AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2016

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2016
యాంటీ-ఎయిర్‌ఫీల్డ్ ఆయుధ పరీక్ష విజయవంతంరన్‌వేలు, బంకర్లను ధ్వంసంచేసే సత్తా ఉన్న అత్యాధునిక ‘స్మార్ట్ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్’ ఆయుధాన్ని రక్షణ, పరిశోధక అభివృద్ధి సంస్థ డిసెంబర్ 24న విజయవంతంగా పరీక్షించింది. చాందీపూర్- ఒడిశా మధ్య దీని ప్రయోగించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 120 కేజీల ఈ ఆయుధం 100 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2013లో రూ.56.58 కోట్లను మంజూరు చేసింది. 

అగ్ని-5 ప్రయోగం విజయవంతం అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి అగ్ని-5 ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26 ఉదయం 11.05 గంటలకు దీనిని పరీక్షించారు.

అగ్ని-5 పరిధి 5-6 వేల కిలోమీటర్లు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థమున్న ఈ క్షిపణి 1,500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. దీనిని నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించి వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ)లోకి ప్రవేశపెట్టారు. ఇందులో అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఆర్‌ఐఎన్‌ఎస్), అధునాతన మైక్రో నేవిగేషన్ వ్యవస్థ (ఎన్‌ఐఎస్‌ఎస్) ఉన్నాయి. తాజా ప్రయోగంతో ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి సామర్థ్యం ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్‌‌స, బ్రిటన్‌ల సరసన ఇండియా చేరింది.
అగ్ని-5 విశేషాలు
బరువు :
 50,000 కేజీలు
పొడవు : 17.5 మీటర్లు
చుట్టుకొలత : 2 మీటర్లు
లక్ష్య దూరం : 5,500 - 5,800 కి.మీ.
వేగం : శబ్దవేగానికి 24 రెట్లు
ఇంజిన్ : 3 స్టేజీ సాలిడ్
మోయగల సామర్థ్యం : 1500 కేజీల అణ్వస్త్రం

అగ్ని సిరీస్‌లోని క్షిపణుల వివరాలు
ప్రయోగాలు
లక్ష్యదూరాలు
ప్రయోగించిన తేది
అగ్ని-1
700 కి.మీ.
ఏప్రిల్ 19, 2012
అగ్ని-2
2000 కి.మీ.
సెప్టెంబర్ 15, 2013
అగ్ని-3
2500-3500 కి.మీ.
జనవరి 3, 2015
అగ్ని-1
2500-3500 కి.మీ.
నవంబర్ 9, 2015
అగ్ని-5
5500 - 5800 కి.మీ.
డిసెంబర్ 26, 2016


వివిధ దేశాల ఖండాంతర క్షిపణుల సామర్థ్యం
దేశం
క్షిపణి పేరు
రేంజ్ (కి.మీ)
చైనా 

డెంగ్ ఫెంగ్ (డీఎఫ్)
45,500
డీఎఫ్-31ఎ
11,200
డీఎఫ్-5
12,000
డీఎఫ్-5ఎ
13,000
ఫ్రాన్స్
ఎం 4 ఎ-బి
6,000
ఎం 51.1
6,000
బ్రిటన్
డి5 ట్రిడెంట్
27,400
అమెరికా
డి5 ట్రిడెంట్
27,400
మిన్యుటెమన్-3
9,650-13,000
రష్యా
ఆర్‌ఎస్20వీ
11,000-15,000
భారత్
అగ్ని-5
5500-5800

కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు ఉపగ్రహ ప్రయోగంగ్లోబల్ కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు తాన్‌శాట్ అనే ఉపగ్రహాన్ని డిసెంబర్ 21న చైనా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం వాతావరణ మార్పును అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుంది. దీని బరువు 620 కిలోలు. తాన్‌శాట్ ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్-2డీ రాకెట్ ద్వారా చైనాలోని గోబి ఎడారి నుంచి ప్రయోగించారు. తాన్‌శాట్‌తో పాటు హై రిజల్యూషన్ మైక్రో నానో శాటిలైట్, రెండు స్పెక్ట్రమ్ మైక్రో-నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. ఇవి వ్యవసాయం, అడవులపై అధ్యయనం చేయనున్నాయి. అమెరికా, జపాన్ తర్వాత చైనా సొంత ఉపగ్రహాలతో గ్రీన్‌హౌస్ ఉద్గారాలను అధ్యయనం చేస్తుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత, విస్తరణ, పయనం వంటి అంశాలను తాన్‌శాట్ పరిశీలిస్తుంది.

యుద్ధవిమానం ఎఫ్‌సీ-31ను పరీక్షించిన చైనాఐదో తరానికి చెందిన ఎఫ్‌సీ-31 యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించినట్లు చైనా మీడియా డిసెంబర్ 26న పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైటర్లను తయారుచేస్తున్న పశ్చిమ దేశాలకు దీటుగా చైనా ఎఫ్‌సీ-31 యుద్ధవిమానాన్ని రూపొందించింది. జే-31 జెట్‌లను మరింత అభివృద్ధి చేసిన చైనా వాటికి ఎఫ్‌సీ-31 గైర్ ఫాల్కన్‌గా నామకరణం చేసింది. చైనా డిసెంబర్ 23న ఈ యుద్ధ విమాన పరీక్షను నిర్వహించింది.
ఉపగ్రహాల తయారీలో ప్రైవేటు భాగస్వామ్యం
ఉపగ్రహాల తయారీకి సంబంధించి బెంగళూరుకు చెందిన ఆరు ప్రైవేటు పరిశ్రమలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 13న ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థల నుంచి రాకెట్ తయారీకి అవసరమైన సామగ్రిని మాత్రమే కొనుగోలు చేస్తోంది.

పీఎస్‌ఎల్‌వీ-సీ 36 ప్రయోగం విజయవంతం
శ్రీ‌హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 7న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్‌శాట్-2ఏను కక్ష్యలోకి పంపారు. మన దేశం ప్రయోగించిన రిసోర్స్‌శాట్ ఉపగ్రహాల్లో ఇది మూడోది. రిసోర్స్‌శాట్-2 జీవిత కాలం ముగుస్తుండటంతో దాని స్థానంలో 1235 కిలోల బరువు గల రిసోర్స్‌శాట్-2ఏను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం పంటల విస్తీర్ణం, దిగుబడులు, తెగుళ్లు, కరువు ప్రభావాలపై సమాచారం అందిస్తుంది. జల వనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు కూడా తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 38వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎత్తు 44.4 మీటర్లు. బరువు 321 టన్నులు. ఇస్రో 1994 నుంచి 2016 వరకు పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా 121 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో మన దేశానికి చెందినవి 42 కాగా, విదేశాలకు చెందినవి 79 ఉన్నాయి.
వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యున్-4ను చైనా డిసెంబర్ 10న విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని లాంగ్ మార్చ్-3బీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ద్వారా ఆ దేశ వాతావరణ పరిశీలనల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

శతఘు్నల కొనుగోలుకు అమెరికాతో ఒప్పందం
ఎం777 రకానికి చెందిన 145 శతఘు్నలు (howitzer guns) కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. 1980ల్లో జరిగిన బొఫోర్స్ కుంభకోణం తర్వాత ఫిరంగుల కొనుగోలుకు సంబంధించి కుదిరిన తొలి ఒప్పందం ఇది. 15వ భారత్-అమెరికా సైన్య సహకార బృందం సమావేశాలు నవంబర్ 30న ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

మండిపోయిన రష్యా అంతరిక్ష నౌకఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంధనం, ఆహారం, ఇతర సామాగ్రిని చేరవేసేందుకు ప్రయోగించిన మానవ రహిత వ్యోమనౌక విఫలమైనట్లు రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ డిసెంబర్ 1న ప్రకటించింది. ప్రోగ్రెస్ ఎమ్‌ఎస్-4 అనే సరకు రవాణా నౌకను మోసుకెళ్తున్న సోయుజ్-యు రాకెట్.. ప్రయోగించిన 383 సెకన్ల తర్వాత కేంద్రంతో సంబంధాలను కోల్పోయిందని తెలిపింది. అనంతరం నౌక వాతావరణంలో మండిపోయినట్లు ప్రకటించింది.

వాటర్ లిల్లీతో బయో ఇంధనం నీటి కలుపు మొక్కగా పిలిచే గుర్రపు డెక్కలో బయోఇంధనం ఉత్పత్తికి అవసరమైన హెమిసెల్యూలోసెస్ ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖరగ్‌పూర్ ఐఐటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, బయో ఎనర్జీ రీసెర్చ్ గ్రూప్‌నకు చెందిన సైకత్ చక్రవర్తి, సజల్ కాంతి దీనికి సంబంధించిన వివరాలను ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్’ పేరుతో డిసెంబర్ 5న విడుదల చేశారు.

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2016

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2016
హెక్సాగ్జిమ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఆవిష్కరించిన సనోఫి
చిన్న పిల్లలకు వచ్చే ఆరురకాల వ్యాధులను నయం చేయగలిగే 6 ఇన్ 1 వ్యాక్సిన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన సనోఫి పాయిశ్చర్ సంస్థ భారత్‌లో నవంబర్ 24న ఆవిష్కరించింది. హెక్సాగ్జిమ్ అనే ఈ వ్యాక్సిన్ డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, పోలియో, హెమోఫోలియా ఇన్‌ఫ్లూయెంజా-బి, హెపటైటిస్-బి అనే ఆరు రకాల వ్యాధులను నయం చేయగలుగుతుంది. ఆరువారాల నుంచి రెండు సంవత్సరాల వయసున్నవారు దీనిని వాడవచ్చు.

యూఏవీ రుస్తుం-2 తొలి పరీక్షలు విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక (ఏటీఆర్) నుంచి నిర్వహించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా వినియోగించవచ్చు. రుసు్తంను డీఆర్‌డీవో (బెంగళూరు), హెచ్‌ఏఎల్-బీఈఎల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
చైనా షెంజావు-11 యాత్ర విజయవంతం
సొంత అంతరిక్ష కేంద్రం కోసం చైనా అక్టోబర్ 17న ప్రయోగించిన షెంజావు-11 వ్యోమనౌక నవంబర్ 18న భూమికి చేరుకుంది. చైనా వ్యోమగాములు జింగ్ హయ్‌పెంగ్, చెన్‌డాంగ్‌లను అంతరిక్షానికి తీసుకెళ్లిన ఈ నౌక మంగోలియాలో దిగింది. 
చర్మ వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణం 
మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లో ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం.. ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ ఆన్‌లైన్ ఎడిషన్‌లో ఈ నెల 17న ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపా దేశాల్లో తెల్ల వాళ్లు ఎక్కువగా ఉంటే భారత్‌లో నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ఉన్నారు. మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి ప్రత్యేక జన్యువు ఆర్‌ఎస్2470102 కారణమని పరిశోధకులు తెలిపారు.
పృథ్వీ-2 విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో తయారై, అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ-2 క్షిపణిని ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి నవంబర్ 21 ఉదయం 9.35 గంటలకు దీనిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడంతో పాటు 500-1000 కిలోల బరువున్న వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తయారైన తొలి క్షిపణి.
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం
కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌక పొడవు 164 మీటర్లు, బరువు 7,500 టన్నులు. దీనిపై సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించొచ్చు.
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆఫ్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 22న జరిపిన అగ్ని-I క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఈ మిస్సైల్ 500 కిలోల బరువు గల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవుతో ఉన్న ఈ క్షిపణి దాదాపు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ క్షిపణిని రూపొందించింది. అగ్ని-1ను చివరిసారిగా 2016 మార్చి 14న ఇదే వేదిక నుంచి విజయవంతంగా పరీక్షించారు.

పెద్దగా కనిపించిన చంద్రుడు
ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నవంబర్ 14న చంద్రుడు అతి పెద్దగా కనిపించాడు. భారత్ సహా ఆసియా దేశాల్లో బిగ్ మూన్ దర్శనమిచ్చింది. భూ క్షక్ష్యలో అత్యంత చేరువగా ఉండే ప్రదేశంలోకి చంద్రుడు రావడం వల్లే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. దీన్ని సూపర్ మూన్‌గా వ్యవహరిస్తారు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 14 రాత్రి 7.22 గంటలకు అత్యంత గరిష్ట స్థాయిలో ఈ మార్పు కనిపించింది. ఆ సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,56,509 కిలోమీటర్లు. దాంతో చందమామ సాధారణం కంటే 14 శాతం అధికంగానూ, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగానూ కనిపించింది. ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఎక్స్‌ట్రా సూపర్‌మూన్‌గా అభివర్ణిస్తోంది. 1948 తర్వాత చంద్రుడు ఇంత చేరువగా రావడం ఇదే మొదటిసారి. మళ్లీ తిరిగి 2034, నవంబర్ 25న కనిపించనుంది. ఆ రోజున చందమామ 3,56,445 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంచనా.
దిక్సూచి ఉపగ్రహం పల్సార్‌ను ప్రయోగించిన చైనా 
చైనా సరికొత్త దిక్సూచి ఉపగ్రహాన్ని నవంబర్ 10న విజయవంతంగా ప్రయోగించింది. భవిష్యత్‌లో వ్యోమనౌకల కోసం స్వతంత్ర దిక్సూచి వ్యవస్థను రూపొందించే దిశగా ఎక్స్‌రే పల్సార్ నేవిగేషన్ శాటిలైట్ (ఎక్స్‌పీఎన్‌ఏవీ-1) అనే ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్-11 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహ బరువు 200 కిలోలు. ఇది భూమి చుట్టూ ఉన్న సూర్య అనువర్తిత కక్ష్యలో తిరుగుతుంది. ఇందులో అమర్చిన రెండు పల్సార్ డిటెక్టర్లు అనేక ప్రయోగాలను నిర్వహిస్తాయి. ఎక్స్‌రే పల్సార్ నేవిగేషన్ అనేది సరికొత్త దిక్సూచి పరిజ్ఞానమని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. పల్సార్లు అనే ఖగోళ వస్తువుల నుంచి క్రమం తప్పకుండా వెలువడే ఎక్స్‌రే సంకేతాలను ఉపయోగించి సుదూర విశ్వంలోని ఒక వ్యోమనౌక స్థితిని నిర్ధారించడం ఇందులో కీలకమని వారు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో వ్యవసాయ జీవవైవిధ్య కాంగ్రెస్
తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సు నవంబర్ 6న ఢిల్లీలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తూ. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆకలి, పోషకాహారలోపం, పేదరికంతో అలమటిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే మనం స్థిరమైన అభివృద్ధిని, జీవవైవిధ్య పరిరక్షణను మరిచిపోకూడదు’ అని వ్యాఖ్యానించారు. 1992 నాటి జీవ వైవిధ్య సదస్సు సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 50-150 జాతులు అంతరించి పోతున్నాయన్నారు. నవంబర్ 6 నుంచి 9 వరకు జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

అతిపెద్ద టెలిస్కోప్‌ను రూపొందించిన నాసాఅమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ అనే అతి పెద్ద టెలిస్కోప్‌ను రూపొందించింది. ఇది హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు శక్తివంతమైనది. దీనిని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులోని కెమెరాలపై సూర్య కిరణాలు నేరుగా పడకుండా ఐదు లేయర్లను ఏర్పరచడంతో స్పష్టమైన దృశ్యాలను చూసేందుకు వీలవుతుంది. గత 26 ఏళ్లుగా సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోప్‌కు ఇది కొనసాగింపు.

అత్యంత ఆకర్షణీయ ఇంటర్‌నెట్ బ్రాండ్ అమేజాన్ఆకర్షణీయమైన ఇంటర్నెట్ బ్రాండ్‌గా అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ నిలిచింది. దాని తరువాతి స్థానంలో సెర్చ్ ఇంజన్ గూగుల్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ నిలిచారుు. భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్‌‌స 2016 పేరిట ‘ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ’ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2016

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2016
అంతరిక్షంలో మొక్కను నాటిన నాసా
లెట్యూస్‌గా పిలిచే క్యాబేజీ వర్గానికి చెందిన మొక్కను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో నాటినట్లు అక్టోబర్ 25న నాసా ప్రకటించింది. భవిష్యత్తులో అంగారక యాత్రకు వెళ్లబోయే వ్యోమగాములకు ఇవి ఎంతగానో ఉపయోగపడే వీలుంది. భూమిపై రైతులు పంటను పండిచ్చినట్టే.. వ్యోమగామి షేన్ కింబరో ఈ మొక్కను నాటినట్లు నాసా వెల్లడించింది.
ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్ల్లు మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) ప్రాజెక్ట్ డెరైక్టర్ సుబ్బయ్య అరుణన్ అక్టోబర్ 28న తెలిపారు.

ఐఎన్‌ఎస్ తిహయు ప్రారంభం
వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్‌ఎస్ తిహయును తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ అక్టోబర్ 19న విశాఖపట్నంలో ప్రారంభించారు. దీన్ని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) నిర్మించింది. నాలుగు వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌ల తయారీలో భాగంగా ఇప్పటికే ఐఎన్‌ఎస్ తార్ముగ్లి నౌకను 2016 మే 23న ప్రారంభించారు. గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో పయనించే ఈ నౌక 315 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. 
కోస్ట్‌గార్డ్‌లోకి రాణీ గైడిన్‌ల్యూ
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి కొత్తగా చేరిన తీరగస్తీ నౌక ఐసీజీఎస్ రాణీ గైడిన్‌ల్యూను డెరైక్టర్ జనరల్ రాజేంద్రసింగ్ అక్టోబర్ 19న ప్రారంభించారు. ఈ నౌకకు స్వాతంత్య్ర సమరయోధురాలు, నాగా రాజకీయ నాయకురాలైన రాణీ గైడిన్‌ల్యూ పేరు పెట్టారు. మత్స్యకారులను పర్యవేక్షించడం, ఆపదలో ఉన్న వారిని రక్షించడం, స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఈ నౌక ఉపయోగపడుతుంది. దీనిని హిందుస్తాన్ షిప్‌యార్డ్ సంస్థ రూపొందించింది. గైడిన్‌ల్యూ నౌక 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
అంగారకుడిపై దిగిన ఐరోపా ల్యాండర్
అంగారకుడిపై ఐరోపా ల్యాండర్ (577 కిలోలు) అక్టోబర్ 19న విజయవంతంగా దిగిందని ఐరోపా అంతరిక్ష సంస్థ తెలిపింది. 
పందుల్లో నులిపురుగుల నివారణకు వ్యాక్సీన్
పందుల్లో నులిపురుగులను నివారించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సీన్‌ను తయారు చేసినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అక్టోబర్ 19న ప్రకటించింది. ‘సిస్‌వ్యాక్స్’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్‌తో పందుల ద్వారా మనుషుల్లో వచ్చే మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) ముప్పును తగ్గించవచ్చని పేర్కొంది. టి.సోలియం అనే పరాన్నజీవి కారణంగా పందుల్లో సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పందుల వ్యర్థాలు ఆహారంలో కలవడం ద్వారా కేంద్రనాడీ వ్యవస్థలో తిత్తుల్లాంటి నిర్మాణాలు ఏర్పడి మూర్ఛ వ్యాధికి కారణమవుతున్నాయి.
మైక్రోశాటిలైట్‌ను ప్రయోగించిన తియాంగాంగ్-2
ఇటీవలే మానవసహిత వ్యోమనౌకను నింగిలోకి పంపిన చైనా తాజాగా అక్కడ ఏర్పాటుచేసిన తియాంగాంగ్-2 అంతరిక్ష కేంద్రం నుంచి మైక్రోశాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. బ్యాంగ్‌జింగ్-2 అనే 47 కిలోగ్రాములున్న శాటిలైట్‌ను అక్టోబర్ 23న ప్రయోగించారు. అత్యాధునిక సామర్థ్యం కలిగిన కెమెరాలున్న ఈ శాటిలైట్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన పలు చిత్రాలను తీస్తుంది.

హెచ్‌ఎఫ్‌సీల తగ్గింపునకు కిగాలి సదస్సులో ఒప్పందం
పర్యావరణానికి పెను ముప్పుగా మారిన హైడ్రోఫ్లోరోకార్బన్(హెచ్‌ఎఫ్‌సీ)ల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ సహా 200 దేశాలు అంగీకరించాయి. అక్టోబర్ 15న రువాండా రాజధాని కిగిలిలో మాంట్రియల్ ప్రొటోకాల్‌కు సవరణలు చేసే అంశంపై జరిగిన చర్చలో 197 దేశాలు ఆమోదం తెలిపాయి. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎఫ్‌సీల వినియోగాన్ని 85% తగ్గించాలనేది ఈ సవరణ ఉద్దేశం.

కిగాలి ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు హెచ్‌ఎఫ్‌సీల తగ్గింపును 2019 నుంచి ప్రారంభించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024 నుంచిచేపట్టాలి. ఈ ఉద్గారాలను 2050 నాటికి పూర్తిగా నిర్మూలించాలి. ఇది పారిస్ ఒప్పందానికి సంబంధించి అతి ముఖ్యమైన అంశం. పారిస్ ఒప్పందం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంచాలని నిర్దేశిస్తోంది. 

హైడ్రోఫ్లోరోకార్బన్స్ సాధారణంగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో ఉపయోగిస్తుంటారు.
బ్లాక్‌చైన్ టెక్నాలజీని పరీక్షించిన ఐసీఐసీఐ
ఎమిరేట్స్ ఎన్‌బీడీ సాయంతో ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్యం, చెల్లింపుల లావాదేవీలను ప్రయోగాత్మకంగా నిర్వహించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు అక్టోబర్ 12న ప్రకటించింది. దీంతో ఈ టెక్నాలజీని వినియోగించిన మొదటి దేశీయ బ్యాంక్‌గా ఐసీఐసీఐ అవతరించింది. బ్లాక్‌చైన్ అనేది లావాదేవీల డేటాబేస్. ‘చెల్లింపుల లావాదేవీల ధ్రువీకరణ, అంతర్జాతీయ వాణిజ్య పత్రాలు కొనుగోలు ఆర్డర్, ఇన్వాయిస్, షిప్పింగ్, బీమా తదితర పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయంతో అప్పటికప్పుడే అందుకోవచ్చు. డిజిటల్ రూపంలో ఉన్న సమాచారం వేలాది కంప్యూటర్ల మధ్య పంపిణీ అవడం వల్ల ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న వారెవరైనా తాజా సమాచారాన్ని పొందడానికి వీలవుతుంది.
మానవ సహిత నౌకను నింగిలోకి పంపిన చైనా
జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మానవసహిత అంతరిక్ష నౌకను చైనా అక్టోబర్ 17న విజయవంతంగా ప్రయోగించింది. ఇద్దరు వ్యోమగాములు జింగ్ హాయ్‌పెంగ్(50), చెన్ డాంగ్ (37) ‘షెంజౌ-11’ అనే అంతరిక్ష నౌకలో లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లారు. వీరు అక్కడ ‘టియాంగాంగ్-2’ అనే అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 30 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్న వ్యోమగాములు అంతరిక్ష నౌకలకు సంబంధించి శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్ పరిశోధనలు చేస్తారు. ఈ ప్రయోగంతో సొంత మానవసహిత అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకోనున్న ఏకైక దేశంగా చైనా అవతరించింది.

చైనా వ్యోమగాములు 30 రోజుల పాటు అంతరిక్షంలో గడపడం ఇదే తొలిసారి. 2003లో ప్రయోగించింన మానవసహిత అంతరిక్ష నౌక అక్కడ 15 రోజుల పాటు ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్‌ఎస్) జీవిత కాలం 2024 నాటికి ముగియనుంది.


జీశాట్-18 ప్రయోగం విజయవంతం
సమాచార సేవలకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్-18ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. అక్టోబర్ 6న ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహం ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తా సేకరణ వంటి అంశాలు వేగవంతం కానున్నాయి.

ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231 అనే వాహకనౌక ఆస్ట్రేలియా ఆపరేటర్ ఎన్‌బీఎన్‌కు సంబంధించిన ‘స్కై మస్టర్-2’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత జీశాట్-18ను కక్ష్యలోకి పంపింది. ఈ ఉపగ్రహంలో 24 సీ బ్యాండ్, 12 ఎక్సెటెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో పాటు 2 కేయూ బీకాన్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఇప్పటికే 12 ఇస్రో సమాచార ఉపగ్రహాలు 235 ట్రాన్స్‌పాండర్లతో దేశవ్యాప్తంగా డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు అందిస్తున్నాయి. 
జీశాట్-18రాకెట్: ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231
మొత్తం బరువు: 3404 కేజీలు
జీవితకాలం: 15 సంవత్సరాలు
వినియోగ శక్తి: 6474 వాట్ల సౌరశక్తి, 144 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలు -2

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2016

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2016
పీఎస్‌ఎల్‌వీ-సీ 35 ప్రయోగం విజయవంతం
పీఎస్‌ఎల్‌వీ సీ-35 ద్వారా ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది.

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సెప్టెంబర్ 6న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 వాహకనౌక స్వదేశీ ఉపగ్రహాలైన స్కాట్‌శాట్-1, ప్రథమ్, పైశాట్ తో పాటు ఐదు విదేశీ ఉపగ్రహాలను (మొత్తం 8) రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఉపగ్రహాల వివరాలుస్కాట్‌శాట్-1:371 కిలోలు బరువుండే స్కాట్‌శాట్-1 ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఓషన్‌శాట్-2 కాలపరిమితి పూర్తవడంతో అత్యంత అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన స్కాట్‌శాట్-1ను పంపారు. వాతావరణంపై ముందస్తు అంచనాలు, తుపానులను కనిపెట్టడం, ఆచూకీ కనుగొనే సేవలను ఇది అందిస్తుంది. 
భారత వర్సిటీల ఉపగ్రహాలు: 2 (ప్రథమ్‌శాట్-ముంబై ఐఐటీ, పైశాట్-బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయం) 
అల్జీరియా ఉపగ్రహాలు: 3 (అల్‌శాట్-1బి, అల్‌శాట్-2బి, అల్‌శాట్-1ఎన్)
అమెరికా ఉపగ్రహం: 1 (పాత్‌ఫైండర్-1)
కెనడా ఉపగ్రహం: 1 (ఎన్‌ఎల్‌ఎస్-19)
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లపై ఐరాస యుద్ధం
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లు, మొండి సూక్ష్మక్రిములను తుదముట్టించేందుకు ఉద్దేశించిన ప్రకటనపై సెప్టెంబర్ 21న ఐరాసలోని 193 దేశాలు సంతకాలు చేశాయి. ఇది విజయవంతమైతే ఏటా 7 లక్షల మరణాలను నివారించే అవకాశం ఉంది. ఒక ఆరోగ్య అంశంపై ఐరాస ప్రకటన చేయడం ఇది నాలుగోసారి. 2001లో హెచ్‌ఐవీ, 2011లో సాంక్రమితేతర జబ్బులు, 2013లో ఎబోలాపై ఐరాస ప్రకటన చేసింది.
అతిపెద్ద రేడియో టెలీస్కోప్ విధుల ప్రారంభం
చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలీస్కోప్ సెప్టెంబర్ 25 నుంచి పనిచేయడం ప్రారంభించింది. గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గ్రహాంతర జీవాన్వేషణకు ప్రాజెక్టు
గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ‘బ్రేక్‌త్రూ లిజన్’ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు సంయుక్తంగా ప్రకటించారు. భూమిని పోలిన గ్రహం ప్రాక్జిమా బి నుంచి రేడియో సిగ్నల్స్‌ను వినడం కోసం దీనిని చేపడుతున్నారు. దీని వ్యయం 10 కోట్ల డాలర్లు(రూ.660 కోట్లు). ప్రాక్జిమా బి భూమికి నాలుగు కాంతి సంవత్సరాల దూరం(25 లక్షల కోట్ల కి.మీ)లో ఉంది.
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సెప్టెంబర్ 21న ప్రారంభించింది. తమిళనాడులోని రామాంతపూర్ జిల్లాలోగల కుమితిలో 648 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేశారు. 4,550 కోట్లతో దాదాపు 5 వేల ఎకరాల్లో నెలకొల్పిన ఈ ప్లాంటును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్లాంటులో మొత్తం 25 లక్షల సోలార్ మాడ్యూల్స్, 576 ఇన్వెస్టర్లు, 154 ట్రాన్సుఫార్మర్లను ఏర్పాటు చేశారు.

క్షిపణి విధ్వంసక నౌక ‘మోర్ముగావో’ ప్రారంభం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘మోర్ముగావో’ను సెప్టెంబర్ 17న ప్రారంభించారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) తయారు చేసిన ఈ నౌకను నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ప్రారంభించి అరేబియా సముద్రంలోకి జలప్రవేశం చేశారు. మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీ.. తీర గస్తీ దళానికి అప్పగింతభారత తీర గస్తీ దళం కోసం విశాఖ షిప్‌యార్డ్ రూపొందించిన గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీని సెప్టెంబర్ 14న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. ఈ నౌక పొడవు 51.5 మీటర్లు, వెడల్పు 8.3 మీటర్లు.

స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను ప్రయోగించిన చైనాఅంతరిక్ష కేంద్రానికి అవసరమైన స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా సెప్టెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించింది. 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ల్యాబ్‌ను పంపింది. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగించారు.

ముంబై ఐఐటీ నుంచి తొలి ఉపగ్రహంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ముంబై) విద్యార్థులు తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ప్రథమ్’ను సెప్టెంబర్ 26న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఐనోస్ఫియర్‌లో ఎలక్ట్రాన్లను లెక్కించడం కోసం దీనిని తయారు చేశారు. భూమి నుంచి 720 కిలోమీటర్ల ఎత్తులో నాలుగు నెలల పాటు ఇది పనిచేస్తుంది. ప్రథమ్ (ఐఐటీ-బీ), పైశాట్ (పెసిట్-బెంగళూరు) అనే రెండు ఉపగ్రహాలతో పాటు మరో ఆరు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా పంపుతున్నారు.

ఇన్‌శాట్-3డీఆర్ ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను ఇస్రో విజయవంతంగా పయోగించింది. దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ను ఉపయోగించారు. ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ఈ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్ (డీఆర్‌టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చారు.
ఉపగ్రహ విశేషాలు
రాకెట్:జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05
తీసుకెళ్లగల సామర్థ్యం: 415.2 టన్నులు
ఎత్తు: 49.1 మీటర్లు 
వ్యాసం- 3.4 మీటర్లు
ఉపగ్రహం: ఇన్‌శాట్ 3డీఆర్
బరువు: 2,211 కిలోలు 
జీవిత కాలం: 10 సంవత్సరాలు
కొలతలు: 2.4 x 1.6 x 1.5 (మీటర్లు)
విద్యుత్తు: 1700 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల రెండు సౌరఫలకాలు, 90 ఏహెచ్ 
లిథియం-అయాన్ బ్యాటరీ
ప్రయోగ వ్యయం: రూ. 210 కోట్లు 
రాకెట్‌కు ఖర్చు: రూ. 160 కోట్లు 
ఉపగ్రహం వ్యయం: రూ. 50 కోట్లు
అణుబాంబును పరీక్షించిన ఉత్తర కొరియా
కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో అణు బాంబును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానల్ సెప్టెంబర్ 8న వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్న అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని కొరియా సంపాదించుకుంది. ఇది ఉత్తర కొరియా ఐదో అణు పరీక్ష. ఈ పరీక్షతో పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర కొరియాపై ఆర్థికపరమైన ఆంక్షలతో దానిని ఒంటరిని చేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

370 కోట్ల సంవత్సరాల కిందటి శిలాజం లభ్యం
దాదాపు 370 కోట్ల సంవత్సరాల కిందటి ఓ శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గతంలో గుర్తించిన 220 మిలియన్ సంవత్సరాల కిందటి శిలాజం కంటే ఇది పురాతనమైనదిగా రికార్డులకెక్కింది. గ్రీన్‌లాండ్‌‌సలోని మంచు దిబ్బల కిందగల గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లో వోలొంగోంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెన్ నట్‌మ్యాన్ బృందం దీనిని గుర్తించింది.

కొత్తగా కనుగొన్న చేపకు ఒబామా పేరు
కొత్తగా కనుగొన్న ఒక చేపకు శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు పెట్టనున్నారు. హవాయ్ తీరంలో కొత్త సముద్ర జీవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించడంతో ఆయనను ఈ విధంగా గౌరవించనున్నారు. ముదురు ఎరుపు, బంగారు వర్ణంలో ఉండే ఈ కొత్త రకం చేపను ‘కురే అటాల్’ అనే పగడాల దీవి దగ్గర్లో 300 అడుగుల లోతు నీటిలో కనుగొన్నారు.

వరిలో కొత్త వంగడం సృష్టించిన శాస్త్రవేత్తలుపోషకాహార లోపానికి చెక్ పెట్టేలా జింక్ ఎక్కువగా ఉండే సరికొత్త వరి వంగడాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి ధాన్ 45 అనే పేరు పెట్టారు.
పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. డీఆర్‌ఆర్ ధాన్ 45 (IET 23832) అని పిలిచే ఈ వరి 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్ ఉంటుంది.

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2016

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2016
స్క్రామ్‌జెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆగస్టు 28న భూవాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయే స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజిన్ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. దీంతో ఉపగ్రహాల ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పాటు అత్యాధునిక ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ రూపకల్పనలో ఇస్రో ముందడుగేసింది. సౌండింగ్ రాకెట్ల ప్రయోగవేదిక నుంచే స్వదేశీ సాంకేతికతతో రూపాందించిన ఏటీవీ(రోహిణి 560 సౌండింగ్ రాకెట్)కి స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అమర్చి నింగిలో 5 సెకన్లు పాటు మండించారు. 
కుష్టు వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్
భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరె క్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బిహార్, గుజరాత్‌ల్లోని ఐదు జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 

2013-14 లెక్కల ప్రకారం మన దేశంలో 1.27 లక్షల మంది లెప్రసీతో బాధపడుతున్నారు.


ఆఫ్రికన్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్
భారతీయ యువ పారిశ్రామికవేత్త రాహుల్ కాల్రా కేవలం ఆఫ్రికన్ల కోసమే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2025 నాటికి ఆఫ్రికన్లలో ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ ద్వారానే కొనుగోళ్లు చేస్తారనే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. Africakart.com పేరుతో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇదవరకే ఘనాలో పర్యటించిన రాహుల్ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వాటికనుగుణంగా ఈ సైటను రూపొందించాడు.
భూమిపై అత్యంత వేడి నెలగా జూలై
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా 2016 జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్‌ఓఏఏ) ప్రకటించింది. నాసా తాజాగా వెల్లడించిన వాతావరణ సమాచారాన్ని విశ్లేషించాక ఎన్‌ఓఏఏ తన నెలవారీ నివేదికను విడుదల చేసింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే 0.11 డిగ్రీలు ఎక్కువ.

‘కూడంకుళం’ జాతికి అంకితం
భారత్, రష్యాలు సంయుక్తంగా తమిళనాడులోని కూడంకుళంలో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్‌ను ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా ఆగస్టు 10న జాతికి అంకితం చేశారు. మోదీ, పుతిన్, జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ యూనిట్ దేశ విద్యుత్తు రంగంలో అతి పెద్ద యునిట్.
హ్యాక్-ప్రూఫ్ ఉపగ్రహం ప్రయోగించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారిగా హ్యాక్ చేయడానికి వీలుపడని ఉపగ్రహాన్ని చైనా ఆగస్టు15నప్రయోగించింది. ‘‘క్వాంటమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అట్ స్పేస్ స్కేల్ (క్వెస్)’’ గా పిలిచే ఈ ఉపగ్రహం బరువు 600 కేజీలు. దీని నుంచి సమాచారం తస్కరించాలని ప్రయత్నిస్తే అది వెంటనే నాశనమయ్యేటట్లు దీనిని రూపొందించారు.
గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్
ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో ఇది పనిచేస్తుంది. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్‌నే ఉపయోగించి డ్యువో ద్వారా వీడియో కాల్ చేసే సౌకర్యం కల్పించారు.

తుపాన్ల సమాచారాన్ని అందించే రాడార్
తుపాన్లు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే సీ బ్యాండ్ పోలరీమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్‌ను ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ ఆగస్టు 4న తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలో ప్రారంభించారు. ఈ తరహా రాడార్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ రాడార్ ద్వారా భారత వాతావరణ విభాగానికి సమాచారం అందుతుంది. 

భూమి లాంటి మరో 20 గ్రహాల గుర్తింపుఅమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన కెప్లర్ వ్యోమనౌక భూమిని పోలిన, నివాస యోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ఆగస్టు 3న తెలిపారు. ఇప్పటి వరకు కెప్లర్ కనుగొన్న 4,000 గ్రహాల్లో నివాస యోగ్యమైనవిగా ఈ 20 ఉన్నాయి. నక్షత్రాల చుట్టూ ఉన్న 216 గ్రహాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉందని, అందువల్ల అక్కడ ద్రవ రూపంలో నీరు ఉండటం వల్ల మనుగడ సాగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

టాన్సిట్ ఎలివేటెడ్ బస్‌ను పరీక్షించిన చైనారోడ్డు మార్గాల్లో రద్దీని ఎదరుక్కొనేందుకు చైనా చక్కటి పరిష్కారం కనుగొంది. ‘ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్’ (టి.ఇ.బి.) పేరుతో కొత్తరకం లాండ్ ఎయిర్ బస్‌ని చైనా ఆగస్టు 5న పరీక్షించింది. రోడ్ల మీద వెళుతున్న వాహనాల మీదుగా ప్రయాణించడం ఈ బస్సు ప్రత్యేకత. 72 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండే ఈ బస్సు విద్యుచ్ఛక్తితో నడుస్తుంది. ఒకేసారి 1400 మంది కూర్చోవచ్చు. గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

సైన్స్ & టెక్నాలజీ జూలై 2016

సైన్స్ & టెక్నాలజీ జూలై 2016
కేజీ బేసిన్‌లో రూ.33 లక్షల కోట్ల విలువైన గ్యాస్ హైడ్రేట్లు
కృష్ణా-గోదావరి బేసిన్(బంగాళాఖాతం)లో భారీ ఎత్తున సహజ వాయు నిల్వలను కనుగొన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే (యూఎస్‌జీఎస్)జూలై 25న వాషింగ్టన్‌లో ప్రకటించింది. గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉన్న ఈ నిల్వల పరిమాణాన్ని 134 లక్షల కోట్ల ఘనపుటడుగులుగా అంచనా వేశారు. దీని విలువ ప్రస్తుత ధరల్లో సుమారు రూ.33 లక్షల కోట్లు. దీంతో భారత్, అమెరికాలు సంయుక్తంగా చేపట్టిన ఈ అన్వేషణ ద్వారా తొలిసారి హిందూ మహాసముద్ర పరిధిలో గ్యాస్ హైడ్రేట్‌లను గుర్తించినట్లైంది. సహజ వాయువు, నీరు కలిసి ప్రకృతి సిద్ధంగా గడ్డ కట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్ అంటారు.

ఇన్‌శాట్-3డీ స్థానంలో ఇన్‌శాట్-3డీఆర్
సేవలు నిలిచిపోయిన ఇన్‌శాట్-3డీ ఉపగ్రహం స్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇన్‌శాట్-3డీఆర్‌ను ప్రవేశపెట్టనుంది.2013 జూలై 26న ఇన్‌శాట్-3డీ ఉపగ్రహన్ని ఇస్రో రోదసిలోకి పంపింది. అయితే సౌర ఫలకాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దీని సేవలు నిలిచిపోయాయి. ఇన్‌శాట్-3డీని రీప్లేస్ చేయనుంది కాబట్టి కొత్త ఉపగ్రహానికి ఇన్‌శాట్-3డీఆర్ అని పేరుపెట్టారు. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 28న చేపట్టనున్నారు.
అధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా 2016
ఇప్పటిదాకా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది.2016లో 6 నెలల కాలంలో అత్యధిక ఊష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. 20వ శతాబ్దంలో.. 378 వరుస నెలల సగటు రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలను 2016 ఉష్ణోగ్రతలు పక్కకు నెట్టి సరికొత్త రికార్డు సృష్టించాయని వెల్లడించింది. దీనికి కారణం నిత్యం వాతావరణంలోకి విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులేననే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
ప్రపంచాన్ని చుట్టొచ్చిన సోలార్ విమానం ఇంపల్స్-2
అతిపెద్ద సోలార్ విమానం ఇంపల్స్-2 చేపట్టిన ప్రపంచ యాత్ర జూలై 26న విజయవంతంగా ముగిసింది. ఇది ప్రపంచ పర్యటనను 2015 మార్చిలో అరిజోనా నుంచి ప్రారంభించి.. సౌదీలోని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ముగించింది. ఇంపల్స్-2 విమానం ఇంధనం అవసరం లేకుండా 500 గంటల్లో 17 భాగాలుగా 40 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీని ప్రపంచ యాత్ర అరేబియన్ సముద్రం, భారత్, మయన్మార్, చైనా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు, అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాల మీదుగా సాగింది. సౌర ఇంధనంపై అవగాహన కల్పించే లక్ష్యంతో విమాన రూపకర్తలు, పెలైట్‌లు ఆండ్రి బార్చ్ బెర్గ్, బెర్ట్రాండ్ పికార్డ్‌లు ఈ యాత్ర చేపట్టారు.

ఐదేళ్ల ప్రయాణానంతరం గురు గ్రహ కక్ష్యలోకి జునో
నాసా ప్రయోగించిన సౌర విద్యుత్‌తో పనిచేసే అంతరిక్ష వ్యోమనౌక జునో.. 5 ఏళ్లపాటు 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి జూలై 5న గురు గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. జునోకు పొడవైన 3 భారీ సౌర ఫలకాలను అమర్చారు. ఇది సౌరవ్యవస్థతో పాటు గ్రహాల్లో పెద్దదైన బృహస్పతి పుట్టుక, పరిణామక్రమాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 
నెట్‌వర్క్‌డ్ రెడీనెస్ ఇండెక్స్‌లో భారత్‌కు 91వ స్థానం
డిజిటలైజ్డ్ ఆర్థిక, సామాజిక వ్యవస్థలు రూపొందించేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించిన తీరు ఆధారంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నెట్‌వర్క్‌డ్ రెడీనెస్ ఇండెక్స్‌ను రూపొందించింది. జూలై 6న విడుదల చేసిన జాబితాలో భారత్‌కు 91వ స్థానం దక్కింది. సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా, ఫిన్‌లాండ్, స్వీడన్‌లు వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

వైమానిక దళంలో చేరిన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ 
స్వదేశీ యుద్ధ విమానం తేజస్ జూలై 1న వైమానిక దళంలో చేరింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. తేజస్ ప్రపంచంలోనే తేలికైన సూపర్ సోనిక్ యుద్ధ విమానం. ఇది గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను ఛేదించగలదు.

ఇజ్రాయెల్-భారత్ ఎంఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతంభూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీడియం రేంజ్ మిస్సైల్ (ఎంఆర్-శామ్)ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

గురుడి కక్ష్యలోకి ప్రవేశించిన ‘జునో’అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ప్రయోగించిన సౌర విద్యుత్తుతో పనిచేసే అంతరిక్ష వ్యోమనౌక ‘జునో’ జూలై 5న విజయవంతంగా గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఐదేళ్ల కాలంలో 170 కోట్ల కి.మీ ప్రయాణించి జునో లక్ష్యాన్ని చేరింది. జునోకు మూడు పొడవైన భారీ సౌర ఫలకాలుంటాయి. మన సౌరవ్యవస్థతోపాటు గ్రహాల్లో అన్నింటికన్నా పెద్దదైన బృహస్పతిల పుట్టుక, పరిణామక్రమాలను అర్థం చేసుకోడానికి జునో సహాయపడనుంది. ఈ అంతరిక్ష వాహకనౌకపై అమెరికా ప్రభుత్వం 1.1 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. గెలీలియో(వాహకనౌక) తర్వాత గురుడి కక్ష్యలోకి వెళ్లిన తొలి వ్యోమనౌక జునోనే. జునోలో 9 సైన్సు పరికరాలుంటాయి. గురుగ్రహంపై అయస్కాంత క్షేత్రాల మ్యాపింగ్, నీరు, అమ్మోనియాల పరిమాణాన్ని కొలవడం, అరోరాలను (ధ్రువాల వద్దే ఏర్పడే రంగు రంగుల ప్రాంతాలు) పరిశీలించడం వంటి బాధ్యతలను జునో నిర్వర్తిస్తుంది. 2018 ఫిబ్రవరి 20న జునో మిషన్ ముగుస్తుంది. అప్పటిలోపు జునో బృహస్పతి చుట్టూ 37 సార్లు పరిభ్రమిస్తుంది. ఈ వ్యోమనౌకను నాసా 2011 ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించింది.

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2016

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2016
విజయవంతమైన విమాన-క్షిపణి పరీక్ష
విమానానికి క్షిపణి అనుసంధాన పరీక్షను భారత్ జూన్ 25న నాసిక్‌లో విజయవంతంగా నిర్వహించింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానానికి 2,500 కిలోల బరువున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అమర్చి పరీక్షించారు. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ విజయంతో ఇలాంటి వ్యవస్థ ఉన్న మొదటి దేశంగా భారత్ నిలిచింది. 
కొత్త రకం రాకెట్‌ను పరీక్షించిన చైనా
అధిక బరువును మోసుకుపోగల కొత్త రకం అంతరిక్ష వాహక నౌక లాంగ్ మార్చ్-7ను చైనా జూన్ 25న వెన్‌చాంగ్ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ నౌక పొడవు 53 మీటర్లు, బరువు 597 టన్నులు. ఇది దిగువ భూ కక్ష్యలోకి 13.5 టన్నుల బరువును మోసుకుపోగలదు. 
నాసా బూస్టర్ ప్రయోగం విజయవంతం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ కోసం నాసా చేపట్టిన ‘రాకెట్ల సామర్థ్యాన్ని పెంచే బూస్టర్’ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో మానవులు ప్రయాణించడానికి, నివాసానికి ఇది పునాది అవుతుందని భావిస్తున్నారు. ఈ బూస్టర్ దీని రెండో పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు నాసా పేర్కొంది. ఓరియన్ అంతరిక్ష నౌకతో కలిపి దీన్ని 2018 చివర్లో అంగారకుడి పైకి పంపనున్నారు. పని చేస్తున్నప్పుడు దీని శబ్దాన్ని బట్టి ఇందులో 33 లక్షల టన్నుల ఒత్తిడి నెలకొన్నట్లు చెబుతున్నారు.
భారత నావికా దళంలోకి వరుణాస్త్ర
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నౌక విధ్వంసక ఆయుధం(టార్పెడో) ‘వరుణాస్త్ర’ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జూన్ 29న భారత నావికాదళంలోకి ప్రవేశ పెట్టారు. 1.25 టన్నుల బరువుతో హెవీ వెయిట్ విభాగానికి చెందిన ఈ నౌక విధ్వంసక ఆయుధాన్ని డీఆర్‌డీవో నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబోరేటరీ రూపొందించింది. 250 కిలోల పేలుడు పదార్థాలను గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యం వరుణాస్త్రకు ఉంది. భారత డైనమిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. ప్రభుత్వం ఈ టార్పెడోలను ఎగుమతి చేసే విషయం గురించి ఆలోచిస్తున్నట్లు పారికర్ వెల్లడించారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ34 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ34 రాకెట్ ద్వారా చేపట్టిన 20 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-34 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. 727.5 కిలోల కార్టోశాట్ 2 సిరీస్‌తో పాటు 560 కిలోల బరువైన మరో 19 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ34 అంతరిక్షంలోకి మోసుకుపోయింది.

ప్రయోగించిన ఉపగ్రహాలు: కార్టోశాట్ 2సీ, చెన్నైలోని సత్యభామ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన సత్యభామశాట్; పుణేలోని స్వయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ఉపగ్రహం; లాసన్-ఎ3 (ఇండోనేసియా); ఎం 3 ఎంశాట్ (కెనడా); స్కైశాట్ జెన్ 2-1 (గూగుల్, యూఎస్‌ఏ); జీహెచ్‌శాట్ (కెనడా); 12 డోవ్ ఉపగ్రహాలు (అమెరికా) ఉన్నాయి.
రెండు సూర్యుళ్ల చుట్టూ తిరుగుతున్న గ్రహం గుర్తింపు
బృహస్పతిని పోలిన గ్రహం ఒకటి రెండు సూర్యుళ్ల వ్యవస్థలో తిరుగుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జూన్ 13న ప్రకటించింది. నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని గుర్తించినట్లు తెలిపింది. దీంతో పాటు కెప్లర్-1674బీ గ్రహాన్ని నాసాకు చెందిన అమెరికాలోని గోడ్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, శాండిగో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు కనుగొన్న గ్రహాల్లో ఇదే పెద్దది.
సూపర్ కంప్యూటర్‌గా చైనా సన్‌వే తైహూలైట్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనాకు చెందిన కంప్యూటర్ సన్‌వే తైహూలైట్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పార్‌లెల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది సెకనుకు 93 క్వాడ్రిలియన్లను గణించగలదు.

రోదసిలో తొలిసారి చిరాల్ అణువు
జీవానికి అవసరమైన, కర్బన సంబంధ ‘ప్రొపైలీన్ ఆక్సైడ్’ అనే చిరాల్ అణువును శాస్త్రవేత్తల బృందం తొలిసారిగా న క్షత్రాల మధ్య కనుగొంది. మన చేతులు ఒకదానికొకటి సారూప్యంగా ఉన్నట్లుగానే కొన్ని కర్బన అణువులకు కూడా ప్రతిబింబాలు ఉంటాయి. ఈ రసాయన ధర్మాన్ని ‘చిరాలిటీ’ అని, ఆ అణువులను చిరాల్ అణువులని అంటారు. అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి దీనిని గుర్తించారు. చిరాల్ అణువులను ఇప్పటిదాకా భూమి మీదికొచ్చిన ఉల్కల్లో, సౌర వ్యవస్థలోని తోక చుక్కల్లో కనుగొన్నారు. మన పాలపుంత కేంద్రానికి దగ్గర్లో నక్షత్రాలతో కూడిన, దుమ్ము, సజ్జిటేరియస్ బీ2 (Sgr B2) వాయువుతో ఏర్పడిన మేఘంలో ప్రొపైలీన్ ఆక్సైడ్ (CH3CHOCH2)ను కనుగొన్నారు. ‘చిరాలిటీ ధర్మం ఉన్న అణువును నక్షత్రాల మధ్య ఆకాశంలో కనుగొనడం ఇదే తొలిసారి. జీవం ఎలా పుట్టిందో తెలుసుకోడానికి, జీవానికి ముందు అణువులు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది’ అని యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రనామీ అబ్జర్వేటరీ పేర్కొంది.

అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్
అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా కేబుల్ ద్వారా ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఇంటర్‌నెట్ సదుపాయాన్ని వేగంగా, సులభతరం చేయడానికే ఈ పనిని చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు సంయుక్తంగా తెలిపాయి. ‘మరియా’ అనే కొత్త కేబుల్ (సెకన్‌కు 160 టెరాబైట్స్ బ్యాండ్‌విడ్త్ వేగంతో) సహాయంతో అత్యధిక వేగంతో ఆన్‌లైన్ సేవలు అందించనున్నారు. 2016 ఆగస్టులో దీని పనులు మొదలుపెట్టి 2017 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

సైన్స్ & టెక్నాలజీ మే 2016

సైన్స్ & టెక్నాలజీ మే 2016
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ బ్రహ్మాస్ క్షిపణిని మే 27న విజయవంతంగా పరీక్షించింది. 290 కిలోమీటర్లకు పైగా పరిధిలోని లక్ష్యాలను చేధించగల (భూతల దాడికి చెందిన)ఈ క్షిపణిని భారత వైమానిక దళం పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించింది. ఈ పరీక్షలో బ్రహ్మోస్ అన్ని ప్రమాణాలను అందుకుని, నిర్దేశిత లక్ష్యాలను చేధించింది. ఇది శబ్ధ వేగం కంటే మూడు రెట్ల ఎక్కువ వేగంతో (మాక్ 3 వేగం) ప్రయాణించింది.
టాప్ మొబైల్ మేనేజింగ్ యాప్‌గా వాట్సప్
ప్రపంచంలోని 109 దేశాల్లో వాట్సప్ టాప్ మొబైల్ మేనేజింగ్ యాప్‌గా నిలిచింది. భారత్‌లో 94.8 శాతం ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేసి ఉంది. యూజర్లు రోజుకు సగటున 37 నిమిషాల పాటు దీన్ని వాడుతున్నారు. డిజిటల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన సిమిలర్ వెబ్ మే 26న నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
చంద్రుడిపై అగాథాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
చంద్రుడిపై మరో రెండు అగాథాలను కనుగొన్నట్లు మే 23న అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొదటి దాని వయసు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌర వ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్‌ఎల్వీ)ను మే 23న విజయవంతంగా ప్రయోగించింది. ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో 70 కిలోమీటర్లు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది.
ఐఎన్‌ఎస్ తార్‌ముగ్లీ జలప్రవేశం
భారత తూర్పు నావికాదళంలో మరో యుద్ధనౌక చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో మే 23న తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ ‘ఐఎన్‌ఎస్ తార్‌ముగ్లీ’ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. తార్‌ముగ్లి అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవి పేరు. ఈ నౌకను తీరప్రాంత గస్తీ, సముద్ర పరిశీలనకు వినియోగిస్తారు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ)లో నిర్మించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌక తార్‌ముగ్లీని తయారుచేశారు.

పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణుసామర్థ్య క్షిపణి ‘పృథ్వీ-2’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఉపరితల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న రెండు ద్రవ ఇంధన ఇంజన్లున్న ఈ క్షిపణిని మే 18న ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి 500 నుంచి 1000 కేజీల వార్‌హెడ్‌లను మోసుకుపోగలదు. ఆధునిక అంతర్గత మార్గదర్శ వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ క్షిపణి నేరుగా లక్ష్యాలను ఢీకొంటుంది. 2003లో దీన్ని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. 9 మీటర్ల పొడవైన పృథ్వీ-2 డీఆర్డీవో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి.

సూర్యుడు, భూమికి మధ్యలో బుధ గ్రహం
సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే బుధ గ్రహం మే 9న భూమికి, సూర్యుడికి మధ్య అడ్డువచ్చింది. సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధ గ్రహం సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తున్నప్పుడు, అది సూర్యుడిపై ఓ చిన్న నల్లని చుక్కలా కన్పించింది.
చైనాలో అతి పొడవైన కీటకం 
ప్రపంచంలోనే అతి పొడవైన కీటకాన్ని దక్షిణ చైనాలో కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ మే 5న పేర్కొంది. కర్రలపై ఉండే 62.4 సెంటీ మీటర్ల పొడవు గల ఈ కీటకాన్ని రెండేళ్ల కిందట దక్షిణ చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. మలేసియాకు చెందిన 56.7 సెం.మీ పొడవైన కీటకం ఇప్పటివరకు అత్యంత పొడవైందిగా గుర్తింపు పొందింది.
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలం
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీర్ఘవృత్తాకారంలో ఉండే భారీ పాలపుంతలో ఏర్పడిన కృష్ణ బిలం (బ్లాక్ హోల్) సూర్యుడితో పోల్చి చూస్తే 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఇర్విన్ (యూసీఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే (ఏఎల్‌ఎంఏ) నుంచి హై రిజల్యూషన్ డేటాను సేకరించి ఈ భారీ కృష్ణబిలం కొలతను కనుగొన్నారు. ‘ఎన్‌జీసీ 1332’ అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయువు, ధూళి వేగాన్ని లెక్కించారు.

అతిపెద్ద మానవరహిత నౌకను పరీక్షించిన యూఎస్ మిలటరీ
ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను యూఎస్ మిలటరీ పరీక్షించింది. ఈ మేరకు పెంటగాన్‌లో మే 3న ఈ మానవరహిత నౌకను ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. కాగా నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్ డియాగో తీరంలో పరీక్షించనున్నారు.

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2016

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2016
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి విజయవంతంభారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్(ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)-1జి ఉపగ్ర హాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.
  • మొదటి దశలో చేపట్టిన ఏడు నావిగేషన్ ఉపగ్రహాల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి చివరిది. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. భారత దిక్సూచి వ్యవస్థ ద్వారా సరిహద్దు నుంచి 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సౌకర్యం కల్పించవచ్చు. ఇది విమానాలు, ఓడల గమనాన్ని తెలపడంలో తోడ్పడుతుంది. వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సదుపాయాన్ని సైనిక అవసరాలకు, క్షిపణి సంబంధ అవస రాలకు వినియోగించుకుంటారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుసంధానం చేయొచ్చు. 2016 చివరికి దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • దిక్సూచి వ్యవస్థ.. నావిక్: భారత దిక్సూచి వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టలేషన్)గా నామకరణం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థలు అమెరికా జీపీఎస్ పేరుతో, రష్యా గోనాస్, ఐరోపా గెలీలియో, చైనా బేయ్‌డోవ్, జపాన్ క్వాసీ జెనిత్ పేర్లతో కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఒక్కోటి 28-35 నావిగేషన్ ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. భారత్.. అమెరికా జీపీఎస్ సేవలను వినియోగించుకుంటోంది.

స్టెల్త్ యుద్ధవిమానాన్ని పరీక్షించిన జపాన్
జపాన్ తొలిసారిగా అభివృద్ధి చేసిన స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఏప్రిల్ 22న ప్రయోగించింది. శత్రుదేశాల రాడార్లకు అందకుండా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న దీనికి ఎక్స్-2 అని పేరు పెట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టెల్త్ యుద్ధవిమానాలను అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే రూపొందించాయి.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష 
జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ఏప్రిల్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.

సిక్కిం ఎన్‌ఐటీలో ఫాస్టెస్ట్ సూపర్‌కంప్యూటర్
దేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను సిక్కింలోని ఎన్‌ఐటీలో ఏర్పాటు చేశారు. దీనికి ‘పరమ్ కంచన్‌జంగా’ అని నామకరణం చేశారు. దేశంలోని 31 ఎన్‌ఐటీలోకెల్లా ఇదే అత్యంత వేగవంతమైన కంప్యూటర్. వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడగలిగే నిర్మాణాలపై ఈ కళాశాల ఇప్పటికే పరిశోధనలు చేస్తోంది. వీటితోపాటు మరెన్నో అంశాల్లో పరిశోధనలకు ‘పరమ్ కంచన్‌జంగా’ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పుణేలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్) సాయంతో రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కంప్యూటర్‌ను ఏర్పాటుచేశారు.

షార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చీఫ్ చార్లెస్ బోల్డెన్‌తో పాటు ఆరుగురు సీనియర్ శాస్త్రవేత్తల బృందం ఏప్రిల్ 6న శ్రీహరికోటలోని షార్‌ను సందర్శించింది. నాసా బృందానికి షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ షార్‌లో చేపట్టిన, చేపట్టబోతున్న ప్రయోగాలు, రాకెట్ లాంచ్ ఫెసిలిటీస్ గురించి వివరించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలతో జరిగిన అవగాహన సదస్సులో నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్ ప్రసంగించారు. 
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా
అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ఏప్రిల్ 9న ప్రకటించింది. ఈ రాకెట్ ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడిచేయగల సామర్థ్యం ఉత్తరకొరియాకి లభించినట్లు తెలిపింది. అయితే అమెరికా, దక్షిణ కొరియాలు ఈ వార్తలను కొట్టిపారేశాయి.
అణుసామర్థ్య క్షిపణి కే-4ను పరీక్షించిన భారత్
అణు జలాంతర్గామి అరిహంత్ నుంచి అణుసామర్థ్య క్షిపణి కే-4ను భారత్ విజయవంతంగా (రహస్యంగా) ప్రయోగించింది. బంగాళాఖాతంలోని గుర్తుతెలియని ప్రదేశం నుంచి భారత నావికాదళం దీన్ని పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కే-4 క్షిపణి 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 12 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల మందం ఉన్న ఈ క్షిపణిని సముద్రంలో 20 మీటర్ల లోతు నుంచి ప్రయోగించారు. 17 టన్నుల బరువున్న కే-4 క్షిపణి రెండువేల కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. కే-4తోపాటు అరిహంత్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగానే రూపొందించింది. ఉపరితల క్షిపణి జలాంతర్గాముల్లో అరిహంత్ కీలకమైనది. రష్యాకు చెందిన అకూలా-1 ఆధారంగా దీనిని తయారు చేశారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం స్మారకార్థం క్షిపణికి కె-4గా నామకరణం చేశారు.

ఆసియాలోనే పెద్ద టెలిస్కోప్ ఆవిష్కరణ
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ దగ్గర్లోని దేవస్థల్ వద్ద బ్రెజిల్ సహాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ఎరీస్ (ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్)ను బ్రెజిల్ ప్రధాని చార్లెస్‌తో కలసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రిమోట్‌తో ఆవిష్కరించారు. 3.6 మీటర్ల వెడల్పు గల ప్రాథమిక కటకం ఉన్న ఈ టెలిస్కోప్ ఆసియాలోనే పెద్దది.

ఎయిడ్స్ వ్యాధికి హోమియో మందువైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ‘క్రొటాలస్ హరిడస్’ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుందని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఒక రకమైన పాము విషంతో తయారుచేసే ఈ మందు... హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనలో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందు పనితీరును పూర్తిస్థాయిలో తేల్చేందుకు 3,900 మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ హోమియో మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని ఆయుష్ వర్గాలు వెల్లడించాయి. 13 మందిలో హెచ్‌ఐవీ వైరస్ శూన్య స్థితికి వచ్చిందని, ఇద్దరిలో ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపాయి.

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2016

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2016
భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్
ఏటా దేశంలో లక్షల మంది పిల్లల ప్రాణాలను బలిగొంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం కీలకచర్య తీసుకుంది. భువనేశ్వర్‌లో మార్చి 26న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రోటా వైరస్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పోగ్రామ్ (యూపీఐ)లో భాగంగా.. పోలియో, మశూచి, రోటా వైరస్, అడల్ట్ జపనీస్ ఎన్సెఫిలిటీస్ వ్యాధులకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. రోటా వైరస్ వ్యాక్సిన్ టీకాను తొలి విడతలో.. ఏపీ, ఒడిశా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణ రవాణ శాఖ ‘ఎం-వాలెట్’ యాప్
దేశంలోనే తొలిసారిగా రవాణాకు సంబంధించిన డాక్యుమెంట్లతో తెలంగాణ రవాణా శాఖ ఓ మొబైల్ వాలెట్ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ ఆర్‌టీఏ ఎం-వాలెట్ యాప్‌ను మార్చి 30న ఆవిష్కరించారు. పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మొబైల్‌లో ఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను వారికి చూపించవచ్చు. ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లెసైన్స్‌ను ఈ యాప్‌లో భద్రపరచుకోవచ్చు. దీని కోసం అన్ని రకాల ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లలో ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్ ఆవిష్కరణ
బెల్జియం సాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్(ఎరీస్)’ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ కలసి రిమోట్‌తో ఆవిష్కరించారు. 3.6 మీటర్ల వెడల్పుగల ప్రాథమిక కటకం ఉన్న టెలిస్కోప్‌ను ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు దగ్గరలోని దేవస్థల్ వద్ద నిర్మించారు. అయితే ప్రస్తుతం బెల్జియం పర్యటనలో ఉన్న మోదీ బ్రసెల్స్ నుంచి ఆ దేశ ప్రధానితో కలసి ఈ టెలిస్కోప్‌ను ప్రారంభించారు. అంతకు ముందు ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై మోదీ, చార్లెస్ చర్చించారు. బ్రసెల్స్‌లో మార్చి 22న జరిగిన ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళులర్పించారు. ఆత్మాహుతి దాడి జరిగిన మాల్‌బీక్ మెట్రో స్టేషన్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు.

అంగారక గ్రహానికి రష్యా-ఐరోపా వ్యోమనౌక
అంగారక గ్రహంపై జీవం ఉనికిని గుర్తించేందుకు రష్యా-ఐరోపాలు సంయుక్తంగా ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టీజీవో) వ్యోమనౌకను ప్రయోగించాయి. దీన్ని ప్రోటాన్ రాకెట్ ద్వారా మార్చి 14న కజికిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ నౌక 49.6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఏడాది అక్టోబర్‌లో అంగారక గ్రహాన్ని చేరనుంది. ఇది అరుణ గ్రహాన్ని చిత్రీకరించడంతో పాటు అక్కడి గాలిని విశ్లేషించననుంది. అంగారకుడిపై మీథేన్‌ను విశ్లేషించడమే ప్రధాన లక్ష్యంగా తాజా ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి ఎక్సో మార్స్-2016గా పేరుపెట్టారు.
అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ ఈ క్షిపణిని పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడంతో పాటు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు.
ఐసీజీఎస్ అర్ణవేష్ జలప్రవేశం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ అర్ణవేష్’ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మార్చి 21న విశాఖపట్నంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇండయన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఈ వేగవంతమైన పెట్రోల్ వెసల్ (FPV)ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునిక నైట్‌విజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక ముందు భాగంలో 40/60 భోఫోర్స్ గన్‌ను అమర్చారు. ఈ నౌకలో ఆరుగురు అధికారులతోపాటు 34మంది నౌకాదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

కె-4 క్షిపణిని పరీక్షించిన భారత్ 
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి కె-4ను భారత్ మార్చి 7న బంగాళాఖాతంలో రహస్యంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. అణుసామర్థ్యం కలిగిన కె-4 క్షిపణిని సముద్రంలో 30 అడుగుల లోతు నుంచి ప్రయోగించారు. ఇది రెండు టన్నుల ఆయుధాలను మోసుకెళ్లడంతో పాటు 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఎఫ్ ప్రయోగం విజయవంతం
భారత ప్రాంతీయ దిక్చూచి వ్యవస్థకు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఎఫ్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చి 10న విజయవంతంగా ప్రయోగించింది. 1425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 32 ద్వారా భూమికి దగ్గరగా(పెరిజీ) 284కిలోమీటర్లు, దూరంగా(అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర క క్ష్యలో ప్రవేశపెట్టారు.
కర్ణాటకలో కొత్తరకం కప్ప జాతి గుర్తింపు
కర్ణాటకలోని ఉడిపి జిల్లా మణిపాల్ పట్టణంలో కొత్త కప్ప జాతిని అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. చేతి బొటనవేలి గోరు పరిమాణంలో ఉండే దీన్ని కోస్తా తీరంలోని లాటిరైట్ రాళ్లలో గుర్తించారు. ఆ కప్ప కన్పించిన ప్రాంతాన్ని స్ఫురింపజేస్తూ దానికి ‘మైక్రోహైలా లాటిరైట్’ అని పేరుపెట్టారు. కేవలం 1.6 సెంటీమీటర్ల పొడవుండే ఈ జాతి కప్పలు లేత గోధుమ వర్ణంలో, నల్లని మచ్చలతో ఉంటాయి. వీటి అరుపు కీచురాయి అరుపును పోలి ఉంటుంది.
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు సామర్థ్యం కలిగిన అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 700 కి.మీ. లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి పరీక్షించారు. ఈ బాలిస్టిక్ క్షిపణి 700 కి.మీ. దూరాన్ని 9 నిమిషాల 36 సెకండ్లలో చేరింది. 12 టన్నుల బరువుండే అగ్ని-1.. ఒక టన్ను పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. దీనిలో అధునాతన నేవిగేషన్ వ్యవస్థను పొందుపరిచారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణులను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. డీఆర్‌డీఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లు సహకారం అందించాయి.

అంతరిక్ష అంచుల్లో కొత్త గెలాక్సీ
ఇప్పటి వరకు కనుగొన్న గెలాక్సీల కంటే అత్యంత దూరమైన నక్షత్ర మండలాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత...విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జెడ్ 11 అనే ఈ గెలాక్సీ...ఉర్సా మేజర్ నక్షత్రమండలంలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీనిచూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు.
వేగంగా క్యాన్సర్‌ను నిర్ధారించే పరికరం
వేగంగా క్యాన్సర్‌ను నిర్ధారించే చిన్న పరికరాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని తయారీకి రూ. 30 వేలు ఖర్చయింది. ఈ చిన్న పరికరాన్ని బెంగుళూరులో మార్చి 4న జరిగిన నానో సదస్సులో ప్రదర్శించారు.

గ్రహాల పరిశోధనకు ఎగిరే టెలిస్కోపు
గ్రహాలు, గ్రహశకలాల సమీపంలోని గెలాక్సీలను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఎగిరే టెలిస్కోపును ప్రయోగించింది. స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రా రెడ్ ఆస్ట్రోనమీ (సోఫియా) సాధనంతో ఏడాది పాటు పరిశీలించనున్నారు. బోయింగ్ 747ఎస్‌పీ విమానంలో మార్పులు చేసి ఈ టెలిస్కోపును అమర్చారు. దీన్ని ప్రయోగించటం ఇది నాలుగోసారి. 

వ్యాధి నిర్ధారణకు కొత్త పరికరంఎబోలా వంటి తీవ్రమైన జబ్బులను సులభంగా గుర్తించే ఒక చిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్‌లోని ‘ఎకోలె పాలీటెక్నిక్ ఫెడరల్ డి లాసన్నె’కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 0.005 మిల్లీలీటర్ల రక్తనమూనాలో 16 రకాల జీవసంకేతాలను (బయోమార్కర్‌లను) గుర్తించగలుగుతుంది.

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2016

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2016
అంతరిక్ష విహారం కోసం నాసాకు 18,300 మంది దరఖాస్తు
వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు 18,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 2012లో వచ్చిన దరఖాస్తుల కంటే మూడు రెట్లు ఎక్కువని నాసా అధికారులు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నైపుణ్యం ఉన్న 8-14 మందిని ఎంపిక చేయనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ తెలిపారు.
స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష నిర్వహించిన ఇస్రో
భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు తోడ్పడే క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 19న విజయవంతంగా పూర్తి చేసింది. మహేంద్రగిరి (తమిళనాడు)లోని ప్రొపల్షన్ సముదాయంలో క్రయోజెనిక్ ఇంజన్‌కు 640 సెకన్ల పాటు ఉష్ణ పరీక్షను నిర్వహించారు.

గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 11న ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కిందట ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి ఉద్భవించి అంతరిక్షంలోకి విస్తరిస్తున్న తరంగాల ఉనికిని నిర్ధారించినట్లు యు.ఎస్. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని, ఇప్పుడు తొలిసారిగా ఆధారపూర్వకంగా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు కదిలి 2015 సెప్టెంబర్ 14న భూమికి చేరడంతో అమెరికా భూగర్భంలో అమర్చిన లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీకి చెందిన అత్యాధునిక పరికరాలు వాటిని గుర్తించాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా విశ్వానికి సంబంధించిన కొత్త అంశాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఐన్‌స్టీన్ 1916లో ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా లెక్కించిన గురుత్వాకర్షణ తరంగాలతో ఈ తరంగాలు కచ్చితంగా సరిపోయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృష్ణబిలాలు, న్యూట్రాన్ లాంటి భారీ వస్తువులు ఢీకొట్టడం ద్వారా అంతరిక్షం-కాలానికి సంబంధించిన గురుత్వాకర్షణ తరంగాలు చోటు చేసుకుంటాయి. వీటిని గుర్తించడం సంక్లిష్టమైన విషయం.
360 టెరాబైట్ల డేటా డిస్క్ ఆవిష్కరణ
లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఆప్టో ఎలక్ట్రానిక్ పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు 360 టెరాబైట్ల సామర్థ్యంతో 5 డెమైన్షనల్ డేటా డిస్‌భను తయారు చేశారు. దీనికి ‘సూపర్‌మేన్ మెమరీ క్రిస్టల్’ అని నామకరణం చేశారు. నానో స్ట్రక్చర్ గ్లాస్‌తో ఈ 5డీ డిస్క్‌ను రూపొందించారు. ఫెమ్టోసెకండ్ లేజర్ రైటింగ్ ద్వారా డిస్క్‌లో డేటాను భద్రపర్చుకోవచ్చు. ఇందులో భద్రపర్చిన సమాచారం వందేళ్లపాటు భద్రంగా ఉంటుందని..1000 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలోనూ ఈ డిస్క్ చెక్కుచెదరదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించడం కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత్ ఫిబ్రవరి 16న విజయవంతంగా ప్రయోగించింది. 500-1000 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం గల ఈ క్షిపణిని బాలాసోర్ జిల్లా చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంచర్ ద్వారా పరీక్షించారు. ద్రవ ఇంధనంతో పనిచేసే రెండు ఇంజన్లు కలిగిన ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అవలీలగా ఛేదించగలదు. ఇంటిగ్రేటేడ్ గెడైడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తయారు చేసిన ఐదు క్షిపణుల్లో ఇదొకటి. 2003లోనే రక్షణ రంగంలో చేర్చిన ఈ క్షిపణిని 2015 నవంబరు 26న ఇదే ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
సూర్యకిరణాలతో హైడ్రోజన్
సూర్య కిరణాల నుంచి నీటిని ఏర్పర్చి, తద్వారా హైడ్రోజన్‌ను తయారు చేసే ‘మల్టీ లేయర్డ్ ఫోటో ఎలక్ట్రోడ్’ను కొరియన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సృష్టిలో సహజంగా జరిగే కిరణజన్య సంయోగక్రియను ఆధారంగా చేసుకుని ఈ కొత్త పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో ఎలాగైతే సూర్యరశ్మి శక్తిగా రూపాంతరం చెందుతుందో.. అదే విధంగా సూర్యరశ్మి నుంచి నీటి అణువులు (H2O) సేకరించి, వీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరికరానికి వాతావరణంలోని 90 శాతం శుద్ధమైన నీటిని గ్రహించుకోగలిగే సామర్థ్యం ఉందని పరిశోధకులు తెలిపారు.

అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా జికా వైరస్ వ్యాప్తి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ఫిబ్రవరి 1న అమెరికాలో జికా వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. పిల్లలు చిన్న తలతో జన్మించడానికి కారణమవుతున్న ఈ వైరస్ గత ఏడాది బ్రెజిల్‌కు వ్యాప్తి చెందిన తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి డబ్ల్యు.హెచ్.ఒ. నిపుణుల సమావేశాన్ని నిర్వహించింది. వచ్చే ఏడాది వరకు ఈ వ్యాధి వల్ల యూఎస్‌ఏలో నాలుగు మిలియన్ల కేసులు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. పనామాలో 50 జికా వైరస్ కేసులను గుర్తించినట్లు ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించడం వల్ల సంబంధిత వైరస్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం, నిధులు పెంచడం, చికిత్స, టీకాల కోసం పరిశోధనను ప్రోత్సహించడం లాంటి వాటికి వెసులుబాటు కలుగుతుంది.
లాంగ్ రేంజ్ రాకెట్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా
లాంగ్ రేంజ్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఉత్తర కొరియా ఫిబ్రవరి 7 ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో చేపట్టిన ఈ రాకెట్ ద్వారా భూపరిశీలక ఉపగ్రహం క్వాంగ్ మ్యాంగ్-4ను ప్రయోగించారు. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇది శాంతియుత అంతరిక్ష ప్రయోగమని తెలిపారు. కానీ, ఇది బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని అమెరికా సహా అనేక దేశాలు భావించాయి. ఈ ప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్‌‌స, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించి ఉత్తర కొరియా పరీక్ష జరిపిందని, తక్షణమే ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలని కోరాయి.
ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు
ఎంఎంటీఎస్ రైళ్లలో మొబైల్ అప్లికేషన్ ద్వారా కాగిత రహిత టిక్కెట్లను పొందే సదుపాయాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఫిబ్రవరి 10న ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీతో పాటు సికింద్రాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలోనే అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని మంత్రి అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను తయారు చేశారు.

హైదరాబాద్‌లో సిద్ధమైన ‘జికా’ తొలి వ్యాక్సిన్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్‌ను నియంత్రించే తొలి వ్యాక్సిన్‌ను తాము సిద్ధం చేశామని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రకటించింది. అధికారికంగా దిగుమతి చేసుకున్న జికా వైరస్‌తో భారత్ బయోటెక్ ల్యాబ్‌లో పరిశోధనలు చేసి, వ్యాక్సిన్‌ను కనుగొన్నామని ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కృష్టా ఎల్లా ఫిబ్రవరి 3న తెలిపారు. ఇందుకోసం తాము తొమ్మిది నెలల కిందటే పేటెంట్ సైతం తీసుకున్నామని చెప్పారు. ప్రయోగశాలలో విజయవంతంగా పరీక్షించిన జికా వ్యాక్సిన్‌ను తర్వాత స్థాయిలో పరీక్షలు జరపాల్సి ఉందని ఎల్లా తెలిపారు. భారత ప్రభుత్వం సహకారం అందిస్తే నాలుగు నెలల్లో 10 లక్షల వ్యాక్సిన్లు తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా దోమకాటు ద్వారానే మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించినా తాజాగా లైంగిక చర్య ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతోందని టెక్సాస్‌లో గుర్తించారు. ఇప్పటికే 20 దేశాల్లో సుమారు 4 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వైరస్ నియంత్రణకు పరిశోధనలు చేసి, మందును కనిపెట్టాలని ప్రపంచ దేశాలను కోరింది.

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2016

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2016
ఆకాశ్ క్షిపణులను పరీక్షించిన భారత్
భారత్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మూడు ఆకాశ్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ నుంచి జనవరి 28న పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనికి 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకుపోయే సామర్థ్యం ఉంది. ఇది ధ్వని వేగం కంటే 2.8 నుంచి 3.5 రెట్ల వేగంతో దూసుకుపోయి యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు వంటి అస్త్రాలను ధ్వంసం చేయగలదు.

భారత్‌లో కొత్త పక్షి జాతి గుర్తింపు
ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో కొత్త పక్షి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశం, స్వీడ న్, చైనా, యూఎస్, రష్యా దేశాల శాస్త్రవేత్తల బృందం ఈ పక్షి జాతిని గుర్తించింది. 1947 తర్వాత భారత్‌లో గుర్తించిన అత్యంత అరుదైన పక్షి జాతుల్లో ఇది నాలుగోది. భారత పక్షి శాస్త్ర పితామహుడు డాక్టర్ సలీం అలీ పేరును ఈ పక్షి జాతికి పెట్టారు. శాస్త్రీయంగా ‘జూతెర సలీమాలీ’గా ఈ పక్షిని పిలవనున్నారు.
కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు ఉన్న గ్రహాన్ని కనుగొన్నట్లు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జనవరి 20న తెలిపారు. ఈ గ్రహం ప్లూటోకు ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కొత్త గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. దీని ద్రవ్యరాశి భూమికంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ గ్రహానికి సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. 
సోలార్ ఫిజిక్స్ అధ్యయనానికి ఆదిత్య-ఎల్1: ఇస్రో
సోలార్ ఫిజిక్స్‌లోని సమస్యలను అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. సూర్యుని గతిశీల ప్రక్రియను దీని ద్వారా తెలుసుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ద్వారా 2019-20లో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నామని జనవరి 26న పేర్కొంది. సూర్యునిపై పరిశోధనకు భారత్ ప్రయోగిస్తున్న తొలి సోలార్ ఉపగ్రహం ఆదిత్య - ఎల్1 మిషన్. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని ఎల్1(లెగ్రాంజియన్ పాయింట్) చుట్టూ ఉండే హాలో కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఎలాంటి గ్ర హణాలు అడ్డులేకుండా నిరంత రం సూర్యుడిని చూడగలిగేందుకు ఇక్కడ వీలుపడుతుంది. మరింత విస్తృత అధ్యయనానికి గాను ఈ ఉపగ్రహానికి మరో ఆరు పేలోడ్లను అమర్చనున్నారు. ఈ ప్రయోగం కోసం సుమారు రూ.378.53 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా వంటి వాటిపై అధ్యయనం చేయనున్నారు.
ఐఎన్‌ఎస్ విరాట్‌కు విశ్రాంతి
భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఇక విశ్రాంతి తీసుకోనుంది. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన విమాన వాహక యుద్ధనౌకగా విరాట్ గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకోనుంది. అనంతరం షిప్ మ్యూజియంగా రూపాంతరం చెంది కాకినాడ తీరంలో కొలువుదీరనుంది. కాకినాడ తీరంలో ఏర్పాటయ్యే ఈ ఐఎన్‌ఎస్ విరాట్ షిప్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది అవుతుంది.

తొలి సేంద్రీయ రాష్ట్రంగా సిక్కిం
75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని సేంద్రీయ, సుస్థిర సాగు కిందకు తీసుకురావడం ద్వారా దేశంలోనే తొలి ఆర్గానిక్ స్టేట్‌గా సిక్కిం అవతరించింది. ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ మార్గదర్శకాలకు అనుగుణంగా 75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని క్రమంగా సేంద్రీయ సాగు పద్ధతిలోకి మార్చారు. 2003లో పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ పద్ధతిలోనే భూమిని సాగు చేయాలని తీర్మానించడంతో క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల అమ్మకాన్ని నిషేధించి రైతులు సేంద్రీయ సాగును అనుసరించాల్సిన తప్పని పరిస్థితిని కల్పించారు.
పీఎస్‌ఎల్వీ-సీ31 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... జనవరి 20న పీఎస్‌ఎల్వీ-సీ31 రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ తరహాలో దేశీయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ మరింత బలోపేతం కానుంది. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో మొత్తంగా 51వ విజయాన్ని, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 32వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఉపఖండంలో క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ (రీజనల్ నావిగేషన్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)ను రూ.3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ, 1బీ, 1సీ, 1డీలతో తాజాగా ‘1ఈ’ ఉపగ్రహంతో కలిపి ఐదింటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 2016 మార్చి 10, 28 తేదీల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’ వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటు చుట్టూ మరో 1,500 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే జీపీఎస్ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఇస్రో అధికారులు ప్రకటించారు.

విశ్వంలో మరో వంద గ్రహాలు!
విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100 గ్రహాలను రెండో దశలో (కె-2 మిషన్)లో కెప్లర్ గుర్తించింది. కొత్త గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరుగుతూ కెప్లర్‌ను దాటినప్పుడు నక్షత్రాల వెలుగుకు అడ్డురావటంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. యాంత్రిక లోపాల వల్ల కెప్లర్ దారి తప్పింది. 2013 మేలో కెప్లర్‌తో సంబంధాలు తెగాయి. అయితే శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి టెలీస్కోప్ సాయంతో కెప్లర్‌ను అనుసరిస్తున్నారు. 
నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కద్మత్
జలాంతర్గామి విధ్యంసక నౌక ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకాదళంలో చేరింది. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్కే దోవన్ జనవరి 7న దీన్ని తూర్పు నౌకాదళంలో చేర్చారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సిగ్నల్ వ్యవస్థ ఐఎన్‌ఎస్ కద్మత్‌లో ఉంది. ఇది శబ్దం లేకుండా శత్రు జలాంతర్గాములను ధ్వంసం చేయగలదు. దీని బరువు 3,500 టన్నులు, పొడవు 109 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. ఇది గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణి ంచగలదు. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డిండ్ అండ్ ఇంజనీర్స్ సంస్థ ఐఎన్‌ఎస్ కద్మత్‌ను నిర్మించింది. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దీనికి పశ్చిమ తీరంలోని దీవి కద్మత్ పేరు పెట్టారు.
మరో భారీ పాలపుంత సమూహం గుర్తింపు
మన పాలపుంతకంటే వెయ్యిరెట్లు పెద్దదైన ఓ భారీ పాలపుంత సమూహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బిగ్ బ్యాంగ్‌కు సంభవించిన దాదాపు 3.8 బిలియన్ సంవత్సరాలకు ఈ పాలపుంత ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆవిర్భావ సమయంలో వాయువులు, ధూళితో నిండి ఉన్న విశ్వంలో కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత పాలపుంతలు ఏర్పడ్డాయని, అవన్నీ ఒకచోటుకు చేరడం ద్వారా పాలపుంతల సమూహాలు ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన పాలపుంత సమూహం అలా ఏర్పడిందేనని, భూమికి 10 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, వేల సంఖ్యలో పాలపుంతలను కలిగి ఉందని, సూర్యుడికంటే 250 ట్రిలియన్ రెట్లు పెద్దదని తెలిపారు.

హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన
కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీదరహళ్లి కావల్‌లో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 3న శంకుస్థాపన చేశారు. 15 ఏళ్లలో ఈ కేంద్రం నుంచి 600 దేశీయ హెలికాప్టర్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మోదీ వెల్లడించారు. వీటిని సైన్యానికి అందజేయనున్నట్లు చెప్పారు. 2018 నాటికి ఈ కర్మాగారం నుంచి తయారైన మొదటి దేశీయ హెలికాప్టర్ నింగిలో ఎగరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, అనంతకుమార్, సదానందగౌడ, రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా పాల్గొన్నారు.

డీఆర్‌డీఓ మానవ రహిత యుద్ధ వాహనంమానవ రహిత యుద్ధ వాహనాన్ని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి మండలి(డీఆర్‌డీఓ) సిద్ధం చేసింది. ఈ వాహనాన్ని మైసూరు నగరంలోని మానస గంగోత్రిలో ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని పుణేలోని డీఆర్‌డీఓ కేంద్రం సిద్ధం చేసింది. ఇది ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సహాయంతో నడుస్తుంది. బాంబులను కూడా కనిపెట్టి నిర్వీర్యం చేస్తుంది. ఈ వాహనంలో రోబో తొడుగుతో తయారు చేసిన వస్తువు చాలా బరువైన బాంబులను కూడా పైకి ఎత్తుతుంది. నేలలో ఉన్న బాంబులను కూడా పైకి తీస్తుంది. దీనిపై అతి బరువైన ఆయుధాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. 

హెడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తర కొరియాఅణుబాంబు కన్నా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా జనవరి 6న ప్రకటించింది. ‘సూక్ష్మీకరించిన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కొనే తాజా అస్త్రం సిద్ధమైంది’ అని అక్కడి అధికార టెలివిజన్‌లో ప్రకటన వెలువడింది. దీంతో ఉత్తర కొరియా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రోజన్ బాంబును తయారు చేశామని 2015 డిసెంబర్‌లో ఆ దేశ అత్యున్నత నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలకు సంబంధించిన తొలి ఆదేశాలపై డిసెంబర్ 15న, తుది ఆదేశాలపై జనవరి 3న కిమ్ సంతకం చేశారు. అణు విచ్ఛిత్తి ఆధారంగా రూపొందే అణు బాంబుల కన్నా.. సంలీన సూత్రంతో తయారయ్యే హైడ్రోజన్ బాంబ్ వందల రెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా అణు పరీక్షా కేంద్రం ‘పంగ్యేరి’ దగ్గరలో 5.1 డిగ్రీల తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని అంతర్జాతీయ భూకంప పరిశీలకులు గుర్తించారు. అయితే, భూ ప్రకంపన తీవ్రత ఆధారంగా అది హైడ్రోజన్ బాంబ్ పేలుడు కాదని తెలుస్తోందని, విఫలమైన హైడ్రోజన్ బాంబు ప్రయోగానికి కూడా అంత తక్కువ శక్తి విడుదల కాదని దక్షిణ కొరియా పేర్కొంది. అది ఉత్తర కొరియా నాలుగో అణు బాంబు పరీక్ష కావచ్చొచ్చంది.

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2015

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2015
బరాక్ 8 క్షిపణి పరీక్ష విజయవంతం
యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే బరాక్ 8 క్షిపణిని భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే 70 కిలోమీటర్ల పరిధి(రేంజ్) ఉన్న బరాక్ 8 క్షిపణిని అరేబియా సముద్రంలో ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ నౌక నుంచి పరీక్షించారు. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల్లో ఇది అత్యంత పరిధి కలిగి ఉంది. దీంతో పాటు క్షిపణులను గుర్తించి, ప్రమాదాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరిచారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 250 కిలోమీటర్లకు పైగా పరిధిలో వందలాది శత్రు క్షిపణులు, అనుమానాస్పద విమానాలు, డ్రోన్‌లను ఒకేసారి గుర్తించవచ్చు.

పీఎస్‌ఎల్‌వీ-సీ29 ప్రయోగం విజయవంతం
భారత్ చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ (పీఎస్‌ఎల్‌వీ-సీ29) ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 16న ఆరు సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ29 భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ నుంచి చేపట్టిన 50వ ప్రయోగం. ఆరు ఉపగ్రహాలలో రిమోట్ సెన్సింగ్ కోసం రూపొందించిన టెలియాస్-01 ఉపగ్రహం (బరువు 400 కిలోలు)తో పాటు కెంట్ రిడ్జ్ (78 కిలోలు), వెలాక్సి-సీ1 (123 కిలోలు), వెలాక్స్-2 (13 కిలోలు), గెలాషియో (3.4 కిలోలు), ఎథినోక్సాట్ అనే చిన్న ఉపగ్రహం ఉన్నాయి. ఇస్రో 1999 నుంచి వాణిజ్య పరంగా ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టటం ప్రారంభించింది.
భూమిపైకి తిరిగొచ్చిన ‘ఫాల్కన్9’ రాకెట్
అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ప్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కంపెనీ(స్పేస్-ఎక్స్)అనే ప్రైవేట్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో విఫలయత్నాల తర్వాత భూమిపై ఫాల్కన్ నేరుగా ల్యాండ్ అయినట్లు కంపెనీ తెలిపింది. రాకెట్ మొదటి దశ ఫ్లోరిడాలోని కేప్‌కెనవరల్ వద్ద డిసెంబర్ 21న నేలపై దిగినట్లు పేర్కొన్నారు. ఆర్బ్‌కాం కంపెనీకి చెందిన 11 కృత్రిమ ఉపగ్రహాలను ఫాల్కన్ భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ 2015 నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.

హైడ్రోజన్ బాంబు అభివృద్ధి చేశాం: ఉత్తర కొరియా
హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశనేత కిమ్ జాంగ్ ఉమ్ డిసెంబర్ 10న ప్రకటన చేశారు. కాగా, దీనిపై వివిధ దేశాల నిపుణులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబును థెర్మోన్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తారు. దీని తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే శక్తిమంతమైన పేలుడును సృష్టిస్తుంది. ఉత్తర కొరియా 2006, 2009, 2013లలో భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించింది. 

షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను ప్రయోగించిన పాక్ అణ్వస్త్ర సామర్థ్యం గల షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. అరేబియా సముద్రంలో డిసెంబర్ 11న షహీన్-3ని, 15న షహీన్ 1-ఎను పరీక్షించింది. సంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లే షహీన్-3.. 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను, షహీన్ 1-ఎ.. 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. భారత్‌లోని అనేక నగరాలు వీటి పరిధిలోకి వస్తాయి.

ఇస్రో 50వ అంతరిక్ష ప్రయోగం విజయవంతంభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 50వ అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి డిసెంబర్ 16న పీఎస్‌ఎల్‌వీ సీ-29 రాకెట్ ఆరు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రో 50వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-29 ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను 550 కి.మీల ఎత్తులోని సన్ సింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1999లో వాణిజ్యపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 32వ పీఎస్‌ఎల్వీ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ - 29 రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 227.6 టన్నులు. 

కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు..
  • టెలియోస్-1 (400 కిలోలు)
  • కెంట్‌రిడ్జ్ (78 కిలోలు)
  • వెలాక్సి-సీ1 (123 కిలోలు)
  • వెలాక్సి-11 (13 కిలోలు)
  • గెలాషియో (3.4 కిలోలు)
  • ఎథినోక్సాట్

విద్యార్థులు అభివృద్ధి చేసిన క్యూబ్‌శాట్స్ ప్రయోగించిన నాసాఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా విద్యార్థులు రూపొందించిన మూడు చిన్న పరిశోధన ఉపగ్రహాల(క్యూబ్‌శాట్స్)ను ప్రయోగించింది. రెండు విశ్వవిద్యాలయాలు, ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు ఈ క్యూబ్‌శాట్స్‌కు రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఎడ్యుకేషనల్ లాంచ్ ఆఫ్ నానోశాటిలైట్(ఈఎల్‌ఏఎన్‌ఏ) మిషన్స్ తొమ్మిదో ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా క్యూబ్‌శాట్ లాంచ్ ఇన్షియేటివ్(సీఎస్‌ఎల్‌ఐ) కార్యక్రమం ద్వారా ఈ క్యూబ్‌శాట్స్‌ను ఎంపికచేసినట్లు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కనవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డిసెంబర్ 3న అట్లాస్-5 రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించారు. ఖగోళ అన్వేషణ, భూ పర్యవేక్షణ తదితర నాసా మిషన్లకు ఈ శాటిలైట్లు తక్కువ ఖర్చులో సేవలందించనున్నాయి.

ఐసీటీ సూచీలో భారత్‌కు 131వ ర్యాంకుయూఎన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్(ఐసీటీ) 167 దేశాలతో రూపొందించిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధిసూచీ(ఐసీటీ)లో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ల మంది(ప్రపంచ జనాభాలో 43.4 శాతం మంది) ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని ఐటీయూ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ సూచీలో దక్షిణ కొరియా మొదటిస్థానంలో నిలువగా, ఐస్‌లాండ్ రెండో స్థానంలో నిలిచింది.

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2015

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2015

‘అగ్ని-1’ ప్రయోగం విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 క్షిపణిని భారత్ నవంబర్ 27న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది 700 కి.మీ. పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకుపోగల అగ్ని-1 బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేయగా, భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసింది.
పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్.. నవంబరు 26న ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగిస్తారు. ఇది 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.
నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ కదమత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కదమత్ (Kadmatt)’ నవంబరు 26న నౌకాదళంలోకి చేరింది. శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే ఈ యుద్ధ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) అభివృద్ధి చేసింది. దీని బరువు 3,200 టన్నులు, పొడవు 109 మీటర్లు. 25 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ తరహాకు చెందిన 4 యుద్ధ నౌకలను ‘పి-28’ ప్రాజెక్ట్ కింద జీఆర్‌ఎస్‌ఈ అభివృద్ధి చేసింది. వీటిలో కదమత్ రెండోది కాగా, మొదటిది ఐఎన్‌ఎస్ కమోర్తాను 2014లో నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
‘బారక్-8’ ప్రయోగం విజయవంతం
భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారక్-8 క్షిపణిని జెరుసలేంలో నవంబరు 27న విజయవంతంగా పరీక్షించారు. ఇది 250 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీన్ని భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.

ఏఏడీ క్షిపణిని పరీక్షించిన భారత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) క్షిపణిని భారత్ నవంబర్ 22న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో విజయవంతంగా పరీక్షించింది. ఈ సూపర్ సోనిక్ ఇంటర్‌సెప్టార్ మిస్సైల్‌ను బహుళ అంచెల క్షిపణిగా అభివృద్ధి చేశారు. 7.5 మీటర్ల పొడవైన ఏఏడీ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇందులో ఆధునిక దిక్సూచి వ్యవస్థ, కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్లు ఉంటాయి. 
ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకుపోగల ధనుష్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ నవంబర్ 24న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరానికి సమీపంలో ఐఎన్‌ఎస్ శుభద్ర యుద్ధ నౌక నుంచి దీన్ని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని ధనుష్ క్షిపణి విజయవంతంగా చేధించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ధనుష్ అనేది నౌకాదళం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణి. 500 కిలోల సంప్రదాయ లేదా అణ్వాస్త్రాలను మోసుకుపోగల ధనుష్ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు

నిఘా విమానం పీ-8ఐ జాతికి అంకితం
నిఘా విమానం పీ-8ఐ విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 13న జాతికి అంకితం చేశారు. ఈ దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా విమానాల్లో ఒకటిగా పేరొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పీ-8ఐ చే రికతో భారత వైమానిక దళబలం మరింత పెరిగింది.
భారత నావికా దళంలో చేరిన ‘మారిచ్’
ఆధునిక టార్పెడో రక్షణ వ్యవస్థ (ఏటీడీఎస్) ‘మారిచ్’ భారత నావికా దళంలో చేరింది. విశాఖలోని నావికా దళ సమర శాస్త్ర సాంకేతిక పరిశోధనశాల (ఎన్‌ఎస్‌టీఎల్)లో నవంబర్ 14న రక్షణమంత్రి మనోహర్ పరేకర్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధావన్‌కు దీనిని అందచేశారు. ఎన్‌పీఓఎల్, ఎన్‌ఎస్‌టీఎల్ సహకారంతో ‘మారిచ్’ రూపకల్పన చేశారు. నౌకల స్థాయిని నిర్దేశించే సీ కీపింగ్ యుక్తివిన్యాస బేసిన్ (ఎస్‌ఎంబీ)ను కూడా రక్షణమంత్రి ప్రారంభించారు. రూ.168 కోట్ల వ్యయంతో ఎన్‌ఎస్‌టీఎల్‌లోనే నిర్మితమైన ఈ బేసిన్‌లో నౌకల సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. 
హైదరాబాద్‌లో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్
వైద్య పరిశోధనలకు ఉపయోగపడే జంతువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య పరిశోధన విభాగం పంపిన ఈ ప్రతిపాదనకు నవంబర్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధనల మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ. 338.58 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2018-19 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పే ఈ తరహా కేంద్రం దేశంలోనే మొదటిది.

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ నవంబరు 9న విజయవంతంగా పరీక్షించింది. 4000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశా తీరానికి సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం (వీలర్) దీవి నుంచి పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే అగ్ని-4 క్షిపణి పొడవు 20 మీటర్లు. బరువు 17 టన్నులు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ క్షిపణి సొంతం.
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భూమిపై నుంచి దాడిచేసే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని నవంబరు 7న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి రకాన్ని 2007లో సైన్యంలో ప్రవేశపెట్టారు. బ్రహ్మోస్ క్షిపణి.. భూమి, సముద్రం, సాగర గర్భం; గాల్లో నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణించగలదు. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. భారత్, రష్యాలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశాయి.
సూపర్ టమోటా పరిశోధనలు
మొక్కల ఎదుగుదలలో కీలకమైన జింక్, టైటానియం డయాక్సైడ్‌లను నానో స్థాయిలో అందించటం వల్ల టమోటాల పరిమాణాన్ని, అందులోని పోషకాలను గణనీయంగా పెంచవచ్చని వాషింగ్టన్ యూనివర్సిటీ (సెయింట్ లూయిస్, అమెరికా) శాస్త్రవేత్తలు రమేశ్ రాలియ, ప్రీతం విశ్వాస్‌లు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వీరిద్దరూ భారత సంతతి శాస్త్రవేత్తలు. 
‘ఈ-పాఠశాల’ ప్రారంభం
డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నవంబరు 7న కొన్ని యాప్‌లను ప్రారంభించింది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కోసం ‘ఈ-పాఠశాల’, సీబీఎస్సీ పాఠశాలల కోసం ‘సారాంశ్’ యాప్‌లను మంత్రి స్మృతీ ఇరానీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. పాఠశాలల అభివృద్ధికి ‘శాల సిద్ధి’, కేంద్రీయ విద్యాలయలో చదివే విద్యార్థుల వివరాల కోసం ‘శాల దర్పణ్’ యాప్‌లను ఆవిష్కరించారు.
భారీ రేడియో గెలాక్సీని గుర్తించిన భారత శాస్త్రవేత్తలు
అత్యంత అరుదైన భారీ ‘రేడియో’ గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతర్థాన దశలో ఉన్న ఈ గెలాక్సీ సుమారు 9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్(ఎన్‌సీఆర్‌ఏ)లోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మీటర్‌వేవ్ రేడియో టెలిస్కోప్(జీమ్‌ఆర్‌టీ) సాయంతో దీన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు. ‘జీ021659044920’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తున్న ఈ గెలాక్సీ ఏకంగా నాలుగు మిలియన్ కాంతి సంవత్సరాల పరిధి వరకూ శక్తిమంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతున్నట్లు వెల్లడించారు. ఇలా సుదూర ప్రాంతాల వర కూ రేడియో తరంగాలను వెలువరించే గెలాక్సీలను భారీ ‘రేడియో గెలాక్సీ’లు అని అంటారు. ఒక మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలోపు వరకు రేడియో గెలాక్సీలు ఉండడం సహజం. అయితే కొన్ని కాస్మిక్ సంవత్సరాల దూరంలో ఉన్న భారీ రేడియో గెలాక్సీలు చాలా అరుదు. ఇప్పటి వరకూ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీటిని గుర్తించారు. 
జీశాట్-15 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 11న జీశాట్-15 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంతరిక్ష కేంద్రం రూపొందించిన అరైన్5వీఏ227 రాకెట్ ద్వారా 3,164 కిలోల బరువైన జీశాట్-15 ఉపగ్రహంతో పాటు అరబ్‌శాట్-6బీను రోదసీలోకి పంపారు. 43.24 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేశారు. ఈ ఉపగ్రహాన్ని 250 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరగా), 35,819 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది నిర్ణీత కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇన్‌శాట్-3ఏ, ఇన్‌శాట్-4బీ ఉపగ్రహాల కాలపరిమితి ముగియడంతో సుమారు రూ.800 కోట్ల వ్యయంతో తయారుచేసిన జీశాట్-15ను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా మెరుగైన టెలివిజన్ ప్రసారాలు, విమానాల సిగ్నల్స్ అందుతాయి.

యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష 
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోచి నుంచి జరిపిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమయింది. నవంబరు 1న దేశ పశ్చిమ తీరం నుంచి 290 కి.మీ.ల దూరంలో అరేబియా సముద్రంలో గల లక్ష్యనౌక అలెప్పిని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. బ్రహ్మోస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది 49వ సారి. 

తొలి మేడ్ ఇన్ చైనా విమానంవిమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని నవంబర్ 2న ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్‌పోర్టులు 21 ఉన్నాయి.

ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలుభారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు నవంబర్ 4న వెల్లడించారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు.