AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 14 February 2018

ఇండియా & వరల్డ్ 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ జనవరి 2017 ద్వైపాక్షిక సంబంధాలు
పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత్ పర్యటన
పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య జనవరి 7న రక్షణ, భద్రత, ఐటీ, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలకు సంబంధించి ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో ఐక్యరాజ్యసమితి పాత్ర ఎంతో కీలకమని, దీనికి ఐరాస సూచించిన చర్యలను అంతర్జాతీయ సమాజం ప్రభావవంతంగా అమలుచేయాలని ఇరు దేశాల నేతలు సంయుక్త ప్రకటనలో కోరారు.

భారత్, యూఏఈ మధ్య 14 ఒప్పందాలు 
 భారత్, యూఏఈ మధ్య తాజాగా 14 ఒప్పందాలు కుదిరాయి. అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు జనవరి 25న ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, ఇంధనం తదితర కీలకాంశాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 

గణతంత్ర వేడుకలకుముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు 
అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్-సహ్యాన్ భారత 68వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2006 గణతంత్ర వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లాబిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, 2017లో అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ హాజరు కానున్నారు. 2016 రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు.

పోర్చుగల్, కెన్యా, ఉరుగ్వేలతో ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సహకారం కోసం పోర్చుగల్, కెన్యాలతో రెండు ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాలు సంతకాలు జరిగిన తేదీ నుంచి ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. కావాలంటే తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు మొక్కల విక్రయాలు, శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు, నిపుణుల సందర్శనలు వంటి వాటికి పోర్చుగల్‌తో కుదుర్చుకునే ఒప్పందం వీలు కల్పిస్తుంది. వ్యవసాయ పరిశోధనలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, సహజ వనరుల నిర్వహణ, కోత అనంతర యాజమాన్య మెళకువలు, మార్కెటింగ్ వంటి అంశాలు కెన్యా ఒప్పందంలో ఉండనున్నాయి. కస్టమ్స్ సంబంధిత అంశాల్లో సహకారానికి ఉరుగ్వేతో చేసుకునే ఒప్పందం వీలు కల్పిస్తుంది.

భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై సౌదీ అరేబియా నిషేధం
బర్డ్ ఫ్లూ ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికల దృష్ట్యా భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా జనవరి 3న తాత్కాలిక నిషేధం విధించింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో సౌదీ అరేబియా రెండో అతి పెద్ద దేశంగా ఉంది.

ఇండియా & వరల్డ్ ఫిబ్రవరి 2017 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, రువాండాల మధ్య 3 ఒప్పందాలు
భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రువాండా పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఫిబ్రవరి 20న మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ఉద్దేశించిన వాయు సేవల ఒప్పందం, రువాండాలో ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్ట్ కలిగిన వారికి వీసా మినహాయింపు ఒప్పందాలు ఉన్నాయి.

ఇండోర్‌లో దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఇండోర్‌లో ఫిబ్రవరి 18 నుంచి రెండు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. అమె మాట్లాడుతూ మానవీయ కోణం లేని ఏ అభివృద్ధీ సుస్థిరం కాబోదని పేర్కొన్నారు. పార్లమెంట్, ఇంటర్ పార్లమెంటరీ యూత్ (ఐపీయూ)ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను కోరిన భారత్ 
రుణాల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు సీబీఐ పంపిన అభ్యర్ధన లేఖను బ్రిటన్ హై కమిషన్‌కు అందజేసినట్లు ఫిబ్రవరి 9న కేంద్రం ప్రకటించింది. 

మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల పైచిలుకు రుణాలు బకాయి పడింది. ఈ రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దేశం విడిచి బ్రిటన్ వెళ్లిపోయాడు.

2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ఐఎంఎఫ్ 
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-IMF అంచనా వేసింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థపై వార్షిక నివేదికను ఫిబ్రవరి 22న విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016-17లో వృద్ధి రేటు 6.6 శాతానికి క్షీణిస్తుందని అయితే దీని ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. వస్తు సేవల పన్ను-GST అమల్లోకి వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో భారత్ 8 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.

మైక్రోసాఫ్ట్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
 దేశీ ఈ-కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రపంచ ఐటీ అగ్రగామి మైక్రోసాఫ్ట్ మధ్య ఫిబ్రవరి 20న అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పేమెంట్, లాజిస్టిక్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇకపై మైక్రోసాఫ్ట్ రూపొందించిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనుంది.

ఇండియా & వరల్డ్ మార్చి 2017 ద్వైపాక్షిక సంబంధాలు
రక్షణ రంగంలో భాగస్వామ్య బలోపేతానికి భారత్-అమెరికా నిర్ణయం
రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని సంకల్పించాయి. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్‌కెల్లీతోపాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌మెక్‌మాస్టర్‌లతో మార్చి 25న వాషింగ్టన్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జకార్తాలో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం 
 ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్‌ఏ) 2017 సమావేశం మార్చి 5 - 7 వరకూ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. ఈ భేటికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఉగ్రవాదంపై పోరుకు ఐక్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు.
ఐఓఆర్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్, కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. ఐఓఆర్‌ఏ కేంద్ర కార్యాలయం మారిషస్‌లో ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2017 సమావేశం
ఎప్పుడు : మార్చి 5 - 7
ఎక్కడ :జకార్తా (ఇండోనేషియా)
ఎందుకు : అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో పరస్పర సహకారం కోసం

బిమ్‌స్టెక్ దేశాల భద్రతా సమావేశం
భారత జాతీయ భద్రత సలహాదారు.. అజిత్ ధోవల్ అధ్యక్షతన బిమ్‌స్టెక్ దేశాల జాతీయ భద్రత విభాగాధిపతుల సమావేశం మార్చి 21న న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదంపై సమష్టి పోరు జరపాల్సిందిగా బిమ్‌స్టెక్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా, విపత్తులపై కలిసికట్టుగా పోరాడాలన్నారు. సైబర్ భద్రత, సముద్ర భద్రతపై పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.

ఢిల్లీలో ప్రపంచ పర్యావరణ సదస్సు - 2017
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మార్చి 25 నుంచి 26 వరకూ ప్రపంచ పర్యావరణ సదస్సు 2017 జరిగింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న వ్యాధుల్లో 24 శాతం, మరణాల్లో 23 శాతం వాతావరణ కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ చట్టాలపై సదస్సులో చర్చించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ పర్యావరణ సదస్సు - 2017
ఎప్పుడు : మార్చి 25-26
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ 
ఎక్కడ : న్యూఢిల్లీ

ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలకు ప్రపంచ బ్యాంక్ సహాయం 
ఉత్తరాఖండ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు 100 మిలియన్ డాలర్ల సహాయం చేయనుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో మార్చి 25న ఒప్పందం చేసుకుంది. ఈ నిధులతో ముఖ్యంగా కొండ ప్రాంత జిల్లాల్లో వైద్య సేవలను అభివృద్ధి చేస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలకు ప్రపంచ బ్యాంక్ వంద మిలియన్ డాలర్ల సహాయం 
ఎప్పుడు : మార్చి 25 
ఎందుకు : ఉత్తరాఖండ్‌లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు

ఇండియా & వరల్డ్ ఏప్రిల్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-సైప్రస్ మధ్య నాలుగుఒప్పందాలు
ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ హింసను ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని భారత్-సైప్రస్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఏప్రిల్ 28న ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్‌‌స మధ్య ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చ జరిగింది. వైమానిక సేవలు, వాణిజ్య, నౌకాయాన సహకారం సహా 4 అంశాలపై వీరి సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-సైప్రస్ మధ్య 4 ద్వైపాక్షిక ఒప్పందాలు 
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్ సమక్షంలో 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వైమానిక సేవలు, వాణిజ్య, నౌకాయాన సహకారం కోసం

శ్రీలంక ప్రధాని భారత్ పర్యటనలో ఆర్థిక సహకార ఒప్పందం 
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే భారత పర్యటనలో ఏప్రిల్ 26న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్, శ్రీలంక మధ్య ఆర్థిక సహకార ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం కొలంబోలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్, ట్రింకోమలీలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుచేస్తారు.

మధ్యదరా సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌ విన్యాసాలు 
మధ్యదరా సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు జరిగాయి. ‘‘వరుణ్’’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాల్లో భారత్ నుంచి ఐఎన్‌ఎస్ త్రిశూల్, ఐఎన్‌ఎస్ ముంబై అనే యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ ఆదిత్య అనే నౌకాదళ ఇంధన ట్యాంకర్ పాల్గొన్నాయి.

భారత్-ఇజ్రాయెల్ మధ్య క్షిపణి ఒప్పందం 
 దేశ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు భారత్ ఇజ్రాయెల్‌తో 2 బిలియన్ డాలర్ల క్షిపణి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా కోసం ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరు దేశాలూ ఏప్రిల్ 6న సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఇజ్రాయెల్ ప్రభుత్వ అధీనంలోని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) భారత్‌కు ఎంఆర్‌ఎస్‌ఏఎం శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలను అందజేస్తుంది. మరో సంస్థ రఫేల్ నుంచి కూడా భారత్ రక్షణ సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2 బిలియన్ డాలర్ల క్షిపణి ఒప్పందం 
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : భారత్-ఇజ్రాయెల్ 
ఎందుకు : అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా కోసం

భారత్- బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలు 
భారత్, బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఏప్రిల్ 9న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాల సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 
కీలక ఒప్పందాలు 
ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారానికి ఒప్పందం. దీనిలో భాగంగా బంగ్లాదేశ్‌కు మిలటరీ హార్డ్‌వేర్‌ను భారత్ సరఫరా చేస్తుంది. 
బంగ్లాదేశ్‌కు లైన్ ఆఫ్ క్రెడిట్ (విడతల వారిగా ఇచ్చే రుణం)లో భాగంగా 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.32 వేల కోట్లు) అందించేందుకూ ఒప్పందం. 
పౌర అణు రంగంలో ఒప్పందం కారణంగా బంగ్లాలో భారత్ అణుకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్- బంగ్లాదేశ్ మధ్య 22 ఒప్పందాలు 
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భారత, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రులు 
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : రక్షణ, వ్యాపార సహకారం కోసం 

భారత్, ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు 
ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, మందులు, క్రీడలు, పర్యావరణం, వాతావరణం, విమానయాన భద్రత, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాల్లో సహకారం కోసం భారత్ - ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు 
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు 
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరుకి పరస్పర సహకారం కోసం 

హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం భారత్, యూకే ఫండ్
దేశంలో హరిత ఇంధన ప్రాజెక్టుల స్థాపన కోసం భారత్, యూకే 240 మిలియన్ పౌండ్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నాయి. ఢిల్లీలో ఏప్రిల్ 4న జరిగిన భారత్-యూకే 9వ ఆర్థిక, ద్రవ్య చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిధికి భారత్ తన వాటాగా 120 మిలియన్ పౌండ్లను కేటాయించనుంది. ఇది 2015లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు ఉప నిధిగా వ్యవహరిస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం 240 మిలియన్ పౌండ్ల నిధి 
ఎప్పుడు : ఏప్రిల్ 4 
ఎవరు : భారత్ - యూకే 
ఎక్కడ : న్యూఢిల్లీలో

ఇండియా & వరల్డ్ మే 2017 ద్వైపాక్షిక సంబంధాలు
మారిషస్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం
మారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మే 27న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్‌‌స రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారిషస్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం 
ఎప్పుడు : మే 27
ఎవరు : భారత్

భారత్ - జర్మనీ మధ్య 12 ఒప్పందాలు 
ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చల సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై మే 30న కీలక చర్చలు జరిపారు. 
అనంతరం రెండు దేశాల మధ్య 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సహం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. 
భారత్ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి జర్మనీ మద్దతు 
చర్చల్లో అణు సరఫరాదారుల కూటమి(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి జర్మనీ మద్దతు పలికింది. అత్యవసరంగా ఐరాస భద్రతామండలిలో భారీ స్థాయిలో సంస్కరణలు అవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. అలాగే అలాగే ఇండో జర్మన్ ఎన్విరాన్‌మెంటల్ ఫోరం సమావేశం- 2017ను న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - జర్మనీ మధ్య 12 ఒప్పందాలు 
ఎప్పుడు : మే 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 
ఎక్కడ : జర్మనీలో 

టర్కీ అధ్యక్షుడి భారత పర్యటన
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భారత్‌కు అన్నివిధాలుగా సహాయమందిస్తామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ టయిప్ ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్ మే 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలతోపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీ అధ్యక్షుడి భారత పర్యటన
ఎప్పుడు : మే 1
ఎవరు : రిసెప్ టయిప్ ఎర్డోగాన్
ఎక్కడ : న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్

మారిషస్ ప్రధాని భారత పర్యటన
మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ మే 26 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా మే 27న ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మారిషస్‌కు 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.3,227 కోట్లు) రుణం ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.

ఏడీబీ గ్రూపు 52వ వార్షిక సమావేశం
ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) గ్రూపు 52వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని మోదీ మే 22న గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఇది మే 26 వరకు జరిగింది. భారత్‌లో ఈ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఆఫ్రికాలో సంపద సృష్టికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఈ సదస్సు ఉద్దేశం.

శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీ
భారత్-శ్రీలంక మధ్య బౌద్ధమతానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 11న శ్రీలంక చేరుకున్న ప్రధాని బౌద్ధులకు అత్యంత కీలక పండుగ అయిన అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన
ఎప్పుడు : మే 11
ఎందుకు : అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొనడానికి

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
శాంతికోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మే 16న సమావేశమైన మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం సాగిస్తూనే సార్వభౌమాధికారం, స్వాతం త్య్రం కలిగిన ఐక్య పాలస్తీనాను చూడాలని భారత్ ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వీసా మినహాయింపులు, వ్యవసాయ రంగం, ఆరోగ్యం, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఇండియా & వరల్డ్ జూన్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు
‘ఛాగోస్’పై మారిషస్‌కు భారత్ మద్దతు
ఛాగోస్ ఆర్చిపెలాగో ద్వీపంపై మారిషస్-బ్రిటన్ మధ్య ఏర్పడిన వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. దీనిపై ఐరాస సర్వప్రతినిధుల సభలో జూన్ 22న ప్రవేశపెట్టిన తీర్మానం 94-15 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

యూన్ ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌కు మళ్లీ ఎన్నికైన భారత్ 
 ఐరాస ఆధ్వర్యంలోని ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ECOSOC)కు భారత్ మళ్లీ ఎన్నికైంది. ఈ మేరకు జూన్ 15న జరిగిన ఓటింగ్‌లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్ తర్వాత భారత్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో భారత్‌తో కలిపి మొత్తం 18 దేశాలు ఎన్నికయ్యాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఈసీఓఎస్‌ఓసీకు ఎన్నికైన 18 దేశాలు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : మరోసారి ఎన్నికైన భారత్ 
ఎక్కడ : ఐరాస అనుబంధ సంస్థ 

భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు 
మూడు దేశాల(పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్)పర్యటనలో భాగంగా జూన్ 24న పోర్చుగల్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతో పాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4 మిలియన్ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:  
ఏమిటి : భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 24
ఎవరు: మోదీ - ఆంటోనియో కోస్టా
ఎక్కడ : పోర్చుగల్
ఎందుకు : మోదీ పోర్చుగల్ పర్యటనలో భాగంగా 

ఉగ్రవాదంపై అమెరికా-భారత్ సంయుక్త పోరాటం 
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేయటంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. 
ఉగ్రవాదంపై పోరులో..
ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలో దోషులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతో పాటుగా వాణిజ్యం,ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటు ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై 
ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా మోదీ, ట్రంప్ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్ ప్రశంసించారు. భారత ‘థింక్ వెస్ట్’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలు
భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్ డ్రోన్‌‌స) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్ షిప్పింగ్’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ-ట్రంప్ నిర్ణయించారు. దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
ఎప్పుడు : జూన్ 26
ఎక్కడ : వాషింగ్టన్
ఎందుకు : ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా

భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు 
అమెరికా పర్యటన తర్వాత జూన్ 27న ఐరోపా దేశం నెదర్లాండ్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, నీటి సహకారం, సంస్కృతీ సహకారాలకు సంబంధించిన 3 అవగాహనా ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌కు క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం దక్కడంలో మద్దతు ఇచ్చినందుకు నెదర్లాండ్‌‌సకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీ డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభమైందన్నారు. భారత్‌లో వాణిజ్య ప్రమాణాలు ప్రపంచ దేశాలతో సమానంగా ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ప్రధాని మోదీ - నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్
ఎక్కడ : నెదర్లాండ్స్

నల్లధనం వెల్లడికి స్విట్జర్లాండ్ ఆమోదం
నల్లధనం వివరాల్ని భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని (Automatic Exchange Financial Account) జూన్ 16న స్విట్జర్లాండ్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో ఎటువంటి వివరాలనైనా భారత్ సులువుగా పొందనుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకునే అవకాశం ఉంది. దీంతో.. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏఈఓఐ ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : స్విట్జర్లాండ్ 
ఎందుకు : నల్లధనం వివరాలను భారత్‌తో పంచుకునేందుకు

భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ 
భారత్ - మయన్మార్‌ల సరిహద్దు ద్వారా జరుగుతోన్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్‌గా నియమించింది. 
మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 
ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్. ఎన్. రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ.. మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రీనా మిత్రా కమిటీ ఏర్పాటు 
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర హోంశాఖ 
ఎందుకు : భారత్ - మయన్మార్ సరిహద్దు అధ్యయనానికి

సియోల్‌లో 5వ భారత్- కొరియా ఆర్థిక సదస్సు 
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్-యెన్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సు
ఎప్పుడు : జూన్ 14
ఎక్కడ : సియోల్, కొరియా 
ఎందుకు : భారత్‌కు 10 బిలియన్ డాలర్ల కొరియా సాయంపై ఒప్పందం 

సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదం
భారత్, సోమాలియా మధ్య జరిగిన శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతోపాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖైదీల బదిలీ ఒప్పందం
ఎప్పుడు : జూన్ 7 
ఎవరు : భారత్, సోమాలియా

భారత్ - స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు 
ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్ - స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. 
శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు 
ఎప్పుడు : మే 31
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్ 
ఎవరు : భారత ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్

భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ ఒప్పందం 
అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు జూన్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. టీఏఎస్‌ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ-130 జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్ - 92 హెలికాప్టర్‌లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీఏఎస్‌ఎల్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల ఒప్పందం
ఎప్పుడు : జూన్ 19
ఎక్కడ : పారిస్ ఎయిర్‌షోలో 
ఎందుకు : భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ కోసం

ఇండియా & వరల్డ్ జూలై 2017 ద్వైపాక్షిక సంబంధాలు
వృద్ధికి భారత్-శ్రీలంక మధ్య ఒప్పందం 
శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్‌లో గల అనురాధాపూర్ జిల్లాలోని సోబిథా థెరో (ప్రముఖ బౌద్ధసన్యాసి సోబిథా థెరో పేరుపై ఏర్పడిన గ్రామం) అనే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్-శ్రీలంక మధ్య జూలై 17న ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రూ. 30 కోట్ల వ్యయంతో గ్రామంలో 153 కొత్త ఇళ్లను నిర్మిస్తారు. అలాగే బహుళార్థక సామాజిక భవనం, అంతర్గత నీటి సరఫరా వ్యవస్థ, గ్రంథాలయం నిర్మిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సోబిథా థెరో గ్రామాభివృద్ధికి ఒప్పందం 
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత్-శ్రీలంక
ఎక్కడ : అనురాధాపూర్ జిల్లా, శ్రీలంక 

మలబార్ సైనిక విన్యాసాలు2017
భారత్, అమెరికా, జపాన్ నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మలబార్ సైనిక విన్యాసాలు జూలై 10న బంగాళాఖాతంలో ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి మనం గొప్ప ఉదాహరణగా నిలుస్తామని అమెరికా నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ విలియం డీ బైర్న్ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 95 విమానాలు, 16 ఓడలు, రెండు జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపుదల కోసం ఏటా మలబార్ సైనిక్య విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 1992లో భారత్, అమెరికా ఈ విన్యాసాలను ప్రారంభించాయి. జపాన్ 2015లో జపాన్ కూడా జతకలిసింది. చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ సైనిక విన్యాసాలు - 2017
ఎప్పుడు : జూలై 10-14
ఎవరు : భారత్, అమెరికా, జపాన్ 
ఎక్కడ : బంగాళాఖాతంలో 
ఎందుకు : అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపు కోసం

భారత్‌కు ‘మిగ్-35’ యుద్ధ విమానాలు
 భారత్‌కు మిగ్-35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్ కూడా ఆసక్తిగా ఉందని మిగ్ కార్పొరేషన్ చీఫ్ ఇల్యా టారసెంకో తెలిపారు. రష్యా రూపొందించిన అత్యాధునిక 4++ జనరేషన్ యుద్ధ విమానాలే మిగ్ 35. దాదాపు 50 ఏళ్లుగా భారత్ రష్యాకు చెందిన మిగ్ విమానాల్ని వినియోగిస్తోంది. 
మిగ్ -35 ప్రత్యేకతలు
ఒకరు లేదా ఇద్దరు పైలట్లు నడపొచ్చు. టేకాఫ్ సమయంలో గరిష్ట బరువు 29,700 కిలోలు 
ఎత్తులో ఉన్నప్పుడు గరిష్ట వేగం గంటకు 2,400 కి.మీ. సముద్రమట్టంలో వేగం 1450 కి.మీ. 
1000 కి.మీ. పరిధిలో యుద్ధ విన్యాసాలు చేయగలదు. 
గన్స్: జీఎస్‌హెచ్-301 ఆటోకేనన్ (150 రౌండ్స్) 
రాకెట్‌లు : ఐదు 
క్షిపణులు: గగనతలం నుంచి గగనతలం(రెండు), గగనతలం నుంచి భూఉపరితలంపైకి(ఒకటి), యాంటీ రేడియేషన్ మిస్సైల్, యాంటీ షిఫ్ మిస్సైల్ 
బాంబులు: కేఎబీ-500కేఆర్, కేఏబీ-500ఎల్, కేఏబీ-500ఎస్ 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌కు మిగ్-35 యుద్ధ విమానాల సరఫరా
ఎప్పుడు : జూలై 23 
ఎవరు : రష్యా

భారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు 
ఉగ్రవాదంతో పాటుగా వీరికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించటంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రవాద పరిస్థితులు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న వారిపై సంయుక్తంగా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా జూలై 5న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదం, దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైఇరువురు చర్చించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావటంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు జెరూసలేంలో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
ఏడు ఒప్పందాలపై సంతకాలు
ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు ఉగ్రవాదంపై పోరాటంలోనూ పరస్పర సహకారం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. 
అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయం రంగాలతోపాటు నీటి పరిరక్షణ అంశంలో ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి. 
భారత్-ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), సాంకేతిక సృజనాత్మకత కోసం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.259 కోట్లు) నిధిని ఏర్పాటు చేసేందుకు ఇరువురు ప్రధానులు అంగీకరించారు. 
నీటి సంరక్షణతో పాటుగా భారత్‌లో నీటి వినియోగ సంస్కరణలు తీసుకురావటంపై పరస్పర అంగీకారం. 
అణు గడియారాలు, చిన్న శాటిలైట్ల కోసం ఎలక్ట్రిక్ చోదక ఇంజన్‌లు, జియో-లియో (GEO&LEO) ఆప్టికల్ లింక్‌పైనా సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు 
ఎప్పుడు : జూలై 5
ఎవరు : నరేంద్ర మోదీ - బెంజ్‌మెన్ నెతన్యాహూ
ఎక్కడ : ఇజ్రాయెల్‌లో
ఎందుకు : మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా

స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బు
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015తో పోల్చితే 2016లో ఈ డబ్బు సగం తగ్గి, రూ.4,500 కోట్లుగా(676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నమోదయి్యంది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ)తాజా గణాంకాల ప్రకారం.. భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో ప్రత్యక్షంగా ఉన్న మొత్తం 664.8 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. ట్రస్టీల రూపంలో ఉన్న మొత్తం 11 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వరుసగా మూడేళ్ల నుంచీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గుతూ వస్తోంది.
1987 నుంచీ స్విస్ తన బ్యాంకుల్లో విదేశీయుల డబ్బు గణాంకాలను ప్రకటిస్తోంది. ఆ తర్వాత భారతీయుల డబ్బు ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2006లో ఇక్కడ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయి రూ.23,000 కోట్లుగా నమోదైంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో విదేశీ క్లెయింట్ల డబ్బు రూ.96 లక్షల కోట్లకు(1.42 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరింది. 2015లో ఈ మొత్తం 1.41 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ 
ఎప్పుడు : 2016 
ఎవరు : స్విస్ నేషనల్ బ్యాంకు
ఎక్కడ : స్విట్జర్లాండ్ 

ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన
ఇజ్రాయెల్, భారత్‌లు కలసికట్టుగా ముందుకు సాగితే మరిన్ని అద్భుతాలు సాధించగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జూలై 4న ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం (70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ) వేచిచూస్తున్నామని.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో మాట్లాడారు. సంయుక్త మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మోదీ, నెతన్యాహూలు ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు ఒకే రకమైన ముప్పును, సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాటిపై కలసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. 
ఓ పువ్వుకు మోదీ పేరు..
మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ పేరు పెట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 70 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రధాని
ఎప్పుడు : జూలై 4 - 6
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం

ఇండియా & వరల్డ్ ఆగష్టు 2017 ద్వైపాక్షిక సంబంధాలు
మనీలాలో ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు
15వ ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు ఆగస్టు 6న మనీలాలో ముగిసింది. ఇందులో భారత విదేశాంగ సహాయ మంత్రి వి.కె.సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది.

దక్షిణకొరియా ఐవీఐతో భారత్ ఒప్పందం 
టీకా మందులపై పరిశోధన, అభివృద్ధి కోసం దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఐ)తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) డెరైక్టర్ సౌమ్యా స్వామినాథన్, ఐవీఐ డెరెక్టర్ జనరల్ జెరోమ్ హెచ్ కిమ్‌లు ఆగస్టు 21న ఒప్పందంపై సంతకాలు చేశారు. 
భారత్ 2012 నుంచి ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌లో సభ్య దేశంగా ఉంది. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఈ సంస్థకు ఏటా 5 లక్షల డాలర్ల సహాయాన్ని అందిస్తుంది. ఐవీఐలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 35.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐవీఐతో భారత్ ఒప్పందం 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఐసీఎంఆర్, ఐవీఐ
ఎందుకు : టీకాలపై పరిశోధన, అభివృద్ధి కోసం

భారత్, నేపాల్ మధ్య ఎనిమిది ఒప్పందాలు 
 నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా.. భారత్ పర్యటనలో భాగంగా ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్‌‌స అక్రమ రవాణాను అరికట్టడం, భూకంపాల తర్వాత హిమాలయన్ దేశాల్లో పునర్నిర్మాణం వంటి ఎనిమిది అంశాలపై వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. భారత్-నేపాల్‌ల మధ్య ఉన్న ఓపెన్ సరిహద్దు దుర్వినియోగం కాకుండా ఇరుదేశాల భద్రత, రక్షణ బలగాలు ఒకరినొకరు సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేవ్‌బా స్పందిస్తూ ప్రతి విషయంలోనూ భారత్‌కు సహకారం అందిస్తామని, ఓపెన్ సరిహద్దు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగనివ్వమని హామీనిచ్చారు. అనంతరం కటైయా-కుసాహ, రాక్సల్-పర్వానీపూర్ సరిహద్దుల ప్రాంతాల మధ్య విద్యుత్ రవాణా లైన్లను ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్, నేపాల్ మధ్య 8 ఒప్పందాలు 
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా
ఎందుకు : నేపాల్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా

భారత్, జర్మనీల మధ్య పునరుత్పాదక ఇంధన ఒప్పందం 
పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు సంబంధించిన గ్రిడ్ల నిర్మాణం, అనుసంధానం కోసం భారత్, జర్మనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండో జర్మన్ ఎనర్జీ ప్రోగ్రామ్ - గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ (IGEN-GEC) కార్యక్రమంలో భాగంగా రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. IGEN-GEC ని భారత్, జర్మనీలు 2013లో ప్రారంభించాయి. భారత పునరుత్పాదక ఇంధన నిర్వహణ, హరిత శక్తి కారిడార్ల నిర్మాణం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం రాయితీతో కూడిన ఒక బిలియన్ యూరోల రుణాన్ని జర్మనీ భారత్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్, జర్మనీ మధ్య గ్రిడ్ అనుసంధాన ఒప్పందం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎందుకు : పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరాకు సంబంధించి గ్రిడ్ల నిర్మాణం, అనుసంధానం కోసం

ఇండియా & వరల్డ్ సెప్టెంబరు 2017 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్‌ను ఎదుర్కొనేందుకే అణ్యాయుధాలు : పాక్
అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. సెప్టెంబర్ 21న జరిగిన ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్‌‌స భేటీలో మాట్లాడారు. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని(cold start doctrine) ఎదుర్కొనేందుకే ఈ అణ్వాయుధాలను రూపొందించామని వెల్లడించారు. 
పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం. 

ఐరాస వేదికగా పాక్‌పై భారత్ మండిపాటు 
 ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టైస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది. 

భద్రత కౌన్సిల్‌లో భారత సభ్యత్వానికి భూటాన్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రత కౌన్సిల్‌లో జీ - 4 దేశాలకు (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) శాశ్వత సభ్యత్వానికి భూటాన్ మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్‌గే ఈ మేరకు జీ - 4 దేశాలకు శాశ్వత సభ్య కల్పించాలని కోరారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలోను సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. 
పోర్చుగీస్ ప్రధాని ఆంటోని లూయిస్ డా కోస్టా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం: భారత్ 
అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్ మాటిస్ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్ చర్చించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అఫ్గనిస్తాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు స్పష్టం చేసిన భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎక్కడ : భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశంలో

భారత్ - జపాన్ మధ్య 15 ఒప్పందాలు
 భారత్ - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 14న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌర అణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.

‘రక్షణ’ సహకారానికిభారత్, జపాన్ నిర్ణయం
రక్షణ రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 6న జపాన్ పర్యటనలో ఆ దేశ రక్షణ మంత్రి ఇస్తునోరీ ఒనెడేరాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జపాన్ నౌకా స్థావరంలోని పి-1 హెలికాప్టర్ నమూనాను పరిశీలించారు. జలాంతర్గాములను ధ్వంసం చేసే ఆయుధ సంపత్తి ఉండటం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ విధానంలో శిక్షణ ఇవ్వడం పైనా అవగాహన కుదిరింది. రోబోటిక్స్, మానవ రహిత వాహనాలపై సాంకేతిక చర్చలు జరపాలని; నీటిలో, గాలిలో తిరిగే యూఎస్-2ఐ ఉభయచర విమానాల కొనుగోలుపై చర్చించాలని నిర్ణయించాయి.

భారత్, శ్రీలంక నౌకాదళ విన్యాసాలు
భారత్, శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలు సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఐదో విడత సంయుక్త విన్యాసాలను రెండు పర్యాయాలుగా జరుపుతారు. మొదటి పర్యాయం సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు, రెండో పర్యాయం సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహిస్తారు.

భారత్-బెలారస్ మధ్య 10 ఒప్పందాలు 
భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్‌‌స అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - బెలారస్ మధ్య 10 ఒప్పందాలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో 
ఎక్కడ : న్యూఢిల్లీలో

భారత్, మయన్మార్ మధ్య 11 ఒప్పందాలు 
 భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 6న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. 
మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
సూచీకి ప్రత్యేక కానుక..
సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 

అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు భారత్ సంసిద్ధత 
వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరింత సహకారం అందిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విసృ్తత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ సెప్టెంబర్ 11న భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - ఆఫ్గనిస్తాన్ 2వ వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్ సమావేశం 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ 
ఎక్కడ : న్యూఢిల్లీ

ఇండియా & వరల్డ్ అక్టోబరు 2017 ద్వైపాక్షిక సంబంధాలు
ఇటలీ ప్రధాని భారత పర్యటన
 ఇటలీ ప్రధాని పాలో జెంటిలోని రెండు రోజుల భారత పర్యటన కోసం అక్టోబర్ 29న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జెంటిలోని ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విసృ్తతమైన చర్చలు జరిపారు. అనంతరం రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2018 మార్చిలో ఇటలీతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ లోగోను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 8.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57 వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇటలీ ప్రధాని భారత పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 30 - 31
ఎవరు : పాలో జెంటిలోని
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం

ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ పర్యటన
ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

యూఎస్ విదేశాంగ మంత్రి పర్యటన
భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ అక్టోబర్ 25న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ విధానం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ర భారత పర్యటన
ఒక రోజు పర్యటనకు భారత్ వచ్చిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ అవసరాల కు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఘనీ ఢిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సు
ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 24న ముగిసింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద అనుకూల శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

భారత్ - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు
 రక్షణ రంగంలో మరింత సహకారంలో భాగంగా భారత్ - రష్యాలు అక్టోబర్ 19 నుంచి 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్న అంశంపై 'ఇంధ్ర-2017' పేరుతో రష్యాలో చేపట్టే ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు పాల్గొంటాయి. సెర్గీవిస్కీలోని 249వ కంబైండ్ ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్ లోని జపాన్ సముద్రాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. భారత్ తరపున 350 మంది ఆర్మీ, 80 మంది వైమానిక సిబ్బంది, రెండు ఐఎల్ -76 విమానాలు, నౌకదళానికి చెందిన ఒక యుద్ధ నౌక, ఒక సహాయక నౌక పాల్గొంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంధ్ర - 2017 సైనిక విన్యాసాలు 
ఎప్పుడు : అక్టోబర్ 19 నుంచి 30 
ఎవరు : భారత్ - రష్యా 
ఎక్కడ : రష్యాలో 
ఎందుకు : రక్షణ రంగంలో మరింత సహకారం కోసం 

జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం 
యువతను టెక్నికల్ ఇంటర్న్స్‌గా జపాన్‌కు పంపేందుకు భారత్ ఆ దేశంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్(TITP)పై సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 17న టోక్యోలో జరిగిన సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, జపాన్ మంత్రి కత్సునోబు కాటో ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం జపాన్‌లో 3 నుంచి 5 ఏళ్ల పాటు ఉపాధి శిక్షణ కోసం భారత్ ఔత్సాహిక యువతీ యువకులను ఆ దేశం పంపిస్తుంది. 
జపాన్‌తో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న మూడో దేశం భారత్. జపాన్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 2016 చివరి నాటికి వివిధ దేశాలకు చెందిన 2.3 లక్షల మంది టెక్నికల్ ఇంటర్న్స్‌గా ఉపాధి శిక్షణ పొందుతున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎందుకు : ఉపాధి శిక్షణ కోసం యువతను జపాన్‌కు పంపేందుకు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటన
 రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటనలో అక్టోబర్ 4న తూర్పు ఆఫ్రికా దేశం జిబూతీని సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ఒమర్ గ్యులేహ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యాలయ స్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులు నెలకొల్పుకునే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2015లో యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్ నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆపరేషన్ రాహత్’లో జిబూతీ అందించిన తోడ్పాటుకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. నౌకా వాణిజ్య, సౌర విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారంపై కోవింద్, ఒమర్ చర్చించారు. జిబూతీని సందర్శించిన తొలి భారతీయ నేత కోవింద్ కావడం గమనార్హం. జిబూతీలో చైనా తన విదేశీ సైనిక స్థావరాన్ని నెలకొల్పిన నేపథ్యంలో భారత రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇథియోపియాతో రెండు ఒప్పందాలు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇథియోపియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ములాతు తెషోమేతో అడిస్ అబాబాలో చర్చలు జరిపారు. వాణిజ్యం, సమాచార-ప్రసార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలపడేలా ఇరువురి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)లో ఇథియోపియా భాగస్వామి కావడం పట్ల భారత్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్- ఇథియోపియా 70 ఏళ్ల దౌత్య సంబంధాలు’ అనే పుస్తకాన్ని ఇరువురూ విడుదల చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత రాష్ట్రపతిమొదటివిదేశీ పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్

భారత్-ఈయూ 14వ సదస్సు
ఉగ్రవాదంపై పోరుకు ఒకరికొకరు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. ఈ మేరకు అక్టోబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన భారత్-ఈయూ 14వ సదస్సులో ఇరు పక్షాలు ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పాల్గొన్నారు.
వాణిజ్యం, భద్రత వంటి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం; రోహింగ్యా సంక్షోభం, కొరియా ద్వీపకల్పంలోని ఉద్రిక్త పరిస్థితులతో పాటు వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మూడు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. వీటిలో అంతర్జా తీయ సౌర కూటమికి సంబంధించిన ఒడంబడిక కూడా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : ప్రధాని మోదీ, ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్
ఎక్కడ : భారత్-ఈయూ 14వ సదస్సు, న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, అతివాదంపై ఉమ్మడి పోరుకు

బంగ్లాదేశ్‌కు రూ.29,250 కోట్ల రుణంపై ఒప్పందం
బంగ్లాదేశ్‌లో మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి భారత్ రూ.29,250 కోట్ల రుణం ఇచ్చేందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు అక్టోబర్ 4న సంతకాలు చేశాయి. భారత్, బంగ్లా ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, అబుల్ మాల్ అబ్దుల్ ముహిత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

భారత్‌కు ఏఐఐబీ, ఏడీబీ 655 కోట్ల రుణం
 భారత్‌లో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్ డాలర్లు) రుణం అందించనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని ఇవ్వనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీ చేయడం ఇది నాలుగోసారి.
చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌కు రూ.655 కోట్ల రుణం 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏఐఐబీ, ఏడీబీ 

భారత్‌కు మళ్లీ అమెరికా ‘చమురు’
అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు అక్టోబర్ 2న చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్‌సీసీ ఎమ్‌టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసంయూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది. భారత్-యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు-గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 
1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా నుంచి భారత్‌కు చమురు 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎందుకు : చమురు-గ్యాస్ రంగాల్లో ఒప్పందంలో భాగంగా

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతుCurrent Affairs స్వతంత్ర పాలస్తీనా కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా ఐరాసకు ఆయన ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవ్వాలని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్ సందర్భంగా
ఎందుకు : శాంతియుత, స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా ఏర్పాటు కోసం

ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. తద్వారా 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా నవంబర్ 27న రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విసృ్తతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉగ్రవాదంపై పోరులో సహకారం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : భారత్, రష్యా

భారత్‌తో సమాచార మార్పిడికి స్విస్ ఒప్పందం Current Affairs స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ ఆమోదం తెలిపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది.

భారత్ - బంగ్లా వీక్లీ ‘బంధన్’ రైలు ప్రారంభం Current Affairsభారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు సర్వీసులని ప్రారంభించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. రూ. 650 కోట్లతో నిర్మించిన బైరట్, టైటాస్ రైల్వే వంతెనలను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభం 
ఏమిటి : నవంబర్ 9 
ఎవరు : భారత ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని హసీనా 
ఎక్కడ : భారత్ - బంగ్లా మధ్య 

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌‌సలో పర్యటిస్తున్నారు. ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. 
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్పీన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన 
ఏమిటి : నవంబర్ 12 - 14
ఎందుకు : ఇండియా-ఆసియాన్, 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు 

మనీలాలో ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు. 
ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. 
ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలుఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
ఏమిటి : నవంబర్ 13
ఎక్కడ : మనీలా, ఫిలిప్పీన్స్ 
ఎందుకు : ఆసియాన్ సదస్సు సందర్భంగా


నల్లధనం సమాచార ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ సంతకాలు
Current Affairs 
నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు డిసెంబర్ 21న సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బామ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్ సమాచార మార్పిడి(AEIO) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య 2017 నవంబర్ నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్ స్విస్‌కు హామీ ఇచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నల్లధనం సమాచార మార్పిడి ఒప్పందంపై సంతకాలు 
ఎప్పుడు : డిసెంబర్ 21 
ఎవరు : భారత్ - స్విట్జర్లాండ్ 
ఎందుకు : స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలుగా 

భారత్, చైనా మధ్య ‘సరిహద్దు’ చర్చలు భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు డిసెంబర్ 22న జరిగాయి. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాలేదు. 
భారత్, చైనా మధ్య 2017 జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం 2017 ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటు చేసిన పాక్ అధికారులు.. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. వీరితోపాటు వచ్చిన భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను జాధవ్‌తో మాట్లాడేందుకు అనుమతించలేదు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎక్కడ : ఇస్లామాబాద్, పాకిస్తాన్ 

ఐరాసకు అనుగుణంగానే ‘కశ్మీర్’ పరిష్కారంప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగానూ శాంతి, స్థిరత్వాలను సాధించాలంటే కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి భారత్, పాక్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, అఫ్గానిస్తాన్, పాక్ దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇస్లామాబాద్‌లో సమావేశమై ఈ ప్రకటనను వెలువరించారు. తొలుత కశ్మీర్ అంశంపై చర్చించేందుకు రష్యా, ఇరాన్, అఫ్గాన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆయా దేశాలు తమకు రాజకీయంగా ప్రయోజనాలు చేకూర్చే అంశాలను చర్చల జాబితాలో చేర్చాయనీ, తమకూ కశ్మీర్ అంశమే ముఖ్యమని పాక్ పట్టుబట్టడంతో మిగతాదేశాలూ ఒప్పుకోక తప్పలేదు. 
అలాగే... చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు కలసి తొలిసారిగా డిసెంబర్ 26న బీజింగ్‌లో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37Current Affairs చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఎకనామిక్ ఇంటెల్లిజెన్స్ యూనిట్
ఎందుకు : రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో

సింగపూర్‌తో భారత్ రక్షణ ఒప్పందం రక్షణ రంగంలో పరస్పరం మరింత సహకరించుకునేందుకు భారత్ - సింగపూర్ 2017 నవంబర్ 29న ఒప్పందం కుదుర్చు కున్నాయి. ప్రధానంగా నౌకారంగంలో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించు కోనున్నాయి. భారత రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్ మధ్య చర్చలు జరిగాయి. భారత యుద్ధ నౌకలు తమ నౌకా స్థావరాల్లో ఇంధనం నింపుకోవ డా నికి అవకాశం కల్పిస్తామని సింగపూర్ మంత్రి తెలిపారు. దక్షిణ చైనా సముద్రం లో నౌకలు తిరగడానికి స్వేచ్ఛ ఉండాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. ఉగ్రవాద అణిచివేత, రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకరించుకోవాలని నిర్ణయించాయి. 

వాసెనార్ బృందంలో భారత్ కు సభ్యత్వంఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. ఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాసెనార్‌లో 42వ సభ్యదేశం చేరిక
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : భారత్
ఎందుకు : రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి

ఢిల్లీలో ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారి స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు డిసెంబర్ 11న ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : సుష్మాస్వరాజ్, వాంగ్ యీ, సెర్జీ లావ్రోవ్ (రష్యా)
ఎక్కడ : ఢిల్లీ

‘చాబహర్’ పోర్టును ప్రారంభించిన ఇరాన్Current Affairs భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘చాబహర్’ పోర్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇరాన్
ఎందుకు : ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు


No comments:

Post a Comment