AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 18 February 2018

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు జనవరి 2016 ఎకానమీ
ప్రపంచ కుబేరుల జాబితాలో ముగ్గురు భారతీయులు
ప్రపంచ కుబేరుల జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకొన్నారు. వెల్త్‌ఎక్స్ టాప్-50 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24.8 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 27వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల సంపదతో 43వ స్థానంలో, సన్‌ఫార్మా అధిపతి దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు.

పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంపు
కేంద్రం జనవరి 30 నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.1, డీజిల్‌పై రూ.1.50 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.3,200 కోట్లు సమకూరనుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం గత నెల రోజుల్లో ఇది మూడోసారి.

రూ.6,500 కోట్ల విలువైన 13 ఎఫ్‌డీఐలకు ఆమోదం
రూ.6,500 కోట్ల విలువైన 13 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను భారత ప్రభుత్వం ఆమోదించింది. దీంట్లో రూ.5,900 కోట్ల విలువైన వయామ్ నెట్‌వర్క్స్ ప్రతిపాదనకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. వయామ్ నెట్‌వర్క్‌లో ఏటీసీ(అమెరికా టవర్ కార్పొరేషన్) ఆసియా పసిఫిక్ పీటీఈ మెజారిటీ వాటాను రూ.5,900 కోట్లకు కొనుగోలు చేయనుంది. రూ.400 కోట్ల విలువైన ఆల్‌స్టోమ్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా ప్రతిపాదన, రూ.150 కోట్ల విలువైన సిప్లా ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి.

మహిళా ఎస్‌హెచ్‌జీలకు 7%కే రుణం
మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) 7 శాతానికే రుణాలు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు స్పష్టంచేసింది. 2015-16లో నేషనల్ రూరల్ లైవ్‌లీవుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద మహిళా ఎస్‌హెచ్‌జీలకు ఈ తక్కువ స్థాయి రేటుకు రుణం అందించాలని పేర్కొంది. వార్షికంగా 7 శాతం వడ్డీకి రూ.3 లక్షల వరకూ రుణంపై వడ్డీ రాయితీకి (ఇన్‌ట్రస్ట్ సబ్‌వెన్షన్) ఎస్‌హెచ్‌జీ మహిళలు అందరూ అర్హులేనని వివరించింది. 

భారత్‌లో ‘రెట్రోస్పెక్టివ్’ పన్ను ఇక ఉండదు
భారత్‌లో రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానం(పాత ఒప్పందాలకూ పన్నుల వర్తింపు) ఇక గతించిన అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విధమైన పన్నుల విధింపు అనేది ఇక్కడ మళ్లీ ఎప్పుడూ ఉండబోదని హామీనిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పర్యటన సందర్భంగా జనవరి 24న చండీగఢ్‌లో జరిగిన భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. వొడాఫోన్ పన్ను కేసు ఇతరత్రా ఇటువంటివే మరికొన్ని అంశాల కారణంగా భారత్‌లో స్థిరమైన పన్నుల విధానం లేదంటూ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతంగా నమోదు
వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015, డిసెంబర్‌లో 5.61 శాతంగా నమోదైంది. ఇది గత నవంబర్‌లో 5.41 శాతంగా ఉంది. 2014, డిసెంబర్‌లో 4.28 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో ఒక శాతంపైన పెరిగింది. కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు పెరగటం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్ర గణాంకాల శాఖ జనవరి 12న తెలిపింది. ఆహారం, పానియాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతంగా ఉంది.

ఫ్రాన్స్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి
ఫ్రాన్స్‌లో జనవరి 18న ఆర్థిక అత్యవసర పరిస్థితిని (ఆ దేశంలో) ప్రకటించింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్య తీవ్రమవటంతో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది. దేశీయ వ్యాపార నమూనాను పునర్నిర్మించాల్సిన సమయం వచ్చిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 2.2 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రకటించారు.

క్షీణించిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 
దేశంలో తటోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబర్‌లో -0.73గా నమోదైంది. ఇది గత పద్నాలుగు నెలల కాలం నుంచి మైనస్‌ల్లో కొనసాగుతుంది. దీంతో 2014, డిసెంబర్‌తో పోల్చినప్పుడు గత డిసెంబర్‌లో టోకు బాస్కెట్ రేటు క్షీణించింది. గత నవంబర్‌లో ఈ రేటు -1.99గా నమోదైంది. పండ్లు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల రేట్లు పెరగటంతో డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణంలో కొద్ధిగా పెరుగుదల కన్పించింది. ఈ గణాంకాలను కేంద్రం జనవరి 14న విడుదల చేసింది.

ఆధార్‌తో ఏటా 6,700 కోట్లు ఆదా: ప్రపంచ బ్యాంకు
ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు) ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2016: డిజిటల్ డివిడెండ్స్’ పేరుతో ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగిపోయి భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు.

భారత్ వృద్ధి రేటు 7.5 శాతం: ఐక్యరాజ్యసమితి
భారత్ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇదివరకు అంచనా 8.2 శాతం కాగా సంస్కరణల అమల్లో జాప్యం కారణంగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) రూపొందించి నివేదిక ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను వంటి అంశాల సంస్కరణల్లో ముందడుగు పడితే దేశం వృద్ధి బాట పడుతుందని తెలిపింది.

స్టార్టప్‌ల కోసం ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ బ్రాంచ్
స్టార్టప్‌ల కోసమే ప్రత్యేక బ్రాంచీని ‘ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్’ (SBI InCube) పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరులో జనవరి 14న ప్రారంభించింది. దీంతో పాటు ఎక్స్‌క్లూజిఫ్(Exclusif) పేరుతో వెల్త్‌మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్‌లకు సలహాపూర్వక సేవలను ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ సమకూరుస్తుంది. ప్రారంభంలో ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ ఎలాంటి రుణాలివ్వకుండా స్టార్టప్‌లకు ఆర్థిక నిర్వహణ సేవలందించనుంది. 

వ్యాపారానికి భారత్ అనుకూలం: పీడబ్ల్యూసీ నివేదిక
వ్యాపారానికి అత్యంత అనుకూలమైన తొలి ఐదు దేశాల్లో భారత్‌కు చోటుదక్కింది. దేశ, విదేశీ కంపెనీలకు అత్యుత్తమ అవకాశాలు భారత్‌లో లభిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) నిర్వహించిన గ్లోబల్ సీఈఓ సర్వేలో వెల్లడైంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో జనవరి 20న ఈ నివేదిక విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లోని 1,409 మంది సీఈఓలను ప్రశ్నించి, వారిచ్చిన సమాధానాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. అభివృద్ధికి పుష్కల అవకాశాలున్న టాప్ 5 దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, యునెటైడ్ కింగ్‌డమ్, భారత్ చోటు సాధించాయి.

వృద్ధిలో ఇండియా టాప్
భారత్ 2016లో కూడా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే ఇండియా వృద్ధిరేటును గత జూన్‌లో 7.9 శాతంగా అంచనా వేయగా దాన్ని 7.8 శాతానికి తగ్గించింది. ఈ స్థాయి వృద్ధిరేటును భారత్ మినహా మరే దేశం సాధించటం లేదు. భారత్ తర్వాతి స్థానంలో (6.7 శాతం) చైనా ఉంది. ప్రపంచ వృద్ధిరేటును జూన్‌లో 3.3 శాతంగా అంచనా వేయగా, తాజాగా దాన్ని 2.9 శాతానికి కుదించింది.

35 డాలర్లకు తగ్గిన ముడిచమురు
బ్రెంట్ ముడిచమురు ధర 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జనవరి 5 నాటికి బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 34.83 డాలర్లకు చేరుకుంది. ముడిచమురు ధరలు గత 11 ఏళ్లలో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయికి దిగజార లేదు. చివరగా 2004లో బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుత స్థాయిలో కొనసాగింది. డిమాండుకు మించిన సరఫరా, భారీగా నిల్వలు పేరుకుపోవటంతో ముడిచమురు ధరలు క్షీణిస్తున్నాయి.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
అతివృష్టి, అనావృష్టి.. అకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పంట బీమా పథకాన్ని ప్రకటించింది. జనవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కు ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కింద.. ఖరీఫ్ ఆహార ధాన్యాలు / నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే.. రబీ ఆహారధాన్యాలు / నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. ప్రీమియంలో మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. దేశవ్యాప్తంగా గల మొత్తం 19,440 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణంలో సగం పంటల బీమాను కేంద్రం భరించటానికి ఏటా రూ. 8,800 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ ఏడాది జూన్ నుంచి మొదలు కానున్న ఖరీఫ్ పంటల నుంచి ఈ బీమా పథకం అమలులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి పూర్తి బీమాను రైతులకు అందిస్తారు. అయితే వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటల బీమాకు రైతులు ఐదు శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు. 

దక్షిణ కొరియాలో ఎస్‌బీఐ తొలి శాఖ ప్రారంభం
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తాజాగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో తొలి శాఖను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాల వృద్ధిలో ఈ కొత్త సియోల్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందని ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్ బి.శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. బ్యాంకు సియోల్ శాఖ పారిశ్రామికవేత్తలకు రిటైల్ బ్యాంకింగ్‌తో సహా ట్రెడ్ ఫైనాన్స్, సిండికేటెడ్ రుణాలు, కార్పొరేట్ డిపాజిట్స్ వంటి తదితర సేవలను అందిస్తుంది. అలాగే రిటైల్ కస్టమర్లకు సేవింగ్స్, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, రెమిటెన్స్ వంటి తదితర సేవలను అందిస్తుంది. విదేశాల్లో ఎస్‌బీఐకి దాదాపు 135కి పైగా శాఖలు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
 కేంద్ర ప్రభుత్వం జనవరి 2న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.2 మేర ఎక్సైజ్ సుంకం పెరిగింది. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి డీజిల్‌పై రూ.4,300 కోట్లు, పెట్రోల్‌పై రూ.80 కోట్లు సమకూరనుంది. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల ప్రస్తుత రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.

1.7 శాతం పెరిగిన భారత్ విదేశీ రుణ భారం
భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని డిసెంబర్ 31న విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. 

‘నయీ మంజిల్’కు ప్రపంచబ్యాంకు రుణసాయం
భారత్‌లో మైనారీటీలకు విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు 50 మిలియన్ డాలర్ల రుణ సాయాన్ని అందించింది. ఈ మేరకు రుణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు డిసెంబర్ 31న సంతకాలు చేశాయి. మైనారిటీ వర్గాలకు సంపూర్ణ విద్యతో పాటు వారిలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రారంభించిన ‘నయీ మంజిల్(న్యూ హారిజాన్)’ పథకానికి 50 మిలియన్ డాలర్లు రుణసాయాన్ని అందించినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.

ఆర్థిక వ్యవహారాలు ఫిబ్రవరి 2016 ఎకానమీ
7-7.75 శాతం వృద్ధి అంచనాతో ఆర్థిక సర్వే 2015-16
ఆర్థిక సర్వే 2015-16ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 26న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో 2016-17లో వృద్ధిరేటు 7-7.75 శాతంగా ఉండనుందని అంచనా వేశారు. ఇది 2015-16లో 7.6 శాతంగా ఉంది. పారిశ్రామిక రంగ వృద్ధి 7.3 శాతం, తయారీ రంగ వృద్ధి 9.5 శాతం, సేవా రంగ వృద్ధి 9.2 శాతంగా అంచనా వేశారు. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో (2015-16) రూ.93,231. ఇది 2014-15లో రూ.86,879

2015-16లో తెలంగాణ వృద్ధిరేటు 9.2 శాతంగా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 9.2 శాతంగా ఉండనుంది. ఈ మేరకు రాష్ర్ట ఆర్థిక గణాంక శాఖ ఫిబ్రవరి 23న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.5,83,117 కోట్లు ఉండగా, తలసరి ఆదాయం రూ.1,43,023కు చేరింది.

జీఎస్‌టీ కమిటీ చైర్మన్‌గా అమిత్ మిత్రా
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)పై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ నూతన చైర్మన్‌గా పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఫిబ్రవరి 19న ఎంపికయ్యారు. దీని చైర్మన్‌గా ఉన్న కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2015 నవంబర్‌లో పదవి నుంచి తప్పుకున్నారు. మిత్రా ఆర్థికవేత్తగా సుపరిచితులు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 2011లో రాజకీయాల్లో చేరిన ఆయన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమలుకోసం నిబంధనలను రూపొందించడం లక్ష్యంగా జీఎస్‌టీ కమిటీ పనిచేస్తుంది.

స్టార్టప్‌లకు 700 మిలియన్ డాలర్లు
రాబోయే ఏడాది కాలంలో 130 దేశీయ స్టార్టప్ కంపెనీలు సుమారు 700 మిలియన్ డాలర్లను సమీకరించనున్నాయి. అలాగే 5,000లకు పైగా ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఈ మేరకు ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ‘ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016’ పేరిట రూపొందించిన నివేదికలో పేర్కొంది.

పోస్టల్ చెల్లింపు బ్యాంకుకు పీఐబీ ఆమోదం
ఇండియా పోస్ట్ రూ.800 కోట్లతో ఏర్పాటు చేయాలనుకుంటున్న చెల్లింపు బ్యాంకు ప్రతిపాదనకు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (పీఐబీ) ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో ఈ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉందని పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారొకరు తెలిపారు.

2016 - 2017ల్లో భారత్ వృద్ధి 7.5 శాతం: మూడీస్
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016, 2017 సంవత్సరాల్లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడీస్ ఫిబ్రవరి 18న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. ప్రభుత్వ ఆదాయా-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును 2017 జీడీపీలో 3.5 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం తన వ్యయాల్ని తగ్గించుకునే అవకాశముందని సంస్థ విశ్లేషించింది. ఇదిలా ఉండగా 2016-17లో భారత్ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అంచనావేసింది. మూడు నెలల క్రితం అంచనా 7.3 శాతం కాగా దీనిని తాజాగా సంస్థ సవరించి పెంచింది. సంవత్సరాల పరంగా చూస్తే 2016లో 7.4 శాతం, 2017లో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. చైనా వృద్ధి రేట్లను ఈ రెండేళ్లలో వరుసగా 6.5 శాతం, 6.2 శాతంగా పేర్కొంది.

కార్డుతో చెల్లింపులపై సర్‌చార్జీలు రద్దు
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 24న ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

జనవరిలో 5.69 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతానికి చేరిందని కేంద్రీయ గణాంకాల విభాగం ఫిబ్రవరి 12న విడుదల చేసిన గణాంకాల్లో తెలిపారు. 2015 జనవరిలో ఇది 5.19 శాతం, డిసెంబర్‌లో 5.61 శాతంగా ఉండేది. ఈ గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 6.48 శాతం పెరిగింది. ధరల పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో 6.48 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.81 శాతంగా ఉంది.

పీఎఫ్‌పై వడ్డీరేటు 8.8 శాతానికి పెంపు
2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)పై వడ్డీ రేటును 8.75 శాతం నుంచి 8.80 శాతానికి పెంచారు. ఫిబ్రవరి 16న చెన్నైలో జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ట్రస్టీల కేంద్ర బోర్డు (సీబీటీ) 211వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేటును 8.90 శాతినికి పెంచితే ప్రభుత్వం వద్ద ‘మిగులు’ రూ. 285 కోట్లుగా ఉంటుంది కానీ 8.8 శాతానికి పెంచినందు వల్ల అది రూ. 673 కోట్లుగా ఉంది.

బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.4.38 లక్షల కోట్లు
బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి రూ.3.4 లక్షల కోట్లు ఉండగా వాటి విలువ తాజాగా రూ.4.38 లక్షల కోట్లకు చేరింది. ఈ తరుణంలో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకుని, భవిష్యత్తులోనూ తీర్చలేని పరిస్థితుల్లో పడ్డ 150 కంపెనీలను ఆర్‌బీఐ గుర్తించింది. వీటికి అప్పులిచ్చిన బ్యాంకులు ఆ ఖాతాల్ని ఎన్‌పీఏలుగా ప్రకటించాలంటూ ఆదేశించింది. ఎస్‌బీఐ నిరర్థక ఆస్తులైతే డిసెంబర్ నాటికి రూ.72,000 కోట్లు దాటాయి.

నెట్ న్యూట్రాలిటీకే ట్రాయ్ మొగ్గు
దేశంలో ఇంటర్నెట్ సర్వీసులందించే ఏ సంస్థ కూడా.. కంటెంట్ (వెబ్‌సైట్లు) ఆధారంగా చార్జీల్లో ఎక్కువ తక్కువ వసూలు చేయకూడదని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) స్పష్టం చేసింది. అంటే ఇప్పటి మాదిరిగా ఏ సంస్థ అయినా తానందించే ఇంటర్‌నెట్ స్పీడు ఆధారంగా మాత్రమే రకరకాల చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే నిర్దిష్ట స్పీడుతో కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు ఆ పరిధిలో ఏ వెబ్‌సైట్‌ను చూసినా అవే చార్జీలు చెల్లిస్తాడు. ఈ నిబంధన పాటించని సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

బయోఆసియా-2016 సదస్సు
హెదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన బయోఆసియా-2016 సదస్సు పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిబ్రవరి 10న ప్రకటించారు. వివిధ కంపెనీలు రూ.వెయ్యి కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సులో ముందుకొచ్చాయన్నారు. ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ తమ భారత్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుందని వివరించారు. ఫెర్రింగ్ ఫార్మా 21 ఏళ్లుగా ముంబై నుంచి పనిచేస్తున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు తరువాత భారత్‌లో ప్రధాన కార్యాలయం ఇదే అవుతుందని సంస్థ సీఓఓ మైకేల్ పెటీగ్రూ తెలిపారు. హైదరాబాద్ కేంద్రం ఏర్పాటుకు 2.5 కోట్ల డాలర్లు (సుమారు 170 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలిపారు.

అత్యంత శక్తివంతమైన ఐటీ బ్రాండ్ టీసీఎస్
 ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో టీసీఎస్‌కు ఈ ఘనత దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది. నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ పేరు, ప్రఖ్యాతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో 78.3 పాయింట్ల స్కోర్‌తో, ఏఏప్లస్ రేటింగ్‌తో టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. అన్నిరంగాల పరంగా చూస్తే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా డిస్ని, అత్యంత విలువైన బ్రాండ్‌గా ఆపిల్ నిలిచాయి. గత ఆరేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా కూడా టీసీఎస్ నిలిచింది. 2010లో 234 కోట్ల డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది 940 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఆర్థిక వ్యవహారాలు మార్చి 2016 ఎకానమీ
కరెన్సీ నోటుకు స్వదేశీ కాగితం
మన కరెన్సీ నోటు ముద్రణకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారుచేసుకోనున్నాం. దీని వల్ల వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు సంబంధించిన కాగితపు పరిశ్రమను ప్రారంభించింది. ఏడాదికి 12 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కాగిత పరిశ్రమ ఏర్పాటుతో ఏడాదికి రూ.1,280 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని బీఆర్‌బీఎన్‌ఎంఎల్ డెరైక్టర్ జగన్మోహన్ తెలిపారు.

ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం -0.91
మార్చి 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం(2015, ఫిబ్రవరితో పోల్చి చూస్తే) -0.91గా నమోదైంది. ద్రవ్యోల్బణం మైనస్‌ల్లో కొనసాగడం ఇది వరుసగా 16వ నెల. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో (2015, ఫిబ్రవరితో పోల్చి చూస్తే) 5.18 శాతంగా నమోదైంది. ఇది గత నెలలో 5.69 శాతంగా ఉంది.

రష్యాలో చమురు క్షేత్రాల కొనుగోలుకు ఓవిఎల్, ఐఓసీ ఒప్పందాలు
రష్యాలోని రెండు చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవిఎల్), ఆయిల్ ఇండియా కార్పొరేషన్ సారథ్యంలోని కన్సార్షియం మార్చి 16న సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.28,253 కోట్లు. ఈ కన్సార్షియం యురియక్ చమురు క్షేత్రంలోని 29.9 శాతం వాటాను రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ నుంచి కొనుగోలు చేసింది.

రూ.1,35,689 కోట్లతో ఏపీ బడ్జెట్ 2016-17
2016-17 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 10న శాసనసభకు సమర్పించారు. 2016-17లో వృద్ధిరేటును 15 శాతంగా బడ్జెట్‌లో అంచనా వేశారు. 20 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు అమరావతిలో సైన్స్ సిటీ, ఓర్వకల్లులో 27,788 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ హబ్, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు రూ.16,250.58 కోట్ల వ్యయంతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు
మొత్తం బడ్జెట్:రూ. 1,35, 689 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ. 86,555 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ.49,134 కోట్లు 
రెవెన్యూ లోటు: రూ.4,868 కోట్లు
ఆర్థిక లోటు: రూ. 20,497.15 కోట్లు

రూ.1,30,415 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2016-17
2016-17 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మార్చి 14న శాసనసభకు సమర్పించారు. కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.25,000 కోట్లు కేటాయించారు.
ముఖ్యాంశాలు
మొత్తం బడ్జెట్:రూ.1,30,415 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ.62,785 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ.67,630 కోట్లు
రెవెన్యూ రాబడి: రూ.1,00,924.73 కోట్లు
రెవెన్యూ మిగులు: రూ.3,718 కోట్లు
ద్రవ్యలోటు: రూ.23,467.28 కోట్లు

రూ. 16,250 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
సేంద్రియ వ్యవసాయం, నీటికుంటల తవ్వకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2016-17 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను మార్చి 10న రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. గతేడాదికంటే రూ. రెండు వేల కోట్ల పెంపుతో 2016-17 సంవత్సరానికి రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలపి చేసే ప్రణాళిక వ్యయం రూ.7,691.90 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.8,558.68 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌లో అచ్చంగా వ్యవసాయానికి రూ.5,786.23 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో రూ. 1,311.77 కోట్లు ప్రణాళికా వ్యయం, రూ. 4,474.46 కోట్లు ప్రణాళికేతర వ్యయమని మంత్రి వివరించారు.

వసూలు కాని పన్ను మొత్తం రూ.7 లక్షల కోట్లు
భారత్‌లో వసూలు కాని పన్ను మొత్తాలు 2015 మార్చి నాటికి రూ. 7 లక్షల కోట్లకు పెరిగాయి. 2014 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.75 లక్షల కోట్లు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. పన్ను బకాయిదారుల స్థిర, చర ఆస్తుల జప్తు, అమ్మకం, సంబంధింత ఆస్తుల నిర్వహణకు రిసీవర్ నియామకం, జైలుశిక్ష వంటి ఎన్నో మార్గాల ద్వారా చట్ట ప్రకారం వసూళ్లకు అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిమాణం పెరుగుతున్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. స్వాధీనానికి తగిన ఆస్తులు లేకపోవడం, బకాయిదారుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోవడం, పలు కేసులు న్యాయ, అధికార పరిధుల్లో పెండింగులో ఉండడం వంటి అంశాలు పన్ను డిమాండ్‌లు నెరవేరకపోవడానికి కారణాలని తెలిపింది. 2013-14తో పోల్చితే 2014-15లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం మేర (రూ.57,196 కోట్లు) పెరిగినట్లు పేర్కొంది. అయితే స్థూలంగా పన్ను వసూళ్లలో వీటి వాటా మాత్రం 56.1 శాతం నుంచి 55.9 శాతానికి తగ్గినట్లు వివరించింది. 

భారత్‌కు ఏడీబీ నిధులు
మౌలిక వసతుల అభివృద్ధి కోసం భారత్‌కు వచ్చే మూడేళ్లలో 10-12 బిలియన్ డాలర్లు అందించనున్నట్లు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు వెల్లడించింది. మార్చి 11న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం ఏడీబీ ప్రెసిడెంట్ తకిహికొ నకావొ ఈ మేరకు ప్రకటించారు.

కొత్తగా నాలుగు సెజ్‌లకు కేంద్రం ఆమోదం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ఆమోదం తెలిపింది. వీటిలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ రంగారెడ్డి జిల్లాలో దాదాపు 2.51 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఇన్ఫోసిస్ 20.23 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ జోప్‌ను పంజాబ్‌లోని మొహాలీలో నిర్మించనుంది.

నమ్మకమైన ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్ అమెజాన్
 ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా భారత్‌లో ‘అత్యంత విశ్వసనీయమైన ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్’గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఉన్నాయి. టాప్ 10లో స్థానం పొందిన వాటిల్లో ఈబే, మింత్రా, యెప్‌మి, జబొంగ్, నాప్‌టాల్, షాప్‌క్లూస్, ఆస్క్‌మిబజార్ సంస్థలు ఉన్నాయి. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ.. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

హైదరాబాద్‌లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్ ఏర్పాటుకానుంది. సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ కంపెనీలు సంయుక్తంగా మొబైల్స్ పరిశోధన అభివృద్ధి హబ్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. కంపెనీలు కలసి ఇలా హబ్ నెలకొల్పనుండడం భారత్‌లో ఇదే తొలిసారి. ఇక తెలంగాణలో ఇప్పటికే సెల్‌కాన్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద మొబైల్స్ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తోంది. అలాగే సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్‌లు రంగారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. తాజాగా భాగ్యనగరిలో ఆర్‌అండ్‌డీ హబ్‌కు శ్రీకారం చుట్టాయి.

ఆర్థిక వ్యవహారాలు ఏప్రిల్ 2016 ఎకానమీ
ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.8 శాతానికి పెంపు
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతూ ఏప్రిల్ 29న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్‌పై మార్చి నుంచి మూడుసార్లు తన నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం.. నిరసనల నేపథ్యంలో విరమించుకుంది. ఎంప్లాయిర్ వాటా నిధులను 58 ఏళ్ల తర్వాతే ఉద్యోగి పొందేలా తీసుకున్న నిర్ణయాన్నీ మార్చుకుంది. తాజాగా ఈపీఎఫ్‌పై 8.7 శాతమే వడ్డీ చెల్లిస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 2015-16కు పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ తిరస్కరించడంతో చివరకు 8.7 శాతంగానే నిర్ణయించారు. దీనిపై కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒత్తిడి పెరగడంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది.

పీఎఫ్‌పై 8.7% వడ్డీ ఖరారు
2015-16 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.7 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కార్మిక మంత్రి నేతృత్వంలోని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సీబీటీ) ఫిబ్రవరిలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.8 శాతం చేయాలని ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 25న లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.

శ్రీ సిటీలో క్యాడ్‌బరీ ఉత్పత్తి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాకొలెట్ల ఉత్పత్తి ఆరంభమయింది. అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన తన అతిపెద్ద ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని ఏప్రిల్ 25న ఆరంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్పత్తిని స్విచ్ ఆన్ చేయటం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశ ఉత్పత్తిని ఆరంభించిన ఈ ప్లాంటు... 2020 నాటికి 2.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని అంచనా. తద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాంటుపై సంస్థ 19 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది.

రెమిటెన్సుల్లో భారత్ టాప్
విదేశాల నుంచి రెమిటెన్స్‌ల స్వీకరణలో భారత్.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ వార్షిక నివేదిక వెల్లడించింది. రెమిటెన్స్‌ల రూపంలో భారత్‌కు గతేడాది 69 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం 2014తో (70 బిలియన్ డాలర్లు) పోలిస్తే 1 బిలియన్ డాలర్లమేర తక్కువ (2.1 శాతం క్షీణత). 2009 తర్వాత రెమిటెన్స్‌లు తగ్గడం ఇదే తొలిసారి. ఇక భారత్ తర్వాతి స్థానాల్లో చైనా (64 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (28 బిలియన్ డాలర్లు), మెక్సికో (25 బిలియన్ డాలర్లు), నైజీరియా (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేస్తున్న వారు అక్కడ సంపాదించిన డబ్బును స్వదేశానికి పంపడాన్ని రెమిటెన్స్‌లుగా వ్యవహరిస్తారు.

పన్ను ఎగవేతల కట్టడికి భారత్, అమెరికాల మధ్య అంగీకారం
పరస్పర ఆర్థిక, వాణిజ్య లావాదేవీలకు సంబంధించి పన్ను ఎగవేతలు, మనీ ల్యాండరింగ్ వంటివి నిరోధించడానికి భారత్-అమెరికాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా పరస్పర సమాచార మార్పిడి, సంయుక్త ఆడిటింగ్ నిర్వహించాలని ఏప్రిల్ 14న వాషింగ్టన్‌లో జరిగిన ‘భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం’ (ఈఎఫ్‌పీ) ఆరో వార్షిక సమావేశంలో ఇరు దేశాలూ అంగీకరించాయి. తద్వారా అక్రమ నిధుల వలసకు, ఉగ్రవాదులకు అందుతున్న నిధులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. ఈ అంశంపై అధికారిక చర్చలు జరపాలని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ జే ల్యూలు ఒక అంగీకారానికి వచ్చారు. దీంతోపాటు భారత్ మౌలిక సదుపాయాల్ని వృద్ధిపర్చుకోవడానికి నెలకొల్పిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా పేర్కొంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జెనెట్ యెలెన్, భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

కృష్ణపట్నం నుంచి ఒమన్‌కు నేరుగా నౌక రవాణా
ప్రొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు మరో ఘనత సాధించింది. ఇక ఈ పోర్టు ద్వారా ఒమన్ దేశంలోని ‘సలాలా’ ఓడరేవుకు నౌకల ద్వారా నేరుగా ఎగుమతి-దిగుమతులు జరగనున్నాయి. ఈ మేరకు కంటైనర్ కార్పొరేషన్ ఇండియా(కాన్‌కర్) ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న కృష్ణపట్నం పోర్టు నుంచి సలాలా ఓడరేవుకు ‘మెర్స్క్ బెన్‌టోన్‌విల్లె’ అనే నౌక ద్వారా భారీ కంటైనర్ల ఎగుమతిని ప్రారంభించారు. ఇప్పటివరకు కృష్ణపట్నం పోర్టు నుంచి సలాలా ఓడరేవుకు నౌకలు కొలంబో మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి నేరుగా ఒమన్ వెళతాయి. 

జన్ ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన ‘సివిల్ సర్వీసెస్ డే’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డిపాజిట్లను స్వీకరించాయని తెలిపారు.

పవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా నీతా అంబానీ
 2016గానూ ఫోర్బ్స్ ప్రకటించిన ఆసియాలోని 50 మంది పవర్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నీతా అంబానీ తొలిస్థానంలో నిలిచారు. భారత్ నుంచి ఈ జాబితాలో మొత్తం 8 మంది మహిళలకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఎస్‌బీఐ సీఎండీ అరుంధతీ భట్టాచార్య రెండోస్థానంలో నిలిచారు. వీరితో పాటు ఈ జాబితాలో సిగ్మా సీఈవో అంబికా దీరజ్ (14), వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా (16), ఐసీఐసీఐ ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చార్ (22), విఎల్‌సీసీ హెల్త్‌కేర్ ఫౌండర్ వందనా లుత్రా (26), బయోకాన్ సీఎండీ కిరణ్ ముజుందార్ షా (28)లు ఉన్నారు.

రెపో రేటు 0.25 తగ్గించిన రిజర్వు బ్యాంకు
రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 5న నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. దీంతోపాటు రిజర్వు బ్యాంకు రివర్స్ రెపో రేటును 0.25 శాతం పెంచడంతో అది 6 శాతానికి చేరింది. నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను మాత్రం ఆర్బీఐ (4 శాతం)యథాస్థితిలో కొనసాగించింది.

ఆర్థిక వ్యవహారాలు మే 2016 ఎకానమీ
ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో 56 భారత కంపెనీలు
ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉంది. మొత్తం జాబితాలో ఇది 121వ స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి. వారెన్ బఫెట్ బార్క్‌షేర్ హాత్‌వే 4వ స్థానంలో ఉంది. ఇక యాపిల్ 8వ స్థానంలో, వాల్‌మార్ట్ 15వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ 23వ స్థానంలో, ఐబీఎం 41వ స్థానంలో, ఫేస్‌బుక్ 188వ స్థానంలో ఉన్నాయి. ఫోర్బ్ జాబితాలో అమెరికా నుంచి 586 కంపెనీలు, చైనా నుంచి 249 సంస్థలు స్థానం పొందాయి. జపాన్ నుంచి టయోటా మోటార్స్ మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకుంది.

సీడీఎస్‌ఎల్ చైర్మన్‌గా కృష్ణమూర్తి 
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) చైర్మన్‌గా టి.ఎస్.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈయన నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. కృష్ణమూర్తి ఏప్రిల్ 8న సీడీఎస్‌ఎల్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి తాజాగా సెబీ ఆమోదం ముద్ర వేసింది. కృష్ణమూర్తి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన మాజీ అధికారి. ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

2016లో భారత్ వృద్ధి 7.3%: ఐరాస
భారత్ ఆర్థికాభివృద్ధి 2016లో 7.3 శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి మే 12న విడుదల చేసిన తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్ వృద్ధి తీరు మెరుగుపడుతోందని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి నివేదిక 2017లో భారత్ వృద్ధిని 7.5 శాతంగా అంచనావేసింది. 2015లో ఈ రేటు 7.2 శాతం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే... వృద్ధి రేటు 2015 తరహాలోనే 2016లో కూడా 2.4%గా నమోదయ్యే వీలుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి 2016 మధ్యంతర నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. దీనిప్రకారం.. దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి అవకాశాలు కొనసాగుతాయి. భారత్, ఇరాన్‌ల వృద్ధి ఇందుకు కొంత కారణం కానుంది. దక్షిణాసియా మొత్తం జీడీపీలో భారత్ వాటా 70%.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్‌గా చావ్లా
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌గా అశోక్ చావ్లా నియమితులయ్యారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. చావ్లా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈయన 2019 మార్చి 27 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. చావ్లా నియామకం మే 3 నుంచి అమల్లోకి వచ్చింది. ఈయన గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చీఫ్‌గా వ్యవహరించారు. అలాగే ఆర్థిక కార్యదర్శిగా, పౌర విమానయాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలనే యస్ బ్యాంక్ అదనపు డెరైక్టర్‌గా కూడా ఎన్నికయ్యారు. కాగా చావ్లా 1973 క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఈయనకు ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉంది. 

ప్రపంచంలో అతిపెద్ద చౌక ఎయిర్‌లైన్స్ కూటమి
ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కూటమి(అలయెన్స్) ఆవిర్భవించింది. ఆగ్నేయాసియా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన ఎనిమిది బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కలిసి ‘వేల్యూ అలయెన్స్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మే 16న ప్రకటించాయి. ఈ కంపెనీలకు చెందిన టికెటింగ్ ప్లాట్‌ఫామ్ షేరింగ్ ద్వారా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వెబ్‌సైట్ ద్వారానైనా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలయెన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’, ఫిలిప్పైన్స్‌కు చెందిన సెబు ఫసిఫిక్, దక్షిణ కొరియా జేజు ఎయిర్, థాయ్‌లాండ్ నోక్ ఎయిర్, నోక్‌స్కూట్; టైగర్ ఎయిర్ సింగపూర్, టైగర్ ఎయిర్ ఆస్ట్రేలియా, జపాన్ సంస్థ వెనీలా ఎయిర్‌లు ఉన్నాయి.

వృద్ధిరేటు 7.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మే 3న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బలహీన ఎగుమతులు, రుణ వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పటికీ పటిష్ట వినియోగ డిమాండ్ భారత వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. 

దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం
దివాలా బిల్లుకు మే 11న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ ఈ బిల్లుకు మే 5నే ఆమోదం తెలిపింది. రెండు సభలు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుదీర్ఘకాలయాపన లేకుండా... కంపెనీలు, వ్యక్తులు అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్థిష్ట కాల వ్యవధుల్లో దివాలా సమస్యల పరిష్కారం, తద్వారా రుణ సమస్యల నివారణ ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో తాజా బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. దివాలా వ్యవహారాల ప్రక్రియ మొత్తం 180 రోజుల్లో పూర్తికావాలని బిల్లు నిర్దేశిస్తోంది.

ఆర్థిక వ్యవహారాలు జూన్ 2016 ఎకానమీ
ఏడో వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఏడో వేతన సంఘం సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలు 23.5 శాతం మేర పెరగనున్నాయి. 2016 జనవరి 1 నుంచే సిఫారసులను అమలు చేయనున్నారు. వేతన సంఘం సిఫారసుల అమలుతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరగబోయే వేతనాలతో ప్రభుత్వ ఖజానాపై 2016-17లో రూ. 1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.65 శాతం) భారం పడనుంది. ఆరో వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై అదనంగా పడిన భారం జీడీపీలో 0.77 శాతంగా నమోదైంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. గరిష్ట వేతనాన్ని రూ.2.5 లక్షల వరకు పెంచారు. 2015 నవంబర్‌లోనే జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్రం ప్రతీ పదేళ్లకు వేతన సంఘాన్ని నియమిస్తుంది.

మోడల్ షాప్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో 24 గంటలు, 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా ‘ద మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఉద్యోగం, సేవల వసతి నియంత్రణ) చట్టం-2016’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, కంపెనీలు (తయారీ సంస్థలు తప్ప) ఏడాదిపాటు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దుకాణాలు తెరుచుకోవచ్చు. దీంతో పాటు సరైన భద్రత కల్పించటం ద్వారా రాత్రి షిఫ్టులో మహిళలను పనిలో పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే ఉద్యోగులందరికీ సరైన తాగునీరు, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్సతోపాటు మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఇది నేరుగా అమల్లోకి వస్తుంది.

ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో దాని అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేటినెట్ జూన్ 15న ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు రూ.1000 కోట్ల మూలధనంతో ఏర్పాటు చే సిన భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆ‌ఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా.. ఎస్‌బీఐలో విలీనమయ్యేందుకు మార్గం సుగమం అయింది. విలీనం తర్వాత ఎస్‌బీఐ శాఖల సంఖ్య 22,500కు, ఉద్యోగుల సంఖ్య 2.50 లక్షలకు, మొత్తం ఆస్తులు రూ.37 లక్షల కోట్లకు చేరతాయి.

రక్షణ, విమానయాన రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
రక్షణ, పౌర విమానయాన రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ.. జూన్ 20న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో ఎఫ్‌డీఐల పరిమితి 49 శాతంగా ఉండేది. దీంతో విమానయాన, ఫార్మా రంగాల్లోనూ భారీ మార్పులు వచ్చే అవకాశముంది. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కు సవరణలు చేసింది.

కొత్త పౌరవిమానయాన విధానానికి కేటినెట్ ఆమోదం
కొత్త పౌర విమానయాన విధానానికి కేంద్ర కేబినెట్ జూన్ 15న ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రకారం- ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు చార్జీగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీగా వసూలు చేస్తారు. అంతేకాకుండా దేశంలోకి మరిన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు అడుగుపెట్టేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనను రద్దు చేశారు.

తేయాకు ఉత్పత్తిలో భారత్ నెం.1
2015-16 ఆర్థిక సంవత్సరంలో 123 కోట్ల కిలోల తేయాకు ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో టీ ఉత్పత్తి చేసిన దేశంగా భారత్ ఖ్యాతి సంపాదించింది. ఇదేకాలంలో 23 కోట్ల కిలోల తేయాకు పొడి ఎగుమతి చేసినట్లు కోల్‌కతాలోని టీ బోర్డు జూన్ 18న ప్రకటించింది. ఎగుమతుల విలువ రూ.4,493 కోట్లు ఉంటుందని తెలిపింది. గత 35 ఏళ్లలో ఇదే అత్యధికమని వివరించింది. రష్యా, ఇరాన్, జర్మనీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ, పోలండ్‌కు మనదేశం తేయాకు ఎగుమతి చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు బాగా లేక ఉత్పత్తి తగ్గినప్పటికీ, ఉత్తరాదిలో సాగు పెరిగింది.

మేలో 5.76 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
వరుసగా రెండో నెల్లోనూ వినియోగదారు ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం పెరిగి.. రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.47 శాతం కాగా, ఇది మేలో మరింత పెరిగి 5.76 శాతానికి చేరింది. గతేడాది మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.01 శాతం. ఈ ఏడాది కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్రం జూన్ 13న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.

మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్‌ఇన్
వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్‌ఇన్‌ను కొనుగోలుచేసినట్లు జూన్ 13న మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ డీల్ కోసం 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే. పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు ఒప్పందం ఉంటుందని.. లింక్డ్‌ఇన్‌కు చెందిన ఒక్కో షేరుకి 196 డాలర్ల చొప్పున విలువ కట్టినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

కొత్త పౌర విమానయాన పాలసీకి కేబినెట్ ఆమోదం
సామాన్యుడికి విమానయానాన్ని మరింత చేరువచేయడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ చార్జీని వసూలు చేయాల్సి ఉంటుంది. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అంతేకాకుండా దేశంలోకి మరిన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు అడుగుపెట్టేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా రద్దు చేసింది. దీని స్థానంలో 0/20 నిబంధనను తీసుకువచ్చింది. ప్రయాణికులకు టికెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. జూన్ 15న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఏవియేషన్ పాలసీకి ఆమోద ముద్ర పడింది.

భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభం
వ్యాపార నిర్వహణ సులభమైన దేశాల జాబితా-2016లో భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (జీఆర్‌డీఐ) అభివృద్ధి చెందుతున్న 30 దేశాల జాబితాను జూన్ 5న విడుదల చేసింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 

కీలక వడ్డీ రేట్లను యథాత థంగా కొనసాగించిన ఆర్బీఐ 
 రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్ 7న ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రెపో రేటు ( 6.5 శాతం), రివర్స్ రెపో రేటు (6 శాతం), సీఆర్‌ఆర్ (4 శాతం) యథాతథంగా కొనసాగనున్నాయి. 2016-17 వృద్ధిరేటును 7.6 శాతంగా అంచనా వేసిన ఆర్బీఐ, వచ్చే ఏడాది జనవరి నాటికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5 శాతంగా పేర్కొంది.

ఆర్థిక వ్యవహారాలు జూలై 2016 ఎకానమీ
రుణ వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
రుణ గ్రహీతలు తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలో చెల్లించని పక్షంలో వారు తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేసుకునే అధికారాన్ని బ్యాంకులు కల్పించే చట్టానికి లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు నుంచి వ్యవసాయ భూమికి మినహాయింపునిచ్చారు. ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రికవరీ ఆఫ్ డెట్ లాస్ అండ్ మిస్లేనియస్ ప్రావిజన్స్(సవరణలు) బిల్లు-2016’ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సర్‌ఫాసీ, డీఆర్టీ, స్టాంపు చట్టం, డిపాజిటరీ చట్టాలకు సవరణలు చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రుణదాతలు డీఫాల్టర్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారమిస్తూ.. జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారాన్ని 30 రోజుల్లో పూర్తి చేసేలా సవరణ తెచ్చారు.

సీబీడీటీ చైర్‌పర్సన్‌గా రాణి సింగ్ నాయర్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా రాణి సింగ్ నాయర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె 1979 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సీనియర్ అధికారిణి. ఇదివరకు సీబీడీటీ చైర్మన్‌గా కొనసాగిన అతులేశ్ జిందాల్ జూలై 31న పదవీ విరమణ చేశారు. రాణి సింగ్ ఇప్పటి వరకు సీబీడీటీలో సభ్యులుగా ఉన్నారు. ఆమె అక్టోబర్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.

జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా నమోదు
ఈ ఏడాది జూన్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ దవ్యోల్బణం (సీపీఐ) సూచీ 5.77 శాతంగా నమోదైంది. ఇది 22 నెలల గరిష్టస్థాయి. ఈ ఏడాది మే నెలలో 5.76 శాతం ఉంది.

ఆర్థిక వ్యవహారాలు ఆగష్టు 2016 ఎకానమీ
ఆర్‌బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు ఖేల్ ప్రోత్సాహన్ 2016 పురస్కారం లభించింది. దీన్ని ఆగస్టు 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా స్వీకరించారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగానూ ఆర్‌బీఐకి ఈ అవార్డు లభించింది.

వైఫల్యం చెందకూడని బ్యాంకులుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 26న వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా ప్రకటించింది. ఇలాంటి హోదా ఈ బ్యాంకులకు లభించడం ఇది వరుసగా రెండోసారి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థీకృతంగా చాలా ప్రాముఖ్యత కలిగినవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఆయా బ్యాంకుల పటిష్టతకు గట్టి నిఘా, పర్యవేక్షణలు ఉంటాయి.

భారత వృద్ధిరేటు 7.8 శాతం: ఫిక్కీ సర్వే
భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.8 శాతంగా నమోదవుతుందని ఫిక్కీ సర్వే పేర్కొంది. తగినంత వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగం మంచి ఫలితాలు ఇస్తుందని, దీంతో పారిశ్రామికవృద్ధీ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

LEMOA ఒప్పందంపై భారత్-అమెరికా సంతకాలు
మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లను పరస్పరం వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఒప్పందం ‘లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (LEMOA) భారత్-అమెరికాల మధ్య కుదిరింది. ఈ మేరకు ఆగస్టు 30న వాషింగ్టన్‌లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ సంతకాలు చేశారు. దీంతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాంలు మెరుగవటమే కాకుండా రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు.

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి మార్గం సుగమం
మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏర్పాటు దిశగా భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోడానికి సంబంధించిన ప్రతిపాదనకు ఆగస్టు 18న ఎస్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది.

విలీనం వల్ల కలిగే ప్రయోజనాలు
భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్‌బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. 
22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది. 
ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరిస్తుంది.

జూలైలో 3.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
2016 జూలైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.55 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పు దినుసులు వంటి ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్టానికి చేరింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటి 11.82 శాతానికి పెరిగింది. పప్పు దినుసులు 35.76 శాతం, కూరగాయలు 28.05 శాతం, తృణ ధాన్యాల ధరలు 7.03 శాతం అధికమయ్యాయని ఆగస్టు 16న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళా దుంపల ధరలు 58.78 శాతం పెరిగాయి. పంచదార, పండ్ల ధరలు వరుసగా 32.33 శాతం, 17.30 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌లో 1.62 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం.. 2015 జూలై లో -4.00 శాతంగా నమోదు కావడం గమనార్హం. 

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.2,500 కోట్ల జరిమానా
పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తన కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యానికన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు) చేరుకుంది. 

కేజీ డీ6 బ్లాక్‌లో ధీరూభాయి-1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి ప్రతి రోజు 80 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ 2011-12లో జరిగిన వాస్తవ ఉత్పత్తి రోజుకు 35.33 ఎంఎంఎస్‌సీఎండీగానే ఉంది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సీఎండీ, 2013-14లో 9.77 ఎంఎంఎస్‌సీఎండీల మేరకే ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ ఇది 8 ఎంఎంఎస్‌సీఎండీలకే పరిమితం అయింది.

ఈ ఏడాది భారత్ వృద్ధి 7.5 శాతం: మూడీస్
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంచనా 7.5 శాతంగా ఉంది. అయితే 2016లో చైనా 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన మూడీస్ దీనిని 6.6 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. 2017 రేటు అంచనాను 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెంచింది. పటిష్ట ద్రవ్య, పరపతి విధానం దీనికి కారణమని మూడీస్ పేర్కొంది.

జూలైలో 6.07 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 23 నెలల గరిష్ట స్థాయికి చేరి 6.07 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2014 సెప్టెంబర్‌లో 6.46 శాతంగా నమోదైంది. తర్వాత ఈ ఏడాది జూలైలో 6.07 శాతానికి చేరింది. పంచదార, నూనె, కొవ్వు పదార్థాలు, సుగంధ ద్రవ్యాల ధరలు.. గిరాకీకి అనుగుణంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.

కీలక రేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 9న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో)ను ప్రస్తుతం ఉన్నట్లు 6.5 శాతంగా, బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే డిపాజిట్లపై వాటికి ఆర్‌బీఐ చెల్లించే రేటు(రివర్స్ రెపో)ను 6 శాతంగా, క్యాష్ రిజర్వ్ రేషియోను 4 శాతంగా యథాతథంగా కొనసాగించింది.

హైదరాబాద్‌లో మొదటి ఐకియా స్టోర్
రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు ఆగస్టు 11న శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. 2017 చివరినాటికి ప్రారంభం కానున్న ఈ ఔట్‌లెట్‌కు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది.
హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరులోనూ 2018 నాటికి ఐకియా స్టోర్లు ఏర్పాటు చేస్తోంది.

జీఎస్టీ రోడ్‌మ్యాప్ విడుదల
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో దాని అమలుకు ఏప్రిల్ 1, 2017ను లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందుకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను ఆగస్టు 4న విడుదల చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంయుక్తంగా ఈ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు.

జీఎస్టీ రోడ్‌మ్యాప్ క్లుప్తంగా

సవరణ బిల్లుకు 30 రోజుల్లో కనీసం 16 రాష్ట్రాల ఆమోదం.రాష్ట్రపతి సమ్మతి అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు.నమూనా జీఎస్టీ నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుసీజీఎస్టీ, ఐజీఎస్టీ(అంతరాష్ట్ర) చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.ఎస్జీఎస్టీ(రాష్ట్రాల జీఎస్టీ)కి అన్ని రాష్ట్రాల ఆమోదం.వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల ఆమోదం.డిసెంబర్‌లోగా కేంద్ర, రాష్ట్ర అధికారులకు శిక్షణ పూర్తిడిసెంబర్ 2016 నాటికి జీఎస్టీ సాఫ్ట్‌వేర్ సిద్ధం.జనవరి- మార్చి, 2017 మధ్యలో జీఎస్టీ సాఫ్ట్‌వేర్ పరీక్షించడం, అనుసంధానం చేయడం. 10. సంబంధిత వర్గాలతో మార్చి, 2017లోగా సంప్రదింపులు పూర్తి.జీఎస్టీ నిబంధనలపై మార్చి 31, 2017లోగా నోటిఫికేషన్వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, కేంద్ర ఎక్సైజ్ పన్ను జీఎస్టీలో విలీనం
జీఎస్‌టీ బిల్లుకి రాజ్యసభ ఆమోదం
వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యంత భారీ పన్ను సంస్కరణ ఇది. రాజ్యాంగం ప్రకారం.. ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించేందుకు కేంద్రానికి, చిల్లర అమ్మకం పన్నులు వసూలు చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఆ పన్నుల స్థానంలో ఏకీకృతమైన జీఎస్‌టీని అమలు చేయటానికి వీలు కల్పించేందుకు.. రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు - 2014ను పెద్దల సభ ఆమోదించింది. జీఎస్‌టీకి సంబంధించి పలు అంశాలపై నాటి, నేటి అధికార, విపక్షాల మధ్య విభేదాలతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పన్ను సంస్కరణల బిల్లుకు.. అన్నా డీఎంకే మినహా కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ పెద్దల సభలో మద్దతు ప్రకటించాయి. అన్నా డీఎంకే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. జీఎస్‌టీ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు చర్చించిన అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 203 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.

ఆర్థిక వ్యవహారాలు సెప్టెంబరు 2016 ఎకానమీ
పరపతి విధాన కమిటీకి ముగ్గురు ఆర్థికవేత్తలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ముగ్గురు ఆర్థిక విద్యావేత్తలను నియమిస్తూ సెప్టెంబర్ 22న కేంద్రం నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం-అహ్మదాబాద్ ప్రొఫెసర్ రవీంద్ర హెచ్.ధొలాకియాలు నియమితులయ్యారు.

రైల్వే బడ్జెట్ విలీనం
92 ఏళ్లుగా వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 21న ఆమోదించింది. బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విధానాన్ని తొలగించి బడ్జెట్‌ను సరళతరం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఫిబ్రవరి నెల చివరి రోజుకు బదులు ఫిబ్రవరి ఒకటో తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఫ్లిప్‌కార్ట్ యూజర్లు- 10 కోట్లు
దేశీ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ వినియోగదారుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని చేరింది. దీంతో భారత్ ఆన్‌లైన్ మార్కెట్ విభాగంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా ఫ్లిప్‌కార్ట్ అవతరించింది. 2016 మార్చి నాటికి 7.5 కోట్లుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ యూజర్ల సంఖ్య తాజాగా 10 కోట్లకు చేరింది. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను, అందుబాటు ధరల్లో అందిస్తున్నందుకే ఈ మార్క్ చేరామని సీఈవో బిన్నీ బన్సల్ తెలిపారు.

ఆరోగ్య సూచీలో భారత్‌కు 143వ స్థానం
పలు ఆరోగ్య సూచీలపై ప్రపంచ వ్యాప్తంగా 188 దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్‌కు 143వ స్థానం దక్కింది. ఈ మేరకు ఆరోగ్యంపై సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వార్షిక నివేదిక ‘ఎస్డీజీ ఆరోగ్య సూచీ-2015’ ను ‘లాన్సెట్’ మేగజీన్‌లో ప్రచురించారు. శుభ్రత, గాలి కాలుష్యం, మరణాల రేటులో నిరాశజనక పనితీరు వల్ల భారత్ చిన్న దేశాలైన భూటాన్, బోత్సవానా, సిరియా, శ్రీలంక కంటే వెనకబడింది. అయితే బంగ్లాదేశ్(149), పాక్(151)ల కంటే ముందంజలో ఉంది. ఐస్‌లాండ్, సింగపూర్, స్వీడన్, యూకే, ఫిన్‌లాండ్‌లు వరుసగా తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

జీఎస్‌టీ పరిమితి 20 లక్షలు
ఏడాదికి రూ.20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలు, వర్తకులకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని సెప్టెంబర్ 23న జరిగిన జీఎస్టీ మండలి (కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు) భేటీలో నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాల్లో మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించినట్లు జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. దీంతో పాటు ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు ఆదాయమున్న సంస్థల వ్యవహారాలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి. జీఎస్టీ కింద 90 రకాల వస్తువులు, సేవలకు మినహాయింపు ఇవ్వనున్నారు.

ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 112వ ర్యాంక్
వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ 112వ స్థానంలో నిలిచింది. ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్-2016 వార్షిక నివేదిక ప్రకారం ఇండియా ఈ సంవత్సరం పది స్థానాలు కోల్పోయింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ తర్వాత వరుసగా 113వ స్థానాన్ని, 121వ స్థానాన్ని, 133వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. భూటాన్ 78వ స్థానం, నేపాల్ 108వ స్థానం, శ్రీలంక 111వ స్థానంలో నిలిచాయి. తొలి మూడు స్థానాల్లో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు నిలిచాయి.

పప్పుల మద్దతు ధర పెంపునకు కమిటీ సిఫార్సు
దేశంలో పప్పుల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 చొప్పున పెంచాలని, ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సెప్టెంబర్ 16న నివేదికను సమర్పించిన కమిటీ.. దానిలో సాగు పెంపు, ధరల అదుపు దిశగా పలు సంస్కరణలను సూచించింది. యుద్ధ ప్రాతిపదిక న పప్పుల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరింది.

ఆగస్టులో 3.74 శాతానికి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు నెలలో 3.74 శాతానికి చేరుకుంది. ఇది జూలైలో 3.55 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న విడుదల చేసింది. జూలైలో 11.82 శాతంగా ఉన్న ఆహార ధరల సూచీ ఆగస్టులో 8.23 శాతంగా నమోదైంది.

ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనానికి మార్గం సుగమం
 అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌లు వైర్‌లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించాయి. తద్వారా విలీన కంపెనీ రూ.65,000 కోట్ల విలువైన, భారత్‌లో నాలుగో పెద్ద సంస్థగా ఆవిర్భవించనుంది. ఈ విలీనంతో ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ ప్రస్తుత యాజమాన్య సంస్థ, మలేసియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)కు చెరో 50 శాతం చొప్పున వాటాలు దక్కాయి.

విదేశీ రుణ భారం 485.6 బిలియన్ డాలర్లు
భారత విదేశీ రుణ భారం 2016 మార్చి నాటికి 485.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 2.2 శాతం (10.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. దీర్ఘకాల రుణ భారం ప్రత్యేకించి ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల రూపంలో పెరిగిందని నివేదిక తెలిపింది. వాణిజ్య సంబంధ రుణాలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. విదేశీ రుణ భారం వల్ల ఒత్తిడులు ఎదుర్కొనే విషయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది.


ఈ ఏడాది వృద్ధి రేటు 7.5%: డీ అండ్ బీ
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగా ఉండనుందని (గత ఆర్థిక సంవత్సరం 7.2 శాతం) ప్రపంచ వాణిజ్య, వ్యాపార సమాచార విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ) అంచనా వేసింది. వినియోగ డిమాండ్ దీనికి ప్రధాన కారణమని, తగిన వర్షపాతంతో వ్యవసాయ వృద్ధి, దిగువస్థాయి క్రూడ్ ఆయిల్ ధరలు 7.5 శాతం వృద్ధికి బాటలు వేస్తాయని డీ అండ్ బీ ఇండియా ఆర్థికవేత్త అరుణ్‌సింగ్ తెలిపారు.

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ(122)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లు అమోదం కోసం 17 రాష్ట్రాలకు పంపగా 16 రాష్ట్రాలు అమోదించాయి. బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలవగా, ఒడిశా 16వ రాష్ట్రంగా నిలిచింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను ఉద్దేశం.

సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్ ప్రారంభించిన ఐసీఐసీఐ
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ‘సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్’ లేదా ‘రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్’ను సెప్టెంబర్ 8న ముంబైలో ప్రారంభించింది. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నదే తమ లక్ష్యమని బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తెలిపారు.

జీఎస్‌టీ మండలికి కేబినెట్ ఆమోదం
వస్తు, సేవల పన్నుకు సంబంధించిన జీఎస్‌టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్‌చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చిస్తారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఈ మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యుడిగా కొనసాగుతారు కానీ ఓటు హక్కు ఉండదు.

రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 29న వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. 2015-16లో జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతం కాగా, ఇది 2016-17లో 7.6 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (మార్చి నాటికి) ద్రవ్యోల్బణ రేటు 6 శాతం కాగా, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5 శాతానికి దిగొస్తుందని పేర్కొంది. 

వస్తు, సేవల పన్ను బిల్లుకు తెలంగాణ ఆమోదం
వస్తు, సేవల పన్ను బిల్లును ఆగస్టు 30న తెలంగాణ శాసన సభ, శాసన మండలిలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. బిల్లు ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే వ్యాట్ కూడా జీఎస్టీ పరిధిలోకి వెళ్లనుంది. గతేడాది తెలంగాణకు లభించిన మొత్తం పన్ను ఆదాయం రూ.31,117 కోట్లు కాగా, అందులో వ్యాట్ ద్వారా రూ.16,000 కోట్లు సమకూరాయి.

ఈఎస్‌ఐ వేతన పరిమితి 21 వేలు
ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) బీమాలో చేరటానికి నెల వారీ వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 15,000 నుండి రూ. 21,000కు పెంచాలని నిర్ణయించింది. బోర్డు భేటీలో ఈఎస్‌ఐసీ వేతన పరిమితిని రూ. 25,000 కు పెంచాలని సంస్థ ప్రతిపాదించినప్పటికీ.. రూ. 21,000 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 2.6 కోట్ల మంది బీమా కార్మికులు ఉన్నారు. ఈఎస్‌ఐసీ బోర్డుకు కార్మికమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం సెప్టెంబరు 4న ముగియడంతో అదే రోజు ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.

ఆర్థిక వ్యవహారాలు అక్టోబరు 2016 ఎకానమీ
యువజనఅభివృద్ధి సూచీలో భారత్‌కు 133వ స్థానం
కామన్వెల్త్ సెక్రటేరియట్ విడుదల చేసిన యువజన అభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. మొత్తం 183 దేశాల్లో ఉపాధి, విద్య, ఆరోగ్య, రాజకీయ తదితర రంగాలపై సర్వే చేసి ఈ సూచీని రూపొందించారు. నేపాల్ (77), భూటాన్ (69), శ్రీలంక (31)లు భారత్ కంటే మెరుగైన స్థానాలు సాధించాయి. జర్మనీ, డెన్మార్క్, ఆస్ట్రేలియాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు హైస్కూల్ విద్యలోకి ప్రవేశించలేకపోతున్నారని నివేదిక తెలిపింది.

తొలి పది స్థానాల్లో నిలిచిన దేశాలు

Country

Global Rank

Germany

1

Denmark

2

Australia

3

Switzerland

4

United Kingdom

4 (5)

Netherlands

6

Austria

7

Luxembourg

8

Portugal

9

Japan

10


కనీస వ్యవసాయ కూలీ 350
 సి-క్లాస్ పట్టణాల్లో నైపుణ్యంలేని వ్యవసాయ కూలీకి రోజువారీ కనీస వేతనం రూ. 350 గా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఇది 2016 నవంబర్ 1వ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని వ్యవసాయ కార్మికులకు జాతీయ కనీస కూలీ కింద రోజుకు రూ. 160 చెల్లిస్తున్నారు. ‘వేతనాల స్మృతి (కోడ్ ఆన్ వేజెస్)’, పారిశ్రామిక సంబంధాల స్మృతి (కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్) పై జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ మొత్తాన్ని రూ.350 కు పెంచాలని నిర్ణయించారు. 

లింగత్వ వ్యత్యాస నివేదికలో భారత్‌కు 87వ స్థానం
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అక్టోబర్ 24న విడుదల చేసిన ప్రపంచ లింగత్వ వ్యత్యాస నివేదిక-2016లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. స్త్రీ-పురుషుల మధ్య వ్యత్యాస నివేదిక ప్రకారం భారత్‌లో విద్యారంగ పరిస్థితి మెరుగైంది. గతేడాది 108వ స్థానంలో ఉన్న భారత్ 21 స్థానాలను మెరుగుపరచుకుంది. 144 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో ఐస్‌లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఫిన్‌లాండ్, నార్వే, స్వీడన్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా 99వ స్థానంలో ఉంది.

రైతు సానుకూల రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్
వ్యవసాయ పరిశ్రమల విషయంలో రైతు సానుకూల విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్, రాజస్తాన్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. నీతి ఆయోగ్ అక్టోబర్ 31న వెలువరించిన ‘వ్యవసాయ మార్కెటింగ్, రైతుహిత సంస్కరణల సూచీ’ (Agri Marketing and Farmer Friendly Reforms Index) లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 7వ, తెలంగాణ 9వ స్థానాన్ని దక్కించుకోగా మధ్యప్రదేశ్‌కు 4వ ర్యాంకు, హర్యానాకు 5, హిమాచల్‌ప్రదేశ్‌కు 6, కర్ణాటకకు 8, గోవాకు 10, ఛత్తీస్‌గఢ్‌కు 11వ ర్యాంకు వచ్చింది. పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లు వ్యవసాయ సంస్కరణల్లో వెనుకబడ్డాయి.

జాబితాలో మొదటి 10 రాష్ట్రాలు

రాష్ట్రం

స్కోర్

1. మహారాష్ట్ర

81.7

2. గుజరాత్

71.5

3. రాజస్తాన్

70.0

4. మధ్యప్రదేశ్

69.5

5. హర్యానా

63.3

6. హిమాచల్‌ప్రదేశ్

59.5

7. ఆంధ్రప్రదేశ్

56.20

8. కర్ణాటక

55.50

9. తెలంగాణ

54.3

10. గోవా

52.8


సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతం
ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతంగా నమోదైంది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి. ఆగస్టులో ద్రవ్యోల్బణం 5.05 శాతంగా ఉంది. వరుసగా రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 13న ప్రకటించింది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడం విశేషం.

భారత్‌లో సంపన్నులు 2 లక్షలు
అధిక నికర సంపద కలిగిన వ్యక్తుల (High-net-worth individual) సంఖ్యా పరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2014లో భారత్‌లో వీరి సంఖ్య 1.8 లక్షలు ఉండగా 2015లో ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగింది. వీరి సంపద సైతం 1.6 శాతం వృద్ధి చెంది 797 బిలియన్ డాలర్లకు చేరిందని ‘ఆసియా-పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2016’ పేరుతో క్యాప్‌జెమిని విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం 27 లక్షల HNWI తో జపాన్ మొదటి స్థానంలో నిలవగా 10 లక్షల మందితో చైనా రెండో స్థానంలో, 2.3 లక్షల మందితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి.

మొత్తంగా 2015లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని HNWI ల సంపద 9.9% వృద్ధితో 17.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని క్యాప్ జెమిని వెల్లడించింది.

రెపోరేటును పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. నాలుగో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రెపోరేటును పావు శాతం తగ్గిస్తూ అక్టోబర్ 4న నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) పావు శాతం తగ్గి 6.25 శాతానికి చేరింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. తాజా నిర్ణయంతో గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు చౌకయ్యే అవకాశం ఉంది. 

ఆటోమేషన్‌తో భారత్‌లో ఉద్యోగాలు తగ్గుతాయి: ప్రపంచ బ్యాంకు
ఆటోమేషన్‌తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను రాబోయే రోజుల్లో టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది.

ప్రపంచ రుణ భారంపై ఐఎమ్‌ఎఫ్ ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారం ఆల్-టైమ్ హైకి చేరిందని, దీని పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారాలు 152 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 65 శాతానికిపైగా ప్రైవేటు రంగానికి చెందింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వృద్ధికి మద్దతుగా వడ్డీరేట్లు తగ్గిస్తూ రావడం దీనికి కారణమని ఐఎమ్‌ఎఫ్ తెలిపింది.

బ్యాంకుల మొండి బకాయిలు 9.24 లక్షల కోట్లు
దేశీయ బ్యాంకులకు మొండిబకాయి(ఎన్‌పీఏ)ల సమస్య పెరుగుతూ రూ.9.24 లక్షల కోట్లకు చేరిందని రాయిటర్స్ వార్తా సంస్థ పరిశోధన నివేదికలో వెల్లడైంది. 2015 డిసెంబర్ నాటికి ఎన్‌పీఏలు 121 బిలియన్ డాలర్లు ఉండగా అవి 2016 జూన్ నాటికి 15% పెరిగి 138.5 బిలియన్ డాలర్ల(రూ.9.24 లక్షల కోట్లకు)కు చేరాయి. వీటిలో 122 బిలియన్ డాలర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కాగా ప్రైవేటు బ్యాంకుల వాటా 14 బిలియన్ డాలర్లు, విదేశీ బ్యాంకుల వాటా 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ఐడీఎస్ కింద 65 వేల కోట్ల నల్లధనం వెల్లడి
నల్లధనాన్ని వెలికి తీయడానికి మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకం (Income Declarationn Scheme) లో భాగంగా దేశవ్యాప్తంగా రూ.65,250 కోట్ల నల్లధనం బహిర్గతమైంది. మొత్తం 64,275 మంది తమ అక్రమాదాయాన్ని బయటపెట్టారు. దీనిలో పన్నుల రూపంలో రూ. 29,362 కోట్లు ప్రభుత్వానికి సమకూరనుంది. ఇందులో రూ.14,700 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూరనున్నాయి. పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.

వెల్లడించిన అదాయం ప్రకారం దాదాపు రూ. 13 వేల కోట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ముంబై(రూ. 8,500 కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్‌కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి.

2016 జూన్ 1న ఐడీఎస్‌ను తీసుకొచ్చారు. ఈ పథకం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 45 శాతం పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది. విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి 2015లో ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కేవలం 644 మందే దీనికి స్పందించారు. 

6.25 శాతానికి రెపో రేటు
కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రెపో రేటు(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను పావుశాతం తగ్గించాయి. దీంతో 0.25 పాయింట్లు తగ్గి ఈ రేటు 6.25 శాతానికి దిగింది. కేవలం ఆర్‌బీఐ గవర్నర్ కాకుండా, ఆరుగురు సభ్యుల విస్తృత స్థాయి కమిటీ రెపోపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు బ్యాంకులకు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఆర్‌బీఐ ఇచ్చే రుణ రేటు 5.75 శాతానికి తగ్గింది.

సమీక్ష ముఖ్యాంశాలు
రెపో, రివర్స్‌రెపో రేటు వరుసగా 6.25 శాతం, 5.75 శాతానికి తగ్గాయి.
సీఆర్‌ఆర్ (బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం) 4 శాతంగా కొనసాగుతుంది. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.6 శాతం. వచ్చే ఏడాది 7.9 శాతానికి పెరిగే అవకాశం. 

ఈ ఏడాది వృద్ధి రేటు 7.6%: ప్రపంచ బ్యాంకు
 భారత జీడీపీ వృద్ధి రేటు 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమివ్వడం, ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలిపింది. అక్టోబర్ 4న దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి ప్రధాన సవాళ్లున్నాయని వెల్లడించింది.

ఆర్థిక వ్యవహారాలు నవంబరు 2016 ఎకానమీ
భారత్ కొత్త నోట్లపై నిషేధం విధించిన నేపాల్
భారత్ విడుదల చేసిన కొత్త రూ.500, రూ.2000 నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ నవంబర్ 24న ప్రకటించింది. భారత్ రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడంలో ఆ దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనంత వరకు భారత్‌కు చెందిన కొత్త కరెన్సీ నోట్ల మార్పిడి ఉండదని పేర్కొంది. నోటిఫికేషన్ వల్ల విదేశీ పౌరులు భారత కరెన్సీని నిర్దిష్ట మొత్తంలో కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుందని ఆ దేశ అధికారులు తెలిపారు.

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభం
టెలికం రంగంలో అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్ ‘ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు’ పేరుతో ప్రయోగాత్మక సేవల్ని ప్రారంభించింది. తద్వారా దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీగా నిలిచింది. రాజస్థాన్‌లో ఉన్న 10 వేల ఎయిర్‌టెల్ అవుట్‌లెట్లలో నవంబర్ 23న ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

ఆధార్, ఈ కేవైసీతో ఎయిర్‌టెల్ మొబైల్ నంబరే వారి ఖాతా నంబర్‌గా ఎవరైనా సేవింగ్స్ ఖాతా తెరవచ్చు. ఖాతాలోని నగదు నిల్వలపై వార్షికంగా 7.25 శాతం వడ్డీని చెల్లిస్తారు. ఖాతాదారుడికి రూ.లక్ష మేరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తారు.

ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన పథకం ప్రారంభం
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జమవుతున్న నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించనిది) సమర్థంగా వినియోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన (పీఎం జీకేవై)-2016 పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని కింద ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 50% పన్ను విధిస్తారు. మిగిలిన దానిలో 25 శాతంను తప్పనిసరిగా పీఎంజీకేవై లో జమ చేయాలి. దీనిపై నాలుగేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. మిగిలిన 25 శాతంను వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు నవంబర్ 28న ఆదాయ పన్ను(ఐటీ) చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చిస్తారు. పీఎంజీకేవైను ఫైనాన్స్ చట్టం-2016లో చాప్టర్ 9 కింద చేర్చారు.

ఐటీ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించేందుకు ఉద్దేశించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు 2016ను నవంబర్ 29న లోక్‌సభ ఆమోదించింది. రద్దయిన రూ. వెయ్యి, రూ. 500 నోట్లను చట్టవిరుద్ధంగా మార్చే వారిని కట్టడి చేయడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు. దీని ప్రకారం రద్దయిన కరెన్సీని అక్రమంగా మార్చే వారిపై 60% పన్ను, పెనాల్టీలతో కలిపి గరిష్టంగా 85% వసూలు చేస్తారు. స్వయంగా నల్లధనం వివరాలు సమర్పిస్తే 50% పన్ను విధించి 25% నగదును వెంటనే తీసుకునే వెసులుబాటు కల్పిండంతో పాటు, మిగతా 25% నాలుగేళ్ల అనంతరం తీసుకునేలా ప్రతిపాదనలు చేర్చారు.

అక్టోబర్‌లో తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 3.39 శాతంగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెల్లోనూ డబ్ల్యూపీఐ తగ్గుముఖం పట్టింది. ఇది సెప్టెంబర్‌లో 3.57 శాతంగా నమోదైంది. కూరగాయలతోపాటు పలు ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఇది 2015, అక్టోబర్‌లో -3.70 శాతంగా నమోదైంది. 

రైతు నెలసరి సగటు ఆదాయం రూ.6,426
దేశంలో ఒక వ్యవసాయ కుటుంబానికి నెలకు సగటున రూ.6,426 ఆదాయం వస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ నవంబర్ 18న లోక్‌సభకు తెలిపారు. 2012-13 వ్యవసాయ లెక్కల ప్రకారం ఇది ఏపీలో రూ.5,979, తెలంగాణలో రూ.6,311 ఉన్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబాలు దేశంలోనే అత్యధికంగా ప్రతి నెలా రూ.18,059 ఆదాయం పొందుతున్నాయి. ఇది పశ్చిమ బెంగాల్‌లో అత్యల్పంగా రూ.3,980 ఉంది. 2012 జూలై నుంచి 2013 జూన్ వరకు నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ప్రారంభం
 చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) నవంబర్ 13న ప్రారంభమైంది. బలూచిస్తాన్ రాష్ట్రంలో పున ర్నిర్మించిన వ్యూహాత్మక గ్వాదర్ నౌకాశ్రయం పునఃప్రారంభంతో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఈ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. బంగ్లాదేశ్, శ్రీలంక, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్,యూరోపియన్ యూనియన్ దేశాలకు సరుకులు తీసుకె ళ్లే రెండు వాణిజ్య నౌకలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. వీటి ద్వారా చైనా నుంచి వచ్చిన బియ్యం, పత్తి, యంత్రాలను పంపించారు. చైనాలో కష్గర్‌లో గత నెల 29న బయలుదేరిన సరుకుల వాహనాలు మరుసటి రోజున పాకిస్తాన్ సరిహద్దులో ప్రవేశించాయి. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఈ కారిడార్ నిర్మిస్తుండటంతో భారత్ గతంలోనే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

గోధుమ, పప్పులకు ‘మద్దతు’ ధర పెంచిన కేంద్రం
కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను నవంబర్ 15న పెంచింది. ఈ మేరకు 2016-17 రబీ పంటలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది.
కనీస మద్దతు ధరలు (క్వింటాలుకు..రూ.లలో)

ధాన్యం

ప్రస్తుతం

పెంచిన తర్వాత

గోధుమలు

1,525

1,625

శనగలు

3,500

4,000

ఆవాలు

3,350

3,700

బార్లీ

1,225

1,325

కుసుమలు

3,300

3,700

కందిపప్పు

3, 400

3,950


జీఎస్టీ పన్ను రేట్లు ఖరారు
 నాలుగు శ్లాబుల జీఎస్టీ పన్ను రేటుకు జీఎస్టీ కౌన్సిల్ నవంబర్ 3న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పన్ను రేట్లను 5, 12, 18, 28 శాతం గా ఖరారు చేసింది. దీని ప్రకారం నిత్యావ సర వస్తువులపై తక్కువ పన్ను రేటు విలాస వస్తువులు, ఆరోగ్యానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలపై అధిక రేటు వసూలు చేస్తారు. అలాగే వాటిపై అదనపు సెస్సు విధిస్తారు. ఏఏ వస్తువులు ఎంతశాతం పన్ను పరిధిలోకి వస్తాయనేది త్వరలో నిర్ణయిస్తారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించి 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది.

రూ.500, రూ.1000 నోట్లు రద్దు
నల్లధనం నియంత్రణలో భాగంగా రూ.500, రూ.1,000 కెరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో ప్రజలు కొంత ఇబ్బంది పడతారని.. కానీ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావడానికి ఇదే అరుదైన అవకాశమని పునరుద్ఘాటించారు. దీంతో దేశానిక పట్టిన నల్లధనం, నకిలీ కరెన్సీ నోట్లు, ఉగ్రవాదం, అవినీతి జాడ్యాలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. రద్దయిన వాటి స్థానంలో నవంబర్ 10 నుంచి రూ.2,000, రూ.500 కొత్తరకం నోట్లను ప్రవేశపెడతారు. భారత్‌లో అక్రమ నగదు కార్యకలాపాల విలువ జీడీపీలో 20.7 శాతం(1999), 23.2 శాతం(2007)గా ఉన్నట్లు జులై, 2010లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

నోట్ల మార్పిడికి గడువు
ప్రజలు తమ వద్ద ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30లోపు(50 రోజుల గడువు) ఆర్‌బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు. డిసెంబర్ 30లోగా డిపాజిట్ చేసుకోలేనివారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ నోట్లను నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాల్లో జమ చేయవచ్చు.

నవంబర్ 10 నుంచి కొత్త నోట్లు
ఈ నేపథ్యంలో కొత్త సిరీస్‌ల్లో రూ.500, రూ.2,000 నోట్లు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ‘మహాత్మాగాంధీ (న్యూ) సిరీస్’ పేరుతో విడుదల చేసిన రూ.2000 నోటుపై అరుణ గ్రహంపై ఇస్రో చేసిన మిషన్ టు మార్స్’ యాత్ర మంగళయాన్‌ను ముద్రించారు. మాజెంటా రంగులో ఉండే ఈ నోటు 66 మి.మీ.-166 మి.మీ. సైజులో ఉంటుంది. రూ.500 నోటును స్టోన్‌గ్రే రంగులో 63 మి.మీ.-150 మి.మీ. సైజులో ఉంటుంది. దీనిపై ఢిల్లీలోని ఎరక్రోట చిత్రం ముద్రించారు. మహాత్మాగాంధీ సిరీస్ నోట్లను 1996 నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. భద్రతా ప్రమాణాలు పెంచి ఎంజీ సిరీస్ కొత్త నోట్లను 2005 నుంచి తీసుకొచ్చారు.

ఆర్‌బీఐ ఇప్పటివరకు ముద్రించిన అత్యంత విలువైన నోటు రూ.10,000. దీనిని 1938లో ముద్రించారు. 1946లో తొలిసారిగా రూ.1,000, రూ.10,000 నోట్లను చలామణి నుంచి తొలగించారు. రూ.500 నోటును 1987 అక్టోబరులో, 1,000 నోట్లను 2000 నవంబరులో మళ్లీ ప్రవేశపెట్టారు.

ఆర్థిక వ్యవహారాలు డిసెంబరు 2016 ఎకానమీ
తొలి నగదు రహిత ప్రాంతంగా డామన్ డయ్యు
అరేబియా తీరంలోని కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యు.. దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతంగా రికార్డుకెక్కింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ 190 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలోని వలంటీర్లు 25,000 కుటుంబాలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలను జరిపేందుకు వీలుగా పరిపాలనా యంత్రాంగం ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించింది.

3.15 శాతానికి తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
కూరగాయలతోపాటు పలు ఆహార వస్తువులు చౌకగా మారడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరసగా మూడో నెలా తగ్గింది. నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదైంది. ఇది అక్టోబర్‌లో 3.39 శాతంగా ఉంది.

ఎండీఆర్ రుసుం తగ్గించిన ఆర్‌బీఐ
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు డెబిట్ కార్డుల చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను (ఎండీఆర్) తగ్గిస్తూ భారత రిజర్వు బ్యాంక్ డిసెంబర్ 16న నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే చిన్న లావాదేవీలపైనా సుంకాలను ఎత్తేయాలని నిర్ణయించింది. ఎండీఆర్ అంటే డెబిట్, క్రెడిట్ కార్డ్ సేవలను అందిస్తున్నందుకు వ్యాపారుల వద్ద బ్యాంకులు వసూలు చేసే రుసుం. 

నవంబర్‌లో 3.63 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలా తగ్గి నవంబర్‌లో 3.63 శాతంగా నమోదైంది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. 2016, అక్టోబర్‌లో ఇది 4.20 శాతంగా నమోదైంది.

భారత సంపద నివేదిక- 2016
దేశంలో సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదటిస్థానంలో నిలిచాయి. దీంతో ఎఫ్‌డీల్లో వ్యక్తిగత సంపద 11 శాతం పెరిగి రూ.36.8 లక్షల కోట్లకు చేరింది. తర్వాత స్థానాల్లో ఈక్విటీలు, బీమా నిలిచాయి. ఆర్థిక సేవల సంస్థ కార్వీ ప్రైవేట్ వెల్త్ ఏడో విడతగా విడుదల చేసిన ‘భారత సంపద నివేదిక- 2016’ ఈ వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16లో దేశీయంగా వ్యక్తిగత సంపద 8.5 శాతం వృద్ధితో రూ.304 లక్షల కోట్లకు చేరింది. రాబోయే అరుుదేళ్లలో ఇది చక్రగతిన 12.80 శాతం వృద్ధితో రూ.558 లక్షల కోట్లకు చేరనుందని నివేదిక తెలిపింది. భౌతిక ఆస్తుల్లో మాత్రం 10.32 శాతం వృద్ధితో రూ. 132 లక్షల కోట్లకు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ పెమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం
దేశంలో తొలి పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబర్ 14న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తన సేవలు ప్రారంభించింది. భారత్‌లో ఎయిర్‌టెల్‌కు 25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, 15 లక్షల రిటైల్ ఔట్‌లెట్లు ఉన్నాయి. కస్టమర్ మొబైల్ నంబరే ఖాతా సంఖ్యగా ఉంటుంది. డిపాజిట్లపై 7.25 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ప్రారంభం
నల్లధనాన్ని కలిగి ఉన్నవారు 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ క్యలాణ్ యోజన(పీఎంజీకేవై) డిసెంబర్ 17న ప్రారంభమైంది. ఈ పథకం కింద పన్ను చెల్లించేవారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు, పన్ను చట్టాల కింద ఎలాంటి విచారణ ఉండదు. మార్చి 31 వరకూ ఖాతాల్లో డబ్బు జమ చేయవచ్చు.

ఆర్‌బీఐ పాలసీ సమీక్ష.. వడ్డీరేట్లు యథాతథం
ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించారు. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను మార్చలేదు.

డిజిటల్ చెల్లింపులపై రాయితీలు ప్రకటించిన కేంద్రం
నగదు వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రజలను పోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిసెంబర్ 8న కొన్ని రాయితీలు ప్రకటించారు. దీంతో పెట్రోలు, ఇన్సూరెన్స్, రైల్వే టికెట్ల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులపై రాయితీలు వర్తించనున్నాయి. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలకే అమలవుతాయని, ప్రైవేటు సంస్థలు వాళ్ల ధరను వారే నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

క్రాస్ బోర్డర్ ట్రేడ్‌లో భారత్‌కు 102వ స్థానం
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నవంబర్ 30న విడుదల చేసిన సరిహద్దు ఆవలి వాణిజ్యం (క్రాస్ బోర్డర్ ట్రేడ్)లో భారత్‌కు 102వ స్థానం దక్కింది. 136 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. ఇందులో సింగపూర్ మొదటి స్థానంలో, నెదర్లాండ్స్ రెండో స్థానంలో, హాంగ్‌కాంగ్ మూడో స్థానంలో నిలిచాయి. వస్తువులు స్వేచ్ఛగా సరిహద్దు అవతలకు, లక్షిత ప్రాంతాలను చేరేందుకు ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీ రూపొందించారు. ఇందులో దేశీయ, విదేశీ మార్కెట్‌ల అందుబాటు, సరిహద్దు నిర్వహణ, రవాణా, డిజిటల్ సదుపాయాలు, నిర్వహణ పరిస్థితులు వంటివి ఉన్నాయి.

మార్చి వరకూ ‘జియో’ ఉచిత సేవలు
 రిలయన్‌‌స జియో కస్టమర్లకు డిసెంబర్ 31తో ముగియనున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వాయిస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు కూడా మార్చి వరకు ఉచితంగా పొందవచ్చు. కానీ పారదర్శక వినియోగ విధానం (ఎఫ్‌యూపీ) కింద ప్రతీ కస్టమర్‌కు ఒక రోజులో ఉచిత డేటాను 1 జీబీ మాత్రమే అందిస్తారు. జనవరి 1 నుంచి కొత్త ఆఫర్ వర్తిస్తుంది.

ప్రపంచ బ్యాంక్‌తో అపోలో గ్రూప్ ఒప్పందం
రిటైల్ హెల్త్ కేర్ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్) ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), ఐఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కలిసి ఈక్విటీ రూపంలో రూ.450 కోట్లు ఏహెచ్‌ఎల్‌ఎల్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడులతో ఏహెచ్‌ఎల్‌ఎల్‌లో ఐఎఫ్‌సీకి 28.03 శాతం వాటా దక్కుతుంది. అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన ఏహెచ్‌ఎల్‌ఎల్ దేశంలోని 17 రాష్ట్రాల్లో 400 సెంటర్లలో 7 విభాగాల్లో సేవలందిస్తుంది.

ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్‌‌స కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మన దేశంలో 2005 నుంచి హెల్త్ కేర్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ, డెబిట్ రూపంలో పెట్టుబడులు పెడుతుంది. ఇది ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.11,700 కోట్ల (117 బిలియన్‌‌స) పెట్టుబుడులు పెట్టగా మనదేశంలో 28 శాతం వాటాతో రూ.3,200 కోట్ల (32 బిలియన్‌‌స) పెట్టుబడులు పెట్టింది.

No comments:

Post a Comment