AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2015

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2015
జీశాట్-6 ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ఆగస్టు 27న ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించిన జీఎస్‌ఎల్‌వీ- డి6 రాకెట్ జీశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరవేసింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌ను జీఎస్‌ఎల్‌వీకి ఉపయోగించడం ఇది మూడోసారి. అధిక బరువు గల ఉపగ్రహాలను ప్రయోగించడానికి క్రయోజెనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. ఈ ఇంజన్లు రూపొందించే సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ దేశాలకే ఉంది. ప్రస్తుతం భారత్ ఈ దేశాల జాబితాలో చేరింది. సమాచార ఉపగ్రహమైన జీశాట్-డి6 2,117 కిలోల బరువు ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా అధునాతన డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

ఆగస్టు 27న జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆగస్టు 27న సాయంత్రం 4.52 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు అన్ని పరీక్షలు జరిపి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా బోర్డు నిర్వహించింది. ఆగస్టు 26 మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి, 29 గంటల తర్వాత ఆగస్టు 27 సాయంత్రం 4.52కు ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించారు.
దేశంలోనే తొలి ‘లిచీస్’ జన్యు బ్యాంక్
లిచీస్ ఫలాలను(వేసవిలో లభ్యమయ్యే తియ్యటి పండ్లు) పరిరక్షించేందుకు, నాణ్యతను పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో లిచీస్ జన్యు బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి అనుమతులు లభించిన వెంటనే బ్యాంకును ఏర్పాటు చేస్తామని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ లిచీ(ఎన్‌ఆర్‌సీఎల్) డెరైక్టర్ విశాల్‌నాథ్ వెల్లడించారు. లిచీస్‌ను పరిరక్షించడంలో భాగంగా జన్యు వనరులు అందుబాటులో ఉండేలా ఈ బ్యాంకును ఏర్పాటుచేస్తున్నారు.

అంగారకుడు, చంద్రుడిపైకి నాసా డ్రోన్లు?
అంగారక గ్రహం, చంద్రుడు, వంటి వాటిపై ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు డ్రోన్లను ప్రయోగించాలని నాసా భావిస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ప్రయోగించిన రోవర్లు ఇక్కడ దిగలేదు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్లను వాటిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.
ఇస్రో టైటానియం ప్లాంట్ ప్రారంభం
అంతరిక్ష ప్రయోగాలకు వాడే రాకెట్లు, ఉపగ్రహాలు, రక్షణ పరికరాల తయారీలో వినియోగించే టైటానియం స్పాంజ్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఆగస్టు 10 నుంచి వాణిజ్య స్థాయిలో పని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా కేరళలోని చవరాలో ఇస్రో ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది. తమకు ఏటా దాదాపు 300 టన్నుల టైటానియం స్పాంజ్ అవసరం ఉంటుందని వెల్లడించింది.
గ్లోబల్ శాటిలైట్‌కు కలాం పేరు
మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ఓ గ్లోబల్ శాటిలైట్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. భూమి పరిశీలన, ప్రకృతి విపత్తుల నష్టం తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రయోగించనున్న ‘గ్లోబల్‌శాట్ ఫర్ డీడీఆర్’కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని కానియస్(సీఏఎన్‌ఈయూఎస్- కెనడా, యూరప్, యూఎస్, ఏసియా) చైర్మన్ మిలింద్ పింప్రికర్ వెల్లడించారు. కలాం గౌరవార్థం ఈ ఉపగ్రహానికి ‘యూఎన్ కలాం గ్లోబల్‌శాట్’గా పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
ఐఎస్‌ఎస్ వ్యోమగాముల స్పేస్‌వాక్ విజయవంతం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు విజయవంతంగా స్పేస్‌వాక్ చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. ఎక్స్‌పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ఫ్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకో ఆగస్టు 10వ తేదీన 5 గంటల 31 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా వారు ఐఎస్‌ఎస్ కిటికీలను శుభ్రం చేయడం, కొత్త యాంటెన్నా అమర్చడం, మొత్తం ఐఎస్‌ఎస్ బాహ్య భాగాన్ని ఫొటోగ్రాఫిక్ సర్వే చేయడం వంటి పనులు చేసినట్లు వివరించింది. గెన్నడీ పడల్కాకు ఇది తొమ్మిదో స్పేస్‌వాక్ కాగా, కోర్నియెంకో చేయడం ఇది రెండోసారి. రష్యాకు చెందిన ఒలెగ్ కొనొనెంకో, స్కాట్ కెల్లీ(నాసా), జెల్ లింగ్డ్రెన్, కిమియా యూ(జపాన్) వ్యోమగాములు ఐఎస్‌ఎస్ లోపలి నుంచి స్పేస్‌వాక్‌ను పర్యవేక్షించారు.

ఎబోలా వ్యాధికి టీకా కనుగొన్న కెనడా
ఎబోలా వైరస్‌కు టీకా అభివృద్ధి చేసినట్లు, ఇందుకు సంబంధించి పరిశోధన పరీక్షల్లో నూరు శాతం కచ్చితత్వం కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జూలై 30న వెల్లడించింది. కెనడాకు చెందిన పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఈ టీకాను అభివృద్ధి చేసింది.

చైనాలో అతిపెద్ద దోమల పరిశ్రమడెంగీ జ్వరాలను అదుపుచేసేందుకు సంతానోత్పత్తి నిరోధక దోమల ఉత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద దోమల పరిశ్రమను చైనా వాయువ్య గువాంగ్‌సౌ ప్రావిన్సులో ఏర్పాటుచేసింది. డెంగీ జ్వరాలను నివారించేందుకు వారానికి పది లక్షల సంతానోత్పత్తి నిరోధక దోమలను ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసి విడుదల చేస్తారు. ఇటువంటి దోమలను షాజీ ద్వీపంలో ప్రతివారం విడుదల చేస్తున్నారు. ఇందువల్ల డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమల సంఖ్య తగ్గిపోతుంది. గతేడాది చైనాలో 47 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీనికి ఇంతవరకు టీకా, చికిత్సా లేదు. 

యురేనస్ పరిమాణంలోని గ్రహం గుర్తింపుసౌరకుటుంబం ఆవల యురేనస్ పరిమాణంలో ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. తన నక్ష త్రానికి సుదూరంగా పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని ‘గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్’ ప్రక్రియ ద్వారా కనుగొన్నారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్, హవాయ్‌లోని డబ్ల్యూఎమ్ కెక్ అబ్జర్వేటరీలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ గ్రహం.. తన నక్షత్రం చుట్టూ 370 మిలియన్ మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ఇంచు మించు సూర్యుడికి, గురు గ్రహానికి మధ్యనున్న దూరంతో సమానమని తెలిపారు. ఇక ఆ నక్షత్రం సూర్యుడి కన్నా సుమారు 70 శాతం పెద్దదని చెప్పారు. అందుబాటులో ఉన్న గ్రహ శోధన ప్రక్రియల కారణంగా ఇప్పటి వరకూ నక్షత్రాలకు దగ్గరగా పరిభ్రమిస్తున్న గ్రహాలనే ఎక్కువగా గుర్తించారు. సుదూరంగా పరిభ్రమిస్తున్న నక్షత్రాలను గుర్తించడానికి గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ ప్రక్రియ వీలు కల్పిస్తుంది. 

కొత్త సైకస్ జాతులను గుర్తించిన భారత శాస్త్రవేత్తలుజురాసిక్ యుగం (సుమారు 201 మిలియన్-145 మిలియన్ ఏళ్ల క్రితం) నాటి రెండు కొత్త సైకస్ జాతి మొక్కలను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్త విశ్వవిద్యాలయానికి చెందిన సైకడాలజిస్ట్ రీతా సింగ్, ఆమె విద్యార్థులు పి. రాధా(ఉస్మానియా యూనివర్సటీ, హైదరాబాద్), జేఎస్ ఖురైజామ్(ఎన్‌బీఆర్‌ఐ, లక్నో)లు ఈ కొత్త సైకస్ జాతులను ఒడిశాలో కనుగొన్నారు. ఎనిమిదేళ్లుగా వీరు ఆ రాష్ట్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సైకస్ జాతి మొక్కలను పురాతనమైనవిగా, బతికి ఉన్న శిలాజాలుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 111 జాతుల సైకస్ మొక్కలను గుర్తించగా అందులో మనదేశంలో తొమ్మిది ఉన్నాయి. కొత్తగా రెండు జాతులను గుర్తించడంతో ఆ సంఖ్య 11కి చేరింది.

పాకిస్తాన్‌కు సెర్న్‌లో సభ్యత్వంభౌతికశాస్త్రంలో కీలక పరిశోధనలు చేస్తున్న యూరప్ అణు పరిశోధన సంస్థ(యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్)లో పాకిస్తాన్ జూలై 31న అసోసియేట్ సభ్యదేశంగా చేరింది. సెర్న్‌లో అసోసియేట్ సభ్యత్వ హోదా పొందిన మొదటి యూరపేతర, మొదటి ఆసియా దేశంగా పాక్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం, శాంతియుత ప్రయోజనాలకు అణు ఇంధన వినియోగం వంటి అంశాలకు గుర్తింపుగా పాక్‌కు ఈ హోదా లభించినట్లు సెర్న్ ప్రకటించింది.

భూమికి చేరువగా వచ్చిన ఆస్టరాయిడ్వేరశనగ ఆకారంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్ ఆగస్టు 1న భూమికి అత్యంత చేరువగా వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు గుర్తించారు. 1999 జేడీ6గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ జూలై 24న భూమికి 7.2 మిలియన్ కిలోమీటర్ల చేరువకు వచ్చిందని ఈ దూరం భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 19 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. మళ్లీ 2054లో ఒక ఆస్టరాయిడ్ భూమికి ఇంత చేరువగా వస్తుందని అంచనా.

No comments:

Post a Comment