AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2015

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2015
పీఎస్‌ఎల్‌వీ-సీ 27 ప్రయోగం విజయవంతం
పీఎస్‌ఎల్‌వీ-సీ 27 ప్రయోగం విజయవంతమైంది. మార్చి 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత ప్రాంతీయ దిక్సూచి(నావిగేషన్) ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) అభివృద్ధికి గానూ ఈ ఉపగ్రహాన్ని పంపారు. దీంతో అమెరికా, రష్యా, చైనాలకున్న నావిగేషన్ వ్యవస్థ వల్ల విపత్తుల అంచనా, నౌకలు, ఇతర వాహనాల కదలికలను గుర్తించవచ్చు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి బరువు 1,425 కిలోలు. దీన్ని రూ. 145 కోట్లతో రూపొందించారు. ఇది 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. 
‘కిరోబో’ రెండు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు సహచరిగా సేవలందించిన జపాన్ మరమనిషి ‘కిరోబో’ రెండు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన తొలి సహచర రోబో, అత్యంత ఎత్తులో (సముద్ర ఉపరితలానికి 414.2 కిలోమీటర్ల ఎత్తులో) సంభాషించిన రోబోగా ఇది రెండు రికార్డులను నమోదు చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు కొన్నిసార్లు ఒంటరిగా గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారికి నాలుగు మాటలు చెబుతూ ఒంటరితనాన్ని దూరం చేసే ఓ తోడు కావాలి అనిపిస్తుంది. ఆ తోడు మనిషే కావాల్సిన అవసరం లేదు కదా! అందుకే జపాన్ శాస్త్రవేత్తలు మాట్లాడే మరమనిషి కిరోబోను సృష్టించారు. దీన్ని ఎత్తు 34 సెంటీమీటర్లు. బరువు ఒక కిలో. ఈ రోబో మనుషుల స్వరాలను గుర్తుపడుతుంది. జపనీస్ భాషలో మాట్లాడుతుంది. 2013 ఆగస్టు 4న కిరోబోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ కొయిచీ వకాతా అనే వ్యోమగామికి ఇది సహచరిగా పనిచేసింది.

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్).. ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని మార్చి 18న ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టారు. క్షిపణిని సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి కదులుతున్న లక్ష్యం వైపు ప్రయోగించారు. యుద్ధ విమానం నుంచి క్షిపణి విడిపోయి, 2 కి.మీ. ఎత్తులో కదులుతున్న లక్ష్యాన్ని అడ్డుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన అతిచిన్న క్షిపణి అస్త్ర. దీని పొడవు 3.8 మీటర్లు. ఇది 15 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. సూపర్‌సోనిక్ వేగంతో శత్రు విమానాలను అడ్డుకొని, ధ్వంసం చేయగలదు.

సొమాటిక్ కణాలతో క్లోనింగ్ గేదె దూడ
గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి భారత శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారిగా క్లోనింగ్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్.డి.ఆర్.ఐ) శాస్త్రవేత్తలు ముర్రా గేదెకు సొమాటిక్ కణాలను ఉపయోగించి దూడను పుట్టించారు. ఈ విధానం జీవకణాలు వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. ఈ దూడకు అపూర్వ అని పేరు పెట్టారు. ముర్రా అధికంగా పాలిస్తుంది. ఈ క్లోనింగ్ విధానం అధికంగా పాలిచ్చే గేదెల సంఖ్యను పెంచుకొనేందుకు తోడ్పడుతుంది.
సేవల నుంచి ఐఎన్‌ఎస్ అలెప్పీ విరమణ
కోస్టల్ మైన్ స్వీపర్ ఐఎన్‌ఎస్ అలెప్పీని సేవల నుంచి మార్చి 13న విరమింపజేశారు. ఆరు పొంచిచెర్రి తరగతి మైన్ స్వీపర్‌లలో ఐఎన్‌ఎస్ అలెప్పీ ఒకటి. రష్యా నుంచి 1970లో కొనుగోలు చేసిన అలెప్పీ నాటి నుంచి పశ్చిమ నావల్ కమాండ్‌లో సేవలందించింది. ఈ నౌకను హార్బర్ సమీపంలో నీటి అడుగున ఉండే మైన్లను గుర్తించి విచ్ఛిన్నం చేసేందుకు రూపొందించారు.

ఎలక్ట్ట్రిక్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు
ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్ట్రిక్‌తో పనిచేసే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కాలిఫోర్నియాలోని కేప్ కెనరావల్ నుంచి మార్చి 1న ప్రయోగించారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ (స్పేస్ ఎక్స్) ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిని కక్ష్యలోకి చేర్చడానికి రాకెట్ థ్రస్టర్ల బదులుగా ఎలక్ట్ట్రిక్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండు దశాబ్దాలపాటు పనిచేస్తాయి. తక్కువ బరువు ఉండటం వల్ల ఈ రెండు ఇంజన్లను ఒకేసారి ప్రయోగించడానికి వీలుంటుంది. ఇవి భూస్థిర కక్ష్యలోకి చేరేందుకు కొన్ని నెలలు పడుతుంది. వీటిని బోయింగ్ సంస్థ ఫ్రాన్‌‌సలోని ఇయుటెల్‌శాట్, ఆసియా బ్రాడ్ కాస్ట్ శాటిలైట్‌ల కోసం నిర్మించింది.

నాలుగు నక్షత్రాల గ్రహం గుర్తింపుఅమెరికన్ శాస్త్రవేత్తలు నాలుగు నక్షత్రాల వ్యవస్థలో భారీ గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 136 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రాల వ్యవస్థ పేరు 30 అరి. ఇందులోని వాయుగ్రహం గురుగ్రహం కంటే 10 రెట్లు పెద్దగా ఉంది. శాన్ డిగోలో పాలోమార్ అబ్జర్వేటరీలోని టెలిస్కోప్ ద్వారా ఈ వ్యవస్థను గుర్తించారు. సాధారణంగా ఒక్కో గ్రహ వ్యవస్థకు ఒకే మాతృ నక్షత్రం ఉంటుంది. నాలుగు నక్షత్రాల గ్రహాన్ని కనుగొనడం ఇది రెండోసారి. మొదట గుర్తించిన గ్రహాన్ని కేఐసీ 4862625 పేరుతో పిలుస్తున్నారు.

షహీన్ -3 క్షిపణిని పరీక్షించిన పాక్అణు సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి షహీన్-3ను పాకిస్థాన్ మార్చి 9న విజయవంతంగా పరీక్షించింది. ఇది 2750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతుంది.

సౌర విమానం ప్రపంచ యాత్రఇదివరకే పలుసార్లు విజయవంతంగా గగనవిహారం చేసిన ప్రపంచ తొలి సౌర విమానం 
‘సోలార్ ఇంపల్స్’ మొదటిసారిగా ప్రపంచయాత్రకూ శ్రీకారం చుట్టింది. మార్చి 9న అబుదాబీ నుంచి సోలార్ ఇంపల్స్-2 (ఎస్‌ఐ-2) సౌర విమానం చరిత్రాత్మక ప్రయాణం మొదలెట్టింది. చుక్క ఇంధనం లేకుండా.. 35 వేల కి.మీ. సాగే ఈ సుదీర్ఘయాత్రకు తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్.. రెండో పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరనుంది. జూలై చివరలో ఈ విమానం తిరిగి అబుదాబీకి చేరుకోనుంది. మార్చి 10న భారత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. వారణాసిలో కూడా ఆగుతుంది. అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది.

రోటావైరస్ టీకా ఆవిష్కరణదేశీయంగా అభివృద్ధి చేసి తయారు చేసిన అతిసార వ్యాధి కారకం రోటావైరస్ వ్యాక్సిన్ ‘రోటావాక్’ను మార్చి 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీంతో ఈ వ్యాధికి అంతర్జాతీయంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్ల సరసన భారత్ రూపొందించిన ‘రోటావాక్’ చేరింది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైనదని(డోస్‌కు రూ.60) ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గత 25 ఏళ్ల అసాధారణ కృషి ఫలితంగా ఈ విజయం దక్కిందని పీఎంఓ తెలిపింది. ఈ వ్యాధికి గురై ఏటా 80వేల మంది 5 ఏళ్లలోపు పిల్లలు చనిపోతున్నారు. ఈ టీకా అభివృద్ధి భారత్‌లో పరిశోధన, తయారీకి స్ఫూర్తి అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

29న పీఎస్‌ఎల్‌వీ-సీ27 ప్రయోగం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి ఈనెల 29న సాయంత్రం 5.15 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ27ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 9వ తేదీన జరగాల్సిన ఈ ప్రయోగం తుది విడత తనిఖీల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహంలోని టెలీమేట్రీ టాన్స్‌మీటర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఉపగ్రహానికి మరమ్మతులు చేశారు. ఈ నెల 17న బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం (ఐసాక్) నుంచి శాస్త్రవేత్తలు టెలీమెట్రీ ట్రాన్స్‌మీటర్‌ను తీసుకురానున్నారు. 18న ఉపగ్రహానికి ట్రాన్స్‌మీటర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. 19న ఉపగ్రహాన్ని రాకెట్‌కు అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేస్తారు. 19 నుంచి 23 వరకు రాకెట్ అనుసంధాన భవనంలో అన్నిరకాల పరీక్షలు నిర్వహించి 24న ప్రయోగవేదికైన హుంబ్లీకల్ టవర్‌కు అనుసంధానం చేస్తారు. 25 నుంచి 27 వరకు ప్రయోగవేదికపై తుది విడత పరీక్షలు నిర్వహించి 27 మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. 29న రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

No comments:

Post a Comment