ఇండియా & వరల్డ్ 2015 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం
ఇండియా & వరల్డ్ జనవరి 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత మామిడిపై నిషేధం ఎత్తేసిన ఈయూ
భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం ఎత్తేయాలని ఐరోపా యూనియన్ (ఈయూ) జనవరి 20న నిర్ణయించింది. ఈ పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ 2014, మే 1 నుంచి 2015 డిసెంబర్ వరకు నిషేధం విధిస్తూ ఈయూ గతంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ మామిడి మొక్కల సంరక్షణ వంటి వాటిలో గణనీయ పురోగతి సాధించినందున నిషేధం అవసరం లేదని ఈయూ భావించింది.
అణు ఒప్పందంపై అవగాహన
అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు జనవరి 25న ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు.
స్మార్ట్‌సిటీల అభివృద్ధి ఒప్పందం
విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య జనవరి 25న అవగాహనా ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ ఫిబ్రవరి 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం
భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం చిగురించింది. రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మధ్య ఫిబ్రవరి16న ఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధా లు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య జాలర్ల అంశాన్ని సామరస్యంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డాయి. చర్చల అనంతరం మోదీ, సిరిసేన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పౌర అణు ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి మరో ప్రతీక. శ్రీలంక ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం మొదటిసారి. దీనివల్ల అనేక రంగాల్లో రెండుదేశాల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. శ్రీలంక-భారత్ మ ధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అనేక అంశాలు ఉమ్మడి నిర్ణయాలతో ముడివడి ఉన్నాయి. దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సిరిసేన తొలిసారి భారత్‌కు వచ్చినందుకు సం తోషం. జాలర్ల విషయంలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. 2 దేశాల మధ్య మత్స్యకార సంఘాలను ప్రోత్సహిస్తాం.’అని మోదీ చెప్పారు.
అణు బాధ్యత చట్టాన్ని సవరించేది లేదు: భారత్
 పౌర అణు సహకార అణు ఒప్పందం అమలు కోసం.. అణు విధ్వంసానికి పౌర బాధ్యత (సీఎల్‌ఎన్‌డీ) చట్టం లేదా నిబంధనలను సవరించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అణువిద్యుత్ ప్లాంటు వద్ద ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే.. సంబంధిత అణు పరికరాలను సరఫరా చేసిన విదేశీ సంస్థలపై బాధితులు కేసు వేయకుండా ఉండేందుకు ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న అవగాహనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 8న ఒక వివరాణాత్మక పత్రాన్ని విడుదల చేసింది. అణు ప్రమాదానికి బాధ్యత, పరిహారం, వనరుల హక్కు వంటి వివాదాస్పద అంశాలతో సహా ‘తరచుగా అడుగుతున్న ప్రశ్నలు’ అనే పేరుతో ఈ పత్రాన్ని విడుదల చేసింది. ఏదైనా అణు ప్రమాదం జరిగినపుడు సంబంధిత రియాక్టర్లను సరఫరా చేసిన విదేశీ సంస్థలపై పరిహారం కోరుతూ బాధితులు కేసు వేయడానికి వీలు ఉండబోదని.. అయితే వనరుల హక్కు ఉన్న సదరు అణు విద్యుత్ కేంద్ర నిర్వాహక సంస్థ ఇటువంటి కేసు వేసేందుకు వీలు ఉంటుందని పేర్కొంది. దీనిని అణు రియాక్టర్ సరఫరా సంస్థలకు అణు కేంద్రం నిర్వాహక సంస్థకు మధ్య ఒప్పందం ద్వారా అమలు చేయవచ్చని తెలిపింది. అణు ఒప్పందం అమలుకు విధానపరంగా ఉన్న అవరోధాలను అధిగమించేందుకు.. భారత్ అమెరికా అణు సంబంధ బృందాల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చల్లో ఈ అవగాహనకు వచ్చినట్లు వివరించింది.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ మార్చి 2015 ద్వైపాక్షిక సంబంధాలు
ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా మార్చి 13న ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. లంక అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంక ఐక్యత, సమగ్రత భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమై చర్చలు జరిపారు. న్యూఢిల్లీ- కొలంబో మధ్య ఎయిరిండియా డెరైక్ట్ విమాన సర్వీసు, లంకలో రామాయణ ఇతిహాస ఆనవాళ్ల గుర్తింపుకు సహాయం, భారత్‌లో బౌద్ధ కేంద్రం ఏర్పాటు, ఈ ఏడాది ఇండియా- శ్రీలంక ఫెస్టివల్ నిర్వహణ వంటి ప్రకటనలు ప్రధాని చేశారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ట్రింకోమలీని పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అంగీకారం, ఆర్‌బీఐ- లంక సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య * 9500 కోట్ల కరెన్సీ మార్పిడి ఒప్పందం, లంక రైల్వేలకు * 2000 కోట్ల రుణం, వీసా నిబంధనల సరళీకరణ ఒప్పందం ఉన్నాయి.
భారత్ -స్పెయిన్ రక్షణ ఒప్పందం
రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్, స్పెయిన్ మధ్య న్యూఢిల్లీలో మార్చి 5న సంతకాలు జరిగాయి. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెమ్స్, భారత్ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్ ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి నిర్దేశించిన పి-751 ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి స్పెయిన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
వారణాసి - ఖాట్మండు బస్ సర్వీస్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మార్చి 4న వారణాసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు బస్ సర్వీసును ప్రారంభించారు. భారత్ - నేపాల్ మైత్రి బస్ సేవ పేరుతో దీన్ని ఆరంభించారు.
భారత్-సీషెల్స్ మధ్య నాలుగు ఒప్పందాలు
సీషెల్స్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశలో ఆ దేశానికి పెద్దఎత్తున సాయం అందించడానికి భారత్ ముందుకు వచ్చింది. ఆ దేశ జలసంపదను మ్యాపింగ్ ద్వారా గుర్తించేందుకు సాయపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా మార్చి 11న రెండు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. రక్షణరంగంలో పరస్పర సహకారంలో భాగంగా భారత్ సాయంతో ఏర్పాటు చేసిన తీరప్రాంత నిఘా రాడార్ వ్యవస్థను మోదీ ప్రారంభించారు. సీషెల్స్‌కు మరో డోర్నియర్ విమానం ఇస్తామని, సీషెల్స్ పౌరులకు 3 నెలల ఉచిత వీసా అందిస్తామని ప్రకటించారు. రాజధాని విక్టోరియాలో మోదీ.. సీషెల్స్ అధ్యక్షుడు అలెక్స్ మైఖేల్‌తో పలు అంశాలపై చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రెండు దేశాలమధ్య ఒప్పందాలు కుదిరాయి.
ఇస్లామిక్ స్టేట్ సంస్థపై నిషేధం
 ఇరాక్, సిరియాలలో వరుస హత్యలు, దాడులతో దారుణ మారణకాండను కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను భారత్ నిషేధించింది. భారత్ సహా వివిధ దేశాల యువతను ఉగ్రవాదులుగా ఆ సంస్థ నియమించుకుంటోందని, ఉగ్రవాద శిక్షణ పొందిన యువత తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే జాతీయ భద్రతకే పెనుముప్పు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/డైష్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ ఏప్రిల్ 2015 ద్వైపాక్షిక సంబంధాలు
ప్రధాని జర్మనీ పర్యటన
మూడు దేశాల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న బెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ, మెర్కెల్ పాల్గొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందంపై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత్-ఐరోపా కూటమి (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందంపై రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రక్రియను పునరుద్ధరించాలన్నారు. మోదీ హనోవర్‌లో ఇండో జర్మన్ బిజినెస్ సమ్మిట్‌లో భారత పెవిలియన్‌ను ప్రారంభించారు.
యురేనియం సరఫరాకు కెనడా-భారత్ ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటనలో ఏప్రిల్ 15న ఒటావాలో భారత్‌కు యురేనియం సరఫరాపై ఒప్పందం కుదిరింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రధాన ఒప్పందం 2013లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కెనడా ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు 3000 టన్నుల యురేనియం భారత్‌కు సరఫరా చేస్తుంది. దీని విలువ సుమారు రూ. 1524 కోట్లు ఉంటుంది. ఇప్పటికే భారత్ యురేనియం సరఫరాకు రష్యా, కజికిస్థాన్‌లతో ఒప్పందం చేసుకుంది. ఇరు దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 13 ఒప్పందాలు, అంతరిక్ష సహకారానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది.
ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన
ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ సు యోంగ్ ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌లో పర్యటించారు. కొరియా ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను భారత్ కోరుకుంటుందని ఆమె, రీ యోంగ్‌కు తెలిపారు. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
నేతాజీ ఫైళ్లపై కమిటీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్య పత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేతాజీ మనవడు సూర్యకుమార్ బోస్ జర్మనీలో ప్రధాని మోదీని కలిసి నేతాజీ విషయంపై విజ్ఞప్తి చేసిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర హోం, న్యాయ, సిబ్బంది వ్యవహారాల శాఖల కార్యదర్శులతో కూడిన ఈ కమిటీ.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయడంలో సాధ్యాసాధ్యాలను, అధికారిక ఫైళ్లను ఎంతకాలం తర్వాత బయటపెట్టవచ్చన్న అంశాలను పరిశీలించనున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాల (ఓఎస్‌ఏ)ను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది.
జనతా పరివార్ విలీనం
రెండున్నర దశాబ్దాల కిందట చీలిపోయిన ‘జనతా పరివార్’లోని ఆరు పార్టీలు మళ్లీ విలీనమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలోని అధికార పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునెటైడ్)లతో పాటు.. రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జనతాదళ్ (సెక్యులర్), సమాజ్‌వాదీ జనతా పార్టీలు విలీనమైనట్లుగా ఆయా పార్టీల అధినేతలు ఏప్రిల్ 15న ఢిల్లీలో ప్రకటించారు. ఎస్‌పీ అధినేత ములాయం అధికారిక నివాసం అశోకారోడ్-16లో శివపాల్‌యాదవ్ (ఎస్‌పీ), లాలూప్రసాద్‌యాదవ్ (ఆర్‌జేడీ), శరద్ యాదవ్, నితీశ్ కుమార్ (జేడీయూ), హెచ్.డి.దేవెగౌడ (జనతాద ళ్ సెక్యులర్) ఓంప్రకాశ్ చౌతాలా తనయుడు అభయ్ చౌతాలా (ఐఎన్‌ఎల్‌డీ), కమల్ మరార్క (సమాజ్‌వాది జనతా పార్టీ) సమావేశమై తమ పార్టీలను విలీనం చేస్తూ లాంఛనంగా నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ములాయంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ జెండా తదితర అంశాలపై ఆరుగురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని శరద్ యాదవ్ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.
ఫ్రాన్స్‌తో 17 ఒప్పందాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఏప్రిల్ 10న ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఆగిపోయిన అణు విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన అంశం, భారత పర్యాటకులకు 48 గంటల్లో వీసా జారీ పథకాన్ని ఫ్రాన్స్ అమలు చేయడం, భారత్‌లో 100 కోట్ల డాలర్ల ఫ్రాన్స్ పెట్టుబడులు మొదలైన వాటిపై సంతకాలు జరిగాయి.
‘ఆపరేషన్ రహాత్’ పూర్తి
సంక్షుభిత యెమెన్ నుంచి భారతీయులను తరలించడానికి చేపట్టిన ‘ఆపరేషన్ రహాత్’ విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి మొత్తం 5,600 మందిని తరలించారు. వీరిలో 4,640 మంది భారతీయులతో పాటు 41 దేశాలకు చెందిన 960 మంది ఇతరులు కూడా ఉన్నారు. ‘యెమెన్ నుంచి భారతీయుల తరలింపు పూర్తయింది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ ఈ రాత్రికే స్వదేశానికి తిరిగి వస్తున్నారు...’ అని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ మే 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్ - చైనాల మధ్య 24 ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 15న 24 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మోదీ మూడు రోజుల పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వస్థలం జియాన్ నగరాన్ని సందర్శించారు. చైనా తొలి చక్రవర్తి క్విన్ షిహ్వాంగ్ రూపొందించిన యుద్ధవీరుల ప్రతిమలున్న టైట (మట్టితో చేసిన ప్రతిమల మ్యూజియం)ను మోదీ సందర్శిం చారు. రెండోరోజు చైనా ప్రధాని లీకెక్వియాంగ్‌తో సమావేశమ య్యారు. ఇరుదేశాల మధ్య రైల్వేలు, గనులు, అంతరిక్షం, ఇంజనీరింగ్, పర్యాటక, విద్యా, భూకంపశాస్త్రం వంటి ప్రధాన రంగాల్లో పరస్పర సహకారం, చెంగ్డు, చెన్నైలలో రాయబార కార్యాలయాల ఏర్పాటుపై ఒప్పందాలు జరిగాయి. సోదర నగరాల నిర్మాణ ఒప్పందాల్లో కర్ణాటక రాష్ట్రం - సిచువాన్ రాష్ట్రం, చెన్నై - చోంగ్ క్వింగ్, హైదరాబాద్ - క్వింగ్ డావో, ఔరంగాబాద్ - దన్‌హాంగ్ నగరాల అభివృద్ధికి ఒప్పందం జరిగింది.
మంగోలియాకు రూ. 6,344 కోట్ల భారత్ రుణం
ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల మంగోలియా పర్యటనలో ఆ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 6,344 కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించారు. మే 17న ఆ దేశ ప్రధాని చిమెదిన్ సాయిఖాన్ బిలెగ్‌తో నిఘా, వైమానిక సేవలు, సైబర్ భద్రతతోపాటు 13 అంశాలకు చెందిన ఒప్పందాలు చేసుకున్నారు. మంగోలియా సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ ఆ దేశ పార్లమెంట్ స్టేట్ గ్రేట్ ఖురల్ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు.
దక్షిణ కొరియాలో మోదీ పర్యటన
ప్రధాని మోదీ మే 17న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గున్ హైతో చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం, దృశ్య శ్రవణ సంయుక్త నిర్మాణం, విమాన రాకపోకల విస్తరణ, విద్యుత్ ఉత్పత్తి - పంపిణీతోపాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సముద్ర భద్రతపై పరస్పర సహకారం, నౌకా నిర్మాణంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఇరుదేశాలు నిర్ణయించాయి.
ప్రధాని మోదీ చైనా పర్యటన
చైనాలో మూడు రోజుల పర్యటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 13వ తేదీన బయలుదేరి వెళ్లారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా రాజధాని బీజింగ్ నుంచి కాకుండా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ సొంత నగరమైన గ్జియాన్ (షాంగ్జి రాష్ట్ర రాజధాని) నుంచి మోదీ చైనా పర్యటన ప్రారంభం కావడం విశేషం. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత బీజింగ్ వెలుపల ఒక విదేశీ నేతకు జిన్‌పింగ్ స్వాగతం పలకడం ఇదే ప్రథమం.
అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ భారత పర్యటన
అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన తొలి భారత పర్యటనలో 2015 ఏప్రిల్ 28న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు నేతలు చర్చించారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి, సుస్థిరతలకు భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రక్షణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఉగ్రవాదం పెద్ద సవాలని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. దీన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ ట్రాన్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్‌లో చేరేందుకు భారత్ తన ఆసక్తిని వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సరిహద్దులో వాఘా - అట్టారీ వద్ద అఫ్ఘాన్ ట్రక్కులు ప్రవేశించేందుకు ప్రధాని సమ్మతి వ్యక్తం చేశారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ జూన్ 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్ - థాయిలాండ్ మధ్య ఒప్పందాలు
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ థాయిలాండ్ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక సహకార సంయుక్త సమావేశంలో జూన్ 29న పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ పర్యటనలో 2013లో కుదిరిన నేరస్థుల అప్పగింత ఒప్పందం అమలుకు సంబంధించిన పత్రాల మార్పిడి కూడా జరిగింది. ఆయుర్వేద పీఠం ఏర్పాటుకు సంబంధించి భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ, థాయిలాండ్ రంగిట్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
నేపాల్‌కు వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం
పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం వంద కోట్ల డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నేపాలీల కన్నీళ్లు తుడిచేందుకు నేపాల్ ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది. నేపాల్ రాజధాని కఠ్మాండూలో జూన్ 25న జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నేపాల్స్ రీకన్‌స్ట్రక్షన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. నేపాల్ పునర్నిర్మాణానికి నిధులు రాబట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం తరఫున సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.
మూడు దేశాలతో మోటారు వాహన ఒప్పందం
సార్క్ దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో జూన్ 15న భూటాన్ రాజధాని థింపూలో మోటారు వాహన ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, సంబంధిత దేశాల రవాణా శాఖా మంత్రులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఆయా దేశాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిరంతరం, సులువుగా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఇటువంటి ఒప్పందాన్ని మయన్మార్, థాయిలాండ్‌తో భారత్ కుదుర్చుకోనుంది.
తీవ్రవాదులపై భారత్-మయన్మార్ ఆర్మీ ఆపరేషన్
మణిపూర్ సరిహద్దులోని మయన్మార్‌లో తీవ్రవాదులపై జూన్ 9న భారత్, మయన్మార్ సైన్యాలు జరిపిన దాడిలో 50 మంది తీవ్రవాదులు మరణించారు. వీరు ఎన్‌ఎస్‌పీఎస్(కే), కేవైకేఎల్ సంస్థలకు చెందిన వారు. వీరు మణిపూర్‌లో జూన్ 4న జరిపిన దాడిలో 18 మంది సైనికులు మృతిచెందారు. తీవ్రవాదులు మయన్మార్‌లో తల దాచుకోవడంతో భారత్ మయన్మార్‌తో కలిసి సైనికదాడి జరిపింది. దేశం బయట భారత సైన్యం తీవ్రవాదులపై కమాండో ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి.
రాష్ట్రపతి స్వీడన్ పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వీడన్ పర్యటనలో ఆ దేశ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫ్‌వెన్‌తో సమావేశమయ్యారు. వీరి సమక్షంలో ఇరు దేశాల మధ్య జూన్ 1న సుస్థిర పట్టణాభివృద్ధిపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. నాలుగేళ్ల క్రితం ముగిసిన ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలను తిరిగి ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగంలో స్వీడన్ పెట్టుబడులు పెట్టే మార్గాలపై భారత్ చర్చించింది. యూఎన్‌వో భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం అంశానికి స్వీడన్ ప్రధాని మద్దతు తెలిపారు.
భూ సరిహద్దు వివాద పరిష్కార ఒప్పందానికి భారత్, బంగ్లా ఆమోదం
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో జూన్ 6న ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో చర్చలు జరిపారు. వీరిద్దరి సమక్షంలో భూ సరిహద్దు ఒప్పందానికి చెందిన పత్రాలను అధికారులు పరస్పరం మార్చుకున్నారు. 1974లో కుదిరిన సరిహద్దు ఒప్పందం నేటికి కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందం ప్రకారం వెయ్యి ఎకరాల్లో ఉన్న 111 ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో, 500 ఎకరాల్లో ఉన్న 51 ప్రాంతాలు భారత్‌లో కలుస్తాయి. ప్రధాని పర్యటనలో తీరప్రాంత రక్షణ; మనుషుల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ అరికట్టడం; భారత ఆర్థిక మండలి ఏర్పాటు; ఆర్థిక సహకారం లాంటి 22 అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. కోల్‌కతా-ఢాకా-అగర్తలా, ఢాకా-షిల్లాంగ్-గువాహటి మధ్య రెండు బస్సు సర్వీసులను ప్రారంభించారు. వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నుంచి ప్రధాని మోదీ స్వీకరించారు.
తీవ్రవాదంపై పోరుకు భారత్-నెదర్లాండ్‌స నిర్ణయం
తీవ్రవాదంపై పోరాడేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ భారత పర్యటనలో భాగంగా జూన్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సైబర్ నేరాలపై ద్వైపాక్షిక, బహుళపక్ష సహకారానికి రెండు దేశాలకు అంగీకరించాయి. నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్రయాన సహకారం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం తదితర 18 రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
భారత్, కేంబ్రిడ్జిల ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్‌లు
బయో టెక్నాలజీ రంగంలో ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్‌లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తాజాగా సంతకాలు జరిగాయి. ఈ ఫెలోషిప్‌లకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, కేంబ్రిడ్జి వర్సిటీ సంయుక్తంగా నిధులు అందజేస్తాయి. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వై. సుజనా చౌదరి ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పర్యటించినప్పుడు ఈ ఫెలోషిప్‌లను ప్రకటించారు. ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్ కాలవ్యవధి ఐదేళ్లు. ఈ ఫెలోషిప్ పొందిన పరిశోధకులు భారత్‌లోని సంస్థల్లో మూడేళ్లు, కేంబ్రిడ్జిలో రెండేళ్లు పనిచేయొచ్చు.
బెలారస్‌తో భారత్ రక్షణ, భద్రతా సంబంధాలు
రక్షణ, భద్రతాపరమైన అంశాలపై సంయుక్తంగా కలిసి పనిచేయాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. జూన్ 3న బెలారస్‌లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బెలారస్ అధ్యక్షుడు ఏజీ లుకషెంకోలు ఈ మేరకు 17 అంశాలతో రోడ్‌మ్యాప్ అమలుకు ఆమోదం తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం జూన్ 1వ తేదీరాత్రి బెలారస్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ అధ్యక్షుడు లుకషెంకోతో జూన్ 3న సమావేశమై అనేక అంశాలపై చర్చించారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ జూలై 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్‌తో కలసి రష్యా 200 హెలికాప్టర్ల తయారీ
వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా 200 మిలిటరీ హెలికాప్టర్లను రష్యా.. భారత్‌లోనే తయారు చేయనుంది. స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రష్యాతో ఈ ఒప్పందం కుదిరింది. భారత్ ఇతర దేశాల నుంచి సైనిక పరికరాలు కొంటున్నప్పటికీ, దశాబ్దాల క్రితం రష్యాతో కుదర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం ఇప్పటికీ అమలవుతోంది.
ఉగ్రవాదంపై భారత్-తజకిస్తాన్ నిర్ణయం
 మధ్య ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జూలై 13న తజకిస్తాన్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎమెమలి రెహ్మాన్‌తో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని విస్తృత పరచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. తజకిస్తాన్ రాజధాని దుషాంబెలో ఇరు దేశాల నేతలు రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
భారత్, కజకిస్తాన్ మధ్య ఐదు ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ కజకిస్తాన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్‌తో జూలై 9న సమావేశం అయ్యారు. ఇద్దరు నేతలు ప్రాంతీయ శాంతి, తీవ్రవాదం, అనుసంధానత, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు వంటి అనేక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఐదు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో భారత్‌కు యురేనియం సరఫరా, రక్షణ రంగంలో సహకారం, ఖైదీల బదలాయింపు వంటివి ఉన్నాయి. కజకిస్తాన్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
భారత్-అమెరికా ఎఫ్‌ఏటీసీఏ ఒప్పందం
భారత్- అమెరికాలు విదేశీ పన్ను ఎగవేతను, నల్లధనాన్ని అరికట్టేందుకు జూలై 9న అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లయెన్స్ యాక్ట్ (ఎఫ్‌ఏటీసీఏ) అమలుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్, అమెరికా దౌత్యవేత్త రిచర్డ్ వర్మ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా పౌరుల ఖాతాల సమాచారాన్ని భారత్, అలాగే భారత పౌరుల ఖాతాల సమాచారాన్ని అమెరికా ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ ఒప్పందం సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది.
భారత్-తుర్క్‌మెనిస్తాన్‌ల మధ్య ఏడు ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తుర్క్‌మెనిస్తాన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు గుర్‌బంగూళి బెర్డిముఖమ్‌మెదేవ్ జూలై 11న చర్చలు జరిపారు. తుర్క్‌మెనిస్తాన్- అఫ్ఘానిస్తాన్- పాకిస్తాన్- భారత్ (తాపి) గ్యాస్ పైప్‌లైన్‌ను 10 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్నారు. 1735 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా సహజవాయువు తుర్క్‌మెనిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్ దేశాలకు సరఫరా అవుతుంది. ఇరుదేశాలు రక్షణ, పర్యాటక రంగం, రసాయన ఉత్పత్తుల సరఫరా, విదేశీ వ్యవహారాలు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మందుల రంగాలకు చెందిన ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
భారత్, కిర్గిజిస్తాన్‌ల మధ్య నాలుగు ఒప్పందాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 13న కిర్గిజిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు అల్మాజ్‌బెక్ అతాంబాయేవ్‌తో ప్రధాని సమావేశమై తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహించడం, రక్షణ, సాంస్కృతిక సహకారం వంటివి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతుపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
నవాజ్ షరీఫ్‌తో మోదీ చర్చలు
ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని భారత్, పాకిస్తాన్ నిర్ణయించడంతో ఇరుదేశ సంబంధాల్లో కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఈ మేరకు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా జులై 10న రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
మోదీ-షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు
ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఇరుదేశాల భద్రత సలహాదార్లు అజిత్ దోవల్(భారత్), సర్తాజ్ అజీజ్ (పాక్) ఢిల్లీలో సమావేశమై ఉగ్రవాద అంశాలపై చర్చిస్తారు. (అజీజ్‌కు పాక్‌లో దార్శనికుడిగా, ఆర్థికవేత్తగా పేరుంది).పాక్‌లో జరుగుతున్న 26/11 ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు.. స్వర నమూనాలను అందించడం సహా.. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అంగీకారం.వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) డెరైక్టర్ జనరల్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్‌ల మధ్య అతిత్వరలో భేటీ. తర్వాత ఇరుదేశాల డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) భేటీ.అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని దక్షిణాసియా నుంచి తరిమేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం.పాక్ జైళ్లలో ఉన్న 355 మంది భారత జాలర్లను, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లను, వారి పడవలతో సహా 15 రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయం.మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక యంత్రాంగం రూపకల్పన.వచ్చే సంవత్సరం ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవాలన్న షరీఫ్ ఆహ్వానానికి మోదీ సానుకూల స్పందన. (2004 జనవరిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాక్ పర్యటన అనంతరం భారత ప్రధాని పాక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం)
ఆరు అగ్ర రాజ్యాలతో ఇరాన్ అణు ఒప్పందం
పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా తీవ్రస్థాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ఆరు అగ్ర రాజ్యాలతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. అణ్వస్త్రాల తయారీని నిలిపేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రతిగా.. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించేందుకు ఆరు అగ్ర రాజ్యాలు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా అంగీకరించాయి. ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో 18 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన కీలక చర్చల అనంతరం జూలై 14న ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అగ్ర రాజ్యాలతో ఇరాన్ వైరానికి విరామం లభించినట్లైంది. ఈ అణు ఒప్పందం ప్రపంచానికి ఒక ఆశావహ నూతనాధ్యాయమంటూ ఇరాన్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు గొప్పగా ప్రశంసించగా.. ఇది చరిత్రాత్మక తప్పిదమంటూ ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్ అభివర్ణించింది.
ఒప్పందంలోని అంశాలు:
ఇరాన్ తన అపకేంద్ర యంత్రాల(సెంట్రిఫ్యుజెస్) సంఖ్యను 19 వేల నుంచి 6,104కి తగ్గించాల్సి ఉంటుంది. ఈ యంత్రాలు అణుబాంబు తయారీకి అవసరమైన అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తాయి.మరో పదేళ్ల పాటు తమ దగ్గరున్న ఆధునిక అపకేంద్ర యంత్రాలను యురేనియం ఉత్పత్తికి ఇరాన్ ఉపయోగించరాదు.తమ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 98% నిల్వలను తొలగించాలి.తమ దేశంలోని అణు కేంద్రాలను, సరఫరా శృంఖలాన్ని, యురేనియం గనులను, యురేనియం ఉత్పత్తి, నిల్వ కేంద్రాలను, ప్రయోగ కేంద్రాలను.. అన్నింటినీ అంతర్జాతీయ సమాజం ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు ఇరాన్ అంగీకరించాలి.అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ఫ్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయాలి.ఈ ఒప్పందంలోని కొన్ని పారదర్శక నిబంధనలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి.
ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన
 మధ్య ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 6న ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్‌తో ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు. అణు ఇంధన శక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాదం, అఫ్గానిస్థాన్ పరిస్థితి సహా పలు ప్రాంతీయ అంశాలపై ఇరు దేశాల నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంస్కృతి, పర్యాటక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
కజకిస్తాన్ పర్యటనలో ప్రధాని మోదీ
మధ్య ఆసియా దేశాల్లో తొలిసారి పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 7న కజకిస్తాన్‌లో పర్యటించారు. జూలై 6న ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించిన మోదీ.. 7న తాష్కెంట్ నుంచి ప్రత్యేక విమానంలో కజకిస్తాన్ రాజధాని అస్తానా చేరుకున్నారు. కజక్ ప్రధాని కరీమ్ మాసిమోవ్‌తో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత నజర్‌బయేవ్ వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ ఆగష్టు 2015 ద్వైపాక్షిక సంబంధాలు
యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆగస్టు 16న యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యాతో చర్చలు జరిపారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం అబుదాబి విమానాశ్రయంలో అరబ్ యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. అరబ్‌లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును మోదీ సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు.
అబుదాబి యువరాజుతో మోదీ చర్చలు
యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 17న అబుదాబిలో ఆ దేశ యువరాజు, సాయుధ దళాల ఉపసర్వాధిపతి మొహమ్మద్ బిన్ నహ్యాన్‌తో; దుబాయ్‌లో యూఏఈ ఉప రాష్ట్రపతి, ప్రధాని రషీద్ అల్ మక్తూమ్‌తో చర్చలు జరిపారు. ఈ ప్రాంతం పరిస్థితి, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదం, ముప్పుపై చర్చించారు. తర్వాత 31 సూత్రాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి యూఏఈ మద్దతు ప్రకటించింది.
భారతీయుల సభలో మోదీ ప్రసంగం
పర్యటన రెండో రోజు ఆగస్టు 17న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతీయ ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సభలో దాదాపు 50,000 మంది పాల్గొన్నారు. యూఏఈలో లీగల్ కేసుల విషయంలో భారతీయులకు సాయం చేసేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
75 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు..
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్‌లో తమ పెట్టుబడులను 75 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) పెంచడానికి యూఏఈ అంగీకరించింది. అలాగే వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 60 శాతం మేర పెంచుకోవాలని భారత్, యూఏఈ నిర్ణయించుకున్నాయి. ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి అంగీకరించినట్లు సంయుక్త ప్రకటనలో అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత యూఏఈ భారత్‌కి మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2014-15లో భారత్-యూఏఈల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్ల మేర ఉంది.
మొజాంబిక్‌తో భారత్ అవగాహన ఒప్పందాలు
 మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆగస్టు 5న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. పునరుత్పాదక ఇంధనంలో ఉమ్మడి ప్రాజెక్టులు, రక్షణ, రైల్వే, సముద్ర సంబంధ వ్యాపారంలో సహకారం పెంపుదలకు మార్గాన్వేషణకు సంబంధించి ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. న్యూసీ భారత్‌లో ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటించనున్నారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ సెప్టెంబరు 2015 ద్వైపాక్షిక సంబంధాలు
శ్రీలంకతో భారత్ నాలుగు ఒప్పందాలు
 రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్ 15న విక్రమసింఘే, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ఇరుదేశాల ప్రధానుల మధ్య విస్తృత ప్రాతిపదికన చర్చలు జరిగాయి. శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని మోదీ శ్రీలంక ప్రధానిని కోరారు. తమిళులకు న్యాయం చేయటం పైనే ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ, రెండు దేశాల నడుమ సుదీర్ఘంగా నలుగుతున్న జాలర్ల సమస్య, వ్యాపార, రక్షణ వ్యవస్థల బలోపేతం, ఉగ్రవాదం, సముద్రజలాల సరిహద్దుల భద్రత వంటి అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. వైద్య-ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష విజ్ఞానంలో పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
కంబోడియాతో భారత్ ఒప్పందాలు
ఆసియాన్ కూటమి దేశమైన కంబోడియాతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మూడు రోజుల కంబోడియా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. అన్సారీ సెప్టెంబర్ 16న కంబోడియా ప్రధాని హున్ సెన్‌తో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో టూరిజం, త్వరిత ప్రభావిత ప్రాజెక్టుల(క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు(క్యూఐపీ))పై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ క్యూఐపీలో మెకాంగ్-గంగా సహకారం, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహిళా సాధికారత, వ్యవసాయ సహకారంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి రూ.33లక్షల గ్రాంటు ఉన్నాయి. కంబోడియా మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి అన్సారీ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి వెంట తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ అక్టోబరు 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్- అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం
 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబరు 28న భారత్-అమెరికా మధ్య మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రక్షణ అవసరాల కోసం భారత్ రూ.19.86 వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లను కొంటుంది.
ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
అమెరికా, 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ట్రాన్స్-పసిఫిక్ పాట్నర్‌షిప్-టీపీపీ) కుదిరింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ పసిఫిక్ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వేల సంఖ్యలో సుంకాలు రద్దుకానున్నాయి. దీంతో పాటు చైనా ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జీడీపీ (2012) 40 శాతంగా ఉంది.
పట్టణ రవాణాపై భారత్- స్వీడన్ మధ్య ఒప్పందం
రవాణా వ్యవస్థ మెరుగుపరచడం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, డిజిటలైజేషన్‌కు సంబంధించి దేశంలో తలపెట్టిన నూతన పథకాల అమలులో సహకారం కోసం భారత్-స్వీడన్ మధ్య ఒప్పందం కుదిరింది. స్వీడన్ పట్టణాభివృద్ధి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మెహ్మెట్ కప్లాన్, భారత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అక్టోబర్ 13న భేటీ అయ్యారు. పట్టణాల సుస్థిర ప్రగతికి అవసరమైన ప్రాజెక్టులను గుర్తించాలని వారు నిర్ణయించారు. ద్రవ, ఘనవ్యర్థాలనుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి తమ దేశం అన్నివిధాలుగా సహకరిస్తుందని కప్లాన్ హామీ ఇచ్చారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ నవంబరు 2015 ద్వైపాక్షిక సంబంధాలు
మలేసియాతో మూడు ఒప్పందాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియా పర్యటనలో నవంబర్ 23న ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశమయ్యారు. భద్రత, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సైబర్ భద్రత, 2015-20 మధ్యకాలంలో సాంస్కృతిక పర్యటనలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.
సింగపూర్‌తో భారత్ పది ఒప్పందాలు
వ్యూహాత్మక భాగస్వామ్యం సహా రక్షణ, సైబర్ భద్రత, పౌర విమానయానం, నౌకాయానం తదితర రంగాల్లో భారత్, సింగపూర్‌లు 10 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా నవంబర్ 24న ఆ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్, అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్‌తో సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా పది ఒప్పందాలు కుదిరాయి. సింగపూర్ ప్రధాని లూంగ్ ఇచ్చిన గౌరవ విందులో పాల్గొన్న మోదీ.. 1842నాటి సింగపూర్ చిత్రపటాన్ని లూంగ్‌కు బహూకరించారు.
బ్రిటన్‌తో పౌరఅణు సహకార ఒప్పందం
 భారత ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా నవంబర్ 12న ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి కామెరూన్ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు పౌర అణుసహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసి అణిచి వేయాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. బ్రిటీష్, భారత కంపెనీల మధ్య రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీలలో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్ డిసెంబరు 2015 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, రష్యా మధ్య 16 ద్వైపాక్షిక ఒప్పందాలు
 భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన సందర్భంగా డిసెంబర్ 24న నిర్వహించిన 16వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తితోపాటు ఆర్థిక రంగంలోనూ పరస్పరం సహకారం చేసుకోవాలని నిర్ణయించారు. మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన ఈ సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కమోవ్-226 యుద్ధ హెలికాప్టర్ల తయారీకి రష్యా సమ్మతించింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 12 అణువిద్యుదుత్పత్తికి రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
రష్యాతో కుదుర్చుకున్న 16 ఒప్పందాలు
పౌరుల విమాన ప్రయాణాల విషయంలో పరస్పరం నిబంధనల సరళీకరణఅధికారులు, దౌత్యవేత్తల పాస్‌పోర్టులున్న వారికి ఇరుదేశాల్లో పరస్పరం ప్రయాణించే విధానంహెలికాప్టర్ ఇంజనీరింగ్‌రంగంలో సహకారం2015-17 మధ్య కస్టమ్స్ ఎగవేత నియంత్రణలో సహకారంభారత్‌లో 12 రష్యా తయారీ అణురియాక్టర్ల ఏర్పాటు (ఏపీతో సహా)రైల్వే రంగంలో సాంకేతిక సహకారంభారత్‌లో సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణంలో సహకారంరాంచీలోని హెచ్‌ఈసీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెవీ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఒప్పందంహెచ్‌ఈసీ తయారీ సామర్థ్యాన్ని పెంచటం, నూతనీకరించేందుకు ఒప్పందంప్రసార రంగంలో సహకారంసీ-డాక్, ఐఐఎస్‌సీ (బెంగళూరు), లోమొనోసోవ్ మాస్కో స్టేట్ వర్సిటీ మధ్య ఒప్పందంసీ-డాక్, ఓజేఎస్‌సీ, గ్లోనాస్ యూనియన్ మధ్య ఒప్పందంరష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులకు సహకారంహైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి (రష్యా భూభాగంపై) ఒప్పందం.జేఎస్‌సీ వాంకోర్‌నెఫ్ట్‌లో సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులో తొలివిడత పనులు పూర్తయినట్లు ధృవీకరణహైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి(భారత భూభాగంపై) ఒప్పందం.
జపాన్ రాష్ట్రం తోయామాతో ఏపీ ఒప్పందం
జపాన్‌లోని తోయామా రాష్ట్రంతో పలు రంగాల్లో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రాష్ట్రాలు పరస్పరం అభిప్రాయాలు, అనుభవాలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు స్నేహపూర్వక భాగస్వామ్యం కోసం అవగాహనకు వచ్చాయి. తోయామా గవర్నర్ తకకాజు ఇషి నేతృత్వంలోని 19మంది సభ్యుల జపాన్ బృందం డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి దాని గురించి వివరించారు. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధి, ఫార్మాస్యూటికల్, సాంృ్కతిక, పర్యాటక రంగాల్లో ఏపీ, తోయామాలు పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి. రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల్లోని సంస్థలు, కంపెనీలు ఉమ్మడి ప్రయోజన అంశాలను గుర్తించి, వాటిపై పనిచేస్తాయి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇరువురికీ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపడతాయి. సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తాయి.
భారత్ - అమెరికాల మధ్య ‘రక్షణ’ ఒప్పందం
రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్‌తో జరిపిన భేటీలో కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్‌కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహదం పడుతుంది.
భారత్, జపాన్‌ల మధ్య 16 ఒప్పందాలు
 భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు డిసెంబర్ 12న ఢిల్లీలో జరిగింది. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో పాల్గొని చర్చలు జరిపారు. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుతోపాటు పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో కీలక సహకారం వంటి ముఖ్యమైన 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం వంటి ఒప్పందాలూ ఉన్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై - గుజరాత్ ముఖ్య వ్యాపార కేంద్రం అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు 12 బిలియన్ డాలర్ల (రూ. 98 వేల కోట్లు) ప్యాకేజీ ఇవ్వటంతో పాటు సాంకేతికంగా పూర్తి సహకారం అందించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల కాల వ్యవధికి.. 0.1 శాతం వడ్డీతో 80 శాతం నిధులను (రూ.98 వేల కోట్లు) జపాన్ అందించనుంది. దీంతో పాటు పౌర అణు ఒప్పందంలో సహకారం, రక్షణ రంగ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవటంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు.. దక్షిణ చైనా సముద్రం, ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మొదలైన అంశాలపైనా ఇద్దరు ప్రధానులు చర్చించారు.
ఒప్పందాల వివరాలు
శాంతియుత వినియోగానికి పౌర అణుశక్తి సహకార ఒప్పందంముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందంరక్షణ రంగంలో పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మార్పునకు ఒప్పందంపరస్పర మిలటరీ సమాచారం మార్పిడి చేసుకునే ఒప్పందంరెండు దేశాల మధ్య డబుల్ ట్యాక్సేషన్ తొలగింపు ఒప్పందంభారత రైల్వేలు, జపాన్ మౌలిక వసతుల మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందంభారత్‌లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత రైల్వే వ్యవస్థకోసం జపాన్ రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందంశాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు యువ పరిశోధకుల పరస్పర మార్పునకు సహకారం.భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ విభాగం, జపాన్ ఆరోగ్య శాఖ మధ్య సహకారం.ఇరుదేశాల మానవ వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంస్కృతి, క్రీడలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారంనీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ఆఫ్ జపాన్ మధ్య ఒప్పందంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తోయామా ప్రిఫెక్షర్ మధ్య పరస్పర సహకార ఒప్పందంకేరళ ప్రభుత్వం, జపాన్‌లోని మూడు నగరాల మేయర్ల మధ్య అభివృద్ధి ఒప్పందం.ఐఐఎం అహ్మదాబాద్, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ మధ్య ఒప్పందంభారత పర్యావరణ శాఖ, జపాన్ వ్యవసాయ, అటవీ శాఖ మధ్య సహకారం.

No comments:
Post a Comment