AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2016

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2016
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి విజయవంతంభారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్(ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)-1జి ఉపగ్ర హాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.
  • మొదటి దశలో చేపట్టిన ఏడు నావిగేషన్ ఉపగ్రహాల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి చివరిది. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. భారత దిక్సూచి వ్యవస్థ ద్వారా సరిహద్దు నుంచి 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సౌకర్యం కల్పించవచ్చు. ఇది విమానాలు, ఓడల గమనాన్ని తెలపడంలో తోడ్పడుతుంది. వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సదుపాయాన్ని సైనిక అవసరాలకు, క్షిపణి సంబంధ అవస రాలకు వినియోగించుకుంటారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుసంధానం చేయొచ్చు. 2016 చివరికి దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • దిక్సూచి వ్యవస్థ.. నావిక్: భారత దిక్సూచి వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టలేషన్)గా నామకరణం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థలు అమెరికా జీపీఎస్ పేరుతో, రష్యా గోనాస్, ఐరోపా గెలీలియో, చైనా బేయ్‌డోవ్, జపాన్ క్వాసీ జెనిత్ పేర్లతో కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఒక్కోటి 28-35 నావిగేషన్ ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. భారత్.. అమెరికా జీపీఎస్ సేవలను వినియోగించుకుంటోంది.

స్టెల్త్ యుద్ధవిమానాన్ని పరీక్షించిన జపాన్
జపాన్ తొలిసారిగా అభివృద్ధి చేసిన స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఏప్రిల్ 22న ప్రయోగించింది. శత్రుదేశాల రాడార్లకు అందకుండా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న దీనికి ఎక్స్-2 అని పేరు పెట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టెల్త్ యుద్ధవిమానాలను అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే రూపొందించాయి.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష 
జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ఏప్రిల్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.

సిక్కిం ఎన్‌ఐటీలో ఫాస్టెస్ట్ సూపర్‌కంప్యూటర్
దేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను సిక్కింలోని ఎన్‌ఐటీలో ఏర్పాటు చేశారు. దీనికి ‘పరమ్ కంచన్‌జంగా’ అని నామకరణం చేశారు. దేశంలోని 31 ఎన్‌ఐటీలోకెల్లా ఇదే అత్యంత వేగవంతమైన కంప్యూటర్. వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడగలిగే నిర్మాణాలపై ఈ కళాశాల ఇప్పటికే పరిశోధనలు చేస్తోంది. వీటితోపాటు మరెన్నో అంశాల్లో పరిశోధనలకు ‘పరమ్ కంచన్‌జంగా’ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పుణేలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్) సాయంతో రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కంప్యూటర్‌ను ఏర్పాటుచేశారు.

షార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చీఫ్ చార్లెస్ బోల్డెన్‌తో పాటు ఆరుగురు సీనియర్ శాస్త్రవేత్తల బృందం ఏప్రిల్ 6న శ్రీహరికోటలోని షార్‌ను సందర్శించింది. నాసా బృందానికి షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ షార్‌లో చేపట్టిన, చేపట్టబోతున్న ప్రయోగాలు, రాకెట్ లాంచ్ ఫెసిలిటీస్ గురించి వివరించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలతో జరిగిన అవగాహన సదస్సులో నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్ ప్రసంగించారు. 
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా
అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ఏప్రిల్ 9న ప్రకటించింది. ఈ రాకెట్ ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడిచేయగల సామర్థ్యం ఉత్తరకొరియాకి లభించినట్లు తెలిపింది. అయితే అమెరికా, దక్షిణ కొరియాలు ఈ వార్తలను కొట్టిపారేశాయి.
అణుసామర్థ్య క్షిపణి కే-4ను పరీక్షించిన భారత్
అణు జలాంతర్గామి అరిహంత్ నుంచి అణుసామర్థ్య క్షిపణి కే-4ను భారత్ విజయవంతంగా (రహస్యంగా) ప్రయోగించింది. బంగాళాఖాతంలోని గుర్తుతెలియని ప్రదేశం నుంచి భారత నావికాదళం దీన్ని పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కే-4 క్షిపణి 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 12 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల మందం ఉన్న ఈ క్షిపణిని సముద్రంలో 20 మీటర్ల లోతు నుంచి ప్రయోగించారు. 17 టన్నుల బరువున్న కే-4 క్షిపణి రెండువేల కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. కే-4తోపాటు అరిహంత్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగానే రూపొందించింది. ఉపరితల క్షిపణి జలాంతర్గాముల్లో అరిహంత్ కీలకమైనది. రష్యాకు చెందిన అకూలా-1 ఆధారంగా దీనిని తయారు చేశారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం స్మారకార్థం క్షిపణికి కె-4గా నామకరణం చేశారు.

ఆసియాలోనే పెద్ద టెలిస్కోప్ ఆవిష్కరణ
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ దగ్గర్లోని దేవస్థల్ వద్ద బ్రెజిల్ సహాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ఎరీస్ (ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్)ను బ్రెజిల్ ప్రధాని చార్లెస్‌తో కలసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రిమోట్‌తో ఆవిష్కరించారు. 3.6 మీటర్ల వెడల్పు గల ప్రాథమిక కటకం ఉన్న ఈ టెలిస్కోప్ ఆసియాలోనే పెద్దది.

ఎయిడ్స్ వ్యాధికి హోమియో మందువైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ‘క్రొటాలస్ హరిడస్’ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుందని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఒక రకమైన పాము విషంతో తయారుచేసే ఈ మందు... హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనలో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందు పనితీరును పూర్తిస్థాయిలో తేల్చేందుకు 3,900 మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ హోమియో మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని ఆయుష్ వర్గాలు వెల్లడించాయి. 13 మందిలో హెచ్‌ఐవీ వైరస్ శూన్య స్థితికి వచ్చిందని, ఇద్దరిలో ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపాయి.

No comments:

Post a Comment