AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2014

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2014
తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర జాతికి అంకితం 
తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు. గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన ఐఎన్‌ఎస్ సుమిత్ర అత్యాధునిక ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న నౌకలలో ఇది నాలుగోది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌక బరువు 2,200 టన్నులు, పొడవు 105 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు.

అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటార్ మిషన్ 
భారత ఉపగ్రహం మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ-సీ25 ద్వారా శ్రీహరికోట నుంచి మామ్‌ను ప్రయోగించారు. 66.6 కోట్ల కిలో మీటర్లు ప్రయాణించి 300 రోజుల అనంతరం కక్ష్యలోకి చేరింది. దీంతో తొలి ప్రయత్నంలోనే అంగారక క క్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన అరుదైన ఘనతను భారత్ సాధించింది. అరుణగ్రహంపైకి ఉపగ్రహాన్ని చేర్చిన తొలి ఆసియా దేశంగానూ నిలిచింది. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్‌లు మాత్రమే ఇప్పటివరకు విజయం సాధించాయి. అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 51 ప్రయత్నాలు జరగ్గా, 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మామ్‌కు అమర్చిన పరికరాలు అంగారక గ్రహ ఉపరితలాన్ని, అక్కడి వాతావరణాన్ని, ఖనిజ సంపదను పరిశీలిస్తాయి. జీవం ఆవిర్భవానికి ఆధారమైన మీథేన్ ఉందా? లేదా? అన్నదానిపై అన్వేషణ సాగుతుంది. అంగారకుడి నుంచి చిత్రాలు, సంకేతాలను కాన్‌బెర్రాలోని నాసా పరిశోధన కేంద్రాలు అందుకుని ఇస్రోకు చేరవేశాయి. 
అంగారక కక్ష్యలోకి మావెన్
అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఒకప్పుడు నీరు, ఉష్ణం ఉన్న అరుణగ్రహం ఇప్పుడు శీతలంగా, పొడిగా ఎందుకు మారిందనే దానిపై ఇది అధ్యయనం చేస్తుంది. మావెన్ అంతరిక్షంలో దాదాపు 10 నెలలపాటు 71.1 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్ 21న అంగారకుడికి చేరువైంది. ఈ గ్రహం ఎగువ వాతావరణంపై పరిశోధన కోసం పంపిన మొట్టమొదటి ఉపగ్రం ఇదే.

స్ట్రాటో ఆవరణకు చేరిన ఇస్రో శాస్త్రవేత్త సురేశ్‌కుమార్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరం నుంచి మిగ్-29లో 17,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ నౌక 45 నిమిషాల్లో 1,850 కి.మీ వేగంతో స్ట్రాటో ఆవరణను చేరింది. రష్యాలోని కంట్రీ ఆఫ్ టూరిజం లిమిటెడ్ అనే స్పేస్ ట్రావెల్ సంస్థ ద్వారా కుమార్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ప్రపంచంలో ఈ యాత్ర చేపట్టిన వారిలో కుమార్ 259వ వ్యక్తి. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అనే ఈ యాత్రను ఆరేళ్ల కిందట ప్రారంభించారు. 

అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతంపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ సెప్టెంబర్ 10న ఒడిశాలోని బాలాసోర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రోడ్డు, రైల్ మొబైల్ లాంఛర్ల నుంచి ప్రయోగించవచ్చు. 1000 కిలోల సంప్రదాయ, అణు ఆయుధాలను మోసుకుపోగలదు. సెకనుకు 2.5 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 15 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి బరువు 12 టన్నులు.

No comments:

Post a Comment