AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2016

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2016
హెక్సాగ్జిమ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఆవిష్కరించిన సనోఫి
చిన్న పిల్లలకు వచ్చే ఆరురకాల వ్యాధులను నయం చేయగలిగే 6 ఇన్ 1 వ్యాక్సిన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన సనోఫి పాయిశ్చర్ సంస్థ భారత్‌లో నవంబర్ 24న ఆవిష్కరించింది. హెక్సాగ్జిమ్ అనే ఈ వ్యాక్సిన్ డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, పోలియో, హెమోఫోలియా ఇన్‌ఫ్లూయెంజా-బి, హెపటైటిస్-బి అనే ఆరు రకాల వ్యాధులను నయం చేయగలుగుతుంది. ఆరువారాల నుంచి రెండు సంవత్సరాల వయసున్నవారు దీనిని వాడవచ్చు.

యూఏవీ రుస్తుం-2 తొలి పరీక్షలు విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక (ఏటీఆర్) నుంచి నిర్వహించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా వినియోగించవచ్చు. రుసు్తంను డీఆర్‌డీవో (బెంగళూరు), హెచ్‌ఏఎల్-బీఈఎల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
చైనా షెంజావు-11 యాత్ర విజయవంతం
సొంత అంతరిక్ష కేంద్రం కోసం చైనా అక్టోబర్ 17న ప్రయోగించిన షెంజావు-11 వ్యోమనౌక నవంబర్ 18న భూమికి చేరుకుంది. చైనా వ్యోమగాములు జింగ్ హయ్‌పెంగ్, చెన్‌డాంగ్‌లను అంతరిక్షానికి తీసుకెళ్లిన ఈ నౌక మంగోలియాలో దిగింది. 
చర్మ వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణం 
మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లో ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం.. ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ ఆన్‌లైన్ ఎడిషన్‌లో ఈ నెల 17న ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపా దేశాల్లో తెల్ల వాళ్లు ఎక్కువగా ఉంటే భారత్‌లో నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ఉన్నారు. మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి ప్రత్యేక జన్యువు ఆర్‌ఎస్2470102 కారణమని పరిశోధకులు తెలిపారు.
పృథ్వీ-2 విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో తయారై, అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ-2 క్షిపణిని ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి నవంబర్ 21 ఉదయం 9.35 గంటలకు దీనిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడంతో పాటు 500-1000 కిలోల బరువున్న వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తయారైన తొలి క్షిపణి.
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం
కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌక పొడవు 164 మీటర్లు, బరువు 7,500 టన్నులు. దీనిపై సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించొచ్చు.
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆఫ్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 22న జరిపిన అగ్ని-I క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఈ మిస్సైల్ 500 కిలోల బరువు గల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవుతో ఉన్న ఈ క్షిపణి దాదాపు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ క్షిపణిని రూపొందించింది. అగ్ని-1ను చివరిసారిగా 2016 మార్చి 14న ఇదే వేదిక నుంచి విజయవంతంగా పరీక్షించారు.

పెద్దగా కనిపించిన చంద్రుడు
ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నవంబర్ 14న చంద్రుడు అతి పెద్దగా కనిపించాడు. భారత్ సహా ఆసియా దేశాల్లో బిగ్ మూన్ దర్శనమిచ్చింది. భూ క్షక్ష్యలో అత్యంత చేరువగా ఉండే ప్రదేశంలోకి చంద్రుడు రావడం వల్లే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. దీన్ని సూపర్ మూన్‌గా వ్యవహరిస్తారు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 14 రాత్రి 7.22 గంటలకు అత్యంత గరిష్ట స్థాయిలో ఈ మార్పు కనిపించింది. ఆ సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,56,509 కిలోమీటర్లు. దాంతో చందమామ సాధారణం కంటే 14 శాతం అధికంగానూ, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగానూ కనిపించింది. ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఎక్స్‌ట్రా సూపర్‌మూన్‌గా అభివర్ణిస్తోంది. 1948 తర్వాత చంద్రుడు ఇంత చేరువగా రావడం ఇదే మొదటిసారి. మళ్లీ తిరిగి 2034, నవంబర్ 25న కనిపించనుంది. ఆ రోజున చందమామ 3,56,445 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంచనా.
దిక్సూచి ఉపగ్రహం పల్సార్‌ను ప్రయోగించిన చైనా 
చైనా సరికొత్త దిక్సూచి ఉపగ్రహాన్ని నవంబర్ 10న విజయవంతంగా ప్రయోగించింది. భవిష్యత్‌లో వ్యోమనౌకల కోసం స్వతంత్ర దిక్సూచి వ్యవస్థను రూపొందించే దిశగా ఎక్స్‌రే పల్సార్ నేవిగేషన్ శాటిలైట్ (ఎక్స్‌పీఎన్‌ఏవీ-1) అనే ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్-11 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహ బరువు 200 కిలోలు. ఇది భూమి చుట్టూ ఉన్న సూర్య అనువర్తిత కక్ష్యలో తిరుగుతుంది. ఇందులో అమర్చిన రెండు పల్సార్ డిటెక్టర్లు అనేక ప్రయోగాలను నిర్వహిస్తాయి. ఎక్స్‌రే పల్సార్ నేవిగేషన్ అనేది సరికొత్త దిక్సూచి పరిజ్ఞానమని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. పల్సార్లు అనే ఖగోళ వస్తువుల నుంచి క్రమం తప్పకుండా వెలువడే ఎక్స్‌రే సంకేతాలను ఉపయోగించి సుదూర విశ్వంలోని ఒక వ్యోమనౌక స్థితిని నిర్ధారించడం ఇందులో కీలకమని వారు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో వ్యవసాయ జీవవైవిధ్య కాంగ్రెస్
తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సు నవంబర్ 6న ఢిల్లీలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తూ. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆకలి, పోషకాహారలోపం, పేదరికంతో అలమటిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే మనం స్థిరమైన అభివృద్ధిని, జీవవైవిధ్య పరిరక్షణను మరిచిపోకూడదు’ అని వ్యాఖ్యానించారు. 1992 నాటి జీవ వైవిధ్య సదస్సు సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 50-150 జాతులు అంతరించి పోతున్నాయన్నారు. నవంబర్ 6 నుంచి 9 వరకు జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

అతిపెద్ద టెలిస్కోప్‌ను రూపొందించిన నాసాఅమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ అనే అతి పెద్ద టెలిస్కోప్‌ను రూపొందించింది. ఇది హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు శక్తివంతమైనది. దీనిని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులోని కెమెరాలపై సూర్య కిరణాలు నేరుగా పడకుండా ఐదు లేయర్లను ఏర్పరచడంతో స్పష్టమైన దృశ్యాలను చూసేందుకు వీలవుతుంది. గత 26 ఏళ్లుగా సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోప్‌కు ఇది కొనసాగింపు.

అత్యంత ఆకర్షణీయ ఇంటర్‌నెట్ బ్రాండ్ అమేజాన్ఆకర్షణీయమైన ఇంటర్నెట్ బ్రాండ్‌గా అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ నిలిచింది. దాని తరువాతి స్థానంలో సెర్చ్ ఇంజన్ గూగుల్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ నిలిచారుు. భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్‌‌స 2016 పేరిట ‘ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ’ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

No comments:

Post a Comment