AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

ఎకానమీ Economy రైల్వే బడ్జెట్ 2015-16

రైల్వే బడ్జెట్ 2015-16

భారతీయ రైల్వే వ్యవస్థను ఆధునికీకరించి ‘హైటెక్’ మార్గంలో నడిపే దిశగా అడుగులు వేసింది ఎన్డీఏ సర్కారు. కొత్త రైళ్లు, కొత్త మార్గాలు, కొత్త ప్రాజెక్టులు వంటి ప్రకటనలు పక్కనపెట్టి..
వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, మరింతగా విస్తరించటం, బలోపేతం చేయటం, ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు 2015-16 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కారు గురువారం(ఫిబ్రవరి 26న) ప్రవేశపెట్టిన రెల్వే బడ్జెట్ మొత్తం వ్యయం రూ. 1,00,011 కోట్లు.

ఎన్‌డీఏ సర్కారు తలపెట్టిన ‘స్మార్ట్ సిటీ’ ప్రణాళికలు, ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాలకు అనుగుణంగా.. రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే సేవలు, సదుపాయాలను సాంకేతికంగా ఆధునీకరించే ప్రణాళికలు ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యంతో మొదలుపెట్టి.. ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఆధునీకరించటం కోసం తాజా బడ్జెట్‌లో రూ. 12,500 కోట్లు కేటాయించారు. రైళ్ల వేగాన్ని గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచనున్నారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రైల్వే వ్యవస్థను బలోపేతం చేసి ప్రయాణికులకు భిన్నమైన అనుభవాన్ని అందిస్తామని మంత్రి ప్రకటించారు.

రైల్వే బడ్జెట్ తీరు (రూ. కోట్లలో) 
అంశం2013-142014-152015-16
మొత్తం ఆదాయం1,39,558.181,59,248.001,83,578.00
వ్యయం1,30,320.751,45,970.001,62,210.00
నికర రెవెన్యూ11,749.0716,452.5925,076.45
డివిడెండ్ చెల్లింపులు8,008.679,174.1310,810.74
నిర్వహణ రేషియో93.6%91.8%88.5%
మిగులు3,740.407,278.4614,265.71
(రైల్వే బడ్జెట్ 2015-16 పత్రాల ఆధారంగా..)

బడ్జెట్ ముఖ్యాంశాలు
400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం
ప్రత్యేక ఈ-టికెటింగ్ వెబ్‌సైట్ రూపకల్పన, డెబిట్ కార్డుతో టికెట్లు పొందే సౌకర్యం
ఆన్‌లైన్‌లో విశ్రాంతి గదుల బుకింగ్, వికలాంగులకు వీల్‌చైర్ బుకింగ్
టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే నచ్చిన ఆహారం ఎంచుకునే సదుపాయం
బ్రాండెడ్ సంస్థలు, ఫుడ్-చైన్ సంస్థలతో ప్రయాణికులకు ఆహార సరఫరా
120 రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
స్టేషన్‌కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే సాధారణ టికెట్ పొందేలా సదుపాయాలు
రైల్ కమ్ రోడ్ టికెట్లను మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించటం
రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయటం
ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనల కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన
భద్రత, సేవలకు సంబంధించి 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫోన్ లైన్లు
బోగీల ద్వారాలను వెడల్పు చేయటం, పెద్ద స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల అమరిక
రైళ్లలో బెర్తుల ఆధునీకరణ, డిజైన్, నాణ్యత, శుభ్రతల ప్రమాణాల పెంపు
స్లీపర్ బోగీల్లో పై బెర్తుల్లోకి ఎక్కేందుకు ఆధునిక మడత నిచ్చెన్ల అమరిక
రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్త విభాగం ఏర్పాటు
బోగీల్లోనూ చెత్తడబ్బాల ఏర్పాటు, రైలు బోగీల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు
శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, అన్ని రైళ్లలో మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాలు
మహిళల భద్రత కోసం రైళ్లలో సీసీటీవీ కెమెరాలతో నిఘా
9 రైల్వే కారిడార్లలో రైళ్ల వేగాన్ని 200 కిలోమీటర్ల వరకూ పెంచటం
ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థను స్థాపించటం
4-5-11 మంత్రం
రేల్వేల సమగ్రాభివృద్ధితో దేశ ఉన్నతికి పాటు పడేలా ఎన్డీఏ సర్కారు 4-5-11 మంత్రాన్ని జపించింది. వీటిలో ప్రధానంగా నాలుగు లక్ష్యాలు, ఐదు చోదకాలు, 11 ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఐదు చోదకాలు
రైల్వేలను సంపూర్ణంగా రూపాంతరం చేయటానికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
నిధుల లభ్యత, చిట్టచివరి మైలు అనుసంధానం కోసం రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుముఖ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం
ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల సమీకరణ
నిర్వహణ విధానాలను పునర్‌వ్యవస్థీకరించటం
పాలన, పారదర్శకతల ప్రమాణాలను నిర్దేశించటం
నాలుగు లక్ష్యాలు
ప్రయాణికుల అనుభూతిని సుస్థిరంగా మెరుగుపరచటం
రైల్వేలను సురక్షితమైన రవాణా సాధనంగా మలచటం
రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాలను విస్తరించటం, ఆధునీకరించటం
సామర్థ్య విస్తరణకు, క్షీణిస్తున్న ఆస్తులను తిరిగి బలోపేతం చేయటానికి వీలుగా భారీ మిగులు సృష్టించటం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటం
11 అంశాలు
ఆర్థిక వ్యవస్థ ప్రధాన చోదకశక్తిగా రైల్వేలను మళ్లీ అభివృద్ధి చేయటం
అధిక పెట్టుబడుల కోసం వనరులను సమీకరించటం
భారీ మార్గాలపై ఒత్తిడిని తగ్గించటం, రైళ్ల వేగాన్ని పెంచటం
ప్రయాణ సదుపాయాలు, భద్రతాచర్యలు మెరుగుపరచటం
రైల్వే మౌలికసదుపాయాల బలోపేతం
ఎంపిక చేసిన శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు
బి-కేటగిరీ రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయం
మరో 200 రైల్వే స్టేషన్లు ఆదర్శ స్టేషన్ల పథకం కిందికి తేవటం
రోజు వారీ ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 2.1 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచటం
రైలు మార్గాల నిడివిని 20 శాతం - ఇప్పుడున్న 1.14 లక్షల కిలోమీటర్ల నుంచి 1.38 లక్షల కిలోమీటర్లకు - పెంచటం
వార్షిక సరుకు రవాణా సామర్థ్యాన్ని 100 కోట్ల టన్నుల నుంచి 150 కోట్ల టన్నులకు పెంచటం వంటివి ఉన్నాయి.
ఆదాయ వ్యయాలు
రూపాయి రాక..
ఆదాయ మార్గంవచ్చే మొత్తం
సరకు రవాణా65
ప్రయాణికుల చార్జీలు25
ఇతర చార్జీలు3
చిల్లర వ్యాపారాలు4
ఇతరత్రా ఆదాయం3

రూపాయి పోక..

వ్యయ మార్గంఖర్చు మొత్తం
భత్యాలు, అలవెన్సులకు33
ఇంధనం19
నిల్వ3
తరుగుదల నిధి6
పెన్షన్ల నిధి17
లీజు చార్జీలు4
డివిడెండ్6
పెట్టుబడి నిధి0.03
అభివృద్ధి నిధి2
రుణాలు0.01
ఇతరత్రాలు9.96

ఆధునీకరణ, విస్తరణలకు 8.5 లక్షల కోట్లు
రానున్న ఐదేళ్లలో (2015-19 కాలం) రూ. 8.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రైల్వేల ఆధునీకరణ, ఇతర విస్తరణ ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నట్లు రైల్వేమంత్రి ప్రకటించారు. ఈ మేరకు రైల్వే ఆదాయంలో పెట్టుబడుల కోసం వినియోగించే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 8.2%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11.5% పెరగనుంది. రానున్న 3, 4 ఏళ్లలో రైల్వే శాఖకు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం కాగా సాధారణ బడ్జెట్ ద్వారా లభించే మద్దతు కనీసం రూ. 50 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 9,420 కిమీల రైల్వేలైన్ల సామర్ధ్యాన్నిపెంచేందుకు రూ. 96,182 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నామన్నారు.
 

2015-19 కాలానికి ప్రతిపాదిత పెట్టుబడులురూ.కోట్లలో
నెట్‌వర్క్ రద్దీ నివారణ (ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు,
విద్యుదీకరణ.. ట్రాఫిక్ సౌకర్యాలు, విద్యుదీకరణ సహా
డబ్లింగ్ పనులు)
1,99,320
నెట్‌వర్క్ విస్తరణ (విద్యుదీకరణ సహా)1,93,000
జాతీయ ప్రాజెక్టులు (ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ కనెక్టివిటీ కోసం)39,000
రక్షణ (ట్రాక్ నిర్వహణ, వంతెనల నిర్మాణం, ఆర్వోబీ,
ఆర్‌యూబీ, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలికం)
1,27,000
సమాచార సాంకేతికత (ఐటీ)/పరిశోధన5,000
రోలింగ్ స్టాక్ (ఇంజన్లు, బోగీలు, వ్యాగన్లు.. మొదలైనవి)1,02,000
ప్రయాణికుల సదుపాయాలు12,500
హైస్పీడ్ రైల్ అండ్ ఎలివేటెడ్ కారిడార్65,000
స్టేషన్ల అభివృద్ధి, సరుకు నిల్వ సదుపాయాలు1,00,000
ఇతర అవసరాలు13,200
మొత్తం8,56,020

మెట్రో సిటీల మధ్య రైళ్ల వేగం పెంపు
మెట్రో సిటీల మధ్య నడిచే రైళ్ల వేగం గణనీయంగా 200 కిలోమీటర్ల వరకు పెరగనుంది. ఎంపిక చేసిన తొమ్మిది రైల్వే కారిడార్లలో ప్రస్తుతం గంటకు 110, 130 కిలోమీటర్లుగా ఉన్న రైళ్ల వేగాన్ని.. ఇకపై 160, 200 కిలోమీటర్లకు పెంచనున్నారు.

స్టేషన్లు, ట్రాక్‌ల వెంట సౌర విద్యుదుత్పత్తి
విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రైల్వేలకు చెందిన స్థలాలను, స్టేషన్లను, ట్రాకులనుఇలా అవకాశమున్న ప్రతి చోటాసౌరఫలకాలను ఏర్పాటుచేసిసౌర విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకోనున్నారు.

ప్రభుత్వ సహకారం 40,000 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ వ్యయం రూ. 1,00,011 కోట్లు కాగా, అందులో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం రూ. 40 వేల కోట్లు ఉంది. అంటే మొత్తం రైల్వే బడ్జెట్‌లో ప్రభుత్వం మద్దతు 41.6%. గత ఆర్థిక సంవత్సరం రైల్వేలకు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెటరీ మద్దతు రూ. 30 వేల కోట్లు. మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరుల ద్వారా రూ. 17,793 కోట్లు, డీజిల్ సెస్ ద్వారా రూ. 1,645 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య పథకాల ద్వారా రూ. 6 వేల కోట్లను సేకరించనున్నారు.

9,420 కిలోమీటర్ల లైన్ల సామర్థ్యం పెంపు
9,420 కిలోమీటర్ల రైల్వే లైన్ల సామర్థ్యాన్ని విస్తరించటానికి రూ. 96,182 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ ఏడాది నాలుగు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం, మరో 6,608 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ పూర్తవుతుందని అంచనా.

ప్రయాణికుల స్వర్గధామంగా రైల్వేలు 
ప్రయాణికులకు సరికొత్త రైల్వేలను పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన రైల్వే మంత్రి రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, బయో టాయ్‌లెట్లు, ఐదు నిమిషాల్లో జనరల్ టికెట్ల జారీ, రైళ్లలో భద్రత, కొత్త డిజైన్లతో సీట్లు, 24 గంటల హెల్ప్‌లైన్, సకల రుచులతో నాణ్యమైన ఆహారం, వైఫై వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ వసతుల కల్పన కోసం మొత్తంగా రూ. 12,500 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కంటే 67 శాతం అధికం కావడం గమనార్హం.

స్వచ్ఛ రైల్ - స్వచ్ఛ భారత్
స్టేషన్లను, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక విభాగంతో స్వచ్ఛ రైల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గతంలో చేపట్టిన 120 రైల్వే స్టేషన్లకు తోడు మరో 650 స్టేషన్ల పరిధిలో కొత్త మరుగుదొడ్లను నిర్మించనున్నారు.

5 నిమిషాల్లో జనరల్ టికెట్.. 120 రోజుల ముందే రిజర్వేషన్
జనరల్ టికెట్లు పొందడానికి ప్రయాణికులు పడే కష్టాలు దూరం చేసేందుకు ‘ఆపరేషన్ ఐదు నిమిషాలు’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్టేషన్‌కు వచ్చిన ప్రతి ప్రయాణికుడు ఐదు నిమిషాల్లోనే జనరల్ టికెట్ పొందగలిగేలా చేయడమే దీని లక్ష్యం. అలాగే ప్రస్తుతం 60 రోజులు ముందుగా ఉన్న టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని 120 రోజులకు పెంచనున్నారు.

24 గంటల హెల్ప్‌లైన్.. మహిళల భద్రతకు సీసీ కెమిరాలు
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు 138 హెల్ప్‌లైన్ నంబర్ ఇకపై 24/7 పనిచేయనుంది. దీంతో పాటు 182 నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి పరుస్తారు. మహిళల భద్రత కోసం ఎంపిక చేసిన బోగీల్లో నిఘా కెమెరాలను అమర్చనున్నారు.

టికెట్‌తోపాటే నచ్చిన ఆహారం
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ ప్రస్తుత బడ్జెట్‌లో వారికి ఇష్టమైన ప్రాంతీయ రుచులను అందించే కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఎస్‌ఎంఎస్ అలర్ట్
రైలు వచ్చి/పోయే తాజా వేళలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందించేలా ఎస్‌ఎంఎస్ అలర్ట్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రయాణికులు దిగే స్టేషన్ రావడానికి అరగంట ముందే ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తారు.

ఆహార ధాన్యాల నుంచి బొగ్గు దాకా.. సరుకు రవాణా చార్జీల పెంపు
ప్రయాణ చార్జీలుఏ మాత్రం పెంచని రైల్వే మంత్రి 12 రకాల సరకుల రవాణా చార్జీలను మాత్రం 0.8 శాతం నుంచి 10 శాతం దాకా పెంచారు. రవాణా చార్జీలు సిమెంటుపై 2.7%, బొగ్గుపై 6.3%, ఇనుము..ఉక్కుపై 0.8%, ఆహార ధాన్యాలు..పప్పు ధాన్యాలపై 10%, వేరుశనగ నూనెపై 2.1%, ఎల్‌పీజీపై 0.8%, కిరోసిన్‌పై 0.8% మేర పెరగనున్నాయి. మరోవైపు సున్నపురాయి, డోలోమైట్, మ్యాంగనీస్, స్పీడ్ డీజిల్ ఆయిల్ మొదలైన వాటి రవాణా చార్జీలు మాత్రం సుమారు 1 శాతం దాకా తగ్గనున్నాయి.

భారత రైల్వేలు- సరకు రవాణా చార్జీలు
సరుకుల వర్గీకరణధరలు (రూ.లలో/టన్నుకు)
సగటు దూరం (కి.మీ.లో)ప్రస్తుతప్రతిపాదితప్రస్తుతప్రతిపాదితతేడా (శాతం)
ఉప్పు1,2001101001,108.71,108.70.0%
సిమెంట్551150140784.6805.62.7%
బొగ్గు535150145722.9768.66.3%
ఇనుము8971801651,379.01390.50.8%
తృణ ధాన్యాలు,
పప్పుధాన్యాలు
1,2801301301,415.11,556.610.0%
యూరియా772130130891.4980.610.0%
సున్నపురాయి,
డోలమైట్, మాంగనీస్
ఖనిజాలు
575160145837.0834.30.3%
ఇనుప ఖనిజం300180165500.8504.90.8%
తుక్కు ఇనుము,
దుక్క ఇనుము
645160150902.2930.53.1%
ధాతు మలినాలు575150140784.7805.62.7%
వేరుశనగ నూనె1,6001401402,000.32,043.22.1%
స్పీడ్ డీజిల్ ఆయిల్7232001801,291.01278.41.0%
తారు645170160958.6992.53.5%
కిరోసిన్6451801651,015.01,023.50.8%
ఎల్‌పీజీ6451801651,015.01,023.50.8%

నిర్వహణ నిష్పత్తి లక్ష్యం 88.5 %
రాబోయే ఆర్థిక సంవత్సరం(2015-16)లో నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతం స్థాయికి తగ్గించుకోవాలని రైల్వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యుత్తమం కానుంది. దీనిని 2014-15 ఆర్థిక సంవత్సరంలో 91.8 శాతంగా నిర్దేశించుకోగా అంతకుముందు సంవత్సరం(2013-14)లో 93.6 శాతంగా ఉండింది. నిర్వహణ నిష్పత్తిని తగ్గించుకోవడం సంస్థ లాభాలబాటలో పయనించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు నిర్వహణ నిష్పత్తి 93.6 శాతంగా ఉంటే.. భారత రైల్వేలు ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 6.4 పైసలు మాత్రమే మిగులుతుంది.

సెమీ బులెట్ రైళ్ల ఊసే లేదు
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట రైల్వే మంత్రి హోదాలో సదానంద గౌడ ఘనంగా ప్రకటించిన సెమీ బులెట్ రైళ్ల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేదు. దక్షిణ మధ్య రైల్వేకు రెండు రైళ్లను కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతోసిద్ధం చేసి హైస్పీడ్ (సెమీ బులెట్) రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కానీ ఈ బడ్జెట్‌లో వాటి ప్రస్తావన లేదు.

తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ
రైల్వే బడ్జెట్‌లో యథావిధిగా తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. అరకొర విదిలింపులతో అవిభాజ్య రాష్ట్రం దశాబ్దాలుగా అన్యాయానికి గురికాగా ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాల్సిన కొత్త రైల్వే జోన్ ప్రకటన కూడా లేదు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ గానీ, రైల్ నెట్‌వర్క్ విస్తరణ హామీకిగానీ ఈ రైల్వే బడ్జెట్‌లో మోక్షం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ పేర్కొంది. బడ్జెట్‌లో దాని ఊసు కూడా లేదు. మొత్తంగా పాత ప్రాజెక్టులకే అరకొర విదిలింపులు మినహా రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. గణనీయంగా కేటాయింపులు జరిపిన వాటిలో తెలంగాణ విషయానికి వస్తే పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రూ. 140 కోట్లు, మేళ్లచెర్వు-విష్ణుపురం లైనుకు రూ. 100 కోట్లు కేటాయించారు. కొత్తగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను మంజూరు చేశారు. మన్మాడ్-ముద్కేడ్ మధ్య, పగిడిపల్లి-నల్లపాడు మధ్య విద్యుదీకరణ పనులు మంజూరు చేశారు.

పాత సర్వే పనులకు కేటాయించినవి (రూ.లలో)

సర్వే పని2015-16 కేటాయింపు
నిజాంపట్నం-రేపల్లెసున్నా
పగిడిపల్లి-శంకర్‌పల్లిసున్నా
గిద్దలూరు-బాక్రాపేటసున్నా
బోధన్-బీదర్సున్నా
మంత్రాలయం రోడ్-కర్నూలు అప్‌డేటింగ్సున్నా
గుత్తి-ధర్మవరం డబ్లింగ్ సర్వే1,00,000
గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్ సర్వే2,00,000
బీడీసీఆర్-విశాఖ అప్‌డేటింగ్సున్నా
జగ్గయ్యపేట-మిర్యాలగూడ అప్‌డేటింగ్1,000
కరీంనగర్-హసన్‌పర్తి సర్వే1,000
పటాన్‌చెరు-ఆదిలాబాద్ అప్‌డేటింగ్2,00,000
నంద్యాల-ఆత్మకూరు వయా మహానందిసున్నా
హైదరాబాద్-శ్రీైశైలంసున్నా
కడప-హిందూపూర్ వయా కదిరి10,00,000
మచిలీపట్నం-నిజాంపట్నం వయా రేపల్లెసున్నా
నాందేడ్-లాతూర్ రోడ్8,00,000
వాషిం-మాహుర్-ఆదిలాబాద్5,00,000
సిద్దిపేట-అక్కన్నపేట5,00,000
డోర్నకల్-మిర్యాలగూడ1,000
మహబూబ్‌నగర్-గుత్తి డబ్లింగ్15,00,000
సికింద్రాబాద్-ముద్కేడ్-ఆదిలాబాద్1,000
ధర్మవరం-పాకాల10,00,000
మంచిర్యాల-ఆదిలాబాద్5,00,000
పర్బణీ-మన్మాడ్28,00,000
తిరుపతి-కట్పది డబ్లింగ్10,00,000
సికింద్రాబాద్-కాజీపేట మూడో లైన్9,68,000
పర్బణి-పర్లి డబ్లింగ్1,00,000

కొత్త సర్వే పనుల మంజూరు(రూ.లలో)

సర్వే పనిఅంచనా వ్యయం2015-16 కేటాయింపు
పూర్ణ బైపాస్ లైన్1,17,0001,00,000
ఘన్‌పూర్-సూర్యాపేట25,50,0005,000
కొత్తగూడెం-కిరండోల్27,00,0006,000
దువ్వాడ-విజయవాడ3,35,00,00045,000

భారతీయ రైల్వేలు - విశేషాలు
జార్జ్ స్టీఫెన్‌సన్: బ్రిటన్‌కు చెందిన జార్జ్ స్టీఫెన్‌సన్(1781-1848) రైల్వే పితామహుడిగా ప్రసిద్ధి. ఎందుకంటే.. 1814లో ఎక్కువ వ్యాగన్లను లాగే సత్తా ఉన్న స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారు చేసింది ఆయనే. అంతకుముందు రిచర్డ్ ట్రెవిథిక్ అనే ఆయన తొలి ట్రామ్‌వే లోకోమోటివ్‌ను రూపొందించినా.. అది రోడ్డుపై నడిచే లోకోమోటివ్. తర్వాత మరికొంత మంది స్టీమ్ లోకోమోటివ్‌లను తయారుచేసినా.. స్టీఫెన్‌సన్ శక్తిమంతమైనదాన్ని తయారుచేశారు. పైగా.. ప్రపంచంలోనే తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును లాగింది జార్జ్ తయారుచేసిన ఇంజినే.

సెప్టెంబర్ 27, 1825.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడిచింది ఈ రోజునే. ఈ రెండు పట్టణాల మధ్య 12.9 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మించాలని స్టాక్‌టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వే యోచిస్తున్న విషయం తెలిసిన వెంటనే.. అప్పటివరకూ కిల్లింగ్‌వర్త్ కాలరీలో పనిచేస్తున్న జార్జ్ స్టీఫెన్‌సన్.. ఈ కంపెనీ అధినేత ఎడ్వర్డ్‌ను కలిశాడు. వాస్తవానికి ఈ రైల్వే లైనులో వ్యాగన్లను గుర్రాలతో లాగించాలని ఎడ్వర్డ్ భావించాడు. అయితే, వాటికి బదులుగా స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్‌ను ఉపయోగిస్తే.. అంతకు 50 రెట్లు బరువును అవి లాగగలవంటూ తన ప్రణాళికను వివరించాడు. దీంతో ఎడ్వర్డ్ ఈ రైల్వే లైను మొత్తం బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు. సెప్టెంబర్ 27న 450 మంది మనుషులు, కొన్ని వందల కిలోల సరుకుతో ఈ రైలు బయల్దేరింది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలింజన్‌ను నడిపింది స్టీఫెన్‌సనే.
 
ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి 1924లో మొదలైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నె ట్‌వర్క్‌లలో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
1,14,500 కిలోమీటర్ల రైలు పట్టాలు, 65 వేల కిలోమీటర్ల మార్గం, 8 వేలకు పైగా స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 12 వేల రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, 7 వేల రైళ్లు సరుకు రవాణా చేస్తున్నాయి.
ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఏడో స్థానంలో ఉంది. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు.
భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులు, మూడు ఇంజన్లతో ముందుకెళ్లింది. ఈ 34 కిలోమీటర్ల ప్రయాణానికి 75 నిమిషాలు పట్టింది.
దక్షిణ భారత దేశంలో తొలి రైలు 1856 జూలై 1న వేయ్‌సరాప్ది(మద్రాస్) నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు ప్రయాణించింది.
1873లో ఢిల్లీ నుంచి రేవారి మధ్య ప్రపంచంలోనే తొలి మీటర్‌గేజ్ సర్వీస్ ప్రారంభమైంది.
తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
1862లో మూడో తరగతిలో రెండు వరుసల(టూ టైర్) సీట్లు ప్రవేశపెట్టారు.
1871-74 మధ్య ప్రయాణికుల బోగీల్లో గ్యాస్ దీపాలు అమర్చారు.
1872లో ఒకటో తరగతి బోగీల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ప్రారంభించారు. 1936లో ఏసీ ప్రవేశపెట్టారు.
1874లో రైళ్లలో నాలుగో తరగతి కోచ్‌లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు.
రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905లో వాటిని ఏర్పాటుచేశారు.
ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు 1952 నుంచి తప్పనిసరి చేశారు.
1967లో స్లీపర్ క్లాస్ బోగీలు ప్రారంభించారు.
1974లో 3వ తరగతి బోగీలు తొలగించారు.
1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ఢిల్లీలో ప్రారంభమైంది.
చిన్న పేరున్న రైల్వేస్టేషన్: ఇబ్-ib (ఒడిశా)
పెద్ద పేరున్న రైల్వేస్టేషన్: శ్రీ వెంకటనరసింహరాజువారి పేట (తమిళనాడు)
అత్యధిక దూరం ప్రయాణించే రైలు: వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్లు).
అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)
అత్యధిక దూరం ప్రయాణించే రెండో రైలు: (జమ్మూతావి నుంచి కన్యాకుమారి వరకు 3,715 కి.మీ)
ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: కేరళ ఎక్స్‌ప్రెస్ (3,054 కి.మీ). ఇది త్రివేండ్రమ్ రాజధాని (వడోదర-కోట మధ్య 528 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు: త్రివేండ్రమ్ సెంట్రల్-గౌహతి ఎక్స్‌ప్రెస్. ప్రతిరోజూ ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
దేశం నలుమూలల చివరి రైల్వేస్టేషన్లు: ఉత్తరాన జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా. పశ్చిమాన గుజరాత్‌లోని భుజ్ సమీపంలో నలీయా. దక్షిణాన కన్యాకుమారి. తూర్పున తిన్సుకియా లైన్‌లోని లీడో.
ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద పడి మరణించిన వ్యక్తి విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబరు 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు.
ఇప్పటికీ రైలు సౌకర్యం లేని దేశాలున్నాయా?
జపాన్, చైనాల్లో విమానాలతో పోటీ పడుతూ బుల్లెట్ రైళ్లు దూసుకెళుతున్నాయి.. భారత్ వంటి దేశాల్లో లోపలా, బయటా కిక్కిరిసిన జనాలతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.. మరోవైపు ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో రైళ్లే లేవు. ప్రస్తుతం దాదాపు 25 దేశాల్లో అసలు రైళ్లే లేవు. మన పొరుగునే ఉన్న భూటాన్ నుంచి సైప్రస్, ఉత్తర తిమోర్, కువైట్, లిబియా, మకావూ, మాల్టా, నైగర్, ఓమన్, పపువా న్యూగినియా, ఖతార్, రువాండా, సాన్ మారినో, సోలోమన్ ఐలాండ్స్, సోమాలియా, టోంగా, ట్రినిడాడ్, యెమెన్, బహమాస్, బురుండి, బహ్రెయిన్ వంటి దేశాల్లో రైళ్లే లేవు. ఇక ప్రపంచంలోనే అతి తక్కువగా మొనాకోలో కేవలం 1.7 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. అలాగే లావోస్‌లో 3.5 కిలోమీటర్లు, నౌరూలో 3.9, లీచెన్‌స్టైన్‌లో 9.5, బ్రూనైలో 13, పరాగ్వేలో 38, సెయింట్ కిట్స్‌లో 58, మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 59 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 కిలోమీటర్ల కన్నా తక్కువగా రైలు మార్గాలున్న దేశాల సంఖ్య ఏకంగా 64 కావడం కొసమెరుపు.

రైల్వే ట్రాక్‌నూ ఎత్తాల్సిందే..
అంతటా రైలొస్తే గేట్లు వేస్తారు... ఇక్కడ మాత్రం పడవలొస్తే రైలు పట్టాలనే ఎత్తేస్తారు.. వెళ్లిపోయాక మళ్లీ దించేస్తారు.. ఆశ్చర్యపోతున్నారా? మన దేశ దక్షిణ దిశన చిట్టచివర ఉన్న రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంపై ఈ రైల్వే వంతెన ఉంది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జికి ఎటు చూసినా సముద్రం.. మధ్యలో మన రైలు.. కిటికీలోంచి చూద్దామన్నా గుండెలు గుభేలుమనడం ఖాయం. 1902లో రూ. 70 లక్షలతో 600 మందితో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యలో పాక్ జలసంధిపై రెండు వైపులా ఎత్తగలిగే 65.2 మీటర్ల పొడవున ‘కాంటిలివర్’ బ్రిడ్జినీ నిర్మించారు. ఎప్పుడో వందేళ్ల కింద 1914లో రైళ్లు నడవడం మొదలుపెట్టినా... ఇప్పటికీ వంతెన దృఢంగా ఉంది. 1964లో వచ్చిన భారీ తుపానును ఇది తట్టుకుని నిలవడం అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.

పొడవైన రైళ్లు ఎక్కడ ఉన్నాయి?
మన దేశంలో గూడ్స్ రైళ్లు 1.2 కిలోమీటర్ల వరకూ, ప్రయాణికుల రైళ్లు 600 మీటర్ల వరకూ ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలో బీహెచ్‌పీ సంస్థ ఏకంగా 682 వ్యాగన్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపింది. 8 ఇంజన్లను వాడిన ఈ రైలు ఏకంగా లక్ష టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది. దక్షిణాఫ్రికాలో 660 వ్యాగన్లతో 7.3 కి.మీ పొడవైన రైలును నడిపారు.. ఇది 16 ఇంజన్లతో 70 వేల టన్నుల సామగ్రిని మోసుకెళ్లింది. రష్యా కూడా 439 వ్యాగన్లతో 6.5 కిలోమీటర్ల పొడవైన రైలును నడిపింది. ఇక బెల్జియంలో 70 కోచ్‌లతో 1.8 కి.మీ. పొడవున్న ప్యాసింజర్ రైలును నడిపారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో 90 కోచ్‌లతో 1.2 కి.మీ. పొడవైన రైళ్లను నడుపుతారు.


ఎకానమీ Economy తెలంగాణకు భారీ మిగులు ఆదాయం

తెలంగాణకు భారీ మిగులు ఆదాయం

కేంద్ర పన్నుల వాటా లేకున్నా ఢోకా లేదు
కేంద్రం వాటా చేరితే 4 రెట్ల మిగులు
2020 నాటికి రూ.34,252 కోట్ల మిగులు ఆదాయం
14వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడి

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మిగులు ఆదాయానికి ఢోకా లేదు. రెవెన్యూ ఆదాయం... వ్యయాల ఆధారంగా అయిదేళ్ల తర్వాత తెలంగాణలో రూ. 34,252 కోట్ల మిగులు ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం లెక్కగట్టింది. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.15,003 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఏటేటా మిగులు ఆదాయం దాదాపు 20 శాతం చొప్పున పెరుగుతుందని లెక్కలేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా రాకున్నా తెలంగాణలో మిగులు ఆదాయమే ఉంటుందని.. రెవెన్యూ ఆదాయం సమృద్ధిగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదికలో రాష్ట్రాల వారీగా రాబోయే అయిదేళ్లకు సంబంధించిన రెవెన్యూ ఆదాయ, వ్యయాల వివరాలను పొందుపరిచింది. దీని ప్రకారం కేంద్రం ఇచ్చే పన్నుల వాటా లేకుండానే... తెలంగాణ రాష్ట్రానికి 2015-16 సంవత్సరంలో రూ. 818 కోట్ల మిగులు ఆదాయం ఉంటుంది. అయిదేళ్ల తర్వాత రూ. 8,902 కోట్లకు చేరుతుంది.

రూ. 3.9 లక్షల కోట్లకు పైగా ఆదాయం..
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పన్నులు... పన్నేతర రాబడుల ద్వారా రాబోయే అయిదేళ్లలో తెలంగాణకు రూ. 3,91,256 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.3,69,284 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం పన్నుల వాటాతో సంబంధం లేకుండా సొంతంగా రాష్ట్రంలో సమకూరే రాబడి.. ఖర్చుల వివరాలను అందులో పొందుపరిచింది.

అధిక మొత్తం వడ్డీలకే..
ఇదిలా ఉండగా, ఏళ్లకేళ్లుగా ఉన్న అప్పుల భారం తెలంగాణను వెంటాడుతోంది. గతంలో ఉన్న అప్పులకు చెల్లించే వడ్డీలకే ప్రభుత్వం ఏటా వేలాది కోట్లు కుమ్మరించక తప్పని పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7,057 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019-20 నాటికి ఈ వడ్డీల భారం రూ.12,869 కోట్లకు చేరనుంది. దీంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు భారీగానే ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.8,686 కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. 2019-20 నాటికి పెన్షన్ల భారం రూ.12,969 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

తెలంగాణ మిగులు ఆదాయం (రూ. కోట్లలో)
ఆర్థిక సంవత్సరంసొంత పన్నులతోకేంద్ర పన్నుల వాటా కలిపితే
2015-1681815,003
2016-172,18418,554
2017-183,93022,846
2018-196,13828,023
2019-208,90234,252

తెలంగాణ రెవెన్యూ ఆదాయ, వ్యయాలు(రూ.కోట్లలో)

ఆర్థిక సంవత్సరంఆదాయంవ్యయం
2015-1657,42656,607
2016-1766,34064,156
2017-1876,64172,711
2018-1988,54682,408
2019-201,02,30493,402


ఎకానమీ Economy వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 24 వరకు జరుగుతాయి. ఈ సంస్థ మానవాళి ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న డబ్ల్యూఈఎఫ్ గురించి తెలుసుకుందాం...

చరిత్ర: 
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను యూరప్ వ్యాపారవేత్తలు 1971లో ఏర్పాటు చేశారు. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సమావేశమై డబ్ల్యూఈఎఫ్‌కు శ్రీకారం చుట్టారు. 1987 వరకు దీన్ని యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత డబ్ల్యూఈఎఫ్‌గా మార్చారు. ఆర్థిక వ్యవస్థపై యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన ప్రొఫెసర్ క్లాజ్ స్క్వాబ్ రచించిన పుస్తకం ఈ సంస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. మొదట యూరప్‌కే పరిమితమైన డబ్ల్యూఈఎఫ్ అనంతరం అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది. ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్.

సభ్యులు: 
డబ్ల్యూఈఎఫ్‌లో 1000 మంది సభ్యులు ఉంటారు. ప్రపంచంలోని ప్రఖ్యాత వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు ఇందులో సభ్వత్వం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే నిధులతో డబ్ల్యూఈఎఫ్ కార్యకలాపాలు కొనసాగుతాయి. వీటిని ఫౌండేషన్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ప్రతిఏటా దాదాపు 6 ప్రాంతీయ సమావేశాలు వివిధ దేశాల్లో నిర్వహిస్తారు. ఏటా ఒక్కో దేశంలో వార్షిక సమావేశం ఏర్పాటు చేస్తారు.

లక్ష్యాలు: 
ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందించడం
సామాజిక, ఆర్థిక రంగాల్లో సమస్యలను పరిష్కరించడం
ప్రపంచ ఆర్థికాభివృద్ధికి, మానవ ప్రగతికి సూచనలు చేయడం
పర్యావరణ పరిరక్షణ
లింగ వివక్షను రూపుమాపడం
ఆర్థిక అసమానతలను అంతం చేయడం
ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం
మానవ హక్కులను కాపాడడం
ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, బాధితులకు బాసటగా నిలవడం
విద్యార్థులు, నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వర్క్‌షాప్‌ల నిర్వహణ
అవినీతిని నిర్మూలించి, పరిపాలనలో పారదర్శకతను పెంచడం
మరిన్ని సంగతులు 
ఏర్పాటు: 1971 జనవరి 
అధికార భాష: ఆంగ్లం 
మ కోలొనీ, స్విట్జర్లాండ్ 
వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్: క్లాజ్ స్క్వాబ్ 


ఎకానమీ Economy తెలంగాణలో 2012 నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు

తెలంగాణలో 2012 నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు

తెలంగాణలో 2012 నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు (రూ.కోట్లలో) 
ప్రాజెక్టు2012-132013-142014-15 *2014-15
ప్రాణహిత1,0507821,0511,790
దేవాదుల745462462214.10
ఎస్సారెస్పీ రెండో దశ75404022.50
ఎస్సారెస్పీ-116216016063.40
కల్వకుర్తి220122122119
నెట్టెంపాడు144888879
భీమా17525012583.50
కోయిల్‌సాగర్4540-25
ఆర్డీఎస్1962132.70
లెండి4545453
నిజాంసాగర్20018018069.50
సింగూరు3640408
అలీసాగర్, గుత్ప3012122
రాజీవ్ దుమ్ముగూడెం150828211
ఇందిరాసాగర్1507575.105
దుమ్ముగూడెం-టేల్‌పాండ్4097973
ఎల్లంపల్లి360450450237
శ్రీరాంసాగర్ వరద కాల్వ300475475200
కంతనపల్లి60808049.50
నాగార్జునసాగర్ ఆధునీకరణ590765743378.08
ఎస్‌ఎల్‌బీసీ--420323.25
చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్టు-10101
కడెం-22223
నీల్వాయి--3554.77
పెద్దవాగు--2013
పాలెంవాగు--251
సుద్దవాగు--102
సంగంబండ--2027.25
కొమురం భీమ్ ప్రాజెక్టు---25
ఘణపూర్---8.20

ప్రాణహితకు గత కేటాయింపులు 
ఏడాదికేటాయింపులు
2010-11700
2011-12608
2012-131,050
2013-14782
2014-151,051
2014-151,790


ఎకానమీ Economy బడ్జెట్ పదజాలం

బడ్జెట్ పదజాలం

బడ్జెట్ అంటే...
ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో క్లిష్టమైన పదాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని సులభతర రీతిలోకి మారిస్తే- నెలవారీ బడ్జెట్‌లో సామాన్యుడు వినియోగించే పదాలే ఇవి. ఇలాంటి కొన్ని ముఖ్య పదజాలం గురించి పరిశీలిద్దాం..

వార్షిక ఆర్థిక నివేదిక
సింపుల్‌గా చెప్పుకుంటే ఇదే బడ్జెట్. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది.

బడ్జెట్ ఫండ్స్ 
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్: ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్: ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.
రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.
క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

జీడీపీలో లోటు శాతం
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

ట్రెజరీ బిల్స్
ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

ప్రధాన ఆదాయమార్గాలివే..
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో పన్నులు కూడా ఒకటి. వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూళ్ళపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు.

ప్రత్యక్ష పన్నులు
ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయం, సంపాదనపై చెల్లించే పన్నులన్నీ ఈ ప్రత్యక్ష పన్నుల్లోకే వస్తాయి. ఉదాహరణకు ఆదాయపు పన్ను, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నీ ఇందులోకే వస్తాయి. వీటిలో కొన్ని ప్రధానమైన ప్రత్యక్ష పన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను
ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది. ప్రస్తుతం రూ. రెండు లక్షల ఇరవై వేల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్నులేదు. ఆపైన శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కార్పొరేట్ ట్యాక్స్
ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.

మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

లావాదేవీలపై పన్ను
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

వెల్త్ ట్యాక్స్(సంపద పన్ను)
ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ పై మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.
పరోక్ష పన్నులు
చేస్తున్న ఖర్చుల్లో మనకు తెలియకుండానే పన్నులు చెల్లించేస్తుంటాము. అందుకే వీటిని పరోక్ష పన్నులు అంటారు. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వంటివి పరోక్ష పన్నుల్లోకి వస్తాయి.

కస్టమ్స్ సుంకం
విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు చెల్లించాల్సిన పన్నుని కస్టమ్స్ సుంకాలుగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దిగుమతుల నుంచి దేశాన్ని కాపాడటానికి కూడా దీన్ని వినియోగిస్తారు.

ఎక్సైజ్ సుంకం
దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.
సర్వీస్ ట్యాక్సు
వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.
జీఎస్‌టీ
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా.
బడ్జెట్ రూపకల్పన
క్లుప్తంగా చెప్పుకోవాలంటే... రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్‌ల రూపకల్పన. రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది.

సెప్టెంబర్ చివర్లో..
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ చివర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్..
ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ..
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్ ట్యాపింగ్..
బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

సందర్శకులపై మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఫిబ్రవరి చివర్లో..
బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపై ఎంత జాగ్రత్తో..
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు.

అత్యవసర సమయాల్లో..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 28/29..
సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు.

ఏ నాణెం ఎక్కడ తయారయింది?
రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా? ‘మింట్’లో.. అని చెబుతారా? అది సరే.. ఎక్కడి మింట్‌లో తయారైంది అని అడిగితే చెప్పగలరా? మీకీ విషయం తెలుసా? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.
నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘డైమండ్’ గుర్తు ఉంటే.. అది ముంబై మింట్‌లో తయారైనట్లు లెక్క.
ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్‌కతా మింట్నాణెమే.
ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘చీలిన డైమండ్’ (స్ల్పిట్ డైమండ్) లేదా ‘చుక్క’ (డాట్) లేదా ‘స్టార్’ (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.
ముద్రణా సంవత్సరం కింద ‘గుండ్రని బిందువు’ (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.
ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్‌లలో తయారైనట్టు లెక్క.


జాతీయం National భారత రక్షణ వ్యవస్థ

భారత రక్షణ వ్యవస్థ

భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలు ఉన్నాయి. అవి.. సైనిక దళం, వైమానిక దళం, నావికా దళం. భారత రక్షణ దళాల అధిపతి (సుప్రీం కమాండర్) రాష్ర్టపతి. రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలో ఉన్నాయి.
త్రివిధ దళాల అధిపతులు
సైనిక దళాల అధిపతి - జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ 
నౌకాదళాల అధిపతి  - అడ్మిరల్ సునీల్ లాంబా
వాయుసేనాధిపతి - ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా

ప్రధాన దినోత్సవాలు
సైనిక దినోత్సవం- జనవరి 15
నౌకాదళ దినోత్సవం - డిసెంబర్ 4
వైమానిక దళ దినోత్సవం - అక్టోబర్ 8
రక్షణ దళాల పతాక దినోత్సవం - డిసెంబర్ 7

భారత సైనిక దళం
భారత సైనిక దళాన్ని ఏడు కమాండ్లుగా విభజించారు. వాటి ప్రధాన కార్యాలయాలు..
తూర్పు కమాండ్ - కోల్‌కతా
పశ్చిమ కమాండ్ - చండీమందిర్
ఉత్తర కమాండ్  - ఉద్దంపూర్
దక్షిణ కమాండ్   - పుణె
సెంట్రల్ కమాండ్  - లక్నో
నైరుతి కమాండ్ -జైపూర్ 
ట్రైనింగ్ కమాండ్ - సిమ్లా

ప్రధాన సైనిక శిక్షణ కేంద్రాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఖడక్ వాస్లా
ఇండియన్ మిలిటరీ అకాడమీ - డెహ్రాడూన్
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ -డెహ్రాడూన్ 
ఆర్మీవార్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ కంబాట్)  - మౌ (మధ్యప్రదేశ్)
ఇన్‌ఫాంట్రీ స్కూల్ - మౌ
మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -మౌ
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - చెన్నై
హై ఆప్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ -గుల్‌మార్గ్
ఆర్‌‌మడ్ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్ -అహ్మద్ నగర్ 
స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ  -దేవ్‌లాలి (మహారాష్ర్ట)
కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ -కిర్కే (మహారాష్ర్ట)
కౌంటర్ ఇన్‌సర్జన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ - వెరైంగ్టే (మిజోరాం
ఆర్మీ మెడికల్ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్ - లక్నో
కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ -జబల్‌పూర్ 
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ -సికింద్రాబాద్ 
రీ మౌంట్ అండ్ వెటర్నరీ కార్‌‌ప్స సెంటర్ అండ్ స్కూల్ - మీరట్ 
ఆర్మీ ఎడ్యుకేషన్ కార్‌‌ప్స ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ -పచ్‌మడి (మధ్యప్రదేశ్)
కార్‌‌ప్స ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్ -బెంగళూరు
ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్  -పుణె
ఆర్మీ ఎయిర్ బార్‌‌న ట్రైనింగ్ స్కూల్  -ఆగ్రా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్  -పుణె
ఆర్మీ కేడెట్ కాలేజ్  -డెహ్రాడూన్
ఆర్మీ క్లర్‌‌క ట్రైనింగ్ స్కూల్  -ఔరంగాబాద్ 
ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ -బెంగళూరు
ఆర్మీ, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ స్కూల్ -ఆగ్రా
మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో - పుణె
ఆర్‌‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ -పుణె
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ -న్యూఢిల్లీ 
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ -సికింద్రాబాద్ 
డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ - వెల్లింగ్‌టన్

 భారత నావికాదళం
 భారత నౌకాదళంలో నాలుగు కమాండ్‌లు ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు..
 తూర్పు కమాండ్ -విశాఖపట్నం
 పశ్చిమ కమాండ్ -ముంబై
 దక్షిణ కమాండ్ -కోచి
 అండమాన్, నికోబార్ కమాండ్ -పోర్ట్ బ్లెయిర్

 నౌకాదళ శిక్షణ  సంస్థలు
 ఇండియన్ నావల్ అకాడమీ -ఎజిమల (కేరళ)
 ఐఎన్‌ఎస్ అగ్రాని - కోయంబత్తూర్
 ఐఎన్‌ఎస్ చిల్కా - ఒడిశా
 ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య -కోచి
 ఐఎన్‌ఎస్ గరుడ -కోచి
 ఐఎన్‌ఎస్ హమ్ల -ముంబై
 ఐఎన్‌ఎస్ కుంజలి - ముంబై
 ఐఎన్‌ఎస్ మండోవి -గోవా
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ -గోవా
 ఐఎన్‌ఎస్ శివాజీ  -లోనావాలా
 షిప్‌రైట్ స్కూల్  -విశాఖపట్నం
 ఐఎన్‌ఎస్ వల్సురా  -జాంనగర్ 
 ఐఎన్‌ఎస్ వెందుర్తి   -కోచి
 ఐఎన్‌ఎస్ శాతవాహన  -విశాఖపట్నం
 అణు జలాంతర్గాములు
ఐఎన్‌ఎస్ చక్ర         - రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
ఐఎన్‌ఎస్ అరిహంత్  -స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి

ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు
ఐఎన్‌ఎస్ విరాట్ 
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య- దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. రష్యన్లు అడ్మిరల్ గోర్షకోవ్ పేరుతో పిలిచేవారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  2014, జూన్ 14న భారత నౌకాదళంలోకి లాంఛనంగా దీన్ని ప్రవేశపెట్టారు.

భారత వైమానిక దళం
భారత వైమానిక దళంలో ఐదు ఆపరేషన్ కమాండ్‌లు, రెండు ఫంక్షనల్ కమాండ్‌లు ఉన్నాయి.

ఆపరేషన్ కమాండ్‌లు
సెంట్రల్ ఎయిర్ కమాండ్   -అలహాబాద్ 
ఈస్టర్న్ ఎయిర్ కమాండ్     -షిల్లాంగ్ 
సదరన్ ఎయిర్ కమాండ్     -తిరువనంతపురం
సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ -గాంధీనగర్ 
వెస్టర్న్ ఎయిర్ కమాండ్  -న్యూఢిల్లీ

ఫంక్షనల్ కమాండ్‌లు
ట్రైనింగ్ కమాండ్    -బెంగళూరు
మెయింటెనెన్స్ కమాండ్    -నాగ్‌పూర్

వైమానిక దళ సంస్థలు
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ  -దుండిగల్ (హైదరాబాద్)
ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్   -కోయంబత్తూర్ 
పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్   -అలహాబాద్ 
స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్  -బెంగళూరు
ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ - జలహళ్లి (బెంగళూరు)
పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్    -ఆగ్రా
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్        -బెంగళూరు

క్షిపణి వ్యవస్థ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారుచేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. డీఆర్‌డీవో ప్రస్తుత డెరైక్టర్ జనరల్ క్రిస్టోఫర్. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్ రెడ్డి.

మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మోస్.. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. దీని పరిధి 290 కి.మీ. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్  వేగంతో ప్రయాణిస్తుంది.నిర్భయ్ అనే సబ్‌సోనిక్ క్షిపణి.. ధ్వని వేగం
(1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,000 కి.మీ.

యుద్ధాలు
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పాకిస్తాన్‌తో 1947, 1965, 1971, 1999లలో నాలుగుసార్లు యుద్ధాలు చేసింది. 1971లో పాకిస్తాన్‌ను ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది.

1962లో చైనాతో యుద్ధం చేసింది. 
 ఇతర రక్షక దళాలు: అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, రాష్ట్రీయ రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్‌‌డ్స, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.


జాతీయం National భారత రక్షణ వ్యవస్థ - అస్త్రశస్త్రాలు

భారత రక్షణ వ్యవస్థ - అస్త్రశస్త్రాలు

భారత రక్షణ వ్యవస్థలో సైనిక, వైమానిక, నావికా దళాలు (త్రివిధ దళాలు) కీలకంగా వ్యవహరిస్తాయి. రాష్ట్రపతి భారత రక్షణ దళాలకు అధిపతిగా (సుప్రీం కమాండర్) ఉంటారు. రక్షణ దళాల ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాలు కొనసాగుతున్నారు. ఏటా డిసెంబరు 7న రక్షణ దళాల ఫ్లాగ్ డేగా నిర్వహిస్తారు. భారత రక్షణ దళాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947, 1965, 1971, 1999ల్లో పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాయి. వీటితో పాటు భారత్ 1962 లో చైనాతో యుద్ధం చేసింది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో 13 లక్షలకు పైగా సైనికులు దేశ రక్షణలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. దేశ భద్రతలో త్రివిధ దళాలతో పాటు పారామిలిటరీ దళాలు సేవలు అందిస్తున్నాయి.
త్రివిధ దళాల అధిపతులు
సైనిక దళాలు: జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్
నౌకా దళం: అడ్మిరల్ ఆర్.కె.ధోవన్
వాయుసేన: ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా
పారామిలిటరీ దళాలు
అస్సాం రైఫిల్స్: ఇది అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం. 1835 నుంచి పనిచేస్తోంది. అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్: ఇది 1978లోప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీరరేఖను సంరక్షిస్తోంది.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎస్): ఇది 1962లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో ఉంది.
సైనిక శిక్షణ కేంద్రాలు
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ - న్యూఢిల్లీ
నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఖడక్ వస్లా
ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ - చెన్నై
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ - డెహ్రాడూన్
ఇన్‌ఫాంట్రీ స్కూల్ - మౌ (మధ్యప్రదేశ్)
కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ - ఖడ్కీ, మహరాష్ట్ర
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్- సికింద్రాబాద్
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ - పుణె
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ - పుణె
నౌకా దళ శిక్షణ కేంద్రాలు
కాలేజ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్ - ముంబై
ఇండియన్ నావల్ అకాడమీ - ఎజిమల
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ - గోవా
షిప్‌రైట్ స్కూల్ - విశాఖపట్నం
ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య - కోచి
ఐఎన్‌ఎస్ గరుడ - కోచి
ఐఎన్‌ఎస్ హమ్లా - ముంబై
ఐఎన్‌ఎస్ శాతవాహన - విశాఖపట్నం
ఐఎన్‌ఎస్ చిల్కా - ఒడిశా
ఐఎన్‌ఎస్ కుంజలి - ముంబై
వైమానికాదళ శిక్షణ కేంద్రాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ - బెంగళూరు
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ - దుండిగల్ (హైదరాబాద్)
ఎయిర్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ - కోయంబత్తూర్
పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ - అలహాబాద్.
ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్ - జలహళ్లి
పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్ - ఆగ్రా
సంయుక్త విన్యాసాలు
మలబార్: భారత్, అమెరికా, జపాన్ నౌకాదళాలు
యుద్ధ్ అభ్యాస్: భారత్, అమెరికాల సైన్యాలు.
ఇంద్ర: భారత్, రష్యా నౌకాదళాలు.
వరుణ: భారత్, ఫ్రాన్స్ నౌకాదళాలు.
గరుడ: భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు.
సూర్యకిరణ్: భారత్, నేపాల్, సైనిక దళాలు.
హ్యాండ్ ఇన్ హ్యాండ్: భారత్, చైనా సైనిక దళాలు.
సింబెక్స్: భారత్, సింగపూర్ నౌకాదళాలు.
అణు జలాంతర్గాములు
ఐఎన్‌ఎస్ చక్ర: రష్యా నుంచి 2012, ఏప్రిల్‌లో ఐఎన్‌ఎస్ చక్రను దిగుమతి చేసుకున్నారు. దీని రష్యన్ పేరు కే- 152 నెర్పా.
ఐఎన్‌ఎస్ అరిహంత్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 2009, జూలై 26న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ స్వదీశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణుజలాంతర్గామిగా ప్రసిద్ధికెక్కింది.
వైమానిక దళం: 
లక్ష్య: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసింది. ఇది పైలట్ రహిత టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్
తేజస్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం.
నిశాంత్: ఇది మానవ రహిత(అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) విమానం.
ధ్రువ్: హెచ్‌ఏఎల్ తయారుచేసిన హెలికాప్టర్. దీన్ని ఆధునికీకరించి రుద్ర అటాక్ హెలికాప్టర్‌ను తయారు చేశారు.
ఎంఐ 17- వీ5: ఈ హెలికాప్టర్లను రష్యా నుంచి కొనుగోలు చేశారు.
రఫాల్ ఫైటర్ జెట్స్: ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేయనున్న యుద్ధ విమానాలు.

అగ్ని-V: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-V. ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని బరువు 50 టన్నులు, పొడవు 17.5 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. అగ్ని-V 1500 కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. దీన్ని ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి 2012, ఏఫ్రిల్‌లోతొలిసారి ప్రయోగించారు. తర్వాత 2013, సెప్టెంబరు, 2015 జవవరిలలో ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించారు.

క్షిపణులు
క్షిపణిప్రయోగించే విధానంపరిధి (కి.మీ.)
పృథ్వీ-1ఉపరితలం నుంచి ఉపరితలం150
పృథ్వీ-2ఉపరితలం నుంచి ఉపరితలం250-350
పృథ్వీ -3ఉపరితలం నుంచి ఉపరితలం350-600
శౌర్యఉపరితలం నుంచి ఉపరితలం750-1900
అగ్ని-1ఉపరితలం నుంచి ఉపరితలం700
అగ్ని-2ఉపరితలం నుంచి ఉపరితలం2,000-3,000
అగ్ని-3ఉపరితలం నుంచి ఉపరితలం3,500
అగ్ని-4ఉపరితలం నుంచి ఉపరితలం4,000
అగ్ని-5ఉపరితలం నుంచి ఉపరితలం5,000-6,000
ఆకాశ్ఉపరితలం నుంచి గగనతలం30
త్రిశూల్ఉపరితలం నుంచి గగనతలం9
అస్త్రగగనతలం నుంచి గగనతలం80- 110
నాగ్యాంటీ ట్యాంక్ క్షిపణి4-5
ప్రహార్ఉపరితలం నుంచి ఉపరితలం150
ధనుష్ఉపరితలం నుంచి ఉపరితలం350
(పృథ్వీ క్షిపణికి నౌకాదళ వెర్షన్)



జాతీయం National రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) భారత్‌కు చెందిన విదేశీ గూఢచార ఏజెన్సీ. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉంది. 1968 సెప్టెంబర్ 21న దీన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుత ‘రా’ చీఫ్ రాజిందర్ ఖన్నా.
చరిత్ర
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్‌ఏడబ్ల్యూ-రా)... భారత విదేశీ గూఢాచార సంస్థ. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం, 1965లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం అనంతరం విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అప్పటి వరకూ విదేశీ, స్వదేశీ నిఘా వ్యవస్థను ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)పర్యవేక్షించే ది. 1968 సెప్టెంబర్‌లో ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ నుంచి వేరుగా విదేశీ నిఘా కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ పేరిట మరో సంస్థను ఏర్పాటుచేశారు. ‘రా’ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

విదేశాలపై నిఘా
‘రా’కు ప్రత్యకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పగించారు. ఇంటలిజెన్స్ బ్యూరో, ఇతర నిఘా సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంది. ‘రా’ కేంద్ర కేబినెట్‌లో భాగం. ఇది పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు చట్టం నుంచి దీనికి మినహాయింపు ఉంది. ‘రా’కు ఆర్క్(ఏఆర్‌సీ-ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్) వైమానిక నిఘా వ్యవస్థ కూడా ఉంది. వివిధ దేశాల నిఘా సంస్థలతోనూ ‘రా’కు సత్సంబంధాలు ఉంటాయి. ‘రా’ గూఢచారులు బహుళజాతి సంస్థలు, ఎంబసీలు, వివిధ ఆఫీసుల్లో పనిచేస్తూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు.

కార్యకలాపాలు
పొరుగు దేశాల రాజకీయ, రక్షణ అభివృద్ధి కార్యకలాపాలు ఏవైతే భారతదేశ రక్షణ, విదేశీ వ్యవహారాలను ప్రభావితం చేయగలవో వాటిపై నిఘా ఉంచుతుంది.
ఇతర దేశాల నుంచి దేశ భద్రతకు ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టడం రక్షణ దిగుమతులు తదితరాలపై కన్నేసి ఉంటుంది.

కౌంటర్ ఇంటెలిజెన్స్: శత్రుదేశాల నిఘా వర్గాలపై కూడా ‘రా’ నిఘా ఉంచుతుంది.


జాతీయం National జైపూర్ సాహిత్యోత్సవం (జేఎల్‌ఎఫ్)

జైపూర్ సాహిత్యోత్సవం (జేఎల్‌ఎఫ్)

జైపూర్ సాహిత్యోత్సవం (జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)ను ఏటా జనవరిలో జైపూర్‌లో నిర్వహిస్తారు. 2006లో ప్రారంభమైన జేఎల్‌ఎఫ్ ఆసియా ఖండంలో కెల్లా అతిపెద్ద సాహిత్య ఉత్సవం.
8వ జేఎల్‌ఎఫ్‌ను 2015 జనవరి 21 నుంచి 25 వరకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని డిగ్గీ ప్యాలెస్‌లో నిర్వహించారు. నమిత గోఖలే, విలియం డాల్‌రింపుల్ ఈ ఉత్సవానికి డెరైక్టర్లుగా వ్యవహరించారు. నోబెల్ సాహితీ బహుమతి గ్రహీత వి.ఎస్. నైపాల్, 2013 మ్యాన్ బుకర్ ప్రైజ్ గ్రహీత అయిన న్యూజిలాండ్ రచయిత్రి ఎలినార్ కాటన్‌తో పాటు భారత్‌కు చెందిన ప్రఖ్యాత రచయితలు కేదార్‌నాథ్ సింగ్, నీల్ ముఖర్జీ, అమీష్ త్రిపాఠీ, చేతన్ భగత్ తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2015 జనవరి 21న దీన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రారంభించారు. తొలిరోజున పులిట్జర్ బహుమతి గ్రహీత విజయ్ శేషాద్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అరవింద్ కృష్ణ మెహరోత్రా ప్రసంగించారు.
 
సర్ వి.ఎస్. నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఫర్ మిష్టర్ బిస్వాస్’ పుస్తకం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
కవిత్వం విభాగంలో అందజేసే కుష్వంత్ సింగ్ మెమోరియల్ ప్రైజ్‌ను అరుంధతి సుబ్రమణ్యం అనే రచయిత్రికి ప్రదానం చేశారు. ఈమె రచించిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు ఈ బహుమతి లభించింది.
నాలుగో రోజైన జనవరి 24న భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
జైపూర్ సాహితీ ఉత్సవంలో ప్రతిష్టాత్మక ‘డీఎస్‌సీ ప్రైజ్ ఫర్ సౌత్ ఏసియాన్ లిటరేచర్ 2015’ను భారత - అమెరికన్ రచయిత్రి ఝుంపా లాహిరికి ప్రకటించారు. ‘ద లో ల్యాండ్’ పుస్తకానికి గాను ఆమెకు ఈ బహుమతి లభించింది. ఈ అవార్డు కింద 50 వేల అమెరికన్ డాలర్ల నగదు అందజేస్తారు. ‘ద లో ల్యాండ్’ పుస్తకం 2013 మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు కూడా షార్‌‌ట లిస్ట్ అయ్యింది.
ఇప్పటివరకూ డీఎస్‌సీ దక్షిణాసియా సాహిత్య బహుమతిని ఐదుగురు వ్యక్తులకు అందజేశారు.
సం.రచయిత/ రచయిత్రిదేశంనవల పేరు
2011హెచ్.ఎం. నఖ్వీపాకిస్తాన్హోమ్‌బాయ్
2012షెహాన్ కరుణ తిలకశ్రీలంకచైనామ్యాన్
2013జీత్ థాయిల్భారత్నార్కోపోలీస్
2014సైరస్ మిస్త్రీభారత్క్రానికల్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్
2015ఝుంపా లాహిరిభారతీయ అమెరికన్ద లో ల్యాండ్



జాతీయం National బేటీ బచావో- బేటీ పఢావో

బేటీ బచావో- బేటీ పఢావో

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ‘బేటీ బచావో, బేటీ పఢావో (కుమార్తెను కాపాడండి, కుమార్తెను చదివించండి)’ అనే పథకాన్ని ప్రారంభించారు.
బాలబాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. భారతదేశంలో బాల బాలికల నిష్పత్తి 1000 : 919 ఉండగా, హర్యానాలో 1000 : 834 మాత్రమే ఉంది.

లింగ వివక్షత అంతం చేయడం, బాలికా సంక్షేమం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆడ శిశువులను తల్లి గర్భంలోనే చంపేసే విష సంస్కృతిని మానసిక వ్యాధిగా ప్రధాని పేర్కొన్నారు. భ్రూణహత్యలు, లింగవివక్షతకు వ్యతిరేకంగా సభికులతో ప్రధాని ప్రతిజ్ఞ చేయించారు. ఈ పథకాన్ని దేశంలో 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. వీటిలో 12 జిల్లాలు హర్యానాలోనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జె.పి. నద్దా; హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా రోజూ 2,000 ఆడశిశువుల భ్రూణహత్యలు జరుగుతున్నాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. హర్యానాలోని 70 గ్రామాల్లో గత కొన్నేళ్లుగా ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదన్నారు. ఈ పథకాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఈ పథకానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.

బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం కింద బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే సుకన్య సమృద్ధియోజనను కూడా ప్రధాని అదే వేదికపై ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఈ పథకం కింద బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కనీసం వేయి రూపాయల డిపాజిట్‌తో ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై ఏటా 9.1 శాతం వడ్డీతో పాటు, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా * 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాతే ఉన్నత చదువుల కోసం ఖాతాలోంచి సగం డబ్బును తీసుకోవచ్చు. బాల్య వివాహాలను అరికట్టే ఉద్దేశంతో 18 ఏళ్ల వరకు విత్‌డ్రాయల్‌ను అనుమతించరు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలిక వివాహమయ్యేంత వరకూ సుకన్య సమృద్ధి అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది.


జాతీయం National భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే..!

భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే..!

ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వస్తున్న సంగతి తెలిసిందే.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లవుతున్నా ఇంతవరకూ కేవలం ఆరుగురు అమెరికా అధ్యక్షులే భారత్‌ను సందర్శించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్వాతంత్య్రం తరువాత పాకిస్తాన్ అమెరికా కూటమిలో చేరడం, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం, ఇందిరాగాంధీ హయాంలో అణుపరీక్షలు జరపడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించాయి. క్రమంగా అమెరికాతో సంబంధాలు బలపడ్డాయి. 2008లో ఇరుదేశాల మధ్యకుదిరిన అణుఒప్పందం సంబంధాలను శిఖరాగ్రస్థాయికి చేర్చింది. ఆసియాలో చైనాను నిలువరించడంలో భాగంగా అమెరికా వ్యూహాత్మకంగా భారత్‌తో చెలిమికి ప్రాధాన్యం ఇస్తోంది. ఒబామా భారత్‌కు రానుండటం ఇది రెండోసారి కావడం విశేషం.


జాతీయం National 13వ ప్రవాసీ భారతీయ దివస్

13వ ప్రవాసీ భారతీయ దివస్

మహాత్మాగాంధీ వందేళ్ల కిందట 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2003 నుంచి ఏటా ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జనవరి 9వ తేదీని ‘ప్రవాసీ భారతీయ దివస్’గా ప్రకటించారు.

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశాల్లోని భారత సంతతి ప్రజలు మనదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడాన్ని ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో గుర్తు చేసుకుంటారు. దీంట్లో భాగంగా భారత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులనిచ్చి సత్కరిస్తారు. ఇప్పటివరకు 13 ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులు నిర్వహించారు.

పదమూడో ప్రవాసీ భారతీయ దివస్
I. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో 13వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు వేల మంది ఎన్‌ఆర్‌ఐలు, విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజలు హాజరయ్యారు. భారత సంతతికి చెందిన గయానా అధ్యక్షుడు డోనాల్డ్ రవీంద్రనాథ్ రామోతర్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గయానా దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం.
II. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తొలి రోజు (జనవరి 7న) యువ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను ప్రారంభించారు. ‘భారత్ కో జానో, భారత్ కో మానో’ అనే నినాదంతో యువ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. యువ ప్రవాసీ భారతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్; యువజన, క్రీడామంత్రి సర్బానంద సొనొవాల్; విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్; బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ ప్రసంగించారు.
III. భారత ప్రధాని నరేంద్ర మోదీ 13వ ప్రవాసీ భారతీయ దివస్‌ను గాంధీనగర్‌లోని ‘మహాత్మా మందిర్’లో జనవరి 8న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ స్మారక నాణేలను ఆవిష్కరించారు. రూ. 10, రూ. 100 స్మారక నాణేలను, రూ. 5, రూ. 25 విలువైన స్టాంపులను ప్రధాని ఆవిష్కరించారు. ప్రవాస భారతీయులు మన దేశానికి విలువైన పెట్టుబడి అని, భారతదేశాభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడాన్ని మోదీ ప్రస్తావించారు. తన ప్రతిపాదనకు ఐరాసలోని 193 దేశాల్లో 177 దేశాలు మద్దతివ్వగా.. అందులో 40 ఇస్లామిక్ దేశాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన ఆమోదంతో ప్రపంచానికి భారత్‌పై ఉన్న ప్రేమ తెలుస్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గంగా ప్రక్షాళన అత్యంత ముఖ్యమైన అంశమని, దీంట్లో ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్‌‌కలోని మేడిసన్ స్క్వేర్‌లో చెప్పిన ప్రకారం.. భారత సంతతి ప్రజలు (పీఐఓ), విదేశాల్లోని భారత పౌరులు (ఓసీఐ) ఈ రెండు వర్గాలను విలీనం చేస్తూ ఆర్డినెన్‌‌స జారీ చేశామని చెప్పారు. దీనివల్ల వీరికి జీవితకాల వీసా లభిస్తుంది.
IV. మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో రూపొందించిన ప్రదర్శనశాల ‘దండి కుటీర్’ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ చేపట్టిన దండి సత్యాగ్రహానికి గుర్తుగా 41 మీటర్ల ఎత్తయిన ఉప్పు గుట్టను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో గాంధీ జీవిత ఘట్టాలను శిల్పరూపంలో ప్రదర్శించారు. ప్రవాస భారతీయులు భారత దేశం గురించి మరింతగా తెలుసుకునేందుకు ఏటా ‘భారత్ కో జానో’ పేరుతో క్విజ్ పోటీని నిర్వహించుకోవాలని సూచించారు.
V. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ‘భారత్‌లో అవకాశాలు’ అనే సదస్సులో ప్రసంగించారు.
VI. ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలు జనవరి 9న ముగిశాయి. చివరి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రుల సదస్సులో ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రవాస భారతీయులను విజ్ఞప్తి చేశారు.
VII. 13వ ప్రవాసీ భారతీయ దివస్ ముగింపు సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 15 మందికి ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేశారు. దీనికి సత్యనాదెళ్ల హాజరు కాలేదు.
  1. డోనాల్డ్ రవీంద్రనాథ్ రామోతర్ - గయానా దేశాధ్యక్షుడు.
  2. మాలా మెహతా - ఆస్ట్రేలియాలో హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
  3. సంజయ్ రాజారాం - భారత్‌లో జన్మించిన మెక్సికన్ వ్యవసాయ శాస్త్రవేత్త. 2014 ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత.
  4. కన్వల్‌జిత్‌సింగ్ భక్షి - న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడు.
  5. ఎస్సోప్ గులామ్ పహాద్ - దక్షిణాఫ్రికా రాజకీయ నాయకుడు.
  6. మహేంద్ర నాంజీ మెహతా - ఉగాండాలో వ్యాపారవేత్త.
  7. నాథ్ రాం పూరీ - యూకే.
  8. లార్‌‌డ రాజ్ లుంబా - యూకేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు.
  9. కమలేష్ లుల్లా - అమెరికాలో విఖ్యాత రోదసీ శాస్త్రవేత్త.
  10. నందినీ టండన్ - అమెరికా.
  11. రాజ్‌మల్ పరఖ్ - ఒమన్.
  12. దురైకన్ను కరుణాకరన్ - సెషెల్స్.
  13. షా భరత్ కుమార్ జయంతీలాల్-యూఏఈ.
  14. అష్రాఫ్ పాలార్ కున్నుమల్ - యూఏఈ
  15. సత్యనాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈవో, యూఎస్‌ఏ.
VIII. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రెండున్నర కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 25 లక్షల మంది నివసిస్తున్నారు.
IX. ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న దేశాలు.. అమెరికా, మలేషియా, కెనడా, ట్రినిడార్ అండ్ టొబాగో, గయానా, యునెటైడ్ కింగ్‌డమ్, ఫ్రాన్‌‌స, సురినామ్, నెదర్లాండ్‌‌స, కువైట్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రేన్, ఖతర్, ఒమన్, యెమెన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఫిజీ, దక్షిణాఫ్రికా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.
ఇప్పటి వరకు ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలు జరిపిన సంవత్సరం, ప్రదేశాల వివరాలు..
క్ర.సం.సంవత్సరంప్రదేశం
1.2003న్యూఢిల్లీ
2.2004న్యూఢిల్లీ
3.2005ముంబై
4.2006హైదరాబాద్
5.2007న్యూఢిల్లీ
6.2008న్యూఢిల్లీ
7.2009చెన్నై
8.2010న్యూఢిల్లీ
9.2011న్యూఢిల్లీ
10.2012జైపూర్(రాజస్థాన్)
11.2013కొచ్చి (కేరళ)
12.2014న్యూఢిల్లీ
13.2015గాంధీనగర్(గుజరాత్)



జాతీయం National ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ముంబయిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ‘మానవ అభివృద్ధి కోసం సైన్‌‌స, టెక్నాలజీ’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.ముంబయినగరంలో సైన్‌‌స కాంగ్రెస్‌ను 45 ఏళ్ల తర్వాత నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వ విద్యాలయాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించనున్నట్లు ప్రధాని తెలిపారు. పాఠశాలలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కుగా ఉండాలని, విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని మరింత పెరిగేలా చేయాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో వ్యాపార వాణిజ్యాలతో పాటు పరిశోధనలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు. కార్పొరేట్లు సామాజిక బాధ్యతలో భాగంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏటా జనవరిలో నిర్వహిస్తారు. గత 102 ఏళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. తొలి సైన్స్ కాంగ్రెస్‌ను 1914 జనవరిలో కోల్‌కతాలో నిర్వహించారు. 2013 జనవరిలో వందో సమావేశాన్ని కూడా కోల్‌కతా నగరంలోనే నిర్వహించారు. 101వ సైన్స్ కాంగ్రెస్ 2014లో జమ్ములో జరిగింది.

102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముంబయిలోని ముంబయి యూనివర్సిటీలో 2015 జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించారు. సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని ప్రసంగిస్తూ.. దేశ పురోగతి, మానవాభివృద్ధి శాస్త్ర, సాంకేతిక రంగంతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనాను ఉదహరిస్తూ.. ప్రపంచంలోనే చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండో స్థానాన్ని ఆక్రమించడం సమాంతరంగా జరిగాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని శాస్త్రవేత్తలను కొనియాడారు. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపైకి మంగళయాన్ ఉపగ్రహాన్ని పంపడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హుద్‌హుద్ తుపాను సమయంలో కచ్చితమైన ముందుస్తు హెచ్చరికలతో వేలాది మంది జీవితాలను కాపాడగలిగామన్నారు. జాతీయ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి కీలక పాత్ర కల్పించిన వ్యక్తి దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ప్రశంసించారు.
భారత ప్రధాని వివిధ దేశాల నుంచి వచ్చిన నోబెల్ బహుమతి గ్రహీతలను సత్కరించారు. వీరిలో 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ విజేత అడా యోనాథ్ (ఇజ్రాయెల్), 2013లో వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్న ర్యాండీ షెక్‌మన్ (అమెరికా), 2001లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత కర్‌‌ట వత్‌రిచ్ (స్విట్జర్లాండ్), 2006లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్ (బంగ్లాదేశ్), 2001లో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకున్న పౌల్ నర్‌‌స (ఇంగ్లండ్), 2005లో వైద్య శాస్త్రంలో నోబెల్ విజేత రాబెన్ వారెన్ (ఆస్ట్రేలియా) తదితరులున్నారు. 2014 ఫీల్డ్స్ మెడల్ విజేత మంజుల్ భార్గవను కూడా సన్మానించారు. గణిత శాస్త్రంలో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి ఫీల్డ్స్ మెడల్ అందజేస్తారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ముంబయిలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్‌లోని ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ మైదానంలో ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. 102వ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్‌లో భాగంగా దీన్ని నిర్వహించారు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధిలో సాధించిన కీలక విజయాలను ప్రదర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వాటి విజయాలను ప్రదర్శించాయి. ఇస్రో రాకెట్లు, ఉపగ్రహ ట్రాన్‌‌సపాండర్లు, మంగళయాన్ నమూనాలను ప్రదర్శించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్‌‌చ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఎర్‌‌త సెన్సైస్ కూడా పాల్గొన్నాయి. ఓఎన్‌జీసీ సంస్థ అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానాలను ప్రదర్శించింది. మొత్తం 250కి పైగా అగ్రశ్రేణి సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇదే ప్రాంగణంలో భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసింది.
102వ సైన్స్ కాంగ్రెస్ రెండో రోజైన జనవరి 4న ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవసారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. భారతదేశ సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈ దిశగా మనం మరింత కృషి చేయాలి’ అని పేర్కొన్నారు.
‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై పైలట్ శిక్షణ కేంద్రం మాజీ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఆనంద్ జె. బోడాస్ మాట్లాడారు.
భారత సైన్స్ కాంగ్రెస్‌ను పురస్కరించుకొని ముంబయిలో బాలల సైన్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని జనవరి 4న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఇది 22వ బాలల సైన్స్ కాంగ్రెస్. వ్యాధులపై పోరు కోసం జన్యు ఇంజినీరింగ్ లాంటి పరిజ్ఞానం అవసరమని అబ్దుల్ కలాం పేర్కొన్నారు. ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి కూడా బాలలసైన్స్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని పిలుపునిచ్చారు.
భారత సైన్స్ కాంగ్రెస్ మూడో రోజైన జనవరి 5న ‘అణుశక్తి - వర్తమానం - భవిష్యత్తు’ అంశంపై సదస్సు జరిగింది. దీనికి ప్రముఖ అణుశాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు అణువిద్యుత్ ఆవశ్యకతను వివరించారు. అణు విద్యుత్ విషయంలో పరిశోధన ఫలితాలను ప్రపంచ దేశాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, ఇవి ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కాబట్టి అణు విద్యుత్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో బాబా అణు పరిశోధన కేంద్రం డెరైక్టర్ శేఖర్ బసు వైద్యం, వ్యవసాయం లాంటి అంశాల్లో అణు ఇంధన వినియోగంపై మాట్లాడారు.
‘ఆరోగ్యం, అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన మరో సదస్సులో నిపుణులు దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతులే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడగలరని పేర్కొన్నారు.
‘గిరిజనుల ఆరోగ్య సమస్యలు’ అనే మరో అంశంపై జరిగిన సదస్సులో ప్రముఖ సామాజిక కార్యకర్త అభయ్ బంగ్ పాల్గొన్నారు. గిరిజనులకు సరైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం లేదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
‘జన్యుమార్పిడి పంటలు - వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై మరో సదస్సు జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం జన్యు మార్పిడి పంటలను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
భారత సైన్స్ కాంగ్రెస్ నాలుగో రోజైన జనవరి 6న మారుతున్న వాతావరణ పరిస్థితులపై చర్చ జరిగింది. అభివృద్ధి, ప్రకృతి మధ్య సమతౌల్యం సాధించాల్సిన బాధ్యత సైన్‌‌సపై ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, సునామీలను నియంత్రించలేకపోయినా.. వాటివల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
ముంబయిలోని కలీనా క్యాంపస్‌లో ఐదురోజులపాటు జరిగిన 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌కు 12,000లకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి వివిధ దేశాల నుంచి సాంకేతిక నిపుణులు, రీసెర్‌‌చ విద్యార్థులు హాజరయ్యారు. ముంబయికి దేశ ఆర్థిక రాజధానిగానే కాకుండా సైన్స్ సిటీగానూ గుర్తింపు తేవాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహించారు. ముంబయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్‌‌క), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా మెమోరియల్ సెంటర్ లాంటి సంస్థలున్నాయి. ఇవన్నీ భారత సైన్‌‌స కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పాలుపంచుకున్నాయి.
ఈ సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయం, అడవులు, పశువైద్య శాస్త్రం, ఆంథ్రోపాలజీ, రసాయన శాస్త్రం, ఇంజినీరింగ్, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, గణితం, వైద్యం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటివాటిపై చర్చలు జరిగాయి.
రెండు రోజులపాటు మహిళా సైన్స్ కాంగ్రెస్‌ను కూడా నిర్వహించారు. జనవరి 7న 102వ భారత సైన్స్ కాంగ్రెస్ ముగింపు ఉత్సవం జరిగింది.


జాతీయం National ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ దేశాలు పర్యటించారు.
బ్రిక్స్, ఐరాస సర్వసభ్య సమావేశం తదితర కీలక సదస్సుల్లో పాల్గొన్నారు. పలు దేశాలతో ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం పోటీ పరీక్షల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రధాని పర్యటనలకు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా అందజేస్తున్నాం...

భూటాన్:
నరేంద్రమోడీ 2014 మే 26న భారత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిపిన తొలి అధికారిక విదేశీ పర్యటన భూటాన్. ఆయన జూన్ 15, 16 తేదీల్లో భారత పొరుగు దేశమైన భూటాన్‌లో పర్యటించారు. ప్రధానితోపాటు విదేశీ వ్యవ హారాల మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ కూడా భూటాన్ పర్యటించారు. నరేంద్రమోడీ తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రపంచానికి తెలియజేయడం. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత ప్రధానికి పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భారత్ సహాయంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని భూటాన్ రాజధాని థింపూలో నరేంద్రమోడీ ప్రారంభించారు. జూన్ 16న భూటాన్ పార్లమెంటు ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, భూటాన్ ఉమ్మడి ప్రాజెక్టు అయిన 600 మెగావాట్ల కోలోంగ్చూ జల విద్యుత్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేశారు.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గ్వెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ టోబ్గేతో భారత ప్రధాని సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భూటాన్‌లో డిజిటల్ గ్రంథాలయాన్ని నెలకొల్పడానికి అవసరమైన సహాయం భారత్ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నరేంద్ర మోడీ బీ2బీగా అభివర్ణించారు. బీ2బీ అంటే భారత్ టు భూటాన్ సంబంధాలు.

బ్రెజిల్:
జూలై 15, 16 తేదీల్లో బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో బ్రిక్స్ కూటమి ఆరో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇది నరేంద్రమోడీకి రెండో విదేశీ పర్యటన, తొలి అంతర్జాతీయ సదస్సు. బ్రిక్స్ సదస్సులో నరేంద్రమోడీతోపాటు బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా పాల్గొన్నారు. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పనున్నారు. ఈ బ్యాంకు తొలి అధ్యక్షుడు భారతీయుడై ఉంటాడు. పదవీకాలం ఆరేళ్లు. భారత్ తర్వాత అధ్యక్ష పదవి బ్రెజిల్, రష్యా దేశాలకు వరుసగా దక్కుతాయి. బ్యాంకు బోర్‌‌డ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు లభించింది.

బ్రిక్స్ దేశాల నాయకులు బ్యాంకుతో పాటు అత్యవసర నిల్వల వ్యవస్థ (కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్)ను 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ధ్రవ్యనిధుల్లో తక్షణ సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో విడిగా 80 నిమిషాలపాటు సమావేశమయ్యారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు. భారతదేశంలో మౌలికరంగంలో చైనా పెట్టుబడుల్ని భారత ప్రధాని ఆహ్వానించారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని మోడీ కోరారు. నవంబర్‌లో చైనాలో నిర్వహించనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సుకు హాజరు కావాలని జీ జిన్‌పింగ్ మోడీని ఆహ్వానించారు. భారత్‌కు అపెక్‌లో సభ్యత్వం లేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని చైనా అధ్యక్షుడు కోరారు. భారతదేశానికి ఈ సంస్థలో పరిశీలక హోదా మాత్రమే ఉన్పప్పటికీ అదనపు బాధ్యతలు స్వీకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

ఫోర్తలేజాలో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం భారత ప్రధాని బ్రెజిల్ రాజధాని బ్రెజీలియా చేరుకున్నారు. అక్కడ బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్‌తో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు, ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను బ్రెజిల్ అధ్యక్షురాలిని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. భారత్, బ్రెజిల్ దేశాల మధ్య పర్యావరణ, అంతరిక్ష రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.

నేపాల్:
పధాని నరేంద్రమోడీ ఆగస్టు 3, 4 తేదీల్లో నేపాల్‌లో పర్యటించారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నేపాల్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. 1997లో అప్పటి ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ నేపాల్‌లో పర్యటించారు. తన పర్యటనలో మోడీ నేపాల్ అధ్యక్షుడు రాంబరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. నేపాల్ పార్లమెంట్ రాజ్యాంగ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నేపాల్‌కు మనదేశం బిలియన్ డాలర్ల రుణసాయాన్ని అందజేస్తుందని ప్రకటించారు. నేపాల్‌లో భారత్ సహాయంతో నిర్మించ తలపెట్టిన పంచేశ్వర్ ప్రాజెక్టుకు పూర్తి సహాయ, సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నేపాల్ అభివృద్ధి కోసం మోడీ ‘హిట్ (ఏఐఖీ) ఫార్ములా’ను ప్రకటించారు. హిట్ అంటే హైవేస్, ఇన్ఫర్మేషన్ వేస్, ట్రాన్‌‌సమిషన్ వేస్. ఈ మూడింటి అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని పశుపతినాథ ఆలయాన్ని మోడీ సందర్శించి పూజలు నిర్వహించారు.

జపాన్:
2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య ఐదురోజులపాటు భారత ప్రధాని జపాన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. క్యోటో నగరం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యోటోలా వారణాసిని వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. క్యోటోలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రక టించింది. వీటిని మౌలిక వసతులు స్మార్‌‌టసిటీలు, గంగానది ప్రక్షాళన తదితరాల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్లను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని జపాన్ అందిస్తుంది. దీంట్లో భాగంగా మొదటి బుల్లెట్ రైలును అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రవేశపెడ్తారు. రక్షణ, పరిశుభ్రమైన ఇంధనశక్తి, రహదారులు, ఆరోగ్యం, మహిళా సంక్షేమం.. మొత్తం ఐదు ఒప్పందాలపై జపాన్, భారత్ సంతకాలు చేశాయి.

1998లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత జపాన్ ఆరు సంస్థలపై నిషేధాన్ని విధించింది. మోడీ పర్యటన సందర్భంగా ఈ నిషేధాన్ని తొలగించారు. ఈ సంస్థల్లో హిందూ స్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) కూడా ఉంది. భారత్, జపాన్ మధ్య పౌర, అణు, సహకార ఒప్పందంపై చర్చలను వేగవంతం చేసి త్వరలో అణు ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

అమెరికా:
భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబరు 26 నుంచి 30 వరకు అయిదు రోజులపాటు అమెరికాలో పర్యటించారు. సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చారు. మధ్య ఆసియాలో చెలరేగిపోతున్న ఉగ్రవాద సంస్థలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని మోడీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి వచ్చే ఏడాదికి 70 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, చైనా దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. ప్రపంచంలో వివిధ కూటములు ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. జీ-8, జీ-20 కూటములుగా కాకుండా జీ- ఆల్‌గా అన్నిదేశాలు కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. ఐరాస సర్వసభ్య సమావేశంలోనే ఆయన విడిగా సార్‌‌క దేశాధినేతలతో సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 28న న్యూయార్‌‌కలోని మ్యాడి సన్ స్క్వేర్ గార్డెన్‌లో సమావేశమైన 20,000 మందికి పైగా ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్రమోడీ ప్రసంగించారు. భారత సంతతి వ్యక్తులకు (పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) జీవితకాల వీసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌యోజన, మేక్ ఇన్ ఇండియా కార్య క్రమాల గురించి వారికి వివరించారు. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సహకారాన్ని అందించాలని ప్రవాస భారతీయులు కోరారు. అంగారకయానం విజయవంతం కావడాన్ని ప్రస్తావించారు.

సెప్టెబర్ 30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతల ద్వైపాక్షిక సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. అణుఒప్పందం అమలులో ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంస్థలకు అందుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సహాయాలను నిలిపివేసే దిశగా కృషి చేయాలని సంకల్పించారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. బరాక్ ఒబామా, నరేంద్రమోడీ ‘చలే సాథ్ సాథ్’ అనే దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు.

మయన్మార్:
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11-20 తేదీల మధ్య మూడు దేశాల్లో పది రోజులపాటు పర్యటించారు. 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలుసుకున్నారు. మొదటగా మయన్మార్ (బర్మా) వెళ్లారు. ఆ దేశ రాజధాని నేపిటాలో అధ్యక్షుడు థీన్‌సేన్‌తో సమావేశమయ్యారు. నవంబర్ 12న నేపిటాలో జరిగిన 12వ ఆసియాన్-భారత్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఇందులో ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యులైన పది దేశాల నేతలు పాల్గొన్నారు. బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్‌‌స దేశాలకు ఆసియాన్‌లో సభ్యత్వం ఉంది. ఈ సదస్సులో మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో భారత్‌కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవిగా మోదీ స్పష్టం చేశారు. 2015 చివరికల్లా ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నాయకులు లక్ష్యంగా నిర్ణయించారు.
నవంబర్ 13న నేపిటాలో నిర్వహించిన తొమ్మిదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా తూర్పు ఆసియా సదస్సు చేసిన ప్రకటనను మోదీ సమర్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సులో పది ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా (మొత్తం 18) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్ సూకీతో కూడా భారత ప్రధాని సమావేశమయ్యారు.

ఆస్ట్రేలియా:
మయన్మార్ నుంచి నరేంద్రమోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందుగా ఆయన బ్రిస్బేన్‌లో నిర్వహించిన జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు నవంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. జీ-20 సదస్సు అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కాన్‌బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించారు. సిడ్నీలోని ఆల్ఫోన్‌‌స ఎరినాలో 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నవంబర్ 17న మాట్లాడారు. ఈ సందర్భంగా జన్‌ధన్ యోజన పథకం గురించి వివరించారు. కేవలం పది వారాల్లోనే ఏడు కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. నవంబర్ 18న మెల్‌బోర్‌‌న నగరానికి వెళ్లారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న మెల్‌బోర్‌‌న క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందులో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్.లక్ష్మణ్, అలన్ బోర్డర్ పాల్గొన్నారు.

ఫిజీ:
మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దేశాన్ని సందర్శించారు. 33 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఫిజీలో పర్యటించడం ఇదే ప్రథమం. 1981లో ఫిజీలో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామాతో సమావేశమయ్యారు. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమకు భారత్ 75 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందిస్తుందని ప్రకటించారు.

నేపాల్‌లో సార్క్ సదస్సు:
2014 నవంబర్ 25న 18వ సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. సార్‌‌క సదస్సు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. సార్‌‌కలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఖాట్మండు సదస్సు సందర్భంగా మోదీ పాకిస్థాన్ మినహా మిగతా దేశాల నాయకులతో విడిగా చర్చలు జరిపారు.


జాతీయం National నలందా యూనివర్సిటీ పునఃప్రారంభం

నలందా యూనివర్సిటీ పునఃప్రారంభం

ప్రపంచంలోనే మొదటగా వెలిసిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం బీహార్‌లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన రాజ్‌గిర్‌లో పునఃప్రారంభమైంది. దాదాపు 821 సంవత్సరాల తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రాంగణంలో సెప్టెంబర్ 1న తరగతులు మొదలయ్యాయి. ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ 2014, సెప్టెంబర్ 19న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి, వర్సిటీ వైస్ చాన్సలర్ గోప సభర్వాల్, ఫ్యాకల్టీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నలందా విశ్వవిద్యాలయ వివరాలను పరిశీలిస్తే..

15 మందితో ప్రారంభం:
నలందా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దాదాపు 40 దేశాలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తొలి విడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15 మంది విద్యార్థులతో ప్రారంభించారు.

గుప్తుల కాలంలో:
ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల్ని ఆకర్షించిన నలందా విశ్వవిదాల్యయం ఐదో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైంది. ఇందులో 10 వేల మంది విద్యార్థులు, 1500 మంది అధ్యాపకులు ఉండేవారు. ఇక్కడ తొమ్మిది అంతస్తుల గ్రంథాయం కూడా ఉండేది. క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇది శిధిలావస్థలో ఉంది.

కలాం చొరవ:
నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. ఆ తర్వాత 2010 ఆగస్టులో నలందా యూనివర్సిటీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అదే సంవతర్సం సెప్టెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదించడంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. అదే ఏడాది నవంబర్ 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ మొదటి చాన్సలర్‌గా నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, వైస్‌చాన్సలర్‌గా గోప సభర్వాల్ 2011 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.

455 ఎకరాల భూమి:
నలందా విశ్వవిద్యాలయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం 455 ఎకరాల భూమిని కేటాయించింది. జపాన్, సింగపూర్ దేశాలు 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. 2010లో చైనా మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,727 కోట్లు కేటాయించింది. 2020 నాటికి వర్సిటీకి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి రానుంది.


జాతీయం National ప్రవాసీ భారతీయ దివస్

ప్రవాసీ భారతీయ దివస్

1915, జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. భారతదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటారు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) వంటివి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
 
  • ఎల్‌ఎం సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం జరిపి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏటా జనవరి 9ను ప్రవాసీ భారతీయ దివస్‌గా జరపాలని నిర్ణయించారు. దివస్ సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వ్యక్తులను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులతో సత్కరిస్తారు.
తొలి ప్రవాసీ భారతీయ దివస్:
మొదటి ప్రవాసీ భారతీయ దివస్‌ను 2003, జనవరి 9న న్యూఢిల్లీలో నిర్వహించారు. 12వ ప్రవాసీ భారతీయ దివస్ 2014, జనవరి 7-9 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. సదస్సుకు 51 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా మలేషియా సహజ వనరులు, పర్యావరణ మంత్రి దాతుక్‌సెరీ జి.పళనివేల్ హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరి వివరాలు..
ఇలా గాంధీ (మహాత్మా గాంధీ ముని మనుమరాలు, దక్షిణాఫ్రికా)
లీసా మారియా సింగ్ (ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనేటర్)
కురియన్ వర్గీస్ (బహ్రెయిన్)
రేణు ఖతోర్ (అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్)
వాసుదేవ్ చంచ్‌లానీ (కెనడా)
బికాస్ చంద్ర సన్యాల్ (ఫ్రాన్స్)
సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్ (నెదర్లాండ్స్)
శిశీంద్రన్ ముత్తువేల్ (పపువా న్యూగినియా)
శిహాబుద్దీన్ వావాకుంజు (సౌదీ అరేబియా)
షంషీర్ వాయలిల్ పరంబత్ (యూఏఈ)
శైలేష్ లక్మన్ వర (బ్రిటన్)
పార్థసారథి చిరామెల్ పిళ్లై (యూఎస్‌ఏ)
రామకృష్ణ మిషన్ (ఫిజీ)
  • 2015 జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌ను గుజరాత్‌లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహిస్తారు. గాంధీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు అయిన సందర్భంగా గుజరాత్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పవాసీ భారతీయ దివస్- వివరాలు
సదస్సుసంవత్సరంనగరం
12003న్యూఢిల్లీ
22004న్యూఢిల్లీ
32005ముంబై
42006హైదరాబాద్
52007న్యూఢిల్లీ
62008న్యూఢిల్లీ
72009చెన్నై
82010న్యూఢిల్లీ
92011న్యూఢిల్లీ
102012జైపూర్
112013కోచి
122014న్యూఢిల్లీ
132015గాంధీనగర్