అంతర్జాతీయం 2015 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం
జనవరి 2015 అంతర్జాతీయం
ఇటలీ నూతన అధ్యక్షుడిగా సెర్గియో మతారెల్లా
ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మతారెల్లా(73) ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా జనవరి 31న ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు 665 ఓట్లు సాధించి మతారెల్లా విజయం సాధించారు. సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుని హత్యానంతరం మతారెల్లా క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.
అడిస్ అబాబాలో ఏయూ సదస్సు
54 దేశాలకు సభ్యత్వం ఉన్న ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) రెండు రోజుల వార్షిక సదస్సు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగింది. ఆఫ్రికా ఖండం భద్రతకు, రక్షణకు, అభివృద్ధికి తీవ్రవాదం ముఖ్యంగా బోకో హరమ్ తీవ్రవాద సంస్థ చర్యలు ముప్పుగా పరిణమించడంపై సదస్సులో చర్చించా రు. ఇది నైజీరియా నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని అణచివేతకు దళాలను పంపాలని సభ్యదేశాలు నిర్ణయించాయి.
వృద్ధిలో చైనాను అధిగమించనున్న భారత్
భారత వృద్ధిరేటు 2016లో 6.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) జనవరి 20న విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదికలో అంచనా వేసింది. ఇదే ఏడాది చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది. భారత వృద్ధిరేటు 2014లో 5.8 శాతం (చైనా 7.4 శాతం) ఉండగా, 2015లో 6.3 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ముడిచమురు ధరల క్షీణత, పరిశ్రమల్లో పెట్టుబడులు పుంజుకోవడం వంటివి భారత్‌కు అనుకూల అంశాలని నివేదికలో పేర్కొన్నారు.
అభిశంసనకు గురైన థాయిలాండ్ మాజీ ప్రధాని
సైన్యం మద్దతు ఉన్న థాయిలాండ్ పార్లమెంటు నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎన్‌ఎల్‌ఏ).. ఆ దేశ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను జనవరి 23న అభిశంసనకు గురిచేసింది. దీంతో ఆమెను రాజకీయాల నుంచి అయిదేళ్లు పాటు నిషేధించడానికి అవకాశం ఏర్పడిం ది. బియ్యం సబ్సిడీ పథకంలో అవినీతిని అరికట్టలేకపోయారన్న కారణంగా ఇంగ్లక్‌ను అభిశంసించారు.
అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014
నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ చేపట్టిన రెండు వేర్వేరు అధ్యయనాల ప్రకారం 1880 మొదలు భూమిపై నమోదైన అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 గుర్తింపు పొందింది. ఈ నివేదిక జనవరి 16న విడుదలైంది.
ప్రపంచ సంపదలో క్రైస్తవులదే అధికం
ప్రపంచ సంపదలో అధికంగా క్రైస్తవుల వద్దే ఉన్నట్లు ‘న్యూ వరల్డ్ వెల్త్’ సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో ముస్లింలు, హిందువులు ఉన్నట్లు తెలిపింది. క్రైస్తవుల వద్ద 55 శాతం సంపద (107,280 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ఉండగా, ముస్లింల సంపద 5.8 శాతం (11,335 బిలియన్ డాలర్లు), హిందువుల సంపద 3.3 శాతం (6,505 బిలియన్ డాలర్లు) అని పేర్కొంది. ప్రపంచంలో అధికంగా సంపద కలిగి ఉన్న పది దేశాల్లో ఏడు దేశాలు క్రైస్తవులు అధికంగా ఉన్నవే.
ప్రపంచ టాప్-50లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల జాబితా(2014 ఏడాదికి)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చోటు దక్కించుకుంది. మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ ఈ టాప్-50 జాబితాను రూపొందించింది. 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ 45వ స్థానంలో నిలిచింది. టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది.
శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన
శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన జనవరి 9న ప్రమాణస్వీకారం చేశారు. జనవరి 8న జరిగిన ఎన్నికల్లో సిరిసేన అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న మహీంద రాజపక్సపై విజయం సాధించారు. ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో సిరిసేన జన్మించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగిడి, అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. రాజపక్స ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడినరోజే సిరిసేన తన ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష కూటమి మద్దతుతో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలన్న లక్ష్యంతో రాజపక్స రాజ్యాంగాన్ని సవరించి ఎన్నికలను రెండేళ్లు ముందుకు జరిపారు.
ఫ్రాన్స్‌లో పత్రిక కార్యాలయంపై దాడి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై జనవరి 8న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ చార్బోనియర్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు ఫ్రాన్స్‌లో ఇంతమందిని పొట్టనబెట్టుకోవడం ఇదే ప్రథమం. ఈ దాడికి వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, బ్రిటన్ ప్రధాని కామెరాన్‌లతోపాటు 50 దేశాల నేతలు పాల్గొన్నారు.
వీగిన పాలస్తీనా తీర్మానం
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. 2014, డిసెంబర్ 31న మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 8 దేశాలు మద్దతు పలికాయి. మరో తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. మండలి వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించకపోతే.. తీర్మానం ఆమోదం పొందడానికి 9 దేశాల మద్దతు అవసరం. కానీ అమెరికా, ఆస్ట్రేలియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
ఉత్తర కొరియాపై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాం టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది.
AIMS DARE TO SUCCESS
ఫిబ్రవరి 2015 అంతర్జాతీయం
ఐపీసీసీ చైర్మన్ పదవికి పచౌరీ రాజీనామా
ఐక్య రాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) చైర్మన్ ఆర్.కె. పచౌరీ (74) ఫిబ్రవరి 24న పదవికి రా జీనామా చేశారు. ఈ పదవిలో ఆయన 13 ఏళ్ల పాటు కొనసాగారు. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారనే కేసు ను ఎదుర్కొంటున్నందు వల్ల ఆయన రాజీనామా చేశారని భావిస్తున్నారు. పచౌరీ, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌కు 2007లో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
రికార్డు స్థాయిలోతృణ ధాన్యాల ఉత్పత్తి
ప్రపంచ తృణ ధాన్యాల ఉత్పత్తి 2014లో రికార్డు స్థాయిలో 2,534 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు ఐరాసకు చెందినఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తెలిపింది. 2013తో పోలిస్తే ఇది 13 మిలియన్ టన్నులు ఎక్కువ. ఎఫ్‌ఏవో అంచనాల ప్రకారం ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య దశాబ్ద కాలంలో 100 మిలియన్లు తగ్గగా.. ఇదే కాలంలో తృణ ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 500 మిలియన్ టన్నులు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 1104 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఆహార పదార్థాలుగా, 876 మిలియన్ టన్నులు జంతువుల ఆహారం కోసం వినియోగిస్తున్నారు. 2013-14లో భారత్‌లో 245.5 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఉత్పత్తయ్యాయి. ఈ ఉత్పత్తి దశాబ్ద కాలంలో 33 శాతం పెరిగింది. 96 మిలియన్ టన్నుల గోధుమలు, 106.5 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది.
ఉక్రెయిన్ - శాంతి ఒప్పందం
తూర్పు ఉక్రెయిన్ సంక్షోభంపై బెలారస్‌లో జరిగిన చర్చలు 2015 ఫిబ్రవరి 11న శాంతి ఒప్పందంతో ముగిశాయి. ఉక్రెయిన్, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం లభించింది. ఇది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తుంది. భారీ బలగాలను ఉపసంహరిస్తారు. తిరుగుబాటు ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారు.
పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 136వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా 2015 సంవత్సరానికి విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌కు 136వ స్థానం దక్కింది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. దీంట్లో ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్‌క వరసగా మొదటి స్థానాల్లో నిలిచాయి. 2014లో భారత ర్యాంకు 140.
సముద్ర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు
2010లో ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలిసినట్లు సైన్‌స జర్నల్ పేర్కొంది. ఇది 1961లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన ప్లాస్టిక్‌కు దాదాపుగా సమానం. సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాన్ని లెక్కగట్టడం ఇదే తొలిసారి. ఈ వ్యర్థాల్లో 83 శాతం 20 దేశాలకు చెందినవే ఉన్నాయి. చైనా ఏటా 8.82 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాన్ని దుబారా చేస్తూ మొదటి స్థానంలో ఉంది. భారత్ 0.6 మిలియన్ టన్నుల వ్యర్థాలతో 12వ స్థానంలో ఉంది. కోస్తా తీరంలోని 192 దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణను మెరుగుపర్చకపోతే వచ్చే దశాబ్దంలో ఈ వ్యర్థాలు రెండింతల కంటే ఎక్కువవుతాయని అధ్యయనంలో తేలింది.
నిధులను అడ్డుకునే తీర్మానం
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపునకు వచ్చే నిధులను అడ్డుకునే తీర్మానానికి ఐరాస భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం ద్వారా ఐఎస్, అల్‌ఖైదాకు చెందిన సంస్థలతో వ్యక్తులు, సంస్థలు చమురు వాణిజ్యం జరపడంపై ఆంక్షలు విధించారు.
యోగాలో గిన్నిస్ రికార్డ్
యోగాసనాలు వేయడమంటేనే కొంచెం కష్టమైన విషయం. అలాంటిది మూడు రోజులపాటు ఏకధాటిగా ఆసనాలు వేయడమంటే... అసాధ్యం అనిపిస్తుంది కదా. ఆ అసాధాన్ని సుసాధ్యం చేశాడు భారత దేశానికి చెందిన ఓ యోగా గురువు. హాంకాంగ్‌లో యోగ శిక్షణనిస్తున్న సీపీ యోగరాజ్ శుక్రవారం ఉదయంనుంచి ఆదివారం వరకూ ఏకంగా మూడు రోజుల్లో 40 గంటలపాటు 1500 ఆసనాలను ప్రదర్శించి పురుషుల విభాగంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు.
లిబియాలో క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
మతోన్మాదం నెత్తికెక్కిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను లిబియాలో అత్యంతపాశవికంగా హతమార్చారు. లిబియా రాజధాని ట్రిపోలీ దగ్గర్లోని సముద్రతీరంలో ఆ క్రిస్టియన్లకు ఆరెంజ్ రంగు దుస్తులు వేసి, చేతులను వెనక్కు విరిచికట్టేసి, వరుసగా నిల్చోబెట్టి నలుపురంగు దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్న ఉగ్రవాదులు అత్యంత హేయం గా తలలు తెగనరికారు. ఆ దృశ్యాలున్న వీడియోను ఆన్‌లైన్లో ఫిబ్రవరి 15న విడుదల చేసి, ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. ఐదు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియో చివరలో ఒక ఉగ్రవాది ‘అల్లాపై ఒట్టేసి చెబుతున్నాం. షేక్ ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని మీరు దాచి న సముద్ర జలాల్లోనే మీ రక్తాన్ని కలుపుతాం’ అంటూ ప్రతినబూనిన దృశ్యం కూడా ఉంది. తమ తదుపరి లక్ష్యం ఇటలీ రాజధాని రోమ్ అనే హెచ్చరిక ఆ వీడియోలో ఉంది. లిబియాలోని సిర్తె పట్టణంలో నెల రోజుల క్రితం ఆ క్రిస్టియన్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఐఎస్ బలంగా ఉన్న సిరియా, ఇరాక్‌లకు ఆవల మరో దేశంలో ఈ స్థాయి హత్యలకు తెగబడడం ఐఎస్‌కు ఇదే తొలిసారి. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఈజిప్ట్ తీవ్రంగా స్పందించింది. ఆ వీడియో విడుదలైన కాసేపటికే.. పొరుగుదేశం లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదసంస్థ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుధాగారాలపై యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున పలు దఫాలుగా వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 64 మంది మిలిటెంట్లు హతమయ్యారని, ఐదుగురు పౌరులు చనిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు.
2012లో 80 లక్షల కేన్సర్ మరణాలు
 ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఈ వ్యాధికి సంబంధించిన గణాంకాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసింది. 2012లో కేన్సర్‌తో 80 లక్షల మందికిపైగా మరణించగా, వీరిలో 60 శాతం మంది ఆఫ్రికా; ఆసియా; మధ్య, దక్షిణ అమెరికాలో ఉన్నారు. ఈ వ్యాధి 2012 లో ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలిచింది. భారత్‌లో 2011లో 10,57,204 కేన్సర్ కేసులు నమోదుకాగా, 2014 నాటికి ఈ సంఖ్య 11,17,269కు చేరింది. దేశంలో ఏటా కేన్సర్‌తో ఐదు లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా.
యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా
యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తరకొరియా ఫిబ్రవరి 7న ప్రకటించింది. ఈ క్షిపణి రష్యా కు చెందిన కేహెచ్-35 తరహాలో 130-140 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. సముద్ర ఉపరితలానికి దగ్గరగా వేగంగా ప్రయాణించగలదు.
నాలుగు సార్క్ దేశాల మధ్య స్వేచ్ఛా రవాణా ఒప్పందం!
సార్క్‌దేశాలలైన భారత్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌ల వుధ్య స్వేచ్ఛా రోడ్డు రవాణా సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఒప్పందం మోటార్ వెహికల్ అగ్రిమెంట్ (ఎంవీఏ)త్వరలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ నాలుగుదేశాల మధ్య రాకపోకలు, సరుకు రవాణా అత్యంత ఖర్చుతో కూడుకుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగుదేశాల మధ్య ఇప్పడున్న ప్రయాణ, రవాణా ఛార్జీలు భారీగా తగ్గుతాయని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 6న పకటించింది. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లకూ అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిమెంట్ (ఎంవీఏ)కు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు కోల్‌కతా సమీపంలోని రాయ్‌చక్‌లో సమావేశం అయ్యూరు. ఒప్పందం విజయవంతంగా అమలుచేయడానికి ఆయా దేశాలు చేపట్టాల్సిన ప్రణాళికలు, చర్యలను వేగవంతం చేయూలని అధికారులు నిర్ణయించారు.
AIMS DARE TO SUCCESS
మార్చి 2015 అంతర్జాతీయం
పారదర్శకతలో భారత్‌కు 37వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా పారదర్శకమైన పరిపాలనలో భారత్ 37వ స్థానంలో నిలిచింది. ‘వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (డబ్ల్యూజేపీ)’ ఏటా విడుదల చేసే ‘ఓపెన్ గవర్నమెంట్ ఇండెక్స్-2015’ నివేదిక ఈ ర్యాంకును ఇచ్చింది. 102 దేశాలను పరిగణనలోకి.. దక్షిణాసియాకు సంబంధించి భారత్ తొలిస్థానంలో నిలిచింది. ఈ జాబితా రూపకల్పనలో వివిధ దేశాలకు సంబంధించి అమల్లో ఉన్న చట్టాలు, సమాచార హక్కు, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదు వ్యవస్థలను పరిశీలించి మార్కులు ఇస్తారు.
యాపిల్ చీఫ్ టిమ్ కుక్... రూ.4,700 కోట్ల విరాళం
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ (54)..సామాజిక సేవా కార్యక్రమాల కోసం యావదాస్తిని దానం చేయనున్నట్లు తెలిపారు. తన సోదరుని కుమారుడి కాలేజీ చదువుకు అయ్యే ఖర్చులను పక్కన పెట్టి, మిగతాదంతా ఇచ్చివేయనున్నట్లు వెల్లడించారు.సాధారణంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే టిమ్ కుక్.. ఫార్చూన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. ఫార్చూన్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 785 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,710 కోట్లు) ఉంటుంది. యాపిల్‌లో ప్రస్తుతం ఆయనకి ఉన్న షేర్ల విలువ 120 మిలియన్ డాలర్లు కాగా, మరో 665 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఆయనకు దఖలుపడనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలకు బిలియనీర్ ఇన్వెస్టరు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తదితరులు ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు వితరణ చేస్తున్న సంగతి తెలిసిందే.
యూకేలోని తొలి 101 ఆసియా కుబేరుల సంపద రూ. 5.06 లక్షల కోట్లు
యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)లో ఆసియా దేశాలకు చెందిన తొలి 101 మంది కుబేరుల వద్ద ఉన్న మొత్తం సంపద ఎంతో తెలుసా? 54.48 బిలియన్ పౌండ్లు. అంటే దాదాపు 5.06 లక్షల కోట్ల రూపాయలు. గతేడాదితో పోలిస్తే ఈ సంపద 2.95 బిలియన్ పౌండ్లు పెరిగింది. ఆసియన్ మీడియా, మార్కెటింగ్ గ్రూప్‌నకు చెందిన ‘ఈస్ట్రన్ ఐ’ పత్రిక 2015 సంవత్సరానికి గాను ‘యూకేస్ 101 వెల్తీయెస్ట్ ఆసియన్స్’ పేరిట సంపన్నుల జాబితాను విడుదల చేసింది. హిందూజా సోదరులు, లక్ష్మీ మిట్టల్ ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రవాస భారతీయులైన జి.పి.హిందూజా, ఎస్.పి.హిందూజా సోదరుల ఆస్తుల విలువ 15.5 బిలియన్ పౌండ్లు(1.44 లక్షల కోట్లు) వీరి సంపద గతేడాది కంటే ఎన్నో రెట్లు పెరిగింది. ఉక్కు దిగ్గజం, ఆర్సెలార్ మిట్టల్ సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ మిట్టల్ ఆస్తుల విలువ గతేడాది 9.7 బిలియన్ పౌండ్లు(రూ.90.21 వేల కోట్లు) కాగా ఈ ఏడాది 2.3 బిలియన్ పౌండ్లు (రూ.21.30 వేల కోట్లు) ఉంది. ఉక్కు ధరలు తగ్గడంతో ఆయన సంపద తరిగిపోయింది. లక్ష్మీ మిట్టల్ వ్యాపార సామ్రాజ్యం 60 దేశాలకు విస్తరించింది. జాబితాలోని ధనవంతుల మొత్తం సంపద గతేడాది కంటే 5.7 శాతం పెరిగింది. కొపారో గ్రూప్ వ్యవస్థాపకుడు లార్డ్ స్వరాజ్ పాల్ రిచ్ లిస్ట్‌లో 12వ స్థానం దక్కించుకున్నారు. ఆయన వద్దనున్న సంపద 725 మిలియన్ పౌండ్లు(రూ.67.80 వేల కోట్లు) ఇది గతేడాది కంటే 25 మిలియన్ పౌండ్లు తక్కువ. స్వరాజ్‌పాల్ గతంలో వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీ చాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం వోల్మర్‌హాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్‌గా పనిచేస్తున్నారు.
ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు దేశాల్లోనే..
ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, ఇండోనేషియాలో ఉన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) మార్చి 19న తన నివేదికలో పేర్కొంది. 2014లో బలమైన ఆర్థిక వృద్ధి చూపిన ఈ దేశాల్లో 363 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్న వారున్నట్లు తెలిపింది. 2014-15 ప్రపంచ ఆహార విధాన నివేదిక (జీఎఫ్‌పీఆర్) ఈ దేశాలు తమ ఆహార విధానాలను మార్చుకోవాలని కోరింది. పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టిసారించాలని, వ్యవసాయంలో లింగ వ్యత్యాసం తొలగించాలని, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు గ్రామీణ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరింది.
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
బెంజిమెన్ నెతన్యాహూ మరోసారి ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగనున్నారు. మార్చి 18న జరిగిన ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ పార్లమెంటు నెస్సెట్‌లోని 120 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుంది. అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఇతర చిన్నపార్టీలతో కలిసి నెతన్యాహూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టారు.
ఎల్-1బీ వీసా నిబంధనలు సరళతరం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విదేశీ ఐటీ సంస్థలకు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఎల్-1బీ వీసా మంజూరు ప్రక్రియను మరింత సరళతరం చేశారు. విదేశీ పెట్టుబడులను, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికాకు రప్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒబామా మంగళవారం సెలెక్ట్ యూఎస్‌ఏ సదస్సులో మాట్లాడారు. గ్లోబల్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఎల్-1బీ వీసా కేటగిరీలో సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించారు. దీనిప్రకారం.. అమెరికాలో కార్యాలయాలను కలిగిన విదేశీ సంస్థలు తాత్కాలిక అవసరాల కోసం ఉద్యోగులను విదేశాల నుంచి అమెరికాకు సులభంగా, త్వరగా పంపించవచ్చు.
స్వదేశీ ద్రోణ్, క్షిపణిని పరీక్షించిన పాక్
పాకిస్తాన్ దేశీయంగా తయారుచేసిన తొలి ఆయుధ ద్రోణ్‌ను, లేజర్ గెడైడ్ క్షిపణిని మార్చి 13 విజయవంతంగా పరీక్షించింది. ద్రోణ్‌ను బుర్రాక్, క్షిపణిని బార్‌కగా పిలిచారు. బుర్రాక్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలదు. వీటివల్ల పాక్‌కు ఉగ్రవాదంపై పోరాటం జరిపే సామర్థ్యం పెరుగుతుందని పాక్ ప్రధాన సైన్యాధికారి జనరల్ రహీల్ షరీఫ్ తెలిపారు.
బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహం
మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్‌లో మార్చి 14న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీతోపాటు పలువురు రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్‌లో ఏర్పాటైన తొలి భారతీయుడి విగ్రహం గాంధీదే. ప్రభుత్వ పదవులు నిర్వహించని వ్యక్తి విగ్రహం కూడా ఇదే. తొమ్మిది అడుగుల ఈ విగ్రహాన్ని శిల్పి ఫిలిప్ జాక్సన్ రూపొందించారు. 1931లో లండన్ పర్యటనలో శాలువాతో ఉన్న గాంధీ రూపంతో ఈ విగ్రహం మలిచారు.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ నషీద్‌కు కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద ఆ దేశ కోర్టు మార్చి 13న శిక్ష ప్రకటించింది. 2012 జనవరిలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రధాన న్యాయమూర్తి అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారన్న అభియోగాలపై జైలు శిక్షకు గురయ్యారు. నషీద్ మాల్దీవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు. పోలీసులు, సైన్యం తిరుగుబాటు చేయడంతో 2012 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశంతోనే విచారణ సరిగా చేయలేదని నషీద్ న్యాయవాదులు పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో నషీద్‌ను పాల్గొనకుండా చేసేందుకే శిక్ష విధించారని ప్రతిపక్షం ఆరోపించింది.
ఐఎస్‌పై సంయుక్త పోరాటం: ఆసియాన్ దేశాల తీర్మానం
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల నుంచి పరిణమించే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్)లోని 10 సభ్యదేశాలుతీర్మానించాయి. మలేసియాలోని లంగ్వాయిలో రెండు రోజులపాటు జరిగిన ఆసియాన్ దేశాల రక్షణ మంత్రులు సమావేశంలో ప్రాంతీయ భద్రతను పరిరక్షించుకోవాలన్న డిక్లరేషన్‌పై మార్చి 16న సంతకాలు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మలేసియా రక్షణ మంత్రి హిశాముద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, ఐఎస్ ప్రభావానికి మూలకారణాలను గుర్తించి దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే విపత్తు నివారణకు ఆసియాన్ మిలిటరీ రెడీ గ్రూప్, ఆసియాన్ సెంటర్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్‌ను ఏర్పాటుచేసే అంశంపై చర్చించామన్నారు.
చట్టసభల్లో రెండింతలైనమహిళల ప్రాతినిధ్యం
ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 20 ఏళ్లలో రెండింతలు పెరిగిందని ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) మార్చి 5న తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 22.1 శాతం పార్లమెంటరీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. ఇది 1995లో 11.3 శాతంగా ఉండేది. సబ్ - సహారా ఆఫ్రికన్ దేశాల సభల్లో అధికంగా మహిళలు ఉన్నారు. రువాండాలో అత్యధికంగా 3.8 శాతం మంది ఉన్నారు. తర్వాత స్థానాల్లో బొలీవియా, అండోర్రా ఉన్నాయి. స్వీడన్ ఆరో స్థానంలో ఉంది. కోటా విధానం వల్ల మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇది 120 దేశాల్లో అమలవుతోందని ఐపీయూ పేర్కొంది.
బిలియనీర్ల జాబితాలో బిల్‌గేట్స్‌కు అగ్రస్థానం
ఫోర్బ్స్ పత్రిక మార్చి 2న ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 79.2 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన అగ్రస్థానంలో నిలవడం ఇది 16వసారి. రెండో స్థానంలో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (77.1 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో వారెన్ బఫెట్ (72.7 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
భారత బిలియనీర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ జాబితాలో ముకేశ్ అంబానీ (21 బిలియన్ డాలర్లు) 39వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ (20 బిలియన్ డాలర్లు) 44వ స్థానంలో, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (19 బిలియన్ డాలర్లు)48వ స్థానంలో ఉన్నారు.
నమీబియా అధ్యక్షుడికి మో ఇబ్రహీం అవార్డు
ప్రపంచంలో అత్యంత విలువైన మో ఇబ్రహీం ఆఫ్రికన్ లీడర్‌షిప్ అవార్డుకు నమీబియా అధ్యక్షుడు హిఫి కెపున్యె పొహాంబ ఎంపికయ్యారు. నమీబియా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు కృషి చేసినందుకు పొహాంబను ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ మార్చి 2న ప్రకటించింది. రెండోసారి నమీబియా అధ్యక్షుడిగా పనిచేస్తున్న పొహాంబ పదవీ కాలం మార్చి 21తో ముగుస్తుంది. సూడాన్‌కు చెందిన టెలికాం వ్యాపారి మో ఇబ్రహీం ఈ అవార్డును నెలకొల్పారు. దీని కింద పదేళ్లలో 50 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.31 కోట్లు) అందజేస్తారు. ఆ తర్వాత అవార్డు దక్కిన వ్యక్తికి జీవితాంతం ఏటా రెండు లక్షల డాలర్లు (సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు) అందజేస్తారు.
ఒబామా వీటో ప్రయోగం
కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. దీంతో రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షునిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఒబామా ఈ అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి.
‘ఎన్‌డీబీ’లో బ్రిక్స్ దేశాలకు సమాన వాటా
బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు ఏర్పాటు చేయనున్న ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’లో అన్ని సభ్య దేశాలకు సమాన వాటా ఉంటుందని, లావాదేవీలు అమెరికా డాలర్లలో జరుగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో చెప్పారు. అన్ని సభ్య దేశాలకు సమాన వాటా ఉండాలన్న భారత ప్రతిపాదనను మిగతా సభ్య దేశాలన్నీ అంగీకరించాయని సుష్మా అన్నారు.
AIMS DARE TO SUCCESS
ఏప్రిల్ 2015 అంతర్జాతీయం
నేపాల్‌లో భూకంపం
నేపాల్ రాజధాని కఠ్మాండులో ఏప్రిల్ 25న ఉదయం సంభవించిన తీవ్ర భూకంపంలో 4000 మందికి పైగా మరణించారు. 6,500 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది గల్లంతయ్యారు. అనేక వారసత్వ కట్టడాలు దెబ్బతిన్నాయి. ధరహారా టవర్, దర్బారాహాల్‌తో పాటు అనేక పురాతన ఆలయాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి నేపాల్‌లో 26 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిమాలయాల్లో ఎవరెస్టు బేస్ క్యాంపుపై మంచు కొండలు విరిగిపడడంతో 22 మంది పర్వతారోహకులు మరణించారు. 60 మందికి గాయాలవగా, 217 మంది గల్లంతయ్యారు. ఇదేరోజు భారత్‌లోని బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. భారత్‌లో 73 మంది మరణించగా, బీహార్‌లోనే 23 మంది మృతిచెందారు. నేపాల్ రాజధాని కఠ్మాండుకు వాయువ్యంగా 80 కి.మీ దూరంలో ఉన్న లామ్‌జంగ్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకం ప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. తర్వాత రోజు కూడా నేపాల్‌లో అనేక సార్లు భూమి కంపించింది. నేపాల్‌లో గడచిన 80 ఏళ్లలో ఎప్పుడూ ఇంతటి భూకంపం సంభవించలేదు. ఆపరేషన్ మైత్రి పేరుతో నేపాల్‌కు సహాయ, పునరావాస చర్యలను భారత్ చేపట్టింది. ఆహార పదార్థాలు, మందులు, వైద్యబృందాలను నేపాల్‌కు పంపింది. రక్షణ, పునరావాస కార్యకలాపాల్లో వందలాది పౌర, సైనిక సిబ్బంది పాల్గొన్నారు.
జపాన్ రైలు వేగం గంటకు 603 కి.మీ.
జపాన్ అత్యాధునిక రైలు గంటకు 603 కి.మీ. వేగంతో నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 21న మౌంట్ ఫుజీ దగ్గర ఈ రైలు వేగాన్ని పరీక్షించారు. మ్యాగ్లేవ్ (మ్యాగ్నటిక్ లెవిటేషన్) రైలు ఏడు డబ్బాలతో 600 కి.మీ. వేగంతో 11 సెకన్ల పాటు సాగింది. 2013లో 581 కి.మీ. వేగంతో నెలకొల్పిన రికార్డును అధిగమించింది. మ్యాగ్లేవ్ రైలు.. ట్రాక్స్‌కు 10 సెంటీమీటర్లపైన నడుస్తుంది. విద్యుత్తుతో చార్జి చేసిన మ్యాగ్నెట్స్ ఈ రైలును నడిపిస్తాయి. 2045 నాటికి ఈ రైలు టోక్యో-ఒసాకాల మధ్య నడుస్తుంది.
మధ్యదరా సముద్రంలో దుర్ఘటన
లిబియా తీరానికి 96 కి.మీ. దూరంలో మధ్యదరా సముద్రంలో ఏప్రిల్ 18న పడవ మునగడంతో 700 మంది మరణించారు. ఈ పడవలో లిబియా నుంచి వలసదారులు ఐరోపా తీరాలకు చేరుకునేందుకు బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు. పేదరికం, పోరాటాల వల్ల ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన పేదలు సముద్ర మార్గాన యూరోపియన్ యూనియన్ దేశాలకు వలసపోతున్నారు. 2015 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 900 మంది వలసదారులు పడవ ప్రమాదాల్లో మరణించారు.
ఈజిప్టు నేత మోర్సీకి 20 ఏళ్ల జైలుశిక్ష
పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి కైరో కోర్టు ఏప్రిల్ 21న 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రదర్శనకారులను నిర్బంధించినందుకు, హింసకు గురిచేసిన ఆరోపణలపై కోర్టు శిక్ష విధించింది. ఇదే ఆరోపణలపై మరో 14 మందికి కూడా కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించింది. ప్రజల వ్యతిరేకతతో దీర్ఘకాల పాలకుడు హోస్నీ ముబారక్ 2011లో పదవి కోల్పోవడంతో తొలిసారి జరిగిన స్వేచ్ఛాయుత ఎన్నికల్లో మోర్సీ అధికారంలోకి వచ్చాడు.
సూడాన్ అధ్యక్షుడు బషీర్ తిరిగి ఎన్నిక
సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ 94 శాతం ఓట్లతో ఏప్రిల్ 28న మళ్లీ గెలుపొందారు. 1989 సంవత్సరం నుంచి ఆయన సూడాన్‌కు అధ్యక్ష హోదాలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) 426 సీట్లకు గానూ 323 గెలుచుకున్నారు.
జకార్తాలో ఆసియా-ఆఫ్రికా సదస్సు
ఆసియా-ఆఫ్రికా దేశాల రెండు రోజుల సదస్సు ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏప్రిల్ 23న ముగిసింది. రెండు ప్రాంతాల మధ్య బహుళ అంశాలకు చెందిన సంబంధాలను బలోపేతం చేయాలని సదస్సులో నేతలు నిర్ణయించారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోడో విడోడో సౌత్-సౌత్ సహకారాన్ని పటిష్టం చేసే బాండూంగ్ మెసేజ్, కొత్త ఆసియన్-ఆఫ్రికన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పాలస్తీనాపై ప్రకటన మూడు ప్రధాన డాక్యుమెంట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. పాలస్తీనాపై ప్రకటనలో స్వతంత్ర పాలస్తీనా దేశానికి నేతలు మద్దతు ప్రకటించారు.
చరిత్రకారుడు క్రిస్టోఫర్ బేలీ మృతి
ప్రముఖ చరిత్రకారుడు, అధ్యాపకుడు క్రిస్టోఫర్ అలన్ బేలీ లండన్‌లో ఏప్రిల్ 20న మరణించారు. వలస పాలనలో, తదనంతరం భారత్ పరిస్థితులపై ఆయన రచనలు చేశారు. ద లోకల్ రూట్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: అలహాబాద్ 1880-1920(1975); ఇండియన్ సొసైటీ అండ్ మేకింగ్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్(1988) వంటి పుస్తకాలు రాశారు.
సంతోషంలో భారత్ స్థానం 117
ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 117వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి మొత్తం 158 దేశాల్లో ఉన్న స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ), అవినీతి, జీవితకాలం, కష్టాల్లో ఉన్నప్పుడు దొరికే సామాజిక మద్దతు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం, ఔదార్యం తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఇందులో 2015 సంవత్సరానికిగాను అత్యంత ఆనందంగా ఉన్న దేశంగా స్విట్జర్లాండ్ మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 10లో ఐస్‌లాండ్, డెన్మార్క్, నార్వే, కెనడా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ప్రపంచ సంతోష నివేదిక పేరుతో ఐరాసకు చెందిన సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్ (ఎస్‌డీఎస్‌ఎన్) సంతోష దేశాల జాబితాను ప్రచురించింది.
నేపాల్ మాజీ ప్రధాని బహదూర్ థాపా మృతి
నేపాల్ మాజీ ప్రధాన మంత్రి సూర్య బహదూర్ థాపా (87)అనారోగ్యంతో ఏప్రిల్ 15న మరణించారు. ఆయన ఐదు సార్లు (1963-64, 1965-69, 1979-83, 1997-98, 2003-04) నేపాల్ ప్రధాన మంత్రిగా విధులు నిర్వర్తించారు.
ఈ- వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ఐదోస్థానం: యూఎన్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ- వ్యర్థాలు) ఉత్పత్తిలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2014లో 1.7 మిలియన్ టన్నుల వ్యర్థాలు భారత్‌లో వెలువడినట్లు ‘గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్- 2014’ పేరిట రూపొందించిన నివేదికలో పేర్కొంది. మరో మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ-వ్యర్థాలు 21 శాతం పెరిగే అవకాశాలున్నట్లు హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆసియాలో చైనా, జపాన్, భారత్‌లో అత్యధికంగా ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
పాక్, చైనాల మధ్య 51 ఒప్పందాలు
వివిధ రంగాల్లో పరస్పరం సహకారం అందించుకునేలా చైనా, పాకిస్తాన్‌ల మధ్య 51 ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీంతో పాటు చైనా సహకారంతో చేపట్టబోయే ఎనిమిది ప్రాజెక్టుల శిలాఫలకాలను వారు ఆవిష్కరించారు. విద్యుత్, నిర్మాణం, వ్యవసాయం, విద్య, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో మితృత్వం తమ విదేశాంగ విధానంలో ఎంతో కీలకమని పాక్ ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీకి 20 ఏళ్ల జైలు శిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికారంలో ఉన్న సమయంలో నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు, 10 మంది మరణానికి కారణమమైనందుకు న్యాయస్థానం మోర్సీకి ఈ శిక్ష విధించింది. ఆయనతో పాటు మరో 12 మంది ముస్లిం బ్రదర్‌హుడ్ నాయకులకు కూడా 20 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై వారు పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. హోస్నీ ముబారక్ పాలన అనంతరం ఈజిప్టులో 2012 జూన్‌లో ప్రజస్వామ్యయుతంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీనే. 2013లో సైనిక కుట్రతోఆయన పదవీచ్యుతుడయ్యారు.
20 ఏళ్ల తరువాత దక్షిణాఫ్రికాకు ముగాబే రాక
దాదాపు 20 ఏళ్ల విరామం తరువాత జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే దక్షిణాఫ్రికాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. చితికిపోయిన తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నిజానికి ముగాబే తన భార్య గ్రేస్‌తోపాటు గతంలో పలుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించారు. 1994 తరువాత ఈ దేశంలో అధికారికంగా పర్యటించడం ఇది రెండోసారి. ప్రతికూల వృద్ధి, ద్రవ్యలభ్యత తగ్గిపోవడం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడంతో గత దశాబ్దంలో జింబాబ్వే ఆర్థికవ్యవస్థ రికార్డుస్థాయిలో క్షీణించింది. ఈ నేపథ్యంలో ముగాబే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో గురువారం చర్చలు జరుపుతారు.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ
అగ్రరాజ్య అధ్యక్ష పదవికి తాను మరోసారి పోటీపడబోతున్నానని అమెరికా మాజీ మంత్రి, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్లో పేర్కొనడంతో పాటు తన మద్దతుదారులకు ఈ మెయిల్ సందేశమిచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు. 2008లో డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒబామాతో పోటీ పడి నెగ్గలేకపోయిన ఆమె రంగంలోకి దూకడం ఇది రెండోసారి. 2001-2009 వరకు ఆమె సెనేట్‌కు న్యూయార్క్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
నేషనల్ ఎర్త్ అవర్ క్యాపిటల్-థానే
మహారాష్ట్రలోని థానే నగరం 2015 నేషనల్ ఎర్త్ క్యాపిటల్‌గా ఎంపికైంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏప్రిల్ 9న జరిగిన ఈ ఏడాది ఎర్త్ అవర్ సిటీ చాలెంజ్‌లో థానే విజేతగా నిలిచింది. 16 దేశాలు పాల్గొన్న ఈ పోటీలో గ్లోబల్ ఎర్త్ సిటీగా సియోల్ నిలిచింది. పురపాలక భవనాల్లో పర్యావరణ అనుకూ ల చర్యలను థానే నగర యాజమాన్యం చేపట్టింది.
లఖ్వీ నిర్బంధం మళ్లీ రద్దు
ముంబై దారుణ మారణకాండకు సూత్రధారి అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని నిర్బంధం నుంచి విడుదల చేయాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి లాహోర్ హైకోర్టు ఏప్రిల్ 9న ఆదేశించింది.ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీకి కొద్దినెలల కింద బెయిల్ మంజూరయింది. దానిపై భారత్ తీవ్రంగా స్పందించడంతో శాంతి భద్రతల నిర్వహణ చట్టం కింద లఖ్వీని పాక్ మళ్లీ నిర్బంధించింది. ఆ నిర్బంధాన్ని తప్పుబట్టిన హైకోర్టు అతడిని విడుదల చేసింది. ప్రభుత్వం మళ్లీ అదే చట్టం కింద అరెస్టు చేయడం.. ఇలా రెండుసార్లు జరిగాయి. దీంతో లఖ్వీ ఈసారి తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఏ ఆరోపణల ప్రకారం లఖ్వీని నిర్బంధించారో తెలిపే పత్రాలు, ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం పత్రాలు, ఆధారాలను సమర్పించినా... లాహోర్ హైకోర్టు తిరస్కరించి లఖ్వీని విడుదల చేసింది.
ఐరాస కీలక సంస్థల్లో భారత్
ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన నాలుగు కీలక అనుబంధ సంస్థలకు భారత్ సభ్యదేశాల నుంచి ఊహించని మద్దతుతో ఎన్నికైంది. అంతర్జాతీయ ఆర్థిక సామాజిక మండలి(ఎకోసాక్) కి జరిగిన ఎన్నికల్లో భారత్‌ను సభ్యుల హర్షధ్వానాల మధ్య తిరిగి ఎన్నుకున్నారు. ఈ కమిటీలో 13 ఇతర దేశాలూ సభ్యత్వాన్ని పొందాయి. భారత్ బ్యాలెట్ అవసరం లేకుండా ఎన్నికైంది. 47 దేశాల మానవ హక్కుల మండలి సభ్యత్వం పొందిన వారానికే ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో అద్భుత స్పందన భారత్‌కు లభించడం విశేషం. దీంతో పాటు ఐరాస బాలల నిధి(యూనిసెఫ్) కార్యనిర్వాహక బోర్డు సభ్యత్వానికి కూడా భారత్ ఎన్నికైంది. 2016 నుంచి మూడేళ్ల పాటు భారత్ ఇందులో కొనసాగుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) కార్యనిర్వాహక బోర్డుకు కూడా భారత్ తిరిగి ఎన్నికైంది. నేర నియంత్రణ, న్యాయ కమిషన్(సీసీపీసీజే)లో భారత్‌కు మూడేళ్ల సభ్యత్వం లభించింది. భారత్‌తో పాటు పాకిస్తాన్, సౌదీ అరేబియా తదితర 20 దేశాలకు ఇందులో చోటు దక్కింది. ఆవాస కార్యక్రమం (యూఎన్ హాబిటాట్) గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా భారత్ ఎన్నికైంది. అందరికీ సామాజిక పరంగా, పర్యావరణ పరంగా గూడు కల్పించడం ఈ మండలి లక్ష్యం.
చైనాలో కొనసాగనున్న ‘ఒకే బిడ్డ’ విధానం
ఒక జంటకు ఒకే సంతానం అనే విధానాన్ని ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలను చైనా ప్రభుత్వం ఏప్రిల్ 10న ఖండించింది. జనాభా పెరుగుదల వనరులు, పర్యావరణం, ఆర్థిక, సామాజిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని జాతీయ ఆరోగ్య, కుటుంబ నియంత్రణ సంఘం ప్రతినిధి సాంగ్ షులీ అన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని ఉపసంహరించుకోబోమని స్పష్టీకరించారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా తోబుట్టువులు లేకుంటే.. ఆ జంట రెండో సంతానాన్ని కనేందుకు మాత్రం 2013 నుంచి అనుమతిస్తున్నారు.
మయన్మార్‌లో శాంతి ఒప్పందం
మయన్మార్‌లో జాతీయ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 31న కుదిరింది. ఈ ముసాయిదా ఒప్పందంపై ఆ దేశ అధ్యక్షుడు థీన్‌సేన్ సంతకం చేశారు. సాయుధ తిరుగుబాటు గ్రూపులతో జరిగిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. దేశ వ్యాప్తంగా కాల్పుల విరమణకు తోడ్పడే ఈ ముసాయిదా ఒప్పందాన్ని తిరుగుబాటు దళాల ప్రతినిధులు, సైన్యం, ప్రభుత్వం అంగీకరించాయి. ఈ శాంతి సంప్రదింపులకు ఐక్యరాజ్యసమితి పరిశీలక సంస్థగా వ్యవహరించింది.
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి విజయం
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ఆర్మీ జనరల్ మహ్మద్ బుహారీ విజయం సాధించారు. మార్చి 31న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు గుడ్‌లక్ జోనథాన్‌పై 25 లక్షల ఓట్ల మెజారిటీతో బుహారి భారీ విజయం సాధించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా (173 మిలియన్) కలిగిన నైజీరియాలో ప్రజాస్వామ్యయుతంగా అధికార మార్పిడి జరిగింది. అవినీతి కుంభకోణాలు, ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిస్ట్‌కు చెందిన బోకోహారమ్ ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడం లాంటి వాటి వల్ల పీడీపీ ప్రజల మద్దతు కోల్పోయింది.
ఇరాన్ అణు కార్యక్రమంపై సఫలమైన చర్చలు
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇందుకు సంబంధించిన చర్చలు స్విట్జర్లాండ్‌లోని లసానేలో ఏప్రిల్ 2న జరిగాయి. ఈ చర్చల్లో ఇరాన్‌తో పాటు ఆరు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పాల్గొన్నాయి. రెండు వర్గాల మధ్య కుదిరిన కార్యచరణ ఒప్పందం జూన్ 30 నాటికి సమగ్రంగా పూర్తవుతుంది. ప్రస్తుత అంగీకారం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై పదేళ్లు పరిమితులు ఉంటాయి. ఇందుకు బదులుగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పలు దేశాలు ఎత్తివేశాయి.
ఆపరేషన్ రాహత్ సఫలం
యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ రాహత్ ద్వారా ఎయిర్ ఇండియా ఏప్రిల్ 5 నాటికి 2,300 మందిని భారత్‌కు చేర్చింది.
ఉగ్రవాదుల దాడిలో 150 మంది మృతి
కెన్యాలో ఈశాన్య ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఏప్రిల్ 2న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 150మంది విద్యార్థులు మరణించగా, 79 మంది గా య పడ్డారు. సోమాలియాకు చెందిన ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఈ దాడులకు పాల్పడింది.
టాప్-50 వాణిజ్య పదాల్లో ‘గురు’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వాణిజ్య పదాల జాబితా టాప్-50లో ‘గురు’ అనే భారతీయ పదం చోటు నిలుపుకుంది. 2014 సంవత్సరానికి గాను ‘గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్’ (జీఎల్‌ఎమ్) ఈ జాబితాను రూపొందించింది. 2013లో ఆరో స్థానంలో నిలిచిన ‘గురు’ తాజా జాబితాలో 15వ స్థానానికి పడిపోయింది. గురు అంటే గురువు, ఉపాధ్యాయుడు అని అర్థం. సంస్కృతం నుంచి ఈ పదం పుట్టింది. ఈ జాబితాలో ‘కంటెంట్’ అనే పదం వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్, బిగ్ డేటా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఆఫ్‌లైన్, ఫేస్ టైమ్, పింగ్, రాక్ అండ్ ఎ హార్డ్ ప్లేస్, విన్ విన్ నిలిచాయి. ‘వాణిజ్య రంగానికి ప్రత్యేక పదజాలం ఉంటుంది. ఇంగ్లిష్ భాషనే ఇప్పుడు బిజినెస్ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు’ అని జీఎల్‌ఎమ్ ప్రెసిడెంట్ పాల్ జేజే పాయక్ తెలిపారు.
AIMS DARE TO SUCCESS
మే 2015 అంతర్జాతీయం
‘ఆకలి’లో మొదటి స్థానంలో భారత్
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మే 27న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 25 సంవత్సరాల క్రితంతో పోల్చితే ఒక బిలియన్(100 కోట్లు)గా ఉన్న పేదల సంఖ్య 795 మిలియన్లకు(దాదాపు 80 కోట్లు) తగ్గింది. ఇది మొత్తం జనాభాలో 12.9 శాతం తగ్గింది. వీరి సంఖ్య 25 ఏళ్ల క్రితం 991 మిలియన్లు/23.3 శాతంగా ఉండేది. భారతదేశం ఆకలితో బాధపడే 19.4 కోట్ల మందితో మొదటి స్థానంలో ఉంది. 13.38 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. 24 ఆఫ్రికా దేశాలు ఇంకా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని నివేదిక పేర్కొంది. సబ్-సహారా ఆఫ్రికాలో దయనీయ పరిస్థితులున్నాయని, ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి బాధితులని తెలిపింది. తూర్పు ఆసియా, లాటిన్ అమెరికా, తూర్పు మధ్య ఆసియాలలో ఆకలి పరిస్థితులు బాగా తగ్గాయి. 129 దేశాల్లో 72 దేశాల్లో గత దశాబ్ద కాలంలో మంచి పురోగతి కనిపిస్తుందని నివేదిక తెలిపింది.
యూఎస్ స్పెల్లింగ్ బీ టైటిల్
భారత సంతతికి చెందిన అమెరికన్లు వన్య శివశంకర్ (13), గోకుల్ వెంకటాచలం (14)లు 2015 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ ట్రోఫీని సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను వరుసగా రెండోసారి భారత - అమెరికన్లు సాధించారు. వీరికి మే 28న వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో బహుమతిగా చెరో రూ.37,000 నగదును బహూకరించారు.
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు
ప్రపంచంలో శక్తిమంతమైన మహిళలజాబితాను ఫోర్బ్స్ పత్రిక మే 26న విడుదల చేసింది. ఈ 12వ వార్షిక జాబితాలో 100 మందికి చోటుదక్కింది. వీరిలో భారతదేశానికి చెందిన నలుగురు ఉన్నారు. మొదటి స్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. రెండో స్థానంలో హిల్లరీ క్లింటన్ (అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడనున్న మహిళ), మూడో స్థానంలో మిలిండా గేట్స్ (బిల్‌గేట్స్ సతీమణి) ఉన్నారు. భారత్‌కు చెందిన ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య (30వ స్థానం), చందా కొచ్చర్ (ఐసీఐసీఐ బ్యాంకు అధిపతి-35వ స్థానం), కిరణ్ మజుందార్(బయోకాన్ సంస్థ స్థాపకురాలు-85వ స్థానం), శోభనా భాటియా(హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్-93వ స్థానం)లకు చోటు దక్కింది.
మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలు అమీనా
మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా అమీనా ఫకీమ్ (56)ను ఎంపిక చేస్తూ మారిషస్ పార్లమెంట్ మే 28న తీర్మానాన్ని ఆమోదించింది. ఆమె అంతర్జాతీయంగా పేరుగాంచిన జీవశాస్త్రవేత్త. 2012 నుంచి అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ పురియాగ్ మే 29న రాజీనామా చేశారు. 1968లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన మారిషస్ 1992లో రిపబ్లిక్‌గా అవతరించింది. అప్పటివరకు దేశాధినేతగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కొనసాగింది.
నైజీరియా నూతన అధ్యక్షుడిగా బుహారీ
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ బుహారీ నైజీరియా నూతన అధ్యక్షుడిగా మే 29న ప్రమాణం చేశారు. సైనిక, సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విపక్ష నాయకుడితో అబూజా ఈగిల్స్ స్క్వేర్ భవనంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్థిక సంక్షోభంతోపాటు బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థ దాడులు నైజీరియాను వణికిస్తున్న నేపథ్యంలో ఈ మాజీ సైనికాధికారి దేశాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
నాలుగింతలు పెరిగిన వాయు కాలుష్య మరణాలు
వాయుకాలుష్యం వల్ల ఏటా మరణిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో నాలుగింతలు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకు సంబంధించిన నివేదికను మే 18న జెనీవాలో ప్రారంభమైన 68వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో సమర్పించింది. ‘ఆరోగ్యం, పర్యావరణం: ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం’ పేరిట సమర్పించిన ఈ నివేదికలో 8 మిలియన్ల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఇంటిలోపల కాలుష్యం వల్ల 4.3 మిలియన్ల మంది మరణించగా, బాహ్య కాలుష్యం వల్ల 3.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. నివారించదగ్గ ఈ కాలుష్యం వల్ల చైనా, భారత్ ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఐర్లాండ్‌లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో(రెఫరెండమ్) 70 శాతం మంది అనుకూలంగా ఓటువేశారు. మే 23న విడుదల చేసిన ఓటింగ్ ఫలితాల్లో 32 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొని గే, లెస్బియన్ వివాహాలకు అనుకూలంగా స్పందించారు. దీంతో స్వలింగ వివాహాలకు ఓటింగ్ ద్వారా చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. ఇప్పటికే 21 దేశాల్లో ఇటువంటి వివాహాలకు చట్టబద్ధత ఉంది.
నేపాల్‌లో రెండోసారి భూకంపం
నేపాల్‌లో మే 12న కాఠ్మాండూకు తూర్పున 80 కి.మీ.ల దూరంలో ఎవరెస్టు పర్వతానికి సమీపంలో రెండోసారి భూకంపం సంభవించిన ఘటనలో 50 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. భూమి లోపల 15 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. దీని ప్రభావం నేపాల్‌లోని 32 జిల్లాలపై పడింది. నేపాల్‌తోపాటు భారత్, అఫ్గానిస్థాన్‌లలో కూడా భూమి కంపించింది. భారత్‌లో 17 మంది మరణించారు. ఏప్రిల్ 25న సంభవించిన భూ కంపంతో నేపాల్‌లో సుమారు 8వేల మంది మరణించారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన వాటికన్
పాలస్తీనాను వాటికన్ సిటీ అధికారికంగా గుర్తించింది. ఇందుకు సంబంధించి పాలస్తీనా, వాటికన్‌ల మధ్య మే 13న ఒప్పందం కుదిరింది. ఇకపై వాటికన్ దౌత్య సంబంధాలను పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో కాకుండా పాలస్తీనా దేశంతో కలిగి ఉంటుంది. పాలస్తీనా రాజ్యాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2012లో గుర్తించడాన్ని వాటికన్ స్వాగతించింది. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా గుర్తింపుపై తీవ్ర నిరాశకు గురైంది.
రూ. 1,154 కోట్లు పలికిన పికాసో చిత్రం
ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో వేసిన ఉమెన్ ఆఫ్ అల్జీర్స్ (వెర్షన్ ఓ) చిత్రం రూ. 1,154 కోట్లు పలికింది. న్యూయార్క్‌లో క్రిస్టిస్ సంస్థ మే 11న నిర్వహించిన వేలంలో ఈ అమ్మకాలు జరిగాయి. కళాఖండానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. ఇదే వేలంలో స్విట్జర్లాండ్ శిల్పి ఆల్బర్ట్ జియకోమెట్టి వేసిన పాయింటింగ్ మేన్ అనే శిల్పం రూ. 909 కోట్లు పలికింది. ఒక శిల్పానికి రికార్డు స్థాయిలో ధర పలకడం కూడా ఇదే మొదటిసారి.
ట్వీటర్‌లో ఓబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాజిక మాధ్యమం ‘ట్వీటర్’లో మే18న అధికారికంగా ఖాతా తెరిచారు. @POTUS అనే చిరునామాతో ఖాతా తెరిచిన 12 గంటల్లోపే ఇందులో ఒబామాను అనుసరించేవారి(ఫాలోవర్స్) సంఖ్య 14.6 లక్షలకు చేరడం విశేషం. ‘హలో ట్వీటర్: నేను బరాక్. నిజంగా! ఆరేళ్ల తర్వాత నాకు సొంత ఖాతా ఇచ్చారు’ అంటూ ఒబామా తొలి ట్వీట్ చేశారు. నాలుగు గంటల తర్వాత న్యూజెర్సీ పర్యటనకు సంబంధించి రెండో ట్వీట్ చేశారు. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ మూడో ట్వీట్ వదిలారు. ఒబామా ట్వీటర్‌లో ఇప్పటివరకు 65 ఖాతాలను అనుసరిస్తున్నారు. వీటిలో అధికశాతం తన కేబినెట్ సహచరులవే ఉన్నాయి. విదేశీ నేతల ట్వీటర్ ఖాతాలను ఒబామా ఇంకా ఫాలో కావడం లేదు. ప్రత్యేకంగా వచ్చే ట్వీట్ల ద్వారా అమెరికా ప్రజలతో ప్రత్యక్షంగా అనుబంధం పెంచుకోవడానికి అధ్యక్షుడికి ట్వీటర్ ఖాతా ఉపయోగపడుతుందని శ్వేతసౌధం ప్రకటించింది.
బ్రిటన్ ఎన్నికల్లో కామెరూన్ విజయం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ విజయం సాధించారు. బ్రిటన్ పార్లమెంటులోని 650 స్థానాలకు మే 7న ఎన్నికలు జరగ్గా, కామెరూన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీ 232 స్థానాలు గెలుపొందింది. ఎడ్ మిలిబండ్ నాయకత్వంలో పోటీచేసిన లేబర్ పార్టీ గతంలో కన్నా 26 స్థానాలు తక్కువగా సాధించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేందుకు తీసుకున్న చర్యలు, కొత్తగా రెండు మిలియన్ల ఉద్యోగాలు కల్పించడం వంటివి కన్సర్వేటివ్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. ఎస్‌ఎన్‌పీకి చెందిన 20 ఏళ్ల హైరీ బ్లాక్ ఎంపీగా ఎన్నికైంది. బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు సాధించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన 10 మంది భారత సంతతికి చెందిన వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఉన్నారు.
భూవాతావరణంలో మండిపోయిన రష్యా వ్యోమనౌక
రష్యాకు చెందిన మానవరహిత వ్యోమనౌక ప్రోగ్రెస్-59 భూవాతావరణంలో ప్రవేశించి మే 8న మండిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు సరుకులు తీసుకెళ్తూ మధ్యలో విఫలమై కొన్ని రోజులుగా కక్ష్యలో తిరుగుతోంది. ఈ నౌకను సోయజ్ రాకెట్ ద్వారా ఏప్రిల్ 28న కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది 418 కి.మీ. ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి చేరుకోలేకపోయింది. ప్రయోగించిన 9 నిమిషాలకు రాకెట్ నుంచి వేరుపడి సంబంధాలు కోల్పోయింది.
ఇద్దరు రాయబారులు మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హెలికాప్టర్‌ను తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాదులు మే 8న కూల్చివేయడంతో ఇద్దరు రాయబారులు మరణించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించగా వీరిలో ఫిలిప్పిన్స్, నార్వే రాయబారులు, మలేసియన్, ఇండొనేషియన్ రాయబారుల భార్యలు ఉన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రయాణిస్తున్నారని భావించి, క్షిపణితో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రాజెక్టులు ప్రారంభించడానికి పాక్ ప్రధానితో పాటు రాయబారులు మూడు హెలికాప్టర్లలో బయలుదేరివెళ్లారు. ప్రధాని షరీఫ్ సురక్షితంగా ఇస్లామాబాద్ చేరుకున్నారు.
19వ రాజ్యాంగ సవరణకు శ్రీలంక ఆమోదం
శ్రీలంక పార్లమెంట్ 19వ రాజ్యాంగ సవరణకు 2015 ఏప్రిల్ 28న ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు 225 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో 212 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈ చట్టం ద్వారా అధ్యక్షుడు, పార్లమెంట్ కాలం ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గుతుంది. ఒక వ్యక్తి అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ను నాలుగున్నర సంవత్సరాల తరువాతనే అధ్యక్షుడు రద్దు చేసేందుకు వీలుంది. ఇప్పటివరకు ఒక సంవత్సరం మాత్రమే ఉండేది. రాజ్యాంగ మండలి తిరిగి ఏర్పాటు చేస్తారు. స్వతంత్ర కమిషన్లను ఏర్పాటు చేస్తారు.
సిరియా జర్నలిస్ట్‌కు యునెస్కో అవార్డు
ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో వార్షిక ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు సిరియన్ జర్నలిస్ట్ మజెన్ డార్విష్‌కు దక్కింది. సిరియా జర్నలిస్ట్, హక్కుల కార్యకర్త అయిన డార్విష్‌ను ప్రభుత్వం గత మూడేళ్లుగా నిర్బంధంలో ఉంచింది. 2012 ఫిబ్రవరి 16న ఆయన తీవ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నారని అరెస్ట్ చేశారు. ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మే 3న లాట్వియాలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. సిరియాలో ప్రయాణ నిషేధం, వేధింపులు, తరచూ అరెస్టులు వంటి చర్యలను తట్టుకొని గత పదేళ్లుగా హక్కుల కోసం పోరాడుతున్న డార్విష్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునెస్కో తెలిపింది.
బ్రిటిష్ నేర కథల రచయిత్రి రూత్ రెండెల్ మృతి
ప్రముఖ బ్రిటిష్ నేర కథల రచయిత్రి రూత్ రెండెల్ (85) లండన్‌లో 2015 మే 2న మరణించారు. ఆమె సృష్టించిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర వెక్స్‌ఫోర్‌డ బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె రాసిన వాటిలో 60పైగా నవలలు అధికంగా అమ్ముడుపోయాయి. ఆమె మొదటి నవల ఫ్రమ్ డూన్ విత్ డెత్ 1964లో, ఆమె చివరి నవల ద గర్‌ల నెక్ట్స్ డోర్ గత సంవత్సరం ప్రచురితమయ్యాయి.
మలాలా కేసులో నేరస్తులకు 25 ఏళ్ల జైలు
2012లో పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం పోరాటం చేసిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌పై దాడిచేసిన 10 మంది తాలిబన్ మిలిటెంట్లకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలో ఉన్న ఏటీసీ జడ్జి ఏప్రిల్ 30న నేరస్తులకు శిక్ష విధిస్తూ తీర్పుచ్చింది. 2012 అక్టోబర్‌లో స్వాత్ లోయలో 15 ఏళ్ల మలాలా స్కూలు బస్సులో వెళ్తుండగా మిలిటెంట్లు బస్సులోకి చొరబడి తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు అప్పుడే ప్రకటించారు. ఈ దాడి ప్రధాన నిందితుడు అతుల్లా ఖాన్ (23) అని పోలీసులు పేర్కొన్నప్పటికీ శిక్ష పడిన 10 మందిలో అతడి పేరులేకపోవడం గమనార్హం.
AIMS DARE TO SUCCESS
జూన్ 2015 అంతర్జాతీయం
నాలుగు దేశాల్లో ఉగ్రవాదుల దాడులు
కువైట్, టునీసియా, సిరియా, ఫ్రాన్స్‌లలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది జూన్ 27న ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిపి 25 మందిని చంపేశాడు. టునీసియాలోని సౌస్సెలోని బీచ్ రిసార్ట్‌లో మరో ఉగ్రవాది పర్యాటకులపై తూటాలు కురిపించి 28 మంది ప్రాణాలు తీశాడు. ఫ్రాన్స్‌లో ఇంకో ఉగ్రవాది ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు 146 మందిని హత్య చేశారు. 24 గంటల వ్యవధిలో బీరట్‌లో 120 మంది, సమీపంలోని గ్రామంలో మరో 26 మంది పౌరులను ఐఎస్‌కు చెందిన తీవ్రవాదులు హత్య చేశారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది.
అత్యధిక ఉద్యోగులున్న టాప్-10 సంస్థల్లో భారతీయ రైల్వే, ఆర్మీ
ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగివున్న టాప్-10 సంస్థల జాబితాలో రెండు భారతీయ సంస్థలు రైల్వే, ఆర్మీ చోటు సంపాదించాయి. మొత్తం 14 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉన్న భారతీయ రైల్వేలు ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరోవైపు 13 లక్షల ఉద్యోగులతో భారత ఆర్మీ ఆ తరువాతి స్థానం(9వ)లో నిలిచింది. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని అనుసరించి.. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా అమెరికా రక్షణ శాఖ నిలుస్తోంది. ఇది 32 లక్షల మంది ఉద్యోగులను కలిగివుంది. 23 లక్షల మంది ఉద్యోగులతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) రెండో స్థానంలో నిలిచింది. 21 లక్షల మంది ఉద్యోగులతో అమెరికా సూపర్ మార్కెట్ జెయంట్ వాల్‌మార్ట్ ఈ జాబితాలో మూడో స్థానం పొందింది.
ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం
ఇండోనేసియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ సి-130 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మేడన్ పట్టణం మధ్యలో కూలిపోయింది. జూన్ 30వ తేదీ మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 12 మంది సిబ్బందితోపాటు 101 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఇళ్ల మధ్యలో విమానం కూలిపోవడంతో స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
అల్‌ఖైదా నేత నాసిర్ మృతి
అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అగ్రనేత నాసిర్ అల్-ఉహాయిషీ మరణించాడు. జూన్ 9న నాసిర్ యెమెన్‌లో మరణించినట్లు అల్‌ఖైదా సంస్థ అరేబియా ద్వీపకల్ప (ఏక్యూఏపీ) విభాగం జూన్ 15న ప్రకటించింది. లాడెన్ మృతి తర్వాత ఆ సంస్థకు నాసిర్ మరణం ఎదురుదెబ్బ. నాసిర్ స్థానంలో కొత్త అధిపతిగా ఖాసిం అల్ రిమీని నియమించినట్లు ఏక్యూఏపీ తెలిపింది.
భద్రతా మండలి విస్తరణకు సిఫార్సు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మెడలైన్ ఆల్బ్రైట్ చైర్‌పర్సన్‌గా ఐక్యరాజ్యసమితి 14 మంది సభ్యులతో ఏర్పాటుచేసిన ఈ కమిటీ జూన్ 9న నివేదిక సమర్పించింది. ఈ కమిటీలో భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్‌సరన్ కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ రక్షణ, న్యాయ, పాలన అనే అంశాలపై ఈ కమిటీని ఏర్పాటుచేశారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మండలి విస్తరణ చాలా అవసరమని కమిటీ పేర్కొంది. 21వ శతాబ్దంలో వాతావరణ మార్పులు, సంఘర్షణలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలకు తగిన సామర్థ్యం లేదని ఆల్బ్రైట్ పేర్కొన్నారు.
అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి
 అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్‌పై తాలిబన్ ఉగ్రవాదులు జూన్ 22న దాడిచేశారు. కారు బాంబును పేల్చి పార్లమెంట్ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో దాడికి దిగారు. ఇందులో ఇద్దరు మరణించగా, 31 మంది గాయపడ్డారు. పార్లమెంట్ సభ్యులందరూ సురక్షితంగా బయటపడ్డారు. భద్రతా దళాలు జరిపిన ప్రతి దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు తాలిబాన్ సంస్థ ప్రకటించింది.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు. దేశంలో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజ్‌పథ్ వద్ద 35,985 మంది యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 84 దేశాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలిచింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రారంభ వేడుకలకు థాయిలాండ్, నేపాల్, వియత్నాం, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర 192 దేశాల్లో అధికారికంగా నిర్వహించారు.
జర్మనీలో 41వ జీ-7 సదస్సు
41వ జీ-7 సదస్సు జర్మనీలోని బవారియన్ ఆల్ఫ్స్‌లో జూన్ 8న ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సు అనంతరం జీ-7 ప్రకటన జారీ అయ్యింది. కర్బన ఇంధనాల వాడకాన్ని 2100 నాటికి నిలిపేసేందుకు నేతలు అంగీకరించారు. 2050 నాటికి 40-50 శాతం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి మద్దతు పలికారు. పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయితో పోల్చితే సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించే లక్ష్యానికి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో అవసరమైతే రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయాలన్నారు. అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
టర్కీ ఎన్నికల్లో మెజారిటీ సాధించని అధ్యక్షుడు
టర్కీ పార్లమెంటుకు జూన్ 7న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగన్‌కు చెందిన జస్టిస్ పార్టీ(ఏకేపీ) 41 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించింది. పార్లమెంటులోని 550 స్థానాల్లో ఏకేపీకి 258 స్థానాలు దక్కాయి. ఈ సంఖ్య అవసరమైన మెజార్టీ కంటే 18 స్థానాలు తక్కువ. ఎర్డోగన్ 2003 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేసి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో టర్కీలో పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్యక్ష తరహా పాలనకు మారేందుకు రాజ్యాంగ సవరణ తేవాలన్న ఆయన ఆలోచనకు అడ్డుకట్టవేసినట్లయింది.
26 ఆఫ్రికా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్
ఒకే విధమైన మార్కెట్ వ్యవస్థను సృష్టించే స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఒప్పందంపై 26 ఆఫ్రికా దేశాలు ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జూన్ 10న సంతకాలు చేశాయి. ఇందులో ఆఫ్రికా ఖండంలోని దాదాపు సగం దేశాలు చేరాయి. ప్రపంచ వాణిజ్యంలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ ఈ ఒప్పందం వల్ల బాగా పుంజుకోనుంది. ఈ ఒప్పందం అమలుకు వాణిజ్య అడ్డంకుల తొలగింపునకు విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. రెండేళ్లలో సభ్యదేశాల పార్లమెంట్లు ఆమోదం తెలపాలి.
బ్రిటిష్ నటుడు క్రిస్టోఫర్ లీ మృతి
ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు క్రిస్టోఫర్ లీ(93) లండన్‌లో జూన్ 7న మరణించారు. చిత్ర పరిశ్రమలో డ్రాకులాగా ఆయన ప్రసిద్ధులు. హ్యూమర్, హారర్ చిత్రాల్లో ఆయన డ్రాకులా పాత్రలు పోషించారు. 250కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లో శారుమన్ పాత్ర, జేమ్స్ బాండ్‌లో స్కారమంగ పాత్రల్లో ఆయన నటించారు.
బ్రిటన్ జాతీయ పక్షిగా రాబిన్ సోర్స్
బ్రిటన్ జాతీయ పక్షి ఎంపిక కోసం జరుగుతున్న అన్వేషణ ముగిసింది. బ్రిటన్ జాతీయ పక్షి కోసం కొంతకాలంగా సాగిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో రాబిన్ పక్షి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రాబిన్ బ్రిటన్ జాతీయ పక్షిగా ఎంపికకానుంది.దీని ఎంపిక కోసం కొంతకాలం నుంచి బ్రిటన్‌లోని 60 పక్షులతో ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో మొత్తం 2,50,000 వరకు ఓట్లు పోలయ్యాయి. గత నెల 7న ముగిసిన ఓటింగ్‌లో రాబిన్ 34 శాతం ఓట్లు సాధించింది. దీని తర్వాతి స్థానాల్లో బార్న్ పక్షి (12 శాతం ఓట్లు), బ్లాక్ బర్డ్ (11శాతం ఓట్లు) నిలిచాయి.
ప్రమాదకరంగా వాయు కాలుష్యం
వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఎనిమిదింటిలో ఒకటి వాయుకాలుష్యం వల్ల సంభవిస్తోందని తెలిపింది. జెనీవాలో మే చివరివారంలో ముగిసిన ప్రపంచ ఆరోగ్య సమావేశంలో తొలిసారిగా వాయుకాలుష్యం - ఆరోగ్యంపై దాని ప్రభావం అంశాన్ని మదింపు చేశారు. ఇండియాలో ఆరోగ్యంపై వాయుకాలుష్యం ప్రభావం పెరిగిందని తాజా అంచనాలు తెలియజేస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో గతేడాది ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 1600 నగరాలను గుర్తించగా.. వాటిలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.
చైనాలో నౌక ప్రమాదం
చైనా తూర్పు ప్రాంతంలోని నాన్‌జింగ్ పట్టణం నుంచి యాంగ్జీ నదిలో పర్యాటకులతో బయలుదేరిన ఈస్టర్న్ స్టార్ నౌక జియాన్లీ ప్రాంతంలో తుఫాను చెలరేగడంతో జూన్ 1న ముంపునకు గురైంది. ఈ ప్రమాదంలో 434 మంది మరణించారు, 8 మంది ఆచూకీ తెలియరాలేదు. సిబ్బందితో కలిసి మొత్తం 450 మంది నౌకలో ఉన్నారు.
రూల్ ఆఫ్ లాలో భారత్‌కు 59వ స్థానం
ప్రపంచ సమన్యాయ పాలన(రూల్ ఆఫ్ లా) సూచీలో భారత్‌కు 59వ స్థానం దక్కింది. ఈ సూచీని అమెరికాకు చెందిన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ 2015 సంవత్సరానికిగానూ జూన్ 2న విడుదల చేసింది. న్యాయ వ్యవస్థను సమర్థంగా అమలుచేయడంలో భారత్‌కు మొదటి 50 స్థానాల్లో చోటుదక్కింది. పౌర న్యాయం, క్రిమినల్ న్యాయం, ప్రభుత్వ అధికారాలకు పరిమితులు లాంటి ఎనిమిది అంశాల ఆధారంగా మొత్తం 102 దేశాల పనితీరును మదింపు చేసి ర్యాంకులు కేటాయించారు. ఈ సూచీలో డెన్మార్క్, నార్వే, స్వీడన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి కుదిరిన అంగీకారం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెలారస్ పర్యటనలో జూన్ 2న రక్షణ, భద్రతతోపాటు వాణిజ్య సంబంధాలు, మైనింగ్‌లో సహకారం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెవీ మెషినరీ తదితర అంశాలపై బెలారస్ అధ్యక్షుడు ఎ.జి. లుకషెంకోతో చర్చించారు. పరస్పర విశ్వాసం, నమ్మకాలను బలోపేతం చేయడానికి 17 అంశాల కార్యాచరణకు ఈ సమావేశంలో రెండు దేశాల నేతలు అంగీకరించారు. తూర్పు యూరోపియన్ దేశమైన బెలారస్‌లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.
టర్కీ ఎన్నికల్లో అధికార పక్షానికి షాక్
పార్లమెంటు ఎన్నికల్లో టర్కీ అధికార పార్టీ పరాజయం పాలయింది. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న ప్రస్తుత అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగన్ ఆశలు ఫలించలేదు. జూన్ 6న ప్రకటించిన షలితాల్లో ప్రతిపక్ష జస్టిస్ అండ్ డెవెలప్‌మెంట్ పార్టీ (ఏకేపీ)కే మెజారిటీ దక్కింది. దీనికి 41 శాతం మంది ఓటు వేశారు. ఈ పార్టీ త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కుర్దుల అనుకూల పక్షం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఈ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చాయి. అధికార పక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ 25 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. మొత్తం 550 సీట్లున్న టర్కీలో ఏకేపీకి 258 సీట్లు దక్కుతాయి.
చైనాలో ఘోర పడవ ప్రమాదం
చైనాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 444 మంది గల్లంతయ్యారు. చెనాలోని యాంగ్జీ నదిలో ప్రయాణిస్తున్న పడవ తుపాను కారణంగా తిరగబడి, మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చైనా తూర్పు ప్రాంతంలోని నాన్‌జింగ్ పట్టణం నుంచి యాంగ్జీ నదిలో ‘ఈస్టర్న్ స్టార్ షిప్’ జూన్ 1న బయలుదేరిన ఈ పడవ జియాన్లీ ప్రాంతంలో తుపాను విరుచుకుపడటంతో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి పడవ కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ సహా 14 మంది ప్రాణాలతో బయటపడగా, ఐదు మృతదేహాలను గుర్తించారు.
భారత్‌కు యూఎన్‌ఎస్‌సీలో చోటుకు స్వీడన్ మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ మద్దతు పలుకుతున్న దేశాల జాబితాలో స్వీడన్ చేరింది. పెద్దదేశమైన భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ పేర్కొన్నారు. దీంతోపాటు ఉన్నతస్థాయి దేశాలు సభ్యులుగా ఉన్న క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి (ఎంటీసీఆర్)లో భారత్‌కు చోటు కల్పించేందుకూ స్వీడన్ బాసటగా నిలిచింది. ఇందులో ప్రవేశానికి భారత్‌కు మద్దతిచ్చే విషయాన్ని స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ ఆ దేశంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి.
ఆస్ట్రేలియాలో ప్రాచీన ముత్యం లభ్యం
అత్యంత అరుదైన సహజసిద్ధ ముత్యం ఆస్ట్రేలియాలో నిర్వహించిన తవ్వకాల్లో బయటపడింది. ఇది 2000 ఏళ్ల క్రితం రూపుదాల్చిందని పరిశోధకులు జూన్ 3న తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఉత్తర కింబర్లీ తీరంలో ఈ అరుదైన ముత్యాన్ని పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి ముత్యం లభించడం ఇదే మొదటిసారి. పూర్తి గోళాకారంలో ఉన్న దీని వ్యాసార్ధం 5 మిల్లీమీటర్లు. గులాబి, బంగారు రంగుల్లో మెరిసిపోతోంది.
AIMS DARE TO SUCCESS
జూలై 2015 అంతర్జాతీయం
ఇథియోపియాలో పర్యటించనున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్రికా దేశాల పర్యటన కోసం జూలై 24న పయనమయ్యారు. తన తండ్రి స్వదేశం కెన్యాతోపాటు ఆఫ్రియా యూనియన్‌కు కేంద్రమైన ఇథియోపియా రాజధానిలోనూ పర్యటిస్తారు. అమెరికా అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన తన పూర్వీకుల స్వదేశాన్ని సందర్శిస్తున్నారు. అంతేగాక ఇథియోపియాలో పర్యటించనున్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామాయే! ఇథియోపియా రాజధాని అడిస్ అబామాలో నిర్వహించే సమావేశంలో ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ప్రజాస్వామ్యం, దారిద్య్రం, మానవహక్కులపై ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సూజన్ రైస్, విదేశీ విధాన సల హాదారు బెన్ రోడ్స్ కూడా ఆయన వెంట ఉంటారు.
నేపాల్ రాజ్యాంగం నుంచి ‘లౌకికవాదం’ తొలగింపు
తమ రాజ్యాంగం నుంచి లౌకికవాదం పదాన్ని తొలగించేందుకు నేపాల్‌లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఈ హిమాలయ రాజ్యం 2007 నుంచి లౌకికదేశంగా మారింది. సాయుధపోరు కారణంగా 13 వేల మంది మరణాలకు కారణమైన నేపాల్ ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చాక హిందూరాజ్యం ముద్ర తొలగిపోయింది. అంతకుముందు నేపాల్ దాదాపు శతాబ్దకాలం హిందూరాజ్యంగా కొనసాగింది. ఇక్కడి ప్రజల్లో 80 శాతం మంది హిందువులే. కొత్త రాజ్యాంగం రూపకల్పన కోసం ప్రజల అభిప్రాయాలను సేకరించగా, అత్యధికులు లౌకికవాదం అనే పదాన్ని తొలగించి, హిందూరాజ్యం అనే పదం చేర్చాలని అభిప్రాయపడ్డారు. మతస్వేచ్ఛ కలిగిన దేశం అనే పదాన్ని చేర్చినా అభ్యంతరం లేదని కొందరు పేర్కొన్నారు. లౌకికవాదం అనే పదం నేపాల్ రాజ్యాంగానికి సరిపోదు కాబట్టి దానిని తొలగిస్తున్నామని, త్వరలోనే కొత్త రాజ్యాంగాన్ని ప్రకటిస్తామని యూసీపీఎన్ (మావోయిస్టు) చైర్మ న్ పుష్పకమల్ దహల్ ఎలియాస్ ప్రచండ జూలై 27న తెలిపారు.
అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా కలాం జయంతి: ఐరాస
దివంగత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం లభించింది. ఆయన జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ విద్యార్థి దినోత ్సవంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
మంచి ప్రతిష్ట గల దేశం కెనడా
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రెప్యుటేషన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 2015 సంవత్సరానికి ప్రపంచంలో మంచి ప్రతిష్ట కలిగిన దేశాల్లో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 33వ స్థానంలో ఉంది. మొత్తం 55 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా నార్వే, స్వీడన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ 53, చైనా 46వ స్థానాల్లో నిలిచాయి. సమర్థవంతమైన పాలన, మంచి పర్యావరణం, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు కేటాయించారు.
నైజీరియాలో పేలుళ్లు... 64 మంది మృతి
నైజీరియాలో జూలై 17న జరిగిన మూడు పేలుళ్ల ఘటనలో ఇద్దరు మానవ బాంబర్లు సహా 64 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. దమ్‌తూరు నగరంలో ఈద్ వేడుకలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇద్దరు మహిళా మానవ బాంబర్లు దాడికి తెగబడగా 12 మంది చనిపోయారు. అంతకుముందు స్థానికులు రంజాన్ సామగ్రిని కొనుగోలు చేస్తుండగా ఓ మసీదు వద్ద రెండు బాంబులు పేలి 50 మంది మృతిచెందారు.
ఇరాక్‌లో ఆత్మహుతి దాడి: 115 మంది మృతి
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మహుతి దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జూలై 17న ఆత్మాహుతి దాడి చేశారు. తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్సులో రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కును ఐఎస్‌ఐఎస్ ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చేశాడు. ఈ పేలుడులో 115 మంది దుర్మరణం చెందగా మరో 170 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఇరాక్‌లో గత పదేళ్లలో ఒక ప్రదేశంలో జరిగిన ఉగ్ర దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటనల్లో ఇది కూడా ఒకటి.
చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో జూలై 20న దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు అధికారికంగా నిర్ణయించాయి. గతేడాది డిసెంబర్ 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చలు జరిపారు. 1961 తర్వాత వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంపై క్యూబా జెండా ఎగిరింది.
ప్రపంచ ధనిక జంట.. బిల్ గేట్స్, మిలిందా
భార్యాభర్తలుగా ఉంటూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పది జంటల జాబితాను గ్లోబల్ వెల్త్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘వెల్త్ ఎక్స్’ ఆవిష్కరించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఉన్నారు. వీరి సంపద 85.7 బిలియన్ డాలర్లని వెల్త్ ఎక్స్ వెల్లడించింది. ఈ జాబితాలో 7 జంటలు అమెరికాకు చెందినవే కాగా... చైనా, ఫ్రాన్స్, స్పెయిన్‌కు చెందిన మూడు జంటలు కూడా స్థానం దక్కించుకున్నాయి.
రష్యాలో ఏడో బ్రిక్స్ సదస్సు
ఏడో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సు రష్యాలోని ఉఫాలో జూలై 9న జరిగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జూమా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెంట్ (ఐఎస్‌ఐఎల్) ఉగ్రవాద చర్యలను సదస్సు ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, దక్షిణాఫ్రికా చేస్తున్న ప్రయత్నాలకు బ్రిక్స్ మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదంలో రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను బ్రిక్స్ వ్యతిరేకించింది.
లంచం కేసులో ఇటలీ మాజీ ప్రధానికి జైలుశిక్ష
లంచం కేసులో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని(78)ని కోర్టు దోషిగా నిర్ధారించింది.
2006లో నాటి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓ సెనేటర్‌కు బెర్లుస్కోనీ రూ.20 కోట్ల లంచం ఇచ్చినట్లు నిర్ధారిస్తూ ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్లపాటు పదవులు చేపట్టకుండా నిషేధం విధించింది.
ఎస్‌సీఓలో భారత్‌కు పూర్తి సభ్యత్వం
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేందుకు జూలై 10న ఉఫా సదస్సులో అంగీకరించారు. ఈ మేరకు భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వాన్ని కల్పిస్తారు. ఈ సంస్థలో భారత్ 2005 నుంచి పరిశీలక హోదాలో ఉంది. 2016 నుంచి భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభిస్తుంది. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం ఏర్పడిన ఎస్‌సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. పూర్తిస్థాయి సభ్యత్వాన్ని అంగీకరించిన సభ్యదేశాలకు ఈ సదస్సులో పాల్గొన్న మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వాలపై విశ్వాసంలో భారత్‌కు రెండో స్థానం
కేంద్ర ప్రభుత్వాలపై విశ్వాసం అనే సర్వేలో భారత్‌కు రెండోస్థానం దక్కింది. 40 దేశాల్లో 2014లో జాతీయ ప్రభుత్వాలపై ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) నిర్వహించిన సర్వేలో భారత్ రెండో స్థానంలో నిలవగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో, నార్వే మూడో స్థానంలో ఉన్నాయి. జాతీయ ప్రభుత్వంపై విశ్వాసం ఉందా అన్న ప్రశ్నకు 73 శాతం మంది ప్రజలు అవును అని సమాధానమిచ్చారు.
ప్రమాదంలో సనా సిటీ: యునెస్కో
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారసత్వ నగరాల జాబితాలో యెమెన్ రాజధాని సనా చేరింది. ప్రభుత్వ అనుకూల బలగాలకు, షియా (హుతీ) తిరుగుబాటుదారులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో సనా సిటీని ఈ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) జులై 3న పేర్కొంది. యెమెన్‌లోని మరో నగరం షిబమ్‌తో పాటు ఇరాక్‌లోని హత్రా సిటీ కూడా జాబితాలో చేరాయి.
చైనాలో భారీ భూకంపం
చైనాలోని జింజియాంగ్ యుగ్యార్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో జులై 3న భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైన దీని తీవ్రత ధాటికి ఆరుగురు చనిపోగా, 48 మంది గాయపడ్డారు. 3 వేలకుపైగా ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి.
40 వేల మంది సైనికులను తొలగించనున్న అమెరికా
దేశంలో, విదేశాల్లో సైన్యంపై ఖర్చు చేస్తున్న డబ్బును ఆదా చేయడానికి వచ్చే రెండేళ్ల కాలంలో దాదాపు 40వేల మంది సైనికులను తొలగించాలని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించింది.
ఈ విషయాన్ని తొందరలోనే ప్రకటించడానికి ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికను అమలుచేస్తే 2017నాటికి అమెరికా ఆర్మీలో 4,50,000 మంది సైనికులే ఉంటారని తెలిపింది.
మైక్రోసాఫ్ట్‌లో 7,800 ఉద్యోగాల కోత
మొబైల్ పరికరాల వ్యాపార విభాగం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,800 ఉద్యోగాల్లో కోత విధించనుంది. కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్‌లో ఈ విషయాలు వివరించారు. ‘ఫోన్ల వ్యాపారంపై తీసుకున్న నిర్ణయాల ప్రభావాల వల్ల ఫోన్ల వ్యాపార విభాగంలో దాదాపు 7,800 దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశముందని వెల్లడించారు.
బెయిల్ అవుట్ ప్యాకేజీ షరతుల తిరస్కరణ
ఐరోపా యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు విధించిన షరతులను జూలై 5న నిర్వహించిన రిఫరెండంలో గ్రీసు ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ప్రజలు షరతులను తిరస్కరించగా, 39 శాతం మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు ఈయూ, ఐఎంఎఫ్‌లు కఠిన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, వ్యయ నియంత్రణ చర్యలు వంటి షరతులను విధించాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న గ్రీసు జూన్ 30 నాటికి ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయిలను చెల్లించలేక డీఫాల్ట్ అయింది.
సౌదీ యువరాజు రూ. 2 లక్షల కోట్ల దానం
 సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన రూ. 2 లక్షల కోట్ల సంపదను సమాజసేవ కోసం దానం చేశారు. ఈ సంపద మొత్తాన్ని సమాజ అభివృద్ధికి, మహిళల సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి, విపత్తు సహాయానికి ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించి చారిటీ ప్రాజెక్టుల ద్వారా ఈ నిధులను వినియోగిస్తారు. ట్రస్టుల బోర్డుకు యువరాజు చైర్మన్‌గా ఉంటారు. అమెరికాలోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరహాలో ఈ చారిటీ ట్రస్ట్ పనిచేస్తుంది. అల్వలీద్‌కు ప్రభుత్వ పదవి ఏదీ లేదు. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌డమ్ హోల్డింగ్ కంపెనీకి మీడియా పెట్టుబడులతో పాటు యూరో డిస్నీ థీమ్ పార్క్, హోటళ్లు, సిటీ గ్రూప్‌లలో భాగస్వామ్యం ఉంది. అల్వలిద్ గత జనవరిలో చనిపోయిన సౌదీరాజు అబ్దుల్లాకు సమీప బంధువు.
యూరప్‌లోకి భారీగా పెరిగిన అక్రమ వలసలు
ఈ ఏడాది తొలి ఆరునెలల్లో సముద్రమార్గం ద్వారా యూరప్‌లోకి ప్రవేశించిన అక్రమ వలసదారులు దాదాపు 1,37,000 మంది అని ఐక్యరాజ్య సమితి జులై 1న వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 83 శాతం ఎక్కువ. యుద్ధ వాతవారణంతో సిరియా నుంచి , హింస చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్, ఎరిత్రియా దేశాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో యూరప్‌లోకి ప్రవేశిస్తున్నారు. సోమాలియా, నైజీరియా, ఇరాక్, సుడాన్ నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇలా ప్రవేశించేటప్పుడు జరిగే ప్రమాదంలో ఇప్పటి వరకు 1867 మంది మృతి చెందగా, అందులో 1308 మంది గత ఏప్రిల్‌లోనే మరణించారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
AIMS DARE TO SUCCESS
ఆగష్టు 2015 అంతర్జాతీయం
గ్రీసు ప్రధాని రాజీనామా
గ్రీసు ప్రధానమంత్రి అలెక్సిస్ టిస్ప్రాస్ తన పదవికి రాజీనామా చేసి... మళ్లీ ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము కుదుర్చుకున్న 86 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ అత్యుత్తమమైనదని టిస్ప్రాస్ ఆగస్టు 20న దేశ ప్రజలనుద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో సమర్థించుకున్నారు. మూడేళ్ల వరకు ఆర్థిక వనరులకు ఇబ్బంది ఏమీలేదు కాబట్టి తన చర్యలపై గ్రీసు ప్రజలను తాజా తీర్పు కోరాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. నెలలోగా ఎన్నికలు జరుగుతాయని, సెప్టెంబరు 20న బహుశా ఎన్నికలు ఉండొచ్చని అధికారవర్గాలు తెలిపాయి.
మొదటిసారిగా ఓటేయనున్న సౌదీ మహిళలు
సౌదీ అరేబియా చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 12, 2015వ తేదీనజరిగే కింగ్‌డమ్ మున్సిపాలటీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి. ఇప్పటికే ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆరంభించారు. 2011లో సౌదీ రాజు అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చారిత్రాత్మక ఆలయాన్ని కూల్చేసిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు
సిరియాలోని పురాతన నగరమైన పాల్మీరలోని బాల్షమిన్ ఆలయాన్ని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు శక్తివంతమైన పేలుడు పదార్థాలతో ఆగస్టు 23, 2015వ తేదీన కూల్చివేశారు. 2000 ఏళ్ల చరిత్ర కలిగిన పాల్మీర.. మధ్య ప్రాచ్యంలోనే అత్యంత అద్భుతమైనది. ఇది యూనెస్కో గుర్తింపు కూడా పొందింది. మే నెలలో 20 మంది సిరియా సైనికులను హతమార్చి ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఈ నగరాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. విగ్రహారాధన ప్రక్షాళనలో భాగంగా ఈ ఆలయాన్ని కూల్చివేశామని ఉగ్రవాదులు ప్రకటించారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, ఈజిప్ట్ నిర్ణయం
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఈజిప్ట్ నిర్ణయించాయి. రక్షణ, ఉగ్రవాదంపై పోరు, భద్రతతోపాటు వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించాయి. ఉగ్రవాదాన్ని, ప్రత్యేకించి ఐఎస్‌ఐఎస్ ముష్కర సంస్థను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించాయి. తొలిసారి ఈజిప్ట్‌లో పర్యటిస్తున్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ ఆగస్టు 24, 2015న కైరోలో దేశాధ్యక్షుడు ఫతా అల్-సిసీతో భేటీ అయ్యారు. ద్వైపాకిక్ష సంబంధాలపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న ‘ఇండియా-ఆఫ్రికా’ సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీ తరఫున సుష్మ.. అధ్యక్షుడిని ఆహ్వానించారు.
చైనాలో భారీ అగ్ని ప్రమాదం: 112 మంది మృతి
ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలో ఓ రసాయనిక పదార్థాల గోడౌన్‌లో భారీ పేలుళ్లు సంభవించి సుమారు 112 మంది దుర్మరణం చెందారు. వందల మంది గాయపడ్డారు. ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో 90 మంది ఆచూకీ గల్లంతైంది. పేలుళ్ల ధాటికి సమీపంలో నిలిపి ఉన్న సుమారు 1000 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సూపర్ కంప్యూటర్ షట్‌డౌన్: ఈ పేలుళ్ల కారణంగా చైనా తన సూపర్ కంప్యూటర్ ‘త్యాన్‌హే-1ఎ’ను అరగంట షట్‌డౌన్ చేసింది. దీని నిర్వహణ కేంద్రం ప్రమాద ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కంప్యూటర్ ఒక సెకనుకు 2.57 క్వాడ్రిలియన్(పదికోట్ల కోట్లు) కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ కంప్యూటర్ కేంద్రం నెలకొన్న భవనంలో పేలుడు దెబ్బకు సీలింగ్ కూలిపోయింది.
ఇరాక్‌లో ట్రక్కుబాంబు పేలి 67 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆగస్టు 13న ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 152 మంది గాయపడ్డారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని హెచ్చరించారు. ముస్లిం జాతి కోసం షియాలపై మరిన్ని బాంబు దాడులు చేస్తామన్నారు.
సిరియాలో వైమానిక దాడులు: 82 మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్‌లో తిరుగుబాటుదారుల అధీనంలోని మార్కెట్‌పై ఆగస్టు 16న ప్రభుత్వ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 82 మంది మరణించారు. 200కు పైగా మంది గాయపడ్డారు. డమాస్కస్ శివారులో రద్దీగా ఉన్న మార్కెట్‌పై ప్రభుత్వ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడి సిరియాలో ఐదేళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో ప్రభుత్వం జరిపిన అతిపెద్ద దాడుల్లో ఒకటని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఐదేళ్లలో సిరియా ప్రభుత్వం రెబెల్స్ స్థావరాలపై జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారని, మొత్తంగా సిరియా అంతర్యుద్ధంలో 2.50 లక్షల మంది చనిపోగా, లక్షలాది మంది గాయపడ్డారని వెల్లడించారు.
ఇండోనేసియాలో కూలిన విమానం: 54 మంది మృతి
ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తూర్పు ఇండోనేసియాలోని పపువా ప్రాంత రాజధాని జయపుర నుంచి 49 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ఆగస్టు 16న ఓకిస్‌బిల్ నగరానికి బయలుదేరిన ట్రిగనా ఎయిర్‌లైన్స్ విమానం గమ్యానికి కొద్దిదూరంలోనే కొండను ఢీకొట్టి కూలిపోయింది. విమానంలోని మొత్తం 54 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. 45 నిమిషాల్లో గమ్యానికి చేరుకోవాల్సిన విమానం ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని చివరి 9 నిమిషాల ప్రయాణ సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానం ఓ కొండను ఢీకొని కుప్పకూలినట్లు బింటాంగ్ జిల్లాలోని ఓక్‌బపే గ్రామస్తులు చెప్పారు. అయితే ఇప్పటిదాకా ట్రిగనా ఎయిర్‌కు చెందిన 14 విమానాలు తీవ్ర ప్రమాదాలకు గురయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలను పాటించడంలేదన్న కారణంతో యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలో ఈ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధించింది.
బ్యాంకాక్‌లో భారీ పేలుడు: 27 మంది మృతి
పర్యాటక నగరమైన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆగస్టు 17న భారీ బాంబు పేలుడు జరిగింది. నగరం నడిబొడ్డున, ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో బ్రహ్మదేవుడి ఆలయం ప్రాంగణంలో అత్యంత శక్తిమంతమైన బాంబును పేల్చిన దుండగులు 27 మందిని బలి తీసుకున్నారు. ఈ ఘటనలో మరో 117 మంది గాయపడ్డారు. చిద్లోమ్ డిస్ట్రిక్ట్, రాజ్‌ప్రసంగ్ జంక్షన్‌లోని ‘ఎరవాన్ (బ్రహ్మదేవుడి) ఆలయం’ ప్రాంగణంలో ఉన్న ఒక స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. థాయ్‌లో బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాదఘటనలు అరుదు. 2012 నాటి పేలుళ్లలో ఐదుగురు గాయపడ్డారు.
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో యూఎన్‌పీ విజయం
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో యునెటైడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యూఎన్‌పీ ఆగస్టు 17న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 106 స్థానాలను గెలుచుకుంది. దీంతో విక్రమసింఘే మరోసారి ప్రధాని పీఠం అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. 225 స్థానాల పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. తమిళ పార్టీల మద్దతుతో విక్రమసింఘే మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రాతినిధ్యం వహిస్తున్న యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్(యూపీఎఫ్‌ఏ) 95 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. లంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళుల ప్రాబల్యమున్న మూడు జిల్లాల్లోని 16 స్థానాలను తమిళ్ నేషనల్ అలయన్స్ గెల్చుకుంది. లంక పార్లమెంటులోని మొత్తం 225 స్థానాలకు గాను 196 సీట్లకు ఆగస్టు 17న ఎన్నికలు జరిగాయి. మిగతా 29 స్థానాలను జాతీయ స్థాయిలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా ఆయా పార్టీలకు కేటాయిస్తారు.
మరో సూయజ్ కాలువను ప్రారంభించిన ఈజిప్టు
ప్రఖ్యాత సూయజ్ కాలువకు సమాంతరంగా మరో కాలువను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్‌సిసీ ఆగస్టు 6న ప్రారంభించారు. కాలువ ప్రారంభ కార్యక్రమంలో భారత్ తరఫున కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. సంవత్సర కాలంలో నిర్మించిన ఈ కాలువకు 8.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 120 మైళ్ల కాలువను విస్తరించడంతో రెండు వైపులా రవాణాకు వీలవుతుంది. నౌకలు వేచిఉండే సమయం ఎనిమిది గంటలు తగ్గుతుంది. 2023 నాటికి వార్షికంగా 13.2 బిలియన్ల ఆదాయం సమకూరుతుంది. 1869 నవంబరు 29న సూయజ్ కాలువను అధికారికంగా ప్రారంభించారు. దీనివల్ల ఐరోపా నుంచి భారత్‌కు వెళ్లే నౌకల ప్రయాణం 7 వేల కిలోమీటర్లు తగ్గింది.
కాబూల్ బాంబు పేలుళ్లలో 51 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆగస్టు 7న జరిగిన బాంబు పేలుళ్లలో 51 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. 2014 డిసెంబరులో నాటో మిషన్ తర్వాత జరిగిన అతిపెద్ద దుర్ఘటన ఇది. తాలిబన్ నేత ముల్లా ఉమర్ మరణించినట్లు ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి. ఆత్మాహుతి మానవ బాంబు పోలీసు దుస్తుల్లో కాబూల్ పోలీసు అకాడమీలోకి చొరబడి తనను తాను పేల్చుకోవడంతో 27 మంది మరణించారు. అంతకు ముందు ట్రక్ బాంబు పేలిపోవడంతో మరికొందరు మృత్యువాతపడ్డారు.
చైనా, తైవాన్‌లలో సౌడెలార్ తుఫాను
సౌడెలార్ తుఫానుకు చైనా, తైవాన్‌లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ తుఫాను వల్ల ఆగస్టు 9 నాటికి చైనాలో 14 మంది, తైవాన్‌లో 10 మంది మరణించారు. వెన్‌చెంగ్ కౌంటీలో 24 గంటల్లో 645 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంత అధికంగా కురవడం గత 100 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇదే నగరంలో 1.58 మిలియన్ల మంది తుఫాను తాకిడికి గురయ్యారు. విద్యుత్తు, రహదారి వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
జపాన్‌లో అణురియాక్టర్ ప్రారంభం
ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత తొలిసారి దక్షిణ జపాన్‌లోని అణు రియాక్టర్‌ను జపాన్ ఆగస్టు11న తిరిగి ప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలతో అణువిద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించారు. 2011లో భూకంపం, సునామీ వల్ల ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించిన తర్వాత జపాన్‌లో అణువిద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది.
నేపాల్‌లో కొత్త రాజ్యాంగ ఒప్పందం
దేశ అంతర్గత సరిహద్దులను నిర్దేశించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై నేపాల్‌లోని నాలుగు రాజకీయ పార్టీలు ఆగస్టు 8న సంతకాలు చేశాయి. దేశాన్ని ఆరు ప్రావిన్సులలో విభజించే ఒప్పందాన్ని అంగీకరించాయి. ఈ ఆరు ప్రావిన్సులు భారత్‌తో సరిహద్దు కలిగి ఉన్నాయి. దేశాన్ని ఎనిమిది ప్రావిన్సులుగా విభజిస్తూ జూన్‌లో చరిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి. రాష్ట్రాల అంతర్గత సరిహద్దులను నిర్దేశించే అంశాలను ఫెడరల్ కమిషన్‌కు వదిలేశారు. ప్రస్తుత ఒప్పందంతో కమిషన్ సరిహద్దులను నిర్ణయించే అవసరం ఇక ఉండదు. ప్రస్తుత ఒప్పందంతో సమాఖ్య ఏర్పాటుకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ఆరు రాష్ట్రాలకు పేర్లు నిర్ణయించాల్సి ఉంది.
మొజాంబిక్ అధ్యక్షుడి భారత పర్యటన
మొజాంబక్ అధ్యక్షుడు ఫిలిప్ జాసింతో న్యూసీ భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మొజాంబిక్‌లో హైడ్రోకార్బన్స్, ఖనిజాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశం ప్రోత్సాహకర పరిస్థితులు కల్పిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొజాంబిక్‌లో ఉన్న సహజ వాయువు, బొగ్గు, ఇతర ఖనిజాలు భారత్ వృద్ధిలో ప్రధానమైన వనరులుగా ప్రధాని పేర్కొన్నారు. మొజాంబిక్ రాజధాని మపుటోలో భారత రుణంతో చేపడుతున్న విద్యుత్తు సరఫరా ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. వ్యవసాయం, ఆహార భద్రత రంగాల అభివృద్ధికి పూర్తి సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
మలేషియా విమానం ఎంహెచ్ 370 శకలం గుర్తింపు
హిందూ మహాసముద్రంలో మడగాస్కర్‌కు సమీపంలోని రీయూనియన్ ఐల్యాండ్ వద్ద దొరికిన 2 మీటర్ల శకలం గతేడాది మార్చి 8న అదృశ్యమైన తమ విమానం ‘ఎంహెచ్370’దే అని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. విమానం అదృశ్యమైన 515 రోజుల తర్వాత శకలాన్ని గుర్తించారు. దొరికిన శకలం ఎంహెచ్370 విమానానిదే అని అంతర్జాతీయ నిపుణుల బృందం నిర్ధారించింది.
2100 నాటికి ప్రపంచ జనాభా 1,120 కోట్లు!
ఈ శతాబ్దంలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరగనుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 730 కోట్లనీ, 2050 నాటికి 970 కోట్లకు, 2100 నాటికి 1,120 కోట్లుకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఆఫ్రికా ఖండంలో జనాభా విస్పోటం అత్యధికంగా ఉందని తెలిపింది. ఆగస్టు 10న వాషింగ్టన్‌లోని సీటెల్ నగరంలో ‘2015 జాయింట్ స్టాటిస్టికల్ మీటింగ్’ జరిగింది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి డెరైక్టర్ జాన్ విల్మోత్ పాల్గొన్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో జనాభా వేగంగా పెరుగుతోందని తెలిపారు. 2100 నాటికి ప్రపంచ జనాభా 23 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఆసియా ఖండంలో 2050 నాటికి జనాభా 530 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు.
టర్కీకి నాటో మద్దతు
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్, తిరుగుబాటు చేస్తున్న కుర్దులపై టర్కీ జరుపుతున్న దాడులకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మద్దతు ప్రకటించింది. బ్రసెల్స్‌లో జూలై 28న జరిపిన అత్యవసర సమావేశంలో ఉగ్రవాదంపై టర్కీ జరుపుతున్న పోరాటానికి గట్టి మద్దతు పలికింది. జూలై రెండోవారంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుర్దుష్ సరిహద్దు పట్టణంలో జరిపిన బాంబు దాడుల్లో 32 మంది ప్రజలు మరణించారు.
గడాఫీ కుమారుడికి మరణశిక్ష
 లిబియా మాజీ నియంత ముమ్మార్ గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లామ్‌కు ట్రిపోలీ కోర్టు జూలై 28న మరణశిక్ష విధించింది. ఇస్లామ్‌తోపాటు మరో ఎనిమిది మంది మాజీ అధికారులకు కోర్టు మరణశిక్ష విధించింది. వీరిలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్లా అల్ సెనుస్సీ, మాజీ ప్రధానమంత్రి బాగ్దాదీ అల్ మహమౌదీ ఉన్నారు. గడాఫీ కుమారుడు ఇస్లామ్‌ను 2011 నుంచి నిర్బంధంలో ఉంచారు. ఆయన కోర్టులో లేకుండానే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మానవహక్కుల గ్రూపులు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఈ కేసు విచారణ సక్రమంగా సాగలేదని లిబియా కోర్టును ప్రశ్నించాయి.
ఒమర్ మరణాన్ని ధ్రువీకరించిన అఫ్గానిస్థాన్
తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్ మరణించినట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం జూలై 29న ప్రకటించింది. ఒమర్ పాకిస్తాన్‌లో 2013 ఏప్రిల్‌లో మరణించినట్లు సమాచారం ఉందని పేర్కొంది. అఫ్గానిస్థాన్‌ను 1996 నుంచి 2001 వరకు ఒమర్ కర్కషంగా పాలించాడు. 2001లో అమెరికా దళాలు దేశంలోకి ప్రవేశించడంతో ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఒమర్ తాలిబాన్ ఉద్యమాన్ని 1994లో స్థాపించాడు. అంతర్యుద్ధంలో విజయం సాధించి 1996లో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకున్నాడు.
మయన్మార్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి
మయన్మార్‌లో వర్షాల వల్ల గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో ఆ దేశ ప్రభుత్వం ఆగస్టు 1న జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. జూలై 22న కురిసిన వర్షాలకు 27 మంది మరణించగా లక్ష మందికి పైగా ఇబ్బందులకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతింది.
2022 నాటికి భారత్‌లో అత్యధిక జనాభా
2022 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని జూలై 29న విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్: ది 2015 రివిజన్ పేరుతో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో 10 అత్యధిక జనాభా గల దేశాలు ఉన్నాయి. వీటిలో ఆఫ్రికాలో నైజీరియా; ఆసియాలో బంగ్లాదేశ్, చైనా, భారత్, ఇండోనేషియా, పాకిస్తాన్; లాటిన్ అమెరికాలో బ్రెజిల్, మెక్సికో; ఉత్తర అమెరికాలో యూఎస్‌ఏ; ఐరోపాలో రష్యా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.3 బిలియన్లుగా ఉంది. ఇది 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2100 నాటికి 11.2 బిలియన్లకు చేరుతుందని నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభాలో చైనా 19 శాతం, భారత్ 18 శాతం జనాభాను కలిగి ఉన్నాయి.
బిల్ అండ్ మిలిందా గేట్స్‌దే అత్యంత సంపన్న ట్రస్టు
43.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో అత్యంత సంపన్న ప్రైవేట్ చారిటబుల్ సంస్థల జాబితాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మొత్తం మన కరెన్సీలో రూ.2.75 లక్షల కోట్లపైమాటే. 8.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో లీ కా షింగ్ ఫౌండేషన్ రెండో స్థానం, గోర్డన్ అండ్ బెట్టీ మూర్ (6.4 బిలియన్ డాలర్లు) మూడో స్థానం దక్కించుకున్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత సంపన్నులు స్థాపించిన సామాజిక సేవా సంస్థలతో కూడిన ఈ జాబితాను వెల్త్-ఎక్స్ రూపొందించింది. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తులన్నీ కలిపి చూసినా కూడా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు సమానంగా లేవు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్ పేరిట ఇది ఏర్పాటైంది. ఇక రెండో స్థానంలో ఉన్న లీ కా షింగ్ ఫౌండేషన్‌ను హాంకాంగ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం లీ కా షింగ్ నెలకొల్పారు. దీన్ని తన మూడో కుమారుడిగా చెప్పుకునే షింగ్... తన ఆస్తుల్లో మూడో వంతును ఫౌండేషన్‌కు రాసిచ్చారు. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తుల విలువ 83.1 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇది వాటిని స్థాపించిన వారి మొత్తం ఆస్తుల విలువలో సుమారు 29.7%. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్నులు నెలకొల్పిన ఫౌండేషన్లు 5,000 పైచిలుకు ఉన్నాయి. వీటన్నింటి ఆస్తుల విలువ 560 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది.
బొకోహరామ్ చెర నుంచి 178 మందికి విముక్తి
నైజీరియాలో బొకోహరామ్ తీవ్రవాదుల చెర నుంచి 178 మందిని భద్రతా దళాలు రక్షించాయి. బామా నగరంలోని బొకోహరామ్ తీవ్రవాదుల స్థావరాలపై వైమానిక దళాలు దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల క్యాంపులన్నీ ధ్వంసం చేసి 101 మంది పిల్లలు, 67 మంది మహిళలు, 10 మంది పురుషులను రక్షించారు.
అఫ్గాన్‌లో 88 మంది ఉగ్రవాదులు హతం
ఆఫ్గానిస్తాన్ నేషనల్ పోలీస్, సైన్యం కలిసి చేసిన దాడుల్లో ఆగస్టు 5వ తేదీ వరకు కనీసం 88 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. దేశంలోని నంగన్హార్, లాగ్‌మన్, పర్వాన్, టఖార్, కుందుజ్, ఫర్యాబ్, సార్-ఇ-పుల్, బల్ఖ్, జబుల్, ఓరుజ్‌గాన్, మైదాన్ వర్దక్, ఘజినీ, ఖోస్త్, పఖ్తియా, హెల్‌మండ్ తదితర ప్రావిన్స్‌లో నిర్వహించిన పలు ఆపరేషన్లలో ఈ మేరకు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
AIMS DARE TO SUCCESS
సెప్టెంబరు 2015 అంతర్జాతీయం
ఐరాస సుస్థిర అభివృద్ధి సభ
ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిర అభివృద్ధి సభ సెప్టెంబరు 25 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి సంస్థల అధిపతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ కొత్త అభివృద్ధి లక్ష్యాలను స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంపన్న దేశాలు టెక్నాలజీని ఇతర దేశాలకు అందజేయాలన్నారు. ఐరాసలో సంస్కరణలు అమలు చేస్తేనే దాని విశ్వసనీయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి అజెండాను ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 15న ఆమోదించింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర జీవనం, విద్యను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను అరికట్టడం వంటి 17 లక్ష్యాలను ఇందులో నిర్దేశించారు. వీటి సాధనకై ఏడాదికి 3.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల వరకు వెచ్చించనున్నారు.
ఐరాస సంస్కరణలకు పిలుపునిచ్చిన జీ-4 దేశాలు
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో కూడిన జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా జీ-4 దేశాలు ప్రకటించాయి. నిర్దేశిత కాలవ్యవధిలో భద్రతామండలిని సంస్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఖండాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భద్రతా మండలి విశ్వసనీయత, న్యాయబద్ధత కలిగి ఉంటుందని స్పష్టం చేశాయి. దశాబ్దం తర్వాత జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లు పాల్గొన్నారు.
హజ్ యాత్ర తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా మృతి
సౌదీ అరేబియాలోని మినా వద్ద సెప్టెంబరు 24న జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా హజ్ యాత్రికులు మరణించారు. ఇందులో 35 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబరు 28న తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. మినాలో జమారత్ వద్ద సైతానుగా భావించే స్తంభాలను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
సిలికాన్ వ్యాలీలో మోదీ ‘ఐటీ’ పర్యటన
డిజిటల్ ప్రపంచానికి రాజధాని అయిన సిలికాన్ వ్యాలీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాలతో సెప్టెంబర్ 26న మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తన ప్రణాళికలను ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థల సీఈఓలతో జరిగిన భేటీలో మోదీ బయటపెట్టారు.
నరేంద్రమోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవానికి తమ సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్‌కామ్ దాదాపు రూ. వేయి కోట్లు మేర నిధులను అందించనున్నట్లు పాల్ జాకబ్స్ ప్రకటించారు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ విజ్ఞప్తికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 27న ప్రధాని మోదీ ఫేస్‌బుక్, గూగుల్ ప్రధాన కార్యలయాలను సందర్శించారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో సమావేశమయ్యారు.
అగ్రరాజ్యాల అధినేతలతో మోదీ చర్చలు
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న అగ్రరాజ్యాల అధినేతలతో సమావేశమై పలు చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మూడోసారి సమావేశమైన మోదీ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని.. భద్రత, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒబామాతో భేటీకన్నా ముందు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌లతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణలు, వాతావరణ మార్పు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం కోసం భారత అభ్యర్థిత్వానికి బ్రిటన్, ఫ్రాన్స్‌లు రెండూ మద్దతు తెలిపాయి.
మహాత్మాగాంధీకి లిథువేనియా ప్రత్యేక నివాళి
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని లిథువేనియా దేశం ఘన నివాళి అర్పించనుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీతో కలిసి పనిచేసిన ఆయన స్నేహితుడు, లిథువేనియాకు చెందిన హెర్మన్ కలెన్‌బాచ్‌లు కలిసున్న విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న లిథువేనియా ప్రధానమంత్రి అల్గిర్‌దాస్ బట్కెవిసియస్, భారత వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌భాయ్ కుందరియన్ ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. హెర్మన్ జన్మస్థలమైన రుస్నేలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
తీరప్రాంతాల సంరక్షణపై ఒప్పందం
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇండో-పసిఫిక్ సముద్ర తీరప్రాంతాల సంరక్షణకు కలసి పనిచేయాలని భారత్, జపాన్, అమెరికాలు నిర్ణయించాయి. ఇక నుంచి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, సముద్ర జలాల్లో స్వేచ్చాయుత సంచారానికి అనుమలు ఇవ్వడానికి ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 29న నిర్వహించిన భారత్, జపాన్, అమెరికా త్రైపాక్షిక మంత్రుల చర్చల్లో విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, ఫ్యుమియో కిషిడా, జాన్ కెర్రీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అమల్లోకి వచ్చిన నేపాల్ రాజ్యాంగం
నేపాల్‌లో సెప్టెంబరు 20 నుంచి చారిత్రాత్మక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో నేపాల్ పూర్తి స్థాయి లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 239 ఏళ్ల నేపాల్ రాచరికం 2008లో రద్దయింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్ట సభలు ఉంటాయి. ప్రతినిధుల సభ, దిగువసభలో 375 మంది, ఎగువసభలో 60 మంది సభ్యులు ఉంటారు. ఏడు ప్రావిన్సుల(రాష్ట్రాల)తో సమాఖ్య ఏర్పడుతుంది. దక్షిణ మైదాన ప్రాంతంలో మైనారిటీ గ్రూపులు తమ ప్రావిన్సుల విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఐరాసలో సంస్కరణలకు తొలి అడుగు
ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన చర్చా పత్రానికి ఐరాస సర్వప్రతినిధి సభ సెప్టెంబరు 14న ఆమోదం తెలిపింది. ఏడేళ్ల అనంతరం సభలో ముసాయిదా ఆధారంగా చర్చ జరుగనుంది. ఈ చర్చా పత్రంలో భద్రతా మండలి సంస్కరణలపై సభ్యదేశాల వైఖరి, భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాన్ని ఏవిధంగా విస్తరించాలి వంటి అంశాలున్నాయి. భద్రతామండలిలో సంస్కరణ లు చేపట్టాలని భారత్ కోరుతోంది.
గ్రీస్ ప్రధానిగా సిప్రాస్ తిరిగి ఎన్నిక
అలెక్సిస్ సిప్రాస్ సెప్టెంబరు 21న గ్రీసు ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గ్రీసు పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 300 స్థానాలకు వామపక్ష పార్టీ సిరిజా నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ 145 స్థానాల్లో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి న్యూ డెమొక్రసీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్‌కు 75 స్థానాలు దక్కాయి. రుణ సంక్షోభం నేపథ్యంలో ఆగస్టులో సిప్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు.
పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి
పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సెప్టెంబర్ 18న జరిగిన ఈ దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరం చెక్‌పోస్ట్‌పై, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక ఆర్మీ కెప్టెన్, ఇద్దరు సైనికులు, 23 మంది పాక్ వైమానిక దళ సిబ్బంది, ముగ్గురు పౌరులు మృతిచెందారు. భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతి మిలిటెంట్లేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది.
నేపాల్ జాతీయ జంతువుగా ఆవు
గోమాతను పవిత్రంగా భావించే నేపాల్‌లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. 2015 సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకొచ్చిన కొత్త రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా పరిగణించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరికి ఆవును ఎంపికచేశారు. దీంతో దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లయింది. దేశంలో గోవధను నిషేధించారు. ఈ అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ చివరగా చేర్చారు.
ఐర్లాండ్‌లో మోదీ పర్యటన
ఏడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు చేరుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా డబ్లిన్‌లో ఆ దేశ ప్రభుత్వాధినేత (Taoiseach) ఎన్డా కెన్నీతో ప్రధాని సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతునివ్వాలని మోదీ ఐర్లాండ్‌ను కోరారు. అనంతరం మోదీ డబ్లిన్ నుంచి ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ బయల్దేరి వెళ్లారు. తరవాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతి పరిరక్షక సదస్సులో పాల్గొంటారు.
సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ విజయం
సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) విజయం సాధించింది. సెప్టెంబరు 11న జరిగిన ఎన్నికల్లో పీఏపీ 89 స్థానాలకు 83 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ ఆరు స్థానాలకు పరిమితమైంది. 1965లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పీఏపీ అధికారంలో కొనసాగుతోంది.
ఈజిప్టు కొత్త ప్రధానిగా షరీఫ్ ఇస్మాయిల్
అవినీతి ఆరోపణలు రావటంతో ఈజిప్టు ప్రధానమంత్రి ఇబ్రహీం మహ్లాబ్, కేబినెట్ మంత్రులు సెప్టెంబరు 12న రాజీనామా చేశారు. దీంతో చమురు శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ కోరారు.
లౌకికవాదం తిరస్కరణ
కొత్త రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తొలగించి, హిందూ దేశంగా తిరిగి చేర్చాలనే ప్రతిపాదనను నేపాల్ రాజ్యాంగ సభ తిరస్కరించింది. దీనికి సంబంధించిన ఓటింగ్ సెప్టెంబరు 14న జరిగింది.
మక్కా మసీదులో ఘోర ప్రమాదం
ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కా మసీదులో సెప్టెంబర్ 11న జరిగిన ఘోర ప్రమాదంలో 107 మంది ప్రాణాలు కోల్పోయారు. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడటంతో ప్రమాదం సంభవించింది. కాబా మసీదు ప్రాంగణాన్ని విస్తరించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం పనులు చేపట్టింది. ఒక క్రేన్ పైభాగం ఆకస్మాత్తుగా కూలిపోయి మసీదు ప్రాంగణంపై పడటంతో ప్రమాదం జరిగింది.
రోజూ 16 వేల శిశు మరణాలు
ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు నేటికీ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాల్లో రోజూ 16 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. పౌష్టికాహార లోపం, నివారించదగ్గ రోగాలతో ఈ ఏడాది 59 లక్షల మంది చిన్నారులు ఐదో పుట్టినరోజు జరుపుకునేలోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో ఏటా 1.27 కోట్లుగా నమోదైన శిశు మరణాల రేటు 2015 నాటికి 50 శాతానికిపైగా తగ్గి 60 లక్షలలోపు తగ్గినప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మరణాల రేటూ ఎక్కువేనని నివేదిక తెలిపింది. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నట్లు వివరించింది.
అఫ్గాన్ జైలుపై తాలిబన్ల దాడి: 355 మంది ఖైదీల పరారీ
అఫ్గానిస్తాన్‌లో ఘజ్ని నగరంలోని జైలుపై తాలిబన్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 14న జైలు గేటు వద్ద కారు బాంబును పేల్చి జైలులోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జైలులో మొత్తం 436 మంది ఖైదీలుండగా, వీరిలో 355 మంది తప్పించుకుని పారిపోయారు. 2011లో కాందహార్ జైలును బద్దలుకొట్టి 500 మంది తాలిబన్లు తప్పించుకుపోయిన తర్వాత అంత భారీ స్థాయిలో జైలుపై దాడి జరగడం ఇదే ప్రథమం.
ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్‌బుల్
మల్టీ మిలియనీర్, మాజీ బ్యాంకర్ మాల్కమ్ టర్న్‌బుల్ ఆస్ట్రేలియా 29వ ప్రధానమంత్రిగా సెప్టెంబర్ 15న ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జనరల్ పీటర్ కోస్‌గ్రోవ్ నేతృత్వంలో టర్న్‌బుల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 14న జరిగిన పార్టీ అంతర్గత ఓటింగ్‌లో ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్‌ను తొలగించారు. లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్‌లో అబాట్‌కు 44 ఓట్లే దక్కాయి. అబాట్ వ్యతిరేక వర్గం నేత మాల్కం టర్న్‌బుల్‌కు 54 ఓట్లు దక్కాయి. దీంతో అబాట్ ప్రధాని పదవి కోల్పోయారు. 2010లో కెవిన్ రడ్‌ను పదవీచ్యుతుడిని చేసి గిలార్డ్ ప్రధాని అయిన ఉదంతం మాదిరిగానే తాజా ఘటన జరిగింది.
శ్రీలంక యుద్ధ నేరాలపై అంతర్జాతీయ కోర్టు
శ్రీలంకలో ఎల్టీటీఈతో దశాబ్దాల పోరులో, 2009 నాటి ముగింపు యుద్ధంలో సైనికుల నేరాలపై అంతర్జాతీయ జడ్జీలతో కూడిన ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సంఘం మొగ్గు చూపింది. ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ జీద్ హుసేన్ తయారు చేసిన నివేదికలో ఈమేరకు పేర్కొన్నారు. యుద్ధకాలంలో సైన్యం వైపు నుంచి హత్యలు, అత్యాచారాలు వంటి ఘోరాలు జరిగాయన్నారు. నివేదికను సెప్టెంబర్ 16న విడుదల చేశారు.
శ్రీలంక ప్రతిపక్ష నేతగా సంపంతన్
మూడు దశాబ్దాల తర్వాత శ్రీలంక పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా తమిళ నేత ఆర్.సంపంతన్ నియమితులయ్యారు. తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) నేత ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైనట్లు స్పీకర్ కరు జయసూరియా సెప్టెంబరు 3న ప్రకటించారు. సంపంతన్ 22 సంవత్సరాలకు పైగా ఎంపీగా పనిచేశారు. తొలి తమిళ ప్రతిపక్ష నాయకుడిగా 1977 నుంచి 1983 వరకు తమిళ్ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ (టీయూఎల్‌ఎఫ్)కు చెందిన ఎ.అమృతలింగమ్ పనిచేశారు.
చైనా సైనిక పాటవ ప్రదర్శన
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా తన సైనిక పాటవాన్ని సెప్టెంబరు 2న బీజింగ్‌లోని తియన్మెన్ స్క్వేర్ వద్ద ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వంటి ఆయుధాలను చైనా ప్రదర్శించింది. రష్యా, పాకిస్తాన్ సహా 17 దేశాల నుంచి వచ్చిన వెయ్యి మంది సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. చైనా పౌరులు, విదేశీ అతిథులు ఈ ప్రదర్శనను వీక్షించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు వేదికపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ సహా 30 దేశాల నేతలు ఈ ప్రదర్శనను తిలకించారు.
బహదుర్ డాంగీ మృతి
ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా గిన్నిస్ రికార్డుల్లో ఉన్న నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగీ (75) అమెరికాలో సెప్టెంబరు 4న అనారోగ్యంతో మరణించారు. 2012 గిన్నిస్ రికార్డు ప్రకారం డాంగీ ఎత్తు 54.6 సెంటీమీటర్లు.
క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు
బ్రిటన్‌ను సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న రాజ్యాధినేతగా 89 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 9, 2015వ తేదీన రికార్డు సృష్టించారు. ఇంతకుముందు బ్రిటన్‌కు అత్యధిక కాలం రాణిగా కొనసాగిన క్వీన్ విక్టోరియా (క్వీన్ ఎలిజబెత్-2 నానమ్మకు నానమ్మ) 63 ఏళ్ల పరిపాలన రికార్డును క్వీన్ ఎలిజబెత్ - 2 అధిగమించారు. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ఆమె పాలనకు 63 ఏళ్ల 7 నెలల కాలం పూర్తయింది. ఈ సందర్భంగా లండన్‌లోని రాజసౌధంలో వేడుకలు జరిపి, ఆమెకు తుపాకి వందనం సమర్పించారు.
నల్లధనం నిర్మూలనకు భారత్-సీషెల్స్ ఒప్పందం
భారత్ సీషెల్స్ మధ్య ఆగస్టు 26న ఒప్పందం జరిగింది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మైఖెల్ భారత్‌ను సందర్శించినప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పన్ను ఎగవేతను అరికట్టేలా సమాచారం మార్పిడికి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పర్యటనలో అలెక్స్ మైఖెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. సముద్ర భద్రతలో సంబంధాలు, మత్స్య రంగంలో సహకారం కోసం భారత్ -సీషెల్స్ కోరుకుంటున్నాయి. ప్రధాని మోదీ సీషెల్స్‌కు రెండో డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బహుమతిగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది.
గంగానది ప్రక్షాళనకు జర్మనీ సాయం
 గంగానది ప్రక్షాళనకు జర్మనీ ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తున్న గంగానదిలో కొంత భాగాన్ని ప్రక్షాళించేందుకు అంగీరించింది. యూరప్‌లోని రైన్ నదిని శుద్ధీకరించేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ విద్యాలయలోనూ సాయం అందించేందుకు జర్మనీ ఒప్పుకుంది.
మౌంట్ మెకిన్లీ పేరు దెనాలిగా మార్పు
ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ మెకిన్లీ పేరును ‘దెనాలి’గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చారు. ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు సెప్టెంబర్ 1న ఒక ప్రకటన విడుదల చేశాయి. 1896లో అప్పటి కాబోయే అమెరికా అధ్యక్షుడు విలియమ్ మెకిన్లీ పేరు ఈ పర్వతానికి పెట్టారు. అయితే ఆ పేరు ఈ ప్రాంత ప్రజలకు నచ్చలేదు. తమ సంస్కృతి సంప్రదాయాలకు తగిన పేరు పెట్టాలని చాలా కాలం నుంచి వారు డిమాండ్ చేస్తున్నారు. 1975 నుంచి అలస్కా ప్రభుత్వం ఈ విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల కోరిక మేరకు పర్వతం పేరు ‘దెనాలి’గా మారుస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు.
AIMS DARE TO SUCCESS
అక్టోబరు 2015 అంతర్జాతీయం
ఒకే బిడ్డ విధానం రద్దుచేసిన చైనా
చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ అక్టోబరు 29న ప్రకటించింది. ఇకపై ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది. దేశంలో వృద్దుల సంఖ్య పెరగడం, కార్మిక శక్తి తగ్గడంతో రెండింటి మధ్య సమతుల్యం పాటించేందుకు ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం 1970 చివర్లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పట్టణప్రాంతాల్లోని జంటలు ఒకే బిడ్డను కనాలి. గ్రామీణ ప్రాంతాల్లో తొలికాన్పు ఆడపిల్ల పుడితేనే రెండో కాన్పునకు అనుమతి ఉంటుంది. 2013 లెక్కల ప్రకారం చైనా జనాభా 135 కోట్లకు పైగా ఉంది.
మాల్దీవుల ఉపాధ్యక్షుడి అరెస్ట్
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌ను అక్టోబరు 24న అరెస్ట్ చేశారు. గత నెల 28న యమీన్ సౌదీ అరేబియా తీర్థయాత్ర ముగించుకుని తిరిగొస్తుండగా బోటులో బాంబు పేలింది. ప్రమాదం నుంచి యమీన్ సురక్షితంగా బయటపడగా, భార్య, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాగా యమీన్ గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ జమీల్‌ను దేశద్రోహ ఆరోపణలతో తొలగించి ఆస్థానంలో అదీబ్‌ను మూడు నెలల కిందట నియమించారు.
70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐరాస
అక్టోబరు 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1945, అక్టోబరు 24న ప్రపంచ దేశాలు ఐరాసను ఏర్పాటు చేశాయి. ప్రారంభంలో సభ్య దేశాలు 51 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 193కు చేరింది. సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఇతర కార్యాలయాలు జెనీవా, నైరోబీ, వియన్నాలో ఉన్నాయి. ప్రపంచ దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడుస్తున్న ఐరాస, ప్రపంచశాంతి కోసం పాటుపడుతోంది. మానవహక్కులను, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా దేశాలకు సహాయ సహకారాలు అందిస్తోంది.
మూడు దేశాల్లో భూకంపం: 266 మంది మృతి
అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో అక్టోబర్ 26న భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి పాకిస్తాన్‌లో 200 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆప్ఘనిస్తాన్‌లో 63 మంది మృతి చెందారు. ఇరు దేశాల్లో 1300 మందికి పైగా గాయపడ్డారు. భూకంప భయంతో భారత్‌లోని కశ్మీర్‌లో ముగ్గురు చనిపోయారు. అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.మీ. దూరంలోని జుర్మ్‌లో హిందూకుష్ పర్వతాల కింద 213 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 2005లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రానికి తాజా భూకంప కేంద్రం అతి దగ్గరలో ఉంది. నాటి భూకంపంలో 75వేల మంది చనిపోయారు.
గ్వాటెమాలా అధ్యక్షుడిగా జిమ్మీ మొరేల్స్
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా అధ్యక్షుడిగా హాస్యనటుడు జిమ్మీ మొరేల్స్ ఎన్నికయ్యారు. అవినీతి పాలనతో విసిగిపోయిన గ్వాటెమాలా ప్రజలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని హాస్యనటుడైన జిమ్మీ మొరేల్స్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అక్టోబర్ 25న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొరేల్స్‌కు 69 శాతం ఓట్లు, ఆయన ప్రత్యర్థి, మాజీ ప్రథమ మహిళ శాండ్రా టోరెస్‌కు 31 శాతం ఓట్లు వచ్చాయి. అవినీతి ఆరోపణలతో ఒటో పెరెజ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జైలుకె ళ్లిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
నేపాల్ తొలి అధ్యక్షురాలిగా విద్యాదేవి
నేపాల్ తొలి అధ్యక్షురాలిగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు విద్యాదేవి భండారీ అక్టోబర్ 28న ఎన్నికయ్యారు. ఏభైనాలుగేళ్ల విద్యాదేవి సీపీఎన్-యూఎంల్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె కమ్యూనిస్టు ప్రముఖుడు దివంగత మదన్ భండారీ సతీమణి. ఆమె ఎన్నికను పార్లమెంటు స్పీకర్ ఒన్సారీ ఘర్తీ మగర్ ప్రకటించారు. ఆమె నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌బహదూర్ గురంగ్‌పై 113 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నేపాల్ తొలి అధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్ తర్వాత ఈ అత్యున్నత పీఠానికి విద్యాదేవి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. విద్యాదేవి విద్యార్థి ఉద్యమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని 1979లో ప్రారంభించారు. ఆమె రెండుసార్లు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.
పేదరికంపై ఎఫ్‌ఏవో నివేదిక
ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలేందుకు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) తన నివేదికలో పేర్కొంది. ఐరాస నిర్ణయించిన జీవన ప్రమాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.97 ఖర్చు చేయలేని పరిస్థితిలో జీవిస్తున్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని రూపుమాపడానికి అమలు చేస్తున్న పలు పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆ నివేదికలో ఎఫ్‌ఏవో కితాబిచ్చింది.
ఉద్యోగులు అమితంగా ఇష్టపడే ‘గూగుల్’
ఉద్యోగులు పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ ప్రథమస్థానంలో ఉందని ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్’ పేర్కొంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్ ప్లేసెస్’ పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎస్‌ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, వీఎల్‌గోరే వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచవ్యాప్తంగా ఏటా పన్నెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 19న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2015’ పేరుతో విడుదలచేసిన నివేదికలో పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ద్విచక్రవాహన ప్రమాదాల్లో పశ్చిమ పసిఫిక్, ఆగ్నేసియా దేశాల్లోనే మూడొంతుల మంది చనిపోతున్నారని, రోడ్డు భద్రత కార్యక్రమాలపై సమీక్ష జరిపి మరింత పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తామని డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు.
నాలుగు నెలలు నిలిచిపోనున్న ‘బిగ్‌బెన్’
ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్లాక్ టవర్స్‌లో ఒకటైన బిగ్ బెన్‌కు తక్షణం మరమ్మతులు నిర్వహించాల్సి రావడంతో సుమారు నాలుగు నెలల పాటు దీనిని నిలిపి వేయనున్నారు. లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్ భవనం వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విశిష్ట నిర్మాణం 1859లో పూర్తయింది. 156 ఏళ్ల చరిత్రలో ఈ గడియారం ఇంతకాలం పాటు నిలిచిపోనునుండడం ఇదే తొలిసారి. 1976లో మరమ్మతుల కారణంగా 26 రోజుల పాటు ఈ గడియారాన్ని నిలిపివేశారు.
ప్రపంచ పింఛన్ సూచీలో చివరన భారత్
ప్రపంచ పింఛన్ సూచీ పరంగా ‘భారత పదవీ విరమణ వ్యవస్థ’ చివరి స్థానంలో నిలిచిందని ప్రముఖ అధ్యయన సంస్థ మెర్సెర్ పేర్కొంది. భారత్ సూచీ విలువ(స్కోర్) 2014లో 43.5 ఉండగా, 2015లో అది 40.3కి పడిపోయింది. ప్రధానంగా సేవింగ్స్ రేటు తగ్గడమే దీనికి కారణమని మెల్‌బోర్న్ మెర్సెర్ గ్లోబల్ పింఛన్ ఇండెక్స్(ఎంఎంజీపీఐ) తెలియజేసింది. ఈ సూచీలో డెన్మార్క్(స్కోర్ 81.7) అత్యుత్తమ పదవీ విరమణ వ్యవస్థతో మొదటి స్థానంలో నిలిచింది.
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 12 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఏటా పన్నెండున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 19న వెల్లడించింది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2015’ (Global status report on road safety 2015) పేరుతో విడుదల చేసిన నివేదికలో.. పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. అయితే యూరోపియన్ దేశాలతోపాటు 79 వివిధ దేశాల్లో ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గగా.. 68 పేద దేశాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 80 శాతం దేశాల్లో అమ్ముడవుతున్న వాహనాల్లో.. కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలిపింది.
కెనడా నూతన ప్రధానిగా ట్రూడో
కెనడా పార్లమెంటుకు అక్టోబర్ 18న జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో లిబరల్ పార్టీ నేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తం 338 సీట్లకు జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ 184 సీట్లు దక్కించుకుంది. దేశాన్ని పదేళ్లపాటు పరిపాలించిన ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది.ఇదే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 19 మంది కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 8 మంది కెనడా భారతీయులు గెలుపొందగా ఈసారి వారి సంఖ్య రెట్టింపైంది.
శ్రీలంక ఆర్మీది యుద్ధనేరమే: విచారణ కమిటీ
ఎల్టీటీఈతో యుద్ధం జరిగిన సమయంలో శ్రీలంక సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కమిటీ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం చెప్పినట్లు ఈ నేరాలపై విదేశీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చరమాంకంలో కొందరు సైనికులు దారుణంగా వ్యవహరించారని.. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ఏర్పాటుచేసిన ఈ కమిటీ తన 178 పేజీల నివేదికలో పేర్కొంది. ఈ కేసుల విచారణకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ
నేపాల్ 38వ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అక్టోబరు 12న ప్రమాణస్వీకారం చేశారు. అక్టోబర్ 11న జరిగిన ఎన్నికల్లో సుశీల్ కొయిరాలాపై ఆయన విజయం సాధించారు. మొత్తం 587 మంది ఓటింగ్‌లో పాల్గొనగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ ఓలీ 338 ఓట్లు సాధించగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొయిరాలాకు 249 ఓట్లు వచ్చాయి.
ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
అమెరికా, 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ట్రాన్స్-పసిఫిక్ పాట్నర్‌షిప్-టీపీపీ) కుదిరింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ పసిఫిక్ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వేల సంఖ్యలో సుంకాలు రద్దుకానున్నాయి. దీంతో పాటు చైనా ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జీడీపీ (2012) 40 శాతంగా ఉంది.
మూడు దేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన
జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్టోబర్ 10న జోర్డాన్ చేరుకునన్నారు. ఆ దేశ పాలకుడు కింగ్ అబ్దుల్లాతో ప్రణబ్ సమావేశమయ్యారు.ఈ మేరకు ఇరు దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్‌లోని అమ్మన్‌లో గాంధీ పేరిట ఏర్పాటుచేసిన ఓ వీధిని ప్రణబ్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్ సిటీ కౌన్సిల్ ఆయనకు ‘గోల్డెన్ కీ ఆఫ్ అమ్మాన్’ను బహూకరించింది.
అనంతరం అక్టోబర్ 12న ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమై చర్చించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనాకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలియజేశారు. పాలస్తీనా అథారిటీకి భారత్ రూ. 32.3 కోట్ల చెక్కును బడ్జెటరీ మద్దతుగా అందించింది. అలాగే.. పాలస్తీనా భూభాగంలో రమల్లాలో టెక్నాలజీ పార్కు సహా ఐదు ప్రాజెక్టుల కోసం రూ. 115 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
ఆఖరిగా ఇజ్రాయిల్‌లో పర్యటించిన రాష్ట్రపతి అక్టోబర్ 14న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. పశ్చిమాసియాలో సాగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
దారిద్య్రరేఖను సవరించిన ప్రపంచ బ్యాంకు
ప్రపంచ దారిద్రరేఖను ప్రపంచ బ్యాంకు సవరించింది. ఇప్పటి వరకు రోజుకు 1.25 డాలర్లు సంపాదించే వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న వారిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రోజు వారీ సంపాదనను 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు (రూ.130) సవరించింది.
భారత్‌తో అనిశ్చితి తొలగింపునకు నేపాల్ త్రిసభ్య బృందం
భారత్‌తో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, దౌత్య అనిశ్చితికి తెరదించేందుకుగాను నేపాల్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని అక్టోబర్ 9న నియమించింది. ఈ సమస్యతోపాటు పెట్రోలియం ఉత్పత్తులు సహా నిత్యావసరాల సరఫరా సాఫీగా సాగేలా ఈ బృందం భారత్‌తో చర్చలు జరుపుతుంది. ఈ బృందానికి విదేశాంగ మంత్రి మహేంద్ర బహదుర్ పాండే నాయకత్వం వహించనున్నారు. ఇంకా ఈ బృంద సభ్యులుగా నేపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ్‌లాల్ సుబేడి, వాణిజ్య. పౌరసరఫరా శాఖ కార్యదర్శి ప్రసాద్ ఉపాధ్యాయ సభ్యులుగా నియమితులయ్యారు.
టర్కీలో బాంబు పేళుల్లు: 86 మంది మృతి
టర్కీ రాజధాని అంకారాలో అక్టోబర్ 10న ఉగ్రవాదులు జరిపిన బాంబు పేళ్లులో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 186 మంది గాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా ఉగ్రవాదులు రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 24 మంది కన్నుమూసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యూజినోగ్లు తెలిపారు. అంకారా నగర చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడిని దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఖండించారు.
ఫిజి తదుపరి అధ్యక్షుడు జియోజి
ఫిజి తదుపరి అధ్యక్షుడిగా ఆ దేశ ఉపాధి శాఖ మంత్రి జియోజి కొనౌసి కొన్రోటే అక్టోబర్ 12న ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలో అధికార ఫిజి ఫస్ట్ పార్టీ ఆయనను బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో జియోజీకి 31 ఓట్లు రాగా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రటు ఎపేలి గనిలావ్‌కు కేవలం 14 ఓట్లే దక్కాయి. ఫిజి రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు తమ తరఫున ఒకరిని అధ్యక్ష పదవి ఎన్నికల బరిలోకి దించుతారు. మెజారిటీ ఓట్లు దక్కించుకున్న వ్యక్తి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
బ్రహ్మపుత్రపై చైనా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టును చైనా అక్టోబర్ 13న ప్రారంభించింది. సుమారు రూ. 9764 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ జామ్ హైడ్రోపవర్ స్టేషన్‌లో 2.5 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది టిబెట్‌లోనే అత్యంత పెద్ద డామ్. ఈ స్టేషన్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో సెంట్రల్ టిబెట్ విద్యుత్ కొరతను తీర్చవచ్చు. చైనా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా వరదలప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశముందని గతంలోనే భారత మంత్రిత్వ శాఖల అంతర్గత నిపుణుల బృందం అభిప్రాయపడింది. భారత సరిహద్దుకు 550 కిలోమీటర్ల దూరంలో మాత్రమే డ్యామ్‌లు నిర్వహించాలని సూచించింది.
అణు ఒప్పందానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
ప్రపంచ దేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ పార్లమెంట్ అక్టోబర్ 13న ఆమోదముద్ర వేసింది. 250 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో ఒప్పందాన్ని బలపరిచే తీర్మానానికి(జేసీపీవోఏ) అనుకూలంగా 161 మంది ఓటేశారు. రెండేళ్ల చర్చోపచర్చల అనంతరం ఈ ఏడాది జూలై 14న ఇరాన్, ఆరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇరాన్‌పై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు 2016 జనవరి కల్లా తొలగిపోతాయి. అదే సమయంలో ఇరాన్ కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)ను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. శాంతియుత ప్రయోజనాల కోసమే అణు ఇంధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు నమ్మకం కలిగించాలి.
పట్టణ రవాణాపై భారత్- స్వీడన్ మధ్య ఒప్పందం
రవాణా వ్యవస్థ మెరుగుపరచడం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, డిజిటలైజేషన్‌కు సంబంధించి దేశంలో తలపెట్టిన నూతన పథకాల అమలులో సహకారం కోసం భారత్-స్వీడన్ మధ్య ఒప్పందం కుదిరింది. స్వీడన్ పట్టణాభివృద్ధి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మెహ్మెట్ కప్లాన్, భారత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అక్టోబర్ 13న భేటీ అయ్యారు. పట్టణాల సుస్థిర ప్రగతికి అవసరమైన ప్రాజెక్టులను గుర్తించాలని వారు నిర్ణయించారు. ద్రవ, ఘనవ్యర్థాలనుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి తమ దేశం అన్నివిధాలుగా సహకరిస్తుందని కప్లాన్ హామీ ఇచ్చారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సదస్సు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉన్నత స్థాయి శాంతి పరిరక్షణ సదస్సు సెప్టెంబరు 29న న్యూయార్క్‌లో జరిగింది. ఈ సదస్సులో 50 దేశాల నేతలు పాల్గొన్నారు. సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరాస శాంతి పరిరక్షక ఆపరేషన్స్‌ను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దళాలను పంపిస్తున్న దేశాలకు భద్రతామండలికి మధ్య సంప్రదింపులు పెరగాల్సిన అవసరాన్ని డిక్లరేషన్ పేర్కొంది. శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారత్ నుంచి 1.8 లక్షల మంది సైనికులు 49 కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిలో 161 మంది మరణించారని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
భారత్- అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం
 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబరు 28న భారత్-అమెరికా మధ్య మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రక్షణ అవసరాల కోసం భారత్ రూ.19.86 వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లను కొంటుంది.
AIMS DARE TO SUCCESS
నవంబరు 2015 అంతర్జాతీయం
మాల్టాలో చోగమ్ సదస్సు
కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్).. మాల్టా రాజధాని వాలెట్టాలో నవంబరు 27 నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఉగ్రవాద నిధులపై సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల హబ్ నెలకొల్పేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. కామన్వెల్త్‌లోని చిన్న, పేద దేశాలకు ఉద్గారాలను తగ్గించేందుకు నిధులు సమకూర్చేందుకు ఈ హబ్ తోడ్పడనుంది. ఉగ్రవాద నిర్మూలనకు రూ.50 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు సదస్సులో ప్రకటించారు. ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ ఇతివృత్తంతో సదస్సు జరిగింది. సదస్సులో 53 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ-మూన్ కూడా పాల్గొన్నారు. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సదస్సుకు హాజరయ్యారు.
బ్రిటన్‌లో ‘చోగమ్ 2018’
2018లో చోగమ్‌ను బ్రిటన్ నిర్వహించనుంది. చోగమ్ ప్రతి రెండేళ్లకూ ఒకసారి జరుగుతుంది. 53 దేశాలతో కూడిన ఈ సదస్సు 2017లో వనటు దేశంలో జరగాల్సి ఉంది. అయితే.. 2015 మార్చిలో తుపాన్ తాకిడితో చిన్న పసిఫిక్ దీవి దేశమైన వనటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో తదుపరి సదస్సును 2018లో తాము నిర్వహించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.
పారిస్‌లో ‘వాతావరణ సదస్సు’
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశం నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రారంభమైంది. సదస్సుకు 150పైచిలుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. COP21 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)గా పిలిచే ఈ సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కర్బన ఉద్గారాలపై పోరాటానికి భారత్ నిబద్ధతను ప్రదర్శిస్తూ సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతదేశ వేదికను మోదీ ప్రారంభించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు.. ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకు నెట్టివేయటం నైతికంగా తప్పన్నారు. పేద దేశాలకు.. తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవటానికి కర్బనాన్ని మండించే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌లతో మోదీ భేటీ అయ్యారు.
అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమి
పారిస్ వాతావరణ సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ నవంబర్ 30న అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిని ప్రారంభించారు. ఈ కూటమిలో సుమారు 120 దేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సెక్రటేరియట్ ఏర్పాటు సహా మౌలిక వసతుల కోసం భూమిని కేటాయిస్తామని, అలాగే భారత్ తరఫున వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 200 కోట్లు) ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోదీ ప్రకటించారు. కూటమికి సంబంధించిన కార్యక్రమాన్ని త్వరలో హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ’లో నిర్వహిస్తామన్నారు.
మాలిలో ఉగ్రవాదుల దాడి: 27 మంది మృతి
ఆఫ్రికా దేశం మాలిలో హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 20వ తేదీన మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసి.. 170 మందిని బందీలుగా పట్టుకున్నారు. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి బందీలను విడిపించాయి.
కౌలాలంపూర్‌లో ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సదస్సు మలేసియాలోని కౌలాలంపూర్‌లో నవంబర్ 21న జరిగింది. పదమూడో భారత్-ఆసియాన్ సదస్సు కూడా ఇక్కడే జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్- ఆసియాన్‌ల మధ్య భౌగోళిక, డిజిటల్ అనుసంధానత కోసం రూ. 100 కోట్ల రుణాన్ని ఆయన ప్రకటించారు. అన్ని ఆసియాన్ దేశాలకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయాసియా దేశాలు ప్రత్యేక ఆర్థిక సమాజం (ఏఈసీ)ను నవంబర్ 22న ఏర్పాటు చేసుకున్నాయి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత సరుకు రవాణా, పెట్టుబడుల ప్రవాహానికి ఇది తోడ్పడుతుంది.
‘తోరణ’ గేట్‌ను ప్రారంభించిన మోదీ, నజీబ్
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో రూ.70 కోట్ల వ్యయంతో భారత్ నిర్మించిన ‘తోరణ’ గేట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ నవంబర్ 23న ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి.. లిటిల్ ఇండియాగా పిలిచే బ్రిక్‌ఫీల్డ్స్‌లో దీన్ని నిర్మించారు.
జీటీఐలో భారత్‌కు ఆరో స్థానం
ప్రపంచ ఉగ్రవాద సూచీ (జీటీఐ)- 2015లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ సంస్థ నవంబర్ 18న విడుదల చేసిన ఈ సూచీలో 2014 లో ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన తొలి 10 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 2014లో 162 ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్థాన్, సిరియాలో ఉగ్రవాద ప్రభావం ఎక్కువ ఉందని ఆ సంస్థ తెలిపింది.
అర్జెంటీనా అధ్యక్షుడిగా మక్రీ
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ ప్రొపోజల్ పార్టీ నేత మౌరిసియో మక్రీ విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డి కిర్చేనర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జస్టిసియాలిస్ట్ పార్టీ తరుఫున డానియెల్ ఎన్నికల బరిలో దిగారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో డానియెల్‌పై మక్రీ గెలుపొందారు. దీంతో 12 సంవత్సరాలుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న క్రిస్టినా శకం ముగిసినట్లైంది. భర్త నెస్టర్ కిర్చేనర్ మరణానంతరం దేశ రాజకీయాల్లో కీలక ప్రాత పోషిస్తూ వస్తున్న క్రిస్టినా ఫెర్నాండేజ్ అర్జెంటీనాకు రెండో మహిళా అధ్యక్షురాలుగా సేవలందించారు.
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ
తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో రష్యా సుఖోయ్ యుద్ధ విమానం ఎస్‌యూ 24ను టర్కీ సైన్యం ఎఫ్ 16 యుద్ధ విమానంతో కూల్చివేసింది. తమ గగనతలంలోకి ప్రవేశించడంతోపాటు పలుమార్లు చేసిన హెచ్చరికలను లెక్కచేయనందునే నవంబర్ 24న రష్యా విమానాన్ని కూల్చేసినట్లు టర్కీ పేర్కొంది.
చైనా, భారత్‌లో విపత్తులు అత్యధికం
వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి నవంబర్ 24న వెల్లడించింది. 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల వల్ల ఈ రెండు దేశాల్లో 3 బిలియన్ల మందికి పైగా ప్రభావితం చెందారని తెలిపింది. నవంబర్ 30 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కీలక వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులకు మానవ మూల్యం పేరిట యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది.
ట్యునీషియాలో ఎమర్జెన్సీ
ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియాలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం నవంబర్ 25న ప్రకటించింది. దేశ రాజధాని ట్యూనిష్ నగరంలో నవంబర్ 24న అధ్యక్షుడు కాన్వాయ్‌లోని ఒక బస్సును గుర్తుతెలియని దుండగులు పేల్చేశారు. ఈ ప్రమాదంలో 15 మంది బాడీగార్డులు దుర్మరణం చెందారు. ఈ దాడి అధ్యక్షుడి లక్ష్యంగా జరిగి ఉండవచ్చని, అందువల్లే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇది నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని అధ్యక్షుడు బెజీ సియాద్ ఎస్సెబ్సి ప్రకటించారు.
పారిస్ ఉగ్రదాడిలో 128 మంది మృతి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నవంబర్ 14న ఉగ్రవాదులు జరిపిన దాడులలో 128 మంది పౌరులు మరణించగా, మరో 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిస్‌లోని ఏడుచోట్ల విచక్షణారహిత దాడులకు పాల్పడ్డారు. పారిస్ అంతర్జాతీయ స్టేడియం, బతాక్లాన్ థియేటర్‌తో పాటు కెఫేలపై బాంబులు, తుపాకులతో దాడిచేసి పౌరులను హతమార్చారు. ఉగ్రవాదుల్లో కొందరిని భద్రతా దళాలు కాల్చి చంపగా, మరికొందరు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సిరియాలో దాడులకు ప్రతీకారంగానే పారిస్ దాడులకు పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ప్రకటించింది. ఈ దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు తమ దేశంపై జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం పారిస్ దాడులను తీవ్రంగా ఖండించింది.
ఆంటిల్యాలో జీ-20 సదస్సు
రెండు రోజుల జీ-20 సదస్సు ఆంటిల్యా (టర్కీ)లో నవంబర్ 15న ప్రారంభమైంది. సదస్సులో దేశాధినేతలు ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. పారిస్ ఐఎస్‌ఐఎస్ దాడుల నేఫథ్యంలో సదస్సులో ఉగ్రవాద సమస్య ప్రధానాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, సుస్థిర వృద్ధి, ఇంధనం, వాతావరణ మార్పు, శరణార్థుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో కోటా సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓటుహక్కు కల్పించడం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి.
మయన్మార్ ఎన్నికల్లో సూచీ విజయం
మయన్మార్‌లో తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూచీ ఘన విజయం సాధించారు. నవంబర్ 8న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) 80 శాతం స్థానాలను కైవసం చేసుకొంది. మొత్తం 664 స్థానాలకు గాను 440 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలను సైన్యం తనకు కేటాయించుకొంది. భర్త, పిల్లలు విదేశాల్లో పుట్టడంతో సూచీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలిగా ఆ దేశ నిబంధనలు ఉన్నాయి.
ప్రవాస భారతీయుల సభలో మోదీ ప్రసంగం
బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లండన్‌లోని వెంబ్లీ ఫుట్‌బాల్ స్టేడియంలో నవంబర్ 13న ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 ఏర్పాటు చేసిన విందులో మోదీ పాల్గొన్నారు. పునర్‌వ్యవస్థీకరించిన భారత్-యూకే సీఈవోల ఫోరం తొలి సమావేశానికి కూడా మోదీ హాజరయ్యారు.
యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జిందాల్
అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు లూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి 2016లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో వెనకబడిన జిందాల్, రిపబ్లికన్ పార్టీ తరఫున ‘వైట్‌హౌస్’ రేసుకు పోటీపడుతున్న అభ్యర్థుల లిస్టులో దాదాపు చివరన ఉన్నారు. రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్, రిటైర్డ్ న్యూరోసర్జన్ బెన్ కార్సన్ ఆ పార్టీ తరఫున ముందు వరుసలో ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో ఇద్దరు విపక్ష నేతలకు ఉరి శిక్ష
విపక్షాలకు చెందిన ఇద్దరు కీలక నేతలకు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు నవంబర్ 18న సంచలన తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ నుంచి విడిపోయే సందర్భంగా చోటు చేసుకున్న 1971 యుద్ధ సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డారంటూ అలీ ఎహసాన్ మహ్మద్ ముజాహిద్ (67), సలాఉద్దీన్ ఖాదర్ చౌదరి (66)లకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ప్రస్తుతం జమాతే ఇస్లామీ (బంగ్లాదేశ్) పార్టీలో కీలకనేతగా ఉన్న ముజాహిద్.. 1971 యుద్ధ సమయంలో వేలాది మైనారిటీ హిందుల ఊచకోతలకు ప్రేరేపించడం, పలువురు మేధావులను హింసించడంతోపాటు వారిలో కొందరిని హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. తనపై నమోదైన ఐదు కేసుల్లోనూ ముజాహిద్ దోషిగా తేలారు. ఖాదర్ చౌదరి.. యుద్ధ సమయంలో పెద్ద ఎత్తున సామూహిక హత్యాకాండ జరిపించారని నిర్ధారణ అయింది. మతగురువులనూ చంపించారని తేలింది.
పాకిస్థాన్ స్పీకర్‌గా మరోసారి అయాజ్
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ నేత అయాజ్ సాదిక్ మళ్లీ ఎన్నికయ్యారు. పీఎంఎల్ నేత అయిన సాదిక్‌కు మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఓటు వేశారు. 2013 నాటి సార్వత్రిక ఎన్నికల్లో సాదిక్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే రిగ్గింగ్ అభియోగాల నేపథ్యంలో ఆయన ఎన్నిక రద్దయింది. సాదిక్ ఎన్నిక స్వేచ్ఛగా, సజావుగా సాగడం లేదంటూ పాకిస్థాన్ తె హ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్ ఓ పిటిషన్ దాఖలు చేయడంతో ఆగస్టు 22న పదవీచ్యుతుడయ్యాడు. అయితే పీఎంఎల్ పార్టీ ఈ ఎన్నికల బరిలోకి తిరిగి సాదిక్‌నే అభ్యర్థిగా దించింది.
బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా నవంబర్ 12న ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను బహిష్కరించి, ఏకాకిని చేసే విషయంలో ఒక అంతర్జాతీయ తీర్మానం అవసరమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్లోని రాయల్ గ్యాలరీ నుంచి 25 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ.. సమకాలీన సమాజపు అతిపెద్ద ప్రమాదమైన ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సమాజం ఐకమత్యంగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యూకే పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ దిగువ సభలో అడుగుపెట్టగానే.. బ్రిటన్ ఎంపీలంతా లేచి నిల్చొని స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమరాన్ కూడా పాల్గొన్నారు.
ఫిజి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన జియోజి కొన్రోటే
ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ సైనికాధికారి, దౌత్యవేత్త జియోజి కొన్రోటే నవంబర్ 11న ఫిజి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జియోజీతో దేశ ప్రధాన న్యాయమూర్తి ఆంథోనీ గేట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. 67 ఏళ్ల జియోజీ... లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి కమాండర్‌గా వ్యవహరించారు. 2001-06 మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో ఫిజి హైకమిషనర్‌గా పనిచేశారు.
టాంజానియా అధ్యక్షుడిగా పాంబే మగుఫులి
టాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార చమా చమ పిండుజి(సీసీఎం) పార్టీకి చెందిన జాన్ పాంబే మగుఫులి విజయం సాధించారు. అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ముగుఫులికి 58.46 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ లొవస్సాకు 39.97 శాతం ఓట్లు వచ్చాయి. టాంజానియాలో 1977 నుంచి సీసీఎం పార్టీ అధికారంలో కొనసాగుతోంది.
రష్యా విమానం కూలిన దుర్ఘటనలో 224 మంది మృతి
రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో అక్టోబరు 31న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం ఎర్రసముద్రంలోని పర్యాటక ప్రాంతం షర్‌మఎల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుంది. ప్రయాణికుల్లో రష్యాకు చెందిన 214 మంది, ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానాన్ని తామే కూల్చినట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో తమసంస్థపై దాడులకు ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల కూలిపోయి ఉంటుందని రష్యా వెల్లడించింది.
2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబరు 29న తన నివేదికలో ప్రకటించింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 96 లక్షల మందికి కొత్తగా క్షయ వ్యాధి సోకింది. భారత్‌లో అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చైనాలో 10 శాతం చొప్పున నమోదయ్యాయి. 2014లో మరణించిన 15 లక్షల మందిలో మూడింట రెండొంతుల మంది భారత్, నైజీరియాలోనే ఉన్నారు. క్షయవ్యాప్తి 1990లో కన్నా 2015లో 42 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
‘గే’ల పెళ్లికి ఐర్లాండ్ అనుమతి
స్వలింగ సంపర్కుల వివాహానికి ఐర్లాండ్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ‘వివాహ బిల్లు 2015’లో మార్పులు చేస్తూ అక్టోబర్ 30న అధ్యక్ష కమిషన్ చట్టం తీసుకొచ్చింది. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 62.1 శాతం ప్రజలు గేలకు మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గేలకు మద్దతుగా చట్టం తీసుకొచ్చిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది.
మాల్దీవుల్లో ఎమర్జెన్సీ
 మాల్దీవుల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున నవంబర్ 4 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ వెల్లడించారు. అక్టోబర్ 31న అధ్యక్ష భవనం దగ్గర్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడం, అధ్యక్షుడిపై హత్యాయత్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) తలపెట్టిన నిరసనకు రెండురోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మహమద్ నషీద్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద దోషిగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఎండీపీ ఆందోళన కార్యక్రమం తలపెట్టింది.
రోమానియా ప్రధాని రాజీనామా
రోమానియా దేశ చరిత్రలో ఎన్నడూలేనంతటి ఘోర అగ్ని ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి విక్టర్ పొంటా నవంబర్ 4న తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 6వ తేదీన బుకారెస్ట్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మంది క్షతగాత్రుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆగ్రహించిన 20,000 మంది స్థానికులు నవంబర్ 2న సిటీలోని ప్రఖ్యాత విక్టరీ స్క్వేర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాని గద్దెదిగాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొంటా ప్రకటించారు. రోమానియాకు పోంటా 2012 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.
AIMS DARE TO SUCCESS
డిసెంబరు 2015 అంతర్జాతీయం
పోప్ ‘శాంతి’ సందేశం
ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, అస్థిరత తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ (79) పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీ నుంచి సన్నీ స్క్వేర్‌లోని 10వేల మంది యాత్రికులనుద్దేశించి పోప్ తన సందేశాన్నిచ్చారు. సిరియా, లిబియానుంచి వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని ప్రశంసించారు. సిరియా అంతర్యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అఫ్గాన్ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించిన మోదీ
రూ.600 కోట్లు వెచ్చించి భారత్ నిర్మించిన అఫ్గానిస్తాన్ కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి డిసెంబర్ 25న భారత ప్రధాని నరే్రంద మోదీ ప్రారంభించారు. అలాగే పార్లమెంట్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(డిసెంబర్ 25 ఆయన 91వ పుట్టినరోజు) పేరిట నిర్మించిన ‘అటల్ బ్లాక్’నూ ప్రారంభించారు. అనంతరం పార్లమెంట్‌లో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినప్పుడే అఫ్గానిస్తాన్ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని మోదీ అన్నారు. అఫ్గాన్ ఆర్మీలో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు చెందిన 500 మంది పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందిస్తామని మోదీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు భద్రత అంశాలపై మోదీ.. ఘనీతో చర్చించారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లాతో కూడా మోదీ భేటీ అయ్యారు.
పాకిస్తాన్‌లో మోదీ ఆకస్మిక పర్యటన
ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25న పాకిస్తాన్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు కానుకగా.. మనవరాలు మెహరున్నిసా పెళ్లికి ప్రత్యేక అతిథిగా మోదీ హాజరయ్యారు. రష్యా పర్యటన అనంతరం అఫ్గానిస్తాన్ నుంచి భారత్ బయల్దేరిన మోదీ.. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి భారత్ పయనమయ్యారు. ఈ సందర్భంగా భారత్, పాక్ సంబంధాలను మెరుగుపర్చే దిశగా షరీఫ్‌తో కొద్దిసేపు చర్చలు జరిపారు. మనవరాలి వివాహానికి హాజరుకావాల్సిందిగా షరీఫ్ మోదీని ఆహ్వానించడంతో ఈ అనుకోని పర్యటన చోటు చేసుకుందని అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) వర్గాలు తెలిపాయి. కాగా 2004లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ తరువాత దాయాది దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే.
ఎబోలా రహిత దేశంగా పాపువా న్యూగినియా
పాపువా న్యూగినియాను ప్రాణాంతక ఎబోలా వ్యాధిరహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డిసెంబర్ 29న ప్రకటించింది. ఈ వ్యాధి బారినపడి పశ్చిమాఫ్రికాకు చెందిన 12 వేల మంది చనిపోయారు. 21 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ ముగిసిన అనంతరం రెండోసారి జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్ అని రావడంతో ఒకరినుంచి మరొకరికి సోకే ఈ వ్యాధి నుంచి గినియాకు విముక్తి కలిగినట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. గినియాలో పుట్టిన ఈ వ్యాధి ఆ తర్వాత లిబీరియా, సియెరా లియోన్ దేశాల్లోనూ వ్యాప్తిచెందింది.
ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 34 దేశాలతో ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటైంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ కేంద్రంగా ఈ సైనిక కూటమి పనిచేయనుంది. ఈ మేరకు సౌదీ అరేబియా డిసెంబర్ 14న ప్రకటన చేసింది. ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేసియా, పాకిస్థాన్, నైజీరియా, సోమాలియా, మాలీ, చాద్, మాల్దీవులు, బహ్రెయిన్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.
అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా 2016
2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. పప్పుదినుసుల్లో ఉన్న మాంసకృత్తులు, పీచు, ఇతర పోషకాల గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల బాధ్యతను ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో)కు అప్పగించింది.
మిస్ వరల్డ్ - 2015గా మిరేయ రొయో
మిస్ వరల్డ్-2015గా స్పెయిన్‌కి చెందిన 23 ఏళ్ల మిరేయా లలగున రొయో ఎంపికైంది. సాన్యా (చైనా) లో డిసెంబర్ 19న ముగిసిన పోటీల్లో రష్యాకు చెందిన సోఫియా నికిచ్చుక్, ఇండోనేసియాకు చెందిన మరియా హర్ఫాంటి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
మిస్ యూనివర్స్-2015గా అలొంజ్ వుర్త్‌బాచ్
ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలొంజ్ వుర్త్‌బాచ్ మిస్ యూనివర్స్-2015గా ఎంపికైంది. లాస్‌వెగాస్ (అమెరికా)లో డిసెంబర్ 21న ముగిసిన పోటీల్లో వుర్త్‌బాచ్ కిరీటం దక్కించుకోగా, కొలంబియాకు చెందిన అరియాడ్నా గ్విటెర్జ్ రెండో స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ఒలివియా మూడో స్థానాన్ని దక్కించుకొంది. భారత్ నుంచి (2000) లారాదత్తా ఈ కిరీటాన్ని సాధించారు.
ఉగ్రవాద సంస్థల నిధుల కట్టడి తీర్మానానికి ఆమోదం
భయానక ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్‌కాయిదాలకు నిధులు అందే అన్ని మార్గాలనూ మూసేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలను భారీగా పెంచుతామని సభ్య దేశాలు ప్రతినబూనాయి. భద్రతామండలిలోని 15 సభ్యదేశాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశాన్ని డిసెంబర్ 18న నిర్వహించారు. ఐఎస్, అల్‌కాయిదాలపై ఆంక్షలను పెంచడం, వాటికి నిధులు అందకుండా అడ్డుకోవడం, దాతృత్వ కార్యక్రమాల పేరిట జరిగే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం తదితర చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మిస్ ఇరాక్‌గా షైమా అబ్దెల్ రహ్మాన్
ఇరాక్‌లో సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం నిర్వహించిన మిస్ ఇరాక్ పోటీల్లో 20 ఏళ్ల షైమా అబ్దెల్ రహ్మాన్ విజేతగా నిలిచింది. భారీ బందోబస్తుతో డిసెంబర్ 19న నిర్వహించిన ఫైనల్స్‌లో స్విమ్‌సూట్, ఆల్కహాల్ వంటి ఆధునిక పోకడలకు తావివ్వలేదు. ఇరాక్ పురోగమిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని విజేత షైమా తెలిపింది. ఇరాక్‌లో చివరిసారిగా 1972లో అందాల పోటీలు నిర్వహించారు.
ప్రధాని మోదీ రష్యా పర్యటన
రక్షణ రంగంతో పాటు పలు అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. రెండ్రోజుల పర్యటన కోసం డిసెంబర్ 23న ఢిల్లీ నుంచి బయల్దేరి మాస్కో చేరుకున్నారు. డిసెంబర్ 24న మోదీ.. పుతిన్‌తో 16వ భారత్-రష్యా వార్షిక చర్చల్లో భాగంగా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. భారత్-రష్యా సీఈవోల భేటీలో పాల్గొన్నారు. మాస్కోలో ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు.
హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు
 ఐదో ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగింది. ఈ సదస్సును పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియాకి అఫ్గానిస్థాన్ గుండె వంటిదని అభివర్ణించారు. అఫ్గానిస్థాన్ లో ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని పాక్ ప్రధాని ప్రకటించారు. భారత్ తరపున సదస్సులో పాల్గొన్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అఫ్గానిస్థాన్‌లో సమర్థవంతమైన రవాణా ఏర్పాట్లకు సాయం చేస్తామని తెలిపారు. సదస్సులో 14 సభ్యదేశాలు,17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొన్నాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, అజర్ బైజాన్, భారత్, చైనా, ఇరాన్, కజికిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్థాన్, టర్కీ, తుర్కమెనిస్థాన్, యూఏఈ దేశాలు కలసి 2011లో హార్ట్ ఆఫ్ ఆసియాను ఏర్పాటు చేశాయి.
భూతాపం తగ్గింపునకు ఆమోదం
పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్21)లో రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి భూతాపాన్ని పరిమితం చేసేందుకు డిసెంబరు 12న 195 దేశాలు ఆమోదం తెలిపాయి. పారిశ్రామికీకరణ ముందునాటితో పోల్చితే 2100 నాటికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించాయి. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రరాజ్యాలు 2020 నాటి నుంచి ఏటా కనీసం 10,000 కోట్ల డాలర్లు సమకూర్చటం, ఈ మొత్తాన్ని 2025లో మరోసారి సమీక్షించటం తదితర అంశాలను ఒప్పందంలో పొందుపరచారు.
కజకిస్తాన్ మాజీ ప్రధానికి జైలు శిక్ష
కజకిస్తాన్ మాజీ ప్రధాని సెరిక్ అక్మెతోవ్‌కు అవినీతి కేసులో ఆ దేశ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాని స్థాయి వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించడం కజక్‌లో ఇదే తొలిసారి. సెరిక్ 2012 నుంచి 2014 వరకు కజకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. ఈయన నుర్ ఓటాన్ పార్టీకి చెందిన నేత. అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధులు కాజేయడం వంటి అవినీతి కేసుల్లో సెరిక్‌ను దోషిగా తేలుస్తూ డిసెంబర్ 12న కోర్టు తీర్పు చెప్పింది.
సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలు
ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా తొలిసారి అవకాశం కల్పించారు. పెరుగుతున్న లింగవివక్షను నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 12న జరిగిన మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు పోటీలో పాల్గొనగా, 20 మంది గెలుపొందారు. రాచరిక పాలన ఉన్న సౌదీలో ప్రజలు ఓటేసి ఎన్నుకునేది ఒక్క ఈ మునిసిపల్ కౌన్సిల్స్‌నే.
‘తాపి’ పైప్‌లైన్ పనులకు శ్రీకారం
నాలుగు దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సహజవాయువు సరఫరా పైప్‌లైన్ (తాపి పైప్‌లైన్)కు తుర్క్‌మెనిస్తాన్‌లోని మేరీ నగరంలో డిసెంబర్ 13న శ్రీకారం చుట్టారు. తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్‌బంగులీ, అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొని వెల్డింగ్ పనులను ప్రారంభించారు. సహజవాయు సరఫరాకు గాను 1,800 కి.మీ. పొడవైన పైపులైన్‌ను రూ. 51 వేల కోట్లతో నిర్మించనున్నారు. 2019 డిసెంబరు కల్లా పూర్తిచేసి దీని ద్వారా రోజుకు 9 కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు (ఎంఎంఎస్ సీఎండీ) 30 ఏళ్లపాటు భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లకు తుర్క్‌మెనిస్తాన్ పంపిణీ చేయనుంది.
TAPI Pipeline: Turkmenistan–Afghanistan–Pakistan–India Pipeline
వెనెజువెలాలో ప్రతిపక్ష కూటమి విజయం
వెనెజువెలా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రజాస్వామ్య కూటమి ‘డెమోక్రటిక్ యూనిట్ రౌండ్ టేబుల్ (ఎంయూటీ)’ విజయం సాధించింది. నేషనల్ అసెంబ్లీలోని 167 స్థానాల్లో, 99 స్థానాలను గెలుచుకుంది. సోషలిస్ట్ పార్టీ 46 స్థానాలు మాత్రమే గెలుచుకొంది. దీంతో 17 సంవత్సరాల తర్వాత అధికారాన్ని కోల్పోయింది. అధ్యక్షుడు నికోలస్ మదురో ఓటమిని అంగీకరించారు.
భారత్-పాక్ భద్రతా సలహాదారుల సమావేశం
భారత్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) సమావేశం డిసెంబరు 6న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగింది. జమ్మూకశ్మీర్, ఉగ్రవాదం, నియంత్రణ రేఖ వద్ద కాల్పులు వంటి పలు ద్వైపాక్షిక అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. నిర్మాణాత్మక చర్చలు కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. భారత్ ఎన్‌ఎస్‌ఏ అజిత్ ధోవల్, పాకిస్తాన్ ఎన్‌ఎస్‌ఏ నాసర్ ఖాన్ జన్‌జులా నేతృత్వంలోని బృందాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి.
కలుషిత ఆహారానికి ఏటా 4.2లక్షల మంది బలి
ప్రపంచ వ్యాప్తంగా కలుషిత ఆహారం తిని ప్రతి ఏటా 4లక్షల 20 వేల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు మూడోవంతు ఉన్నారని తెలిపింది. ఆహార సంబంధిత వ్యాధుల ప్రభావంపై విడుదల చేసిన నివేదికలో.. 60 కోట్ల మంది ఏటా కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 55 కోట్ల మంది ‘నోరోవైరస్’, ‘కాంపిలో బాక్టర్’ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
పాక్‌తో భారత్ ‘సమగ్ర ద్వైపాక్షిక చర్చలు’
భారత్ - పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాలు ‘సమగ్ర ద్వైపాక్షిక చర్చలు’ జరపనున్నాయి. శాంతిభద్రతలు, కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా మళ్లీ సమగ్ర చర్చలు ప్రారంభించాలని తీర్మానించాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్‌తో, పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాలపై సలహాదారైన సర్తాజ్ అజీజ్‌తో సుష్మా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర చర్చలు జరపాలని ఇరు దేశాలూ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సమగ్ర ద్వైపాక్షిక చర్చల్లో శాంతిభద్రతలు, జమ్మూకశ్మీర్ అంశాలతో పాటు.. పరస్పర విశ్వాస నిర్మాణ చర్యలు, సియాచిన్, సర్ క్రీక్, ఉల్లార్ బారేజ్/తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్, ఆర్థిక-వాణిజ్య సహకారం, ఉగ్రవాదంపై పోరాటం, మాదకద్రవ్యాల నియంత్రణ, మానవీయ అంశాలు, ఆధ్యాత్మిక పర్యటన తదితర అంశాలు.
వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశం చైనా
 ప్రపంచంలోనే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశంగా చైనా నిలిచింది. ఆ దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 212 మిలియన్ల(21.2 కోట్లు)కు చేరుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్, మరో మూడు సంస్థలు కలసి నవంబర్ 29న ఈ నివేదికను విడుదల చేశాయి.
బ్రిక్స్ మీడియా శిఖరాగ్ర సమావేశం
ఐదు బ్రిక్స్ దేశాలకు చెందిన 25 మీడియా సంస్థలు పాల్గొన్న తొలి ‘బ్రిక్స్ మీడియా శిఖరాగ్ర సమావేశం’ డిసెంబర్ 1న చైనా రాజధాని బీజింగ్‌లో ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదం, వాతావరణ మార్పుపై పోరాటం చేయాలని మీడియా సంస్థల అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రిక్స్ కూటమికి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల్లో మీడియా ప్రయోజనాలను మెరుగుపరచడంతో పాటు సంస్థాగత వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

No comments:
Post a Comment