AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

జాతీయం 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

జాతీయం 2016 సంవత్సరం 

జనవరి 2016 జాతీయం
20 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించిన కేంద్రం
20 స్మార్ట్ సిటీల జాబితా (ఆకర్షణీయ నగరాలు)ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జనవరి 28న ప్రకటించారు. తొలి విడత జాబితాలో ఏపీ నుంచి విశాఖపట్నం, కాకినాడలకు చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ పథకం కింద ఎంపిక చేసిన నగరాల్లో ఏటా రూ.200 కోట్లతో ఐదేళ్ల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణం, స్వీయ ఆర్థిక సామర్థ్యం, సంస్కరణల అమలు వంటి అంశాలకు 100 పాయింట్లు కేటాయించి నగరాల ఎంపిక చేపట్టింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలకు తొలి విడత జాబితాలో చోటు దక్కలేదు. 
తొలిజాబితాలో ఉన్న నగరాలు
భువనేశ్వర్ (ఒడిశా), పుణే, సోలాపూర్ (మహారాష్ట్ర), జైపూర్, ఉదయపూర్ (రాజస్థాన్), అహ్మదాబాద్, సూరత్ (గుజరాత్), కొచ్చి( కేరళ), జబల్‌పూర్, ఇండోర్, భోపాల్ (మధ్యప్రదేశ్), విశాఖపట్నం, కాకినాడ (ఏపీ), దావణగెరే, బెల్గావి (కర్నాటక), న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, కోయంబత్తూర్, చెన్నై (తమిళనాడు), గువాహతి (అసోం), లూథియానా (పంజాబ్)

రాష్ట్రపతి పుస్తకం ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-96’ ఆవిష్కరణ
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన అనుభవాలతో రాసిన రెండో పుస్తకం ‘ద టర్బులెంట్ ఇయర్స్ 1980-1996’ (కల్లోల సంవత్సరాలు) పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ జనవరి 28న ఢిల్లీలో ఆవిష్కరించారు. రాష్ట్రపతి పాలన విధింపు అనేది దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుందని.. అయితే కొన్నేళ్లలో చేసిన విధానపరమైన మార్పులు ఆ అవకాశాన్ని కొంతమేర తగ్గించాయని ప్రణబ్ పుస్తకంలో పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాన్ని రద్దుచేసే శక్తిని రాజ్యాంగంలోని 356వ అధికరణ కేంద్రానికి కల్పిస్తోందని.. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ శక్తిని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో ఈ అధికరణపై తీవ్ర విమర్శలు వచ్చాయని ప్రణబ్ తన పుస్తకంలో ఉటంకించారు.

నేతాజీకి సంబంధించిన ఫైళ్లు విడుదల
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి 100 ఫైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 23న న్యూఢిల్లీలో బహిర్గతం చేశారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ఈ ఫైళ్లను బయటపెట్టారు. ఇకపై ప్రతి నెల నేషనల్ అర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏఐ) ప్రత్యేక వెబ్‌సైట్‌లో 25 ఫైళ్లను ఉంచుతారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రెండు కమిషన్లు 1945, ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని వెల్లడించాయి. అయితే ఎం.కె.ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ.. విమాన ప్రమాదం తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారని పేర్కొంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జనవరి 24న నిర్ణయించింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొనటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కేబినెట్ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ర్టపతి జనవరి 26న ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి నబమ్ టుకీ (కాంగ్రెస్)పై 21 మంది అసంతృప్తి ఎంఎల్‌ఏలు డిసెంబరు 16న తిరుగుబాటు చేయటంతో సంక్షోభం మొదలైంది.

కొత్త విద్యుత్ టారిఫ్ విధానానికి కేబినెట్ ఆమోదం
జాతీయ విద్యుత్ టారిఫ్ విధానంలో అనేక సవరణలకు కేంద్ర కేబినెట్ జనవరి 20న ఆమోదం తెలిపింది. పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహించటంతోపాటు ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సవరణలు చేపట్టింది. విద్యుత్ ఉత్పత్తి వ్యయంపై ప్రభావితం చూపే పన్నులు, సుంకాలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు అనుమతిచ్చింది. 

ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ఆహారచట్టం అమలు
తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2016 ఏప్రిల్ నుంచి జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తాయని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ జనవరి 21న ప్రకటించారు. ప్రస్తుతానికి 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చామని, మిగతా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేస్తాయని చెప్పారు. ఆహారభద్రత చట్టాన్ని 2013లోనే ఆమోదించారు. ఏడాదిలోగా దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. అప్పటి నుంచి ఈ గడువును మూడుసార్లు పొడిగించారు. ఈ చట్టం ప్రకారం భారత జనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలకు ప్రతి నెలా కిలోకు రూ.1-3 చొప్పున ఐదు కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారు. గుజరాత్, జమ్మూకశ్మీర్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, మిజోరామ్, దాదర్ అండ్ నగర్ హవేలీ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు.

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాండ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు.. మునుపెన్నడూ లేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోలాండ్ సైనిక వందనాన్ని స్వీకరించారు. త్రివిధ దళాలతో పాటు బీఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ పటాలాలు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా పటాలం, ఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్ తదితర పారా మిలటరీ, సాయుధ బలగాలతో పాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ పటాలాలు కవాతులో పాల్గొన్నాయి. ఫ్రాన్స్ సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొంది. ఒక విదేశీ సైనిక దళం భారత గణతంత్ర పరేడ్‌లో పాల్గొనటం ఇదే తొలిసారి. అలాగే 26 ఏళ్ల తరవాత సైనిక జాగిలాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. మొత్తం 36 జాగిలాలు సైనికులతో కలసి కవాతు నిర్వహించాయి. విభిన్న చారిత్రక, నిర్మాణ కళానైపుణ్య, సాంస్కృతిక వారసత్వ సంపదలను ప్రతిబింబిస్తూ.. 17 రాష్ట్రాల నుంచి, ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈసారి రిపబ్లిక్‌డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా రిటైర్డు మిలటరీ సైనికుల శకటాన్ని ప్రదర్శించారు. 

అవినీతి దేశాల్లో 76వ స్థానంలో భారత్
ప్రపంచ వ్యాప్త దేశాల్లో అవినీతిలో భారత్ 76వ స్థానంలో ఉందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్ కరెప్షన్ పర్సెప్షన్’ 2015లో అవినీతిపై తన నివేదికను జనవరి 27న విడుదల చేసింది. అవినీతి రాజ్యాల నివేదికలో 38 పాయింట్లతో భారత్ 76వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఈ నివేదికలో మన దేశం 85వ స్థానంలో ఉంది. డెన్మార్క్ అతి తక్కువ అవినీతితో 91 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం దేశాలు అవినీతితో ఇబ్బందులు పడుతున్నాయి. వీటిలో జీ20 దేశాలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా, సోమాలియా దేశాలు 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి. యూఎస్, ఆస్ట్రేలియాలు.. 76 పాయింట్లతో 16వ స్థానం, యూకే.. 81 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాయి.

గ్యాంగ్‌టక్‌లో రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు
రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు జనవరి 18న సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగింది.‘ సమ్మిళిత వ్యవసాయం, రైతుల సంక్షేమం’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సిక్కింను దేశంలోని తొలి సంపూర్ణ సేంద్రీయ రాష్ర్టంగా ప్రకటించి, సిక్కిం ముఖ్యమంత్రి చామ్లింగోకు ఆర్గానిక్ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొన్నారు.

స్టార్టప్‌లకు రాయితీలు ప్రకటించిన ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జనవరి 16న న్యూఢి ల్లీలో ఆరంభ కంపెనీల (స్టార్టప్)కు పలు రాయితీలు ప్రకటించారు. స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా 19 అంశాల కార్యాచరణను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఇందులో భాగంగా స్టార్టప్‌లకు మూడేళ్లపాటు ట్యాక్స్‌హాలిడే, లాభాలపై చెల్లించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు, రూ.10,000 కోట్లతో మూలధన నిధి ఏర్పాటు వంటి అంశాలున్నాయి. వీటితో పాటు తొమ్మిది రకాల కార్మిక, పర్యావరణ చట్టాలకు సంబంధించి స్టార్టప్ ఔత్సాహికులకు స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తొలి మూడేళ్ల పాటు తనిఖీలు లేకపోవటం, సులభమైన పేటెంట్ విధానం, పేటెంట్ ఫీజులో 80 శాతం తగ్గింపు వంటి పోత్సాహకాలను స్టార్టప్ ఇండియా పోగ్రామ్ ద్వారా ప్రకటించారు.

ఎల్‌డీసీ, యూడీసీల స్థానంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు
లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)ల స్థానంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 13న నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు సాంకేతిక నైపుణ్యం కలిగి బహుళ పనులను నిర్వహించే వారుగా ఉంటారు. కేంద్ర సచివాలయ సర్వీసు (సీఎస్‌ఎస్), కేంద్ర సచివాలయ స్టెనోగ్రాఫర్ సర్వీసు (సీఎస్‌ఎస్‌ఎస్)లలో ఇకపై నియామకాలు ఉండవు. అయితే ఈ సర్వీసులు కొంత కాలం కొనసాగనున్నాయి. రానున్న 20-25 ఏళ్లలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ విద్యలో ఏడాది డిప్లొమా కోర్సు చేసుండాలి.

తమిళనాడులో ‘అమ్మ కాల్‌సెంటర్’
ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వం ‘అమ్మ కాల్‌సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత జనవరి 19న 1100 టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కాల్‌సెంటర్ 24 గంటలు, 365 రోజులూ పనిచేస్తుంది. ప్రజా ఫిర్యాదుల కోసం ఇప్పటికే సీఎం స్పెషల్ సెల్ ఉన్నప్పటికీ, ఫిర్యాదులు సత్వర పరిష్కారం కోసం ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇప్పటికే అమ్మ పేరుతో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఫార్మసీ, అమ్మ సిమెంట్ పేరిట పలు పథకాలు ఉన్నాయి.

జమ్ము కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ మృతి
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ (79) జనవరి 7న న్యూఢిల్లీలో అనారోగ్యంతో మరణించారు. ఆయన తొలిసారి 1962లో శాసనసభకు ఎన్నికై సహాయ మంత్రిగా పనిచేశారు. 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక, పౌరవిమానయాన మంత్రిగా,1989లో వి.పి.సింగ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా సేవలందించారు. ముఫ్తీ మొహమ్మద్ 1999 లో జమ్ము కశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. 2002లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జమ్ము కశ్మీర్ సీఎంగా ఎన్నికై మూడేళ్లు పదవిలో కొనసాగారు. 2015లో బీజేపీ మద్దతుతో తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన తొలి ముస్లిం నేతగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నిలిచారు. ముఫ్తీ మరణంతో ఈ నెల 8 నుంచి కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. 

జల్లిక ట్టుపై నిషేధం తొలగించిన కేంద్రం
తమిళనాడులో సంక్రాంతి పండుగ మరుసటి రోజు జరుపుకొనే ఎద్దుల క్రీడ జల్లికట్టుకు కేంద్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారంటూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం జల్లికట్టుపై నిషేధం విధించింది. 2014లో సుప్రీంకోర్టు కూడా నిషేధ ఉత్తర్వును సమర్థించింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో జరుపుకొనే ఎండ్ల పందాలకు అనుమతి మంజూరు చేసింది. దీంతో జంతు ప్రేమికులు, హక్కుల సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.

‘శత్రు ఆస్తి’ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
నలభై ఏడు సంవత్సరాలనాటి శత్రు ఆస్తి చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 8న ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం శత్రు ఆస్తి ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉందో అలాగే కొనసాగుతుంది. అంటే 1965, 1971 యుద్ధాల తర్వాత పాక్ పౌరసత్వాన్ని స్వీకరించిన ఎవరి పేరు మీద కూడా ఆ ఆస్తులను బదలాయించడానికి వీల్లేదు. భారత్-పాక్ మధ్య 1965, 1971లో జరిగిన యుద్ధాల తర్వాత ఇరుదేశాల మధ్య పౌరులు వలస వెళ్లారు. కొందరు పాక్ నుంచి భారత్‌కు రాగా, మరికొందరు ఇక్కడ్నుంచి పాక్‌కు వెళ్లారు. అలా పొరుగు దేశానికి వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరించిన వారి ఆస్తులు, కంపెనీలను భారత రక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1968లో కేంద్రం శత్రు ఆస్తి చట్టానికి రూపకల్పన చేసింది. చట్ట ప్రకారం ఆ ఆస్తి ఎవరికి చెందుతుందో తేలేదాకా.. ఆ ఆస్తి కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటుందని అందులో పేర్కొన్నారు. అయితే అసలు ఆస్తి బదలాయింపులకే వీల్లేకుండా, ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం అధీనంలోనే యథాతథంగా కొనసాగేందుకు వీలుగా 2010లో అప్పటి యూపీఏ సర్కారు.. 1968నాటి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.

మైసూర్‌లో 103వ సైన్స్ కాంగ్రెస్
 103వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 3న మైసూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధనల సమయంలో ఐదు ‘ఇ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ)లను గుర్తుంచుకోవాలని సూచించారు. ‘భారత్‌లో దేశీయ అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఐదు రోజుల ఈ సదస్సులో దేశంలోని 500 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి 
పఠాన్‌కోట్ (పంజాబ్)లోని భారత వాయుసేన స్థావరంపై జనవరి 2న ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వైమానిక స్థావరంలో ఉన్న మిగ్ 21 ఫైటర్ విమానాలు, ఎంఐ 25 యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేసే ఉద్దేశంతో బలమైన ఆయుధ సంపత్తితో దాడికి దిగారు. ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు జవాన్లు, ఒక లెఫ్టినెంట్ కల్నల్ మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ‘గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థావరంలోని సిబ్బందిని, ఆస్తులను, నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేసి ఎయిర్‌బేస్ భద్రంగా ఉందని నిర్దారించుకునే వరకు అపరేషన్ కొనసాగిస్తాం’ అని ఎన్‌ఎస్‌జీ ఐజీ మేజర్ జనరల్ దుషాంత్ సింగ్ జనవరి 4న పఠాన్‌కోట్‌లో విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో భూకంపం
దేశంలోని ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో జనవరి 4న భూకంపం సంభవించింది. భూకంపం వల్ల 9 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఐదుగురు మరణించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంప ప్రభావంతో అస్సాం, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లో పలు చోట్ల భూమి కంపించింది. మణిపూర్‌లోని తమెంగ్ లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం నమోదైంది. 

సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగల్ కమిటీ
కొద్ది కాలంగా విమర్శల పాలవుతున్న సెన్సార్ బోర్డును సంస్కరించేందుకు ప్రసిద్ధ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, సినీ విమర్శకురాలు భావన సోమయ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్ ఎండీ నైనా లత్ గుప్తా, సంయుక్త కార్యదర్శి(సినిమాలు) సంజయ్ మూర్తి, ప్రకటనా రంగంలో పనిచేసే పియూష్ పాండే కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ పలు సూచనలతో రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది. 

ఆరు కీలక చట్టాలకు రాష్ర్టపతి ఆమోదం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు కీలక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఇందులో భారీ వ్యాపార వివాదాలను పరిష్కరించేందుకు హైకోర్టులకు వీలు కల్పించే చట్టం ముఖ్యమైంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టానికి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ సవరణ చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే సవరణ చట్టం, ద కమర్షియల్ కోర్ట్స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అప్పీలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్స్ యాక్ట్, అణుశక్తి సవరణ చట్టం, ద పేమెంట్ అండ్ బోనస్ సవరణ చట్టం, జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జువనైల్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇకపై అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన 16 నుంచి 18 ఏళ్ల మధ్య మైనర్లను వయోజనులకు ఉద్దేశించిన చట్టాల ప్రకారమే విచారిస్తారు. దోషిగా తేలితే పెద్దల చట్టాల ప్రకారమే శిక్షలు విధిస్తారు.

పారామిలటరీ దళాల్లో మహిళలకు 33% రిజర్వేషన్
పారామిలటరీ దళాలైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)ల్లో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో ఇకపై మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాగే, సరిహద్దుల రక్షణ బాధ్యతలు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ల్లోని కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 15% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం లభించిందని జనవరి 5న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దళాల్లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది సాయుధ సైనికులు ఉండగా, వారిలో 20 వేల మంది మాత్రమే మహిళలు. ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో 6300 మంది మహిళలే ఉన్నారు.

వ్యర్థ జలాల శుద్ధికి ప్రత్యేక వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే కార్యక్రమంలో భాగంగా వ్యర్థ జలాల శుద్ధికి పీపీపీ(ప్రభుత్వ-ప్రైవేటు భాగసామ్య పద్ధతి) ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కానుంది. సంబంధిత ప్రతిపాదనకు జనవరి 6న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దేశంలో వ్యర్థ జలాల నిర్వహణ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థ కృషి చేయనుంది. దీనికింద ఏర్పాటు చేయబోయే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)... శుద్ధి చేసిన జలాలకు మార్కెటింగ్ వసతి కల్పించే బాధ్యతలను కూడా పర్యవేక్షించనుంది. కంపెనీల చట్టం-2013 ప్రకారం ఏర్పాటు చేయబోయే ఈ ఎస్‌పీవీ స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల నుంచి యూజర్ చార్జీల వసూలు వంటివి ఒప్పందంలో భాగంగా ఉంటాయి.

మూడు హెచ్‌ఎంటీ యూనిట్ల మూసివేత
ప్రభుత్వ రంగ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు చెందిన మూడు నష్టజాతక యూనిట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. 2007 వేతనస్కేళ్ల ప్రకారం సంబంధిత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)ను అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసివేతకు ప్రతిపాదించిన యూనిట్లలో హెచ్‌ఎంటీ వాచెస్, హెచ్‌ఎంటీ చినార్ వాచెస్, హెచ్‌ఎంటీ బేరింగ్స్ ఉన్నాయి. ఈ మూడూ హెచ్‌ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఈ మూడింటికీ రూ.427.48 కోట్ల నగదు సాయాన్ని అందించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు వారికి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన బకాయిలతో పాటు ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్/వీఎస్‌ఎస్‌ను కల్పించడం ద్వారా హెచ్‌ఎంటీ నుంచి విడదీసి ఆ తర్వాత మూడు యూనిట్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2016 జాతీయం
2016-17 కేంద్ర బడ్జెట్
2016-17 కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న పార్లమెంటుకు సమర్పించారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో భారత వృద్ధి 7.6 శాతంగా ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా ఆరోగ్యం, నైపుణ్యాల పెంపు, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో సమ ప్రాధాన్యం కల్పించారు. ఆదాయపన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ముఖ్యాంశాలు:
మొత్తం వ్యయం:రూ.19,78,060 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ.5,50,010 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ.14,28,050 కోట్లు
ద్రవ్యలోటు: 3.5 శాతం
రెవెన్యూ లోటు: 2.5 శాతం

2016-17 రైల్వే బడ్జెట్
రూ.1.21 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయ ప్రతిపాదనలతో రైల్వే బడ్జెట్ 2016-17ను రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఫిబ్రవరి 25న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మొత్తం రవాణా వసూళ్లు రూ. 1,84,819.84 కోట్లలో సరుకు రవాణా ఆదాయాన్ని రూ.1,17,933 కోట్లు, ప్రయాణికుల ద్వారా పొందే ఆదాయాన్ని రూ.51,012 కోట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు, సరుకు రవాణా చార్జీలను యథతథంగా కొనసాగించటం, 2020 నాటికి డిమాండుకు అనుగుణంగా రిజర్వేషన్ సదుపాయం, సరుకు రవాణా రైళ్ల వేగాన్ని గంటకు 50 కి.మీ, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని గంటకు 80 కి.మీలకు పెంచటంతో పాటు కొత్తగా మరో మూడు రకాల వేగవంతమైన రైళ్లను బడ్జెట్‌లో ప్రకటించారు.

ఎన్నికల చట్టంలో సవరణకు లోక్‌సభ ఆమోదం
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ మేరకు ఎన్నికల చట్టం(సవరణ) బిల్లు, 2016ను న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2002 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11, 1950 ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలోని 300 గ్రామీణ విభాగాలకు ఆర్థిక సాయం, వసతులు కల్పిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర లోక్‌సభలో చెప్పారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకంలో భాగంగా మొదటి దశలో 100 విభాగాల్ని అభివృద్ధి చేస్తామన్నారు.

‘అబ్దుల్ కలాం పార్టీ’ ఆవిర్భావం
మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాంకు సలహాదారు అయిన పొన్‌రాజ్ ఫిబ్రవరి 28న ‘అబ్దుల్‌కలాం విజన్ ఇండియా పార్టీ(వీఐపీ)’ని స్థాపించారు. రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరిగిన చోట పార్టీ బోర్డును ఆవిష్కరించారు. పార్టీ ఏర్పాటుపై కలాం బంధువుల మద్దతు తెలపలేదు. అవినీతి వ్యతిరేక పోరాటమే ఎజెండాగా పార్టీని స్థాపించినట్లు పొన్‌రాజ్ తెలిపారు.

గురుత్వాకర్షణ తరంగాల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు ఏర్పాటు చేయనున్న లిగో (లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 17న ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన లిగో ప్రయోగశాల సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా

శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రారంభం
శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని డొంగర్‌గఢ్ బ్లాక్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 300 గ్రామాలను పట్టణ వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. తొలి ఏడాది 100 కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. దీని కోసం రానున్న మూడేళ్లలో రూ.5000 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నారు. పురా పథకం స్థానంలో కేంద్రం కొత్తగా రూర్బన్ మిషన్‌ను ప్రవేశపెట్టింది.

207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలి
జాతీయ భావన పెంచేందుకు దేశంలోని 46 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీల వీసీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతోంది. అయితే.. అన్ని చోట్లా దీని ఎత్తు సమానంగా ఉండాలని నిర్ణయించారు. 2012 యూజీసీ చట్టం (వర్సిటీల్లో సమానత్వ భావన పెంచటం, ఎస్సీ, ఎస్టీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటం) అమలుపై చర్చించారు.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి: ఐదుగురు జావాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఫిబ్రవరి 20న శ్రీనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలోని పాంపోర్‌లో శ్రీనగర్-జమ్మూ హైవేలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లను, ఒక పౌరుణ్ని బలితీసుకున్నారు. కాల్పుల తర్వాత మిలిటెంట్లు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఈడీఐ)లోకి చొరబడ్డారు. ఈ ఆపరేషన్లో ఫిబ్రవరి 21న మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జాట్‌ల రిజర్వేషన్‌పై కేంద్ర కమిటీ
ఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో.. వారి రిజర్వేషన్ల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కోరుతున్న జాట్‌ల డిమాండ్‌ను పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. వెంకయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఉపాధ్యక్షులు సత్పాల్ మాలిక్, అవినాశ్ రాయ్ ఖన్నా సభ్యులుగా ఉంటారు. నివేదికను కమిటీ ప్రభుత్వానికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేస్తుంది.

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన విజయకాంత్
తమిళనాడు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత అర్హతను డీఎండీకే అధినేత విజయకాంత్ కోల్పోయారు. ఆ పార్టీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఫిబ్రవరి 21న ప్రకటించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీచేసిన డీఎండీకే 29 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయ్‌కాంత్ ఎదిగారు. ఇప్పటివరకు డీఎండీకేకు 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్న 8 మంది ఎమ్యేల్యేలు ఫిబ్రవరి 21న తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాల్ని ఆమోదించిన స్పీకర్.. డీఎండీకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు ప్రకటించారు.

పాస్‌పోర్టుల జారీలో మూడో స్థానంలో భారత్
పాస్‌పోర్టుల జారీలో భారత్ మూడోస్థానంలో ఉందని విదేశీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, చీఫ్ పాస్‌పోర్టు అధికారి ముక్తేశ్ పరదేశీ ఫిబ్రవరి 22న పేర్కొన్నారు. మొదటి రెండు స్థానాల్లో చైనా, యూఎస్‌లు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కంటే 2010 నుంచి రెట్టింపు స్థాయిలో పాస్‌పోర్టు జారీ చేసినట్లు చెప్పారు. ఐదేళ్ల క్రితం సంవత్సరానికి 60 లక్షల పాస్‌పోర్టులు అందజేయగా, ప్రస్తుతం 1.2 కోట్ల మందికి జారీ చేస్తున్నట్లు ముక్తేశ్ వివరించారు. 

వాయు కాలుష్యంలో చైనాను దాటిన భారత్
వాయుకాలుష్యంలో భారత్ చైనాను దాటిపోయిందని గ్రీన్‌పీస్ ఇండియా వెల్లడించింది. 21వ శతాబ్దంలో మొదటిసారిగా 2015 సంవత్సరంలో వాయుకాలుష్యం స్థాయి చైనా కంటే భారత్‌లో ఎక్కువగా నమోదైందని గ్రీన్‌పీస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం అందించిన సమాచారం ప్రకారం భారత్‌లో కాలుష్యం పెరిగినట్లు వెల్లడించింది. అత్యధిక కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని గ్రీన్‌పీస్ పేర్కొంది.

ముంబైలో మేక్ ఇన్ ఇండియా వీక్
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న ముంబైలో ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ను ప్రారంభించారు. భారత తయారీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శక, స్థిరమైన పన్ను విధానాల అమలు, లెసైన్సుల విధానాల సరళతరం, మేధో హక్కుల పరిరక్షణ లాంటి సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో పెట్టుబడులకు ఇది సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో స్వీడన్ ప్రధాని క్యెల్ స్టెఫాన్ లోఫెన్, ఫిన్లాండ్ ప్రధాని జహా పెట్రి సిపిలా పాల్గొన్నారు. సుమారు 2,500 పైగా విదేశీ, 8,000 దేశీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 72 దేశాల నుంచి వ్యాపార బృందాలు కూడా పాల్గొన్నాయి.

పరిశుభ్ర నగరాల జాబితా..
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2016 జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 15న విడుదల చేశారు. భారత నాణ్యతా మండలి దేశవ్యాప్తంగా 73 నగరాల్లో పరిశుభ్రతపై సర్వే నిర్వహించింది. ఇందులో మైసూరు మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా మొదటి స్థానం ఈ నగరానికే దక్కింది. చండీగఢ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో తిరుచిరాపల్లి, నాలుగో స్థానంలో ఢిల్లీ ఉన్నాయి. ఈ జాబితాలో విశాఖపట్నం 5, హైదరాబాద్ 19, విజయవాడ 23, వరంగల్ 32 స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో ధన్‌బాద్ ఉంది. 

47వ గవర్నర్ల సదస్సు
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 9, 10న రెండు రోజుల పాటు 47వ గవర్నర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్యాంగాన్ని పరిరక్షించే అత్యంత క్లిష్టమైన బాధ్యత గవర్నర్లపై ఉందని అన్నారు. రాజ్యాంగంలోని అత్యున్నత ఆశయాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని, రాజ్యాంగ పవిత్రతను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. గవర్నర్లు రాష్ట్రాల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి తోడ్పడాలని, దేశంలోని సహకార వ్యవస్థను ఆరోగ్యకరమైన పోటీదాయక సమాఖ్య వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కశ్మీర్‌లో 18 కి.మీ. సొరంగ మార్గ నిర్మాణానికి ప్రతిపాదన
కశ్మీర్‌లోని గురెజ్ కేంద్రంగా ఒక పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) కేంద్రానికి సమర్పించింది. దీనికి అవసరమయ్యే వ్యయం రూ. 9,000 కోట్లుగా అంచనా. బండిపొర జిల్లాలో ఉన్న గురెజ్‌లో శీతాకాలంలో కురిసే అత్యధిక మంచు కారణంగా మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించి ఏడాది పొడవునా గురెజ్ లోయలోని మిగిలిన ప్రాంతాలన్నీ సంబంధాలు కలిగి ఉండేలా చేయాలన్నదే ఈ నిర్మాణం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ సొరంగ రోడ్డు మార్గం పొడవు 18 కి.మీ. కేంద్రం నుంచి దీనికి అనుమతి లభిస్తే దేశంలోనే పొడవైన సొరంగ రోడ్డు మార్గంగా ఇది రికార్డులకెక్కుతుంది. 

తమిళనాడులో 42 మంది నేతలపై ఈసీ వేటు
తమిళనాడులోని వివిధ పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులపై ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలు సక్రమంగా చూపని వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2011 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 10 మంది అభ్యర్థులు, 2014 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 32 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు సక్రమంగా చూపలేదని పేర్కొంటూ మొత్తం 42 మందిపై నిషేధం విధించింది. ఈ 42 మంది మరో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ఫిబ్రవరి 15న ప్రకటించారు.

రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన సమీక్ష
రిజర్వ్ బ్యాంకు ఫిబ్రవరి 2న ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్వహించింది. ఇందులో పాలసీ రేట్ల మార్పులు చేయలేదు. రెపో రేటు 6.75 శాతం, రివర్‌‌స రెపో రేట్ 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగించారు. 2015-16లో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి.) వృద్ధి రేటు గతంలో అంచనా వేసినవిధంగా 7.4 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. 2016-17లో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సమావేశం
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల 18వ జాతీయ సమావేశం ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దీపక్ గుప్తా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, 26 రాష్ట్రాలకు చెందిన సర్వీసు కమిషన్ల చైర్‌పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కంప్యూటర్ బేస్‌డ్ టెస్టుల (సీబీటీ) నిర్వహణతో నియామక కాలం భారీగా తగ్గుతుందని భవిష్యత్తులో ఈ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని వక్తలు పేర్కొన్నారు. నియామకాల్లో పారదర్శకతపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం దృష్టి సారించింది.

పారాదీప్ రిఫైనరీ జాతికి అంకితం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒడిశాలోని పారాదీప్‌లో నిర్మించిన చమురు శుద్ధి కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఫిబ్రవరి 7న జాతికి అంకితం చేశారు. దీనికి 2000 మేలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు. రూ. 34,555 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ కేంద్ర సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. ప్రస్తుతం ముడి చమురు అవసరాల్లో 79 శాతం దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈ దిగుమతులను 2022 నాటికి 10 శాతానికి తగ్గించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

సియాచిన్ ప్రమాదంలో 10 మంది జవాన్ల మృతి
సియాచిన్ గ్లేసియర్‌లో ఉన్న భారత సైనిక స్థావరంపై మంచు చరియలు విరిగి పడటంతో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఫిబ్రవరి 3న మంచు చరియలు విరిగిపడ్డాయి. 19 వేల అడుగుల ఎత్తయిన ఆ ప్రాంతంలో మంచు చరియల కింద పది మంది జవాన్లు కూరుకుపోయారు. గాలింపు చేపట్టిన సైన్యం ఫిబ్రవరి 9వ తేదీ నాటికి పది మందిని వెలికి తీసింది. వీరిలో 9 మంది వీర మరణం పొందగా.. లాన్స్ నాయక్ హనుమంతప్ప సజీవంగా బయటపడ్డారు. అప్పటి అపస్మారక స్థితిలో ఉన్న ఆయన ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న తుదిశ్వాస విడిచారు.
లడఖ్‌లో సుమారు 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు, చైనా ఆక్రమిత కశ్మీర్‌కు మధ్య ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. భారత సైన్యం పాకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకోవడానికి 1984లో ‘ఆపరేషన్ మేఘదూత్’ చేపట్టింది. నాటి నుంచి ఇక్కడ ఇరు దేశాల సైనిక మోహరింపులు కొనసాగుతున్నాయి. ఇక్కడ - 25°C నుంచి - 45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శీతాకాలంలో సగటున 1000 సెం.మీ. మంచు కురుస్తుంది. 

విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన
11వ అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - ఐఎఫ్‌ఆర్) ఫిబ్రవరి 4న విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఐఎఫ్‌ఆర్ విలేజ్, ప్రదర్శనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ ప్రారంభించారు. ఈ ఐఎఫ్‌ఆర్‌ను తొలిసారిగా దేశ తూర్పు తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 దేశాలు పాలుపంచుకున్నాయి. త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 6న యుద్ధనౌకల సమీక్ష నిర్వహించారు. ఐఎన్‌ఎస్ సుమిత్రలో ఆయన నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ప్రదర్శనలో ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, విక్రమాదిత్య, విరాట్, శివాలిక్, మైసూర్ మొదలైన యుద్ధనౌకలతో పాటు సింధురాజ్, సింధుకారి, సింధువీర్ జలాంతర్గాములు కూడా పాల్గొన్నాయి. భారత్‌కు చెందిన 65 యుద్ధనౌకలతో పాటు 24 దేశాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల నౌకాదళాలు సమష్టిగా పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశాల మధ్య శాంతి, సుహృద్భావాన్ని పెంపొందించడానికి సముద్ర జలాలను సాధనంగా చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఫిబ్రవరి 7న భారత నౌకాదళం సాహస విన్యాసాలు ప్రదర్శించింది. వివిధ దేశాల నౌకాదళాలు కవాతు, శకటాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ‘సముద్ర జలాలపై శాంతి, సుస్థిరత తీరప్రాంత దేశాల సమష్టి బాధ్యత’ అని పేర్కొన్నారు. ఈ బాధ్యతను తీరప్రాంత దేశాలన్నీ స్వీకరించాలని కోరారు.

భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు
భారత్-చైనా దేశాలు లడఖ్‌లో వ్యూహాత్మకంగా సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. వీటికి ‘సినో-ఇండియా కో-ఆపరేషన్ 2016’ అని పేరు పెట్టారు. చుసుల్-మొల్డో ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దు భద్రతాదళాలు సంయుక్తంగా విన్యాసాలను చేపట్టాయి. ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య విశ్వాసాన్ని పంచి సరిహద్లుల్లో శాంతి సుస్థిరతను కాపాడే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు

దేశంలోనే తొలి ద్విచక్ర అంబులెన్స్‌లు ప్రారంభం
అంబులెన్స్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు తెరతీస్తు ద్విచక్ర వాహనాలతో మోటార్ సైకిల్, స్కూటర్ అంబులెన్స్‌లను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫిబ్రవరి 8న ప్రారంభించారు. సాధారణ అంబులెన్స్‌లు ట్రాఫిక్ రద్దీని ఛేదించుకుని సంఘటన స్థలానికి వెళ్లడం కష్టసాధ్యం కావ డంతో ద్విచక్ర వాహనాల ద్వారా వేగంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేయగల శిక్షణ ఇచ్చి పది నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకునేలా తీర్చిదిద్దారు. దీనిని ప్రయోగాత్మకంగా చెన్నైలో ప్రారంభించారు.

మోదీ ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.1.41 కోట్లు కాగా.. ఆయన చేతిలో ఉన్న నగదు కేవలం రూ.4,700. మోదీ 13 ఏళ్ల క్రితం కొన్న ఇంటి విలువ 25 రెట్లు పెరగడంతో ఆస్తుల విలువ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకున్న మోదీ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తాజాగా ప్రకటించింది. 2015 మార్చి 31 నాటికి ఆయన చేతిలో ఉన్న నగదు రూ. 4,700 అని, అంతకుముందు 2014 ఆగస్టు 18న ఆస్తులను ప్రకటించినప్పుడు ఆయన వద్ద రూ.38,700 ఉండిందని తెలిపింది. ఈ కాలంలో ఆయన మొత్తం స్థిర, చరాస్తులు రూ. 1,26,12,288 నుంచి రూ. 1,41,14,893కు పెరిగాయి. పీఎంఓ వివరాల ప్రకారం.. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పేరున ఎలాంటి వాహనం లేదు. ఆయన ఇప్పటికీ తన బ్యాంకు ఖాతాను గుజరాత్‌లోనే కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఏ బ్యాంకులోనూ ఖాతా లేదు.

ఉపాధి హామీ పథకానికి పదేళ్లు
దేశంలోని గ్రామీణ పేదలకు ఏటా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి 2తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించిన వేతనాలు రూ. 3,13,844 కోట్లు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్‌టీలు17శాతం, మహిళలు 57శాతానికి పెరుగుదల. కార్మికులకు లభించిన పనిదినాలు 1980కోట్లు. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పనులు 65 శాతం.

‘గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్’లో మోదీ ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 2న కోజికోడ్‌లో నిర్వహించిన ‘గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్’లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఏర్పాటైన ‘విజన్ కాంక్లేవ్’నుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయుర్వేదం వంటి భారత సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో రిజర్వేషన్ల అంశంపై ప్రధాని స్పష్టతనిచ్చారు. దళితులు, ఓబీసీలు, ఇతర అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను తొలగించే ఆలోచనే లేదని చెప్పారు.

రోహిత్ ఆత్మహత్యపై జస్టిస్ అశోక్‌కుమార్ కమిషన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, పరిస్థితులపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. యూనివర్సిటీలో విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన యంత్రాంగం పనితీరును కూడా ఈ ఏకసభ్య జ్యూడీషియల్ కమిషన్ సమీక్షిస్తుంది. మూడు నెలల్లోగా ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2016 జాతీయం
సొంతింటి కలకు చేయూత
‘2022 నాటికి ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు’ అమల్లో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మార్చి 23న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద మైదాన ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకి రూ. 1.20 లక్షలు, పర్వత, కఠిన ప్రాంతాల్లో నివసించే వారికి రూ.1.30 లక్షలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య విద్యుత్, బ్యాండ్‌విడ్త్ సరఫరా
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా, ఆ దేశం నుంచి భారత్‌కు 10 జీబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్టవిటీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 23న ప్రారంభించారు. తాజా బ్యాండ్‌విడ్త్ కనెక్టవిటీతో తూర్పు భారత్‌కు ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడింది. ఇప్పటికే దేశంలో పశ్చిమ, దక్షిణ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ గేట్‌వేలు ఉన్నాయి.

అణురియాక్టర్ల ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
మహారాష్ట్రలోని జైతాపూర్ వద్ద నిర్మించనున్న ఆరు అణురియాక్టర్లకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్ దేశాలు మార్చి 22న న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, వాణిజ్య సంప్రదింపులన్నీ పూర్తి చేయాలని ఇరు దేశాలు గతంలోనే నిర్ణయించుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా సంస్థ(ఈడీఎఫ్) అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం పర్యటనలో భాగంగా దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్చి 27న నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంబంధిత ప్రకటనపై మార్చి 27న సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. మార్చి 18న అధికార కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 26న వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. మార్చి 18న సభలో ప్రభుత్వానికి బలం లేకపోయినప్పటికీ వివాదాస్పద పరిస్థితుల్లో స్పీకర్ ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించారని, ఇలాంటి తరుణంలో రావత్ ప్రభుత్వాన్ని కొనసాగించడం అనైతికమని, రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్రం తెలిపింది.

పఠాన్‌కోట్ ఘటనపై భారత్‌కు పాక్ విచారణ బృందం
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి ఘటనను విచారించేందుకు పాకిస్తాన్ నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సంయుక్త విచారణ బృందం (జిట్) మార్చి 27న ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకుంది. దేశంలో ఉగ్రదాడి ఘటనలకు సంబంధించి విచారణ కోసం విదేశీ అధికారులు భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. పఠాన్‌కోట్ ఘటనపై మనదేశానికి చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) కూడా విచారణ చేస్తోంది. పాక్ విచారణ బృందంతో పాటు ఎన్‌ఐఏ అధికారులు కూడా మార్చి 29న పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనున్నారు. ఉగ్రవాద నిరోధక ప్రత్యేక విభాగం పంజాబ్ చీఫ్ మహమ్మద్ అజీమ్ అర్షద్ పాకిస్తాన్ విచారణ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.

డిఫెక్స్‌పో ఇండియా - 2016 ప్రదర్శన
దక్షిణ గోవాలోని క్యూపెమ్ తాలూకా నకేరి క్విటోల్‌లో 9వ ‘డిఫెక్స్‌పో ఇండియా - 2016’ ప్రదర్శన మార్చి 28న ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేళ్లకోమారు నిర్వహించే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పలురకాల రక్షణ పరికరాలను, ఆయుధాలను ప్రదర్శిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రగతి మైదాన్‌లో నూతన కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తుండడంతో ఈసారి గోవాలో ఏర్పాటు చేశారు. డిఫెక్స్‌పోను 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే దేశ, విదేశీ కంపెనీల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 2014 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో నిర్వహించిన 8వ డిఫెక్స్‌పోలో 32 దేశాలకు చెందిన 232 కంపెనీలు, 58 దేశాలకు చెందిన 63 ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ప్రదర్శనలో 47 దేశాలకు చెందిన 1,035 కంపెనీలు పాల్గొంటున్నాయి. అమెరికా, రష్యా, యునెటైడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఈజిప్ట్, ఫిన్‌లాండ్, ఫ్రాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్, స్వీడన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు వీటిలో ఉన్నాయి. ఆసియాలో జరిగే అతిపెద్ద రక్షణ రంగ ప్రదర్శన ఇదే.

జాట్ల రిజర్వేషన్‌కు హరియాణా అసెంబ్లీ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జాట్లు, మరో ఐదు కులాలకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు హరియాణా అసెంబ్లీ మార్చి 29న ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జాట్ కులంతో పాటు జాట్ సిక్కు, రోర్, బిష్ణోయి, త్యాగీ, ముల్లా జాట్/ముస్లిం జాట్ కులాలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. హరియాణా వెనకబడిన వర్గాల (ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్) బిల్లు-2016, హరియాణా వెనకబడిన వర్గాల కమిషన్ బిల్లు-2016ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బిల్లులో బీసీ బ్లాక్ ఏ, బీసీ బ్లాక్ బీ, బీసీ బ్లాక్ సీలకు చట్టపరమైన హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి ఆమోదం తెలిపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ (రెడ్‌విత్ ఆర్టికల్ 31బి)లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

మోదీ మూడు దేశాల పర్యటన
మూడు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 29వ తేదీ రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగే 13వ భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్‌కు వెళ్తారు. మార్చి 31, ఏప్రిల్ 1న అక్కడ జరిగే ‘అణు భద్రతా సదస్సు’లో పాల్గొంటారు. అనంతరం సౌదీ అరేబియాకు వెళ్తారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో సౌదీలో మోదీ పర్యటన సాగుతుంది. 

రైలు టిక్కెట్టు రద్దుకు ‘139’
ప్రయాణికులు రైలు టిక్కెట్టును రద్దు చేసుకోవడానికి భారతీయ రైల్వే శాఖ 139 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రైల్ టిక్కెట్టు రద్దుకు 139కి కాల్‌చేసి వివరాలు చెప్తే వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) పొందవచ్చు. అదే రోజు కౌంటర్ వద్ద ఓటీపీ వివరాలు చెప్పి టిక్కెట్టు డబ్బులు తిరిగి పొందవచ్చు.

కృషి ఉన్నతి మేళాకు శ్రీకారం
వరుస కరువులు.. వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రైతులు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో మార్చి 19న మూడు రోజుల కృషి ఉన్నతి మేళాను ప్రారంభించిన ఆయన నీటి పొదుపుతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిందిగా రైతులను కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 80 లక్షల హెక్టార్లకు సాగునీరందించే 90 సాగునీటి ప్రాజెక్టులను గుర్తించినట్లు ప్రధాని తెలిపారు.

పాలన, మెరుగైన జీవనంలో ముంబై, తిరువనంతపురం టాప్ 
దేశంలోని నగరాల్లో ముంబై, తిరువనంతపురం పాలన, మెరుగైన జీవనంలో ఉమ్మడిగా తొలిస్థానంలో నిలిచాయి. 21 నగరాల్లో సర్వేచేయగా చండీగఢ్, జైపూర్ అట్టడుగు స్థానాల్లో ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రణాళిక, డిజైన్, సామర్థ్యం, వనరులు, పారదర్శకత తదితర అంశాల ఆధారంగా జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్ షిప్ అండ్ డెమోక్రసీ సర్వే నిర్వహించింది. 0-10 రేటింగ్ స్కేల్‌పై తిరువనంతపురం, ముంబైలు 4.2 రేటింగ్‌ను సాధించాయి.

స్వచ్ఛ రైల్వేస్టేషన్లుగా సూరత్, రాజ్‌కోట్
దేశంలోని 10 పరిశుభ్ర రైల్వేస్టేషన్లలో గుజరాత్‌లోని సూరత్, రాజ్‌కోట్ రైల్వేస్టేషన్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అత్యంత పరిశుభ్రమైన రైల్వేస్టేషన్లను ఎంపిక చేయడం కోసం 16 రైల్వే జోన్లలోని 407 స్టేషన్లలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వే వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు మార్చి 17న వెల్లడించారు. 75 ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో సూరత్, రాజ్‌కోట్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వేస్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. సోలాపూర్, ముంబై సెంట్రల్, ఛండీగఢ్, భువనేశ్వర్, వడోదర రైల్వే స్టేషన్‌లు వరుసగా తరవాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయి, పుణే రైల్వే స్టేషన్‌లు దేశంలోనే అతిచెత్త రైల్వే స్టేషన్‌లుగా నిలిచాయి.

పోఖ్రాన్‌లో ‘ఐరన్ ఫిస్ట్-2016’ విన్యాసాలు
రాజస్థాన్ థార్ ఎడారిలోని పోఖ్రాన్ అణ్వస్త్ర ప్రయోగ భూమిలో మార్చి 18న భారత వైమానిక విన్యాసాలు జరిగాయి. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో ‘ఐరన్ ఫిస్ట్-2016’ పేరిట విన్యాసాలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 22 రకాల యుద్ధ వైమానిక వేదికల నుంచి ఆయుధ వ్యవస్థలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. గాలిలో నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే తేలికపాటి యుద్ధవిమానం తేజస్, భూమి నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే ఆకాశ్ క్షిపణిని ఇందులో ప్రదర్శించారు. ఫైటర్ జెట్‌లు సుఖోయ్-30, మిరేజ్-2000, మిగ్-27, జాగ్వర్‌లు ఆకాశంలో సందడి చేశాయి. రాత్రిపూట నిర్వహించిన ప్రదర్శనలో 180 యుద్ధవిమానాలు సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. విన్యాసాలను రాష్ట్రపతితో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీక్షించారు. ఎక్సర్‌సైజ్ ఐరన్ ఫిస్ట్‌ను 2013లో మొదటిసారి నిర్వహించారు.

క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్లు
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల కనీస మందాన్ని 50 మైక్రాన్లకు పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకన్నా తక్కువ మందం ఉన్న బ్యాగులను నిషేధించినట్లు మార్చి 18న ప్రకటించింది. పెళ్లిళ్లు, రాజకీయ పార్టీల ర్యాలీలు, మత కార్యక్రమాలు, ఇతర సామూహిక కార్యక్రమాలు జరిగిన వేదికల వద్ద పోగుబడిన ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేసే బాధ్యత ఆయా కార్యక్రమాల నిర్వాహకులదేనని ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016’లో స్పష్టం చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్, బయో మెడికల్, నిర్మాణం.. తదితర రంగాల్లోని వ్యర్థాల నిర్వహణ నిబంధనలనూ చేర్చారు. పల్లెల్లోనూ ఈ నిబంధనల పరిధిలోకి చేర్చారు.

ప్రభుత్వ ప్రకటనలపై ఆదేశాలు సవరించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలు కూడా వేసుకోవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రకటనలపై కేవలం ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని 2015 మే 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు సమాఖ్య వ్యవస్థకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంటూ.. వీటిని పునఃసమీక్షించాలని కేంద్రంతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, తదితర ఏడు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు పాత ఆదేశాలను సవరించింది. దీనిప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధానికి బదులుగా ఆయా శాఖల కేబినెట్ మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల ఫొటోలూ వేసుకోవచ్చు. అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి బదులుగా ఆయా శాఖల కేబినెట్ మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల ఫొటోలు వేసుకోవచ్చు. 

అంబేడ్కర్ స్మారకోపన్యాసం చేసిన మోదీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో అంబేద్కర్ స్మారకానికి మార్చి 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి అనంతరం స్మారకోపన్యాసం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని మోదీ స్పష్టం చేశారు. నల్లవారి హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్‌తో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను పోల్చారు. తాను ఇంతకుముందే చెప్పినట్లు సాక్షాత్తూ అంబేద్కరే వచ్చినా ఇప్పుడు దళితుల హక్కును లాగేసుకోలేరని మోదీ చెప్పారు. ఇప్పటిదాకా ఆరుసార్లు అంబేద్కర్ స్మారక ఉపన్యాసం నిర్వహిస్తే దేశ ప్రధాని ప్రసంగించడం ఇదే మొదటిసారి. 

సురక్షిత నీరందని వారు భారత్‌లోనే అధికం
ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేక అత్యధిక మంది ఇబ్బందులు పడుతున్నది భారత్‌లోనే అన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 7.6 కోట్ల మంది ప్రజలకు మంచినీరు అందుబాటులో లేదు. టాప్ 10 జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత చైనా, నైజీరియా ఉన్నాయని వాటర్‌ఎయిడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. పాక్ పదో స్థానంలో నిలిచింది. మంచి నీటి కోసం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొందని, నీటి వనరుల అస్తవ్యస్త నిర్వహణే దీనికి ప్రాథమిక కారణమని తేల్చింది. ప్రాజెక్టుల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడమో లేదా పైపులైన్లు లేకపోవడం వల్లనో ప్రజలకు నీరు అందడం లేదని పేర్కొంది. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది.

అటల్ పెన్షన్ యోజనకు సవరణలు
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మార్చి 22న ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా సవరణ ప్రకారం.. ఏపీవై చందాదారులెవరైనా మరణించినా వారి భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి) ఈ పెన్షన్ ఖాతాను కొనసాగించవచ్చు. నిర్ణీత గడువు పూర్తయ్యే వరకూ (చందాదారుడికి 60 ఏళ్లు పూర్తయి ఉండే సమయం వరకు) వారు చందా చెల్లిస్తే... వారికి జీవితాంతం నెలనెలా నిర్ధారిత పెన్షన్ మొత్తం అందుతుంది. భాగస్వామి కూడా మరణించాక వారి నామినీకి ఏకమొత్తంగా పెన్షన్ సొమ్మును చెల్లిస్తారు.

అడ్వాన్సింగ్ ఏషియాపై భారత్, ఐఎంఎఫ్ సదస్సు
భారత్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన అడ్వాన్సింగ్ ఏషియా-2016 సదస్సు మార్చి 12న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఐఎంఎఫ్‌లో కోటా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందన్నారు. ఈ సదస్సులో దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ, సాంకేతిక సహకార కేంద్రం (ఎస్‌ఎఆర్‌టీటీఏసీ) ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టీన్ లగార్డ్‌లు సంతకాలు చేశారు.

ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
ఆధార్ కార్యక్రమానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ మార్చి 11న ఆమోదం తెలిపింది. అర్హులైన లక్షిత వర్గాలకు సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వ సబ్సిడీలు, సేవలను అందించేందుకు ఆధార్ బిల్లు ద్వారా చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ ఆధార్ ఆధారంగా ఎల్పీజీ సబ్సిడీలను నేరుగా అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.15,000 కోట్లు ఆదా అయినట్లు తెలిపారు.

‘రియల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015’కు రాజ్యసభ మూజువాణి ఓటుతో మార్చి 10న ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో వినియోగదారుల డబ్బులో 70 శాతాన్ని చెక్కుల ద్వారా ప్రత్యేక ఎస్క్రూ అకౌంట్లో బ్యాంకుల్లో జమచేయడం, అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో విధానం, రాష్ర్టస్థాయిలో నియంత్రణ సంస్థల ఏర్పాటు వంటి కీలకాంశాలు ఉన్నాయి. 

నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
నిరుపేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లను అందించేందుకు ఉద్దేశించిన రూ.8 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈమేరకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’కు పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి కేటాయించిన రూ. 8 వేల కోట్ల నిధులను మూడేళ్లలో వినియోగిస్తారు. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న మహిళలకు యుద్ధప్రాతిపదికన గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం దీని ఉద్దేశం. ఒక్కో కనెక్షన్‌కు రూ. 1,600 ఆర్థిక సాయం లభిస్తుంది. దీనిపై 2016-17 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. ఈ ఏడాది 1.5 కోట్ల మందికి, మూడేళ్లలో మొత్తం 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్‌కనెక్షన్లు ఇస్తామన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఖాకీ నిక్కర్ స్థానంలో ప్యాంటు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఖాకీ నిక్కర్, తెల్లచొక్కా యూనిఫాంలో స్వల్ప మార్పలు చేస్తున్నట్లు ప్రకటించింది. 91 ఏళ్లుగా ట్రేడ్‌మార్క్‌గా ఉన్న ఖాకీ నిక్కర్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో గోధుమరంగు ప్యాంటును తెస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో మూడు రోజులపాటు జరిగిన మేధోమథన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ వెల్లడించారు. 1925లో ఆరంభమైన ఆరెస్సెస్ యూనిఫాంలో చిన్నచిన్న మార్పులు జరిగినప్పటికీ ఖాకీ నిక్కర్ ఇప్పటిదాకా మారలేదు.

ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని యమునా నది తీరంలో మూడురోజుల పాటు నిర్వహించిన ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం (World Culture Festival)’ మార్చి 13న ముగిసింది. మార్చి 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 155 దేశాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. రవిశంకర్‌కు ప్రపంచనేతల నుంచి ఆహ్వానాలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించాని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని తమ దేశంలో జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ కోరారు.

ఇండియన్ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఐదో ‘ఇండియన్ ఏవియేషన్ షో-2016’ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ దేశంలో పౌర విమానయాన వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. విమానయాన రంగంలో ప్రపంచంలో ప్రస్తుతమున్న 9వ స్థానం నుంచి 2020 నాటికి మూడో స్థానానికి ఎదిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. 2020 నాటికి దేశంలో విమానయానం చేసే ప్రయాణికుల సంఖ్య 42 కోట్లకు చేరుతుందన్నారు. 25 దేశాల నుంచి 200 మందికిపైగా ప్రతినిధులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.

4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగింది. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు 43 రోజుల్లో పలువిడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపును మే 19న చేపట్టనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో మే 16న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలో రెండు దశల్లో, వామపక్ష తీవ్రవాదం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఆరుదశల్లో పోలింగ్ జరగనుంది. 

సేతు భారత్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని
రోడ్డు భద్రతను పటిష్టపరిచే చర్యల్లో భాగంగా రూ.50,000 కోట్ల వ్యయంతో చేపట్టే సేతు భారత్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మార్చి 4న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద 2019 నాటికి జాతీయ రహదారుల్లో రైల్వే క్రాసింగ్స్ లేకుండా చేస్తారు. ఇందులో భాగంగా రూ.20,800 కోట్లతో 208 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్ అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. రూ.30,000 కోట్ల వ్యయంతో దశాబ్దాల కాలం నాటి 1500 వంతెనలను పునర్నిర్మిస్తారు.

చట్టసభల్లో గలమెత్తిన మహిళా ఎంపీలు
దేశ చరిత్రలోనే తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యానికి వేదికలుగా చెప్పుకునే లోక్‌సభ, రాజ్యసభలో కేవలం అతివలే తమ గొంతును వినిపించారు. మార్చి 8న ఉభయ సభల్లో కేవలం మహిళా ఎంపీలే చర్చలో పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు ఎంపీలు మహిళా సాధికారత కోసం రూపొందించాల్సిన చట్టాలు, అమలు చేయాల్సిన విధివిధానాల గురించి మాట్లాడారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లోనూ స్త్రీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కేవలం చట్టాల రూపకల్పనతో సరిపెట్టకుండా మహిళా సాధికారత కోసం ఓ భారీ పథకాన్ని ప్రకటించాలన్నారు.

ఇంధన భద్రతలో భారత్ ర్యాంకు 90
ఇంధన భద్రత, అందుబాటు ధరల్లో నిలకడగా సరఫరా అనే అంశాల ప్రాతిపదికన 126 దేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన జాబితాలో భారత్‌కు 90వ స్థానం దక్కింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి ర్యాంకు సాధించగా నార్వే, స్వీడన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్ 4, డెన్మార్క్ 5, ఆస్ట్రియా 6, స్పెయిన్ 7, కొలంబియా 8, న్యూజీలాండ్ 9, ఉరుగ్వే 10వ ర్యాంకుల్లో ఉన్నాయి. ఇంధనాన్ని అందుబాటు ధరల్లో అందించడం, పర్యావరణపరంగా ఆచరణీయత, భద్రత అనే మూడు అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. రష్యా 52, చైనా 94వ స్థానాల్లో నిలిచాయి.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2016 జాతీయం
సివిల్స్ సర్వీసెస్ డే
న్యూఢిల్లీలో ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ విద్యాలయ అవార్డులను ప్రధాని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్; దాద్రానగర్ హవేలీలు స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు ఎంపికయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న జిల్లాల అధికారులకు సివిల్ సర్వీసెస్ డేలో ప్రధాని అవార్డులను అందజేశారు.

దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులు
దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 22న విడుదల చేసిన భారత్‌లో వృద్ధాప్యం-2016 నివేదిక ప్రకారం 2011 నాటి జనాభా లెక్కల నాటికి మొత్తం జనాభాలో 10.38 కోట్ల మంది (8.6 శాతం) వృద్ధులున్నారు. 2001లో వీరి సంఖ్య 7.66 కోట్లు (5.6 శాతం). దేశంలోని మొత్తం వృద్ధుల్లో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.

కొట్టాయం మసీదులోకి మహిళలకు ప్రవేశం
చరిత్రలో తొలిసారిగా మహిళల కోసం ఓ మసీదు ద్వారాలు తెరుచుకున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఉన్న తఝతంగడి మసీదులోకి మహిళలు ఏప్రిల్ 24న అడుగుపెట్టారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో సుమారు వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మసీదును కొట్టాయం మహిళలే కాకుండా కేరళవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది మహిళలు తిలకించారు. మహిళలను కేవలం సందర్శనార్థమే మసీదులోకి అనుమతించామని, ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వీలులేదని మతపెద్దలు వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏప్రిల్ 29న అసెంబ్లీలో బలపరీక్ష లేదని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ 27న విచారించింది. ఈ సందర్భంగా న్యాయయూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఏడు క్లిష్టమైన ప్రశ్నలు సంధించింది. వీటితోపాటు అవసరమనుకుంటే మరికొన్ని ప్రశ్నలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అటార్నీ జనరల్ (ఏజీ)కు సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదావేసింది.

ముంబైలో తొలి మారిటైమ్ సదస్సు
దేశంలో తొలి మారిటైమ్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 14న ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భారత మారిటైమ్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. దేశంలోని 7,500 కి.మీ. తీరప్రాంతం భారీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోందని తెలిపారు. 2025 నాటికి ఓడరేవుల సామర్థ్యాన్ని 3000 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దేశ సముద్ర రంగంలో 250 ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని, ఇందులో 100 ప్రాజెక్టులను సాగరమాల కింద గుర్తించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో 41 దేశాలకు చెందిన 4,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఇనామ్ ప్రారంభం
మండీలను సమీకృతం చేయడానికి ఉద్దేశించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఇనామ్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆన్‌లైన్ వ్యాపారం కోసం ఎనిమిది రాష్ట్రాల్లోని 21 మండీలను సమీకృతం చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఇనామ్ ద్వారా రైతులు... గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లోని 21 మండీల్లో 25 రకాల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 2018 నాటికి 285 టోకు మండీలను సమీకృతం చేయనున్నారు.

పులుల సంరక్షణపై ఆసియా దేశాల మంత్రుల సదస్సు
పులుల సంరక్షణపై ఆసియా దేశాల మంత్రుల మూడో సదస్సు ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవ్‌దేకర్ మాట్లాడుతూ భారత్‌లో పులుల సంరక్షణకు తీసుకున్న చర్యల ఫలితంగా 2014లో 2,226 ఉన్న వాటి సంఖ్య ఈ ఏడాది 2,250కి పెరిగిందని తెలిపారు. 

అంబేడ్కర్ జన్మస్థలం మహులో ప్రధాని మోదీ
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహు గ్రామంలో నిర్వహించిన 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ స్వయం పాలనా కార్యక్రమం ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ను మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్ చివరిరోజుల్లో నివసించిన ఢిల్లీలోని అలీపూర్ రోడ్, 26 నంబర్ ఇంటిని ఆయన స్మారకంగా మారుస్తున్నామని వెల్లడించారు.

బ్రిటన్ ప్రిన్స్ జంట భారత పర్యటన
బ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్‌లు వారం రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్ 10న భారత్ చేరుకున్నారు. వీరు ముంబైలో దిగిన అనంతరం నేరుగా తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లి 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. తాజ్ హోటల్ నుంచి ఓవల్ మైదానానికి చేరుకున్న ఈ జంట పలు స్వచ్ఛంద సంస్థల చిన్నారులు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడారు. విలియమ్ జంట భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 

శని శింగ్నాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం
వివాదాస్పద శని శింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. మహారాష్ట్రీయుల కొత్త సంవ త్సరం ‘గుడి పడ్వా’ కానుకగా ఆలయ ట్రస్టు ఏప్రిల్ 8న ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై హైకోర్టు ఆదేశాల్ని అనుసరిస్తూ అందరికి శనిదేవుడ్ని కొలిచేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శని శింగ్నాపూర్‌లోకి మహిళల్ని అనుమతించాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దశాబ్దాల కట్టుబాట్లను బద్దలుకొడుతూ 2015 నవంబరులో శనిదేవునికి ఓ మహిళ తైలాభిషేకం చేసింది. ఈ సంఘటన అనంతరం అనేక సంఘాలు ముందుకొచ్చి మహిళలకు ప్రవేశంపై పోరాటం చేశాయి. ‘భూమాతా రణరాగిని బ్రిగేడ్’ ఆధ్వర్యంలో తృప్తి దేశాయి(32) మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఆలయంలోకి వెళ్లేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. దేవుడ్ని పూజించేందుకు మహిళల్ని అనుమతించాలని, శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశం కల్పించాలంటూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 1న ఆదేశించింది.

కేరళ పుట్టింగల్ ఆలయంలో పెను విషాదం
కేరళలోని కొల్లాం జిల్లా పరువూర్‌లో ఉన్న పుట్టింగల్ ఆలయంలో ఏప్రిల్ 10న జరిగిన అగ్నిప్రమాదంలో 106 మంది మృతిచెందారు. ఇక్కడ ఏటా 7 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు పెద్దఎత్తున బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ బాణసంచా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రాకెట్ మాదిరి నింగిలోకి దూసుకెళ్లి పెద్దశబ్దంతో పేలిపోయే ‘అమిట్టు’ అనే టపాసును వెలిగించారు. ఈ టపాసే పెను విధ్వంసానికి కారణమైంది. నిప్పంటించగానే ఆకాశంలోకి వెళ్లాల్సిన అమిట్టు నేలపైనే పేలిపోయింది. నిప్పు రవ్వలు మరిన్ని అమిట్టులపై పడడంతో అవన్నీ పేలాయి. ఇదే సమయంలో పక్కనే బాణసంచాను నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలోని టపాసులు పేలడం మొదలైంది. ఈ మంటలకు 106 మంది ఆహుతవగా 383 మంది తీవ్రగాయాల పాలయ్యారు. 

పులుల సంరక్షణ కోసం ఆసియా మంత్రుల సమావేశం
అంతరించిపోతున్న జీవుల జాబితాలో ముందువరుసలో ఉన్న పులుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆసియా దేశాల మంత్రులు సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12న నిర్వహించిన ఈ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సమావేశంలో ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మలేసియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయ్‌లాండ్, వియెత్నాం, కిర్గిజ్, కజకిస్తాన్ దేశాల పర్యావరణ మంత్రులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

లాతుర్‌కు చేరిన వాటర్ ట్రైన్
తీవ్ర నీటి ఎద్దడి, కరువుతో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలోని లాతుర్‌కు నీరు సరఫరా చేసేందుకు ఏప్రిల్ 11న మిరాజ్ నుంచి పది వ్యాగన్‌లతో బయలుదేరిన వాటర్ ట్రైన్ ఏప్రిల్ 12న లాతుర్ చేరుకుంది. ప్రతి వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. సాంగ్లిలోని మిరాజ్ రైల్వే స్టేషన్‌లో నీటిని నింపి లాతుర్‌కు తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌ముఖ్ బావిలో నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడ నీటిని శుద్ధిచేసి 70 ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేయనున్నారు.

‘మహారాజా ఎక్స్‌ప్రెస్’కు ప్రపంచ గుర్తింపు
భారతదేశంలోని ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైళ్లల్లో ఒకటిగా గుర్తించారు. న్యూ వరల్డ్ వెల్త్ కంపెనీ చేపట్టిన సర్వేలో మహారాజా ఎక్స్‌ప్రెస్ నాల్గో స్థానంలో నిలిచింది. ఈస్ట్రన్ అండ్ ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్ (సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లో ప్రయాణిస్తుంది) ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిచింది. భారతీయ సంప్రదాయాలతో, ఆధునిక పోకడలతో ఎంతో విలాసవంతమైన ప్రయాణంగా మహారాజా ఎక్స్‌ప్రెస్ సాగుతుంది. మహారాజా రైలులో పర్యటనలకు రూ. రెండు లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు వివిధ రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. బ్లూ ట్రైన్, రోవోస్ రైలు (సౌత్ ఆఫ్రికా), ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ (యూరప్, టర్కీ) లగ్జరీ రైళ్లలో ప్రసిద్ధి చెందినవి. ఈ సర్వేలో ప్రపంచంలోని ధనవంతుల ఓటింగ్ ఆధారంగా లగ్జరీ రైళ్లను, లగ్జరీ హోటళ్లను ప్రకటించారు. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియోను అత్యంత విలాసవంతమైన హోటల్‌గా గుర్తించారు. సహారా గ్రూప్‌నకు చెందిన ప్లాజా హోటల్ (న్యూయార్క్) రెండో స్థానంలో నిలిచింది.

‘సావెన్’లో చేరనున్న భారత్
దక్షిణాసియా దేశాల సరిహద్దుల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన సౌత్ ఆసియా వైల్డ్‌లైఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (సావెన్)లో భారత్ సభ్యత్వానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సభ్యదేశాల మధ్య వన్యప్రాణుల విషయంలో జరుగుతున్న నేరాలు, వీటిని ఆపేందుకు పరస్పర సహకారం, సమన్వయం కోసం సావెన్‌ను రూపొందించారు. కాగా, మత్స్య పరిశ్రమలో పరస్పర సహకారానికి భారత్, బంగ్లా మధ్య ఏప్రిల్ 13న ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి మనుషుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్-యూఏఈ ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. వీటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

దేశమంతా ఒకే ఎమర్జెన్సీ నంబరు 112కు ఆమోదం
 నేషనల్ ఎమర్జెన్సీ నంబరుగా 112ను తీసుకొచ్చేందుకు కేంద్ర అంతర్ మంత్రిత్వ టెలికాం కమిషన్ మార్చి 28న ఆమోదం తెలిపింది. అన్ని అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఒకే నంబరు (112) ఉండేలా టెలికాం క్రమబద్ధీకరణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) సిఫార్సు చేసింది. ప్రస్తుతం దేశంలో పోలీసు (100), అంబులెన్సు (102), అగ్నిమాపక దళం (101) సేవలకు వేరు వేరు నంబర్లు ఉన్నాయి. ఇలాంటి సేవలన్నింటినీ కలపి అమెరికా (911), యునెటైడ్ కింగ్ డమ్ (999)ల్లో ఒకే నంబర్లు ఉన్నాయి. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబరును తీసుకురానుంది. 

జమ్మూకశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణస్వీకారం
జమ్మూకశ్మీర్ 13వ ముఖ్యమంత్రిగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ 4న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు తొలి మహిళా సీఎంగా, దేశంలో సీఎంగా ఎన్నికైన రెండో ముస్లిం మహిళగా ముఫ్తీ రికార్డులకెక్కారు. 1980లో సైదా అన్వరా (అస్సాం) తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఫ్తీతో పాటు మొత్తం 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం విధించిన 86 రోజుల రాష్ట్రపతి పాలనకు తెరపడింది.

కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలి 21 మంది దుర్మరణం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలడంతో 21 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 88 మంది గాయపడ్డారు. అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరొందిన బుర్రాబజార్ ప్రాంతంలో ఇరుగ్గా ఉండే రవీంద్ర సరాని- కె.కె.టాగూర్ రోడ్డుపై 2 కి.మీ. మేర ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైవర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ సంస్థ నిర్మిస్తోంది.

కిరోసిన్ రహిత నగరంగా చండీగఢ్
దేశంలో కిరోసిన్ వినియోగించని నగరంగా చండీగఢ్ ఘనత దక్కించుకుంది. ఈమేరకు కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నగరంలో సబ్సిడీపై కిరోసిన్ అమ్మకాలను పూర్తిగా నిలుపుదల చేశారు. దీంతో గృహవినియోగదారులు అంతా ఎల్‌పీజీకి మారాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2016 నుంచి చండీగఢ్‌లో సబ్సిడీ కిరోసిన్ పంపిణీ జరగదని కేంద్ర పెట్రోలియం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చండీగఢ్‌ను కిరోసిన్ ఫ్రీ సిటీగా నిలిపేందుకుగానూ ఆ నగర యంత్రాంగం సహాయంతో కేంద్రం పనిచేస్తోంది. 

47 మంది పోలీసులకు జీవితఖైదు
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4న జీవిత ఖైదు విధించింది. జూలై 12, 1991న సిక్కు యాత్రికుల బస్సును అడ్డుకున్న పోలీసులు వారిలో 10 మందిని నకిలీ ఎన్‌కౌంటర్ చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపామంటూ తర్వాతి రోజు పోలీసులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌పై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. టైస్టుల్ని చంపితే వచ్చే అవార్డులు, గుర్తింపు కోసమే హత్యాకాండకు పోలీసులు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. మొత్తం 57మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 10 మంది విచారణ మధ్యలోనే మరణించారు. 47 మందిపై విచారణ జరిపి తీర్పు వెలువరించారు.

‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు దేశంలోని 1.25 లక్షల బ్యాంకు బ్రాంచులు ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు ఇస్తాయని చెప్పారు. ఏప్రిల్ 5న నోయిడాలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల వారికి జీవనోపాధి కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5,100 ఈ-రిక్షాలను మోదీ పంపిణీ చేశారు.
పథకం వివరాలు..
స్టాండప్ ఇండియా పథకం కింద రుణం తీసుకునే వారు రూపే డెబిట్ కార్డు ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వారికి ముందస్తు శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి), నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీలు రూ.5 వేల కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తాయి. రూ. 10 వేల కోట్లు రీఫైనాన్స్ చేస్తాయి. సిడ్బి, నాబార్డు కార్యాలయాలు స్టాండప్ ఇండియా అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తాయి.

బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం
బిహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి వచ్చింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్) సహా రాష్ట్రంలో మద్యం(ఆల్కహాల్) విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 5న పూర్తి నిషేధాన్ని విధించింది. ఇది తక్షణం అమలులోకి వస్తుంది. బార్లు, రెస్టారెంట్లతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఆల్కహాల్‌ను విక్రయించడానికి వీల్లేదు.

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
దేశంలోనే అత్యంత వేగమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఏప్రిల్ 5న ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. శుక్రవారం మినహాయించి వారానికి ఆరు రోజులు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ వరకు ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం తాజ్‌మహల్‌కు సెలవు దినం కావడంతో ఆ రోజు ఈ రైలుకు విశ్రాంతినిచ్చారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్‌లో సకల సౌకర్యాలు ఉన్నాయి.

AIMS DARE TO SUCCESS 

మే 2016 జాతీయం
మూలధన వస్తువుల తయారీ విధానానికి కేబినెట్ ఆమోదం
మూలధన వస్తువుల(కేపిటల్ గూడ్స్) ఉత్పత్తి జాతీయ విధానానికి కేంద్ర కేబినెట్ మే 25న ఆమోదం తెలిపింది. నూతన విధానం ద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు..
2014-15లో ఈ రంగం ఉత్పత్తి విలువ దాదాపు రూ.2,30,000 కోట్లు. దీన్ని 2025 నాటికి రూ.7,50,000 కోట్లకు పెంచడం.ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ రంగం 14 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. దీన్ని 2025 నాటికి 50 లక్షలకు, పరోక్ష ఉపాధి అవకాశాలను 70 లక్షల నుంచి 2.5 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం.క్యాపిటల్ గూడ్స్ డిమాండ్‌లో దేశీయ ఉత్పత్తి వాటా ప్రస్తుతం 60 శాతం. దీన్ని 80 శాతానికి పెంచడం.దేశీయ ఉత్పత్తిలో ప్రస్తుతం 27 శాతం ఎగుమతులు జరుగుతుండగా, దీన్ని 40 శాతానికి, మొత్తం తయారీ రంగంలో ఈ రంగం వాటాను 12 నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది.


ఈశాన్య మండలి సమావేశం
షిల్లాంగ్‌లో మే 27న జరిగిన ఈశాన్య మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈశాన్య భారతాన్ని ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా అభివర్ణించారు. యాక్ట్ ఈస్ట్ విధానాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా షిల్లాంగ్‌లో 3 కొత్త రైళ్లను ప్రారంభించారు. దీంతో పాటు చిరపుంజిలోని డాప్లర్ వాతావరణ రాడార్‌ను జాతికి అంకితం చేశారు.

ఈ- వ్యర్థాల విడుదలలో 5వ స్థానంలో భారత్
ప్రపంచంలో ఈ-వ్యర్థాల విడుదలలో భారత్ 5వ స్థానంలో ఉంది. ఈ మేరకు మే 25న విడుదల చేసిన అసోచాం-కేపీఎంజీల సంయుక్త అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ గల భారత్ నుంచి ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయి. అందులో టెలికం పరికరాల నుంచే 12 శాతం ఈ-వ్యర్థాలు వస్తున్నాయి. భారత్‌లో 1.03 బిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని, ఏడాదికి 25 శాతం ఈ-వ్యర్థాల పరిమాణం పెరుగుతోందని సర్వే పేర్కొంది.

కేంద్ర ఆయుధాగారంలో అగ్నిప్రమాదం
 మహారాష్ట్రలోని పల్గావ్‌లో ఉన్న కేంద్ర ఆయుధాగారంలో మే 31న జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మరణించారు. ఆసియాలోనే రెండో అతిపెద్దదైన పల్గావ్ ఆయుధాగారంలో మంటలు చెలరేగడంతో వాటి అదుపుచేసే ప్రయత్నంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆయుధాగారం నాగ్‌పూర్‌కు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ డిపోలో భారత్ సైన్యానికి చెందిన కీలక ఆయుధాల్ని భద్రపరుస్తారు. బాంబులు, గ్రెనేడ్స్, షెల్స్, రైఫిల్స్, మిస్సైల్స్ ఇతర పేలుడు పదార్థాల్ని వివిధ ఫ్యాక్టరీల్లో తయారయ్యాక ముందుగా ఇక్కడికి తరలించి నిల్వ చేస్తారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు గెలుపొందిన అధికార పార్టీలు
ఒక కేంద్రపాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 19న వెల్లడయ్యాయి.
పశ్చిమ బెంగాల్: మొత్తం 294 స్థానాలకు గానూ మమతాబెనర్జీ నేతృత్వంలోని ఏఐటీసీ 211 స్థానాలను గెలుచుకొంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) 44, సీపీఐ (ఎం) 26, బీజేపీ 3, ఇతరులు 10 స్థానాలను గెలుచుకున్నారు.
తమిళనాడు: మొత్తం 232 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఏఐఏడీఎంకే 134, డీఎంకే 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ 1 స్థానంలో విజయం సాధించాయి. 
అసోం: మొత్తం 126 స్థానాలకు గానూ బీజేపీ 60, కాంగ్రెస్ 26, ఏఐయూడీఎఫ్ 13, ఏజీపీ 14, బీపీఎఫ్ 12, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. 
కేరళ: మొత్తం 140 స్థానాలకు గానూ సీపీఎం 58, కాంగ్రెస్ 22, సీపీఐ 19, ఐయూఎంఎల్ 18, ఇతరులు 23 స్థానాల్లో విజయం సాధించారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అధికారాన్ని దక్కించుకుంది.
పుదుచ్చేరి: మొత్తం 30 స్థానాలకు గానూ కాంగ్రెస్ 15, ఏఐఎన్‌ఆర్‌సీ 8, ఏఐఏడీఎంకే 4, డీఎంకే 2, ఇతరులు 1 స్థానం దక్కించుకున్నాయి.

‘దివ్యాంగ్‌జన్ సశక్తికరణ్’గా వికలాంగుల విభాగం
వికలాంగుల సాధికారత విభాగాన్ని ఇకపై హిందీలో ‘దివ్యాంగ్‌జన్ సశక్తికరణ్’గా పిలవనున్నారు. ‘వికలాంగ్‌జన్’ పదాన్ని తొలగించారు. ఈమేరకు కేబినె ట్ కార్యద ర్శి ఆదేశాలు జారీచే శారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. 2015 డిసెంబర్ 27న ఆకాశవాణి ‘మనసులో మాట’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వికలాంగులకు దైవ సంబంధ సామర్థ్యాలుంటాయని, ‘వికలాంగ్’ స్థానంలో ‘దివ్యాంగ్’ అనే మాట వాడాలని సూచించారు. 

మోదీ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 64 శాతం ప్రజలు
నరేంద్ర మోదీ రెండేళ్ల ప్రభుత్వ పాలన తీరుపై మూడింట రెండొంతుల మంది ప్రజానీకం సంతృప్తిని వ్యక్తం చేసింది. లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది. 20 అంశాలతో కూడిన పత్రాన్ని 15 వేల మంది పట్టణవాసులు అందించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగుందని అభిప్రాయపడగా.. 34 శాతం మంది అనుకున్నంత బాగా లేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళలు, చిన్నారుల భద్రత, ధరల నియంత్రణ తదితర కీలక అంశాల్లో మరిన్ని చర్యలు అవసరమని వారు అభిప్రాయపడినట్లు పేర్కొంది. మొత్తంగా 76 శాతం మంది ప్రజలు భారత్‌లో తమ, తమ కుటుంబ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు సర్వే వివరించింది.

కాల్‌డ్రాప్స్ పరిహారానికి సుప్రీం నో
కాల్‌డ్రాప్స్‌కు సంబంధించి వినియోగదా రులకు పరిహారం చెల్లించాలన్న టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాలను సుప్రీంకోర్టు మే 11న తోసిపుచ్చింది. ఈ నిబంధన ఏకపక్షం, చట్టవిరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ.1 చొప్పున వినియోగదారులకు చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16న ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై భారత టెలికం సర్వీస్ ప్రొవైడర్ల అత్యున్నత సంస్థ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం
దివాలా బిల్లుకు రాజ్యసభ మే 11న ఆమోదం తెలిపింది. మే 5నే దీనికి లోక్‌సభ ఆమోదం లభించడంతో తాజాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. దివాలా వ్యవహారం మొత్తం 180 రోజుల్లో పూర్తవ్వాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.

కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ 11వ స్థానం లో నిలిచింది. ఢిల్లీలో కాలుష్య సూచీ ఏడాదికి సగటున 122 మైక్రో పర్ గ్రామ్ క్యూబిక్ మీటర్‌గా ఉంది. 20 అత్యంత కాలుష్య నగరాల్లో 10 భారత్‌లోనే ఉన్నాయి.

హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
హైజాకింగ్ వ్యతిరేక బిల్లు -2014ను లోక్‌సభ మూజువాణి ఓటుతో మే 9న ఆమోదించింది. ఈ బిల్లులో విమానాల హైజాకింగ్ నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఇందులో భాగంగా విమానశ్రయ సిబ్బంది చనిపోయినా హైజాకర్లకు మరణశిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు విమాన సిబ్బంది, ప్రయాణికులు, భద్రతా సిబ్బంది, బందీలు తదితరులు మరణి స్తేనే హైజాకర్లకు ఉరిశిక్ష విధించేవారు.

భారత నౌకాదళం కొత్త చీఫ్‌గా సునీల్ లంబా
భారత నౌకాదళం కొత్త చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సునీల్ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మే 5న ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నావికాదళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

భారత పటాన్ని తప్పుగా చూపితే రూ. 100 కోట్ల జరిమానా
భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం.. భారత భౌగోళిక సమాచారాన్ని సేకరించడం, ప్రచురించడం, పంపిణీచే యడానికి ముందు సదరు సంస్థ తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.

కూంబింగ్‌కు తొలిసారి మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బంది
కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నక్సలైట్ల ఏరివేతలో మహిళా సైన్యాన్ని నియమించనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో 232 మహిళా బెటాలియన్‌కు చెందిన 567 మంది మహిళలు.. న క్సలైట్లపై పోరాటానికి అవసరమైన శిక్షణ పొందారు. 44 వారాలపాటు శిక్షణ సాగింది. ఇందులోభాగంగా అజ్మీర్‌లో మే 7న పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించారు. మహిళా రక్షక దళం కరాటే, షూటింగ్ వంటి విద్యలలో శిక్షణ పొందింది. మహిళా సైనికులు తుపాకులు ధరించి అడ వుల్లో కూంబింగ్ నిర్వహిస్తారు.

బలపరీక్షలో హరీశ్ రావత్ గెలుపు
తీవ్ర ఉత్కంఠ మధ్య మే 10న జరిగిన ఉత్తరాఖండ్ బలపరీక్షలో హరీశ్ రావత్ సర్కారు గట్టెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమాచారం మేరకు రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేయగా, 28 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 90 నిమిషాల ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసిన అధికారులు సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. గెలుపు వివరాలను సుప్రీంకోర్టు మే 12న అధికారికంగా ప్రకటించనుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ మార్చి 28న మోదీ సర్కారు రాష్ట్రపతి పాలనను విధించింది. ఓటింగ్ కోసం మే 10వ తేదీ ఉదయం రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను తొలగించారు. 

లక్షన్నర గ్రామాల్లో కరువు
దేశ జనాభాలో నాలుగో వంతు మందిపై కరువు ప్రభావం చూపిందని.. 1.5 లక్షల గ్రామాలు కరువు పీడితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో.. నదుల అనుసంధానం వంటి వివాదాస్పద అంశాలపై ఏకాభిప్రాయం అవసరమని లోక్‌సభలో అన్ని పక్షాలనూ కోరింది. కరువు, నీటి కొరత, నదుల అనుసంధానం అంశాలపై మే 10న లోక్‌సభలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 313 జిల్లాలు, 1,58,205 గ్రామాలు, 4,44,280 జనావాసాలు కరువుబారిన పడ్డాయని గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్ చెప్పారు.

‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ ప్రారంభం
 దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను ప్రధాని నరేంద్రమోదీ మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద.. వచ్చే మూడేళ్లలో ఐదు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.8,000 కోట్లు ఖర్చుచేస్తుంది. వారణాసిలో జరిగిన మరో కార్యక్రమంలో ప్రధాని 11,000 మంది లబ్ధిదారులకు ఇ-రిక్షాలను పంపిణీ చేశారు. గంగా నదిలో బోట్లు నడిపేవారికి సోలార్ విద్యుత్‌తో నడిచే 11 బోట్లను మోదీ అందించారు. 

ఠాగూర్ జయంతికి ఈజిప్ట్‌లో ఉత్సవాలు
రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఈజిప్టులో సాంస్కృతికోత్సవాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఏర్పరిచేందుకు ఈ వేడుకలను జరపనుంది. మే 8 నుంచి 12 వరకు ఉత్సవాలు జరుగుతాయి. కైరోలో భారత రాయబార కార్యాలయం, మౌలానా ఆజాద్ భారత సాంస్కృతిక కేంద్రాలు సంయుక్తంగా వేడుకలను నిర్వహిస్తాయి. ఠాగూర్ రచనల్లో గీతాంజలితో పాటు అనేక ఇతర కావ్యాలను అరబిక్ లోకి అనువదించారు. ఆయన రచనలు ఈజిప్టులో మంచి గుర్తింపు పొందాయి. నైలు నది, ఈజిప్టు ప్రజల నాగరికతల మధ్యనున్న బంధం గురించి కూడా ఠాగూర్ రచనలు చేశారు. 

ఎంపీ పదవికి విజయ్ మాల్యా రాజీనామా
కింగ్‌ఫిషర్ మాజీ అధిపతి, ఎంపీ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆయన పంపిన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈమేరకు మే 4న రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం లేదంటూ మాల్యా తొలుత పంపిన రాజీనామా లేఖను అన్సారీ మే 3న తిరస్కరించారు. దీంతో మాల్యా తాను సంతకం చేసిన రాజీనామాను మరోసారి పంపారు. మాల్యా సభ్యత్వాన్ని తక్షణమే బహిష్కరించాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ కూడా తన సిఫార్సును మే 4న నివేదించింది. మాల్యా తొలుత పంపిన లేఖతోసహా మొత్తం వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2016 జాతీయం
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్ 27న పుణేలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో పుణేకు సంబంధించిన 14 ప్రాజెక్టులతో పాటు ఇతర స్మార్ట్ నగరాలకు చెందిన 69 ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పట్టణీకరణను సమస్యగా భావించేవారని, తాను అలా అనుకోవడం లేదన్నారు. ఆర్థిక రంగానికి చెందిన వారు నగరాలను అభివృద్ధికి కేంద్రాలుగా భావిస్తారన్నారు. పేదరిక నిర్మూలనకు పట్టణీకరణ ఒక అవకాశమని పేర్కొన్నారు.

ఆదాయ పన్ను చెల్లించనివారిపై కఠిన చర్యలు
ఉద్దేశపూర్వకంగా ఆదాయ పన్ను చె ల్లించని వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాలని ఐటీ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మార్గనిర్దేశం చేసింది. అరెస్టులతో పాటు ఆయా వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేయాలని జూన్ 21న సూచించింది. 

లోక్‌పాల్ పరిధిలోకి స్వచ్ఛంద సంస్థలు
ప్రభుత్వం నుంచి రూ.కోటికి పైగా ఆర్థిక సాయాన్ని, విదేశాల నుంచి రూ.10 లక్షలకు పైగా విరాళాలను పొందే స్వచ్ఛంద సేవా సంస్థలను లోక్‌పాల్ పరిధిలోకి తీసుకువస్తూ జూన్ 21న నిర్ణయం తీసుకుంది. 

ఎంటీసీఆర్‌లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం
క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో భారత్‌కు జూన్ 27న పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. ఈ మేరకు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ దేశాల రాయబారుల సమక్షంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జైశంకర్ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో భారత్ బహుళపక్ష ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలోకి ప్రవేశించింది. భారత్ చేరికతో ఈ వ్యవస్థలోని మొత్తం సభ్య దేశాల సంఖ్య 35కు చేరింది. ఎంటీసీఆర్‌లో సభ్యత్వం పొందడం ద్వారా ఉన్నత స్థాయి క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయడానికి మన దేశానికి అవకాశం ఉంటుంది. 

చిన్నారుల మరణాల్లో 48 స్థానంలో భారత్
 ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో (2014 వరకున్న వివరాల ప్రకారం) భారత్ 48వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2015లో భారత్‌లో 2.57 కోట్ల మంది జన్మించగా ఇందులో 12 లక్షల మంది చిన్నారులు వివిధ కారణాలతో మరణించారు. 2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, అంగోలాల్లోనే ఉంటాయని యునిసెఫ్ వెల్లడించింది. 

నివేదికలోని మరిన్ని అంశాలు
భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 48 మంది చనిపోతున్నారు.దేశంలో సగటు ఆయుర్దాయం 68 ఏళ్లు.2009-2014 గణాంకాల ప్రకారం అక్షరాస్యత పురుషుల్లో 90 శాతం, మహిళల్లో 82 శాతం(15-24ఏళ్లలోపు).వందమందిలో 74 మంది మొబైల్ వినియోగం, 18 మంది ఇంటర్నెట్ వినియోగం.వెయ్యిమందిలో 12 మంది బాల కార్మికులు.21 లక్షల మందికి హెచ్‌ఐవీ. ఇందులో 1.3 లక్షల మంది చిన్నారులు.వరల్డ్ ఎకనమిక్ ఫోరం హ్యూమన్ క్యాపిటల్ (ఆర్థికాభివృద్ధికి కావాల్సిన సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి, సరైన వినియోగం) సూచీలో భారత్‌కు 105 స్థానం.నాణ్యమైన విద్య విషయంలో 39, సిబ్బంది శిక్షణలో 46, నైపుణ్య ఉద్యోగుల విషయంలో 45వ స్థానంలో భారత్.


ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న యోగా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. యోగా డేను పురస్కరించుకొని చండీగఢ్‌లో నిర్వహించిన యోగా ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆయన 30 వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొనగా, ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని యోగాసనాల చిత్రపటాలతో అలంకరించారు. భారత్ కోరిక మేరకు ఐరాస జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది.

భారత్‌లో 38.7 శాతం పిల్లల్లో ఎదుగుదల లోపం
భారత్‌లో 38.7 శాతం మంది పిల్లలు పోషకాహార లోపం కారణంగా సరిగా ఎదగడంలేదని ప్రపంచ పోషకాహార నివేదిక (జీఎన్‌ఆర్) జూన్ 15న వెల్లడించింది. ఇది ప్రపంచ సగటు 23.8 శాతం కంటే అధికమని తెలిపింది. మొత్తం 132 దేశాల్లో సర్వే జరపగా భారత్ 114వ స్థానంలో నిలిచింది. మధుమేహ వ్యాధిపై 190 దేశాల్లో జరిపిన సర్వేలో భారత్‌కు 104వ స్థానం లభించింది. దేశంలో 9.5 శాతం మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు సర్వే పేర్కొంది. 

థాయ్‌లాండ్ ప్రధాని భారత పర్యటన
భారత్ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా జూన్ 17న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

రోడ్డు ప్రమాదాల్లో 2015లో 1.46 లక్షల మంది మృతి
2015లో జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాల ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) జూన్ 9న విడుదల చేసింది. 2015లో దేశంలో ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వాటిలో 1.46 లక్షల మంది మరణించారు. 2014తో పోల్చితే 2015లో రోడ్డు ప్రమాదాలు 2.5 శాతం పెరగ్గా, మరణాలు 4.6 శాతం మేర పెరిగాయి. రోజుకు సగటున 1,374 రోడ్డు ప్రమాదాలు, 400 మరణాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాద మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపు వారేనని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తర ప్రదేశ్ తొలిస్థానంలో నిలవగా, ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, తొమ్మిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలున్నాయి.

చమురు వినియోగంలో మూడో స్థానంలో భారత్
ప్రపంచంలో చమురు వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ మేరకు ప్రఖ్యాత బి.పి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ జూన్ 8న విడుదల చేసిన ఇంధన గణాంకాల సమీక్ష వెల్లడించింది. 2015లో అమెరికా రోజుకు 19.39 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11.96 మిలియన్ బ్యారెళ్ల వినియోగంతో రెండో స్థానంలో, భారత్ 4.1 మిలియన్ బ్యారెళ్ల వినియోగంతో మూడో స్థానంలో నిలిచాయి. ప్రపంచ ఇంధన వినియోగంలో చమురు 32.9 శాతం, బొగ్గు 29.2 శాతం, సహజ వాయువు 23.8 శాతం వాటా కలిగి ఉన్నాయి.

42,000 మెగావాట్లు దాటిన పునర్వినియోగ ఇంధనం
పునర్వినియోగ ఇంధనం తొలిసారి జల విద్యుత్ ఉత్పత్తిని మించిపోయింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జూన్ 10న తెలిపిన వివరాల ప్రకారం పునర్వినియోగ ఇంధన రంగ మొత్తం సామర్థ్యం 42,849.38 మెగావాట్లకు చేరుకుంది. ఇది జల విద్యుత్ సామర్థ్యం (42,783.42 మెగావాట్ల) కంటే ఎక్కువ. ప్రభుత్వ విధాన పరమైన చర్యలు, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు పెట్టుబడుల వల్ల పునర్వినియోగ ఇంధన రంగం.. జల విద్యుత్తు సామర్థ్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మూడు లక్షల మెగావాట్లు. 

శక్తిమంత సైనిక దేశాల్లో భారత్‌కు 4వ స్థానం
ప్రపంచంలో అత్యంత శక్తిమంత సైనిక దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన ఓ సంస్థ గ్లోబల్ ఫైర్ పవర్-2016 పేరిట సైనిక సామర్థ్యంలో ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల జాబితాను జూన్ 8న ప్రకటించింది. ఇందులో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, తర్వాత స్థానాల్లో వరుసగా రష్యా, చైనాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు 17వ స్థానం లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి భౌగోళిక ప్రాంతం, సహజ వనరులు, ఆయుధ బలం, ప్రస్తుత ఆర్థిక స్థితి వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

భారత్‌లో 38.7% పిల్లల్లో పోషకాహార లోపం
భారత్‌లో 38.7 శాతం పిల్లలు పోషకాహార లోపం వల్ల సరిగా ఎదగలేకపోతున్నారని ప్రపంచ పోషకాహార నివేదిక (Global Nutrition Report)లో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు 23.8 కన్నా ఎంతో అధికం. సర్వే జరిపిన 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో నిలిచింది. 1.3 శాతం పోషకారహార లోపంతో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. చిలీ (1.8%), ఆస్ట్రేలియా (2%), అమెరికా (2.1%) తరవాత స్థానాల్లో ఉన్నాయి. చైనా 9.4 శాతంతో 26వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ (45%) 125వ స్థానంలో ఉంది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని ద్వీప దేశమైన తైమర్-లెస్తే 57.7 శాతం పోషకాహార లోపంతో నివేదికలో ఆఖరి స్థానంలో ఉంది.

పోస్టాఫీసు బ్యాంకులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఇండియా పోస్ట్.. పేమెంట్స్ బ్యాంకుల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూన్ 1న ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి కల్లా 650 పోస్టాఫీసులను బ్యాంకులుగా మార్చడంతోపాటు 5,000 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం దేశంలో 1.54 లక్షల మంది పోస్టల్ అధికారులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్. పోస్టాఫీసులను బ్యాంకులుగా మారిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే పెద్ద బ్యాంకింగ్ రంగం అవుతుంది’ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.39 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 23,000 పోస్టాఫీసులు సేవలందిస్తున్నాయి.

2016-17 ఖరీఫ్ సీజన్ కనీస మద్దతు ధరల పెంపు
కేంద్ర ప్రభుత్వం 2016-17 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి, పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను జూన్ 1న పెంచింది. వరికి స్వల్పంగా క్వింటాలుకు రూ.60 పెంచిన కేంద్రం, పప్పు ధాన్యాల మద్దతు ధరను గణనీయంగా పెంచింది. తాజా పెంపుతో కామన్ గ్రేడ్ వరికి క్వింటాలుకు రూ.1,470, గ్రేడ్ ఏ రకం వరికి క్వింటాలుకు రూ.1,510 మద్దతు ధర లభించనుంది. మీడియం స్టేపుల్ పత్తికి రూ.3,860, లాంగ్‌స్టేపుల్ పత్తికి రూ 4,160 మద్దతు ధరను అందించనున్నారు. వీటితో పాటు పెరిగిన పప్పు ధాన్యాలు, నూనె గింజల మద్దతు ధరల వివరాలు (క్వింటాలుకు)..
కందులు: రూ.5050
మినుములు: రూ.5000
పెసలు: రూ.5,225
వేరుశనగ: రూ.4,220
నువ్వులు: రూ.5,000
ఈ ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సముద్ర జలాలను శుభ్రపరచడంలో భారత్‌కు 11వ స్థానం
సముద్ర జలాలను శుభ్రపరచడంలో 130 దేశాలతో కూడిన జాబితాలో భారత్‌కు 11వ స్థానం దక్కింది. ఓషన్ కన్సర్వెన్సీ దినోత్సవం సందర్భంగా 2015 సెప్టెంబర్ 26న చేపట్టిన ఓషన్ క్లీన్ అప్ కార్యక్రమంలో సముద్ర జలాల నుంచి తొలగించిన ప్లాస్టిక్, చెత్త బరువు ఆధారంగా నైరోబీలో గత నెలలో ర్యాంకులను ప్రకటించారు. 8 లక్షల మంది వాలంటీర్లు సుమారు 80 లక్షల కిలోల వ్యర్థాలను సముద్రం నుంచి వెలికితీశారు. ఇండియన్ మారిటైం ఫౌండేషన్ సమన్వయంతో భారత్‌లోని 250 మైళ్ల తీరాన్ని 10,800 మంది వాలంటీర్లు శుభ్రం చేశారు.

మథురలో అల్లర్లు: 29 మంది బలి
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులు, ఆక్రమణదారుల మధ్య జరిగిన కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్రమణల తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులపై ఆందోళనకారులు కాల్పులకు తెగబడ్డారు. జూన్ 2వ తేదీ సాయంత్రం జరిగిన ఈ హింసలో మృతుల సంఖ్య 29కు చేరగా.. మథుర సిటీ ఎస్పీతో పాటు ఎస్‌హెచ్‌ఏ(సీఐ స్థాయి అధికారి) ప్రాణాలు కోల్పోయారు. ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’కి చెందిన 28 మంది ఆందోళనకారులూ మృతిచెందారు. మథుర జవహర్‌బాగ్‌లోని 260 ఎకరాల్లో 3 వేల మంది రెండేళ్లుగా అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల్ని తొలగిస్తుండగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు.

గువాహటి నగర జంతువుగా డాల్ఫిన్
అస్సాం రాజధాని గువహటికి మస్కట్‌గా గంగానది డాల్ఫిన్‌ను ఎంపిక చేశారు. ఒక పట్టణానికి ప్రత్యేకంగా జంతువును ప్రకటించడం ఇదే తొలిసారి. అంతరించడానికి చేరువగా ఉన్న డాల్ఫిన్‌తో పాటు బోర్ కాసో (నలుపు తాబేలు రకం), హార్గిలా (కొంగ రకం) మధ్య ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీ నిర్వహించి డాల్ఫిన్‌ను ఎంపికచేసినట్లు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. గంగానది డాల్ఫిన్‌ను స్థానికంగా ‘సిహు’ అని పిలుస్తారు. 

శాంతి సూచీలో అట్టడుగున భారత్
విశ్వ శాంతి సూచికలో (గ్లోబల్ పీస్ ఇండెక్స్)లో భారత్ చివరి వరుసలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) అనే అంతర్జాతీయ సంస్థ అత్యంత శాంతియుత ప్రాంతాలేవనే దానిపై 163 దేశాలపై సర్వే చేసింది. ఇందులో భారత్‌కు 141వ స్థానం దక్కింది. సిరియా చిట్టచివరి స్థానం సాధించగా.. అంతకు ముందు స్థానాల్లో వరుసగా దక్షిణ సుడాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్, సోమాలియాలు నిలిచాయి. ఐస్‌ల్యాండ్ మొదటి ర్యాంకు సాధించగా డెన్మార్క్, ఆస్ట్రియా వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలు మాత్రమే పూర్తి శాంతియుతంగా ఉన్నాయని నివేదిక తేల్చింది.

విపత్తు నిర్వహణకు జాతీయ ప్రణాళిక
విపత్తుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేశం విపత్తులను తట్టుకునేలా, ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించేలా, జీవనోపాధి కోల్పోకుండా ఉండేలా జాతీయ ప్రణాళికను మొదటిసారి తీసుకొచ్చింది. సంబంధిత బ్లూప్రింట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 1న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. విపత్తుల సమయంలో ఏ ఏ దశలో ఎలా వ్యవహరించాలో ప్రభుత్వ సంస్థలకు నిర్దేశిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్‌డీఎంపీ)లో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించారు. ఆపత్కాలంలో ప్రాణనష్టాన్ని తగ్గించడంతోపాటు ఆర్థిక, భౌతిక, సామాజిక, సాంస్కృతిక ఆస్తులను పరిరక్షించేలా అధికారులు, ప్రజలు ఎలా కృషిచేయాలో ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

AIMS DARE TO SUCCESS 

జూలై 2016 జాతీయం
2025 నాటికి 139 కోట్లకు దేశ జనాభా 
భారత్ జనాభా 2025 నాటికి 139 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 26న రాజ్యసభలో తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు కాగా, అది 2016లో సుమారు 127 కోట్లకు చేరే అవకాశముందన్నారు. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సంతాన సాఫల్యత ముగ్గురు కంటే అధికంగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 146 జిల్లాల్లో కుటుంబ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలుచేయనున్నట్లు తెలిపారు.

బాలలను పనిలో పెట్టుకుంటే 2 ఏళ్ల జైలు 
14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలను పనిలో పెట్టుకునేవారికి రెండేళ్ల జైలు శిక్ష విధించేలా తీసుకొచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బాల కార్మికుల (నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లుకు రాజ్యసభ గతంలోనే ఆమోదం తెలపగా, జూలై 26న లోక్‌సభ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో గతంలో ఆరు నెలలున్న జైలు శిక్ష రెండేళ్లకు, రూ.10 వేల జరిమానా రూ. 20 వేలకు, రూ.20 వేల జరిమానా రూ. 50 వేలకు పెరగనుంది.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నో
తమిళనాడులో జరిగే వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు జూలై 26న నిరాకరించింది. జల్లికట్టు నిషేధంపై స్టే విధించాలనే ఆ రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది. 2011లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే తర్వాత అధికారంలో కొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పలు ఆంక్షలతో జల్లికట్టు క్రీడకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. 

‘ఆపరేషన్ తలాష్’గా ఏఎన్-32 విమాన గాలింపు
భారత వాయుసేనకు చెందిన అదృశ్యమైన ఏఎన్-32 విమాన గాలింపు చర్యలకు అధికారులు ఆపరేషన్ తలాష్‌గా పేరు పెట్టారు. జూలై 22న చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు 29 మంది భద్రతా సిబ్బందితో బయలుదేరిన విమానం కనిపించకుండా పోయింది. దాని జాడ కనుగొనేందుకు నౌకా, వైమానిక, తీర రక్షక దళాలకు తోడు ఇస్రో రంగంలోకి దిగినా గాలింపు చర్యల్లో పురోగతి కనిపించడం లేదు.

‘త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం
త్రిపుర రాజధాని అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లే ‘త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్’ను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు జూలై 31న ప్రారంభించారు. తద్వారా త్రిపురలో తొలిసారి బ్రాడ్‌గేజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి రూ. 968 కోట్లు ఖర్చయింది. వారంలో ఒకసారి నడిచే ఈ రైలు గువాహటి మీదుగా మొత్తం 2,480 కిలోమీటర్లు ప్రయాణించి 47 గంటల్లో ఢిల్లీలోని ఆనంద్‌విహార్ స్టేషన్‌కు చేరుతుంది. కాగా, సురేశ్ ప్రభు, బంగ్లాదేశ్ రైల్వే మంత్రిముజిబుల్ హక్‌లు అగర్తల-అఖౌరా (బంగ్లా) రైల్వే ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సాగరమాల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
ఓడరేవుల ఆధారిత అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల అధీకృత మూలధనంతో సాగరమాల అభివృద్ధి సంస్థ (ఎస్‌డీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూలై 19న ఆమోదం తెలిపింది. దీన్ని కంపెనీల చట్టం కింద నెలకొల్పనున్నారు. ఇది కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేస్తుంది. సాగరమాల పథకం కింద గుర్తించిన పనులను.. సంబంధిత ఓడరేవులు, రాష్ట్ర ప్రభుత్వాలు, నౌకాయాన మండళ్లు, కేంద్ర మంత్రిత్వశాఖలు.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పి.పి.పి) పద్ధతిలో చేపడతాయి. కోస్తా ఆర్థిక మండళ్ల అభివృద్ధికి సమగ్ర బృహత్ ప్రణాళికలు రూపొందించడం, ప్రాజెక్టులకు సమన్వయకర్తగా వ్యవహరించడం వంటి బాధ్యతలను కూడా ఎస్‌డీసీ నిర్వహిస్తుంది. సాగరమాల కార్యక్రమం కింద చేపట్టే పనులకు రుణం, ఈక్విటీ రూపేణా నిధుల్ని సమీకరిస్తుంది. దేశంలో 7,500 కి.మీ ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా గతేడాది సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఫార్చ్యూన్ 500-కంపెనీల జాబితాలో భారత్ నుంచి ఏడు
భారత్‌కు చెందిన ఏడు కంపెనీలు ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో నాలుగు ప్రభుత్వ కంపెనీలు కాగా, మూడు ప్రైవేటు కంపెనీలు. కంపెనీల ఆదాయాల ఆధారంగా జాబితాను రూపొందించినట్లు ఫార్చ్యూన్ జూలై 20న తెలిపింది. రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ 4,82,130 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకొంది. భారత్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 54.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 161వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. గతేడాది జాబితాలో స్థానం పొందిన ఓఎన్‌జీసీ ఈసారి చోటు కోల్పోయింది. ఫార్చ్యూన్-500 జాబితాలోని కంపెనీలు 6.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ.. 33 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి మొత్తం ఆదాయం గతేడాది 27.6 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన రవాణా విమానం ఏఎన్-32.. 29 మంది సిబ్బందితో బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తూ అదృశ్యమైంది.చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి జూలై 22న అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ వైమానిక స్థావరానికి వెళ్లటానికి బయలుదేరిన ఏఎన్-32 విమానం కనిపించకుండా పోయింది. అదృశ్యమైన ఎఎన్-32 రకం విమానం సుదీర్ఘ కాలంగా వైమానిక దళానికి రవాణా విమానంగా పనిచేస్తోంది.

అంతర్రాష్ట్ర మండలి సమావేశం
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జూలై 16న అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై రాష్ట్రాలు దృష్టిపెట్టాలని ప్రధాని సూచించారు. 2014-15తో పోల్చితే 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాయం 21 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.

నలందకు యునెస్కో వారసత్వ హోదా 
ప్రపంచంలోనే అతి పురాతనమైన నలంద విశ్వవిద్యాలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జూలై 15న నిర్వహించిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ మేరకు ప్రకటన చేసింది. క్రీ.శ. ఐదో శతాబ్దంలో నిర్మాణమైన నలందను క్రీ.శ. పదమూడో శతాబ్దంలో తురుష్కులు కూల్చివేశారు.

మరో రెండు కూడా: నలందను వారసత్వ సంపదగా గుర్తించిన రెండు రోజులకే చండీగఢ్ రాజధాని ప్రాంగణం, కాంచనజంగా ఉద్యానవనాలను యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. దీంతో తొలిసారి ఒక దేశంలోని మూడు ప్రదేశాలకు ఒకేసారి యునెస్కో గుర్తింపు లభించిన ట్లైంది. చండీగఢ్ రాజధాని ప్రాంగణానికి ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కోర్‌బుజీర్ రూపకల్పన చేశారు. ఈ ప్రాంగణంలో శాననసభతోపాటు సచివాలయం, హైకోర్టు భవనాలున్నాయి. సిక్కింలోని కాంచనజంగా నేషనల్ పార్క్ అంతరించిపోతున్న మొక్కలు, జంతువులకు నిలయంగా ఉంది. ఈ మూడు ప్రదేశాల చేరికతో భారత్‌లో యునెస్కో గుర్తించిన ప్రదేశాలు/కట్టడాల సంఖ్య 35కు చేరింది. వీటితో పాటు చైనాలోని జోజియాంగ్ హుషాన్ రాక్ ఆర్ట్ కల్చరల్ ల్యాండ్‌స్కేప్, ఇరాన్‌లోని పర్షియన్ కనత్, తూర్ప మైక్రోనేషియాలోని నాన్ మడోల్ ఉత్సవ కేంద్రం యునెస్కో వారసత్వ హోదా పొందాయి.

‘నీట్’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం
నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ఆర్డినెన్సుల స్థానంలో తెచ్చిన రెండు బిల్లులను లోక్‌సభ జూలై 19న ఆమోదించింది. భారత వైద్య మండలి (సవరణ) బిల్లు-2016, దంతవైద్యుల (సవరణ) బిల్లు-2016లను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా వీటి పరిథిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల వైద్య విద్యార్థులకు బహుళ సంఖ్యలో ప్రవేశ పరీక్షలు రాసే బాధ తప్పుతుందని, అలాగే, క్యాపిటేషన్ ఫీజు వంటి సమస్యలకు ఈ బిల్లులు అంతం పలుకుతుతాయని వాటిని సభలో ప్రవేశపెడ్తూ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పు
బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పునకు సంబంధించి న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 5న ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలవనున్నారు. కలకత్తా హైకోర్టును కూడా కోల్‌కతా హైకోర్టుగా మార్చనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 

‘నమామి గంగే’ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకం జూలై 7న హరిద్వార్ వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీలతో పాటు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌లు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని వంద ప్రాంతాల్లో రూ.1,500 కోట్లతో మురుగుశుద్ధి కేంద్రాలు, ఘాట్లను నిర్మించనున్నారు.

ఐఎన్‌ఎస్ కర్ణను ప్రారంభించిన నేవీ చీఫ్ లంబా
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం వద్ద ఉన్న ఐఎన్‌ఎస్ కళింగలో అభివృద్ధి చేసిన మెరైన్ కమాండో యూనిట్ (మార్కోస్ ఈస్ట్)ను భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లంబా జూలై 12న ప్రారంభించారు. దీనికి ఐఎన్‌ఎస్ కర్ణగా నామకరణం చేశారు. దేశంలోనే తొలి ప్రత్యేక మెరైన్ కమాండోస్ శిక్షణ కేంద్రంగా ఐఎన్‌ఎస్ కర్ణ రూపుదిద్దుకుంది. మెరైన్ కమెండోలు భూమిపైన, ఆకాశం, సముద్రంలోనూ.. ఎక్కడి నుంచైనా శత్రువులపై మెరుపు దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 1992లోనే విశాఖలో మార్కోస్ ఈస్ట్ సేవలు మొదలయ్యాయి. ఈ యూనిట్‌లో 325 మంది కమాండోలు, 25 మంది అధికారులు, 20 మంది సివిలియన్లు సేవలందిస్తారు. ఐఎన్‌ఎస్ కర్ణ కెప్టెన్‌గా వరుణ్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరణ
అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు జూలై 13న సంచలన తీర్పు ఇచ్చింది. 2016 జనవరిలో అరుణాచల్‌లో కాంగ్రెస్ సర్కారు రద్దుకు దారితీసిన ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాలన్నిటినీ రద్దు చేసింది. రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండగా.. మంత్రిమండలి నిర్ణయాన్ని విస్మరించి గవర్నర్ ప్రవర్తించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టింది. 2016 జనవరి 14న జరగాల్సిన శాసనసభ సమావేశాలను గత డిసెంబర్ 16-18 తేదీల్లో నిర్వహించేలా తేదీలను ముందుకు జరుపుతూ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా ఇచ్చిన సందేశాన్ని, ఆ సమావేశాలను నిర్వహించిన తీరును కూడా పక్కనపెట్టింది. 2015 డిసెంబర్ 15వ తేదీన 14 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేసింది. రాష్ట్ర శాసనసభలో డిసెంబర్ 15వ తేదీ నాడు నెలకొని ఉన్న పరిస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో జనవరిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించటంతో పదవీచ్యుతుడైన నబమ్ టుకీ జూలై 13న ఢిల్లీలోని అరుణాచల్ భవన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సూడాన్‌లోని భారతీయుల కోసం ‘సంకట్ మోచన్’
అంతర్యుద్ధంతో అనిశ్చితి నెలకొన్న దక్షిణ సూడాన్‌లోని భారతీయులను వెనక్కు రప్పించేందుకు విదేశాంగ శాఖ రెండు సీ-17 మిలిటరీ విమానాలను ఆ దేశ రాజధాని జుబాకు పంపనుంది. ఈ ఆపరేషన్‌కు ‘సంకట్ మోచన్’ అని పేరు పెట్టినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. 300 మంది భారతీయులను జుబా నుంచి వెనక్కు తీసుకొస్తారు. ఈ ఆపరేషన్‌ను విదేశాంగ శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ పర్యవేక్షిస్తారు.

నైపుణ్యాల వృద్ధికి రూ. 12 వేల కోట్లు
వచ్చే నాలుగేళ్లలో(2016-20) కోటిమంది నైపుణ్యాల అభివృద్ధికిగాను ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) పథకం కింద రూ. 12 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 13న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 60 లక్షల మంది యువతకు కొత్తగా శిక్షణ, 40 లక్షల మందికి కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నారు. బిహార్‌కు చెందిన రాజేంద్ర సెంట్రల్ అగ్రికల్చరల్ వర్సిటీ పేరు ‘డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ’గా మార్చే సవరణ బిల్లుకు, ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చి భారత్‌లో లాంగ్ టెర్మ్ వీసాపై ఉంటున్న మైనారిటీలకు పలు సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన మైనారిటీ వర్గాలు బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆస్తులు కొనడానికి, స్వయం ఉపాధికి వీలుగా స్థలం పొందడానికి, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు, ఆధార్ నంబర్‌లు పొందేందుకు అనుమతి ఇచ్చారు.

లక్ష కి.మీ పరిధిలో మొక్కలు నాటాలని కేంద్రం నిర్ణయం
జాతీయ రహదారుల వెంట లక్ష కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 1న ప్రకటించారు. నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్ కింద 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనతోపాటు రహదారుల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించనున్నారు. 2019 లోగా జాతీయ రహదారుల నిర్మాణానికి వెచ్చించనున్న రూ.5 లక్షల కోట్లలో.. ఐదువేల కోట్ల రూపాయలను పచ్చదనం కోసమే ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ.300 కోట్లు వెచ్చించి 1500 కి లోమీటర్ల పరిధిలో మొక్కలు నాటనున్నారు. 

ఏకీకృత రక్షణ సమాచార వ్యవస్థ ప్రారంభం
దేశంలో మొట్టమొదటి ఏకీకృత రక్షణ సమాచార వ్యవస్థను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి దళానికి ఆయా సమాచార, మేధో వ్యవస్థలు ఉన్నప్పటికీ అన్ని దళాలకు ఉపయోగపడేలా ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అత్యంత అధునాతన పద్ధతుల్లో పనిచేసే ఈ వ్యవస్థను రక్షణ సమాచార వ్యవస్థ (డీసీఎన్)గా వ్యవహరిస్తారు. ఇది లడఖ్, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపాల్లో సైతం సమర్థవంతంగా పనిచే స్తుంది. 

స్వలింగ సంపర్కులు మూడో లింగ పరిధిలోకి రారన్న సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కులను మూడో లింగ (థర్డ్ జెండర్) వ్యక్తులుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు జూన్ 30న స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు 2014లో (సుప్రీంకోర్టు) ఇచ్చిన తీర్పు ప్రకారం.. లింగమార్పిడి చేయించుకున్నవారు, హిజ్రాలు మాత్రమే మూడో లింగ వర్గానికి చెందుతారని, స్వలింగ సంపర్కులు ఆ పరిధిలోకి రారని పేర్కొంది. 

జీవ ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సు ప్రారంభం
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) దేశంలో తొలిసారి పూర్తిగా జీవ ఇంధనం (బయో డీజిల్)తో నడిచే బస్సును జూలై 4న బెంగళూరులో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన ఈ సూపర్ లగ్జరీ బస్సు బెంగళూరు-చెన్నైల మధ్య నడుస్తుంది.

దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు 
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అన్ని సర్వీసుల్లో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టు జూలై 4న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1995లో వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ) చట్టం చేసిన ఇన్నేళ్ల తర్వాత కూడా వారికి 3 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కల్పించడంపై కోర్టు విచారం వ్యక్తం చేసింది.

మోదీ మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు



భారీస్థాయి మార్పులు, చేర్పులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గానికి కొత్తరూపునిచ్చారు. ఐదుగురు సహాయమంత్రులను తొలగించి.. కొత్తగా 19 మందికి చోటు కల్పిస్తూ విస్తరించటంతో పాటు.. పలువురు మంత్రుల శాఖలనూ మార్చుతూ పునర్‌వ్యవస్థీకరించారు. జూలై 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది.

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు:
ప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల శాఖ (కేబినెట్ హోదా)
స్మృతి ఇరానీ - చేనేత, జౌళి శాఖ (మానవ వనరుల శాఖ మార్పు)
రవిశంకర్ ప్రసాద్ - ఐటీ శాఖకు అదనంగా న్యాయ శాఖ
సదానంద గౌడ - గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రి (న్యాయ శాఖ తొలగింపు)
అనంత కుమార్ - ఎరువులు, రసాయనాల శాఖకు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాలు
వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (పార్లమెంటరీ వ్యవహారాలు, గృహ నిర్మాణం తొలగింపు)
పీయూశ్ గోయల్ - విద్యుత్, పునరుత్పత్తి విద్యుత్ శాఖకు అదనంగా గనులు
చౌదరీ బీరేంద్ర సింగ్ - స్టీల్ (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం తొలగింపు)
హన్సరాజ్ ఆహిర్ - హోం శాఖ సహాయ మంత్రి (ఎరువులు, రసాయనాలు శాఖ తొలగింపు)
సంతోష్ కుమార్ గంగ్వార్ - ఆర్థిక శాఖ సహాయ మంత్రి (చేనేత, జౌళి శాఖ తొలగింపు)
మనోజ్ సిన్హా - రైల్వే సహాయ మంత్రి, కమ్యూనికేషన్స్ (అదనం)
సంజీవ్ కుమార్ - జలవనరులు, నదుల అనుసంధానం (సహాయ మంత్రి); (వ్యవసాయం తొలగింపు)
జయంత్ సిన్హా - పౌర విమానయాన (సహాయ మంత్రి) (ఆర్థిక సహాయ మంత్రి తొలగింపు)
హరిభాయ్ చౌదరి - సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (సహాయ మంత్రి) (హోం శాఖ తొలగింపు)
రావ్ ఇందర్‌జిత్ సింగ్ - ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన (సహాయ మంత్రి) (రక్షణ శాఖ తొలగింపు)
నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య (సహాయ మంత్రి), (గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖ తొలగింపు)

కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు:
అనిల్ మాధవ్ దవే - అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు (స్వతంత్ర)
విజయ్ గోయల్ - క్రీడలు, యువజన సర్వీసులు (స్వతంత్ర)
అర్జున్ రామ్ మేఘ్వాల్ - ఆర్థికర, కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఎస్‌ఎస్ అహ్లువాలియా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఫగన్ సింగ్ కులస్తే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
అనుప్రియ పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
రాజన్ గోహెన్ - రైల్వే శాఖ (సహాయ మంత్రి)
ఎంజే అక్బర్ - విదేశీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
కృష్ణపాల్ - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
రాందాస్ అఠావలే - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
జస్వంత్ సింహ బహదూర్ - గిరిజన వ్యవహారాలు
పీపీ చౌదరి - న్యాయ, ఐటీ శాఖలు (సహాయ మంత్రి)
డాక్టర్ సుభాష్ భామ్రే - రక్షణ (సహాయ మంత్రి)
సీఆర్ చౌదరి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ (సహాయ మంత్రి)
అజయ్ తాంతా - చేనేత, జౌళి (సహాయ మంత్రి)
మన్షుక్ మాండవీయ - రహదారులు, రవాణా, షిప్పింగ్, ఎరువులు-రసాయనాలు (సహాయ మంత్రి)
పర్షోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి)
డాక్టర్ మహేంద్రనాథ్ పాండే - మానవ వనరుల శాఖ (సహాయ మంత్రి)
రమేశ్ చందప్ప జిగజినాగి - తాగునీరు, పారిశుద్ధ్యం

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2016 జాతీయం
బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు
జైపూర్‌లో రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఆగస్టు 21న ముగిసింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధులు బ్రిక్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాలని అభిలషించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సదస్సు ముగింపులో ఆమోదించిన జైపూర్ డిక్లరేషన్.. ఆర్థిక వృద్ధి, సామాజిక సమ్మిళితం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాల పటిష్టతకు మహిళా పార్లమెంటేరియన్లు ప్రతినబూనాలని పేర్కొంది.

మయన్మార్‌లో పర్యటించిన సుష్మా స్వరాజ్
మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 22న ఆ దేశంలో పర్యటించారు. భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని ఆ దేశం తెలిపింది. పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు యు హిటిన్ క్యా, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూకీతో సుష్మ సమావేశమయ్యారు.

హాజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం
ప్రఖ్యాత హాజీ అలీ దర్గా (మజార్-ఎ-షరీఫ్)లోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ముంబై కోర్టు తీర్పునిచ్చింది. మహిళలను ప్రధాన దర్గాలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని 14, 15, 25వ అధికరణలను అతిక్రమించడమే అని కోర్టు తెలిపింది. 2012 నుంచి దర్గాలోకి మహిళలను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తే ఐదేళ్ల జైలు
ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించడం వంటి కీలక సిఫార్సులను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది.

ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫారసులను ఆమోదించారు. ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలనే నిబంధనలు చేర్చారు.

టాప్ ఫార్మా సంస్థల్లో... లుపిన్‌కు అగ్రస్థానం
దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలో నిలిచింది. సన్‌ఫార్మా, సిప్లా తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ (most reputed pharma brands in India 2016) పేరిట టీఆర్‌ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. 

ఈ జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 4వ స్థానంలో నిలిచింది. అరబిందో ఫార్మా 11వ స్థానం, నాట్కో ఫార్మా 21వ స్థానం దక్కించుకున్నాయి. సువెన్ లైఫ్ సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ లేబొరేటరీస్ (44), జెనోటెక్ లేబొరేటరీస్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ 52వ ర్యాంకుల్లో నిలిచాయి.

41 దేశీ సంస్థలు, 17 అంతర్జాతీయ సంస్థలు, మొత్తం 58 బ్రాండ్స్‌ను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. భారత్‌లో పేరొందిన విదేశీ బ్రాండ్స్ విషయానికొస్తే జీఎస్‌కే అగ్రస్థానంలోనూ, ఫైజర్, అబాట్ తదుపరి స్థానాల్లోనూ నిలిచాయి.

ఫిక్కీ మహిళల తొలి పారిశ్రామిక పార్కు
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద 50 ఎకరాల్లో దీనిని నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. దీని ద్వారా 3-4 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

భారతీయ విద్యార్థుల కోసం మిషన్ మిలియన్ బుక్స్
భారతీయ విద్యార్థుల కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా ‘మిషన్ మిలియన్ బుక్స్’ కార్యక్రమాన్ని చేపట్టింది. నిరూపయోగంగా ఉన్న పుస్తకాలను సేకరించి, అవసరమైన విద్యార్థులకు వాటిని అందజేసేందుకు ‘మిషన్ మిలియన్ బుక్స్’ కార్యక్రమాన్ని చేపట్టారు. సెప్టెంబరు 16 వరకు పుస్తకాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న 2,500 విద్యాసంస్థల్లో పంపిణీ చేస్తారు. దీనికోసం అలీబాబా కంపెనీ 50,000 పుస్తకాలను విరాళంగా అందిస్తోంది.

తొలి ‘బహిర్భూమి’ రహిత రాష్ట్రంగా కేరళ
బహిరంగ మలవిసర్జన (Open defecation) ను రూపుమాపిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవనుంది. 2016 నవంబర్‌లోగా సుమారు 941 పంచాయతీల్లో మొత్తం 1.90 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించనుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం కింద రూ. 308 కోట్లతో సుచిత్రా మిషన్ అనే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తుంది.

‘స్కార్పిన్’ జలాంతర్గాముల రహస్యాలు లీక్
ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నిత సమాచారం లీక్ అయింది. ఈ లీకేజీకి సంబంధించి 22,400 పేజీల సమాచారం వెల్లడయింది. ఈ జలాంతర్గాముల్లో సిబ్బంది ఏ పౌనఃపున్యం వద్ద నిఘా పెడతారు. వివిధ వేగాల వద్ద, వివిధ లోతుల్లో జలాంతర్గామి ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి శబ్దాలు వస్తాయి అనే విషయాలకు సంబంధించి సమస్త సమాచారం ఇందులో ఉందని అస్ట్రేలియాకు చెందిన ’ది ఆస్ట్రేలియన్’ పత్రిక వెల్లడించింది.

వాణిజ్య అద్దె గర్భంపై నిషేధం
పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానం దుర్వినియోగం అవుతుండటంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు ఆగస్టు 24న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు అర్హులు. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో భారత్ వాణిజ్య సరోగసీకి కేంద్రంగా మారింది. అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు.

బిల్లులో ముఖ్యాంశాలు
పెళ్లై ఐదేళ్లు దాటినా పిల్లలు పుట్టని జంటలు సరోగసీ ద్వారా సంతానం పొందవచ్చు.
భార్య వయసు 23-50 మధ్యలో, భర్త వయసు 26-55 మధ్యలో ఉండాలి.
దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ ఉండాలి.
సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం.
అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు ఉంటుంది.
గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ కచ్చితంగా వివాహిత అయి, అంతకుముందే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి.
గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ కచ్చితంగా దంపతుల్లో ఒకరికి దగ్గరి బంధువై ఉండాలి.
ఒకసారి మాత్రమే గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు అనుమతి ఇస్తారు.
సింగిల్ పేరెంట్స్, లివిన్ పార్ట్‌నర్స్ (పెళ్లికు ముందే కలిసుండే జంట), స్వలింగ సంపర్కులకు సరోగసీ ద్వారా పిల్లలు కనటంపై నిషేధం.
విదేశీయులు, ఎన్నారైలు, పీఐవో (భారత సంతతి)లపై కూడా నిషేధం.

తిరంగా యాత్ర థీమ్ సాంగ్ విడుదల
డెబ్బై ఏళ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరుతో రూపొందించిన ‘తిరంగా యాత్ర’ థీం సాంగ్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆగస్టు 12న ఢిల్లీలో విడుదల చేశారు. గజల్ శ్రీనివాస్ రచించిన ఈ పాటను నాలుగు భాషల్లో రూపొందించారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి ఈ వారోత్సవాలను ప్రారంభించారు.

70 స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు
దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆగస్టు 15న ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు మువ్వెన్నల పతాకాలను ఎగురవేశారు.ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాని వరకు అందరూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నారు. ప్రధాని మూడోసారి కూడా బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ లేకుండా ఓపెన్ ఎయిర్ పొడియంపై ఏకంగా 94 నిమిషాల పాటు ప్రసంగించడం ద్వారా రికార్డు సృష్టించారు.

ముగియనున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రస్థానం
కేంద్ర సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 14న ఆమోదం తెలిపారు. దీంతో 92 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి తెరపడనుంది. రైల్వే బడ్జెట్ విలీనానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక, రైల్వే శాఖ సీనియర్ అధికారులతో ఐదుగురు సభ్యుల కమిటీని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 31 నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఆర్థిక శాఖ ఆదేశించింది.

ప్రసూతి ప్రయోజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. ఈ బిల్లు చట్టమైతే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రపంచంలో నార్వే, కెనడాలు అత్యధికంగా 44 వారాల పాటు ప్రసూతి సెలవులను కల్పిస్తున్నాయి. ప్రస్తుత బిల్లుతో భారత్ అత్యధిక ప్రసూతి సెలవులు కల్పించే దేశాల వరుసలో మూడో స్థానంలో నిలుస్తుంది.
ఈ బిల్లు ప్రకారం 26 వారాలకు పూర్తి జీతంతో కూడిన సెలవును, కనీసం 10 మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలూ మంజూరు చేయాల్సి ఉంటుంది.

కొత్త ఐఐటీలకు రాష్ట్రపతి ఆమోదం
కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-2016కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆగస్టు 10న ఆమోదం తెలిపారు. జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా జమ్మూ (జమ్మూకశ్మీర్), తిరుపతి (ఏపీ), పాలక్కడ్ (కేరళ), గోవా, ధార్వాడ్ (కర్ణాటక), భిలాయ్(ఛత్తీస్‌గఢ్)లో ఐఐటీలను, ఏపీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్‌ఎం) కు ఐఐటీ హోదా కల్పించారు.

ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆగస్టు 12న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) రిజిస్ట్రేషన్‌కు పర్యావరణ పరిరక్షణ సెస్ కింద 1 శాతం ప్రత్యేక రుసుంను సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకు చెల్లించాలని తెలిపింది.

కాశ్మీర్‌పై అఖిలపక్ష భేటీ
జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఆగస్టు 12న అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీలో ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. బెలూచిస్తాన్; పాకిస్తాన్ ఆక్రమణలోని పీవోకేలో ఆ దేశం సాగిస్తున్న అకృత్యాలను బయటపెట్టి దౌత్య పరమైన ఎదురుదాడి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి విదేశాల్లో స్థిరపడ్డ ప్రజలతో సంబంధాలను ఏర్పరుచుకొని, అక్కడి స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాలన్నారు. రాజ్యాంగ పరిధిలో కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ భేటీలో కాంగ్రెస్, జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్న పీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

‘జీఎస్టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అస్సాం అసెంబ్లీ ఆగస్టు 12న ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇటీవల జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రాల ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ సవరణ బిల్లును అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వకర్మ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

జీఎస్‌టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లుకు ఉద్దేశించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 3న ఆమోదం తెలిపగా.. లోక్‌సభ ఆగస్టు 8న ఆమోదించింది. జీఎస్‌టీ చట్టం ఆచరణలోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుంది. జీఎస్‌టీ బిల్లును తొలుత 2015 మే 6న లోక్‌సభ ఆమోదించింది. అయితే తాజాగా రాజ్యసభ బిల్లులో చేసిన సవరణలకు లోక్‌సభ ఆగస్టు 8న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

మోటారు సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు కేంద్ర కేబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం అర్హత లేకుండా వాహనం నడిపితే కనీసం రూ.10 వేల జరిమానా చెల్లించాలి. ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.5000, తాగి వాహనం నడిపితే రూ.10 వేలు, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. హిట్ అండ్ రన్ కేసుల్లో రూ.2 లక్షల జరిమానాతోపాటు ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఢిల్లీపై పాలనాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కే
రాజ్యాంగాన్ని అనుసరించి ఢిల్లీ.. కేంద్ర పాలిత ప్రాంతం గానే కొనసాగుతుందని, లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్‌జీ) దానికి పాలనాధిపతి అని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 4న స్పష్టం చేసింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకు ఎల్‌జీ పనిచేయాల్సిన అవసరం లేదని, ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వ నోటిఫికేషన్ల జారీ అక్రమమని పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతం (ఎస్‌సీటీ) పాలనా వ్యవహారాల్లో అధికారాలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.

ఓబీసీ జాబితాలోకి మరికొన్ని
ఓబీసీ జాబితాలో కొత్తగా మరో 121 కులాలను చేర్చేందు కు కేంద్ర కేబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఏపీ ప్రతిపాదించిన 35 కులాలు, తెలంగాణ ప్రతిపాదించిన 86 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చనున్నారు. 

భారతీయ రైల్వే గీతం విడుదల
భారతీయ రైల్వే వ్యవస్థపై ప్రత్యేక గీతాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆగస్టు 5న విడుదల చేశారు. సంగీత దర్శకుడు శరవణ్ స్వరపరిచిన ఈ మూడు నిమిషాల గీతాన్ని ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తిలు ఆలపించారు.

తెలుగు ప్రాచీన భాషే: మద్రాస్ హైకోర్టు
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని మద్రాసు హైకోర్టు ఆగస్టు 8న తీర్పు చెప్పింది. తెలుగు ప్రాచీనమేనని స్పష్టం చేసింది. తెలుగుతోపాటు వివిధ ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనన్‌ను కొట్టివేసింది. తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా భాషలకు కేంద్రం కల్పించిన ప్రాచీన హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాకరణం, సాహిత్యపు విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు భాషా పండితుల అధ్యయనం ఆధారంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చింది. న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

70 సాల్ ఆజాదీ-జర యాద్ కరో కుర్బానీ
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ‘70 సాల్ ఆజాదీ-జర యాద్ కరో కుర్బానీ’(70 ఏళ్ల స్వాతంత్య్రం- నాటి త్యాగాలు స్మరించుకుందాం) కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 9న ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పురా జిల్లా భాబ్రాలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. 

కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం జాతికి అంకితం
రష్యా సాంకేతిక సహకారంతో భారత్.. తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) జాతికి అంకితమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలు సంయుక్తంగా ఆగస్టు 10న ప్లాంటులోని మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయ చెన్నైలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు విశేషాలు..
కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచెవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు కార్యాచరణ 1997లో మొదలైంది. భారత అణువిద్యుత్ కార్పొరేషన్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు కేఎన్‌పీపీని నిర్మించాయి. శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే వీవీఈఆర్ రకం అణు రియాక్టర్లను ఇందులో నెలకొల్పారు. మొదటి, రెండో యూనిట్లను రూ. 21 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగం తమిళనాడు, మిగతా భాగం కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలు పంచుకుంటాయి.

ప్రసూతి చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం
మహిళలకు ప్రసూతి సెలవులను ప్రస్తుతమున్న 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి ప్రయోజనాల చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రసూతి ప్రయోజనం (సవరణ) బిల్లు, 2016ను లోక్‌సభలో ప్రవేశపెట్టటం ద్వారా 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టానికి చేసిన సవరణలను.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. దీనిద్వారా మహిళలకు మాతృత్వ కాలంలో ఉద్యోగ భద్రత లభిస్తుంది. తమ శిశువుల పరిరక్షణ కోసం పూర్తి వేతనంపై సెలవు తీసుకునే అవకాశం లభిస్తుంది. పది మంది అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు గల అన్ని సంస్థలకూ ఈ చట్టం వర్తిస్తుంది. సంఘటిత రంగంలో గల 18 లక్షల మంది మహిళా ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. బిల్లును రాజ్యసభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది.

పశ్చిమ బెంగాల్ పేరు ‘బెంగాల్’గా మార్పు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు ‘బెంగాల్’గా మార్చాలన్న ప్రతిపాదనను ఆ రాష్ట్ర కేబినెట్ ఆగస్టు 2న ఆమోదించింది. ఆంగ్లంలో ‘వెస్ట్ బెంగాల్’ను ఇక నుంచి బెంగాల్ అని, బెంగాలీ భాషలో ‘బంగ్లా’ లేదా ‘బంగా’గా పిలవాలని నిర్ణయించారు. పేరు మార్పునకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ‘బెంగాల్’ పదం ఆ రాష్ట్ర సంస్కృతికి సూచికగా పరిగణిస్తుండటంతో పేరు మార్చాలనే వాదన ఉంది. ఇంగ్లీష్‌లో వెస్ట్ బెంగాల్ అని పిలుస్తుండటంతో కేంద్రం జరిపే ముఖ్యమంత్రుల భేటీల్లో ఆ రాష్ట్ర సీఎంకు అక్షరక్రమంలో చివర్లో మాట్లాడాల్సి రావడం మరో కారణం.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2016 జాతీయం
ధనిక నగరంగా ముంబై
దేశంలోని సంపన్న నగరాల్లో ఆర్థిక రాజధాని ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లున్న ఈ నగరం మొత్తం సంపద విలువ దాదాపు రూ.53.3 లక్షల కోట్లుగా (820 బిలియన్ డాలర్లు) ఉన్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నిలిచాయి.

ఢిల్లీలో 22,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉండగా, మొత్తం సంపద విలువ దాదాపు రూ.29.2 లక్షల కోట్లు (450 బిలియన్ డాలర్లు). బెంగళూరులో 7,500 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ నగరం మొత్తం సంపద దాదాపు రూ.20.8 లక్షల కోట్లుగా (320 బిలియన్ డాలర్లు) ఉంది. దేశంలో 4వ సంపన్న నగరంగా నిలిచిన హైదరాబాద్ 8,200 మంది మిలియనీర్లు, ఏడుగురు బిలియనీర్లతో సహా దాదాపు రూ.20.1 లక్షల కోట్ల (310 బిలియన్ డాలర్లు) సంపద కలిగి ఉంది.
ధనిక నగరాలు



మిలియనీర్లు

బిలియనీర్లు

సంపద విలువ (లక్షల కోట్లలో)

ముంబై

45,000

28

53.3

ఢిల్లీ

22,000

18

29.2

బెంగళూరు

7,500

8

20.8

హైదరాబాద్

8,200

7

20.1

కోల్‌కతా

8,600

10

-

పుణె

3,900

5

-

చెన్నై

6,200

4

-

గుర్గావ్

3,600

2

-


వ్యక్తుల అప్పుల్ని మినహాయించి, ప్రైవేటు ఆస్తులను లెక్కించారు. కనీసం రూ.6.5 కోట్ల (1 మిలియన్ డాలర్లు) విలువగల నికర ఆస్తులను కలిగిన వారిని మిలియనీర్లుగా, రూ.6,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) విలువైన నికర ఆస్తులను కలిగిన వారిని బిలియనీర్లుగా పేర్కొన్నారు. మొత్తంగా 2016 జూన్ నాటికి దేశంలో రూ.364 లక్షల కోట్ల (5.6 ట్రిలియన్ డాలర్లు) సంపద, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురు బిలియనీర్లు

దివీస్ ల్యాబ్స్

మురళి దివి

రెడ్డీస్ లాబొరేటరీస్

సతీష్‌రెడ్డి

అమరరాజా

గల్లా రామచంద్రనాయుడు

అపోలో హాస్పిటల్స్

ప్రతాప్ సి రెడ్డి

రామోజీ గ్రూపు

రామోజీరావు

అరబిందో ఫార్మా

నిత్యానందరెడ్డి

నవయుగ గ్రూపు

విశ్వేశ్వరరావు


పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైనికుల దాడి
భారత సైన్యం జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో గల ఉగ్రవాద ప్రయోగ స్థావరాల (లాంచ్ ప్యాడ్స్) పై మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో 8 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా 38 మంది ఉగ్రవాదులతో పాటు, ఇద్దరు పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు అంచనా. ముందస్తు వ్యూహంతో సెప్టెంబర్ 29 తెల్లవారుజామున సుశిక్షుతులైన 25 మంది కమాండోలు 200 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకెళ్లి దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావని కేవలం పరస్పర కాల్పులు అని పాక్ కొట్టిపారేసింది. 

సర్జికల్ స్ట్రైక్స్ అంటే నిర్దేశిత లక్ష్యాలపై చాలా చురుకుగా దాడి చేసి శత్రువును మట్టుబెట్టి భారీగా నష్టం కలిగించడం. అయితే సామాన్య ప్రజలకు, పరిసర ప్రాంతాలకు ఏ మాత్రం నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాన్ని, అక్కడున్న శత్రవులను మట్టుపెట్టడం ఈ దాడుల ఉద్దేశం.

2015, జూన్‌లో 70 మంది భారత కమాండోలు మయన్మార్ అడవుల్లో సర్జికల్ దాడులు నిర్వహించి 38 మంది నాగా మిలిటెంట్లను హతమార్చారు. 

2011లో పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌లో ఓ ఇంటిపై అమెరికా బలగాలు మెరుపుదాడి చేసి లాడెన్‌ను హతమార్చాయి. దీనికి నెప్ట్యూన్ స్పియర్ (ఆపరేషన్ జెరోనిమో) అని పేరుపెట్టారు.

ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌కు 39వ స్థానం
ప్రపంచ పోటీతత్వ సూచీ (Global Competitiveness Index)లో భారత్ 39వ స్థానంలో నిలిచింది. గతేడాది 55వ స్థానంలో ఉన్న భారత్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సెప్టెంబర్ 28న మొత్తం 138 దేశాలతో కూడిన గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో చైనా 28వ స్థానాన్ని దక్కించుకోగా తర్వాత స్థానాల్లో బ్రెజిల్(81), రష్యా (43), దక్షిణాఫ్రికా(47) నిలిచాయి. శ్రీలంక 71వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది.

సూచీలో మొదటి 10 దేశాలు

1

స్విట్జర్లాండ్

2

సింగపూర్

3

అమెరికా

4

నెదర్లాండ్స్

5

జర్మనీ

6

స్వీడన్

7

యూకే

8

జపాన్

9

హాంకాంగ్

10

ఫిన్‌లాండ్


20-20 నుంచి భారత్ స్టేజ్-6 ప్రమాణాలు
2020, ఏప్రిల్ నుంచి భారత్ స్టేజ్ (బి.ఎస్)-6 ఉద్గారాల ప్రమాణాలను అమలుచేయాలని కేంద్రం సెప్టెంబర్ 19న నోటిఫై చేసింది. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ఈ ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో బి.యస్-4 ప్రమాణాలను పాటిస్తున్నారు. 

సీఎస్‌ఐఆర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 26న జరిగిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ప్లాటినం జూబ్లీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. క్షీణిస్తోన్న సాగుభూమి, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని పంట దిగుబడి పెంచేందుకు శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనాలని శాస్త్రవేత్తలకు సూచించారు. విజ్ఞానంతో సామాన్య ప్రజలను అనుసంధానం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.


భారత్-ఫ్రాన్స్ మధ్య ‘రఫెల్’ ఒప్పందం
గగనతలం నుంచి గగనతలం, భూ ఉపరితలంపై లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులతో పాటు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు కలిగిన 36 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు మనోహర్ పరీకర్, జీన్ ఇవెస్ లెడ్రియన్‌లు సెప్టెంబర్ 23న సంతకాలు చేశారు. దీని ప్రకారం 36 నెలల్లో తొలి విమానాన్ని, 67 నెలల్లోపు మొత్తం విమానాల్ని అందచేయాలి. రూ.25,588 కోట్లు విమానాల కొనుగోలుకు కాగా మిగిలిన మొత్తం భారత్ సూచించిన మార్పులు, విమానాల నిర్వహణకు అవుతుంది.

యూపీఏ హయాంలో 126 రఫెల్ విమానాల కోసం ప్రతిపాదించిన రూ.1.34 లక్షల కోట్ల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసి తాజా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రఫెల్ విమానాల ప్రత్యేకత
ప్రాధమిక విధి:అన్ని విధాలుగా ఉపయోగపడే యుద్ధ విమానం
తయారీ సంస్థ: డసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్
సీట్లు: ఒకటి లేదా రెండు
టేకాఫ్ గరిష్ట బరువు: 24,500 కిలోలు
గరిష్ట వేగం: ఎత్తై ప్రదేశాల్లో గంటకు 1,912 కి.మి.
తక్కువ ఎత్తులో: గంటకు 1,390 కి.మి.

స్వాతంత్య్ర సమర యోధుల పింఛను 20 శాతం పెంపు
సాతంత్య్ర సమరయోధుల నెలవారీ పింఛన్‌ను 20 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 21న నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు అన్ని విభాగాల స్వాతంత్య్ర సమరయోధులు, వారి జీవిత భాగస్వాములు, సమరయోధులపై ఆధారపడ్డవారికి వర్తిస్తుంది. తాజా పెంపుతో అండమాన్ మాజీ రాజకీయ ఖైదీలు, వారి జీవిత భాగస్వాములకు నెలకు రూ.30 వేలు, బ్రిటిష్ ఇండియా వెలుపల ఇబ్బందులు పడిన వారికి నెలకు రూ.28 వేలు, భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) సభ్యులు, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు నెలకు రూ.26 వేలు పింఛనుగా లభిస్తుంది. ఈ పెంపు 2016, ఆగస్టు 15 నుంచి వర్తిస్తుంది.

వ్యవసాయ ఎగుమతుల రాయితీలను ఎత్తేసిన బ్రిక్స్
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం వ్యవసాయ ఎగుమతుల రాయితీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2015, డిసెంబర్‌లో నైరోబిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మంత్రుల స్థాయి సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రులు ఉమ్మడి ప్రకటన చేశారు.

బహిరంగ మలవిసర్జన లేని నగరంగా మైసూర్
బహిరంగ మలవిసర్జన లేని నగరంగా 10 లక్షల జనాభా కలిగిన మైసూర్ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 73 నగరాల్లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వేలో మైసూర్ అగ్రస్థానంలో నిలిచింది. మైసూర్‌లో 99 శాతం మంది ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నగరంలోని 28 మురికివాడల్లో సైతం ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది.

7 రేస్ కోర్స్ రోడ్ పేరు మార్పు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని నివాసంతో పాటు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారుల నివాసాలు ఉన్న 7 రేస్ కోర్స్ రోడ్ పేరు ‘7 లోక్ కళ్యాణ్ మార్గ్’గా మారనుంది. ఈ మేరకు బ్రిటిష్ కాలం నాటి రోడ్డు పేరును మార్చుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే సిక్కు సంస్థల విజ్ఞప్తిపై పార్లమెంటు సముదాయానికి ఆనుకుని ఉన్న గురుద్వారా రకాబంజ్ కూడలి పేరును గురుగోవింద్‌సింగ్ చౌక్‌గా మార్చాలనీ నిర్ణయించారు. గత ఏడాది ఢిల్లీలో ఔరంగజేబ్ రోడ్డు పేరు మార్చి, దానికి మాజీ రాష్ట్రపతి కలాం పేరు పెట్టారు.

ఇండస్ వాటర్ ట్రీటీపై సమీక్ష
56 ఏళ్ల నాటి భారత్-పాక్ సింధు జలాల ఒప్పందం (‘ఇండస్ వాటర్స్ ట్రీటీ)పై సెప్టెంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవంటూ వ్యాఖ్యానించిన మోదీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయి నీటిని వినియోగించడం వంటి అంశాలపై చర్చించారు. నదీ జలాల ఒప్పందంపై పూర్తి వివరాల అధ్యయనానికి అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేస్తారు. తూర్పుకు ప్రవహించే నదుల్లో(సింధు, చినాబ్, జీలం) భారత్ హక్కులపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఎదురుదాడిని ఉధృతం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. 

ఒప్పందం విశేషాలు
1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు సింధు(ఇండస్) జలాల ఒప్పందంపై సంతకం చేశారు. దాని ప్రకారం భారత్.. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని, పాక్ సింధు, చీనాబ్, జీలంల నీటిని వాడుకోవాలి. 9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని భారత్ వాడుకోవచ్చు. దీన్ని మరో 4.2 లక్షల ఎకరాలకు విస్తరించవచ్చు. భారత్ 8 లక్షల ఎకరాలకు సరిపడా నీటినే వాడుతోంది. అలాగే భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 3,034 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోంది.

స్వచ్ఛభారత్, గోగ్రీన్ కోసం సైకిల్ యాత్ర
‘స్వచ్ఛభారత్’, ‘గో గ్రీన్’ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్రను చేపట్టింది. మొత్తం నాలుగు జట్లు (ఒక్కో జట్టులో 20 మంది సభ్యులుంటారు) దేశంలోని నాలుగు సరిహద్దు ప్రాంతాల నుంచి యాత్ర మొదలు పెట్టి ‘ఎయిర్ ఫోర్స్ డే’ అయిన అక్టోబర్ 8న దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంటాయి. ఉత్తర దిశ నుంచి వచ్చే జట్టు కారాకొరమ్ నుంచి, తూర్పు జట్టు షిల్లాంగ్ నుంచి, దక్షిణ దిశ నుంచి వచ్చే జట్టు తిరువనంతపురం, పశ్చిమ దిశ నుంచి వచ్చే జట్టు నాలియా నుంచి యాత్రను ప్రారంభించాయి. ఢిల్లీలోని ఇండియా గేట్ చేరుకునే సరికి ప్రతి జట్టు సుమారు 2,600 కి.మీ దూరం యాత్రను పూర్తిచేస్తుంది.

స్వచ్ఛభారత్ మస్కట్‌గా 105 ఏళ్ల మహిళ
 స్వచ్ఛభారత్ అభియాన్ చిహ్నం (మస్కట్)గా 105 ఏళ్ల వయసున్న ఛత్తీస్‌గఢ్ మహిళను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ధంతరి జిల్లాలో నివసించే కున్వర్ బాయి తన వద్ద ఉన్న 10 మేకలను అమ్మి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించింది. దీంతో స్వచ్ఛతా దివస్ సందర్భంగా సెప్టెంబర్ 17న ఢిల్లీలో ఆమెను సత్కరించారు.

ఆసియాలో ప్రసిద్ధిగాంచిన మ్యూజియం హాల్ ఆఫ్ ఫేమ్
జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లోగల ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియం ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన మ్యూజియాల్లో మొదటిస్థానంలో నిలిచింది. దీంతోపాటు ఉదయ్‌పూర్‌లోని బాగోర్ కీ హవేలీ, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియాల్ హాల్, హైదరాబాద్‌లోని సాలార్‌సంగ్ మ్యూజియం, జైసల్మేర్‌లోని జైసల్మేర్ వార్ మ్యూజియం వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారుు. ట్రిప్ అడ్వైజర్ సంస్థ రూపొందించిన ఆసియాలోని 25 ప్రముఖ మ్యూజియంల జాబితా ఈ వివరాలు వెల్లడించింది. అయితే ప్రపంచంలోని తొలి 25 ప్రఖ్యాతి గాంచిన మ్యూజియంలలో భారత్ నుంచి ఒక్క మ్యూజియం కూడా చోటు దక్కించుకోలేదు.

కాంగ్రెస్‌ను వీడిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం
అరుణాచల్ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూ సహా 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 16న ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో విలీనమయ్యారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు.

బలూచ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఏఐఆర్
పాకిస్తాన్‌తోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బలూచ్ ప్రజల కోసం ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సెప్టెంబర్ 16న మల్టీ మీడియా, మొబైల్ అప్లికేషన్ సేవలను ప్రారంభించింది. సరిహద్దు ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం ఈ సేవలను ప్రారంభించినట్లు ప్రసార భారతి చైర్మన్ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు.

యూరి ఉగ్ర దాడిలో 20 మంది సైనికులు మృతి
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరి సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి, సైనిక స్థావరంలోకి ప్రవేశించిన ముష్కరులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేయడంతో సైనిక గుడారాలకు మంటలంటుకున్నాయి. మంటల వల్ల 13 మంది సైనికులు మరణించారు. సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్మూ, కశ్మీర్‌లో 1999 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాల్లో భద్రతాదళాలపై మొత్తం 19 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 130 మందికి పైగా సిబ్బంది మరణించారు.

అరుదైన కళాకృతులను అప్పగించిన ఆస్ట్రేలియా
స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అతి పురాతనమైన మూడు విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ 19న భారత్‌కు అందించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ విగ్రహాలను కాన్‌బెర్రాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎన్‌జీఏ) వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ దేశ కళల శాఖమంత్రి మిచ్ ఫైఫీల్డ్డ్.. భారత పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు అందించారు. వీటిలో మూడో శతాబ్దానికి చెందిన రాతితో చేసిన విగ్రహం, బుద్ధుని విగ్రహం, 900 ఏళ్ల కిందటి ప్రత్యంగిరాదేవి విగ్రహం ఉన్నాయి.

స్మార్ట్ సిటీల మిషన్‌కు తిరుపతి ఎంపిక
స్మార్ట్ సిటీల మిషన్ పథకంలో భాగంగా సెప్టెంబర్ 20న విడుదల చేసిన మూడో విడత జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి నగరం చోటు దక్కించుకుంది. ఈ విడతలో 63 నగరాలు పోటీ పడగా 27 నగరాలు ఎంపికయ్యాయి. అమృత్‌సర్ మొదటి స్థానంలో నిలిచింది. గతంలో రెండో విడతగా విడుదల చేసిన 13 నగరాల జాబితాలో తెలంగాణ నుంచి వరంగల్ చోటు దక్కింది.

మూడో విడత నగరాల జాబితా

1

Amritsar

Punjab

2

Kalyan-Dombivili

Maharashtra

3

Ujjain

Madhya Pradesh

4

Tirupati

Andhra Pradesh

5

Nagpur

Maharashtra

6

Managaluru

Karnataka

7

Vellore

Tamil Nadu

8

Thane

Maharashtra

9

Gwalior

MP

10

Agra

Uttar Pradesh

11

Nashik

Maharashtra

12

Rourkela

Odisha

13

Kanpur

UP

14

Madurai

Tamil Nadu

15

Tumakuru

Karnataka

16

Kota

Rajasthan

17

Thanjavur

Tamil Nadu

18

Namchi

Sikkim

19

Jalandhar

Punjab

20

Shivamogga

Karnataka

21

Salem

Tamil Nadu

22

Ajmer

Rajasthan

23

Varanasi

UP

24

Kohima

Nagaland

25

Hubbali-Dharwad

Karnataka

26

Aurangabad

Maharashtra

27

Vadodara

Gujarat


కేంద్రం, నాబార్డ్, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియ తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడుకు కావేరి జలాలు విడుదల
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 6న కర్నాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసింది. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ (కేఆర్‌ఎస్), హారంగి, కబిని, హేమావతి డ్యామ్‌ల నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున పది రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేస్తోంది.

గ్రామీణ పారిశుధ్యంలో అగ్ర భాగాన సిక్కిం 
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే లో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8నఎన్‌ఎస్‌ఎస్‌వోసర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ 14వ స్థానంలో, ఏపీ 16వ, స్థానంలో, తెలంగాణ 22వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పారిశుధ్య పరిస్థితిపై సేకరించిన వివరాలతో క్రోడీకరించిన నివేదికలోనూ సిక్కిం (99.1 శాతం) అగ్రస్థానంలో నిలవగా, బిహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో మరుగుదొడ్లు కలిగి వాడుతున్న వారి శాతం 42.13గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ.. నివేదికలో పేర్కొంది.

యూపీఏ హయాంలో ‘ఎంబ్రాయర్’ కుంభకోణం
యూపీఏ హయాంలో 2008లో బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్, డీఆర్డీవో మధ్య మూడు విమానాల కొనుగోలుకు కుదిరిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. మొత్తం రూ. 14 వేల కోట్ల (208 మిలియన్ డాలర్లు)తో కుదిరిన ఈ ఒప్పందంలో ఎంబ్రాయర్ సంస్థ ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు తమ దగ్గర అధారాలున్నాయని తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు కూడా ఆయా ప్రభుత్వాలకు ఎంబ్రాయర్ ముడుపులు ఇచ్చినట్లు తెలిపింది. యూపీఏ పాలనలో అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో కూడా అక్రమాలు జరగడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.

ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని ప్రకటించిన సిద్ధూ
ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో రాజకీయేతర పార్టీని ప్రకటించారు. చండీగఢ్‌లో సెప్టెంబర్ 8న కొత్త పార్టీని ప్రకటించిన సిద్ధూ 15-20 రోజుల్లో తన పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నారు.

తొలి ద్వీప ప్రాంత జిల్లాగా మజులీ 
దేశంలో తొలి ద్వీప ప్రాంత జిల్లాగా అసోంలోని మజులీ ఏర్పడింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సెప్టెంబర్ 8న ప్రకటన చేశారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులీ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ. మజులీ అసోంలో 35వ జిల్లా.

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం
కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి హింసాత్మకంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లోను పౌరులు, ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బెంగళూరులో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారడంతో వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

కశ్మీర్‌లో ఆపరేషన్ ‘కామ్ డౌన్’
హింస, ఉగ్రవాదంతో కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించింది. ఈ మేరకు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4,000 అదనపు జవాన్లను మొహరించారు. అలర్ల నేపథ్యంలో 200 ఏళ్ల తరువాత జమా మసీద్ మూతపడింది. 1821 తరువాత ఇక్కడ బక్రీద్ ప్రార్థనలు జరగకపోవడం ఇదే తొలిసారి.

సింగూరు భూమి రైతులకిచ్చేయండి: సుప్రీంకోర్టు
 పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు భూసేకరణను సుప్రీంకోర్టు ఆగస్టు 31న కొట్టేసింది. మొత్తం 1053 ఎకరాల భూమిపై హక్కులను 12 వారాల్లోగా రైతులకు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి తీసుకోరాదని, పదేళ్లపాటు రైతులు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతులకే చెందుతుందని తీర్పు చెప్పింది. టాటా సంస్థ నానో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో భూసేకరణ చేసింది. 

స్వచ్ఛభారత్‌పై కామిక్ బుక్
దేశాన్ని స్వచ్ఛంగా రూపొందించాలని ప్రారంభించిన ‘స్వచ్ఛభారత్ మిషన్’పై త్వరలో కామిక్ పుస్తకం విడుదల కానుంది. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో పాటు పిల్లల్లోనూ అవగాహన కల్పించేందుకు కామిక్ పుస్తకాన్ని తెస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ అమర్ చిత్ర కథాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

తృణమూల్ కాంగ్రెస్‌కు జాతీయ పార్టీ హోదా
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను సెప్టెంబర్ 2న కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. దీంతో జాతీయ హోదా కలిగిన ఏడో పార్టీగా ఆ పార్టీ గుర్తింపు పొందింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలు జాతీయ పార్టీ హోదాను కలిగున్నాయి.

క్యూస్ ర్యాంకింగ్‌లో ఐఐఎస్‌సీకు 152వ స్థానం
సెప్టెంబర్ 6న విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో భారత్‌కు చెందిన ఐఐఎస్‌సీ 152 స్థానంలో నిలిచింది. గత ఏడాది జాబితాలో దీనికి 147వ స్థానం లభించగా అది తాజాగా 152 కి పడిపోయింది. అలాగే తొలి 400 ర్యాంకుల్లో స్థానం దక్కిన ఇతర భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ(185), బాంబే ఐఐటీ(219), మద్రాస్ ఐఐటీ(249), కాన్పూర్ ఐఐటీ (302), ఖరగ్‌పూర్ ఐఐటీ (313), రూర్కీ ఐఐటీ(399) ఉన్నాయి.

అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (2), హార్వర్డ్ యూనివర్సిటీ(3), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(4) తదితరాలున్నాయి.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2016 జాతీయం
ఒకే ర్యాంకు - ఒకే పింఛన్‌పై కమిటీ నివేదిక
ఒకే ర్యాంకు-ఒకే పింఛన్‌పై పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏక సభ్య న్యాయ సంఘం తన నివేదికను అక్టోబర్ 26న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు అందజేసింది. ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానం అమల్లో ఏవైనా వైరుద్ధ్యాలు ఉంటే గుర్తించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. కమిటీ దేశంలోని 20 నగరాలు, పట్టణాల్లో పర్యటించి మాజీ సైనికుల అభిప్రాయాలతోపాటు, వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 704 వినతి పత్రాలను స్వీకరించింది. వీటిన్నింటినీ క్రోడీకరించి నివేదికను రూపొందించింది.

జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఆయుర్దాయం
దేశంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ నిలిచింది. 2010 వరకు ఈ జాబితాలో కేరళ అగ్రస్థానంలో కొనసాగింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 నుంచి 2014 వరకు పలు దఫాలుగా జరిపిన అధ్యయనాల తర్వాత అక్టోబర్ మూడో వారంలో (గత నెల) ఆర్‌జీఐ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2010 వరకు అన్ని వయసు వర్గాల్లో కేరళలో ఆయుర్దాయం ఎక్కువగా ఉంది.

అంతర్ రాష్ట్ర మండలి పునర్వ్యవస్థీకరణ
అంతర్ రాష్ట్ర మండలిని కేంద్ర హోంశాఖ అక్టోబర్ 28న పునర్వ్యవస్థీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో సభ్యులుగా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాధిపతులతోపాటు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్‌లు నియమితులయ్యారు.

భోపాల్‌లో అమర వీరుల స్మారక కేంద్రం
యుద్ధంలో అమరవీరులైన సైనికుల స్మృత్యర్థం దేశంలో తొలిసారిగా భోపాల్‌లో నిర్మించిన అమర వీరుల (శౌర్య) స్మారక కేంద్రాన్ని అక్టోబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 12.67 ఎకరాల్లో రూ.41 కోట్ల వ్యయంతో శౌర్య స్మారక కేంద్రాన్ని నిర్మించారు. సైనికులు కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని మోడీ పేర్కొన్నారు. సైనికుల త్యాగాల వల్లే పౌరులు సుఖంగా జీవించగలుగుతున్నారని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకం అమలుతో మాజీ సైనికులకు లబ్ధి చేకూర్చామన్నారు.

‘సరస్వతి’ నది ఉనికిని తేల్చిన వాల్దియా కమిటీ
పురాణాలలో ఉన్నట్లుగా భావించిన సరస్వతి నది ఒకప్పుడు భూమిపై నిజంగానే ప్రవహించిందని భూగర్భ శాస్త్రజ్ఞుడు కేఎస్ వాల్దియా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది. సరస్వతి హిమాలయాల్లో పుట్టి 4 వేల కి.మీ. ప్రవహించి గుజరాత్‌లోని గల్ఫ్ వద్ద అరేబియా సముద్రంలో కలిసేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సముద్రంలోకి చేరేముందు పాకిస్తాన్‌లోని రాన్ ఆఫ్ కచ్ గుండా ప్రవహించేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు.

హరప్పా నాగరికత కాలంలో పాలియోచానెల్ (నది ఒకప్పుడు ప్రవహించి, తన దిశను మార్చుకున్నపుడు వట్టిగా మిగిలిపోయిన ప్రాంతాలు) తీరంలో 1,700 చిన్న, పెద్ద గ్రామాలు ఉండేవని అవి 5,500 సంవత్సరాలపాటు ఉనికిలో ఉన్నాయి కాబట్టి వారికి జీవనాధారమైన నదిని కనుక్కోవడానికి చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని వాల్దియా తెలిపారు.

కేరళ ద్వీపానికి నాట్ జియో పత్రికలో చోటు
ప్రకృతి రమణీయతకు మారుపేరైన కేరళలోని సుందర ద్వీపం ‘కక్కతురుతు’ ప్రసిద్ధ వైజ్ఞానిక పత్రిక నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్‌లో చోటు సంపాదించుకుంది. అరౌండ్ ది వరల్డ్ ఇన్ 24 అవర్స్ పేరుతో ప్రచురించిన కథనంలో ఈ ద్వీపం గురించి వివరించారు. చుట్టూ విశాలసముద్రం, కొబ్బరి తోటలు, పచ్చని కొండలతో ఈ ద్వీపం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది.

లూధియానాలో ఎస్సీ, ఎస్టీ హబ్
‘ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో లూధియానాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ హబ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 18న ప్రారంభించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖకు అనుబంధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ను 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. మార్కెట్ వెసులుబాటు, సౌకర్యం, పర్యవేక్షణ, సామర్థ్యం పెంచడం, వివిధ పథకాల కింద రుణాలు ఇవ్వడం, పరిశ్రమ వర్గాలు అనుసరిస్తున్న ఉత్తమమైన విధానాలు అనుసరించడం వంటి పనుల్ని ఈ హబ్ నిర్వర్తిస్తుంది.

ఇరోం షర్మిలను నిర్దోషిగా ప్రకటించిన మణిపూర్ కోర్టు
మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోం షర్మిల (44)ను నిర్దోషిగా పరిగణిస్తూ మణిపూర్ జిల్లా కోర్టు అక్టోబర్ 5న తీర్పునిచ్చింది. ఆమె మణిపూర్‌లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరసన దీక్ష కొనసాగించారు. కోర్టు తీర్పుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు తనకు మార్గం సుగమం అయిందని షర్మిల పేర్కొన్నారు. 

‘ఎయిడ్స్’ రోగులపై వివక్షకు రెండేళ్ల జైలు
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ద్వారా వ్యాధిగ్రస్తుల హక్కులను కాపాడటంతోపాటు వారి ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని ఏర్పాటు చేయాలి.

కావేరి జలాల విడుదలకు అంగీకరించిన కర్ణాటక
తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం కుదరదని, ఇవ్వాల్సి వచ్చినా డిసెంబర్‌లో ఇస్తామని కర్ణాటక సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని చెప్పడంతోపాటు కేంద్రాన్ని కావేరి జలాలపై ప్రత్యేక నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నే పథ్యంలో అక్టోబర్ 3న సమావేశమైన కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసేందుకు తీర్మానం చేసింది.

చెంగల్పట్టు వద్ద తొలి మెడికల్ పార్క్
చెన్నైలోని చెంగల్పట్టు వద్ద దేశంలోనే మొదటి మెడికల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 5న అనుమతి మంజూరు చేసింది. తక్కువ ధరలకే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఇక్కడ తయారుచేస్తారు. దీనిని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ సంస్థ 300 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది.

భారత ఆవాస ప్రాంత జాతీయ నివేదిక - 3 ఆవిష్కరణ
ప్రపంచ ఆవాస ప్రాంత దినోత్సవం (వరల్డ్ హ్యాబిటాట్ డే) సందర్భంగా భారత ఆవాస ప్రాంత జాతీయ నివేదిక - 3ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అక్టోబర్ 3న విడుదల చేశారు. ఈ నివేదికలో 20 ఏళ్ల లక్ష్యాలను పేర్కొన్నారు. ఇంధనం, నీటి వినియోగాన్ని సగానికి తగ్గించడం, పునరుత్పాదక విద్యుత్, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నెలలో ఈక్వెడార్‌లోని క్వైటోలో పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్వర, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంతోపాటు, వాతావరణ మార్పులకు అనుకూలమైన పట్టణాభివృద్ధి వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సత్వర పట్టణాభివృద్ధి కారణంగా కలిగే ఫలితాలను పొందుతూనే, ఇవి నిరంతరం ఉండేలా చూడటం సవాలులాంటిదని అన్నారు. ఇంతవరకు కనీస వసతుల కల్పనపైనే దృష్టి సారించగా, ఇకపై పట్టణీకరణకు భారీ ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు.

మహిళా వ్యాపారవేత్తల్లో తమిళనాడు టాప్
అత్యధికంగా మహిళా వ్యాపారవేత్తలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ఉన్నట్లు ‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. 73.4 అక్షరాస్యత కలిగిన తమిళనాడులో పది లక్షల వ్యాపార సంస్థలు అంటే 13.5 శాతం మహిళలే నిర్వహిస్తున్నారు. 92 శాతం అక్షరాస్యత కలిగిన కేరళలో 11.3 శాతం, 59.1 శాతం అక్షరాస్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 శాతం, 70.5 అక్షరాస్యత కలిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 10.3 శాతం, 75.9 శాతం అక్షరాస్యత కలిగిన మహారాష్ట్రలో 8.2 శాతం వ్యాపార సంస్థలను మహిళలు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సరాసరి అక్షరాస్యత 65.5 శాతం ఉండగా, మహిళల కార్మిక శక్తి మాత్రం సరాసరి 25.5 శాతం మాత్రమే ఉంది. మహిళల కార్మిక శక్తి నేపాల్‌లో 79.9 శాతం ఉండగా, బంగ్లాదేశ్‌లో 57.4 శాతం, శ్రీలంకలో 35.1 శాతం ఉంది.

శునకాలు, గుర్రాలకు సైనిక పతకాలు
సైనికులకు శౌర్య పతకాలు ఇచ్చినట్టు తొలిసారిగా కుక్కలు, గుర్రాలకు కూడా పతకాలు ఇవ్వనున్నట్లు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం తెలిపింది. తన 55వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుర్రాలకు ‘యానిమల్ ట్రాన్స్‌పోర్ట్’, కుక్కలకు ‘కే9 (కెనైన్)’ అనే పతకాలను ప్రవేశపెడుతున్నట్లు ఐటీబీపీ పేర్కొంది. అత్యంత ప్రతికూల వాతావరణంలో సైన్యంతో ఉండి సేవలు అందించిన ‘థండర్ బోల్ట్’ అనే గుర్రం, ‘సోఫియా’ అనే కుక్క ఈ తొలి అవార్డులను నోయిడాలో అందుకోనున్నాయి.

పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించిన భారత్
పారిస్ ఒప్పందాన్ని భారత్ అక్టోబర్ 2న ధ్రువీకరించింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన పత్రాన్ని ఐరాసలోని భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితి ఒప్పందాల విభాగాధిపతి శాంటియాగో విల్లాల్పండోకు అందించారు.

మద్యనిషేధం కోసం బిహార్ కొత్త చట్టం
మద్యనిషేధం కోసం బిహార్ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పిన 24 గంటల్లోనే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది అక్టోబర్ 2 నుంచి అమల్లో ఉంటుంది. ‘బిహార్ ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్ చట్టం 2016’ పేరుతో తెచ్చిన ఈ చట్టం ప్రకారం బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం ఉంటుంది. ఇంట్లో మద్యం దాచుకున్నట్టు తేలితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి భారీ జరిమానా విధిస్తారు. పోలిస్టేషన్లలో బెయిల్ పొందడం కుదరదు.

ప్రశాంత్ భూషణ్ కొత్త పార్టీ ‘స్వరాజ్ ఇండియా’
 ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు అక్టోబర్ 2న ‘స్వరాజ్ ఇండియా’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీకి యోగేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2016 జాతీయం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల సదస్సు
జాతీయ స్థాయి డీజీపీ, ఐజీల వార్షిక సదస్సు హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నవంబర్ 26న జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీసులు మరింత చురుగ్గా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ శిక్షణలో భాగంగానే జరగాలన్నారు. మనస్తత్వం, మనోవిజ్ఞాన నైపుణ్యాలు శిక్షణలో కీలకాంశాలుగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని Indian Police at Your Call అనే యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగం అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు.

భారత్‌లో తొలిసారిగా రోబో ఒలింపియాడ్ పోటీలు
ఢిల్లీకి సమీపంలోగల నోయిడాలో 13వ వరల్డ్ రోబో ఒలింపియాడ్ పోటీలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. దైనందిన జీవితాల్లో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు రోబోటిక్ పరిష్కారాలను సూచించడం, ఈ-వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. 54 దేశాల నుంచి 2000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం (ఎన్‌సీఎస్‌ఎం), ఐఎస్‌ఎఫ్‌ల ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంది.

ఫ్రీ టాక్‌టైమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన గోవా
దేశంలో తొలిసారిగా ‘గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్’ పేరుతో 100 నిమిషాల టాక్‌టైమ్, 1 జీబీ డేటా (2 ఎంబీపీఎస్)ను ఉచితంగా అందించే పథకాన్ని గోవా ప్రభుత్వం నవంబర్ 25న ప్రకటించింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత (16- 30 ఏళ్ల మధ్య)ను ఆకర్షించేందుకు గోవాలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 1.25 లక్షల మంది లబ్ధి పొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు.

టాప్ 100 వర్శిటీల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చోటు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 100 యూనివర్సిటీల్లో భారత్ నుంచి ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చోటు దక్కింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, విద్యా ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని క్యూఎస్ ఎంప్లాయబిలిటీ అనే సంస్థ ప్రపంచంలోని 200 విద్యాసంస్థల్లో సర్వే నిర్వహించి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ఐఐటీ ఖరగ్‌పూర్‌కి 71-80వ స్థానం దక్కింది. ఈ జాబితాలో ఐఐటీ బాంబేకు కూడా చోటు దక్కింది. దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న విద్యాసంస్థగా ఐఐటీ ఖరగ్‌పూర్ మొదటిస్థానంలో నిలిచింది. కాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శిన్వా యూనివర్సిటీలు జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

గోవాలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) గోవాలో నవంబర్ 20న ప్రారంభమైంది. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 88 దేశాలకు చెందిన 194 చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత చిత్రం ఆఫ్టర్ ఇమేజ్ ప్రదర్శనతో చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ చిత్రోత్సవం నవంబర్ 28 వరకు జరుగుతుంది. 
పురస్కారాలు ప్రదానం: ఈ వేడుకలో దక్షిణ కొరియా దిగ్గజ దర్శకుడు ఇమ్ క్వొన్ టిక్‌కు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శత వసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

నక్సల్స్‌పై పోరుకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమాండోలు
జార్ఖండ్‌లో నక్సల్స్‌పై పోరాడేందుకు తొలిసారిగా మహిళా కమాండోలను సీఆర్‌పీఎఫ్ వినియోగిస్తోంది. 135 మంది మహిళా కమాండోలు రాంచీ సమీపంలోని ఖూంటి ప్రాంతంలో జరుగుతున్న నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. 

వాయు కాలుష్యంతో భారత్‌లో రోజుకు 3,283 మంది మృతి
వాయు కాలుష్యం వల్ల 2015లో భారత్‌లో రోజుకు 3,283 మంది మరణించినట్లు గ్రీన్ పీస్ సంస్థ నవంబర్ 16న ప్రకటించిన నివేదికలో పేర్కొంది. అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా చైనాను భారత్ అధిగమించినట్టు వెల్లడైంది. చైనాలో రోజుకు 3,233 మంది మరణించారు.

పర్యావరణ మార్పుల పనితీరు సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు
పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(Climate Change Performance Index)లో భారత్ 20వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘జర్మన్‌వాచ్ అండ్ కై ్లమేట్ యాక్షన్ నెటవర్క్ యూరప్’ 58 దేశాలకు సంబంధించి 2016 నివేదిక విడుదల చేసింది. వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలు పాటించాలని నివేదిక సూచించింది. ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుందని, పునరుత్పాదక ఇంధన వినియోగంలో మెరుగుపడిందని పేర్కొంది.
సూచీలో మొదటి 10 దేశాలు

స్థానం

దేశం

స్కోర్

1

-

-

2

-

-

3

-

-

4

ఫ్రాన్స్

66.17

5

స్వీడన్

66.15

6

యూకే

66.10

7

సైప్రస్

64.28

8

మొరాకో

63.28

9

లక్సెంబర్గ్

62.86

10

మాల్టా

62.51

20

భారత్

59.08

గమనిక: ‘-’ ఏ దేశం కూడా నిర్దేశిత ప్రమాణాలను చేరుకోలేదు.

20 కోట్ల మంది భారతీయులకు అధిక రక్తపోటు
భారత్‌లో 20 కోట్ల మంది హైబీపీతో బాధపడుతున్నారని లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తల అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా హైబీపీ బాధితుల సంఖ్య 40 ఏళ్లలో రెట్టింపై 113 కోట్లకు చేరిందని నివేదిక తెలిపింది. చైనాలో సుమారు 22.6 కోట్ల మందికి హైబీపీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల కన్నా పురుషుల్లోనే ఈ సమస్య అధికం. రక్తపోటు అధికంగా ఉన్న వారి శాతాల పరంగా పరిశీలిస్తే పురుషుల్లో క్రొయేషియా(38%), స్త్రీలలో నైగర్(36%) తొలిస్థానంలో నిలిచాయి.

స్వచ్ఛభారత్ అవగాహన ప్రచారంలో అలీగఢ్‌కు ప్రథమస్థానం
స్వచ్ఛభారత్ పై అవగాహన కోసం ప్రచారం (Awareness Campaign for Swachh Bharat) చేపడుతున్న 500 నగరాల్లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో వసాయ్-విరార్ (మహారాష్ట్ర) నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి మూడో స్థానంలో హైదరాబాద్, 8వ స్థానంలో తిరుపతి (ఆంధ్రప్రదేశ్) ఉన్నాయి. స్వచ్ఛభారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పది పట్టణాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నవంబర్ 17న ఢిల్లీలో విడుదల చేసింది.
జాబితాలో మొదటి 9 పట్టణాలు

స్థానం

పట్టణం

రాష్ట్రం

1

ఆలీఘడ్

ఉత్తరప్రదేశ్

2

వసాయ్-విరార్

మహారాష్ట్ర

3

హైదరాబాద్

తెలంగాణ

4

గురుగ్రామ్

హరియాణా

5

చండీగఢ్

హరియాణా

6

మధురై

తమిళనాడు

7

వడోదర, రాజ్‌కోట్

గుజరాత్

8

తిరుపతి

ఆంధ్రప్రదేశ్

9

మైసూర్

కర్ణాటక


కాన్పూర్ రైలు ప్రమాదంలో 150 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో గల పుఖ్రయా వద్ద నవంబర్ 20న జరిగిన రైలు ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బయలుదేరిన ‘ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్’కు చెందిన 14 బోగీలు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పాయి. పట్టా విరిగి పోవటంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
1988 నుంచి అతి పెద్ద రైలు ప్రమాదాలు
1988 ఏప్రిల్ 18: ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ వద్ద పట్టాలు తప్పిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్. 75 మంది మృతి.
1988 జూలై 8: కేరళలోని అష్టముడి సరస్సులోకి పడిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్. 107 మంది మృతి.
1995 ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్‌లో కలిండి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్. 400 మంది దుర్మరణం.
1997 సెప్టెంబర్ 14: మధ్యప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలో నదిలోకి పడ్డ అహ్మదాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు. 81 మంది మృతి
1998 నవంబర్ 26: పంజాబ్‌లోని ఖన్నా వద్ద పట్టాలు తప్పిన ఫ్రంటియర్ మెయిల్ రైలు బోగీలను ఢీకొన్న జమ్మూ తావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్. 212 మంది మృతి. 
1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసల్ వద్ద రెండు ప్రయాణికుల రైళ్లు ఢీ. 290 మంది మృతి.
2002 సెప్టెంబర్ 9: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ధావే నదిలోకి పడ్డ హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్. 100 మంది మృతి. 150 మందికి గాయాలు.
2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించిన నక్సల్స్. 148 మంది మృతి. 
2014 మే 4: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ వద్ద పట్టాలు తప్పిన సవంత్‌వాడీ ప్యాసింజర్. 20 మంది దుర్మరణం. 100 మందికి గాయాలు.
2014 మే 26: ఉత్తరప్రదేశ్‌లోని కబీర్‌నగర్ జిల్లాలో సరకు రవాణా రైలును ఢీకొన్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. క్షతగాత్రులైన 50 మంది. 
2015 మార్చి 20: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ వద్ద పట్టాలు తప్పిన డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్. 39 మంది మృతి. 150 మందికి గాయాలు.
2015 ఆగస్టు 4: మధ్యప్రదేశ్‌లోని హార్ధా జిల్లాలో పట్టాలు తప్పిన కామాయణి ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. 25 మందికి గాయాలు. 

ఉప ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ హవా
ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నవంబర్ 19న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 22న వెలువడ్డాయి. వీటిలో బీజేపీ రెండు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రెండు లోక్‌సభ స్థానాలు గెలిచాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్, తమ్లుక్ లోక్‌సభ, మోంటేశ్వర్ అసెంబ్లీ స్థానాలను టీఎంసీ కై వసం చేసుకోగా, అస్సాంలోని లఖిన్‌పూర్ లోక్‌సభ, భైతలంగ్సో అసెంబ్లీ.. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ, నేపనగర్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ చేజిక్కించుకుంది. తమిళనాడులోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే గెలిచింది. పుదుచ్చేరిలోని నెల్లితోపులో కాంగ్రెస్ పార్టీ సీంఎ వి.నారాయణ స్వామిని విజయం వరించింది.

తిరువనంతపురంలో తొలి ఎల్‌ఎన్‌జీ బస్ ప్రారంభం
దేశంలోనే తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ) బస్‌ను కేరళలోని తిరువనంతపురంలో నవంబర్ 7న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. దేశంలో కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలో భాగంగా ఈ ఎల్‌ఎన్‌జీ బస్‌ను ప్రారంభించారు. తిరువనంతపురంలో వాణిజ్య వాహనాలను ఎల్‌ఎన్‌జీతో నడిపేందుకు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా మోటార్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ సందర్భంగా డీజిల్ కంటే ఎల్‌ఎన్‌జీ చవకైనదే కాకుండా పర్యావరణ హితమైందని, దీన్ని రైల్వేల్లో వినియోగించేందుకు కేంద్రం ఇప్పటికే ప్రణాళికను ప్రకటించిందని మంత్రి తెలిపారు.

జల వివాదంలో పంజాబ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
నదీ జలాలను పంజాబ్.. హ రియాణా, ఇతర రాష్ట్రాలతో పంచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు నవంబర్ 10న తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకునేందుకు నిరాకరించిన పంజాబ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. దీంతో పంజాబ్, హరియాణా రాష్ట్రాల మధ్య సట్లేజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) వివాదం మరోసారి తెరపైకొచ్చింది. కోర్టు తీర్పును నిరసిస్తూ పంజాబ్‌లో కాంగ్రెస్‌కి చెందిన లోక్‌సభ ఎంపీ అమరీందర్ సింగ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.

పాక్ సరిహద్దులో హెలిబోర్న్ ఆపరేషన్ 
ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లు సంయుక్తంగా పాక్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్ (రాజస్థాన్) ఎడారి ప్రాంతంలో నవంబర్ 13, 14 తేదీల్లో హెలిబోర్న్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా శత్రువును దెబ్బకొట్టేందుకు చేపట్టే కీలక విన్యాసాలతోపాటు సైనిక పాటవాన్ని పరీక్షించారు. యుద్ధంలో అనుకోని అవాంతరాలు ఎదురైన ప్పుడు లేదా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చినప్పుడు సైనిక, వైమానిక బలగాలు ఎలాంటి సమన్వయాన్ని కలిగి ఉండాలి? మనవైపు తక్కువ నష్టంతో శత్రువును ఎలా మట్టుపెట్టాలి? వంటి అంశాలను కృత్రిమ యుద్ధ వాతావరణంలో పరిశీలించారు. ఈ విన్యాసాల్లో యుద్ధ హెలికాప్టర్లు, సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను కూడా వినియోగించారు.

నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం
దాదాపు ఎనిమిదేళ్ల కిందట మూతపడిన నేషనల్ హెరాల్డ్(ఎన్‌హెచ్) పత్రిక డిజిటల్ వర్షన్‌లో పునఃప్రారంభమైంది. ఈ మేరకు www.nationalheraldindia.comవెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నవంబర్ 14న తెలిపింది. ప్రింట్ వర్షన్‌ను కూడా త్వరలో పునఃప్రారంభించనున్నారు. ఎన్‌హెచ్ వ్యవస్థాపకులు జవహర్‌లాల్ నెహ్రూ.

ఆస్ట్రేలియా పాఠ్యపుస్తకాల్లో హిందీ
ఇంగ్లీషేతర భాషలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రి-స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో హిందీ సహా మరిన్ని విదేశీ భాషలను చేర్చనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం నవంబర్ 14న ప్రకటించింది. దీంతో ఈ ఘనత పొందిన తొలి భారతీయ భాషగా హిందీ నిలవనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ భాషలు నేర్చుకోవడానికి ది ఎర్లీ లెర్నింగ్ లాంగ్వేజెస్ ఆస్ట్రేలియా (ఎల్లా) అప్లికేషన్లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా 2017 నుంచి ఇటలీ, స్పానిష్, 2018 నుంచి హిందీ, గ్రీకు భాషలు బోధిస్తారు.

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ఢిల్లీలో భారీ ఎత్తున కురుస్తోన్న పొగమంచుతోపాటు కాలుష్యం విపరీతంగా పెరగడంతో నవంబర్ 5న ఢిల్లీ ప్రభుత్వం తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. శీతకాలం వాతావరణంలోని కాలుష్య మేఘాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) తన పరిధిలోని 1800 సూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రకటించింది. నిర్మాణ పనులను 5 రోజులు, బదర్‌పుర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 10 రోజులపాటు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

శబరిమలలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం తరపు న్యాయవాది నవంబర్ 7న సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మహిళలు (అన్ని వయసుల వారు) శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. గత జూలైలో శబరిమలలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే తాజా విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతుగా 2007లో తాము దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

కేంద్ర సమాచార కమిషన్ 11వ వార్షిక సమావేశం
కేంద్ర సమాచార కమిషన్ 11వ వార్షిక సమావేశం నవంబర్ 7న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాచార హక్కు కింద వచ్చిన దరఖాస్తులు అన్నింటికీ సమాధానాలు ఇవ్వాలని, ఎటువంటి వివరాలు అడిగారనే దానితో సంబంధం లేకుండా దరఖాస్తుదారుడు కోరిన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పారదర్శకతకు ప్రాధాన్యం పెరుగుతోందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. విధాన నిర్ణయాల్లో ప్రజల పాత్ర పెరుగుతోందని, వస్తుసేవల పన్ను విషయంలో 40 వేలకు పైగా సలహాలు రావడమే దీని నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార కమిషన్ అప్పీళ్లను విచారించేందుకు ఉద్దేశించిన కాగిత రహిత ఈ-కోర్టును హోం మంత్రి ప్రారంభించారు. దీని కోసం కమిషన్ తన వద్ద ఉన్న 1.5 లక్షల పత్రాలను డిజిటలైజేషన్ చేసింది.

స్విస్ టూరిజం భారత ప్రచారకర్తగా రణ్‌వీర్‌సింగ్
స్విట్జర్లాండ్ పర్యటకానికి భారత ప్రచారకర్తగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది నుంచి స్విట్జర్లాండ్ టూరిజం ప్రచారంలో అతడు పాల్గొంటాడు. ఇప్పటికే హీరో సిద్దార్థ మల్హోత్రా న్యూజిలాండ్ టూరిజం భారత ప్రచాకర్తగా వ్యవహరిస్తున్నారు.

బిజినెస్ ఆప్టిమిస్టిక్ ఇండెక్స్‌లో భారత్‌కు రెండోస్థానం
వ్యాపార ఆశావహ (Business Optimism Index) సూచీలో భారత్ రెండోస్థానంలో నిలిచింది. విధానపరమైన సంస్కరణలు, త్వరలోనే జీఎస్టీ అమల్లోకి రానుండటం వంటి సానుకూలతలతో సూచీలో ఒక స్థానం ముందుకెళ్లింది. గ్రాంట్ థార్న్‌టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో మూడోస్థానంలో ఉన్న భారత్ జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఒక స్థానం మెరుగు పరుచుకొని రెండోస్థానానికి చేరింది. తాజా జాబితాలో ఇండోనేసియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2016 జాతీయం
గ్రామాల్లో ఆరోగ్య సేవలకు టోల్‌ఫ్రీ నంబర్
గ్రామీణ ప్రాంతంలో మాతాశిశువులకు ఉన్న ఆరోగ్య సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు 10588 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే 90 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి సిబ్బంది వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారు. కాల్ సెంటర్‌ను తెలుగు సహా ఏడు భాషల్లో నిర్వహించనున్నారు. 

ముంబైలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకం
 మహారాష్ట్రలో ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించనున్న ఛత్రపతి శివాజీ భారీ స్మారక (ఎత్తు 192 మీటర్లు) నిర్మాణానికి డిసెంబర్ 24న ప్రధాని మోదీ జలపూజ చేశారు. రూ.3,600 కోట్లతో నిర్మించనున్న ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తై స్మారక విగ్రహం. దీని తర్వాత గుజరాత్‌లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం) 182 మీటర్ల ఎత్తు ఉంది.
ప్రపంచంలో ఎత్తై స్మారక నిర్మాణాలు

పేరు

ఎత్తు

ప్రదేశం/దేశం

శివాజీ స్మారకం

192 మీ.

మహారాష్ర్ట

స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం

182 మీ.

గుజరాత్

స్రింగ్ టెంపుల్ బుద్ధ

153 మీ.

చైనా

ఉషికు దాయిగుత్సు

120 మీ.

జపాన్

స్టాట్యూ ఆప్ లిబర్టీ

93 మీ.

న్యూయార్క్

మదర్‌లాండ్ కాల్స్

85 మీ.

రష్యా

క్రీస్ట్ ది రెడీమర్

39.6 మీ.

రియో డి జనిరో


అమల్లోకొచ్చిన బినామీ లావాదేవీల సవరణ చట్టం
నల్లధనం కట్టడిలో భాగంగా బినామీ లావాదేవీలను నిషేధించడానికి ఉద్దేశించిన బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం-2016 అమల్లోకి వచ్చింది. 1988 బినామీ లావాదేవీల నిషేధిత చట్టంకు సవరణలు చేసి దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఆదాయానికి మించిన, లెక్క చెప్పలేని ఆస్తులు జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు మార్కెట్ విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించవచ్చు.

ఆయుధాల కొనుగోళ్లలో రెండో స్థానంలో భారత్
అమెరికా నుంచి 2008-15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలను కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. వీటి కొనుగోలు కోసం భారత్ 34 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఈ జాబితాలో 93.5 బిలియన్ డాలర్లు వెచ్చించిన సౌదీ అరేబియా తొలిస్థానంలో నిలిచింది. ఈ మేరకు కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008-15’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 2015 ఏడాదిలో ఆయుధాల అంతర్జాతీయ వ్యాపారం అత్యధికంగా చేసిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో నిలవగా ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలిచింది.

వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై నిషేధం
కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాలతో సహా ఎక్కడ చెత్తను దగ్ధం చేసినా సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధించనున్నట్లు ఎన్‌జీటీ పేర్కొంది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5000 జరిమానాగా విధిస్తామని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ డిసెంబర్ 22న ప్రకటించింది.

దివ్యాంగుల హక్కుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దివ్యాంగులకు భద్రత కల్పించి వారి హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన దివ్యాంగుల హక్కుల బిల్లు-2014ను రాజ్యసభ డిసెంబర్ 14న ఆమోదించింది. బిల్లు ప్రకారం దివ్యాంగులుగా గుర్తించేందుకు ఉండాల్సిన వైకల్యాల జాబితాను 7 నుంచి 21కి పెంచారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు. దివ్యాంగులపై వివక్ష పాటిస్తే 6 నెలల నుంచి రెండేళ్ల దాకా జైలుశిక్షతో పాటు రూ. 10 వేల నుంచి 5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. 

డిజిటల్ చెల్లింపులకు బహుమతులు
డిజిటల్ చెల్లింపులకు భారీ ప్రోత్సాహకాలు అందించే పథకాలను కేంద్రం డిసెంబర్ 15న ప్రకటించింది. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజన, వ్యాపారుల కోసం డిజిధన్ వ్యాపార యోజనలను డిసెంబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. వీటి కోసం రూ.340 కోట్లు వెచ్చించనున్నారు. డిసెంబర్ 25న మొదటి డ్రాను, అంబేద్కర్ జయంతి సందర్భంగా 2017, ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తారు.

మేజర్ పోర్ట్‌ అథారిటీస్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
భారీ ఓడరేవు అధికారాల (మేజర్ పోర్ట్ అథారిటీస్) బిల్లు- 2016కు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 14న ఆమోదం తెలిపింది. నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఓడరేవుల నిర్వహణ నైపుణ్యం, సామర్థ్యాలను పెంచేందుకు తాజా బిల్లు ఉపయోగపడనుంది. నౌకాయాన శాఖ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్రం ప్రధాన ఓడరేవు ధర్మకర్తల మండళ్ల చట్టం-1963 స్థానంలో తాజా బిల్లును తెచ్చింది.

కేరళలో ట్రాన్స్‌జెండర్ల కోసం తొలి పాఠశాల
ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయనున్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ‘షాహగ్ ఇంటర్నేషనల్ స్కూల్’ పేరుతో ట్రాన్‌‌స ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ పాఠశాల డిసెంబర్ 30న ప్రారంభం కానుంది. ట్రాన్స్ జెండర్స్‌ను గుర్తించి, వారికి అందరితోపాటు సమాన అవకాశాలు కల్పిస్తూ, ప్రత్యేక రిజర్వేషన్లను ఇవ్వడానికి 2015లో కేరళ ప్రభుత్వం ‘ట్రాన్స్ జెండర్ పాలసీ’ని తీసుకువచ్చింది. 

గ్రీన్‌బిల్డింగ్స్‌ ర్యాంకింగ్‌లో భారత్‌కు మూడోస్థానం
యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ విడుదల చేసిన హరిత భవనాల ర్యాంకింగ్‌లో భారత్‌కు మూడోస్థానం దక్కింది. లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ దృవీకరణలో 34.62 మిలియన్ గ్రాస్ స్వ్కేర్ మీటర్ స్థలంతో చైనా తొలి స్థానంలో నిలవగా 34.39 మిలియన్ల జీఎస్‌ఎంతో కెనడా రెండో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి 15.90 మిలియన్ల జీఎస్‌ఎం స్థలం ఎల్‌ఈఈడీ దృవీకరణ పొందింది.

కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ
కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20న ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాలకృష్ణన్, రూర్కీ సైంటిస్ట్ డాక్టర్ ఆర్‌పీ పాండే, చీఫ్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ శుక్లా, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డెరైక్టర్ ఎన్ ఎన్‌రాయ్ సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్-1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేస్తుంది. కమిటీ తన నివేదికను 90 రోజుల్లో కేంద్ర జల వనరుల శాఖకు అందిస్తుంది. 

న్యూఢిల్లీలో బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం
క్షయ, హెచ్‌ఐవీ, మలేరియా లాంటి జబ్బులను ఎదుర్కొనేందుకు పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్ దేశాలు) నిర్ణయించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో డిసెంబర్ 16న ముగిసిన ఆరో బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించింది.

ఆసియా - పసిఫిక్ మంత్రిత్వ శాఖల సదస్సు
గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధిపై ఆసియా-పసిఫిక్ మంత్రిత్వ శాఖల సదస్సు డిసెంబర్ 16న న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో ఆసియా-పసిఫిక్ దేశాలు అనియంత్రిత పట్టణ విస్తరణను నివారించేందుకు పట్టణ అనుబంధ పద్ధతిని అనుసరించాలని తీర్మానించాయి.

అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం
భారత్‌లోనే అతి పెద్ద చమురు శుద్ధి (రిఫైనరీ) కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లు న్యూఢిల్లీలో జరిగిన పెట్రోటెక్ సదస్సులో డిసెంబర్ 7న సంతకాలు చేశాయి. ఈ రిఫైనరీని ఐఓసీ నాయకత్వంలోని కన్సార్షియం పశ్చిమ తీరంలో (మహారాష్ట్ర) 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) వ్యయంతో, 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఇందులో ఐవోసీ వాటా 50 శాతం. కాగా.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ చెరో 25 శాతం వాటాలను కలిగున్నాయి.

ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్‌కు 7వ స్థానం
ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) 2015 సంవత్సరానికి ఉగ్రవాద ప్రభావిత దేశాల సూచీని డిసెంబర్ 8న విడుదల చేసింది. ఇందులో ఇరాక్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ 7వ స్థానంలో ఉంది. ఉగ్రవాదానికి అత్యధికంగా ప్రభావితం అవుతున్న మొదటి 10 దేశాల్లో ఆరు దేశాలు ఆసియాకు చెందినవే. ప్రపంచంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 20 శాతం ఇరాక్‌లోనే జరగ్గా, భారత్‌లో 7 శాతం, అఫ్గానిస్తాన్‌లో 14 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం దాడులు జరిగాయి. 

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం: అలహాబాద్ హైకోర్టు
ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’ ఒక దేశంగా భారత్ ఉండకుండా అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అయినా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అతీతం కాదని చెప్పింది. యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పు వెలువరిచింది.

రక్షణ నిధుల టాప్-5 దేశాల జాబితాలో భారత్
ప్రపంచంలో రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించే టాప్-5 దేశాల జాబితాలో భారత్ చేరింది. సౌదీ అరేబియా, రష్యాలను అధిగమించి 50.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.34 వేల కోట్లు) భారత్ మిలిటరీ బడ్జెట్‌కు కేటాయించినట్లు బ్రిటన్‌కు చెందిన ఐహెచ్‌ఎస్ మార్కిట్’ అధ్యయన సంస్థ వెల్లడించింది. రక్షణ రంగంలో అధికంగా ఖర్చుచేసే మొదటి మూడు దేశాల్లో అమెరికా, చైనా, బ్రిటన్ కొనసాగుతున్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, రష్యా ఉన్నాయి. భారత్ గత ఏడాది 46.6 బిలియన్ డాలర్లను ఖర్చుచేయగా, ఈ ఏడాది 50.7 బిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. అత్యధికంగా అమెరికా ఏటా 622 బిలియన్ డాలర్లను ఖర్చుపెడుతుండగా, చైనా 191.7 బిలియన్ డాలర్లను, బ్రిటన్ 53.8 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నాయి. సౌదీ అరేబియా 48.68 బిలియన్‌‌స, రష్యా 48.44 బిలియన్ డాలర్లను రక్షణ రంగంపై ఖర్చుపెడుతున్నాయి.

బంగాళఖాతంలో వార్ద తుపాను
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వార్ద తుపాను వల్ల తమిళనాడు, ఆంధ్రాల్లో భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులతో తుపాను డిసెంబర్ 12న తీరం తాకుతుందని వెల్లడించింది. వర్దా అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్థం. పాకిస్తాన్ సూచించిన ఈ పేరునే తుపానుకు పెట్టారు. 

వర్దా తుపానుతో తమిళనాడు అతలాకుతలం
పెను తుపాను వర్దా ధాటికి తమిళనాడు అతలాకుతలం అయింది. డిసెంబర్ 12న తీరం దాటిన తుపాను వల్ల గంటకు 129 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెన్నైతో పాటు తీరప్రాంతాల్లో 18 మంది మృతి చెందారు. రూ.1,000 కోట్ల నష్టం సంభవించిందని అంచనా.

ఓబీసీల్లోకి 15 కొత్త కులాల చేరికకు కేంద్రం ఆమోదం
ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) కేంద్ర జాబితాలో మార్పుచేర్పులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా 15 కులాలను చేర్చడంతోపాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది.

యునెస్కో అదృశ్య వారసత్వ జాబితాలోకి యోగా
యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ)కు చెందిన ‘మానవుల సాంస్కృతిక అదృశ్య వారసత్వం’ (Intangible Cultural Heritage of Humanity) జాబితాలో యోగాకు చోటు దక్కింది. ఇథియోపియాలో అడీస్‌అబాబాలో డిసెంబర్ 1న జరిగిన యునెస్కోకు చెందిన 11వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో భౌతికంగా కంటికి కనిపించని వారసత్వాలను చేర్చుతారు. ఇందులో భారత్‌కు చెందిన 13వ వారసత్వ సంపదగా యోగా చేరింది.

డిజిటల్ లావాదేవీల అధ్యయనానికి కమిటీ
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత (డిజిటల్) లావాదేవీల అమలుపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నీతి అయోగ్ నవంబర్ 30న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత అంశంలో నిపుణులు మొత్తం 13 మంది సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కమిటీలో సభ్యుడు కాగా, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సభ్య కార్యదర్శి.

నగదు రహిత లావాదేవీలకు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించి వాటిని దేశంలో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి కమిటీ తన నివేదికను ఇస్తుంది. 

కమిటీలో సభ్యులు
నవీన్ పట్నాయక్ ఒడిశా (ముఖ్యమంత్రి)
శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ (ముఖ్యమంత్రి)
పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం (ముఖ్యమంత్రి)
వి.నారాయణ స్వామి పుదుచ్చేరి (ముఖ్యమంత్రి)
దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ర్ట (ముఖ్యమంత్రి)
నందన్ నిలేకని యూఐడీఏఐ మాజీ చైర్మన్
జన్మేజయ సిన్హా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్
రాజేశ్ జైన్ నెట్‌కోర్ మేనేజింగ్ డెరైక్టర్
శరద్ శర్మ ఐ స్పిరిట్ సహ వ్యవస్థాపకుడు
డాక్టర్ జయంత్ వర్మ ఐఐఎం (అహ్మదాబాద్) ఫ్రొఫెసర్ 

సినిమా థియేటర్లలో ‘జనగణమన’ తప్పనిసరి
ప్రజల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకు సినిమా హాళ్లలో జాతీయ గీతం ‘జనగణమన’ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు నవంబర్ 30న ఆదేశాలు జారీ చేసింది.

తద్వారా దేశంలోని అన్ని థియేటర్లు సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. జాతీయగీతాన్ని ప్రదర్శించే సమయంలో ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడాలి. జాతీయ గీతం, జాతీయ జెండాను గౌరవించడం దేశంలోని ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్‌మిశ్రా, అమితవరాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, అధికారిక ఫంక్షన్లు, కార్యక్రమాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు సరైన నిబంధనలను, ప్రొటోకాల్‌ను నిర్దేశించాలని కోరుతూ శ్యామ్ నారాయణ చౌస్కి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ‘నాడా’ తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 30న తుపాను చెలరేగింది. దీనికి ఒమన్ దేశం సూచించిన ’నాడా’ గా నామకరణం చేశారు. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగాను, దక్షిణ కోస్తాపై ఓ మోస్తరుగానూ ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2017
దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న వారిలో 71 శాతం పురుషులు ఉండగా 29 శాతం మహిళలు ఉన్నారని ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2017’ నివేదిక తెలిపింది. పనిచేసే వయస్సు కలిగిన మహిళలకు (21-50 ఏళ్లలోపు) ప్రోత్సాహం లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. ఈ సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), పీపుల్స్ స్ట్రాంగ్, వీబాక్స్, యునెటైడ్ నేషన్‌‌స డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. దీని కోసం దేశవ్యాప్తంగా 125కు పైగా సంస్థలతో పాటు 5.6 లక్షల మంది విద్యార్థులను సర్వే చేశారు.

రాష్ట్రాల వారీగా ఉద్యోగాలు పొందగలిగిన మహిళలు (శాతాల్లో)

రాజస్తాన్

31

ఆంధ్రప్రదేశ్

23

కర్ణాటక

21

తెలంగాణ

20

మహారాష్ట్ర

18

పశ్చిమ బెంగాల్

17

ఉత్తరప్రదేశ్

17

హరియాణా

15

తమిళనాడు

11

గుజరాత్

08


తొలి నగదు రహిత గ్రామంగా ధసై
దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మహారాష్ట్ర థానే జిల్లా ముర్బాడ్ తాలూకాలోని ధసై గ్రామం నిలిచింది. పది వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో 150కి పైగా దుకాణాలు ఉన్నాయి. సావర్కర్ స్మారక్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గ్రామంలోని వ్యాపారులందరికి స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఏది కొనాలన్నా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నిత్యావసరాలకు ఈ గ్రామంపై ఆధారపడే చుట్టూ ఉన్న 40 గిరిజన, ఆదివాసీ పల్లెల్లోని ప్రజలకు కూడా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారు.

No comments:

Post a Comment