జాతీయం 2015 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు
జనవరి 2015 జాతీయం
గాంధీనగర్‌లో ‘ఈ-గవర్నెన్స్’ సదస్సు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జనవరి 30, 31 తేదీల్లో ఈ-గవర్నెన్స్‌పై 18వ జాతీయ సమావేశాలు జరిగాయి. వీటి ఇతివృత్తం ‘డిజిటల్ గవర్నెన్స్-న్యూ ఫ్రాంటియర్’. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పించన్ల మంత్రిత్వశాఖలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం; కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రిత్వశాఖలోని ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం సంయుక్తంగా సమావేశాలను నిర్వహించాయి. ఈ-గవర్నెన్స్ కోణంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు.
2013-14లో జీడీపీ వృద్ధి 6.9 శాతం
దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 2013-14లో 6.9 శాతానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 30న సవరించింది. దీన్ని గతంలో 4.7 శాతంగా పేర్కొంది. జీడీపీ గణాంకాలకు సంబంధించి ఆధార సంవత్సరాన్ని (బేస్ ఇయర్) 2004-05 నుంచి 2011-12కు మార్చడంతో జీడీపీలో మార్పు వచ్చింది. 2012-13 జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. 2010లో 2004-05ను బేస్ ఇయర్‌గా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆధారసంవత్సరాన్ని పదేళ్లకోసారి మార్చేవారు. దీన్ని ఐదేళ్లకోసారి మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్ (ఎన్‌ఎస్‌సీ) సిఫార్సు చేయడంతో తాజా మార్పు జరిగింది.
‘స్వచ్ఛ భారత్’పై తపాలాబిళ్లలు
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 30న కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ఇతివృత్తంతో న్యూఢిల్లీలో స్మారక తపాలాబిళ్లలను విడుదల చేసింది. ఇవి కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా విడుదలయ్యాయి. స్వచ్ఛ భారత్‌పై చిన్నారులకు పోటీలను నిర్వహించి, తపాలాబిళ్లల డిజైన్లను తపాలా శాఖ ఖరారు చేసింది.
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా
భారత 66వ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సైనిక కవాతు, శకటాల ప్రదర్శన, వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి. భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామాయే. దేశం కోసం ప్రాణాలర్పించిన నాయక్ నీరజ్‌కుమార్, మేజర్ ముకుంద్ వరదరాజన్‌లకు మరణానంతరం ప్రకటించిన అశోకచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ను ప్రారంభించిన మోదీ
బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచా వో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి.. ఆడపిల్లల్ని చదివించడం)’ ప్రచార కార్యక్రమాన్ని హరియాణలోని పానిపట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. దీన్ని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు.
జాతీయ వారసత్వ అభివృద్ధి పథకం
దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘హృదయ్ (హెరిటేజ్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్‌మెంటేషన్ యోజన)’ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 21న ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, రాజస్థాన్‌లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మధుర, పంజాబ్‌లోని అమృత్‌సర్, గుజరాత్‌లోని ద్వారక, బీహార్‌లోని గయ, కర్ణాటకలోని బాదామి, ఒడిశాలోని పూరీ, తమిళనాడులోని కాంచీపురం, వేలాంగణి నగరాలను ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ నగరానికి రూ. 40.54 కోట్లు, ఏపీలోని అమరావతికి రూ.22.26 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో నగరాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొల్పాల్సి ఉంటుంది. పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రతకు చర్యలు తీసుకోవాలి.
దేశంలో 2,226కు చేరిన పులుల సంఖ్య
దేశంలో పులుల సంఖ్య 2014లో 2,226కు చేరినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ జనవరి 20న విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా-2014’ నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లో ఉన్నాయి. 2010 నాటికి 1,706 ఉండగా, 30.5 శాతం వృద్ధితో 2014 నాటికి 2,226కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2010 లో 72 పులులు ఉండగా, 2014 నాటికి 68కి తగ్గింది.
కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌కు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) అవార్డును జనవరి 20న ప్రకటించారు. రిజర్వ్ విస్తరణలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డు దక్కింది.
భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతం
భారత్ వృద్ధి రేటు 2016లో 6.3 శాతమని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ఈ ఏడాది వృద్ధి 5.9 శాతమని, 2014లో 5.4 శాతమని అంచనాల్లో పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కీలక సంస్కరణల ప్రకటన, అమలు వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2015’ అన్న పేరుతో విడుదలైన నివేదికలో తెలిపింది.
వైమానిక దళంలో చేరిన తేజస్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ వైమానికదళంలో చేరింది. జనవరి 17న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ లోహ విహంగాన్ని అందించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా.. తేజస్ పత్రాల్ని పారికర్ నుంచి అందుకున్నారు. తేజస్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని, గగనతలం నుంచి నేలమీదున్న లక్ష్యాల్ని , గగనతలం నుంచి సముద్రం మీదున్న లక్ష్యాల్ని ఛేదించగలదు. దీని పొడవు 13.2 మీటర్లు, ఎత్తు 4.4 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు, గరిష్ట వేగం 1.6 మ్యాక్. ఒక్కో విమానం ఖరీదు రూ. 220-250 కోట్లు.
ఎన్నికల నిర్వహణలో ఉమ్మడి ఏపీకి పురస్కారం
2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యున్నత ప్రతిభను చూపిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు ప్రకటించింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25న అందజేస్తారు.
వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్
గుజరాత్‌లో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 11న గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ప్రారంభించారు. సుస్థిరమైన పన్ను విధానం, పారదర్శకమైన, న్యాయబద్ధమైన విధాన వాతావరణం కల్పించడం ద్వారా.. ప్రపంచ సమాజం వాణిజ్యం చేయడానికి భారతదేశాన్ని అత్యంత అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌లతోపాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. ఈ సదస్సును మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రెండేళ్ల కోసారి నిర్వహిస్తున్నారు. 2003లో వైబ్రంట్ గుజరాత్ మొదటి సదస్సు జరిగింది.
సత్యార్థి నోబెల్ జాతికి అంకితం
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన అవార్డును జాతికి అంకితం చేశారు. జనవరి 7న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి తన మెడల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. సత్యార్థి బహూకరించిన నోబెల్ అవార్డు రాష్ట్రపతి భవన్‌లోని మ్యూజియంలో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. సత్యార్థి గతేడాది డిసెంబర్ 10న పాకిస్థాన్ బాలిక మలాలాతో కలిసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
గాంధీనగర్‌లో ప్రవాస భారతీయ దివస్
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో 13వ ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ)’ను జనవరి 7 నుంచి 9 వరకు నిర్వహించారు. ఇందులో 58 దేశాలకు చెందిన 4వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ ముఖచిత్రం ఉన్న నాణేలు, స్టాంపులను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చి వందేళ్లు పూర్తయినందుకు గుర్తుగా వీటిని రూపొందించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సత్య నాదెళ్లతోపాటు మరో 14 మందికి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ అవార్డులను అందజేశారు.
జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన
జమ్మూ-కశ్మీర్‌లో గవర్నర్ పాలన మరోసారి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా చేసిన సిఫారసును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 9న ఆమోదించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడమే ఇందుకు కారణం. మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీలో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు యత్నాలు ఫలించకపోవడంతో గవర్నర్ పాలన తప్పనిసరైంది. భారత్‌లో అంతర్భాగమే అయినప్పటికీ జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఇందులోని ఆర్టికల్ 92 గవర్నర్ పాలనకు సంబంధిం చింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనపుడు గవర్నర్ పాలన విధిస్తారు. ఆరు నెలల గవర్నర్ పాలన తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమల్లోకి వస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనపుడు ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. జమ్మూ-కశ్మీరులో ఇప్పటివరకు ఆరు సార్లు గవర్నర్ పాలన విధించారు.
ఒబిలిస్క్ టవర్ ప్రారంభం
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్ మాదిరి ఒబిలిస్క్ టవర్‌ను యానాం (పుదుచ్ఛేరి)లో నిర్మించారు. దీన్ని పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్ సింగ్, ముఖ్యమంత్రి రంగసామి జనవరి 6న ప్రారంభించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ నిర్మాణానికి రూ.45 కోట్లు ఖర్చయ్యాయి.
కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు సంబంధించి 121వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014, డిసెంబర్ 31న ఆమోదం తెలిపారు. దీంతో 1993లో ఏర్పడిన న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునే కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటవుతుంది. రాజ్యాంగ ప్రతిపత్తి గల ఈ కమిషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలూ కమిషన్ ద్వారా జరుగుతాయి.
ఐఆర్‌డీఏ పేరు మార్పు
బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) పేరును భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ ఆఫ్ ఇండియా)గా పేరు మార్చారు. దీనికి సంబంధించి సంస్థ 2014, డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించింది.
మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’
మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు. అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది.
ఉగ్రవాదుల పడవను అడ్డుకున్న భారత తీర రక్షక దళాలు
అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను భారత తీర రక్షక దళాలు అడ్డుకున్నాయి. ముంబై 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. 2014, డిసెంబర్ 31న గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 365 కి.మీ. దూరంలో భారత తీర రక్షక దళాలు పడవను గుర్తించాయి. తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఉగ్రవాదులు పడవను పేల్చేశారు.
ముంబైలో 102వ సైన్స్ కాంగ్రెస్
ముంబైలోని ముంబై యూనివర్సిటీలో 102వ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హ్యుమన్ డెవలప్‌మెంట్ (మానవ అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ)’పై సదస్సు అయిదు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో 12 వేల మంది దేశ, విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. వివిధ అంశాలపై విస్తృత చర్చలు, పరిశోధన పత్రాలను సమర్పించారు.
ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకం ప్రారంభం
గృహ సామర్థ్య విద్యుత్ కార్యక్రమం(డీఈఎల్‌పీ) కింద కరెంటును ఆదాచేసే ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించారు. సౌత్‌బ్లాక్‌లో ఓ సాధారణ బల్బును తొలగించి ఎల్‌ఈడీ బల్బును అమర్చారు. ఎల్‌ఈడీ బల్బు ‘ప్రకాశ్ పథ్’(వెలుగు బాట) అని వ్యాఖ్యానించారు.
చట్టంగా సీఆర్‌డీఏ బిల్లు
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లు 2014, డిసెంబర్ 30న చట్టంగా రూపొందింది. ఈ చట్టం ప్రకారం మొత్తం రాజధాని పరిధి 7,068 చదరపు కిలోమీటర్లు కాగా రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లు. ప్రభుత్వం సీఆర్‌డీఏకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు.
AIMS DARE TO SUCCESS
ఫిబ్రవరి 2015 జాతీయం
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్
జేడీయూ నేత నితీశ్ కుమార్.. బిహార్ ముఖ్యమంత్రిగా 2015 ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. మరో 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ముఖ్యమంత్రిగా ఉన్న జితన్‌రాం మాంఝీ పార్టీ విధేయత కోల్పోవడంతో రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లో జేడీయూ దెబ్బతినడానికి నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్ 2014 మే 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో 2014 మే 20న మాంఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భూసార కార్డుల పథకం ప్రారంభం
భూసార కార్డుల (సాయిల్ హెల్త్ కార్డు) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఎరువులు, ఖనిజ లవణాల వాడకాన్ని నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. దీని కింద వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు అందిస్తారు. భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత భూమి ఏ పంటలకు అనుకూలం, అందులో ఏ పంటకు ఎంత మోతాదులో ఏయే ఎరువులు వేయాలి, భూసారాన్ని పెంచడానికి ఏయే ఖనిజ లవణాల అవసరం ఎంత మేరకు ఉంటుంది లాంటి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తారు. 2017 నాటికి రైతులందరికీ వీటిని మూడు విడతలుగా అందించనున్నారు. వీటిని డిజిటలైజ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది.
అంతర్జాతీయ ఏరో ఇండియా
అంతర్జాతీయ ఏరో ఇండియా - 2015 (10వ కార్యక్రమం)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులోని యళహంక వైమానిక స్థావరంలో 2015 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రక్షణ రంగ పరికరాల దిగుమతిలో భారత్ మొదటి స్థానంలో ఉందని, దీన్ని తగ్గించడానికి వచ్చే అయిదేళ్లలో 70 శాతం దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, తద్వారా 1.20 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు.
రూ. 4.31 కోట్లకు అమ్ముడుపోయిన మోదీ సూట్
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్‌గళా సూటు ఎంత వివాదాస్పదమైందో వేలం పాటలోనూ అంతే స్థాయిలో రికార్డు సృష్టించింది. మూడు రోజులపాటు జరిగిన వేలంలో చివరిరోజైన శుక్రవారం (ఫిబ్రవరి 21) రూ. 4.31 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రధానికి వచ్చిన బహుమతులను వేలానికి పెట్టడం ఇదే తొలిసారి. సూట్ సహా వీటినన్నింటిని రూ. 8.33 కోట్లకు కొనుక్కున్నారు. నేవీ బ్లూ కలర్ కోటుపై బంగారు రంగు గీతల్లో ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’ అని రాసి ఉంటుంది. మోదీ జనవరి 25న ధరించిన ఈ సూట్‌ను సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్, ఆయన కుమారుడు సొంతం చేసుకున్నారు. ‘ధర్మానంద వజ్రాల కంపెనీకి చెందిన లాల్జీ పటేల్, ఆయన కుమారుడు హితేశ్.. ఈ సూట్‌ను వేలంలో రూ.4,31,31,000కు కొన్నారు’ అని జిల్లా కలెక్టర్ రాజేంద్ర కుమార్ వేలం ముగిశాక తెలిపారు.
ఢిల్లీలో ఆప్ ఘన విజయం

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భారీ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2015 ఫిబ్రవరి 7న శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో 70 స్థానాలకుగాను 67 స్థానాల్లో గెలుపొందింది. ఢిల్లీ శాసనసభలో ఒక పార్టీ ఇంత ఆధిక్యాన్ని సాధించడం ఇదే తొలిసారి. బీజేపీ మూడు స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఆప్‌కు 54.3 శాతం, బీజేపీకి 32.7 శాతం, కాంగ్రెస్‌కు 9.7 శాతం, ఇతరులకు 3.3 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ 2015 ఫిబ్రవరి 14న ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2013 ఎన్నికల్లో ఆప్ 29.5 శాతం ఓట్లతో 28 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 32, కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2013లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 49 రోజుల తర్వాత పదవికి రాజీనామా చేశారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్ ఏర్పాటు
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారణకు ప్రభుత్వం తాజాగా ఓ ప్రత్యేక దర్యాప్తుబృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ హ త్యానంతరం ఢిల్లీ, పలు ఇతర రాష్ట్రాల్లో సిక్కు మతస్తులపై చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించిన అన్ని కేసులను ఈ త్రిసభ్య బృందం పునర్విచారణ చేసి, ఆరునెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని కేంద్ర హోంశాఖ గురువారం వెల్లడించింది. దీనికిఐపీఎస్ అధికారి ప్రమోద్ ఆస్థానా నేతృత్వం వహిస్తారు
కట్నం ఎప్పుడు అడిగినా.. నేరమే: సుప్రీం
వరకట్నం అనేది ఎప్పుడైనా అడిగే అవకాశముందని, పెళ్లి తర్వాత అడిగినా అది నేరమేనని ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.భార్యకు విషమిచ్చి, కాల్చిచంపిన కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు గతంలో విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. పెళ్లికి ముందు తాను ఎలాంటి కట్నం అడగలేదని, పెళ్లి తర్వాతే అడి గినందున దానిని పరిగణనలోకి తీసుకోరాదంటూ భీం సింగ్ అనే సదరు వ్యక్తి చేసిన విజ్ఞప్తిని ఈ మేరకు న్యాయమూర్తులు ఎంవై ఇక్బాల్, పినాకీ చంద్ర ఘోష్‌ల సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.
నీతి ఆయోగ్ తొలి సమావేశం
ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్’ తొలి పాలకమండలి సమావేశం ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలో జరిగింది. దీనికి చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. అధిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు అధిక నిధులు ఇచ్చేందుకు, వాటి వినియోగానికి మరిన్ని అధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రులతో మూడు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మొదటి బృందం 66 కేంద్ర ప్రాయోజిత పథకాలను సమీక్షిస్తుంది. వీటిలో వేటిని కొనసాగించాలి? రాష్ట్రాలకు వేటిని అప్పగించాలి? వేటిని రద్దు చేయాలి? అనే అంశాలపై ప్రతిపాదనలు సమర్పిస్తుంది. రెండో బృందం రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై అధ్యయనం చేస్తుంది. మూడో బృందం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించేందుకు వ్యవస్థాగత యంత్రాంగం, సాంకేతిక నిర్మాణంపై సూచనలిస్తుంది.
AIMS DARE TO SUCCESS
మార్చి 2015 జాతీయం
ఢిల్లీ ఏక్తా స్థల్‌లో పీవీకి స్మారక కేంద్రం
దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. మరణించిన పదేళ్ల తర్వాత ఆయన స్మారక కేంద్రం దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు కానుంది.
యమునా నది ఒడ్డున ఏక్తా స్థల్ వద్ద పీవీకి స్మారకం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినెట్ నోట్‌ను రూపొందించింది. యమునా నది ఒడ్డున విజతా ఘాట్, శాంతివన్ మధ్యలో 22.56 ఎకరాల విస్తీర్ణంలో ఏక్తా స్థల్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ దివంగత రాష్ట్రపతులు జ్ఞాని జైల్‌సింగ్, శంకర్‌దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, ఆర్.వెంకట్రామన్, మాజీ ప్రధానులు ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్‌ల స్మారకాలు ఉన్నాయి. మొత్తం 9 స్మారకాల కోసం ఏక్తా స్థల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకా మూడు స్మారకాలు నెలకొల్పే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకం నిర్మించాలంటూ తెలుగుదేశం పార్టీ గతేడాది అక్టోబర్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
అంతర్జాతీయ ఇంధన సదస్సు-2015
అంతర్జాతీయ ఇంధన సదస్సు.. ఊర్జా సంగమ్-2015 న్యూఢిల్లీలో మార్చి 27న జరిగింది. సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ సంపన్నులు గ్యాస్ రాయితీని వదులుకోవాలని కోరారు. ఇంతవరకు 2.8 లక్షల మంది రాయితీలు వదులుకున్నారని, ఇందువల్ల రూ. 100 కోట్లు ఆదా అయిందన్నారు. ఈ మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు.
మిజోరం గవర్నర్ తొలగింపు
మిజోరం గవర్నర్‌గా ఉన్న అజీజ్ ఖురేషిని కేంద్ర ప్రభుత్వం మార్చి 28న తొలగించింది. ఈయన 2017 మే వరకు కొనసాగాల్సి ఉంది. మిజోరం గవర్నర్‌గా పశ్చిమబెంగాల్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఖురేషిని యూపీఏ ప్రభుత్వం నియమించింది.
‘ప్రగతి’ని ప్రారంభించిన ప్రధాని
ప్రజల ఫిర్యాదులకు పరిష్కారం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, సమీక్ష లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత కార్యక్రమం ‘ప్రగతి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో మార్చి 25న ప్రారంభించారు. ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్(ప్రగతి-సానుకూల పాలన, సమయోచిత అమలు) అనేది సాంకేతిక పరిజ్ఞాన ఆధారితమైన ఒక ప్రత్యేకమైన సమగ్ర, పారస్పరిక వేదిక అని ప్రధాని వివరించారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోదీ ప్రతి నెల నాలుగో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమవుతారు. ఆ రోజును‘ప్రగతి డే’గా పిలుస్తారు.
ఎన్నికల్లో పోటికి విద్యార్హత
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విద్యార్హతను నిర్ణయిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజస్థాన్ శాసనసభ మార్చి 27న ఆమోదం తెలిపింది. దేశంలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హతను నిర్ణయించిన తొలి రాష్ట్రం రాజస్థానే. సర్పంచ్ పదవికి 8వ తరగతి, రిజర్వుడ్ గిరిజన ప్రాంతాలకైతే 5వ తరగతి చదివి ఉండాలి. జిల్లా పరిషత్ లేదా సమితి ఎన్నికల్లో పోటీ చేయాలంటే పదో తరగతి చదివి ఉండాలి.
ఫార్య్చూన్ జాబితాలో మోదీ
అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మేగజీన్ 2015 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ నేతల జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదో స్థానంలో నిలిచారు. 50 మందితో కూడిన ఈ జాబితాలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడు మరియో డ్రాగీ నిలిచారు. భారత్‌ను వ్యాపారానికి సానుకూలంగా మలిచేందుకు చర్యలు, మహిళలపై దాడులను అరికట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచుకోవడం వంటి వాటికి మోదీ కృషి చేస్తున్నారని పత్రిక పేర్కొంది. భారత్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు.
భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్
భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని మార్చి 27న సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణల ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5తో ముగియనుంది. అంతకంటే ముందే రాజ్యసభను ప్రొరోగ్ చేసి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని సీసీపీఏ సిఫార్సు చేసింది.. అయితే ఎప్పటిలోగా జారీ చేస్తారో చెప్పలేదు ఫిబ్రవరి 23న ప్రారంభమైన బడ్జెట్ తొలి దశ సమావేశాలు మార్చి 20న ముగిశాయి. ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు మలిదశ సమావేశాలు జరుగనున్నాయి. భూసేకరణ బిల్లును తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదించింది. విపక్షాలవ్యతిరేకతతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభను ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందుకే రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని నిర్ణయించారు.
కొత్త ఆర్డినెన్స్‌లో 9 సవరణలు.. లోక్‌సభలో భూసేకరణ బిల్లును ఆమోదించినప్పుడు ప్రతిపాదించిన 9 సవరణలను కొత్త ఆర్డినెన్స్‌లో చేరుస్తారు. ఈ సవరణలకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేసుకోవటం కోసం 9 సవరణలతో పాటు మరిన్ని ప్రతిపాదనలతో మలిదశ సమావేశాల్లో రాజ్యసభ ముందుకు బిల్లును తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.. తొలి ఆర్డినెన్స్‌లో తొలగించిన ‘భూసేకరణకు 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరి’ అంశాన్ని కొద్ది మార్పులతో తిరిగి చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
జాట్‌ల కోటాను రద్దుచేసిన సుప్రీంకోర్టు
జాట్ వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేంద్ర జాబితాలో చేర్చుతూ గతంలో జారీఅయిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 17న రద్దు చేసింది. 2014, మార్చిలో యూపీఏ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. అయితే జాట్లను ఓబీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. జాట్‌లు బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నారు.
ప్రతినెలా 7 నుంచి టీకాల వారం
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు.
భారత్‌లో మొబైల్ కనెక్షన్లు 95.5 కోట్లు
భారతదేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 95.5 కోట్లు అని టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ లోక్‌సభలో మార్చి18న వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న మొబైల్ వినియోగానికి ఈ లెక్కలే నిదర్శనమని చెప్పారు. గతేడాది నాటికి 30 కోట్ల ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ సంఖ్య అమెరికా, చైనాల్లోని కనెక్షన్ల కన్నా అధికమని పేర్కొన్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ విషయంలో అమెరికా తరువాత స్థానంలో ఇండియా నిలిచిందని చెప్పారు. భాషల పరిరక్షణ, పరిశోధన, అభివృద్ధి, వ్యాప్తికి ‘టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ (టీడీఐఎల్) పథకం ద్వారా కృషి చేస్తున్నామని వివరించారు. పలు భాషల అభివృద్ధికి సాఫ్ట్‌వేర్ టూల్స్, అప్లికేషన్లను రూపొందిస్తున్నామని తెలిపారు. భాషా వనరుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో గుర్తింపు పొందిన 22 భాషలకు చెందిన సీడీలు, సాఫ్ట్‌వేర్ టూల్స్, ఫాంట్లు www.tdildc.inవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
దేశంలో 2,500 మల్టీ స్కిల్ ఇన్‌స్టిట్యూట్లు
నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా 2500 మల్టీ స్కిల్ ఇన్‌స్టిట్యూట్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో జిల్లాల వారీగా స్కిల్ మ్యాపింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మార్చి 18న రాజ్యసభలో తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాల లేమి మధ్య నెలకొన్న అంతరంపై ఇప్పటికే అధ్యయనం పూర్తయిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేశారు. దేశంలో 2500 బహుళ నైపుణ్య సంస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు చొప్పున సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. వృత్తి విద్యను సాధారణ విద్యలో అంతర్భాగంగా మార్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ఐటీ చట్టంలోని 66ఏ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీం తీర్పు
వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సంపూర్ణంగా కొట్టివేస్తూ మార్చి 24న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ సెక్షన్ రాజ్యాంగవిరుద్ధంగా, సందిగ్ధపూరితంగా ఉందని తేల్చిచెప్పింది. పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను కల్పిం చిన రాజ్యాంగంలోని 19(1) అధికరణను ఈ సెక్షన్ ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. 66(ఏ)లో పేర్కొన్న కొన్ని పదాలను స్పష్టంగా నిర్వచించకపోవడం వల్ల భిన్న వ్యాఖ్యానాలకు అవకాశమిచ్చేలా ఉందని ఆక్షేపించింది. 69ఏ, 79లను కొన్ని పరిమితులతో కొనసాగించేందుకు అంగీకరించింది. వాటిలో వెబ్‌సైట్లలోని సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి రాకుండా బ్లాక్ చేయాలని ఆదేశించే అధికారాన్నిచ్చేది సెక్షన్ 69ఏ కాగా.. కొన్ని ప్రత్యేక కేసుల్లో ఇంటర్మీడియరీలకు బాధ్యతనుంచి మినహాయింపునిచ్చేది సెక్షన్ 79. సెక్షన్ 66ఏలా కాకుండా, సెక్షన్ 69ఏని నిర్దిష్టంగా రూపొందించారని, కేంద్రప్రభుత్వం తప్పదని భావిస్తేనే వెబ్‌సైట్లను నిషేధించేలా నిబంధనను అందులో పొందుపర్చారని పేర్కొంది.భావప్రకటన హక్కు అత్యంత మౌలికమైనదని ఈ సందర్భంగా జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం 123 పేజీల తీర్పులో స్పష్టంచేసింది. ప్రజలకున్న సమాచారాన్ని తెలుసుకునే హక్కుపై ఈ సెక్షన్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. 66ఏ దుర్వినియోగం కాకుండా మరిన్ని నిబంధనలను పొందుపరుస్తామంటూ విచారణ సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీని కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు మారుతాయి కానీ చట్టాలు అలానే ఉంటాయని వ్యాఖ్యానించింది. సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను కల్పించే రాజ్యాంగంలోని 14, 21, 19(1)(2) నిబంధనలపై ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ చూపే ప్రభావాన్ని కోర్టు నిశితంగా పరిశీలించి, ఆ సెక్టన్‌కు చట్టబద్ధత లేదని తేల్చింది. 66ఏ సెక్షన్‌లో సవరణ చేయాలంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్ 2012లో దాఖలు చేసిన ప్రజాశ్రేయోవ్యాజ్యం సహా పలు సంబంధిత పిటిషన్లపై విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
టర్కీ కాన్సులేట్ ప్రారంభం
రిపబ్లిక్ ఆఫ్ టర్కీ కాన్సులేట్ జనరల్ కార్యాలయం హైదరాబాద్‌లో మార్చి 22న ప్రారంభమయ్యింది. కార్యాలయ కార్యకలాపాలను హైదరాబాద్ టర్కీ కాన్సులేట్ జనరల్ మురాక్ ఓమెరెగ్లూతో కలసి కేంద్ర మంద్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి విదేశీ వ్యవహారాలకు సంబంధించి రాయబార కార్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. టర్కీకి వెళ్లాలనుకునే వారికి ఇక్కడ తేలిగ్గా వీసా సదుపాయం లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు తేలిగ్గా టర్కీకి వెళ్లాలనుకుంటే ఇక్కడ వీసా తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వీసాను సినీ నటి లక్ష్మీ మంచుకు అందజేశారు.
బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన బీమా బిల్లుకు మార్చి 12న రాజ్యసభ మూజువాణి(వాయిస్) ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ద్వారా బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు. గతేడాది డిసెంబర్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం బీమా చట్టాలు(సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీనిపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. సభ్యుల నిరసనతో సభ పలుమార్లు వాయిదా పడింది. బీమా బిల్లుకు కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ, బీజేడీ, శివసేన, ఆకాలీ దళ్ మద్దతు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, జేడీ(యూ) వాకౌట్ చేశాయి. వాస్తవానికి బీజేపీకి ఎగువ సభలో తగిన మెజారిటీ లేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలో 26 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. ఇకపై 49 శాతం పెట్టుబడులను అనుమతిస్తారు.
భారత్‌లో టెలికం వినియోగదారులు 97.92 కోట్లు
 ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 97.92 కోట్లకు చేరింది.
వీరి సంఖ్య గతేడాది డిసెంబర్‌లో 97.09 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. టెలిఫోన్ వినియోగదారుల నెలవారి వృద్ధి 0.85 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. టెలిఫోన్లను వినియోగిస్తున్న వారి శాతం 77.58 నుంచి 78.16కి పెరిగినట్లు తెలిపింది. ల్యాండ్‌లైన్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 2.70 కోట్ల నుంచి 2.68 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది.
ఎన్నికల్లో ఒక్క చోటే పోటీ:న్యాయ కమిషన్ సిఫారసు
ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ఒక్క చోట మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉండాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. అంతేకాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు ఉండాలని ప్రతిపాదించింది. ‘పెయిడ్ న్యూస్’పైనా కఠినంగా వ్యవహరించాలని.. వార్తలకు డబ్బు చెల్లించడంతో పాటు తీసుకోవడాన్నీ నేరంగా పరిగణించాలని సూచించింది. నిర్బంధ ఓటింగ్‌ను కమిషన్ వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామికమని పేర్కొంది. నన్ ఆఫ్ ద ఎబోవ్(నోటా)కు పోలైన కంటే తక్కువ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను రీకాల్ చేసే అవకాశం ఉండాలి అంటూ వస్తున్న డిమాండ్లను కూడా తిరస్కరించింది. ఎన్నికల సంస్కరణలపై తమ ప్రతిపాదనలతో కూడిన రెండో నివేదికను న్యాయ కమిషన్ మార్చి 12న సమర్పించింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
న్యాయ కమిషన్ సూచనలు..
ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలి. దీనివల్ల ఓటర్లకు ఇబ్బందులు, ప్రభుత్వానికి అనవసరపు వ్యయం తగ్గుతుంది.ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో ఎక్కువ మంది డమ్మీ అభ్యర్థులు. ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన పేరుతో ఉండి ఓటర్లను తికమకపెట్టేందుకు స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి తీసుకువస్తున్నారు. అందువల్ల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు పోటీకి అవకాశం లేకుండా ఉండాలి.ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేయాలి.లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు నుంచే ప్రభుత్వ ప్రకటనలపై కఠినమైన నియంత్రణ, నిషేధం విధించాలి.
ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించని అభ్యర్థులపై విధిస్తున్న నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలి. తద్వారా తర్వాతి ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.
జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ చెల్లదు:సుప్రీం
తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్ కులస్థులకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ 2014 మార్చి 4న యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 17న తోసిపుచ్చింది.
రాజకీయంగా బలోపేతమైన జాట్లను వెనుకబడిన తరగతులుగా గుర్తించడం, వారికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము అంగీకరించబోమని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పును వెలువరించింది. ‘‘రిజర్వేషన్లకు కులం ఒక్కటే ఆధారం కాదు. ఈ విషయంలో సమకాలీన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు మార్చి 4న కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జాట్లకు ఓబీసీ రిజర్వేషన్లు అమలవుతాయని అందులో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఓబీసీ రిజర్వేషన్ రక్షా సమితితోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు.. యూపీఏ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. యూపీఏ నిర్ణయాన్ని సమర్థించింది. జాట్లకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం రాజకీయ అవసరాల కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసమేనని పేర్కొంది.
రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధాన సమీక్షతో సంబంధం లేకుండా మార్చి 4న రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో ఇది 7.75 నుంచి 7.5 శాతానికి తగ్గింది. రెపో రేటుతో ముడిపడిన రివర్‌స రెపో రేటు కూడా 6.5 శాతానికి తగ్గింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని యథాతథంగా 4 శాతం వద్ద కొనసాగించింది. రెపో రేటు తగ్గడం వల్ల గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల చెల్లింపు (ఈఎంఐ) తగ్గనుంది.
నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్
అమెరికా కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ మార్చి 3న విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల జాబితా ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్‌ట - 2015’లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 138వ స్థానంలో ఉంది. 440 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించి 230 నగరాలకు ర్యాంకులు కేటాయించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో, జూరిచ్ (స్విట్జర్లాండ్) రెండో స్థానంలో, ఆక్లాండ్ (న్యూజిలాండ్) మూడో స్థానంలో ఉన్నాయి. పుణే 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్‌కతా 160 స్థానాల్లో నిలిచాయి.
1200 దాటిన స్వైన్ ఫ్లూ మరణాలు
దేశంలో 2015 మార్చి 4 నాటికి స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 1239కి చేరుకుంది. వ్యాధి సోకిన వారి సంఖ్య 23,153కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా గుజరాత్‌లో 300, రాజస్థాన్‌లో 295, మహారాష్ట్రలో 178, మధ్యప్రదేశ్‌లో 174 మంది మరణించారు. తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు.
ముస్లిం కోటాను రద్దు చేసిన మహారాష్ట్ర
ముస్లింలకు విద్యా సంస్థల్లో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 5న రద్దు చేసింది. ఇప్పటికే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందిన వారికి అవి వర్తిస్తాయని పేర్కొంది. 2014 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికలకు ముందు అప్పటి ఎన్‌సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కోర్టు మరాఠా రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసి, ముస్లింలకు విద్యా సంస్థల్లో అనుమతినిచ్చింది.
జూన్ 1 నుంచి ‘అటల్ పింఛన్ యోజన’
పింఛన్‌దారుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన పథకాన్ని జూన్ 1 నుంచి ప్రారంభించనుంది. గత యూపీఏ హయాంలో స్వావలంభన్ యోజనగా ఉన్న ఈ పథకం పేరును ఎన్‌డీఏ ప్రభుత్వం అటల్ యోజనగా మార్చింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కార్మికులు దీనికి అర్హులు. 60 ఏళ్లు దాటిన తరువాత నెలకు రూ.1000 నుంచి 5000 వరకు పింఛన్ లభిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన
ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 10న ఢిల్లీ నుంచి బయల్దేరి సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. మారిషస్, శ్రీలంకల్లో కూడా ప్రధాని పర్యటించనున్నారు. గత 33 ఏళ్లలో సీషెల్స్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే. సీషెల్స్ నుంచి ప్రధాని మారిషస్ వెళతారు. మార్చి 12 అక్కడ జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ దేశ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌తో చర్చలు జరుపుతారు. 13, 14 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. శ్రీలంకలో తమిళులు అధికంగా నివసించే జాఫ్నాను ప్రధాని సందర్శించనుండడం విశేషం. భారత జాలర్ల భద్రత అంశాన్ని ఆయన శ్రీలంకతో ప్రధానంగా చర్చించనున్నారు. ఎల్టీటీఈ, శ్రీలంక ప్రభుత్వాలమధ్య జరిగిన అంతర్యుద్ధంలో నిరాశ్రయులైన జాఫ్నాలోని తమిళులకు భారత్ సహాయంతో నిర్మించిన ఇళ్లను ప్రధాని అందజేస్తారు. జాఫ్నాను సందర్శించిన మొదటి ప్రధాని మోదీనే కానున్నారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రూపాయి నోటు
సుమారు 20 ఏళ్ల విరామం తర్వాత సరికొత్త హంగులతో ఒక్క రూపాయి నోటు ముద్రణ మళ్లీ మొదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఇది తాజాగా విడుదలైంది. రాజస్థాన్‌లో నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో మహర్షి ఈ నోటును విడుదల చేశారు. మిగతా కరెన్సీ నోట్లతో పోలిస్తే ఈ రూపాయి నోటుకో ప్రత్యేకత ఉంటుంది. మిగతావన్నీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ఉంటే.. ఈ రూపాయి నోటుపై మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది.
ప్రత్యేకతలు ఇవీ...
కొత్త రూపాయి నోటు 110 మైక్రాన్ల మందంతో ఉంటుంది. వాటర్‌మార్కుగా అశోక స్తంభం చిహ్నం (సత్యమేవ జయతే పదాలు లేకుండా) ఉంటుంది. నోటు మధ్యలో ఒక అంకె, కుడివైపున ఒక పక్కగా భారత్ (హిందీలో) అనే పదం దాగి ఉంటాయి. నోటు ముందు భాగంలో ఆర్థిక శాఖ కార్యదర్శి మహర్షి సంతకం రెండు భాషల్లో ముద్రించి ఉంటుంది. ముద్రణా వ్యయం పెరిగిపోవడం వల్ల 1994లో ఒక్క రూపాయి నోటు ముద్రణ నిలిచిపోయింది. 1995లో రూ.2, రూ.5 నోట్ల ముద్రణను కూడా నిలిపివేశారు. అప్పట్నుంచి ఈ కరెన్సీ విలువలకు సంబంధించి నాణేలను మాత్రమే ముద్రిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ సమన్వయకర్తలుగా నడ్డా, హన్స్‌రాజ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత అంశాలను సమన్వయం చేసుకోవడానికి ఏడుగురు మంత్రులకు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా (ఆంధ్రప్రదేశ్), హన్స్‌రాజ్ అహిర్ (తెలంగాణ), నిర్మలా సీతారామన్ (పశ్చిమ బెంగాల్), పీయూష్ గోయల్ (తమిళనాడు, పుదుచ్ఛేరి), రాజీవ్ ప్రతాప్ రూడీ (కేరళ), ధర్మేంద్ర ప్రధాన్ (అస్సాం), మహేశ్ శర్మ (ఒడిశా)లను పార్టీ సమన్వయకర్తలు (కో-ఆర్డినేటర్స్)గా నియమించారు.
భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
భూసేకరణ బిల్లుకు లోక్‌సభ మార్చి 10న ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య మూజువాణి ఓటుతో ‘సముచిత పరిహారం, పారదర్శకతలతో భూసేకరణ, పునరావాస(సవరణ) బిల్లు-2015’ దిగువ సభ ఆమోదం పొందింది. బిల్లులో 9 అధికారిక సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణల్లో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, బహుళ పంటలు పండే భూముల సేకరణపై నిషేధం.. తదితర రైతు అనుకూల అంశాలను పరిగణనలోనికి తీసుకోలేదు.
బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌కు సమన్లు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 11న ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఒడిశాలోని తలబిర-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించడం ద్వారా కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి భారీ స్థాయిలో అనుచిత లబ్ధి చేకూరేలా మన్మోహన్ వ్యవహరించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మాజీ ప్రధానిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 120బీ(నేరపూరిత కుట్ర), 409(నేరపూరిత విశ్వాస ఘాతుకం) సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద శిక్షకు అవకాశమున్న నేరారోపణలు నమోదు చేశారు. ఇవి రుజువైతే పదేళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్‌కు యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశముంది. ఒక క్రిమినల్ కేసులో కోర్టు సమన్లు అందుకున్న రెండో ప్రధానిగా మన్మోహన్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు.
మోటార్ వెహికల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
మోటార్ వెహికల్ సవరణ బిల్లు 2015కు మార్చి 11న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా ఈ-రిక్షాలు, ఈ-బండ్లను మోటారు వెహికల్ చట్టం పరిధిలోకి తీసుకురావడమే ప్రధానోద్దేశం. ఈ బిల్లు గతవారం లోక్‌సభ ఆమోదం పొందింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాల స్థానంలో ఈ-రిక్షాలు ప్రవేశపెట్టాలన్న బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
భారతీయ రైల్వేలో ఎల్‌ఐసీ భారీ పెట్టుబడులు
భారతీయ రైల్వేలకు నిధుల పంట పండనుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటిదాకా రైల్వేల చరిత్రలో ఇదే అత్యంత భారీ పెట్టుబడి. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుల సమక్షంలో ఇరు సంస్థలూ ఈ పెట్టుబడి నిధులకు సంబంధించి మార్చి 11న ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. భారతీయ రైల్వేలకు చెందిన ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) తదితర సంస్థలు జారీచేసే బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్‌ఐసీ ఈ ప్రతిపాదిత పెట్టుబడి నిధులను వెచ్చిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడులపై రైల్వే శాఖ ఐదేళ్లపాటు వడ్డీ, రుణాలు తిరిగి చెల్లింపులు జరపకుండా మారటోరియం కూడా అమలు కానుంది.
జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం
జమ్ము-కశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ (79) జమ్మూలో మార్చి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా భాజపా నాయకుడు నిర్మల్‌సింగ్ నియమితులయ్యారు. భాజపా తొలిసారి అధికారంలో భాగస్వామిగా చేరింది. పీడీపీ, భాజపా, పీపుల్స్ కాన్ఫరెన్‌స సంకీర్ణ ప్రభుత్వం జమ్ము-కశ్మీర్‌లో ఏర్పడింది. మంత్రి వర్గంలో పీడీపీ నుంచి 12 మంది, భాజపా నుంచి 12 మంది, పీపుల్స్ కాన్ఫరెన్‌స నుంచి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పీడీపీ అధికారం పంచుకున్నప్పుడు ముఫ్తీ మహ్మద్ 2002-05 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. శాసనసభ ఎన్నికల ఫలితాలను 2014 డిసెంబర్ 23న ప్రకటించారు. మొత్తం 87 స్థానాలకుగాను పీడీపీ-28, భాజపా-25, జేకేఎన్‌సీ-15, కాంగ్రెస్-12, ఇతరులు-7 స్థానాల్లో విజయం సాధించారు.
‘మిషన్ ఇంద్రధనుష్’ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు సరిగా అందడం లేదన్న ‘డీఎల్‌హెచ్‌ఎస్’ సర్వే నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ వివిధ వ్యాధులకు సంబంధించిన టీకాలు వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మిషన్ ఇంద్రధనుష్’ పేరిట ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టి... మార్చి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని తొలిదశలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్నారు. ఏపీలో తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో.. తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అమలుచేస్తారు.
మార్చి 3 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ పోర్టబిలిటీ
దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) మార్చి 3 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 2009 నాటి ఎంఎన్‌పీ నిబంధనలను సవరించింది. ఈ చట్టానికి చేసిన ఆరో సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా మార్చి 3 నుంచి ఎంఎన్‌పీ అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ పేర్కొంది. వినియోగదారుడు తన ఫోన్ నంబర్‌ను మార్చుకోకుండానే టెలికం సర్వీసులందజేసే ఆపరేటర్‌ను మార్చుకోవడానిన ఎంఎన్‌పీగా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ ఈ ఎంఎన్‌పీ ఒక టెలికం సర్కిల్(సాధారణంగా ఒక రాష్ట్రానికి)కు మాత్రమే పరిమితమై ఉంది. ఇక మార్చి 3 నుంచి ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉన్న వినియోగదారుడు ఢిల్లీకి మారితే, అక్కడ ఆ యూజర్ ఎంఎన్‌పీని పొందొచ్చు.
అతి పెద్ద ‘పచ్చని’ మహానగరంగా ఢిల్లీ
దేశంలోని మహానగరాల్లో ఎక్కువగా పచ్చదనం ఉన్న నగరంగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ముంబై రెండో స్థానంలో ఉండగా చెన్నై చిట్టచివ రలో ఉంది. కోల్‌కత్తాకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ మేరకు జాతీయ అటవీ నివేదిక 2013 ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం లిఖిత పూర్వకంగా రాజ్యసభకు తెలిపారు. ఢిల్లీలో 180 చ.కిమీ, ముంబైలో 86.57 చ.కిమీ, చెన్నైలో 24 చ.కి మీల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో 88.4 చ.కిమీ, బెంగళూరులో 97 చ.కిమీ, జైపూర్‌లో 74.47 చ.కిమీ, చంఢీఘడ్‌లో 34.4 చ.కిమీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం భూమిలో అడవులు 23 శాతం ఉన్నాయని మంత్రి తెలిపారు. మహానగరాల్లో అడవులశాతం తరుగుదలకు సంబంధించిన సమాచారం అందలేదని జవదేకర్ తెలిపారు. అడవుల సమాచారాన్ని 1987 నుంచి డెహ్రడూన్‌లో ఉన్న భారత అటవీ సర్వే అంచనా వేస్తోంది.
AIMS DARE TO SUCCESS
ఏప్రిల్ 2015 జాతీయం
ఆక్రమణ్-2 పేరుతో సైనిక విన్యాసాలు
భారత సైన్యం ఆక్రమణ్-2 పేరుతో రాజస్థాన్‌లో ఏప్రిల్ 26న భారీ విన్యాసాలు నిర్వహించింది. ఎడారి ప్రాంతంలో కొత్త రకానికి చెందిన ఆయుధ సంపత్తిని, వేదికలను పరీక్షించింది. 300 పైగా యుద్ధ విమానాలు, ప్రధాన యుద్ధ ట్యాంకులు, అధిక పరిధి గల తుపాకులు, 10,000 దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ఐయూసీఎన్ రెడ్‌లిస్ట్‌లో భారత జంతు జాతులు
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ 2014 సంవత్సరానికి ప్రచురించిన అంతరించిపోతున్న జంతు జాతుల రెడ్ లిస్ట్‌లో భారత్‌కు చెందిన 15 జాతు లు కొత్తగా చేరాయి. ఆ జాబితాలో అంతరించిపోతున్న, అంతరించే ప్రమాదమున్న మొత్తం 988 రకాల పశు పక్ష్యాదులు భారత్‌కు చెందినవి ఉన్నాయి. 2013లో ఈ సంఖ్య 973. 2008లో వీటి సంఖ్య 659. గత ఏడు సంవత్సరాల్లో భారత్‌లో అంతరించిపోతున్న జంతు జాతుల సంఖ్య 50 శాతం పెరిగిందని ఐయూసీఎన్ తెలిపింది.
జువెనైల్ చట్టానికి సవరణలు
జువెనైల్ చట్టానికి సవరణల ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపింది. ఈ సవరణల ప్రకారం హత్య, మానభంగం వంటి హేయమైన నేరాలకు పాల్పడిన 16-18 సంవత్సరాల పిల్లలను జువెనైల్ చట్టం కింద కాకుండా భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద విచారించి శిక్షిస్తారు. 2012 ఢిల్లీ నిర్భయ కేసులో కోర్టు నలుగురికి శిక్ష విధించింది. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన బాలుడికి కూడా మరణశిక్ష విధించాలని, ఇందుకు చట్టాన్ని సవరించాలని డిమాండ్లు రావడంతో ప్రభుత్వం ఈ చట్ట సవరణను తీసుకొచ్చింది.
లింగ మార్పిడి హక్కుల రక్షణకు ప్రైవేటు బిల్లు
లింగ మార్పిడి హక్కుల రక్షణకు సంబంధించిన ప్రైవేటు బిల్లు ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్-2014ను రాజ్యసభ ఏప్రిల్ 24న ఆమోదించింది. డీఎంకే ఎంపీ తిరూచి శివ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి కాకుండా ఇతర సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేటు బిల్లు అంటారు. ఈ బిల్లు ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు, ఆర్థిక సహాయం, సామాజిక సమ్మిళితం పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. ఈ సామాజిక వర్గం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సంక్షేమ బోర్డులను, ట్రాన్స్ జెండర్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. పెన్షన్, నిరుద్యోగ భృతికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
ఉద్యోగాలకు ఆకర్షణీయ కంపెనీగా గూగుల్
దేశీయంగా ఉద్యోగాలకు ఆకర్షణీయమైన సంస్థగా ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని సోనీ దక్కించుకుంది. వివిధ విభాగాల కంపెనీలపై మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ 2015 సంవత్సరానికి గాను నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. రంగాలవారీగా చూసినప్పుడు తయారీకి సంబంధించి టాటా స్టీల్, ఎఫ్‌ఎంసీజీ విభాగంలో పీఅండ్‌జీ, ఆటోమొబైల్ విభాగంలో హోండా ఇండియా అగ్రస్థానంలో నిల్చాయి. వీటితో పాటు ఉద్యోగాలకు ఆకర్షణీయమైన కంపెనీల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్, హ్యులెట్ ప్యాకార్డ్, హెచ్‌పీసీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ తదితర సంస్థలు ఉన్నాయి. భారత ఎకానమీతో పాటు ఉద్యోగాల మార్కెట్ క్రమంగా పుంజుకుంటోందని రాండ్‌స్టాడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి తెలిపారు. కంపెనీ ఆకర్షణీయంగా నిలవడానికి జీతభత్యాలు, ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలు (54%) , ఉద్యోగ భద్రత (49%) మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో సుమారు 8,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
జాతీయ న్యాయ కమిషన్ అమలు
జాతీయ న్యాయ నియామకాల కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్-ఎన్‌జేఏసీ)ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్‌జేఏసీకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణ చట్టాన్ని (99వ రాజ్యాంగ సవరణ) కూడా అమల్లోకి తెచ్చింది. న్యాయమూర్తులను నియమించేందుకు 1993లో ఏర్పడిన కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీ పనిచేస్తుంది. ఈ కమిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలను చేపడుతుంది.
వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరి-1 ర్యాంకు
భారత వైమానికరంగం భద్రత విషయంలో కేటగిరి-1 ర్యాంకుకు చేరుకున్నట్లు అమెరికాకు చెందిన విమానయాన పర్యవేక్షణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. దీంతో దేశీయ వియానయాన సంస్థలు తమ సేవలను విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విఫలం కావడంతో 14 నెలల క్రితం భారత్ ర్యాంకును కేటగిరి-2 కి తగ్గించారు.
‘ఆర్టికల్ 66 రద్దు’పై హోంశాఖ కమిటీ
ఐటీ(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టంలోని ఆర్టికల్ 66ఏను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో తలెత్తనున్న భద్రతపరమైన సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ(అంతర్గత భద్రత) ప్రత్యేక కార్యదర్శి అశోక్ ప్రసాద్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. వైబ్‌సైట్లలో నేరపూరిత అంశాలను పోస్ట్ చేసేవారిని అరెస్టు చేసేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 66ను కోర్టు మార్చి 24న రద్దు చే సింది.
న్యాయ నియామకాల కమిషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్
వివాదాస్పద ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్- ఎన్‌జేఏసీ)’ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో మోదీ సర్కారు తీసుకువచ్చిన ఎన్‌జేఏసీని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. ఎన్‌జేఏసీకి ఏప్రిల్ 13 నుంచి రాజ్యాంగబద్ధత కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్టం(99వ సవరణ చట్టం)తో పాటు ఎన్‌జేఏసీ చట్టాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1993 నుంచి అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దు అయినట్లే. అయితే, అదేసమయంలో కొలీజియంకు ప్రత్యామ్నాయంగా ఎన్‌జేఏసీ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి సమయం పడుతుంది.
ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఉంటారు. ఇద్దరు అత్యంత సీనియర్లైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉన్న కమిటీ ఆ ఇద్దరు ప్రముఖులను నామినేట్ చేస్తుంది. ఆ ప్రముఖుల్లో ఒకరు కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాల్లో ఏదైనా ఒక వర్గానికి చెంది ఉండాలని చట్టంలో పొందుపర్చారు. వారు మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. వారిని తిరిగి నామినేట్ చేయొచ్చు.
జాతీయ వాయు నాణ్యత సూచీ ప్రారంభం
జాతీయ వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని ఢిల్లీలో రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖా మంత్రుల సమావేశంలో ఏప్రిల్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి దశలో ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి, ఫరీదాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో వాయు నాణ్యతను ఈ సూచీ ద్వారా పరిశీలిస్తారు. తర్వాతి దశలో 20 రాష్ట్రాల రాజధానులతో పాటు 45 నగరాల్లో ఈ సూచీని ప్రారంభిస్తారు. ఈ సూచీలో ఎరుపురంగు ప్రమాదకర స్థాయిని, ఆకుపచ్చ రంగు ఆరోగ్యకర వాయు నాణ్యతను సూచిస్తాయి. భారత్‌లో ప్రధాన నగరాల్లో క్షీణిస్తున్న వాయు నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏక్యూఐని ప్రారంభించింది.
సార్క్ దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం
సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) దేశాల ఆరోగ్య మంత్రుల ఐదో సమావేశం ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో విడుదల చేసిన ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సుకు అనుగుణంగా పొగాకు ఉత్పత్తులపై కనీసం 50 శాతం ఉండేటట్లు చిత్ర రూపంలో హెచ్చరికలు ముద్రించాలన్న దానికి కట్టుబడి ఉన్నట్లు సార్క్ దేశాలు స్పష్టం చేశాయి.
2022 నాటికి 109.7 మిలియన్ ఉద్యోగాలు
భారత్‌లో 2022 నాటికి 109.7 మిలియన్ ఉద్యోగాలు సృష్టించగలమని కేంద్ర నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమల వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 9న తెలిపింది. రంగాల వారీగా మానవ వనరులు, నైపుణ్యం అవసరాలను లెక్కించి తాజా అంచనాలు, అధ్యయనాలను నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించింది. గతంలో 2022 నాటికి 500 మిలియన్ ఉద్యోగాలు కల్పించవచ్చని అంచనావేశారు.
101వ స్థానంలో భారత్
ఏప్రిల్ 9న విడుదల చేసిన సామాజిక ప్రగతి సూచీ (ఎస్‌పీఐ)-2015లో 133 దేశాల జాబితాలో భారత్‌కు 101వ స్థానం దక్కింది. నార్వే మొదటి స్థానంలో ఉండగా, రెండు, మూడు స్థానాల్లో వరుసగా స్వీడన్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యం వ్యక్తిగత భద్రత, అవకాశాల అందుబాటు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను లెక్కలోకి తీసుకొని ఈ సూచీని రూపొందించారు. మన పొరుగు దేశాలైన శ్రీలంక (88), నేపాల్ (98), బంగ్లాదేశ్ (100)లు భారత్ కంటే ముందున్నాయి. అమెరికాకు చెందిన సోషియల్ ప్రోగ్రెస్ ఇంపెరేటివ్ అనే లాభాపేక్ష లేని సంస్థ ఈ సూచీని రూపొందిస్తుంది.
గవర్నర్ల పర్యటనలపై కేంద్రం ఆంక్షలు
గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు ఏడాదికి కనీసం 292 రోజులు ఉండాలని నిర్దేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రేతర పర్యటనలకు వెళ్లాల్సి వస్తే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఇష్టారీతిన రాష్ట్రం విడిచి వెళుతున్నారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ల రాష్ట్రేతర పర్యటనలకు సంబంధించి 18 నిబంధనలను కేంద్ర హోంశాఖ రూపొందించింది. దేశ, విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే వారం నుంచి ఆరువారాల ముందు రాష్ట్రపతి భవన్‌కు సమాచారమివ్వాలని, చివరి క్షణంలో పర్యటన ఖరారు అయిన ఎడల ఎందుకు అత్యవసరంగా వెళ్లాల్సి వస్తోందో హేతుబద్ధమైన కారణాలను గవర్నర్ తెలపాల్సి ఉంటుందనే నిబంధన విధించింది. గవర్నర్లు కేలండర్ ఇయర్‌లో 20 శాతానికి మించిన రోజులు రాష్ట్రానికి వెలుపల గడపవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రాజకీయ స్పష్టతను కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొంది.
ఉగ్రవాద నిరోధక బిల్లుకు ఆమోదం
వివాదాస్పద గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లును గుజరాత్ శాసనసభ మార్చి 31న ఆమోదించింది. వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం అవసరమని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం బాగా పెరిగిపోవడంతో ఫోన్ సంభాషణలు కీలకమైన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయని తెలిపింది.
సీఎంలు, సీజేల జాతీయ సదస్సు
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్గత స్వీయ మదింపు చర్యను ఏర్పాటు చేసుకోవాలని న్యాయమూర్తులను మోదీ కోరారు. వందకు పైగా ట్రైబ్యునళ్లకు అధిక నిధులు వ్యయమవుతున్నాయని, వాటి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు లో న్యాయవాద పదకోశాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
భూ సేకరణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం
కేంద్రం తాజాగా రూపొందించిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. కేంద్ర కేబినెట్ మార్చి 31న సిఫార్సు చేసిన ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఏప్రిల్ 3న సంతకం చేశారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం జారీ చేసిన 11వ ఆర్డినెన్స్. లోక్‌సభలో ఆమోదం పొందిన భూసేకరణ బిల్లులోని 9 సవరణలను చేరుస్తూ ప్రభుత్వం దీన్ని తాజాగా జారీ చేసింది. గతంలో విడుదల చేసిన భూసేకరణ ఆర్డినెన్స్ రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఎన్డీయే ప్రభుత్వానికి ఎగువసభలో తగిన మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ఆర్డినెన్స్ ఏప్రిల్ 4న రద్దు కావాల్సి ఉండగా.. ప్రభుత్వం మరో తాజా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
వాయు నాణ్యతకు సూచిక.. పదినగరాల్లో ఏర్పాటు
ఢిల్లీలో ఏప్రిల్ 6న జాతీయ పర్యావరణ మంత్రుల, ఉన్నతాధికారుల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసందర్భంగా ‘జాతీయ వాయు నాణ్యత సూచిక’ను ప్రారంభించారు.
పర్యావరణ హితం కోసం పెద్ద స్థాయిలో అణుశక్తిని వినియోగంలోకి తేవాలనే భారత్ ప్రయత్నాలను అగ్ర రాజ్యాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నాయని, ప్రపంచంలోని రాజధాని నగరాలన్నింటిలో న్యూఢిల్లీ అత్యంత కలుషితమైన నగరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఆరోగ్యంపై వాయు కాలుష్యంపై ప్రభావం పట్ల ప్రజలలో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం వాయు నాణ్యత సూచికను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై, ఆహ్మదాబాద్, ఆగ్రా, లక్నో, కాన్పూర్, వారణాసి నగరాల్లో ఉన్న వాయు నాణ్యతను ఈ సూచిక ప్రకటిస్తుంది. ఇందుకోసం ఈ నగరాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను చూపించే బోర్టులతో పాటు మానిటరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలిలో కాలుష్య స్థాయిని అంకెల్లోకి మార్చి కాలుష్య తీవ్రత గురించి ప్రజలను హెచ్చరిస్తుంది. వాయు నాణ్యత ఏవిధంగా ఉండేది తెలుపుతుంది. దీని సహాయంతో వాయు కాలుష్య స్థాయిని గూర్చి ప్రజలకు మీడియా ద్వారా హెచ్చరికలు అందించవచ్చు. వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉన్నట్లయితే కాలుష్య ఎమర్జెన్సీని ప్రకటించే పద్ధతిని పారిస్, బీజింగ్ నగరాల్లో పాటిస్తున్నారు. అంటే వాయు నాణ్యత తీవ్ర కాలుష్య స్థాయి నుంచి మెరుగైన స్థాయిని చేరుకునేంతవరకు అత్యవసర స్థితిని అమల్లో ఉంచి నగరంలోని పరిశ్రమలన్నింటినీ మూసివేస్తారు.
AIMS DARE TO SUCCESS
మే 2015 జాతీయం
నలంద చాన్సలర్‌గా సింగపూర్ మాజీ మంత్రి
నలంద విశ్వవిద్యాలయ చాన్సలర్‌గా సింగపూర్ మాజీ మంత్రి జార్జ్ యో (60)ను కేంద్రం మే 30న ప్రకటించింది. చాన్సలర్‌గా ఉన్న ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ రెండోసారి చాన్సలర్‌గా కొనసాగేందుకు నిరాకరించడంతో కొత్త నియామకం జరిగింది. యో బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు 2012లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. నలంద విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కోసం 2013లో భారత్, ఆస్ట్రేలియా, కాంబోడియా, సింగపూర్, బ్రూనై, న్యూజిలాండ్, మయన్మార్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
స్వయం ఉపాధిదారుల సంఖ్య తగ్గుదల
2015లో దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఉపాధి, నిరుద్యోగం పేరిట 68వ రౌండ్ సర్వేను నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2011 జూలై నుంచి 2012 జూన్ వరకు నిర్వహించింది. మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 2004-05, 2011-12 మధ్యకాలంలో నగరాలు, పట్టణాల్లో తగ్గుతున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ మే 24న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఈ తగ్గుదల చిన్న పట్టణాల్లో (50,000 కంటే తక్కువ జనాభా ఉన్న క్లాస్-3) ఎక్కువ ఉంది. 2004-05లో 54.47 శాతంగా ఉండగా ఇది 2011-12 నాటికి 50.5 శాతానికి తగ్గింది. మొత్తం క్లాస్-1 నగరాల్లో స్వయం ఉపాధి పొందేవారి శాతం వారణాసిలో అత్యధికంగా (82.2 శాతం) ఉండగా, నాగపూర్‌లో అతి తక్కువగా (23.9 శాతం) ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత
 తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మే 23న ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతోపాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగళూరు హైకోర్టు మే 11న ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఆమెకిది ఐదోసారి. ఇందులో మూడుసార్లు ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణస్వీకారం చేయగా, ఆస్తుల కేసులో నిర్దోషిగా తేలి మరో రెండుసార్లు ప్రమాణస్వీకారం చేశారు. 2011 మే ఎన్నికల్లో విజయం సాధించి ఆమె అధికారంలోకి వచ్చారు. తొలిసారి 1991లో, తర్వాత 2001లో ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరులో సీబీఐ ప్రత్యేక కోర్టు 2014, సెప్టెంబర్ 27న నాలుగేళ్ల శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
స్నాప్‌డీల్, పేపాల్‌తో ఎస్‌బీఐ ఒప్పందం
చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) తోడ్పాటు కోసం ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేపాల్‌తో ఎస్‌బీఐ మే 21న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం సదరు సైట్ ద్వారా లావాదేవీలు జరిపే విక్రేతలు లేదా తయారీ సంస్థలకు ఎస్‌బీఐ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు వడ్డీ రేటుపై మరో 0.25% తగ్గింపు ఉంటుంది. రూ. కోటి వరకు రుణాలకు తనఖా అవసరం ఉండదు.
బాల కార్మిక చట్టానికి సవరణలు
బాల కార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రి వర్గం మే 13న ఆమోదం తెలిపింది. ఈ సవరణల వల్ల ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, వృత్తుల్లో 14 ఏళ్లలోపు పిల్లలు పనిచేసేందుకు అనుమతి లభించింది. వినోద పరిశ్రమలు, క్రీడా కార్యక్రమాల్లోనూ పిల్లలతో పనిచేయించుకోడానికి వీలుంటుంది. వ్యవసాయం, హస్తకళలు వంటి కుటుంబ వృత్తుల్లో పిల్లలు పనిచేయడం వల్ల మెళకువలు నేర్చుకోవడం, తల్లిదండ్రులకు సహకరించడం, సామాజిక నిర్మాణం వంటి పరిస్థితుల వల్ల పిల్లలు పనిచేసేందుకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. బాలకార్మికులను ప్రోత్సహించేవారికి జైలుశిక్షను మూడేళ్లకు, జరిమానాను రూ. 50 వేలకు పెంచారు.
నల్లధనం అరికట్టే బిల్లుకు పార్లమెంటు ఆమోదం
విదేశాల్లో దాచిన నల్లధనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ మే 11న, రాజ్యసభ మే 13న ఆమోదించాయి. దీంతో నల్లధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధింపు బిల్లు -2015కు పార్లమెంటు ఆమోదం లభించింది. బిల్లు అమల్లోకి వస్తే 120 శాతం పన్ను, జరిమానాతో పాటుపదేళ్ల జైలు శిక్ష పడుతుంది. విదేశాల్లో దాచిన నల్లధనానికి సమానంగా భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది.
మానవ వనరుల వినియోగంలో భారత్‌కు వందో స్థానం
ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన మానవ వనరుల వినియోగ సూచీ (హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్)లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మే 14న విడుదల చేసిన సూచీలో బ్రిక్స్ (రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) దేశాలు, పొరుగు దేశాలు శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ తక్కువ స్థానంలో నిలిచింది. ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలవగా నార్వే, స్విట్జర్లాండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. విద్యను ఆర్జించడంలో భారత్ పరిస్థితి మెరుగుపడినప్పటికీ యువతలో అక్షరాస్యత 90 శాతంగా ఉంది. ఇది పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే తక్కువని నివేదిక పేర్కొంది. అధిక అసంఘటిత రంగం వల్ల శ్రామిక భాగస్వామ్యంలో భారత్ ర్యాంకు తక్కువని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. కాలిఫోర్నియాలో మే 12న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో గూగుల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ క్యాంపస్ అమెరికా వెలుపల గూగుల్ క్యాంపస్‌లలో అతిపెద్దది కానుంది. ఇది ఆసియాలో గూగుల్‌కు తొలి క్యాంపస్. 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1000 కోట్లతో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తారు. 13 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. 2016లో దీని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు.
టెలికం లెసైన్సుల పొడిగింపునకు సుప్రీం నో
దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలోని తమ లెసైన్సుల గడువును పొడిగించాలంటూ వివిధ టెలికం సర్వీస్ ప్రొవైడర్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు మే 14న డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్లలో విచారణార్హత లేదని జస్టిస్ చలమేశ్వర్ సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. త్వరలో కాలపరిమితి ముగియనున్న తమ లెసైన్సులను పొడిగించాలంటూ భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ తదితర కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
నీతి ఆయోగ్ వెబ్‌సైట్ ప్రారంభం
ప్రణాళికా సంఘం స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత జాతీయ పరివర్తన సంస్థ(నీతి ఆయోగ్)కు సంబంధించిన వెబ్‌సైట్ www.niti.gov.inబీటా వర్షన్ మే 18న ప్రారంభించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా దీన్ని ప్రారంచారు.పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ చేపట్టే కార్యక్రమాలు, ప్రస్తుతం చేస్తున్న పనులు, అధికారుల అభిప్రాయాలు తదితర వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
జయలలిత నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు తీర్పు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు మెడకు చుట్టుకోవడంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఏఐఏడీఎంకే అధినేత జయలలితకు అతిపెద్ద ఊరట లభించింది. రూ.66.65 కోట్ల అక్రమాస్తుల కేసు నుంచి కర్ణాటక హైకోర్టు మే11న ఆమెకు విముక్తి కలిగించింది. జయలలితపై ఉన్న అన్ని కేసులను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్.కుమారస్వామి తీర్పు వెలువరించారు. దీంతో ఆమె మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైంది. కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురు శశికళ, సుధాకరన్, ఇళవరసిలను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
గతేడాది సెప్టెంబర్ 27న సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించింది. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవిని కోల్పోయారు. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడినవారు ఎవరైనా తమ పదవిని కోల్పోతారు. దీనిప్రకారం జయలలిత ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తనకు శిక్ష విధించడంతో జయ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను వేగవంతం చేయాలని కోరారు.
మూడు సామాజిక భద్రత పథకాలు ప్రారంభం
కోల్‌కతాలో మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు సామాజిక భద్రత పథకాలను ప్రారంభించారు. ఇందులో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), అటల్ పించన్ యోజన(ఏపీవై)లు ఉన్నాయి. ఈ పథకాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పీఎంఎస్‌బీవై: ఇది వ్యక్తిగత బీమా పథకం. 18-70 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా, శాశ్వతంగా వికలాంగులైనా రూ.రెండు లక్షల పరిహారం లభిస్తుంది. బ్యాంకు ఖాతా నుంచి సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ప్రతి సంవత్సరం రెన్యూవల్ కోవాల్సి ఉంటుంది. పీఎంజేజేబీవై: ఇది జీవిత బీమా పథకం. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల వయసు వారికి వర్తిస్తుంది. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ద్వారా ఈ పథకంలో చేరాలి. వార్షిక ప్రీమియం రూ.330. బీమాదారుడు మరణిస్తే ఈ పాలసీ నుంచి రూ.2 లక్షలు అందుతుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఏపీవై: అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన పించన్ పథకం. బ్యాంకు ఖాతా ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 20 సంవత్సరాల పాటు పథకంలో కొనసాగాలి. 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.1000 పించన్ పొందాలంటే ప్రతి నెల రూ.42, నెలకు రూ.5,000 పొందాలంటే రూ.210 చెల్లించాలి.
భూ సరిహద్దు ఒప్పంద బిల్లుకు ఆమోదం
బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం బిల్లుకు రాజ్యసభ మే 6న ఆమోదం తెలిపింది. లోక్‌సభ మే 7న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ (119) బిల్లు-2013 భారత బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందం-1974 అమల్లోకి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఇది పార్లమెంట్ ఆమోదం పొందిన 100వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అసోంలోని కొన్ని భూభాగాలను బంగ్లాదేశ్‌కు ఇచ్చి కొన్నింటిని ఆ దేశం నుంచి భారత్ పొందుతుంది. భూ సరిహద్దులను ఖరారు చేసుకోవడం వల్ల అక్రమ వలసలను నిరోధించవచ్చని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
బాలనేరస్థుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
హేయమైన నేరాలకు పాల్పడే 16-18 వయసు వారిని జువెనైల్ చట్టం కింద కాకుండా భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద విచారించి శిక్షించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ మే 7న ఆమోదం తెలిపింది. హత్య, మానభంగం వంటి నేరాలు హేయమైన/క్రూర నేరాల కిందికి వస్తాయి. కొత్త చట్టం ప్రకారం బాల నేరస్థులకు జీవిత ఖైదు, మరణశిక్ష విధించరు. బాలనేరస్థుడికి ఎలాంటి శిక్ష విధించినప్పటికీ 21 ఏళ్లు నిండేవరకు బాల నేరస్థుల కేంద్రంలో ఉంచుతారు. 21 ఏళ్ల తర్వాత ప్రవర్తనను అంచనా వేసి పరివర్తన ఉందని భావిస్తే శిక్షలో మార్పు చేస్తారు. లేకుంటే శిక్షను కొనసాగిస్తారు.
‘నల్లధనం’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
విదేశాల్లో దాచిన నల్లధనానికి సంబంధించి కఠిన చర్యలతో కూడిన బిల్లును బుధవారం పార్లమెంటు ఆమోదించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు దాచిన వారు.. వాటిని వెల్లడించేందుకు గల గడువును వినియోగించుకోవాలని సూచించింది. లేదంటే ప్రపంచ ఆటోమేటిక్ సమాచార మార్పిడి వ్యవస్థ 2017లో అమలులోకి వస్తుందని.. ఆ తర్వాత ఇటువంటి వారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. మే 11న లోక్‌సభ ఆమోదం పొందిన ‘నల్ల ధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు) మరియు పన్ను విధింపు బిల్లు - 2015’ను మే 13న రాజ్యసభ కూడా ఆమోదించింది. అలాగే.. విజిల్‌బ్లోయర్స్ ప్రొటెక్షన్ (సవరణ) బిల్లు - 2015 (సామాజిక సమాచార ఉద్యమకారుల పరిరక్షణ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించింది.
వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో రూపొందించే వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ 2015 ఏప్రిల్ 29న ఆమోదం తెలిపింది. అలాగే అటల్ పట్టణ రూపాంతరణ, పునర్నవీకరణ పథకం (ఏఎంఆర్‌యూటీ)ను కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ. 48,000 కోట్లు, ఏఎంఆర్ యూటీ పథకానికి రూ. 50,000 కోట్లు ఖర్చు చేస్తారు. స్మార్ట్ సిటీల కోసం సంవత్సరానికి రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు కేంద్రం నిధులు అందజేస్తుంది. మెరుగైన వసతులతో, నగరాలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దడమే స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యం.
అమృత్ (ఏఎంఆర్‌యూటీ) పథకం కింద 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
హేయమైన నేరాల్లో అవినీతి చేర్చాలని కేంద్రం నిర్ణయం
అవినీతికి పాల్పడటాన్ని హేయమైన నేరాల కిందకు తీసుకువచ్చే చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ 2015 ఏప్రిల్ 29న ఆమోదం తెలిపింది. దీని కోసం అవినీతి నిరోధక చట్టం -1988కు సవరణలు చేస్తారు. ఈ చట్ట సవరణ ద్వారా అవినీతికి పాల్పడే వారికి ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచడం, లంచం తీసుకునే వారికి, ఇచ్చే వారికి ఉన్న శిక్ష కాలాన్ని పెంచడం, అవినీతి కేసులను వేగంగా రెండేళ్ల లోపు పూర్తి చేయడం వంటి మార్పులు తీసుకువస్తారు.
బిజేష్ తీర్పుపై విచారణకు సుప్రీం కోర్టు సమ్మతి
కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి జరపాలా, లేక కేవలం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య చేయాలా? అన్న అంశంపై మాత్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే అర్థ వివరణ ఇస్తుందని పేర్కొంది. ఈ పిటిషన్లపై నాలుగు రాష్ట్రాల నుంచి సమగ్రంగా వాదనలు వినాల్సి ఉన్నందున... నాలుగు రోజులు కేటాయించాల్సి ఉంటుందని, అందువల్ల సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బ్రిజేష్ అవార్డును నోటిఫై చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్.. తిరిగి కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వాదనలన్నీ విన్న ధర్మాసనం... అన్ని పిటిషన్లపై ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. సెక్షన్ 89 పరిధి, విధి విధానాలు, తదితర అంశాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగించవచ్చని, సుప్రీం విచారణను ట్రిబ్యునల్‌కు అవరోధంగా భావించరాదని స్పష్టం చేసింది.
AIMS DARE TO SUCCESS
జూన్ 2015 జాతీయం
స్మార్ట్ సిటీలు, అమృత్ ప్రాజెక్టులు ప్రారంభం
పట్టణాభివృద్ధి, గృహవసతికి ఉద్దేశించిన మూడు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 25న ప్రారంభించారు. అందరికీ ఇల్లు, అటల్ పట్టణ రూపాంతరణ - పునర్నవీకరణ పథకం(ఏఎంఆర్‌యూటీ - అమృత్), స్మార్ట్‌సిటీలు అనే మూడు పథకాలను ప్రారంభించారు. అమృత్ (ఏఎంఆర్‌యూటీ) పథకం కింద 500 పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రూ.50,000 కోట్లు కేటాయించారు. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ స్థానంలో అమృత్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుల రూపకల్పన, ఆమోదం, పూర్తిచేయడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఉంటుంది. దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు రూ.48,000 కోట్లు కేటాయించారు. అందరికీ ఇల్లు పథకం కింద 2022 నాటికి రెండు కోట్ల మంది పట్టణ పేదలకు గృహ వసతి కల్పిస్తారు.
బిహార్‌లో జేపీ స్మారక ఏర్పాటుకు నిర్ణయం
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషలిస్ట్ అధినేత జయప్రకాశ్ నారాయణన్ స్మారకాన్ని బిహార్‌లోని ఆయన జన్మస్థలంలో ఏర్పాటుచేయాలని కేంద్ర కేబినెట్ జూన్ 24న నిర్ణయించింది. బిహార్‌లోని చప్పారా జిల్లాలోని లాలా కాటోలా, సితాబ్, డియారాలో జాతీయ స్మారకాన్ని నిర్మిస్తారు. ఇందులో ప్రదర్శనశాల, ప్రజాస్వామ్యంపై అధ్యయనం, పరిశోధనా సంస్థ వంటివి ఏర్పాటు చేస్తారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణన్ పోరాడారు.
ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
దేశంలో ఆరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూన్ 24న ఆమోదం తెలిపింది. వీటిని విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), బుద్ధ గయ(బీహార్), సిర్మౌర్ (హిమాచల్ ప్రదేశ్), నాగ్‌పూర్(మహారాష్ట్ర), సంబల్‌పూర్ (ఒడిశా), అమృత్‌సర్ (పంజాబ్)లలో ఏర్పాటు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి.
సౌర విద్యుత్ సామర్థ్య పెంపునకు ఆమోదం
దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం లక్ష మెగావాట్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ జూన్ 17న ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుత సామర్థ్యానికి అయిదింతలు ఎక్కువ. 2022 నాటికి ఆ స్థాయికి చేరుకునేందుకు రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లక్ష్యం సాధిస్తే భారత్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశంగా నిలుస్తుంది.
అందరికీ ఇల్లు పథకానికి ఆమోదం
పట్టణ పేదలకు అందుబాటు ధరలకు గృహ వసతి సమకూర్చేందుకు ఉద్దేశించిన 2022 నాటికి అందరికీ ఇల్లు పథకానికి కేంద్ర కేబినెట్ జూన్ 17న ఆమోదించింది. దీని ద్వారా జాతీయ పట్టణ గృహ నిర్మాణం పథకం కింద ఒక్కో ఇంటికి సగటున రూ.లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు కేంద్ర సాయం అందుతుంది. వచ్చే ఏడేళ్లలో 20 మిలియన్ల ఇళ్ల వసతి కల్పిస్తారు. పట్టణ పేదలకు రుణాలపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపారు. దీనివల్ల ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాల వారికి, మురికి వాడల్లో ఉండేవారికి లబ్ధి చేకూరుతుంది. మురికివాడల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించే కార్యక్రమం కింద కేంద్రం సగటున రూ.లక్ష వరకు ఒక్కో లబ్ధిదారుడికి సహాయం అందిస్తోంది.
శివ సేనకు 50 ఏళ్లు
మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ ‘శివ సేన’ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. మరాఠీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి 1966 జూన్ 19న ముంబైలో సంస్థగా బాల్ ఠాక్రే స్థాపించిన శివ సేన, 1989లో బీజేపీతో పొత్తు తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా అవతరించింది. మరాఠీ గుర్తింపు, ముంబైలో మహారాష్ట్ర ప్రజల పట్ల వివక్షపై సేన పోరాటం చేసింది.
భారత గణాంకాల సంస్థ డెరైక్టర్ తొలగింపు
భారత గణాంకాల సంస్థ డెరైక్టర్ బిమల్ రాయ్‌ని కేంద్ర ప్రభుత్వం జూన్ 13న తొలగించింది. క్రమశిక్షణ ఉల్లంఘన, మోసం, ఆర్థిక అవకతవలకు పాల్పడవచ్చనే అనుమానంతో ఆయనను తొలగించింది. ఆయన పదవీకాలం జూలై 31న ముగియనుంది. ఆయన స్థానంలో ఆగస్టు 1న సంఘమిత్ర బందోపాధ్యాయ్ బాధ్యతలు చేపడతారు.
అణు ప్రమాద నిధి బీమా ఏర్పాటు
కేంద్రం రూ.1500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర అణు ఇంధన సహాయ మంత్రి జితేంద్రసింగ్ జూన్ 13న తెలిపారు. ఈ నిధి వల్ల భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించే విదేశీ అణు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం సంభవిస్తే ఈ ప్రమాద బీమా నిధి నుంచి నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రమాదాల బాధ్యత నుంచి అణు రియాక్టర్లు, పరికరాల సరఫరాదారులకు ఉపశమనం కల్పించినట్లవుతుంది. ఈ నిధి ఏర్పాటుతో ప్రమాద పరిహారం కారణంగా ఆగిపోయిన గోరఖ్‌పూర్ హరియాణా అణువిద్యుత్ పరియోజన వంటి ప్రాజెక్టుల పనులు తిరిగి ప్రారంభమయ్యేందుకు, కొత్త అణు ప్రాజెక్టుల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చేందుకు అవకాశముంటుంది.
12 మంది మావోలు మృతి
జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలో జూన్ 8న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల జోనల్ కమాండర్ ఆర్కే అలియాస్ అనురాగ్‌తోపాటు 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. అనురాగ్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.
కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్ మృతి
మాజీ కేంద్ర మంత్రి షీలా కౌల్(100) ఘజియాబాద్‌లో జూన్ 13న మరణించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేసిన ఆమె మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సమీప బంధువు. 1992-95 మధ్యకాలంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
రాక్‌గార్డెన్ సృష్టికర్త నేక్‌చంద్ మృతి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాక్‌గార్డెన్ సృష్టికర్త నేక్ చంద్(90) చండీగఢ్‌లో జూన్ 12న మరణించారు. సుఖ్నా సరస్సు సమీపంలో పగిలిపోయిన గాజు, పింగా ణీ, టైల్స్, ఇనుపముక్కలు వంటి వాటితో మనుషులు, దేవతా మూర్తులు, పశుపక్ష్యాదులను అద్భుతంగా సృష్టించారు. రెండు దశాబ్దాల తర్వాత 1975లో ఆ రాక్ గార్డెన్ వెలుగులోకి వచ్చింది. 1976లో దానికి ప్రారంభోత్సవం జరిగింది. నేక్ చంద్‌ను ప్రభుత్వం 1984లో పద్మశ్రీతో సత్కరించింది.
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం
నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా సీసం ఉండటంతో నెస్లే సంస్థకు చెందిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులను విక్రయించకుండా ఢిల్లీ, గుజరాత్, జమ్ము-కశ్మీర్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు తాత్కాలిక నిషేధం విధించాయి. మ్యాగీ నూడుల్స్ తినడం ప్రమాదకరమని భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జూన్ 5న ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం పరీక్షించిన మ్యాగీ నూడుల్స్ నమూనాల్లో 2.8 - 5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) వరకు సీసం ఉన్నట్లు తేలింది. అనుమతిస్తున్న పరిమితి 2.5 పీపీఎం.
మణిపూర్‌లో సైనికులపై తీవ్రవాదుల దాడి
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో సైనిక వాహనాలపై తీవ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది సైనికులు మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 6వ డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనిక బృందం తెంగ్నౌపాల్-నూసమ్తాల్ రోడ్డుపై జూన్ 4న గస్తీ తిరుగుతుండగా శక్తిమంతమైన పేలుడు పరికరం(ఐఈడీ)తో తీవ్రవాదులు దాడిచేశారు. మణిపూర్‌కు చెందిన తీవ్రవాద సంస్థలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), కంగ్లీ యావొల్ కన్నా లుప్(కేవైకేఎల్) ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కేవైకేఎల్ అనేది స్థానిక మీతీ తెగకు చెందిన తీవ్రవాద సంస్థ. గత 20 ఏళ్లలో సైన్యంపై ఇంత పెద్ద దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ దాడిలో పాల్గొని మయన్మార్‌లో తలదాచుకున్నట్లు భావిస్తున్న 20 మంది తీవ్రవాదులను భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు జూన్ 9న మట్టుబెట్టాయి.
తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్
 దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ జూన్ 2న ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, శిశుసంక్షేమ మంత్రి మేనకాగాంధీ సంయుక్తంగా ‘‘ఖోయా-పాయా’’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పౌరులు తమకు ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులతో పిల్లలు కనిపించినా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలపొచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 70వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు.
మ్యాగీ నూడుల్స్‌పై ఢిల్లీలో నిషేధం
మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. వాటి విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నూడిల్స్‌ను వినియోగించరాదని సైన్యం కూడా జూన్ 3న ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్‌లు దేశ వ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఈ ఉత్పత్తి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్‌బచ్చన్, మాధురీదీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బీహార్ కోర్టు జూన్ 2న ఆదేశాలు ఇచ్చింది.
జైపూర్ మెట్రో ప్రారంభం
రాజస్థాన్‌లో జైపూర్ మెట్రో రైలు సేవలు జూన్ 3న ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. 9.6 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. ఉదయం 6.45 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి.
AIMS DARE TO SUCCESS
జూలై 2015 జాతీయం
జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్రాలకు అనుమతి
జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలను శిక్ష తగ్గించి, విడుదల చేసేందుకు రాష్ట్రాల కున్న అధికారాలపై 2014లో విధించిన స్టేను సుప్రీంకోర్టు జూలై 23న తొలగించింది. జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు కొన్నిషరతులతో కూడిన అనుమతిని రాష్ట్రాలకిచ్చింది. ఆ షరతుల ప్రకారం.. సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణజరిగి, శిక్షఅనుభవిస్తున్న ఖైదీలకు, టాడా వంటి కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వారికి, లైంగికపరమైన ఘోర నేరాలైన హత్యాచారం(అత్యాచారం+హత్య) చేసినవారికి, కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించని ఖైదీలకు, జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంగా పేర్కొన్న ఖైదీలకు, 20 నుంచి 25 ఏళ్లంటూ శిక్షాకాలాన్ని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవారికి శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయకూడదు. వారి విషయంలో రాష్ట్రాలకున్న ‘శిక్ష తగ్గింపు’ అధికారం వర్తించదు. ఈ ఆదేశాలు మాజీ ప్రధాని రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌కు వర్తించబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్ర దాడి
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జూలై 27న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మరణించారు. వీరిలో ఒక ఎస్పీ, ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సాయుధ దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు దీనానగర్‌లో రైలు పట్టాలపై బాంబులు అమర్చారు.
లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ఎంపీలు
బెంగాలీ నటుడు ‘జార్జ్ బేకర్’, కేరళకు చెందిన ‘రిచర్డ్ హే’లను లోక్‌సభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. జార్జ్ బేకర్ ‘చమేలీ మేమ్‌సాబ్’ చిత్రానికి 1975లో జాతీయ చలనచిత్రోత్సవ అవార్డును పొందారు. రిచర్డ్ హే ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. ఆయన దేశ, విదేశాల్లోని వివిధ అకడమిక్ సంస్థల్లో ఆర్థిక శాస్త్ర అంశాలను బోధిస్తున్నారు.
యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు
1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. జూలై 30వ తేదీ ఉదయం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో మెమన్‌ను ఉరి తీశారు. శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు జూలై 29న నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. చిట్టచివరగా మెమెన్ దాఖలుచేసిన పిటిషన్‌ను దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 29వ తేదీ అర్ధరాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విచారించిన హైకోర్టు.. మెమన్ పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నాగ్‌పూర్ జైలు అధికారులు మెమన్‌ను ఉరితీశారు.
2014లో 1.31 లక్షల మంది ఆత్మహత్య
2014లో దేశవ్యాప్తంగా 1,31,666 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) జూలై 17న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. జాతీయ ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకు 10.6 శాతంగా ఉంది. మొత్తం ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు చోటుచేసుకున్నాయి. ఇందులో గృహిణులు 20,148, వ్యవసాయ పనివారు 12,360, విద్యార్థులు 8,068 మంది ఉన్నారు. ఆత్మహత్యలకు ప్రధానంగా కుటుంబ సమస్యలు, అనారోగ్యం, వైవాహిక సమస్యలు, ప్రేమవ్యవహారాలు కారణాలుగా ఉన్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.4 లక్షలుగా ఉంది.
2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.25 కోట్లు
దేశంలో 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.25 కోట్లకు చేరినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జూలై 18న విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సంఖ్య 2013లో 1.99 కోట్లుగా ఉంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది.
ఆంధ్ర, ఒడిశాలకు తుపాను సాయం పెంపు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ‘నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రాజెక్టు’ మొదటి దశ కింద కేంద్రం అందించే సాయం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 835 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొదట ప్రకటించిన రూ. 1,496.71 కోట్ల నుంచి రూ. 2,331.71 కోట్లకు పెంచింది. ఇందులో రూ. 1,843.94 కోట్లు ప్రపంచబ్యాంకు రుణం రూపంలో కేంద్రం సాయం అందిస్తుంది. మిగిలిన రూ. 457.77 కోట్లు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూలై 16న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీలో జూలై 20న ప్రారంభమైన 46వ భారత కార్మిక సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఉపాధి అవకాశాలకు ఉద్దేశించిన పోర్టల్ ‘నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్)’ను ప్రారంభించారు. ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లను ఆధునీకరించి ఉద్యోగార్ధులకు, ఉద్యోగులు అవసరం ఉన్న సంస్థలకు ఉపయోగపడే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లా ఎన్‌సీఎస్‌ను తీర్చిదిద్దనున్నారు.
127 కోట్లు దాటిన దేశ జనాభా
భారత దేశ జనాభా జూలై 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు 127,42,39,769కి చేరినట్లు జాతీయ జనాభా స్థిరీకరణ నిధి (ఎన్‌పీఎస్‌ఎఫ్) తెలిపింది. జనాభా ఏటా 1.6 శాతం రేటుతో పెరుగుతోంది. దీంతో 2050 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా(163 కోట్లు) ఉన్న దేశంగా భారత్ అవతరించనుంది. చైనా ప్రస్తుతం 139 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 17.25 శాతానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 121 కోట్లు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్న ఎన్‌పీఎస్‌ఎఫ్ జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వివరాలు వెల్లడించింది.
‘ఆగస్టు 7’ జాతీయ చేనేత దినం
ప్రతి ఏటా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించనున్నారు. ఈ మేరకు మోదీ ఆగస్టు 7న చేనేత చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. 1905లో అదే రోజు స్వదేశీ ఉద్యమం మొదలైంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన చేనేత ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా ప్రత్యేక చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు.
దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘గగన్’ ప్రారంభం
భారత ఉపఖండ ప్రాంతంలో విస్తృతమైన నావిగేషన్ సౌకర్యాన్ని కల్పించే.. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగుమెంటెడ్ నావిగేషన్)’ ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు జూలై 13న దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బంగాళాఖాతం, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ఆఫ్రికా వరకు పనిచేసే వ్యవస్థను ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశాయి. రూ.774 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో పలు కృత్రిమ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తోంది. గత ఏడాదే ప్రయోగించిన‘జీశాట్-8, జీశాట్-10’ శాటిలైట్లు నావిగేషన్ సిగ్నల్స్‌ను పంపుతున్నాయి. ఈ నావిగేషన్ వ్యవస్థ సైనిక, పౌర విమాన సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, వ్యయాలను తగ్గించేందుకు, భద్రతకు తోడ్పడుతుంది.
ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకమైన ‘‘ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై)’’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జూలై 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో పాటు నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం-2015, నైపుణ్య రుణాల పథకాలను ప్రారంభించారు. కొంతమంది ఎంపిక చేసిన ట్రైనీలకు ఆయన చేతుల మీదుగా రుణాలు అందించారు. ‘‘స్కిల్ ఇండియా’’ లోగోను కూడా ప్రధాని ఆవిష్కరించారు. యువతలో ఆత్మాభిమానాన్ని పెంపొందించి.. వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురావలసిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం నైపుణ్య భారత్ మిషన్‌ను ప్రారంభించిందని మోదీ అన్నారు.
ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే..
దేశంలో 35 ఏళ్ల లోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఇది. వచ్చే ఏడాది చివరికల్లా 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి 40 కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.
స్కిల్ లోన్స్: నైపుణ్య శిక్షణ పొందిన యువతకు స్కిల్ లోన్ పేరుతో రూ. 5 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందిన యువకుల్లో 34 లక్షల మందికి రుణ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.
జాతీయ నైపుణ్య విధానానికి కేబినెట్ ఆమోదం
జాతీయ నైపుణ్య విధానానికి కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంచుతారు. తద్వారా సృజనాత్మక పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సంతులనం సాధించడం, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను తొలగించడం, గుణాత్మకమైన పనితనం, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు
అత్యాచారం, అత్యాచార యత్నం కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదర్చడం వీలుపడదని సుప్రీంకోర్టు జూలై 1న పేర్కొంది. ఈ నేరాలు అపరాధ రుసుంతో సరిపోయేవి కావని, అందువల్ల రాజీ కుదర్చడం సరికాదని పేర్కొంటూ, కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు రాజీ చేసుకోవడానికి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతించడంపై ప్రభుత్వం అప్పీలు చేసిన కేసులో సుప్రీం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ కేసును తిరిగి పరిశీలించాలని హైకోర్టుకు తిప్పి పంపింది.
డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రారంభించిన ప్రధాని
 డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అవినీతి నిర్మూలనకు, పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు, పేద-ధనికుల మధ్య వ్యత్యాసాలను అంతం చేసేందుకు డిజిటల్ విప్లవం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్స్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని రిలయన్స్, బిర్లా, మిట్టల్, విప్రో తదితర సంస్థల అధిపతులు పాల్గొని, 18 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు డిజిటల్ రంగంలో దాదాపు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత్ నెట్, డిజిటల్ లాకర్, ఉపకారవేతనాల పోర్టల్, డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
వీధిబాలల గుర్తింపు కోసం ఆపరేషన్ ముస్కాన్
దేశవ్యాప్తంగా వీధిబాలలను సంరక్షించడం, తప్పిపోయిన వారి కుటుంబాలకు చేర్చడం కోసం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి 31 వరకు కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులు, ప్రార్థనా స్థలాలు తదితర ప్రదేశాలలో వీధి పిల్లల ఫోటోలు తీసి వివరాలు సేకరిస్తారు.
పీఎంకేఎస్‌వైకు కేబినెట్ ఆమోదం
ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)కు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పిస్తారు. దీనికోసం వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఈ కార్యక్రమం కింద కేంద్రం రాష్ట్రాలకు 75 శాతం నిధులు గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్రాలు భరించాలి. ఈశాన్య, కొండ ప్రాంతాల రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది.
జాతీయ వ్యవసాయ మార్కెట్‌కు ఆమోదం
జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. కొత్త విధానం ద్వారా రాష్ట్రం మొత్తం మార్కెట్ కార్యకలాపాలకు సింగిల్ లెసైన్స్, ఒకే రకమైన పన్ను విధానం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరుగుతుంది. దీంతో రాష్ట్రం మొత్తం ఒకే మార్కెట్‌లా మారుతుంది. దేశంలోని 585 హోల్‌సేల్ వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్‌కు రూ.200 కోట్లు కేటాయించింది.
చెత్త ఏరుకునే వారికి జాతీయ అవార్డు
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్త ఏరుకునే వారు(ర్యాగ్ పికర్స్) చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారికి జాతీయ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కొన్ని సంస్థలను, చెత్త ఏరుకునేవారిని ముగ్గురిని ఎంపిక చేసి జాతీయ అవార్డుతో పాటు రూ. 1.5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు.
2018 కల్లా భారత్‌లో 4 లక్షల మంది మిలియనీర్లు: వెల్త్-ఎక్స్ నివేదిక
వచ్చే మూడేళ్లలో (2018 కల్లా) భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 4.37 లక్షలకు చేరుకోనుంది. 2023 కల్లా ఇది రెట్టింపు కానుందని. ‘దశాబ్దాల సంపద: రాబోయే పదేళ్లలో సంపద’ పేరిట వెల్త్-ఎక్స్ ఆవిష్కరించిన నివేదికలో వెల్లడించింది. రాబోయే పదేళ్లలో అత్యంత సంపన్నుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో ఈ దశాబ్దం భారత్‌ది కానున్నట్లు సంస్థ పేర్కొంది.
AIMS DARE TO SUCCESS
ఆగష్టు 2015 జాతీయం
98 స్మార్ట్‌సిటీల ఎంపిక
ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్)గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన 98 నగరాల జాబితాను కేంద్రం ఆగస్టు 27న ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి. మొత్తం జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 13 నగరాలు ఉన్నాయి. తర్వాత తమిళనాడుకు చెందిన 12 నగరాలు ఉన్నాయి. 10 నగరాలు మహారాష్ట్రకు చెందినవి ఉన్నాయి. ఇందులో 24 రాష్ట్ర రాజధానులు ఉన్నాయి. ఈ ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి కేంద్రం రూ.48 వేల కోట్లు సమకూర్చుతుంది. ఇంతే మొత్తాన్ని రాష్ట్రాలు, పురపాలక సంస్థలు సమకూర్చాలి. తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్లు, తర్వాత నాలుగు సంవత్సరాలపాటు రూ.100 కోట్లు వ్యయం చేస్తారు. ఈ పథకం కింద నగరాల్లో తగినంత నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, సమర్థమైన రవాణా వ్యవస్థ కల్పిస్తారు. డిజిటలైజేషన్‌ను పెంపొందించి ప్రజలకు రక్షణ, భద్రత కల్పిస్తారు.
దేశ జనాభాలో తగ్గుతున్న హిందువులు
2011 జనాభా లెక్కల ఆధారంగా మతాలవారీ జనాభా వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆగస్టు 25న విడుదల చేశారు. 2001లో మొత్తం జనాభా 1,028,610,328గా ఉండగా 2011లో మొత్తం జనాభా 1,210,854,977. 2011 జనాభాలో హిందువులు 96.63 కోట్లు (79.8 శాతం); ముస్లింలు 17.22 కోట్లు (14.2 శాతం); క్రైస్తవులు 2.78 కోట్లు (2.3 శాతం); సిక్కులు 2.08 కోట్లు (1.7 శాతం); బౌద్ధులు 84 లక్షలు (0.7 శాతం); జైనులు 45 లక్షలు (0.4 శాతం); ఇతర మతాల వారు 79 లక్షలు (0.7 శాతం); ఏ మతం తెలపని వారు 29 లక్షలు (0.2 శాతం) ఉన్నారు. 2011లో మొత్తం జనాభాలో హిందువుల జనాభా 0.7 శాతం తగ్గగా ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగింది. దేశ జనాభా 2001-11 దశాబ్దకాలంలో 17.7 శాతం పెరిగింది. సమైఖ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2001లో 7.6 కోట్లుగా ఉన్న జనాభా, 2011లో 8.5 కోట్లకు చేరింది. 2011లో హిందువులు 7.48 కోట్లు, ముస్లింలు 80.8 లక్షలు, మతం తెలపని వారి సంఖ్య 4,04,100.
‘పటేల్’ ఆందోళనలో 10 మంది మృతి
గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన సంఘటనల్లో ఆగస్టు 26న 10 మంది మరణించారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మొదలైన ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ సంఘటనల వల్ల అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, జాంనగర్ సహా అనేక పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మరణశిక్ష రద్దుకు లా కమిషన్ సిఫార్సు
మరణశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ ఆగస్టు 31న విడుదల చేసిన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే, ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని కమిషన్ సమర్థించింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణశిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని కమిషన్ పేర్కొంది. జస్టిస్ ఎ.పి.షా నేతృత్వంలోని 20వ లా కమిషన్‌లోని మొత్తం పది మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు అనుకూలంగా ఉండగా, జస్టిస్ ఉషా మెహ్రా, మరో ఇద్దరు సభ్యులు ఉరిశిక్షను కొనసాగించాలని స్పష్టం చేశారు.
‘అందరికీ ఇళ్లు’కు 305 పట్టణాల ఎంపిక
దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఉద్దేశించిన అందరికీ ఇళ్లు పథకం కింద కేంద్రం తొమ్మిది రాష్ట్రాల్లోని 305 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసిన జాబితాను ఆగస్టు 30న విడుదల చేసింది. ఈ పథకం అమలుకు 15 రాష్ట్రాలతో తప్పనిసరైన ఆరు సంస్కరణల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(34) ఉన్నాయి. అల్పాదాయ వర్గాలకు ఇళ్ల అనుమతుల్లో సడలింపులు, అద్దె నియంత్రణ చట్టాల సవరణ, మురికివాడల అభివృద్ధికి అదనపు సడలింపులు వంటివి ఈ సంస్కరణల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటికి రూ.2-2.50 లక్షల ఖర్చు చేస్తుంది. వచ్చే ఆరేళ్లలో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.
హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లు
మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యల్లో భాగంగా హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాల్లో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్ స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ సమీపంలోని పాంచ్‌కులా పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను స్వయంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మిగిలిన 20 మహిళా పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. ఈ స్టేషన్లలో స్త్రీలకు సంబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వహిస్తారు.
భూసేకరణ ఆర్డినెన్స్ చెల్లు
భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 30న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. ఆగస్టు 31తో ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. ఇదే ఆఖరి ఆర్డినెన్స్ అని ప్రధాని తెలిపారు. పాత చట్టాలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలో మోదీ ప్రభుత్వం సవరణలు చేసి కొత్త భూసేకరణ బిల్లును రూపొందించింది.
‘రామచరితమానస్’ను ఆవిష్కరించిన మోదీ
ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 31, 2015వ తేదీన ఢిల్లీలో ఆవిష్కరించారు. రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషిని మోదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతో కాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు.
ఫోర్బ్స్ జాబితాలో 3 భారత కంపెనీలు
ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో మూడు భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సన్ ఫార్మా ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యునీలీవర్ కంపెనీలకు చోటు లభించింది. హిందుస్తాన్ యునీలీవర్ 41వ స్థానంలో నిలువగా, టీసీఎస్- 64, సన్‌ఫార్మా-71వ ర్యాంకులో నిలిచాయి. అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ రెండో స్థానంలో నిలువగా, ఈ కామర్స్ సంస్థ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
భారత్-పసిఫిక్ ద్వీప దేశాల సదస్సు
ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపీఐసీ) శిఖరాగ్ర సమావేశాన్ని ఆగస్టు 21, 2015వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని రామ్‌బాగ్ ప్యాలస్‌లో జరిగింది. మోదీతో పాటు 14 పసిఫిక్ ద్వీప దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. 14 పసిఫిక్ దేశాలకు వ్యాపార అవసరాల నిమిత్తం ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ 15 దేశాల్లో ఎక్కడో ఒకచోట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కుక్ ఐలాండ్స్, టోంగా, తువాలు, నౌరు, కిరిబాటి, వంటావూ, సోలోమోన్ ఐలాండ్స్, సమోవా, నుయి, పలావు, మైక్రోనేసియా, మార్సల్ ఐలాండ్స్, ఫిజి, పాపువా న్యూ గినియా దేశాలు ఎఫ్‌ఐపీఐసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నాయి.
ప్రముఖుల స్మారకార్థం పోస్టల్ స్టాంప్‌లు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సహా మొత్తం 25 మంది దివంగత ప్రముఖుల గౌరవార్థం, జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్‌లు విడుదల చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. వారి సేవలకు స్మరణగా ఈ స్టాంప్‌లను ఆవిష్కరించనున్నట్టుగా వివరించారు. మౌర్య చక్రవర్తి అశోకుడి స్మారకంగా ఆగస్టు 25, 2015న పోస్టల్‌స్టాంప్‌ను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, కవి విద్యాపతి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, బాబూ రాజేంద్ర ప్రసాద్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, ‘మౌంటెన్ మేన్’ దశరథ్ మాంఝీ, బాల గంగాధర్ తిలక్, శివాజీ తదితరుల స్మారక స్టాంప్‌లను ఆవిష్కరించారు.
రాజస్తాన్‌లో వార్ మ్యూజియం
భారత్‌లో తొలిసారి, కొత్తగా వార్ మ్యూజియమ్‌ను రాజస్తాన్‌లో ప్రారంభించారు. వార్ మ్యూజియమ్, వార్ మెమోరియల్ అనే రెండు ప్రత్యేక విభాగాలను దక్షిణ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అశోక్ సింగ్హాస్ ప్రారంభించారు. జైసల్మీర్ మిలటరీ స్టేషన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో జైసల్మీర్-జోధ్‌పూర్ రహదారికి సమీపంలో వీటిని నెలకొల్పారు. దేశం కోసం ఆర్మీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా వీటిని ఏర్పాటు చేసినట్టు అశోక్ సింగ్హాస్ తెలిపారు. ముఖ్యంగా 1965, 1971 ఇండియా-పాక్ యుద్ధాల్లో ఆర్మీ అద్భుత పనితీరుకు జ్ఞాపకార్థం వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
భారత్‌లో తగ్గిన హిందువుల జనాభా
దేశంలో హిందువుల జనాభా కాస్త తగ్గింది. అదే సమయంలో ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగింది. 2011 సంవత్సర జనగణనలోని మతాలవారీ జనాభా వివరాలను ఆగస్టు 25, 2015వ తేదీన రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్ విడుదల చేశారు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాతో పోలిస్తే హిందువుల జనాభా 0.7 శాతం తగ్గింది. 2011 జనగణన ప్రకారం మొత్తం దేశజనాభా 121.09 కోట్లు. వారిలో హిందువులు 96.63(79.80 శాతం), ముస్లింలు 17.22 కోట్లు(14.20 శాతం) ఉన్నారు. క్రిస్టియన్లు 2.78 కోట్లు(2.30 శాతం), సిక్కులు 2.08 కోట్లు(1.70 శాతం), బౌద్ధులు 0.84 కోట్లు(0.7 శాతం), జైనులు 0.45 కోట్లు(0.4 శాతం), ఇతర మతస్తులు 0.79 కోట్లు(0.7 శాతం), మతం చెప్పడానికి ఇష్టపడనివారు 0.29 కోట్లు(0.2 శాతం) ఉన్నారు. క్రిస్టియన్లు, జైనుల జనాభాశాతం పెరుగుదల లేదు. కానీ, సిక్కులు 0.2, బౌద్ధులు 0.1 శాతం తగ్గారు. 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 82.75 కోట్లు(80.45 శాతం), ముస్లింలు 13.8 కోట్లు(13.4 శాతం) ఉన్నారు. గత పదేళ్లల్లో మతాలవారీగా జనాభా పెరుగుదల వివరాలు... హిందువులు 16.8, ముస్లింలు 24.6, క్రిస్టియన్లు 15.5, సిక్కులు 8.4, బుద్ధిస్టులు 6.1, జైనుల జనాభా 5.4 శాతం చొప్పున పెరిగింది.
గుజరాత్‌లో పటేల్ వర్గీయుల ఆందోళనలు హింసాత్మకం
ఇతర వెనుకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. ఆగస్టు 26, 2015వ తేదీన జరిగిన ఆందోళనల్లో ఏడుగురు మృతి చెందారు. వారిలో ఆరుగురు పోలీసు కాల్పుల్లో మరణించారు. ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి’ ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్ట్‌తో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, మెహసన, రాజ్‌కోట్, జామ్‌నగర్, ఆనంద్ తదితర నగరాల్లో హింసా ఘటనలు చోటు చేసుకున్నాయి.
సీషెల్స్‌కు భారత్ బహుమతిగా గస్తీ నౌక
తీరప్రాంత గస్తీ నౌకను, రెండో డోర్నియర్ విమానాన్నీ సీషెల్స్‌కు బహుమతిగా ఇస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన సీషెల్స్ ప్రధాని జేమ్స్ అలిక్స్ మిషెల్‌తో ఆగస్టు 26, 2015వ తేదీన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. సీషెల్స్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అనీ, గస్తీ నౌకను, విమానాన్ని బహుమతిగా ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. గత మార్చిలో సీషెల్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఇంటర్సెప్టర్ కోస్ట్‌గార్డ్ బోటును, డోర్నియర్ విమానాన్నీ అందచేస్తానని మాటిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగం
భారత 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ప్రసంగించారు. పరిశ్రమల వ్యవస్థాపన కోసం ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ నినాదంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పరిశ్రమల వ్యవస్థాపనను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ పేరును ‘వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ’గా మార్చనున్నట్లు తెలిపారు. దేశాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి అందరికీ ఇల్లు, విద్యుత్ వంటి మౌలిక సేవలు కల్పిస్తామని తెలిపారు. ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ ద్వారా 17 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచినట్లు తెలిపారు. దేశంలోని 1.25 లక్షల బ్యాంకు శాఖల ద్వారా ఒక్కో శాఖ ఒక దళిత పారిశ్రామికవేత్తను, ఆదివాసీ పారిశ్రామికవేత్తను, ఒక మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహించాలని కోరారు.
సంక్షేమ లబ్ధికి ఆధార్ ఐచ్చికమన్న సుప్రీం
ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ ఐచ్చికమేనని సుప్రీంకోర్టు ఆగస్టు 11న పేర్కొంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే వస్తువుల పంపిణీ మినహా ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ నమోదుకు సేకరించిన ప్రజల వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని కోర్టు నిర్దేశించింది. ఆధార్ తప్పనిసరి కాదని ప్రభుత్వం మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేయాలని కోర్టు ఆదేశించింది.
మ్యాగీపై నిషేధం ఎత్తివేత
మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు ఆగస్టు 13న ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో హానికర లెడ్(సీసం) అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం విధిస్తూ జూన్ 5న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఆదేశాలతోపాటు రాష్ట్రంలో నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. అన్ని రకాల నూడుల్స్ నుంచి ఐదు శాంపిళ్లను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లలో ఎన్‌ఏబీఎల్ గుర్తించిన ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపాలంది. 6 వారాల్లో ల్యాబ్‌లు నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.
బిహార్‌కు రూ. 1.25 లక్షల కోట్ల కేంద్ర ప్యాకేజీ
బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. బిహార్‌లోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు ఆగస్టు 18న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మొత్తం 700 కి.మీ. నిడివి గల 11 జాతీయ ప్రాజెక్టులను రూ. 9,700 కోట్లతో ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నారు. సహర్సలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ బిహార్‌కు ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర నిధులతో కొనసాగుతున్న రూ. 40 వేల కోట్లకు అదనంగా పై ప్యాకేజీ ఉంటుందన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. భారత చేనేత లోగోను కూడా ఆవిష్కరించారు. ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమంలో ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేపట్టిన రోజుకు గుర్తుగా చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. చేనేతను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు, చేనేత కార్మికులకు సరైన ప్రతిఫలం దక్కేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. 2012-14 మధ్యకాలంలో చేనేత రంగంలో నైపుణ్యం ప్రదర్శించిన 72 మందికి ప్రధాని అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు అందజేశారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అత్యధికంగా ఉపాధి కల్పిస్తోంది. దేశంలోని మొత్తం వస్త్ర వినియోగంలో 15 శాతం చేనేత రంగానికి చెందింది.
వాయు కాలుష్యంతో పదేళ్లలో 35 వేల మంది మృతి
గత పది సంవత్సరాల్లో (2006-15) వాయు కాలుష్యం వల్ల 35,616 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6న పార్లమెంటుకు తెలిపింది. ఈ కాలంలో ప్రతి సంవత్సరం 2.6 కోట్ల వాయు కాలుష్య కేసులు నమోదయ్యాయి. ఇటువంటి సమాచారాన్ని ప్రభుత్వం చాలా అరుదుగా అందజేస్తుంది. వాయు కాలుష్యం వల్ల మరణించిన వారి సంఖ్య(6,423) పశ్చిమబెంగాల్‌లో అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (3,768), ఉత్తరప్రదేశ్ (2,458), మధ్యప్రదేశ్ (2,069) ఉన్నాయి.
మరణ శిక్ష రద్దు తీర్మానాన్ని ఆమోదించిన త్రిపుర అసెంబ్లీ
మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ త్రిపుర శాసనసభ ఆగస్టు 7న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతుంది. మరణ శిక్ష రద్దుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302ను సవరించాలని, ఎంత తీవ్రమైన నేరానికైనా జీవిత ఖైదు విధించేలా చట్టాలను సవరించాలని కేంద్రాన్ని కోరింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తీర్మానాన్ని సమర్థిస్తూ ఎంతటి తీవ్రమైన నేరాలకైనా జీవించి ఉన్నంత వరకూ జైలు శిక్ష సరైనదని అభిప్రాయపడ్డారు.
ఉరిశిక్ష రద్దు చేయాలని త్రిపుర అసెంబ్లీ తీర్మానం
భారత శిక్షాస్మృతిలోని ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ త్రిపుర రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి ఆగస్టు 7న కేంద్రానికి పంపింది. ఎంత తీవ్రమైన నేరానికి అయినా అంతిమంగా జీవితఖైదు విధించాలి తప్ప మరణదండన వద్దు అని, ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని, ఐపీసీలోని సెక్షన్ 302ని తొలగిస్తూ ఉరిశిక్షను రద్దు చేయాలని తీర్మానంలో కోరారు. భారత ప్రభుత్వం చట్టంలో కచ్చితంగా మార్పులు తీసుకురావాలని శాసనసభ కోరింది. ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ తీవ్రమైన నేరాలకు కూడా జీవించి ఉన్నంత వరకూ జైల్లో పెట్టడం అనేది సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో భార త విద్యార్థులకు పతకాలు
కజకిస్తాన్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్‌లో నలుగురు భారత విద్యార్థులు మెడల్స్ సాధించారు. ముంబయికి చెందిన మాలవిక రాజ్ జోషి, చశాక్ గురుకుల్ సిల్వర్ మెడల్ సాధించగా, అర్జున్ పిట్చనాథన్( చెన్నై), కుషాగ్ర జునేజ(ఢిల్లీ) కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఐదు మెగా సైన్స్ ఒలింపియాడ్‌లలో యునెస్కో, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్(ఐఎఫ్‌ఐపీ) నిర్వహించే ఈ ఒలింపియాడ్ కూడా ఒకటి. గతేడాది తైవాన్‌లో నిర్వహించిన ఇదే ఒలింపియాడ్‌లో భార త్‌కు ఓ పసిడి, ఓ కాంస్య పతకం లభించాయి.
భారత్‌లో నమోదైన రాజకీయ పార్టీలు 1,866
2015 జూలై 24 నాటికి తమ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు మొత్తం 1,866 ఉన్నాయని ఎన్నికల కమిషన్(ఈసీ) వెల్లడించింది. వీటిలో 56 పార్టీలకు మాత్రమే ఈసీ గుర్తింపు ఉంది. ఇందులో ఆరు(బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ)లు జాతీయ పార్టీలు కాగా మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అత్యధికంగా 239 పార్టీలు ఈసీ వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 464 పార్టీలు మాత్రమే ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఐదేళ్లుగా ఏదైనా రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, లేదా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 4 శాతం ఓట్లు పొందిన పార్టీలకు మాత్రమే ఈసీ గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు పొందిన పార్టీలు తమ సొంత గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. గుర్తింపు లేని పార్టీలు ఈసీ వద్ద ఉన్న 84 గుర్తుల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. మొత్తం పోలై న వాటిలో ఆరో వంతు కన్నా తక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లే. కాగా, లా కమిషన్ న్యాయశాఖకు ఇచ్చిన నివేదికలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో వరుసగా పదేళ్లు పోటీ చేయని పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ప్రతిపాదించింది.
స్కూల్ నర్సరీ యోజన
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రకృతి, పర్యావరణాలను కాపాడేందుకు ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా‘స్కూల్ నర్సరీ యోజన’ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం- ప్రతి పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు మొక్కలు నాటడం, వాటి సంరక్షణ వంటి చర్యల్లో పాల్గొనాలి. ఏటా సుమారు వేయి మొక్కల పెంపకం లక్ష్యంగా చేసుకోవాలి. ఇందుకోసం ప్రతి పాఠశాలలో వంద చదరపు అడుగుల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ఈ పథకంలో మొక్కల పెంపకానికే పరిమితం కాకుండా.. అందుకు అవసరమైన నర్సరీ ఏర్పాట్లకు రూ. 25 వేల వార్షిక గ్రాంట్‌లను కూడా మంజూరు చేయనుంది.
భూభాగాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్-బంగ్లాదేశ్
భారత్, బంగ్లాదేశ్ ఆగస్టు 1న 162 భూభాగాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. భారత్ 17,160 ఎకరాలతో కూడిన 111 ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించగా.. బంగ్లాదేశ్ 7,110 ఎకరాల విస్తీర్ణమున్న 51 ప్రాంతాలను భారత్‌కు ఇచ్చింది. ఈ ప్రాంతాల్లోని 51 వేల మందిలో 14 వేల మంది భారతీయ పౌరులుగా మారగా, మిగిలిన వారు బంగ్లాదేశ్ పౌరసత్వం పొందారు. దీంతో 1947 దేశవిభజన నాటి నుంచి కొనసాగుతున్న ‘ఏ దేశానికీ చెందని వారు’గా ఉన్న పౌరుల సమస్య తీరింది. భూ సరిహద్దు ఒప్పందం (ఎల్‌బీఏ) కింద సరిహద్దు ప్రాంతాల మార్పిడి జరిగింది. జూన్ 6న జరిగిన ఈ ఒప్పందంపై ఢాకాలో భారత్, బంగ్లా ప్రధానమంత్రుల సమక్షంలో సంతకాలు జరిగాయి.
వ్యవస్థీకృత నేరాల బిల్లును తిప్పి పంపిన కేంద్రం
వివాదాస్పద గుజరాత్ ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ బిల్లు-2015ను కేంద్రం తిప్పిపంపింది. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ బిల్లును జూలై 28న తిప్పి పంపింది. చార్జ్‌షీట్ ఫైల్ చేసే గడువును 90 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించడం, నిందితులకు బెయిలు మంజూరుకు కఠిన నిబంధనలు చేర్చడం వంటివి బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లును గుజరాత్ శాసనసభ మార్చి 31న ఆమోదించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లు కేంద్ర చట్టాలను అతిక్రమించినట్లయితే దానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇది గతంలో మూడుసార్లు తిరస్కరణకు గురైంది. ఎ.పి.జె.అబ్దుల్ కలాం 2004లో, ప్రతిభాపాటిల్ 2008, 2009లో తిరస్కరించారు.
కొమెన్ తుఫాను వల్ల 180 మంది మృతి
కొమెన్ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా,మణిపూర్ రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య ఆగస్టు 3 నాటికి 180కి చేరింది. పశ్చిమబెంగాల్‌లోనే దాదాపు 50 మంది మరణించారు. లక్షలాది నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 20 మంది మరణించారు.
నాగా తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం
నాగాలాండ్ తిరుగుబాటు గ్రూపు నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - ఇసాక్ (ఎన్‌ఎస్‌సీఎన్-ఈఎం) నేత ముయివాతో కేంద్రం ఆగస్టు 3న శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ చారిత్రక ఒప్పందంపై చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధి ఆర్.ఎన్.రవి, ఎన్‌ఎస్‌సీఎన్-ఈఎం నాయకుడు టి.ముయివా సంతకాలు చేశారు. 16 సంవత్సరాలపాటు 80 దఫాల చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ప్రత్యేక నాగాలాండ్ కోసం జరిగిన పోరాటంలో 3 వేల మంది వరకు మరణించారు.
ఖరీదైన పర్యాటక నగరం.. ముంబై
 భారత్‌లో అత్యంత ఖరీదైన పర్యాటక నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, చండీగఢ్ నగరాల్లో ట్రిప్ అడ్వైజర్ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఫోర్ స్టార్ హోటల్లో మూడు రోజుల బస, ప్రతి రోజూ భోజనం, ట్యాక్సీ ఖర్చులు తదితర అంశాల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. ముంబైలో మూడు రోజులు నివసించడానికి రూ. 39,956లు ఖర్చు అవగా, చంఢీగఢ్‌లో రూ. 21,849 వ్యయం అవుతున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పర్యాటక నగరంగా కాన్‌కున్ (మెక్సికో) మొదటి స్థానంలో నిలిచింది. జురిచ్(స్విట్జర్లాండ్), న్యూయార్క్(అమెరికా), లండన్(బ్రిటన్) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
భూ బిల్లు పై వెనుక్కు తగ్గిన కేంద్రం
వివాదాస్పద భూసేకరణ బిల్లుపై గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా వంటి కీలక నిబంధనలను తిరిగి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఆగస్టు 3న నిర్వహించిన భేటీలో పలు సవరణలను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ చీఫ్ రాజన్ ఎస్ కటోచ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజన్ అక్టోబరు 31 వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. సీనియర్ ఐఏయస్ అధికారి అయిన రాజన్ పదవీ కాలాన్ని ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు పొడిగించింది. ఆయన తొలుత 2012 మార్చిలో ఈడీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
తల్లిపాల బ్యాంకుల్ని ప్రారంభించిన జయలలిత
ప్రయాణంలో ఉన్నప్పుడు పిల్లలకు పాలివ్వడం కోసం బస్ టెర్మినల్ ్సలో 352 ప్రత్యేక గదుల్ని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆగస్టు 1 నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తోన్న ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత వీటిని నెలకొల్పారు. వీటితో పాటు తిరుచారాపల్లి, మధురై, కోయంబత్తూర్, తేనీ, సేలం, తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రులలో తల్లిపాల బ్యాంకుల్ని ఆమె ఆరంభించారు. తల్లుల నుంచి సేకరించిన పాలను ఇక్కడ భద్రపరుస్తారు. గతేడాది పిల్లల ఆస్పత్రిలో తొలిసారిగా మిల్క్‌బ్యాంకును ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎస్సీ, ఎస్టీలపై అమానవీయ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఎస్సీ/ఎస్టీ సవరణ బిల్లు-2014ను లోక్‌సభ ఆగస్టు 4న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలను మానవ, జంతు కళేబరాలను తీసుకెళ్లేలా, చేతులతో పారిశుద్ధ్య పనులు చేసేలా బలవంతం చేయడం తదితర నేరాలకు కఠిన శిక్ష విధించేందుకు 1989 నాటి ఎస్సీ, ఎస్టీ(నేరాల నిరోధం) చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు.
బిల్లులోని ముఖ్యాంశాలు:
నేరాల విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు, బాధితులకు పునరావాసం.చెప్పుల దండలు వేయడం, ఎస్సీ, ఎస్టీలను అందరిముందు కులం పేరుతో దూషించడం, వారిపై విద్వేషాన్ని ప్రచారం చేయడం, చనిపోయిన ప్రముఖులను అగౌరవించడం, సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించడం, బహిష్కరిస్తామని బెదిరించడం వంటివి నేరాల కింద పరిగణిస్తారు.ఎస్సీ, ఎస్టీలను ఒక అభ్యర్థికి ఓటేసేలా బలవంతం చేయడం, వారి భూములను అక్రమంగా లాక్కోవడం, ఆ వర్గాల మహిళలపై దాడి, లైంగిక దాడి, లైంగికోద్దేశంతో అనుమతిలేకుండా తాకడం, మాట్లాడ్డం, సైగలు చేయడం, వారిని ఆలయాలకు దేవదాసీలుగా మార్చడం, ఎస్సీ, ఎస్టీలను ప్రజా భవనాలు వాడుకోకుండా అడ్డుకోవడం, ఆలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులకు రానివ్వకపోవడం కూడా నేరాలే.బాధితులకు, వారిపై ఆధారపడిన వారికి, సాక్షులకు ప్రభుత్వం నుంచి రక్షణ.ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎస్సీ, ఎస్టీయేతర ప్రభుత్వోద్యోగికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష.
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తడంతో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భోపాల్‌కు 160 కి.మీ. దూరంలోని ఖిర్కియా, భీరంగి స్టేషన్ల మధ్య మచక్ నది బ్రిడ్జిపై ఆగస్టు 4వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందగా, 50 మంది గాయపడ్డారు. ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామాయనీ ఎక్స్‌ప్రెస్ తొలుత బ్రిడ్జిపైకి రాగా, అదే సమయంలో పట్నా నుంచి ముంబై వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్ కూడా ఎదురుగా మరో ట్రాక్‌పై వచ్చింది, దీంతో రెండు రైళ్లూ పట్టాలు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది.
కశ్మీర్‌లో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది
భారత్‌లో మారణహోమం సృష్టించేందుకు సరిహద్దులు దాటి వచ్చిన ఓ పాక్ ఉగ్రవాదిని ఆగస్టు 5న ఇద్దరు భారత పౌరులు ప్రాణాలకు తెగించి, సజీవంగా పట్టుకున్నారు. ఈ ఉగ్రవాది పేరు మొహమ్మద్ నవేద్ యాకూబ్ అని, ఇతను పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ పట్టణంలో ఉన్న గులం ముస్తఫాబాద్ ప్రాంతానికి చెందినవాడని సైన్యం తెలిపింది. ఆగస్టు 5వ తేదీ ఉదయం మరో ఉగ్రవాది నొమన్ అలియాస్ మొమిన్‌తో కలసి యాకూబ్ అత్యాధునిక ఆయుధాలతో బీఎస్‌ఎఫ్ వాహన శ్రేణిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే సైన్యం జరిపిన ఎదురుదాడిలో మొమిన్ చనిపోగా.. యాకూబ్ అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే కొండల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలోకి వెళ్లాడు. అక్కడ ఐదుగురు గ్రామస్తులను బందీలుగా పట్టుకున్నాడు. అప్పటికే పోలీస్, ఆర్మీ ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. బందీలుగా చిక్కిన గ్రామస్తుల్లో గ్రామ రక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు రాకేశ్ కుమార్, విక్రమ్‌జిత్‌లు ధైర్యంగా ఆ ఉగ్రవాదిని బంధించి పోలీసులకు అప్పగించారు.
AIMS DARE TO SUCCESS
సెప్టెంబరు 2015 జాతీయం
అత్యుత్తమ ప్రాజెక్టుగా ‘ఏపీసీఎంయూహెచ్‌ఐఎస్’
అరుణాచల్‌ద్రేశ్ చీఫ్ మినిస్టర్స్ యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకం (ఏపీసీఎంయూహెచ్‌ఐఎస్)... దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు స్థానాన్ని దక్కించుకుంది. స్మార్ట్ గవర్నెన్స్- 2015 కింద దీనికి స్కోచ్ పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 41వ స్కోచ్ సమితి సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టచో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోని 12 అగ్రగామి ఆరోగ ్య ప్రాజెక్టుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద ఈ ప్రాజెక్టుకు పురస్కారం దక్కింది.
కేరళకు రూ. వంద కోట్ల సాయాన్ని ప్రకటించిన మాత
స్వచ్చభారత్ పథకంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టేందుకు కేరళ రాష్ట్రానికి మాతా అమృతానందమయి రూ. వంద కోట్ల సాయాన్ని ప్రకటించారు. మాత 62వ జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 27న ఈ మొత్తాన్ని కేరళ సీఎం ఊమెన్ చాందీ సమక్షంలో ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్రంలో టాయిలెట్ల నిర్మాణంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. గంగ శుద్ధి, స్వచ్ఛ భారత్ కోసం సెప్టెంబర్ నెలలోనే కేంద్రానికి మాత రూ. వంద కోట్లను విరాళమిచ్చారు.
ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష
తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక మోకా(ఎంసీఓసీఏ) కోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించింది. మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి దాదాపు రూ. 11 లక్షల చొప్పున రూ. 1.51 కోట్ల జరిమానా విధించింది. 2006, జూలై 11న ముంబైలోని ఏడు లోకల్ రైళ్లలో పదినిమిషాల వ్యవధిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది చనిపోగా, 829 మంది గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ముంబైలోని స్పెషల్ మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డీ షిండే పై తీర్పును వెలవరించారు.
అంబేడ్కర్ స్మారకార్థం పోస్టల్ స్టాంపు విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఈ మేరకు సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెప్టెంబర్ 30న స్టాంపును విడుదల చేశారు. అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోంది.
ఎస్‌పీఎంఆర్‌ఎం మిషన్‌కు కేబినెట్ ఆమోదం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రర్బన్(రూరల్-అర్బన్) మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)కు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 16న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో రూ.5,142.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300 గ్రామీణ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పురపథకం స్థానంలో ప్రభుత్వం గతేడాది ఎస్‌పీఎంఆర్‌ఎంను ప్రకటించింది. క్లస్టర్స్ అభివృద్ధిలో 14 అంశాలను పేర్కొన్నారు. ఇందులో డిజిటల్ అక్షరాస్యత, సంచార ఆరోగ్య కేంద్రం, రోడ్ల అనుసంధానం, ఆర్థిక కార్యక్రమాలతో ముడిపడిన నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం తగ్గించడం,గ్రామీణ వలసలను తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటారు.
నేతాజీ రహస్య ఫైళ్లను బయటపెట్టిన బెంగాల్ ప్రభుత్వం
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం, ప్రభుత్వ లాకర్లలో ఉన్న 64 రహస్య ఫైళ్లను సెప్టెంబర్ 18న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో బహిర్గతం చేశారు. 12,744 పేజీలున్న ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బయటపెట్టారు. ఫైళ్ల డీవీడీలను నగర పోలీస్ కమిషనర్ ఎస్‌కేపురకాయస్థ నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేతాజీ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదని ఈ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది. 1949 వరకు ఆయన జీవించే ఉన్నట్లు ఆధారాలున్నాయి.
బీడీఎల్, ఈసీఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం
భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్(ఈసీఐఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ రంగంలో క్షిపణులు, నీటి అడుగున ఆయుధ వ్యవస్థ తయారీలో పరస్పర సహకారంతో పనిచేయాలని సెప్టెంబర్ 21న బీడీఎల్‌లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు బీడీఎల్ చైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ వీ ఉదయ భాస్కర్, ఈసీఐఎల్ మేనేజింగ్ డెరైక్టర్ పీ సుధాకర్‌లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
డబ్ల్యూసీడీ, వేదాంత అవగాహన ఒప్పందం
దేశవ్యాప్తంగా నాలుగువేల అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ (డబ్ల్యూసీడీ) సెప్టెంబర్ 21న వేదాంత సంస్థతో అవగాహనా ఒప్పందం కుదర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా చిన్నారులు, మహిళల అభివృద్ధికి వేదాంత సోషల్ ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా బాలల్లో అక్షరాస్యత పెంపు, పోషకాహార లేమిని నివారించడం, మహిళల్లో వృత్తినైపుణ్యాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను వేదాంత ఆధునీకరిస్తుంది.
రాజస్తాన్‌లో గుజ్జర్లకు రిజర్వేషన్ బిల్లు ఆమోదం
రాజస్తాన్‌లో గుజ్జర్లు, మరికొన్ని ఇతర కులాల వారికి ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్‌బీసీ) కింద ఐదు శాతం రిజర్వేషన్లు, రిజర్వేషన్లు లేని వారిలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) వారికి 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 22న వేర్వేరు బిల్లులను ఆమోదించింది. బంజారా/బల్దియా/లాబానా, గడియా లోహర్/గడిలియా, గుజర్/గుర్జార్, రాయికా/రెబారి/దేబాసి, గడారియా/గాడ్రి/గయారి అనే పేర్లు గల ఐదు కులాల వారికి ఎస్‌బీసీ కింద 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
సరిహద్దుల్లో కాల్పుల నిషేధానికి అంగీకారం
సరిహద్దుల్లో కాల్పులు, మోర్టార్ షెల్స్ ప్రయోగంపై పూర్తి నిషేధాన్ని పాటించేందుకు భారత్, పాక్ అంగీకరించాయి. ఈ మేరకు సెప్టెంబరు 12న ఢిల్లీలో జరిగిన సరిహద్దు దళాల డెరైక్టర్ జనరల్స్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది.
10వ విశ్వ హిందీ సమ్మేళన్
10వ విశ్వ హిందీ సమ్మేళన్‌ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సెప్టెంబర్ 10న నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమ్మేళన్‌ను ప్రారంభించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఇంగ్లిష్, చైనీస్‌తోపాటు హిందీ డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతాయని మోదీ అన్నారు. హిందీని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హిందీ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి దీనిని సొమ్ము చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు హిందీలో ఆప్స్ రూపొందించాలని సూచించారు. ఈ సదస్సుకు గుర్తుగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌స్టాంపును ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆవిష్కరించారు.
ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారణ
ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు సెప్టెంబర్ 11న దోషులుగా నిర్ధారించింది. 2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 188 మరణించగా... 829 మంది గాయపడ్డారు. ఈ కేసులో తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా సెప్టెంబర్ 11న మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డి షిండే 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు.
మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు: 89 మంది మృతి
బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 89 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఓ భవనంలో భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో భవనం కుప్పకూలిపోయింది.
ఇందిర, రాజీవ్ స్టాంపులు ముద్రణ నిలిపివేత
మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ముఖచిత్రాలతో కూడిన స్టాంపుల ముద్రణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆధునిక భారత నిర్మాతలు’ పేరుతో ఇప్పటివరకు వీరిద్దరి స్టాంపులు రోజువారీ వినియోగానికి అందుబాటులో ఉండేవి. అయితే విధానపరమైన మార్పును తెస్తూ... ‘భారత నిర్మాతలు’ థీమ్‌తో పలువురు ప్రముఖుల పేరిట నిత్యవినియోగానికి స్టాంపులను ముద్రించనున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, మౌలానా ఆజాద్, భగత్‌సింగ్, జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, వివేకానంద, మహరాణా ప్రతాప్... తదితరుల ముఖచిత్రాలతో స్టాంపులు అందుబాటులోకి రానున్నాయి. ఇందిర, రాజీవ్‌లతో పాటు హోమీ జే భాభా, జేఆర్‌డీ టాటా, సీవీ రామన్, సత్యజిత్ రేల స్టాంపుల ముద్రణను కూడా నిలిపివేశారు. అయితే మహాత్మాగాంధీ, జవహర్ లాల్‌నెహ్రూ, బి.ఆర్.అంబేడ్కర్, మదర్ థెరిసాల ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను ఇదివరకటిలాగే కొనసాగిస్తారు.
వన్ పెన్షన్ అమలుకు కేంద్రం నిర్ణయం
మాజీ సైనికులకు ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 5న ప్రకటించారు. దీన్ని 2014 జూలై నుంచి వర్తింపచేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.8000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల మేర భారం పడనుంది. దాదాపు 24 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని మూడో పే కమిషన్ నివేదికల ఆధారంగా 1973లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.
డెహ్రాడూన్‌లో ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం
సహజ వారసత్వ ప్రాంతాల రక్షణలో భాగంగా తొలి ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం డెహ్రాడూన్‌లో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సెప్టెంబరు 2న భారత్, యునెస్కోలు సంతకాలు చేశాయి. ఈ కేంద్రాన్ని డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రపంచ స్థాయి సహజ వారసత్వ సంపద, నిర్వహణ, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఎనిమిది దేశాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు పనిచేస్తున్నాయి. కాగా సహజ వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదే. డెహ్రాడూన్‌లోని కేంద్రం ఆసియా, పసిఫిక్ ప్రాంతాలతో పాటు 50 దేశాల్లోని పరిరక్షించదగ్గ సహజ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 227 వారసత్వ ప్రాంతాలు ఉండగా అందులో 59 సహజ వారసత్వ ప్రాంతాలు. ఇండియాలో 32 వారసత్వ ప్రదేశాలు ఉండగా అందులో తొమ్మిది సహజ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.
మణిపూర్ హింసలో 8 మంది మృతి
మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు సెప్టెంబరు 1న నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారి 8 మంది మృతికి దారితీసింది. చురచాంద్‌పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. ఆగస్టు 31న శాసనసభ ఆమోదించిన మణిపూర్ భూ రెవెన్యూ, సంస్కరణల(సవరణ) బిల్లు-2015కు వ్యతిరేకంగా గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి కొనుగోలు హక్కు కల్పిస్తుంది. స్థానిక గిరిజన తెగలు ఇన్నర్‌లైన్ పర్మిట్ (ఐఎల్‌పీ) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
జనతా పరివార్ నుంచి వైదొలిగిన సమాజ్‌వాదీ పార్టీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసేందుకు కూటమిగా ఏర్పడిన జనతా పరివార్ నుంచి ములాయం సింగ్ సార్థ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వైదొలిగింది. ఈ మేరకు సెప్టెంబర్ 2, 2015వ తేదీన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎస్పీకి కేవలం ఐదు సీట్లు కేటాయించడం వల్లే కూటమి నుంచి వైదొలిగినట్లు ములాయం వెల్లడించారు. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.
విద్యార్థులకు పాఠాలు చెప్పిన రాష్ట్రపతి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2015వ తేదీన నిర్వహించిన ‘బి ఎ టీచర్’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లో ఉన్న ‘డా.రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ’ పాఠశాలలో ప్రణబ్ టీచర్ అవతారం ఎత్తారు. 11వ, 12వ తరగతి పిల్లలకు ‘భారతదేశ రాజకీయ చరిత్ర’పై గంటపాటు పాఠాలు చెప్పారు. దేశ చరిత్రలో రాష్ట్రపతి పదవిలో ఉండగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇదే తొలిసారి.
అమ్మ బేబీకేర్ కిట్‌ను ప్రారంభించిన జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ బేబీ కేర్ కిట్’ అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నవజాత శిశువుకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ కిట్‌లో రూ.1000 విలువ చేసే సామాగ్రి ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ. 67 కోట్లను కేటాయించింది.
అక్టోబర్ 12 నుంచి బిహార్ ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 2015, అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ వెల్లడించారు. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బిహార్ ప్రస్తుత శాసనసభ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది. 2010లో జరిగిన గత ఎన్నికల్లో 6 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బిహార్‌లో 6.68 కోట్లమంది ఓటర్లున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 16న వెలువడనుంది.
పశ్చిమ మధ్య రైల్వే ఘనత
దేశంలో మానవ రహిత లెవల్ క్రాసింగులు లేని తొలి రైల్వే జోన్ గా పశ్చిమ మధ్య రైల్వే నిలిచింది. 2014 ఏప్రిల్ 1 నాటికి కాపలాదారులు లేని లెవల్ క్రాసింగులు 118 ఉండగా, వాటిలో 2014-15 లో 80, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతావాటి ని తొలగించారు. దేశవ్యాప్తంగా 29,487 లెవల్ క్రాసింగులు ఉండగా, 10,046 క్రాసింగు ల్లో కాపలాదారులు లేరు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, రైల్ అండర్‌బ్రిడ్జ్‌లు నిర్మించేందుకు రూ.30వేల కోట్లతో రైల్వే శాఖ ‘స్పెషల్ రైల్వే సేఫ్టీ ఫండ్’ను ఏర్పాటుచేసింది.
AIMS DARE TO SUCCESS
అక్టోబరు 2015 జాతీయం
వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 130వ స్థానం
ప్రపంచబ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట రూపొందించిన జాబితాలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల జాబితాను ప్రపంచబ్యాంకు అక్టోబరు 28న విడుదల చేసింది. కొత్త కంపెనీల చట్టం, మెరుగైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు భారత్‌ను 130వ స్థానంలో నిలిపాయి. మొత్తం జాబితాలో సింగపూర్‌కు మొదటి ర్యాంక్ వచ్చింది. న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
అమృత్ కార్యాచరణకు కేంద్రం ఆమోదం
అమృత్ పథకం ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు రూపొందించిన రాష్ట్రస్థాయి వార్షిక కార్యాచరణ ప్రణాళికల (ఎస్‌ఏఏపీ)కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అక్టోబరు 23న ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.663 కోట్ల వ్యయంతో 26 నగరాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరా, ఉద్యానవనాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కింద పనులు చేపట్టనున్నారు. ఇందులో యాభై శాతం వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తాగునీటి సరఫరా పథకాలకు రూ. 646 కోట్లు, ఉద్యానవనాలకు రూ. 17 కోట్లు ఖర్చు చేస్తారు.
యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు
దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళా పైలట్లను నియమిస్తామని అక్టోబరు 24 రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపిక చేస్తామని కేంద్రం తెలిపింది. 2017 జూన్ నాటికి వారికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొంది.
ఢిల్లీలో భారత్ -ఆఫ్రికా సదస్సు
నాలుగు రోజుల పాటు జరిగే మూడో భారత్-ఆఫ్రికా సదస్సు ఢిల్లీలో అక్టోబరు 26న ప్రారంభమైంది. ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాలు పాల్గొంటున్న ఈ సదస్సుకు 40 దేశాల ప్రభుత్వాధినేతలు హాజరు కానున్నారు. భారత్, ఆఫ్రికాల మధ్య ఏటా సుమారు 70 బిలియన్ డాలర్ల (4.5 లక్షల కోట్లు) వ్యాపారం కొనసాగుతోంది. ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతోపాటు ఇంధనం, వాణిజ్యం, ఆహారం, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరుపుతారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధకంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తారు.
ఐటీ చట్టాల సరళీకరణపై కమిటీ
ఆదాయపు పన్ను (ఐటీ) చట్టాల సరళీకరణపై సిఫారసులు చేయడానికి భారత ప్రభుత్వం అక్టోబర్ 27న ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ ఈశ్వర్ నేతృత్వం వహించే ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. జనవరి 31వ తేదీలోపు కమిటీ తన మధ్యంతర నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్‌లో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి వీలుగా తాజా కమిటీ సిఫారసులను వినియోగించుకోవాలన్నది కేంద్రం ప్రధాన ఉద్దేశం.
ఢిల్లీ ఐఐటీలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్
 భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 28న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ టౌన్‌హాల్‌లో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. భారత్‌లో 13 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారులున్నారని, వీరిలో ఎక్కువమంది తమ అనుబంధ సంస్థ వాట్సప్‌కు కూడా కనెక్ట్ అయి ఉండటం అద్భుతమని అన్నారు. నెట్ న్యూట్రాలిటీకి తమ కంపెనీ కట్టుబడి ఉందని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్ వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచడంలో ఏ కొన్నింటిపైనో పక్షపాతం చూపకుండా టెల్కోలు తటస్థంగా వ్యవహరించాలన్నది నెట్ న్యూట్రాలిటీ సూత్రం. నెట్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే పేరుతో కొన్ని టెలికం కంపెనీల భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ తలపెట్టిన ‘ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్’ ప్రాజెక్టు ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్‌జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పు
ఎన్‌జేఏసీ ఏర్పాటు, కొలీజియం వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అక్టోబరు 16న తీర్పు వెలువరించింది. ఎన్‌జేఏసీ, 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే కొలీజియం వ్యవస్థలోనూ లోపాలున్నాయని తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ పారదర్శకమేనని, దాన్ని ఇంకా సమర్థంగా అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
రామేశ్వరంలో కలాం స్మారకం
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ఆయన జన్మించిన రామేశ్వరంలో స్మారకం నిర్మిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కలాం 84వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15న ఢిల్లీలో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యిందని, దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ‘ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలాం లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, కలాం స్మారకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.
కలాం పేరిట పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌లు
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్(డాక్టరేట్ చేసిన తర్వాత ఇచ్చే అవార్డు)లు అందజేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పర్యావరణం, జీవావరణ రంగాల్లో యువ శాస్త్రవేత్తలను పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఫెలోషిప్‌లు అందజేయనున్నారు. కలాం 85వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్, ఎకాలజీ రంగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 35 ఏళ్ల లోపున్న యువ శాస్త్రవేత్తలకు ఈ ఫెలోషిప్‌లు అందజేస్తారు. ఫెలోషిప్ కాలపరిమితి మూడేళ్లు. రీసెర్చ్ అసోసియేట్‌కు సమానంగా మంత్లీ ఫెలోషిప్‌తో పాటు కంటింజెన్సీ గ్రాంటుగా రూ.1.5 లక్షలు అందిస్తారు.
ఇజ్రాయెల్ వర్సిటీలతో ఐఐటీ ఖరగ్‌పూర్ ఒప్పందం
గగనతలంపై పరిశోధన, సహకారం, అధ్యాపకుల సందర్శన పర్యటనలు, వ్యవసాయం, కంప్యూటర్ సైన్స్, విద్యార్థుల మార్పిళ్లకు సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ అక్టోబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన మూడు విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెంట ఇజ్రాయెల్‌కు వెళ్లిన విద్యాబృందం సభ్యుడైన ఐఐటీ ఖరగ్‌పూర్ డెరైక్టర్ పీపీ చక్రవర్తి ఈ మేరకు బెన్ గురియన్ విశ్వవిద్యాలయం (బీజీయూ), హిబ్రూ, హయిఫా విశ్వవిద్యాలయాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
‘బలిదాన్ దివస్’గా గాడ్సేను ఉరితీసిన రోజు
మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను ఉరితీసిన నవంబర్ 15వ తేదీని ‘బలిదాన్ దివస్’గా నిర్వహించాలని అతివాద హిందూ సంస్థ ‘హిందూ మహాసభ’ నిర్ణయించింది. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకూ హిందూ మహాసభ సన్నాహాలు చేస్తోంది. గాంధీ హత్యకేసులో మరో నిందితుడైన నాథూరాం సోదరుడు గోపాల్ రచనలను ప్రజలకు పంచిపెట్టాలని యోచిస్తోంది.
మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్
బాలీవుడ్‌లో విజయం సాధించిన సల్మాన్ ఖాన్ చిత్రం బజరంగీ భాయ్‌జాన్‌ను మూకీ చిత్రంగా డబ్బింగ్ చేయనున్నారు. పాకిస్తాన్‌లో తప్పిపోయిన భారత్‌కు చెందిన మూగ-చెవిటి యువతి గీత కోరిక మేరకు ఈ చిత్రాన్ని సైగలతో రూపొందిచనున్నారు. భారత్‌లో తప్పిపోయిన ఓ పాకిస్తానీ చిన్నారిని ఆమె తల్లి దగ్గరకు చేర్చే వృత్తాంతంతో తీసిన బజరంగీ భాయ్‌జాన్ తన జీవితానికి దగ్గరగా ఉందని.. ఈ చిత్రాన్ని మూగ భాషలో డబ్బింగ్ చేస్తే.. తనలాంటి చాలా మంది చూసి ఆనందిస్తారని గీత కోరినట్లు అధికారులు వెల్లడించారు.
బీహార్ తొలిదశలో 57 శాతం పోలింగ్
బీహార్ శాసనసభకు అక్టోబరు 12న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 57 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 54.5 శాతం మంది పురుషులు, 59.5 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశలో 49 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ నాయక్ తెలిపారు.
అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
ముంబైలోని ఇందు మిల్స్ ఆవరణలో 400 కోట్ల వ్యయంతో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక నిర్మాణానికి అక్టోబర్ 11న మోదీ శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ జీవితంతో ముడిపడివున్న 5 ముఖ్యమైన స్థలాలను.. ప్రజలు సందర్శనార్థం ‘పంచ తీర్థాలు’గా అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం 150 అడుగుల ఎత్తు, 110 అడుగుల చుట్టుకొలత ఉంటుంది.
‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్’ పుస్తకావిష్కరణ
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్-యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించారు. అక్టోబర్ 12న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్‌ఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణితో కలసి కసూరి పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ముంబై నగరంలో పాకిస్తాన్‌కు చెందిన పుస్తకావిష్కరణను వ్యతిరేకించిన శివసేన కార్యకర్తలు.. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న సుధీంద్ర కులకర్ణిని అడ్డుకుని ఆయనపై సిరాతో దాడి చేశారు. ముఖంపై, దుస్తులపై నల్లరంగు పులిమారు. దీంతో పటిష్ట పోలీసు భద్రత నడుమ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జనవరి నుంచి నేతాజీ ఫైళ్లు బహిర్గతం
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని మోదీ అక్టోబర్ 14న అధికారికంగా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్‌లో ఈ మేరకు సమావేశమయ్యారు.
జర్మనీ చాన్సలర్ భారత పర్యటన
 భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్‌తో కూడిన 28 సభ్యుల బృందం అక్టోబరు 4న న్యూఢిల్లీ చేరుకుంది. పర్యటనలో భాగంగా ఆమె అక్టోబరు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టులకు రూ.7,300 కోట్ల మేర జర్మనీ ఆర్థిక సాయం అందించనుంది. దేశంలో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన ఫాస్ట్‌ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఈ సందర్భంగా మెర్కల్ 10వ శతాబ్దంలో కశ్మీర్‌లో చోరీకి గురైన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.
గ్రీన్ హైవేస్ పాలసీ-2015 ఆవిష్కరించిన కేంద్రం
హరిత జాతీయ రహదారుల విధానం-2015ను (గ్రీన్ హైవేస్ పాలసీ) కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబరు 29న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులకు రెండు వైపులా మొక్కలు నాటుతారు. తొలి ఏడాది 6,000 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణాన్ని కాపాడటం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌కు 55వ స్థానం
ప్రపంచ పోటీతత్వ సూచీ (2015-16)లో భారత్ 55వ స్థానంలో నిలిచింది. 140 దేశాలకు సంబంధించిన సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సెప్టెంబరు 29న విడుదల చేసింది. 2014-15లో 71వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంవత్సరం సూచీలో 16 స్థానాలను మెరుగుపరచుకుంది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానం దక్కించుకుంది. సింగపూర్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య వంటి 12 అంశాలు-వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని సూచీని రూపొందించారు.
‘నీరాంచల్’కు కేబినెట్ ఆమోదం
రైతులకు నీటిపారుదల సౌకర్యాలను పెంచే ఉద్దేశంతో రూ. 2,142.30 కోట్లతో జాతీయ వాటర్‌షెడ్ నిర్వహణ పథకం ‘నీరాంచల్’కు అక్టోబర్ 7న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇందులో 50% (రూ.1,071.15 కోట్లు) ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 50 శాతాన్ని ప్రపంచబ్యాంక్ రుణంగా అందించనుంది. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలోను, అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు.
కర్బన ఉద్గారాలను 35 శాతం తగ్గిస్తాం: భారత్
వాతావరణంలో కర్బన ఉద్గారాల విడుదలను గణనీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని భారత్ ప్రకటించింది. 2030 నాటికి ఉద్గారాల విడుదలను 33-35 శాతం తగ్గిస్తామని వెల్లడించింది. అలాగే మొత్తం శక్తి వినియోగంలో పునరుద్ధరింపదగిన ఇంధన వనరులు వినియోగాన్ని 40 శాతానికి పెంచుతామని ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 1న ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్‌ఎఫ్‌సీసీసీ)కు తన ఆలోచనలు, లక్ష్యాలతో నివేదిక(ఐఎన్‌డీసీ)ను సమర్పించింది.
AIMS DARE TO SUCCESS
నవంబరు 2015 జాతీయం
రాజ్యంగ దినోత్సవంగా నవంబరు 26
రాజ్యాంగ సభ.. 1949, నవంబరు 26న రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నట్లు నవంబరు 26న లోక్‌సభ ప్రకటించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 26న ప్రారంభమయ్యాయి.
భారత్‌లో తొలి పోలియో వ్యాక్సిన్ ఇంజక్షన్
పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తొలి సారిగా ఇంజక్టబుల్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ‘ఇన్‌యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (IPV)’ ఇంజక్షన్‌ను నవంబర్ 30న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. మొదటి దశలో ఈ వ్యాక్సిన్ ఆరు రాష్ట్రాల్లో (అస్సాం, గుజరాత్, పంజాబ్, బిహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్) ప్రవేశ పెడుతున్నారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్
 బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి, వరుసగా మూడోసారి. ఆయనతో పాటు 28 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు మంత్రివర్గంలో చేరారు. వీరిలో తేజ్ ప్రతాప్ ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
అంతర్జాతీయ ఇండాలజీ సదస్సు
తొలి అంతర్జాతీయ ఇండాలజిస్టుల సదస్సును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 21న న్యూఢిల్లీలో ప్రారంభిచారు. సదస్సులో ప్రణబ్ మాట్లాడుతూ.. దుష్ట శక్తులు ప్రేరేపిస్తున్న అసహనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రస్తుతం ప్రపంచం ఇబ్బంది పడుతోందని అన్నారు. ఇండాలజీలో కృషి చేసిన జర్మనీ ఫ్రొపెసర్ ఎమిరెటస్ హెన్రిచ్ ఫ్రీహెర్‌కు విశిష్ట ఇండాలజిస్టు అవార్డును అందజేశారు.
రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26
నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1949 నవంబర్ 29న భారత రాజ్యాంగానికి ఆమోదం లభించగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవం రోజున చేపట్టే వివిధ కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు
15 కీలక రంగాలకు సంబంధించి...విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్రం నవంబర్ 10న నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు ఎఫ్‌డీఐలకు అనుమతి ప్రక్రియను సరళతరం చేసింది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్, తోటపంటల సాగులో 100 శాతం, న్యూస్, కరెంట్ అఫైర్స్, టీవీ చానెళ్లు, రక్షణ రంగంలో 49 శాతం, నిర్మాణ రంగంలో పూర్తై ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రాంతీయ ఎయిర్ సర్వీసుల్లో 49 శాతం మేర ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌గా అనుమతి మంజూరు చేయనున్నారు. రూ.5000 కోట్ల పరిధి వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి మంజూరు చేసే అధికారాన్ని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుకు కల్పించారు. గతంలో బోర్డుకు రూ.3,000 కోట్లు వరకే నిర్ణయాధికారం ఉండేది.
అత్యుత్తమ 100 యూనివర్సిటీల్లో బెంగళూరు ఐఐఎస్‌సీ
ప్రపంచంలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) స్థానం దక్కించుకొంది. ఈ జాబితాలో ఐఐఎస్‌సీ తొలిసారిగా 99వ స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నవంబర్ 12న ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, కాల్‌టెక్, మసాచుసెట్స్ యూనివర్సిటీలు(మిట్) వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.
ఎన్‌ఎస్‌సీఎన్-కేపై నిషేధం
నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్ (ఎన్‌ఎస్‌సీఎన్-కే)పై నిషేధంతోపాటు, ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ భారత ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్.ఎస్. ఖప్లాంగ్ సారథ్యంలో 1988, ఏప్రిల్ 30న ఎన్‌ఎస్‌సీఎన్-కే సంస్థ ఏర్పాటైంది. నాగా ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. భారత ఈశాన్య ప్రాంతంలోని నాగా, పక్కనే ఉన్న మయన్మార్‌లోని కొంత ప్రాంతాన్ని కలుపుకుని ‘నాగాలిం’ ఏర్పాటు కోసం ఈ ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోంది.
మూడు బంగారు పథకాలను ప్రారంభించిన ప్రధాని
మూడు కొత్త పసిడి పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 5న ప్రారంభించారు. అవి.. గోల్డ్ డిపాజిట్ స్కీం, గోల్డ్ బాండ్‌ల జారీ, బంగారు నాణేల విడుదల. దేశంలో గృహాలు, సంస్థల్లో ఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు గోల్డ్ డిపాజిట్ స్కీంను ప్రభుత్వం తీసుకొచ్చింది. బంగారం కొనుగోలుకు బదులు పేపర్ గోల్డ్‌ను ప్రోత్సహించేందుకు గోల్డ్ బాండ్‌ల పథకాన్ని ప్రారంభించారు. దేశంలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం బంగారు నాణేల విక్రయాన్ని ప్రారంభించింది. నాణేలపై ఒకవైపు జాతీయ చిహ్నం అశోకచక్రం, మరోవైపు మహాత్మా గాంధీ చిత్రం ఉన్నాయి. బంగారం దిగుమతులను వీలైనంత తగ్గించటం పసిడి పథకాల ప్రధాన ఉద్దేశం. గోల్డ్ డిపాజిట్ పథకం కింద మధ్యకాలిక డిపాజిట్లపై 2.25 శాతం, దీర్ఘకాలిక డిపాజిట్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. ప్రభుత్వ గోల్డ్ బాండ్లపై వార్షిక వడ్డీ రేటు 2.75 శాతం.
‘ఇంప్రింట్ ఇండియా’ను ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన పరిశోధనలకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ప్రాజెక్టు ‘ఇంప్రింట్ ఇండియా’ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 5న ఆవిష్కరించారు. ఇది దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల సంయుక్త ప్రాజెక్టు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ కోసం 0.5 శాతం సేవా పన్ను
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. సేవలపై 0.5 శాతం పన్ను విధించాలని నవంబరు 6న నిర్ణయించింది. ఇది నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి రూ.100 విలువపై 50 పైసలును సెస్ రూపంలో వసూలు చేస్తారు. ప్రస్తుతం సేవలపై 14 శాతం సేవల పన్ను వసూలు చేస్తున్నారు. 0.5 శాతం సేవా పన్ను ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు సమకూరనుంది. కేంద్రం 2015-16 బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం సెస్ వసూలు ప్రతిపాదన చేసింది.
బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల మహా కూటమి విజయం సాధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, కాంగ్రెస్ పార్టీ కలసి మొత్తం 243 స్థానాల్లో 178 స్థానాలు గెలుచుకున్నాయి. నవంబరు 8న ప్రకటించిన ఫలితాల్లో ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీయేకు 58 స్థానాలు దక్కాయి. ఇందులో భాజపాకు 53, దాని మిత్రపక్షాలకు అయిదు స్థానాలు లభించాయి. రెండు పక్షాల మధ్య ఓట్ల తేడా 8 శాతం.
‘ఒక ర్యాంకు, ఒక పెన్షన్’ అమలుకు నోటిఫికేషన్
మాజీ సైనికోద్యోగులకు ‘ఒక ర్యాంకు, ఒక పెన్షన్’ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబరు 7న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల 25 లక్షల మంది మాజీ సైనికులకు, యుద్ధంలో మరణించిన వారి భార్యలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ విధానం వల్ల ఒకే ర్యాంకులో పనిచేసి, గతంలో రిటైరైన ఉద్యోగులకు, అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందుతుంది. 2014, జూలై 1 నుంచి ఈ విధానం వర్తిస్తుంది. ఈ విధానం కోసం మాజీ సైనికులు 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొత్త విధానం అమలు వల్ల కేంద్ర ప్రభుత్వంపై 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.
మాతా, శిశు సంరక్షణకు ‘ప్రాజెక్టు ఆస్మాన్’
మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణ విధానాల ద్వారా భారత్‌లో మాతా, శిశు మరణాలను తగ్గించే దిశగా ప్రైవేటు రంగ దిగ్గజాలు చేతులు కలిపాయి. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ఎంఎస్‌డీ ఇండియా, రిలయన్స్ ఫౌండేషన్, టాటా ట్రస్టు, యునెటైడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ‘ప్రాజెక్టు ఆస్మాన్’ను రూపొందించాయి.
ప్రపంచంలోనే మెదటి లింగ సమానత్వ సదస్సు
లింగ సమానత్వంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కేరళ ప్రభుత్వం, యూఎన్ మహిళా విభాగం నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు కోవలం సమీపంలో నవంబర్ 12న ప్రారంభమైంది. మహిళలు, హిజ్రాలతో పాటు లింగవివక్ష ఎదుర్కొంటున్న పలువురి సమస్యలను ఈ సదస్సులో వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది పరిశోధకులతోపాటు దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు మూడు రోజులపాటు కొనసాగనుంది.
అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 7వస్థానం
ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయబ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఈ ఏడాది 7వ స్థానం దక్కింది. భారత బ్రాండ్ ఫైనాన్స్ నవంబరు 1న విడుదల చేసిన 100 దేశాల జాబితాలో భారత్ ఒకస్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంది. భారత్ బ్రాండ్ విలువ 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్‌లు వరసగా టాప్ స్థానాల్లో ఉన్నాయి. అమెరికా బ్రాండ్ విలువ 1970 కోట్ల డాలర్లుగా ఉంది. ఒకదేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల విక్రయాల ఆధారంగా జాతీయ బ్రాండు విలువను లెక్కిస్తారు.
పసిడి వినియోగం భారత్‌లో అధికం
 ప్రపంచంలో అత్యధికంగా పసిడి వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ తొమ్మిది నెలల్లో 642 టన్నుల బంగారాన్ని వినియోగించిందని జీఎఫ్‌ఎంఎస్ గోల్డ్ సర్వే 2015 మూడో త్రైమాసిక రిపోర్టులో థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. రెండో స్థానంలో చైనా నిలిచింది.
AIMS DARE TO SUCCESS
డిసెంబరు 2015 జాతీయం
డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో ఛత్తీస్‌గఢ్‌కు తొలిస్థానం
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో అత్యున్నత సేవలు అందించిన రాష్ర్టంగా ఛత్తీస్‌గఢ్ అవార్డు గెలుచుకుంది. డిజిటల్ ఇండియా వారోత్సవాలు-2015 సందర్భంగా ఛత్తీస్‌గఢ్ విశిష్ట సేవలు అందించి తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబరు 28న కేంద్ర సమాచార- ప్రసారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ అవార్డును అందజేస్తారని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ముఖ్యకార్యదర్శి అమన్‌కుమార్ సింగ్ డిసెంబర్ 25న వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్, కొరియా, గరియాబాంద్ జిల్లాలు ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో విశిష్టంగా కృషి చేశాయి. ఈ సేవల్లో హిమాచల్ ప్రదేశ్ రెండోస్థానాన్ని దక్కించుకోగా, మేఘాలయ మూడోస్థానంలో నిలిచింది. జులై 1 నుంచి 7 వరకు నిర్వహించిన డిజిటల్ ఇండియా వారోత్సవాల సందర్భంగా అందించిన సేవల ఆధారంగా ఈ పురస్కారాల ఎంపిక జరిగింది.
రూ. 10 లక్షల ఆదాయం దాటితే గ్యాస్ సబ్సిడీపై కోత
వార్షికాదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు వంట గ్యాస్ సబ్సిడీపై కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2016 జనవరి నుంచే అమల్లోకి వచ్చే ఈ నిబంధన ప్రకారం.... వినియోగదారులైన భార్యా, భర్తల్లో ఎవరో ఒకరు పదిలక్షల రూపాయల కంటే ఆదాయం ఉండి పన్ను చెల్లిస్తుంటే వంట గ్యాస్ రాయితీని కోల్పోతారు. ప్రారంభంలో వినియోగదారుడి ప్రమాణ పత్రం ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 2014-15లో కేంద్రం ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.40,551 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ ఏడాది ఆయిల్ ధరలు తగ్గడంతో ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో రూ.8,814 కోట్లు మాత్రమే కేంద్రం భరించింది. ఈ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా సబ్సిడీలకు కోతపెడుతోంది.
‘సోలార్’ రాయితీ రూ. 5 వేల కోట్లకు పెంపు
స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంపొందించే కృషిలో భాగంగా.. ఇంటి పైకప్పులు, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లను అనుసంధానించే గ్రిడ్‌కు అందించే ఆర్థిక సాయాన్ని (రాయితీని) రూ. 600 కోట్ల నుంచి దాదాపు పది రెట్లు పెంచుతూ రూ. 5,000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ సోలార్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 4,200 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు స్థాపించటానికి ఈ నిధులు దోహదం చేస్తాయి. ఈ పథకం కింద సాధారణ తరగతి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 30 శాతం పెట్టుబడి రాయితీ, ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 70 శాతం పెట్టుబడి రాయితీ అందిస్తారు. ప్రైవేటు రంగంలో వాణిజ్య, పారిశ్రామిక ప్లాంట్ల స్థాపనకు ఇతరత్రా ప్రయోజనాలు ఉన్నందున వాటికి రాయితీలు వర్తించవు. కేంద్ర కేబినెట్ డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది.
ఐఏఎస్‌ల సస్పెన్షన్‌కు ప్రధాని ఆమోదం తప్పనిసరి
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. తాజా నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏ ఐఏఎస్ అధికారినైనా ఇకపై సస్పెండ్ చేయాలంటే ప్రధాని ఆమోదం తప్పనిసరి. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లయితే 48 గంటల్లోగా ఆ సమాచారాన్ని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. తాజా నిబంధనల ప్రకారం ఐఎస్‌ఎస్ అధికారుల సస్పెండ్ పీరియడ్‌ను మూడు నెలల నుంచి రెండు నెలలకు తగ్గించారు. సస్పెన్షన్ పెంపు వ్యవధిని కూడా ఆరు నెలల నంచి నాలుగు నెలలకు కుదించారు. సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) మంత్రి ఆధ్వర్యంలోని సమీక్ష కమిటీ సిఫారసుల ఆధారంగా ఐఏఎస్‌లను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది.
త్రివిధ దళాల వార్షిక సదస్సు
త్రివిధ దళాల వార్షిక సదస్సు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య (కోచి వద్ద సముద్రంలో)లో డిసెంబర్ 15న జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఉగ్రవాద నిర్మూలనా చర్యల్లో భాగంగానే పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ బయట త్రివిధ దళాల వార్షిక సమావేశం జరగటం ఇదే తొలిసారి.
రెమిటెన్స్ పొందటంలో భారత్‌కి మొదటి స్థానం
రెమిటెన్స్ పొందుతున్న దేశాల్లో 2014 సంవత్సరానికి గానూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 7000 కోట్ల డాలర్ల (ప్రవాస భారతీయుల నుంచి పొందుతున్న డబ్బు) రెమిటెన్స్ పొందింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 4 శాతంగా ఉంది. చైనా 6,400 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌లతో రెండో స్థానాన్ని దక్కించుకొంది. ఫిలిప్పీన్స్ 2,800 కోట్ల డాలర్లు, మెక్సికో 2,500 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 2014లో ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌ల మొత్తం 58,300 కోట్ల డాలర్లు కాగా, 2015గానూ ఈ మొత్తం 58,600 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా.
పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం పెంపు
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 16 నుంచి పెట్రోలియంపై 30 పైసలు, డీజిల్‌పై రూ.1.17 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో అదనపు, ప్రత్యేక ఎక్సైజ్ సుంకాలతో కలిపి లీటరు పెట్రోలుపై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.19.36కు, సాధారణ డీజిల్‌పై మొత్తం సుంకం రూ.11.83కు చేరింది.
వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 97వ స్థానం
ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 97వ స్థానం దక్కించుకొంది. 2015 సంవత్సరానికి గానూ 144 దేశాలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ డిసెంబర్ 17న ప్రకటించింది. జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలువగా, జర్మనీ (18), అమెరికా (22), రష్యా (81), చైనా (94) స్థానాల్లో ఉన్నాయి.
యాహూ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఆవు
బీఫ్‌పై నిషేధం, గో రక్షణ, అసహనం.. తదితర వివాదాస్పద అంశాలపై ఆన్‌లైన్లో నెలకొన్న హంగామాకు నిదర్శనంగా ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2015’గా ఆవును యాహూ సంస్థ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్‌పై నిషేధం ప్రకటించింది మొదలు భారత్‌లో ఆన్‌లైన్ చర్చలు, ‘దాద్రి’, అసహనంపై చర్చ వంటివి తమ నిర్ణయానికి కారణమని యాహూ తెలిపింది. ఆన్‌లైన్లో ఎక్కువమంది వెతికిన మహిళా సెలబ్రిటీగా వరుసగా నాలుగో ఏటా సన్నీ లియోన్ నిలవగా, పురుష సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్ నిలిచాడు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు బిల్లుల ఆమోదం
నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23తో ముగిశాయి. లోక్‌సభ 117గంటల 14 నిమిషాలు కొనసాగగా, రాజ్యసభ 60 గంటలకుపైగా కొనసాగింది. లోక్‌సభలో 13 బిల్లులు ఆమోదం పొందగా.. రాజ్యసభ 9 బిల్లులకే ఆమోదం తెలిపింది. 2016, ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దామనుకున్న కీలకమైన జీఎస్‌టీతోపాటు పలు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లులు
లోక్‌సభ: బోనస్ బిల్లు, దివాలా బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, అణుశక్తి బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు
రాజ్యసభ: జువనైల్ జస్టిస్ బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, కమర్షియల్ కోర్టులు-కమర్షియల్ డివిజన్ బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, బోనస్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు.
నల్లధనం తరలింపులో 4వ స్థానంలో భారత్
నల్లధనాన్ని విదేశాలకు తరలించటంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ డిసెంబర్ 9న నల్లధనంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో 2013-14లో భారత్ నుంచి 51 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలివెళ్లిందని పేర్కొంది. పన్ను ఎగవేత, నేరాలు, అవినీతి వంటి అక్రమ మార్గాలలో ఆర్జించిన సొమ్మును నల్లధనంగా ఆ సంస్థ తెలిపింది. కాగా, ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశం నుంచి ఏటా 139 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. చైనా తర్వాత స్థానాల్లో 104 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్థానం, 52.8 బిలియన్ డాలర్లతో మెక్సికో మూడోస్థానంలో ఉన్నాయి.
వికలాంగుల జాబితాలో యాసిడ్ దాడి బాధితులు
యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల జాబితాలో చేర్చాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డిసెంబర్ 7న ఆదేశించింది. ఉచిత చికిత్స, పునరావాసాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బీహార్‌లో యాసిడ్ దాడికి గురైన బాలిక కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాలికకు ఉచిత చికిత్సతో పాటు పరిహారంగా రూ.10 లక్షలు అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న యాసిడ్ దాడులపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
కుంచించుకుపోతున్న ఎవరెస్ట్ హిమానీనదాలు
వాతావరణ మార్పుల కారణంగా గత 40 ఏళ్ల కాలంలో ఎవరెస్ట్ హిమానీనదాలు 28 శాతం కుంచించుకుపోయాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, హునన్ యూనివర్సిటీ ఆఫ్ సెన్సైస్, మౌంట్ కోమో లాంగ్మా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్లు డిసెంబర్ 7న సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. గత 50 ఏళ్లుగా ఎవరెస్ట్ శిఖరం వద్ద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
జపాన్ ప్రధాని భారత పర్యటన
జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 11న భారత్ చేరుకున్నారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో అబే భేటీ అయ్యారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వివిధ సమస్యల పరిష్కారం కోసం భారత్ తీసుకున్న చొరవను షింజో అబే స్వాగతించారు. మరోవైపు, అబేకు ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ పాత్ర, ప్రధానిగా షింజో అబే చొరవకు గౌరవంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌యూ వీసీ సుధీర్ కుమార్ తెలిపారు.
ప్రణబ్ జన్మదినం సందర్భంగా పుస్తకాల ఆవిష్కరణ
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 80వ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. ప్రణబ్ ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో రూపొందించిన ‘సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ - మూడో సంపుటం’ పుస్తకాన్ని, ‘ప్రెసిడెన్షియల్ రిట్రీట్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. ప్రజలు చారిత్రక స్పృహను పెంపొందించుకోవాలని.. చారిత్రక వారసత్వ సంపద భావి తరాలకు అందేలా చూడాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.
‘ఒక ర్యాంకు - ఒక పెన్షన్’పై కమిటీ
ఒక ర్యాంకు-ఒక పెన్షన్ (ఓఆర్‌ఓపీ) అమలులో ఎదురయ్యే అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ కమిటీని నియమిస్తున్నట్లు డిసెంబర్ 14న ప్రకటించింది. కమిటీకి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలుగు వాడైన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నాయకత్వం వహిస్తారు. ఆరు నెలల్లోగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7న ప్రభుత్వం ప్రకటించిన ఓఆర్‌ఓపీ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను.. వాటిపై వచ్చిన సూచనలు, సిఫార్సులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో డిసెంబర్ 15న కొచ్చిలో భేటీ అయ్యారు. హిందూ మహా సముద్ర జలాలపై యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై త్రివిధ దళాధిపతులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశ రాజధానికి ఆవల త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం. చరిత్రను మార్చడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సహకారంలో పురోగతి, సుస్థిరత, సౌభాగ్యతలతో ఈ ప్రాంతాన్ని విలసిల్లజేయడం లక్ష్యాలుగా పాక్‌తో చర్చలు మళ్లీ ప్రారంభిస్తున్నామని మోదీ చెప్పారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ పాల్గొన్నారు.
భారత్‌లో మరో గూగుల్ క్యాంపస్: సుందర్ పిచాయ్
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్‌లో కొత్తగా మరో భారీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు పెద్దయెత్తున ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2015 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 16న న్యూఢిల్లీ వచ్చిన సందర్భంగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. భారత్‌లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించారు. 2016 చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 400 స్టేషన్లలో ఉచిత వైఫై కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగం రైల్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో 100 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తామని పిచాయ్ వెల్లడించారు.
అంబేద్కర్ నాణేల విడుదల
 అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 6న, ఆయన స్మారకార్థం రూ.125, రూ.10 నాణేలను విడుదల చేశారు.
గిన్నిస్ రికార్డుల్లోకి ఎల్‌పీజీ సబ్సిడీ
వంటగ్యాస్ నగదు బదిలీ పథకానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఎల్‌పీజీ సబ్సిడీ ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ పథకంగా గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సర్టిఫికెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అందజేశారు. ఈ పథకం కింద జూన్ 30 నాటికి 12.57 కోట్ల మంది ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. 2013, సెప్టెంబరు 1న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
లోక్‌సభలో మధ్యవర్తిత్వ చట్ట సవరణ బిల్లు
వాణిజ్య వివాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం కోసం ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్ట సవరణ బిల్లు (Arbitration and Conciliation Bill)ను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా ‘మధ్యవర్తిత్వం, ఒప్పంద చట్టం-1996’లో సవరణలు చేయనున్నారు. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరిధిలోకి సేవలు, వస్తువులు, విధానాలను చేర్చాల్సిన బిల్లుకు లోక్‌సభ డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది.
జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం
జన్‌లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ డిసెంబర్ 4న ఆమోదించింది. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో 64 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లు అమల్లోకి వస్తే.. అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవు. కేంద్ర మంత్రులు కూడా దీని కింద విచారణ ఎదురుకోవాల్సి ఉంటుంది.
హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు
న్యూఢిల్లీలో డిసెంబర్ 4న నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశాభివృద్ధికోసం తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళుతుందని మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలసి వస్తేనే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతిబాటలో తీసుకెళ్లడం కేంద్రప్రభుత్వం ఒకరివల్లే సాధ్యపడదన్న మోదీ.. రాష్ట్రాల అభివృద్ధికోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తన పిలుపుతో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల కుటుంబాలు ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నాయని, వీటిని తమ ప్రభుత్వం పేదవర్గాలకు ఇస్తుందని చెప్పారు.
100 శాతం పొగరహిత గ్రామంగా వైచకూరహళ్లి
ప్రతీ ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్ ఉండటంతో కర్ణాటకలోని వైచకూరహళ్లి గ్రామాన్ని వందశాతం పొగరహిత (స్మోక్‌లెస్) గ్రామంగా కేంద్ర పెట్రోలియం శాఖ గుర్తించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చేపట్టిన పొగరహిత గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉన్న దేశంలోనే తొలి గ్రామంగా చిక్కబళాపుర జిల్లాలోని వైచకూరహళ్లిని ఎంపిక చేసింది. 276 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఇంతకుముందు 174 ఇళ్లలో మాత్రమే ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండేవి.
ఖాన్ అకాడమీతో కలిసి టాటా ట్రస్ట్స్ ఉచిత ఆన్‌లైన్ విద్య
భారత్‌లో ఉచిత ఆన్‌లైన్ విద్యను అందించేందుకు టాటా ట్రస్ట్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థ ఖాన్ అకాడమీతో జతకడుతున్నట్లు డిసెంబర్ 6న ఒక ప్రకటనలో తెలిపింది. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ భాగస్వామ్యంలో టాటా ట్రస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ యాక్సెస్ ఆన్‌లైన్ మాధ్యమాల్లో ఒకటిగా నిలుస్తున్న ఖాన్ అకాడమీకి నిధులు అందించనుంది.
బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 16 భారత వర్సిటీలు
బ్రిక్స్ దేశాలు సహా 35 వర్థమాన దేశాల్లోని 200 అగ్రశ్రేణి ఉన్నత విద్యాసంస్థల జాబితాలో భారత్‌కు చెందిన 16 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ‘టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ర్యాంకింగ్స్’లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) 16వ స్థానంలో నిలిచి టాప్-20లోకి ప్రవేశించింది. ఐఐటీ-బాంబే 29వ ర్యాంకు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) మాత్రం ఈ ఏడాది జాబితాలో చోటు కోల్పోగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 193వ ర్యాంకు దక్కింది. ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివ ర్సిటీలో డిసెంబర్ 3న జరిగిన టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ సమ్మిట్‌లో ఈ ర్యాంకులను విడుదల చేశారు.
కాలుష్యం నియంత్రణకు ‘ఆడ్/ఈవెన్’ ఫార్ములా
దేశ రాజధాని న్యూఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ‘ఆడ్/ఈవెన్’ ఫార్ములాను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 2016, జనవరి 1వ తేదీ నుంచి ఢిల్లీ రోడ్లపై సరి సంఖ్య నంబర్లు గల వాహనాల (కార్లు)ను ఒకరోజు, బేసి సంఖ్య నంబరు కలిగిన వాహనాలను మరొక రోజు అనుమతించనున్నట్లు ప్రకటించింది. కాలుష్యం సృష్టిస్తోన్న బదర్‌పుర్ థర్మల్ విద్యుత్తు పవర్‌ప్లాంటును కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఇలాంటి విధానం అమలు చేసిన తొలి నగరంగా, ఆసియాలో బీజింగ్ తర్వాత రెండో నగరంగా ఢిల్లీ నిలుస్తుంది.
ఆగ్రాలో పక్షుల పండుగ
అంతర్జాతీయ పక్షుల పరిశీలన కేంద్రంగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఆ రాష్ట్ర అటవీ శాఖ.. ఫిక్కి సంస్థ సహకారంతో ఆగ్రాలోని జాతీయ చంబల్ అభయారణ్యంలో మూడు రోజులపాటు అంతర్జాతీయ పక్షి ఉత్సవాన్ని నిర్వహించనుంది. 2016 జనవరి 4న ప్రారంభమయ్యే ఈ ఉత్సవం 6న ముగుస్తుంది. 25 దేశాలకు చెందిన అంతర్జాతీయ పక్షి నిపుణులతోపాటు భారత్‌కు చెందిన మరో 80 మంది పక్షి శాస్త్రవేత్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు.
చెక్ బౌన్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
చెక్ బౌన్స్ కేసుల్లో చెక్కును జారీ చేసిన చోట కాకుండా, చెక్కును చెల్లింపుల కోసం సమర్పించే ప్రాంతంలో కేసు నమోదు చేసేందుకు వీలు కల్పించే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లు -2015ను పార్లమెంటు డిసెంబర్ 7న ఆమోదించింది. దీంతో చెక్ జారీ చేసిన ప్రాంతంలో కాకుండా చెక్ బౌన్స్ జరిగిన ప్రాంతంలో ఫిర్యాదులు నమోదు చేయడానికి వీలవుతుంది.
రియల్ ఎస్టేట్ బిల్లుకు కేంద్రం ఆమోదం
రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్మాణ ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని ప్రత్యేక ఎస్క్రొ ఖాతాలో(మూడో వ్యక్తి నియంత్రణలో ఉండే తాత్కాలిక అకౌంట్) డిపాజిట్ చేయాలన్న నిబంధనకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2015లో సవరణ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన డిసెంబర్ 9న సమావేశమైన కేబినెట్ రియల్ ఎస్టేట్ బిల్లులోని ఈ ప్రతిపాదనతో పాటు పలు ఇతర ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కచ్చితత్వం, వివాదాల పరిష్కారాల్లో వేగం.. మొదలైనవి లక్ష్యాలుగా ఈ బిల్లును రూపొందించారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:
పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో 1.5 లక్షల టన్నులతో ఈ ఏడాదే ఒక ఆపద్ధర్మ నిల్వ(బఫర్ స్టాక్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఆహార ధాన్యాలు, పంచదారను ప్యాక్ చేసేందుకు జనపనార బస్తాలను ఉపయోగించాలి. ఈ నిర్ణయం వల్ల 3.7 లక్షల జౌళి మిల్లు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.అదనంగా 106 అంతర్గత జల రవాణా మార్గాలను జాతీయ జల రవాణా మార్గాలుగా మార్చేందుకు చట్టం చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. జాతీయ జలరవాణా మార్గాల బిల్లు-2015లో అధికారిక సవరణలకు అంగీకారం.

No comments:
Post a Comment