AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు సెప్టెంబరు 2015

క్రీడలు సెప్టెంబరు 2015
సానియా- హింగిస్‌లకు గ్వాంగ్‌జౌ ఓపెన్ టైటిల్
గ్వాంగ్‌జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్‌లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015 సీజన్‌లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్‌కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది. 
క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్
ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్‌కి 14వ టైటిల్.
హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్
ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్‌బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు.
ఖతర్‌లో 2022 సాకర్ ప్రపంచకప్
2022 సాకర్ ప్రపంచకప్‌ను అరబ్ దేశం ఖతర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఫిఫా సెప్టెంబర్ 25న ప్రకటించింది. 28 రోజుల పాటు జరిగే ఈ 22వ ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి ఖతర్ ఆతిథ్యమిస్తోంది. ఫిఫా ప్రంపచకప్‌ను నిర్వహిస్తున్న తొలి అరబ్, మధ్య ఆసియా దేశంగా ఖతర్ నిలిచింది. టోర్నీ 2022 నవంబర్ 21న మొదలై డిసెంబర్ 18 (ఖతర్ జాతీయ దినం)న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. జూన్-జూలైల్లో కాకుండా వేరే నెలల్లో జరుగుతున్న మొదటి ఫిఫా ప్రపంచకప్ ఇదే.
ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్
చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన 16వ ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు ఏడు పతకాలు సాధించారు. వీటిలో ఐదు రజతాలు కాగా రెండు కాంస్య పతకాలున్నాయి. తొలుత కపిల్ శర్మ, జస్విందర్ సింగ్, రాజేశ్ వర్మ, మహ్మద్ అజాద్‌ల తో కూడిన భారత బృందం తొలి రజతాన్ని అందించింది. అనంతరం దత్తు బబన్ భోకనాల్ పురుషుల సింగిల్స్‌లో రెండో రజతాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు. పురుషుల డబుల్స్ లైట్ వెయిట్, పురుషుల డబుల్స్, పురుషుల 8 ఈవెంట్ విభాగాల్లో భారత్‌కు రజతాలు దక్కాయి. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో దేవిందర్ సింగ్, నవీన్, పురుషుల లైట్‌వెయిట్ విభాగంలో దుష్యంత్ కాంస్యాలు అందించారు.
చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అనర్హత
దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టు మినీ ప్రపంచకప్‌గా భావించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. 2015 సెప్టెంబర్ 30 వరకు ఐసీసీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది. తాజాగా సెప్టెంబర్ 30న ప్రకటించిన ర్యాంకుల్లో విండీస్ 9వ స్థానానికి పడిపోయింది. దీంతో 1998 నుంచి సాగుతున్న ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ కరీబియన్ జట్టు ఆడలేకపోతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో పాక్, భారత్, దక్షిణాఫ్రికా జట్లను తమ అద్భుత ఆటతీరుతో వణికించిన బంగ్లాదేశ్ 9వ ర్యాంకు నుంచి 7కు చేరింది. ఈ ర్యాంకుతో 2006 అనంతరం మరోసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.

నేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ ఛాంపియన్‌గా రైల్వేస్
కోల్‌కతాలో సెప్టెంబరు 19లో ముగిసిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా రైల్వేస్ నిలిచింది. మొత్తం 267 పాయింట్లతో రైల్వేస్ మొదటి స్థానంలో నిలువగా, ఓఎన్‌జీసీ(185),సర్వీసెస్(174.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్
ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సింగపూర్‌లో సెప్టెంబరు 20న జరిగిన రేసులో వెటల్ మొదటి స్థానంలో నిలువగా, డేనియల్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు.
కొరియా ఓపెన్ టైటిల్
కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. సెప్టెంబరు 20న సియోల్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అజయ్ జయరామ్ (భారత్)ను చెన్ లాంగ్ ఓడించాడు.కెరీర్‌లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు.విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వ స్థానం
అపియా (సమోవా)లో సెప్టెంబరు 11న ముగిసిన యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 24 స్వర్ణాలు, 19 రజతాలు, 19 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(13 స్వర్ణ పతకాలు), ఇంగ్లండ్(12), మలేసియా(11)తో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 9 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలతో భారత్ 5వ స్థానంలో నిలిచింది.
జకోవిచ్, పెనెట్టాలకు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్
పురుషుల సింగిల్స్: నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 14న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు.

మహిళల సింగిల్స్: ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాబెర్టా విన్సీ (ఇటలీ)ని ఓడించింది. అత్యంత పెద్ద వయసులో (33) తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న మహిళగా పెనెట్టా గుర్తింపు సాధించింది.

పురుషుల డబుల్స్: హెర్బెర్ట్-నికోలస్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్)- జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించారు.

మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో కేసే డెలాక్వా (ఆస్ట్రేలియా), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్) జంటను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్.. స్విస్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించాడు. వీరు ఫైనల్లో అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సామ్ క్వెరీ జోడీని ఓడించారు. ఈ విజయంతో పేస్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరాయి.
రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్‌కు కాంస్యం
రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. లాస్‌వెగాస్‌లో సెప్టెంబరు 13న కాంస్యం కోసం జరిగిన పోటీలో జెలిమ్‌ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై యాదవ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో నర్సింగ్ యాదవ్ 2016-రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
యూకీ బాంబ్రీకి షాంఘై చాలెంజర్ టైటిల్
భారత్ టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ షాంఘై చాలెంజర్ టైటిల్ గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను లిన్ డాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి గె ఒకుహారా (జపాన్) గెలుచుకుంది. ఆమె ఫైనల్లో అకానె యమగుచి (జపాన్)ను ఓడించింది.
విజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికిన మేవెదర్
స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ విజయంతో రింగ్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఈ 38 ఏళ్ల బాక్సర్ చివరిదైన 49వ మ్యాచ్‌లో అండ్రీ బెర్టోపై నెగ్గి తన రికార్డును 49-0కు మెరుగుపర్చుకున్నాడు. దాంతో దిగ్గజ ఆటగాడు రాకీ మార్సియానో రికార్డును (49-0) సమం చేశాడు.

అపూర్వికి షూటింగ్‌లో రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అపూర్వి చండేలా రజత పతకం సాధించింది. సెప్టెంబరు 5న మునిచ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అహ్మది ఎల్హాన్ (ఇరాన్) స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియాకు కాంస్య పతకం దక్కింది.
జోష్న చిన్నప్పకు ఇండియన్ స్క్వాష్ టైటిల్
ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్‌లో జోష్న చిన్నప్ప (భారత్) మహిళల టైటిల్ గెలుచుకుంది. ముంబైలో సెప్టెంబరు 6న జరిగిన పోటీలో హబీబా మహ్మద్ (ఈజిప్టు)ను జోష్న ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఆడ్రియన్ వాలెర్(ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. మహేశ్ మంగోంకర్ (భారత్)ను వాలెర్ ఓడించారు.
హామిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రి
ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మొంజా (ఇటలీ) లో సెప్టెంబరు 6న జరిగిన రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలువగా, ఫెరారీ డ్రైవర్ వెటల్ రెండో స్థానం సాధించాడు.
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. బ్యాంకాక్‌లో సెప్టెంబరు 6న ముగిసిన పోటీల్లో కజకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ రెండో స్థానంలో, థాయిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఈవెంట్ ద్వారా అక్టోబరులో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు.
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. శ్రీలంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆమోదించారు.

శ్రీలంకపై భారత్ చరిత్రాత్మక విజయం
భారత క్రికెట్ జట్టు చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 22 ఏళ్ల తర్వా త లంక గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. 2011 తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 1993 తర్వాత శ్రీలంకలో సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని టీమ్ 1-0తో సిరీస్‌ను గెలిచింది. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన కోహ్లికి ఇదే తొలి సిరీస్ విజయం. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 

2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరం డర్బన్
 
2022లో కామన్వెల్త్ గేమ్స్‌ను దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న ఆక్లాండ్‌లో సమావేశమైన గేమ్స్ సమాఖ్య ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఈ గేమ్స్‌కు ఓ ఆఫ్రికా దేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. అధిక ఖర్చు కారణంగా కెనడా, ఎడ్మాంటన్ ఫిబ్రవరిలోనే రేసు నుంచి వైదొలగడంతో డర్బన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అలాగే గేమ్స్‌లో నిర్వహించే క్రీడాంశాల సంఖ్యను కూడా 10 నుంచి 16కు పెంచారు. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ప్రెసిడెంట్‌గా స్కాట్లాండ్‌కు చెందిన లూయిస్ మార్టిన్‌ను ఎన్నుకున్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.

క్రీడలు ఆగష్టు 2015

క్రీడలు ఆగష్టు 2015
ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్బీజింగ్‌లో ఆగస్టు 30న ముగిసిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏడు స్వర్ణాలతో కెన్యా తొలిసారి మొదటి స్థానం సాధించింది. మరో ఆఫ్రికా దేశం జమైకా రెండో స్థానంలో నిలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఆఫ్రికా దేశం అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మొత్తం 206 దేశాలు పాల్గొన్న చాంపియన్‌షిప్‌లో భారత్ 65వ స్థానంలో నిలిచింది. భారత అథ్లెట్ లలితా శివాజీ బాబర్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక పాయింట్ భారత్‌కు లభించింది. మొత్తం 18 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

పతకాల పట్టిక:మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
కెన్యా76316
జమైకా72312
అమెరికా66618
బ్రిటన్4127
ఇథియోపియా3328


ఈ చాంపియన్‌షిప్‌లో జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మూడు బంగారు పతకాలు సాధించాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు నాలుగొందల మీటర్ల రిలేలో తన సహచరులతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ మొత్తం 11 స్వర్ణ పతకాలు సాధించాడు.

12 ఏళ్ల తర్వాత యూరోప్ అథ్లెట్‌కు స్వర్ణంమహిళల 200 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అమ్మాయి డాఫ్నె ష్కిపెర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 28న జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో ష్కిపెర్స్ 21.63 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో యూరోప్ అథ్లెట్‌కు పసిడి పతకం లభించింది. చివరిసారి 2003లో అనస్తాసియా కాపాచిన్స్‌కాయా (రష్యా) ఈ ఘనత సాధించింది.

రియో ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టుభారత మహిళల హాకీ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆగస్టు 28న ప్రకటించింది. జూలైలో బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ 5వ స్థానాన్ని సాధించడంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. 36 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు ఈ అర్హత సాధించింది. చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగో స్థానంలో మహిళల జట్టు నిలిచింది. 

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షణలోని అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌లలో ఒకడిగా అతను వ్యవహరిస్తాడు. ‘ఐసీసీ అమెరికాస్ క్రికెట్ కంబైన్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఐసీసీ కోచ్‌ల బృందాన్ని ఎంపిక చేసింది. రాజుతో పాటు బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్ కూడా ఇందులో ఉన్నారు. క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రాజు... భారత జట్టు సెలక్టర్‌గా, హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా పని చేయడంతో పాటు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇటీవలి వరకు ఐసీసీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసియా రీజియన్ అభివృద్ధి అధికారిగా కూడా పని చేశాడు.

గాంధీ-మండేలా సిరీస్ఇక నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లను ‘ద మహత్మ గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్’గా వ్యవహరించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి. అలాగే ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘ఫ్రీడం ట్రోఫీ (స్వతంత్ర ట్రోఫీ)’గా నామకరణం చేశాయి. ఈ విషయాన్ని ఆగస్టు 31న ఇరు బోర్డులు తెలియజేశాయి. 

యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ
ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను యు ముంబా గెలుచుకుంది. ముంబైలో ఆగస్టు 23న జరిగిన ఫైనల్లో బెంగళూరు బుల్స్‌ను యు ముంబా ఓడించింది. టైటిల్ గెలిచిన యు ముంబా జట్టుకు రూ.కోటి, బెంగళూరుకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీగా సందీప్ (టైటన్స్), రైడర్ ఆఫ్ ది టోర్నీగా కషిలింగ్ (ఢిల్లీ), డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా రవీందర్ (ఢిల్లీ), ఆల్‌రౌండర్ ఆఫ్ ది టోర్నీగా మంజీత్ చిల్లర్ (బెంగళూరు) నిలిచారు.
హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 23న జరిగిన రేసులో హామిల్టన్ టైటిల్ సాధించగా, రోస్‌బర్గ్, గ్రోస్యెన్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.
ఉసేన్ బోల్ట్‌కు 100 మీటర్ల టైటిల్
2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచాడు. బీజింగ్‌లో ఆగస్టు 23న జరిగిన 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.79 సెకన్లలో రేసును ముగించి మొదటి స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.80 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. బోల్ట్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకు చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ రేసులో డాఫ్నీ చిపర్స్(నెదర్లాండ్స్) రజతం, టోరీ (అమెరికా) కాంస్యం సాధించారు.
ఫెదరర్‌కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్
సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. సిన్సినాటి (అమెరికా)లో ఆగస్టు 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఫెదరర్ ఓడించాడు. ఈ టైటిల్ ఫెదరర్ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో సిమోనా హాలెప్‌ను సెరెనా ఓడించింది.
క్రికెట్ నుంచి విరమించుకున్న సంగక్కర
శ్రీలంక క్రికెట్‌కు 15 ఏళ్లుగా సేవలందించిన సీనియర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర(37) ఆట నుంచి విరమించుకున్నాడు. ఆగస్టు 24న కొలంబోలో భారత్‌తో ముగిసిన రెండో టెస్టు నుంచి ఆయన తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆయనకు తోటి ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు. 134 టెస్టులు ఆడిన సంగక్కర 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. 404 వన్డేల్లో 14,234 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లండ్‌కు యాషెస్ ట్రోఫీ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-2 తేడాతో నెగ్గి యాషెస్ ట్రోఫీని ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో రెండవ, ఐదో టెస్టులను ఆసీస్ నెగ్గగా... మిగతా మూడు టెస్టులను ఇంగ్లండ్ గెలుచుకుంది. క్రిస్ రోజర్స్ (ఆసీస్), రూట్ (ఇంగ్లండ్)లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఈ టెస్టుతో ఆసీస్ కెప్టెన్ క్లార్క్, మరో ఆటగాడు క్రిస్ రోజర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం కెరీర్‌లో క్లార్క్ 115 టెస్టుల్లో 49.10 సగటుతో 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. రోజర్స్ 25 టెస్టుల్లో 42.87 సగటుతో 5 సెంచరీలు సహా 2015 పరుగులు సాధించాడు. 
ఆఫ్రికా అథ్లెట్లకు స్వర్ణాలు
ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఎరిత్రియాకు చెందిన 19 ఏళ్ల రన్నర్ గిర్మె గెబ్రెసెలాసీ చరిత్ర సృష్టించాడు. బీజింగ్‌లో ప్రారంభమైన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల మారథాన్ రేసులో విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించాడు. తన కెరీర్‌లో కేవలం మూడో రేసులో పాల్గొన్న అతను 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 12 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించాడు. యెమాన్ సెగె (ఇథియోపియా-2గం.13ని.08 సెకన్లు) రజతం, సాలమన్ ముతాయ్ (ఉగాండ-2గం.13ని.30 సెకన్లు) కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఎరిత్రియాకు ఇదే తొలి పసిడి పతకం. 2009 చాంపియన్‌షిప్‌లో 10 వేల మీటర్ల రేసులో తదెస్సె జెర్సెనె ఎరిత్రియాకు రజత పతకం అందించాడు.
అలాగే పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా రెండోసారి పసిడిపతకాన్ని దక్కిం చుకోగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కెన్యా యువతార నికోలస్ బెట్ తొలిసారి తమ దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో గెన్‌జెబి దిబాబా విజేతగా నిలిచి ఈ మెగా ఈవెం ట్‌లో ఇథియోపియా పసిడి ఖాతాను తెరిచింది.
భారత్‌లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2015 అక్టోబర్ 11-15 మధ్య పుణేలో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ జరుగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. మనదేశం నుంచి 40 మంది ఈ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్నారు. వారిలో 11 మంది యూత్ (బాలుర, బాలికల), 16 మంది జూనియర్ (పురుషుల, మహిళల), 13 మంది సీనియర్ (పురుషుల, మహిళల) విభాగాల్లో బరిలోకి దిగనున్నారు.

ప్రపంచ ఆర్చరీలో అభిషేక్‌కు స్వర్ణం
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3 పోటీల్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. వ్రోక్లా (పోలండ్)లో ఆగస్టు 15న జరిగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇస్మాయిల్ ఇబాది (ఇరాక్)పై అభిషేక్ విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుపొందింది. ఆగస్టు 16న జరిగిన జకార్తాలో జరిగిన ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనానెహ్వాల్ రజతం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చెన్ లాంగ్ (చైనా) ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)ను ఓడించి టైటిల్ సాధించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహ్మద్ అసన్, హెంద్రా సెటియావన్ (ఇండొనేషియా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో లియు జియోలాంగ్, కియు జిహాన్ (చైనా)లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను జావో యున్‌లీ, తియాన్ కింగ్ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో క్రిస్టినా పెడెర్సన్, కమిలా రైటర్ జుహీ (డెన్మార్క్)లను ఓడించారు.
నిషికోరికి వాషింగ్టన్ ఓపెన్ టైటిల్
వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కీ నిషికోరి (జపాన్) గెలుచుకున్నాడు. వాషింగ్టన్‌లో ఆగస్టు 9న జరిగిన ఫైనల్లో జాన్ ఇస్నర్ (అమెరికా)ను నిషికోరి ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్లోయానే స్టీఫెన్స్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో అనస్టాసియా పాలిచెకునోవాను ఓడించింది.
ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి
ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) క్లబ్ వెస్ట్ హామ్ యునెటైడ్ మహిళా ఫుట్‌బాల్ జట్టు.. భారత క్రీడాకారిణి అదితి చౌహాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇంగ్లండ్‌లోని ఓ టాప్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2013లో దక్షిణాసియా టైటిల్‌ను నెగ్గిన భారత జట్టులో గోల్‌కీపర్ అదితి కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ వ్యవస్థలో మూడో లెవల్ అయిన మహిళల ప్రీమియర్ లీగ్ సదరన్ డివిజన్‌లో వెస్ట్ హామ్ జట్టు తలపడుతోంది.
భారత గోల్ఫ్ క్రీడాకారుడు లాహిరి కొత్త రికార్డ్
భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈ స్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. లాహిరి దాదాపు రూ. 2.40 కోట్ల ప్రైజ్‌మనీ నెగ్గాడు. 28 ఏళ్ల లాహిరి మార్చిలో మూడు వారాల వ్యవధిలో మలేసియా ఓపెన్, హిరో ఇండియన్ ఓపెన్ నెగ్గి వార్తల్లో నిలిచాడు. జీవ్ మిల్కా సింగ్ 2008లో తొమ్మిది స్థానాన్ని సంపాదించడమే భారత్ తరఫున ఇప్పటివరకు పీజీఏ చాంపియన్‌షిప్‌లో ఉత్తమ ప్రదర్శన.
ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో
బ్రిటన్ దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ కో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టు 19న జరిగిన ఎన్నికల్లో సెబాస్టియన్ కోకు 115 ఓట్లు రాగా... ఆయన ప్రత్యర్థి, ఉక్రెయిన్ పోల్‌వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కాకు 92 ఓట్లు వచ్చాయి. 16 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న లామైన్ డియాక్ (సెనెగల్) స్థానంలో ఆగస్టు 31న కో బాధ్యతలు స్వీకరిస్తారు. 58 ఏళ్ల సెబాస్టియన్ కో 1980 మాస్కో, 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లలో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. అంతేకాకుండా ఎనిమిది అవుట్‌డోర్, మూడు ఇండోర్ ప్రపంచ రికార్డులను సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సెర్గీ బుబ్కా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుబ్కాతోపాటు దహ్లాన్ అల్ హమాద్ (ఖతార్), హమాద్ కల్కాబా మల్బూమ్ (కామెరూన్), అల్బెర్టో యువాన్‌టొరెనా (క్యూబా) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇదే ఎన్నికల్లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమరివల్లా ఐఏఏఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్
ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (34)అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్లు ఆగస్టు 8న ప్రకటించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ అనంతరం వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2011 నుంచి ఆయన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌లో 114 టెస్ట్‌లు ఆడిన క్లార్క్ 8628 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి.
ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్
ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 5 స్వర్ణ పతకాలు లభించాయి. దక్షిణ కొరియాలోని సువన్‌లో ఆగస్టు 10న ముగిసిన పోటీల్లో 5 స్వర్ణ పతకాలతోపాటు 5 రజత, ఏడు కాంస్య పతకాలు దక్కాయి. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ఎన్.కృష్ణ తేజ (అండర్-18 ఓపెన్‌లో) స్వర్ణ పతకం సాధించాడు.
హాకీ ఆటగాడు గుర్బాజ్‌పై 9 నెలల నిషేధం
సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. జట్టులో విభేదాలు సృష్టిస్తుండడంతో పాటు తనలో క్రమశిక్షణ లేదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ అనంతరం హెచ్‌ఐకి సమర్పించిన నివేదికలో గుర్బాజ్‌పై ఈమేరకు ఫిర్యాదు అందింది. ఆగస్టు 10న హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని సమావేశమైన హెచ్‌ఐ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 2016, మే 9 వరకు అతడు భారత జట్టుకు ఆడలేడు. జూడ్ ఫెలిక్స్ అందించిన నివేదికను అనుసరించి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కోచ్‌గా పనిచేసిన మైకేల్ నాబ్స్‌తో కూడా గొడవ పడి లండన్ ఒలింపిక్స్ అనంతరం కొద్ది కాలం గుర్బాజ్ సస్పెండ్‌కు గురయ్యాడు.
సానియాకు ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’
 దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ పురస్కారానికి ఎంపికైంది. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. జాబితాను క్రీడాశాఖ ఆమోదించిన తర్వాత ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆటగాళ్లకు ఈ అవార్డులను అందజేస్తారు. క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మందిని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించారు.
ఖేల్త్న్ర అవార్డు దక్కించుకోబోతున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్... 1996లో ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 
అర్జున అవార్డుకు ఎంపికైన మరో 14 మంది
పూవమ్మ (అథ్లెటిక్స్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతు రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్‌దీప్ జాంగ్రా (బాక్సింగ్), బబిత, భజ్‌రంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (ప్యారా సెయిలింగ్), మన్‌జీత్ చిల్లార్, అభిలాష మహాత్రే (కబడ్డీ).
అద్వానీ ఖాతాలో 13వ ప్రపంచ టైటిల్
భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ తన కెరీర్‌లో 13వ ప్రపంచ టైటిల్‌ను సాధించాడు. ఆగస్టు 11న జరిగిన ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను అతడు కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన తను ఫైనల్లో యాన్ బింగ్‌టావో (చైనా)ను 6-2తో సునాయాసంగా ఓడించాడు.

సురేశ్ రైనా @ పదేళ్లు
 భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా జూలై 30 నాటికి అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. 2005, జూలై 30న శ్రీలంకతో దంబుల్లాలో వన్డే మ్యాచ్‌లో రైనా ఆరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల రైనా ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటివరకు 218 వన్డేల్లో 5 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 5,500 పరుగులు చేశాడు. వన్డే, టెస్టు, టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 2011 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడంతో పాటు అదే ఏడాది వెస్టిండీస్ టూర్‌కు వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2011, 15 ప్రపంచకప్‌లు ఆడిన రైనా.. ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలలో 358 పరుగులు చేశాడు. 18 టెస్టులు, 44 టీ20 మ్యాచ్‌లు సైతం ఆడాడు.

భారత క్రికెట్ స్పాన్సర్‌గా ‘పేటీఎం’భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అంతర్జాతీయ సిరీస్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను పేటీఎం మాతృ సంస్థ ‘వన్97’ కంపెనీ దక్కించుకుంది. 2019 వరకు భారత్‌లో జరిగే అన్ని సిరీస్‌లనూ పేటీఎం కప్‌గా నిర్వహించనున్నారు. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.203.28 కోట్ల ఆదాయం సమకూరనుంది. జూలై 30న జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీలో ఈమేరకు నిర్ణయించారు. ఒక్కో మ్యాచ్‌కు రూ.1.68 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా... పేటీఎం రూ.2.42 కోట్లు చెల్లిస్తామంటూ దాఖలు చేసిన బిడ్‌ను కమిటీ ఆమోదించింది. గత ఏడాది మైక్రోమ్యాక్స్ సంస్థ ఒక్కో మ్యాచ్‌కు రూ.2.02 కోట్లు చెల్లించింది.

2022 వింటర్ ఒలింపిక్స్ వేదిక బీజింగ్ప్రపంచ క్రీడల చరిత్రలో చైనా రాజధాని బీజింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2008లో సమ్మర్ ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన బీజింగ్... 2022 వింటర్ ఒలింపిక్స్‌కూ ఆతిథ్యమివ్వనుంది. దీంతో రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన నగరంగా బీజింగ్ రికార్డులకెక్కనుంది. పోటీల వేదికను ఖరారు చేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) జూలై 31న ప్రత్యేకంగా సమావేశమైంది. బిడ్డింగ్‌లో బీజింగ్ 44 ఓట్లు సాధించగా... చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన కజకిస్తాన్‌కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు దేశాలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనగా... రకరకాల కారణాలతో నాలుగు దేశాలు వైదొలిగాయి. 

రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రకు సానియా పేరు ప్రతిపాదనప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. దీనిపై కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సానియా సాధించిన విజయాలకు గుర్తుగా ఆమె పేరును సిఫార్సు చేసినట్లు ఆగస్టు 1న క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంటర్-ఇన్‌స్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్45వ ఆల్ ఇండియా ఇంటర్- ఇన్‌స్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోష్ గెలుచుకున్నాడు. ఆగస్టు 2న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో హర్మీత్ దేశాయ్‌ని సౌమ్యజిత్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మనికా బాత్రా గెలుచుకుంది. ఈమె ఫైనల్లో అంకితా దాస్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను అభిషేక్ యాదవ్, సుధాన్షు గ్రోవర్ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో సౌమ్యజిత్ ఘోష్, హర్మీత్ దేశాయ్‌ని ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను క్రిత్వికా సిన్హా రాయ్, శ్వేతా పార్తే గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో అనిందితా చక్రవర్తి, పల్లబి కుందూలను ఓడించారు.

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్భారత్‌కు చెందిన ఆర్చర్ రజత్ చౌహాన్ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి, వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయుడుగా రికార్డుకెక్కాడు. కోపెన్‌హాగెన్‌లో ఆగస్టు 1న జరిగిన ఫైనల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్టీఫెన్ హానెన్స్ (డెన్మార్క్) బంగారు పతకం సాధించాడు. మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచి, రజతం సాధించింది. దీపికా కుమారి, లక్ష్మీరాణి, రిమిల్‌తో కూడిన బృందం ఈ పతకం సాధించింది. ఆగస్టు 2న కోపెన్‌హాగెన్‌లో జరిగిన ఫైనల్లో రష్యా జట్టు బంగారు పతకం సాధించింది.

జోత్స్నకు పదో టైటిల్భారత స్టార్ స్వ్కాష్ క్రీడాకారిణి జోత్స్న చిన్నప్ప తన కెరీర్‌లో పదో డబ్ల్యూఎస్‌ఏ టైటిల్ సాధించింది. ఆగస్టు 2న జరిగిన విక్టోరియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, 15 వేల డాలర్ల (దాదాపు రూ. 9.60 లక్షలు) ప్రైజ్‌మనీని పొందింది.

స్పెషల్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడులాస్ ఏంజెలీస్‌లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్.. గోల్ఫ్‌లో భారత్‌కు చెందిన రణవీర్ సింగ్ సైనీ స్వర్ణ పతకం సాధించాడు. మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న 14 ఏళ్ల సైనీ.. జులై 31న జరిగిన జీఎఫ్ గోల్ఫ్ లెవల్-2 అల్టర్‌నెట్ షాట్ ప్లేలో విజయం సాధించి ఆ ఘనత దక్కిన మొదటి భారతీయుడయ్యాడు. రణవీర్ రెండేళ్ల కిందట ఆసియా పసిఫిక్ క్రీడల్లో రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించాడు.

జిమ్నాస్ట్ దీపాకు కాంస్యంఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఆగస్టు 3న జరిగిన మహిళల వాల్ట్ విభాగంలో త్రిపురకు చెందిన దీపా 14.725 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. యాన్ వాంగ్ (చైనా-14.988 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... సెయి మియకావ (జపాన్-14.812 పాయింట్లు) రజత పతకాన్ని దక్కించుకుంది.

స్విమ్మింగ్‌లో లెడెకి ప్రపంచ రికార్డుప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆగస్టు 3న జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్ రేసును 18 ఏళ్ల లెడెకి 15 ని: 27.71 సెకన్లలో ముగించి, గతేడాది పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 15 ని : 28.35 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. 1500 మీటర్ల విభాగంలో లెడెకిది నాలుగో ప్రపంచ రికార్డు. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 15 ని : 36.53 సెకన్లతో తొలి ప్రపంచ రికార్డును సృష్టించిన లెడెకి... ఆ తర్వాత వుడ్‌లాండ్స్ మీట్‌లో (15 ని : 34.23 సెకన్లు), పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో మరో రెండుసార్లు ప్రపంచ రికార్డును సవరించింది. 400, 800 మీటర్ల విభాగాల్లోనూ లెడెకి పేరిటే ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

క్రీడలు జూలై 2015

క్రీడలు జూలై 2015
తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఒమన్
మధ్య ప్రాచ్య దేశం ఒమన్ క్రికెట్ జట్టు సీనియర్ స్థాయి క్రికెట్‌లో తొలిసారి ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనబోతుంది. 2016లో భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ఒమన్ క్వాలిఫై అయింది. జూలై 23న జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒమన్ 5 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. టి20 ప్రపంచకప్‌కు ఆప్ఘనిస్తాన్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ కూడా అర్హత సాధించాయి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు
క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలతోపాటు 36 మందిపై నమోదైన అభియోగాలను జూలై 25న కోర్టు కొట్టేసింది. ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013 మే 16న క్రికెటర్లతోపాటు కొందరు బుకీలు అరెస్టయ్యారు.
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీ
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. అస్తానా (కజకిస్థాన్) లో జూలై 26న ముగిసిన టోర్నమెంటులో మొత్తం తొమ్మిది పతకాలతో భారత్ రన్నరప్‌గా నిలచింది. కజకిస్థాన్ మొదటి స్థానం, మంగోలియా మూడో స్థానాల్లో ఉన్నాయి.
స్క్వాష్ టాస్మేనియన్ ఓపెన్ టోర్నీ టైటిల్
టాస్మేనియన్ ఓపెన్ టోర్నమెంట్ స్క్వాష్ టైటిల్‌ను భారత్‌కు చెందిన కుష్ కుమార్ గెలుచుకున్నాడు. ఇది ఆయనకు తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టైటిల్. జూలై 26న ఆస్ట్రేలియాలో ముగిసిన ఫైనల్లో జేమీ హేకాక్స్(ఇంగ్లండ్)ను కుష్ కుమార్ ఓడించాడు.
వెటెల్‌కు హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్
ఫార్ములా వన్ హంగేరీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 26న ముగిసిన పోటీలో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, క్వియాట్ (రెడ్ బుల్) రెండో స్థానం పొందాడు.
సీపీఎల్ చాంపియన్ ట్రినిడాడ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టైటిల్‌ను ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టు గెలుచుకుంది. జూలై 27న జరిగిన ఫైనల్లో ట్రినిడాడ్ జట్టు 20 పరుగుల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓడించింది. ట్రినిడాడ్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్... సీపీఎల్‌లో ఈ ఏడాది ట్రినిడాడ్ జట్టులో వాటా కొనుక్కుంది.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ క్లైవ్ రైస్ కన్నుమూత
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో జూలై 28న మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడంతో దాదాపు 20 ఏళ్ల పాటు రైస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది. 1991లో దక్షిణాఫ్రికాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రైస్ ప్రపంచ క్రికెట్‌కు చిరపరిచితుడు. 42 ఏళ్ల వయసులో ఆ సిరీస్‌లో ఆడిన మూడు వన్డేల అనంతరం ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో రైస్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. మొత్తం 482 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ రైస్ 40.95 సగటుతో 48 సెంచరీలు సహా 26,331 పరుగులు చేశారు. తన పేస్ బౌలింగ్‌తో 22.49 సగటుతో 930 వికెట్లు పడగొట్టారు.

లాగోస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాట్మింటన్ చాంపియన్‌షిప్
మహిళల డబుల్స్ టైటిల్‌ను సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రె (భారత్) గెలుచుకున్నారు. నైజీరియాలో జూలై 19న జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో ఒజ్గె బరాక్, నెష్లిహాన్ యిగిట్ (టర్కీ)లను సిక్కీ జోడీ ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్ రెడ్డి, మను అత్రీ(భారత్) జోడీ గెలుచుకుంది. రాబర్ట్ మతెమయెక్, నదియా జీబా(పోలండ్)లు ఫైనల్లో సిక్కి రెడ్డి, తరుణ్ కోనా(భారత్)లను ఓడించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించారు.
దులీప్ ట్రోఫీని నిలిపేసిన బీసీసీఐ
క్రికెట్ జోనల్ టోర్నమెంట్ దులీ్‌ప్ ట్రోఫీని ప్రస్తుత సీజన్‌లో కొనసాగించరాదని బీసీసీఐ జూలై 20న ప్రకటించింది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ట్రోఫీని ఈ ఏడాది నిర్వహించకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. 1961-62లో దులీప్ ట్రోఫీ మొదలైంది.
గోల్ఫర్ శుభమ్ సంచలనం
భారత జూనియర్ గోల్ఫ్ ఆటగాడు శుభమ్ జగ్లాన్ సంచలనం సృష్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఐఎంజీ అకాడమీ ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పదేళ్ల ఈ ఢిల్లీ బాలుడు విజేతగా నిలిచాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించాడు. 
ఫార్ములావన్ డ్రైవర్ బియాంచి మృతి
తొమ్మిది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్ములావన్ డ్రైవర్ జూలెస్ బియాంచి జూలై 17న మరణించాడు. గతేడాది అక్టోబర్ 5న జపాన్ గ్రాండ్‌ప్రిలో వర్షంలో దూసుకెళుతున్న అతని కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న రికవరీ వెహికల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో రేసులో మనోర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల బియాంచి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఈ ఫ్రెంచ్ డ్రైవర్ నైస్ పట్టణంలోని తన ఇంటికి దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫార్ములావన్ చరిత్రలో ఇప్పటికి 36 మంది డ్రైవర్లు తమ ప్రాణాలు వదలగా... చివరిసారిగా 1994లో ప్రఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెన్నా దుర్మరణం చెందాడు. 2013, 2014 సీజన్లలో మనోర్ జట్టు తరఫున బియాంచి 34 రేసులను పూర్తి చేశాడు. గతేడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో తొమ్మిదో స్థానంలో నిలిచి తమ జట్టుకు తొలిసారిగా చాంపియన్‌షిప్ పాయింట్లను అందించాడు. 
టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మౌరెస్మో
ప్రపంచ మహిళల టెన్నిస్ మాజీ నంబర్‌వన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్)కు అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. మౌరెస్మోతోపాటు పారాలింపిక్ ప్లేయర్ డేవిడ్ హాల్ (ఆస్ట్రేలియా), నాన్సీ జెఫెట్ (అమెరికా)లకు కూడా ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కోచ్‌గా వ్యవహరిస్తున్న 36 ఏళ్ల మౌరెస్మో 2006లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. అదే ఏడాది 36 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది. కెరీర్ మొత్తంలో 25 టైటిల్స్ నెగ్గిన ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది.
ముగ్గురు ఆర్చర్లపై మూడేళ్ల నిషేధం
ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో కాంస్య పతక పోరుకు ఆలస్యంగా చేరుకొని అనర్హతకు గురైన ముగ్గురు ఆర్చర్లు గుర్విందర్ సింగ్, కన్వల్‌ప్రీత్ సింగ్, అమన్.. జట్టు అధికారి జీవన్‌జ్యోత్ సింగ్‌లపై భారతీయ యూనివర్సిటీల సంఘం (ఏఐయు) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ నలుగురిపై ఇంటర్ యూనివర్సిటీ, అంతర్జాతీయ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొనకుండా మూడేళ్లపాటు నిషేధం విధించింది. దాంతోపాటు ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా వారిపై వెచ్చించిన సొమ్మును (ఒక్కొక్కరిపై సుమారు రూ. 5 లక్షలు) వారి నుంచే రాబట్టాలని నిర్ణయం తీసుకుంది.

భారత్‌కు న్యూజిలాండ్ సిరీస్
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో 2015, జూలై 8న ముగిసిన ఐదో వన్డేను భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 3-2 తేడాతో భారత్‌కు దక్కింది.
వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2015 విజేతలు
వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2015 పోటీలు జూలై 12తో ముగిసాయి. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దక్కించుకుంది. చాంపియన్‌షిప్‌లో విజేతకు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్‌కు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.జొకోవిచ్‌కు మూడో వింబుల్డన్ టైటిట్జూలై 12న జరిగిన ఫైనల్‌లో రెండో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను నొవాక్ ఓడించి మూడో సారి వింబుల్డన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో జొకోవిచ్ 200వ విజయాన్ని సాధించాడు. ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆరోసారి వింబుల్డన్ విజేతగా సెరెనాఅమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆరోసారి వింబుల్డన్ విజేతగా నిలిచింది. జూలై 11న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో సెరెనా 2002, 2003, 2009, 2010, 2012లలో ఈ టైటిల్‌ను సాధించింది. ఇప్పటి వరకు సెరెనా మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుపొందింది. స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-1988లో) తరవాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణి సెరెనాయే.సానియా జోడికి డబుల్స్ టైటిల్వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి కైవసం చేసుకుంది. జూలై 11న జరిగిన ఫైనల్‌లో ఈ జోడి ఎకతెరీనా మకరోవా - ఎలీన వెస్నినా (రష్యా) జోడిని ఓడించింది. విజేతకు 3 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 3 కోట్ల 34 లక్షలు), రన్నరప్‌కు లక్షా 70 వేల పౌండ్లు (రూ. కోటీ 67 లక్షలు) ప్రైజ్ మనీగా లభించాయి.మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ విజేత పేస్ జోడిభారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దీంతో తన ఖాతాలో 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా పేస్ కెరీర్‌లో ఇది నాలుగో వింబుల్డన్ మిక్స్‌డ్ టైటిల్.పురుషుల డబుల్స్ టైటిల్వింబుల్డన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోజర్ (నెదర్లాండ్స్), హోరియా టీకా (రోమానియా) జోడి గెలుపొందింది. ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్), జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
నేషనల్ సీనియర్ స్క్వాష్ టైటిల్
63వ నేషనల్ సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను సౌరవ్ ఘోసల్, మహిళల టైటిల్‌ను జోస్నా చిన్నప్పలు గెలుచుకున్నారు. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు. జూలై 12న తిరువనంతపురంలో ముగిసిన ఫైనల్లో హరీందర్ పాల్ సింగ్ సంధూ (తమిళనాడు)ను ఘోసల్ ఓడించగా, హర్షిత్ కౌర్ జవందా(ఢిల్లీ)ను జోస్నా చిన్నప్ప ఓడించారు.
ఇండియన సూపర్ లీగ్‌లో చెత్రికి రూ.1.20 కోట్లు
భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. జులై 10న జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు చెందిన ముంబై సిటీ ఎఫ్‌సీ ఫ్రాంచైజీ చెత్రిని కోటీ 20 లక్షలకు (కనీస ధర రూ.80 లక్షలు) కొనుగోలు చేసింది. మొత్తం పది మంది భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.
సోమ్‌దేవ్ రికార్డు
భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. అమెరికాలోని వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)పై గెలిచి విజేతగా నిలిచాడు. 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ సమయంపాటు జరిగిన ఫైనల్‌గా గుర్తింపు పొందింది. కెరీర్‌లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న అతను ఈ విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 148వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 
చెన్నై, రాజస్థాన్‌పై రెండేళ్ల నిషేధం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన జస్టిస్ లోధా కమిటీ తన తీర్పును వెలువరించింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల లోధా కమిటీ జూలై 14న ఈ విషయాలను వెల్లడించింది. అలాగే బెట్టింగ్‌కు పాల్పడినందుకు చెన్నై జట్టు టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్ధారించింది. వారు అవినీ తికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని ప్రకటించింది. ఇక భవిష్యత్‌లో వీరిద్దరు ఎలాంటి క్రికెట్ కార్యకలాపా లు చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను రహానే సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి వన్డేలో భారీ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 14న జరిగిన మూడో వన్డేలో భారత్ 83 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో అంబటి రాయుడు (124 నాటౌట్), ఆఖరి మ్యాచ్‌లో కేదార్ జాదవ్ (105 నాటౌట్) సెంచరీలు సాధించారు. సిరీస్‌లో అత్యధికంగా 165 పరుగులు సాధించిన రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ సిరీస్ విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా గెలవగా.. తరవాత రెండు వన్డేల్లో నెగ్గిన బంగ్లా ట్రోఫీని దక్కించుకుంది. ఈ ఏడాది సొంతగడ్డపై బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌పై, జూన్‌లో భారత్‌పై బంగ్లా సిరీస్ విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ వన్డేల్లో 200 వికెట్లు, నాలుగువేల పరుగులు చేసి ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో నిలిచాడు.
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు
భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ జూలై 15న నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మూడు దేశాలు ఏకగ్రీవంగా దీనికి ఆమోద ముద్ర వేశాయి. టోర్నీకి సరైన ప్రజాదరణ లేదని గతంలోనే రద్దు ప్రతిపాదనలు వచ్చినా... స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్తాన్, చెన్నై ఫ్రాంచైజీలపై వేటు పడటంతో ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టింది. ప్రజాదరణ దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని కౌన్సిల్ తెలిపింది. సీఎల్‌టి20ని బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు కలిసి 2009లో ఏర్పాటు చేశాయి.
700 వికెట్ల క్లబ్‌లో హర్భజన్
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 700 వికెట్ల క్లబ్‌లో చేరాడు. జింబాబ్వేతో జూలై 14న జరిగిన మూడో వన్డేలో సికిందర్ రజా వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 700 వికెట్లు తీసిన జాబితాలో 12వ స్థానంలో ఉన్న భజ్జీ భారత్ తరఫున రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇతని కంటే ముందున్నాడు. టాప్-5లో ముత్తయ్య మురళీధరన్ (1347), షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (956), మెక్‌గ్రాత్ (949), వసీమ్ అక్రమ్ (916) ఉన్నారు. 435 ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ మార్క్‌ను సాధించగా, మురళీధరన్ 308 ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు.

చిలీకి కోపా అమెరికన్ కప్
ఫుట్‌బాల్ కోపా అమెరికన్ కప్‌ను తొలిసారి చిలీ గెలుచుకుంది. ఈ కప్‌ను చిలీ 99 ఏళ్ల అనంతరం గెలుచుకోగలిగింది. జూలై 5న శాంటియాగో (చిలీ)లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను చిలీ ఓడించింది. 

ఒలింపిక్స్‌కు మహిళల హాకీ జట్టు అర్హత హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌లో విజయం సాధించి భారత హాకీ మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో జూలై 4న జరిగిన పోటీలో జపాన్ జట్టును ఓడించి భారత్ అయిదో స్థానం దక్కించుకుంది. దీంతో 35 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

భారత్‌కు ఎస్‌ఏబీఏ చాంపియన్‌షిప్ టైటిల్4వ దక్షిణాసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎస్‌ఏబీఏ) టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో జూలై 5న జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మూడో స్థానంలో నేపాల్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, అయిదో స్థానంలో మాల్దీవులు, ఆరో స్థానంలో భూటాన్ నిలిచాయి. దీంతో భారత్ ఈ ఏడాది చివర చైనాలో జరిగే ఆసియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.

అమెరికాకు మహిళల ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టైటిల్మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. వాంకోవర్‌లో జూలై 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను అమెరికా 5-2 తేడాతో ఓడించింది. ఈ కప్‌ను అమెరికా గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 1991, 1999లో గెలుచుకుంది. మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా అమెరికా నిలిచింది.

బ్రిటిష్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్బ్రిటిష్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జులై 5న ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ఈ రేసులో 52 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 31 నిమిషాల 27.729 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

మహిళల హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్స్మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ విజేతగా నెదర్లాండ్స్ నిలిచింది. జులై 5న జరిగిన ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ దక్షిణ కొరియాపై 2-1తో విజయం సాధించింది. నెదర్లాండ్స్ తరఫున ఎల్లన్ హుగ్ (3వ నిమిషం), వాన్ మాసక్కర్ (44వ నిమిషం) గోల్స్ చేయగా, దక్షిణ కొరియా ప్లేయర్ కిమ్ బో మి 34 నిమిషంలో గోల్ చేసింది.

మిథాలీ రాజ్ @5 వేల పరుగులుభారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా.. తొలి భారత క్రికెటర్‌గా నిలిచారు.తొలి స్థానంలో చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) కొనసాగుతున్నారు. జూలై 6న న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు 157 వన్డేలు ఆడిన మిథాలీ 48.82 సగటుతో 5029 పరుగులు చేశారు. వీటిలో ఐదు సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి.

మేవెదర్ టైటిల్ వెనక్కిమ్యానీ పకియావోతో జరిగిన ‘శతాబ్దపు పోరు’లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కించుకున్నాడు. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.కోటీ 27 లక్షలు)ను ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబీవో)కు చెల్లించాల్సి ఉంది. జూలై 3న ఈ గడువు ముగియడంతో వెల్టర్‌వెయిట్ బెల్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డబ్ల్యుబీవో నిర్ణయించింది. డబ్ల్యుబీవో నిబంధనల ప్రకారం బాక్సర్లు తాము గెలుచుకున్న మొత్తం నుంచి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంటవాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈ గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 156 పతకాలు కొల్లగొట్టింది. ఇందులో 89 స్వర్ణాలు, 50 రజతాలు, 17 కాంస్యపతకాలు ఉన్నాయి.
ఇంతకుముందు 2013లో ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారత్ సాధించిన 83 పతకాలే అత్యధికం. స్విమ్మింగ్ విభాగంలో సీఆర్‌పిఎఫ్‌కు చెందిన రీచా మిశ్రా ఏకంగా ఆరు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన కుల్విందర్ కౌర్ 5 బంగారు పతకాలు సాధించింది. 50 మందితో కూడిన భారత బృందం ఏడు విభాగాల్లో పోటీపడింది. వాటిలో అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, ఆర్చరీ, స్విమ్మింగ్, షూటింగ్ విభాగాలున్నాయి.

న్యూజిలాండ్‌తో 5 వన్డేల సిరీస్ భారత్ కైవసంన్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తో భారత్ సొంతం చేసుకుంది. జులై 8న జరిగిన చివరి వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 27.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో బీసీసీఐ భారత జట్టుకు ప్రోత్సాహకంగా బోర్డు తరఫున రూ. 21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

క్రీడలు జూన్ 2015

క్రీడలు జూన్ 2015
ఎన్‌బీఏ లీగ్‌కు సత్నామ్ సింగ్ ఎంపిక
అమెరికాలోని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ) లీగ్‌కు పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ భమారా(19) ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా ఆయనకు గుర్తింపు లభించింది. జూన్ 26న జరిగిన ఎన్‌బీఏ డ్రాఫ్ట్‌లో సత్నామ్‌ను డల్లాస్ మావెరిక్స్ ఎంపిక చేసుకుంది.
ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్
క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరం నుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెట్ అభివృద్ధి కమిటీలోకి తీసుకుంది.
తపలోవ్‌కు నార్వే చెస్ టైటిల్
నార్వే చెస్ 2015 టైటిల్‌ను వి.తపలోవ్ గెలుచుకున్నాడు. జూన్ 25న నార్వేలో ముగిసిన పోటీలో తపలోవ్ టైటిల్ సాధించగా, విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానంలో నిలిచాడు.
జ్వాలా - అశ్విని జోడీకి కెనడా ఓపెన్ టైటిల్
బ్యాడ్మింటన్ కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల డబుల్స్ టైటిల్‌ను గుత్తా జ్వాలా- అశ్విని పొన్నప్ప(భారత్) గెలుచుకున్నారు. వీరు కెనడాలో జూన్ 29న జరిగిన ఫైనల్లో ఈఫ్జీ ముస్కెన్స్- సెలెనా ఫైక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించారు.
ఎడ్మాంటన్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
తెలుగు తేజం, భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఎడ్మాంటన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. కెనడాలో ముగి సిన ఈ టోర్నీలో హరికృష్ణ 7.5 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని దక్కించున్నాడు. మొత్తం 10 మంది క్రీడాకారుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఆరు గేముల్లో గెలిచాడు.
కామన్వెల్త్ చెస్ చాంపియన్ అభిజిత్ గుప్తా
కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా చాంపియన్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. జూన్ 30న ముగిసిన ఈ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్లలో అభిజిత్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆర్గ్యా దీప్ దాస్ (భారత్), దీపన్ చక్రవర్తి (భారత్)తో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... ఆర్గ్యాదీప్‌కు రెండో స్థానం, లలిత్‌కు మూడో స్థానం, దీపన్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇదే టోర్నమెంట్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్ వీ (మలేసియా) దక్కించుకున్నాడు. చోంగ్ వీ జూన్ 21న జరిగిన ఫైనల్లో హాన్స్ - క్రిస్టియన్ విటింగస్(డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి ఒకుహరా (జపాన్) ఫైనల్లో సయాకాసతో (జపాన్)ను ఓడించి గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను లి జున్‌హుయ్ - యుచిన్ లియు (చైనా) జోడీ ఫైనల్లో మనూ అత్రి - సుమీత్ రెడ్డి (భారత్)ను ఓడించి కైవసం చేసుకుంది. 
సెర్బియాకు అండర్ - 20 ఫిఫా వరల్డ్ కప్
అండర్ - 20 ఫిఫా వరల్డ్ కప్‌ను సెర్బియా గెలుచుకుంది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జూన్ 20న జరిగిన ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియా బ్రెజిల్‌ను ఓడించి టైటిల్‌ను సాధించింది. 
రోస్‌బర్గ్‌కు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. స్పీల్‌బర్గ్‌లో జూన్ 21న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటి స్థానంలో నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు. 
రోజర్ ఫెదరర్‌కు గెర్రీ వెబర్ ఓపెన్ టైటిల్
గెర్రీ వెబర్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) హాలె (జర్మనీ)లో జూన్ 21న జరిగిన ఫైనల్లో ఆండ్రియాస్ సెప్పీ (ఇటలీ)ని ఓడించి దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా), రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) - ఫ్లోరిన్ మెర్జీ (రుమేనియా) జోడీని ఓడించి చేజిక్కించుకుంది. 
జోర్డాన్ స్పీథ్‌కు యూఎస్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్
యూఎస్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను జోర్డాన్ స్పీథ్ గెలుచుకున్నాడు. అమెరికాలో జూన్ 21న ముగిసిన పోటీలో జోర్డాన్ స్పీథ్ విజయం సాధించాడు. డస్టిన్ జోన్సన్ రెండో స్థానంలో నిలిచాడు. 
దక్షిణాసియా టీటీ టోర్నీలో వరుణికి టీమ్ స్వర్ణం
దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి వరుణి జైస్వాల్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. బాలికల క్యాడెట్ విభాగంలో వరుణికి ఈ పతకం దక్కింది. ఇక్కడి తాల్కటోరా స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత జట్టు నేపాల్, శ్రీలంకలను చిత్తు చేసి టీమ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 
డోపింగ్‌లో భారత్‌కు మూడో స్థానం
2013 ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(World Anti-Doping Agency) నివేదిక ప్రకారం భారత్‌కు డోపింగ్‌లో మూడో స్థానం దక్కింది. తొలి రెండు స్థానాల్లో రష్యా, టర్కీ నిలిచాయి. ఆ ఏడాది భారత్ నుంచి 91 మంది అథ్లెట్లు నిషేధిక ఉత్ప్రేర కాలు వాడినట్టు తేలింది. ఇందులో 20 మంది మహిళలున్నారు. ఈనెల 15న వాడా ఈ నివేదికను వెల్లడించింది. రష్యా నుంచి 212 మంది అథ్లెట్లు డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలితే టర్కీ నుంచి 155 మంది డోపీలయ్యారు. మొత్తంగా 115 దేశాల నుంచి 89 క్రీడల్లో 2,07,513 శాంపిళ్లను పరీక్షించారు. ఇక భారత్ నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు 30 మంది డోపింగ్‌కు పాల్పడగా ఆ తర్వాతి స్థానాల్లో వెయిట్‌లిఫ్టింగ్ (19), పవర్‌లిఫ్టర్స్ (8), బాడీ బిల్డింగ్ (8), జూడో (7), బాక్సింగ్ (4), అక్వాటిక్స్ (2), సైక్లింగ్ (2), కబడ్డీ (2), క్రికెట్ (1), ఫుట్‌బాల్ (1), తైక్వాండో (1), వాలీబాల్ (1) నుంచి ఉన్నారు. 
ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్ యువ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ముస్తాఫిజుర్ మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ హారిస్ ఐదు వన్డేల సిరీస్‌లో 13 వికెట్లు తీశాడు. 
భారత్‌పై బంగ్లా తొలి సిరీస్ విజయం
భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. భారత్‌పై బంగ్లాదేశ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. ఆఖరి వన్డేలో భారత్ గెలిచింది. బంగ్లాదేశ్‌కు స్వదేశంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. మొర్తాజా నాయకత్వంలోని బంగ్లా జట్టు జింబాబ్వేపై 5-0, పాకిస్తాన్‌పై 3-0, భారత్‌పై 2-1తో వరుసగా మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది.

బోపన్న జోడీకి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్
భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న.. ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వీరు స్టుట్‌గార్ట్ (జర్మనీ)లో జూన్ 14న జరిగిన ఫైనల్లో అలెగ్జాండర్ పెయా(ఆస్ట్రియా)- బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జంటను ఓడించారు. బోపన్నకు కెరీర్‌లో ఇది 14వ డబుల్స్ టైటిల్. సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్(స్పెయిన్) ఫైనల్లో విక్టర్ ట్రియెకి(సెర్బియా) ను ఓడించి గెలుచుకున్నాడు.
‘ఫోర్బ్స్’ సంపన్న క్రీడాకారుల్లో ధోని
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని తొలి 100 సంపన్న క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి 23వ స్థానం దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారుడు ధోనియే కావడం విశేషం. ఏడాదిలో ఆయన సంపాదన 31 మిలియన్ డాలర్లు(రూ.198.3 కోట్లు). గతేడాది ఆయన ర్యాంకు 22 కాగా.. ఈసారి ఒక స్థానం పడిపోయింది. అమెరికన్ బాక్సర్ లాయిడ్ మేవెదర్ ఈ జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు. గోల్ఫర్ టైగర్ వుడ్స్, టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్, పోర్చుగీస్ సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో తదితరులు అగ్రస్థానాల్లో నిలిచారు. 2014 నుంచి 2015 జూన్ వరకు క్రీడాకారులు సంపాదించిన వేతనాలు, ప్రైజ్ మనీ, బోనస్‌ల ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. 300 మిలియన్ డాలర్ల(రూ.1919.17 కోట్లు) సంపాదనతో బాక్సర్ మేవెదర్ జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు.

వావ్రింకా, సెరెనాకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్స్‌ను వావ్రింకా, సెరెనా గెలుచుకున్నారు. పారిస్‌లో జూన్ 7న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను వావ్రింకా (స్విట్జర్లాండ్) ఓడించి టైటిల్ సాధించాడు. ఇది వావ్రింకాకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్ దక్కించుకుంది. సెరెనాకు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఈమె మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్) ఫైనల్లో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్(అమెరికా)ను ఓడించి సాధించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను లూసీ సఫరోవా(చెక్ రిపబ్లిక్)-బెథానీ మాట్(అమెరికా) ఫైనల్లో డెలాక్వా(ఆస్ట్రేలియా)- ష్వేదోవా(రష్యా) జోడిని ఓడించి సాధించారు.
హామిల్టన్‌కు కెనడా గ్రాండ్‌ప్రీ
ఫార్ములా వన్ కెనడా గ్రాండ్‌ప్రీ టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మాంట్రియల్‌లో జూన్ 8న ముగిసిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, నికో రోస్ బర్గ్ రెండో స్థానం సాధించాడు.
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్
చైనాలోని వుహాన్‌లో జూన్ 7న ముగిసిన 21వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 4 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 13 పతకాలు గెలుచుకుంది. చైనా 15 స్వర్ణ పతకాలతో మొదటి స్థానంలో ఉండగా, కతార్ 7 స్వర్ణ పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. షాట్‌పుట్‌లో ఇందర్‌జీత్ సింగ్ తొలి స్వర్ణం సాధించాడు. భారత్‌కు చెందిన అథ్లెట్లు జూన్ 6న మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో లలితా బాబర్, డిస్కస్ త్రోలో వికాస్ గౌడ స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా స్వర్ణ పతకం సాధించింది.

బీసీసీఐ సలహాదారులుగా సచిన్, గంగూలీ, లక్ష్మణ్
 భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ)లో నూతనంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో క్రికెట్ దిగ్గజాలకు చోటు లభించింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను సభ్యులుగా నామినేట్ చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ జూన్ 1న ప్రకటించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత క్రికెట్ జట్టుకు, బీసీసీఐకి వీరు సహాయ సహకారాలు అందిస్తారు.

ఫిఫా అధ్యక్షుడిగా బ్లాటర్ ఎన్నిక.. రాజీనామాఅంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్(79) తిరిగి ఎన్నికయ్యారు. జ్యూరిచ్‌లో మే 29న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోర్డాన్ ప్రిన్స్ బిల్ అల్ హుస్సేన్‌పై బ్లాటర్ విజయం సాధించారు. గత పదిహేడేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన అయిదోసారి ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా.. బ్లాటర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జూన్ 2న ప్రకటించారు. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. అయితే ఇప్పుటికిప్పుడు ఆయన ఫిఫాను వదిలి వెళ్లే అవకాశాల్లేవు. నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి డిసెంబర్-మార్చి మధ్యలో మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే వరకు ఆయనే పదవిలో కొనసాగుతారు. 

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇందర్‌జీత్‌కు స్వర్ణంఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చైనాలోని వుహాన్‌లో జూన్ 3న జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఇందర్‌జీత్ సింగ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల ఈ షాట్‌పుటర్ ఇనుప గుండును 20.41 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇందర్‌జీత్ తాజా ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఎనిమిదో భారతీయ షాట్‌పుటర్‌గా నిలిచాడు. గతంలో జగ్‌రాజ్ సింగ్ (1973), బహదూర్ సింగ్ (1975), బల్వీందర్ సింగ్ (1985, 1989), శక్తి సింగ్ (2000), నవ్‌ప్రీత్ సింగ్ (2007), ఓంప్రకాశ్ సింగ్ (2009) ఈ ఘనత సాధించారు.

క్రీడలు మే 2015

క్రీడలు మే 2015
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-8 టైటిల్
ఎనిమిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ చాంపియన్‌షిప్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. కోల్‌కతాలో మే 24న జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను గెలవడం ముంబైకిది రెండోసారి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ వార్నర్ 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రావో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. విలువైన ఆటగాడిగా ఆండ్రీ రస్సెల్(14 వికెట్లు, 326 పరుగులు) నిలిచాడు. క్రిస్ గేల్ అత్యధికంగా 36 సిక్సర్లు కొట్టాడు.
సైనా నంబర్‌వన్
 భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీడబ్ల్యూఎఫ్ మే 21న విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. గత నెలలో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా ఆ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. మే 26న ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సైనా డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగింది. పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ ర్యాంకులో ఉంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ తన నాలుగో స్థానాన్ని.. పి.కశ్యప్, ప్రణయ్ తమ 13, 15వ స్థానాలను కాపాడుకున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జంట 21వ స్థానంలో ఉంది.
రోస్‌బర్గ్‌కు మొనాకో గ్రాండ్ ప్రీ
ఫార్ములా వన్ మొనాకో గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ రేసర్ నికో రోస్‌బర్గ్ గెలుచుకున్నాడు. మోంటెకార్లోలో మే 24న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా సెబాస్టియన్ వెటల్ రెండో స్థానాన్ని పొందాడు.
సియెట్ ఉత్తమ క్రీడాకారుడు రహానే
2015 సియెట్ క్రీడా అవార్డులను మే 25న ముంబైలో ప్రదానం చేశారు. లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు: కపిల్ దేవ్; ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: కుమార సంగక్కర(శ్రీలంక); ఉత్తమ క్రీడాకారుడు: అజింక్య రహానే; ఉత్తమ బ్యాట్స్‌మన్: హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా); ఉత్తమ బౌలర్: హెరాత్(శ్రీలంక); ఉత్తమ టీ-20 ఆటగాడు: డ్వేన్ బ్రావో(వెస్టిండిస్); పాపులర్ చాయిస్ అవార్డు: పొలార్డ్(వెస్టిండిస్).

చైనాకు బ్యాడ్మింటన్ సుదిర్మన్ కప్
బ్యాడ్మింటన్ సుదిర్మన్‌కప్‌ను చైనా గెలుచుకుంది. చైనాలోని డాంగ్వాన్‌లో మే 16న ముగిసిన ప్రపంచ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్ ఫైనల్‌లో జపాన్‌ను చైనా ఓడించి వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. ఈ పోటీలు తిరిగి 2017లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతాయి.
జొకోవిచ్, షరపోవాలకు రోమ్ ఓపెన్ టైటిళ్లు
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జొకోవిచ్ గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 16న జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు నాలుగో మాస్టర్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మరియా షరపోవా కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను టిమియా బాబోస్, క్రిస్టినా మడనోవిచ్ జోడీ గెలుచుకుంది.
రన్నరప్ సానియా జంట 
 రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట రన్నరప్‌గా నిలిచింది. రోమ్‌లో మే 17న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 4-6, 3-6తో మూడో సీడ్ తిమి బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సానియా జంట తుదిపోరులో మాత్రం వరుస సెట్‌లలో ఓడింది. 72 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జోడీ తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా-హింగిస్‌లకు 57,840 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 42 లక్షలు)తోపాటు 585 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జతగా ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంటకు ఫైనల్లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. తొలి మూడు టోర్నమెంట్లలో (ఇండియన్ వెల్స్, మియామి, ఫ్యామిలీ సర్కిల్ కప్) విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం పోర్షె గ్రాండ్‌ప్రిలో రెండో రౌండ్‌లో, మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.

క్విటోవాకు మాడ్రిడ్ ఓపెన్ టైటిల్
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను పెట్రా క్విటోవా మే 9న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వెత్లానా కుజనెత్సోవాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే.. ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించి గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా).. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా), మార్సిన్ మట్‌కోవిక్సీ (పోలండ్)లను ఓడించి గెలుచుకున్నారు. బోపన్నకు ఇది మూడో మాస్టర్స్ సిరీస్ టైటిల్.
హాకీ సిరీస్ భారత్ కైవసం
జపాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. భువనేశ్వర్‌లో మే 9న జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్‌కు 3-0 తేడాతో సిరీస్ దక్కింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
రోస్‌బర్గ్‌కు స్పెయిన్ గ్రాండ్‌ప్రి
మెర్సిడస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములా వన్ స్పెయిన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. బార్సిలోనాలో మే 10న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు.
ఏటీపీ చాలెంజర్ టోర్నీ
భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాబ్రీ స్పెయిన్‌కు చెందిన ఆడ్రియన్ మెనాడస్ మెసిరాస్‌తో కలిసి ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరు మే 9న కర్షి (ఉజ్బెకిస్తాన్) లో జరిగిన ఫైనల్లో సెర్గి బెటోవ్ (బెలారస్), మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)లను ఓడించారు.

వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్‌షిప్‌లో హంపీ, హారికలకు పతకాలు
భారత్ చెస్ క్రీడాకారిణిలు హంపీ, హారికలు వరల్డ్ ఉమెన్ టీం చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత బోర్డు మెడల్ పొందారు. చైనాలోని చెంగ్డూలో 2015 ఏప్రిల్ 28న ముగిసిన పోటీల్లో హారికకు రజత పతకం, హంపీకి కాంస్య పతకం దక్కాయి. టీం చాంపియన్‌షిప్‌లో జార్జియా మొదటి స్థానంలో నిలవగా రష్యా, చైనా, భారత్‌కు తరువాతి స్థానాలు దక్కాయి.

బాక్సింగ్ మెగా ఫైట్‌లో మేవెదర్ గెలుపుప్రముఖ బాక్సింగ్ క్రీడాకారులు ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్‌‌స)ల మధ్య 2015 మే 3న లాస్‌వెగాస్ (అమెరికా)లో జరిగిన బౌట్‌లో మేవెదర్ విజేతగా నిలిచాడు. ఈ శతాబ్దపు మేటి బౌట్‌గా పేర్కొన్న ఈ పోటీలో పాకియోను ఓడించి మేవెదర్ గెలుపొందాడు. విజేతకు రూ. 1,147 కోట్లు (18 కోట్ల డాలర్లు), ఓడిన పాకియోకు రూ. 764 కోట్లు(12 కోట్ల డాలర్లు) లభించాయి. మేవెదర్‌కు ఇది వరుసగా 48వ విజయం.

ఫెదరర్‌కు ఇస్తాంబుల్ ఓపెన్టాప్‌సీడ్ రోజర్ ఫెదరర్ ఇస్తాంబుల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇస్తాంబుల్‌లో 2015 మే 3న జరిగిన ఫైనల్స్‌లో పాబ్లో క్యూవస్‌ను ఫెదరర్ ఓడించాడు.

ముర్రేకు మ్యూనిచ్ ఓపెన్ టైటిల్మ్యూనిచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. మ్యూనిచ్‌లో 2015 మే 4న జరిగిన ఫైనల్స్‌లో ఫిలిప్ కోల్ స్క్రీబెర్‌ను ముర్రే ఓడించాడు. ముర్రేకి ఇది కెరీర్‌లో 33వ టైటిల్.

రోరె మక్‌లోరేకు వరల్డ్ మ్యాచ్ ప్లే చాంపియన్‌షిప్వరల్డ్ నెంబర్ వన్ రోరె మక్‌లోరే గోల్ఫ్ వరల్డ్ మ్యాచ్ ప్లే చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్‌కోలో 2015 మే 3న జరిగిన మ్యాచ్‌లో గారీ ఉడ్‌లాండ్‌ను రోరె ఓడించాడు.

రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్ నేషనల్..5వ హాకీ ఇండియా ఉమెన్‌‌స నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేలు గెలుచుకున్నాయి. సైఫై (ఉత్తరప్రదేశ్)లో 2015 మే 3న జరిగిన ఫైనల్స్‌లో జార్ఖండ్‌ను రైల్వేలు ఓడించాయి. రైల్వేలకు ఐదేళ్లలో ఇది నాలుగో నేషనల్ టైటిల్.

స్కేటింగ్‌లో భారత్‌కు 7 స్వర్ణాలుహాంకాంగ్ ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 14 పతకాలు గెలుచుకుంది. ఇందులో 7 స్వర్ణాలు కావడం విశేషం. వీటితో పాటు మరో 5 రజతాలు, 2 కాంస్యాలు భారత్ సొంతం చేసుకుంది. 11 ఏళ్ల ఖుషీ షా మూడు ఈవెంట్లలో స్వర్ణాలు సాధించింది. 

ఆసియా సీనియర్ రెజ్లింగ్‌లో గీతకు కాంస్యంఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది. దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో మే 6న జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో ఆమె... వియత్నాంకు చెందిన థి లొన్ నైగుయెన్‌ను కంగుతినిపించింది. పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరీలో హితేందర్ కూడా కాంస్యపతక పోటీకి అర్హత సంపాదించాడు.

క్రీడలు ఏప్రిల్ 2015

క్రీడలు ఏప్రిల్ 2015
ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ టోర్నీలో విజేతగా భారత్
ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండోనేషియాలో ఏప్రిల్ 27న ముగిసిన టోర్నమెంట్‌లో భారత్ నాలుగు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి మొత్తం 33 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. పురుషుల విభాగంలో రాకేశ్ కుమార్, హర్పాల్ సింగ్ స్వర్ణపతకాలు సాధించారు. మనీశ్ కుమార్‌కు కాంస్య పతకం దక్కింది. మహిళల విభాగంలో సర్జు బాల, పింకీ జాంగ్రా స్వర్ణాలు సాధించారు. ఈ టోర్నమెంట్‌లో 30 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొన్నారు.
నేషనల్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ
కోల్ ఇండియా నేషనల్ సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల టైటిల్‌ను గురుసాయిదత్త, మహిళల టైటిల్‌ను నేహా పండిట్ గెలుచుకున్నారు. బెంగళూరులో ఏప్రిల్ 18న ముగిసిన పోటీల్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో బి.సాయి ప్రణీత్ (పెట్రోలియం)ను గురుసాయిదత్త (పెట్రోలియం) ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రూపేశ్ కుమార్ (పెట్రోలియం), సనావే థామస్ (కేరళ) ఫైనల్లో అరుణ్ జార్జ్ (కేరళ), నందగోపాల్(ఏఏఐ)లను ఓడించి టైటిల్ గెలుపొందారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రేష్మా కార్తీక్ (ఏఐ)ను ఓడించి నేహాపండిట్ (మహారాష్ట్ర) గెలుచుకుంది. మహిళల డబుల్స్ టైటిల్ ఫైనల్‌లో మేఘనా, కె.మనీషా.. ధన్యా నాయర్, మొహితా సహదేవ్‌లను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ఫైనల్‌లో సన్యామ్ సుక్లా, కె.మనీషా.. శుక్లా రామచంద్రన్, జె.మేఘనలను ఓడించి టైటిల్ గెలిచారు.
లిన్‌డాన్‌కు బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ డాన్ (చైనా) గెలిచాడు. బీజింగ్‌లో ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో తియాన్ హువైయీ (చైనా)ను లిన్ డాన్ ఓడించి టైటిల్ సాధించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచనోక్ ఇంతనోన్ (థాయిలాండ్) ఫైనల్లో లీ గ్సూయిరీ(చైనా)ని ఓడించింది.

జోర్డాన్ స్పీథ్‌కు మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్
మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్‌ను జోర్డాన్ స్పీథ్ (అమెరికా) గెలుచుకున్నాడు. ఆగస్టాలో ఏప్రిల్ 12న ముగిసిన పోటీలో స్పీథ్ టైటిల్ సాధించగా, ఫిల్ మైకెల్‌సన్ (అమెరికా) రెండో స్థానంలో నిలిచాడు. ఈ మాస్టర్ టైటిల్ స్పీథ్ గెలవడం ఇదే తొలిసారి.
హామిల్టన్‌కు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకున్నాడు. మనామా (బహ్రెయిన్)లో ఏప్రిల్ 19న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి
 మైదానంలో యువ క్రికెటర్ అంకిత్ కేసరి (20) మరణించారు. బెంగాల్ డివిజన్-1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఏప్రిల్ 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన బంతిని పట్టుకోవడంలో మరో క్రికెటర్ సౌరవ్ మొండెల్ ఒకరికొకరు ఢీకొనడంతో గాయపడ్డాడు. మూడు రోజుల అనంతరం కోల్‌కతలో చికిత్స పొందు తూ ఏప్రిల్ 20న మరణించాడు. అంకిత్ బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సచిన్
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రముఖ లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సభ్యత్వం దక్కింది. సచిన్‌తో పాటు చైనా బాస్కెట్‌బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్‌లు కూడా ఏప్రిల్ 15న ప్రకటించిన లారెస్ అకాడెమీ జాబితాలో ఉన్నారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌లకు ఈ గౌరవం దక్కింది.
లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా జొకోవిచ్, దిబాబా
16వ లారెస్ క్రీడా అవార్డులను ఏప్రిల్ 15న షాంఘైలో ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ (టెన్నిస్) ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా ఇథియోపియాకు చెందిన గెంజెబె దిబాబా(లాంగ్ డిస్టెన్స్ రన్నర్) ఎంపికయ్యింది. వరల్డ్ టీం ఆఫ్ ది ఇయర్‌గా జర్మనీ ఫుట్‌బాల్ టీం నిలిచింది.
కార్తికేయన్‌కు మూడో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ మూడో స్థానంలో నిలిచాడు. సుజుకాలో ఏప్రిల్ 19న జరిగిన రేసులో అండ్రీ లోటెరర్ మొదటి స్థానం, కజుకి నకజిమా రెండో స్థానం సాధించారు. ఫార్ములా వన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో టాప్-3కి చేరడం ఇదే తొలిసారి.
ఆసియా ఓషియానియా గ్రూప్-2లో భారత్ విజయం
ఫెడ్ కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఆసియా ఓషియానియా గ్రూప్-2 మహిళల టెన్నిస్ టోర్ని ఫైనల్ ప్లే ఆఫ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ ఫైనల్లో ఫిలిప్పీన్స్‌ను భారత్ ఓడించింది. దీంతో భారత్‌లో 2016లో జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్-1కు అర్హత సాధించింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్
ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం 116 పాయింట్లతో ఉన్న ధోని సేన టాప్‌లో ఉన్న ఆసీస్ కన్నా ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (112), ఆ తర్వాత శ్రీలంక (108), కివీస్ (107), ఇంగ్లండ్ (101), పాకిస్తాన్ (95) ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కోహ్లి నాలుగో స్థానంలో ఉండగా ధావన్ ఆరు, కెప్టెన్ ధోని ఎనిమిదో స్థానంలో ఉన్నారు. డి విలియర్స్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు.

టాప్ టెన్‌లో కోహ్లి, ధావన్, ధోని: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోని టాప్ టెన్‌లో తమ ర్యాంకుల్లోనే కొనసాగుతున్నారు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి నాలుగవ, ధావన్ ఆరవ, ధోని ఎనిమిదో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానాన్ని అలంకరించాడు. టాప్‌టెన్‌లో భారత బౌలర్లకు స్థానం దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 116 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకుంది. కాగా ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
సైనా మళ్లీ నెంబర్ 1
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సింగిల్స్‌లో మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్య్లూబీఎఫ్) ఏప్రిల్ 16న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 80191 పాయింట్లతో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న లీ జురుయ్ మూడో స్థానానికి పడిపోగా.. కరోలినా మారిన్ (స్పెయిన్) రెండో ర్యాంకుకు ఎగబాకింది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. పీవీ సింధు టాప్‌టెన్‌లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ నాలుగవ, పారుపల్లి కశ్యప్ 14వ, హెచ్ ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల -అశ్విని పొన్నప్ప జంట 18వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా.. మలేసియా ఓపెన్ టోర్నీ సెమీస్‌లో నిష్ర్కమించడంతో రెండో ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ టోర్నీలో వైజాగ్ బాక్సర్‌కు స్వర్ణం
థాయ్‌లాండ్ అంతర్జాతీయ ఆహ్వానిత బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 49 కేజీల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో శ్యామ్ 3-0 తేడాతో సురాజిత్ థోంగ్ ఆనంద్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రోహిత్ (60 కేజీలు), మంజిత్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. 
సంగక్కరకు ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనీ అవార్డును గెల్చుకోవడం ఇది రెండోసారి. భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తరవాత ఈ అవార్డును రెండుసార్లు అందుకున్నది సంగక్కరనే. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ‘విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. 
ఎన్‌బీఏ లీగ్ ఆడిన తొలి భారత సంతతి క్రీడాకారుడు
భారత సంతతికి చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు గుర్ సిమ్రాన్ సిమ్ భుల్లర్ కొత్త చరిత్రను సృష్టించాడు. భారతీయ నేపథ్యం ఉన్న ఒక ఆటగాడు ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏప్రిల్ 8న జరిగిన మ్యాచ్‌లో భుల్లర్ శాక్రమెంటో కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. 7 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న భుల్లర్ కెనడాలో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు చాలా కాలం కిందటే పంజాబ్‌నుంచి వలస వచ్చారు. 
డబుల్స్‌లో సానియా నంబర్ వన్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు మహిళల డబుల్స్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానం దక్కింది. అమెరికాలోని చార్ల్‌స్టన్‌లో ఫ్యామిలీ సర్కిల్ కప్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి కెసే డెలాక్వా (ఇటలీ)-డారిజా జురాక్(క్రొయేషియా) జంటను ఓడించి మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతవరకు భారత్‌కు చెందిన లియాండర్ పేస్, మహేశ్ భూపతి పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరగలిగారు.
షూటర్ అపూర్వీకి కాంస్యం
భారత షూటర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించింది. చాంగ్‌వన్ (కొరియా)లో ఏప్రిల్ 11న ముగిసిన పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడంతో ఆమె రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. స్నెజానా పెజ్‌సిచ్ (క్రొయేషియా) స్వర్ణం, ఇవానా కఖ్‌సిమోవిచ్ (సెర్బియా) రజతం సాధించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన జీతూ రాయ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
అజ్లాన్‌షా హాకీ టోర్నీ విజేత న్యూజిలాండ్
అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. ఇపో (మలేసియా)లో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఓడించింది. భారత్, కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
ధ్రువ్ సిత్వాలాకు ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్
ముంబైకి చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బీజింగ్‌లో ఏప్రిల్ 13న ముగిసిన ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీని ఓడించాడు. సిత్వాలాకు ఇది తొలి అంతర్జాతీయ టైటిల్.

గ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరు
ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరును ఒక చిన్న గ్రహానికి 4538 విషీ ఆనంద్ అని పెట్టినట్లు ఏప్రిల్ 1న మైనర్ ప్లానెట్ సెంటర్ తెలిపింది. ఈ గ్రహాన్ని 1998వ సంవత్సరంలో అక్టోబర్ 10న కెంజో సుజుకీ గుర్తించారు. ఇది అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో ఉంది. సాధారణంగా కొత్తగా గుర్తించిన గ్రహాలకు వాటిని కనుగొన్న వారి పేర్లే పెడతారు. పదేళ్ల పాటు గ్రహానికి పేరు పెట్టకపోతే వేరే పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఖరారు చేస్తుంది. విశ్వనాథన్ కన్నా ముందు రోజర్ ఫెదరర్, జెస్సీ ఓవెన్స్, డొనాల్డ్ బ్రాడ్‌మెన్‌లకు ఈ గౌరవం దక్కింది. 

చెన్ లాంగ్, మారిన్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, కరోలినా మారిన్ (స్పెయిన్) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో లిన్ డాన్ (చైనా)ను చెన్ ఓడించాడు. భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో జురుయ్ లీ చేతిలో ఓడిపోయింది.

మియామీ టైటిల్ సెరెనా కైవసంమియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫ్లోరిడాలో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)ను ఓడించింది. సెరెనా ఎనిమిదోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. ఇది తన కెరీర్‌లో 66వ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: టైటిల్‌ను భారత్‌కు చెందిన సానియా మిర్జా.. మార్టీనా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి రష్యాకు చెందిన ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నియాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్: టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ ఆండీ ముర్రేను ఓడించి గెలుచుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఐదో మియామి మాస్టర్స్ టైటిల్.

విశ్వవిజేత మరియాఅంతర్జాతీయ మాస్టర్ మరి యా ముజిచిక్ (ఉక్రెయిన్) ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. సోచి (రష్యా)లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో నటాలియా పోగోనియా (రష్యా)ను మరియా ఓడించింది. సెమీఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్)కు కాంస్య పతకం దక్కింది.

ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లాఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ కొత్త చైర్మన్‌గా రంజీబ్ బిస్వాల్ స్థానంలో రాజీవ్ శుక్లా ఎంపికయ్యారు. ఇందులో మాజీ ఆటగాళ్ల హోదాలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి ఉన్నారు.

క్రీడలు మార్చి 2015

క్రీడలు మార్చి 2015
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్
 క్రికెట్ ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా ఐదోసారి గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో మార్చి 29న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ. 24.85 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: జేమ్స్ ఫాల్కనర్(ఆస్ట్రేలియా); మ్యాన్ ఆఫ్ ద సిరీస్: మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) ఎంపికయ్యారు. ఈ టోర్నీలో గప్ట్టిల్(న్యూజిలాండ్) అత్యధికంగా 547 పరుగులు చేశాడు. స్టార్క్(ఆస్ట్రేలియా), బౌల్ట్ (న్యూజిలాండ్) ఇరువురు అత్యధిక (22) వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా 2015తోపాటు 1987, 1999, 2003, 2007 ప్రపంచకప్‌ను ఐదుసార్లు గెలుచుకుంది. తదుపరి ప్రపంచకప్ 2019లో ఇంగ్లండ్‌లో జరుగుతుంది. 
ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. సైనా నెంబర్‌వన్ ర్యాంక్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య.. ఏప్రిల్ 2న అధికారికంగా ప్రకటిస్తుంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. 
సైనా, శ్రీకాంత్‌లకు ఇండియా ఓపెన్ టైటిల్స్
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్స్‌ను భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో మార్చి 29న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా ఇంతనోన్ రత్చనోక్ (థాయిలాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ను శ్రీకాంత్ ఓడించాడు. 
హాకీ ఇండియా అవార్డులు
తొలిసారిగా ప్రవేశపెట్టిన హాకీ ఇండియా అవార్డులను న్యూఢిల్లీలో మార్చి 28న బహుకరించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం బల్బీర్ సింగ్ సీనియర్(90)కు దక్కింది. ఆయనకు ట్రోఫీతో పాటు రూ.30 లక్షల నగదు ఇచ్చారు. 1948-56 వరకు స్వర్ణ పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ సింగ్ ఆడారు. 1956లో ఒలంపిక్ ఫైనల్స్‌లో ఆయన చేసిన ఐదు గోల్స్ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఉత్తమ క్రీడాకారుడు అవార్డు బీరేంద్ర లక్రాకు, ఉత్తమ క్రీడాకారిణి అవార్డు వందనా కటారియాకు దక్కింది.

కెప్టెన్‌గా ధోనీ రికార్డు
భారత క్రికెట్ జట్టును వంద వన్డేల్లో గెలిపించిన కెప్టెన్‌గా ఎం.ఎస్.ధోనీ రికార్డు సృష్టించాడు. మార్చి 19న బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో విజయంతో ఈ గుర్తింపు లభించింది. ధోనీ 178 వన్డేల్లో 100 విజయాలు సాధించాడు. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియేతర ఆటగాడు ధోనీనే. రికీ పాంటింగ్ (165), అలెన్ బోర్డర్ (107) ధోనీ కంటే ముందున్నారు.
సానియా జోడీకి ఇండియన్ వెల్స్ టైటిల్
సానియా మీర్జా స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 21న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జోడీని సానియా-హింగిస్ జోడీ ఓడించింది. విజేతగా నిలిచిన వీరికి రూ.కోటి 83 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సానియాకు కెరీర్‌లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా, హింగిస్‌కు 42వ డబుల్స్ టైటిల్. ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విస్)ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు 50వ ఏటీపీ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సిమోనా హలెప్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో జెలెనా జంకోవిచ్‌ను ఓడించింది.
ప్రపంచకప్‌లో మార్టిన్ గప్తిల్ అత్యధిక స్కోర్
న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ ప్రపంచకప్ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. మార్చి 21న వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో గప్తిల్ 237 (163 బంతుల్లో) పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్. వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్‌కు చెందిన రోహిత్‌శర్మ నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

మైఖల్ వైట్‌కు ఇండియన్ ఓపెన్ స్నూకర్ టైటిల్
మైఖల్ వైట్ (వేల్స్) ఇండియన్ ఓపెన్ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబైలో మార్చి 14న జరిగిన ఫైనల్స్‌లో రికీ వాల్డెన్ (ఇంగ్లండ్)ను వైట్ ఓడించాడు.
హామిల్టన్‌కు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి
ఫార్మూలా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మెల్‌బోర్‌‌నలో మార్చి 15న జరిగిన ఈ సీజన్ తొలి గ్రాండ్ ప్రి టైటిల్‌ను హామిల్టన్ గెలుచుకోగా, మరో మెర్సిడెజ్ డ్రైవర్ నికో రోజ్‌బర్‌‌గ రెండో స్థానంలో నిలిచాడు.
సర్వీసెస్‌కు ఫుట్‌బాల్ సంతోష్ ట్రోఫీ
సర్వీసెస్ జట్టు ఫుట్‌బాల్ సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. లూథియానాలో మార్చి 15న ముగిసిన ఫైనల్‌లో పంజాబ్ జట్టును సర్వీసెస్ జట్టు ఓడించింది. ఈ ట్రోఫీని సర్వీసెస్ గెలుచుకోవడం ఇది నాలుగోసారి.
క్జుక్జిన్, ఫెంగ్ తియాన్వీలకు ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టైటిల్స్
ఆసియా కప్ పురుషుల టైటిల్‌ను క్జుక్జిన్ (చైనా) గెలుచుకున్నాడు. జైపూర్‌లో మార్చి 15న జరిగిన ఫైనల్‌లో ఫాన్ జెన్‌డోంగ్ (చైనా)ను క్జిన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఫెంగ్ తియాన్వీ (సింగపూర్) గెలుచుకుంది. ఫైనల్‌లో లియు షీవెన్ (చైనా)ను ఓడించింది.
శ్రీకాంత్‌కు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, హైదరాబాద్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ సాధించాడు. బసెల్‌లో మార్చి 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో విక్టర్ అలెక్స్ (డెన్మార్‌‌క)ను శ్రీకాంత్ ఓడించాడు. దీంతో స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందాడు. శ్రీకాంత్‌కి ఇది రెండో గ్రాండ్ ప్రి టైటిల్. 2013లో థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచాడు.
వరల్డ్‌కప్ హాకీ లీగ్ చాంపియన్‌గా భారత్
వరల్డ్‌కప్ హాకీ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. న్యూఢిల్లీలో మార్చి 15న జరిగిన ఫైనల్‌లో పోలండ్‌ను భారత్ ఓడించింది. 
వాకింగ్ చాంపియన్‌షిప్‌లో బల్జీందర్ సింగ్‌కు కాంస్యం
ఆసియా 20 కి.మీ. రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బల్జీందర్‌సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. జపాన్‌లోని నోమిసిటీలో మార్చి 15న జరిగిన ఈవెంట్‌లో కాంస్యం సాధించి 2015 ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.

మానవ్‌జిత్‌కు ప్రపంచ షాట్‌గన్ టోర్నీలో కాంస్యం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నిర్వహించే ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్‌లో భారత షూటర్ మానవ్‌జిత్ కాంస్య పతకం సాధించాడు. మార్చి 3న మెక్సికోలో జరిగిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్‌లో మానవ్‌జిత్ మొదటి స్థానంలో నిలిచి ఉంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత దక్కేది.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ ఓటమి చెందినప్పటికీ ఈ స్థాయికి చేరిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మార్చి 8న బర్మింగ్ హామ్‌లో జరిగిన ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ను కరోలినా ఆరీన్ (ఫ్రాన్‌‌స) ఓడించింది. గతంలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) గెలుచుకున్నారు.
మహిళల డబుల్స్ టైటిల్‌ను బావో యిక్సిన్, టాంగ్ యుయాంటింగ్ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో వాంగ్ గ్జియోలీ, యుయాంగ్ (చైనా)లను ఓడించారు.
పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్ జోర్గెన్‌సన్ (డెన్మార్‌‌క)ను ఓడించి చెన్‌లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మాథియాస్ బోయి, కార్‌‌సటన్ మొగెన్సన్ (డెన్మార్‌‌క) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో ఫు హైఫెంగ్, జాంగ్‌నన్ (చైనా)ను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను జాంగ్‌నన్, జావో యున్‌లీ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో టోంటోవీ అహ్మద్, లియానా నస్టిర్ (ఇండోనేషియా)ను ఓడించారు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ ఆటగాడి తొలి శతకం
బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు మహ్మదుల్లా కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 9న ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు ఏ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ప్రపంచకప్‌లో సెంచరీ కొట్టలేదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ కలుపుకుని ఇప్పటివరకు బంగ్లాదేశ్ 30 మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఏకైక బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా.
ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు భారత్
ఐర్లాండ్‌పై మార్చి 10న సాధించిన విజయంతో ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక విజయాలు(9) సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డు సమం చేసింది. గంగూలీ నాయకత్వంలోని టీమ్ ఇండియా 2003 వరల్డ్‌కప్‌లో వరుసగా 8 విజయాలు సాధించగా ఇప్పుడు ధోని సేన ఆ రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌లలో 24 విజయాలతో తొలి స్థానంలో ఉంది. కాగా వెస్టిండీస్‌తో కలిసి భారత్ 9 విజయాలతో రెండో స్థానంలో ఉంది. గత వారం విండీస్‌తో మ్యాచ్ నెగ్గి విదేశాల్లో అత్యధిక వన్డే విజయాలు(59) సాధించిన భారత కెప్టెన్‌గా ధోని నిలిచాడు. తాజా విజయంతో ప్రపంచకప్‌లో అత ్యధిక విజయాలు సాధించి కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు (11) నుఅధిగమించాడు. 
వన్డేల్లో సంగక్కర సరికొత్త రికార్డు
వన్డే క్రికెట్‌లో వరుసగా నాలుగు శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 11న స్కాట్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అంతే కాకుండా వరల్డ్‌కప్‌లో అత్యధిక అవుట్‌లలో భాగస్వామ్యం పంచుకున్న వికెట్ కీపర్‌గా సంగక్కర నిలిచాడు. 54 అవుట్‌లలో సంగక్కర భాగస్వామి.

బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా ఎన్నిక
 
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్ ఎంపికయ్యారు. సౌత్‌జోన్ నుంచి ఉపాధ్యక్షుడిగా ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాల్మియా గతంలో 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఫెదరర్‌కు దుబాయ్ ఓపెన్దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. మార్చి 1న దుబాయ్‌లో జరిగిన ఫైనల్స్‌లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. ఫెదరర్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది ఏడోసారి. కెరీర్‌లో ఇది 84వ టైటిల్.

నాదల్‌కు ఏటీపీ అర్జెంటీనా ఓపెన్ టైటిల్ఏటీపీ అర్జెంటీనా ఓపెన్ టైటిల్‌ను నాదల్ గెలుచుకున్నాడు. బ్యూనస్ ఏయిర్‌‌సలో మార్చి 1న జరిగిన ఫైనల్స్‌లో జాన్ మొనాకోను ఓడించి కెరీర్‌లో 65వ టైటిల్ సాధించాడు.