AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 18 February 2018

సైన్స్ & టెక్నాలజీ 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం

 సైన్స్ & టెక్నాలజీ 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం

 సైన్స్ & టెక్నాలజీ మార్చి 2012
భూమిని తాకిన సౌర తుఫాను
మార్చి 6న సూర్యగోళంలో ఏర్పడిన రెండు బలమైన విస్ఫోటనాల వల్ల వెలువడిన విద్యుదావేశ కణాలు మార్చి 8న భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకాయి. ఈ భారీ సౌర తుఫాను వల్ల భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహ, సమాచార వ్యవస్థలు, విమానాలకు అంతరాయం కలిగే అవకాశముందని అమెరికాలోని నేషనల్ ఓసియానిక్, అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ) తెలిపింది. ప్రస్తుత సౌర కేంద్ర ద్రవ్యరాశి విస్ఫోటనం గత ఐదేళ్లలో సంభవించిన వాటిలో అతి పెద్దదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విద్యుదావేశ కణాలు గంటకు 40 లక్షల మైళ్ల వేగంతో దూసుకొస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇది భూ అయస్కాంత క్షేత్రంపై పెద్ద ప్రభావముండదని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.

సైన్స్ & టెక్నాలజీ జూలై 2012
నావికా దళంలోకి ఐఎన్‌ఎస్ సహ్యాద్రి
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ సహ్యాద్రి’ని ముంబయిలో జూలై 21న నావికాదళంలో చేర్చారు. దీని నుంచి క్షిపణులు ప్రయోగించవచ్చు. ఇది రెండు హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. 4,900 టన్నుల బరువుగల ఈ యుద్ధనౌకలో 250 మంది సిబ్బంది ఉంటారు. ముంబయిలో మజగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ రూ.2200 కోట్లతో నిర్మించింది. స్టెల్త్ యుద్ధ నౌకల తరగతిలో సహ్యాద్రి చివరిది. ఐఎన్‌ఎస్ సివాలిక్, ఐఎన్‌ఎస్ సాత్పూరా ఇప్పటికే నావికాదళంలో చేరాయి. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సామర్థ్యం, టోర్బెడోలతోపాటు సోనార్, రాడార్ వ్యవస్థలున్నాయి.

అతి శీతల పరిస్థితులను విపత్తుగా ప్రకటించిన కేంద్రం
అతి శీతల పరిస్థితులు, చలిగాలుల కారణంగా పడే మంచు స్ఫటికాల వల్ల పంటనష్టం జరిగితే దాన్ని ప్రకృతి విపత్తుగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటువంటి నష్టం సంభవిస్తే కేంద్ర, రాష్ట్ర సహాయం పొందేందుకు అర్హత ఉందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రకృతి విపత్తులుగా తుఫాను, కరువు, భూకంపం, వరదలు, అగ్నిప్రమాదాలు, సునామి, వడగండ్లు, కొండచరియలు విరిగి పడటం, కీటకాలు- జంతువుల దాడి వంటి వాటిని పరిగణిస్తున్నారు. పై జాబితాలో తాజాగా మంచు గాలులు, అతి శీతల పరిస్థితులు కూడా చేర్చినట్లు జూలై 20న కేంద్రం ప్రకటించింది.



ఫ్లూటో ఐదో ఉపగ్రహాం 
ఫ్లూటో చుట్టూ పరిభ్రమిస్తున్న ఐదో ఉపగ్రహాన్ని హబుల్ టెలిస్కోప్ ద్వారా గుర్తించి నట్లు అమెరికా శాస్త్రవేత్తలు జూలై 12న ప్రకటించారు. దీనికి ఎస్/2012గా పేరుపెట్టారు. గతేడాది నాలుగో ఉపగ్రహాన్ని కనుగొన్నారు. 1990లో ప్రయోగించిన హబుల్ 2005లో నిక్స్, హైడ్రా ఉపగ్రహాలను కనుగొన్నారు.

విజయవంతమైన అగ్ని-1 
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్షిపణి అగ్ని-1ను ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి జూలై 13న భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని-1 నిర్దేశిత 700 కి.మీ.లక్ష్యాన్ని ఛేదించింది. 12టన్నుల బరువు 15 మీటర్ల ఎత్తు ఉన్న అగ్ని-1ను మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. ఇది టన్ను బరువున్న ఆయుధాలను మోసుకుపోతుంది. దీన్ని డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది.

రెండోసారి స్పేస్‌కు సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (46) జూలై 15న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయలుదేరి వెళ్లింది. కజకిస్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రంనుంచి సోయజ్ టి.ఎం.ఏ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్‌తోపాటు రష్యాకు చెందిన యూరీ మాలెంషెంకో, జపాన్‌కు చెందిన అకిహికో హోషిడేలు వెళ్లారు.

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2012


పాలపుంతను పోలిన జంట గెలాక్సీలు
అంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.



లక్ష్య-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.



పృథ్వి-2 పరీక్ష విజయవంతం 
పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వా

స్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.

కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభం
కోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.



భారత్‌కు ఎంబ్రాయెర్ 145
గగన తల నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ఎంబ్రాయెర్ 145 నిఘా విమానాన్ని భారత్ సమకూర్చుకుంది. దీనికి ఎంబ్రాయెర్ 145 ఏఈడబ్ల్యూసీ (ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్)గా పేరు పెట్టారు. బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయెర్ తయారు చేసిన ఈ విమానంలో భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే(ఏఈఎస్‌ఏ) రాడార్‌ను అమర్చారు. ఆగస్ట్ 17న బ్రెజిల్‌లోని శావ్‌జోస్ డాస్ కాంపోస్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులకు బ్రెజిల్ కంపెనీ ఈ విమానాన్ని అప్పగించింది. 2014 నాటికి ఇటువంటి మూడు విమానాలతోపాటు ఇతరత్రా సాంకేతిక సహకారం అందించాలని బ్రెజిల్ కంపెనీతో భారత్ కుదుర్చుకున్న 210 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా తొలి విమానం మన దేశానికి అందింది. ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను అన్ని వైపుల నుంచీ పసిగట్టగలదు.



విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్ష
మధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.



అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.



ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డు
సీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.



అంగారక యాత్రకు క్యాబినెట్ ఆమోదం
అంగారక పరిశోధన కోసం చేపట్టే యాత్రకు కేంద్ర క్యాబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. అంగారక యాత్రలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘మార్స్ ఆర్బిటర్’ అనే ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపుతుంది. భారత్ తొలిసారి చేపట్టే అంగారక యాత్ర 2013 నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.

అరుణ గ్రహంపై వాతావరణం, పుట్టుక, పరిణామం, అక్కడ జీవ రాశుల మనుగడకు అవకాశాలు వంటి అంశాలను ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. ఇది మార్స్‌ను చేరడానికి 300 రోజులు పడుతుంది. ఈ యాత్రకు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ అధునాతన వెర్షన్ రాకెట్ ద్వారా దీనిని పంపిస్తారు. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా దేశాలు అంగారక యాత్రలు జరిపాయి. భారత్ 6వ దేశంగా ఇప్పుడు వీటి సరసన చేరనుంది.

ఐఎన్‌ఎస్ ‘బాజ్’ జాతికి అంకితం
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘బాజ్’ను జూలై 31న అండమాన్ నికోబార్‌లో నౌకాదళం అధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ ప్రారంభించారు. దీంతో హిందూ మహా సముద్ర ప్రాంతం(ఐఓఆర్)పై నౌకాదళం మంచి పట్టు సాధిస్తుంది. ఐఓఆర్‌లో పెరుగుతున్న చైనా ఆధిపత్యం నేపథ్యంలో భారత్ దక్షిణ ప్రాంతంలో అండమాన్ నికోబార్‌లో ఈ నౌకను మోహరించడం అనివార్యమైంది.

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2012
అగ్ని 4 విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం గల అత్యాధునిక ఖండాతర క్షిపణి అగ్ని-4ను భారత్ సెప్టెంబర్ 19న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి పరీక్షించిన అగ్ని-4 క్షిపణి 4000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు గల ఈ క్షిపణి ఒక టన్ను బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. గతంలోనూ (నవంబర్ 15, 2011) అగ్ని-4 పరీక్ష విజయవంతమైంది.

అగ్ని -3 ఐదో పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అగ్ని- 3’ ఖండాంతర క్షిపణి సెప్టెంబర్ 21న ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి భారత్ విజయవంతంగా ఐదోసారి పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఈ క్షిపణి 3000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 1.5 టన్నుల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. 

మానవ మెదడు పటం సృష్టించిన శాస్త్రవేత్తలు
మానవ మెదడుకు సంబంధించిన సమగ్ర పటాన్ని అమెరికాలోని సీటెల్‌కు చెందిన అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ సెన్సైస్ శాస్త్రవేత్తలు సృష్టించారు. మెదడు మొత్తానికి సంబంధించిన జన్యువుల కార్యకలాపాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఎటువంటి వ్యాధులు లేని మూడు సాధారణ మెదడు స్కాన్‌ల ఆధారంగా ఈ పటాన్ని రూపొందించారు. ఇది నాడీ సంబంధ, మానసిక సమస్యలపై అవగాహనకు దోహదపడుతుంది. 

బాబర్ క్షిపణి పరీక్షించిన పాక్ 
పాకిస్థాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాబర్ (హతాఫ్-7) క్రూయిజ్ క్షిపణిని సెప్టెంబర్ 17న విజయవంతంగా పరీక్షించింది. సంప్రదాయ అణ్వాయుధాలను కూడా ఇది మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ 700 కి.మీ. దూరంలోని ఉపరితల, సముద్ర లక్ష్యాలను ఛేదించగలదు. 

ఐఎస్‌ఎస్ కమాండర్‌గా సునీత
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కమాండర్‌గా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 17న బాధ్యతలు చేపట్టారు. జెన్నడే పడాల్కా నుంచి 33వ యాత్ర కమాండర్‌గా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. తద్వారా ఐఎస్‌ఎస్ కమాండర్‌గా ఎంపికైన రెండో మహిళగా సునీత చరిత్ర సృష్టించారు (గతంలో పెగ్గి విట్సన్ తొలి మహిళా కమాండర్ బాధ్యతలు నిర్వహించారు). ఇంతవరకు ఆరు సార్లు స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యోమగామి కూడా సునీత ఘనతను దక్కించుకున్నారు.

పీఎస్‌ఎల్‌వీ -సి 21 విజయవంతం 
పోలార్ శాటిలైట్ లాంచ్ వెిహ కల్(పీఎస్‌ఎల్‌వీ)-సి 21 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 9న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో 100 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో 62 ఉప గ్రహాలు, 37 రాకెట్లు, ఒక స్పేస్ క్యాప్సూల్ ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ- సి 21 ద్వారా మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ మూడింటిలో ఫ్రాన్స్‌కు చెందిన ‘స్పాట్-6’, జపాన్‌కు చెందిన ‘ప్రొయిటెరస్’, భారత్‌కు చెందిన ‘మినీ రెడిస్’ ఉన్నాయి. భూమికి 655 కిలోమీటర్ల ఎత్తులో 98.23 డిగ్రీల వాలుతో సూర్యానువర్తన ధ్రువ కక్ష్య(సన్ సిక్రోనస్ ఆర్బిట్)లో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. స్పాట్-6 కోసం ఫ్రాన్స్‌రూ.100 కోట్లు చెల్లిస్తుంది. ఈ ప్రయోగాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు.

స్పాట్-6: ఫ్రాన్స్‌కు చెందిన ఆస్ట్రియం కంపెనీ రూపొందించింది. 715 కిలోల బరువుగల స్పాట్-6 భూ పరిశీలన కోసం చిత్రాలను తీస్తుంది. ఏడేళ్ల పాటు పనిచేస్తుంది.

ప్రొయిటెరస్: 15 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని జపాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు రూపొందించారు. జపాన్‌లోని కాన్యాయి జిల్లా చిత్రాలను తీసి పంపుతుంది. విద్యుత్ థ్రస్టర్లు వినియోగంపై అధ్యయనానికి ఉపయోగపడుతుంది.

మినీ రెడిస్: నావిగేషన్ విధానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు 50 కిలోల ఈ పేలోడ్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది.



భారత్ చేరిన డ్రీమ్ లైనర్ 
అత్యంత ఆధునిక ప్రయాణికుల రవాణా విమానం ‘బోయింగ్ 787 డ్రీమ్ లైనర్’ సెప్టెంబర్ 8న భారత్ చేరింది. అమెరికాలోని దక్షిణ కరోలినాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి 15 గంటల్లో న్యూఢిల్లీ చేరింది. 2008 నాటికి అందేలా మొత్తం 27 డ్రీమ్ లైనర్ల కొనుగోలుకు బోయింగ్‌తో ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకోగా తొలి విమానం సెప్టెంబర్ 8న చేరింది. ఎలాంటి విరామం లేకుండా 16,000 కి.మీ. ప్రయాణించడం డ్రీమ్ లైనర్ ప్రత్యేకత. 210 నుంచి 290 మంది వరకు ప్రయాణించొచ్చు. విమాన తయారీలో అల్యూమినియం బదులు కర్బన మిశ్రమ లోహాన్ని వినియోగించడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇంధన సామర్థ్యం 20 శాతం పెరుగుతుంది.

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
ఖండాంతర క్షిపణి ‘డాంగ్‌ఫెంగ్-41’ని గత నెలలో పరీక్షించినట్లు చైనా ఆగస్టు 28న ప్రకటించింది. ఈ క్షిపణి 14,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ఖండాలను చేరుకోగలదు. 10 అణ్వాయుధాలను మోసుకుపోగలదు. ఇది చైనా రూపొందించిన మూడో తరం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. భారత్ తన ఖండాంతర క్షిపణి ‘అగ్ని-5ను ఏప్రిల్‌లో పరీక్షించింది. ఇది 5,000 కిలోమీటర్లు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2012
అత్యంత తేలికైన గ్రహం 
అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు భూమికంటే ఆరు రెట్లు పెద్దగా ఉన్న గ్రహాన్ని కనుగొన్నట్లు ‘డైలీ మిర్రర్’ పత్రిక అక్టోబర్ 16 న తెలిపింది. దీనికి ‘పీహెచ్-1’గా పేరు పెట్టారు. ఇప్పటి వరకూ కనుగొన్న ఎక్సోప్లానెట్‌లన్నీ మన భూమి కంటే చాలా పెద్దవి. కానీ ద్రవ్యరాశి మాత్రమే భూమికి సమానంగా ఉండటంతో దీన్ని అతి తేలికైన ఎక్సోప్లానెట్‌గా భావిస్తున్నారు. ఇది నెఫ్ట్యూన్ కంటే కొంచెం పెద్దది. ఈ గ్రహంపై కనిష్ట ఉష్ణోగ్రత 251 డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్ట ఉష్ణోగ్రత 340 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుందని గుర్త్తించారు.

పృథ్వీ-2 విజయవంతం
ప్రతిష్టాత్మక పృథ్వీ -2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అక్టోబర్ 4న విజయవంతంగా ప్రయోగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సైన్యం వినియోగ పరీక్షల్లో భాగంగా రోడ్ మెబైల్ లాంచర్ నుంచి పరీక్ష నిర్వహించారు. పృథ్వీ-2ను భారత్ 2010 డిసెంబర్ 22న తొలిసారి ప్రయోగించింది. రెండు ద్రవ ఇంజన్ల సామర్ధ్యంతో పనిచేసే పృథ్వీ -2 తొమ్మిది మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉంటుంది. 500 కిలోల పేలుడు పదార్థాలను తీసుకువెళ్లగలదు.

ధనుష్ క్షిపణి విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి ‘ధనుష్’ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఒడిశాలోని బాలాసోర్ నుంచి అక్టోబర్ 5న విజయవంతంగా పరీక్షించింది. ఇది నౌకాద ళం కోసం రూపొందించిన పృథ్వీ క్షిపణి రకానికి చెందింది. 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ధనుష్ 500 కిలోల అణ్వాయుధాలను మోసుకువెళుతుంది. 8.53 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల వ్యాసం గల ధనుష్ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద డీఆర్‌డీవో రూపొందించిన ఐదు క్షిపణుల్లో ధనుష్ ఒకటి. 

బ్రహ్మోస్ క్షిపణి విజయవంతం 
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత నౌకాదళం అక్టోబర్ 7న విజయవంతంగా పరీక్షించింది. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని గోవా తీరంలో ఐఎన్‌ఎస్ టేగ్ యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు. మెలికలు తిరుగుతూ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల శత్రువుల యుద్ధ నౌకలు ఈ క్షిపణిని గుర్తించలేవు. రష్యాలో తయారైన ఐఎన్‌ఎస్ టేగ్, ఐఎస్‌ఎస్ తార్కాష్, ఐఎన్‌ఎస్ త్రికుండ్ యుద్ధ నౌకల్లో ఈ క్షిపణిని మోహరిస్తారు.

భారీ టెలిస్కోప్‌ను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా 
కోలోస్సర్ రేడియో టెలిస్కోప్‌ను ఆస్ట్రేలియా అక్టోబర్ 5న ఆవిష్కరించింది. ఈ అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ వల్ల సుదూరంలోని గెలాక్సీలను ఖగోళ శాస్త్రజ్ఞులు గుర్తించవచ్చు. ప్రస్తుతం ఉన్న టెలిస్కోప్‌ల కంటే వేగంగా ఆకాశాన్ని సర్వే చేయడానికి, విశ్వాన్ని లోతుగా పరిశీలించడానికి, కృష్ణ బిలాలు, నక్షత్రాలు పరిశోధనకు ఇది ఉపకరిస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అరే పాథ్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ) టెలిస్కోప్‌ను పశ్చిమ ఆస్ట్రేలియా ఏడారిలో నెలకొల్పారు. ఇందులో 36 యాంటెన్నాలున్నాయి. ఒక్కో యాంటెన్నా 12 మీటర్ల డయా మీటర్‌తో ఉంటుంది. ఇందుకు 140 మిలియన్ డాలర్లు ఖర్చుచేశారు. 

జీశాట్-10 ప్రయోగం విజయవంతం
దేశ ఆధునిక, అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-10 ప్రయోగం విజయవంతమైంది. 3,400 కిలోల బరువైన జియోసింక్రనస్ శాటిలైట్(జీశాట్)-10ను సెప్టెంబర్ 29న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియాన్ -5 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. భూమికి 3,600 కి.మీ. ఎత్తులో అంతరిక్ష కక్ష్యలోకి జీశాట్ ప్రవేశించింది. ఈ ఉపగ్రహం వల్ల టెలి కమ్యూనికేషన్లు, డెరైక్ట్ టు హోం సేవలు బాగా మెరుగవుతాయి. ఇది ఇస్రో చేపట్టిన 101 అంతరిక్ష ప్రయోగం. జీశాట్ -10 ఈ ఏడాది నవంబర్ నుంచి 15 సంవత్సరాలపాటు సేవలందిస్తుంది. దీని నిర్మాణం, ప్రయోగానికి ఇస్రో రూ. 750 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఉపగ్రహంలో ‘గగన్ ’ పేలోడ్‌ను కూడా అమర్చారు. దీనివల్ల పౌర విమానయానానికి జీపీఎస్ సంకేతాలు మరింత కచ్చితంగా అందుతాయి. గతంలో జీశాట్ -8లోకూడా గగన్ పేలోడ్‌ను అమర్చారు.

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2012
ఐరాసలో ఆకాశ్ ప్రదర్శన
భారతదేశ ప్రతిష్టాత్మక టాబ్లెట్ కంప్యూటర్ ఆకాశ్‌ను ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించనున్నారు. ఐరాసలో భారత ప్రతినిధి, భద్రతా మండలి అధ్యక్షుడు హర్‌దీప్ సింగ్ పూరి నవంబర్ 28న ఆకాశ్‌పై ప్రదర్శన ఇవ్వనున్నారు.

‘అగ్ని-1’ పరీక్ష సక్సెస్అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ వద్ద గల ఐటీఆర్ నుంచి డిసెంబర్ 12న ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-1 క్షిపణిని రక్షణరంగ పరిశోధన అభివద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా ఈ క్షిపణి నిర్మాణంలో పాలుపంచుకుంది. 12టన్నుల బరువు, 15 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి ఒకే దశలో ఘన ఇంధనాన్ని వినియోగించుకుంటూ దూసుకెళుతుంది. వెయ్యి కిలోల వరకూ అణ్వస్త్రాలను మోసుకుపోతూ సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. తొలిసారిగా 2002 జనవరిలో రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించిన అగ్ని క్షిపణిని సైన్యం ఇదివరకే తన అమ్ములపొదిలో చేర్చుకుంది.

క్యోటో కాలపరిమితి 2020 వరకూ పెంపువాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ సదస్సు డిసెంబర్ 8న ఖతార్ రాజధాని దోహాలో ముగిసింది. పర్యావరణ పరిరక్షణకు కోసం 1997లో కుదుర్చుకున్న క్యోటో ప్రోటోకాల్‌ను 2020 వరకు పొడిగేంచేందుకు సదస్సు నిర్ణయించింది. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం విషయంలో ధనిక దేశాలకు పరిమితులు విధిస్తూ 1997లో కుదిరిన క్యోటో ప్రొటోకాల్ ఒప్పందానికి కాలపరిమితి వచ్చే జనవరి 1న ముగియనున్న నేపథ్యంలో తాజాగా దానిని మరో ఎనిమిదేళ్లు పొడిగించేందుకు సభ్యదేశాలు అంగీకరించాయి. ‘దోహా క్లైమేట్ గేట్‌వే’ పేరుతో కొత్త ఒప్పందానికి సభ్యదే శాలు అంగీకరించాయి. దీని ప్రకారం.. వాతావరణ మార్పు నుంచి ఉపశమన చర్యల కోసం పేద దేశాలకు నిధుల పెంపుదలకు, పర్యావరణ అనుకూల ఇంధన వనరులను అందించేందుకు ధనిక దేశాలు అంగీకరించాయి.

నౌకా స్థావరం సీబర్డ్‌కు ఆమోదంభారత కొత్త నౌకా స్థావరం ‘ప్రాజెక్ట్ సీబర్డ్’ రెండో దశకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ డిసెంబర్ 7న ఆమోదం తెలిపింది. ఈ స్థావరాన్ని రూ. 13,500 కోట్ల ఖర్చుతో కర్ణాటకలోని కార్వార్‌లో ఏర్పాటు చేస్తారు. ఇది దేశంలో అతి పెద్ద నౌకా స్థావరం కానుంది. ఈ స్థావరం భారత పశ్చిమ సముద్ర ప్రాంతంలో సైనిక సామర్థ్యం పెంచేందుకు తోడ్పడుతుంది. ఇది ఇప్పటికే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యకు స్థావరంగా కొనసాగుతుంది.


No comments:

Post a Comment