AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 12 February 2018

ఇండియా & వరల్డ్ 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

ఇండియా & వరల్డ్ జనవరి 2016 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-ఫ్రాన్స్‌ల మధ్య 16 ఒప్పందాలు
 ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ భారత పర్యటనలో జనవరి 24న ఇరు దేశాల మధ్య 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో హెలికాప్టర్ల తయారీ, పట్టణాభివృద్ధి, రవాణా, నీరు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సౌర విద్యుత్తు మొదలైన అంశాలు ఉన్నాయి. మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్.. చండీగఢ్‌లో భారత్-ఫ్రాన్స్ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్నారు. అంతర్జాతీయ సౌర విద్యుత్ దేశాల కూటమి (ఐఎస్‌ఏ) తాత్కాలిక కార్యాలయాన్ని న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ప్రారంభించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాంగణంలో ఐఎస్‌ఏ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హోలండ్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం
ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జనవరి 25న సంతకాలు జరిగాయి. దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన 36 ఫైటర్ జెట్లను ‘విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో’ కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని 2015లో మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు.

ఆర్మేనియాతో భారత్ ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం
భారత్, ఆర్మేనియాల మధ్య సవరించిన ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాలు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఫలితంగా పన్ను ఎగవేతలు తగ్గుతాయని అంచనా. ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వంద్వ పన్నుల నివారణ కన్వెన్షన్(DTAC)కు సంబంధించి సవరణపై భారత్, ఆర్మేనియా దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నల్లధనం పోగుపడకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ ఒప్పందంతో మరింత శక్తివంతం అవుతాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య 2004, సెప్టెంబర్ 9న డీటాక్ ఒప్పందం కుదిరింది.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ ఫిబ్రవరి 2016 ద్వైపాక్షిక సంబంధాలు
నేపాల్‌తో భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు
భారత్-నేపాల్‌ల మధ్య రవాణా, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 20న ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్-ముజఫర్‌పూర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్ బంగ్లాదేశ్‌ల మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం. విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

యూఏఈ, భారత్ మధ్య ఒప్పందాలు
అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహైన్ భారత పర్యటనలో భాగంగా.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) - భారత్ మధ్య ఫిబ్రవరి 11న తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. కరెన్సీ మార్పిడి, సంసృ్కతి, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, పునర్వినియోగ ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, బీమా పర్యవేక్షణ, సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యాభివృద్ధి, వాణిజ్య సమాచార మార్పిడికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, రక్షణ, సముద్ర భద్రత, మధ్య ప్రాచ్య పరిస్థితులు లాంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ, యువరాజు నహైన్ చర్చించారు.

రక్షణ సంబంధాల మెరుగుకు భారత్-బ్రూనై నిర్ణయం
 రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఇందులోభాగంగా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించాలని భారత్-బ్రూనై నిర్ణయించాయి. ఈ మేరకు మూడు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఫిబ్రవరి 2న బ్రూనై రాజధాని బందర్‌సెరి బేగవాన్ చేరుకున్నారు. అనంతరం సుల్తాన్ హసన్‌లాల్ బొల్కయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. సమాచారం, శిక్షణ, ఉమ్మడి సైనిక విన్యాసాలు, సెమినార్లు, చర్చలు వంటివి తరచూ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఎల్‌ఎన్జీ ఉత్పత్తిలో బ్రూనై ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ మార్చి 2016 ద్వైపాక్షిక సంబంధాలు
బంగ్లాదేశ్‌కు భారత్ విద్యుత్
 బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. మార్చి 23 నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్ ఇంటర్‌నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని, ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుం దని మోదీ అభివర్ణించారు. ఇప్పటికే మనకు పశ్చిమ, దక్షిణ ఇంటర్నెట్ గేట్‌వేలు ఉన్నాయని, ఇప్పుడు తూర్పున కూడా ప్రధానమైన ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడిందని మోదీ అన్నారు. బంగ్లాతో ఏర్పడిన ఈ ఈశాన్య గేట్‌వే అస్సాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు కనెక్టివిటీని ఏర్పరచిందన్నారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేసిన 400 కేవీడీసీ లైన్ల ద్వారా త్రిపుర నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ ఏప్రిల్ 2016 ద్వైపాక్షిక సంబంధాలు
మాల్దీవులతో భారత్ ఆరు ఒప్పందాలు
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఏప్రిల్ 11న ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందం కుదిరిన అంశాల్లో రక్షణ సహకారం, పన్నులు, పర్యాటకం, అంతరిక్ష పరిశోధన తదితరాలున్నాయి. వీటితో పాటు మాల్దీవుల్లో చారిత్రక కట్టడాలను పరిరక్షించడం, పునరుద్ధరించడంపై ఇరుదేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ కొంత కాలం నుంచి మాల్దీవుల్లో ఓడరేవులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తోంది.

సౌదీ అరేబియాతో భారత్ ఐదు ఒప్పందాలు
 ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద వ్యతిరేక అంశాలతోపాటు పలు కీలకాంశాల్లో సహకారాన్ని కొనసాగించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ నిర్ణయించారు. ఏప్రిల్ 3న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన విస్తృతస్థాయి చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా.. ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. భారత చమురు వినియోగంలో 5వ వంతు సరఫరా చేస్తున్న సౌదీ ఇకపై దీన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు సౌదీలో చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేసే అంశంపైనా మోదీ చర్చించారు. ప్రధాని మోదీకి సౌదీ ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లా’ను రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అందజేశారు. కాగా తన సౌదీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. సౌదీ రాజుకు కేరళలోని ‘చెరమన్ జుమా మసీదు’ బంగారు ప్రతిరూపాన్ని బహుమతిగా ఇచ్చారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ మే 2016 ద్వైపాక్షిక సంబంధాలు
ఇరాన్‌తో భారత్ 12 ఒప్పందాలు
 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇరాన్ పర్యటనలో భాగంగా మే 23న ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో చబహర్ ఓడరేవు అభివృద్ధితో పాటు అల్యూమినియం ప్లాంటు స్థాపన, ఆఫ్గానిస్తాన్, మధ్యాసియాలను అనుసంధానించే రైల్వేలైన్ ఏర్పాటు కోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంకుతో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం వంటివి ఉన్నాయి.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ జూన్ 2016 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, థాయ్‌లాండ్ మధ్య ఒప్పందాలు
రక్షణ, తీరప్రాంత భద్రతతోపాటు ఆర్థిక, సైబర్ సెక్యూరిటీ, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్-థాయ్‌లాండ్ నిర్ణయించాయి. జూన్ 17న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయుత్ చానోచా మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారిని పూర్తి చేయటంతోపాటు ఈ మూడు దేశాల మధ్య మోటారు వాహన ఒప్పందం జరగటాన్ని భారత-థాయ్‌లాండ్ దేశాలు ప్రాధాన్యతాంశంగా గుర్తించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలకు త్వరలోనే 70 వసంతాలు పూర్తవనున్నందున భారత్‌లో థాయ్ ఉత్సవం.. థాయ్‌లాండ్‌లో భారత్ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 2016-19 కాలానికి ‘సంస్కృతి మార్పిడికి ప్రత్యేక కార్యక్రమం’, నాగాలాండ్ వర్సిటీ, థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ వర్సిటీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అలాగే భారత్‌లోని బౌద్ధ స్థలాలను చూసేందుకు వచ్చే థాయ్‌లాండ్ పర్యాటకులకు డబుల్ ఎంట్రీ ఈ-టూరిస్టు వీసాలను ఇచ్చేలా కొత్త నిబంధనలను మోదీ ప్రకటించారు.

ఉగ్రవాదంపై భారత్ , యూఎస్ కీలక ఒప్పందం
 ఉగ్రవాదంపై పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలని భారత్, అమెరికా దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని అనుసరించి ఉగ్రవాదులు, అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన జీవితచరిత్రలతో సహా వారి సమాచారాన్ని ఇరు దేశాలు పరస్పరం అందజేసుకోవాలి. ఈ మేరకు ఒప్పందంపై జూన్ 2న హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అమెరికా రాయబారి రిచర్డ్ సంతకాలు చేశారు. ఇరుదేశాల్లో స్థిర అభివృద్ధి కోసం ఇంధన భద్రత, వాతావరణ మార్పుల విషయంలో పరస్పరం సహకారం పెంపొందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఖతర్‌తో భారత్ ఏడు ఒప్పందాలు
భారత్‌లో హవాలా లావాదేవీలను అరికట్టేలా రహస్య సమాచారాన్నిచ్చేందుకు ఖతర్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో పాటు.. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం గురించిన సమాచారాన్ని భారత్‌తో పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతర్ పర్యటనలో భాగంగా జూన్ 5న ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతోపాటు వ్యూహాత్మక పెట్టుబడులపై ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు చేకూర్చటంతోపాటు మద్దతిస్తున్న సంస్థలు, వ్యక్తుల విషయంలో సమాచారాన్ని పంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ఒప్పందాలతోపాటు అంతర్జాతీయ, ప్రాంతీయ మార్పులపై నిరంతరం చర్చలు జరిపేందుకు ఇరు దేశాల మంత్రులతో ఉన్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా భారత్
భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. తద్వారా.. రక్షణ రంగ వాణిజ్యం, సాంకేతికత బదిలీ విషయంలో అమెరికా అతి సన్నిహిత మిత్రులతో సమానంగా భారత్‌నూ పరిగణిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జూన్ 7న జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. అధీకృత నౌకాశ్రయ సందర్శనలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ, విపత్తు సహాయం కార్యక్రమాల్లో పరస్పరం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు లాజిస్టిక్స్ ఎక్సేంజ్ అవగాహన ఒప్పందాన్నీ ఇరు దేశాలూ ఖరారు చేశాయి. కాగా అమెరికాలోని సియాటిల్ నగరంలో భారత్ త్వరలో కొత్త దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించనుంది. అమెరికాలోని వాయువ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ల కోసం ఈ ఆరో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ జూలై 2016 ద్వైపాక్షిక సంబంధాలు
ప్రధాన మంత్రి మోదీ ఆఫ్రికా పర్యటన
మొజాంబిక్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొజాంబిక్ పర్యటనలో భాగంగా జూలై 7న ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసీతో సమావేశమయ్యారు. దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మొజాంబిక్‌తో దీర్ఘకాలిక పప్పు ధాన్యాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొజాంబిక్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటంలో భాగంగా.. ఎయిడ్స్‌కు చికిత్స చేసేందుకు వినియోగించే ఔషధాలు సహా నిత్యావసర ఔషధాలను భారత్ విరాళంగా ఇవ్వనుంది. అలాగే ఆ దేశ భద్రతా బలగాల సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ సాయపడుతుంది.

దక్షిణాఫ్రికా: ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జూలై 8న ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారం కోసం 8 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. జొహెనెస్‌బర్‌‌గలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ ప్రసంగించారు. 1893లో మహాత్మాగాంధీని రైల్లో నుంచి తోసేసిన రైల్వే స్టేషన్‌ను మోదీ సందర్శించారు. పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌కు పయనించారు.

టాంజానియా: ప్రధానమంత్రి మోదీ టాంజానియా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జాన్ పాంబే మగు ఫులితో సమావేశమయ్యారు. జూలై 10న దారెస్సలాంలో ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి.

కెన్యా: ఆఫ్రికా పర్యటనలో భాగంగా కెన్యాలో పర్యటించిన ప్రధాని మోదీ జూలై 11న నైరోబిలో ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్టాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, ద్వంద పన్నుల రద్దు, వీసా, గృహ నిర్మాణాలకు సంబంధించి 7 ఒప్పందాలు కుదిరాయి.

విమానాల కొనుగోలుకు భారీ ఒప్పందం 
రక్షణరంగ నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పర్చేలా బిలియన్ డాలర్ల వ్యయంతో (దాదాపు రూ.6,700 కోట్లు) నాలుగు నిఘా విమానాలు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8’లను కొనేందుకు భారత్.. అమెరికా రక్షణశాఖ, బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. తేలికపాటి ‘ఎం777’ రకం 145 శతఘు్నలను కూడా కొనడానికి భారత్ అమెరికాతో చర్చలు జరుపుతోంది. కాగా 22 ఆపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య 2015లో మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. 

భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ భారత పర్యటనలో భాగంగా జూన్ 30న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పోషకాహారం, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై చర్చించారు. కిమ్ పర్యటనలో సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత్‌కు ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల సాయం అందించనుంది. భారత్ 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ సెప్టెంబరు 2016 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-వియత్నాం మధ్య 12 ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటనలో సెప్టెంబర్ 3న ఆ దేశ ప్రధాని గుయేన్ ఫుక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ, ఐటీ, అంతరిక్షం, సైబర్ భద్రత, సముద్ర గస్తీ బోట్ల నిర్మాణం వంటి 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. రక్షణ రంగాన్ని మెరుగుపరచుకునేందుకు వియత్నాంకు భారత్ రూ.3,400 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆ దేశంలో సాఫ్ట్‌వేర్ పార్క్ ఏర్పాటు కోసం ప్రధాని రూ.34 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈజిప్ట్ అధ్యక్షుడి భారత్ పర్యటన
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసీ సెప్టెంబర్ 2న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే దిశగా రక్షణ, భద్రతా రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. నౌకా వాణిజ్యానికి సంబంధించి రవాణా ఒప్పందంపై సంతకాలు చేశారు.

మయన్మార్ అధ్యక్షుడి భారత్ పర్యటన
మయన్మార్ అధ్యక్షుడు హతిన్ క్యా ఆగస్టు 29న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మయన్మార్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది.

ఆస్ట్రేలియాలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’
 భారత్-ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలోని ఆరు నగరాల్లో పది వారాల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో భారత్, ఆస్ట్రేలియా దేశాల నృత్య, సంగీత, క్రీడలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ నుంచి అడిలైడ్, అలైస్ స్పింగ్‌‌స, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాల్లో జరగనున్నాయి.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ అక్టోబరు 2016 ద్వైపాక్షిక సంబంధాలు
ఐరాసలో తొలిసారి దీపావళి వేడుకలు
ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో అక్టోబర్ 31న తొలిసారి దీపావళి వేడుకలను నిర్వహించారు. దీపావళిని పురస్కరించుకొని ఐరాస ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో అలంకరించి హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు పెట్టారు. 

న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ భారత పర్యటన
 న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో అక్టోబర్ 26న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించిన మూడు ఒప్పందాలు కుదిరాయి. అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వంకు న్యూజిలాండ్ నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని జాన్ కీ హామీ ఇచ్చారు. కానీ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు.

సింగపూర్ ప్రదాని భారత పర్యటన
సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో అక్టోబర్ 4న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా మూడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో వాణిజ్యానికి ఊతమిచ్చే మేధో హక్కుల ఒప్పందం, ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, రాజస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఉదయ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టూరిజమ్ ట్రైనింగ్ ఏర్పాటు వంటి అంశాలున్నాయి.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు బ్రిక్స్ దేశాల పిలుపు
ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది. గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు.. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ అక్టోబర్ 16 ప్రకటన (గోవా డిక్లరేషన్) విడుదల చేశాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతోపాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. 
అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయి ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా చర్చించారు. జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఐక్యరాజ్యసమితి నిషేధం ముద్ర పడకుండా చైనా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. 

బ్రిక్స్-బిమ్స్‌టెక్ సదస్సు
అక్టోబర్ 16న గోవాలో జరిగిన బ్రిక్స్-బిమ్స్‌టెక్(బంగాళాఖాత దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార వేదిక) సదస్సులో సభ్యదేశాలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాధినేతలతో పాటు షేక్ హసీనా (బంగ్లాదేశ్), మైత్రిపాల సిరిసేన (శ్రీలంక), ప్రచండ (నేపాల్), ఆంగ్‌సాన్ సూచీ (మయన్మార్), సెరింగ్ తోబ్గే (భూటాన్), థాయ్‌లాండ్ విదేశాంగ సహాయ మంత్రి పాల్గొన్నారు.

రష్యాతో భారత్ 16 ఒప్పందాలు
భారత్ రష్యాల మధ్య రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా మొత్తం 16 ఒప్పందాలు కుదిరాయి. ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థ, అడ్మిరల్ గ్రిగోరోవిచ్ తరగతికి (ప్రాజెక్ట్ 11356) చెందిన 4 నిర్దేశిత క్షిపణి రహస్య యుద్ధ నౌకలు కొనడం (రూ. 20,016 కోట్లు), కమోవ్ హెలికాప్టర్ల తయారీ కోసం సంయుక్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి మూడు భారీ రక్షణ రంగ ఒప్పందాలు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా గోవా వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 15న సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
రూ.33,350 కోట్ల విలువైన ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ 400 కి.మీ. పరిధి వరకూ దూసుకెళ్లగల క్షిపణులు, డ్రోన్లు, రహస్య విమానాలతో సహా శత్రు విమానాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. అడ్మిరల్ గ్రిగోరోవిచ్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందం కింద రెండు నౌకలను రష్యా భారత్‌కు అందిస్తుంది. మరో రెండింటిని రష్యా సాయంతో భారత్‌లోనే నిర్మిస్తారు. కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం కింద రూ. 6,672 కోట్లతో 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను రష్యా, భారత్‌లు కలసి భారత్‌లోనే తయారు చేస్తాయి. 

ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి బ్రెజిల్ మద్దతు
అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రెజిల్ మద్ధతు తెలిపింది. గోవాలో ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్‌తో అక్టోబర్ 17న ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. జెనెటిక్ రిసోర్సస్, వ్యవసాయం, పశు సంక్షేమ, సహజ వనరులు, ఫార్మా ఉత్పత్తుల నియంత్రణ, పశువుల పునరుత్పత్తికి సాయపడే సాంకేతికత, పెట్టుబడుల సహకారం, సులభతరం చేయడం వంటి అంశాలకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ నవంబరు 2016 ద్వైపాక్షిక సంబంధాలు
సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్‌తో భారత్ ఒప్పందం
స్విట్జర్లాండ్‌లో 2018 సెప్టెంబర్ తర్వాత జరిగే భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను పొందేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2019 సెప్టెంబర్ నుంచి ‘ఆటోమేటిక్ షేరింగ్’ కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని మనదేశం పొందుతుంది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకొనే ‘సంయుక్త ప్రకటన’ ఒప్పందంపై సీబీడీటీ చైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోడిట్ నవంబర్ 22న సంతకాలు చేశారు.

సెర్న్‌లో అనుబంధ సభ్య దేశంగా భారత్
యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సెర్న్)లో భారత్ అనుబంధ సభ్య దేశంగా చేరింది. ముంబైలో నవంబర్ 21న దీనికి సంబంధించిన ఒప్పందంపై భారత్, సెర్న్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సెర్న్.. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ లేబొరేటరీ. 2004లో భారత్ ఇందులో పరిశీలక దేశంగా చేరింది. తాజాగా అనుబంధ సభ్య దేశంగా చేరడంతో భారత కంపెనీలు సెర్న్‌కు చెందిన ఇంజనీరింగ్ కాంట్రాక్ట్‌లను పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సెర్న్‌లో ఉద్యోగాలకు భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ సభ్యత్వం వల్ల భారత్‌కు దాదాపు రూ.78 కోట్ల వ్యయం అవుతుంది. సెర్న్ జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 22 సభ్య దేశాలు. నాలుగు అనుబంధ సభ్య దేశాలు ఉన్నాయి.

పౌర అణు ఒప్పందంపై భారత్-జపాన్ సంతకాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా నవంబర్ 11న ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టోక్యోలో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దీంతో జపాన్ తన అణు సాంకేతికతను, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైంది. దాదాపు ఆరేళ్ల పాటు జరిపిన అనేక చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందంతోపాటు మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచడం, రైల్వేలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాడానికి ఉద్దేశించిన మరో తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. 

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై భారత్ సంతకం చేయకపోయినా అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేందుకు భారత్‌కు మినహాయింపునిస్తూ జపాన్ ఈ ఒప్పందం చేసుకుంది. అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్‌‌స, నమీబియా, అర్జెంటీనా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఇప్పటికే భారత్ అణు ఒప్పందాలు చేసుకుంది.

సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన భారత్-శ్రీలంక
‘మిత్ర శక్తి-2016’ పేరుతో భారత్-శ్రీలంకలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలు నవంబర్ 6న ముగిశాయి. నాలుగో ద్వైపాక్షిక విన్యాసాల్లో భాగంగా శ్రీలంకలోని అంబెపూస వేదికగా 14 రోజుల పాటు వీటిని నిర్వహించారు. ఇందులో భారత సైన్యానికి చెందిన రాజ్‌పుతనా రైఫిల్స్ రెజిమెంట్, శ్రీలంక సైన్యానికి చెందిన సిన్హా రెజిమెంట్‌లు పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశాలకు లోబడి ఉగ్రవాద నిరోధక చర్యలపై కలిసి పనిచేయడంపై దృష్టిసారించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన, అనుభవాలను పంచుకోవడం, పరస్పర నమ్మకం, అవగాహనను పటిష్టం చేసుకోవడానికి ఈ విన్యాసాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇదే తరహా విన్యాసాలను గతేడాది సెప్టెంబర్‌లో పుణెలో నిర్వహించాయి.

ఇజ్రాయెల్ అధ్యక్షుడి భారత పర్యటన
తొమ్మిది రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్‌వెన్ రివ్లిన్ నవంబర్ 15న ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేలా రక్షణ భాగస్వామ్యం, ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

బ్రిటన్ ప్రధాని థెరెసా మే భారత పర్యటన
 మూడు రోజుల పర్యటన నిమిత్తం నవంబర్ 6న ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భారత్-బ్రిటన్ ఆర్థిక సంబంధాలు, నేరస్తుల అప్పగింత అంశాలతో పాటు వీసా నిబంధనలపై ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ ప్రధాని హామీ ఇచ్చారు. సులభ వాణిజ్యం, మేధోసంపత్తి హక్కులపై సహకారం పెంపునకు భారత్, బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యాధికారక సూక్ష్మజీవులపై పరిశోధనగాను రూ.107 కోట్లతో సంస్థను ఏర్పాటు చేస్తాయి.

మనీ లాండరింగ్ ఆరోపణలున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ సహా భారత్ వాంటెడ్ జాబితాలో ఉన్న 60 మందిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌ను కోరగా పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద తమ కస్టడీకి అప్పగించాలని 17 మందితో కూడిన జాబితాను బ్రిటన్ భారత్‌కు అందించింది.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ డిసెంబరు 2016 ద్వైపాక్షిక సంబంధాలు
అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా భారత్
భారత్‌ను అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తించే బిల్లుకు ఆ దేశ సెనేట్ ఆమోదం లభించింది. సెనేట్‌లో డిసెంబర్ 8న జరిగిన ఓటింగ్‌లో 92-7 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై సంతకం చేస్తే ఒప్పందం అధికారికంగా కార్యరూపం దాల్చుతుంది.

ఖతర్ ప్రధాని అబ్దుల్లా భారత్ పర్యటన
భారత్‌లో పర్యటించిన ఖతర్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ థానీతో డిసెంబర్ 3న ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వీసా, సైబర్ భద్రత, పర్యాటకం, పెట్టుబడులకు సంబంధించి ఐదు ఒప్పందాలు కుదిరాయి.ఖతర్ భారత్‌కు అత్యధికంగా 66 శాతం మేర ఎల్‌ఎన్జీని సరఫరా చేస్తోంది.

భారత రాయబార కార్యాలయాల్లో ఓపెన్ హౌస్
వీసా, పాస్‌పోర్ట్, ఓవర్‌సీస్ సిటిజన్‌‌స ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాల్లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్ణ వెల్లడించారు. ప్రతి పదిహేను రోజులకోసారి నిర్వహించే ఓపెన్ హౌస్ లో వీసా, పాస్‌పోర్టు సమస్యలను పరిష్కరిస్తారు.

అమృత్‌సర్‌లో 6వ హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు
 పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో డిసెంబర్ 3 - 4 తేదీల్లో 6వ హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు జరిగింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోన్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సదస్సు తీర్మానించింది. ఉగ్రవాదం అణిచివేత, ప్రాంతీయ సహకారం పెంపొందించడం ప్రధానాంశాలుగా ఈ సదస్సు జరిగింది. సదస్సు ముగింపు సందర్భంగా ‘అమృత్‌సర్ డిక్లరేషన్’ ను విడుదల చేశారు. 14 సభ్య దేశాలకు చెందిన సీనియర్ అధికారులు, ఐరోపా సమాఖ్య, నాటో, షాంఘై సహకార సంస్థ సహా 17 సభ్యేతర దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

‘ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ, రక్షణ, ఆర్థికసాయం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.

సదస్సు తీర్మానాలు 
‘ఆసియా ప్రాంతంలోని ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలి. వారికందే ఆర్థిక, వ్యూహాత్మక, ఆయుధ సాయాన్ని అడ్డుకోవాలి. 
చైనా-అఫ్గన్‌లను కలుపుతూ నిర్మిస్తున్న సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ ఒప్పందాన్ని సమావేశంలో స్వాగతించారు. 
అఫ్గన్ శరణార్థులు తిరిగి వస్తుండటంతో ఎదురవుతున్న సమస్యలతో అంతర్జాతీయ సాయానికి పిలుపునిచ్చారు. 
ఆసియా దేశాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై హర్షం. 
అఫ్గనిస్తాన్‌లో ఉత్పత్తవుతున్న నల్ల మందు, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని నిర్ణయం. 
భారత్ - ఇరాన్ - అఫ్గానిస్తాన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఛబహార్ రవాణా ఒప్పందం కారణంగా మధ్య ఆసియాకు ప్రపంచ మార్కెట్లతో బంధం మరింత బలపడుతుందని తీర్మానం తెలిపింది. 
అఫ్గాన్‌లో హిజ్బే ఇస్లామీ గుల్బుద్దీన్ హెక్‌మత్యార్ సంస్థతో.. ప్రభుత్వం జరి పిన శాంతి చర్చలపై హర్షం వ్యకమైంది. 

ఇండోనేసియా అధ్యక్షుడి భారత్ పర్యటన
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేపట్టాలని, రక్షణ, భద్రత సహా పలు కీలక రంగాల్లో పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఇండోనేసియా నిర్ణయిచాయి. ఈ మేరకు డిసెంబర్ 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య క్రీడలు, యువజన సర్వీసుల్లో పరస్పర సహకారం, ప్రామాణీకరణకు సంబంధించి రెండు ఒప్పందాలు కుదిరాయి.

భారత్, వియత్నాం మధ్య కుదిరిన అణు ఒప్పందం
వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు ఎన్‌గాయోన్ దచిన్‌గాన్ భారత్‌పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్ 9న పౌర అణు సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీంతోపాటు వైమానిక సంబంధాల్ని పెంచుకోవడం, ఇంధన రంగంలో ఉమ్మడి కృషి, పార్లమెంటరీ సహకారానికి సంబంధించి మరో మూడు ఇతర ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్నారు.

భారత్-కిర్గిజిస్థాన్ మధ్య ఆరు ఒప్పందాలు
కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు ఆల్మాజ్‌బెక్ అతంబయేవ్ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమలుకు విస్తృత ప్రాతిపదికను ఖరారు చేశాయి. తీవ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడతామనే కృతనిశ్చయాన్ని ప్రకటించాయి. దీంతోపాటు ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో వ్యవసాయం, పర్యాటక రంగం, సాంస్కృతిక, ప్రసార, యువజన వ్యవహారాల్లో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందాలు ఉన్నాయి.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment