AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2015

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2015
జలాంతర్గామి కల్వరి జల ప్రవేశం 
జలాంతర్గామి కల్వరిని ముంబైలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు.

గురుగ్రహంపై తగ్గుతున్న ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ 
గురుగ్రహం పైనున్న అతిపెద్ద ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ క్రమక్రమంగా కుంచించుకుపోతోందని నాసా పేర్కొంది. రెడ్‌స్పాట్ క్రమంగా వృత్తాకారంగా మారుతోందని, గ్రహం కేంద్రం స్థానంలో అసాధారణమైన ఫిలమెంటరీ లక్షణం కనిపించిందని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త ఆమీ సైమన్ తెలిపారు.
వృక్ష, డైనోసార్ శిలాజాలు 
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీప్రాంతంలో లక్షల ఏళ్లనాటి వృక్ష, డైనోసార్ శిలాజాలు లభించాయి. రెండు మీటర్ల పొడవైన వృక్ష శిలాజాలతోపాటు, అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపించాయని మూడేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్న చరిత్ర అధ్యాపకుడు రెడ్డి రత్నాకరరెడ్డి వెల్లడించారు. ఓ సూక్ష్మరాతి పనిముట్టు, మూడు అంగుళాల జంతు శిలాజపు పనిముట్టు దొరికాయని తెలిపారు. 
కాకతీయుల నాటి గణేశ్వరాలయం
కాకతీయ రాజు గణపతిదేవుడి కాలం నాటి గణేశ్వరాలయాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగం మాటు వద్ద కనుగొన్నారు. ఆలయానికి సంబంధించిన మూల స్తంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలాశాసనాలపై చెక్కే సూర్య చంద్రుల గుర్తులు బయటపడ్డాయి. ఈ ఆలయం క్రీ.శ. 12, 13వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ తెలిపారు.
చంద్రునిపై భారీ మట్టి దిబ్బను గుర్తించిన శాస్త్రవేత్తలు
చంద్రుడి ఉపరితలంపై అగ్నిపర్వతాన్ని పోలిన భారీ మట్టిదిబ్బను శాస్త్రవేత్తలు గుర్తించారు. మూన్ మినరాలజీ మ్యాపర్ అనే ఉపగ్రహం అందించిన సమాచారాన్ని అధ్యయనం చేసిన బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్రో 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1తో పాటు ఈ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపారు. దీని ప్రకారం అగ్నిపర్వతాన్ని పోలిన ఈ ఆకారం.. దాదాపు 800 మీటర్ల ఎత్తు, 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో దక్షిణ ధ్రువంలోని ‘అట్కిన్ బేసిన్’ అనే భారీ కందకానికి సరిగ్గా మధ్యలో విస్తరించి ఉంది. మాక్ మౌండ్‌లుగా పిలిచే ఈ మట్టిదిబ్బలను తొలిసారిగా 1990లో కార్ల్ పీటర్స్ అనే ప్లానెటరీ జియాలజిస్టు గుర్తించారు. ఇవి పుష్కలమైన కాల్షియం పైరాగ్జిన్‌లతో నిండి ఉండి వాటిపై తక్కువ కాల్షియం ఉన్న రాతి పొరలు ఉంటాయి.
410 కోట్ల ఏళ్ల క్రితమే జీవం పుట్టుక!
భూమిపై 410 కోట్ల సంవత్సరాల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజిలిస్(యూసీఎల్‌ఏ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఇంతకు ముందు భావించిన దానికంటే 30 కోట్ల సంవత్సరాలు ముందుగానే భూమిపై జీవం ఏర్పడి ఉంటుందని అంచనా. 454 కోట్ల ఏళ్ల కిందట భూమి ఆవిర్భావం చెందిన కొద్దికాలానికే జీవం పుట్టుక కూడా సాధ్యమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.
మార్స్‌పై సేద్యానికి పరిశోధనలు
అరుణ (మార్స్) గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త మైకెల్ అలెన్, యూనివర్సిటీ ఆఫ్ ఇదాహో ఫుడ్ సైంటిస్టు హెలెన్ జాయినర్ కలసి ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులను కలుపుకుపోతున్నారు. అక్కడి వాతావరణంలో కార్బన్ (జీవం పెరిగేందుకు ఆధారం), నైట్రోజన్ (చెట్లు ప్రొటీన్ తయారు చేసుకునేందుకు అవసరం) ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నీటి జాడలున్నట్లు అర్థమవుతోంది. వీటి ఆధారంగా అక్కడ వ్యోమగాములు.. వారికి వారే పంటలు పండించుకునే ప్రయత్నం చేయాలని అలెన్ చెప్పారు.

అంగారకుడిపై ఇసుక తిన్నెలు
అంగారకుడిపై ఇసుకు తిన్నెలకు గురించిన చిత్రాలను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విడుదల చేసింది. ఈ చిత్రాలను ఎమ్‌ఆర్‌వో వ్యోమనౌక హైరైజ్ (హై రెజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పరిమెంట్) కెమెరా ద్వారా తీసింది. క్రమక్షయం, ఉపరితల వస్తువుల గమనం, గాలి, వాతావరణ పరిస్థితులు, మట్టి రేణువులు, వాటి పరిమాణం తదితర అంశాల గురించిన సమాచారాన్ని ఈ ఫొటోలు ద్వారా తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. 
జీవిత కాలాన్ని పెంచే జన్యువులు
మనిషి జీవిత కాలం పెంచే దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇటీవల మనిషి వయసును పెంచే 238 జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈస్ట్ కణాలపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ జన్యువులను తొలగించినప్పడు కణాల జీవిత కాలం పెరిగినట్లు గమనించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.
కనిపించని వ్యాధుల జాబితాలో ‘యాస్’!
భయంకరమైన చర్మవ్యాధి ‘యాస్’ను దీర్ఘకాలికంగా కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చనున్నారు. ఈ అంటువ్యాధి 2003 నుంచి మన దేశంలో ఎక్కడా నమోదైనట్లు వివరాలు లేవు. దీంతో యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించి వ్యాధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యాధిని కనుమరుగైన వ్యాధుల జాబితాలో చేర్చునున్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటిస్తోంది.

అంగారకుడిపై నీటి జాడలు గుర్తించిన నాసా
అంగారకుడిపై నీటి జాడలను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సెప్టెంబరు 28న ప్రకటించింది. ఒకప్పుడు అంగారక గ్రహంపై నీరు ప్రవహించిన కారణంగానే లోయలు, కనుమలు ఏర్పడి ఉండవచ్చనే శాస్త్రవేత్తల వాదనకు ప్రస్తుతం ఆధారాలు లభ్యమయ్యాయని నాసా పేర్కొంది. అంగారకుడి ఉపరితలంపై వేసవి నెలల్లో ఉప్పునీటి ప్రవాహాలు సాగి ఉండవచ్చనే విషయాన్ని తొలిసారి శాస్త్రవేత్తలు నిర్దారించారు.

యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి జలప్రవేశంఅతి పెద్ద స్వదేశీ యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా ముంబైలో సెప్టెంబరు 30న జలప్రవేశం చేసింది. ఐఎన్‌ఎస్ కోచి బరువు 7,500 టన్నులు, పొడవు 164 మీటర్లు, నౌక మధ్య భాగం వెడల్పు 17 మీటర్లు. ఇది గంటకు 30 నాటికన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ యుద్దనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సర్లు, నిఘా పరికరాలు, దీర్ఘశ్రేణి లక్ష్యాలను చేధించే క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి.

ఇక్రిశాట్ పంటల జాబితాలోకి రాగులుహైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)’ తాజాగా రాగి పంటను తమ జాబితాలో చేర్చింది. ఇక్రిశాట్ ఇప్పటివరకూ సజ్జలు, జొన్నలు, కంది, శనగ, వేరుశనగలపై తమ పరిశోధనలు కేంద్రీకరించగా, తాజాగా రాగులకూ ప్రాధాన్యం దక్కనుంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇక్రిశాట్ కొత్త రాగి వంగడాలను ప్రవేశపెట్టింది. ఇక్రిశాట్ జన్యుబ్యాంకులో రాగి పంటకు సంబంధించి 24 దేశాల నుంచి సేకరించిన దాదాపు ఆరువేల రకాల వంగడాల జర్మ్‌ప్లాసమ్‌లు పరిశోధనల కోసం అందుబాటులో ఉన్నాయి. 

ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి జలప్రవేశంటొర్పెడోలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి నౌక భారత నావికా దళంలో చేరింది. ప్రయోగించిన టొర్పొడోలను తిరిగి రికవరీ చేయగల సామర్థ్యం కలిగిన అస్త్రధరిణిని తూర్పు నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ విశాఖపట్నం నేవల్ బేస్‌లో అక్టోబర్ 6న ప్రారంభించి జలప్రవేశం చేయించారు. మేకిన్ ఇండియా నినాదంతో 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌక రూపుదిద్దుకుంది. 2015 జూలై 17న సేవలనుంచి విరమించిన అస్త్రవాహినికి అధునాతన సాంకేతికత జోడించి నిర్మాణమైన నౌక అస్త్రధరిణి.

విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహాల ప్రయోగంపౌర విమానాలు, నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లను(క్యూబ్‌శాట్స్) చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్‌హెచ్370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది. ఎస్‌టీయూ-2గా పిలుస్తున్న ఈ క్యూబ్‌శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా, అవి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుఫాన్ తెలిపారు. కేవలం 6.8కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన కెమెరాలు, ‘ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైవలెన్స్ బ్రాడ్‌కాస్ట్(ఏడీఎస్-బి)’ రిసీవర్లను అమర్చారు.

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2015

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2015
పీఎస్‌ఎల్‌వీ సీ-30 ప్రయోగం విజయవంతం
ఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్‌ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్‌తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్‌కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 
చైనా లాంగ్ మార్చ్-11 ప్రయోగం విజయవంతం 
లాంగ్ మార్చ్-11 రాకెట్‌ను చైనా సెప్టెంబర్ 25న విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా నాలుగు సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. చైనాలో వాయవ్య ప్రాంతంలో ఉన్న గాన్సు ప్రావిన్సులోని జియుక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్‌ను అభివృద్ధి చేశాయి. సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. లాంగ్‌మార్చ్ రాకెట్ల చరిత్రలో ఇది 211వ మిషన్.
భారీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కొచ్చి జలప్రవేశం
భారతదేశ నౌకాదళంలోకి క్షిపణి సామర్థ్యమున్న అత్యాధునిక విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కొచ్చి చేరింది. భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద నౌక అయిన ఐఎన్‌ఎస్ కొచ్చిని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబర్ 30న ముంబైలోని నేవీ డాక్‌యార్డ్‌లో జలప్రవేశం చేయించారు. వ్యయం: రూ. 4వేల కోట్లు బరువు: 7,500 టన్నులుపొడవు: 164 మీటర్లుబీమ్(నౌక మధ్యభాగం వెడల్పు):17 మీటర్లు
నౌకలోని బహళ నిఘా వ్యవస్థ, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్తుంది (ఒక నాటికల్ మైలు 1.852 కిమీకి సమానం). దీనిలో 40 మంది అధికారులు, 350 మంది జవాన్లు ఉంటారు.


అమోఘ-1 క్షిపణి పరీక్ష విజయవంతం
యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్ అమోఘ-1ను సెప్టెంబరు 10న భారత్ విజయవంతంగా పరీక్షించింది. యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్‌ను మధ్యప్రదేశ్‌లోని బాబినా ఆర్మీ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తెలిపింది. ఈ క్షిపణి 2.8 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో దీన్ని అభివృద్ధి చేశారు.
20 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా 
ఉపగ్రహ వాహక నౌక లాంగ్ మార్చ్-6 ద్వారా చైనా ఒకేసారి 20 సూక్ష్మ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 20న షాంఘై ప్రావిన్సులోని తైయువాన్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌లో ఇంధనంగా కాలుష్య రహిత ఇంధనాలు ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఉపయోగించారు. 
స్పేస్ షాట్‌గన్ అభివృద్ధి చేస్తున్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రపంచంలోనే తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్‌ని ఈ షాట్‌గన్‌తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్(ఏఆర్‌ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించింది. ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం.

ఐఎన్‌ఎస్ వజ్రకోష్ ప్రారంభం
నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ వజ్రకోష్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 9న కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రారంభించారు. పశ్చిమ తీరం నుంచి యుద్ధ నౌకల నిర్వహణకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్మించింది. దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలను స్థావరంలో నిల్వ చేస్తారు. ఇది కార్వార్‌లో ఏర్పాటైన మూడో నౌకా స్థావరం.
దక్షిణాఫ్రికా గుహల్లో కొత్త ‘మానవ జాతి’
మానవ కుటుంబ వృక్షానికి చెందిన కొత్త జాతి ఆనవాళ్లను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో రైజింగ్ స్టార్ గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరు 10న మగలీస్‌బర్గ్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాజాలు వెలుగుచూసిన నలెడి గుహ పేరిట ఈ కొత్త జాతికి హోమో నలెడిగా పేరుపెట్టారు. నలెడి గుహలో 15 జీవులకు సంబంధించిన 1500కు పైగా ఎముకలు లభించాయి. ఈ శిలాజాల వయసు 25 లక్షల ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఐఎస్‌ఎస్‌కు చేరిన రష్యా వ్యోమనౌక
ముగ్గురు వ్యోమగాములతో కూడిన రష్యా వ్యోమనౌక సెప్టెంబర్ 4, 2015వ తేదీన విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) చేరింది. కజక్‌స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సూయజ్-ఎఫ్‌జీ రాకెట్ ద్వారా ప్రయోగించిన సూయజ్ టీఎమ్‌ఏ-18ఎమ్ ఐఎస్‌ఎస్‌కు చేరింది. ప్రయోగించిన ఆరుగంటల్లోపే ఐఎస్‌ఎస్‌కు చేరే లా మొదట ప్రణాళిక రూపొందించినా భద్రతా సమస్యల కారణంగా యాభై గంటలకు చేరేలా తరువాత షెడ్యూల్‌ను మార్పు చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో వ్యోమగాములు సెర్జీ వోల్‌కోవ్, ఆండ్రియాస్ మొగెసెన్, ఎమ్‌బెతోవ్ ఉన్నారు. 
పాకిస్తాన్ తొలి స్వదేశీ ద్రోన్
తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్‌ను సెప్టెంబర్ 7, 2015వ తేదీన పాకిస్తాన్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్‌లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది.

నాసా కొత్త టార్గెట్
ఫ్లూటోను దాటి రికార్డు సృష్టించిన ‘నాసా’ న్యూహారిజాన్స్ వ్యోమనౌక... సౌరకుటుంబం అవతల ఆవరించి ఉన్న క్యూపర్ బెల్ట్ ప్రాంతంలోని ‘2014 ఎంయూ69 (పీటీ1)’ అనే గ్రహశకలంపై పరిశోధన చేయనుంది. ఫ్లూటోకు అవతల 30 మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలాన్ని న్యూహారిజాన్స్ తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నట్లు నాసా ప్రకటించింది. క్యూపర్‌బెల్ట్‌పై సూర్యకిరణాల ప్రభావం అతి తక్కువగా ఉంటుందని.. ఈ ‘పీటీ1’పై పరిశోధన చేస్తే సౌరకుటుంబం ఆవిర్భావం నాటి అంశాలు తెలిసే అవకాశముందని తెలిపింది. సౌరకుటుంబంపై పరిశోధన చేయడానికి 2006, జనవరి 19న న్యూహారిజాన్స్‌ను ప్రయోగించారు.

పర్యావరణ సమాచార కేంద్రం ఏర్పాటుచేసిన నాసా, యూఎస్‌ఏఐడీలోయర్ మెకంగ్ రీజియన్‌లోని ఐదు దేశాల్లో(మైన్మార్, కంబోడియా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం) పర్యావరణ పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి. సెర్ విర్-మెకంగ్ (SERVIR Mekong)గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు ప్రధాన భవనం బ్యాంకాక్‌లో ఏర్పాటుచేశారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, విధానకర్తలు ఈ ప్రాజె క్టులో భాగస్వాములవుతారు. విపత్తు నిర్వహణ, ఆహార భద్రత, ప్రజారోగ్యం, నీటి వనరుల నిర్వహణ తదితర అంశాల్లో ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలకు భూ పరిశీలనలు, భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహాయ సహకారాలు అందిస్తుంది. 

భారతీయ భాషలను బ్రె యిలీ లిపిలోకి మార్చే సాఫ్ట్‌వేర్భారతీయ భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. హిందీ, బెంగాళీ, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కన్నడ తదితర భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే స్పర్శ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ను ఐఐటీ-ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ అనుపమ్ బసు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ ఏ భారతీయ భాషనైనా యూనీకోడ్‌గా తీసుకొని బ్రెయిలీ లిపిగా మారుస్తుంది.

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2015

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2015
జీశాట్-6 ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ఆగస్టు 27న ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించిన జీఎస్‌ఎల్‌వీ- డి6 రాకెట్ జీశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరవేసింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌ను జీఎస్‌ఎల్‌వీకి ఉపయోగించడం ఇది మూడోసారి. అధిక బరువు గల ఉపగ్రహాలను ప్రయోగించడానికి క్రయోజెనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. ఈ ఇంజన్లు రూపొందించే సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ దేశాలకే ఉంది. ప్రస్తుతం భారత్ ఈ దేశాల జాబితాలో చేరింది. సమాచార ఉపగ్రహమైన జీశాట్-డి6 2,117 కిలోల బరువు ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా అధునాతన డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

ఆగస్టు 27న జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆగస్టు 27న సాయంత్రం 4.52 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు అన్ని పరీక్షలు జరిపి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా బోర్డు నిర్వహించింది. ఆగస్టు 26 మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి, 29 గంటల తర్వాత ఆగస్టు 27 సాయంత్రం 4.52కు ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించారు.
దేశంలోనే తొలి ‘లిచీస్’ జన్యు బ్యాంక్
లిచీస్ ఫలాలను(వేసవిలో లభ్యమయ్యే తియ్యటి పండ్లు) పరిరక్షించేందుకు, నాణ్యతను పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో లిచీస్ జన్యు బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి అనుమతులు లభించిన వెంటనే బ్యాంకును ఏర్పాటు చేస్తామని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ లిచీ(ఎన్‌ఆర్‌సీఎల్) డెరైక్టర్ విశాల్‌నాథ్ వెల్లడించారు. లిచీస్‌ను పరిరక్షించడంలో భాగంగా జన్యు వనరులు అందుబాటులో ఉండేలా ఈ బ్యాంకును ఏర్పాటుచేస్తున్నారు.

అంగారకుడు, చంద్రుడిపైకి నాసా డ్రోన్లు?
అంగారక గ్రహం, చంద్రుడు, వంటి వాటిపై ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు డ్రోన్లను ప్రయోగించాలని నాసా భావిస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ప్రయోగించిన రోవర్లు ఇక్కడ దిగలేదు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్లను వాటిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.
ఇస్రో టైటానియం ప్లాంట్ ప్రారంభం
అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాలు, రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియం స్పాంజ్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఆగస్టు 10 నుంచి వాణిజ్య స్థాయిలో పని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా కేరళలోని చవరాలో ఇస్రో ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది. తమకు ఏటా దాదాపు 300 టన్నుల టైటానియం స్పాంజ్ అవసరం ఉంటుందని వెల్లడించింది.
గ్లోబల్ శాటిలైట్‌కు కలాం పేరు
మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ఓ గ్లోబల్ శాటిలైట్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. భూమి పరిశీలన, ప్రకృతి విపత్తుల నష్టం తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రయోగించనున్న ‘గ్లోబల్‌శాట్ ఫర్ డీడీఆర్’కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని కానియస్(సీఏఎన్‌ఈయూఎస్- కెనడా, యూరప్, యూఎస్, ఏసియా) చైర్మన్ మిలింద్ పింప్రికర్ వెల్లడించారు. కలాం గౌరవార్థం ఈ ఉపగ్రహానికి ‘యూఎన్ కలాం గ్లోబల్‌శాట్’గా పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
ఐఎస్‌ఎస్ వ్యోమగాముల స్పేస్‌వాక్ విజయవంతం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు విజయవంతంగా స్పేస్‌వాక్ చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. ఎక్స్‌పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ఫ్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకో ఆగస్టు 10వ తేదీన 5 గంటల 31 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా వారు ఐఎస్‌ఎస్ కిటికీలను శుభ్రం చేయడం, కొత్త యాంటెన్నా అమర్చడం, మొత్తం ఐఎస్‌ఎస్ బాహ్య భాగాన్ని ఫొటోగ్రాఫిక్ సర్వే చేయడం వంటి పనులు చేసినట్లు వివరించింది. గెన్నడీ పడల్కాకు ఇది తొమ్మిదో స్పేస్‌వాక్ కాగా, కోర్నియెంకో చేయడం ఇది రెండోసారి. రష్యాకు చెందిన ఒలెగ్ కొనొనెంకో, స్కాట్ కెల్లీ(నాసా), జెల్ లింగ్డ్రెన్, కిమియా యూ(జపాన్) వ్యోమగాములు ఐఎస్‌ఎస్ లోపలి నుంచి స్పేస్‌వాక్‌ను పర్యవేక్షించారు.

ఎబోలా వ్యాధికి టీకా కనుగొన్న కెనడా
ఎబోలా వైరస్‌కు టీకా అభివృద్ధి చేసినట్లు, ఇందుకు సంబంధించి పరిశోధన పరీక్షల్లో నూరు శాతం కచ్చితత్వం కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జూలై 30న వెల్లడించింది. కెనడాకు చెందిన పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఈ టీకాను అభివృద్ధి చేసింది.

చైనాలో అతిపెద్ద దోమల పరిశ్రమడెంగీ జ్వరాలను అదుపుచేసేందుకు సంతానోత్పత్తి నిరోధక దోమల ఉత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద దోమల పరిశ్రమను చైనా వాయువ్య గువాంగ్‌సౌ ప్రావిన్సులో ఏర్పాటుచేసింది. డెంగీ జ్వరాలను నివారించేందుకు వారానికి పది లక్షల సంతానోత్పత్తి నిరోధక దోమలను ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసి విడుదల చేస్తారు. ఇటువంటి దోమలను షాజీ ద్వీపంలో ప్రతివారం విడుదల చేస్తున్నారు. ఇందువల్ల డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమల సంఖ్య తగ్గిపోతుంది. గతేడాది చైనాలో 47 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీనికి ఇంతవరకు టీకా, చికిత్సా లేదు. 

యురేనస్ పరిమాణంలోని గ్రహం గుర్తింపుసౌరకుటుంబం ఆవల యురేనస్ పరిమాణంలో ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. తన నక్ష త్రానికి సుదూరంగా పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని ‘గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్’ ప్రక్రియ ద్వారా కనుగొన్నారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్, హవాయ్‌లోని డబ్ల్యూఎమ్ కెక్ అబ్జర్వేటరీలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ గ్రహం.. తన నక్షత్రం చుట్టూ 370 మిలియన్ మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ఇంచు మించు సూర్యుడికి, గురు గ్రహానికి మధ్యనున్న దూరంతో సమానమని తెలిపారు. ఇక ఆ నక్షత్రం సూర్యుడి కన్నా సుమారు 70 శాతం పెద్దదని చెప్పారు. అందుబాటులో ఉన్న గ్రహ శోధన ప్రక్రియల కారణంగా ఇప్పటి వరకూ నక్షత్రాలకు దగ్గరగా పరిభ్రమిస్తున్న గ్రహాలనే ఎక్కువగా గుర్తించారు. సుదూరంగా పరిభ్రమిస్తున్న నక్షత్రాలను గుర్తించడానికి గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ ప్రక్రియ వీలు కల్పిస్తుంది. 

కొత్త సైకస్ జాతులను గుర్తించిన భారత శాస్త్రవేత్తలుజురాసిక్ యుగం (సుమారు 201 మిలియన్-145 మిలియన్ ఏళ్ల క్రితం) నాటి రెండు కొత్త సైకస్ జాతి మొక్కలను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్త విశ్వవిద్యాలయానికి చెందిన సైకడాలజిస్ట్ రీతా సింగ్, ఆమె విద్యార్థులు పి. రాధా(ఉస్మానియా యూనివర్సటీ, హైదరాబాద్), జేఎస్ ఖురైజామ్(ఎన్‌బీఆర్‌ఐ, లక్నో)లు ఈ కొత్త సైకస్ జాతులను ఒడిశాలో కనుగొన్నారు. ఎనిమిదేళ్లుగా వీరు ఆ రాష్ట్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సైకస్ జాతి మొక్కలను పురాతనమైనవిగా, బతికి ఉన్న శిలాజాలుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 111 జాతుల సైకస్ మొక్కలను గుర్తించగా అందులో మనదేశంలో తొమ్మిది ఉన్నాయి. కొత్తగా రెండు జాతులను గుర్తించడంతో ఆ సంఖ్య 11కి చేరింది.

పాకిస్తాన్‌కు సెర్న్‌లో సభ్యత్వంభౌతికశాస్త్రంలో కీలక పరిశోధనలు చేస్తున్న యూరప్ అణు పరిశోధన సంస్థ(యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్)లో పాకిస్తాన్ జూలై 31న అసోసియేట్ సభ్యదేశంగా చేరింది. సెర్న్‌లో అసోసియేట్ సభ్యత్వ హోదా పొందిన మొదటి యూరపేతర, మొదటి ఆసియా దేశంగా పాక్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం, శాంతియుత ప్రయోజనాలకు అణు ఇంధన వినియోగం వంటి అంశాలకు గుర్తింపుగా పాక్‌కు ఈ హోదా లభించినట్లు సెర్న్ ప్రకటించింది.

భూమికి చేరువగా వచ్చిన ఆస్టరాయిడ్వేరశనగ ఆకారంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్ ఆగస్టు 1న భూమికి అత్యంత చేరువగా వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు గుర్తించారు. 1999 జేడీ6గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ జూలై 24న భూమికి 7.2 మిలియన్ కిలోమీటర్ల చేరువకు వచ్చిందని ఈ దూరం భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 19 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. మళ్లీ 2054లో ఒక ఆస్టరాయిడ్ భూమికి ఇంత చేరువగా వస్తుందని అంచనా.

సైన్స్ & టెక్నాలజీ జూలై 2015

సైన్స్ & టెక్నాలజీ జూలై 2015
రూ.235 కోట్లతో సార్క్ ఉపగ్రహం
సార్క్ దేశాల కోసం భారత్ ప్రయోగించనున్న ఉపగ్రహానికి రూ.235 మేర ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 24న పార్లమెంటుకు తెలిపింది. 2014 నవంబరులో నేపాల్‌లో జరిగిన సార్క్ సదస్సులో ఈ ఉపగ్రహంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. 12 కేయూ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎంకే-2 ద్వారా ఇస్రో ప్రయోగిస్తుంది. ఉపగ్రహం ద్వారా సార్క్ సభ్యదేశాలకు టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్, విపత్తుల నిర్వహణ వంటివాటికి అవసరమయ్యే సేవలు అందుబాటులోకి వస్తాయి.
దేశీయ యుద్ధనౌకల నిర్మాణానికి 15 ఏళ్ల ప్రణాళిక
భారత నౌకాదళం..స్వదేశీ నిర్మాణ ప్రణాళిక(2015-30) ను జూలై 20న ఆవిష్కరించింది. దేశీయంగా యుద్ధ నౌకలు, ఇతర ఆయుధాల నిర్మాణాన్ని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ద్వారా చేపట్టేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. దీన్ని ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానిస్తారు. భారతీయ పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తారు.
గ్రహాంతర వాసుల అన్వేషణ ప్రారంభం
గ్రహాంతర వాసుల అన్వేషణకు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు లండన్‌లో జూలై 20న ప్రకటించారు. పదేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టుకు రష్యాకు చెందిన బిలియనీర్ యూరీ మిల్నర్ 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అని పేరు పెట్టారు. దీనికోసం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సహాయం తీసుకుంటారు. ఇతర గ్రహాల్లోని మేధో జీవులు వెలువరించే రేడియో సంకేతాల కోసం ఈ పరిశోధనలు చేపడుతున్నారు.

సూపర్ కంప్యూటర్ టియాన్-2
ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ కంప్యూటింగ్ సదస్సులో టాప్ 500 అత్యంత వేగవంతమైన కంప్యూటర్ జాబితాలో చైనాకు చెందిన టియాన్-2 మొదటి స్థానంలో నిలచింది. దీన్ని చైనా రక్షణ, సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.
క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం
క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్‌ను జూలై 16న తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. 19 టన్నుల శక్తి గల ఇంజన్‌ను 800 సెకన్ల పాటు పరీక్షించారు. సి-25గా పిలిచే ఈ ఇంజన్‌ను నాలుగు టన్నుల బరువు గల ఉపగ్రహాలను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3లో ఉపయోగించనున్నారు. ఇందులో అత్యల్ప ఉష్ణోగ్రతలతో కూడిన ద్రవ హైడ్రోజన్(-253 డిగ్రీల సెంటిగ్రేడ్), ద్రవ ఆక్సిజన్(-193 డిగ్రీ సెంటిగ్రేడ్)లను ఇంధనంగా వినియోగిస్తారు. 
ప్లూటోపై మంచు కొండలు
మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఫొటో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు పర్వతాలుగా భావించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లూటోపై మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చని, వీటిని బట్టి చూస్తే ప్లూటో ఇంకా భౌగోళికంగా క్రియాశీలంగానే ఉండవచ్చన్నారు. ప్లూటోను సమీపించకముందు న్యూ హారిజాన్స్ జూలై 21న 77 వేల కి.మీ. దూరం నుంచి ఈ మంచుకొండలను క్లోజ్-అప్ ఫొటో తీసింది. 
చైనాలో బాలికకు 3డీ ప్రింటెడ్ లోహపుర్రె మార్పిడి 
ప్రపంచ వైద్యరంగంలోనే కీలకమైన సరికొత్త పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చైనా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హైడ్రోసెఫలస్(తలలో నీరు చేరడం) అనే సమస్య బారిన పడిన ఓ మూడేళ్ల బాలికకు వారు త్రీడీ(3డీ) ప్రింటెడ్ లోహపు పుర్రెను మార్పిడి చేశారు. ఇలా 3డీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన పుర్రెను అమర్చడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. చైనాలోని హునాన్ రాష్ట్రంలో గల సెకండ్ పీపుల్స్ హాస్పిటల్‌లో జూలై 15న ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స జరిగింది.
10 కోట్ల ఏళ్ల నాటి చేప శిలాజం గుర్తింపు
ఆస్ట్రేలియాలో 10 కోట్ల ఏళ్ల కిందటి చేప శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వీన్‌లాండ్ రాష్ట్రం జులియా క్రీక్ నగరానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని పురాతన లోతట్టు సముద్ర సమాచారం తెలుసుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 10 కోట్ల సంవత్సరాల కిందటి అతిపెద్ద చేప శిలాజాన్ని గుర్తించామని, దీంతో పాటు మరో 20-30 చిన్న చేపల అవశేషాలను కూడా కనుగొన్నట్లు శాస్త్రవేత్త తిమోతీ హొలాండ్ తెలిపారు. ఇది మూడు మీటర్ల కంటే పొడవుగా ఉందని, దీని తోక చాలా బలంగా ఉన్నట్లు చెప్పారు. పళ్లు రెండు సెంటీమీటర్ల కంటే పెద్దవిగా ఉన్నాయని తెలిపారు.

పీఎస్‌ఎల్‌వీ సి-28 ప్రయోగం
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి జూలై 10న చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) సి-28 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన 1440 కిలోల బరువు ఉన్న ఐదు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అధిక బరువైన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ఇస్రో ప్రయోగించింది. ఈ ఐదింటిలో బ్రిటన్‌కు చెందిన మూడు డిజాస్టర్ మానిటరింగ్ కాన్‌స్టెలేషన్ (డీఎంసీ) ఉపగ్రహాలు మరో రెండు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. 
వైమానిక దళంలోకి ఆకాశ్ క్షిపణి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌సోనిక్ క్షిపణి ఆకాశ్‌ను వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. గ్వాలియర్‌లో జూలై 10న కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాకు ఆకాశ్‌ను అందించారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆకాశ్‌ను అభివృద్ధి చేసింది. ఇది 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగలదు. 18 వేల మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుంటుంది.
‘హెలినా’ పరీక్ష విజయవంతం
శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ‘హెలినా’ క్షిపణి (‘నాగ్’ క్షిపణి హెలికాప్టర్ వెర్షన్)ను రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లో జైసల్మేర్‌లో చందన్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఈ ప్రయోగంలో.. 7 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ‘హెలినా’ ఛేదించింది. జూలై 12న మూడు సార్లు దీనిని ప్రయోగించగా ఒకసారి లక్ష్యానికి స్వల్ప దూరంలో పేలిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఫ్లూటోను దాటి వెళ్లిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక జూలై 14న ప్లూటో మరుగుజ్జు గ్రహాన్ని అతిసమీపం నుంచి దాటివెళ్లిన అనంతరం 13 గంటలకు భూమికి సమాచారం పంపింది. ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్‌కాల్‌ను న్యూ హారిజాన్స్ పంపిందని నాసా వెల్లడించింది. సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ జూలై 14వ తేదీ ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటింది. ఆటోమోడ్‌లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. ప్లూటోతో సహా కూపర్‌బెల్ట్‌లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోంది.

శాస్త్రవేత్త సంజీవ్‌కు బిర్లా అవార్డు
2014 సంవత్సరానికి జి.డి.బిర్లా అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే ఎంపికయ్యారు. ఈయన పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కణ జీవశాస్త్రం, ఎపిజెనిటిక్స్ రంగాల్లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.

తీర గస్తీ నౌక రాణి దుర్గావతి ప్రారంభంసముద్ర తీర గస్తీ నౌక రాణి దుర్గావతిని విశాఖపట్నంలో జూలై 6న తూర్పు నౌకదళాధిపతి అడ్మిరల్ సతీశ్ సోనీ ప్రారంభించారు. గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరును ఈ నౌకకు పెట్టారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

11 వేలు దాటిన ఎబోలా మృతుల సంఖ్యపశ్చిమ ఆఫ్రికాలో ఇప్పటివరకు 11,220 మంది ఎబోలా మహమ్మారికి బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. సంస్థ జులై 2న విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 27,514 మందికి ఎబోలా వైరస్ సోకింది. అత్యధికంగా లైబీరియాలో 10,666 కేసులు నమోదవ్వగా 4,806 మంది మృత్యువాతపడ్డారు. సియెర్రా లియోన్‌లో 3,932 మంది, గినియాలో 2,482 మంది ఎబోలాతో మరణించారు. వీటితోపాటు మాలి, నైజీరియా, సెనెగల్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాల్లోనూ ఎబోలా కేసులు నమోదయ్యాయి.

ఐఎస్‌ఎస్‌కు సామగ్రిని తీసుకెళ్లిన రష్యా వ్యోమనౌకఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములకు అవసరమైన సామగ్రిని మోసుకెళ్లే వ్యోమనౌకను రష్యా విజయవంతంగా ప్రయోగించింది.ఇదివరకే రెండుసార్లు ప్రయోగం విఫలమైన నేపథ్యంలో జులై 3న కజకిస్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సూయజ్-యు రాకెట్ ద్వారా ఎం-28ఎం నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఐఎస్‌ఎస్‌లో ప్రస్తుతం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా, మిఖైల్ కోర్నియంకో, నాసాకు చెందిన స్కాట్ కెల్లీ ఉన్నారు. వీరికి అవసరమైన 2.4 మెట్రిక్ టన్నుల ఇంధనం, ఆక్సిజన్, నీళ్లు, ఆహారం తదితరాలను ఎం-28ఎం నౌక మోసుకెళ్లింది.

‘సోలార్ ఇంపల్స్ 2’ రికార్డు ప్రయాణంసౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్ 2’ విమానం చరిత్ర సృష్టించింది.
జపాన్‌లోని నగోయా నుంచి జూన్ 29న బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి జులై 3న హవాయి దీవులకు చేరుకుంది. నిరంతరాయంగా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. ఆయన 2006లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెట్ విమానంలో 76 గంటల 45 నిమిషాలు ప్రయాణించారు.

టాప్ టెక్నాలజీ నగరాల్లో బెంగళూరుఅంతర్జాతీయంగా టెక్నాలజీకి కేంద్రాలుగా నిలుస్తున్న నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. 20 నగరాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది.ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్‌ఎల్) నిర్వహించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ వార్షిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లండన్, శాన్ జోసె, బీజింగ్ నగరాలు ఈ లిస్టులో తొలి మూడు స్థానాల్లోను ఉన్నాయి.

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2015

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2015
శాస్త్రవేత్తలకు ఆర్యభట్ట అవార్డులు
2013 సంవత్సరానికి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అవినాశ్ చందర్, 2012 సంవత్సరానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ రంగనాథ్ ఆర్.నవల్‌గుంద్‌లను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఆర్యభట్ట అవార్డుల కోసం ఎంపిక చేసింది. డీఆర్‌డీఓ అధిపతిగా, రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేసిన అవినాశ్ చందర్ అగ్ని క్షిపణుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.
యూఏఈలో తొలిసారిగా కృత్రిమ గుండె మార్పిడి
యూఏఈలో తొలిసారిగా కృత్రిమ గుండె మార్పిడి జరిగింది. షార్జా నగరానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థికి దీన్ని అమర్చారు. షార్జాలోని అల్-కిసిమీ ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్రచికిత్సను చేశారు. ‘విద్యార్థికి మరో గుండె లభించే వరకు ఇది అతని ప్రాణాలు కాపాడే వారధి’లా పనిచేస్తుందని కార్డియాక్ సర్జన్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ 1.5 కిలోల గుండెను శరీరంలో 10 ఏళ్లపాటు ఉంచవచ్చు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు పనిచేస్తుంది.

నక్షత్ర మండలానికి రొనాల్డో పేరు
యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న నక్షత్ర మండలానికి పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో పేరు పెట్టారు. రొనాల్డో ముద్దుపేరు సీఆర్7గా నామకరణం చేశారు. ఇప్పటివరకు కనుగొన్న సుదూర నక్షత్ర మండలాల్లో సీఆర్7 చాలా పురాతనమైందని, అన్నిటికన్నా మూడింతలు ఎక్కువ ప్రకాశవంతమైందని శాస్త్రవేత్తలు చెప్పారు. 
రైల్వేకు ‘గగన్’ సాయం
దేశీయంగా అభివృద్ధిపర్చిన గగన్ (జీపీఎస్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ) ద్వారా నావిగేషన్ సేవలను రైల్వేకు అందించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ జూన్ 17న అహ్మదాబాద్‌లో తెలిపారు. కాపలాదారులు లేని రైల్వే గేట్ల దగ్గర భద్రతను కల్పించేందుకు, రైల్వే ట్రాకులు నీట మునిగినప్పుడు గుర్తించేందుకు, పర్వత ప్రాంతాల్లో ట్రాకులను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థతో వీలవుతుందన్నారు. గగన్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఉపయోగిస్తే.. కాపలా లేని రైల్వే క్రాసింగ్ సమీపించగానే ఆటోమేటిక్‌గా సైరన్ మోగుతుందని వివరించారు. 
రోబోనాట్-2కు అవార్డు 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోకి 2011 లో చేరిన తొలి హ్యూమనాయిడ్ రోబో.. రోబోనాట్ - 2 (ఆర్-2)కు 2015 నాసా ఇన్వెన్షన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ రోబో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తూ ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములకు తోడ్పడుతోంది. జనరల్ మోటార్స్‌తో కలిసి నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) దీన్ని రూపొందించింది. ఇది మనిషి మాదిరిగా సులభంగా కదులుతుంది. ఐఎస్‌ఎస్ చుట్టూ తిరుగుతూ మరమ్మతులు చేసేందుకు, స్పేస్ వాక్‌లో వ్యోమగాములకు తోడ్పడేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 
ఇంటర్నెట్.. స్పేస్ టు హోమ్
ఇంటర్నెట్‌కు దూరంగా మారుమూలల్లో ఉన్న 300 కోట్ల మంది కోసం 12 ఉపగ్రహాలతో ‘ఓ3బీ నెట్‌వర్క్స్’ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. భూమి చుట్టూ 8 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ సిగ్నళ్లను ప్రసారం చేసే 12 ఉపగ్రహాలను ఓ3బీ నెట్‌వర్క్స్ మోహరించింది. కొన్ని నెలలుగా ప్రధానంగా భూమధ్య రేఖాప్రాంతంలోని దేశాలు, దీవులకు ఈ ఇంటర్నెట్ సేవ లను అందిస్తోంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్‌ను చవకగానే అందించడం దీని ప్రత్యేకత. ఈ శాటిలైట్ నెట్‌వర్క్ నుంచి భూగోళంపై 70 శాతం ప్రాంతాలు కవర్ అవుతాయని ఓ3బీ నెట్‌వర్క్స్ వ్యవస్థాపకుడు గ్రెగ్ వీలర్ వెల్లడించారు. 
చైనా ఎలక్ట్రిక్ విమానం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాన్ని చైనా తయారు చేసింది. షెన్‌యాంగ్ ఏరోస్పేస్ యూనివర్సిటీ, లియోనింగ్ జనరల్ ఏవియేషన్ అకాడమీ ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించాయి. ‘బీఎక్స్1ఈ’గా పిలిచే ఈ విమానం 3వేల మీటర్ల ఎత్తులో ఎగరగలదు. 230 కిలోల బరువు మోసుకుపోగలదు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ ఎలక్ట్రిక్ విమానానికి రెండు గంటల లోపే పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక సారి చార్జి చేస్తే 45 నిమిషాల నుంచి గంట వరకు ప్రయాణింవచ్చు. 
భారత్‌లో తొలి ఏసీ డెమూ రైలు ప్రారంభం
భారత దేశపు మొట్టమొదటి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు జూన్ 21న కేరళలోని కోచిలో ప్రారంభించారు. ఎర్నాకుళం జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో సురేశ్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. డెమూ సర్వీస్‌తో నడిచే ఈ రైలులో ఏసీ సౌకర్యం కల్పించామని త్వరలోనే మరిన్ని ఇలాంటి రైళ్లను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ రైలులో బయో టాయ్‌లెట్లను ఏర్పాటుచేశారు.

ఎస్-200 మోటారు భూస్థిర పరీక్ష విజయవంతం
భారీ ఉపగ్రహ ప్రయోగాలకు తోడ్పడే ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌కు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో జూన్-14న జరిపిన పరీక్ష విజయవంతమైంది. ఎస్-200 ఘన ఇంధన మోటారు సామర్థ్యం విశ్లేషణకు ఈ భూస్థిర పరీక్ష నిర్వహించారు. ఈ మోటారును 2016లో ఇస్రో ప్రయోగించనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3(డీ1) వాహన నౌకలో ఉపయోగించనున్నారు. ఈ ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌ల ద్వారా 3-5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు.

సంయుక్త క్షిపణిని పరీక్షించిన అమెరికా, జపాన్
అమెరికా, జపాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎమ్-3 క్షిపణిని కాలిఫోర్నియా తీరంలో జూన్ 6న విజయవంతంగా పరీక్షించారు. ఇది బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీన్ని రూ.12,800 కోట్లతో అభివృద్ధి చేశారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించి 2018లో అమెరికా, జపాన్ తీర రక్షణ దళాల్లో ప్రవేశపెట్టనున్నారు.

సైన్స్ & టెక్నాలజీ మే 2015

సైన్స్ & టెక్నాలజీ మే 2015
యాంటీ సబ్‌మెరైన్ యుద్ధనౌక ప్రారంభం
నాలుగోది, చివరిదైన జలాంతర్గాములను ఎదుర్కొనే (యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్) యుద్ధనౌక కవరట్టీని మే 18న కోల్‌కతాలో ప్రారంభించారు. దీంతో భారత నౌకాదళం కొనుగోలు స్థాయి నుంచి నిర్మాణ స్థాయికి చేరిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ తెలిపారు. ఈ నౌకను 90 శాతం దేశీయంగా నిర్మించారు. ఇది నౌకాదళానికి దేశీయంగా జరుగుతున్న నిర్మాణాల్లో తలమానికం లాంటిది. దీని నిర్మాణాన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ చేపట్టింది. ఢిల్లీలోని డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ రూపకల్పన చేసింది.
అస్త్ర క్షిపణి పరీక్షలు విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు విజువల్ రేంజ్ అస్త్ర క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ నుంచి మే 20న విజయవంతంగా పరీక్షించారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణులను ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించి పరీక్షించారు. తొలి పరీక్షలో ఈ సూపర్ సోనిక్ క్షిపణిని అత్యంత ఎత్తులో విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. రెండో పరీక్షను మరింత ఎత్తు నుంచి పరీక్షించారు. తాజా పరీక్షలతో ఏడు అభివృద్ధి పరీక్షలు జరిపినట్టయింది. ఈ క్షిపణికి మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత 2016లో వైమానిక దళంలో చేర్చుతారు. ఇది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన అతి చిన్న క్షిపణుల్లో ఒకటి.
రోడ్డుపై దిగిన యుద్ధవిమానం
భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిరాజ్ 2000ను ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మే 21న విజయవంతంగా దించారు. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా ఉపయోగించుకునేందుకు ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశారు. ఇలా యుద్ధ విమానాన్ని హైవేపై దించడం ఇదే తొలిసారి. దేశమంతటా ఇతర హైవేలపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తారు.
జలాంతర్గామి సింధుకీర్తి జలప్రవేశం
తొమ్మిది సంవత్సరాల మరమ్మతుల అనంతరం జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుకీర్తిని మే 21న విశాఖపట్నంలో జలప్రవేశం చేయించారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ జలాంతర్గామిని ఆధునికీకరించారు. దీనికోసం 2005లో రూ.550 కోట్లు కేటాయించారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఆధునికీకరణ పనులు చేపట్టింది.

2021నాటికి వీనస్ ఉపరితలంపైకి విమానం
శుక్రగ్రహం(వీనస్) ఉపరితలంపైకి తొలిసారిగా ఓ విమానం పంపాలని అమెరికాకు చెందిన ఓ ఏరోస్పేస్ కంపెనీ ప్రణాళిక రచిస్తోంది. ‘వీనస్ అట్మాస్పియరిక్ మాన్యువరబుల్ ప్లాట్‌ఫామ్’ గా పిలిచే దీన్ని 2021 నాటికి శుక్రగ్రహంపైకి పంపాలని యోచిస్తోంది. దీని రెక్కలు 55మీటర్లు ఉంటాయని, గంటకు సుమారు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని ‘నార్త్‌రాప్ గ్రమ్మన్’ అనే కంపెనీ వెల్లడించింది. వీనస్ ఉపరితలంపై నుంచి 50- 70 కి.మీ. ఎత్తులో ఉండి ఆ గ్రహం ఉపరితలాన్ని పరిశీలిస్తుందని తెలిపింది. శుక్ర గ్రహంపై 460 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, నాలుగు గంటలకు పైగా అక్కడ ఉండి సమాచారం సేకరించడం పెద్ద చాలెంజ్ అని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు కన్‌స్టాంటైన్ త్సాంగ్ తెలిపారు.

నౌకా స్థావరం ‘ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్’ ప్రారంభం
వ్యూహాత్మకంగా ప్రాధాన్యత గల కొత్త నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్‌ను గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మే 9న ప్రారంభించారు. ఇది గుజరాత్‌లో రెండో నౌకా స్థావరం. ఓఖా సమీపంలో ఉన్న ఐఎన్‌ఎస్ ద్వారక మొదటి స్థావరం. 1,600 కి.మీ. కోస్తా తీరం గల గుజరాత్‌లో కొత్తగా ప్రారంభించిన రెండో నౌకా స్థావరం మరింత భద్రతను పెంపొందిస్తుందని భారత నౌకాదళ ఉన్నతాధికారులు తెలిపారు. గుజరాత్‌లోని ఓడరేవుల నుంచి ఏడాదికి 300 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.
సైన్యానికి ఆకాశ్ క్షిపణి అప్పగింత
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని మే 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సైన్యానికి అప్పగించారు. 20 కి.మీ. ఎత్తులో 25 కి.మీ. వరకు గగనతలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్‌కు ఉంది. ఈ క్షిపణి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు, ఎక్కడికైనా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆకాశ్‌లో అత్యాధునిక రాడార్లు, కంట్రోల్ వ్యవస్థలు ఉండడంతో క్షిపణిని లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఏ రకమైన వాతావరణ పరిస్థితిలోనైనా ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. ఆకాశ్‌ను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. మూడు దశాబ్దాల కృషితో భారత్ ఆకాశ్‌ను రూపొందించింది. 1984 నుంచి డీఆర్‌డీఓ రూపొందించిన ఐదు క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి. వైమానిక రంగానికి చెందిన క్షిపణి కంటే.. సైన్యానికి చెందిన ఆకాశ్ క్షిపణి ఎటువంటి ప్రమాదాల వైపైనా వేగంగా కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఎడ్యూక్లౌడ్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్
క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలు ఎడ్యూక్లౌడ్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా మే 5న ప్రారంభించింది. దీనిద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిజిటల్ విద్యా సేవలను అందిస్తారు. డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ లెర్నింగ్ ఉంటుంది. ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ పరికరాల ద్వారా విద్యా బోధన సాగుతుంది. దేశంలో వచ్చే 18 ఏళ్లలో 1500 విద్యా సంస్థల ద్వారా 60 లక్షల విద్యార్థులు, 10 లక్షల బోధకులకు ఈ విధానాన్ని అందిస్తారు.

బుధుడిని ఢీకొన్న మెసెంజర్ ఉపగ్రహం
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన మెసెంజర్ ఉపగ్రహం బుధ (మెర్కూరీ) గ్రహం ఉపరితలాన్ని 2015 ఏప్రిల్ 29న ఢీకొట్టినట్లు అమెరికాలోని జాన్ హప్కిన్‌‌స యూనివర్సిటీలోని మిషన్ కంట్రోల్ ధృవీకరించింది. మెసెంజర్ గత 11 సంవత్సరాలుగా బుధుడి ఉపరితలానికి చెందిన విలువైన సమాచారాన్ని, వేలాది చిత్రాలను అందించింది. మెసెంజర్‌ను 2004 ఆగస్ట్ 3న ప్రయోగించారు. ఇది 2011 మార్చి 18 నుంచి బుధుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన ప్రారంభించింది. 2012 మార్చి నాటికి జీవిత కాలం ముగిసినా ఢీకొనేంతవరకు మెసెంజర్ సేవలు అందించింది. అత్యంత వేడి, రేడియేషన్ తట్టుకొని బుధుడికి 535 కి.మీ. దూరంలో అతి దగ్గరగా తిరుగుతూ నాలుగేళ్ల పాటు పరిశోధన సాగించింది. ఆ గ్రహ అయస్కాంత క్షేత్రం, మంచుతో నిండి ఉన్న బిలాలను గుర్తించింది. బుధుడిని 14 వేల కి.మీ. వేగంతో ఢీకొనడంతో అక్కడ 52 అడుగుల గొయ్యి ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండటంతో అక్కడ అత్యంత వేడి, రేడియేషన్ ఉంటాయి.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్త సతీష్‌రెడ్డికి లండన్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త డాక్టర్ సతీష్‌రెడ్డికి లండన్‌లోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్ (ఆర్‌ఐఎన్) ఫెలోషిప్ లభించింది. ఈ ఫెలోషిప్‌కు భారత్‌కు చెందిన శాస్త్రవేత్త ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇనర్షియల్, శాటిలైట్ ఆధారిత నేవిగేషన్, ఏవియానిక్స్ సాంకేతిక అభివృద్ధిలో మూడు దశాబ్దాలుగా చేసిన కృషికి గానూ ఆయనకు ఈ ఫెలోషిప్ దక్కింది. సతీష్ రెడ్డి డీఆర్‌డీవో పరిశోధన సంస్థ ఇమారత్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు. ఆయన అగ్ని-5 క్షిపణిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
  • 1947లో ఏర్పాటైన రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 450 మందికి ఫెలోషిప్స్ అందజేసింది. ఈ సంస్థ నేవిగేషన్ పరిశోధనలకు పేరు గాంచింది.

సైన్యం అమ్ములపొదిలోకి ‘ఆకాశ్’స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన అత్యంత అధునాతన క్షిపణి ‘ఆకాశ్’ భారత సైన్యంలోకి చేరింది. పూర్తిగా స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణిని మే 5న ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా సైన్యానికి అప్పగించారు. హైదరాబాద్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యం లో దీన్ని రూపొందించారు. జి. చంద్రమౌళి ఆకాశ్ క్షిపణి ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. భారత సైన్యంలో ఆకాశ్ క్షిపణి చేరడంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది.

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2015

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2015
విజయవంతమైన అగ్ని-3 పరీక్ష
అణ్వస్త్రాలను మోసుకుపోగల క్షిపణి అగ్ని-3ని భారత్ ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో గల పరీక్షా కేంద్రం నుంచి ఏప్రిల్ 16న విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి పనితీరును నిర్ధారించేందుకు సైన్యం ఈ పరీక్ష నిర్వహించింది. అగ్ని-3 క్షిపణి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 1.5 టన్నుల ఆయుధాలను మోసుకుపోగలదు. ఇందులో ఘన ఇంధనంతో పనిచేసే రెండంచెలు ఉంటాయి. పొడవు 17 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు, బరువు 50 టన్నులు. ఈ క్షిపణిలో హైబ్రిడ్ నేవిగేషన్, దిశానిర్దేశ నియంత్రణ వ్యవస్థలు, అధునాతన ఆన్‌బోర్డు కంప్యూటర్ వ్యవస్థలు ఉన్నాయి.
యుద్ధనౌక ‘విశాఖపట్నం’ జల ప్రవేశం
ఆధునిక యుద్ధనౌక విశాఖపట్నాన్ని ఏప్రిల్ 20న ముంబైలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ సతీమణి మిను ధోవన్ జల ప్రవేశం చేయించారు. దీన్ని 2018లో లాంఛనంగా నౌకాదళంలో చేరుస్తారు. ఒక యుద్ధనౌకకు విశాఖపట్నం పేరు పెట్టడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కోల్‌కత తరగతికి చెందింది. పి-15బి స్టెల్త్ డెస్ట్రాయిర్ల శ్రేణిలో మొదటిది. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలంలోకి లక్ష్యాలను ఛేదించగల సూపర్‌సోనిక్ క్షిపణులను అమరుస్తారు. 
యూట్యూబ్‌లో మరో 15 భాషలు
వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూ ట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు చేరాయి. దీంతో తమ మాతృభాషలోనే వెబ్‌సైట్‌ను వీక్షించే అవకాశమున్న భాషల సంఖ్య 76కు చేరింది. 
ప్రపంచంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు తాము అందుబాటులోకి వచ్చినట్లు యూ ట్యూబ్ ప్రకటించింది. సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ డెవలపర్లు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. 
యూ ట్యూబ్‌లో కొత్తగా చేరిన భాషలు... 
అజర్‌బైజాన్, ఆర్మేనియన్, జార్జియన్, ఖజక్, ఖ్మేర్, కిర్గిజ్, లావో, మాసిడోనియన్, మంగోలియన్, మైన్మార్(బర్మా), నేపాలీ, పంజాబీ, సింహళ, ఆల్బేనియన్, ఉజ్బెక్.


దనుష్ పరీక్ష విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకుపోగల బాలిస్టిక్ క్షిపణి ధనుష్‌ను భారత్ ఏప్రిల్ 9న ఒడిశా తీరంలో యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
అశ్విన్ క్షిపణి పరీక్ష విఫలం
ఆధునికీకరించిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) ఇంటర్‌సెప్టెర్ క్షిపణి అశ్విన్ పరీక్ష విఫలమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఏప్రిల్ 6న చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగంలో మంటలు చెలరేగడంతో కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. 20 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అడ్డుకునేందుకు దీన్ని ప్రయోగించారు. ఇప్పటివరకు ఇలాంటి ఏడు పరీక్షలు నిర్వహిస్తే అందు లో ఐదు విజయవంతమయ్యాయి. దీని ఎత్తు 7.5 మీటర్లు, బరువు 1.2 టన్నులు, వ్యాసం 0.5 మీటర్లు.

రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
ప్రాణాంతక ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఓ కొత్త, సమర్థమైన హోమియో ఔషధం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు, ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్-బి కారక వైరస్‌ల వ్యాప్తిని నిరోధించే ఈ ఔషధం తయారీపై వీరి పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. రక్తపింజర(క్రొటాలస్ హెరిడస్) విషం ఆర్‌టీ అనే ఎంజైమ్‌ను నిరోధించగలదని వీరు ఇదివరకే శాస్త్రీయంగా నిరూపించారు. ఏప్రిల్ 2, 2015న హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రథమ ఎస్. మెయింకర్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్‌లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. క్రోటాలస్ హెరిడస్ విషానికి ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు తెలిపారు. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చి, దానిని అభివృద్ధి చేసి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్- బి వంటి వైరస్‌ల బారి నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

షుగర్ వ్యాధిని నియంత్రించే వరి వంగడం తయారీషుగర్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో దోహదపడే ఆర్‌ఎన్‌ఆర్ 15048 అనే వరి వంగడాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) వచ్చే ఖరీఫ్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే కొందరు రైతులు సాగు చేస్తున్న ఈ వంగడాన్ని అధికారికంగా విడుదల చేసి, విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వర్సిటీ ప్రత్యేకాధికారి డా. వి.ప్రవీణ్‌రావు తెలిపారు. గ్లుటామిన్ ఇండెక్స్ (జీఐ) ఎంత ఎక్కువ ఉంటే మధుమేహ రోగులకు ఆ బియ్యం అంత మేలైనవిగా భావిస్తారు. సాధారణ వరి వంగడాల్లో 35-36 వరకు జీఐ ఉంటుంది. ఈ రకాల బియ్యం రక్తంలో చక్కెర నిల్వల పెంపుదలకు కారణమవుతున్నాయన్నారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడంలో ఇది 56 వరకు ఉందని జాతీయ పోషకాహార సంస్థలో జరిపిన పరీక్షల్లో తేలిందన్నారు. బీపీటీ బియ్యంలో 51 వరకు జీఐ ఉంటుందన్నారు.

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2015

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2015
పీఎస్‌ఎల్‌వీ-సీ 27 ప్రయోగం విజయవంతం
పీఎస్‌ఎల్‌వీ-సీ 27 ప్రయోగం విజయవంతమైంది. మార్చి 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత ప్రాంతీయ దిక్సూచి(నావిగేషన్) ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) అభివృద్ధికి గానూ ఈ ఉపగ్రహాన్ని పంపారు. దీంతో అమెరికా, రష్యా, చైనాలకున్న నావిగేషన్ వ్యవస్థ వల్ల విపత్తుల అంచనా, నౌకలు, ఇతర వాహనాల కదలికలను గుర్తించవచ్చు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి బరువు 1,425 కిలోలు. దీన్ని రూ. 145 కోట్లతో రూపొందించారు. ఇది 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. 
‘కిరోబో’ రెండు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు సహచరిగా సేవలందించిన జపాన్ మరమనిషి ‘కిరోబో’ రెండు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన తొలి సహచర రోబో, అత్యంత ఎత్తులో (సముద్ర ఉపరితలానికి 414.2 కిలోమీటర్ల ఎత్తులో) సంభాషించిన రోబోగా ఇది రెండు రికార్డులను నమోదు చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు కొన్నిసార్లు ఒంటరిగా గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారికి నాలుగు మాటలు చెబుతూ ఒంటరితనాన్ని దూరం చేసే ఓ తోడు కావాలి అనిపిస్తుంది. ఆ తోడు మనిషే కావాల్సిన అవసరం లేదు కదా! అందుకే జపాన్ శాస్త్రవేత్తలు మాట్లాడే మరమనిషి కిరోబోను సృష్టించారు. దీన్ని ఎత్తు 34 సెంటీమీటర్లు. బరువు ఒక కిలో. ఈ రోబో మనుషుల స్వరాలను గుర్తుపడుతుంది. జపనీస్ భాషలో మాట్లాడుతుంది. 2013 ఆగస్టు 4న కిరోబోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ కొయిచీ వకాతా అనే వ్యోమగామికి ఇది సహచరిగా పనిచేసింది.

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్).. ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని మార్చి 18న ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టారు. క్షిపణిని సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి కదులుతున్న లక్ష్యం వైపు ప్రయోగించారు. యుద్ధ విమానం నుంచి క్షిపణి విడిపోయి, 2 కి.మీ. ఎత్తులో కదులుతున్న లక్ష్యాన్ని అడ్డుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన అతిచిన్న క్షిపణి అస్త్ర. దీని పొడవు 3.8 మీటర్లు. ఇది 15 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. సూపర్‌సోనిక్ వేగంతో శత్రు విమానాలను అడ్డుకొని, ధ్వంసం చేయగలదు.

సొమాటిక్ కణాలతో క్లోనింగ్ గేదె దూడ
గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి భారత శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారిగా క్లోనింగ్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్.డి.ఆర్.ఐ) శాస్త్రవేత్తలు ముర్రా గేదెకు సొమాటిక్ కణాలను ఉపయోగించి దూడను పుట్టించారు. ఈ విధానం జీవకణాలు వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. ఈ దూడకు అపూర్వ అని పేరు పెట్టారు. ముర్రా అధికంగా పాలిస్తుంది. ఈ క్లోనింగ్ విధానం అధికంగా పాలిచ్చే గేదెల సంఖ్యను పెంచుకొనేందుకు తోడ్పడుతుంది.
సేవల నుంచి ఐఎన్‌ఎస్ అలెప్పీ విరమణ
కోస్టల్ మైన్ స్వీపర్ ఐఎన్‌ఎస్ అలెప్పీని సేవల నుంచి మార్చి 13న విరమింపజేశారు. ఆరు పొంచిచెర్రి తరగతి మైన్ స్వీపర్‌లలో ఐఎన్‌ఎస్ అలెప్పీ ఒకటి. రష్యా నుంచి 1970లో కొనుగోలు చేసిన అలెప్పీ నాటి నుంచి పశ్చిమ నావల్ కమాండ్‌లో సేవలందించింది. ఈ నౌకను హార్బర్ సమీపంలో నీటి అడుగున ఉండే మైన్లను గుర్తించి విచ్ఛిన్నం చేసేందుకు రూపొందించారు.

ఎలక్ట్ట్రిక్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు
ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్ట్రిక్‌తో పనిచేసే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కాలిఫోర్నియాలోని కేప్ కెనరావల్ నుంచి మార్చి 1న ప్రయోగించారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ (స్పేస్ ఎక్స్) ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిని కక్ష్యలోకి చేర్చడానికి రాకెట్ థ్రస్టర్ల బదులుగా ఎలక్ట్ట్రిక్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండు దశాబ్దాలపాటు పనిచేస్తాయి. తక్కువ బరువు ఉండటం వల్ల ఈ రెండు ఇంజన్లను ఒకేసారి ప్రయోగించడానికి వీలుంటుంది. ఇవి భూస్థిర కక్ష్యలోకి చేరేందుకు కొన్ని నెలలు పడుతుంది. వీటిని బోయింగ్ సంస్థ ఫ్రాన్‌‌సలోని ఇయుటెల్‌శాట్, ఆసియా బ్రాడ్ కాస్ట్ శాటిలైట్‌ల కోసం నిర్మించింది.

నాలుగు నక్షత్రాల గ్రహం గుర్తింపుఅమెరికన్ శాస్త్రవేత్తలు నాలుగు నక్షత్రాల వ్యవస్థలో భారీ గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 136 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రాల వ్యవస్థ పేరు 30 అరి. ఇందులోని వాయుగ్రహం గురుగ్రహం కంటే 10 రెట్లు పెద్దగా ఉంది. శాన్ డిగోలో పాలోమార్ అబ్జర్వేటరీలోని టెలిస్కోప్ ద్వారా ఈ వ్యవస్థను గుర్తించారు. సాధారణంగా ఒక్కో గ్రహ వ్యవస్థకు ఒకే మాతృ నక్షత్రం ఉంటుంది. నాలుగు నక్షత్రాల గ్రహాన్ని కనుగొనడం ఇది రెండోసారి. మొదట గుర్తించిన గ్రహాన్ని కేఐసీ 4862625 పేరుతో పిలుస్తున్నారు.

షహీన్ -3 క్షిపణిని పరీక్షించిన పాక్అణు సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి షహీన్-3ను పాకిస్థాన్ మార్చి 9న విజయవంతంగా పరీక్షించింది. ఇది 2750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతుంది.

సౌర విమానం ప్రపంచ యాత్రఇదివరకే పలుసార్లు విజయవంతంగా గగనవిహారం చేసిన ప్రపంచ తొలి సౌర విమానం 
‘సోలార్ ఇంపల్స్’ మొదటిసారిగా ప్రపంచయాత్రకూ శ్రీకారం చుట్టింది. మార్చి 9న అబుదాబీ నుంచి సోలార్ ఇంపల్స్-2 (ఎస్‌ఐ-2) సౌర విమానం చరిత్రాత్మక ప్రయాణం మొదలెట్టింది. చుక్క ఇంధనం లేకుండా.. 35 వేల కి.మీ. సాగే ఈ సుదీర్ఘయాత్రకు తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్.. రెండో పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరనుంది. జూలై చివరలో ఈ విమానం తిరిగి అబుదాబీకి చేరుకోనుంది. మార్చి 10న భారత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. వారణాసిలో కూడా ఆగుతుంది. అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది.

రోటావైరస్ టీకా ఆవిష్కరణదేశీయంగా అభివృద్ధి చేసి తయారు చేసిన అతిసార వ్యాధి కారకం రోటావైరస్ వ్యాక్సిన్ ‘రోటావాక్’ను మార్చి 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీంతో ఈ వ్యాధికి అంతర్జాతీయంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్ల సరసన భారత్ రూపొందించిన ‘రోటావాక్’ చేరింది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైనదని(డోస్‌కు రూ.60) ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గత 25 ఏళ్ల అసాధారణ కృషి ఫలితంగా ఈ విజయం దక్కిందని పీఎంఓ తెలిపింది. ఈ వ్యాధికి గురై ఏటా 80వేల మంది 5 ఏళ్లలోపు పిల్లలు చనిపోతున్నారు. ఈ టీకా అభివృద్ధి భారత్‌లో పరిశోధన, తయారీకి స్ఫూర్తి అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

29న పీఎస్‌ఎల్‌వీ-సీ27 ప్రయోగం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి ఈనెల 29న సాయంత్రం 5.15 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 9వ తేదీన జరగాల్సిన ఈ ప్రయోగం తుది విడత తనిఖీల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహంలోని టెలీమేట్రీ టాన్స్‌మీటర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఉపగ్రహానికి మరమ్మతులు చేశారు. ఈ నెల 17న బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం (ఐసాక్) నుంచి శాస్త్రవేత్తలు టెలీమెట్రీ ట్రాన్స్‌మీటర్‌ను తీసుకురానున్నారు. 18న ఉపగ్రహానికి ట్రాన్స్‌మీటర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. 19న ఉపగ్రహాన్ని రాకెట్‌కు అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేస్తారు. 19 నుంచి 23 వరకు రాకెట్ అనుసంధాన భవనంలో అన్నిరకాల పరీక్షలు నిర్వహించి 24న ప్రయోగవేదికైన హుంబ్లీకల్ టవర్‌కు అనుసంధానం చేస్తారు. 25 నుంచి 27 వరకు ప్రయోగవేదికపై తుది విడత పరీక్షలు నిర్వహించి 27 మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. 29న రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2015

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2015
భారత్, శ్రీలంక మధ్య పౌర అణు ఒప్పందం
భారత్, శ్రీలంక పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన భారత పర్యటనలో భాగంగా 2015 ఫిబ్రవరి 16న ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీలంక ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దీని కింద నైపుణ్యాలు, వనరులను బదలాయించుకుంటారు. అణు భద్రతలో సిబ్బందికి శిక్షణ కల్పిస్తారు. రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని కూడా విస్తరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. కళలు, సంస్కృతుల విషయంలోనూ ఇరు దేశాలు సంబంధాలు పెంపొందించుకుంటాయి. నలందా యూనివర్సిటీ ప్రాజెక్టులో శ్రీలంక భాగం పంచుకునేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో సహకారానికి సంబంధించి మరో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రపంచపు శక్తిమంతమైన మైక్రోస్కోప్
ప్రపంచంలోనే అత్యధిక (రెజల్యూషన్ సామర్థ్యం) శక్తిమంతమైన మైక్రోస్కోప్‌ను జపాన్‌కు చెందిన అంతర్జాతీయ కంపెనీ హిటాచీ రూపొందించింది. ఈ మైక్రోస్కోప్‌తో ఎలక్ట్రాన్ల ప్రవాహం ఆధారంగా అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే అణువులనూ సైతం స్పష్టంగా చూడవచ్చు. దీనిపేరు ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (టీఈఎమ్). 2010 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో దీని నిర్మాణం పూర్తయింది. టీఈఎమ్ 43 పికోమీటర్ (అతిసూక్ష్మ అణువు సగం వ్యాసార్థానికి సమానం) రెజల్యూషన్ కలిగి ఉంటుంది. పికోమీటర్ అంటే మీటరులో లక్షకోట్లవ వంతు. అంటే ఇంతవరకూ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా కూడా చూడని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను దీని ద్వారా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇది ఒక పెద్ద గదిని ఆక్రమించేంత పరిమాణంలో ఉంటుంది. 1930లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి దాకా శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు.
పృథ్వీ -2 పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అణు సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి 2015 ఫిబ్రవరి 19న పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతుంది.
రూ. లక్ష కోట్లతో 7 యుద్ధ నౌకలు, 6 అణు జలాంతర్గాముల నిర్మాణం
దేశీయంగా ఏడు యుద్ధ నౌకలు, ఆరు అణు ఇంధన జలాంతర్గాముల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17న ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ మేరకు భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సంఘం నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లలో 24 జలాంతర్గాములను నిర్మించే కార్యక్రమానికి 1999లో ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ. 50,000 కోట్లతో ప్రాజెక్టు-75 ఎ కింద నాలుగు యుద్ధ నౌకలను మజగావ్ డాక్ (ముంబై)లో, మూడింటిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్‌‌స అండ్ ఇంజనీర్‌‌స సంస్థ (కోల్‌కతా)లో నిర్మిస్తారు. భారత్ ఆరు జలాంతర్గాములను విదేశీ సహకారంతో నిర్మిస్తోంది. మొదటిదాన్ని పదేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
అత్యాధునిక సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైంది. దీన్ని 2015 ఫిబ్రవరి 14న గోవా తీరంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి పరీక్షించారు. ఇది ధ్వని వేగం కంటే 1.4 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో చేర్చారు. 2014లో నౌకాదళంలోకి చేరిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి 16 బ్రహ్మోస్ క్షిపణులను, మిగిలిన యుద్ధ నౌకల ద్వారా ఒకేసారి 8 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే వీలుంది.
హవాయిలో అతిపెద్ద సోలార్ టెలిస్కోప్
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ టెలిస్కోప్‌ను హవాయిలోని మాయులో నెలకొల్పుతున్నారు. ఇది 2019లో ప్రారంభం కానుంది. దీంతో అంతరిక్ష వాతావరణ ప్రమాదాలను అంచనా వేసే సామర్థ్యం మెరుగవుతుంది.

‘తేజస్’ విజయం
నావికాదళ అవసరాల కోసం రూపొందించిన రెండో నావల్ ప్రొటోటైప్ తేజస్ విమానం తొలిసారి విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. ఫిబ్రవరి 7న బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లోని రన్ వే నుంచి గాలిలోకి ఎగిరిన ఈ యుద్ధవిమానం 35 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఇప్పటికే వైమానిక దళంలో తేజస్‌ను చేర్చారు.

హిందూ మహా సముద్రంలో భారత్ ఖనిజ వేటహిందూ మహా సముద్రంలో విలువైన ఖనిజాల అన్వేషణకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 10 వేల చదరపు కిలోమీటర్ల ఈ సముద్ర గర్భంలో బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలతోపాటు అమూల్యమైన ఖనిజాలు ఉన్నట్లు సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

వీటిని వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. ఖనిజాల వెలికితీతకు కేంద్ర ఎర్త్ సెన్సైస్ శాఖ జమైకాలోని ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ(ఐఎస్‌ఏ)తో ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమ ఖనిజ అన్వేషణ ప్రణాళికను ఐఎస్‌ఏ ఆమోదించిందని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్‌టిక్ అండ్ ఓషియన్ రీసెర్చ్(ఎన్‌సీఏఓఆర్) డెరైక్టర్ ఎస్.రాజన్ తెలిపారు. సముద్ర గర్భంలోని నిర్దేశిత ప్రాంతంలో 15 ఏళ్లపాటు లోహాల అన్వేషణ, వెలికితీతకు ఐఎస్‌ఏతో ఒప్పందం కుదర్చుకోనున్నట్లు వెల్లడించారు.

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2015

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2015
అగ్ని-5 విజయవంతం
ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి జనవరి 31న విజయవంతంగా ప్రయోగించింది. టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి క్షిపణిని ప్రయోగించారు. సాధారణంగా క్షిపణులను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. దీన్ని సులువుగా గుర్తించడంతో పాటు శత్రువులు దాడి చేసేందుకు అవకాశముంటుంది. అదే మొబైల్ లాంచర్ వెర్షన్ రహస్యంగా తరలించి, ప్రయోగించవచ్చు. అగ్ని-5 క్షిపణి బరువు 50 టన్నులు, పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు.
క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్
అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యమున్న రాద్ క్రూయిజ్ క్షిపణిని పాకిస్థాన్ ఫిబ్రవరి 2న విజయవంతంగా పరీక్షించింది. ఇది 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

మీథేన్ వాయువుతో కరెంటు
బొగ్గు గనుల నుంచి భారీగా విడుదలయ్యే మీథేన్ వాయువును విద్యుత్‌గా మార్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్‌ను చైనా నిర్మించింది. ప్రపంచంలోనే ఇలాంటి భారీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్స్‌లో లుయాన్ గ్రూప్ దీన్ని ఏర్పాటుచేసింది. గనుల నుంచి విడుదలయ్యే 99 శాతం మీథేన్‌తో 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది.

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2014

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2014
అత్యంత అధిక స్థాయికి CO2 ఉద్గారాలు
శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం. డిసెంబర్ 17న ‘పీబీఎల్ నెదర్లాండ్స్ ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ, ఐరోపా కమిషన్ జాయింట్ రీసెర్చ్ సెంటర్’.. ‘ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఇై2 ఎమిషన్స్-2014’ నివేదికను విడుదల చేసింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల ఇంధన అవసరాలు పెరుగుతుండటం ఉద్గారాల పెరుగుదలకు కారణమని నివేదిక తెలిపింది. ఉద్గారాల విడుదలలో చైనా (29 శాతం), అమెరికా (15 శాతం), ఐరోపా యూనియన్ (11 శాతం), భారత్ (6 శాతం) ముందున్నాయి.
జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్ (కేర్)ను ప్రయోగించారు. భూమికి 126 కి.మీ. ఎత్తులో రాకెట్ నుంచి క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది) విడిపోయింది. తర్వాత పారాచూట్ సహాయంతో బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగం మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు, బరువైన ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేందుకు తోడ్పడుతుంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 (ఎల్‌వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు.
సూపర్ ఎర్త్‌ను గుర్తించిన నాసా కెప్లర్ మిషన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి హెచ్‌ఐపీ116454బిగా పేరు పెట్టారు. ఇది వ్యాసంలో భూమి కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గ్లైడ్ బాంబును పరీక్షించిన భారత్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించారు. ఇది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. వాయుసేనకు చెందిన విమానం ద్వారా బాంబును తీసుకెళ్లి ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో జారవిడిచారు.
నూతన వరి వంగడం ఎంటీయూ-1156
ఆంధ్రప్రదేశ్,పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది. వరిలో ఐదు నుంచి పది శాతం అదనంగా దిగుబడి పెంచాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. ఇది దాళ్వాకు అనువుగా ఉంటుందని, 120 రోజుల కాల పరిమితిలో కోతకు వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

పినాక మార్క్-2 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక మార్క్-2 రాకెట్‌ను భారత్ డిసెంబర్ 9న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్‌ఈ)లో ఈ ప్రయోగం నిర్వహించారు.

జీశాట్-16 ప్రయోగం విజయవంతం 
సమాచార ఉపగ్రహం జీశాట్-16ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబరు 7న ఏరియన్-5 ద్వారా జీశాట్-16ను ప్రయోగించారు. 3,181.6 కిలోల బరువున్న జీశాట్-16ను 36వేల కి.మీ ఎత్తులో భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. తొలిసారి జీశాట్ ఉపగ్రహంలో అత్యధికంగా 48 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఇందులో 12 కేయూ, 24 సీ బ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. ట్రాన్స్‌పాండర్ల వల్ల డీటీహెచ్ వీడియో ప్రసారాల్లో నాణ్యత పెరుగుతుంది. 

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతంఖండాంతర క్షిపణి అగ్ని-4ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) డిసెంబరు 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకుపోగల ఈ క్షిపణి 4,000 కి.మీ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. అగ్ని-4ను పరీక్షించడం ఇది నాలుగోసారి. 

హయబుస-2ను ప్రయోగించిన జపాన్జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరర్ హయబుస-2ను డిసెంబరు 3న విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా రూపొందించిన హెచ్ 02-ఎ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఎక్స్‌ప్లోరర్ నాలుగేళ్లపాటు ప్రయాణించి 2018లో 1999 జేయూ అనే గ్రహశకలంపై దిగుతుంది. ఈ గ్రహశకలం పై రాళ్లు, ధూళిని సేకరించి 2020లో తిరిగి భూమికి చేరుతుంది. 

అంగారక యాత్ర వ్యోమనౌకను పరీక్షించిన అమెరికా అంగారక యాత్రకు మానవులను పంపే ప్రయత్నంలో అమెరికా డిసెంబరు 5న చేపట్టిన వ్యోమనౌక పరీక్ష విజయవంతమైంది. ఒరియన్ అనే వ్యోమనౌకను కేప్ కెనవరాల్‌లోని వైమానిక స్థావరం నుంచి డెల్టా-4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. అది నిర్దేశిత రీతిలో కక్ష్యలోకి వెళ్లి తిరిగి భూమిని చేరింది. ఈ ప్రయోగంలో ఉష్ణ కవచం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక క్షేమంగా తిరిగి భూమికి చేరడం వంటి వాటిని పరీక్షించారు. చంద్రుడికి వెలుపల వ్యోమగాములను తరలించే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2030లో అంగారకుడి మీదకు మానవసహిత యాత్రను చేపట్టాలని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయత్నిస్తోంది.

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2014

సైన్స్ & టెక్నాలజీ నవంబరు 2014
2070 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస
ప్రమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచదేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 2100 నాటికి మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ , ఓజోన్, కార్బన్ డయాక్సైడ్‌లను శూన్యస్థితికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్య క్రమం (యునెప్) నవంబరు 19న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలునవంబరు 20న హామీనిచ్చాయి. ఉద్గారాల తగ్గింపు, భూతాపం ఎదుర్కొనేందుకు పేదదేశాలకు సాయంగా ఈ నిధులను అందజేస్తారు. స్వచ్ఛమైన ఇంధన అవసరాలు, గ్రీన్‌టెక్నాలజీ సమకూర్చడం, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కరవు బారినుంచి కాపాడుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిధుల్ని సమకూరుస్తున్నాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ కేంద్రం దక్షిణ కొరియా.
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని నవంబరు 17న ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత వైమానిక దళం ప్రయోగించింది. ఇది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు. నవంబరు 20న రెండు ఆకాశ్ క్షిపణులను ఒకేసారి ఎగురుతున్న లక్ష్యాలను నిర్దేశించి పరీక్షించారు. ఇందులో ఒకటి వేగంగా కదులుతున్న మానవ రహిత వాహనం బన్‌షీని నాశనం చేసింది. రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో 11 కి.మీల దూరంలో ఎగురుతున్న ఆ లక్ష్యాన్ని 2.5 మాక్‌వేగంతో ఆకాశ్ ఢీకొంది. రెండో క్షిపణిని 24 కి.మీ పరిధిలో 5.5 కి.మీ ఎత్తులో కదులుతున్న లక్ష్యంపై ప్రయోగించారు. 
బిగ్ బ్యాంగ్ ప్రాజెక్టులో చేరిన మద్రాస్ ఐఐటీ
విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపు తున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్)ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేతులు కలిపింది. బిగ్ బ్యాంగ్ యంత్రంగా పేరొందిన లార్డ్ హాడ్రన్ కొలై డర్‌లోని కంపాక్ట్ మ్యువాన్ సోలినాయిడ్‌లో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని తీసుకుంది. ఈ ప్రత్యేకతను సాధించిన తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది.

జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం 
భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్‌లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. 
బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక
తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్‌వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు.
అగ్ని-2 పరీక్ష సక్సెస్
మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు.

విజయవంతంగా షార్ ఎయిర్ డ్రాప్ పరీక్ష
శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అక్టోబరు 31న ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మానవ రహిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, తర్వాత భూ వాతావరణంలోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. 

భూమికి చేరిన చైనా లూనార్ ఆర్బిటర్చంద్రుడి కక్ష్యను చేరిన చైనా వ్యోమనౌక జియావోఫియ్ వారం రోజుల తర్వాత తిరిగి నవంబరు 1న భూమికి చేరింది. ఈ నౌకను అక్టోబరు 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. 8.40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమ నౌకను పంపి తిరిగి భూమికి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యాలు ఈ ఘనత సాధించాయి. 

కూలిన వ్యోమనౌక స్పేస్ షిప్- 2రోదసీలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక స్పేస్‌షిప్-2 అక్టోబరు 31న కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో కూలిపోయింది. వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ నౌకను రూపొందించి, పరీక్షిస్తున్నప్పుడు అది 45 వేల అడుగుల ఎత్తులో పేలిపోయింది. 2015లో ఇది సిద్ధం కావాల్సి ఉంది.

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2014

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2014
అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్
హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది.


పీఎస్‌ఎల్‌వీ-సీ 26 ప్రయోగం విజయవంతం 
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 26 నౌక శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబరు 16న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నావిగేషన్ కోసం ప్రయోగించిన మూడో ఉపగ్రహం ఇది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగించడం ఇది రెండోసారి.

విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి దీర్ఘశ్రేణి సబ్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. దీన్ని అక్టోబరు 17న ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించారు. ఇది 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్రాలను కూడా మోసుకుపోగలదు. భూమి, ఆకాశం, సముద్రంపైనుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది కనిష్టంగా ఐదు మీటర్ల ఎత్తులో, గరిష్టంగా ఐదు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి 290 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. నిర్భయ్‌ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరో నాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ (బెంగళూరు) అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన తోమహాక్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ క్షిపణులకు నిర్భయ్ పోటీగా నిలుస్తుంది.

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2014

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2014
తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర జాతికి అంకితం 
తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు. గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన ఐఎన్‌ఎస్ సుమిత్ర అత్యాధునిక ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న నౌకలలో ఇది నాలుగోది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌక బరువు 2,200 టన్నులు, పొడవు 105 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు.

అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటార్ మిషన్ 
భారత ఉపగ్రహం మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ-సీ25 ద్వారా శ్రీహరికోట నుంచి మామ్‌ను ప్రయోగించారు. 66.6 కోట్ల కిలో మీటర్లు ప్రయాణించి 300 రోజుల అనంతరం కక్ష్యలోకి చేరింది. దీంతో తొలి ప్రయత్నంలోనే అంగారక క క్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన అరుదైన ఘనతను భారత్ సాధించింది. అరుణగ్రహంపైకి ఉపగ్రహాన్ని చేర్చిన తొలి ఆసియా దేశంగానూ నిలిచింది. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్‌లు మాత్రమే ఇప్పటివరకు విజయం సాధించాయి. అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 51 ప్రయత్నాలు జరగ్గా, 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మామ్‌కు అమర్చిన పరికరాలు అంగారక గ్రహ ఉపరితలాన్ని, అక్కడి వాతావరణాన్ని, ఖనిజ సంపదను పరిశీలిస్తాయి. జీవం ఆవిర్భవానికి ఆధారమైన మీథేన్ ఉందా? లేదా? అన్నదానిపై అన్వేషణ సాగుతుంది. అంగారకుడి నుంచి చిత్రాలు, సంకేతాలను కాన్‌బెర్రాలోని నాసా పరిశోధన కేంద్రాలు అందుకుని ఇస్రోకు చేరవేశాయి. 
అంగారక కక్ష్యలోకి మావెన్
అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఒకప్పుడు నీరు, ఉష్ణం ఉన్న అరుణగ్రహం ఇప్పుడు శీతలంగా, పొడిగా ఎందుకు మారిందనే దానిపై ఇది అధ్యయనం చేస్తుంది. మావెన్ అంతరిక్షంలో దాదాపు 10 నెలలపాటు 71.1 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్ 21న అంగారకుడికి చేరువైంది. ఈ గ్రహం ఎగువ వాతావరణంపై పరిశోధన కోసం పంపిన మొట్టమొదటి ఉపగ్రం ఇదే.

స్ట్రాటో ఆవరణకు చేరిన ఇస్రో శాస్త్రవేత్త సురేశ్‌కుమార్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరం నుంచి మిగ్-29లో 17,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ నౌక 45 నిమిషాల్లో 1,850 కి.మీ వేగంతో స్ట్రాటో ఆవరణను చేరింది. రష్యాలోని కంట్రీ ఆఫ్ టూరిజం లిమిటెడ్ అనే స్పేస్ ట్రావెల్ సంస్థ ద్వారా కుమార్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ప్రపంచంలో ఈ యాత్ర చేపట్టిన వారిలో కుమార్ 259వ వ్యక్తి. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అనే ఈ యాత్రను ఆరేళ్ల కిందట ప్రారంభించారు. 

అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతంపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ సెప్టెంబర్ 10న ఒడిశాలోని బాలాసోర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రోడ్డు, రైల్ మొబైల్ లాంఛర్ల నుంచి ప్రయోగించవచ్చు. 1000 కిలోల సంప్రదాయ, అణు ఆయుధాలను మోసుకుపోగలదు. సెకనుకు 2.5 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 15 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి బరువు 12 టన్నులు.

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2014

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2014
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తా జాతికి అంకితం
జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తాను రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ ఆగస్టు 23న జాతికి అంకితం చేశారు. భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో కమోర్తాను తయారు చేసింది. ఈ యుద్ధనౌక సముద్రంలో నిశ్శబ్దంగా కదిలే శత్రు జలాంతర్గాములను కనిపెట్టగలదు. తొలిసారి ఉపరితల, వాయు నిఘా కోసం రేవతి అనే స్వదేశీ రాడార్‌ను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఐఎన్‌ఎస్ కమోర్తాను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ రూపొందించింది. కొర్వెట్టీ తరహాలో నిర్మిస్తున్న నాలుగు అత్యాధునిక యుద్ధనౌకల్లో ఇది మొదటిది.

విద్యుత్ ఉత్పత్తిలో రావత్‌భటా రికార్డు
విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్‌లోని రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ కేంద్రంలోని యూనిట్-5 నిరంతరాయంగా ఆగస్టు 11 నాటికి 739 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీంతో ప్రపంచంలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రెండో కేంద్రంగా రావత్‌భటా నిలిచింది. కెనడాలోని ఓంటారియోలా పికెరింగ్ న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్ 1994లో 894 రోజుల పాటు ఆగకుండా విద్యుత్ ఉత్పత్తి చేసింది. సాధారణంగా విద్యుత్ కేంద్రం 300 రోజులు అంతరాయం లేకుండా పనిచేస్తే దాన్ని ఉత్తమ పనితీరు కనబరిచినట్లు పరిగణిస్తారు. 
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని ఆగస్టు 13న ఒడిశాలోని చాందీపూర్ నుంచి వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. 
ఐఎన్‌ఎస్ కోల్‌కత జాతికి అంకితం 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కత భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్ కోల్‌కత గెడైడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక. దీన్ని మజగావ్ డాక్‌యార్డ్ నిర్మించింది. దీని బరువు 6,800 టన్నులు. పొడవు 164 మీటర్లు. వెడల్పు 18 మీటర్లు. పూర్తి స్థాయిలో సామాగ్రిని మోసుకెళితే బరువు 7,400 టన్నులు. నౌకలో 4.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఈ యుద్ధనౌకలో 30 మంది అధికారులు, 300 మంది సిబ్బంది ఉంటారు.

తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష నౌక
తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష వాహక నౌకగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రొసెట్టా అరుదైన ఘనతను సాధించనుంది. 67P/(చర్యుమోవ్- జిరాసిమెంకో) అనే పేరుగల తోక చుక్కను ఈ నౌక 10 సంవత్సరాల 5 నెలల 4 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చేరువైంది. ప్రస్తుతం ఇది తోకచుక్క ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దానిపై ల్యాండ్ కానుంది. ఈ తోకచుక్కను 1969లో కనుగొన్నారు. 

గ్లోబల్ వార్మింగ్‌కు మానవ చర్యలే ప్రధాన కారణం: ఐపీసీసీ గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు మానవులే ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ ) ఆగస్టు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యం, దక్షిణ ఆసియాలోని ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. 1950 నుంచి ఆసియాలో చల్లగా ఉండే రాత్రీపగలు రోజుల సంఖ్య తగ్గి, వేడితో కూడిన రాత్రీపగలు రోజుల సంఖ్య పెరిగాయని తెలిపింది.

సైన్స్ & టెక్నాలజీ జూలై 2014

సైన్స్ & టెక్నాలజీ జూలై 2014
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
ఆధునీకరించిన బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ,పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒడిశాలోని చాందీపూర్ వద్ద గల పరీక్షా కేంద్రం నుంచి జూలై8న విజయవంతంగా పరీక్షించింది. ఇది 500 సెకన్లలో 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. మోబైల్ లాంఛర్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఇది బ్రహ్మోస్ 44వ ప్రయోగం. ఈ క్షిపణికి పర్వతాలు, భవనాల మధ్య ఉండే రహస్య శత్రు స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. 
సాగర శోధనకు ‘సింధు సాధన‘
దేశంలో తొలిసారిగా నిర్మించిన పరిశోధన నౌక సింధు సాధన ప్రారంభమైంది. ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్ దీన్ని జూలై 13న గోవాతీరంలో జాతికి అంకితం చేశారు.

అత్యాధునిక సమాచార వ్యవస్థ.. దిశానెట్
విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. సమాచార వ్యవస్థ అందుబాటులో లేనిచోట కూడా ఇది పనిచేస్తుంది.ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవ డమే కాకుండా బాధితులు, బంధువులకు సాంత్వన కలిగించడంలో ఇది కీలకం కానుంది. ఈ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ, చెన్నై ఐఐటీ, ఎన్‌జీఆర్‌ఐతో పాటు టోక్యో కియో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. 

అండమాన్‌లో పరిశోధనలకు బయల్దేరిన సింధుసాధనభారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన పరిశోధన నౌక సింధుసాధన అండమాన్ సముద్రంలో పరిశోధన సాగించేందుకు జూలై 27న విశాఖ పోర్టునుంచి బయలుదేరింది. అత్యాధునిక పరిశోధన సదుపాయాలు గల ఈ నౌకను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనల కోసం గుజరాత్‌లోని ఏబీసీ షిప్‌యార్డ్ రూపొందించింది. రూ. 220 కోట్లతో నిర్మించిన ఈ నౌక 6వేల మీటర్ల లోతులో పరిశోధనలు నిర్వహించగలదు. 

క్లోనింగ్ ముర్రా జాతి కోడెదూడహ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఛండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు.

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2014

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2014
బ్రహ్మోస్ విజయవంతం
యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత్ జూన్ 9న కర్ణాటకలోని కర్వార్ తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా ఛేదించగలదు.

నౌకా దళంలోకి ఐ.ఎన్.ఎస్. కమోర్తా
భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐ.ఎన్.ఎస్ కమోర్తా అనే అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేసింది. ఈ యుద్ధనౌక సముద్రంలో నిశ్శబ్దంగా కదిలే శత్రు జలాంతర్గాములను కనిపెట్టగలదు. జలాంతర్గాములను పేల్చివేసే స్వదేశీ రాకెట్ లాంచర్ కూడా తొలిసారి కమోర్తా యుద్ధనౌకకు కల్పించారు. ఈ నౌకలో ఉన్న బౌమౌంటెడ్ సోనార్ నీటి లోపల మరింత మెరుగైన పరిశీలన చేయగలదు. తొలిసారి ఉపరితల, వాయు నిఘాకోసం రేవతి అనే స్వదేశీ రాడార్‌ను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ నిర్మించింది. దీని బరువు 3,400 టన్నులు. పొడవు 109 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు. గరిష్ఠంగా 25 నాట్‌ల వేగంతో ప్రయాణించగలదు. కదమత్, కిల్టాన్, కవరత్తి అనే మరో మూడు యుద్ధనౌకలను గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించనుంది.

రెండో పెద్ద టెలిస్కోప్ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రూపకల్పన చేసింది. దీనికి మ్యాజిక్ అట్మాస్ఫిరిక్ చెరింకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) అని పేరుపెట్టింది. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మేస్ టెలిస్కోప్‌ను జూన్ 28న హైదరాబాద్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు తరలించారు. మేస్ నిర్మాణ వ్యయం రూ.45 కోట్లు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. సూర్యుని నుంచి వెలువడే గామా కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయి. 21 మీటర్ల ఎత్తు, 180 టన్నుల బరువుండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా-26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్ధ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది. 

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ23 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. జూన్ 30న శ్రీహరికోటలోని షార్ వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ23 ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం స్పాట్-7 తోపాటు కెనడా, సింగపూర్, జర్మనీలకు చెందిన మరో నాలుగు బుల్లి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీల వరుసలో ఇది 27వది. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 23 పొడవు 44.4 మీటర్లు, బరువు 230 టన్నులు. ఈ రాకెట్ తన వెంట 765 కిలోల బరువుగల ఉపగ్రహాలను, ఇస్రోకు చెందిన 60 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లింది.

సైన్స్ & టెక్నాలజీ మే 2014

సైన్స్ & టెక్నాలజీ మే 2014
విజయవంతంగా పినాక పరీక్ష
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్ వ్యవస్థను భారత్ మే 29న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్ మెంట్ వేదికగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది. పినాక బహుళ బ్యారెల్ ప్రయోగ వ్యవస్థ ద్వారా ఈ పరీక్ష జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రయోగించే రాకెట్లకు ఎటువంటి దిశా నిర్దేశం ఉండదు. ఆరు లాంచర్లతో కూడిన ఒక విభాగం ద్వారా 12 రాకెట్లను 44 సెకన్లలో ప్రయోగించవచ్చు. 3.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశంలో ఉన్న శత్రువులను ఈ రాకెట్లు నాశనం చేయగలవు.

ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒకేసారి మూడు ఆకాశ్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి మే 28న విజయవంతంగా పరీక్షించింది. ఇది అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణి. సరిహద్దుల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించే పెలైట్ రహిత శత్రు విమానాలను ఛేదించేందుకు డిఆర్‌డీఓ ఆకాశ్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇది కేవలం ఐదు సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలదు.

కొత్త ఉచిత ఈ-మెయిల్ ‘ప్రోటాన్‌మెయిల్’
నెటిజన్ల ఈమెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ (ఎన్.ఎస్.ఎ.) నిఘా పెట్టిన నేపథ్యంలో... ఇతరులు చూసేందుకు వీలులేని కొత్తఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీస్ మే 16న అందుబాటులోకి వచ్చింది. ప్రోటాన్ మెయిల్‌గా పిలిచే దీన్ని ఎం.ఐ.టి, సెర్న్ శాస్త్రవేత్తలతో కలిసి రూపొందించినట్లు ఈమెయిల్ సర్వీస్ కో-డెవలపర్ జాన్‌స్టాక్ మన్ వెల్లడించారు. దీని సర్వర్లు స్విట్జర్లాండ్‌లో ఉంటాయి.

అస్త్ర పరీక్ష విజయవంతం 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ) మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల ( బియాండ్ విజువల్ రేంజ్ ) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. దేశీయంగా రూపొందిన తొలి బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ నుంచి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2014

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2014
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బ్లాక్-3 రకానికి చెందిన ఆధునీకరించిన అణ్వాయుధ సామర్థ్యం గల సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఏప్రిల్ 7న సైన్యం పరీక్షించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ఈశాన్యప్రాంత రాష్ట్రాల్లో చైనా చొరబాటును ఎదుర్కొనేందుకు పర్వత ప్రాంతాల్లో వినియోగించడానికి అనువుగా బ్లాక్-3 రకానికి చెందిన క్షిపణిని తీర్చిదిద్దారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకొనేందుకు భారత్ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ ను పశ్చిమ బెంగాల్‌లోని పానాఘర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన బ్రహ్మోస్‌ని ఇక్కడే మొహరిస్తారు. బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యానికి అప్పగించారు. దీన్ని ఉపరితలం, జలాంతర్గామి, ఆకాశం నుంచి ప్రయోగించేందుకు అనువుగా రూపొందించారు. బ్రహ్మోస్‌ను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

నింగికెగిసిన ఆకాశ్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ క్షిపణిని భారత్ ఏప్రిల్ 26న ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించింది. ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించడానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. 60 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళుతుంది. మధ్య శ్రేణికి చెందిన క్షిపణి యుద్ధవిమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను నాశనం చేస్తుంది. ఒక ఆకాశ్ వ్యవస్థ ఏకకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేస్తుంది. 
విజయవంతమైన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స వ్యవస్థ
శత్రు క్షిపణులను అడ్డుకునే బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స (బీఎండీ) వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఏప్రిల్ 27న జరిపిన దీర్ఘ శ్రేణి క్షిపణులను ముందుగా, ఆకాశంలోనే పేల్చివేసే పృథ్వీ డిఫెన్‌‌స వెహికల్ (పీడీవీ) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రక్షణ శాఖ ఈ ప్రయోగం నిర్వహించింది. పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో రూపొందించిన లక్ష్యాన్ని కూడా ప్రయోగంలో వినియోగించారు. బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ముందుగా లక్ష్యాన్ని ప్రయోగించారు. తర్వాత ప్రయోగించిన పీడీవీ లక్ష్యాన్ని ఛేదించింది. 2000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను పీడీవీ 120 కి.మీ. కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి ధ్వంసం చేస్తుంది.

భూమిలాంటి గ్రహం కెప్లర్-186ఎఫ్
జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్‌తో గుర్తించారు. దీన్ని కెప్లర్-186ఎఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలోని ‘హంసరాశి’లో ఉంది. సౌరమండలంలో కాకుండా విశ్వంలో మరో చోట భూమి పరిమాణంలో ఓ గ్రహం ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గతంలో విశ్వంలో భూమిని పోలిన అనేక గ్రహాలను గుర్తించినప్పటికీ భూమి కంటే అవన్నీ దాదాపు 40 శాతం పెద్దగా ఉన్నట్లు తేలింది. తాము గుర్తించిన కెప్లర్-186ఎఫ్ గ్రహం భూమితో అనేక రకాల పోలికలు కలిగిఉందని పరిశోధకులు చెబుతున్నారు. భూమిలాంటి గ్రహాల ఉనికిని కనుగొనడంలో ఈ కొత్తగ్రహం ఆవిష్కరణ ముఖ్యమైన ముందడుగుగా వారు పేర్కొన్నారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట నుంచి ఏప్రిల్ 4న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)-1బీ. ఇది విజయవంతమైన 26వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం. షార్ నుంచి 42వ ప్రయోగం. ఐర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1బీ పది సంవత్సరాల పాటు పనిచేస్తుంది. రూ. 1,600 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. దీని బరువు 1,432 కిలోలు. రాకెట్ బరువు 320 టన్నులు. రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు. గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ నిర్మాణం కోసం భారత్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా నౌకలు, విమానాల గమనాలను, వాటి భౌగోళిక స్థానాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సొంత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్‌కు ఏడు ఉపగ్రహాల అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1ఏ ఉపగ్రహాన్ని ఇంతకుముందే ప్రయోగించింది. 

విండోస్ ఎక్స్‌పీకి సెలవుసుదీర్ఘకాలం పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్‌పీకి తెరపడింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీనికి ఏప్రిల్ 8 నుంచి సాంకేతిక సహకారాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఫలితంగా ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు పెయిడ్ రూపంలో గానీ ఉచితంగా గానీ సపోర్ట్ లభించదు. ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌నకు ఆన్‌లైన్‌లో టెక్నికల్ కంటెంట్ అప్‌డేట్ కూడా లభించదు. విండోస్ ఎక్స్‌పీని తొలిసారిగా 2001 అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో పోలిస్తే విండోస్ ఎక్స్‌పీ మూడు తరాల పాతది. 2012 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన విండోస్ 8 మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్.

ముగిసిన ఇన్సాట్-3ఇ కాలంకమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3ఇ జీవిత కాలం ముగియడంతో పని చేయడం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం కక్ష్యలో 10 సంవత్సరాల 6 నెలలు పాటు విధులు నిర్వర్తించింది. 15 ఏళ్ల వినియోగం కోసం మూడో తరానికి చెందిన ఈ ఉప గ్రహాన్ని 2003 సెప్టెంబర్‌లో ప్రయోగించారు.

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2014

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2014
సేవలు ప్రారంభించిన ఐఎన్‌ఎస్ సుమేధ
నౌకాదళం ఐఎన్‌ఎస్ సుమేధను తన విధుల్లోకి చేర్చుకుంది. దేశీయంగా రూపొందించి, నిర్మించిన అత్యాధునిక గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమేధను వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా మార్చి 7న పనాజీలో నౌకాదళంలో చేర్చారు. దీన్ని గోవాషిప్ యార్‌‌డ లిమిటెడ్ నిర్మించింది.

సాగర గర్భం నుంచి అణ్వస్త్ర క్షిపణి పరీక్ష 
గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి సబ్‌మెరైన్ -లాంచ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్‌ఎల్‌బీఎం)ను మార్చి 24న బంగాళాఖాతంలో రక్షణ శాఖ వర్గాలు విజయవంతంగా ప్రయోగించాయి. సముద్ర జలాల అడుగు భాగం నుంచి జలాంతర్గామి ద్వారా బీవో 5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణశాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ దాని లక్ష్య పరిధి 700 కిలోమీటర్లు మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు. నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించిన వాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం. దీంతో గగన, భూతలాలతోపాటు సముద్ర గర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ నిలిచింది.

పృథ్వి -2 క్షిపణి పరీక్ష విజయవంతంఅణ్వస్త్ర సామర్థ్యం గల వృథ్వి -2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి మార్చి 28న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కిలోల బరువుగల ఆయుధాలను మోసుకుపోగలదు. ఈ క్షిపణిని 2003లో సైన్యానికి అప్పగించారు. శిక్షణలో భాగంగా ప్రస్తుత పరీక్షను సైన్యం నిర్వహించింది.

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2014

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2014
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతంఆకాశ్ క్షిపణిని రక్షణ శాఖ ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఫిబ్రవరి 24న విజయవంతంగా పరీక్షించింది. మానవరహిత విమానం నుంచి వేలాడే లక్ష్యాన్ని ఆకాశ్ ఛేదించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) పూర్తి స్వదీశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోతుంది. 

జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17-19తేదీల మధ్య మూడు రోజులపాటు బయో ఏషియా-14 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం వల్ల రూ. 20వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. 50 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. రూ.60వేల కోట్ల ఎగుమతులకు అవకాశముంటుంది. జీవ శాస్త్ర రంగాన్ని పారిశ్రామిక రంగం కేటగిరీ కింద పరిగణిస్తారు. ఏక గవాక్ష విధానంలో సంస్థలకు అనుమతులిస్తారు. ఇతర పరిశ్రమలకిచ్చే విద్యుత్ రాయితీలు కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రై వేట్ భాగస్వామ్యంతో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పుతారు. 

101వ సైన్స్ కాంగ్రెస్జమ్మూలో 101వ సైన్‌‌స కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. ‘ఇన్నోవేషన్‌‌స ఇన్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్’ ఇతివృత్తంతో ఈ సైన్‌‌స కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రంబెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ మద్రాస్ సహకారంతో రూ. 225 కోట్లతో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ జనవరి 30న ప్రకటించారు.