AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మే 2014

సైన్స్ & టెక్నాలజీ మే 2014
విజయవంతంగా పినాక పరీక్ష
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పినాక రాకెట్ వ్యవస్థను భారత్ మే 29న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్ మెంట్ వేదికగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది. పినాక బహుళ బ్యారెల్ ప్రయోగ వ్యవస్థ ద్వారా ఈ పరీక్ష జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రయోగించే రాకెట్లకు ఎటువంటి దిశా నిర్దేశం ఉండదు. ఆరు లాంచర్లతో కూడిన ఒక విభాగం ద్వారా 12 రాకెట్లను 44 సెకన్లలో ప్రయోగించవచ్చు. 3.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశంలో ఉన్న శత్రువులను ఈ రాకెట్లు నాశనం చేయగలవు.

ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒకేసారి మూడు ఆకాశ్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి మే 28న విజయవంతంగా పరీక్షించింది. ఇది అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణి. సరిహద్దుల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించే పెలైట్ రహిత శత్రు విమానాలను ఛేదించేందుకు డిఆర్‌డీఓ ఆకాశ్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇది కేవలం ఐదు సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలదు.

కొత్త ఉచిత ఈ-మెయిల్ ‘ప్రోటాన్‌మెయిల్’
నెటిజన్ల ఈమెయిళ్లపై అమెరికా ప్రభుత్వ సంస్థ (ఎన్.ఎస్.ఎ.) నిఘా పెట్టిన నేపథ్యంలో... ఇతరులు చూసేందుకు వీలులేని కొత్తఎన్‌క్రిప్ట్ ఈ-మెయిల్ సర్వీస్ మే 16న అందుబాటులోకి వచ్చింది. ప్రోటాన్ మెయిల్‌గా పిలిచే దీన్ని ఎం.ఐ.టి, సెర్న్ శాస్త్రవేత్తలతో కలిసి రూపొందించినట్లు ఈమెయిల్ సర్వీస్ కో-డెవలపర్ జాన్‌స్టాక్ మన్ వెల్లడించారు. దీని సర్వర్లు స్విట్జర్లాండ్‌లో ఉంటాయి.

అస్త్ర పరీక్ష విజయవంతం 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ) మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల ( బియాండ్ విజువల్ రేంజ్ ) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది. దేశీయంగా రూపొందిన తొలి బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ నుంచి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

No comments:

Post a Comment