అంతర్జాతీయం 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం
జనవరి 2014 అంతర్జాతీయం
సీఏఆర్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ‘సాంబా’
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) తాత్కాలిక అధ్యక్షురాలిగా కేథరిన్ సాంబా పాంజా జనవరి 20 న ఎన్నికయ్యారు. ఆమె 2011లో ఆ దేశ రాజధాని నగరం బాంగ్యుకు మేయర్‌గా వ్యవహరించారు.
దక్షిణకొరియా అధ్యక్షురాలు భారత పర్యటన
దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గున్ హే భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా 2014, జనవరి 16న ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణరంగం వంటి అంశాలపై ఆమె చర్చలు జరిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లతో గున్ హే సమావేశ మయ్యారు. రాజస్థాన్‌లో కొరియా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవకాశాలను ఆమె స్వాగతించారు. కొరియన్ టూరిస్ట్‌లకు వీసాలు త్వరితగతిన జారీచేసే విధానాన్ని భారత ప్రధాని మన్మోహన్ ఈ సంధర్భంగా ప్రకటించారు. ఒడిశాలో రూ.52,000 కోట్లతో దక్షిణ కొరియా నిర్మించే పోస్కో ఉక్కుకర్మాగరానికి పర్యావరణ అనుమతి లభించడం పట్ల గున్ హే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో వర్గీకృత సైనిక సమాచార రక్షణ, సైబర్‌స్పేస్ అంశాలున్నాయి.
మడగాస్కర్ అధ్యక్షుడిగా హెరీ రాజోనారి మాంపియానినా
మడగాస్కర్ దేశ అధ్యక్షునిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి హెరీ రాజోనారి మాంపియానినా ఎన్నికయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో జరిగిన ఎన్నికల అనంతరం హెరీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 2009లో రాజోయిలీనా అధికారం చేజిక్కించుకున్నాక నాలుగేళ్లకు గత డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. నాటి అధికార మార్పిడిలో రాజోయిలీనా ప్రత్యర్థి మార్క్ రాలో మనన దేశం విడిచి పారి పోయి దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందారు.
పోలియో రహిత దేశంగా భారత్
భారత్‌ను పోలియో ర హిత దేశంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ 2014, జనవరి 13న ప్రకటించారు. దేశంలో గత మూడేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. చివరిగా 2011, జనవరి 13న పశ్చిమబెంగాల్‌లో ఓ కేసు నమోదైంది. 2009లో 741గా ఉన్న కేసుల సంఖ్య 210 నాటికి 42కు, 2011లో ఒక్క కేసుకి తగ్గాయి.
తులసిలో జన్యుమార్పిడి
తులసిలో ఔషధ గుణాలను మరింతగా పెంచేందుకు అమెరికా పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆ మొక్కలో జన్యుమార్పిడికి శ్రీకారం చుట్టారు. ఈ బృందానికి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, తెలుగువాడైన చంద్రకాంత్ ఈమని నేతృత్వం వహిస్తున్నారు. ఈయన తన విద్యార్థులతో కలిసి తులసిలో యూజెనాల్ అనే పదార్థం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో యూజెనాల్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
దాతల సదస్సులో సిరియాకు 2.4 బిలియన్ డాలర్ల సాయం
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న సిరియాకు కువైట్‌లో 2014, జనవరి 17న జరిగిన దాతల సదస్సులో వివిధ దేశాలు 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి. మానవతా దృక్పథంతో 6.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలని ఐక్యరాజ్యసమితి ఈ సదస్సు నిర్వహించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో 70 దేశాలు, 24 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన కువైట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది.
న్యూస్‌మేకర్స్ నటి సుచిత్రా సేన్ మృతి
అలనాటి అందాల నటి సుచిత్రా సేన్ (82) కోల్‌కతాలో 2014, జనవరి 17న మరణించారు. ఆమె బెంగాలీ, హిందీ భాషల్లో 60 సినిమాల్లో నటించారు. అగ్ని పరీక్ష, ఆంధీ, సాత్‌పాకే బంధా, మసాఫిర్, బొంబాయ్ కాబబా, దేవదాస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దేవదాస్‌లో నటనకు ఉత్తమ జాతీయ నటి అవార్డు ఆమెకు లభించింది. 1963లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1972లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం, 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సుచిత్రాసేన్ అందుకున్నారు.
కేంద్రమంత్రి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి
కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) న్యూఢిల్లీలో 2014 జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సునంద పుష్కర్‌ను థరూర్ 2010 ఆగస్టులో వివాహమాడారు.
ఆధ్యాత్మిక గురువు బుర్హానుద్దీన్ మృతి
దావూద్ బోహ్రా ముస్లిమ్‌మతపెద్ద సేడ్నా బుర్హానుద్దీన్ (99) ముంబాయిలో 2014 జనవరి 17న మరణించారు. ఈయన ప్రపంచ వ్యాప్త దావూదీ బోహ్రా మతానికి 52వ దాయ్ అల్-మల్తక్. జోర్డాన్ ప్రభుత్వం స్టార్ ఆఫ్ జోర్డాన్, ఈజిప్ట్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది నైలీ వంటి అత్యున్నత పౌరపురస్కారాలతో ఆయనను సత్కరించాయి. అనేక సంస్థలు డాక్టరేట్ బహుకరించాయి. ఇదిలా ఉండగా ఇయన అంత్యక్రియల సందర్భంగా జనవరి 18న ముంబైలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృత్యు వాతపడ్డారు.
కవి నామ్‌దేవ్ ఢసాల్ మృతి
ప్రముఖ మరాఠి కవి, దళిత ఉద్యమనేత పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్ (64) ముంబయిలో 2014, జనవరి 16న కన్నుమూశారు. నామ్‌దేవ్ తొలి కవితా సంకలనం గోల్‌పెథా 1973లో ప్రచురితమయింది. ఆయన 1972లో దళిత్ పాంథర్స్‌అనే ర్యాడికల్ సంస్థను స్థాపించారు. దళిత్ పాంథర్స్ ముంబయిలో శివసేనను సిద్ధాంత పరంగాను, బహిరంగం గాను విభేదించింది. మహిళలతో పాటు కులాలకు అతీతంగా దోపిడికి గురైన వారందరూ దళితులేనంటూ దళిత్ పాంథర్స్ నిర్వచించింది.
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ప్రమాణం
బంగ్లాదేశ్ ప్రధానవుంత్రిగా షేక్ హసీనా (అవామీలీగ్ పార్టీ) జనవరి 12న ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి. గత వారం పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ 232 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అవామీలీగ్ మిత్ర పక్షమైన జతియా పార్టీ 33 స్థానాలను కైవసం చేసుకుంది.
భారతీయ శాస్త్రవేత్తకు అధ్యయన నిధి
అమెరికాలోని భారత సంతతి నాడీశాస్త్రవేత్త ఖలీల్జ్రాక్‌కు అక్కడి జాతీయ ఫౌండేషన్ సుమారు రూ. 5.21కోట్లు (866.90 డాలర్లు) మంజూరు చేసింది. వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగ పడేలా మెదడు చర్యా విధానంపై రజాక్ కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వీటిని కొనసాగించేందుకు ఐదేళ్లకుగాను ఈ మొత్తం నిధిని రజాక్‌కు బహుకరించారు.
కార్మికుల రక్షణపై భారత్, సౌదీ ఒప్పందం
సౌదీఅరేబియాలో పనిచేసే భారత కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, సౌదీ అరేబియాలు జనవరి 2న న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా కార్మికమంత్రి మొహమ్మద్ ఫఖీ, భారత్ తరపున ప్రవాస భారతీయశాఖ మంత్రి వాయిలర్ రవి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యజమాని, గృహ కార్మికుడు ఇరువురి హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. ఇరువురి మధ్య ఒప్పందం సంబంధాలను క్రమబద్ధీకరిస్తుంది. చట్టాలను ఉల్లంఘించే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు తోడ్పడుతుంది.
న్యూఢిల్లీవేదికగా పెట్రోటెక్-2014
2014 అంతర్జాతీయ పెట్రోలియం సమావేశాలకు న్యూఢిల్లీ వేదిక కానుంది. ఈ సమావేశాలు జనవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ సదస్సును పెట్రోలియం, సహజవనరుల, చమురు శుద్ధి మంత్రిత్వశాఖ, పెట్రోటెక్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030 విజన్ పేరుతో ఈ పెట్రోటెక్ 2014 జరగనుంది.
యూరోజోన్‌లోకి లాత్వియా
జనవరి 1న లాత్వియా అధికారికంగా యూరో ను తన దేశ ఆధికారిక కరెన్సీగా స్వీకరించింది. ఉత్తర యూరప్ దేశమైన లాత్వియా జనాభా 20,70,370.
AIMS DARE TO SUCCESS
ఫిబ్రవరి 2014 అంతర్జాతీయం
715 కొత్త గ్రహాలను కనుగొన్న నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 715 కొత్త గ్రహాలను కనుగొన్నట్లు 2014 ఫిబ్రవరి 26న తెలిపింది. ఇంతపెద్ద మొత్తంలో కొత్త గ్రహాలను కనుగొనడం ఇదే తొలిసారి. కెప్లెర్ టెలిస్కోప్ ద్వారా వీటిని నాసా కనుగొంది. వీటిలో 95 శాతం నెఫ్ట్యూన్ కంటే చిన్నవిగా ఉన్నాయి. భూమి కంటే నెప్ట్యూన్ నాలుగురెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త గ్రహాలతో కలిపి సౌర కుటుంబం వెలుపల కచ్చితంగా గుర్తించిన గ్రహాల సంఖ్య దాదాపు 1700కు చేరింది.
భారత పర్యటనలో బహ్రెయిన్ రాజు
బహ్రెయిన్ రాజు హమద్‌బిన్ ఇసా అల్ ఖలీఫా భారత పర్యటనలో ఫిబ్రవరి 20న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు మూడు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల నాయకులు సమీక్షించారు. భారత కంపెనీలు తమ దేశం లో పెట్టుబడులు పెట్టాలని బహ్రెయిన్ కోరింది.
ఇటలీ ప్రధానిగా మటెనో రెంజీ
ఇటలీ ప్రధానమంత్రిగా మటెనోరెంజీ ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 39 ఏళ్ల రెంజీ ఇటలీకి అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెంజీ గతంలో ఫ్లోరెన్‌స గవర్నర్‌గా పనిచేశారు.
నేపాల్ ప్రధామంత్రిగా సుశీల్ కొయిరాలా
నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా(75) ఆ దేశ ప్రధాన మంత్రిగా 2014 ఫిబ్రవరి 10న ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజార్టీ లభించింది. సీపీఎన్-యూఎంఎల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక సుశీల్ కొయిరాలా ఆరో ప్రధానమంత్రి.
పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ స్థానం
పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో అత్యంత దయనీయంగా ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. పారిస్ కు చెందిన రిపోర్టర్‌స విత్ ఔట్ బోర్డర్‌స 2014 ఫిబ్రవరి 12న విడుదల చేసిన నివేదికలో భారత్‌కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో పాకిస్తాన్ 158, చైనా 175, నేపాల్ 120, అఫ్గానిస్తాన్ 128 స్థానాల్లో ఉన్నాయి. ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా అగ్రరాజ్యం అమెరికా 46 స్థానంలో, బ్రిటన్ 33 స్థానంలో నిలిచాయి. 2013లో భారత్‌లో ఎనిమిది మంది జర్నలిస్టులు, ఒక మీడియా వర్కర్ మరణించినట్లు ఆ నివేదిక పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల
‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ల(46) 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యా రు. ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ స్థానంలో నాదెళ్ల బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బిల్‌గేట్స్ స్థానంలో జాన్ థాంప్సన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
మలాలాకు బాలల నోబెల్ పురస్కారం
పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్(16) ప్రపంచ బాలల పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమెతో పాటు అమెరికాకు చెందిన జాన్‌ఉడ్, నేపాల్‌కు చెందిన రాణామగర్ కూడా 2014 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. స్వీడన్‌కు చెందిన సంస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తుంది. జాన్‌ఉడ్, రాణామగర్ కూడా పిల్లల విద్య, హక్కుల కోసం పాటుపడుతున్నారు.
తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు
మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 2014 ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన జనరల్స్‌కు పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించారు.
భారత్‌లోనే నిరక్షరాస్యత: ఐరాస
భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. 28.7 కోట్ల మందికి అక్షరం పట్ల అవగాహన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని పేర్కొంది. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది భారతీయులే ఉన్నారని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ -2013-14’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం
అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితా (గ్లోబల్ గ్రీన్ లిస్)లో భారత్‌కు 155వ స్థానం దక్కింది. ‘2014 పర్యావరణ పనితీరు సూచి’లో 178 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఈ సూచిలో 31.23 పాయింట్లతో భారత్ 155 వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానం, తరువాత స్థానాల్లో లగ్జమ్‌బర్గ్, ఆస్ట్రేలియా, సింగపూర్, చెక్ రిపబ్లిక్‌లు ఉన్నాయి. ఈ సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తో కలిసి యేల్,కొలంబియా విశ్వవిద్యాలయాలు రూపొందించాయి.
ఫేస్‌బుక్‌కు పది వసంతాలు
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌కు 2014, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జుకర్‌బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ఫేస్‌బుక్‌గా రూపుదిద్దుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది.
AIMS DARE TO SUCCESS
మార్చి 2014 అంతర్జాతీయం
జి-8 నుంచి రష్యా సస్పెన్షన్
ఉక్రెయిన్ నుంచి రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం పొందిన క్రిమియాను రష్యా తన సమాఖ్యలోకి చేర్చుకోవడంపై అగ్రరాజ్యాలు మండిపడ్డాయి. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక దేశాల కూటమైన జి-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు కూటమిలోని మిగిలిన 7 దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ప్రకటించాయి. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మార్చి 25న జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. అలాగే రష్యాలోని సోచిలో జూన్‌లో జరగనున్న జి-8 సదస్సును రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ సదస్సును జి-7 పేరుతో బ్రసెల్స్‌లో నిర్వహిస్తామని ప్రకటించాయి. క్రిమియా విషయంలో రష్యా తన వైఖరి మార్చుకునే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
2012లో వాయు కాలుష్యం వల్ల 70 లక్షలమంది మృతి
వాయు కాలుష్యం వల్ల 2012లో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) తాజా అధ్యయనంలో అంచనావేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర పర్యావరణ సంబంధ అనారోగ్య కారకంగా ఉందని డబ్ల్యు. హెచ్.ఒ తెలిపింది. ఈ మరణాల్లో 88 శాతం తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో సంభవిస్తున్నాయని నివేదికలో వివరించింది. వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 80 శాతం గుండె సంబంధమైనవి కాగా, 11 శాతం ఊపిరితిత్తులు, ఆరు శాతం క్యాన్సర్ వల్ల జరుగుతున్నాయని పేర్కొంది.
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘హాంగ్‌కాంగర్‘ ,‘ హాంగ్ కాంగీస్‘ పదాలు
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో కొత్తగా హాంగ్‌కాంగర్, హాంగ్ కాంగీస్ అనే కొత్త పదాలను చేర్చారు. వీటితో పాటు మరో 600 కొత్త పదాలను మార్చి నెలలో చేర్చారు. స్థానికంగా వాడే ఈ పదాలను హాంగ్‌కాంగ్‌లోని ఒక వర్గం గుర్తించింది. హాంగ్‌కాంగర్ అంటే స్థానికుడు లేదా హాంగ్‌కాంగ్ నివాసి. హాంగ్‌కాంగీస్ అంటే హాంగ్‌కాంగ్ నగరం లేదా అక్కడి నివాసితులకు సంబంధించి దేనినైనా వివరించేందుకు ఉపయోగించే పదంగా డిక్షనరీ నిర్వచించింది. ఒకనాటి బ్రిటీష్ వలస ప్రాంతమైన హాంగ్‌కాంగ్‌ను 17 ఏళ్ల కిందట చైనా పొందింది. అప్పటినుంచి ప్రధాన భూభాగ ప్రజల వల్ల స్థానికంగా ధరలు పెరగడం, పిల్లలకు స్థానికత కొరకు ఆ ప్రాంత గర్భిణీ స్త్రీలు నగరానికి వచ్చి ప్రసవించడం, స్థానిక రాజకీయాల్లో బీజింగ్ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల హాంగ్‌కాంగ్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
హేగ్‌లో మూడో అణుభద్రత సదస్సు
మూడో అణుభద్రత సదస్సు (న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్) నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మార్చి 24-25 తేదీల్లో జరిగింది. 58 దేశాలకు చెందిన నాయకులు ఇందులో పాల్గొన్నారు. అణు భద్రతను పటిష్ఠం చేయడం, అణు ఉగ్రవాద ముప్పును తగ్గించడం, 2010 వాషింగ్టన్ సదస్సు తర్వాత సాధించిన పురోగతిపై ప్రధానంగా చర్చించారు. మొదటి అణు భద్రత సదస్సు (2010) వాషింగ్టన్‌లో, రెండో సదస్సు (2012) సియోల్‌లో జరిగాయి. నాలుగో సదస్సు 2016లో అమెరికాలో జరగనుంది.
నాటో సెక్రటరీ జనరల్‌గా స్టోలెన్‌బర్గ్
నార్వే మాజీ ప్రధాన మంత్రి జెన్స్ స్టోలెన్‌బర్గ్ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్‌గా మార్చి 27న ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నార్వే లేబర్‌పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడున్న నాటో అధ్యక్షుడు అండర్స్ ఫాగ్ రాస్‌ముస్సేన్ స్థానంలో అక్టోబర్ 1 నుంచి స్టోలెన్‌బర్గ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నాటో రక్షణ కూటమిలో నార్త్ అమెరికా, ఐరోపాలకు చెందిన 28 దేశాలు ఉన్నాయి.
రష్యాలో విలీనమైన క్రిమియా
రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్‌నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు. క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడంతో జీ-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ రోగులకు వైద్యం
ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా టీబీ వ్యాధి సోకే మూడు మిలియన్లలో మూడింట ఒకవంతు రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్ ఓ) మార్చి 20న విడుదల చేసిన నివేదిక తెలిపింది. టీబీ వ్యాధి మరణాలను సున్నా స్థాయికు తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందని మిలియన్ మందిని గుర్తించి, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా దేశాలను కోరింది. ప్రపంచంలో ప్రతీ సంవత్సరం తొమ్మిది మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ఇందులో మిలియన్ మందికి వ్యాధి తీవ్రంగా ఉంటోంది. తద్వారా వ్యాధి ఇతరులకు విస్తరిస్తుంది. పౌష్టికాహార లోపం, పేదరికం, పర్యావరణం, అధిక స్థాయిలో ప్రజలను తరలించడం వంటి పరిస్థితులు టీబీకి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు.
ఓకే పదానికి 175 ఏళ్లు
ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (ైఓ)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది.
మాల్దీవుల ఎన్నికల్లో పాలక సంకీర్ణం విజయం
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు (పీపీఎం) తన సంకీర్ణ భాగస్వామ్య పార్ట్టీల కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి పార్లమెంట్‌లోని మొత్తం 85 స్థానాలకు గాను 54 స్థానాల్లో గెలుపొందింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఈజిప్ట్‌లో 529 మందికి ఉరిశిక్ష
ఈజిప్ట్‌లో ఒకేసారి 529 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఆ దేశంలోని మనియా కోర్టు తీర్పునిచ్చింది. వీరంతా ఆ దేశ పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులని కోర్టు ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్‌కు చెందిన వీరంతా ఓ పోలీసు అధికారి హత్యకేసు, ప్రజలపై దాడుల కేసులో దోషులుగా నిర్ధారిస్తూ ఈ శిక్షను విధించింది. ఆధునిక ఈజిప్ట్ చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి.
సముద్రంలో కూలిన మలేషియా విమానం
తప్పిపోయిన తమ దేశ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ మార్చి 24న ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి లభించిన సమాచారం ఆధారంగా విమానం సముద్రంలో కూలి మునిగిపోయిందన్న నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 8న మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎం.హెచ్.-370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఇందులో 239 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులున్నారు.
స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ మృతి
స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ (81) మాడ్రిడ్‌లో మార్చి 23న మరణించారు. 1975లో జనరల్ ఫ్రాన్సిస్‌కో ఫ్రాంకో మరణించిన తర్వాత సూరెజ్ స్పెయిన్ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. స్పెయిన్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకున్న కాలంలో భాగం పంచుకున్న వారిలో మరణించిన చివరి వ్యక్తి సూరెజ్. నియంతృత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావడంలో సూరెజ్ నాయకత్వం వహించారు. 1976లో సూరెజ్‌ను ఆదేశ రాజు ప్రధానిగా నియమించారు.
దేవయానిపై అభియోగాల కొట్టివేత
భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ తీర్పు ఇచ్చారు. దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్‌కు 73వ స్థానం
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి.
స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా
ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది. ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు.
ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్
ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు.
ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్
ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది.
వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు
వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్‌నెట్‌లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్‌నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్‌లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
నేప్యిదాలో మూడో బిమ్స్‌టెక్ సదస్సు
మయన్మార్ రాజధాని నేప్యిదాలో మూడో బిమ్స్‌టెక్ సదస్సు మార్చి 4న ముగిసింది. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాటం జరపాలని ఏడు దేశాల బిమ్స్‌టెక్ కూటమి నేతలు అంగీకరించారు. వాణిజ్యం, విద్యుత్తు, పర్యావరణ రంగాల్లో సహకారానికి, దేశాల మధ్య అనుసంధానానికి కూడా నేతలు నిర్ణయించారు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్- బీఐఎంఎస్‌టీఈసీ(బిమ్స్‌టెక్) సదస్సు అనంతరం డిక్లరేషన్ విడుదల చేశారు. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో ఢాకాలో బిమ్స్‌టెక్‌కు శాశ్వత సచివాలయం ఏర్పాటు, భారత్‌లో సెంటర్ ఫర్ వెదర్ అండ్ కై ్లమేట్ ఏర్పాటు, కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పాటు ఉన్నాయి. బిమ్స్‌టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందల నియమితులయ్యారు. బిమ్స్‌టెక్‌లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి.
AIMS DARE TO SUCCESS
ఏప్రిల్ 2014 అంతర్జాతీయం
హతాఫ్ -3 క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్
అణుసామర్థ్యం ఉన్న క్షిపణి హతాఫ్-3ని పాకిస్థాన్ ఏప్రిల్ 22న విజయవంతంగా ప్రయోగించింది. 200 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ శిక్షణలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించింది. భారత్‌లోని పలు ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.
కొత్త ఖనిజాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
పశ్చిమ ఆస్ట్రేలియాలో కొత్త ఖనిజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు అడిలైడ్‌కు చెందిన మినరలాజికల్ మ్యాగజీన్ ఏప్రిల్ 21న తెలిపింది. నిర్మాణం, కూర్పులో ప్రత్యేకత కలిగిన ఆ ఖనిజానికి పుట్నిసైట్ అని పేరుపెట్టారు. ఈ పుట్నిసైట్‌లో స్టోంటియం, కాల్షియం, క్రోమియం, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 400 ఖనిజ రకాలను గుర్తించారు.
బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా సిద్దార్థ్
హిందీ చిత్రం సిద్దార్థ్ బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి ఇండియన్ కెనడియన్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. తప్పిపోయిన కొడుకు కోసం తండ్రి వెతకడం అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 88 దేశాల నుంచి వచ్చిన 837 చిత్రాలతో పోటీ పడిన సిద్దార్థ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి 20 ఏళ్లు
దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 27న ఫ్రీడమ్ డే ని జరుపుకున్నారు. మండేలా లేకుండా తొలిసారి ఫ్రీడమ్ డే జరిగింది. జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు మండేలా 95 ఏళ్ల వయసులో 2013 డిసెంబర్‌లో మరణించారు. 20 ఏళ్ల క్రితం దేశంలో అన్ని జాతులు తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) అధికారంలోకి వచ్చింది. నెల్సన్ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు.
ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు ఒప్పందం
ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్‌లు ఏప్రిల్ 17న ఒక అంగీకారానికి వచ్చాయి. జెనీవాలో సమావేశమైన ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్ సంక్షోభాన్ని రాజ్యాంగ సంస్కరణల ద్వారా పరిష్కరించే ప్రణాళికకు అంగీకరించారు. ఆ ప్రణాళిక ప్రకారం రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలకు అధిక అధికారాలను కల్పిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న దళాల నిరాయుధీకరణ, ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భవనాలను ఖాళీ చేయించడం జరుగుతుంది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి తప్ప మిగిలిన నిరసనకారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు. రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ను, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్ కోరాయి.
దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో 300 మంది గల్లంతు
దక్షిణ కొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోవడంతో 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. 6,825 టన్నుల బరువు, 146 మీటర్ల పొడవైన ఎంవీసీవోల్ అనే ఈ ఓడ దక్షిణ కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్ నుంచి పర్యాటక ప్రాంతమైన జెజు దీవి మధ్య ప్రయాణిస్తుంది. ఇందుకు 14 గంటల సమయం పడుతుంది. మరో మూడు గంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.
నాలుగోసారి అల్జీరియా అధ్యక్షుడిగా ఎన్నికైన బౌటెఫ్లికా
అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ) నాలుగోసారి ఎన్నికయ్యారు. ఏప్రిల్ 18న ప్రకటించిన ఫలితాల్లో 81.53 శాతం ఓట్లను ఆయన సాధించాడు. ప్రత్యర్థి అలీ బెన్‌ఫ్లిస్‌కు 12.18 శాతం ఓట్లు దక్కాయి. మిలటరీ, ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు మధ్య చెలరేగిన అంతర్యుద్ధం కాలంలో (1999) బౌటెఫ్లికా మొదటి సారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
స్వాతంత్య్రం ప్రకటించుకున్న తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్
తూర్పు ఉక్రెయిన్ నగరం డొనెస్క్‌లో రష్యా అనుకూల కార్యకర్తలు ఏప్రిల్ 7న ఉక్రెయిన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. డొనెస్క్‌లోని ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ డొనెస్క్‌ను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ నుంచి విడిపోతున్న్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజాభిప్రాయం సేకరించి మే 11 లోగా రష్యాలో చేరాలని పీపుల్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
రష్యాకు సహకారం నిలిపేసిన నాటో దేశాలు
క్రిమియా సంక్షోభం నేపథ్యంలో రష్యాకు అన్ని రకాల పౌర సహకారాన్ని రద్దు చేసేందుకు నాటో విదేశాంగ మంత్రులు ఏప్రిల్ 1న నిర్ణయించారు. తాజా నిర్ణయం వల్ల రష్యాతో ఎటువంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్రసేల్స్‌లో సమావేశమైన నాటో బ్లాక్‌కు చెందిన 28 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు. క్రిమియాను రష్యా విలీనం చేయడం చట్ట విరుద్ధమని తీవ్రంగా తప్పుబట్టారు.
చిలీ తీరంలో భూకంపం, సునామీ
చిలీకి ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏప్రిల్1న భారీ భూకంపం, సునామీ సంభవించాయి. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఆరుగురు మరణించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2గా నమోదైంది. లక్షలాది మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2010లో చిలీలో భారీ భూకంపం, సునామీ సంభవించడంతో 500 మంది మరణించారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.
వాతావరణ మార్పులతో ఆహారభద్రతకు ముప్పు వాతావరణ మార్పుల వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పునకు చెందిన అంతర ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) హెచ్చరించింది. మార్చి 30న విడుదల చేసిన ‘వాతావరణ మార్పు-2014 ప్రభావాలు’ అనే కొత్త నివేదికలో అన్ని ఖండాలు, సముద్రాలు వాతావరణ ప్రభావానికి గురవుతున్నాయని పేర్కొంది. వాతావరణం దెబ్బతినడం వల్ల వరదలు, వేడివల్ల మరణాలు, కరువులు, ఆహార కొరత సంభవిస్తాయని నివేదిక తెలిపింది.
మాల్టా అధ్యక్షురాలిగా కొలీరో ప్రెకా
మాల్టా దేశానికి తొమ్మిదో అధ్యక్షురాలిగా మేరీ లూసీ కొలీరో ప్రెకా ఏప్రిల్ 4న ప్రమాణ స్వీకారం చేశా రు. ప్రధానమంత్రి ఆమె పేరును సూచించగా, పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 55 ఏళ్ల కొలీరో ప్రెకా మాల్టా దేశానికి రెండో మహిళా అధ్యక్షురాలు. ఆమె 2013 మార్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వంలో సోషల్ పాలసీ మంత్రిగా పనిచేశారు.
AIMS DARE TO SUCCESS
మే 2014 అంతర్జాతీయం
ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో సిసీ ఘన విజయం
ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికలలో మాజీ సైన్యాధిపతి అబ్దుల్ ఫతా అల్ సిసీ (59) ఘన విజయం సాధించారు. మే 29న ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో ఆయనకు 96 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి హమ్ దీన్ నబ్బాహీకి 4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈజిప్ట్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు మహమ్మద్ మోర్సిపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో 2013 జులైలో మోర్సీని సైన్యం పదవీచ్యుతిడ్ని చేసింది.
మూడు దేశాల యూరేషియన్ యూనియన్
మూడు దేశాల ఆర్థిక కూటమి ఏర్పాటుకు ఉద్దేశించిన యూరేషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఒప్పందంపై రష్యా, బెలారస్, కజకిస్థాన్ దేశాల అధ్యక్షులు మే 29న మాస్కోలో సంతకాలు చేశారు. 2015 జనవరి 1 నుంచి ఈ కూటమి అమల్లోకి వచ్చిన తరువాత 170 మిలియన్ల జనాభాతో కూడిన మార్కెట్ వ్యవస్థ ఏర్పడుతుంది. వార్షిక జీడీపీ 2.7 ట్రిలియన్లుగా ఉంటుంది. ప్రపంచ ఇంధన వనరుల్లో నాలుగో వంతు ఇక్కడే ఉంటాయి. ఈ కూటమిలో ఆర్మేనియా జూన్‌లో చేరనుండగా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు సభ్యత్వానికి సిద్ధంగా ఉన్నాయి.
థాయ్‌లాండ్‌లో సైనిక పాలన
థాయ్‌లాండ్ మరోసారి సైనికపాలనలోకి వెళ్లింది. సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రయూత్ చాన్‌వోచా దేశంలో మార్షల్ లా (సైనిక చట్టం) విధిస్తున్నట్లు మే 22న ప్రకటించారు. మే 23న ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను నిర్బంధంలోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను నివారించడానికి ..థాయ్ సైన్యం, రాయల్ ఎయిర్‌ఫోర్స్ పోలీసులతో కూడిన జాతీయ శాంతి పరిరక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైన్యాధ్యక్షుడు చాన్‌వోచా వివరించారు. ఇప్పటిదాకా థాయ్‌లాండ్‌లో 18 సార్లు సైన్యం తిరుగుబాటు చేయగా వాటిలో 11 విజయవంతమయ్యాయి.
రష్యా-చైనాల భారీ గ్యాస్ ఒప్పందం
ఇంధన కొరతతో అల్లాడుతున్న చైనా 40 వేల కోట్ల డాలర్ల గ్యాస్ ఒప్పందాన్ని రష్యాతో కుదుర్చుకుంది. బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న చైనా ఈ భారీ ఒప్పందానికి సిద్ధమైంది. 30 ఏళ్ల ఒప్పందం విషయమై 2004లో ప్రారంభమైన ఈ చర్చల్లో భాగంగా రష్యా 2018 నుంచి చైనాకు ఏటా 3,800 కోట్ల క్యూబిక్ మీటర్ల సహజవాయువును సరఫరా చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.
దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా జాకబ్‌జుమా
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జాకబ్‌జుమాను ఆ దేశ పార్లమెంట్ మే 21న ఏకగ్రీవంగా ఎన్నుకొంది. జాకబ్‌జుమా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవీ కాలం ఐదేళ్లు. నెల్సన్ మండేలా నెలకొల్పిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి జుమా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
షాంఘైలో సీఐసీఏ సదస్సు
ఆసియా దేశాల్లో పరస్పర సంప్రదింపులు, విశ్వాస నిర్మాణ చర్యలకు ఉద్దేశించిన కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇన్ ఆసియా (సీఐసీఏ) సదస్సు చైనాలోని షాంఘైలో మే 21న జరిగింది. భద్రత సహకారానికి కొత్త ఆసియా వ్యవస్థను రూపొందించాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సదస్సులో పిలుపునిచ్చారు. ఇది ప్రాంతీయ ప్రాతిపదికన ఉండాలని, ఇందులో అమెరికా మినహా రష్యా, ఇరాన్‌లతో కలిసి ఉండాలన్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు ఆసియా దేశాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సీఐసీఏ సదస్సు కజకిస్థాన్ ప్రోద్బలంతో 1992లో ఏర్పాటైంది. 24 దేశాల ఈ వేదికలో ఇజ్రాయెల్, మంగోలియా, ఉజ్బెకిస్థాన్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, టర్కీ తదితర దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
దక్షిణ కొరియా కొత్త ప్రధానిగా హాన్ దై హీ
దక్షిణ కొరియా కొత్త ప్రధానిగా హాన్ దై హీ (50)ను దేశ అధ్యక్షురాలు పార్క్ గ్యున్ హే మే 22న నియమించారు. ఏప్రిల్ 16న జరిగిన నౌక ప్రమాదంలో 300 మంది మరణించడంతో ప్రధానిగా ఉన్న చుంగ్ హాంగ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి హాన్ దై హీకు బాధ్యతలు అప్పగించారు.
ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు
శ్రీలంక తమిళ తీవ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)పై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మే 14న మరో ఐదేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత ప్రధాన కుట్రదారైన ఎల్‌టీటీఈని ప్రభుత్వం నిషేధించింది. అంతేకాక 1967నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రభుత్వం దీన్ని చట్టవ్యతిరేక సంస్థగా గుర్తించింది. శ్రీలంక తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో తమిళులకు స్వతంత్ర తమిళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 1976లో ఏర్పడిన ఎల్ టీటీఈ ఉగ్రవాద సంస్థ 2009లో శ్రీలంక సైన్యం చేతిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
తీవ్రవాదసంస్థ బోకోహరమ్‌ను ఎదుర్కొనేందుకు ఆఫ్రికాదేశాల వ్యూహం
నైజీరియాకు చెందిన 200 మంది బాలికలను అపహరించిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ బోకోహరమ్‌ను అణచివేసేందుకు పారిస్‌లో ఆఫ్రికాదేశాలు మే 17న సమావేశమయ్యాయి. ఫ్రాన్స్ నిర్వహించిన ఈ సదస్సులో నైజీరియా, కెమరూన్, నైగర్, చాద్, బెనిన్ దేశాల నాయకులు పాల్గొన్నారు.
దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ఏఎన్‌సీ విజయం
దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) విజయం సాధించింది. మే 9న ప్రకటించిన ఫలితాల్లో 62 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ కూటమికి 22.2 శాతం ఓట్లు దక్కాయి. జులియస్ మలెమాకు చెందిన ఫ్రీడమ్‌ఫైటర్స్ పార్టీకి 6.25 శాతం ఓట్లు వచ్చాయి. జాతివివక్ష ప్రభుత్వం అంతమైన తరువాత ఐదోసారి జరిగిన ఎన్నికల్లో ఏఎన్‌సీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు జాకోబ్ జుమానే రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.
కోస్టారికా అధ్యక్షుడిగా లూయిస్ గులెర్మో సోలిస్
కోస్టారికా కొత్త అధ్యక్షుడిగా లూయిస్ గులెర్మోసోలిస్ మే 8న ప్రమాణ స్వీకారం చేశారు. 56 ఏళ్ల చరిత్రకారుడైన సోలిస్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాననీ, పౌర సమాజంలోని అన్ని వర్గాలతో చర్చలు జరుపుతానని, రాజకీయ, సామాజిక సంస్కరణలు చేపడతానని వాగ్దానం చేశారు.
ఉక్రెయిన్‌కు నాలుగు అంశాల శాంతి ప్రణాళిక
ఉక్రెయిన్, రష్యా భాష మాట్లాడే తిరుగుబాటుదారుల మధ్య నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు రష్యా, ఐరోపాలు శాంతి ప్రణాళికకు మే 7న మాస్కోలో జరిగిన సమావేశంలో అంగీకరించాయి. ఈ ప్రణాళికలో కాల్పుల విరమణ, ఉద్రిక్తతలు తగ్గించడం, చర్చలు ప్రారంభించడం, ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించడం ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, స్విస్ అధ్యక్షుడు డిదీర్ బుర్కాల్డర్ పాల్కొని మే 11న దోదోస్క్ లుహాన్స్‌ల స్వాతంత్రం కోసం నిర్వహించే రెఫరెండంను వాయిదావేయాలని కూడా రష్యా అనుకూల నిరసనకారులను కోరారు.
థాయ్ ప్రధాని తొలగింపు
థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా (46)ను, ఆమె కేబినెట్‌లోని 9మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు మే 7న పదవుల నుంచి తొలగించింది. షినవత్రా తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు 2011లో జాతీయ భద్రత మండలి ప్రధాన కార్యదర్శి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ప్రస్తుతం ఉపప్రధానిగా ఉన్న బూన్సంగ్ పైనన్‌ను నియమించింది.
భారత నగరాల్లో అత్యధిక కాలుష్యం
పట్టణ వాయు నాణ్యత గణాంకాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ మే7న వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణ, వాటికి చేపట్టాల్సిన చర్యలు సంస్థ నిర్దేశించిన సురక్షిత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది. డబ్ల్యు.హెచ్.ఓ. 91 దేశాల్లో 1600 నగరాలకు చెందిన వాయు నాణ్యత గణాంకాలను తెలియజేసింది. ఈ లెక్కల ప్రకారం భారత్‌లోని 120కి పైగా నగరాలు అత్యధిక కాలుష్యం స్థాయిలు గల నగరాల జాబితాలో ఉన్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, వారణాసి, ఆగ్రా తదితర నగరాలు ఉన్నారతుు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం, ప్రై వేటు రవాణా మోటారు వాహనాలు, భవనాల్లో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించకపోవడం, వంటకు, వేడి చేసేందుకు బయోమాస్‌ను ఉపయోగించడం వంటివి వాయు కాలుష్యం పెరగడానికి కారణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
లిబియా కొత్త ప్రధానిగా అహమ్మద్ మితీగ్
లిబియా కొత్త ప్రధానమంత్రిగా అహమ్మద్ మితీగ్‌ను లిబియా పార్లమెంట్ మే 4న ఎన్నుకుంది. 42 ఏళ్ల మితీగ్ లిబియాకు అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని. 2011లో గడాఫీ ప్రభుత్వం కూలిన తర్వాత లిబియాకు మితీగ్ ఐదో ప్రధానమంత్రి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులపై అమెరికా ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఏడుగురు అధికారులు, 17 సంస్థలపై అమెరికా ఏప్రిల్ 28న కొత్త ఆంక్షలు విధించింది. సైనిక అవసరాలకు ఉపయోగించే అత్యాధునిక ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. తూర్పు ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసలో రష్యా జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ కూడా రష్యా, ఉక్రెయిన్ అధికారులపై ఆంక్షలు విధించేందుకు అంగీకరించింది. వీసాలపై నిషేధం, ఆస్తులను స్థంభింపజేయడంలాంటివి ఈ ఆంక్షల్లో ఉన్నాయి.
AIMS DARE TO SUCCESS
జూన్ 2014 అంతర్జాతీయం
బీజింగ్‌లో పంచశీల 60వ వార్షికోత్సవాలు
చైనా రాజధాని బీజింగ్‌లో పంచశీల 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతోపాటు చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, మయన్మార్ అధ్యక్షుడు యూ థీన్ సీన్ హాజరయ్యారు. భారత్, చైనాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకుంటూ పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఈ అంశం పంచశీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్సారీ ఈ సంద్భరంగా అన్నారు.
వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా వ్రోక్లా నగరం
పోలెండ్‌లోని వ్రోక్లా నగరాన్ని 2016 సంవత్సరానికి గాను వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా యునెస్కో జూన్ 26న ప్రకటించింది. ప్రచురణ, పుస్తక అమ్మకాల పరిశ్రమను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించినందుకు ఈ గుర్తింపు లభించింది. వ్రోక్లా నగరంలోని ప్రజానాయకులు ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించినందుకు మంచి కార్యక్రమాన్ని అమలు చేసినట్లు యునెస్కో పేర్కొంది. పుస్తకాలు, పుస్తక పఠనాన్ని వివిధ కార్యక్రమాల్లో ప్రోత్సహించిన నగరాన్ని వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా 2001 నుంచి ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రకటిస్తోంది. ఈ గౌరవం 2003లో న్యూఢిల్లీకి దక్కింది. కాగా 2014లో నైజీరియాకు చెందిన పోర్ట్‌హార్ కోర్ట్, 2015లో దక్షిణ కొరియాలోని ఇంజియోన్‌లు లుక్ క్యాపిటల్‌గా ఎంపికయ్యాయి.
ప్రపంచ పర్యావరణ నేరాల విలువ 213 బిలియన్ డాలర్లు
ప్రపంచ పర్యావరణ నేరాల విలువ 213 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌పోల్ జూన్ 24న విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. ఈ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా భద్రత, సుస్థిర అభివృద్ధిని దెబ్బతీసే నేరస్థులు, ఉగ్రవాదులకు తోడ్పడుతుందని వివరించింది. కెన్యా రాజధాని నైరోబీలోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కార్యాలయం (యుఎన్‌ఈపీ)లో వారం రోజులపాటు జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. వన్యప్రాణుల వేటను అరికట్టడం, హరిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం అనే అంశాల లక్ష్యంగా ఈసదస్సు జరిగింది.
ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌గా జీద్ అల్ -హుస్సేన్
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ నియామకానికి సమితి సర్వ ప్రతినిధిసభ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈయన ఈ పదవిని చేపట్టిన తొలి ముస్లిం, అరబ్. హుస్సేన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ రాయబారిగా ఉన్నారు. సెప్టెంబర్ 1న హుస్సేన్ మానవహక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిల్లే ఈ పదవిలో కొనసాగుతున్నారు. జీద్ అల్ -హుస్సేన్‌కు శాంతి స్థాపన, అంతర్జాతీయ న్యాయ రంగాల్లో అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.
51 మిలియన్లకు చేరిన ప్రపంచ కాందిశీకులు
2013 చివరినాటికి పోరాటాలు, సంక్షోభాల వల్ల నిరాశ్రయులైన కాందిశీకులు అత్యధికంగా 51.2 మిలియన్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి కాందిశీకుల సంస్థ జూన్ 20న పేర్కొంది. ఈ సంఖ్య గతేడాది కంటే ఆరు మిలియన్లు ఎక్కువ. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వీరి సంఖ్య అత్యధిక స్థాయికి చేరింది. సిరియా సంక్షోభం వల్ల ఈ సంఖ్య పెరిగిపోయిందని నివేదికలో పేర్కొంది.
స్విస్ బ్యాంకుల్లో అక్రమసంపదగల దేశాల జాబితాలో భారత్‌కు 58 వ స్థానం
స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ 2013 సంవత్సరపు అధికారిక గణాంకాలను జూన్ 22న విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా నిల్వ ఉన్న సంపద గల దేశాల జాబితాలో భారత్ 58వ స్థానంలో ఉంది. గతేడాది భారత్ 70వ స్థానంలో ఉండేది. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ప్రపంచ సంపద 1.6 ట్రిలియన్ డాలర్లలో భారత్ వాటా కేవలం 0.15 శాతం. ఈ మొత్తం సంపద రూ. 14వేల కోట్లు. కాగా అగ్రస్థానంలో 20 శాతం వాటాతో యునెటైడ్ కింగ్‌డమ్, తరువాత స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ ఉన్నాయి.
ప్రధాని తొలి విదేశీ పర్యటన
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 15, 16 తేదీల్లో భూటాన్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను ‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో మోడీ ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో శాంతి భద్రతలు, పర్యాటకం తదితర అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధికి చేయూతలో భాగంగా భారత్ రూ.70కోట్ల వ్యయంతో నిర్మించిన భూటాన్ సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ భూటాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇరుదేశాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యంగల ఖోలాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
డబ్ల్యూఏలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
ఇంజనీరింగ్ స్టడీస్, ఇంజనీర్ల మొబిలిటీకి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం వాషింగ్టన్ అగ్రిమెంట్(డబ్ల్యూ ఏ) లో జూన్ 13న భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించింది. దీంతో భారతీయ డిగ్రీలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించడంతోపాటూ అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగాలకు భారతీయ ఇంజనీర్లు సులువుగా వెళ్లేందుకు అవకాశాలు విస్తృతమవుతాయి. 1989లో కుదిరిన ఈ ఒప్పందంపై 17 దేశాలు సంతకాలు చేశాయి. ఇంజనీరింగ్ డిగ్రీ కార్యక్రమాలకు అధికారిక గుర్తింపునిచ్చే సంస్థల మధ్య కుదిరిన ఈ అంతర్జాతీయ ఒడంబడికను వాషింగ్టన్ అకార్డ్‌గా పేర్కొంటారు. ఇందులో తాత్కాలిక సభ్యత్వం కలిగి ఉన్న భారత్ గత ఏడేళ్లుగా శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది.
ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్
ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్ రివ్లిన్‌ను ఆ దేశ పార్లమెం ట్ జూన్ 10న ఎన్నుకుంది. షిమోన్ పెరెస్ స్థానంలో రూవె న్ జూలై 24న బాధ్యతలు స్వీకరిస్తారు. రూవెన్ గతంలో స్పీకర్‌గా,కమ్యూనికేషన్ల మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు.
జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కుతెస
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 11న తన 69వ సమావేశానికి ఉగండాకు చెందిన సామ్ కంబా కుతెసను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కుతెస ఉగండా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బ్రస్సెల్స్‌లో జీ-7 సదస్సు
జీ-7 సదస్సు జూన్ 4,5 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరిగింది. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాల నాయకులతోపాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ సంక్షోభం, రష్యా ప్రతిస్పందనపై ప్రధానంగా దష్టి సారించారు. ప్రపంచ వృద్ధి, నిరుద్యోగ సమస్యసు అధిగమించడం వంటి అంశాలపై చర్చలు జరిపారు. భూతాప ప్రభావాన్ని తగ్గించేందుకు 2015లో జరిగే వాతావరణ మార్పుల ఒప్పందం పట్ల తమ నిబద్ధతను ప్రకటించాయి. జీ-7 సదస్సును తొలిసారి యూరోపియన్ యూనియన్ నిర్వహించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్రో పోరోషెంకో
ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్రో పోరోషెంకో జూన్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. పోరోషెంకోను పశ్చిమ దేశాలు సమర్థిస్తున్నాయి. ఈయన మే 25న దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సిరియా అధ్యక్ష ఎన్నికల్లో అసద్ విజయం
సిరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. జూన్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అసద్‌కు 10 మిలియన్ల (88.7శాతం) ఓట్లు దక్కాయి. దీంతో అధికార బాత్ పార్టీ మరో ఏడేళ్లు అధికారంలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 15.8 మిలియన్ల ఓటర్లకు గాను 11.6 మిలియన్ల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఐక్యరాజ్య సమితి ఐసీహెచ్ కమిటీకి భారత్ ఎన్నిక
స్పృశించరాని వారసత్వ సంపద (ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ - ఐసీహెచ్)ను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి అంతర్ ప్రభుత్వ కమిటీకి భారత్ తిరిగి ఎన్నికైంది. జూన్ 4న జరిగిన ఓటింగ్‌లో 142 దేశాల్లో భారత్‌కు 135 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఐసీహెచ్ కమిటీలో 24 మంది సభ్యులు ఉంటారు. నాలుగేళ్లపాటు సభ్యులుగా కొనసాగుతారు. ఆచారాలు, అలవాట్లు, వ్యక్తీకరణలు, జ్ఞానం, నైపుణ్యం వంటివి అంటే పాటలు, సంగీతం, పండుగలు, హస్తకళానైపుణ్యం మొదలైన వాటిని స్పృశించరాని వారసత్వ సంపదగా పేర్కొంటారు.
ఈజిప్టు అధ్యక్షునిగా అబ్దెల్ ఫత్తా
ఈజిప్టు మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్- సిసీ దేశాధ్యక్షునిగా జూన్ 8న బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షునిగా కొనసాగుతారు. అధ్యక్షపదవికి గతవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 96.6 శాతం ఓట్లు వచ్చాయి. 59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా ఈజిప్టుకు 7వ అధ్యక్షుడు. ప్రజాస్వామిక పద్ధతిలో తొలిసారి ఎన్నికైన మహమ్మద్ మోర్సీని ఆయన గత ఏడాది పదవీచ్యుతుడిని చేశారు.
పాలస్తీనా యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు
రెండు పాలస్తీనా వర్గాలైన ఫతా, హమాస్‌ల మధ్య ఏడేళ్ల విభేదాలకు స్వస్తి పలుకుతూ పాలస్తీనా యూనిటీ ప్రభుత్వం జూన్ 2న రొమల్లాలో ప్రమాణ స్వీకారం చేసింది. ప్రధానమంత్రిగా రామి హమ్‌దల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్‌లో కుదిరిన శాంతి ఒప్పందం యూనిటీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడింది. పాలస్తీనా వ్యవహారాల్లో రాజకీయ, భౌగోళిక విభజనను కొత్త యూనిటీ ప్రభుత్వం రూపుమాపుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పాలస్తీనా ఎన్నికలు 2015లో నిర్వహించేందుకు తోడ్పడుతుంది. కొత్త ప్రభుత్వం 2007 తర్వాత తొలిసారిగా గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఒకే రాజకీయ ఆధిపత్యం కిందికి తీసుకొస్తుంది. 2006లో జరిగిన పాలస్తీనా చట్టసభ ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. అప్పటి నుంచి వెస్ట్‌బ్యాంక్ అధ్యక్షుడు మొహ్మద్ అబ్బాస్, ఫతా పాలన కింద ఉంది. గాజా ప్రాంతం ఉగ్రవాద గ్రూపుగా భావిస్తున్న హమాస్ పాలనలో ఉంది.
30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గించనున్న అమెరికా
అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది. 2005 స్థాయి నుంచి 2030 నాటికి జాతీయ సరాసరిలో 30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గించాలని భావిస్తోంది. అమెరికాలో వెలువడే కార్బన్ డయాక్సైడ్‌లో 40 శాతం విద్యుత్ కేంద్రాల నుంచే వెలువడుతుంది. ఈ వాయువు వాతావరణ మార్పునకు ప్రధాన కారణం. ఈ తగ్గింపు వల్ల పిల్లల్లో 6,600 ముందస్తు మరణాలను, 150,000 ఆస్తమా జబ్బులను నివారించవచ్చని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.
AIMS DARE TO SUCCESS
జూలై 2014 అంతర్జాతీయం
భారత్ వృద్ధి 5.4 శాతం
బ్రిక్స్ దేశాల్లో భారత్ మినహా ఇతర దేశాల అభివృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తగ్గించింది. ఈ ఏడాది ఇండియా 5.4 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతం పురోగతి సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక భవితపై జూలై 25న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. బ్రిక్స్‌లో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) రష్యా 0.9శాతం (1.1 శాతం డౌన్‌గ్రేడ్), చైనా 7.4 శాతం(0.2 శాతం), బ్రెజిల్ 1.3 శాతం (0.6 శాతం), దక్షిణాఫ్రికా 1.7 శాతం (0.6 శాతం) వృద్ధి నమోదుచేస్తాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 3.4 శాతానికి చేర్చింది.
చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతం
చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం జూలై 23న మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
బాల్యవివాహాలు భారత్‌లోనే అధికం
ప్రపంచ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో మూడింట ఒక వంతు భారతదేశంలోనే జరుగుతున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. బాల్య వివాహాల సంఖ్య అత్యధికంగా ఉన్న పది దేశాల్లో భారత్, నైగర్, బంగ్లాదేశ్, చాద్, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గినియా,ఇథియోిపియా, బుర్కినాఫాసో, నేపాల్ ఉన్నాయి.
ప్రపంచంలోని 1/3 వ వంతు పేదలు భారత్‌లోనే
ప్రపంచంలో 1.2 బిలియన్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడోవంతు భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల-2014 నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా జూలై 16న న్యూఢిల్లీలో విడుదల చేశారు. రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఆదాయంతో నివసిస్తున్న వారిని అత్యంత పేదవారిగా నివేదిక పేర్కొంది. భారత్‌లో 1994లో 49.4 శాతంగా ఉన్న పేదరికం 2010 నాటికి 32.7 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లో 1.4 మిలియన్ల మంది పిల్లలు ఐదేళ్ల వయసు దాటకుండానే మరణిస్తున్నారని నివేదిక తెలిపింది.
బ్రిక్స్ ఆరో సదస్సు
భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి (బిక్స్) ఆరో సదస్సు బ్రెజిల్‌లోని ఫోర్టలెజాలో జూలై 15-16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదికను వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేరుతో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ షాంఘై (చైనా) ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ఈ బ్యాంక్‌కు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. కరెన్సీ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) ఒప్పందంపై కూడా సభ్యదేశాలు అవగాహనకు వచ్చాయి. 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయనున్న ఈ నిధి సభ్యదేశాల స్వల్పకాల లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోవడానికి తోడ్పడుతుంది. సదస్సులో భారత్ ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. 2015లో జరిగే ఏడో సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 500మంది మృతి
హమాస్ ఆధీనంలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో 500 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జూలై 8 నుంచి ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది.
బాల కార్మిక వ్యవస్థపై బొలీవియా సంచలన నిర్ణయం
బొలీవియా ప్రభుత్వం పదేళ్లు దాటిన పిల్లలను పనిలో పెట్టుకోవచ్చంటూ చట్టం తీసుకువచ్చింది. దీంతో బాలకార్మిక వ్యవస్థను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా బొలీవియా నిలిచింది. జూన్‌లో చట్టసభ కాంగ్రెస్‌లో జరిగిన సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. పనిచేసే వయసును 14 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించడం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందని, దేశంలోని పేద కుటుంబాలకు పిల్లలను పనిలో పెట్టడం తప్ప మరో అవకాశం లేనందున ఆమోదించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం పదేళ్లు దాటిన పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పని చేస్తూ పాఠశాలకు వెళ్లవచ్చు. కాంట్రాక్టు కింద పనిచేయించే వారి వయసు కనీసం 12 సంవత్సరాలు నిండాలి. అయితే పిల్లలను పనిలో చేర్పించే క్రమంలో తగు రక్షణ చర్యలు పాటించాలని, లేని పక్షంలో 30ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించింది.
నకిలీ కరెన్సీలో రూపాయికి మూడో స్థానం
స్విట్జర్లాండ్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్న నకిలీ విదేశీ కరెన్సీ నోట్లలో యూరో, అమెరికన్ డాలర్ తర్వాత భారత రూపాయి మూడో స్థానంలో ఉంది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్ పోల్) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2013లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో యూరో నోట్లు 2,394, అమెరికా డాలర్ నోట్లు 1,101 ఉన్నాయి. భారత రూపాయి నోట్లు 403. కాగా వీటిలో రూ.500 విలువైనవి 380, రూ. 1000 నోట్లు 23 ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2012లో నకిలీ కరెన్సీ జాబితాలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
మలేషియా విమానం కూల్చివేత
మలేషియా విమానం బోయింగ్-777ను ఉక్రెయిన్- రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు జూలై 17న కూల్చివేయడంతో 295 మంది మరణించారు. ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రాబోవో ప్రాంతంలో 33వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఉగ్రవాదులు క్షిపణి ప్రయోగించి కూల్చివేశారని ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది.
వారసత్వ సంపదగా దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇల్లు
బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. పెషావర్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఖవానీ బజార్ ప్రాంతంలో ఉన్న దిలీప్‌కుమార్ పూర్వీకుల ఇల్లు ప్రస్తుతం పాతబడిపోయింది. దీన్ని ఆధునీకరించి ప్రదర్శనశాల ఏర్పాటు చేసే పనిలో పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.
బ్రిటన్ పార్లమెంట్ స్క్వైర్‌లో గాంధీ విగ్రహం
బ్రిటన్ పార్లమెంట్ స్క్వైర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్టిస్తామని బ్రిటన్ విదేశాంగమంత్రి విలియమ్‌హేగ్, ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌ఛెక్కర్ జార్జి ఓస్‌బోర్న్ ప్రకటించారు. ఇప్పటివరకు నెల్సన్‌మండేలా, అబ్రహం లింకన్‌తోపాటు ప్రపంచనేతల విగ్రహాలు పార్లమెంట్ స్క్వైర్‌లో ఉన్నాయి. గాంధీ విగ్రహం 11వది.
నిఖిల్ శ్రీవాస్తవకు జార్జ్ పోల్యా ప్రైజ్
భారతీయ యువ గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన జార్జ్ పోల్యా ప్రైజ్‌ను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో గణితపరంగా కీలకమైన కడినన్- సింగర్ భావనను ఆడమ్ డబ్ల్యూ మార్కస్, డేనియల్ ఏ స్పిల్‌మాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి నిఖిల్ చేసిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.
అఫ్గాన్‌కు నూతన స్వేచ్ఛాయుత వీసా విధానం
అఫ్గానిస్థాన్ దేశస్థుల కోసం నూతన స్వేచ్ఛాయుత వీసా విధానాన్ని భారత్ జూన్ 30న ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది.
అంటార్కిటికాలో పర్వతానికి సిన్హా పేరు
అంటార్కిటికా ఖండంలోని ఓ పర్వతానికి భారత-అమెరికన్ శాస్త్రవేత్త అఖౌరి సిన్హా పేరు పెట్టారు. పరిశోధకుడిగా ఆయన అందించిన సేవలకు గుర్తుగా అంటార్కిటికాలోని మెక్ డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెట్టేందుకు అమెరికా జియోలాజికల్ సర్వే , అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా సంఘం జూన్ 30న నిర్ణయించింది. సిన్హా మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్రం, సెల్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కార్బన్ డై ఆక్సైడ్ అంచనాకు నాసా ఉపగ్రహం
వాతావరణంలో ఉండే కార్బన్‌డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు)ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ -2 గా పిలిచే ఈ ఉపగ్రహ ం వల్ల భూమి మీద ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందో తెలుసుకోవచ్చు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడిగా జీన్‌క్లౌడ్
యూరోపియన్ కమిషన్ నూతన అధ్యక్షుడిగా జీన్ క్లౌడ్ జంకర్ జూన్ 26న ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జోస్ మాన్యుఎల్ బరోసో స్థానంలో ఆయన ఈఏడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. జీన్ క్లౌడ్ 1995 -2013 వరకు లక్సెంబర్గ్ ప్రధానిగా, 2005-13 మధ్య యూరో సమాఖ్య తొలి శాశ్వత అధ్యక్షుడిగా పనిచేశారు. యూరో దేశాల సమాఖ్యలో ఒక దేశానికి సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన ఘనత క్లౌడ్‌దే.
AIMS DARE TO SUCCESS
ఆగష్టు 2014 అంతర్జాతీయం
థాయ్‌లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ - ఓచా
థాయ్‌లాండ్ సైనికాధిపతి ప్రయూ త్ చాన్-ఓచా ఆగస్టు 21న ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులున్న నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 191 మంది మద్దతు ఆయనకు లభించింది.
మొదటి పర్యావరణ హిందూ దేవాలయం
ప్రపంచంలో మొట్టమొదటి ఎకో హిందూ దేవాలయం శ్రీ స్వామి నారాయణన్ మందిర్‌ను ఇంగ్లండ్‌లోని వాయువ్య లండన్‌లో కింగ్స్‌బరీ అనే ప్రాంతం లో ఆగస్టు 19న ప్రారంభించారు. ఈ గుడి పైకప్పును సోలార్ ప్యానల్స్‌తో నిర్మించారు. వాన నీటిని పొదుపు చేసే పలు ప్రత్యేకతలతో కూడిన ఈ దేవాలయ నిర్మాణానికి 20 మిలియన్ పౌండ్లను వెచ్చించారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో 95వ స్వాతంత్య్ర దినోత్సవాలు
ఆఫ్ఘనిస్థాన్ 95వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆగస్టు 19న నిర్వహించింది. 1919లో బ్రిటీష్ ప్రభుత్వంతో కుదుర్చు కున్న ఆంగ్లో-ఆఫ్ఘాన్ ఒప్పందంతో ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
పది లక్షల మందిపై ఎబోలా ప్రభావం
ఎబోలా వైరస్ ప్రభావం పశ్చిమ ఆఫ్రికాలో పది లక్షల మందిపై పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు. త్వరలోనే ఇది మానవ సంక్షోభంగా మారే అవకాశం ఉందని చాన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రతి నగరానికి ఈ వ్యాధి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు.
పనామా కాలువ నిర్మాణానికి నూరేళ్లు
ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ 2014, ఆగస్టు 15 నాటికి వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది. సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1914, ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్- పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది.
2020 నాటికి బీజింగ్‌లో బొగ్గు వినియోగం నిషేధం
చైనా రాజధాని బీజింగ్‌లో 2020 నాటికి బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని బీజింగ్ మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ బ్యూరో ఆగస్ట్ 4న నిర్ణయించింది. బీజింగ్‌తోపాటు మరో ఐదు జిల్లాల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించే ప్రణాళికకు రూపకల్పన చేసింది. చైనాలోని ప్రధాన పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం.
సూయజ్ కాలువ జలమార్గ నిర్మాణ పనులు ప్రారంభం
145 ఏళ్ల చరిత్ర గల సూయజ్ కాలువ జలమార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్-సిసి ఆగస్టు 6న ప్రారంభించారు. దీంతో ఐరోపా, ఆసియా ఖండాల మధ్య వర్తకం మరింత విస్తరించనుంది. సూయజ్ కాలువను తొలిసారిగా 1869లో ప్రారంభించారు. ఇది ఈజిప్ట్‌లోని మెడిటేరేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ జలమార్గం. దీనివల్ల వర్తకుల నౌకలు, ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టిరాకుండా నేరుగా ఐరోపాను చేరుకోవచ్చు.
ఎబోలాపై అంతర్జాతీయ వైద్య ఎమర్జెన్సీ
పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగస్టు 8న అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. గత నాలుగు దశాబ్దాల్లో తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని పేర్కొన్నారు. 2009లో స్వైన్‌ఫ్లూ వ్యాపించిన సమయంలోనూ, గత మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎబోలా వ్యాప్తి గినియాలో గత మార్చిలో ఆరంభమైంది. అక్కడినుంచి సియోర్రాలియోన్, లైబీరియా, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది.
తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సు
తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల నాలుగో సదస్సు మయన్మార్‌లోని నేపితాలో ఆగస్టు 10న జరిగింది. సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా బలప్రయోగాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో బ్రూనై, మలేిషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్‌లతో చైనా పోరాడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం నుంచి అనుమతి పొంది భారత్ జరుపుతున్న చమురు తవ్వకాలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
వాతావరణ మార్పులపై బేసిక్ దేశాల మంత్రుల సమావేశం
బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, భారత్, చైనా (బేసిక్) దేశాల మంత్రుల స్థాయి సమావేశం న్యూఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరిగింది. వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి కార్యాచరణ అంగీకారానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
చైనాలో లోతైన ప్రయోగశాల
ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంలో ప్రయోగశాల నిర్మించేందుకు చైనా ఆగస్టు 2న పనులను ప్రారంభించింది. సైన్స్ చరిత్రలో చిక్కుముడిగా ఉన్న కృష్ణ పదార్థాన్ని గుర్తించే ఉద్దేశంతో నైరుతి సిచువాన్ రాష్ట్రంలోని జిన్‌పింగ్ జల విద్యుత్ కేంద్రం అడుగున 2,400 మీటర్ల లోతున దీన్ని నిర్మిస్తోంది. 2015 నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది.
డబ్ల్యూటీవో చర్చలు విఫలం
వ్యవసాయ సబ్సిడీలపై భారత్ అభ్యంతరాలను సంపన్న దేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. భారత్ లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకుండా.. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(ట్రేడ్ ఫెలిసిటేషన్ అగ్రిమెంట్-టీఎఫ్‌ఏ)ను ఉన్నదున్నట్లుగా భారత్ అంగీకరించాలని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆహారోత్పత్తుల నిల్వ, ఆహార సబ్సిడీల లెక్కింపునకు సంబంధించి డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణలు కావాలని భారత్ కోరుతోంది. మొత్తం ఆహారోత్పత్తుల విలువలో సబ్సిడీలు 10 శాతంగా ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు చెబుతున్నాయి. అయితే, 20 ఏళ్ల కిందటి ధరల ఆధారంగా వాటిని లెక్కిస్తున్నారు. సబ్సీడీల విషయంలో 1986-87ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవద్దని, ప్రస్తుత ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతోంది. అలాగే, 10 శాతం ఆహార సబ్సిడీతో భారత్‌లో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. అది 10 శాతం దాటితే.. భారత్‌పై జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశముంది.
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా ఉద్ధృతం
ఎబోలా వైరస్ ధాటికి పశ్చిమ ఆఫ్రికా దేశాలు విలవిల్లాడుతున్నాయి. సియోర్రా లియోన్‌లో ఎబోలా వ్యాధి ప్రబలి జూలై 31 నాటికి మరణించిన వారి సంఖ్య 233కు చేరింది. సియోర్రాలియోన్‌తో పాటు లైబీరియా, గినియా దేశాల్లో జూలై 31 నాటికి 729 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమావేశం నిర్వహించిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. వ్యాధిని ఎదుర్కొనేందుకు వంద మిలియన్ డాలర్ల ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించాయి.
AIMS DARE TO SUCCESS
సెప్టెంబరు 2014 అంతర్జాతీయం
సార్క్ సాంస్కృతిక రాజధానిగా బమియాన్
ఆఫ్గానిస్థాన్‌లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాంస్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది.
గ్రేట్ బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే స్కాట్లాండ్ ప్రజల ఓటు
స్కాట్లాండ్‌లో నిర్వహించిన రెఫరెండమ్‌లో గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోయేందుకు ప్రజలు తిరస్కరించారు. సెప్టెంబర్ 18న నిర్వహించిన రెఫరెండంలో 55.3 శాతం మంది స్కాట్లాండ్ వాసులు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకు ఓటు వేశారు. 44.7 శాతం మంది స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపారు. ఈ తీర్పును బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్వాగతించారు. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం ప్రచారం నిర్వహించిన స్కాట్లాండ్ నేషనల్ పార్టీ నాయకుడు, మంత్రి అలెక్స్ సాల్మండ్ ఓటమిని అంగీకరిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్, స్కాట్లాండ్‌ల మధ్య అసమానతలు, ఆర్థిక, సంక్షేమ రంగాల్లో వివక్ష, పెరుగుతున్న నిరుద్యోగం, స్కాట్లాండ్‌లో భారీగా చమురు నిల్వలు స్వతంత్రం కోరుకునేందుకు ప్రేరేపించాయి. స్కాట్లాండ్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తామన్న ప్రధాని డేవిడ్ కామెరూన్ హామీ, విభజనతో కలిగే నష్టాలు కలిసి ఉండేందుకు తోడ్పడ్డాయి.
అపర కుబేరుల జాబితాలో భారత్‌ది ఆరోస్థానం
అపర కుబేరుల (బిలియనీర్) ప్రపంచ జాబితాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సెస్-2014 సెప్టెంబర్ 17న వివరాలను వెల్లడించింది. భారత్‌లో ఈ ఏడాది 100 మంది బిలీయనీర్లు ఉన్నట్లు తేల్చింది. ఈ వంద మంది మొత్తం ఆస్తుల విలువ రూ. 10,50,000 కోట్లు (175 బిలియన్ డాలర్లు). అమెరికా, చైనా యునెటైడ్ కింగ్‌డమ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
పన్నుల సమాచార మార్పిడికి జి-20 దేశాల నిర్ణయం
జి-20 దేశాలు ఆటోమాటిక్‌గా ఆయా దేశాల మధ్య పన్నుల సమాచారం మార్పిడి వ్యవస్థను 2017 నాటికి రూపొందించేందుకు నిర్ణయించాయి. సెప్టెంబర్ 21న కెయిర్న్స్‌లో ముగిసిన రెండు రోజుల జి-20 ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో దీన్ని ఆమోదించారు. ఈ నిర్ణయం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత్‌కు తోడ్పడతుంది.
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ
అఫ్గానిస్థాన్ కొత్త అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీని సెప్టెంబర్ 21న ప్రకటించారు. గత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్థికమంత్రిగా ఉన్న అష్రాఫ్ ఘనీ, ప్రతిపక్ష నేత అబ్దుల్లా అబ్దుల్లా ఎవరికి వారు విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. దీంతో దేశంలో సంక్షోభం తలెత్తింది. దీనికి ముగింపు పలుకుతూ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఘనీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి అబ్దుల్లా నామినేట్ అవుతారు.
మూడోసారి న్యూజిలాండ్ ప్రధానిగా జాన్ కీ
న్యూజిలాండ్ ప్రదానమంత్రిగా జాన్‌కీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు చెందిన నేషనల్ పార్టీ 121 స్థానాలకు గాను 61 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్‌పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
బాల్య వివాహాల్లో భారత్‌ది రెండో స్థానం: ఐరాస
భారతదేశం బాల్య వివాహాల్లో రెండో స్థానంలో ఉందని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2000-12 మధ్యలో ఐదేళ్ల లోపున్న బాలల వివరాలు నమోదు చేయని విషయంలో కూడా భారత్ మొదటి స్థానంలో ఉందని ‘బాలల జీవితాల అభివృద్ధి, భవిష్యత్తు మార్పు- 25 ఏళ్లుగా దక్షిణాసియాలో బాలల హక్కులు’ అనే అంశంపై వెల్లడైన యూనిసెఫ్ నివేదిక తెలిపింది. 2000-12 మధ్యలో 71 మిలియన్ల ఐదేళ్లలోపు బాలల వివరాలు భారత్ నమోదు చేయలేదని వెల్లడించింది. బాల్య వివాహాల్లో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, భారత్, నేపాల్, అఫ్గానిస్థాన్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం పోటీ - జాబితాలో భారత్‌కు 71వస్థానం
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రపంచ పోటీ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. 2014, సెప్టెంబర్ 3న జెనీవాలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 144 దేశాలు పోటీపడగా స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొద టి మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్‌ది చివరి స్థానం. 2013-14లో భారత్‌కు 60వ ర్యాంక్ దక్కగా ఈసారి 11 స్థానాలను కోల్పోయింది. గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు (జీసీఆర్)ను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2004 నుంచి ఒక వార్షిక నివేదికగా ప్రచురిస్తోంది.
గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
ఇజ్రాయెల్, పాలస్తీనాల అంగీకారంతో గాజాలో ఆగస్టు 26 నుంచి దీర్ఘకాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గాజాలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, దాడుల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల పునర్మిణానికి వీలుగా దిగ్బంధాన్ని తొలగించేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది.
ఈ-మెయిల్‌కు 32 ఏళ్లు
సమాచార రంగంలో విప్లవాత్మకమై.. నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈ-మెయిల్)కు ఈ ఏడాది ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి.
AIMS DARE TO SUCCESS
అక్టోబరు 2014 అంతర్జాతీయం
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌ిసీ)కి భారత్ తిరిగి ఎన్నికైంది. 2014 అక్టోబరు 21న జనరల్ అసెంబ్లీలో 47 దేశాల మండలికి జరిగిన ఎన్నికలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుత సభ్యత్వం ఈ డిసెంబర్‌తో ముగుస్తుంది. తిరిగి ఎన్నికవడంతో 2017 చివరి వరకు సభ్యదేశంగా కొనసాగుతుంది. వరుసగా రెండుసార్లు సభ్యత్వం పొందిన దేశం మూడోసారి పోటీ పడేందుకు వీలులేదు.
ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు
ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) అక్టోబరు 24న బీజింగ్ కేంద్రంగా ఏర్పాటైంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చే లక్ష్యంతో ఏర్పాటైన ఎఐఐబీ 2015 నుంచి పనిచేస్తుంది. దీనికి 100 బిలియన్ డాలర్ల అధీకృత మూలధనం సమకూరుస్తారు. చైనా ఆర్థికశాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఈ బ్యాంకుకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ బ్యాంక్‌కు సంబంధించిన అవగాహన పత్రంపై చైనా, భారత్‌తోపాటు మొత్తం 20 దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు ఆసియా దేశాలకు ఈ బ్యాంకు దోహదపడుతుంది.
కుబేరులను అందించిన ముంబై వర్సిటీ
ప్రపంచ వ్యాప్తంగా కుబేరులను అందించిన విశ్వ విద్యాలయాల జాబితాలో ముంబై వర్సిటీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇందులో చదువుకున్న 12 మంది పూర్వ విద్యార్థులు వంద కోట్లకు అధిపతులు అయ్యారు. వెల్త్-ఎక్స్ యూబీఎస్ బిలియనీయర్ గణాంకాల ప్రకారం అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా విశ్వ విద్యాల యం అగ్రస్థానంలో నిలిచింది.
అఫ్గాన్‌లో సైనిక కార్యకలాపాలకు బ్రిటన్ ముగింపు
అఫ్గానిస్థాన్‌లో సైనిక కార్యకలాపాలకు బ్రిటన్ అధికారికంగా అక్టోబరు 26న ముగింపు పలికింది. లష్కర్ గాహ్‌లో తమ నియంత్రణలో ఉన్న స్థావరాలను ఆఫ్గాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో 13 ఏళ్లుగా కొనసాగిన బ్రిటన్ సైనిక చర్యలు ముగిశాయి. నాటో దళాలు ఏర్పాటు చేసిన అతిపెద్ద స్థావరం లష్కర్ గాహ్.
కాశ్మీర్‌పై జోక్యానికి ఐరాస విముఖత
కాశ్మీర్ సరిహద్దు అంశంపై జోక్యం కోసం పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. ఈ అంశాన్ని భారత్, పాక్‌లు చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలంటూ సూచించింది. సరిహద్దులో పరిస్థితిని చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని పాక్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు లేఖ రాసింది. అయితే ఈ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
యాంగ్ చాంగ్‌లో జీవ వైవిధ్య సదస్సు
దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు.
బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్
బెల్జియమ్‌లో కొత్త సెంటర్- రైట్ గవర్నమెంట్ అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టింది. ప్రధానమంత్రిగా చార్లెస్ మైఖేల్ (38) ప్రమాణ స్వీకారం చేశారు. 1841 నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు చార్లెస్.
ఆకలి సూచీలో భారత్‌కు 55వ స్థానం
ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ)లో భారత్‌కు ఈ ఏడాది 55వ స్థానం దక్కింది. ఈ జాబితాలో గతేడాది 63వ స్థానంలో నిలిచిన భారత్.. ఏడాది కాలంలో 17.8 పాయింట్లు తగ్గించుకుని 55వ స్థానంలో నిలిచింది.
2050 నాటికి సౌర విద్యుత్తు ప్రధాన విద్యుత్ వనరు
సౌరవిద్యుత్ 2050 నాటికి ప్రధాన విద్యుత్ వనరు కానున్నదని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ) సెప్టెంబర్ 29న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సోలార్ ఫోటో వోల్టాయిక్ వ్యవస్థల ద్వారా 2050 నాటికి మొత్తం ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 16 శాతం ఉత్పత్తి కాగలదని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ఇంధన సామర్థ్యంలో సౌర విద్యుత్ 1 శాతం కంటే తక్కువ. సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం. అమెరికా రెండో స్థానంలో ఉంది.
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గించేందుకు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వరల్డ్‌హార్ట్ డే (సెప్టెంబర్ 29) సందర్భంగా కోరింది. 2025 నాటికి ఉప్పు వాడకాన్ని 30 శాతం తగ్గిస్తే మిలియన్ల సంఖ్యలో గుండెపోటు మరణాలను అరికట్టవచ్చని తెలిపింది.
డాంగ్ ఫెంగ్ క్షిపణిని పరీక్షించిన చైనా
అణ్వస్త్ర సామర్థ్యం గల డాంగ్ ఫెంగ్ -31 బి అనే క్షిపణిని సెప్టెంబర్ 25న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వుఝూయ్ కేంద్రంలో పరీక్షించింది. ఇది 10వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి అమెరికా, ఐరోపాల్లోని పలు నగరాలను తాకగలదు.
AIMS DARE TO SUCCESS
నవంబరు 2014 అంతర్జాతీయం
ఖాట్మండులో 18వ సార్క్ సద స్సు
దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) 18వ సదస్సు నేపాల్ రాజధాని ఖాట్మండులో నవంబరు 26-27 తేదీల్లో జరిగింది. ఉగ్రవాదం, తీవ్రవాదాలను సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి, ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు, సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు ప్రకటించింది. సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలను ఎదుర్కొనేందుకు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలు: భారత్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్. 19వ సదస్సు పాకిస్థాన్‌లో జరగనుంది.
ఐరాసలో మరణశిక్షలపై తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్
మరణశిక్షల తాత్కాలిక నిలిపివేతకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ముసాయిదా తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. నవంబరు 24న జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 114 దేశాలు, వ్యతిరేకంగా 36 దేశాలు ఓటు వేశాయి. 34 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షను విధిస్తున్నట్లు భారత్ పేర్కొంది.
బాల్య వివాహాలపై ఐరాస తీర్మానం
బాల్య వివాహాలను నివారించాలని ప్రభుత్వాలకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నవంబరు 21న తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని కెనడా, జాంబియా ప్రవేశపెట్టాయి. ఇందుకు సంబంధించి చట్టాలను తీసుకురావాలని అన్ని దేశాలను కోరాయి. నైగర్, బంగ్లాదేశ్, భారత్‌లలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
బార్సిలోనాలో స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు
స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో నాలుగో స్మార్ట్‌సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వచ్చే 20 ఏళ్లలో భారత పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెంకయ్య అన్నారు.
నేపాల్‌లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు
ఈ ఏడాది అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు నేపాల్‌లోని లుంబినీ వేదికైంది. నవంబరు 15 నుంచి 18వరకు జరిగిన ఈ సదస్సు జరిగింది.
బీజింగ్‌లో 22వ అపెక్ సదస్సు
చైనా రాజధాని బీజింగ్‌లో 22వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సు నవంబరు 11-12 తేదీల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ బాగస్వామ్యంతో భవిష్యత్ ఆవిష్కరణ అనేది సదస్సు ఇతివృత్తం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటుకు సభ్యదేశాలు అంగీకరించాయి. భారత్ ఇందులో సభ్యదేశం కాదు. పరిశీలకదేశంగా పాల్గొనాలని ఆహ్వానించగా ప్రధాని మోదీ హాజరుకాలేదు. 2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్‌లో జరగనుంది. అపెక్ సభ్య దేశాల సంఖ్య 21.
తోకచుక్కపై దిగిన ఫీలే
ఖగోళ చరిత్రలో తొలిసారి తోకచుక్కపై ల్యాండర్ చేరింది. 67పి/ చుర్యుమోన్-గెరాసి మెంకో అనే తోకచుక్క వెంట పదేళ్లుగా ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన రొసెట్టా వ్యోమ నౌక ఫీలే నవంబరు 12న కాలుమోపింది. ఇలా తోకచుక్కపై దిగడం ఇదే తొలిసారి. 2004లో రొసెట్టా వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించారు. తోకచుక్కల అధ్యయనం వల్ల 450 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిన సౌర కుటుంబం గురించి తెలుసుకోవచ్చు.
బ్రిస్బేన్‌లో జీ-20 సదస్సు
నవంబరు 15-16 తేదీల్లో జరిగిన తొమ్మిదో జీ-20 సదస్సుకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికైంది. సభ్య దేశాలు వచ్చే ఐదేళ్లలో 2.1 లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని ఉమ్మడిగా, వేర్వేరుగా సాధించేందుకు తీర్మానించాయి. భారతీయులు విదేశాల్లో అక్రమంగా దాచిన నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని సదస్సులో ప్రధాని మోదీ కోరారు. బ్రిస్బేన్‌లోని రోమా వీధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పదో జీ-20 సదస్సు (2015) టర్కీలో జరగనుంది.
25వ ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) 25వ సదస్సు నవంబరు 12న మయన్మార్‌లోని నేపితాలో జరిగింది. ‘శాంతి యుత, సౌభాగ్య వంతమైన సమాజం కోసం ఐక్యతతో ముందుకు’ అనే ఇతివృత్తంతో సదస్సు సాగింది. మయన్మార్ అధ్యక్షుడు థీన్‌సేన్ దీనికి అధ్యక్షత వహించారు. ఇందులో పాల్గొన్న ప్రధాని మోదీ భారత ఆర్థిక ప్రగతిలో ఆగ్నేయాసియా దేశాలు భాగస్వాములు కావాలని కోరారు.
అంతర్జాతీయం బెర్లిన్ గోడ కూల్చివేతకు పాతికేళ్లు
చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది.
సంక్రమించని వ్యాధులతో ప్రధాన ఆరోగ్య సమస్య
భారత్‌లో 2012లో 60 శాతం మరణాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లనే సంభవించా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎకానమిక్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం భారత్‌లో 2012-2030 మధ్య కాలంలో ఎన్‌సీడీలు, మానసిక ఆరోగ్య స్థితుల వల్ల 4.58 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి, దేశాభివృద్ధికి పెద్ద సమస్య గా మారాయని పేర్కొంది.
మొనాకోలో ఇంటర్‌పోల్ సదస్సు
మొనాకో వేదికగా 83వ ఇంటర్‌పోల్ సదస్సు జరిగింది. నవంబరు 3-7 తేదీల మధ్య సాగిన ఈ సమావేశంలో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని హిందీలో ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ వేదికపై హిందీలో ప్రసంగించడం ఇదే ప్రథమం. 82వ సదస్సు గతేడాది కొలంబియాలోని కార్టెజినాలో జరిగింది.
ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్లీనరీ నవంబరు 5న జరిగింది. దీనికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి భారత్ లక్ష్యమని ప్రకటించారు.
లింగ అసమానత్వ సూచీలో భారత్‌కు 114వ స్థానం
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2014 లింగ అసమానత్వ సూచీలో భారత్ 114 వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉన్న 101 స్థానం నుంచి 13 స్థానాలు భారత్ దిగజారింది. మొత్తం 142 దేశాల పనితీరు ఆధారంగా అక్టోబరు 28న విడుదల చేసిన సూచీలో మొదటి స్థానంలో ఐస్‌లాండ్ నిలిచింది.
పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్వీడన్
పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటివరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి.
బంగ్లాదేశ్ జమాత్ అధ్యక్షుడికి మరణశిక్ష
బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ అధ్యక్షుడు ఎం.రహ్మాన్ నిజామి (71)కు బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ అక్టోబరు 29న మరణశిక్ష విధించింది. 1971 యుద్ధంలో అనేక మంది లౌకిక వాద మేధావుల హత్యలతో పాటు ఇతర నేరాల్లో కారకుడిగా గుర్తించిన ట్రైబ్యునల్ నిజామికి ఈ శిక్షను ఖరారు చేసింది.
వ్యాపార అనుకూల దేశాల్లో భారత్‌కు 142వ స్థానం
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 142వ స్థానంలో నిలిచింది. మొత్తం 189 దేశాలకు సంబంధించిన జాబితాను ప్రపంచ బ్యాంకు అక్టోబరు 29న విడుదల చేసింది. సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం అక్టోబరులో పీపీపీ అంశంలో భారత్ 7277.279 బిలియన్ అమెరికన్ డాలర్లతో స్థూల జాతీయోత్పత్తిలో 6.8 శాతాన్ని చేరింది. చైనా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.48 శాతంతో మొదటి స్థానంలో, అమెరికా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.28 శాతంతో రెండోస్థానంలో నిలిచాయి.
AIMS DARE TO SUCCESS
డిసెంబరు 2014 అంతర్జాతీయం
పాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 148 మంది మృతి
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సైనిక పాఠశాలపై డిసెంబర్ 16న ఆత్మాహుతి దళ తాలిబన్లు జరిపిన దాడిలో 148 మంది మరణించారు. వీరిలో 132 మంది విద్యార్థులున్నారు. పాక్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు తాలిబన్లు మరణించగా, నలుగురు తమను తాము పేల్చుకున్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లో పాక్ సైన్యం దాడులకు ప్రతీకారంగా సైనిక పాఠశాలపై దాడి చేసినట్లు తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
వ్యాపారానికి అత్యంత అనుకూలం డెన్మార్క్
వ్యాపారానికి అనుకూల దేశాలకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 9వ వార్షిక ర్యాంకింగ్స్‌లో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, న్యూజిలాండ్‌లు వరుసగా రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. 146 దేశాల జాబితాలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. గినియా చివరి స్థానంలో నిలిచింది. ఆస్తి హక్కులు, ఆవిష్కరణలు, పన్నులు, సాంకేతిక పరిజ్ఞానం, అవినీతి తదితర 11 కారకాల ఆధారంగా ఏటా ఫోర్బ్స్ ర్యాంకులు ఇస్తోంది.
అమెరికా సర్జన్ జనరల్‌గా భారతీయ అమెరికన్
అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్‌మూర్తి నియామకాన్ని సెనేట్ డిసెంబర్ 15న ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ నియామకం పొందిన తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. ప్రజారోగ్య విషయాలకు సంబంధించిన పాలనలో సర్జన్ జనరల్ అత్యున్నత పదవి.
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి డిసెంబర్ 11న ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. భారత రాయబారి అశోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 193 సభ్యదేశాలున్న సమితిలో రికార్డు స్థాయిలో 177 దేశాలు మద్దతు ప్రకటించాయి. జూన్ 21న సుదీర్ఘమైన పగటి రోజు కావడంతో చాలాదేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
లిమాలో ముగిసిన వాతావరణ సదస్సు
పెరూ రాజధాని లిమాలో 13 రోజుల పాటు జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు (సీఓపీ-20) డిసెంబర్ 14న ముగిసింది. వాతావరణ కార్యాచరణకు లిమా పిలుపు (లిమా కాల్ టు క్లైమేట్ యాక్షన్) పేరుతో రూపొందించిన పత్రం ఆమోదంతో సదస్సు పూర్తయింది. ఈ పత్రానికి 196 దేశాలు ఆమోదం తెలిపాయి. 2015 డిసెంబర్‌లో పారిస్‌లో రూపొందే ఒప్పందానికి జరిగే చర్చల కోసం విధానపత్రంగా దీన్ని రూపొందించారు.
‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎబోలా చికిత్సకారులు
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, సహాయకులను ఉమ్మడిగా పర్సన్ ఆఫ్ ది ఇయర్ (2014)గా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. చికిత్స అందించే క్రమంలో సహచర వైద్యులు వైరస్ బారినపడి మరణించినా, ధైర్యంతో సేవలు అందిస్తున్నందుకు తుది ఎనిమిది మంది జాబితాలోంచి వీరిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు మ్యాగజైన్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ డిసెంబర్ 10న ప్రకటించారు.
అణ్వస్త్ర రహిత తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు
అణ్వస్త్ర రహిత దేశంగా ఉండటానికి తక్షణ అంగీకారంపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. అణ్వస్త్ర నిరాయుధీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నవంబరు 2న ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 169 దేశాలు వ్యతిరేకించగా, 7 దేశాలు అను కూలంగా ఓటేశాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా తదితర దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తమ అణు సదుపాయాలను ఐఏఈఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంచడాన్ని కూడా తప్పుబట్టాయి.
మాల్దీవుల్లో వాటర్ ఎమర్జెన్సీ
మాల్దీవుల రాజధాని మాలేలోని నీటి శుద్ధి కేంద్రంలో డిసెంబరు 5న జరిగిన అగ్ని ప్రమాదంతో నీటి సర ఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో రాజధాని మాలేలో వాటర్ ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది. హిందూ మహాసముద్రం దిగువ ప్రాంతంలో ఉండే మాలేలో సహజ జలవనరులు లేవు. శుద్ధి చేసిన సముద్ర జలాలే మాలేలోని లక్షమంది ప్రజలకు ఆధారం.
అవినీతి సూచీలో భారత్‌కు 85వ స్థానం
ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ 175 దేశాల అవినీతి సూచీ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 94వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి పరిస్థితిని మెరుగుపరచుకొంది. అత్యంత తక్కువ అవినీతి గల దేశంగా డెన్మార్క్‌కి మొదటి స్థానం దక్కింది. తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ఉన్నాయి. సోమాలియా, ఉత్తర కొరియాలలో అవినీతి ఎక్కువగా ఉంది.

No comments:
Post a Comment