నలందా యూనివర్సిటీ పునఃప్రారంభం
ప్రపంచంలోనే మొదటగా వెలిసిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం బీహార్‌లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన రాజ్‌గిర్‌లో పునఃప్రారంభమైంది. దాదాపు 821 సంవత్సరాల తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రాంగణంలో సెప్టెంబర్ 1న తరగతులు మొదలయ్యాయి. ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ 2014, సెప్టెంబర్ 19న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి, వర్సిటీ వైస్ చాన్సలర్ గోప సభర్వాల్, ఫ్యాకల్టీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్) తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నలందా విశ్వవిద్యాలయ వివరాలను పరిశీలిస్తే..
15 మందితో ప్రారంభం:
15 మందితో ప్రారంభం:
నలందా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దాదాపు 40 దేశాలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తొలి విడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15 మంది విద్యార్థులతో ప్రారంభించారు.
గుప్తుల కాలంలో:
గుప్తుల కాలంలో:
ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల్ని ఆకర్షించిన నలందా విశ్వవిదాల్యయం ఐదో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైంది. ఇందులో 10 వేల మంది విద్యార్థులు, 1500 మంది అధ్యాపకులు ఉండేవారు. ఇక్కడ తొమ్మిది అంతస్తుల గ్రంథాయం కూడా ఉండేది. క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇది శిధిలావస్థలో ఉంది.
కలాం చొరవ:
కలాం చొరవ:
నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. ఆ తర్వాత 2010 ఆగస్టులో నలందా యూనివర్సిటీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అదే సంవతర్సం సెప్టెంబర్ 21న రాష్ట్రపతి ఆమోదించడంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. అదే ఏడాది నవంబర్ 25 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ మొదటి చాన్సలర్‌గా నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, వైస్‌చాన్సలర్‌గా గోప సభర్వాల్ 2011 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
455 ఎకరాల భూమి:
455 ఎకరాల భూమి:
నలందా విశ్వవిద్యాలయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం 455 ఎకరాల భూమిని కేటాయించింది. జపాన్, సింగపూర్ దేశాలు 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. 2010లో చైనా మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీన్ని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,727 కోట్లు కేటాయించింది. 2020 నాటికి వర్సిటీకి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి రానుంది.
No comments:
Post a Comment