AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2015

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2015
జలాంతర్గామి కల్వరి జల ప్రవేశం 
జలాంతర్గామి కల్వరిని ముంబైలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు.

గురుగ్రహంపై తగ్గుతున్న ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ 
గురుగ్రహం పైనున్న అతిపెద్ద ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ క్రమక్రమంగా కుంచించుకుపోతోందని నాసా పేర్కొంది. రెడ్‌స్పాట్ క్రమంగా వృత్తాకారంగా మారుతోందని, గ్రహం కేంద్రం స్థానంలో అసాధారణమైన ఫిలమెంటరీ లక్షణం కనిపించిందని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త ఆమీ సైమన్ తెలిపారు.
వృక్ష, డైనోసార్ శిలాజాలు 
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీప్రాంతంలో లక్షల ఏళ్లనాటి వృక్ష, డైనోసార్ శిలాజాలు లభించాయి. రెండు మీటర్ల పొడవైన వృక్ష శిలాజాలతోపాటు, అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపించాయని మూడేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్న చరిత్ర అధ్యాపకుడు రెడ్డి రత్నాకరరెడ్డి వెల్లడించారు. ఓ సూక్ష్మరాతి పనిముట్టు, మూడు అంగుళాల జంతు శిలాజపు పనిముట్టు దొరికాయని తెలిపారు. 
కాకతీయుల నాటి గణేశ్వరాలయం
కాకతీయ రాజు గణపతిదేవుడి కాలం నాటి గణేశ్వరాలయాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగం మాటు వద్ద కనుగొన్నారు. ఆలయానికి సంబంధించిన మూల స్తంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలాశాసనాలపై చెక్కే సూర్య చంద్రుల గుర్తులు బయటపడ్డాయి. ఈ ఆలయం క్రీ.శ. 12, 13వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ తెలిపారు.
చంద్రునిపై భారీ మట్టి దిబ్బను గుర్తించిన శాస్త్రవేత్తలు
చంద్రుడి ఉపరితలంపై అగ్నిపర్వతాన్ని పోలిన భారీ మట్టిదిబ్బను శాస్త్రవేత్తలు గుర్తించారు. మూన్ మినరాలజీ మ్యాపర్ అనే ఉపగ్రహం అందించిన సమాచారాన్ని అధ్యయనం చేసిన బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్రో 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1తో పాటు ఈ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపారు. దీని ప్రకారం అగ్నిపర్వతాన్ని పోలిన ఈ ఆకారం.. దాదాపు 800 మీటర్ల ఎత్తు, 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో దక్షిణ ధ్రువంలోని ‘అట్కిన్ బేసిన్’ అనే భారీ కందకానికి సరిగ్గా మధ్యలో విస్తరించి ఉంది. మాక్ మౌండ్‌లుగా పిలిచే ఈ మట్టిదిబ్బలను తొలిసారిగా 1990లో కార్ల్ పీటర్స్ అనే ప్లానెటరీ జియాలజిస్టు గుర్తించారు. ఇవి పుష్కలమైన కాల్షియం పైరాగ్జిన్‌లతో నిండి ఉండి వాటిపై తక్కువ కాల్షియం ఉన్న రాతి పొరలు ఉంటాయి.
410 కోట్ల ఏళ్ల క్రితమే జీవం పుట్టుక!
భూమిపై 410 కోట్ల సంవత్సరాల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజిలిస్(యూసీఎల్‌ఏ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఇంతకు ముందు భావించిన దానికంటే 30 కోట్ల సంవత్సరాలు ముందుగానే భూమిపై జీవం ఏర్పడి ఉంటుందని అంచనా. 454 కోట్ల ఏళ్ల కిందట భూమి ఆవిర్భావం చెందిన కొద్దికాలానికే జీవం పుట్టుక కూడా సాధ్యమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.
మార్స్‌పై సేద్యానికి పరిశోధనలు
అరుణ (మార్స్) గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త మైకెల్ అలెన్, యూనివర్సిటీ ఆఫ్ ఇదాహో ఫుడ్ సైంటిస్టు హెలెన్ జాయినర్ కలసి ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులను కలుపుకుపోతున్నారు. అక్కడి వాతావరణంలో కార్బన్ (జీవం పెరిగేందుకు ఆధారం), నైట్రోజన్ (చెట్లు ప్రొటీన్ తయారు చేసుకునేందుకు అవసరం) ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నీటి జాడలున్నట్లు అర్థమవుతోంది. వీటి ఆధారంగా అక్కడ వ్యోమగాములు.. వారికి వారే పంటలు పండించుకునే ప్రయత్నం చేయాలని అలెన్ చెప్పారు.

అంగారకుడిపై ఇసుక తిన్నెలు
అంగారకుడిపై ఇసుకు తిన్నెలకు గురించిన చిత్రాలను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విడుదల చేసింది. ఈ చిత్రాలను ఎమ్‌ఆర్‌వో వ్యోమనౌక హైరైజ్ (హై రెజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్‌పరిమెంట్) కెమెరా ద్వారా తీసింది. క్రమక్షయం, ఉపరితల వస్తువుల గమనం, గాలి, వాతావరణ పరిస్థితులు, మట్టి రేణువులు, వాటి పరిమాణం తదితర అంశాల గురించిన సమాచారాన్ని ఈ ఫొటోలు ద్వారా తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. 
జీవిత కాలాన్ని పెంచే జన్యువులు
మనిషి జీవిత కాలం పెంచే దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇటీవల మనిషి వయసును పెంచే 238 జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈస్ట్ కణాలపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ జన్యువులను తొలగించినప్పడు కణాల జీవిత కాలం పెరిగినట్లు గమనించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.
కనిపించని వ్యాధుల జాబితాలో ‘యాస్’!
భయంకరమైన చర్మవ్యాధి ‘యాస్’ను దీర్ఘకాలికంగా కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చనున్నారు. ఈ అంటువ్యాధి 2003 నుంచి మన దేశంలో ఎక్కడా నమోదైనట్లు వివరాలు లేవు. దీంతో యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించి వ్యాధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యాధిని కనుమరుగైన వ్యాధుల జాబితాలో చేర్చునున్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటిస్తోంది.

అంగారకుడిపై నీటి జాడలు గుర్తించిన నాసా
అంగారకుడిపై నీటి జాడలను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సెప్టెంబరు 28న ప్రకటించింది. ఒకప్పుడు అంగారక గ్రహంపై నీరు ప్రవహించిన కారణంగానే లోయలు, కనుమలు ఏర్పడి ఉండవచ్చనే శాస్త్రవేత్తల వాదనకు ప్రస్తుతం ఆధారాలు లభ్యమయ్యాయని నాసా పేర్కొంది. అంగారకుడి ఉపరితలంపై వేసవి నెలల్లో ఉప్పునీటి ప్రవాహాలు సాగి ఉండవచ్చనే విషయాన్ని తొలిసారి శాస్త్రవేత్తలు నిర్దారించారు.

యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి జలప్రవేశంఅతి పెద్ద స్వదేశీ యుద్దనౌక ఐఎన్‌ఎస్ కోచి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా ముంబైలో సెప్టెంబరు 30న జలప్రవేశం చేసింది. ఐఎన్‌ఎస్ కోచి బరువు 7,500 టన్నులు, పొడవు 164 మీటర్లు, నౌక మధ్య భాగం వెడల్పు 17 మీటర్లు. ఇది గంటకు 30 నాటికన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ యుద్దనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సర్లు, నిఘా పరికరాలు, దీర్ఘశ్రేణి లక్ష్యాలను చేధించే క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి.

ఇక్రిశాట్ పంటల జాబితాలోకి రాగులుహైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)’ తాజాగా రాగి పంటను తమ జాబితాలో చేర్చింది. ఇక్రిశాట్ ఇప్పటివరకూ సజ్జలు, జొన్నలు, కంది, శనగ, వేరుశనగలపై తమ పరిశోధనలు కేంద్రీకరించగా, తాజాగా రాగులకూ ప్రాధాన్యం దక్కనుంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇక్రిశాట్ కొత్త రాగి వంగడాలను ప్రవేశపెట్టింది. ఇక్రిశాట్ జన్యుబ్యాంకులో రాగి పంటకు సంబంధించి 24 దేశాల నుంచి సేకరించిన దాదాపు ఆరువేల రకాల వంగడాల జర్మ్‌ప్లాసమ్‌లు పరిశోధనల కోసం అందుబాటులో ఉన్నాయి. 

ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి జలప్రవేశంటొర్పెడోలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి నౌక భారత నావికా దళంలో చేరింది. ప్రయోగించిన టొర్పొడోలను తిరిగి రికవరీ చేయగల సామర్థ్యం కలిగిన అస్త్రధరిణిని తూర్పు నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ విశాఖపట్నం నేవల్ బేస్‌లో అక్టోబర్ 6న ప్రారంభించి జలప్రవేశం చేయించారు. మేకిన్ ఇండియా నినాదంతో 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌక రూపుదిద్దుకుంది. 2015 జూలై 17న సేవలనుంచి విరమించిన అస్త్రవాహినికి అధునాతన సాంకేతికత జోడించి నిర్మాణమైన నౌక అస్త్రధరిణి.

విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహాల ప్రయోగంపౌర విమానాలు, నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లను(క్యూబ్‌శాట్స్) చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్‌హెచ్370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది. ఎస్‌టీయూ-2గా పిలుస్తున్న ఈ క్యూబ్‌శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా, అవి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుఫాన్ తెలిపారు. కేవలం 6.8కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన కెమెరాలు, ‘ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైవలెన్స్ బ్రాడ్‌కాస్ట్(ఏడీఎస్-బి)’ రిసీవర్లను అమర్చారు.

No comments:

Post a Comment