AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2014

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2014
బ్రహ్మోస్ విజయవంతం
యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత్ జూన్ 9న కర్ణాటకలోని కర్వార్ తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. 290 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా ఛేదించగలదు.

నౌకా దళంలోకి ఐ.ఎన్.ఎస్. కమోర్తా
భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐ.ఎన్.ఎస్ కమోర్తా అనే అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేసింది. ఈ యుద్ధనౌక సముద్రంలో నిశ్శబ్దంగా కదిలే శత్రు జలాంతర్గాములను కనిపెట్టగలదు. జలాంతర్గాములను పేల్చివేసే స్వదేశీ రాకెట్ లాంచర్ కూడా తొలిసారి కమోర్తా యుద్ధనౌకకు కల్పించారు. ఈ నౌకలో ఉన్న బౌమౌంటెడ్ సోనార్ నీటి లోపల మరింత మెరుగైన పరిశీలన చేయగలదు. తొలిసారి ఉపరితల, వాయు నిఘాకోసం రేవతి అనే స్వదేశీ రాడార్‌ను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ నిర్మించింది. దీని బరువు 3,400 టన్నులు. పొడవు 109 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు. గరిష్ఠంగా 25 నాట్‌ల వేగంతో ప్రయాణించగలదు. కదమత్, కిల్టాన్, కవరత్తి అనే మరో మూడు యుద్ధనౌకలను గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించనుంది.

రెండో పెద్ద టెలిస్కోప్ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రూపకల్పన చేసింది. దీనికి మ్యాజిక్ అట్మాస్ఫిరిక్ చెరింకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) అని పేరుపెట్టింది. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మేస్ టెలిస్కోప్‌ను జూన్ 28న హైదరాబాద్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు తరలించారు. మేస్ నిర్మాణ వ్యయం రూ.45 కోట్లు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. సూర్యుని నుంచి వెలువడే గామా కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయి. 21 మీటర్ల ఎత్తు, 180 టన్నుల బరువుండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా-26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్ధ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది. 

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ23 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. జూన్ 30న శ్రీహరికోటలోని షార్ వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ23 ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం స్పాట్-7 తోపాటు కెనడా, సింగపూర్, జర్మనీలకు చెందిన మరో నాలుగు బుల్లి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీల వరుసలో ఇది 27వది. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 23 పొడవు 44.4 మీటర్లు, బరువు 230 టన్నులు. ఈ రాకెట్ తన వెంట 765 కిలోల బరువుగల ఉపగ్రహాలను, ఇస్రోకు చెందిన 60 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లింది.

No comments:

Post a Comment