AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మే 2015

సైన్స్ & టెక్నాలజీ మే 2015
యాంటీ సబ్‌మెరైన్ యుద్ధనౌక ప్రారంభం
నాలుగోది, చివరిదైన జలాంతర్గాములను ఎదుర్కొనే (యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్) యుద్ధనౌక కవరట్టీని మే 18న కోల్‌కతాలో ప్రారంభించారు. దీంతో భారత నౌకాదళం కొనుగోలు స్థాయి నుంచి నిర్మాణ స్థాయికి చేరిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ తెలిపారు. ఈ నౌకను 90 శాతం దేశీయంగా నిర్మించారు. ఇది నౌకాదళానికి దేశీయంగా జరుగుతున్న నిర్మాణాల్లో తలమానికం లాంటిది. దీని నిర్మాణాన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ చేపట్టింది. ఢిల్లీలోని డెరైక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ రూపకల్పన చేసింది.
అస్త్ర క్షిపణి పరీక్షలు విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు విజువల్ రేంజ్ అస్త్ర క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ నుంచి మే 20న విజయవంతంగా పరీక్షించారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణులను ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించి పరీక్షించారు. తొలి పరీక్షలో ఈ సూపర్ సోనిక్ క్షిపణిని అత్యంత ఎత్తులో విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. రెండో పరీక్షను మరింత ఎత్తు నుంచి పరీక్షించారు. తాజా పరీక్షలతో ఏడు అభివృద్ధి పరీక్షలు జరిపినట్టయింది. ఈ క్షిపణికి మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత 2016లో వైమానిక దళంలో చేర్చుతారు. ఇది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన అతి చిన్న క్షిపణుల్లో ఒకటి.
రోడ్డుపై దిగిన యుద్ధవిమానం
భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మిరాజ్ 2000ను ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మే 21న విజయవంతంగా దించారు. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా ఉపయోగించుకునేందుకు ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశారు. ఇలా యుద్ధ విమానాన్ని హైవేపై దించడం ఇదే తొలిసారి. దేశమంతటా ఇతర హైవేలపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తారు.
జలాంతర్గామి సింధుకీర్తి జలప్రవేశం
తొమ్మిది సంవత్సరాల మరమ్మతుల అనంతరం జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుకీర్తిని మే 21న విశాఖపట్నంలో జలప్రవేశం చేయించారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ జలాంతర్గామిని ఆధునికీకరించారు. దీనికోసం 2005లో రూ.550 కోట్లు కేటాయించారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఆధునికీకరణ పనులు చేపట్టింది.

2021నాటికి వీనస్ ఉపరితలంపైకి విమానం
శుక్రగ్రహం(వీనస్) ఉపరితలంపైకి తొలిసారిగా ఓ విమానం పంపాలని అమెరికాకు చెందిన ఓ ఏరోస్పేస్ కంపెనీ ప్రణాళిక రచిస్తోంది. ‘వీనస్ అట్మాస్పియరిక్ మాన్యువరబుల్ ప్లాట్‌ఫామ్’ గా పిలిచే దీన్ని 2021 నాటికి శుక్రగ్రహంపైకి పంపాలని యోచిస్తోంది. దీని రెక్కలు 55మీటర్లు ఉంటాయని, గంటకు సుమారు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని ‘నార్త్‌రాప్ గ్రమ్మన్’ అనే కంపెనీ వెల్లడించింది. వీనస్ ఉపరితలంపై నుంచి 50- 70 కి.మీ. ఎత్తులో ఉండి ఆ గ్రహం ఉపరితలాన్ని పరిశీలిస్తుందని తెలిపింది. శుక్ర గ్రహంపై 460 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, నాలుగు గంటలకు పైగా అక్కడ ఉండి సమాచారం సేకరించడం పెద్ద చాలెంజ్ అని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు కన్‌స్టాంటైన్ త్సాంగ్ తెలిపారు.

నౌకా స్థావరం ‘ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్’ ప్రారంభం
వ్యూహాత్మకంగా ప్రాధాన్యత గల కొత్త నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ సర్దార్ పటేల్‌ను గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మే 9న ప్రారంభించారు. ఇది గుజరాత్‌లో రెండో నౌకా స్థావరం. ఓఖా సమీపంలో ఉన్న ఐఎన్‌ఎస్ ద్వారక మొదటి స్థావరం. 1,600 కి.మీ. కోస్తా తీరం గల గుజరాత్‌లో కొత్తగా ప్రారంభించిన రెండో నౌకా స్థావరం మరింత భద్రతను పెంపొందిస్తుందని భారత నౌకాదళ ఉన్నతాధికారులు తెలిపారు. గుజరాత్‌లోని ఓడరేవుల నుంచి ఏడాదికి 300 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.
సైన్యానికి ఆకాశ్ క్షిపణి అప్పగింత
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని మే 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సైన్యానికి అప్పగించారు. 20 కి.మీ. ఎత్తులో 25 కి.మీ. వరకు గగనతలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్‌కు ఉంది. ఈ క్షిపణి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు, ఎక్కడికైనా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆకాశ్‌లో అత్యాధునిక రాడార్లు, కంట్రోల్ వ్యవస్థలు ఉండడంతో క్షిపణిని లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఏ రకమైన వాతావరణ పరిస్థితిలోనైనా ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. ఆకాశ్‌ను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. మూడు దశాబ్దాల కృషితో భారత్ ఆకాశ్‌ను రూపొందించింది. 1984 నుంచి డీఆర్‌డీఓ రూపొందించిన ఐదు క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి. వైమానిక రంగానికి చెందిన క్షిపణి కంటే.. సైన్యానికి చెందిన ఆకాశ్ క్షిపణి ఎటువంటి ప్రమాదాల వైపైనా వేగంగా కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఎడ్యూక్లౌడ్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్
క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలు ఎడ్యూక్లౌడ్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా మే 5న ప్రారంభించింది. దీనిద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిజిటల్ విద్యా సేవలను అందిస్తారు. డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ లెర్నింగ్ ఉంటుంది. ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి కంప్యూటర్ పరికరాల ద్వారా విద్యా బోధన సాగుతుంది. దేశంలో వచ్చే 18 ఏళ్లలో 1500 విద్యా సంస్థల ద్వారా 60 లక్షల విద్యార్థులు, 10 లక్షల బోధకులకు ఈ విధానాన్ని అందిస్తారు.

బుధుడిని ఢీకొన్న మెసెంజర్ ఉపగ్రహం
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన మెసెంజర్ ఉపగ్రహం బుధ (మెర్కూరీ) గ్రహం ఉపరితలాన్ని 2015 ఏప్రిల్ 29న ఢీకొట్టినట్లు అమెరికాలోని జాన్ హప్కిన్‌‌స యూనివర్సిటీలోని మిషన్ కంట్రోల్ ధృవీకరించింది. మెసెంజర్ గత 11 సంవత్సరాలుగా బుధుడి ఉపరితలానికి చెందిన విలువైన సమాచారాన్ని, వేలాది చిత్రాలను అందించింది. మెసెంజర్‌ను 2004 ఆగస్ట్ 3న ప్రయోగించారు. ఇది 2011 మార్చి 18 నుంచి బుధుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన ప్రారంభించింది. 2012 మార్చి నాటికి జీవిత కాలం ముగిసినా ఢీకొనేంతవరకు మెసెంజర్ సేవలు అందించింది. అత్యంత వేడి, రేడియేషన్ తట్టుకొని బుధుడికి 535 కి.మీ. దూరంలో అతి దగ్గరగా తిరుగుతూ నాలుగేళ్ల పాటు పరిశోధన సాగించింది. ఆ గ్రహ అయస్కాంత క్షేత్రం, మంచుతో నిండి ఉన్న బిలాలను గుర్తించింది. బుధుడిని 14 వేల కి.మీ. వేగంతో ఢీకొనడంతో అక్కడ 52 అడుగుల గొయ్యి ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండటంతో అక్కడ అత్యంత వేడి, రేడియేషన్ ఉంటాయి.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్త సతీష్‌రెడ్డికి లండన్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త డాక్టర్ సతీష్‌రెడ్డికి లండన్‌లోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్ (ఆర్‌ఐఎన్) ఫెలోషిప్ లభించింది. ఈ ఫెలోషిప్‌కు భారత్‌కు చెందిన శాస్త్రవేత్త ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇనర్షియల్, శాటిలైట్ ఆధారిత నేవిగేషన్, ఏవియానిక్స్ సాంకేతిక అభివృద్ధిలో మూడు దశాబ్దాలుగా చేసిన కృషికి గానూ ఆయనకు ఈ ఫెలోషిప్ దక్కింది. సతీష్ రెడ్డి డీఆర్‌డీవో పరిశోధన సంస్థ ఇమారత్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు. ఆయన అగ్ని-5 క్షిపణిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
  • 1947లో ఏర్పాటైన రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 450 మందికి ఫెలోషిప్స్ అందజేసింది. ఈ సంస్థ నేవిగేషన్ పరిశోధనలకు పేరు గాంచింది.

సైన్యం అమ్ములపొదిలోకి ‘ఆకాశ్’స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన అత్యంత అధునాతన క్షిపణి ‘ఆకాశ్’ భారత సైన్యంలోకి చేరింది. పూర్తిగా స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణిని మే 5న ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా సైన్యానికి అప్పగించారు. హైదరాబాద్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యం లో దీన్ని రూపొందించారు. జి. చంద్రమౌళి ఆకాశ్ క్షిపణి ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. భారత సైన్యంలో ఆకాశ్ క్షిపణి చేరడంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది.

No comments:

Post a Comment