AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

జాతీయం National ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ దేశాలు పర్యటించారు.
బ్రిక్స్, ఐరాస సర్వసభ్య సమావేశం తదితర కీలక సదస్సుల్లో పాల్గొన్నారు. పలు దేశాలతో ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం పోటీ పరీక్షల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రధాని పర్యటనలకు సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా అందజేస్తున్నాం...

భూటాన్:
నరేంద్రమోడీ 2014 మే 26న భారత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిపిన తొలి అధికారిక విదేశీ పర్యటన భూటాన్. ఆయన జూన్ 15, 16 తేదీల్లో భారత పొరుగు దేశమైన భూటాన్‌లో పర్యటించారు. ప్రధానితోపాటు విదేశీ వ్యవ హారాల మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ కూడా భూటాన్ పర్యటించారు. నరేంద్రమోడీ తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రపంచానికి తెలియజేయడం. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత ప్రధానికి పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భారత్ సహాయంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని భూటాన్ రాజధాని థింపూలో నరేంద్రమోడీ ప్రారంభించారు. జూన్ 16న భూటాన్ పార్లమెంటు ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, భూటాన్ ఉమ్మడి ప్రాజెక్టు అయిన 600 మెగావాట్ల కోలోంగ్చూ జల విద్యుత్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేశారు.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గ్వెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ టోబ్గేతో భారత ప్రధాని సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భూటాన్‌లో డిజిటల్ గ్రంథాలయాన్ని నెలకొల్పడానికి అవసరమైన సహాయం భారత్ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నరేంద్ర మోడీ బీ2బీగా అభివర్ణించారు. బీ2బీ అంటే భారత్ టు భూటాన్ సంబంధాలు.

బ్రెజిల్:
జూలై 15, 16 తేదీల్లో బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో బ్రిక్స్ కూటమి ఆరో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇది నరేంద్రమోడీకి రెండో విదేశీ పర్యటన, తొలి అంతర్జాతీయ సదస్సు. బ్రిక్స్ సదస్సులో నరేంద్రమోడీతోపాటు బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా పాల్గొన్నారు. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పనున్నారు. ఈ బ్యాంకు తొలి అధ్యక్షుడు భారతీయుడై ఉంటాడు. పదవీకాలం ఆరేళ్లు. భారత్ తర్వాత అధ్యక్ష పదవి బ్రెజిల్, రష్యా దేశాలకు వరుసగా దక్కుతాయి. బ్యాంకు బోర్‌‌డ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు లభించింది.

బ్రిక్స్ దేశాల నాయకులు బ్యాంకుతో పాటు అత్యవసర నిల్వల వ్యవస్థ (కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్)ను 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ధ్రవ్యనిధుల్లో తక్షణ సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో విడిగా 80 నిమిషాలపాటు సమావేశమయ్యారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు. భారతదేశంలో మౌలికరంగంలో చైనా పెట్టుబడుల్ని భారత ప్రధాని ఆహ్వానించారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని మోడీ కోరారు. నవంబర్‌లో చైనాలో నిర్వహించనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సుకు హాజరు కావాలని జీ జిన్‌పింగ్ మోడీని ఆహ్వానించారు. భారత్‌కు అపెక్‌లో సభ్యత్వం లేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని చైనా అధ్యక్షుడు కోరారు. భారతదేశానికి ఈ సంస్థలో పరిశీలక హోదా మాత్రమే ఉన్పప్పటికీ అదనపు బాధ్యతలు స్వీకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

ఫోర్తలేజాలో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం భారత ప్రధాని బ్రెజిల్ రాజధాని బ్రెజీలియా చేరుకున్నారు. అక్కడ బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రౌసెఫ్‌తో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు, ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను బ్రెజిల్ అధ్యక్షురాలిని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమెను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. భారత్, బ్రెజిల్ దేశాల మధ్య పర్యావరణ, అంతరిక్ష రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.

నేపాల్:
పధాని నరేంద్రమోడీ ఆగస్టు 3, 4 తేదీల్లో నేపాల్‌లో పర్యటించారు. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నేపాల్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. 1997లో అప్పటి ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ నేపాల్‌లో పర్యటించారు. తన పర్యటనలో మోడీ నేపాల్ అధ్యక్షుడు రాంబరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. నేపాల్ పార్లమెంట్ రాజ్యాంగ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నేపాల్‌కు మనదేశం బిలియన్ డాలర్ల రుణసాయాన్ని అందజేస్తుందని ప్రకటించారు. నేపాల్‌లో భారత్ సహాయంతో నిర్మించ తలపెట్టిన పంచేశ్వర్ ప్రాజెక్టుకు పూర్తి సహాయ, సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నేపాల్ అభివృద్ధి కోసం మోడీ ‘హిట్ (ఏఐఖీ) ఫార్ములా’ను ప్రకటించారు. హిట్ అంటే హైవేస్, ఇన్ఫర్మేషన్ వేస్, ట్రాన్‌‌సమిషన్ వేస్. ఈ మూడింటి అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని పశుపతినాథ ఆలయాన్ని మోడీ సందర్శించి పూజలు నిర్వహించారు.

జపాన్:
2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య ఐదురోజులపాటు భారత ప్రధాని జపాన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. క్యోటో నగరం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యోటోలా వారణాసిని వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. క్యోటోలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రక టించింది. వీటిని మౌలిక వసతులు స్మార్‌‌టసిటీలు, గంగానది ప్రక్షాళన తదితరాల కోసం ఉపయోగించనున్నారు. భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్లను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని జపాన్ అందిస్తుంది. దీంట్లో భాగంగా మొదటి బుల్లెట్ రైలును అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రవేశపెడ్తారు. రక్షణ, పరిశుభ్రమైన ఇంధనశక్తి, రహదారులు, ఆరోగ్యం, మహిళా సంక్షేమం.. మొత్తం ఐదు ఒప్పందాలపై జపాన్, భారత్ సంతకాలు చేశాయి.

1998లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత జపాన్ ఆరు సంస్థలపై నిషేధాన్ని విధించింది. మోడీ పర్యటన సందర్భంగా ఈ నిషేధాన్ని తొలగించారు. ఈ సంస్థల్లో హిందూ స్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) కూడా ఉంది. భారత్, జపాన్ మధ్య పౌర, అణు, సహకార ఒప్పందంపై చర్చలను వేగవంతం చేసి త్వరలో అణు ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

అమెరికా:
భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబరు 26 నుంచి 30 వరకు అయిదు రోజులపాటు అమెరికాలో పర్యటించారు. సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చారు. మధ్య ఆసియాలో చెలరేగిపోతున్న ఉగ్రవాద సంస్థలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని మోడీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి వచ్చే ఏడాదికి 70 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, చైనా దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. ప్రపంచంలో వివిధ కూటములు ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. జీ-8, జీ-20 కూటములుగా కాకుండా జీ- ఆల్‌గా అన్నిదేశాలు కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. ఐరాస సర్వసభ్య సమావేశంలోనే ఆయన విడిగా సార్‌‌క దేశాధినేతలతో సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 28న న్యూయార్‌‌కలోని మ్యాడి సన్ స్క్వేర్ గార్డెన్‌లో సమావేశమైన 20,000 మందికి పైగా ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్రమోడీ ప్రసంగించారు. భారత సంతతి వ్యక్తులకు (పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) జీవితకాల వీసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌యోజన, మేక్ ఇన్ ఇండియా కార్య క్రమాల గురించి వారికి వివరించారు. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సహకారాన్ని అందించాలని ప్రవాస భారతీయులు కోరారు. అంగారకయానం విజయవంతం కావడాన్ని ప్రస్తావించారు.

సెప్టెబర్ 30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతల ద్వైపాక్షిక సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. అణుఒప్పందం అమలులో ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంస్థలకు అందుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సహాయాలను నిలిపివేసే దిశగా కృషి చేయాలని సంకల్పించారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. బరాక్ ఒబామా, నరేంద్రమోడీ ‘చలే సాథ్ సాథ్’ అనే దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు.

మయన్మార్:
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11-20 తేదీల మధ్య మూడు దేశాల్లో పది రోజులపాటు పర్యటించారు. 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలుసుకున్నారు. మొదటగా మయన్మార్ (బర్మా) వెళ్లారు. ఆ దేశ రాజధాని నేపిటాలో అధ్యక్షుడు థీన్‌సేన్‌తో సమావేశమయ్యారు. నవంబర్ 12న నేపిటాలో జరిగిన 12వ ఆసియాన్-భారత్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఇందులో ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యులైన పది దేశాల నేతలు పాల్గొన్నారు. బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్‌‌స దేశాలకు ఆసియాన్‌లో సభ్యత్వం ఉంది. ఈ సదస్సులో మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో భారత్‌కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవిగా మోదీ స్పష్టం చేశారు. 2015 చివరికల్లా ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నాయకులు లక్ష్యంగా నిర్ణయించారు.
నవంబర్ 13న నేపిటాలో నిర్వహించిన తొమ్మిదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా తూర్పు ఆసియా సదస్సు చేసిన ప్రకటనను మోదీ సమర్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సులో పది ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా (మొత్తం 18) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్ సూకీతో కూడా భారత ప్రధాని సమావేశమయ్యారు.

ఆస్ట్రేలియా:
మయన్మార్ నుంచి నరేంద్రమోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందుగా ఆయన బ్రిస్బేన్‌లో నిర్వహించిన జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు నవంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. జీ-20 సదస్సు అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కాన్‌బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించారు. సిడ్నీలోని ఆల్ఫోన్‌‌స ఎరినాలో 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నవంబర్ 17న మాట్లాడారు. ఈ సందర్భంగా జన్‌ధన్ యోజన పథకం గురించి వివరించారు. కేవలం పది వారాల్లోనే ఏడు కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. నవంబర్ 18న మెల్‌బోర్‌‌న నగరానికి వెళ్లారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న మెల్‌బోర్‌‌న క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందులో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్.లక్ష్మణ్, అలన్ బోర్డర్ పాల్గొన్నారు.

ఫిజీ:
మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దేశాన్ని సందర్శించారు. 33 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఫిజీలో పర్యటించడం ఇదే ప్రథమం. 1981లో ఫిజీలో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామాతో సమావేశమయ్యారు. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమకు భారత్ 75 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందిస్తుందని ప్రకటించారు.

నేపాల్‌లో సార్క్ సదస్సు:
2014 నవంబర్ 25న 18వ సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. సార్‌‌క సదస్సు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. సార్‌‌కలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఖాట్మండు సదస్సు సందర్భంగా మోదీ పాకిస్థాన్ మినహా మిగతా దేశాల నాయకులతో విడిగా చర్చలు జరిపారు.


No comments:

Post a Comment