AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

జాతీయం 2013 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

జాతీయం 2013 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

జనవరి 2013 జాతీయం
మూడు కొత్త హైకోర్టులు
కేంద్ర ప్రభుత్వం మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్తగా మూడు హైకోర్టులను ఏర్పాటు చేసింది. త్రిపుర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి నలుగురు న్యాయమూర్తులు.. మేఘాలయ, మణిపూర్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తితో కలిపి ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఈ మూడు కొత్త హైకోర్టులతో కలిపి దేశంలో హైకోర్టుల సంఖ్య 21 నుంచి 24కు పెరిగింది.

27 శాతం పెరిగిన పాఠశాలలు
దేశంలో 2002-09 మధ్య పాఠశాలల సంఖ్య 27 శాతం పెరిగినట్లు ఎనిమిదో ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వే (ఏఐఈఎస్‌టీ) పేర్కొంది. అదే సమయంలో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 30 శాతానికిపైగా పెరిగినట్లు తెలిపింది. ఈ సర్వేను జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) జనవరి 22న విడుదల చేసింది. దీన్ని సర్వశిక్షా అభియాన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని లెక్కించేందుకు, అమలును పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తారు.

ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సదస్సు
ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో జనవరి 17న ప్రారంభించారు. 75 శాతం కేసుల్లో అంధత్వాన్ని, 85 శాతం కేసుల్లో దష్టి లోపాన్ని సరి చేయవచ్చని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సంఘం అధ్యక్షుడు ఫ్రాంక్ మార్టిన్, అంతర్జాతీయ నేత్ర వైద్యుల మండలి అధ్యక్షుడు బ్రూస్ స్పివే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.

స్వామి వివేకానందపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల
స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 12న ప్రత్యేక తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్)ను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. స్వామి వివేకానంద బోధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కోచిలో ప్రవాసీ భారతీయ దివస్
కేరళలోని కోచిలో 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు. ఇదే వేదికపై ‘గదర్ ఉద్యమం’ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జనవరి 8న ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, తమ విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారు దేశ సామాజిక, ఆర్థిక అభివద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్‌కు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ భారత ఆర్థిక వద్ధిలో పాల్పంచుకోవాలంటూ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. 40 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘ఎంగేజింగ్ డయాస్పొరా-ది ఇండియన్ గ్రోత్ స్టోరీ’ అనే ఇతివత్తంతో ఈ సదస్సు జరిగింది. 2003 జనవరి నుంచి ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తున్నారు.

మహా కుంభమేళా ప్రారంభం
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక, మతపరమైన వేడుకగా పేరొందిన మహా కుంభ మేళా జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్)లో ప్రారంభమైంది. మార్చి 10న మహా శివరాత్రి దాకా 56 రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి దాదాపు పది కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అలహాబాద్ కుంభమేళా... ప్రపంచం మొత్తంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇప్పటికే రికార్డు సష్టించింది. 

2001లో అలహాబాద్‌లో జరిగిన పూర్ణ కుంభమేళాలో 6 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. 

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. పులికాట్ సరస్సుకు అధిక సంఖ్యలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షుల ప్రాధాన్యతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహించింది. గుజరాత్‌లోని రాణాఆఫ్ కచ్ నుంచి ఈ పక్షులు వేలాది సంఖ్యలో ఇక్కడకు వలస వస్తాయి.

నగదు బదిలీ పథకం ప్రారంభం
దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 జిల్లాల్లో జనవరి 1న ప్రారంభించింది. తొలుత ఈ పథకాన్ని 51 జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించినా.. లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి కారణాలతో 20 జిల్లాలకే పరిమితం చేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్టెపెండ్‌లు, వితంతు పింఛన్లు, ఇందిరా మాతృత్వ యోజన, ధనలక్ష్మి పథకం తదితర ఏడు పథకాల కింద తొలి విడతలో ‘నగదు బదిలీ’ చేపట్టనున్నారు. ఆహార పదార్థాలు, ఎరువులు, డీజిల్, కిరోసిన్‌ల సబ్సిడీపై ‘నగదు బదిలీ’ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో జనవరి 6న నగదు బదిలీ పథకం ప్రారంభమైంది. వచ్చే ఆగస్టు నాటికి నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేస్తారు. తొలిదశలో ఐదు పథకాలకే(పింఛన్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, జననీ సురక్ష యోజన, బాల కార్మిక పాఠశాల విద్యార్థుల స్టయిపెండ్) నగదు బదిలీ పథకాన్ని కుదించారు.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2013 జాతీయం
‘కావేరి తీర్పు’పై నోటిఫికేషన్
కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్ 90 రోజుల్లోగా అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత కర్ణాటక విధిగా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జస్టిస్ ఎన్.పి. సింగ్ చైర్మన్‌గా, ఎన్.ఎన్.రావు, సుధీర్ నారాయణ్‌లు సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరిలో కావేరీ జలాల పంపిణీపై ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. కావేరి బేసిన్‌లో దిగువ కోలెరూన్ ఆనకట్ట వద్ద 740 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు నిర్ధారించింది. తమిళనాడుకు 419 టీఎంసీలు (వాస్తవ డిమాండ్ 562 టీఎంసీలు), కర్ణాటకకు 270 టీఎంసీలు (వాస్తవ డిమాండ్ 465 టీఎంసీలు), కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్టు అందులో వివరించింది. పర్యావరణ పరిరక్షణకు 10 టీఎంసీల నీటిని రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై కర్ణాటక, తమిళనాడు రెండూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అప్పట్నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దాంతో ఇంతకాలం తీర్పును గెజిట్‌లో ప్రచురించకపోవడంతో అమలు కాలేదు. కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

బీహెచ్‌ఈఎల్‌లో బీహెచ్‌పీవీ విలీనం
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్‌ఈఎల్)లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్ (బీహెచ్‌పీవీ) విలీనానికి ఫిబ్రవరి 21న కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. దీంతో బీహెచ్‌పీవీ... బీహెచ్‌ఈఎల్‌కు అనుబంధ కంపెనీగా మారనుంది. బీహెచ్‌పీవీని 1966లో విశాఖపట్నంలో స్థాపించారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ20 ప్రయోగం విజయం
ఇస్రో ఫిబ్రవరి 25న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ20 ప్రయోగం విజయవంతమైంది. భారత్-ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన 409 కిలోల సరళ్ (శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ అల్టికా)తోపాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-20 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సముద్రాల అధ్యయనానికి తోడ్పడే సరళ్ ఉపగ్రహంతోపాటు కెనడాకు చెందిన 148 కిలోల సఫైర్, 74 కిలోల నియోశాట్, ఆస్ట్రియాకు చెందిన 14 కిలోల ఎన్‌ఎల్‌ఎస్ 8.1 (యూనిబ్రైట్), ఎన్‌ఎల్‌ఎస్ 8.2(బ్రైట్), డెన్మార్క్‌కు చెందిన 3 కిలోల ఎన్‌ఎల్‌ఎస్ 8.3, ఇంగ్లండ్‌కు చెందిన 6.5 కిలోల స్టాండ్-1 ఉపగ్రహాలను విజయవంతంగా లక్ష్యానికి చేర్చింది. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ20ని నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించారు. మొత్తం 229.7 టన్నుల బరువుతో అది నింగికేసి దూసుకెళ్లింది. 

నిర్లవణీకరణ ప్రాజెక్ట్ ప్రారంభం
సముద్ర జలాలను తాగు నీరుగా మార్చేందుకు ఉద్దేశించిన నిర్లవణీకరణ ప్రాజెక్ట్‌ను తమిళనాడు కాంచీపురం జిల్లాలోని నెమిలి వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఫిబ్రవరి 22న ప్రారంభించారు. దీన్ని రూ.871 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిత్యం 265 మిలియన్ లీటర్ల సముద్ర నీటిని 100 మిలియన్ లీటర్ల తాగు నీరుగా మార్చనున్నారు. దీనివల్ల చెన్నైలోని వేలాచ్చారి, పళ్లిపట్టు, తిరువాన్మయూరులలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మందికి మంచి నీరు అందనుంది.

పోఖ్రాన్‌లో వైమానిక విన్యాసాలు
భారత వాయుసేన (ఐఏఎఫ్) తొలిసారిగా పగలు-రాత్రి విన్యాసాలతో తన యుద్ధ పాటవాన్ని ప్రదర్శించింది. ఫిబ్రవరి 22న రాజస్థాన్‌లోని థార్ ఎడారి సమీపంలోని పోఖ్రాన్ వద్ద ‘ఉక్కు పిడికిలి 2013’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధ విన్యాసాల్లో ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరాజ్2000, జాగ్వర్, మిగ్-21 వంటి ఫైటర్ జెట్‌లు, మిసైల్ లాంచర్లు, హెలికాప్టర్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మొదటి జియోథర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంలో మొదటి జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), ఛత్తీస్‌గఢ్ పునర్వినియోగ ఇంధన అభివద్ధి సంస్థల మధ్య ఫిబ్రవరి 16న ఒప్పందం కుదిరింది. భూమి అంతర్భాగంలో నిల్వఉన్న ఉష్ణం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి పునర్వినియోగ ఇంధనాల గుర్తిం పును జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత మూడు దశాబ్దాలుగా చేపడుతుంది. విద్యుత్ ఉత్పత్తికి అనువైన 340 ఉష్ణ ప్రాంతాలను ఇది గుర్తించింది.

2171 మందిని అనర్హులుగా ప్రకటించిన ఎన్నికల సంఘం
లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలకు పోటీ చేసిన 2171 మందిని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 15న అనర్హులుగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటిం చిన 30 రోజులలోపు ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించకపోవడంతో వారిని అనర్హులుగా గుర్తించింది. వీరిలో చాలావరకు ఎన్నికల్లో ఆషామాషీగా పోటీ చేసినవారే. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద అనర్హత వేటు పడినవారు మరో మూడేళ్లపాటు ఎన్ని కల కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదు. ఈ అనర్హత పొందిన వారిలో అత్యధికంగా 260 మంది మహా రాష్ర్టకు చెందినవారున్నారు.

రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకం ప్రారంభం
బాలల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ‘రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకాన్ని’ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫిబ్రవరి 6న మహారాష్ట్రలోని ఫాల్ఘార్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద జననానికి ముందే వైకల్యానికి కారణమయ్యే వ్యాధులు, లోపాలు, ఇతర సమస్యలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు. దీన్ని ‘చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్’ కార్యక్రమంగా దేశంలో 27 కోట్ల మంది పిల్లలకు వర్తింపజేస్తారు. దేశంలోని అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు.

సైన్యంలో ‘రుద్ర’ హెలికాప్టర్లు
హెలికాప్టర్ ‘రుద్ర’ను బెంగళూరులో ఫిబ్రవరి 8న ఏరో ఇండియా-2013 ప్రదర్శనలో సైన్యానికి అప్పగించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాలు కలిగి ఉండే తొలి హెలికాప్టర్ ‘రుద్ర’. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సైన్యానికి అందజేస్తున్న 60 హెలికాప్టర్లలో మొదటిది ఇది. త్వరలో తొలి ‘రుద్ర’ హెలికాప్టర్ స్వాడ్రన్ అందుబాటులోకి రానుంది. ఒక్కో స్వాడ్రన్‌లో 10 రుద్ర హెలికాప్టర్లు ఉంటాయి. ఎం.కె.-4 తరహాకు చెందిన తేలికపాటి ఆధునిక హెలికాప్టర్ ‘రుద్ర’. ఆయుధాలు, లక్షిత వ్యవస్థ, హెచ్చరిక, ప్రతిచర్యలు లెక్కించే, కాపాడుకునే వ్యవస్థలు ఈ హెలికాప్టర్‌లో ఉంటాయి.

బెంగళూరులో ‘ఏరో ఇండియా-2013’ ప్రారంభం
ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా-2013’ బెంగళూరులోని యలహంక వద్ద రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని ఫిబ్రవరి 6న ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు కొనసాగింది. సైనిక, పౌర విమాన, అవియోనిక్స్ రాడార్స్‌కు చెందిన అత్యాధునిక అంతర్జాతీయ టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శించారు. దేశ, విదేశాలకు చెందిన 600 కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రదర్శించాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ వంటి 27 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు
పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు (43)ను ఫిబ్రవరి 9న తీహార్ జైలులో ఉరి తీశారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఫిబ్రవరి 3న తిరస్కరించడంతో ఉరి అమలు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి కేసులో నిందితుడు. ఆ దాడిలో 9 మంది మరణించారు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారుడు ‘గురు’కు 2002 డిసెంబర్‌లో ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించగా, 2005 ఆగస్ట్ 4న దాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది. తర్వాత అఫ్జల్ గురు భార్య క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. గురు స్వస్థలం కాశ్మీర్ లోయలోని సోహార్ సమీపంలోని దోల్‌ఘా గ్రామం. దేశంలో గత కొద్ది నెలల్లో అమలు జరిగిన రెండో మరణశిక్ష ఇది. 2008 నవంబర్ 26న ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉరి తీశారు.

అనంతపూర్ పేరు ‘అనంతపురం’గా మార్పు
అనంతపూర్ జిల్లా పేరును ‘అనంతపురం’గా మార్చాలని ప్రభుత్వం ఫిబ్రవరి 8న నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గెజిట్‌లో ప్రచురించేందుకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లో అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేయొచ్చు.

భెల్, గెయిల్‌కు ‘మహారత్న’
ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది. దీంతో ఈ రెండు సంస్థలు రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు నవరత్న హోదా మాత్రమే ఉంది. నవరత్న కంపెనీలకు రూ. 1,000 కోట్ల దాకా పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. 

ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు
13వ ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ‘ది గ్లోబల్ ఛాలెంజ్ ఆఫ్ రిసోర్స్-ఎఫిషియంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్’ అనే ఇతివత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. దీనికి 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదానం చేసిన 
అవార్డుల వివరాలు.. 

2013 సుస్థిరాభివద్ధి అవార్డు: సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మైఖేల్‌కు దక్కింది. ఆయన తరఫున సీషెల్స్ విదేశాంగ మంత్రి జీన్ పౌల్ ఆడమ్ ఈ అవార్డు అందుకున్నారు. జార్జెస్కూ-రోజెన్ అవార్డు: కోజ్ మయామి (తొకుషిమా యూనివర్సిటీ), యాక్సియన్ ఎకొలాజికా అండ్ ఆయిల్ వాచ్ సంస్థకు దక్కింది. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టీఈఆర్‌ఐ) అనే సంస్థ 2001 నుంచి ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు (డీఎస్‌డీఎస్)ను నిర్వహిస్తోంది.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2013 జాతీయం
మిస్ ఇండియా 2013గా నవనీత్ కౌర్
ఫెమీనా మిస్ ఇండియా -2013గా నవనీత్ కౌర్ ధిల్లాన్ (చండీఘడ్) ఎంపికైంది. ఈ పోటీలో తొలి రన్నరప్‌గా విశాఖపట్నంకు చెందిన శోభితా ధూళిపాళ నిలిచింది. ఈమెను మిస్ ఇండియా ఎర్త్ 2013గా, రెండో రన్నరప్‌గా నిలిచిన జోయా అఫ్రోజ్(లక్నో)ను మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013గా ప్రకటించారు.

అత్యాచార నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013’ పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. మహిళలను వెంటాడటం, శంగారంలో ఉన్న వారిని చూడటం వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష వంటివి బిల్లులోని ప్రధానాంశాలు.

1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు తీర్పు
1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు మార్చి 21న అంతిమతీర్పునిచ్చింది. ఈ దాడులకు కుట్రపన్నిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్‌కు కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. మరో పది మంది నిందితులకు టాడా కోర్టు విధించిన మరణశిక్షను యూవజ్జీవ శిక్షగా మార్పు చేసింది. మరో 25 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. ఈ కేసులో సంజయ్‌దత్ ఇప్పటికే ఏడాదిన్నరపాటు శిక్ష అనుభవించారు. పేలుళ్లకు తెప్పించిన ఆయుధాల కన్‌సైన్‌మెంట్‌లోని ఆయుధాలనే సంజయ్‌దత్ అక్రమంగా పొందాడని కోర్టు నిర్థారించింది. 1993 ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.

‘ఆర్‌బీవీఆర్ రెడ్డి అప్పా’
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) పేరును రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి రాష్ర్ట పోలీస్ అకాడమీ (ఆర్‌బీవీఆర్ రెడ్డి అప్పా)గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. 

‘తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం’గా 2013
తెలుగు భాష, సంస్కతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను ‘తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరం’గా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

తొలి మిహళా తపాలా కార్యాలయం
కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా దేశంలోనే తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. అందరూ మహిళలే పని చేయడం ఈ కార్యాలయం ప్రత్యేకత.

ఐదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం 
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మార్చి 9న ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. వివరాలు..
నాగాలాండ్-అశ్వినీ కుమార్ (సీబీఐ మాజీ డెరైక్టర్)
ఒడిశా-ఎస్‌సీ జమీర్ (కాంగ్రెస్ నాయకుడు)
త్రిపుర గవర్నర్‌గా ఉన్న డీవై పాటిల్ బీహార్ గవర్నర్‌గా, 
బీహార్ గవర్నర్‌గా ఉన్న దేవానంద్ కన్వర్ త్రిపుర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. 
నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న నిఖిల్ కుమార్ (ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్) కేరళ గవర్నర్‌గా బదిలీ అయ్యారు (గతేడాది జనవరిలో కేరళ గవర్నర్ ఎంఓహెచ్ ఫరూఖీ మరణించినప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భర ద్వాజ్ నిర్వర్తిస్తున్నారు). 

కొత్త సీఎంల ప్రమాణం
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో వరుసగా మూడోసారి మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ మార్చి 6న ప్రమాణ స్వీకారం చేశారు. మాణిక్ సర్కార్ వరుసగా నాలుగో సారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా (కాంగ్రెస్) మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు. సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పగ్గాలను చేపట్టారు. 

పౌర సేవల బిల్లుకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలను నిర్దిష్ట కాల వ్యవధిలోగా అందించటాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన సంబంధిత బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 7న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ కార్యాలయం పౌరులకు అందించే సేవలను, సరుకుల వివరాలను తెలియజేసే ఒక పట్టికను విధిగా బహిరంగ పరచాల్సి ఉంటుంది. ఏ పనికి ఎంత సమయం పడుతుంది? సేవలు సరిగా అందనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అన్ని వివరాలను ఆ పట్టికలో తెలపాలి. ప్రతిపాదిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటానికి వీలుగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులను, సూచనలను స్వీకరించే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్రంలో, ప్రతి రాష్ట్రంలో ఒక కమిషన్‌ను నియమించాలని సూచించింది.

ముగిసిన మహా కుంభమేళా
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ‘మహా కుంభమేళా’ మార్చి 10న (మహాశివరాత్రి రోజున) ముగిసింది. జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్) లో ప్రారంభమై 55 రోజులపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో 12 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న మౌని అమవాస్య రోజున అత్యధికంగా నాలుగు కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అలహాబాద్ కుంభమేళా... ప్రపంచం మొత్తంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇప్పటికే రికార్డు సష్టించింది.

వరంగల్‌కు ఉత్తమ వారసత్వ నగరం అవార్డు 
జాతీయ పర్యాటక అవార్డుల్లో భాగంగా 2011-12 ఏడాదికిగాను ఉత్తమ వారసత్వ నగరం విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వారసత్వ సంపదను కాపాడటం, పర్యాటకరంగ ఉద్యోగులకు నైపుణ్యం పెంచడం, పర్యాటకులకు ఆతిథ్య సేవల విస్తరణ, భద్రతను కల్పించేందుకు టూరిజం, పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచడం వంటి అంశాలాధారంగా వరంగల్‌కు ఈ పురస్కారం దక్కింది.

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. బాబ్లీని కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2.74 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సూచించింది. వర్షాకాలమంతా ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని, వర్షాకాలంలో నదీ ప్రవాహానికి అడ్డంకి కల్పించరాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా నీటి పంపకాన్ని పర్యవేక్షించేందుకు ఒకకమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మరొకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యవహరిస్తారని చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణపై కమిటీకి దిశానిర్దేశం చేసింది. 1975లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60 టీఎంసీల పరిమితికి లోబడే మహారాష్ట్ర నీటిని వాడుకుంటోందని అభిప్రాయపడింది. పోచంపాడు రిజర్వాయర్ పరిధిలో 0.6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున, అంతే పరిమాణంలో నీటిని మహారాష్ట్ర మార్చి 1న ఏపీకి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. శ్రీరాంసాగర్ ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో పిటిషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్ మెట్రోకు అవార్డు
హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)కు ‘బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్‌ఎంఆర్ ఎండీ ఏవీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక ‘గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్’ కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28న వెల్లడించింది. వివరాలు..

త్రిపుర: అధికార లెఫ్ట్‌ఫ్రంట్ విజయం సాధించి వరుసగా ఐదోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 60 సీట్లకు గాను 50 స్థానాల్లో లెఫ్ట్‌ఫ్రంట్ (సీపీఎం-49 స్థానాలు, సీపీఐ-1 స్థానం) గెలిచింది.

నాగాలాండ్: నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 59 అసెంబ్లీ స్థానాలకు గాను 37 సీట్లలో గెలుపొందింది.

మేఘాలయ: మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) గెలిచింది.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2013 జాతీయం
తీర గస్తీనౌక ‘రాజ్‌దూత్’ ప్రారంభం
తీర గస్తీనౌక ‘రాజ్‌దూత్’ను కోల్‌కతాలో ఏప్రిల్ 22న ప్రారంభించారు. ఈ నౌకను గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్‌‌స అండ్ ఇంజనీర్‌‌స సంస్థ నిర్మించింది. ఇన్‌షోర్ పాట్రోల్ వెజల్స్ (ఐిపీవీ)కు చెందిన ఎనిమిదిలో రాజ్‌దూత్ ఆరోది. అత్యంత ఆధునిక కమ్యూనికేషన్, నావిగేషన్ పరికరాలు ఉన్న ఈ నౌక 34 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. గస్తీ, వెతకడం, కాపాడడం, వైద్యసేవకు తరలించడం వంటి విధులను ఈ నౌక నిర్వహిస్తుంది.

‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఆడపిల్లల చదువును పోత్సహించడానికి ఉద్దేశించిన ‘బంగారు తల్లి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డిలో ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు జననం నమోదైనప్పటి నుంచి కాలేజీ చదువు వరకూ ఏటా ప్రోత్సాహకాలను అందిస్తారు. మధ్యలో బడి ఆపకుండా చదివే అమ్మాయికి కాలేజీ చదువుల వరకూ మొత్తం ’ 55,500 ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 18 ఏళ్ల వరకు వివాహం చేసుకోకుండా 12వ తరగతి పూర్తి చేసిన ఆడపిల్లలకు ’ 50,000, డిగ్రీ పూర్తిచేస్తే మరో ’ 50,000 బహుమతిగా ఇస్తారు. ఈ ప్రోత్సాహకాలు ఇప్పటివరకు ఆడపిల్లలకు కల్పిస్తున్న ప్రయోజనాలకు అదనంగా ఉంటాయి. 

స్థాయి సంఘాలకు చైర్మన్‌ల నియామకం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలకు చైర్మన్లను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ 24న ప్రకటించారు. మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి చైర్మన్లుగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మందిని, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ముగ్గురిని నియమించారు. రాష్ర్ట శాసనసభ, శాసనమండలిలోని మొత్తం సభ్యులు ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ప్రతి సంఘంలో 31 మంది సభ్యులుగా ఉంటారు. బడ్జెట్‌లో శాఖల వారీగా జరిపిన కేటాయింపులపై స్థాయి సంఘాలు సమగ్రంగా చర్చించి నివేదికలను రూపొందిస్తాయి. ఆ స్థాయి సంఘాలు ఆమోదించిన పద్దులను ఉభ య సభలు రెండో సమావేశాల్లో ఆమోదిస్తాయి.

గుంతకల్ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ‘ఫైవ్ ఎస్ సర్టిఫికెట్’
దక్షిణమధ్య రైల్వే పరిధిలోని గుంతకల్ డివిజన్‌కు ‘క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా’ అందజేసే ప్రతిష్టాత్మక ‘ఫైవ్ ఎస్ సర్టిఫికేషన్ అవార్డు’ లభించింది. తద్వారా భారతీయ రైల్వేలో ఈ అవార్డు సాధించిన తొలి డివిజన్‌గా నిలిచింది. ప్రాధాన్యతాక్రమంలో ఫైళ్లు.. సేవల విభజన, క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం/అందించడం, పరిశుభ్రత, సేవలస్థాయి ప్రామాణీకరణ, ఈ నాలుగు అంశాల కొనసాగింపు... ఇలా ఐదు ముఖ్యమైన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. జపాన్ భాషలో ఈ ఐదు పదాలు(ఆంగ్లంలో రాస్తే) ‘ఎస్’తో మొదలవుతున్నందున దీనిని ‘ఫైవ్ ఎస్ సర్టిఫికేషన్ అవార్డు’గా పిలుస్తారు.

అకాడమీల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య, సంగీత, లలితకళా అకాడమీలను పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష సంస్కతి, నత్యం, కళలను పోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2012 డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల్లో వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వీటిని 1985లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. 

ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రెవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 వతరగతి వరకు తెలుగు, ఆంగ్ల భాషలను తప్పనిసరిగా చదివేలా ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష అమలును మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

హైదరాబాద్‌లో యూఎన్‌డబ్ల్యూటీవో సదస్సు
తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణ ఆసియాల 25వ పర్యాటక సమావేశాలు హైదరాబాద్‌లో ఏప్రిల్ 11 నుంచి మూడు రోజులు జరిగాయి. 21 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఈ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా యూఎన్‌డబ్ల్యూటీవో సుస్థిర పర్యాటక అభివద్ధి సమావేశం కూడా జరిగింది. సుస్థిర పర్యాటక రంగం అభివద్ధిలో అవలంబించాల్సిన ఉత్తమ వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. తూర్పు, పసిఫిక్, దక్షిణాసియాల తదుపరి పర్యాటక సమావేశం ఫిలిిఫ్పీన్స్‌లో, యూఎన్‌డబ్ల్యూటీవో సమావేశాన్ని 2015లో కాంబోడియాలో జరిపేందుకు నిర్ణయించారు. 

ప్రాజెక్ట్ డయల్ -100 ప్రారంభం
పోలీసులు అత్యవసర సేవలు అందించే ‘ప్రాజెక్ట్ డయల్-100’ను ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ఏప్రిల్ 11న ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ను జీవీకే ఈఎంఆర్‌ఐ-రాష్ట్ర పోలీసుశాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ 100 నెంబర్‌కు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఫోన్ చేయవచ్చు. వారు సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించి స్పందించేటట్లు చూస్తారు. పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి సేవలు అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ‘డయల్ 100’ కేంద్రం ద్వారా ఇతర అత్యవసర సేవలైన మెడికల్, ఫైర్, ఇతర విపత్తు నిర్వహణ సేవలను అనుసంధానం చేస్తారు. ఈ వ్యవస్థను జీపీఎస్/ జీఐఎస్ సర్వర్‌ను అనుసంధానించడం వల్ల ఫోన్ చేసిన వారి ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి పోలీసు వాహనాలు చేరడాన్ని పర్యవేక్షిస్తారు.

ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... న్యాయం ఆలస్యంగా అందుతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, వద్ధులు, పిల్లలు పట్ల జరిగే నేరాలను విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ న్యాయాలయాల వల్ల గ్రామీణులకు తక్కువ వ్యయంతో న్యాయం అందించే వీలవుతుందన్నారు. సమావేశంలో న్యాయశాఖమంత్రి అశ్వినీకుమార్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ పాల్గొన్నారు. 

స్వర్ణోత్సవాలు జరుపుకున్న సీబీఐ
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వర్ణోత్సవాలు ఏప్రిల్ 6న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సుపరిపాలన లేకపోవడం సమాజంలో రుగ్మతలకు కారణమని, అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు ప్రదానం చేశారు.

ఏపీలో 10 కొత్త రెవెన్యూ డివిజన్లు 
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏడు జిల్లాల్లో 10 రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న ఏర్పాటు చేసింది. అవి.. రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి (రంగారెడ్డి), గురజాల (గుంటూరు), దేవరకొండ (నల్గొండ), రామచంద్రాపురం (తూర్పుగోదావరి), అనకాపల్లి (విశాఖపట్నం), ఆత్మకూరు, నాయుడుపేట (నెల్లూరు), కళ్యాణదుర్గం, కదిరి (అనంతపురం). ఈ కొత్త డివిజన్లతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 89కి చేరింది. 

AIMS DARE TO SUCCESS 

మే 2013 జాతీయం
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో 24 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దక్షి ణ బస్తర్ ప్రాంతంలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మరికొద్ది నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా జరిగిన సభలో పాల్గొని వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చి, ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి పలువురు నేతలను హతమార్చారు. వీరిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, పలువురు నేతలు ఉన్నారు.

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
నావికాదళ నూతన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తర్కష్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గోవా తీరంలో మే 22న నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత మార్గంలో ప్రయాణించి బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎ.శివథానుపిళై ్ల వెల్లడించారు.

గుర్గావ్‌లో తొలి రక్షణ విశ్వవిద్యాలయం
హర్యానాలోని గుర్గావ్‌లో బినోలా వద్ద ఏర్పాటు చేస్తున్న తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 23న శంకుస్థాపన చేశారు. ఐఐటీ, ఐఐఎం స్థాయిల్లో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం 2018నాటికి పనిచేయడం ఆరంభిస్తుంది. ఇందులో రక్షణ అధ్యయనాలు,రక్షణ నిర్వహణ,రక్షణకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీల్లో ఉన్నత విద్యను అందిస్తారు. ఇం దులో సైనిక దళాల నుంచి 66 శాతం, ఇతర ప్రభుత్వ సంస్థ ల నుంచి 33 శాతం విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.

మలయాళంకు ప్రాచీన భాష హోదా
మలయాళం భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ మే 23న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3.33 కోట్ల మంది మలయాళం మాట్లాడేవారున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన నాలుగో భాష మలయాళం. ఇప్పటికే తమిళం, కన్నడం, తెలుగు భాషలకు ఈ హోదా దక్కింది. ఈ హోదా వల్ల మలయాళం భాష, సాహిత్యాలను ప్రోత్సహించేందుకు అనేక ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. కేంద్రం నుంచి రూ. 100 కోట్ల సహాయం దక్కుతుంది. అంతేకాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో మలయాళం పీఠం ఏర్పాటు చేసేందుకు యూజీసీ తోడ్పడుతుంది.

పిల్లల గల్లంతుపై సుప్రీం మార్గదర్శకాలు
గల్లంతైన పిల్లలతోపాటు ఇతర నేరాలకు బాధితులైన బాలల రక్షణకు సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. బచ్‌పన్ బచన్ ఆందోళన్ (బీబీఏ) అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల గల్లంతు, వారి అక్రమ తరలింపు సమస్యలపై దాఖలు చేసిన పిటిషన్‌ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో 2009-11 కాలంలో 75,808 మంది పిల్లలు కనిపించకుండా పోయినట్లు గణాంకాలు చెబుతుండగా, పిల్లల గల్లంతుకు సంబంధించి ఇంతవరకు నమోదుకాని కేసుల్లో నెల్లాళ్ల వ్యవధిలోనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తగిన ఆధారాలు లభించేంత వరకు పిల్లల గల్లంతు కేసులన్నింటినీ కిడ్నాప్ కేసులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. బాలలపై నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లోను సుశిక్షితుడైన అధికారిని బాలల సంక్షేమ అధికారిగా నియమించాలని ఆదేశించింది.

ఢిల్లీలో 45వ భారత కార్మిక సదస్సు
45వ భారత కార్మిక సదస్సు ఢిల్లీలో మే 17న జరిగింది. ఈ సదస్సును ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2004 నుంచి 2010 వరకు ప్రభుత్వం 20 మిలియన్ల అదనపు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇదే కాలంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా (కె.జి. సేన్‌గుప్తా) నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మే 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తాతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ సేన్‌గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1953లో కోల్‌కతాలో జన్మించిన జస్టిస్ సేన్‌గుప్తా 1981లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 

గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్స్.. ‘గూగుల్ ఇండియా’తో ఓ అవగాహన ఒప్పందంపై మే 14న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకు, బోధకులకు గూగుల్ శిక్షణ ఇస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ సంస్థ ప్రతినిధి నెల్సన్ మట్టోస్ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. గూగుల్.. దేశంలో విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఆధునిక టెక్నాలజీల్లో గూగుల్ శిక్షణ ఇస్తుంది. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తుంది.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం

కర్ణాటక శాసనసభకు మే 5న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 121 స్థానాలను కైవసం చేసుకుంది (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు సరిపోతాయి). అధికార బీజేపీకి 40 స్థానాలు మాత్రమే దక్కాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నేతత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చెందిన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ)కి ఆరు స్థానాలు దక్కాయి. మరో ప్రాంతీయ పార్టీ బీఎస్‌ఆర్‌సీపీకి నాలుగు స్థానాలు లభించాయి. 2008 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు అదనంగా 2.46 శాతం మేర ఓట్లు వచ్చాయి. బీజేపీ దాదాపు 13.4 శాతం ఓట్లను కోల్పోయింది. 
మొత్తం స్థానాలు: 224
ఎన్నికలు జరిగిన స్థానాలు: 223
గెలిచిన స్థానాలు(ఓట్ల శాతం)కాంగ్రెస్:121(36.55)బీజేపీ:40(19.97)జేడీఎస్:40(20.09)ఇతరులు:22(-)

2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80, బీజేపీకి 110, జేడీఎస్‌కు 12, ఇతరులకు 6 స్థానాలు దక్కాయి. 

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా సిద్ధరామయ్యను మే 10న పార్టీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు. 

19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ

దేశంలో అనేక ప్రాంతాల్లో 19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 4.87 లక్షల హెక్టార్లు, అస్సాంలో 3.30 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.57 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 1.83 లక్షల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో లక్ష హెక్టార్ల చొప్పున ఆక్రమణలో ఉంది. గోవా, లక్షదీవులు, పుదుచ్చేరిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదు. 

కేంద్ర రైల్వే, న్యాయశాఖల మంత్రుల రాజీనామా

కేంద్ర రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్, న్యాయశాఖా మంత్రి అశ్వనీకుమార్‌లు మే10న తమ పదవులకు రాజీనామా చేశారు. అశ్వనీకుమార్, బన్సల్ రాజీనామాల నేపథ్యంలో వారి శాఖలను ఇతర మంత్రులకు అదనంగా కేటాయించారు. కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి కపిల్ సిబల్‌కు న్యాయశాఖ, రవాణా శాఖ మంత్రి సీపీ జోషికి రైల్వే శాఖను అప్పగించినట్లు రాష్ట్రపతిభవన్ మే 11న ప్రకటించింది. 

జల సంరక్షణ సంవత్సరంగా 2013 

2013ను జల సంరక్షణ సంవత్సర ంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ మే 9న ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరులో ఆమోదించిన జాతీయ జలవిధాన కార్యాచరణలో భాగంగా జల సంరక్షణ సంవత్సరానికి పచ్చజెండా ఊపింది. ఏడాదంతా కేంద్ర జలవనరుల శాఖ నీటి పొదుపుపై పెద్దపెత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. 

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం

పార్లమెంటు ప్రాంగణంలో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని మే 7న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. రాజ్యసభ ఔటర్ లాబీ ముఖద్వారం వద్ద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 

భారీ ఓడరేవుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో భారీ ఓడరేవుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ రెండు ఓడరేవుల నిర్మాణానికి రూ.15,820 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 5.40 కోట్ల టన్నుల నిర్వహణ సామర్థ్యంగల ఓడరేవును నిర్మిస్తారు. దీనికి రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులు అవసరం. ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే కేంద్రం దుగరాజపట్నంపై మొగ్గుచూపింది. కొత్త ఓడరేవులను ప్రభుత్వ, ప్రెవేటు భాగస్వామ్యంతో చేపడతారు. వీటి నిర్మాణాన్ని కేంద్రం నోటిఫై చేయనుంది. 

-భారీ ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. చిన్న ఓడరేవులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి. 

-దేశంలో ప్రస్తుతం 12 భారీ ఓడరేవులున్నాయి. అవి.. కోల్‌కతా-హల్దియా, పారాదీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, వీవో చిదంబరనార్ (గతంలో ట్యుటికోరన్), కోచి, న్యూ మంగళూరు, మార్మగోవా, ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కాండ్లా. 

పర్యావరణ సూచీలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలో పర్యావరణ నిర్వహణ సూచీ (ఈపీఐ)-2012లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి; నీరు, అటవీ సంరక్షణకు; చెత్త నిర్వహణకు అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు ఈ గుర్తింపు లభించింది. జాబితాలో సిక్కిం రెండో స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానా (27), బీహార్ (30) స్థానంలో నిలిచాయి. చివరిస్థానం (35)లో లక్షద్వీప్ నిలిచింది. 

ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు

కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 30న 2011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం



రాష్ర్ట జనాభా 8.45 కోట్లు(కచ్చితంగా 8,45,80,777).2001 లెక్కలతో పోల్చితే రాష్ర్ట జనాభా 11శాతం పెరిగింది.ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు.గ్రామీణ జనాభా 5,63,61,702పట్టణ జనాభా 2,82,19,075.అత్యధిక జనాభా ఉన్న జిల్లా-రంగారెడ్డి (27,41,239).అత్యల్ప జనాభా ఉన్న జిల్లా-విజయనగరం (23,44,474).స్త్రీ, పురుష నిష్పత్తి: 992/1000ఆరేళ్లలోపు పిల్లల్లో లింగ నిష్పత్తి- 939/1000జన సాంద్రత: 307అక్షరాస్యత- 67.02 శాతం (మహిళలు 59.15 శాతం, పురుషులు-74.88 శాతం)అక్షరాస్యతలో ప్రథమ స్థానం హైదరాబాద్(75.87 శాతం)అక్షరాస్యతలో చివరి స్థానంలో మహబూబ్‌నగర్- 55.04 శాతంరాష్ర్టంలో ఎస్టీలు- 6.59 శాతంరాష్ర్టంలో ఎస్సీలు- 16.41 శాతం

రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్‌ను మే 4న ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు రాష్ట్ర హోం మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రజా భద్రతా పర్యవేక్షణ, వ్యవస్థలో లోపాలను తొలగించడం వంటి విధులను ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. విధానపరమైప నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాల నిస్తుంది. పోలీసుల ఉత్తమ పనితీరుకు, వ్యవస్థాపరమైన లక్ష్యాలకు సంబంధించి ముందస్తు చర్యలకు సలహాలివ్వడం, పోలీసుల వత్తి పరమైన విధానాలకు సంబంధించి కూడా ఈ కమిటీ సూచనలిస్తుంది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న ‘జాతీయ భద్రత మండలి’ మాదిరిగా రాష్ట్రస్థాయిలో పనిచేస్తుంది.

జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)కు కేంద్ర కేబినెట్ మే1న ఆమోదం తెలిపింది. పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు అనుబంధ కార్యక్రమంగా చేపడతారు. దేశవ్యాప్తంగా 50,000 పైగా జనాభా ఉన్న 779 నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీని వల్ల 7.75 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమం కింద ఐదేళ్లలో రూ. 22,507 కోట్లు వ్యయం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయాన్ని 75:25 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఇందులో కేంద్రం వాటా రూ.16,955 కోట్లు. 

121 కోట్లకు చేరుకున్న భారత్ జనాభా
కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 30న 2011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం భారత జనాభా మార్చి 1 నాటికి 121,07,26,932.

2001 జనాభా లెక్కలతో పోల్చితే పెరిగిన జనాభా 18.196 కోట్లు.2001-11 మధ్య కాలంలో పెరిగిన జనాభా 17.7 శాతం (అంతకుముందు దశాబ్దంలో పెరిగిన జనాభాశాతం 21.5)దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 83.85 కోట్ల మంది నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 37.71 కోట్ల మంది ఉన్నారు.అక్షరాస్యత శాతం 73. ఇది 2001లో 64.8 శాతం.లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2001లో ఇది 933.

అదనపు సొలిసిటర్ జనరల్ రాజీనామా
అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జి) హరేన్ రావల్ ఏప్రిల్ 30న తన పదవికి రాజీనామా చేశారు. బొగ్గు కుంభకోణంపై ిసీబీఐ స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టుకు ఆయన తెలిపిన సమాచారం అసత్యమని తేలడంతో రావల్ రాజీనామా చేశారు. 2009 జూలై 4 నుంచి ఆయన ఏఎస్‌జీగా ఉన్నారు.

కూడంకుళంకు సుప్రీం అనుమతి
వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. రక్షణ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని నిపుణుల కమిటీ నిర్థారించినందున అనుమతిని ఇస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. దీర్ఘకాల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వద్ధి దష్ట్యా కూడంకుళం అవసరమని అభిప్రాయపడింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు అన్ని అనుమతులు సాధించాకే ఉత్పత్తిని ప్రారంభించాలని స్పష్టం చేసింది. 15 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సందర్భంగా కూడంకుళానికి వ్యతికేకంగా ఉద్యమించిన వారందరిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆదేశించింది.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2013 జాతీయం
కాశ్మీర్ లోయతో జమ్మూకు రైలు లింక్
కాశ్మీర్ లోయ-జమ్మూ ప్రాంతాన్ని కలిపే 18 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-కాజీగుండ్ రైలు మార్గాన్ని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జూన్ 26న ప్రారంభించారు. జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపే మొదటి రైలు మార్గం ఇదే కావడం విశేషం. బనిహాల్ - కాజీగుండ్ రైలు మార్గం కోసం పీర్ పంజల్ కొండల్లో దేశంలోనే అతిపెద్దదైన 11 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వడం విశేషం. ఈ రైలు మార్గం వల్ల బనిహాల్-కాజీగుండ్ మధ్య దూరం సగానికి తగ్గిపోనుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉండగా.. రైలు మార్గం వల్ల ఆ దూరం 18 కిలోమీటర్లకు తగ్గింది. దీని నిర్మాణం కోసం సుమారు రూ.1700 కోట్ల రూపాయల వ్యయం అయింది. కాగా జమ్మూకాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఉదమ్పూర్-కాట్రా -కాజీగుండ్ మధ్య రైలు మార్గం 2017 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. 

మూడు ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం
కేంద్ర ఆరోగ్యశాఖ మూడు ఔషధాలపై నిషేధం విధించింది. నొప్పి నివారిణి ‘అనాల్జిన్’, మధుమేహ నివారక ఔషధం ‘పయోగ్లిటాజోన్’, యాంటీ డిప్రెసంట్ ‘డీయాంగ్జిట్’ల ఉత్పత్తి, పంపిణీ, విక్రయాలపై డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలోని సెక్షన్ 26ఏ ప్రకారం నిషేధం విధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటి దుష్ర్పభావాలపై పలు నివేదికలు అందిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అనాల్జిన్ను అమెరికా 1970లోనే నిషేధించింది. పయోగ్లిటాజోన్ను ఫ్రాన్స్ నిషేధించగా, అమెరికా, యూరోప్లలో హెచ్చరికతో విక్రయిస్తున్నారు. తాజా నిషేధం అమలుకు ఈ ఔషధాల ఉత్పత్తిదారులకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 6 నెలల గడువిచ్చింది.

పీఎస్ఎల్వీ- సీ22 ప్రయోగం విజయవంతం
భారత్ చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ 22) ప్రయోగం విజయవంతమైంది. ఈ నెల 1న శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ 22 దేశ తొలి పూర్తిస్థాయి నావిగేషన్ ఉపగ్రహం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1ఎ (ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ)ను రాత్రి 11.41 గంటలకు విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 4.5 మీటర్ల ఎత్తుగల పీఎస్ఎల్వీ-సీ22 రాకెట్ను ఎక్సెల్స్ట్రాపాన్ బూస్టర్లతో నాలుగు దశల్లో ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని దేశంలో మొదటిసారిగా నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు చేపట్టారు. దీనివల్ల భారత్ చుట్టూ 1500 కి.మీ పరిధిలో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం తెలుసుకోవచ్చు. విమానాలు, నౌకలు, మోటారువాహనాల కదలికలన ఈ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. విపత్తులకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇది పీఎస్ఎల్వీ సిరీస్లో 23వ విజయం. శ్రీహరికోట నుంచి విజయవంతమైన 39వ ప్రయోగం.

వరి మద్దతు ధర రూ.60 పెంపు
సాధారణ వరి రకం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 60 రూపాయల చొప్పున పెంచింది. దీంతో ఈ రకం వరి ఎంఎస్పీ క్వింటాల్కు ప్రస్తుతమున్న రూ.1,250 నుంచి రూ.1,310కి పెరగనుంది. అలాగే గ్రేడ్-ఏ వరి రకం ఎంఎస్పీని క్వింటాల్కు రూ. 65 చొప్పున పెంచింది. దీంతో గ్రేడ్-ఏ వరి రకం క్వింటాల్కు ప్రస్తుతమున్న రూ. 1,280 నుంచి 1,345కు పెరగనుంది. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజల ఎంఎస్పీని కూడా ప్రభుత్వం పెంచింది. జూన్ 27న ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వృద్ధి... ఆందోళనకరం
ఆర్థికాభివృద్ధిలో మందగమనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు. మూలధన పెట్టుబడుల్లో తీవ్ర ఒడిదుడుకులు దేశ వృద్ధిని పటిష్ట రీతిన స్థిరంగా ముందుకు సాగనీయకుండా చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ మేరకు ఏడవ ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆర్బీఐ జూన్ 27న విడుదల చేసింది. దేశంలో వ్యాపార అవకాశాలు కొన్ని ఇబ్బందులతో ముడిపడి ఉన్నాయన్న అభిప్రాయం ఇంకా బలంగా ఉందని పేర్కొంటూ, ఈ తరహా ధోరణి దేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారినట్లు సుబ్బారావు నివేదికలో విశ్లేషించారు. 

పారిశ్రామిక క్రియాశీలత తగ్గడం, సేవల రంగం ధోరణిలో బలహీనత వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే సరఫరాల పరమైన ఇబ్బందులు తొలగడానికి తీసుకున్న కొన్ని చర్యల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అవకాశాలు కొంత ఆశావహంగా ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం భారత్ వృద్ధి పట్ల సానుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. గడచిన ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్లో చరిత్రాత్మక గరిష్టస్థాయి 6.7 శాతానికి (జీడీపీలో) చేరుకున్న కరెంట్ అకౌంట్లోటు నాల్గవ త్రైమాసికంలో 3.6 శాతానికి దిగిరావడంలో ఇందుకు సంబంధించి తీసుకున్న స్వల్పకాలిక చర్యల ఫలితమేనని సుబ్బారావు అన్నారు.

ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగిన జేడీయూ
జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు జేడీయూ (జనతాదళ్‌ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ జూన్‌ 16న ప్రకటించారు. దీంతో 17 ఏళ్లుగా ఉన్న రెండు పార్టీల పొత్తు ముగిసింది. బీహార్‌లో జేడీయూ సారధ్యంలో ఉన్న ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి 11 మంది బీజేపీ మంత్రులను బర్త్ఫ్‌ చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తెలిపారు. బీహార్‌లో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న జేడీయూకు బీజేపీ మద్దతిస్తోంది. బీహార్‌ అసెంబ్లీలోని 243 స్థానాల్లో జేడీయూకు 118 స్థానా లు, బీజేపీకి 91, ఆర్‌జేడీకి 22 మంది శాసనసభ్యులుండగా, మిగిలిన పార్టీలకు చెందినవారు 12 మంది ఉన్నారు.

కేంద్ర కేబినెట్‌లో 12కు పెరిగిన రాష్ట్ర ప్రాతినిధ్యం
ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జూన్‌ 17న తన మంత్రివర్గంలో కొత్తగా 8 మందిని చేర్చుకున్నారు. దీంతో మొత్తం కేబినెట్‌ సంఖ్య 77కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి స్థానం కల్పించారు. ఏలూరు నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కావూరి సాంబశివరావుకు కేబినెట్‌ హోదాతో జౌళి శాఖ దక్కగా, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలంకు ఆర్థికశాఖ సహాయమంత్రి పదవి లభించింది. కావూరితోపాటు కేబినెట్‌ మంత్రులుగా శీశ్‌రాం వోలా (కార్మిక శాఖ), ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ (ఉపరితల రవాణా), గిరిజా వ్యాస్‌ (గహ నిర్మాణం, పేదరిక నిర్మూలన) నియమితులయ్యారు. జేడీ శీలంతోపాటు సహాయమంత్రులుగా నియమితులైనవారిలో నాచియప్పన్‌ (వాణిజ్యం, పరిశ్రమలు), శ్రీమతి సంతోష్‌కుమార్‌ (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), మాణిక్‌రావ్‌ గువిట్‌ (సామాజిక న్యాయం, సాధికారత) ఉన్నారు.

160 ఏళ్ల టెలిగ్రాఫ్‌ సర్వీస్‌ రద్దు
160 ఏళ్లపాటు నడిచిన టెలిగ్రాఫ్‌ సర్వీసును జూలై 15 నుంచి నిలిపేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. భారత్‌లో తొలిసారి 1850లో కలకత్తా - డైమండ్‌హార్బర్‌ మధ్య ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ లైన్‌ ఏర్పాటైంది. 1851లో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టె లిగ్రాఫ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. 1853లో ఈ సౌకర్యాలు ప్రజలకందించేందుకు ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌ ప్రారంభమైంది. ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ను 1832లో షిల్లింగ్‌ కనుక్కొన్నారు.

సులభ్ వ్యవస్థాపకుడికి ఫ్రెంచ్ అవార్డ్
ప్రముఖ పర్యావరణవేత్త ‘సులభ్ ప్రాజెక్టు’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం ‘లెజెండ్ ఆఫ్ ప్లానెట్’ అవార్డును అందజేసింది. జూన్ 3న పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనెట్ ఉపాధ్యక్షురాలు చంటల్ జోర్దాన్ ఆయనకు ఈ అవార్డును బహూకరించారు. భారత్‌లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పెంపుదలకు విశేషంగా కషి చేసిన వ్యక్తిగా పాఠక్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 1973లో సులభ్ ఇంటర్నేషనల్‌ను స్థాపించి సులభ్ కాంప్లెక్స్ పేరుతో దేశంలో మరుగుదొడ్ల విప్లవానికి ఆయన నాంది పలికారు.

నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రోష్నీ
దేశంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి జైరాం రమేశ్ జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన నక్సల్స్ ప్రభావిత 24 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైంది. యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే రోష్నీ పథకం లక్ష్యమని మంత్రి చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశంలోని 24 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో 18 నుంచి 35 ఏళ్లలోపున్న 50వేల మంది యువతీయువకుల జీవితాల్లో రోష్నీ పథకం వ్యాపార, ఉద్యోగాల ద్వారా వెలుగు నింపనుందని తెలిపారు. కేంద్రం 75 శాతం, రాష్ట్రాల నుంచి 25 శాతం భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవస్థీకత రంగంలో ఉపాధి కల్పించేందుకు వీలుగా నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు చెందిన యువతీయువకులను ఈ పథకం కింద గుర్తించి వారికి తగిన శిక్షణ అందిస్తారు.

సైనిక శిక్షణపై భారత్ - సింగపూర్ ఒప్పందం
భారత్‌లో సింగపూర్ సైన్యం శిక్షణ, విన్యాసాల సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్- సింగపూర్‌లు జూన్ 4న సంతకాలు చేశాయి. భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోని సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఇటువంటి ఒప్పందాలు ఇరుదేశాల మధ్య 2007, 2008లో కుదిరాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సింగపూర్ సైనిక శిక్షణ కార్యక్రమాలు ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఐదేళ్లపాటు కొనసాగుతాయి. భారత శిక్షణా, విన్యాసాల సౌకర్యాలు పొందుతున్న ఏకైక దేశం సింగపూర్.

అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సదస్సు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతత్వంలో అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం జూన్ 5న న్యూఢిల్లీలో జరిగింది. నక్సల్ సమస్య ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో మే 25న జరిగిన మావోయిస్టుల దాడిని సమావేశంలో పాల్గొన్నవారందరూ ముక్తకంఠంతో ఖండించారు. దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల్లో నక్సలిజం అతిపెద్ద సమస్యని ముఖ్యమంత్రులంతా అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్‌సీటీసీ)ను విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధమన్నారు. కాగా నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు ఏకీకత విధానాన్ని అవలంబించాలని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు తీర్మానించాయి. ముఖ్యమంత్రుల సమావేశంలో భాగంగా 9 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో హోంశాఖ భేటీ నిర్వహించింది. నక్సల్స్‌పై పోరులో ఆంధ్రప్రదేశ్ మార్గాన్ని అనుసరించాలని 9 రాష్ట్రాలూ అంగీకరించాయి.

భారత ప్రధాని మన్మోహన్ జపాన్ పర్యటన
జపాన్ పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 29న ఆ దేశ ప్రధాని షింజో అబెతో చర్చలు జరిపారు. చర్చల తర్వాత పౌర అణు సహకార ఒప్పందం కోసం చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. 2011 మార్చిలో జరిగిన ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత అణు సహకారంపై చర్చలు ఆగిపోయాయి. జపాన్‌తో ఒప్పందం కుదిరితే ఆ దేశం నుంచి అణు రియాక్టర్లను పొందే అవకాశం భారత్‌కు లభిస్తుంది. అదేవిధంగా సముద్ర జలాల భద్రతలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్- జపాన్ నిర్ణయించాయి. ముంబై మెట్రోలైన్-3, హైదరాబాద్ ఐఐటీలో రెండో దశ పనులు సహా ఎనిమిది ప్రాజెక్టుల కోసం భారత్‌కు రూ. 23.86 లక్షల కోట్ల రుణ సహాయం చేసేందుకు కుదిరిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన పనులు వేగవంతం చేయాలని కూడా జపాన్ నిర్ణయించుకుంది. ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే లైన్‌పై ఉమ్మడి అధ్యయనానికి ఆర్థిక సహాయంపై కూడా ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా నికోబార్ దీవులు
భారత్‌లోని నికోబార్ దీవులను యునెస్కో వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా మే 30న ప్రకటించింది. స్థానిక సమాజ చర్యలాధారంగా సుస్థిర అభివద్ధిని ప్రోత్సహించే కార్యక్రమంలో (మాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) భాగంగా యునెస్కో నికోబార్ దీవులను గుర్తించింది. ప్రకతి, మానవ కార్యకలాపాలను నిర్వహించే కొత్త విధానాలను ఈ ప్రాంతంలో పరీక్షిస్తారు. నికోబార్ దీవులు 1800 జంతు జాలాలకు, అంతరిస్తున్న గిరిజన తెగలకు ఆవాసంగా ఉన్నాయి. నికోబార్ దీవులతోపాటు మరో 11 ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్ పరిధిలోకి తెస్తూ పారిస్‌లో మే 30న యునెస్కో ప్రకటించింది.

ఐదోసారి రాజ్యసభకు ఎంపికైన మన్మోహన్ సింగ్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అసోం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీలో 49 తొలి ప్రాధాన్యత ఓట్లతో ప్రధాని ఎన్నికైనట్లు మే 30న ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

నేరస్తుల అప్పగింత ఒప్పందంపై భారత్ - థాయ్‌లాండ్ సంతకాలు
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ థాయ్‌లాండ్ పర్యటనలో మే 30న ఇరుదేశాలు నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉగ్రవాద, ఆర్థిక, ఇతర అంతర్జాతీయ నేరాలతో సంబంధమున్న నేరస్థుల అప్పగింతకు ఈ ఒప్పందం చట్టబద్ధత కల్పిస్తుంది. థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాతో మన్మోహన్ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు కూడా జరిపారు. మనీల్యాండరింగ్‌ను, ఉగ్రవాదులకు నిధుల చేరవేతను అడ్డుకొనేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మార్పిడి, జియోస్పేషియల్ టెక్నాలజీ, మ్యాపుల తయారీ, విద్యా రంగంలో సహకారంలో కూడా ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. బీహార్‌లోని బుద్ధగయలోని పవిత్ర బోధి వక్షానికి చెందిన మొక్కను థాయ్‌లాండ్ రాజు భూమిబల్‌కు ప్రధాని కానుకగా ఇచ్చారు. థాయ్‌లాండ్ పాలకులకు భారత్ బోధి మొక్కను అందజేయడం ఇదే తొలిసారి.

ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు
రాజకీయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 3న కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు కూడా ప్రజా సంస్థలేనని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆరు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరోక్షంగా పెద్ద ఎత్తున నిధులు పొందుతున్నాయని తెలిపింది. ప్రజా సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున.. ఆర్టీఐ చట్టంలోని ప్రజా సంస్థల లక్షణం పార్టీలకున్నట్లేనని చెప్పింది. సీఐసీ పూర్తిస్థాయి ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో తమకు ఏ విధంగా నిధులు వస్తుందీ, ఎలా ఖర్చు పెడుతుందీ, ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరు వారాల్లోగా తమ ప్రధాన కార్యాలయాల్లో కేంద్ర ప్రజా సమాచార అధికారులను (సీపీఐఓ), పునర్విచారణ అధికారులను (అప్పిలేట్ అథారిటీ) నియమించాలని సీఐసీ ధర్మాసనం రాజకీయ పార్టీలను ఆదేశించింది.

పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి వివిధ కేటగిరీల రిజర్వేషన్ శాతాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేస్తారు. జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రామపంచాయతీలైతే ఎస్టీలకు 6.28, ఎస్సీలకు 19.43, బీసీలకు 34 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తారు. మండల పరిషత్‌లైతే ఎస్టీలకు 6.99 శాతం, ఎస్సీలకు 19.32 శాతం, జిల్లా పరిషత్‌లైతే ఎస్టీలకు 9.15 శాతం, ఎస్సీలకు 18.88 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన స్థానాలు జనరల్ కేటగిరీకి ఉద్దేశించినవి. ఈ నాలుగు కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల సమాచారం అందిన వారం రోజుల్లోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో యువ పార్లమెంటేరియన్ల సదస్సు
హైదరాబాద్‌లో అక్టోబర్ 21 నుంచి ఐదు రోజులపాటు యువ పార్లమెంటేరియన్ల సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో జరపాలని కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) నిర్ణయించినట్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మే 29న తెలిపారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ సదస్సులో 54 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. దేశంలోని అన్ని అసెంబ్లీల యువ ప్రజా ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. విద్య, పేదరికం నిర్మూలన వంటి అంశాలకు సంబంధించి చట్ట సభల బాధ్యతపై సదస్సులో చర్చిస్తారు.

AIMS DARE TO SUCCESS 

జూలై 2013 జాతీయం
2011-12లో 21.9 శాతానికి తగ్గిన పేదరికం
ప్రణాళిక సంఘం జూలై 23న విడుదల చేసిన అంచనాల ప్రకారం భారతదేశంలో 2011-12లో పేదరికం 21.9 శాతానికి త గ్గింది. ఇది 2004-05లో 37.2 శాతంగా ఉండేది. 2011-12లో పేదరికంలో ఉన్నవారి సంఖ్య 270 మిలియన్లు. అంటే ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 217 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 53 మిలియన్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) వారి శాతం 2011-12లో 25.8 శాతానికి తగ్గింది. ఇది 2004-05లో 42 శాతంగా ఉండేది. ఈ తగ్గుదల గ్రామీణ ప్రాంతాల్లో 17 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 12 శాతం తగ్గింది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా ఛత్తీస్గఢ్ జనాభాలో 39.93 శాతం బీపీఎల్ కింద ఉన్నారు. తర్వాత జార్ఖండ్ (36.96), మణిపూర్ (36.89), అరుణాచల్ ప్రదేశ్ (34.67), బీహార్ (33.74)లలో అత్యధికంగా బీపీఎల్ జనాభా ఉంది. గోవా (5.09), కేరళ (7.05), హిమాచల్ ప్రదేశ్ (8.06), పంజాబ్ (8.26), పుదుచ్చేరి (9.69)ల్లో తక్కువ పేదరికం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9.20 శాతం పేదరికం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ’ 27.20, పట్టణ ప్రాంతాల్లో రోజుకు ’ 33.30 వ్యయం చేసేవారు బీపీఎల్ కిందకు వస్తారు.

ప్రధానితో అమెరికా ఉపాధ్యక్షుడు బెడైన్ భేటీ
అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బెడైన్ నాలుగురోజుల భారత పర్యటనలో జూలై 23న ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మన్మోహన్తో పలు అంశాలపై చర్చలు జరిపిన బెడైన్, అమెరికా కంపెనీల ఆందోళనను ప్రస్తావిస్తూ, వాణిజ్య అవరోధాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా నుంచి సహజవాయు సరఫరా, అణు ఒప్పందం అమలు వంటి ద్వైపాక్షిక అంశాలతోపాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధానితోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్లతో కూడా బెడైన్ భేటీ అయ్యారు. 

దేశీయ పర్యాటకంలో రాష్ట్రానికి మొదటి స్థానం
దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2012 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 206.8 మిలియన్లు (20.68 కోట్ల) మంది పర్యటించారు. వీరిలో అత్యధికులు తిరుమల సందర్శించేందుకు వచ్చారు. తమిళనాడు 184.4 మిలియన్లు, ఉత్తర ప్రదేశ్ 168.4 మిలియన్ల పర్యాటకులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు మొదటి పది స్థానాల్లో చోటు దక్కలేదు. 

సుప్రీంకోర్టు సీజేగా సదాశివం ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం జూలై 19న ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ఆల్తమస్ కబీర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2014, ఏప్రిల్ 26వరకు జస్టిస్ సదాశివం పదవిలో ఉంటారు. ఆయన 2007, ఆగస్టు 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తమిళనాడు నుంచి ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి జస్టిస్ సదాశివం.

నాన్ బెయిలబుల్ నేరాలుగా యాసిడ్ దాడులు!
యాసిడ్ దాడులను నాన్బెయిల్బుల్ కేసులుగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు తేవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జూలై 18న సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా యాసిడ్ దాడులకు గురైన బాధితులకు నష్ట పరిహారం రూ. 3 లక్షలకు పెంచాలని, 18 ఏళ్లలోపు వయసువారికి యాసిడ్ను విక్రయించరాదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. యాసిడ్ విక్రయాల వివరాలు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం యాసిడ్ బాధితులకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూ. 5000 నుంచి రూ. 150000 వరకు నష్ట పరిహారం చెల్లిస్తున్నాయి. 2006లో ఢిల్లీకి చెందిన లక్ష్మీ అనే యాసిడ్ దాడి బాధితురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పై తీర్పునిచ్చింది.

డీఆర్డీఏలు రద్దు
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలును పర్యవేక్షించే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (డీఆర్డీఏ)ను రద్దు చేస్తున్నట్టు కేంద్రం జూలై 9న ప్రకటించింది. 1980లో స్వతంత్ర సంఘాలుగా ఏర్పాటైన డీఆర్డీఏలు ఇకపై జిల్లా పరిషత్లతో కలిసి పనిచేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరామ్ రమేశ్ తెలిపారు. సొసైటీల చట్టం కింద ఏర్పాటైన డీఆర్డీఏలు 2014 ఏప్రిల్ 1 నాటికల్లా ఉనికిలో ఉండబోవన్నారు.

టెలిగ్రామ్ సేవలు రద్దు
దేశంలో టెలిగ్రామ్ సేవలను జూలై 14 నుంచి పూర్తిగా రద్దు చేశారు. టెలికం రంగం పుంజుకోని రోజుల్లో, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ సాధనాలు ఎరుగని కాలంలో శరవేగంగా సమాచారాన్ని చేరవేసే ఏకైక సాధనంగా టెలిగ్రామ్ వెలుగొందింది. ఒకప్పుడు తపాలా శాఖ పరిధిలో కొనసాగిన టెలిగ్రాఫ్ విభాగం, ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ పరిధిలో కొనసాగుతోంది. భారత్లో టెలిగ్రామ్ సేవలకు 160 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోల్కతా నుంచి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా 1850లో తొలి టెలిగ్రాఫ్ లైన్ను అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. 1854 నుంచి టెలిగ్రామ్ సేవలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. 

ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల జాబితా
అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చూన్ దేశంలో అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాను జూలై 9న విడుదల చేసింది. ఈ జాబితాలో టీసీఎస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కార్పొరేట్ పాలన, కొత్తదనం, సామాజిక బాధ్యతలు, నాయకత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఫార్చూన్ ఈ ర్యాంకులను కేటాయించింది. ఆదాయాలపరంగా ఫార్చూన్ విడుదల చేసిన టాప్-500 గ్లోబల్ కంపెనీల జాబితాలో మొత్తం 132 అమెరికన్ కంపెనీలు స్థానం పొందగా, తర్వాత అత్యధిక స్థాయిలో 95 చైనా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. 

కూడంకుళంలో అణువిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో జూలై 12న ఉత్పత్తి మొదలైంది. భారత్-రష్యా సంయుక్తంగా కూడంకుళంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం (కేఎన్పీపీ) విద్యుదుత్పాదన ప్రారంభించేందుకు అణు ఇంధన నియంత్రణ మండలి(ఏఈఆర్బీ) జూలై 11న అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మే 6న సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో ఉత్పత్తి చర్యలు వేగవంతమయ్యాయి.

డీజీసీఏ స్థానంలో సీఏఏ
పౌర విమానయాన రంగం నియంత్రణ కోసం ప్రస్తుతమున్న ‘డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ స్థానంలో పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే ‘పౌర విమానయాన సంస్థ (సీఏఏ)’ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ జూలై 11న నిర్ణయించింది. దీనికోసం దాదాపు రూ. 110 కోట్లను వ్యయం చేయనున్నారు.

సెక్షన్ 8(4)ను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు
ప్రజాప్రతినిధులకు సంబంధించి సుప్రీం కోర్టు జూలై 10న కీలక తీర్పునిచ్చింది. కింది కోర్టులో దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులు.. దానిపై ఉన్నతస్థాయి కోర్టులో చేసుకున్న అప్పీలు పెండింగ్లో ఉన్నట్లయితే వారిని అనర్హులను చేయరాదని చెప్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4).. న్యాయవిరుద్ధమైనదని పేర్కొంటూ సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్ధారితులైన తేదీ నుంచే వారు అనర్హులుగా మారతారని జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రకటించకముందు దోషులుగా నిర్ధారితులై, అప్పీళ్లు దాఖలు చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు తాజా నిర్ణయం వర్తించదని పేర్కొంది. లిలీథామస్ అనే న్యాయవాది, లోక్ ప్రహారి అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. సెక్షన్ 8(4)ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. జైలు లేదా చట్టబద్ధమైన పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులెవరూ ఎన్నికల్లో పోటీ చేయజాలరని పేర్కొంటూ సుప్రీంకోర్టు జూలై 11న మరో తీర్పు వెలువరించింది. దీని ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలు సైతం ఎన్నికల్లో తలపడేందుకు వీల్లేదు. నేరగాళ్లు చట్టసభల్లో ప్రవేశించకుండా నిరోధించే క్రమంలో.. కేవలం ఓటరుకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. అతను/ఆమె జైలు లేదా పోలీసు కస్టడీలో ఉన్నట్టయితే వారు తమ ఓటు వేసే హక్కును కోల్పోతారని, తద్వారా పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా అనర్హులవుతారని తెలిపింది. ఏ చట్టం కిందనైనా సరే ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నప్పుడు మాత్రం అనర్హత వర్తించబోదు.

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (జేఎంఎం) జూలై 13న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన 13 ఏళ్లలో తొమ్మిదో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సోరెన్.. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన గిరిజన నాయకుల్లో ఐదో వ్యక్తి. అలాగే శిబూ, హేమంత్ సోరెన్ మరో రికార్డు కూడా సృష్టించారు. తండ్రి, తనయుడు సీఎం పగ్గాలు చేపట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించడంతో జనవరి 18న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. దీన్ని ఎత్తేయాలంటూ కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానానికి రాష్ట్రపతి జూలై 12న ఆమోదం తెలిపారు.

ఆహార భద్ర తకు ఆమోదం
జాతీయ ఆహార భద్రత ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 5న ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదించింది. దీనివల్ల 67 శాతం జనాభాకు ప్రతి నెల సబ్సిడీపై ఆహార ధాన్యాలు పొందే హక్కు ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం కిలో రూ. 3కు, గోధుమలు రూ. 2లకు, తృణధాన్యాలు రూ. 1కి అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు 62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి. దీంతో ఆహార సబ్సిడీ వ్యయం రూ.1,12,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

నేషనల్ సైబర్ సెక్యూరిటీ విధానం ప్రకటన
నేషనల్ సైబర్ సెక్యూరిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం జూలై 2న ప్రకటించింది. దీనిని సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను రక్షించేందుకు ఉద్దేశించారు. వెబ్స్ను ఉపయోగించేవారి వ్యక్తిగత సమాచారం, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ప్రభుత్వ సమాచారాన్ని రక్షించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఈ విధానం కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఐదేళ్లలో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దేశ కీలక వ్యవస్థలపై సైబర్ దాడు లు జరిగినప్పుడు తక్షణం స్పందించే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యంత్రాంగం ఏర్పాటవుతుంది. దాడులను ముం దే గుర్తించి అప్రమత్తం చేసే, ఆయా వ్యవస్థలు వెంటనే స్పందించేలా మరో వ్యవస్థ కూడా ఏర్పాటవుతుంది.

త్వరలో అంగారకుడిపైకి భారత్ వ్యోమనౌక
వచ్చే అక్టోబర్-నవంబర్లో మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ జూలై 7న ప్రకటించారు. అంగారకుడిపై జీవాన్వేషణ, అక్కడి వాతావరణ పరిస్థితుల పరిశీలన లక్ష్యంగా ఇస్రో ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ‘మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం)’లో భాగంగా పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా ఒక వ్యోమనౌకను ప్రయోగించనున్నారు. దాని బరువు 1,350 కిలోలు. అందులో అంగారకుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని, అక్కడి వాయువుల్ని పరిశీలించేందుకు ‘లేమాన్ ఆల్ఫా ఫొటోమీటర్, మిథేన్ సెన్సర్ ఫర్ మార్స్, మార్స్ కలర్ కెమెరా, టీఐఆర్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్’ తదితర ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా అంగారకుడి వాతావరణంలోని హైడ్రోజన్, మిథేన్, ఇతర వాయువుల మిశ్రమాలను అధ్యయనం చేస్తారు. ఆ గ్రహం ఉపరితలాన్ని చిత్రించడంతోపాటు, ఖనిజాల శాతం, నీటి జాడలను పరిశీలిస్తుంది.

బంగారు తల్లి పథకం ప్రారంభం
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి జూలై 2న బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ప్రతి ఏటా కొంత మొత్తాన్ని అందిస్తుంది. మొత్తం రూ.2,16,000లు అందజేస్తుంది. ఆడపిల్లల కోసం ఇప్పటికే ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు అదనంగా, ఈ పథకం రాష్ట్రంలోని తెల్లకార్డుదారులందరికీ వర్తిస్తుంది. 



వయసుదశమొత్తం ఏడాదికి(రూ.)పుట్టగానేజనన నమోదు సమయంలో2,5001-2 ఏళ్ల వరకుటీకాల నిమిత్తం1,0003-5 ఏళ్ల వరకుఅంగన్వాడి,5006-10 ఏళ్ల వరకు1-5వ తరగతి వరకు2,00011-13 ఏళ్ల వరకు6-8వ తరగతి వరకు2,50014-15 ఏళ్ల వరకు9-10వ తరగతి వరకు3,00016-17 ఏళ్ల వరకు11-12వ తరగతి వరకు3,50018-21 ఏళ్ల వరకుగ్రాడ్యుయేషన్ (1-4 ఏళ్లు)4,00018 ఏళ్లకుఇంటర్ తర్వాత50,000గ్రాడ్యుయేషన్ తర్వాత1,00,000 మొత్తం2,16,000

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2013 జాతీయం
జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి
క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కి జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురించింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆగస్టు 18న హైదరాబాద్లో వివరాలు వెల్లడించారు. మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించేవారు. అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని వారు చేసిన పరిశోధనలో తేలింది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. 

జీఎస్ఎల్వీ-డీ 5 ప్రయోగం వాయిదా
జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - డీ 5 (జీఎస్ఎల్వీ-డీ5) ప్రయోగం వాయిదా పడింది. ఆగస్టు 19న శ్రీహరికోట నుంచి సాయంత్రం 4.50 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగ వాహన నౌక రెండో దశలో ద్రవ ఇంధనంలో లీకేజి ఏర్పడింది. ఈ వాహక నౌక ద్వారా 1982 కిలోల సమాచార ఉపగ్రహం జీశాట్-14ను 36,000 కిలోమీటర్ల దూరంలోని మధ్యంతర భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. 49.13 మీటర్ల ఎత్తు, 414.75 టన్నుల బరువు గల జీఎస్ఎల్వీలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మూడో దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్లో ద్రవ హైడ్రోజన్, ఆక్సిజన్లను వాడారు. ప్రస్తుతం జరిపేది ఎనిమిదో జీఎస్ఎల్వీ ప్రయోగం. మొదటి ఆరు ప్రయోగాలకు రష్యా అందించిన క్రయోజనిక్ ఇంజన్లు వాడారు. 2010 జూలై 10న జరిపిన ఏడో ప్రయోగంలో స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ను వాడారు. ఇది విఫలమైంది. ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను భూ స్థిర కక్ష్యలోకి ప్రయోగించేందుకు క్రయోజనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. పీఎస్ఎల్వీలు 1.5 టన్నుల ఉపగ్రహాలను మాత్రమే మోసుకుపోగలవు. ప్రస్తుత క్రయోజనిక్ టెక్నాలజీ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

పేలుళ్లతో మునిగిపోయిన సింధురక్షక్ జలాంతర్గామి
ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో ఆగస్టు 13న వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ముంబై కొలాబా డాక్యార్డ్లో ఉన్న సింధు రక్షక్ సగం వరకు మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో అందులో ఉన్న మొత్తం 18 మంది సిబ్బంది మరణించినట్లు భావిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో టోర్పడోలు, క్షిపణులు ఉన్నాయి. 2010, ఫిబ్రవరిలో హైడ్రోజన్ లీకేజీ వల్ల సింధు రక్షక్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సిబ్బందిలో ఒకరు మరణించారు. డీజిల్ - ఎలక్ట్రిక్ జలాంతర్గామి సింధు రక్షక్ను రష్యా నిర్మించింది. రు.400 కోట్లతో కొనుగోలు చేసిన ఈ జలాంతర్గామిని 1997లో భారత నౌకా దళంలో చేర్చారు. దీన్ని 2010లో ఆధునికీకరణకు రష్యాకు అప్పగించారు. రు.450 కోట్లతో ఆధునికీకరించిన సింధు రక్షక్ను రష్యా తిరిగి జనవరి, 2013లో భారత్కు అప్పగించింది. అణు సామర్థ్యం గల ఐఎన్ఎస్ చక్రతోపాటు భారత్ 15 జలాంతర్గాములను కలిగి ఉంది.

పాక్ కాల్పుల్లో ఆరుగురు భారత సైనికుల మృతి
జమ్ముకాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్ భారత భూభాగంలో పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు భారత సైనికులు మరణించారు. ఆగస్టు 6న పూంఛ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొరబడి పాకిస్థాన్‌కు చెందిన 20 మంది సైనికులు, ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత పార్లమెంటులోని ఉభయసభల్లో సభ్యులు పాక్ కాల్పులపై గట్టిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని తమ సైన్యం ఎటువంటి కాల్పులకు పాల్పడలేదని పాకిస్థాన్ పేర్కొంది.

కంపెనీల బిల్లు- 2012కు పార్లమెంటు ఆమోదం
మొదటి కంపెనీల చట్టాన్ని (1956) తీసుకొచ్చిన 57 ఏళ్ల తర్వాత 2012 కంపెనీల బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 8న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గత డిసెంబరులో లోక్‌సభ ఆమోదం పొందింది. 1956 కంపెనీల చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ గవర్నెన్‌‌స, పెట్టుబడిదారుల భద్రత, కార్పొరేట్ సామాజిక బాధ్యత మోసాలను అరికట్టడం వంటి ప్రధాన అంశాలను దష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రకారం కంపెనీలు కార్పొరేటు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద తమ మూడేళ్ల నికర లాభాల్లో కనీసం 2 శాతం సీఎస్‌ఆర్‌కు కేటాయించాలి. రూ. 5 కోట్లకు మించి నికర లాభం గల కంపెనీలు సీఎస్‌ఆర్‌ను ఏర్పాటు చేయాలి. మొత్తం డెరైక్టర్లలో మూడోవంతు స్వతంత్ర డెరైక్టర్లు ఉండాలి. వీరి పదవీకాలం ఐదేళ్లు ఉండాలి. కంపెనీలు సేకరించిన నిధులు ఉద్దేశించిన లక్ష్యానికి కాకుండా వేరే వాటికి వినియోగిస్తే వాటాదారులు వైదొలిగేందుకు అవకాశం బిల్లు కల్పించింది. ప్రైవేటు కంపెనీల్లో గరిష్టంగా ఉండాల్సిన సభ్యుల సంఖ్యను 50 నుంచి 200 కు పెంచారు. ఏకకాలంలో ఒక ఆడిటర్ 20 కంపెనీలకు మించి పనిచేసేందుకు వీలుండదు. ప్రతి ఐదేళ్లకొకసారి ఆడిటర్ల రొటేషన్ జరగాలి. కార్పొరేటు అక్రమాల నివారణకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసుకు అధిక అధికారాలు కల్పించారు.

‘అనర్హత’ తీర్పును అమలు చేయండి
సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసుల్లో దోషులుగా తేలిన రోజు నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చర్యలు ప్రారంభించింది. ‘సుప్రీం’ ఆదేశాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత దోషులుగా తేలి, జైలుశిక్ష, జరిమానా పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం తక్షణమే అనర్హులవుతారని, వారి సీటు ఖాళీ అవుతుందని స్పష్టం చేసింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పేర్లను తమకు పంపాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన పాలనాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టుల్లో దోషులుగా తేలే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలతో కూడిన నివేదికను ప్రతి నెలా 15 నాటికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా తమకు అందజేయాలని సూచించింది. ఈ కేసుల పర్యవేక్షణ కోసం సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి కేసుల సమాచారాన్ని చట్టసభల అధిపతులకు(స్పీకర్/చైర్మన్), తమకు వెంటనే తెలియజేయడానికి ఈ యంత్రాంగం అవసరమని పేర్కొంది. ఇందులో అడ్వొకేట్ జనరల్/ప్రాసిక్యూషన్ డెరైక్టరేట్, తదితరాలను భాగం చేయాలని సూచించింది. 

క్రిటికాలిటీ సాధించిన ఐఎన్‌ఎస్ అరిహంత్ న్యూక్లియర్ రియాక్టర్
భారత్ తొలి అణు విద్యుత్ సామర్థ్యం గల ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామిలో అణు విద్యుత్ రియాక్టర్ ఆగస్టు 10న క్రిటికాలిటీ సాధించింది. దీంతో 83 మెగావాట్ల లైట్-వాటర్ రియాక్టర్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ మొదలైంది. విశాఖపట్నం తీరంలో నావికాదళానికి చెందిన స్థావరంలో జలాంతర్గామిపై ఉన్న పరమాణు రియాక్టర్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా క్రియాశీలం చేశారు. అణు ఇంధనంతో నడిచే ఐఎన్‌ఎస్ అరిహంత్‌పై గల అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసినందున ఈ జలాంతర్గామికి త్వరలోనే వివిధ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి. అరిహంత్‌ను సమకూర్చుకోవడంతో భారత్ కూడా వాటి సరసన చేరనుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకుంటున్న అణు జలాంతర్గాముల త్రయంలో ఐఎన్‌ఎస్ అరిహంత్ మొదటిది. రూ.15 వేల కోట్లతో నిర్మించిన దీనిని ప్రధాని మన్మోహన్ 2009లో ప్రారంభించారు. ఆరు వేల టన్నుల బరువు ఉండే ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు కొన్ని నెలలపాటు పరీక్షలు ఎదుర్కోనుంది. 83 మెగావాట్ల అణు రియాక్టర్‌తో నడిచే ఈ జలాంతర్గాములు భూ, గగన, సముద్రతలాల్లోని లక్ష్యాలపైకి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగలవు. రష్యా నుంచి లీజుకు తీసుకున్న అకులా-2 తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామిని భారత్ ప్రస్తుతం ఉపయోగిస్తోంది. 

గస్తీనౌక రాజ్‌వీర్ జలప్రవేశం 
దేశ తీర రక్షణకు మరో గస్తీనౌక సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్ (ఐపీవీ) తరహా నౌకల్లో ఏడోదైన ఐసీజీఎస్ రాజ్‌వీర్‌ను రక్షణశాఖ కార్యదర్శి ఆర్.కె. మాథుర్ ఆగస్టు 10న విశాఖపట్నంలో జలప్రవేశం చేయించారు. 50 మీటర్ల పొడవైన ఐపీవీ నౌకను తీరరక్షణ దళం కోసం కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ నౌక గంటకు 31.5 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 1,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు.

ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభం
స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఆగస్టు 12న కొచ్చిలో ప్రారంభించారు. దీంతో నౌక తొలి దశ నిర్మాణం పూర్తవుతుంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పూర్తి నిర్మాణం 2016 నాటికి పూర్తవుతుంది. 2018లో నౌకాదళానికి చేరుస్తారు. ఇలాంటి భారీ యుద్ధ నౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకే ఉంది. దీని పొడవు 260 మీటర్లు, వెడల్పు 60 మీటర్లు ఉంటుంది. 37500 టన్నుల బరువును మోయగలదు. మిగ్-29కె, కమాన్ 31, తేలికపాటి యుద్ధ విమానాలను ఈ నౌకపై మోహరించవచ్చు. రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. నౌక 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ నౌకను 2006 నుంచి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తోంది. డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీన్ని డిజైన్ చేసింది.

50 ఏళ్లలో అంతరించిపోయిన 220 భాషలు
దేశంలో గత ఐదు దశాబ్దాల్లో 20 శాతం భాషలు అంతరించిపోయినట్లు వడోదరాకు చెందిన భాషా పరిశోధన, ప్రచురణ కేంద్రం ఆగస్టు 9న తెలిపింది. 1961లో దేశంలో 1100 భాషలుండగా వాటిలో దాదాపు 220 భాషలు కనుమరుగైనట్లు ఆ సంస్థ పేర్కొంది. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో ఆ సంస్థ 2011 నుంచి సర్వే నిర్వహించింది. వారి సర్వేలు 780 భాషలను గుర్తించగా, 100 భాషలను గుర్తించలేకపోయినట్లు తెలిపింది. మొత్తం 880 వరకు ఉన్నట్లు సర్వేలో తేలింది. 1961 జనాభా లెక్కలలో 1652 భాషలను పేర్కొన్నారు. తర్వాత వాటిని 1100కు తగ్గించారు. 1971 జనాభా లెక్కల్లో 108 భాషలనే పేర్కొన్నారు. 10,000 మంది కంటే ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషలనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో భాషల సంఖ్య 108కి తగ్గింది. అంతరించిపోయిన భాషలు చాలావరకు సంచార జాతులకు చెందినవే ఉన్నాయి. గుర్తింపు లేకపోవడం, కొన్ని సమాజాల తరలింపు, భాషలు మాట్లాడేవారికి జీవనోపాధి లేకపోవడం, వెనుకబడినవారిగా చూడడం వంటివి భాషలు అంతరించడానికి కారణాలుగా ఆ సంస్థ పేర్కొంది.

పథ్వీ - 2 విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల పథ్వీ-2 క్షిపణిని భారత్ ఆగస్టు 12న విజయవంతంగా పరీక్షించింది. భూఉపరితలం నుంచి భూఉపరితలంపై 350 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించారు. 500 కిలోల నుంచి 1,000 కిలోల వరకూ వార్‌హెడ్లను పథ్వీ-2 మోసుకెళ్లగలదు. 

ఆర్టీఐ పరిధి నుంచి రాజకీయ పార్టీల మినహాయింపునకు కేబినెట్ ఆమోదం
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధి నుంచి రాజకీయ పార్టీలను మినహాయించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఆరు జాతీయ రాజకీయ పార్టీలు... కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలను ప్రజా సంస్థలుగా పరిగణిస్తూ, అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయంటూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్, 2013లో ఆదేశాలు జారీ చేసింది. సీఐసీ ఆదేశాలపై పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం చట్ట సవరణ వైపే మొగ్గు చూపింది. 

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్, యూపీఏ సమన్వయ కమిటీ ఆమోదం
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సమన్వయ కమిటీ జూలై 30న ఆమోదం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పది జిల్లాల తెలంగాణ ప్రాంతాన్ని వేరుచేసి తెలంగాణను దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది.

రెపోరేటు, సీఆర్‌ఆర్ యథాతథం
2013-14 మొదటి త్రై మాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ జూలై 30న ప్రకటించింది. రెపో రేటును (వివిధ బ్యాంకులకు తానిచ్చిన స్వల్పకాలిక రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు) 7.25 శాతంగాను, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 4 శాతంగానే ఉంచింది. 2013-14 జీడీపీ వద్ధిరేటు అంచనాను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని 5 శాతం వద్ద ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2013 జాతీయం
ఐరాస సాధారణ సభ సమావేశం
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 68వ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సెప్టెంబర్ 28న ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభివద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాని కోసం భద్రతా మండలి పునర్నిర్మాణం జరగాలని, సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి ఐరాస మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలపై ఎలాంటి ఉపేక్ష చూపించరాదన్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్‌ైపై కూడా నిప్పులు చెరిగారు. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమన్నారు. పాక్ భూభాగంపై రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలన్నారు. కాగా, పేదరికాన్ని పారదోలడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సభ్య దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందిపైగా పేదరికంలో మగ్గుతున్నారని, వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందచేయడం ద్వారా పేదరికం తగ్గించాలన్నారు. శాంతి, భద్రత, మానవహక్కులు, పాలన వంటివి పరిష్కరించాల్సిన ప్రధాన అంశాలన్నారు. నీరు, ఇంధనం, మహిళల పట్ల వివక్షత వంటి అంశాలకు 2015 తర్వాత అజెండాలో ప్రాధాన్యత నివ్వాలని కోరారు. ఇక సిరియా సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యకు మిలటరీ చర్యలు పరిష్కారం కాదని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి బహుళ దేశాల సదస్సును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అయితే రసాయన ఆయుధాల వినియోగాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నారు. ఇక అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలు పూర్తిగా అంగీకరించాలని, నిర్ణీత కాలంలో, వివక్ష లేకుండా పూర్తి చేయాలని కోరారు. 

తొలి 5500 హెచ్‌పీ రైలు ఇంజన్
భారత రైల్వేల కోసం తొలిసారిగా అత్యంత శక్తివంతమైన 5500 హెచ్‌పీ రైలు ఇంజన్‌ను సెప్టెంబర్ 26న ప్రారంభించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యు) ఈ ఇంజన్‌ను రూపొందించింది. ఇది ప్రపంచంలో 22 యాక్సిల్ లోడ్‌తో రూపొందించిన అతిపెద్ద లోకోమోటివ్. అనేక దేశాల్లో దీనికంటే శక్తివంతమైన ఇంజన్లు ఉన్నప్పటికీ అవి అధిక యాక్సిల్ లోడ్‌ను ఉపయోగించేవి. ఈ ఆధునిక రైలు ఇంజన్‌ను నార్త్ సెంట్రల్ రైల్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. గంటకు 100 కి.మీ వేగంతో నడిచే ఈ ఇంజన్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇమిడి ఉంది. ఇది అధిక ఇంధన సామర్థ్యంతో, ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. పెద్ద ఇంజన్లు వాడటం వల్ల రవాణా సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, ప్రయాణీకుల రైళ్లకు అధిక ర వాణా సదుపాయాలు కల్పించడానికి వీలవుతుంది.

అభ్యర్థులను తిరస్కరించే హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే తిరస్కరించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. దీంతో పోటీచేస్తున్న అభ్యర్థిని వ్యతిరేకించడం గాని లేదా అందరిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలు, ఓటింగ్ యంత్రాల్లో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఉండాలని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తిరస్కరించే హక్కు ఉండాలంటూ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టుపై తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతత్వంలోని ధర్మాసనం తిరస్కరించే హక్కును నిరాకరిస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొంది. ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా, బెల్జియం, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, స్పెయిన్ దేశాల సరసన భారత్ చేరనుంది. 

సుప్రీంకోర్టుకు ప్రత్యేక పోస్టల్ పిన్‌కోడ్
భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక పిన్‌కోడ్ - 110201ను సెప్టెంబర్ 26న ప్రవేశపెట్టింది. పెద్ద మొత్తంలో పోస్ట్ పొందే వినియోగదారులకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయిస్తారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయించడం వల్ల సార్టింగ్ ఆఫీసు నుంచి నేరుగా మెయిల్ పొందే అవకాశం ఏర్పడుతుంది. మధ్యలో డెలివరీ పోస్ట్ ఆఫీసు జోక్యం ఉండదు. చేరవేసే కాల వ్యవధిని సగం రోజుకు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. త్వరలో అన్ని హైకోర్టులకు కూడా ప్రత్యేక పిన్‌కోడ్స్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం తెలిపారు.

జమ్మూలో ఉగ్రవాదుల దాడిలో 12మంది మృతి 
సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు సెప్టెంబర్ 26న జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత హీరా నగర్ పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. సైన్యం ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే - ఇ- తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు సైనిక అధికారులు తెలిపారు.

ఐటీఐఆర్‌కు కేంద్రం ఆమోదం
హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఐటీఐఆర్ ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఐటీఐఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో 202 చదరపు కిలోమీటర్ల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టు తొలి దశను 2013 నుంచి 2018 వరకూ అమలు చేస్తారు. రెండో దశ అమలు 2018 నుంచి 2038 వరకూ ఉంటుంది.

ఎన్‌ఐసీ సమావేశం
జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు, మీడియా, వ్యాపార, ప్రజా జీవన రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మత విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు, అభ్యంతరకర అంశాలను ప్రచారం చేసేందుకు సామాజిక వెబ్‌సైట్లను దుర్వినియోగం చేయటంపై ప్రధానమంత్రి మన్మోహసింగ్ సహా పలువురు ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.అన్ని మతాల మధ్య సామరస్య సంబంధాలను పెంపొందించేందుకు పౌరులంతా సమానత్వంతో, గౌరవప్రదంగా, స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని ఎన్‌ఐసీ తీర్మానం చేసింది. 

జాతీయ మత సామరస్య అవార్డులు
జాతీయ మత సామరస్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2011 సంవత్సరానికిగాను జాతీయ మత సామరస్య అవార్డును మిజోరాంకు చెందిన కమ్లియానా, ఒడిశాకు చెందిన ఎండీ అబ్దుల్ బారిలకు సంయుక్తంగా అందజేశారు. 2012కుగాను ఢిల్లీకి చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అమిటీ అండ్ నేషనల్ సాలిడారిటీ’ సంస్థ అవార్డును గెల్చుకుంది.

ఎన్‌టీపీసీకి అఫీషియల్ లాంగ్వేజ్ అవార్డు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) కు ఇందిరా గాంధీ ఆఫీషియల్ లాంగ్వేజ్ అవార్డు లభించింది. అధికారిక భాష (రాజభాష) హిందీని తమ కార్యకలాపాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చే వివిధ మంత్రిత్వ శాఖలు, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌‌సకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 1986-87 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.

ఆర్‌బీఐ త్రై మాసిక పాలసీ సమీక్ష
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్రై మాసిక పాలసీ సమీక్షను సెప్టెంబర్ 20న చేపట్టింది. ఇందులోని ముఖ్యాంశాలు..రెపో రేటును పావు శాతం పెంచింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 7.25 శాతం నుంచి 7.5 శాతానికి చేరింది. గత రెండేళ్లలో రెపో రేటు పెంపు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం అంటే.. 2011 అక్టోబర్‌లో చివరిసారిగా రెపో రేటు పావు శాతం పెరిగింది (8.5 శాతానికి). రివర్స్ రెపో కూడా పావు శాతం పెంచింది. దీంతో ఇది 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు. దీన్ని యథావిధిగా 4 శాతంగానే ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును ముప్పావు శాతం తగ్గించి 9.75 శాతానికి పరిమితం చేశారు.

రాజస్థాన్‌లో అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21న నిర్ణయించింది. రాజధాని జైపూర్‌కు సమీపంలోని సాంబార్ సరస్సు వద్ద 23 వేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ ప్రాజెక్ట్ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా 1,000 మెగావాట్లతో కూడిన మొదటి దశ 2016 నాటికి పూర్తవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జవహర్ లాల్ నెహ్రూ సోలార్ మిషన్‌లో భాగంగా 2022 నాటికి 20 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాజస్థాన్‌లోని పచ్‌పద్రా వద్ద హిందుస్థాన్ పెట్రోలియం చమురుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. రూ. 37 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ 2018 నాటికి పూర్తవుతుంది.

పించన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బిల్లు-2011ను లోక్‌సభ సెప్టెంబర్ 4న ఆమోదించింది. వద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించే అథారిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పెన్షన్ ఫండ్‌ను ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు, పెన్షన్ రంగంలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతినిచ్చేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. చందాదారులు తమ సొమ్మును కనీస హామీ మొత్తం పొందగలిగే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు సౌలభ్యం ఉంటుంది. ‘ఆదాయంతోపాటు పొదుపు’ అనే సూత్రం ఆధారంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు పీఎఫ్‌ఆర్‌డీఏకి చట్టబద్ధమైన అధికారాలు కల్పిస్తుంది. ప్రస్తుతం 5.28 మిలియన్ల చందాదారులున్నారు. పీఎఫ్‌ఆర్‌డీఏ ఆగస్టు 14 నాటికి ’ 34,965 కోట్ల కార్పస్ ఫండ్ కలిగి ఉంది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ఉద్యోగులు (సాయుధ బలగాలు తప్ప) ఎన్‌పీఎస్‌లో కచ్చితంగా చేరాలని నిబంధన విధించారు. తర్వాత దేశంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు 2009 మేలో అవకాశం కల్పించారు. 

వైమానిక దళానికి సీ-17 రవాణా విమానం
భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్-3ని రక్షణమంత్రి ఎ.కె ఆంటోనీ ఉత్తర ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో సెప్టెంబర్ 2న వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఈ భారీ రవాణా విమానం సైనిక దళాలను, ట్యాంకర్లు వంటి ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఈ విమానం విపత్తుల్లో సహాయ చర్యలు చేపట్టడంలో వైమానిక దళం సామర్థ్యాన్ని ఎంతో పెంచుతుంది. 75 టన్నుల బరువు, 150 మంది సైనికులతో, 4200 కి.మీ నిరాటంకంగా సీ-17 విమానం ప్రయాణించగలదు. ప్రస్తుతం భారత్ ఉపయోగిస్తున్న రష్యా నిర్మించిన ఐఎల్-76 రవాణా విమానం 40 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. పది సీ-17 విమానాలు, సంబంధిత పరికరాలు అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది.

అక్షరాస్యతలో మొదటి స్థానంలో త్రిపుర
దేశ అక్షరాస్యతలో త్రిపుర మొదటి స్థానంలో నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు. 94.65 శాతం అక్షరాస్యతతో కేరళను అధిగమించి త్రిపుర మొదటి స్థానం సాధించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా సెప్టెంబర్ 8న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాణిక్ ఈ విషయాన్ని తెలిపారు. కేరళ 93.91 శాతం అక్షరాస్యత సాధించింది. 100 శాతం అక్షరాస్యత లక్ష్యం సాధించేందుకు కషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు.

రాజ్యసభలో కొలీజియం వ్యవస్థ రద్దు బిల్లు
న్యాయమూర్తుల నియామకాలు చేపట్టే కొలీజియం వ్యవస్థ రద్దుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ఆగస్టు 29న ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం వ్యవస్థ ద్వారా ప్రస్తుతం చేపడుతున్నారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీలను చేపట్టడానికి జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు కొత్త బిల్లు వీలు కల్పిస్తుంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. కొత్త బిల్లు వల్ల న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వర్గం మాట కూడా చెల్లుబాటవుతుంది. బిల్లు ప్రకారం ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలో ఒక ప్యానెల్ ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రముఖ వ్యక్తులను నియమించే కమిటీలో రాజ్యసభ లేదా లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి కూడా సభ్యులుగా ఉంటారు.

లోక్‌సభలో భూ సేకరణ బిల్లుకు ఆమోదం
భూసేకరణ బిల్లు-2012కు లోక్‌సభ ఆగస్టు 29న ఆమోదం తెలిపింది. 1894 చట్టం స్థానంలో కొత్త బిల్లును తెచ్చారు.

ప్రధానాంశాలు:



ప్రజా ప్రయోజనార్థంలో పేర్కొన్న విధంగా భూసేకరణ జరగాలి.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేనిదే భూ సేకరణ జరపరాదు.నష్ట పరిహారం మార్కెట్ ధర కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగింతలు, పట్టణాల్లో రెండింతలు చెల్లించాలి.భూమి సేకరించి ఐదేళ్లు అయినా నష్టపరిహారం చెల్లించకుంటే కొత్త చట్టం వర్తిస్తుంది. -భూసేకరణ పూర్తికాకుంటే కొత్త ప్రక్రియ ప్రకారం జరగాలి.ప్రభుత్వ - ప్రై వేటు ప్రాజెక్టులకైతే భూసేకరణ చేయాలంటే 70 శాతం భూ యజమానుల ఆమోదం అవసరం. ప్రై వేటు ప్రాజెక్టులకైతే 80 శాతం భూ యజమానుల ఆమోదం అవసరం.పూర్తి మొత్తం చెల్లించనంత వరకు భూ యజమానులను తొలగించేందుకు వీలు లేదు.

భారత జనాభా 2012 మార్చి నాటికి 123 కోట్లు
భారతదేశ జనాభా మార్చి 1, 2012 నాటికి 123 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా ఆగస్టు 29న రాజ్యసభకు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మార్చి 1, 2011 నాటికి ఉన్న జనాభా 121 కోట్లు. 2011-12లో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి సంఖ్య 27 కోట్లుగా పేర్కొన్నారు. 2004-05లో 37.2 శాతంగా ఉన్న పేదరికం 2011-12 నాటికి 21.9 శాతానికి తగ్గినట్లు మంత్రి తెలిపారు.

అరవై నిమిషాలకో అతివ ఆహుతి
వరకట్న సంబంధిత కారణాలతో దేశంలో ప్రతి గంటకూ ఓ మహిళ బలి అవుతున్నట్టు తాజాగా వెల్లడైంది. 2007, 2011 మధ్య కాలంలో ఈ తరహా మరణాలు క్రమంగా పెరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) గణాంకాలు పేర్కొన్నాయి. 2012లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8,233 మంది మహిళలు వరకట్న కోరల్లో చిక్కుకుని మతిచెందినట్టు అవి వెల్లడించాయి. అంటే ప్రతి అరవై నిమిషాలకూ ఓ మహిళ మరణించినట్టు లెక్క. 2011లో ఈ తరహా మరణాలు 8,618 చోటుచేసుకోగా, నేరనిర్ధారణ రేటు 35.8 శాతం మాత్రమే నమోదైంది. 2012లో ఇది 32 శాతానికి తగ్గడం గమనార్హం. వరకట్న సంబంధిత చావులు 2007, 2011 మధ్య కాలంలో క్రమంగా పెరిగాయి. 2007లో 8,093 మరణాలు చోటుచేసుకోగా, 2008లో 8,172, 2009లో 8,383 మరణాలు సంభవించాయి. 2010లో అవి 8,391గా నమోదయ్యాయి.

జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
భారత నౌకాదళం కోసం చేపట్టిన జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సైనిక ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్-5 రాకెట్ ద్వారా ఆగస్టు 30న ప్రయోగించారు. దీనికి రుక్మిణిగా పేరు పెట్టారు. ఈ అత్యాధునిక మల్టీబ్యాండ్ జీశాట్-7ను స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తయారుచేసింది. దీని తయారీకి ’ 187 కోట్లు, ప్రయోగానికి ’ 480 కోట్లు ఖర్చు చేశారు. దీని బరువు 2625 కిలోలు. ఈ ఉపగ్రహం దేశ సముద్ర భద్రతకు, నిఘా వ్యవస్థకు గణనీయంగా ఉపయోగపడుతుంది. భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలకు నెట్‌వర్కింగ్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ ఉపగ్రహంలో ఉన్న ‘ఎస్’ బాండ్ నౌకలకు కమ్యూనికేషన్ సదుపాయం అందిస్తుంది. ‘కెయు’ బాండ్.. ఆడియో, వీడియోల హైడెన్సిటీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా హిందూ మహా సముద్రంలో 70 శాతం ప్రాంత సమాచారం పొందేందుకు తోడ్పడుతుంది. 2014-15లో ఇస్రో నౌకాదళ రెండో ఉపగ్రహం జీశాట్-7ఏని ప్రయోగించనుంది. యూరోపియన్ లాంచ్ కంపెనీ ‘ఏరియాన్ స్పేస్’ 1981 నుంచి ఇస్రోకు చెందిన 17 ఉపగ్రహాలను ప్రయోగించింది.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2013 జాతీయం
కూడంకుళం విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం
తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ప్రారంభమైంది. తిరునల్వేలి జిల్లాలోని ఈ కేంద్రం యూనిట్-1 నుంచి విద్యుత్‌ను అక్టోబర్ 22న దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. భారత్, రష్యాలు సంయుక్తంగా ఈ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాయి. 1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం 20 రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఈ 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తి కలిపితే దేశంలో అణువిద్యుత్తు 5780 మెగావాట్లకు చేరుకుంటుంది. కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2002లో మార్చి 31న ప్రారంభమయ్యాయి.

సొంత 3జీ సేవలను ప్రారంభించిన వైమానిక దళం
భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) సొంత 3జీ సేవలను అక్టోబర్ 25న ప్రారంభించింది. దీంతో ఐఏఎఫ్ సిబ్బందికి దేశమంతా కమ్యూనికేషన్ సేవలు వేగంగా, సకాలంలో అందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూల నగరం బెంగళూరు
ఐటీ రంగానికి సంబంధించి దేశ సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ 12వ స్థానంలో, విశాఖపట్నం 21వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (జిరెమ్), రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ దిగ్గజం డీటీజెడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నగర అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు, మానవవనరులు, నగర సంస్కృతి, జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు, నీరు, వసతి వంటి అంశాలను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై, ముంబై, పుణె నగరాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకోగా ఢిల్లీకి అసలు చోటు దక్కలేదు. మొత్తం 21 నగరాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.

పాట్నాలో బాంబు పేలుళ్లలో ఐదుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో అక్టోబర్ 27న జరిగిన బాంబు పేలుళ్లలో ఐదుగురు మరణించారు. 83 మంది గాయపడ్డారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

భాక్రానంగల్ డ్యామ్‌కు 50 ఏళ్లు
భాక్రానంగల్ డ్యామ్‌ను నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 22న హర్యానాలోని నంగల్‌లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ‘ఆనకట్టలు భారతదేశ ఆధునిక దేవాలయాలు’ అని కీర్తించిన భారత తొలి ప్రధాని నెహ్రూ 1963, అక్టోబర్ 22న ఈ డ్యామ్‌ను జాతికి అంకితం చేశారు. 1960 లలో హరిత విప్లవానికి కారణమైన ఈ డ్యామ్ ద్వారా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని దాదాపు 1.35 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ఆనకట్టను అప్పట్లోనే రూ.245.28 కోట్లతో నిర్మించారు.

తీర గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సునయన ప్రారంభం
నౌకా దళానికి చెందిన రెండో సముద్ర తీర గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సునయనను కోచిలో అక్టోబర్ 15న ప్రారంభించారు. నౌకాదళ పెట్రోలింగ్, నిఘా అవసరాలకు దీన్ని వినియోగిస్తారు. ఇది 25 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ పవర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉంది. ఆధునిక నేవిగేషన్, క మ్యూనికేషన్, ఎల క్ట్రానిక్ సపోర్ట్ వ్యవస్థలున్నాయి. ఎలక్ట్రిక్ ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన 76 ఎం.ఎం. గన్‌తోపాటు ఇతర ఆయుధాలు ఇందులో ఉంటాయి. హెలికాఫ్టర్‌ను కూడా మోసుకుపోగలదు.

ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయులు
ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ (17వ స్థానం), యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన శిఖా శర్మ (32వ స్థానం), హెచ్‌ఎస్‌బీసీకి చెందిన నైనా లాల్ కిద్వాయ్ (42వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు. 

హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఒర్బన్ భారత్ పర్యటన
హంగరీ ప్రధానమంత్రి డాక్టర్ విక్టర్ ఒర్బన్ తన భారత పర్యటనలో అక్టోబర్ 16న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమై చ ర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతునిస్తున్నట్లు ఒర్బన్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో జీవ సంబంధ, రసాయన ఆయుధ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సంప్రదాయ వైద్యం, కళలు, సాంస్కృతిక, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి.

ఫై-లీన్‌ తుపాను ధాటికి దెబ్బతిన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌
అక్టోబర్‌ 12, 13 తేదీల్లో సంభవించిన ఫై-లీన్‌ తుపాను వల్ల ఒడిశాలోని గంజాం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలు తీవ్రం గా నష్టపోయాయి. పారాదీప్‌ పోర్టు ధ్వంసమైంది. జాలర్లు బాగా నష్టపోయారు. అక్టోబర్‌ 12న ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద ఇంద్రనీలం తుపాను తీరం దాటింది. ఈ తుపా ను వల్ల 220 కి.మీ వేగంతో గాలులు వీచాయి. రెండు రాష్ట్రా ల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత 24 ఏళ్లలో ఇంత భారీ తుపాను సంభవించడం ఇదే తొలిసారి. 

ఫై-లీన్‌ పేరును సూచించిన థాయ్‌లాండ్‌: ప్రస్తుత తుపానుకు ఫై-లీన్‌ అనే పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. ఆసియాలో వచ్చే తుపాన్లకు పేర్లను హిందూ మహా సముద్రానికి ఉత్తరంవైపు ఉన్న ఎనిమిది దేశాలు సూచిస్తాయి. గతంలో జల్‌, వాయు, అగ్ని, వృద్వి, ఆకాశ్‌ అనే తుపాన్లకు భారత్‌ పేరు పెట్టింది.

రాష్టస్థ్రాయిలో విపత్తు సహాయదళం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తు సహాయ దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మొదట 1000 మందితో ఈ దళాన్ని ఏర్పాటు చేసి రక్షణ, సహాయ చర్యల్లో శిక్షణ ఇస్తారు. జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రాష్టస్థ్రాయిలో పనిచేస్తుంది.

మధ్యప్రదేశ్‌లో తొక్కిసలాటలో 115 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో రతన్‌గడ్‌ దుర్గాదేవి ఆలయం వద్ద సింధునదిపై ఉన్న వంతెనపై అక్టోబర్‌ 13న జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు. నవరాత్రి సందర్భంగా రతన్‌గడ్‌ మాతా మందిరం వద్దకు చేరుకునే మార్గంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ అక్టోబర్‌ 3న ఆమోదం తెలిపింది. జూలై 30 నాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేబినెట్‌ తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి, విభజన అంశాన్ని పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. మంత్రుల బృందం ఆరువారాల్లో సిఫార్సులు చేస్తుంది.

అనర్హత ఆర్డినెన్స్‌ ఉపసంహరణ
వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్‌ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్‌ అక్టోబర్‌ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్‌ 24న కేంద్రం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. 

రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షాభియాన్‌కు ఆమోదం
ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షాభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీన్ని 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేస్తారు. ఈ పథకం కోసం మొత్తం 98,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో సమకూరుస్తాయి. ఈశాన్య, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి ప్రత్యేక తరహా రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తారు. ఈ పథకం విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అత్యంత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. టీచింగ్‌- లెర్నింగ్‌ క్వాలిటీ, పరిశోధనలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం కిందకు 316 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 13,024 కళాశాలలను తీసుకువస్తారు.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2013 జాతీయం
భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం
భారతీయ మహిళా బ్యాంకు తొలి శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవంబర్ 19న నారీమన్ పాయింట్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించారు. మహిళ సాధికారికతలో ఈ బ్యాంకు ఏర్పాటు చిన్న అడుగు మాత్రమేనని, ఇది మహిళల అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను చూపుతుందని ప్రధానమంత్రి అన్నారు. క్యాటరింగ్, శిశు సంరక్షణ వంటి మహిళా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలు చేపట్టేవారికి రుణాలు ఇవ్వనున్నట్లు మహిళా బ్యాంకు చైర్‌పర్సన్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా చెన్నై, బెంగళూరు, గువహటి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ శాఖలను కూడా ప్రధాని ప్రారంభించారు. 2013-14 బడ్జెట్‌లో రూ.1000 కోట్ల మూలధనంతో పూర్తి మహిళా బ్యాంకును ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలో భాగంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు.

న్యూఢిల్లీలో బ్రిక్స్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్
మూడో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ కాంపిటీషన్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో నవంబర్ 21, 22 తేదీల్లో జరిగింది. బ్రిక్స్‌తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ పరిస్థితుల నుంచి ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత ఆర్థిక, రాజకీయ సమన్వయం బ్రిక్స్ దేశాల మధ్య అవసరమని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ అభివద్ధి బ్యాంక్, కంటెంజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్‌ల ఏర్పాటు ద్వారా నిర్మాణాత్మకమైన సహకారానికి బ్రిక్స్ దేశాలు పూనుకున్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ సహా వివిధ అంశాలు, సవాళ్లపై చర్చలు జరిగాయి. 300 కోట్ల జనాభా గల బ్రిక్స్ దేశాల కూటమి మొత్తం జీడీపీ సుమారు రూ.14 లక్షల కోట్లుగా ఉంది.

భారత్‌లో 50 శాతానికి పైగా అందుబాటులో లేని మరుగుదొడ్లు
భారత్‌లో 50 శాతానికిపైగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. నవంబర్ 16న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో 60 కోట్ల మందికి పైగా మరుగుదొడ్లు అందుబాటులో లేవని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవని నివేదిక తెలిపింది. 100 కోట్ల మంది బహిర్భూమిలోనే కాలకత్యాలు తీర్చుకుంటారని చెప్పింది. 2017 నాటికి బహిర్భూమిలో మల విసర్జన లేకుండా చేసి మరుగుదొడ్ల సమస్యను భారత్ పరిష్కరిస్తుందని నిర్మల్ భారత్ అభియాన్ అనే ప్రభుత్వ కార్యక్రమం పేర్కొంది.

కోస్తాంధ్రలో హెలెన్ తుపాను విధ్వంసం
హెలెన్ తుపాను ధాటికి కోస్తా జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. నవంబర్ 22న వచ్చిన వర్షాలు, గాలులకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, విశాఖపట్నం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. 11 మంది మరణించారు. 600 గ్రామాలపై ఈ తుపాను ప్రభావం చూపింది. 40,000ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూడు లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో కొబ్బరి, పది వేల ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది.

6 రాష్ట్రాలకు పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు
60,000 చ.కి.మీ పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాలని ఆరు రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 14న కోరింది. ఇందులో భాగంగా మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిని నిషేధిస్తూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ కనుమలపై కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని ప్యానెల్ నివేదికను ఆమోదించిన తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అవినీతి, నేరాలు అరికట్టడంపై సదస్సు
సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నవంబర్ 11 నుంచి న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘అవినీతి, నేరాలు అరికట్టడంపై ఉమ్మడి వ్యూహాల రూపకల్పన’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పాలనాపరమైన నిర్ణయాలపై దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, అవి అసమంజసంగా ఉండరాదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నారు. ఈ సదస్సులో సీబీఐ అధికారులు, 19 దేశాల నుంచి పరిశోధనాధికారులు, రాష్ట్రాలు, అవినీతి నిరోధక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా 1963, ఏప్రిల్ 1న సీబీఐ ఏర్పడింది. తర్వాత దీని పరిధి విస్తరిస్తూ వస్తోంది. మొదటి సీబీఐ డెరైక్టర్‌గా డీపీ కోహ్లీ పనిచేశారు. ఆయన 1963, ఏప్రిల్ 1నుంచి 1968, మే 31వరకు విధులు నిర్వర్తించారు.

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య భారత్‌కు అప్పగింత
విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రష్యా సముద్ర తీరంలో నవంబర్ 16న భారత నౌకాదళంలో చేరింది. రష్యా ఆధునీకరించిన ఈ నౌక అప్పగింత కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ పాల్గొన్నారు. ఈ నౌక 2014, ఫిబ్రవరిలో భారత్‌కు చేరుకుంటుంది. భారత నౌకాదళంలోకెల్లా ఇది అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు. 16 మిగ్-29కె, ఆరు కామోవ్ 31, ఆరు సీకింగ్, 4 చేతక్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను ఇందులో మోహరింపచేయొచ్చు. దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. 2008లో అప్పగించాల్సి ఉంది. నిర్మాణ వ్యయం పెరగడం కారణంగా అదనపు వ్యయంతో ఐదేళ్ల ఆలస్యంగా రష్యా.. భారత్‌కు అప్పగించింది. ఇటువంటి అత్యాధునిక విమానవాహక నౌక చేరికతో రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, బ్రెజిల్ దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆసియాలో ఇటువంటి నౌకగల దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా 1987లో ఈ నౌకను ‘బకు’ పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అని నామకరణం చేసింది. 1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించింది.

ప్రపంచంలోనే అత్యంత ఎతై్తన ఆలయానికి శంకుస్థాపన
ప్రపంచంలోనే అత్యంత ఎతై్తన ఆలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలో ఎతై ్తనదిగా గుర్తింపు పొందనుంది. బీహార్ రాజధాని పాట్నాకు 120 కి.మీ దూరంలో తూర్పు చంపారన్ జిల్లాలోని కేషరియాలో ఈ విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు.

మంగళయాన్‌ను ప్రయోగించిన భారత్
అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన మంగళయాన్ ఆర్బిటర్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ25 రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎం.ఓ.ఎం)గా పేరుపెట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ - సీ25 మార్స్ ఆర్బిటర్‌ను భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భూమి చుట్టూ 25 రోజులు పరిభ్రమిస్తుంది. తర్వాత అక్కడ నుంచి 300 రోజులపాటు 400 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. అంగారకుడిపై జీవం ఆవిర్భావానికి ఆధారమైన మిథేన్ గురించి ఆర్బిటర్ అన్వేషిస్తుంది. ఒకప్పుడు ఉన్న నీరు ఎలా లేకుండా పోయిందో తెలుసుకుంటుంది. అంతేకాకుండా అంగారకుడి ఉపరితలంపై పరిస్థితులను, ఖనిజాలను, మూలకాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధనల కోసం ఆర్బిటర్‌లో ఐదు పరికరాలను అమర్చారు. మంగళయాన్ విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా, తొలి ఆసియా దేశంగా భారత్‌కు గుర్తింపు లభిస్తుంది. ఇది భారత్ మొదటి గ్రహాంతర పరిశోధన. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే అంగారకుడిపై విజయవంతంగా ప్రయోగాలు చేశాయి. వివిధ దేశాలు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి.

పీఎస్‌ఎల్‌వీ-సీ25:భారత్ చేపట్టిన 25 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాల్లో 24 విజయం సాధించాయి. 1993లో తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-డీ1 విఫలమైంది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక 1337 కిలోల బరువు గల మార్స్ ఆర్బిటర్‌ను మోసుకెళ్లింది. 49.56 నిమిషాల్లో ఆర్బిటర్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి 450 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

హైదరాబాద్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సు
తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు - 2013 హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యుఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. జనాభా అవసరాలకనుగుణంగా ఆహారోత్పత్తులు పెంచేందుకు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబించడం, చిన్న, సన్నకారు రైతులకు సహాయమందించడం, సాంకేతిక, వ్యవసాయ పరికరాలు వాడటం, ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు పెంచడం, వివిధ సంస్థల మధ్య భాగస్వామ్యం పెంచడం వంటి ఐదు విధానాలను పాటించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు. చిన్నరైతులకు వ్యవసాయం ఆధారంగా కొనసాగాలంటే యాంత్రీకరణను ఒక పరిష్కారంగా పేర్కొన్నారు. సబ్సిడీలు చిన్నరైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. 

ప్రగతి క్షిపణిని ప్రదర్శించిన డీఆర్‌డీవో
రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ‘ప్రగతి’ క్షిపణిని దక్షిణ కొరియాలో జరుగుతున్న సియోల్ ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఎడెక్స్)-2013లో అక్టోబర్ 29న ప్రదర్శించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 60 నుంచి 170 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఎడెక్స్-2013లో 33 దేశాలకు చెందిన 300కు పైగా సంస్థలు పాల్గొన్నాయి.

ఎతైన సర్దార్ పటేల్ విగ్రహానికి శంకుస్థాపన
గుజరాత్‌లోని నర్మదా డ్యామ్ సమీపంలో భారత మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 31న శంకుస్థాపన చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎతై ్తన స్మృతి చిహ్నం కానుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు) ఉంటుంది. 40 నెలల్లో పూర్తిచేసే ఈ విగ్రహాన్ని నర్మదా సరోవర్ డ్యామ్‌కు 3.32 కి.మీ దిగువ ప్రాంతంలో సాధు దీవి వద్ద ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహంతోపాటు పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ. 2500 కోట్లు అవుతుందని అంచనా. చైనాలోని హెనాన్‌లో గల ‘స్పింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ’ 128 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో ఎతై ్తన విగ్రహంగా గుర్తింపు పొందుతోంది.

అధికారులకు రక్షణ కల్పించాలన్న సుప్రీంకోర్టు
రాజకీయ జోక్యం నుంచి అధికారులను కాపాడాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 31న ప్రభుత్వాలను ఆదేశించింది. అధికారుల పదవీకాలాన్ని కచ్చితంగా నిర్దేశించాలని పేర్కొంది. ఐఏఎస్‌ల బదిలీలు నిర్ణయించేందుకు అత్యున్నత స్థాయి సివిల్ సర్వీసెస్ బోర్డు (సీఎస్‌బీ)ని కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. బదిలీలతో అధికారులను వేధించే అవకాశం రాజకీయ నాయకులకు లేకుండా పోతుంది. అధికారుల పోస్టింగ్, బదిలీ, క్రమశిక్షణ చర్యల నియంత్రణకు సంబంధించి పార్లమెంటు చట్టం తేవాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ నాయకుల మౌఖిక ఆదేశాలను అధికారులు పాటించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. రాజకీయ జోక్యం నుంచి బ్యూరోక్రసీని కాపాడాలంటూ కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్‌తోపాటు మరికొందరు అధికారులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2013 జాతీయం
జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత 
ప్రతిపాదిత ‘జుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన (జేఏసీ)’కు రాజ్యాంగబద్ధత కల్పించాలని 2013 డిసెంబర్ 26న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందువల్ల జేఏసీలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలు చేపట్టేందుకు ఈ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 120వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2013 ప్రభుత్వం తీసుకొచ్చింది. న్యాయమూర్తుల నియామక కమిషన్ ఏర్పాటుకు ప్రకరణ 124(ఎ)ని చేరుస్తారు. ప్రకరణలు 124(2), 217(1), 222(1)కు సవరణ చేస్తారు. జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. లా సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
దేశంలోని 24 హైకోర్టుల్లో 800 పైగా న్యాయమూర్తులను నియమించే, బదిలీ చేసే బాధ్యత జేఏసీకి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘కొలీజీయం’ వ్యవస్థ స్థానంలో జేఏసీ పనిచేస్తుంది.

అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరంగా 2016
2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2013 డిసెంబర్ 21న జరిగిన జనరల్ అసెంబ్లీ సమావేశంలో 2016ను పప్పుదినుసుల సంవత్సరంగా ఆమోదించారు. చక్కెర వ్యాధి, స్థూలకాయం పెరుగుతున్న పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి పప్పుదినుసుల సంవత్సరంగా ప్రకటించడం పోషకాహారంలో వాటి ఆవశ్యకతను గుర్తించినట్లయింది. ఇందువల్ల పప్పుదినుసుల గురించి, ఆరోగ్యం, పోషకాహారం, ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరతలో వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కలుగుతుంది. బీన్‌‌స, పెసలు, అలచందలు, బటాణీ, శెనగలు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోషకాలు అందించడంలో ముఖ్యమైన ఆహార పదార్థాలుగా ఉన్నాయి. భారతదేశం విషయానికొస్తే.. పేదలకు ముఖ్యంగా ప్రొటీన్ లోపం ఉన్నవారికి పప్పుదినుసులు చౌకగా కూరగాయల రూపంలో అందే ఆహారం. భారత్ 18.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. 3.5 మిలియన్ టన్నుల దిగుమతితో అతి పెద్ద దిగుమతిదారుగా, 22.0 మిలియన్ టన్నులు వినియోగంతో అతిపెద్ద వినియోగదారుగా కొనసాగుతోంది.

పద్మశ్రీలు వెనక్కి ఇవ్వాలని మోహన్‌బాబు, బ్రహ్మానందంలకు హైకోర్‌‌ట సూచన
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేసినందుకు వాటిని రాష్ర్టపతికి వెనక్కి ఇవ్వాలని నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందంలను ఆంధ్రప్రదేశ్ హైకోర్‌‌ట 2013 డిసెంబర్ 23న సూచించింది. వీరు ‘దేనికైనా రెడీ’ చిత్రంలో పద్మశ్రీ బిరుదును దుర్వినియోగం చేసారని దాఖలైన పిటీషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది.

లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు -2011కు పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 17న, లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించాయి. ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తారు. లోక్‌పాల్ ఏర్పాటైన ఏడాదిలోగా రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి (కొన్ని పరిమితులు మినహా), మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్టంగా ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్లు లేదా 75 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. వీరిని ప్రధానమంత్రి, స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ నియమిస్తుంది.

వైమానిక దళంలో ప్రవేశానికి ఎల్‌సీఏ తేజస్‌కు అనుమతి
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ను వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రాథమిక అనుమతి లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో డిసెంబర్ 20న తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు. ఈ అత్యాధునిక తేలికపాటి యుద్ధ విమానాన్ని మిగ్-21 స్థానంలో ప్రవేశపెడతారు. తద్వారా స్వదేశీయంగా ఎల్‌సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. 2014 చివరినాటికి తేజస్‌కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. దీనికోసం రక్షణ శాఖ 1983లో రూ.560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ఈ వ్యయం ఇప్పటికే రూ.25,000 కోట్లకు చేరుకుంది.

కిషన్‌గంగ నదీజలాలపై భారత్‌కు ఊరట
కిషన్‌గంగ నదీ జలాలను జమ్మూకాశ్మీర్‌లో విద్యుదుత్పాదన కోసం మళ్లించేందుకు భారత్‌కు గల హక్కును హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోర్టు సమర్థించింది. ఈ విషయంలో పాకిస్థాన్ అభ్యంతరాలను కొట్టివేసింది. ఈ మేరకు భారత్ - పాక్‌ల మధ్యవర్తిత్వం కేసులో డిసెంబర్ 20న తుది తీర్పు ఇచ్చింది. కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు దిగువకు కిషన్‌గంగ/నీలం నదిలోకి కనీసం 9 క్యూమెక్‌ల (సెకనుకు క్యూబిక్ మీటర్లు) నీటిని భారత్ నిరంతరం వదిలిపెట్టాలని కూడా ఈ తీర్పులో నిర్ణయించింది.

పెప్సికో బేవరేజ్ సంస్థకు సీఎం శంకుస్థాపన
చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో రూ.1200 కోట్లతో పెప్సికో సంస్థ ఏర్పాటుచేసే శీతల పానీయాల పరిశ్రమకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 21న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో మూడు దఫాలుగా పెప్సీకో సంస్థ పెట్టుబడులు పెడుతుంది. రోజుకు 3.6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సంతరించుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో పెప్సికో సంస్థ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో శ్రీ సిటీలో నెలకొల్పే పరిశ్రమ అతిపెద్దది కానుంది.

వంశధార నుంచి శ్రీకాకుళంకు 8 టీఎంసీల నీటికి అనుమతి
శ్రీకాకుళంలో కాట్రగడ్డ వద్ద వంశధార నది నీటిని వాడుకొనేందుకు మళ్లింపు కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు వంశధార ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ అడ్డుగోడ (సైడ్ వీయర్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఒడిశా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 8 టీఎంసీల నీటిని అదనంగా వాడుకోవడానికి తద్వారా 50 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలవుతుంది. వంశధార ఒడిశాలో జన్మించి ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్లు, ఒడిశా - ఆంధ్ర సరిహద్దులో 29 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 82 కి.మీ ప్రవహిస్తోంది. ఈ నదీ జలాలను సమానంగా పంచుకోవాలని ఇరు రాష్ట్రాల మధ్య 1962, సెప్టెంబర్ 30న ఒప్పందం కుదిరింది.

మంత్రుల ప్రవర్తనా నియమావళికి కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రవర్తనా నియమావళికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా, తటస్థంగా వ్యవహరించాలన్న దానికి కార్యనిర్వాహక వర్గం కట్టుబడి ఉండాలనే క్లాజును సవరణ ద్వారా చేర్చారు. ఈ సవరణలు కేంద్ర స్థాయిలో వెంటనే అమల్లోకి వస్తాయి. తర్వాత రాష్ట్రస్థాయిలోనూ అమలు చేయాలని కోరతారు. ఈ సవరణలు నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులను మంత్రులు ఒత్తిడి చేయకుండా అడ్డుకుంటాయి. అధికారులను ప్రలోభపెట్టే బదిలీలు, పోస్టింగ్‌లను అడ్డుకోవడంలో ఈ నియమావళి సవరణలు దోహదం చేయనున్నాయి.

సచివాలయం - మండలాల మధ్య వీడియో అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు హైడెఫినిషన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (ఏపీస్వాన్) ద్వారా అనుసంధానం చేసే ఈ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీంతో ఇటువంటి సౌకర్యం గల మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజధానిని 23 జిల్లాలు, 1126 మండల కార్యాలయాలతో అనుసంధానం చేస్తుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ వ్యవస్థ ప్రభుత్వ నిర్వహణలో పారదర్శకతను తీసుకువస్తుందని, సంక్షేమ పథకాల సమీక్షకు, ప్రకతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వానికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2000లోనే అన్ని జిల్లా కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు.

స్వలింగ వివాహాలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
స్వలింగ లైంగిక సంబంధాలు నేరం కాదన్న 2009 నాటి ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం శిక్షించదగ్గ నేరమన్న భారతీయ శిక్షాస్మతిలోని సెక్షన్ 377ను కోర్టు సమర్థించింది. దీన్ని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ సెక్షన్ కొనసాగుతున్నంతవరకూ స్వలింగ లైంగిక సంబంధాలను చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు డిసెంబర్ 11న తన తీర్పులో అభిప్రాయపడింది. స్వలింగ సంప్కరాన్ని చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే అంశంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అసహజ లైంగిక కార్యకలాపాలను న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో 25 ల క్షలమంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అంచనా.

వైమానిక దళం నుంచి మిగ్-21 తొలగింపు
భారత వైమానిక దళం నుంచి మిగ్-21 ఎఫ్.ఎల్ యుద్ధ విమానాలను తొలగించారు. వీటి చివరి విన్యాసాలను డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా కలైకుండ విమాన స్థావరంలో నిర్వహించారు. రష్యాకు చెందిన మిగ్-21 మొదటి బ్యాచ్‌ను 1963, మార్చి- ఏప్రిల్‌ల్లో వైమానిక దళంలో చేర్చారు. ఇవి భారత్ పొందిన మొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలు. ఈ విమానాలు యుద్ధ సమయాల్లో భారత్ వైమానిక దళం ఆధిపత్యాన్ని చాటాయి. 1971 భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో ఈ విమానాలు తమ శక్తిని నిరూపించాయి.

భారత్‌లో కేన్సర్‌తో ఏటా ఏడు లక్షల మంది మృతి
భారత్‌లో ప్రతి సంవత్సరం ఏడు లక్షల మంది కేన్సర్ వల్ల మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ కేన్సర్ నివేదిక పేర్కొంది. 10 లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధికి గురవుతున్నట్లు తెలిపింది. 2012లో 4.77 లక్షల మంది పురుషులలో, 5.37 లక్షల మంది మహిళలలో ఈ వ్యాధిని గుర్తించారు. 2012లో మరణించిన వారిలో 3.56 లక్షల మంది పురుషులు, 3.26 లక్షల మంది మహిళలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. భారతీయ పురుషుల్లో పెదవుల, నోటి కేన్సర్ వల్ల, మహిళల్లో రొమ్ము కేన్సర్ వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2012లో కొత్త కేసులు 14.1 మిలియన్లకు చేరుకున్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్‌‌చ ఆన్ కేన్సర్ (ఐఎఆర్‌సీ) ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ వ్యాప్తి, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది.

పృధ్వీ-2 పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృధ్వీ-2 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ 3న పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి 250 కి.మీ నుంచి 350 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 350 కిలోల అణ్వాయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2003లో సైన్యంలో చేర్చారు. దీన్ని ధనుష్ పేరుతో నౌకాదళానికి కూడా అందించారు.

అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం
అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి.
0-100 స్కేలులో 0 స్థానంలో ఉంటే అత్యంత అవినీతి దేశంగా, 100వ స్థానంలో ఉంటే అత్యంత నీతివంతమైన దేశంగా పరిగణిస్తారు. భారత్‌కు 36 పాయింట్లు దక్కాయి. డెన్మార్క్, న్యూజిలాండ్‌లకు 91 పాయింట్లు లభించాయి. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు తక్కువ అవినీతి దేశాలుగా మంచి స్థానంలో ఉన్నాయి. చైనా 80వ స్థానంలోనూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు 72వ స్థానంలోనూ, రష్యా 127, పాకిస్థాన్ 127వ స్థానంలోనూ ఉన్నాయి.

శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్‌ను వార్దా - ఔరంగాబాద్ మధ్య 1200 కె.వి లైన్ నెలకొల్పనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 400 కి.మీ. ప్రస్తుతం 400 కె.వి లైన్ పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో దీని సామర్థ్యాన్ని 1200 కె.వికి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పెంచనుంది. అల్ట్రా హై వోల్టేజి (యుహెచ్‌వీ) విధానాలను ఈ లైన్ ఏర్పాటులో వినియోగిస్తారు. ప్రస్తుతం చైనా వాణిజ్యపరంగా 1100 కె.వి లైన్‌ను ఉపయోగిస్తోంది.

ఉత్తమ వ్యాపార దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం
ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి. ఆస్తి హక్కులు, కొత్తదనం, పన్నులు, సాంకేతికత, అవినీతి, స్వేచ్ఛ (వ్యక్తిగత, వ్యాపార, ద్రవ్యపరమైన), జాప్యం, పెట్టుబడిదారు రక్షణ, స్టాక్ మార్కెట్ పనితీరు వంటి 11 అంశాలపై ఆధారపడి ర్యాంకులు కేటాయించారు.

సీఐసీగా సుష్మా సింగ్
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మా సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మ బాధ్యతలు చేపట్టారు. ఆమెను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మా 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో తయారీ జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో మూడు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం డిసెంబర్ 4న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి కోసం భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మూడు జోన్లను చిత్తూరు, ప్రకాశం, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాకు రూ.43,000 కోట్లు, చిత్తూరుకు రూ.31,000 కోట్లు, ప్రకాశంకు రూ.43000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఒక్కో జోన్‌కు 5000 హెక్టార్ల భూమిని కేటాయించారు.

తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు. 
విభజనతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు.విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది.కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటాడు.హైదరాబాద్ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది.కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజుల్లోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది.కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు.కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితికి మించకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలతోపాటు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా ఉమ్మడిగా అందరికీ ఒకేలా వర్తిస్తుంది.371డీ రెండు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంటుంది.రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తారు.పులిచింతల ప్రాజెక్టు ప్రారంభం
కృష్ణానదిపై నిర్మించిన డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7న ప్రారంభించారు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కృష్ణా డెల్టా ఆయకట్టు భూముల స్థిరీకరణకు తోడ్పడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13.88 ల క్షల ఎకరాలకు నీరందుతుంది. 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1831 కోట్లు వ్యయమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డ్యామ్ స్పిల్ వే 18.50 మీటర్లు ్ఠ 17.00 మీటర్ల 24 రేడియల్ గేట్లతో దేశంలోనే అత్యంత భారీగా నిర్మితమైంది. దీన్ని గుంటూరు జిల్లాలో అచ్చంపేట మండలంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువన, నాగార్జునసాగర్‌కు దిగువన నిర్మించారు. 2004, అక్టోబర్ 15న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం మొదలుపెట్టిన తొలి ప్రాజెక్ట్.

క్షిపణిని ప్రయోగించిన ఎల్‌సీఏ
తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) నుంచి ప్రయోగించిన క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరీక్షను గోవా తీరం నుంచి డిసెంబర్ 7న చేపట్టారు. తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్ నిర్వహించిన క్షిపణి ప్రయోగం మరో ప్రధాన ఘట్టం. దీంతో వైమానిక దళంలో తేజస్‌ను చేర్చేందుకు వీలవుతుంది. దీన్ని బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హెచ్‌ఏఎల్ కలిసి అభివృద్ధి చేశాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన ఎన్నికల ఫలితాలు..
మధ్యప్రదేశ్ (మొత్తం సీట్లు -230):ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి.
ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు -90): ఇక్కడ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిం ది. బీజేపీకి 49,కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి.
రాజస్థాన్ (మొత్తం సీట్లు -200): అధికార కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కించుకున్నారు.
ఢిల్లీ (మొత్తం సీట్లు - 70): ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ పూర్తిగా రాలేదు. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
మిజోరాం (మొత్తం సీట్లు-40): ముఖ్యమంత్రి లాలా థన్‌హవ్లా నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానంలో విజయంలో సాధించాయి.

యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్
క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నియమితులయ్యారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యునిసెఫ్ ప్రచార కార్యకర్తగా సచిన్ వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రంపై యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ డెరైక్టర్ కరీన్ హుల్‌షోప్ సమక్షంలో నవంబర్ 21న టెండ్కూలర్ సంతకం చేశారు. సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటుపై తన శాయశక్తులా ప్రచారం చేస్తానని సచిన్ అన్నారు. దక్షిణాసియాలో అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగుతున్నాయని కరీన్ హుల్‌షోప్ తెలిపారు. 

తుది తీర్పు ప్రకటించిన కృష్ణా జలాల ట్రిబ్యునల్
కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ తన తుది తీర్పును నవంబర్ 29న వెలువరించింది. ఈ తీర్పు 2050 వరకు అమలులో ఉంటుంది.
తీర్పు ప్రధానాంశాలు:
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది.మిగులు జలాలపై ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఎగువ రాష్ట్రాలకు వాటా లభించింది.ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది.2010, డిసెంబర్ 30న ఇచ్చిన మధ్యంతర తీర్పులో ఈ కేటాయింపులు వరుసగా 1001 టీఎంసీలు, 911 టీఎంసీలు, 666 టీఎంసీలు ఉన్నాయి.65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2578 టీఎంసీల నీటిని మూడు రాష్ట్రాలకు పంచింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల నీటిని పంపిణీ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ లభ్యత ఉంటే ఆ మేరకు మిగిలిన నీటిని ఎగువ రాష్ట్రాలు విడుదల చేయాలి.నీటి వాడకంపై పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేస్తారు.కర్ణాటకకు 173, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది.బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 811, కర్ణాటక 734, మహారాష్ట్రలకు 585 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది.సహజీవనం నేరం కాదన్న సుప్రీంకోర్టు
సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది. వివాహబంధాల్నే కాకుండా సహజీవనానికి గుర్తింపునివ్వాలని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను ప్రోత్సహించడం లేదని కూడా తెలిపింది. భరణం ఇప్పించాలంటూ సహజీవనం చేసిన మహిళ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment