AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2016

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2016
భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్
ఏటా దేశంలో లక్షల మంది పిల్లల ప్రాణాలను బలిగొంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం కీలకచర్య తీసుకుంది. భువనేశ్వర్‌లో మార్చి 26న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రోటా వైరస్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పోగ్రామ్ (యూపీఐ)లో భాగంగా.. పోలియో, మశూచి, రోటా వైరస్, అడల్ట్ జపనీస్ ఎన్సెఫిలిటీస్ వ్యాధులకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. రోటా వైరస్ వ్యాక్సిన్ టీకాను తొలి విడతలో.. ఏపీ, ఒడిశా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణ రవాణ శాఖ ‘ఎం-వాలెట్’ యాప్
దేశంలోనే తొలిసారిగా రవాణాకు సంబంధించిన డాక్యుమెంట్లతో తెలంగాణ రవాణా శాఖ ఓ మొబైల్ వాలెట్ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ ఆర్‌టీఏ ఎం-వాలెట్ యాప్‌ను మార్చి 30న ఆవిష్కరించారు. పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మొబైల్‌లో ఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను వారికి చూపించవచ్చు. ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లెసైన్స్‌ను ఈ యాప్‌లో భద్రపరచుకోవచ్చు. దీని కోసం అన్ని రకాల ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లలో ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్ ఆవిష్కరణ
బెల్జియం సాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్(ఎరీస్)’ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ కలసి రిమోట్‌తో ఆవిష్కరించారు. 3.6 మీటర్ల వెడల్పుగల ప్రాథమిక కటకం ఉన్న టెలిస్కోప్‌ను ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు దగ్గరలోని దేవస్థల్ వద్ద నిర్మించారు. అయితే ప్రస్తుతం బెల్జియం పర్యటనలో ఉన్న మోదీ బ్రసెల్స్ నుంచి ఆ దేశ ప్రధానితో కలసి ఈ టెలిస్కోప్‌ను ప్రారంభించారు. అంతకు ముందు ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై మోదీ, చార్లెస్ చర్చించారు. బ్రసెల్స్‌లో మార్చి 22న జరిగిన ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళులర్పించారు. ఆత్మాహుతి దాడి జరిగిన మాల్‌బీక్ మెట్రో స్టేషన్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు.

అంగారక గ్రహానికి రష్యా-ఐరోపా వ్యోమనౌక
అంగారక గ్రహంపై జీవం ఉనికిని గుర్తించేందుకు రష్యా-ఐరోపాలు సంయుక్తంగా ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టీజీవో) వ్యోమనౌకను ప్రయోగించాయి. దీన్ని ప్రోటాన్ రాకెట్ ద్వారా మార్చి 14న కజికిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ నౌక 49.6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఏడాది అక్టోబర్‌లో అంగారక గ్రహాన్ని చేరనుంది. ఇది అరుణ గ్రహాన్ని చిత్రీకరించడంతో పాటు అక్కడి గాలిని విశ్లేషించననుంది. అంగారకుడిపై మీథేన్‌ను విశ్లేషించడమే ప్రధాన లక్ష్యంగా తాజా ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగానికి ఎక్సో మార్స్-2016గా పేరుపెట్టారు.
అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ ఈ క్షిపణిని పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడంతో పాటు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు.
ఐసీజీఎస్ అర్ణవేష్ జలప్రవేశం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ అర్ణవేష్’ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మార్చి 21న విశాఖపట్నంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇండయన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఈ వేగవంతమైన పెట్రోల్ వెసల్ (FPV)ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునిక నైట్‌విజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక ముందు భాగంలో 40/60 భోఫోర్స్ గన్‌ను అమర్చారు. ఈ నౌకలో ఆరుగురు అధికారులతోపాటు 34మంది నౌకాదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

కె-4 క్షిపణిని పరీక్షించిన భారత్ 
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి కె-4ను భారత్ మార్చి 7న బంగాళాఖాతంలో రహస్యంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. అణుసామర్థ్యం కలిగిన కె-4 క్షిపణిని సముద్రంలో 30 అడుగుల లోతు నుంచి ప్రయోగించారు. ఇది రెండు టన్నుల ఆయుధాలను మోసుకెళ్లడంతో పాటు 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఎఫ్ ప్రయోగం విజయవంతం
భారత ప్రాంతీయ దిక్చూచి వ్యవస్థకు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఎఫ్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చి 10న విజయవంతంగా ప్రయోగించింది. 1425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 32 ద్వారా భూమికి దగ్గరగా(పెరిజీ) 284కిలోమీటర్లు, దూరంగా(అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర క క్ష్యలో ప్రవేశపెట్టారు.
కర్ణాటకలో కొత్తరకం కప్ప జాతి గుర్తింపు
కర్ణాటకలోని ఉడిపి జిల్లా మణిపాల్ పట్టణంలో కొత్త కప్ప జాతిని అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. చేతి బొటనవేలి గోరు పరిమాణంలో ఉండే దీన్ని కోస్తా తీరంలోని లాటిరైట్ రాళ్లలో గుర్తించారు. ఆ కప్ప కన్పించిన ప్రాంతాన్ని స్ఫురింపజేస్తూ దానికి ‘మైక్రోహైలా లాటిరైట్’ అని పేరుపెట్టారు. కేవలం 1.6 సెంటీమీటర్ల పొడవుండే ఈ జాతి కప్పలు లేత గోధుమ వర్ణంలో, నల్లని మచ్చలతో ఉంటాయి. వీటి అరుపు కీచురాయి అరుపును పోలి ఉంటుంది.
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు సామర్థ్యం కలిగిన అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 700 కి.మీ. లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి పరీక్షించారు. ఈ బాలిస్టిక్ క్షిపణి 700 కి.మీ. దూరాన్ని 9 నిమిషాల 36 సెకండ్లలో చేరింది. 12 టన్నుల బరువుండే అగ్ని-1.. ఒక టన్ను పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. దీనిలో అధునాతన నేవిగేషన్ వ్యవస్థను పొందుపరిచారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణులను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. డీఆర్‌డీఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లు సహకారం అందించాయి.

అంతరిక్ష అంచుల్లో కొత్త గెలాక్సీ
ఇప్పటి వరకు కనుగొన్న గెలాక్సీల కంటే అత్యంత దూరమైన నక్షత్ర మండలాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత...విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జెడ్ 11 అనే ఈ గెలాక్సీ...ఉర్సా మేజర్ నక్షత్రమండలంలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీనిచూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు.
వేగంగా క్యాన్సర్‌ను నిర్ధారించే పరికరం
వేగంగా క్యాన్సర్‌ను నిర్ధారించే చిన్న పరికరాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని తయారీకి రూ. 30 వేలు ఖర్చయింది. ఈ చిన్న పరికరాన్ని బెంగుళూరులో మార్చి 4న జరిగిన నానో సదస్సులో ప్రదర్శించారు.

గ్రహాల పరిశోధనకు ఎగిరే టెలిస్కోపు
గ్రహాలు, గ్రహశకలాల సమీపంలోని గెలాక్సీలను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఎగిరే టెలిస్కోపును ప్రయోగించింది. స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రా రెడ్ ఆస్ట్రోనమీ (సోఫియా) సాధనంతో ఏడాది పాటు పరిశీలించనున్నారు. బోయింగ్ 747ఎస్‌పీ విమానంలో మార్పులు చేసి ఈ టెలిస్కోపును అమర్చారు. దీన్ని ప్రయోగించటం ఇది నాలుగోసారి. 

వ్యాధి నిర్ధారణకు కొత్త పరికరంఎబోలా వంటి తీవ్రమైన జబ్బులను సులభంగా గుర్తించే ఒక చిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్‌లోని ‘ఎకోలె పాలీటెక్నిక్ ఫెడరల్ డి లాసన్నె’కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 0.005 మిల్లీలీటర్ల రక్తనమూనాలో 16 రకాల జీవసంకేతాలను (బయోమార్కర్‌లను) గుర్తించగలుగుతుంది.

No comments:

Post a Comment