AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2016

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2016
విజయవంతమైన విమాన-క్షిపణి పరీక్ష
విమానానికి క్షిపణి అనుసంధాన పరీక్షను భారత్ జూన్ 25న నాసిక్‌లో విజయవంతంగా నిర్వహించింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానానికి 2,500 కిలోల బరువున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అమర్చి పరీక్షించారు. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ విజయంతో ఇలాంటి వ్యవస్థ ఉన్న మొదటి దేశంగా భారత్ నిలిచింది. 
కొత్త రకం రాకెట్‌ను పరీక్షించిన చైనా
అధిక బరువును మోసుకుపోగల కొత్త రకం అంతరిక్ష వాహక నౌక లాంగ్ మార్చ్-7ను చైనా జూన్ 25న వెన్‌చాంగ్ ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ నౌక పొడవు 53 మీటర్లు, బరువు 597 టన్నులు. ఇది దిగువ భూ కక్ష్యలోకి 13.5 టన్నుల బరువును మోసుకుపోగలదు. 
నాసా బూస్టర్ ప్రయోగం విజయవంతం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ కోసం నాసా చేపట్టిన ‘రాకెట్ల సామర్థ్యాన్ని పెంచే బూస్టర్’ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో మానవులు ప్రయాణించడానికి, నివాసానికి ఇది పునాది అవుతుందని భావిస్తున్నారు. ఈ బూస్టర్ దీని రెండో పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు నాసా పేర్కొంది. ఓరియన్ అంతరిక్ష నౌకతో కలిపి దీన్ని 2018 చివర్లో అంగారకుడి పైకి పంపనున్నారు. పని చేస్తున్నప్పుడు దీని శబ్దాన్ని బట్టి ఇందులో 33 లక్షల టన్నుల ఒత్తిడి నెలకొన్నట్లు చెబుతున్నారు.
భారత నావికా దళంలోకి వరుణాస్త్ర
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నౌక విధ్వంసక ఆయుధం(టార్పెడో) ‘వరుణాస్త్ర’ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జూన్ 29న భారత నావికాదళంలోకి ప్రవేశ పెట్టారు. 1.25 టన్నుల బరువుతో హెవీ వెయిట్ విభాగానికి చెందిన ఈ నౌక విధ్వంసక ఆయుధాన్ని డీఆర్‌డీవో నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబోరేటరీ రూపొందించింది. 250 కిలోల పేలుడు పదార్థాలను గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యం వరుణాస్త్రకు ఉంది. భారత డైనమిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. ప్రభుత్వం ఈ టార్పెడోలను ఎగుమతి చేసే విషయం గురించి ఆలోచిస్తున్నట్లు పారికర్ వెల్లడించారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ34 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ34 రాకెట్ ద్వారా చేపట్టిన 20 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-34 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. 727.5 కిలోల కార్టోశాట్ 2 సిరీస్‌తో పాటు 560 కిలోల బరువైన మరో 19 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ34 అంతరిక్షంలోకి మోసుకుపోయింది.

ప్రయోగించిన ఉపగ్రహాలు: కార్టోశాట్ 2సీ, చెన్నైలోని సత్యభామ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన సత్యభామశాట్; పుణేలోని స్వయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ఉపగ్రహం; లాసన్-ఎ3 (ఇండోనేసియా); ఎం 3 ఎంశాట్ (కెనడా); స్కైశాట్ జెన్ 2-1 (గూగుల్, యూఎస్‌ఏ); జీహెచ్‌శాట్ (కెనడా); 12 డోవ్ ఉపగ్రహాలు (అమెరికా) ఉన్నాయి.
రెండు సూర్యుళ్ల చుట్టూ తిరుగుతున్న గ్రహం గుర్తింపు
బృహస్పతిని పోలిన గ్రహం ఒకటి రెండు సూర్యుళ్ల వ్యవస్థలో తిరుగుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జూన్ 13న ప్రకటించింది. నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని గుర్తించినట్లు తెలిపింది. దీంతో పాటు కెప్లర్-1674బీ గ్రహాన్ని నాసాకు చెందిన అమెరికాలోని గోడ్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, శాండిగో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు కనుగొన్న గ్రహాల్లో ఇదే పెద్దది.
సూపర్ కంప్యూటర్‌గా చైనా సన్‌వే తైహూలైట్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనాకు చెందిన కంప్యూటర్ సన్‌వే తైహూలైట్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పార్‌లెల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది సెకనుకు 93 క్వాడ్రిలియన్లను గణించగలదు.

రోదసిలో తొలిసారి చిరాల్ అణువు
జీవానికి అవసరమైన, కర్బన సంబంధ ‘ప్రొపైలీన్ ఆక్సైడ్’ అనే చిరాల్ అణువును శాస్త్రవేత్తల బృందం తొలిసారిగా న క్షత్రాల మధ్య కనుగొంది. మన చేతులు ఒకదానికొకటి సారూప్యంగా ఉన్నట్లుగానే కొన్ని కర్బన అణువులకు కూడా ప్రతిబింబాలు ఉంటాయి. ఈ రసాయన ధర్మాన్ని ‘చిరాలిటీ’ అని, ఆ అణువులను చిరాల్ అణువులని అంటారు. అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి దీనిని గుర్తించారు. చిరాల్ అణువులను ఇప్పటిదాకా భూమి మీదికొచ్చిన ఉల్కల్లో, సౌర వ్యవస్థలోని తోక చుక్కల్లో కనుగొన్నారు. మన పాలపుంత కేంద్రానికి దగ్గర్లో నక్షత్రాలతో కూడిన, దుమ్ము, సజ్జిటేరియస్ బీ2 (Sgr B2) వాయువుతో ఏర్పడిన మేఘంలో ప్రొపైలీన్ ఆక్సైడ్ (CH3CHOCH2)ను కనుగొన్నారు. ‘చిరాలిటీ ధర్మం ఉన్న అణువును నక్షత్రాల మధ్య ఆకాశంలో కనుగొనడం ఇదే తొలిసారి. జీవం ఎలా పుట్టిందో తెలుసుకోడానికి, జీవానికి ముందు అణువులు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది’ అని యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రనామీ అబ్జర్వేటరీ పేర్కొంది.

అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్
అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా కేబుల్ ద్వారా ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఇంటర్‌నెట్ సదుపాయాన్ని వేగంగా, సులభతరం చేయడానికే ఈ పనిని చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు సంయుక్తంగా తెలిపాయి. ‘మరియా’ అనే కొత్త కేబుల్ (సెకన్‌కు 160 టెరాబైట్స్ బ్యాండ్‌విడ్త్ వేగంతో) సహాయంతో అత్యధిక వేగంతో ఆన్‌లైన్ సేవలు అందించనున్నారు. 2016 ఆగస్టులో దీని పనులు మొదలుపెట్టి 2017 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.

No comments:

Post a Comment