AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 27 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 24 ముఖ్యమైన సమాచారం

చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన సమాచారం నవంబరు 24

డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది. 

క్విక్ రివ్యూ:ఏమిటి : యెనో యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎస్‌బీఐ
ఎందుకు : డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు


భారత్‌కు ఇస్తున్న రేటింగ్‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.

2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. 

క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ-మైనస్’ రేటింగ్ కొనసాగింపు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : స్టాండర్డ్ అండ్ పూర్


భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది. 

క్విక్ రివ్యూ:ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : డబుల్స్ విజేత దివిజ్ శరణ్(భారత్), ఎల్గిన్(రష్యా)


సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు. 

కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది.


భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల (ఏపీఎస్‌ఏ) కార్యక్రమంలో రెండు అవార్డులను ఈ చిత్రం దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు ఉత్తమ నటుడిగా, మయాంక్ తివారీ, అమిత్ మసూర్కర్‌లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా ఎంపికయ్యారు. 

హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన న్యూటన్ ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో సెలక్ట్ అయింది. ఈ కేటగిరిలో భారత్ నుంచి దాదాపు 26 సినిమాలు రేసులో నిలవగా, చివరికి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూటన్‌ని ఎంపిక చేసింది. న్యూటన్ చిత్రం బ్లాక్ కామెడీ తరహా సినిమాగా రూపొందగా, చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే ఈ సినిమా. 

క్విక్ రివ్యూ:ఏమిటి : బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావుకు ఉత్తమ నటుడి అవార్డు 
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్
ఎందుకు : న్యూటన్ చిత్రంలో నటనకు గాను



No comments:

Post a Comment