AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2015

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2015
శాస్త్రవేత్తలకు ఆర్యభట్ట అవార్డులు
2013 సంవత్సరానికి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అవినాశ్ చందర్, 2012 సంవత్సరానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ రంగనాథ్ ఆర్.నవల్‌గుంద్‌లను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఆర్యభట్ట అవార్డుల కోసం ఎంపిక చేసింది. డీఆర్‌డీఓ అధిపతిగా, రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేసిన అవినాశ్ చందర్ అగ్ని క్షిపణుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.
యూఏఈలో తొలిసారిగా కృత్రిమ గుండె మార్పిడి
యూఏఈలో తొలిసారిగా కృత్రిమ గుండె మార్పిడి జరిగింది. షార్జా నగరానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థికి దీన్ని అమర్చారు. షార్జాలోని అల్-కిసిమీ ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్రచికిత్సను చేశారు. ‘విద్యార్థికి మరో గుండె లభించే వరకు ఇది అతని ప్రాణాలు కాపాడే వారధి’లా పనిచేస్తుందని కార్డియాక్ సర్జన్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ 1.5 కిలోల గుండెను శరీరంలో 10 ఏళ్లపాటు ఉంచవచ్చు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు పనిచేస్తుంది.

నక్షత్ర మండలానికి రొనాల్డో పేరు
యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న నక్షత్ర మండలానికి పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో పేరు పెట్టారు. రొనాల్డో ముద్దుపేరు సీఆర్7గా నామకరణం చేశారు. ఇప్పటివరకు కనుగొన్న సుదూర నక్షత్ర మండలాల్లో సీఆర్7 చాలా పురాతనమైందని, అన్నిటికన్నా మూడింతలు ఎక్కువ ప్రకాశవంతమైందని శాస్త్రవేత్తలు చెప్పారు. 
రైల్వేకు ‘గగన్’ సాయం
దేశీయంగా అభివృద్ధిపర్చిన గగన్ (జీపీఎస్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ) ద్వారా నావిగేషన్ సేవలను రైల్వేకు అందించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ జూన్ 17న అహ్మదాబాద్‌లో తెలిపారు. కాపలాదారులు లేని రైల్వే గేట్ల దగ్గర భద్రతను కల్పించేందుకు, రైల్వే ట్రాకులు నీట మునిగినప్పుడు గుర్తించేందుకు, పర్వత ప్రాంతాల్లో ట్రాకులను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థతో వీలవుతుందన్నారు. గగన్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఉపయోగిస్తే.. కాపలా లేని రైల్వే క్రాసింగ్ సమీపించగానే ఆటోమేటిక్‌గా సైరన్ మోగుతుందని వివరించారు. 
రోబోనాట్-2కు అవార్డు 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోకి 2011 లో చేరిన తొలి హ్యూమనాయిడ్ రోబో.. రోబోనాట్ - 2 (ఆర్-2)కు 2015 నాసా ఇన్వెన్షన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ రోబో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తూ ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములకు తోడ్పడుతోంది. జనరల్ మోటార్స్‌తో కలిసి నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) దీన్ని రూపొందించింది. ఇది మనిషి మాదిరిగా సులభంగా కదులుతుంది. ఐఎస్‌ఎస్ చుట్టూ తిరుగుతూ మరమ్మతులు చేసేందుకు, స్పేస్ వాక్‌లో వ్యోమగాములకు తోడ్పడేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 
ఇంటర్నెట్.. స్పేస్ టు హోమ్
ఇంటర్నెట్‌కు దూరంగా మారుమూలల్లో ఉన్న 300 కోట్ల మంది కోసం 12 ఉపగ్రహాలతో ‘ఓ3బీ నెట్‌వర్క్స్’ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. భూమి చుట్టూ 8 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ సిగ్నళ్లను ప్రసారం చేసే 12 ఉపగ్రహాలను ఓ3బీ నెట్‌వర్క్స్ మోహరించింది. కొన్ని నెలలుగా ప్రధానంగా భూమధ్య రేఖాప్రాంతంలోని దేశాలు, దీవులకు ఈ ఇంటర్నెట్ సేవ లను అందిస్తోంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్‌ను చవకగానే అందించడం దీని ప్రత్యేకత. ఈ శాటిలైట్ నెట్‌వర్క్ నుంచి భూగోళంపై 70 శాతం ప్రాంతాలు కవర్ అవుతాయని ఓ3బీ నెట్‌వర్క్స్ వ్యవస్థాపకుడు గ్రెగ్ వీలర్ వెల్లడించారు. 
చైనా ఎలక్ట్రిక్ విమానం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాన్ని చైనా తయారు చేసింది. షెన్‌యాంగ్ ఏరోస్పేస్ యూనివర్సిటీ, లియోనింగ్ జనరల్ ఏవియేషన్ అకాడమీ ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించాయి. ‘బీఎక్స్1ఈ’గా పిలిచే ఈ విమానం 3వేల మీటర్ల ఎత్తులో ఎగరగలదు. 230 కిలోల బరువు మోసుకుపోగలదు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ ఎలక్ట్రిక్ విమానానికి రెండు గంటల లోపే పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక సారి చార్జి చేస్తే 45 నిమిషాల నుంచి గంట వరకు ప్రయాణింవచ్చు. 
భారత్‌లో తొలి ఏసీ డెమూ రైలు ప్రారంభం
భారత దేశపు మొట్టమొదటి డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు జూన్ 21న కేరళలోని కోచిలో ప్రారంభించారు. ఎర్నాకుళం జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో సురేశ్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. డెమూ సర్వీస్‌తో నడిచే ఈ రైలులో ఏసీ సౌకర్యం కల్పించామని త్వరలోనే మరిన్ని ఇలాంటి రైళ్లను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ రైలులో బయో టాయ్‌లెట్లను ఏర్పాటుచేశారు.

ఎస్-200 మోటారు భూస్థిర పరీక్ష విజయవంతం
భారీ ఉపగ్రహ ప్రయోగాలకు తోడ్పడే ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌కు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో జూన్-14న జరిపిన పరీక్ష విజయవంతమైంది. ఎస్-200 ఘన ఇంధన మోటారు సామర్థ్యం విశ్లేషణకు ఈ భూస్థిర పరీక్ష నిర్వహించారు. ఈ మోటారును 2016లో ఇస్రో ప్రయోగించనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3(డీ1) వాహన నౌకలో ఉపయోగించనున్నారు. ఈ ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌ల ద్వారా 3-5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు.

సంయుక్త క్షిపణిని పరీక్షించిన అమెరికా, జపాన్
అమెరికా, జపాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎమ్-3 క్షిపణిని కాలిఫోర్నియా తీరంలో జూన్ 6న విజయవంతంగా పరీక్షించారు. ఇది బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీన్ని రూ.12,800 కోట్లతో అభివృద్ధి చేశారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించి 2018లో అమెరికా, జపాన్ తీర రక్షణ దళాల్లో ప్రవేశపెట్టనున్నారు.

No comments:

Post a Comment