AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

అంతర్జాతీయం 2013 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

అంతర్జాతీయం 2013 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

జనవరి 2013 అంతర్జాతీయం
డబ్ల్యూఈఎఫ్ 43వ వార్షిక సదస్సు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 43వ వార్షిక సదస్సు దావోస్ (స్విట్జర్లాండ్) లో జనవరి 23 నుంచి 27వరకు జరిగింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన ఈ సదస్సులో భారత్ నుంచి కేంద్ర మంత్రులు కమల్ నాథ్, ఆనంద్ శర్మ సహా 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు, ఉపాధి కల్పనకు, అవినీతిపై పోరాటానికి..సువర్ణ త్రిభుజం (గోల్డెన్ ట్రయాంగిల్) ఫార్ములా పాటించాలనే అభిప్రాయాన్ని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు వ్యక్తం చేశారు.

హెడ్లీకి 35 ఏళ్ల జైలు
26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న పాకిస్థాన్ ఉగ్రవాదులకు వ్యూహాత్మక సహకారం అందించిన లష్కరే తోయిబా ఉగ్రవాది, పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ హెడ్లీకి అమెరికాలోని షికాగో కోర్టు జనవరి 24న 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ముంబైలో 2008 నవంబర్ 26న ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది మరణించారు.

ఆహార వ్యర్థాలకు వ్యతిరేకంగా ప్రచారం
ఆహార పదార్థాల వ్యర్థానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం; ఆహార, వ్యవసాయ సంస్థలు సంయుక్తంగా ప్రచారాన్ని చేపట్టాయి. ‘థింక్-ఈట్-సేవ్-రెడ్యూజ్ యువర్ ఫుడ్ ప్రింట్’ అనే నినాదంతో జనవరి 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. వ్యర్థాలుగా వదిలి వేయడం కారణంగా ప్రతి ఏటా 1.3 బిలియన్ టన్నుల ఆహారాన్ని నష్టపోతున్నట్లు, ఇందుకు దారితీస్తున్న అలవాట్లను మార్చే ఉద్దేశంతో ఈ ప్రచారం చేపట్టాయి. ఉత్పత్తి స్థాయిలో అంటే పండే చోట, ప్రాసెసింగ్, పంపిణీ వద్ద ఆహారం అధికంగా వథా అవుతోంది. దీని విలువ ప్రతి సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్లు.

పాదరసం నియంత్రణపై ఒప్పందం
హానికరమైన పాదరసం వినియోగాన్ని పరిమితం చేస్తూ రూపొందించిన ఒప్పందాన్ని 140 దేశాలు అంగీకరించాయి. జెనీవా (స్విట్జర్లాండ్)లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారానికి వచ్చాయి. పాదరసం వినియోగంపై ప్రపంచంలో చట్టబద్ధంగా కట్టుబడాల్సిన మొట్ట మొదటి ఒప్పందం ఇదే. దీన్ని ‘మినమటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యురీ’గా పిలుస్తారు. మినమటా అనేది జపాన్‌లోని పట్టణం. ఇక్కడ దశాబ్దాలుగా ప్రజలు పాదరస ప్రభావానికి తీవ్రంగా గురయ్యారు. విషతుల్యమైన పాదరసాన్ని క్విక్ సిల్వర్‌గా కూడా పేర్కొంటారు. ఇది మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తుంది. దీని ప్రభావం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. పిండస్థ శిశువులు, చిన్న పిల్లలకు ఈ ముప్పు తీవ్రంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఎలక్ట్రికల్ స్విచ్‌లు, థర్మామీటర్లు, బల్బులు, ఫేసియల్ క్రీమ్ వంటి వాటిల్లో ఉంటుంది. మైనింగ్, బొగ్గును మండించే విద్యుత్, సిమెంట్ కర్మాగారాల నుంచి ఎక్కువగా విడుదలవుతుంది.

పునర్వినియోగ ఇంధన ప్రపంచ అట్లాస్ ఆవిష్కరణ
పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచ అట్లాస్‌ను అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన సంస్థ (ఐఆర్‌ఈఎన్‌ఏ) జనవరి 13న ఆవిష్కరించింది. ఇది ఆయా దేశాలకు తమ పునర్వియోగ ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. అబుదాబీలో జరిగిన ఐఆర్‌ఈఎన్‌ఏ రెండు రోజుల వార్షిక సమావేశంలో ఈ అట్లాస్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇందులో సౌర, పవన(విండ్) వనరులకు సంబంధించిన సమాచారం ఉంది. అబుదాబీ కేంద్రంగా 2011లో ఐఆర్‌ఈఎన్‌ఏ ఏర్పాటైంది. అన్ని విధాలైన పునర్వియోగ ఇంధన వనరుల సుస్థిర వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు ఐఆర్‌ఈఎన్‌ఏ పని చేస్తుంది.

శ్రీలంక కొత్త చీఫ్ జస్టిస్ మోహన్ పీరిస్
శ్రీలంక నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఆ దేశ మాజీ అటార్నీ జనరల్ మోహన్ పీరిస్‌ను దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే నియమించారు. పీరిస్ ప్రస్తుతం లంక కేబినెట్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో పీరిస్‌కు ముందు చీఫ్ జస్టిస్‌గా ఉన్న శిరానీ బండారునాయకేను రాజపక్సే జనవరి 13న పదవి నుంచి తొలగించారు.

రెండోసారి ఒబామా ప్రమాణ స్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ హుస్సేన్ ఒబామా జనవరి 20న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా బాధ్యతల స్వీకరణతో రెండోసారి అమెరికా అధ్యక్షుడైన 21వ వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా ఇంతకుముందే గెలిచినప్పటికీ, రాజ్యాంగ ప్రకారం కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం మాత్రం జనవరి 20న జరిగింది. అదే రోజు అమెరికా ఉపాధ్యక్షుడిగా జోయ్ బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. బిడెన్ కూడా ఈ పదవిని చేపట్టడం వరుసగా ఇది రెండోసారి.

శ్రీలంక చీఫ్ జస్టిస్ తొలగింపు
శ్రీలంక మొదటి మహిళా చీఫ్ జస్టిస్ శిరానీ బండారునాయకేను ఆ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే పదవి నుంచి తొలగించారు. బండారునాయకేపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో రాజపక్సే ఈ చర్య తీసుకున్నారు. బండారునాయకేను తొలగించడానికి ఉద్దేశించిన మహాభియోగ తీర్మానాన్ని శ్రీలంక పార్లమెంట్ ఆమోదించింది. ఇందుకోసం జనవరి 11న జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 155 మంది సభ్యులు, వ్యతిరేకంగా 49 సభ్యులు ఓటేశారు.

పర్యావరణ ప్రమాదాలపై డబ్ల్యూఈఎఫ్ నివేదిక
పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంపై రూపొందించిన వార్షిక నివేదికను జెనీవాలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 8న విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన.. బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా, యూకే, అమెరికా దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆర్థిక ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యంలో భారత్ 9వ స్థానంలోనూ, పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో 10వ స్థానంలోనూ ఉంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. 

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీకి 18వ స్థానం దక్కింది. ప్రపంచంలో 100 మంది అత్యంత సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాను బ్లూమ్‌బర్గ్ జనవరి 2న విడుదల చేసింది. ఇందులో మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫ్యాషన్ రిటైలింగ్ సంస్థ జారా వ్యవస్థాపకుడు ఆమాన్చియో ఓర్టెగా వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్‌కు నాలుగో స్థానం, ఐకియా వ్యవస్థాపకుడు ఇంగ్వర్‌కాంప్రాద్‌కు అయిదో స్థానం దక్కింది.

స్టేట్ ఆఫ్ పాలస్తీనా
దేశం హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ మద్దతిచ్చిన నేపథ్యంలో పాలస్తీనా ప్రాధికార సంస్థ అధికారికంగా ‘స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ అనే పేరును ఖరారు చేసుకుంది. ఇకపై అన్ని అధికార పత్రాల్లో ఈ పేరునే వినియోగించాలని అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆదేశాలు జారీ చేశారు.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2013 అంతర్జాతీయం
క్యూబా అధ్యక్షుడిగా రౌల్ కాస్ట్రో
క్యూబా అధ్యక్షుడిగా రౌల్ కాస్ట్రో రెండోసారి ఎన్నికయ్యారు. కాస్ట్రో మరో ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఉపాధ్యక్షుడిగా మిగేల్ దియాజ్ క్యానల్ నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో దియాజ్ విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

సౌర కుటుంబం వెలుపల చిన్న గ్రహం
సౌర కుటుంబం వెలుపల అతి చిన్న గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 21న కనుగొన్నారు. ఇప్పటివరకు మనకు తెలిసిన 800 పై చిలుకు సౌరకుటుంబేతర గ్రహాల్లో ఇదే అతి చిన్నది. ఇది చంద్రుడి కంటే కొంచెం పెద్దగా, భూమి సైజులో మూడో వంతు ఉంటుంది. సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ 13 రోజులకోకసారి పరిభ్రమిస్తుంది. దీనికి కెప్లర్-37బి అనే పేరు పెట్టారు. ఇది భూమికి 210 కాంతి సంవత్సరాల దూరంలో లైరా అనే నక్షత్ర మండలంలో ఉంది.

‘కిషన్‌గంగ’ నీటిపై తీర్పు
భారత్-పాకిస్థాన్‌ల మధ్య కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో తలెత్తిన వివాదానికి నెదర్లాండ్స్‌లో ది హేగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తెరదించింది. ఈ ప్రాజెక్ట్ కోసం కిషన్‌గంగ నది (పాక్‌లో నీలం నది) నీటిని జలవిద్యుత్ ప్లాంటుకు తరలించేందుకు భారత్‌కు హక్కుందని తెలిపింది. 

1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం- భారత్ కిషన్‌గంగ నది నీటిని జలవిద్యుత్ ఉత్పాదనకు తరలించుకోవచ్చని పేర్కొంది. అదే సమయంలో పాక్ వ్యవసాయ ప్రయోజనాల దష్ట్యా ఈ నదిలో కనీస నీటి ప్రవాహం ఉండేలా చూడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న పాక్షిక తీర్పును ఇచ్చింది. ఇరు దేశాలు నది ప్రవాహానికి సంబంధించిన తాజా గణాంకాలు అందిస్తే.. ఈ ఏడాది చివర్లోగా కనీస నీటి ప్రవాహం స్థాయిని ఖరారుచేస్తూ తుది తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

పార్క్ గెయున్ ప్రమాణం 
దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గెయున్ హై ఫిబ్రవరి 25న ప్రమాణ స్వీకారం చేశారు. పార్క్ గెయున్ సైనిక నియంత, ఆ దేశ మూడో అధ్యక్షుడైన దివంగత పార్‌‌క చుంగ్ హే పెద్ద కుమార్తె. ఈమె..ఆసియాలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన దక్షిణ కొరియాకు 18వ అధ్యక్షురాలిగా సారథ్యం వహించనున్నారు. 

మూడో అణుపరీక్ష జరిపిన ఉత్తర కొరియా
భూగర్భ అణు పరీక్షను విజయ వంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ఫిబ్రవరి 12న ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఉల్లంఘించి జరిపిన ఈ పరీక్షను ఐక్యరాజ్యసమితి, అమెరికా, భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఖండించాయి. 2006, 2009 తర్వాత ఉత్తర కొరియా జరిపిన మూడో అణుపరీక్ష ఇది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది. దీన్ని నార్‌‌త హంజీయాంగ్ ప్రావిన్‌‌సలోని పుంగ్సీ-రీ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. గత రెండు పరీక్షల కంటే ప్రస్తుతం జరిపింది చాలా శక్తివంతమైన అణుపరీక్ష. సూక్ష్మీ కరించిన పరికరం ద్వారా నిర్వహించిన మూడోపరీక్షలో విజయం సాధించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2006, 09లో కూడా ఇక్కడే అణు పరీక్షలు జరిపింది. 2009లో పరీక్ష తర్వాత ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గట్టి ఆంక్షలు విధించింది.

హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్
పాకిస్తాన్ అణ్వాయు ధ సామర్థ్యం ఉన్న హతాఫ్ -9 (నాజర్) క్షిపణిని ఫిబ్రవరి 11న విజయవంతంగా పరీక్షిం చింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగిం చే ఈ క్షిపణి 60 కిలోమీట ర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించడంతోపాటు అణ్వాయుధాలను మోసుకుపోగలదు.

నషీద్‌కు భారత దౌత్య కార్యాలయంలో ఆశ్రయం
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ మాలేలోని భారత దౌత్య కార్యాల యంలో ఫిబ్రవరి 13న ఆశ్రయం పొందారు. నషీద్‌కు మాల్దీవుల్లోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన అరెస్ట్ భయంతో భారత్ ఆశ్రయం కోరారు. క్రిమినల్ కోర్‌‌ట జడ్జిని నిర్బంధించిన కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

హతాఫ్-2 అణు క్షిపణిని పరీక్షించిన పాక్
అణు సామర్థ్యం ఉన్న హతాఫ్-2 (అబ్దాలీ) క్షిపణిని పాకిస్తాన్ ఫిబ్రవరి 15న విజయవంతంగా పరీక్షించింది. 180 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించ గలదు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం లోకి ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణి. ఇది అణు సంప్రదాయ ఆయుధాలను మోసు కుపోగలదు.

) మధ్యగా ఆ శకలం దూసుకెళ్లింది. ఇది మళ్లీ 2019 ఫిబ్రవరి 15న భూమికి చేరువగా వస్తుంది.

అమెరికాలో ‘నెమో’ తుఫాను
ఈశాన్య అమెరికాలో మంచు తుఫాను తీవ్ర అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 8న సంభవించిన ఈ తుఫాను తాకిడికి ఐదుగురు మరణించారు. విద్యుత్ సరఫరా, రవాణాకు అంతరాయం కలిగింది. అనేక విమానాలను రద్దు చేశారు. కెనడాతో పాటు న్యూయార్క్, కనెక్టికట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాలు ఈ తుఫాను ధాటికి గురయ్యాయి. ఈ మంచు తుఫానుకు ‘నెమో’ అని పేరు పెట్టారు.

సోలమన్ దీవుల్లో భూకంపం
దక్షిణ పసిఫిక్‌లో సోలమన్ దీవుల్లో ఫిబ్రవరి 6న 8.0 తీవ్రతతో భారీ భూకంపం సంభ వించింది. దీనివల్ల పసిఫిక్ తీరంలో చిన్నపాటి సునామీ అలలు చెలరేగాయి. తొమ్మిది మంది మరణించారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 100 గ్రామాలు సునామీ ధాటికి గురయ్యాయి. సోలమన్ దీవులు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం సంభవిస్తుంటాయి. 2007లో సోలమన్ దీవుల్లో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి 52 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సోలమన్స్‌లో 200 పైగా దీవులున్నాయి. ఈ దీవుల్లో 5,52,000 జనాభా ఉంది.

భారత్-బంగ్లాదేశ్ ఒప్పందాలు
భారత్-బంగ్లాదేశ్ మధ్య నేరస్తుల అప్పగింతపై ఒప్పందం కుదురింది. భారత హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బంగ్లాదేశ్ పర్యటన సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జనవరి 28న ఇరు దేశాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల్లో చట్టాలను అమలు చేసే సంస్థల మధ్య సహకారాన్ని మరింత పెంచేందుకు, నేరస్థులను నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. సవరించిన రవాణా ఒప్పందంపై కూడా ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. దీని వల్ల ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియ మరింత సరళం కానుంది. 

అమెరికా విదేశాంగ మంత్రిగా జాన్ కెర్రీ
అమెరికా విదేశాంగ మంత్రిగా సీనియర్ సెనెటర్ జాన్ కెర్రీ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. హిల్లరీ క్లింటన్ స్థానంలో కెర్రీ బాధ్యతలు స్వీకరించారు. 

పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ స్థానం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. ‘రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్స్’ అనే సంస్థ జనవరి 30న విడుదల చేసిన ‘2013 వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్’ ఈ విషయాన్ని పేర్కొంది. 179 దేశాల్లో ఈ సర్వే చేసింది. దీని ప్రకారం ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వేలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. తుర్క్‌మెనిస్థాన్, ఉత్తర కొరియా, ఎరిత్రియాలు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2013 అంతర్జాతీయం
దర్బన్‌లో ‘బ్రిక్స్’ సదస్సు
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా(బ్రిక్స్) దేశాల ఐదో సదస్సు దక్షిణాఫ్రికా నగరం దర్బన్‌లో 2013 మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. ‘బ్రిక్స్, ఆఫ్రికా-అభివద్ధి ఏకీకరణ, పారిశ్రామికీకరణ కోసం భాగస్వామ్యం’ అనే ఇతివత్తంతో సదస్సు నిర్వహించారు. 100 బిలియన్ డాలర్ల నిధితో బ్రిక్స్ ఆభివద్ధి బ్యాంక్ ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయించారు. సభ్యదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారం ప్రోత్సహించేందుకు, వ్యాపార సహకారాన్ని పెంచేందుకు ‘బ్రిక్స్ వాణిజ్య మండలి’ని ప్రారంభించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి చర్చలను సత్వరం పూర్తి చేయాలని,పటిష్టమైన, సుస్థిర, సమతౌల్య వద్ధిని పెంపొందించేందుకు జి-20 నాయకులు రూపొందించిన అజెండాను కొనసాగించేందుకు సమష్టిగా పనిచేయాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. బిక్స్ బిజినెస్ ఫోరమ్ సమావేశంలో సమీకత అభివద్ధి, పారిశ్రామికీకరణ కోసం బ్రిక్స్, ఆఫ్రికాల మధ్య మరింత సన్నిహిత భాగస్వామ్యానికి అంగీకరించాయి. 

ఆఫ్రికాఖండంలో మౌలిక సదుపాయాల అభివద్ధి, పారిశ్రామికీకరణకు బ్రిక్స్ దేశాలు మరింత చురుకుగా మద్దతునిస్తాయి. ప్రపంచంలో ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న ఐదు దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలను బ్రిక్స్‌గా పిలుస్తారు. 2001లో ఏర్పడిన బ్రిక్.. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. ప్రపంచ జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాల్లో ఉంది. ప్రపంచ భూభాగంలో 30 శాతం, జీడీపీలో 25 శాతం వాటా ఈ దేశాలదే. బ్రిక్స్ ఆరో సదస్సును 2014లో బ్రెజిల్‌లో నిర్వహించనున్నారు.

దోహాలో అరబ్ లీగ్ సదస్సు
కతార్ రాజధాని దోహాలో 24వ అరబ్‌లీగ్ సదస్సు 2013 మార్చి 26న జరిగింది. ప్రతిపక్షాలను అణగదొక్కుతుందన్న కారణంగా 2011లో అరబ్ లీగ్ నుంచి సిరియాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిరియా స్థానం లో ఆ దేశ తిరుగుబాటుదారులకు స్థానం కల్పించారు. సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలతోపాటు అన్ని రకాల మద్దతు తెలపాలని సదస్సు తీర్మానించింది. సిరియన్లపై ప్రభుత్వ సైనిక దాడులను డిక్లరేషన్‌లో సదస్సు ఖండించింది. సిరియా పునర్నిర్మాణానికి ఐక్యరాజ్యసమితి పరిధిలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు, సిరియా జాతీయ సంకీర్ణాన్ని, ప్రతిపక్ష దళాలను చట్టబద్దమైన ప్రభుత్వంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి సదస్సు పిలుపునిచ్చింది. అరబ్ తూర్పు జెరూసలెంకు బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు సదస్సు అమోదం తెలిపింది. తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర దేశాన్ని పాలస్తీనీయులు కోరుతున్నారు.పాలస్తీనా భూభాగం, గోలన్ హైట్స్‌లోని అరబ్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ వైదొలగడం ద్వారా శాంతికి దారితీసే చర్యలు తక్షణమే చేట్టాలని సదస్సు పిలుపునిచ్చింది. ఈ సదస్సులో 15 అరబ్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. 1945లో అరబ్‌లీగ్ ఏర్పడింది. 

కొత్త పోప్ ఫ్రాన్సిస్-1
కొత్త పోప్‌గా అర్జెంటీనా మతాధికారి జార్జి మారియో బెర్గోగ్లియో మార్చి 13న ఎన్నికయ్యారు. ఆయనను ఇక నుంచి పోప్ ఫ్రాన్సిస్-1గా వ్యవహరిస్తారు. రెండువేల సంవత్సరాల కేథలిక్ చర్చి చరిత్రలో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల నుంచి పోప్‌గా ఒక మతాధికారి ఎన్నికవడం ఇదే తొలిసారి. పోప్ బెనెడిక్ట్ తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త పోప్ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికతో 266వ పోప్ అధికారంలోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 120 కోట్ల మంది కేథలిక్ క్రెస్తవులకు పోప్ మతాధికారిగా వ్యవహరిస్తారు. 

చెనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు
చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మిలటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల క్రితం ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మూడువేల మంది సభ్యులు గల చైనా పార్లమెంటు (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్) జిన్‌పింగ్‌ను దేశాధ్యక్షుడిగా, మిలటరీ కమిషన్ చైర్మన్‌గా ఎన్నుకుంది. చైనా నూతన ప్రధానమంత్రిగా లీ కెకియాంగ్ మార్చి 15న ఎన్నికయ్యారు. కెకియాంగ్ పేరును ప్రధాని పదవికి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రతిపాదించగా... ఆ దేశ పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) ఎన్నుకుంది. 

మానవాభివద్ధి సూచీలో భారత్‌కు 136వ స్థానం
యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) మానవాభివద్ధి నివేదిక-2013లో భారత్‌కు 136వ స్థానం (గతంలో 134వ స్థానం) లభించింది. యూఎన్‌డీపీ మార్చి 14న ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో 187 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికలో చైనా స్థానం 101. చాద్ (184వ స్థానం), మొజాంబిక్ (185వ స్థానం), కాంగో(186వ స్థానం), నైజర్(186వ స్థానం) చివరి స్థానాల్లో నిలిచాయి. విద్య, ఆరోగ్యం, ఆదాయం అనే మూడు అంశాలాధారంగా మానవాభివద్ధి సూచీని రూపొందిస్తారు.

నేపాల్ ప్రధానిగా రేగ్మీ ప్రమాణం
నేపాల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖిల్ రాజ్ రేగ్మీ ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా మార్చి 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అన్నీ సవ్యంగా సాగితే ఈయన నేతత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం జూన్ 21 నాటికల్లా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.

పూర్తి కాలం కొనసాగిన పాక్ జాతీయ అసెంబ్లీ
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ చరిత్ర సష్టించింది. తొలి సారి పూర్తి కాలం కొనసాగి పాక్ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచింది. జాతీయ అసెంబ్లీ లేదా పార్లమెంట్ దిగువ సభ మార్చి 16తో ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నికల ద్వారా ఎంపికైన సర్కారును సైన్యం లేదా ఇతర రాజకీయ శక్తులు కూలదోయకపోవడం ఆ దేశంలో ఇదే తొలిసారి. ప్రభుత్వ గడువు పూర్తవడంతో ప్రధాని రజా అష్రాఫ్ మంత్రి వర్గం రద్దయింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు 12 జాతీయ అసెంబ్లీలో ఏ ఒక్కటీ పూర్తి కాలం పని చేయకపోవడం గమనార్హం.

చావెజ్ మృతి
లాటిన్ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అనారోగ్యం (కేన్సర్ వ్యాధి) తో మార్చి 5న ఆ దేశ రాజధాని కారకస్‌లో మరణించారు. చావెజ్ 14 సంవత్సరాలపాటు వినిజులా అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో మరో ఆరేళ్ల కాలానికి చావెజ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈయన 1999లో తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. చావెజ్ 1954 జూలై 28న బరినాస్ (వెనిజులా) లో జన్మించారు. చావెజ్ మృతి నేపథ్యంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో తాత్కాలిక అధ్య క్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

కెన్యా నూతన అధ్యక్షుడిగా ఉహురు కెన్యాట్ట
కెన్యా దేశ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ఉప ప్రధాని ఉహురు కెన్యాట్ట విజయం సాధించారు. మార్చి 9న విడుదలైన ఫలితాల్లో కెన్యాట్టకు 50.07 శాతం ఓట్లు, ఆయన ప్రత్యర్ధి ప్రస్తుత ప్రధాని రైలా ఒడింగాకు 43.28 శాతం ఓట్లు లభించాయి. 

ఐఏఈఏ అధిపతిగా అమనో
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధిపతిగా యుకియా అమనో (జపాన్) రెండో సారి ఎన్నికయ్యారు. మార్చి 7న వియన్నాలో జరిగిన ఐఏఈఏ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అమనో నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.

ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మార్చి 7న ఉత్తర కొరియాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన అణు పరీక్షలకు ప్రతిగా ప్రతిపాదించిన ఆంక్షల తీర్మానానికి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ దేశ బ్యాంకింగ్, రాకపోకలు, వాణిజ్యంపై నిషేధం విధిస్తూ ఆంక్షలను మరింత కఠినం చేసింది. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ప్రభుత్వ సైన్స్ అకాడమీ, ట్రేడింగ్ కంపెనీ, కొరియా మైనింగ్ డెవలప్‌మెంట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అధిపతి, డిప్యూటీ చీఫ్‌లను చేర్చింది. 2006, 09 సంవత్సరాల్లో అణు పరీక్షలు జరిపిన తర్వాత ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల కంటే ప్రస్తుత ఆంక్షలు కఠినమైనవి.

మిత్రాకు ప్రతిష్టాత్మక ‘టెడ్’ ప్రెజ్
ప్రవాస భారతీయ విద్యావేత్త, బ్రిటన్‌లోని న్యూక్యాసిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుగతా మిత్రా 2013 ఏడాదికిగాను ఫిబ్రవరి 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రతిష్టాత్మక ‘టెడ్’ ప్రెజ్ అందుకున్నారు. అవార్డు కింద మిత్రాకు సుమారు రూ. 5.4 కోట్ల (10 లక్షల డాలర్లు) నగదును కూడా బహూకరించారు. భారత్‌లోని మురికివాడల పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించేందుకు మిత్రా 1999లో ‘హోల్ ఆన్ ద వాల్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ (టెడ్) అనే మూడు రంగాల్లో విశేష కషి చేసిన వ్యక్తులను ప్రోత్సహించేందుకు టెడ్ సంస్థ ఏటా ఈ బహుమతిని అందిస్తోంది.

అమెరికా రక్షణమంత్రిగా హేగెల్
అమెరికా నూతన రక్షణ శాఖ మంత్రిగా చక్ హేగెల్ ఫిబ్రవరి 27న ప్రమాణ స్వీకారం చేశారు.

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా
బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ మార్చి 4న బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచం మొత్తం మీద అత్యధిక స్థాయిలో 1,426 మంది స్థానాలను పొందగా, 55 మంది భారతీయులకు చోటు లభించింది. భారతీయుల్లో కుబేరుడిగా ముకేష్ అంబానీ మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆరో ఏడాది అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ముకేష్ సంపద 21.5 బిలియన్ డాలర్లుకాగా, 16.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండో ర్యాంక్‌ను పొందారు. విప్రో అధినేత ప్రేమ్‌జీ 11.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, ప్రపంచ కుబేరుల్లో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (73 బిలియన్ డాలర్లు) వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని పొందడం విశేషం. స్లిమ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ (67 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలవగా, స్పెయిన్‌కు చెందిన ఎమనికో ఓర్టెగా (57 బిలియన్ డాలర్లు ) మూడో ర్యాంక్‌ను, వారెన్ బఫెట్ (53.5 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానాన్ని పొందారు. ఇక ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్‌లో ముకేష్‌కు 22వ ర్యాంక్ లభించగా, లక్ష్మీ మిట్టల్ 41, ప్రేమ్‌జీ 91వ స్థానాల్లో నిలిచారు.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2013 అంతర్జాతీయం
ఆగ్నేయాసియాలో 1.3 బిలియన్ మలేరియా కేసులు
ఆగ్నేయాసియాలో 1.3 బిలియన్ల మంది మలేరియా బారినపడనున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్యుహెచ్‌ఓ) ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో వీరి సంఖ్య 15 శాతంగా ఉంది. ఆఫ్రికా తరువాత అత్యధికంగా ఆగ్నేయాసిలోనే మలేరియా బాధితులున్నారు. ఆగ్నేయాసియాలోని 11 దేశాల్లో మాల్దీవులు తప్ప మిగిలిన 10 దేశాల్లో మలేరియా వ్యాధి ప్రభలుతోంది. 1984 నుంచి మాల్దీవులు మలేరియా లేని దేశంగా ఉంది. భారత్‌లో కూడా మలేరియా ప్రభలుతోందని, ప్రతి ఏటా 700 మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. గిరిజనులు, వలస ప్రజలు, ఆగ్రోఫారెస్ట్రీ, జల విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, మైనింగ్, రబ్బరు తోటల్లో పనిచేసే వారికి మలేరియా ఎక్కువగా సోకుతోందని డబ్యుహెచ్‌ఓ పేర్కొంది.

సెర్బియా, కొసావోల మధ్య ఒప్పందం
సెర్బియా, కొసావో ప్రధాన మంత్రులు ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ 19న బ్రస్సెల్స్‌లో కుదిరింది. కొసావో పార్లమెంట్ ఏప్రిల్ 21న, సెర్బియా పార్లమెంట్ ఏప్రిల్ 27న ఒప్పందాన్ని ఆమోదించాయి. అయితే, వేలాది మంది కొసావో సెర్బులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనకు దిగారు. ఈ ఒప్పందం బాల్కన్ ప్రత్యర్థుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి ఇ.యు.లో సభ్యత్వానికి మార్గం ఏర్పరుస్తుంది. తిరుగుబాటు కొసావో సెర్బులపై కొసావో అల్బేనియన్ నాయకత్వానికి అధికారాన్ని ఈ ఒప్పందం అప్పగిస్తుంది. దీంతో ఉత్తర కొసావోలో సెర్బియా నియంత్రణ ముగుస్తుంది. ఇందుకు ప్రతిగా మైనారిటీ సెర్బులు కొసావో పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి పొందుతారు. సెర్బియా నుంచి కొసావో 2008లో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. దీన్ని సెర్బియా గుర్తించలేదు. అయితే అమెరికాతో 90కి పైగా దేశాలు, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 22 దేశాలు కొసావోను గుర్తించాయి.

ఇటలీ ప్రధానిగా లెట్టా ప్రమాణ స్వీకారం
ఇటలీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్రికో లెట్టా (46) ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేసారు. లెట్టా నాయకత్వంలో రెండు నెలల తరువాత కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ పార్టీలు ఆవసరమైన మెజారిటీ సాధించలేదు. కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని లెట్టాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ (ిపీడీ), మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనికి చెందిన పీపుల్స్ ఆఫ్ లిబర్టీ (ిపీడీఎల్) పార్టీలు కలిసి ఏర్పాటు చేసాయి.

గోల్కొండ వజ్రానికి రూ. 211 కోట్లు
హైదరాబాద్ నిజాంకు చెందిన గోల్కొండ వజ్రం ఏప్రిల్ 17న న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో రూ. 211 కోట్ల ధర పలికింది. 34 క్యారెట్ల ఈ ‘ప్రిన్సీ’ వజ్రాన్ని క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది. గోల్కొండ గనుల్లో బయట పడ్డ ఈ వజ్రం ఒకప్పుడు హైదరాబాద్ చివరి నిజాం వద్ద ఉండేది.

ఐసీసీ ఉపాధ్యక్షునిగా మిట్టల్
ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఉపాధ్యక్షునిగా భారతీ ఎంటర్‌ప్రెజెస్ సీఈఓ సునీల్ భారతీ మిట్టల్ ఎన్నికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన మూడో వ్యక్తి మిట్టల్. గతంలో భారత్ రామ్ (1969-17), హరిశంకర్ సింఘానియా (1993-94) ఈ పదవిలో నియమితులయ్యారు. ఐసీసీని 1919లో ఏర్పాటు చేశారు.

టైమ్ ప్రభావశీలుర జాబితాలో చిదంబరం, అమీర్
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాలో భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌లకు చోటు దక్కింది. అలాగే పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ జాబితాలో ఉన్నారు. 

ఇటలీ అధ్యక్షుడిగా నపోలిటానో
ఇటలీ అధ్యక్షుడిగా జియోర్జియో న పోలిటానో ఏప్రిల్ 20న తిరిగి ఎన్నికయ్యారు. ఇటలీ చరిత్రలో రెండుసార్లు వరుసగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.

సుదీర్ఘ చర్చా కార్యక్రమంతో గిన్నిస్ రికార్డు
నేపాల్‌కు చెందిన రబీ లమిచానే అనే టీవీ వ్యాఖ్యాత 62 గంటలపాటు టీవీ చర్చా కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ కెక్కాడు. ఏప్రిల్ 14న ‘లార్డ్ బుద్ద వజ్ బోర్న్ ఇన్ నేపాల్’ అనే అంశంపై ఆయన ఏకధాటిగా 62 గంటల 12 నిమిషాల పాటు చర్చా కార్యక్రమం నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు 52 గంటలు టీవీ కార్యక్రమం నిర్వహించిన రికార్డు ఉంది.

వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయం
ఏప్రిల్ 14న జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో తాత్కాలిక అధ్యక్షుడు, యునెటైడ్ పార్టీ అభ్యర్థి నికోలస్ మదురో విజయం సాధించారు. ప్రత్యర్థి హెన్రీక్యూ కాప్రిల్స్‌పై విజయం సాధించారు. ఏప్రిల్ 18 నుంచి ఆరేళ్లపాటు మదురో అధ్యక్షుడిగా కొనసాగుతారు. వెనిజులా అధ్యక్షుడుగా ఉన్న హ్యూగో చావెజ్ మార్చి 5న మరణించడంతో ఆయన స్థానంలో మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

హతాఫ్ -4ను ప్రయోగించిన పాక్
అణ్వాయుధ సామర్థ్యం గల హతాఫ్-4 బాలిస్టిక్ క్షిపణిని పాకిస్థాన్ ఏప్రిల్ 10న విజయవంతంగా పరీక్షించింది. ఇది 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 

కెన్యా అధ్యక్షుడిగా కెన్యాట్టా ప్రమాణ స్వీకారం
కెన్యా నాలుగో అధ్యక్షుడిగా ఉరు కెన్యాట్టా ఏప్రిల్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. 51 ఏళ్ల కెన్యాట్టా కెన్యాకు తక్కువ వయస్సుగల అధ్యక్షుడు. ఆఫ్రికా అత్యంత ధనవంతుల్లో ఒకరు. మార్చి 4న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఉన్న రైలా ఒడింగాపై విజయం సాధించారు.

ప్రధాని జర్మనీ పర్యటన 
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జర్మనీ పర్యటనలో ఏప్రిల్ 11న భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల రెండోదఫా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఉన్నత విద్య, పౌరభద్రత పరిశోధన, గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించిన అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్‌తో 2000లో అంగీకరించిన వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఇందులో వాణిజ్యం, ద్వైపాక్షిక పెట్టుబడులు, ఇంధనం, ఇంధన భద్రత, పర్యావరణం, సంస్కతి, విద్యా శిక్షణ పరిశోధన, టెక్నాలజీ రక్షణ వంటి రంగాల్లో ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకు ఉన్న అవకాశాలను గుర్తించారు.

ఏటీటీకి- ఐకాస ఆమోదం
ప్రపంచ ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందానికి (ఏటీటీ) ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏప్రిల్ 2న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో సాధారణ సభలో 193 దేశాలకుగాను 154 దేశాలు అనుకూలంగా 3 దేశాలు వ్యతికేకంగా ఓటు వేయగా 23 దేశాలు గైర్హాజరయ్యాయి. ఒప్పందం ఉగ్రవాదులు, రాజ్యాంగేతర శక్తుల పట్ల బలహీనంగా ఉందంటూ భారత్, చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇరాన్, సిరియా, ఉత్తర కొరియాలు వ్యతిరేకంగా, అమెరికా అనుకూలంగా ఓటు వేసాయి. ఈ ఒప్పందం 70 బిలియన్ల అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్దీకరిస్తుంది. ఇందులో తేలికపాటి ఆయుధాల నుంచి యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు వంటి సంప్రదాయ ఆయుధ వ్యాపారం జరుగుతుంది. సరిహద్దులు దాటి ఆయుధాలు వెళ్లడాన్ని నియంత్రిస్తుం ది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న గ్రూపులకు ఆయుధాలను అందకుండా అడ్డుకుంటుంది. అందుకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయిస్తారు. ఈ ఒప్పందంపై జూన్ 3వరకు సభ్యదేశాలు సంతకం చేయ వచ్చు. సంతకాలు చేసిన 50 దేశాల్లో పార్లమెంట్ ఆమోదం తెలిపిన 90 రోజుల్లో ఒప్పందం అమల్లోకి వస్తుంది.

లెబనాన్ కొత్త ప్రధానిగా తమ్మమ్ సలామ్ 
లెబనాన్ కొత్త ప్రధానమంత్రిగా తమ్మమ్ సలామ్ ఏప్రిల్ 6న నియమితులయ్యారు. పార్లమెంటు ఆయన నియామకాన్ని మెజారిటీతో ఆమోదించింది. ప్రధాని నజీబ్ మికాతీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సలామ్ నియమితులయ్యారు.

స్వల్పంగా అమెరికాలో తగ్గిన నిరుద్యోగిత రేటు
అమెరికాలో నిరుద్యోగిత రేటు మరికాస్తా తగ్గింది. అదనంగా 88 వేల ఉద్యోగాలు లభించడంతో మార్చి నెలకు 7. 6 శాతం నమోదైంది. అంతక్రితం నెల్లో ఇది 7.7 శాతం ఉంది. దేశంలో నిరుద్యోగులు 1.17 కోట్లు ఉన్నారని, నిరుద్యోగిత రేటు 7.6 శాతం ఉందని యూఎస్ శ్రామిక విభాగం వెల్లడించింది. పురుషుల్లో 6.9 శాతం, మహిళల్లో 7 శాతం నిరుద్యోగులున్నారు. అమెరికాలోని ఆసియా వాసుల్లో ఈ నిరుద్యోగిత రేటు 5 శాతం ఉంది. గత పన్నెండు నెలలుగా అమెరికాలో సగటున ప్రతి నెల 1,69,000 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మార్చిలో ఆరోగ్య సంరక్షణ, వత్తినిపుణులు, వ్యాపార సేవల రంగాల్లో ఉద్యోగాలు పెరగ్గా... రిటైల్ వ్యాపారంలో ఉద్యోగిత తగ్గింది.

మొబైల్ ఫోన్‌కు 40 ఏళ్లు 
మొబైల్‌ఫోన్ వాడకం ప్రారంభమై 2013 ఏప్రిల్ 3 నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి మొబైల్ ఫోన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న చేసిన కాల్‌తో మొబైల్ ఫోన్ వాడకం మొదలైంది. ఆయన వాడిన మోటరోలా డైనా టీఏసీ పరికరం బరువు 1 కిలో. బ్యాటరీ లైఫ్ 20 నిమిషాలు. రీచార్జ్‌కు పది గంటలు పట్టేది. 1983లో మార్కెట్‌లోకి హ్యాండ్‌సెట్ విడుదలైంది. ఈ సందర్భంగా కూపర్, ఆయన బందాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వాషింగ్టన్‌లో డ్రాఫర్ ప్రెజ్‌తో సత్కరించింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల సెల్‌ఫోన్ వాడకందార్లు ఉన్నారు. ఇందులో ఒక బిలియన్ వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.

AIMS DARE TO SUCCESS 

మే 2013 అంతర్జాతీయం
తొలి పరీక్షలో గట్టెక్కిన వలస సంస్కరణల బిల్లు
అమెరికాలో కీలకమైన వలస సంస్కరణల బిల్లు మొదటి పరీక్షలో గట్టెక్కింది. ఈ బిల్లును సెనేట్ జ్యుడీషియరీ కమిటీ 13-5 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే అధికారక పత్రాలు లేని 2,60,000 మందికి పైగా భారతీయులు సహా కోటీ పది లక్షల మందికి పైగా వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి మార్గం సుగమమవుతుంది. దీంతో హెచ్-1బీ వీసాల సంఖ్య పెరుగుతుంది. సరిహద్దు భద్రత, ఆర్థిక అవకాశాలు, వలస ఆధునికీకరణ చట్టానికి సంబంధించి తీసుకురాబోతున్న సమగ్ర సంస్కరణల బిల్లుకు 300 సవరణలు చేశారు. బిల్లు తర్వాత సెనేట్ ఆమోదానికి వె ళ్తుంది. ప్రధాన భారత ఐటీ కంపెనీల ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగించే అంశాన్ని బిల్లులో అలానే ఉంచారు.

ఓక్లహామాలో తీవ్ర టోర్నడో - 24 మంది మృతి
అమెరికాలో ఓక్లహామాలో మే20 న సంభవించిన పెను సుడిగాలి (టోర్నడో) తీవ్ర విధ్వంసం సష్టించింది. దీనివల్ల 24 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. వందలాది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గంటకు 320 కి.మీ పైగా వేగంతో గాలులు వీచాయి. స్పానిష్ పదం నుంచి వచ్చిన టోర్నడో పదానికి ఉరుములతో కూడిన తుఫాను అనే అర్థముంది. దీనిని కొందరు ట్విస్టర్, సైక్లోన్ అనే పేర్లతోనూ పిలుస్తారు.

మరిన్ని విశ్వాల ఉనికికి ఆధారాలు లభ్యం!
విశ్వం ఒక్కటే కాకుండా మరిన్ని విశ్వాల ఉనికికి సంబంధించిన ఆధారాలను తొలిసారిగా సంపాదించినట్లు అమెరికాలోని నార్త్‌కరోలినా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీల ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్లాంక్ వ్యోమనౌక సేకరించిన విశ్వకాంతి (కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్-సీఎంబీ) సమాచారం ఆధారంగా పొరుగు విశ్వాలను గుర్తించినట్లు చెబుతున్నారు.

ఎవరెస్టును అధిరోహించిన అక్కా చెల్లెళ్లు
8,848 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకొని ఇద్దరు భారతీయ కవల సోదరీమణులు చరిత్ర సృష్టించారు. ఇలాంటి ఘనత సాధించిన తొలి కవలలుగా రికార్డులకెక్కారు. డెహ్రాడూన్‌కు చెందిన 21 ఏళ్ల తాషీ, నాన్సీమాలిక్‌లు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌తో పాటు పర్వతారోహణలోనూ పలు కోర్సులు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన మీర్జా అలీ, అతని సోదరి సమీనాలు కూడా ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో కరుగుతున్న ఆర్కిటిక్ మంచు
2012లో ఆర్కిటిక్ సముద్ర మంచు రికార్డు స్థాయిలో కరిగిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదికలో తెలిపింది. ఇలాంటి పరిస్థితికి ‘హరికేన్ శాండీ’ వంటి వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పులు కారణమని వెల్లడించింది. 

-2012 సెప్టెంబరులో ఆర్కిటిక్ మంచు ప్రాంత విస్తీర్ణం కేవలం 3.4 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది 2007 (తక్కువ మంచుప్రాంతంగా రికార్డుకెక్కిన ఏడాది)తో పోలిస్తే 18 శాతం తక్కువ. 

- ప్రపంచ సముద్ర మట్టాలు 1880లో ఉన్న దానికంటే ప్రస్తుతం 20 సెం.మీ. మేర ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. 

పాక్ ప్రధాని పీఠంపై నవాజ్! 
పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నేతత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. 272 స్థానాలకుగాను 126 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కేవలం 31 స్థానాలకు పరిమితమైంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) 29 సీట్లు గెలుచుకుంది. నవాజ్ షరీఫ్ మూడోసారి పాక్ ప్రధానిగా పగ్గాలు చేపడతారు. భారత్‌తో స్నేహసంబంధాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని నవాజ్ ప్రకటించారు. 

- నవాజ్ 1949లో లాహోర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించారు. 
- 1985 నుంచి 1990 వరకు పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 
- తొలిసారి పాక్ ప్రధానిగా 1990 నుంచి 93 వరకు పనిచేశారు. రెండోసారి 1997-99 మధ్య ప్రధానిగా ఉన్నారు. 

మలేసియా ప్రధానిగా నజిబ్ 
మలేసియా ప్రధాన మంత్రిగా నజిబ్ రజాక్ మే 6న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మే 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ‘బరిసన్ నేషనల్ పార్టీ’ కూటమి 222 స్థానాలకు గాను 133 స్థానాలు గెలుచుకుంది. 1957లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 56 ఏళ్లుగా ఈ నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉంది. 

కారుణ్య మరణాన్ని ఆశ్రయించిన బెల్జియం శాస్త్రవేత్త
బెల్జియం ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (వైద్యం) క్రిస్టియన్ డె దువె(95) కారుణ్య మరణాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. 1975లో సహ బెల్జియన్ అల్బెర్ట్ క్లౌడ్, అమెరికన్ పలాడేతో కలసి వైద్యంలో నోబెల్ బహుమతి పొందారు. బెల్జియంలో కారుణ్య మరణం పొందాల నుకున్న రెండో ప్రముఖ వ్యక్తి దువే. 2008లో రచయిత హుగో క్లౌస్ ఇలాగే మరణించారు. కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించిన రెండో దేశం బెల్జియం. ప్రపంచంలో తొలిసారి 2002లో నెదర్లాండ్స్ చట్టబద్ధత కల్పించింది.

బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్
బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా డాక్టర్ షిరిన్ షర్మిన్ చౌదురి ఏప్రిల్ 30న ఎన్నికయ్యారు. అబ్దుల్ హామీద్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా అతి పిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నికైన ఘనతను కూడా దక్కించుకున్నారు.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2013 అంతర్జాతీయం
ఆస్ట్రేలియా ప్రధానిగా కేవిన్ రుడ్ 
ఆస్ట్రేలియా 28వ ప్రధానిగా కేవిన్ రుడ్ జూన్ 27న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 26న జరిగిన అధికార లేబర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకూ అధ్యక్షురాలిగా ఉన్న ప్రధాని జూలియా గిలార్డ్ను ఓడించిన మర్నాడే ఆయన ఈ పదవి చేపట్టారు. కాన్బెర్రాలో గవర్నర్ జనరల్ క్వెంటిన్ బ్రైస్.. రుడ్తో ప్రమాణస్వీకారం చేయించారు. రుడ్ ప్రధాని పదవి చేపట్టడం ఇది రెండోసారి.

వలస బిల్లుకు అమెరికా సెనేట్ ఓకే
అమెరికా వలస చట్టంలో త్వరలో సమూలంగా మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ దిశగా చరిత్రాత్మక సమగ్ర వలస సంస్కరణ బిల్లును పార్టీలకు అతీతంగా భారీ మెజారిటీతో జూన్ 27న అమెరికా సెనేట్ ఆమోదించింది. ‘బోర్డర్ సెక్యూరిటీ, ఎకనమిక్ ఆపర్చ్యునిటీ, అండ్ ఇమిగ్రేషన్ మోడర్నైజేషన్ యాక్ట్’గా పిలిచే ఈ కీలక చట్టం ప్రతినిధుల సభ ఆమోదం, అధ్యక్షుడు ఒబామా సంతకం జరిగిన వెంటనే అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియ 2013 చివరికల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు. దీంతో 2.4 లక్షల మంది భారతీయులతో సహా అగ్ర రాజ్యంలో అనధికారికంగా నివాసముంటున్న 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. కొత్తచట్టం ద్వారా పన్నులు తదితర మార్గాల్లో వచ్చే 20 ఏళ్లలో అమెరికాకు ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మేరకు అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే హెచ్-1బి వీసాల విషయంలో మాత్రం భారతీయులకు తీవ్ర ఇబ్బందికరంగా, అమెరికాలోని భారత కంపెనీలకు ప్రతికూలంగా ఉన్న పలు అంశాలను కొత్త బిల్లులో యథాతథంగా ఉంచారు.

ఇరాన్‌ అధ్యక్షుడిగా హసన్‌ రోహనీ విజయం
మితవాద మత గురువు హసన్‌ రోహనీ ఇరాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 14న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 50.68 శాతం ఓట్లు లభించాయి. టె హ్రాన్‌ మేయర్‌ మహ్మద్‌ బఖేర్‌ ఖలీబఫ్‌ 15.76 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 5.05 కోట్ల మంది (72.2 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు రోహనీ సాధించడంతో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు అహ్మదీ నెజాద్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్నికలు జరిగాయి.

ఈ ఏడాది భారత్‌ వద్ధి 5.7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధిరేటు వాస్తవ ప్రాతిపదికన 5.7 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2014-15లో 6.5 శాతం, 2015-16లో 6.7 శాతం వద్ధిరేటు ఉండొచ్చని పేర్కొంది. ఎగుమతులు, ప్రెవేట్‌ పెట్టుబడులు ఇందుకు ఊతం ఇవ్వగలవని ప్రపంచ ఆర్థిక వద్ధి అవకాశాల (జీఈపీ) నివేదికలో ప్రపంచ బ్యాంక్‌ వివరించింది. దక్షిణాసియా ప్రాంత వద్ధిలో భారత్‌ కీలకపాత్ర పోషించనుందని తెలిపింది. భారీస్థాయిలో ఉన్న కరెంట్‌ అకౌంట్‌ లోటును కట్టడి చేసుకునేందుకు భారత్‌ ఎక్కువగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం వల్ల, ఒకవేళ ఇన్వెస్టర్ల సెంటిమెంటు ప్రతికూలంగా మారితే సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. సంపన్న దేశాల్లో పరపతి విధానాలు కఠినం కావడం, రుణ సంక్షోభ భయాలు, రాజకీయ సంక్షోభాలు, దేశీయ సంస్కరణల తీరుపై అసంతప్తి మొదలైనవి ఈ కారణాల్లో ఉండగలవని పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రపంచవద్ధి రేటు 2.2 శాతంగా ఉంటుందని, 2015లో 3.3 శాతానికి చేరుకోగలదని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది.

2028 నాటికి భారత జనాభా 145 కోట్లు
2028 నాటికి భారత జనాభా 145 కోట్లకు చేరుకుంటుందని ‘ప్రపంచ జనాభా పురోగతి-2012 పునఃసమీక్ష’ పేరుతో జూన్‌ 14న విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీని ప్రకారం 2028 నాటికి భారత్‌, చైనాలు చెరో 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాలుగా అవతరించనున్నాయి. ఆ తర్వాత చైనాను అధిగమించి భారత్‌ జనాభాలో ప్రథమస్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాకుండా అభివద్ధి చెందుతున్న దేశాల్లోనే జనాభా పెరుగుదల గణనీయంగా నమోదవుతోంది. వాటిలో సగం ఆఫ్రికా ఖండంలోని దేశాలే. ప్రపంచ జనాభా మరో నెల రోజుల్లో 720 కోట్లకు చేరుతుందని, 2050 నాటికి 960 కోట్లకు చేరనున్నదని ఆ నివేదిక పేర్కొంది. అభివద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో రెండింటిలో ఆయుఃప్రమాణం పెరగనుంది. సగటున ప్రజల ఆయుర్దాయం 2040-50 మధ్యలో 76 ఏళ్లకు, 2095- 2100 నాటికి 82 ఏళ్లకు పెరుగుతుందని ఐరాస తెలిపింది.

అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌గా తియాన్హే-2
చైనాకు చెందిన తియాన్హే-2 సూపర్‌ కంప్యూటర్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌ అని జూన్‌ 17న ప్రకటించిన టాప్‌-500 సర్వే తెలిపింది. ఇది కేవలం సెకను వ్యవధిలో 33,860 లక్షల కోట్ల ఆపరేషన్లు నిర్వహించగలదు. దీని అత్యధిక సామర్థ్యం సెకనుకు 54,900 లక్షల కోట్ల ఆపరేషన్లని ఆ సంస్థ పేర్కొంది. తద్వారా అమెరికాకు చెందిన టైటాన్‌ సూపర్‌ కంప్యూటర్‌ను ఇది అధిగమించింది. దీన్ని తయారు చేయడానికి చైనా ’580 కోట్ల ఖర్చు చేసింది. తియాన్హే-2ను చైనాకు చెందిన నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ తయారుచేసింది. 

ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులోకి ట్వీట్‌
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ద్వారా బహుళ ప్రచారం పొందిన ట్వీట్‌ పదం ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ నిఘంటువులో స్థానం దక్కించుకుంది. జూన్‌ 2013 సంచికలో ఈ పదాన్ని నిఘంటువులో చేర్చనున్నారు. ట్వీట్‌కు డిక్షనరీలో చోటు కల్పించడం కోసం రూల్స్‌నే మార్చడం విశేషం. ఆక్స్‌ఫర్డ్‌ నిబంధనల ప్రకారం ఒక కొత్త పదానికి నిఘంటువులో స్థానం కల్పించాలంటే ఆ పదం పదేళ్లపాటు వాడుకలో ఉండాలి. అయితే పదేళ్ల కంటే తక్కువ కాలమే వాడుకలో ఉన్నా సరే ట్వీట్‌కు డిక్షనరీలో చోటు కల్పించారు. ట్వీట్‌ అనే పదం ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఉంది. అయితే దీనిని ఒక పక్షి పాటకు అనుబంధంగా ఉంచారు. అయితే ఇప్పుడు ఆ పదానికి అధికారిక నిర్వచనాన్ని డిక్షనరీలో పొందుపరచనున్నారు. ట్వీట్‌తోపాటు డాడ్‌ డాన్సింగ్‌, ఎపిక్‌, ఫిస్కల్‌ క్లిఫ్‌, ఫ్లాష్‌మాబ్‌, ఫాలో, గీకెరీ, పే డే లెండింగ్‌, ద సెలైంట్‌ ట్రీట్‌మెంట్‌, బిగ్‌ డాటా, క్రౌడ్‌ సోర్సింగ్‌, ఈ-రీడర్‌, మౌస్‌ ఓవర్‌, రీడెరైక్ట్‌, స్ట్రీమ్‌ వంటి మరికొన్ని పదాలు కూడా ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చోటు సంపాదించాయి.

చైనా ఐదో మానవ సహిత అంతరిక్ష యాత్ర
చైనా ఐదోసారి మనుషులతో కూడిన అంతరిక్ష యాత్రను చేపట్టింది. జూన్‌ 11న గోబీ ఎడారిలోని జియక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంజౌ-10 వ్యోమ నౌకలో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపింది. వీరితో ఒక మహిళ కూడా ఉంది. వీరు 15 రోజులపాటు అంతరిక్షంలో గడుపుతారు. లాంగ్‌మార్చ్‌-2 ఎఫ్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన షెంజౌ-10 వ్యోమనౌక కక్ష్యలో ఉన్న చైనా స్పేస్‌ల్యాబ్‌ తియాంగాంగ్‌-1తో అనుసంధానమైంది. 2020 నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా చైనా ప్రస్తుత యాత్రను చేపట్టింది. 2012 జూన్‌లో చైనా షెంజౌ-9ను పంపింది.

ప్రపంచశాంతి సూచీలో భారత్‌కు 141వ స్థానం
ప్రపంచశాంతి సూచీ (జీపీఐ)లో భారత్‌కు 141వ స్థానం దక్కింది. 162 దేశాలకు చెందిన ర్యాంకులను సిడ్నీ కేంద్రంగా పనిచేసే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ పీస్‌’ జూన్‌ 11న విడుదల చేసింది. ఈ రేటింగ్స్‌లో ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌, న్యూజిలాండ్‌ మొదటి స్థానాల్లో ఉన్నాయి. యునెటైడ్‌ కింగ్‌డమ్‌ 44, యునెటైడ్‌ స్టేట్స్‌ 99, చైనా 101, రష్యా 155 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ ర్యాంక్‌ తగ్గిపోవడానికి సైనికీకరణ, దేశీయ, అంతర్జాతీయ పోరాటాలు, అవినీతిని కారణాలుగా పేర్కొంది.

పాక్ ప్రధానిగా నవాజ్ ప్రమాణం
పాకిస్థాన్ 27వ ప్రధానమంత్రిగా పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ (63) ఎన్నికయ్యారు. జూన్ 5న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ మెజార్జీతో విజయం సాధించారు. అనంతరం ప్రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు జర్దారీ ప్రధాని షరీఫ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 342 మంది సభ్యులు గల పార్లమెంట్ దిగువ సభలో షరీఫ్‌కు 244 ఓట్లు వచ్చాయి. ఆయన 1990-93, 1997-99 మధ్య కాలంలో పాక్ ప్రధానిగా పనిచేశారు. 1999లో పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటుతో ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్ దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి భారీ మెజార్టీతో అదేపదవికి మూడోసారి ఎన్నికై చరిత్ర సష్టించారు.

ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందంపై 60 దేశాలు సంతకాలు
ప్రపంచ ఆయుధ వ్యాపార నియంత్రణ ఒప్పందంపై 60కుపైగా దేశాలు జూన్ 3న సంతకాలు చేశాయి. త్వరలో సంతకం చేస్తానని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని గత ఏప్రిల్ 2న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ప్రధాన ఆయుధ ఎగుమతిదారులు రష్యా, చైనా.. ప్రధాన దిగుమతి దేశాలు భారత్, ఈజిప్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒప్పందం ఆమోదంలో సంతకాలు చేయడం ప్రధానమైన అంశం. ఒప్పందాన్ని 50 దేశాలు ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. 60 నుంచి 85 బిలియన్ డాలర్ల వరకు ప్రపంచ ఆయుధ వ్యాపారం జరుగుతోంది. యుద్ధ ట్యాంకులు, ఆయుధ పోరాట వాహనాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకలు, క్షిపణులు, క్షిపణి ప్రయోగ వాహకాలు, చిన్న ఆయుధాలు, తేలికపాటి ఆయుధాలు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశం సంప్రదాయ ఆయుధాలను తరలించడాన్ని ఒప్పందం నిషేధిస్తుంది.

వాన్ -ఇఫ్రా అధ్యక్షుడిగా టోమస్ బ్రూనెగార్డ్
వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్-ఇఫ్రా) కొత్త అధ్యక్షుడిగా టోమస్ బ్రూనెగార్డ్ ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో జూన్ 5న జరిగిన వాన్-ఇఫ్రా వార్షిక సమావేశాల్లో స్వీడన్ స్టాంపెన్ మీడియా గ్రూప్ చైర్మన్ బ్రూనెగార్డ్‌ను వాన్-ఇఫ్రా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. మలయాళ మనోరమ (కేరళ)కు చెందిన జాకోబ్ మాథ్యూ స్థానంలో బ్రూనెగార్డ్ బాధ్యతలు చేపట్టారు. వాన్-ఇఫ్రా అనేది ప్రపంచ వార్తా పత్రికల, వార్తల ప్రచురణకర్తలకు చెందిన ప్రముఖ సంస్థ. ఇందులో 120 దేశాలకు చెందిన 18,000 ప్రచురణకర్తలు, 15,000 ఆన్‌లైన్ ప్రచురణల సంస్థలు, 3000కు పైగా కంపెనీలకు ప్రాతినిధ్యం ఉంది. పత్రిక స్వేచ్ఛ, విలువలతో కూడిన జర్నలిజం, సంపాదకత్వ నీతి, వ్యాపార పెరుగుదల వంటి అంశాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం కోసం వాన్-ఇఫ్రా పనిచేస్తుంది. ఈ సంస్థ పారిస్ (ఫ్రాన్స్), డార్మ్‌స్టడ్ (జర్మనీ)లలో ప్రధాన కార్యాలయాలతోపాటు సింగపూర్, భారత్‌లో అనుబంధ కార్యాలయాలు కలిగి ఉంది.

యూఎస్ స్పెల్లింగ్ బీ విజేత అరవింద్ మహంకాళి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో హైదరాబాదీ అమెరికన్ అరవింద్ మహంకాళి (13) విజేతగా నిలిచాడు. నెడైల్ (Knaidel) అనే జర్మనీ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి అరవింద్ ఛాంపియన్‌షిప్ సాధించాడు. అరవింద్‌కు ట్రోఫీతోపాటు రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తారు. రెండు, మూడు స్థానాల్లో కూడా భారతీయ అమెరికన్ విద్యార్థులే నిలిచారు. వరుసగా ఆరోసారి భారత సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో గెలిచారు. గతంలో సమీర్ మిశ్రా (2008), కావ్య శివశంకర్ (2009), అనామికా వీరమణి (2010), సుకన్యారాయ్ (2011), స్నిగ్ధ నందిపాటి (2012) విజేతలుగా నిలిచారు.

భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించిన ఓఈసీడీ
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) 2013 సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధిని 5.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఓఈసీడీ మే 29న విడుదల చేసిన ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో భారత జీడీపీ వృద్ధి వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుతుందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ వద్ధి 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదిలో 3.1 శాతం వద్ధి చెందుతుందని తెలిపింది. ఇది 2014లో 4 శాతానికి పెరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2013లో 1.9 శాతం, 2014లో 2.8 శాతం వృద్ధి చెందుతుందని వెల్లడించింది. 
ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ స్థానాన్ని ఆక్రమిస్తుందని కూడా ఓఈసీడీ పేర్కొంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో చైనా, అమెరికాను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కూడా తెలిపింది.

AIMS DARE TO SUCCESS 

జూలై 2013 అంతర్జాతీయం
కువైట్ ఎన్నికల్లో లిబరల్ గిరిజన గ్రూపుల విజయం
కువైట్ పార్లమెంట్కు జూలై 27న జరిగిన ఎన్నికల్లో లిబరల్, గిరిజన గ్రూపులకు చెందినవారు విజయం సాధించారు. మైనారిటీ షియా ఎంపీలు ఉన్నవాటిలో సగం కంటే ఎక్కువ నష్టపోయారు. ఇవి ఎనిమిది నెలల్లో రెండో పార్లమెంటరీ ఎన్నికలు. ఐదేళ్లలో ఆరోసారి పార్లమెంట్కు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో 52.5 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 50 స్థానాలు గల పార్లమెంట్లో షియాకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. గత పార్లమెంట్లో 17 మంది షియా అభ్యర్థులు ఉండేవారు. లిబరల్స్ ముగ్గురు ఎన్నికయ్యారు. గత పార్లమెంట్లో వీరికి ప్రాతినిధ్యం లేదు. గిరిజన గ్రూపులకు చెందినవారు 24 మంది ఎన్నికయ్యారు. సున్నీ ఇస్లామిస్టులు ఏడుగురు ఎన్నికయ్యారు. ముస్లిం బ్రదర్హుడ్, మరికొన్ని ప్రధాన గిరిజన గ్రూపులు ఎన్నికలను బహిష్కరించాయి. మొత్తం సభ్యుల్లో ఇద్దరే మహిళలున్నారు. కువైట్లో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంట్ సభ్యులు స్వతంత్య్ర అభ్యర్థులుగా ఉంటారు. ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాజు ప్రధానమంత్రిని ఎంపిక చేస్తారు. 

హవాయ్లో భారీ ఆప్టికల్ టెలిస్కోప్ ఏర్పాటుపై ఒప్పందం
తర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణానికి సంబంధించిన భాగస్వామ్య ఒప్పందంపై కెనడా, చైనా, భారత్, జపాన్, అమెరికాలు హవాయ్లో జూలై 26న సంతకాలు చేశాయి. టీఎంటీ ఖగోళ శాస్త్ర పరిశోధనలో విప్లవాత్మకమైన సౌకర్యాలు అందిస్తుంది. కాలిఫోర్నియా, కెనడా యూనివర్సిటీలతోపాటు మిగిలిన సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలు దీన్ని చేపట్టాయి. హవాయ్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ప్రపంచంలోనే అతిపెద్దది. దీనికి 1.5 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తారు. ఈ అత్యాధునిక ప్రాజెక్టు నిర్మాణం పనులు 2014 ఏప్రిల్లో మొదలై, 2022 నాటికి శాస్త్రీయ పరిశోధనకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందంలో ప్రాజెక్ట్ లక్ష్యాలు, నిర్వహణ నిర్మాణాన్ని రూపొందించడం, సభ్యదేశాల హక్కులు, బాధ్యతలు, ప్రయోజనాలు ఉంటాయి.

మాస్కోలో జి-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం
జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం మాస్కోలో జూలై 19-20 తేదీల్లో జరిగింది. ఆర్థిక వ్యవస్థల వృద్ధి పునరుత్తేజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి కల్పన, ద్రవ్యలోటును తగ్గించడం వంటి సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. కార్పొరేట్ ట్యాక్స్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని జి-20 నిర్ణయించింది. ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు లోపాలను ఆసరాగా తీసుకుని బిలియన్ల డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమావేశం విడుదల చేసింది. ఈ సమావేశంలో జి-20 దేశాల మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతోపాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినే లగార్డే, భారత్ నుంచి ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పాల్గొన్నారు.

చైనా భూకంపాల్లో 90 మంది మృతి
చైనాలో జూలై 22న సంభవించిన భారీ భూకంపాల వల్ల 90 మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. నైరుతి చైనా ప్రావిన్స్లో సంభవించిన ఈ భూ కంపాల తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6, 5.6గా నమోదైంది. వీటి తాకిడికి 20,000 ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఐర్లాండ్ చరిత్రాత్మక నిర్ణయం
వివాదాస్పద అబార్షన్ల బిల్లుకు సంబంధించి రోమన్ క్యాథలిక్ దేశం ఐర్లాండ్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గర్భస్రావానికి అనుమతి ఇచ్చే చట్టానికి ఐర్లాండ్ దిగువ సభ జూలై 12న ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే సందర్భాల్లో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించింది. రోమన్ క్యాథలిక్ నియమాలను పాటించే దేశంగా పేరున్న ఐర్లాండ్లో అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం. గత ఏడాది అక్టోబర్లో ఐర్లాండ్లో నివసించే భారత సంతతి దంత వైద్యురాలు సవితా హాలప్పనావర్ (31)కు గర్భస్రావానికి నిరాకరించడంతో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్, ఐర్లాండ్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్లకు అనుకూలంగా చట్టాన్ని సవరిస్తూ కొత్త బిల్లును రూపొందించింది. ఈ చట్టానికి ఐరిష్ ఎగువసభ ఆమోదం లభించాల్సి ఉంది. 

భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య ఒప్పందం
త్రైపాక్షిక సహకరంపై భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య జూలై 8న కొలంబో (శ్రీలంక రాజధాని)లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సముద్ర భద్రతకు సంబంధించిన సమాచారాన్ని, సామర్థ్యాన్ని ఈ మూడు దేశాలు పరస్పరం పంచుకుంటాయి. హిందూ మహాసముద్ర ప్రాంత సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఈ సమావేశంలో భారత్ తరపున ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ పాల్గొన్నారు. ఈ మూడు దేశాల భద్రతా సలహాదారుల స్థాయి తొలి చర్చలు 2011 అక్టోబర్లో మాలేలో జరిగాయి. 

ఈజిప్టు ఉపాధ్యక్షుడిగా ఎల్ బరాదీ
ఈజిప్టు ఉపాధ్యక్షుడిగా నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ మాజీ అధిపతి మహమ్మద్ ఎల్ బరాదీ జూలై 9న నియమితులయ్యారు. అదేవిధంగా విదేశీ వ్యవహారాలను కూడా బరాదీ పర్యవేక్షిస్తారు. ఆర్థికవేత్త హజీమ్ ఎల్ బెబ్లావీని ప్రధానమంత్రిగా తాత్కాలిక అధ్యక్షుడు అద్లీ మన్సౌర్ నియమించారు. బెబ్లావీ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పని చేశారు.

ఐరాస మహిళా సంస్థ అధిపతిగా మ్లాంబో
దక్షిణాఫ్రికా మాజీ ఉపాధ్యక్షురాలు ఫుమ్జిలే మ్లాంబో నకుకా ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా జూలై 10న నియమితులయ్యారు. మిచెల్లే బాచ్లెట్ (ఈ సంస్థకు తొలి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్) స్థానంలో మ్లాంబో బాధ్యతలు స్వీకరిస్తారు. మ్లాంబో 2005-08 మధ్య దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. మహిళా హక్కులను ప్రాచుర్యంలోకి తేవడం, ప్రపంచ వ్యవహారాల్లో మహిళలను పూర్తిగా భాగస్వామ్యులను చేయడం అనే లక్ష్యాలతో ఈ సంస్థ పని చేస్తుంది.

భూటాన్ ఎన్నికల్లో విపక్షం విజయం
భూటాన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన విపక్షం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) విజయం సాధించింది. పార్లమెంటు దిగువ సభలోని మొత్తం 47 స్థానాలకు జూలై 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీపీ 32 సీట్లను కైవసం చేసుకుంది. పీడీపీ అధ్యక్షుడు షెరింగ్ తోబ్గే కొత్త ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశముంది. 2008లోప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చిన భూటాన్లో పార్లమెంటు ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. పోలింగ్ కోసం భారత్ 1,900కుపైగా ఈవీఎంలను అందించింది. మూడంచెల పార్లమెంటు వ్యవస్థ ఉన్న భూటాన్లో ఎగువ సభలోని 25 మంది సభ్యుల్లో ఐదుగురిని రాజు నియమిస్తుండగా 20 మంది 20 జిల్లాల నుంచి ఎన్నికవుతారు. దిగువ సభలోని 47 మంది 47 నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు.

ఈజిప్ట్ పీఠంపై మన్సూర్
ప్రజాగ్ర హానికి సైనిక తిరుగుబాటు తోడవడంతో అధ్యక్ష పదవిని కోల్పోయిన మహమ్మద్ ముర్సీ స్థానంలో ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎడ్లీ మహ్మద్ మన్సూర్ జూలై 4న తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు మన్సూర్ అధికారంలో కొనసాగుతారని ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ సిసీ ప్రకటించారు. తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమం సాక్షిగా.. దేశంలో తొలిసారి జరిగిన ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టిన ముర్సీ ఏడాదిలోనే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రజల డిమాండ్లను నెర వేర్చడానికి, సంక్షోభాన్ని పరిష్కరించడానికి సైన్యం విధించిన 48 గంటల గడువును ముర్సీ తోసిపుచ్చడంతో.. జూన్ 3న ఆర్మీ ఆయనను పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం సైన్యం ఆయనను రాజధాని కైరోలోని అధ్యక్ష భవనంలో గృహనిర్బంధంలో ఉంచింది. 

కూలిపోయిన రష్యా రాకెట్ ప్రోటాన్ - ఎం
మూడు గ్లోనాస్ నావిగేషన్ ఉపగ్రహాలను మోసుకెళ్తున్న రష్యా రాకెట్ ప్రోటాన్ - ఎం గాలిలో పేలిపోయింది. దీనిని జూలై 2న కజకిస్థాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. పేలుడు వల్ల రాకెట్లో ఉండే 170 టన్నుల విషపూరితమైన హెప్టైల్ ఇంధనం వాతావరణంలోకి విడుదలైందనే ఆందోళన వ్యక్తమైంది.

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 
142 దేశాలకు సంబంధించి రూపొందించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్కు 66వ స్థానం దక్కింది. ఈ సూచీని కార్నెల్ యూనివర్సిటీ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ), భారత పారిశ్రామిక మండలి (సీఐఐ) ప్రచురించాయి. స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, స్వీడన్కు రెండోస్థానం దక్కింది. ఈ దేశాలు వరుసగా రెండో ఏడాదీ ముందున్నాయి. ఈ సూచీలో 84 అంశాల ఆధారంగా స్థానాలు కేటాయించారు. ఇందులో విశ్వవిద్యాలయాల నాణ్యత, సూక్ష్మ రుణ సౌకర్యం అందుబాటు, వెంచర్ క్యాపిటల్ ఒప్పందాలు, ఇన్నోవేషన్ సామర్థ్యం మొదలైనవి ఉన్నాయి. దేశంలో రాజకీయ అస్థిరతతో కూడిన పేలవ మైన ఇన్నోవేషన్ పనితీరు భారత్ స్థానం తగ్గేందుకు కారణమైంది. కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సేవల ఎగుమతుల్లో భారత్కు లభించిన మొదటిస్థానం భారత్ 66వ ర్యాంకు సాధించడానికి తోడ్పడింది.

అతిపెద్ద గాలిమరను ప్రారంభించిన బ్రిటన్
ప్రపంచంలో అతిపెద్ద గాలిమర (విండ్ఫాం)ను బ్రిటన్ ఆగ్నేయ తీరంలో జూలై 4న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమరూన్ ప్రారంభించారు. ఇది 630 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తు ద్వారా ఐదు లక్షల గృహ అవసరాలను తీర్చవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం 2.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడంతోపాటు 20 కిలోమీటర్ల తీరంలో 175 టర్బైన్లను నిర్మించారు.

జాన్ పాల్-2కు సెయింట్ హోదా
దివంగత పోప్లు జాన్ పాల్-2, జాన్-23లకు సెయింట్ హోదా ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ జూలై 5న నిర్ణయించారు. జాన్ పాల్-2 చేసిన ఓ అద్భుతాన్ని ఫ్రాన్సిస్ ఆమోదించడంతో ఆయనను సెయింట్ను చేయడానికి మార్గం సుగమమైందని వాటికన్ ప్రతినిధి తెలిపారు. 

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2013 అంతర్జాతీయం
ఈజిప్టులో 525 మంది నిరసనకారుల మృతి
ఈజిప్టు సైన్యం అణచివేత చర్యలకు నిరసనగా వీధుల్లో చేరిన వేలాది మంది ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కార్యకర్తలపై ఆగస్టు 15న సైన్యం జరిపిన దాడుల్లో 525 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అయితే 2600 మంది మరణించినట్లు 10 వేల మంది గాయపడినట్లు ముస్లిం బ్రదర్హుడ్ తెలిపింది. జూలై 3న అధ్యక్షుడు మోర్సీని సైన్యం అధికారం నుంచి తొలగించి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది. దీంతో మోర్సీకి చెందిన ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కార్యకర్తలు తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టారు. నిరసనలు అణచి వేసేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. ఆగస్టు 14న దేశంలో నెల రోజులపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు ఎల్ బరాదీ పదవికి రాజీనామా చేశారు. సైన్యం మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వ చర్యలను అనేక పశ్చిమ దేశాలు ఖండించాయి.

ఇరాన్ అధ్యక్షుడిగా రౌహనీ 
మితవాద మతగురువు హసన్ రౌహనీ (64) ఇరాన్ 7వ అధ్యక్షుడిగా ఆగస్టు 4న ప్రమాణస్వీకారం చేశారు. ఇరాన్ పార్లమెంట్ ‘మిల్లి మజ్లిస్’లో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు హాజరయ్యారు. రౌహనీని నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా ఆమోదిస్తూ అగ్రనేత అయతుల్లా అలీ ఖమీనై ప్రకటన చేశారు. జూన్‌లో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో రౌహనీ విజయం సాధించారు.

డీఆర్‌డీఓ పరిజ్ఞానంతో అమెరికా బాంబు డిటెక్టర్
భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అందించిన పరిజ్ఞానంతో అమెరికా.. పేలుడు పదార్ధాలను గుర్తించేందుకు ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌ను ఆగస్టు 2న వాషింగ్టన్‌లో విడుదల చేశారు. దీన్ని అమెరికా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. భారత్ సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా పరికరాన్ని ఉత్పత్తి, సరఫరా చేయడం ఇదే తొలిసారి. 

అంతరిక్షానికి మాట్లాడే రోబో
తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) మాట్లాడే రోబో కిర్భోను జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఆగస్టు 4న పంపింది. ఈ రోబో జపాన్ వ్యోమగామి కొయిచి వాకాటాకు తోడుగా పనిచేస్తుంది. రాకెట్ హెచ్2బి ద్వారా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతోపాటు కిర్భోను కూడా పంపారు.

పాక్ అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ 
భారత్ (ఆగ్రా)లో జన్మించిన పాకిస్థాన్ రాజకీయ నేత మమ్నూన్ హుస్సేన్ పాక్‌కు 12వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 30న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్‌ఎన్) అభ్యర్థిగా బరిలోకి దిగిన 73 ఏళ్ల హుస్సేన్.. తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి, రిటైర్డ్ జడ్జి వజీహుద్దీన్ అహ్మద్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. నామమాత్రపు అధికార పదవైన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు ఓటేశారు. హుస్సేన్‌కు 432 ఓట్లు, అహ్మద్‌కు 77 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే హుస్సేన్ ఐదేళ్లు పదవిలో ఉంటారు. 

జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే
జింబాబ్వే అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (89) తాజాగా ఏడోసారి ఎన్నికయ్యారు. ఆగస్టు 3న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ముగాబే జను-పిఎఫ్ పార్టీ 61 శాతం ఓట్లు సాధించింది. ఆయన ప్రత్యర్థి మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ చేంజ్ నాయకుడు మోర్గాన్ సావంగిరైకి 34 శాతం ఓట్లు దక్కాయి. 33 ఏళ్లు (1980 నుంచి)గా అధికారంలో ఉన్న ముగాబే ప్రస్తుత విజయంతో మరో ఐదేళ్లపాటు అధికారంలో ఉంటారు.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2013 అంతర్జాతీయం
అంతర్జాతీయం
కంబోడియా ప్రధానమంత్రిగా హున్‌సేన్ ఎన్నిక
కంబోడియా ప్రధానమంత్రిగా మరో ఐదేళ్ల కాలానికి హున్‌సేన్‌ను పార్లమెంట్ సెప్టెంబర్ 23న ఎన్నుకుంది. గత 30 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న హున్‌సేన్‌ను కొత్త కేబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా రాజు నోర్‌డమ్ సిహమోనీ కోరారు. హున్‌సేన్‌కు చెందిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 68 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ)కి 55 స్థానాలు దక్కాయి.

ఐపీసీసీ నివేదిక
ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) భూ వాతావరణం వేగంగా వేడెక్కుతున్నట్లు హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను స్టాక్‌హోమ్‌లో సెప్టెంబర్ 27న విడుదల చేసింది. భూతాపానికి మానవులు కారణంగా పేర్కొంటూ ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రత 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని అంచనా వేసింది. సముద్ర మట్టాలు 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్లకు పెరుగుతాయి. వడగాల్పులు, వరదలు, కరువు అధికం అవుతాయని పేర్కొంది. వాతావరణం మరింత క్షీణించకుండా అడ్డుకునేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణం తగ్గించాలని తెలిపింది. పారిశ్రామికీకరణ ముందు నుంచి చూస్తే వాతావరణంలో కార్బన్ డై ఆకై ్సడ్ 40 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. గత మూడు దశాబ్దాలపాటు వరుసగా భూ ఉపరితలం వేడెక్కిందని, ఇది 1850 నుంచి ఏ దశాబ్దంతో పోల్చినా ఎక్కువగా ఉందని పేర్కొంది. గత 1400 సంవత్సరాల్లో 1983-2012 మధ్య 30 ఏళ్ల కాలం అత్యధిక వేడి తో కూడిందని తెలిపింది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే వాతావరణ కార్యాచరణను ఏర్పాటు చేయాలని, 2015లో ఒప్పందాన్ని రూపొందించాలని ఐపీసీసీ అధిపతి క్రిష్టినా ఫిగ్యురీస్ తెలిపారు.

ఆస్ట్రేలియా ప్రధానిగా అబోట్ ప్రమాణం
ఆస్ట్రేలియా 28వ ప్రధానమంత్రిగా లిబరల్ పార్టీ నేత టోనీ అబోట్ సెప్టెంబర్ 18న ప్రమాణస్వీకారం చేశారు. ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలోని గవర్నమెంట్ హౌస్‌లో గవర్నర్ జనరల్ క్వెంటిన్ బ్రై స్ ఆయనతో ప్రమాణం చేయించారు. అబోట్‌తోపాటు 18 మంది కేబినెట్ మంత్రులుగా, 11 మంది సహాయ మంత్రులుగా, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులుగా ప్రమాణం చేశారు.

ఉత్తమ నాయకత్వ కంపెనీల జాబితా
నాయకత్వానికి ఉత్తమమైన పది ఆసియా కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో శామ్‌సంగ్ కంపెనీకి మొదటి స్థానంలో దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో టయోటా, యూనిలివర్ కంపెనీలున్నాయి. ఈ జాబితాలో పెట్రోనాస్, జనరల్ ఎలక్ట్రిక్, ఐబీఎం, సోనీ, కోక-కోలా, డీహెచ్‌ఎల్ ఇంటర్నేషనల్ సంస్థలకు చోటు దక్కింది. అంతర్జాతీయ జాబితాలో చూస్తే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, జనరల్ ఎలక్ట్రిక్, కోక-కోలాలు నిలిచాయి. 

సీసీఆర్‌ఏలో భారత్‌కు అధికారిక గుర్తింపు
భారత్‌కు కామన్ క్రైటీరియా రికగ్నిషన్ అరేంజ్‌మెంట్ (సీసీఆర్‌ఏ) సంస్థలో అధికారిక గుర్తింపు (ఆథరైజ్డ్ నేషన్) లభించింది. ఇటువంటి గుర్తింపు పొందిన 17వ దేశం భార త్. తద్వారా సైబర్ సెక్యూరిటీకి అనుగుణంగా ఐటీ ఉత్పత్తులను పరీక్షించడం, సర్టిఫికెట్ ఇవ్వడం వంటి కార్యకలాపాలను భారత్ నిర్వహించవచ్చు. దీంతో అంతర్జాతీయ సంస్థ లు కూడా తమ ఉత్పత్తుల పరీక్ష, సర్టిఫికెట్ల జారీ కోసం భారతీయ కంపెనీలను ఆశ్రయించవచ్చు. మొత్తం 26 సభ్య దేశాలు ఉండే సీసీఆర్‌ఏలో భారత్ ఇప్పటి వరకు వినియోగ దేశ హోదా (కన్‌స్యూమ్డ్ నేషన్)లో మాత్రమే ఉంది.

ఆర్కిటిక్‌లో రష్యా నేవల్‌బేస్
ఆర్కిటిక్ ఖండంలో 20 సంవత్సరాల తర్వాత తిరిగి నేవల్ బేస్‌ను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ సెప్టెంబర్ 18న వెల్లడించారు. 

బుకర్ పరిధి పెంపు
సాహిత్య ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ది మ్యాన్ బుకర్ ప్రై జ్ పరిధిని విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బుకర్‌ను ఇంగ్లిష్ మాట్లాడే (స్పీకింగ్) దేశాలకు చెందిన రచయితలకు మాత్రమే ప్రదానం చేసే వారు. ఇప్పటి నుంచి ప్రపంచంలో ఏ దేశ రచయిత అయినా బుకర్ కోసం పోటీ పడొచ్చని బుకర్ ప్రైజ్ చైర్మన్ జోనాథన్ టేలర్ తెలిపారు. కానీ ఆ పుస్తకం మాత్రం యూకేలోనే ప్రచురితమై ఉండాలి.

జర్మనీ ఎన్నికల్లో సీడీయూ విజయం
జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ) విజయం సాధించింది. గత రెండు ఫలితాల కంటే అధిక సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ.. అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సెప్టెంబర్ 23న వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్రిస్టియన్ సోషల్ యూనియన్‌లు 41.7 శాతం ఓట్లు సాధించాయి.

ప్రపంచ ఆహారంలో మూడో వంతు వృథా
ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మూడో వంతు (1/3) వృథా అవుతున్నా యని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) సెప్టెంబర్ 11న తన నివేదికలో తెలిపింది. ‘ఆహార ధాన్యాల వృథా - సహజ వనరులపై ప్రభావం’ పేరుతో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తొలిసారిగా వెలువరించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయంగా తిండిని వృథా చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పర్యావరణ కోణంలో వివరించారు. ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం, మనిషి నిర్లక్ష్యం కారణంగా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మూడో వంతు వృథాగా మారుతున్నాయని తెలిపింది. ప్రతిరోజూ 820 మిలియన్ల మంది ఆకలితో ఉంటున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వృథాగా పోతున్న ఆహారం విలువ 750 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో చేపలు, సముద్ర సంబంధిత ఆహారాన్ని చేర్చలేదు. వృథా అవుతున్న ఆహారాన్ని 1.3 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఉత్పత్తి చేసిన ఆహారంలో తినకుండాపోతున్న దానివల్ల ప్రతి ఏటా వాతావరణంలోకి 3.3 బిలియన్ టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు చేరుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆహార వృథాలో 54 శాతం ఉత్పత్తి, నూర్పిడి తర్వాత నిర్వహణ, నిల్వ స్థాయిల్లో వృథా అవుతోంది. మిగిలిన 46 శాతం ప్రాసెసింగ్, పంపిణీ, వినియోగ స్థాయిలో వృథాగా పోతోంది. 

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జీ-20 సమావేశం
జీ-20 దేశాల సమావేశం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సెయింట్‌పీటర్స్‌బర్గ్ (రష్యా)లో జరిగింది. సమావేశానంతరం జీ-20 దేశాల నాయకులు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉద్యోగ కల్పన, పటిష్టమైన, సుస్థిర, సమతౌల్య వద్ధిని తిరిగి తీసుకొచ్చేందుకు కచ్చితమైన చర్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఆర్థిక వద్ధి, ప్రపంచ ఫైనాన్స్, పన్ను ఎగవేత, ఆర్థిక క్రమబద్ధీకరణ, అవినీతి వంటి అంశాలపై డిక్లరేషన్ దష్టి సారించింది. వాతావరణ మార్పు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. సిరియా పరిస్థితిపై, సమస్యను ఎదుర్కోవడంపైన జీ-20 దేశాధినేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్ తరపున ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వచ్చే సమావేశం 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు.

భూమిపై అతిపెద్ద అగ్ని పర్వతం గుర్తింపు
భూమిపై అతి పెద్ద అగ్ని పర్వతాన్ని పసిఫిక్ మహా సముద్ర గర్భంలో కనుగొన్నట్లు హోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు సెప్టెంబర్ 5న ప్రకటించారు. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద అగ్ని పర్వతం. ఇది జపాన్‌కు 1609 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ‘తాము మాసిఫ్’గా భావిస్తున్నారు. ‘తాము మాసిఫ్’ సముద్ర గర్భంలో ఉన్న శిఖరం. 130 - 145 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. దీని విస్తీర్ణం 3,10,798 చదరపు కిలోమీటర్లు. అయితే ఏర్పడిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అది చురుకుదనం కోల్పోయింది. ప్రస్తుతం భూమిపై చురుకుగా ఉన్న ‘హవాయీ మౌనా లోయా’ అతిపెద్ద అగ్ని పర్వతం. దీని విస్తీర్ణం 5,179 చదరపు కిలోమీటర్లు. తాము మాసిఫ్ విస్తీర్ణంలో ఇది రెండు శాతం మాత్రమే. హోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ చేసిన ఈ అధ్యయనం ఈ అతిపెద్ద అగ్ని పర్వతానికి సంబంధించిన సమాచారం అందించింది.

కంబోడియాలో పాలకపార్టీ సీపీపీ విజయం
ప్రధానమంత్రి హూన్‌సేన్‌కు చెందిన కంబోడియా పీపుల్స్ పార్టీ (సీపీపీ) విజయం సాధించినట్లు కంబోడియా ఎలక్షన్ కమిటీ సెప్టెంబర్ 8న ప్రకటించింది. జూలైలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు సామ్ రైన్స్‌సే ఆరోపిస్తూ రావడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. చివరికి ఎలక్షన్ కమిటీ సీపీపీకి 3.2 మిలియన్ల ఓట్లతో 68 స్థానాలు, ప్రతిపక్ష పార్టీ సీఎన్‌ఆర్‌పీ 2.9 మిలియన్ ఓట్లతో 55 స్థానాలు దక్కినట్లు నిర్ణయించింది. 

మలాలాకు పిల్లల శాంతి బహుమతి
పాకిస్థాన్‌కు చెందిన బాలికల విద్యా ప్రచారకర్త మలాలా.. డచ్ అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి ఎంపికైంది. ఈ అవార్డును నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో సెప్టెంబర్ 6న బహూకరిస్తారు. బాలికల విద్య కోసం పోరాడుతూ ఆమె తాలిబన్ల దాడికి గురై బతికి బయటపడింది. ఈ అవార్డును డచ్‌కు చెందిన ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ 2005లో ప్రారంభించింది. ఈ అవార్డు కింద 1,33,000 డాలర్లు బహూకరిస్తారు. ఈ మొత్తాన్ని బహుమతి పొందినవారు కషిచేస్తున్న రంగానికి వెచ్చిస్తారు.

భూటాన్‌కు రూ. 5,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన భారత్
భూటాన్‌కు రూ.5000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు భారత్ ఆగస్టు 31న ప్రకటించింది. భారత పర్యటనలో ఉన్న భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉమ్మడి భద్రతా ప్రయోజనాల పట్ల రెండు దేశాలు తమ విశ్వాసం, నమ్మకాలను పునరుద్ఘాటించాయి.

అతి భారమైన మూలకం గుర్తింపు
అతి భారమైన కొత్త మూలకం కనుగొన్నట్లు జర్మనీ శాస్త్రవేత్తలు ఆగస్టు 28న ప్రకటించారు. 115 పరమాణువు సంఖ్యతో పీరియాడిక్ టేబుల్‌లో దీన్ని త్వరలో చేరుస్తారు. జర్మనీలోని జీఎస్‌ఐ పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ పరిశోధకుల బందం కొత్త మూలకం ఉనికిని ధ్రువీకరించింది. దీనికి పేరు పెట్టాల్సి ఉంది.

స్నోడెన్‌కు జర్మనీ విజిల్ బ్లోయర్ ప్రై జ్
అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (నాసా) కాంట్రాక్టర్‌గా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు జర్మనీకి చెందిన విజిల్ బ్లోయర్ ప్రై జ్ లభించింది. స్నోడెన్ అమెరికా గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సష్టించాడు. 3900 డాలర్ల ఈ అవార్డును బెర్లిన్‌లో ఆగస్టు 30న స్నోడెన్‌కు బహూకరించారు.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2013 అంతర్జాతీయం
బ్రిటన్‌లో సెయింట్ జ్యూడ్ తుపాను
సెయింట్ జ్యూడ్ తుపాను వల్ల బ్రిటన్, ఫ్రాన్స్‌ల్లో అక్టోబర్ 28న భారీ వర్షాలు, గాలులు సంభవించాయి. నలుగురు మరణించారు. రవాణా వ్యవస్థకు బాగా అంతరాయం కలిగింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

ఫిలిప్పీన్స్ భూకంపంలో 100 మందికి పైగా మృతి
ఫిలిప్పీన్స్‌లో అక్టోబర్ 15న సంభవించిన భారీ భూకంప తాకిడికి ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా మృతి చెందారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. బొహోల్ ద్వీపంలోని కార్మెన్ పట్టణ శివార్లలో భూమికి 33 కి.మీ దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది.

భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలు
భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అక్టోబర్ 17న ఎన్నుకుంది. భద్రతా మండలికి తాజాగా ఎన్నికైన చాద్, చిలీ, లిథువేనియా, నైజీరియా, సౌదీ అరేబియాలు 2014 జనవరి నుంచి రెండేళ్ల పాటు అందులో కొనసాగుతాయి. తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రస్తుతమున్న అజర్‌బైజాన్, గ్వాటెమాల, మొరాకో, పాకిస్థాన్, టోగోల కాల పరిమితి ఈ ఏడాది చివరికి ముగుస్తుంది.

బ్రూనైలో 23వ ఆసియాన్‌ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్‌) 23వ సదస్సు ‘మన ప్రజలు, సమష్టిగా మన భవిష్యత్తు’ అనే ఇతివృత్తంతో బ్రూనైలో అక్టోబర్‌ 9, 10 తేదీల్లో జరిగింది. ఈ సదస్సులో ఆసియాన్‌ నాయకులు.. మహిళలు, పిల్లల పట్ల జరిగే హింసను అంతమొందించాలని కోరారు. 2015 నాటికి ఆసియాన్‌ సమాజం ఏర్పాటుపై దృష్టి సారించారు. 2014 సదస్సు అధ్యక్ష బాధ్యతలను మయన్మార్‌కు బ్రూనై అప్పగించింది. ఈ సందర్భంగా ఐదో ఆసియాన్‌ - యూఎన్‌ సదస్సు కూడా జరిగింది. సముద్ర భద్రత, ఆహార, ఇంధన భద్రత, వాతావరణ మార్పు, సహస్రాబ్ధి లక్ష్యాల అమలు వంటి అంశాల్లో సహకారం పెంచే ఆసియాన్‌- యూఎన్‌ డిక్లరేషన్‌ అమలును కొనసాగించాలని నాయకులు అంగీకరించారు. ఇక్కడ జరిగిన 11వ భారత్‌ - ఆసియాన్‌ సదస్సులో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఆసియాన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇరుపక్షాల వాణిజ్యం 76 బిలియన్‌ డాలర్ల నుంచి 2015 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ - ఆసియాన్‌ ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తున్నాయని చెప్పారు. ఆసియాన్‌ కూటమిలో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌, లావోస్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉన్నాయి. 

ఇథియోపియా అధ్యక్షుడిగా ములాతు తెసోమి
ఇథియోపియా అధ్యక్షుడిగా ములాతు తెసోమి అక్టోబర్‌ 7న ఎన్నికయ్యారు. ఆయన లాంఛనప్రాయమైన ఈ పదవిలో ఆరేళ్లపాటు ఉంటారు.

రెమిటెన్సుల్లో భారత్‌కు మొదటి స్థానం
ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్‌ 71 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో అక్టోబర్‌ 3న తెలిపింది. చైనా 60 బిలియన్‌ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. 26 బిలియన్‌ డాలర్ల నిధులతో ఫిలిప్పీన్స్‌ మూడో స్థానంలో ఉంది. 2013లో అభివద్ధి చెందుతున్న దేశాలు పొందుతున్న మొత్తం రెమిటెన్సులు 414 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

2050 నాటికి జనాభాలో భారత్‌ నెంబర్‌ వన్‌
2050 నాటికి భారత్‌ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోగ్రఫిక్‌ స్టడీస్‌ తెలిపింది. ప్రస్తుతం భారత్‌ జనాభా 120 కోట్లు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనా స్థానాన్ని భారత్‌ ఆక్రమిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 130 కోట్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది. 

వరల్డ్‌ టాయిలెట్‌ సమ్మిట్‌
వరల్డ్‌ టాయిలెట్‌ సదస్సు ఇండోనేషియాలో అక్టోబర్‌ 2న మొదలైంది. ఈ మూడు రోజుల సదస్సులో పబ్లిక్‌ టాయిలెట్లు లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో విసర్జన ప్రధానాంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం, మురుగునీటి పారుదల సౌకర్యం అందుబాటులో లేదు. డయేరియాతో ప్రతి ఏటా 10 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సింగపూర్‌కు చెందిన జాక్‌సిమ్‌ 2001లో వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు.

15.7 మిలియన్లమందికి ఆకలి బాధ
అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలు తెలిపాయి. అక్టోబర్‌ 2న విడుదల చేసిన ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013 అనే నివేదికలో 2011-13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య 2010-12లో 868 మిలియన్లుగా ఉండేది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆకలి బాధతో ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 15.7 మిలియన్ల మంది ఆకలితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. చురుకుగా, ఆరోగ్యంగా జీవించడానికి చాలినంత ఆహారం లేకపోవడాన్ని ఆకలి బాధగా నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి ఆదాయాల పెరుగుదలకు, ఆహార లభ్యతకు తోడ్పడుతోందని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తిలో అధికవృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రై వేటు పెట్టుబడులు ఆహార లభ్యతను మెరుగుపరుస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను ప్రతి ఏటా ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రచురిస్తాయి. 

షట్‌డౌన్‌ ప్రకటించిన అమెరికా ప్రభుత్వం
అమెరికా ప్రభుత్వం అక్టోబర్‌ 1న షట్‌డౌన్‌ ప్రకటించింది. షట్‌డౌన్‌ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాలకు అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెరికా షట్‌డౌన్‌ ప్రకటించింది. 1996లో క్లింటన్‌ కాలంలో షట్‌డౌన్‌ విధించారు. ఈ పాక్షిక షట్‌డౌన్‌ వల్ల అత్యవసర, నిత్యావసర సేవలు తప్ప ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి. అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సెప్టెంబర్‌ 30న కాంగ్రెస్‌ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్‌ ప్రకటించాల్సి వచ్చింది. ‘ఒబామా కేర్‌’ అని పిలిచే ఆరోగ్య పథకంపై రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. యాజమాన్యాల నుంచి ఆరోగ్య బీమా లేనివారు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పొందాలనేది ‘ఒబామా కేర్‌’ చట్టంలోని ముఖ్య నిబంధన. దీన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2013 అంతర్జాతీయం
2013 వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘సెల్ ఫీ’
2013 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘సెల్ ఫీ (Selfie)’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నవంబర్ 19న ప్రకటించింది. సెల్‌ఫీకి ట్వెర్క్ (Twerk) మంచి పోటీ ఇచ్చింది. గత 12 నెలల్లో సెల్‌ఫీ వాడకం 17000 శాతం పెరిగినట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలిపింది. తనంత తానుగా తీసుకునే ఫొటోను సెల్‌ఫీగా నిర్వచించారు.

ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణపై ఒప్పందం
అణు కార్యక్రమం నియంత్రణకు ఇరాన్ అంగీకరిస్తూ అమెరికాతో సహా ఐదు అగ్ర దేశాలతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి జెనీవాలో నవంబర్ 24న ఇరాన్.. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్+జర్మనీ (పీ5+1) దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. దీని ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమ పరిశీలకులకు సహకరిస్తుంది. యురేనియాన్ని ఐదు శాతానికి మించి శుద్ధి చేయదు. ఇంతకుమించి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గిస్తుంది. 20 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలను నిర్వీర్యం చేస్తుంది. అరక్ అణు రియాక్టర్ ద్వారా ప్లుటోనియం ఉత్పత్తిని చేపట్టదు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ఆరునెలలపాటు సడలిస్తారు. ఇరాన్ చమురు అమ్మకాల వల్ల వచ్చిన నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నిలిచిపోయిన అకౌంట్ల నుంచి పొందొచ్చు. బంగారం, పెట్రోకెమికల్స్, కారు, విమాన విడిభాగాల వాణిజ్యంపై ఉన్న నియంత్రణలను తొలగిస్తారు.

కొలంబోలో కామన్‌వెల్త్ సదస్సు
కామన్‌వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్) నవంబర్ 15 నుంచి 17 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. న్యాయమైన వద్ధి, సమ్మిళిత అభివృద్ధి అనే అంశం ఇతివృత్తంగా సదస్సును నిర్వహించారు. ఇందులో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా అందులో 27 దేశాల అధిపతులు ఉన్నారు. 2011 పెర్త్‌లో జరిగిన చివరి సమావేశం తర్వాత సాధించిన ప్రగతిని సదస్సులో సమీక్షించారు. కామన్‌వెల్త్ చార్టర్ ఆమోదం, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ కోసం కొత్త వ్యూహాత్మక ప్రణాళికలపై ఒప్పందం వంటి అంశాలతోపాటు ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్ చేసిన ప్రతిపాదనల అమలుపై సదస్సులో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యత, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి భద్రతలు, సహనం, భావ ప్రకటన స్వేచ్ఛ, సమన్యాయపాలన, ఉత్తమ పాలన, సుస్థిర అభివద్ధి, పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వసతి అందుబాటు, లింగ సమాన్వతం, చిన్న, దుర్భల స్థితిలో ఉన్న దేశాల అవసరాలు, పౌర సమాజం పాత్ర వంటి చార్టర్‌లోని అంశాల ప్రాధాన్యతను వారు గుర్తించారు. కామన్‌వెల్త్ బిజినెస్ ఫోరం, యూత్ ఫోరం, పీపుల్స్ ఫోరం ఫలితాలను సదస్సు నాయకులు స్వాగతించారు. 2015 సదస్సు మాల్టా, 2017 సదస్సు వనౌతు, 2019 సదస్సు మలేసియా నిర్వహించేందుకు ముందుకు రావడాన్ని ఆమోదించారు. 

ఆసియా - యూరప్ మంత్రుల సమావేశం
ఆసియా- యూరప్ విదేశాంగ మంత్రుల, అధికారుల సమావేశం న్యూఢిల్లీలో నవంబర్ 11, 12 తేదీల్లో జరిగింది. ఈ 11వ ఆసియా - యూరప్ సమావేశం (ఆసెమ్)లో ‘ఆసెమ్ వృద్ధి, అభివృద్ధి కోసం భాగస్వామ్య నిర్మాణం’ అనే అంశాన్ని ఇతివత్తంగా చేపట్టారు. ఇందులో సైబర్ క్రై మ్ ప్రధాన చర్చనీయాంశమైంది. సుస్థిర అభివృద్ధి, ఇంధన సామర్థ్యం, టెక్నాలజీలతో సహా 12 అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి 36 దేశాల విదేశాంగ మంత్రులతోపాటు మొత్తం 49 దేశాల ప్రతినిధులు, యూరోపియన్ కమిషన్, ఆసియా సెక్రటేరియట్ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో 60 శాతం జనాభా ఆసెమ్ దేశాల్లోనే ఉంది. జీడీపీలో 52 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 68 శాతం ఆసెమ్ దేశాలదే. ఆసియా, యూరప్ భాగస్వామాన్ని అభివద్ధి చేసేందుకు ఆసెమ్‌ను 1994లో సింగపూర్, ఫ్రాన్స్‌లు ప్రారంభించాయి. తర్వాత మొదటి సమావేశం 1996, మార్చిలో బ్యాంకాక్‌లో జరిగింది.

బంగ్లాదేశ్‌లో మాజీ సైనికులకు మరణశిక్ష
2009 నాటి బంగ్లాదేశ్ సైనిక తిరుగుబాటు కేసులో 152 మంది మాజీ సైనికులకు ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నవంబర్ 5న మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ వద్ద 2009, ఫిబ్రవరి 25, 26న పారామిలిటరీ సిబ్బంది తిరుగుబాటు చేసి 74 మంది అధికారులను హత్య చేశారు. ఈ కేసులో కోర్టు 152 మందికి మరణశిక్ష, 158 మందికి యావజ్జీవం, 251 మందికి ఐదేళ్లవరకు జైలు శిక్ష విధించింది.

భారత్ - చైనా సైనిక విన్యాసాలు
పది రోజులపాటు సాగే భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్ 5న చైనాలోని చెగ్దూ పట్టణ సమీపంలో ప్రారంభమయ్యాయి. ఇవి ఐదేళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. ఇటీవల ఇరుదేశాలు సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో కౌంటర్ టైజంపై దష్టిసారించి ఈ విన్యాసాలు చేపట్టారు.

కువైట్ ప్రధాని భారత్ పర్యటన
కువైట్ ప్రధానమంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా తన భారత పర్యటనలో నవంబర్ 8న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తమ సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో భాగంగా పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, ఇంధన రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చలు జరిపాయి.

ఫిలిప్పీన్స్‌లో హైయాన్ తుఫాన్ విధ్వంసం
ఫిలిప్పీన్స్‌లో నవంబర్ 8, 9, 10 తేదీల్లో సంభవించిన తీవ్ర హైయాన్ తుఫాను వల్ల భారీ నష్టం జరిగింది. పదివేలమందికి పైగా మరణించారు. 44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. లైట్ ప్రావిన్స్‌లోని టాక్లోబాన్ పట్టణం అతలాకుతలం అయింది. తుపాన్ తీవ్రతకు లైట్, సమార్, విసాయాస్, బికోల్, మిండనాల్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. చైనా, వియత్నాంలపై కూడా తుపాన్ ప్రభావం పడింది.

ఉపరాష్ట్రపతి అన్సారీ క్యూబా పర్యటన
భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ క్యూబాలో పర్యటించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 31న క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో (87), అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో (82)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ - క్యూబాలు బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో సహకరించుకునే ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత్‌కు చెందిన ప్రసార భారతి, క్యూబన్ రేడియో అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్లు ఇరు దేశాల మధ్య సౌహార్థ సంబంధాలు పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు సంస్కృతి, విద్య, సైన్స్, వినోదం, క్రీడలు, వార్తలకు సంబంధించిన కార్యక్రమాలను మార్పిడి చేసుకుంటాయి.

ఆసియా-యూరప్ మధ్య సముద్రగర్భ రైలు మార్గం
ప్రపంచంలో తొలిసారి రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన సముద్ర గర్భ సొరంగ రైలు మార్గాన్ని టర్కీ అక్టోబర్ 29న ప్రారంభించింది. యూరప్ - ఆసియాలను కలిపే 13.6 కి.మీ మార్గాన్ని బస్పొరస్ జలసంధికి 60 మీటర్ల లోతులో నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 1.4 కి.మీ దిగువన ఉంటుంది. ఇది నల్ల సముద్రాన్ని మర్మరా సముద్రంతో కలుపుతుంది. ఈ మార్గానికి మర్మరేగా పేరు పెట్టారు. 2004లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2.8 బిలియన్ డాలర్ల వ్యయం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి తొలిసారి 1860లో ఒట్టమాన్ సుల్తాన్ అబ్దోల్ మెద్‌జిద్ ఆలోచించారు. కానీ నాటి సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అప్పుడు సాధ్యం కాలేదు.

ప్రపంచ సౌభాగ్య సూచీలో భారత్ స్థానం 106
ప్రపంచ సౌభాగ్య సూచీలో ఈ ఏడాది భారత్‌కు 106వ స్థానం దక్కింది. లండన్‌కు చెందిన లెగాటమ్ ఇన్‌స్టిట్యూట్ 142 దేశాలకు చెందిన జాబితాను అక్టోబర్ 31న విడుదల చేసింది. గతేడాది కూడా భారత్ 101వ స్థానంలో ఉంది. నార్వే మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా మొదటి స్థానం దక్కడం నార్వేకి ఐదోసారి. స్విట్జర్లాండ్ రెండో స్థానంలోనూ, కెనడా మూడో స్థానంలోనూ ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, భద్రత, రక్షణలతో కూడిన ఎనిమిది అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 

యూఎన్ ఆడిట్ ప్యానెల్‌లో భారత్‌కు స్థానం
ఐక్యరాజ్యసమితి బోర్డ్ ఆఫ్ ఆడిటర్స్‌కు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శశికాంత్ శర్మ ఎన్నికయ్యారు. ఈ సభ్యత్వానికి నవంబర్ 2న జరిగిన ఎన్నికల్లో భారత్.. ఫిలిప్పీన్స్‌ను ఓడించింది. 2014, జూలై 1 నుంచి చైనా స్థానంలో భారత్ సభ్యత్వం పొందుతుంది. ఆరేళ్లపాటు ఈ సభ్యత్వం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర సంస్థల అకౌంట్లను, నిధులను యూఎన్ ఆడిట్ ప్యానెల్ ఆడిట్ చేసి తన ప్రతిపాదనలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు పంపుతుంది.

వ్యాపార నిర్వహణ దేశాల జాబితాలో భారత్‌కు 134వ స్థానం
సులువుగా వ్యాపారం చేయదగ్గ దేశాల జాబితాలో భారత్‌కు 134వ స్థానం దక్కింది. ‘ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్’ అనే పేరుతో 189 దేశాలకు చెందిన జాబితాను ప్రపంచ బ్యాంకు అక్టోబర్ 29న విడుదల చేసింది. గతేడాది 131వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 134వ స్థానానికి తగ్గింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. హాంగ్‌కాంగ్ రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలోనూ నిలిచాయి. అమెరికాకు 4వ స్థానం దక్కింది.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2013 అంతర్జాతీయం
ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఈజిప్ట్
పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా సైన్యం నియమించిన ఈజిప్టు పాలకులు 2013 డిసెంబర్ 25న ప్రకటించారు. బ్రదర్‌హుడ్ అన్ని కార్యకలాపాలను నిషేధించారు. ఆ గ్రూపులో కొనసాగేవారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం బ్రదర్‌హుడ్ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా అణచివేస్తుంది. అల్ ఖైదాతో ప్రేరేపిత ఉగ్రవాదులు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో కలిసి పోలీసులు, సైనికుల హత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం నిందించింది. జులైలో మోర్సీని అధ్యక్షుడిగా సైన్యం తొలగించిన తరువాత ఆయనను తిరిగి నియమించాలని జరుగుతున్న ఉద్యమంలో వేయి మంది వరకు మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇస్లామిస్టులు ఉన్నారు. వేలాది మందిని ఖైదీలుగా చేసారు.

చిలీ అధ్యక్షురాలిగా మిచెల్ బాషెలెట్
చిలీ అధ్యక్షురాలిగా సోషలిస్టు పార్టీ నాయకురాలు మిచెల్ బాషెలెట్ డిసెంబర్ 15న ఎన్నికయ్యారు. దేశంలో సామాజిక అసమానతలు తగ్గించేందుకు భారీస్థాయిలో పన్ను, విద్యా సంస్కరణలు తీసుకొస్తానని ఆమె వాగ్దానం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు 62 శాతం ఓటర్ల మద్దతు లభించింది. 1989లో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మొదలైన తర్వాత అధ్యక్ష అభ్యర్థికి ఇంత భారీ మద్దతు లభించడం ఇదే తొలిసారి.

ఎకే 47 సృష్టికర్త కలష్నికోవ్ మృతి
ఎకే-47 ఆటోమేటిక్ రైఫిల్ సృష్టికర్త మిఖైల్ కలష్నికోవ్ (94) రష్యాలోని ఉద్ముర్షియాలో డిసెంబర్ 23న మరణించారు. ఆయన 1947లో ఆ రైఫిల్‌ను రూపొందించడంతో ఎకే 47గా పేరు పెట్టారు. ఈ అత్యాధునిక ఆయుధాన్ని రూపొందించినందుకు కలష్నికోవ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘హీరో ఆఫ్ రష్యా’ ప్రై జ్ లభించింది. 100 మిలియన్లకుపైగా ఈ రైఫిల్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. వీటిని ఇరాక్, అప్ఘానిస్థాన్, సోమాలియా వంటి పోరాట ప్రాంతాల్లో వాడుతున్నారు.

చంద్రునిపై దిగిన చైనా రోవర్
చైనా పంపిన చాంగ్-3 అనే వ్యోమనౌక డిసెంబర్ 14న చంద్రునిపై సైనస్ ఇరిడమ్ అనే ప్రదేశంలో దిగింది. ఆ నౌకలో ఉన్న ల్యాండర్‌తోపాటు యుతు (జేడ్ ర్యాబిట్) అనే రోవర్ చంద్రున్ని చేరాయి. ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి మూడు చదరపు కిలోమీటర్లలో తిరుగుతూ చంద్రుడి అంతర్నిర్మాణం, ఉపరితలంపై సర్వే చేస్తుంది. సహజ వనరుల అన్వేషణ సాగిస్తుంది. 40 సంవత్సరాల తర్వాత తొలిసారి చంద్రునిపై రోవర్ దిగింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్‌లు చంద్రునిపై రోవర్లు దింపాయి. ఇది చైనా పంపిన తొలి రోవర్. చంద్రునిపై రోవర్‌ను దించిన మూడోదేశంగా చైనాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ 1న చైనా లాంగ్‌మార్‌‌చ-3బి రాకెట్ ద్వారా చాంగ్-3 వ్యోమనౌకను ప్రయోగించింది.

అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్
అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో 2010లో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు నాసా తెలిపింది. ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 1983లో -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత 32 ఏళ్లుగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహాల సాయంతో ఈ సమాచారం సేకరించారు.

ఆసియా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం
దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు టెలివిజన్, కేబుల్ టీవీ సేవలు అందించేందుకు తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టింది. భారత్, చైనాలకు కూడా ఈ ఉపగ్రహ సేవలు అందుతాయి. ఈ రాకెట్ ద్వారా ఎస్.ఇ.ఎస్-8 అనే 3.2 టన్నుల ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కేనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 4న ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని భూమి కంటే పైన స్థిర కక్ష్యలో ఉంచి ఉపయోగించుకుంటారు.

నెల్సన్ మండేలా అస్తమయం
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95) జోహెన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 5న మరణించారు. మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనను అంతమొందించారు. అల్ప సంఖ్యాకులైన శ్వేత జాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఆయన 27 ఏళ్ల జైలు జీవితం గడిపారు. 
మండేలా 1918, జూలై 18న జన్మించారు. 1943లో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)లో చేరారు. 1960, మార్చిలో ప్రభుత్వం ఏఎన్‌సీని నిషేధించడంతో 1961 డిసెంబర్‌లో మండేలా చీఫ్ కమాండర్‌గా ఏఎన్‌సీ సాయుధ దళం ఏర్పడింది. ప్రభుత్వం 1962లో మండేలాను బంధించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1964లో జీవిత ఖైదుకు గురయ్యారు. 27 ఏళ్లపాటు రాబెన్ ఐలాండ్ జైలులో దుర్భర జీవితం గడిపారు. 1990, ఫిబ్రవరి 11న జైలు నుంచి విడుదలయ్యారు. 1991లో ఏఎన్‌సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993లో మండేలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994, ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అన్ని జాతులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. జాతి వివక్షకు తెరపడింది. 1994, మే 10న దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత 1999లో స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 2004లో ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. 1990లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతితో భారత ప్రభుత్వం మండేలాను సత్కరించింది.

దుబాయ్‌లో 2020 వరల్డ్ ఎక్స్‌పో
వరల్డ్ ఎక్స్‌పో-2020కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు నవంబర్ 28న జరిగిన బిడ్డింగ్‌లో దుబాయ్‌కు 116 ఓట్లు వచ్చాయి. రష్యాలోని ఎకటెరిన్ బర్గ్ 47 ఓట్లు మాత్రమే సాధించింది. పారిస్‌లో జరిగిన ఓటింగ్‌లో 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 6.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రై వేటు రంగం వ్యయం కలుపుకుంటే ఇది 18.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 438 హెక్టార్లలో భారీ నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. 2,77,000 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ఈ ఎక్స్‌పో నిర్వహిస్తారు. 2015లో మిలాన్‌లో ఈ ఎక్స్‌పో జరుగుతుంది. చివరగా షాంఘైలో జరిగింది.

మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానానికి యూఎన్ ఆమోదం
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కమిటీ తొలిసారిగా మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానాన్ని నవంబర్ 27న ఆమోదించింది. మహిళా హక్కు పరిరక్షకులపై జరిగే హింసాత్మక చర్యలను దేశాలు బహిరంగంగా ఖండించాలని, వారిని అడ్డుకునే చట్టాలను సవరించాలని, వారికి ఐక్యరాజ్యసమితి సంస్థల్లో అవకాశాలు కల్పించాలని ఈ తీర్మానం పేర్కొంటోంది.

ఎయిడ్స్ సంబంధిత రోగంతో 2.1 లక్షల మంది పిల్లల మృతి
గత ఏడాదిలో ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2,10,000 మంది బాలలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) తన నివేదికలో తెలిపింది. హెచ్‌ఐవి వ్యాధితో బాధపడే చిన్నారుల్లో 34 శాతం మంది తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు 10-19 సంవత్సరాల వయసువారిలో 2005-2012 మధ్యకాలంలో 50 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. 2005-12మధ్య కాలంలో పిల్లల్లో 8.5 లక్షల మందికి ఈ వ్యాధి సోకకుండా అరికట్టినట్టు నివేదిక పేర్కొంది.

గూఢచారం వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ వ్యక్తిగత జీవన హక్కు (రైట్ టు ప్రై వసీ) తీర్మానాన్ని నవంబర్ 26న ఆమోదించింది. జర్మనీ, బ్రెజిల్ ఒత్తిడితో ఈ తీర్మానం తీసుకొచ్చారు. జర్మనీ, బ్రెజిల్ నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధిపతి నవనీతం పిళ్లై దేశీయ, దేశీయేతర ప్రై వసీపై నివేదిక తయారు చేస్తారు. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, రష్యా, ఉత్తర కొరియాతోపాటు 55 దేశాలు మద్దతునిచ్చాయి.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment