AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మే 2016

సైన్స్ & టెక్నాలజీ మే 2016
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ బ్రహ్మాస్ క్షిపణిని మే 27న విజయవంతంగా పరీక్షించింది. 290 కిలోమీటర్లకు పైగా పరిధిలోని లక్ష్యాలను చేధించగల (భూతల దాడికి చెందిన)ఈ క్షిపణిని భారత వైమానిక దళం పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించింది. ఈ పరీక్షలో బ్రహ్మోస్ అన్ని ప్రమాణాలను అందుకుని, నిర్దేశిత లక్ష్యాలను చేధించింది. ఇది శబ్ధ వేగం కంటే మూడు రెట్ల ఎక్కువ వేగంతో (మాక్ 3 వేగం) ప్రయాణించింది.
టాప్ మొబైల్ మేనేజింగ్ యాప్‌గా వాట్సప్
ప్రపంచంలోని 109 దేశాల్లో వాట్సప్ టాప్ మొబైల్ మేనేజింగ్ యాప్‌గా నిలిచింది. భారత్‌లో 94.8 శాతం ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేసి ఉంది. యూజర్లు రోజుకు సగటున 37 నిమిషాల పాటు దీన్ని వాడుతున్నారు. డిజిటల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన సిమిలర్ వెబ్ మే 26న నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
చంద్రుడిపై అగాథాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
చంద్రుడిపై మరో రెండు అగాథాలను కనుగొన్నట్లు మే 23న అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొదటి దాని వయసు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌర వ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్‌ఎల్వీ)ను మే 23న విజయవంతంగా ప్రయోగించింది. ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో 70 కిలోమీటర్లు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది.
ఐఎన్‌ఎస్ తార్‌ముగ్లీ జలప్రవేశం
భారత తూర్పు నావికాదళంలో మరో యుద్ధనౌక చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో మే 23న తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ ‘ఐఎన్‌ఎస్ తార్‌ముగ్లీ’ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. తార్‌ముగ్లి అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవి పేరు. ఈ నౌకను తీరప్రాంత గస్తీ, సముద్ర పరిశీలనకు వినియోగిస్తారు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ)లో నిర్మించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌక తార్‌ముగ్లీని తయారుచేశారు.

పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణుసామర్థ్య క్షిపణి ‘పృథ్వీ-2’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఉపరితల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న రెండు ద్రవ ఇంధన ఇంజన్లున్న ఈ క్షిపణిని మే 18న ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి 500 నుంచి 1000 కేజీల వార్‌హెడ్‌లను మోసుకుపోగలదు. ఆధునిక అంతర్గత మార్గదర్శ వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ క్షిపణి నేరుగా లక్ష్యాలను ఢీకొంటుంది. 2003లో దీన్ని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. 9 మీటర్ల పొడవైన పృథ్వీ-2 డీఆర్డీవో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి.

సూర్యుడు, భూమికి మధ్యలో బుధ గ్రహం
సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే బుధ గ్రహం మే 9న భూమికి, సూర్యుడికి మధ్య అడ్డువచ్చింది. సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధ గ్రహం సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తున్నప్పుడు, అది సూర్యుడిపై ఓ చిన్న నల్లని చుక్కలా కన్పించింది.
చైనాలో అతి పొడవైన కీటకం 
ప్రపంచంలోనే అతి పొడవైన కీటకాన్ని దక్షిణ చైనాలో కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ మే 5న పేర్కొంది. కర్రలపై ఉండే 62.4 సెంటీ మీటర్ల పొడవు గల ఈ కీటకాన్ని రెండేళ్ల కిందట దక్షిణ చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. మలేసియాకు చెందిన 56.7 సెం.మీ పొడవైన కీటకం ఇప్పటివరకు అత్యంత పొడవైందిగా గుర్తింపు పొందింది.
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలం
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీర్ఘవృత్తాకారంలో ఉండే భారీ పాలపుంతలో ఏర్పడిన కృష్ణ బిలం (బ్లాక్ హోల్) సూర్యుడితో పోల్చి చూస్తే 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఇర్విన్ (యూసీఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే (ఏఎల్‌ఎంఏ) నుంచి హై రిజల్యూషన్ డేటాను సేకరించి ఈ భారీ కృష్ణబిలం కొలతను కనుగొన్నారు. ‘ఎన్‌జీసీ 1332’ అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయువు, ధూళి వేగాన్ని లెక్కించారు.

అతిపెద్ద మానవరహిత నౌకను పరీక్షించిన యూఎస్ మిలటరీ
ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను యూఎస్ మిలటరీ పరీక్షించింది. ఈ మేరకు పెంటగాన్‌లో మే 3న ఈ మానవరహిత నౌకను ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. కాగా నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్ డియాగో తీరంలో పరీక్షించనున్నారు.

No comments:

Post a Comment