AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2016

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2016
ఆకాశ్ క్షిపణులను పరీక్షించిన భారత్
భారత్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మూడు ఆకాశ్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ నుంచి జనవరి 28న పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనికి 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకుపోయే సామర్థ్యం ఉంది. ఇది ధ్వని వేగం కంటే 2.8 నుంచి 3.5 రెట్ల వేగంతో దూసుకుపోయి యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు వంటి అస్త్రాలను ధ్వంసం చేయగలదు.

భారత్‌లో కొత్త పక్షి జాతి గుర్తింపు
ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో కొత్త పక్షి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశం, స్వీడ న్, చైనా, యూఎస్, రష్యా దేశాల శాస్త్రవేత్తల బృందం ఈ పక్షి జాతిని గుర్తించింది. 1947 తర్వాత భారత్‌లో గుర్తించిన అత్యంత అరుదైన పక్షి జాతుల్లో ఇది నాలుగోది. భారత పక్షి శాస్త్ర పితామహుడు డాక్టర్ సలీం అలీ పేరును ఈ పక్షి జాతికి పెట్టారు. శాస్త్రీయంగా ‘జూతెర సలీమాలీ’గా ఈ పక్షిని పిలవనున్నారు.
కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు ఉన్న గ్రహాన్ని కనుగొన్నట్లు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జనవరి 20న తెలిపారు. ఈ గ్రహం ప్లూటోకు ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కొత్త గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. దీని ద్రవ్యరాశి భూమికంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ గ్రహానికి సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. 
సోలార్ ఫిజిక్స్ అధ్యయనానికి ఆదిత్య-ఎల్1: ఇస్రో
సోలార్ ఫిజిక్స్‌లోని సమస్యలను అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. సూర్యుని గతిశీల ప్రక్రియను దీని ద్వారా తెలుసుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ద్వారా 2019-20లో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నామని జనవరి 26న పేర్కొంది. సూర్యునిపై పరిశోధనకు భారత్ ప్రయోగిస్తున్న తొలి సోలార్ ఉపగ్రహం ఆదిత్య - ఎల్1 మిషన్. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని ఎల్1(లెగ్రాంజియన్ పాయింట్) చుట్టూ ఉండే హాలో కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఎలాంటి గ్ర హణాలు అడ్డులేకుండా నిరంత రం సూర్యుడిని చూడగలిగేందుకు ఇక్కడ వీలుపడుతుంది. మరింత విస్తృత అధ్యయనానికి గాను ఈ ఉపగ్రహానికి మరో ఆరు పేలోడ్లను అమర్చనున్నారు. ఈ ప్రయోగం కోసం సుమారు రూ.378.53 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా వంటి వాటిపై అధ్యయనం చేయనున్నారు.
ఐఎన్‌ఎస్ విరాట్‌కు విశ్రాంతి
భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఇక విశ్రాంతి తీసుకోనుంది. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన విమాన వాహక యుద్ధనౌకగా విరాట్ గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకోనుంది. అనంతరం షిప్ మ్యూజియంగా రూపాంతరం చెంది కాకినాడ తీరంలో కొలువుదీరనుంది. కాకినాడ తీరంలో ఏర్పాటయ్యే ఈ ఐఎన్‌ఎస్ విరాట్ షిప్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది అవుతుంది.

తొలి సేంద్రీయ రాష్ట్రంగా సిక్కిం
75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని సేంద్రీయ, సుస్థిర సాగు కిందకు తీసుకురావడం ద్వారా దేశంలోనే తొలి ఆర్గానిక్ స్టేట్‌గా సిక్కిం అవతరించింది. ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ మార్గదర్శకాలకు అనుగుణంగా 75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని క్రమంగా సేంద్రీయ సాగు పద్ధతిలోకి మార్చారు. 2003లో పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ పద్ధతిలోనే భూమిని సాగు చేయాలని తీర్మానించడంతో క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల అమ్మకాన్ని నిషేధించి రైతులు సేంద్రీయ సాగును అనుసరించాల్సిన తప్పని పరిస్థితిని కల్పించారు.
పీఎస్‌ఎల్వీ-సీ31 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... జనవరి 20న పీఎస్‌ఎల్వీ-సీ31 రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ తరహాలో దేశీయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ మరింత బలోపేతం కానుంది. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో మొత్తంగా 51వ విజయాన్ని, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 32వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఉపఖండంలో క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ (రీజనల్ నావిగేషన్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)ను రూ.3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ, 1బీ, 1సీ, 1డీలతో తాజాగా ‘1ఈ’ ఉపగ్రహంతో కలిపి ఐదింటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 2016 మార్చి 10, 28 తేదీల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’ వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటు చుట్టూ మరో 1,500 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే జీపీఎస్ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఇస్రో అధికారులు ప్రకటించారు.

విశ్వంలో మరో వంద గ్రహాలు!
విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100 గ్రహాలను రెండో దశలో (కె-2 మిషన్)లో కెప్లర్ గుర్తించింది. కొత్త గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరుగుతూ కెప్లర్‌ను దాటినప్పుడు నక్షత్రాల వెలుగుకు అడ్డురావటంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. యాంత్రిక లోపాల వల్ల కెప్లర్ దారి తప్పింది. 2013 మేలో కెప్లర్‌తో సంబంధాలు తెగాయి. అయితే శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి టెలీస్కోప్ సాయంతో కెప్లర్‌ను అనుసరిస్తున్నారు. 
నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కద్మత్
జలాంతర్గామి విధ్యంసక నౌక ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకాదళంలో చేరింది. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్కే దోవన్ జనవరి 7న దీన్ని తూర్పు నౌకాదళంలో చేర్చారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సిగ్నల్ వ్యవస్థ ఐఎన్‌ఎస్ కద్మత్‌లో ఉంది. ఇది శబ్దం లేకుండా శత్రు జలాంతర్గాములను ధ్వంసం చేయగలదు. దీని బరువు 3,500 టన్నులు, పొడవు 109 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. ఇది గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణి ంచగలదు. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డిండ్ అండ్ ఇంజనీర్స్ సంస్థ ఐఎన్‌ఎస్ కద్మత్‌ను నిర్మించింది. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దీనికి పశ్చిమ తీరంలోని దీవి కద్మత్ పేరు పెట్టారు.
మరో భారీ పాలపుంత సమూహం గుర్తింపు
మన పాలపుంతకంటే వెయ్యిరెట్లు పెద్దదైన ఓ భారీ పాలపుంత సమూహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బిగ్ బ్యాంగ్‌కు సంభవించిన దాదాపు 3.8 బిలియన్ సంవత్సరాలకు ఈ పాలపుంత ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆవిర్భావ సమయంలో వాయువులు, ధూళితో నిండి ఉన్న విశ్వంలో కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత పాలపుంతలు ఏర్పడ్డాయని, అవన్నీ ఒకచోటుకు చేరడం ద్వారా పాలపుంతల సమూహాలు ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన పాలపుంత సమూహం అలా ఏర్పడిందేనని, భూమికి 10 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, వేల సంఖ్యలో పాలపుంతలను కలిగి ఉందని, సూర్యుడికంటే 250 ట్రిలియన్ రెట్లు పెద్దదని తెలిపారు.

హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన
కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీదరహళ్లి కావల్‌లో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 3న శంకుస్థాపన చేశారు. 15 ఏళ్లలో ఈ కేంద్రం నుంచి 600 దేశీయ హెలికాప్టర్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మోదీ వెల్లడించారు. వీటిని సైన్యానికి అందజేయనున్నట్లు చెప్పారు. 2018 నాటికి ఈ కర్మాగారం నుంచి తయారైన మొదటి దేశీయ హెలికాప్టర్ నింగిలో ఎగరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, అనంతకుమార్, సదానందగౌడ, రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా పాల్గొన్నారు.

డీఆర్‌డీఓ మానవ రహిత యుద్ధ వాహనంమానవ రహిత యుద్ధ వాహనాన్ని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి మండలి(డీఆర్‌డీఓ) సిద్ధం చేసింది. ఈ వాహనాన్ని మైసూరు నగరంలోని మానస గంగోత్రిలో ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని పుణేలోని డీఆర్‌డీఓ కేంద్రం సిద్ధం చేసింది. ఇది ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సహాయంతో నడుస్తుంది. బాంబులను కూడా కనిపెట్టి నిర్వీర్యం చేస్తుంది. ఈ వాహనంలో రోబో తొడుగుతో తయారు చేసిన వస్తువు చాలా బరువైన బాంబులను కూడా పైకి ఎత్తుతుంది. నేలలో ఉన్న బాంబులను కూడా పైకి తీస్తుంది. దీనిపై అతి బరువైన ఆయుధాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. 

హెడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తర కొరియాఅణుబాంబు కన్నా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా జనవరి 6న ప్రకటించింది. ‘సూక్ష్మీకరించిన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కొనే తాజా అస్త్రం సిద్ధమైంది’ అని అక్కడి అధికార టెలివిజన్‌లో ప్రకటన వెలువడింది. దీంతో ఉత్తర కొరియా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రోజన్ బాంబును తయారు చేశామని 2015 డిసెంబర్‌లో ఆ దేశ అత్యున్నత నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలకు సంబంధించిన తొలి ఆదేశాలపై డిసెంబర్ 15న, తుది ఆదేశాలపై జనవరి 3న కిమ్ సంతకం చేశారు. అణు విచ్ఛిత్తి ఆధారంగా రూపొందే అణు బాంబుల కన్నా.. సంలీన సూత్రంతో తయారయ్యే హైడ్రోజన్ బాంబ్ వందల రెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా అణు పరీక్షా కేంద్రం ‘పంగ్యేరి’ దగ్గరలో 5.1 డిగ్రీల తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని అంతర్జాతీయ భూకంప పరిశీలకులు గుర్తించారు. అయితే, భూ ప్రకంపన తీవ్రత ఆధారంగా అది హైడ్రోజన్ బాంబ్ పేలుడు కాదని తెలుస్తోందని, విఫలమైన హైడ్రోజన్ బాంబు ప్రయోగానికి కూడా అంత తక్కువ శక్తి విడుదల కాదని దక్షిణ కొరియా పేర్కొంది. అది ఉత్తర కొరియా నాలుగో అణు బాంబు పరీక్ష కావచ్చొచ్చంది.

No comments:

Post a Comment