AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2016

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2016
అంతరిక్ష విహారం కోసం నాసాకు 18,300 మంది దరఖాస్తు
వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు 18,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 2012లో వచ్చిన దరఖాస్తుల కంటే మూడు రెట్లు ఎక్కువని నాసా అధికారులు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నైపుణ్యం ఉన్న 8-14 మందిని ఎంపిక చేయనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ తెలిపారు.
స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష నిర్వహించిన ఇస్రో
భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు తోడ్పడే క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 19న విజయవంతంగా పూర్తి చేసింది. మహేంద్రగిరి (తమిళనాడు)లోని ప్రొపల్షన్ సముదాయంలో క్రయోజెనిక్ ఇంజన్‌కు 640 సెకన్ల పాటు ఉష్ణ పరీక్షను నిర్వహించారు.

గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 11న ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కిందట ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి ఉద్భవించి అంతరిక్షంలోకి విస్తరిస్తున్న తరంగాల ఉనికిని నిర్ధారించినట్లు యు.ఎస్. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని, ఇప్పుడు తొలిసారిగా ఆధారపూర్వకంగా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు కదిలి 2015 సెప్టెంబర్ 14న భూమికి చేరడంతో అమెరికా భూగర్భంలో అమర్చిన లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీకి చెందిన అత్యాధునిక పరికరాలు వాటిని గుర్తించాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా విశ్వానికి సంబంధించిన కొత్త అంశాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఐన్‌స్టీన్ 1916లో ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా లెక్కించిన గురుత్వాకర్షణ తరంగాలతో ఈ తరంగాలు కచ్చితంగా సరిపోయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృష్ణబిలాలు, న్యూట్రాన్ లాంటి భారీ వస్తువులు ఢీకొట్టడం ద్వారా అంతరిక్షం-కాలానికి సంబంధించిన గురుత్వాకర్షణ తరంగాలు చోటు చేసుకుంటాయి. వీటిని గుర్తించడం సంక్లిష్టమైన విషయం.
360 టెరాబైట్ల డేటా డిస్క్ ఆవిష్కరణ
లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఆప్టో ఎలక్ట్రానిక్ పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు 360 టెరాబైట్ల సామర్థ్యంతో 5 డెమైన్షనల్ డేటా డిస్‌భను తయారు చేశారు. దీనికి ‘సూపర్‌మేన్ మెమరీ క్రిస్టల్’ అని నామకరణం చేశారు. నానో స్ట్రక్చర్ గ్లాస్‌తో ఈ 5డీ డిస్క్‌ను రూపొందించారు. ఫెమ్టోసెకండ్ లేజర్ రైటింగ్ ద్వారా డిస్క్‌లో డేటాను భద్రపర్చుకోవచ్చు. ఇందులో భద్రపర్చిన సమాచారం వందేళ్లపాటు భద్రంగా ఉంటుందని..1000 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలోనూ ఈ డిస్క్ చెక్కుచెదరదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించడం కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత్ ఫిబ్రవరి 16న విజయవంతంగా ప్రయోగించింది. 500-1000 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం గల ఈ క్షిపణిని బాలాసోర్ జిల్లా చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంచర్ ద్వారా పరీక్షించారు. ద్రవ ఇంధనంతో పనిచేసే రెండు ఇంజన్లు కలిగిన ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అవలీలగా ఛేదించగలదు. ఇంటిగ్రేటేడ్ గెడైడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తయారు చేసిన ఐదు క్షిపణుల్లో ఇదొకటి. 2003లోనే రక్షణ రంగంలో చేర్చిన ఈ క్షిపణిని 2015 నవంబరు 26న ఇదే ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
సూర్యకిరణాలతో హైడ్రోజన్
సూర్య కిరణాల నుంచి నీటిని ఏర్పర్చి, తద్వారా హైడ్రోజన్‌ను తయారు చేసే ‘మల్టీ లేయర్డ్ ఫోటో ఎలక్ట్రోడ్’ను కొరియన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సృష్టిలో సహజంగా జరిగే కిరణజన్య సంయోగక్రియను ఆధారంగా చేసుకుని ఈ కొత్త పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో ఎలాగైతే సూర్యరశ్మి శక్తిగా రూపాంతరం చెందుతుందో.. అదే విధంగా సూర్యరశ్మి నుంచి నీటి అణువులు (H2O) సేకరించి, వీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరికరానికి వాతావరణంలోని 90 శాతం శుద్ధమైన నీటిని గ్రహించుకోగలిగే సామర్థ్యం ఉందని పరిశోధకులు తెలిపారు.

అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా జికా వైరస్ వ్యాప్తి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ఫిబ్రవరి 1న అమెరికాలో జికా వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. పిల్లలు చిన్న తలతో జన్మించడానికి కారణమవుతున్న ఈ వైరస్ గత ఏడాది బ్రెజిల్‌కు వ్యాప్తి చెందిన తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి డబ్ల్యు.హెచ్.ఒ. నిపుణుల సమావేశాన్ని నిర్వహించింది. వచ్చే ఏడాది వరకు ఈ వ్యాధి వల్ల యూఎస్‌ఏలో నాలుగు మిలియన్ల కేసులు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. పనామాలో 50 జికా వైరస్ కేసులను గుర్తించినట్లు ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించడం వల్ల సంబంధిత వైరస్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం, నిధులు పెంచడం, చికిత్స, టీకాల కోసం పరిశోధనను ప్రోత్సహించడం లాంటి వాటికి వెసులుబాటు కలుగుతుంది.
లాంగ్ రేంజ్ రాకెట్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా
లాంగ్ రేంజ్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఉత్తర కొరియా ఫిబ్రవరి 7 ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతతో చేపట్టిన ఈ రాకెట్ ద్వారా భూపరిశీలక ఉపగ్రహం క్వాంగ్ మ్యాంగ్-4ను ప్రయోగించారు. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇది శాంతియుత అంతరిక్ష ప్రయోగమని తెలిపారు. కానీ, ఇది బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని అమెరికా సహా అనేక దేశాలు భావించాయి. ఈ ప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్‌‌స, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించి ఉత్తర కొరియా పరీక్ష జరిపిందని, తక్షణమే ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలని కోరాయి.
ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు
ఎంఎంటీఎస్ రైళ్లలో మొబైల్ అప్లికేషన్ ద్వారా కాగిత రహిత టిక్కెట్లను పొందే సదుపాయాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఫిబ్రవరి 10న ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీతో పాటు సికింద్రాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలోనే అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని మంత్రి అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను తయారు చేశారు.

హైదరాబాద్‌లో సిద్ధమైన ‘జికా’ తొలి వ్యాక్సిన్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్‌ను నియంత్రించే తొలి వ్యాక్సిన్‌ను తాము సిద్ధం చేశామని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రకటించింది. అధికారికంగా దిగుమతి చేసుకున్న జికా వైరస్‌తో భారత్ బయోటెక్ ల్యాబ్‌లో పరిశోధనలు చేసి, వ్యాక్సిన్‌ను కనుగొన్నామని ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కృష్టా ఎల్లా ఫిబ్రవరి 3న తెలిపారు. ఇందుకోసం తాము తొమ్మిది నెలల కిందటే పేటెంట్ సైతం తీసుకున్నామని చెప్పారు. ప్రయోగశాలలో విజయవంతంగా పరీక్షించిన జికా వ్యాక్సిన్‌ను తర్వాత స్థాయిలో పరీక్షలు జరపాల్సి ఉందని ఎల్లా తెలిపారు. భారత ప్రభుత్వం సహకారం అందిస్తే నాలుగు నెలల్లో 10 లక్షల వ్యాక్సిన్లు తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా దోమకాటు ద్వారానే మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించినా తాజాగా లైంగిక చర్య ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతోందని టెక్సాస్‌లో గుర్తించారు. ఇప్పటికే 20 దేశాల్లో సుమారు 4 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వైరస్ నియంత్రణకు పరిశోధనలు చేసి, మందును కనిపెట్టాలని ప్రపంచ దేశాలను కోరింది.

No comments:

Post a Comment