AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూలై 2015

సైన్స్ & టెక్నాలజీ జూలై 2015
రూ.235 కోట్లతో సార్క్ ఉపగ్రహం
సార్క్ దేశాల కోసం భారత్ ప్రయోగించనున్న ఉపగ్రహానికి రూ.235 మేర ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 24న పార్లమెంటుకు తెలిపింది. 2014 నవంబరులో నేపాల్‌లో జరిగిన సార్క్ సదస్సులో ఈ ఉపగ్రహంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. 12 కేయూ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎంకే-2 ద్వారా ఇస్రో ప్రయోగిస్తుంది. ఉపగ్రహం ద్వారా సార్క్ సభ్యదేశాలకు టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్, విపత్తుల నిర్వహణ వంటివాటికి అవసరమయ్యే సేవలు అందుబాటులోకి వస్తాయి.
దేశీయ యుద్ధనౌకల నిర్మాణానికి 15 ఏళ్ల ప్రణాళిక
భారత నౌకాదళం..స్వదేశీ నిర్మాణ ప్రణాళిక(2015-30) ను జూలై 20న ఆవిష్కరించింది. దేశీయంగా యుద్ధ నౌకలు, ఇతర ఆయుధాల నిర్మాణాన్ని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ద్వారా చేపట్టేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. దీన్ని ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానిస్తారు. భారతీయ పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తారు.
గ్రహాంతర వాసుల అన్వేషణ ప్రారంభం
గ్రహాంతర వాసుల అన్వేషణకు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు లండన్‌లో జూలై 20న ప్రకటించారు. పదేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టుకు రష్యాకు చెందిన బిలియనీర్ యూరీ మిల్నర్ 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అని పేరు పెట్టారు. దీనికోసం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సహాయం తీసుకుంటారు. ఇతర గ్రహాల్లోని మేధో జీవులు వెలువరించే రేడియో సంకేతాల కోసం ఈ పరిశోధనలు చేపడుతున్నారు.

సూపర్ కంప్యూటర్ టియాన్-2
ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ కంప్యూటింగ్ సదస్సులో టాప్ 500 అత్యంత వేగవంతమైన కంప్యూటర్ జాబితాలో చైనాకు చెందిన టియాన్-2 మొదటి స్థానంలో నిలచింది. దీన్ని చైనా రక్షణ, సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.
క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం
క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్‌ను జూలై 16న తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. 19 టన్నుల శక్తి గల ఇంజన్‌ను 800 సెకన్ల పాటు పరీక్షించారు. సి-25గా పిలిచే ఈ ఇంజన్‌ను నాలుగు టన్నుల బరువు గల ఉపగ్రహాలను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3లో ఉపయోగించనున్నారు. ఇందులో అత్యల్ప ఉష్ణోగ్రతలతో కూడిన ద్రవ హైడ్రోజన్(-253 డిగ్రీల సెంటిగ్రేడ్), ద్రవ ఆక్సిజన్(-193 డిగ్రీ సెంటిగ్రేడ్)లను ఇంధనంగా వినియోగిస్తారు. 
ప్లూటోపై మంచు కొండలు
మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఫొటో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు పర్వతాలుగా భావించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లూటోపై మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చని, వీటిని బట్టి చూస్తే ప్లూటో ఇంకా భౌగోళికంగా క్రియాశీలంగానే ఉండవచ్చన్నారు. ప్లూటోను సమీపించకముందు న్యూ హారిజాన్స్ జూలై 21న 77 వేల కి.మీ. దూరం నుంచి ఈ మంచుకొండలను క్లోజ్-అప్ ఫొటో తీసింది. 
చైనాలో బాలికకు 3డీ ప్రింటెడ్ లోహపుర్రె మార్పిడి 
ప్రపంచ వైద్యరంగంలోనే కీలకమైన సరికొత్త పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చైనా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హైడ్రోసెఫలస్(తలలో నీరు చేరడం) అనే సమస్య బారిన పడిన ఓ మూడేళ్ల బాలికకు వారు త్రీడీ(3డీ) ప్రింటెడ్ లోహపు పుర్రెను మార్పిడి చేశారు. ఇలా 3డీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన పుర్రెను అమర్చడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. చైనాలోని హునాన్ రాష్ట్రంలో గల సెకండ్ పీపుల్స్ హాస్పిటల్‌లో జూలై 15న ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స జరిగింది.
10 కోట్ల ఏళ్ల నాటి చేప శిలాజం గుర్తింపు
ఆస్ట్రేలియాలో 10 కోట్ల ఏళ్ల కిందటి చేప శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వీన్‌లాండ్ రాష్ట్రం జులియా క్రీక్ నగరానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని పురాతన లోతట్టు సముద్ర సమాచారం తెలుసుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 10 కోట్ల సంవత్సరాల కిందటి అతిపెద్ద చేప శిలాజాన్ని గుర్తించామని, దీంతో పాటు మరో 20-30 చిన్న చేపల అవశేషాలను కూడా కనుగొన్నట్లు శాస్త్రవేత్త తిమోతీ హొలాండ్ తెలిపారు. ఇది మూడు మీటర్ల కంటే పొడవుగా ఉందని, దీని తోక చాలా బలంగా ఉన్నట్లు చెప్పారు. పళ్లు రెండు సెంటీమీటర్ల కంటే పెద్దవిగా ఉన్నాయని తెలిపారు.

పీఎస్‌ఎల్‌వీ సి-28 ప్రయోగం
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి జూలై 10న చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) సి-28 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన 1440 కిలోల బరువు ఉన్న ఐదు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అధిక బరువైన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ఇస్రో ప్రయోగించింది. ఈ ఐదింటిలో బ్రిటన్‌కు చెందిన మూడు డిజాస్టర్ మానిటరింగ్ కాన్‌స్టెలేషన్ (డీఎంసీ) ఉపగ్రహాలు మరో రెండు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. 
వైమానిక దళంలోకి ఆకాశ్ క్షిపణి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌సోనిక్ క్షిపణి ఆకాశ్‌ను వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. గ్వాలియర్‌లో జూలై 10న కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాకు ఆకాశ్‌ను అందించారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆకాశ్‌ను అభివృద్ధి చేసింది. ఇది 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగలదు. 18 వేల మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుంటుంది.
‘హెలినా’ పరీక్ష విజయవంతం
శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ‘హెలినా’ క్షిపణి (‘నాగ్’ క్షిపణి హెలికాప్టర్ వెర్షన్)ను రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లో జైసల్మేర్‌లో చందన్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఈ ప్రయోగంలో.. 7 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ‘హెలినా’ ఛేదించింది. జూలై 12న మూడు సార్లు దీనిని ప్రయోగించగా ఒకసారి లక్ష్యానికి స్వల్ప దూరంలో పేలిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఫ్లూటోను దాటి వెళ్లిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక జూలై 14న ప్లూటో మరుగుజ్జు గ్రహాన్ని అతిసమీపం నుంచి దాటివెళ్లిన అనంతరం 13 గంటలకు భూమికి సమాచారం పంపింది. ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్‌కాల్‌ను న్యూ హారిజాన్స్ పంపిందని నాసా వెల్లడించింది. సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ జూలై 14వ తేదీ ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటింది. ఆటోమోడ్‌లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. ప్లూటోతో సహా కూపర్‌బెల్ట్‌లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోంది.

శాస్త్రవేత్త సంజీవ్‌కు బిర్లా అవార్డు
2014 సంవత్సరానికి జి.డి.బిర్లా అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే ఎంపికయ్యారు. ఈయన పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కణ జీవశాస్త్రం, ఎపిజెనిటిక్స్ రంగాల్లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.

తీర గస్తీ నౌక రాణి దుర్గావతి ప్రారంభంసముద్ర తీర గస్తీ నౌక రాణి దుర్గావతిని విశాఖపట్నంలో జూలై 6న తూర్పు నౌకదళాధిపతి అడ్మిరల్ సతీశ్ సోనీ ప్రారంభించారు. గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరును ఈ నౌకకు పెట్టారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

11 వేలు దాటిన ఎబోలా మృతుల సంఖ్యపశ్చిమ ఆఫ్రికాలో ఇప్పటివరకు 11,220 మంది ఎబోలా మహమ్మారికి బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. సంస్థ జులై 2న విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 27,514 మందికి ఎబోలా వైరస్ సోకింది. అత్యధికంగా లైబీరియాలో 10,666 కేసులు నమోదవ్వగా 4,806 మంది మృత్యువాతపడ్డారు. సియెర్రా లియోన్‌లో 3,932 మంది, గినియాలో 2,482 మంది ఎబోలాతో మరణించారు. వీటితోపాటు మాలి, నైజీరియా, సెనెగల్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాల్లోనూ ఎబోలా కేసులు నమోదయ్యాయి.

ఐఎస్‌ఎస్‌కు సామగ్రిని తీసుకెళ్లిన రష్యా వ్యోమనౌకఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములకు అవసరమైన సామగ్రిని మోసుకెళ్లే వ్యోమనౌకను రష్యా విజయవంతంగా ప్రయోగించింది.ఇదివరకే రెండుసార్లు ప్రయోగం విఫలమైన నేపథ్యంలో జులై 3న కజకిస్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సూయజ్-యు రాకెట్ ద్వారా ఎం-28ఎం నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఐఎస్‌ఎస్‌లో ప్రస్తుతం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా, మిఖైల్ కోర్నియంకో, నాసాకు చెందిన స్కాట్ కెల్లీ ఉన్నారు. వీరికి అవసరమైన 2.4 మెట్రిక్ టన్నుల ఇంధనం, ఆక్సిజన్, నీళ్లు, ఆహారం తదితరాలను ఎం-28ఎం నౌక మోసుకెళ్లింది.

‘సోలార్ ఇంపల్స్ 2’ రికార్డు ప్రయాణంసౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్ 2’ విమానం చరిత్ర సృష్టించింది.
జపాన్‌లోని నగోయా నుంచి జూన్ 29న బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి జులై 3న హవాయి దీవులకు చేరుకుంది. నిరంతరాయంగా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. ఆయన 2006లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెట్ విమానంలో 76 గంటల 45 నిమిషాలు ప్రయాణించారు.

టాప్ టెక్నాలజీ నగరాల్లో బెంగళూరుఅంతర్జాతీయంగా టెక్నాలజీకి కేంద్రాలుగా నిలుస్తున్న నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. 20 నగరాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది.ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్‌ఎల్) నిర్వహించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ వార్షిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లండన్, శాన్ జోసె, బీజింగ్ నగరాలు ఈ లిస్టులో తొలి మూడు స్థానాల్లోను ఉన్నాయి.

No comments:

Post a Comment