AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2016

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2016
అంతరిక్షంలో మొక్కను నాటిన నాసా
లెట్యూస్‌గా పిలిచే క్యాబేజీ వర్గానికి చెందిన మొక్కను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో నాటినట్లు అక్టోబర్ 25న నాసా ప్రకటించింది. భవిష్యత్తులో అంగారక యాత్రకు వెళ్లబోయే వ్యోమగాములకు ఇవి ఎంతగానో ఉపయోగపడే వీలుంది. భూమిపై రైతులు పంటను పండిచ్చినట్టే.. వ్యోమగామి షేన్ కింబరో ఈ మొక్కను నాటినట్లు నాసా వెల్లడించింది.
ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్ల్లు మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) ప్రాజెక్ట్ డెరైక్టర్ సుబ్బయ్య అరుణన్ అక్టోబర్ 28న తెలిపారు.

ఐఎన్‌ఎస్ తిహయు ప్రారంభం
వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్‌ఎస్ తిహయును తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ అక్టోబర్ 19న విశాఖపట్నంలో ప్రారంభించారు. దీన్ని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) నిర్మించింది. నాలుగు వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌ల తయారీలో భాగంగా ఇప్పటికే ఐఎన్‌ఎస్ తార్ముగ్లి నౌకను 2016 మే 23న ప్రారంభించారు. గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో పయనించే ఈ నౌక 315 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. 
కోస్ట్‌గార్డ్‌లోకి రాణీ గైడిన్‌ల్యూ
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి కొత్తగా చేరిన తీరగస్తీ నౌక ఐసీజీఎస్ రాణీ గైడిన్‌ల్యూను డెరైక్టర్ జనరల్ రాజేంద్రసింగ్ అక్టోబర్ 19న ప్రారంభించారు. ఈ నౌకకు స్వాతంత్య్ర సమరయోధురాలు, నాగా రాజకీయ నాయకురాలైన రాణీ గైడిన్‌ల్యూ పేరు పెట్టారు. మత్స్యకారులను పర్యవేక్షించడం, ఆపదలో ఉన్న వారిని రక్షించడం, స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఈ నౌక ఉపయోగపడుతుంది. దీనిని హిందుస్తాన్ షిప్‌యార్డ్ సంస్థ రూపొందించింది. గైడిన్‌ల్యూ నౌక 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
అంగారకుడిపై దిగిన ఐరోపా ల్యాండర్
అంగారకుడిపై ఐరోపా ల్యాండర్ (577 కిలోలు) అక్టోబర్ 19న విజయవంతంగా దిగిందని ఐరోపా అంతరిక్ష సంస్థ తెలిపింది. 
పందుల్లో నులిపురుగుల నివారణకు వ్యాక్సీన్
పందుల్లో నులిపురుగులను నివారించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సీన్‌ను తయారు చేసినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అక్టోబర్ 19న ప్రకటించింది. ‘సిస్‌వ్యాక్స్’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్‌తో పందుల ద్వారా మనుషుల్లో వచ్చే మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) ముప్పును తగ్గించవచ్చని పేర్కొంది. టి.సోలియం అనే పరాన్నజీవి కారణంగా పందుల్లో సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పందుల వ్యర్థాలు ఆహారంలో కలవడం ద్వారా కేంద్రనాడీ వ్యవస్థలో తిత్తుల్లాంటి నిర్మాణాలు ఏర్పడి మూర్ఛ వ్యాధికి కారణమవుతున్నాయి.
మైక్రోశాటిలైట్‌ను ప్రయోగించిన తియాంగాంగ్-2
ఇటీవలే మానవసహిత వ్యోమనౌకను నింగిలోకి పంపిన చైనా తాజాగా అక్కడ ఏర్పాటుచేసిన తియాంగాంగ్-2 అంతరిక్ష కేంద్రం నుంచి మైక్రోశాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. బ్యాంగ్‌జింగ్-2 అనే 47 కిలోగ్రాములున్న శాటిలైట్‌ను అక్టోబర్ 23న ప్రయోగించారు. అత్యాధునిక సామర్థ్యం కలిగిన కెమెరాలున్న ఈ శాటిలైట్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన పలు చిత్రాలను తీస్తుంది.

హెచ్‌ఎఫ్‌సీల తగ్గింపునకు కిగాలి సదస్సులో ఒప్పందం
పర్యావరణానికి పెను ముప్పుగా మారిన హైడ్రోఫ్లోరోకార్బన్(హెచ్‌ఎఫ్‌సీ)ల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ సహా 200 దేశాలు అంగీకరించాయి. అక్టోబర్ 15న రువాండా రాజధాని కిగిలిలో మాంట్రియల్ ప్రొటోకాల్‌కు సవరణలు చేసే అంశంపై జరిగిన చర్చలో 197 దేశాలు ఆమోదం తెలిపాయి. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎఫ్‌సీల వినియోగాన్ని 85% తగ్గించాలనేది ఈ సవరణ ఉద్దేశం.

కిగాలి ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు హెచ్‌ఎఫ్‌సీల తగ్గింపును 2019 నుంచి ప్రారంభించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024 నుంచిచేపట్టాలి. ఈ ఉద్గారాలను 2050 నాటికి పూర్తిగా నిర్మూలించాలి. ఇది పారిస్ ఒప్పందానికి సంబంధించి అతి ముఖ్యమైన అంశం. పారిస్ ఒప్పందం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంచాలని నిర్దేశిస్తోంది. 

హైడ్రోఫ్లోరోకార్బన్స్ సాధారణంగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో ఉపయోగిస్తుంటారు.
బ్లాక్‌చైన్ టెక్నాలజీని పరీక్షించిన ఐసీఐసీఐ
ఎమిరేట్స్ ఎన్‌బీడీ సాయంతో ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్యం, చెల్లింపుల లావాదేవీలను ప్రయోగాత్మకంగా నిర్వహించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు అక్టోబర్ 12న ప్రకటించింది. దీంతో ఈ టెక్నాలజీని వినియోగించిన మొదటి దేశీయ బ్యాంక్‌గా ఐసీఐసీఐ అవతరించింది. బ్లాక్‌చైన్ అనేది లావాదేవీల డేటాబేస్. ‘చెల్లింపుల లావాదేవీల ధ్రువీకరణ, అంతర్జాతీయ వాణిజ్య పత్రాలు కొనుగోలు ఆర్డర్, ఇన్వాయిస్, షిప్పింగ్, బీమా తదితర పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయంతో అప్పటికప్పుడే అందుకోవచ్చు. డిజిటల్ రూపంలో ఉన్న సమాచారం వేలాది కంప్యూటర్ల మధ్య పంపిణీ అవడం వల్ల ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న వారెవరైనా తాజా సమాచారాన్ని పొందడానికి వీలవుతుంది.
మానవ సహిత నౌకను నింగిలోకి పంపిన చైనా
జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మానవసహిత అంతరిక్ష నౌకను చైనా అక్టోబర్ 17న విజయవంతంగా ప్రయోగించింది. ఇద్దరు వ్యోమగాములు జింగ్ హాయ్‌పెంగ్(50), చెన్ డాంగ్ (37) ‘షెంజౌ-11’ అనే అంతరిక్ష నౌకలో లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లారు. వీరు అక్కడ ‘టియాంగాంగ్-2’ అనే అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 30 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్న వ్యోమగాములు అంతరిక్ష నౌకలకు సంబంధించి శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్ పరిశోధనలు చేస్తారు. ఈ ప్రయోగంతో సొంత మానవసహిత అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకోనున్న ఏకైక దేశంగా చైనా అవతరించింది.

చైనా వ్యోమగాములు 30 రోజుల పాటు అంతరిక్షంలో గడపడం ఇదే తొలిసారి. 2003లో ప్రయోగించింన మానవసహిత అంతరిక్ష నౌక అక్కడ 15 రోజుల పాటు ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్‌ఎస్) జీవిత కాలం 2024 నాటికి ముగియనుంది.


జీశాట్-18 ప్రయోగం విజయవంతం
సమాచార సేవలకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్-18ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. అక్టోబర్ 6న ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహం ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తా సేకరణ వంటి అంశాలు వేగవంతం కానున్నాయి.

ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231 అనే వాహకనౌక ఆస్ట్రేలియా ఆపరేటర్ ఎన్‌బీఎన్‌కు సంబంధించిన ‘స్కై మస్టర్-2’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత జీశాట్-18ను కక్ష్యలోకి పంపింది. ఈ ఉపగ్రహంలో 24 సీ బ్యాండ్, 12 ఎక్సెటెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో పాటు 2 కేయూ బీకాన్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఇప్పటికే 12 ఇస్రో సమాచార ఉపగ్రహాలు 235 ట్రాన్స్‌పాండర్లతో దేశవ్యాప్తంగా డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు అందిస్తున్నాయి. 
జీశాట్-18రాకెట్: ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231
మొత్తం బరువు: 3404 కేజీలు
జీవితకాలం: 15 సంవత్సరాలు
వినియోగ శక్తి: 6474 వాట్ల సౌరశక్తి, 144 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలు -2

No comments:

Post a Comment