AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2015

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2015

‘అగ్ని-1’ ప్రయోగం విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 క్షిపణిని భారత్ నవంబర్ 27న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది 700 కి.మీ. పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకుపోగల అగ్ని-1 బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేయగా, భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసింది.
పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్.. నవంబరు 26న ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగిస్తారు. ఇది 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.
నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ కదమత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కదమత్ (Kadmatt)’ నవంబరు 26న నౌకాదళంలోకి చేరింది. శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే ఈ యుద్ధ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) అభివృద్ధి చేసింది. దీని బరువు 3,200 టన్నులు, పొడవు 109 మీటర్లు. 25 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ తరహాకు చెందిన 4 యుద్ధ నౌకలను ‘పి-28’ ప్రాజెక్ట్ కింద జీఆర్‌ఎస్‌ఈ అభివృద్ధి చేసింది. వీటిలో కదమత్ రెండోది కాగా, మొదటిది ఐఎన్‌ఎస్ కమోర్తాను 2014లో నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
‘బారక్-8’ ప్రయోగం విజయవంతం
భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారక్-8 క్షిపణిని జెరుసలేంలో నవంబరు 27న విజయవంతంగా పరీక్షించారు. ఇది 250 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీన్ని భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.

ఏఏడీ క్షిపణిని పరీక్షించిన భారత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) క్షిపణిని భారత్ నవంబర్ 22న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో విజయవంతంగా పరీక్షించింది. ఈ సూపర్ సోనిక్ ఇంటర్‌సెప్టార్ మిస్సైల్‌ను బహుళ అంచెల క్షిపణిగా అభివృద్ధి చేశారు. 7.5 మీటర్ల పొడవైన ఏఏడీ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇందులో ఆధునిక దిక్సూచి వ్యవస్థ, కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్లు ఉంటాయి. 
ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకుపోగల ధనుష్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ నవంబర్ 24న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరానికి సమీపంలో ఐఎన్‌ఎస్ శుభద్ర యుద్ధ నౌక నుంచి దీన్ని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని ధనుష్ క్షిపణి విజయవంతంగా చేధించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ధనుష్ అనేది నౌకాదళం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణి. 500 కిలోల సంప్రదాయ లేదా అణ్వాస్త్రాలను మోసుకుపోగల ధనుష్ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు

నిఘా విమానం పీ-8ఐ జాతికి అంకితం
నిఘా విమానం పీ-8ఐ విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 13న జాతికి అంకితం చేశారు. ఈ దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా విమానాల్లో ఒకటిగా పేరొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పీ-8ఐ చే రికతో భారత వైమానిక దళబలం మరింత పెరిగింది.
భారత నావికా దళంలో చేరిన ‘మారిచ్’
ఆధునిక టార్పెడో రక్షణ వ్యవస్థ (ఏటీడీఎస్) ‘మారిచ్’ భారత నావికా దళంలో చేరింది. విశాఖలోని నావికా దళ సమర శాస్త్ర సాంకేతిక పరిశోధనశాల (ఎన్‌ఎస్‌టీఎల్)లో నవంబర్ 14న రక్షణమంత్రి మనోహర్ పరేకర్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధావన్‌కు దీనిని అందచేశారు. ఎన్‌పీఓఎల్, ఎన్‌ఎస్‌టీఎల్ సహకారంతో ‘మారిచ్’ రూపకల్పన చేశారు. నౌకల స్థాయిని నిర్దేశించే సీ కీపింగ్ యుక్తివిన్యాస బేసిన్ (ఎస్‌ఎంబీ)ను కూడా రక్షణమంత్రి ప్రారంభించారు. రూ.168 కోట్ల వ్యయంతో ఎన్‌ఎస్‌టీఎల్‌లోనే నిర్మితమైన ఈ బేసిన్‌లో నౌకల సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. 
హైదరాబాద్‌లో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్
వైద్య పరిశోధనలకు ఉపయోగపడే జంతువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య పరిశోధన విభాగం పంపిన ఈ ప్రతిపాదనకు నవంబర్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధనల మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ. 338.58 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2018-19 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పే ఈ తరహా కేంద్రం దేశంలోనే మొదటిది.

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ నవంబరు 9న విజయవంతంగా పరీక్షించింది. 4000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశా తీరానికి సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం (వీలర్) దీవి నుంచి పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే అగ్ని-4 క్షిపణి పొడవు 20 మీటర్లు. బరువు 17 టన్నులు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ క్షిపణి సొంతం.
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భూమిపై నుంచి దాడిచేసే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని నవంబరు 7న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి రకాన్ని 2007లో సైన్యంలో ప్రవేశపెట్టారు. బ్రహ్మోస్ క్షిపణి.. భూమి, సముద్రం, సాగర గర్భం; గాల్లో నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణించగలదు. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. భారత్, రష్యాలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశాయి.
సూపర్ టమోటా పరిశోధనలు
మొక్కల ఎదుగుదలలో కీలకమైన జింక్, టైటానియం డయాక్సైడ్‌లను నానో స్థాయిలో అందించటం వల్ల టమోటాల పరిమాణాన్ని, అందులోని పోషకాలను గణనీయంగా పెంచవచ్చని వాషింగ్టన్ యూనివర్సిటీ (సెయింట్ లూయిస్, అమెరికా) శాస్త్రవేత్తలు రమేశ్ రాలియ, ప్రీతం విశ్వాస్‌లు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వీరిద్దరూ భారత సంతతి శాస్త్రవేత్తలు. 
‘ఈ-పాఠశాల’ ప్రారంభం
డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నవంబరు 7న కొన్ని యాప్‌లను ప్రారంభించింది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కోసం ‘ఈ-పాఠశాల’, సీబీఎస్సీ పాఠశాలల కోసం ‘సారాంశ్’ యాప్‌లను మంత్రి స్మృతీ ఇరానీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. పాఠశాలల అభివృద్ధికి ‘శాల సిద్ధి’, కేంద్రీయ విద్యాలయలో చదివే విద్యార్థుల వివరాల కోసం ‘శాల దర్పణ్’ యాప్‌లను ఆవిష్కరించారు.
భారీ రేడియో గెలాక్సీని గుర్తించిన భారత శాస్త్రవేత్తలు
అత్యంత అరుదైన భారీ ‘రేడియో’ గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతర్థాన దశలో ఉన్న ఈ గెలాక్సీ సుమారు 9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్(ఎన్‌సీఆర్‌ఏ)లోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మీటర్‌వేవ్ రేడియో టెలిస్కోప్(జీమ్‌ఆర్‌టీ) సాయంతో దీన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు. ‘జీ021659044920’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తున్న ఈ గెలాక్సీ ఏకంగా నాలుగు మిలియన్ కాంతి సంవత్సరాల పరిధి వరకూ శక్తిమంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతున్నట్లు వెల్లడించారు. ఇలా సుదూర ప్రాంతాల వర కూ రేడియో తరంగాలను వెలువరించే గెలాక్సీలను భారీ ‘రేడియో గెలాక్సీ’లు అని అంటారు. ఒక మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలోపు వరకు రేడియో గెలాక్సీలు ఉండడం సహజం. అయితే కొన్ని కాస్మిక్ సంవత్సరాల దూరంలో ఉన్న భారీ రేడియో గెలాక్సీలు చాలా అరుదు. ఇప్పటి వరకూ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీటిని గుర్తించారు. 
జీశాట్-15 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 11న జీశాట్-15 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంతరిక్ష కేంద్రం రూపొందించిన అరైన్5వీఏ227 రాకెట్ ద్వారా 3,164 కిలోల బరువైన జీశాట్-15 ఉపగ్రహంతో పాటు అరబ్‌శాట్-6బీను రోదసీలోకి పంపారు. 43.24 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేశారు. ఈ ఉపగ్రహాన్ని 250 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరగా), 35,819 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది నిర్ణీత కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇన్‌శాట్-3ఏ, ఇన్‌శాట్-4బీ ఉపగ్రహాల కాలపరిమితి ముగియడంతో సుమారు రూ.800 కోట్ల వ్యయంతో తయారుచేసిన జీశాట్-15ను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా మెరుగైన టెలివిజన్ ప్రసారాలు, విమానాల సిగ్నల్స్ అందుతాయి.

యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష 
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోచి నుంచి జరిపిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమయింది. నవంబరు 1న దేశ పశ్చిమ తీరం నుంచి 290 కి.మీ.ల దూరంలో అరేబియా సముద్రంలో గల లక్ష్యనౌక అలెప్పిని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. బ్రహ్మోస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది 49వ సారి. 

తొలి మేడ్ ఇన్ చైనా విమానంవిమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని నవంబర్ 2న ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్‌పోర్టులు 21 ఉన్నాయి.

ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలుభారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు నవంబర్ 4న వెల్లడించారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు.

No comments:

Post a Comment