AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2015

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2015
విజయవంతమైన అగ్ని-3 పరీక్ష
అణ్వస్త్రాలను మోసుకుపోగల క్షిపణి అగ్ని-3ని భారత్ ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో గల పరీక్షా కేంద్రం నుంచి ఏప్రిల్ 16న విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి పనితీరును నిర్ధారించేందుకు సైన్యం ఈ పరీక్ష నిర్వహించింది. అగ్ని-3 క్షిపణి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 1.5 టన్నుల ఆయుధాలను మోసుకుపోగలదు. ఇందులో ఘన ఇంధనంతో పనిచేసే రెండంచెలు ఉంటాయి. పొడవు 17 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు, బరువు 50 టన్నులు. ఈ క్షిపణిలో హైబ్రిడ్ నేవిగేషన్, దిశానిర్దేశ నియంత్రణ వ్యవస్థలు, అధునాతన ఆన్‌బోర్డు కంప్యూటర్ వ్యవస్థలు ఉన్నాయి.
యుద్ధనౌక ‘విశాఖపట్నం’ జల ప్రవేశం
ఆధునిక యుద్ధనౌక విశాఖపట్నాన్ని ఏప్రిల్ 20న ముంబైలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ సతీమణి మిను ధోవన్ జల ప్రవేశం చేయించారు. దీన్ని 2018లో లాంఛనంగా నౌకాదళంలో చేరుస్తారు. ఒక యుద్ధనౌకకు విశాఖపట్నం పేరు పెట్టడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కోల్‌కత తరగతికి చెందింది. పి-15బి స్టెల్త్ డెస్ట్రాయిర్ల శ్రేణిలో మొదటిది. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలంలోకి లక్ష్యాలను ఛేదించగల సూపర్‌సోనిక్ క్షిపణులను అమరుస్తారు. 
యూట్యూబ్‌లో మరో 15 భాషలు
వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూ ట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు చేరాయి. దీంతో తమ మాతృభాషలోనే వెబ్‌సైట్‌ను వీక్షించే అవకాశమున్న భాషల సంఖ్య 76కు చేరింది. 
ప్రపంచంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు తాము అందుబాటులోకి వచ్చినట్లు యూ ట్యూబ్ ప్రకటించింది. సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ డెవలపర్లు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. 
యూ ట్యూబ్‌లో కొత్తగా చేరిన భాషలు... 
అజర్‌బైజాన్, ఆర్మేనియన్, జార్జియన్, ఖజక్, ఖ్మేర్, కిర్గిజ్, లావో, మాసిడోనియన్, మంగోలియన్, మైన్మార్(బర్మా), నేపాలీ, పంజాబీ, సింహళ, ఆల్బేనియన్, ఉజ్బెక్.


దనుష్ పరీక్ష విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకుపోగల బాలిస్టిక్ క్షిపణి ధనుష్‌ను భారత్ ఏప్రిల్ 9న ఒడిశా తీరంలో యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
అశ్విన్ క్షిపణి పరీక్ష విఫలం
ఆధునికీకరించిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) ఇంటర్‌సెప్టెర్ క్షిపణి అశ్విన్ పరీక్ష విఫలమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఏప్రిల్ 6న చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగంలో మంటలు చెలరేగడంతో కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. 20 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అడ్డుకునేందుకు దీన్ని ప్రయోగించారు. ఇప్పటివరకు ఇలాంటి ఏడు పరీక్షలు నిర్వహిస్తే అందు లో ఐదు విజయవంతమయ్యాయి. దీని ఎత్తు 7.5 మీటర్లు, బరువు 1.2 టన్నులు, వ్యాసం 0.5 మీటర్లు.

రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
ప్రాణాంతక ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఓ కొత్త, సమర్థమైన హోమియో ఔషధం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు, ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్-బి కారక వైరస్‌ల వ్యాప్తిని నిరోధించే ఈ ఔషధం తయారీపై వీరి పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. రక్తపింజర(క్రొటాలస్ హెరిడస్) విషం ఆర్‌టీ అనే ఎంజైమ్‌ను నిరోధించగలదని వీరు ఇదివరకే శాస్త్రీయంగా నిరూపించారు. ఏప్రిల్ 2, 2015న హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రథమ ఎస్. మెయింకర్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్‌లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. క్రోటాలస్ హెరిడస్ విషానికి ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు తెలిపారు. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చి, దానిని అభివృద్ధి చేసి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్- బి వంటి వైరస్‌ల బారి నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

షుగర్ వ్యాధిని నియంత్రించే వరి వంగడం తయారీషుగర్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో దోహదపడే ఆర్‌ఎన్‌ఆర్ 15048 అనే వరి వంగడాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) వచ్చే ఖరీఫ్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే కొందరు రైతులు సాగు చేస్తున్న ఈ వంగడాన్ని అధికారికంగా విడుదల చేసి, విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వర్సిటీ ప్రత్యేకాధికారి డా. వి.ప్రవీణ్‌రావు తెలిపారు. గ్లుటామిన్ ఇండెక్స్ (జీఐ) ఎంత ఎక్కువ ఉంటే మధుమేహ రోగులకు ఆ బియ్యం అంత మేలైనవిగా భావిస్తారు. సాధారణ వరి వంగడాల్లో 35-36 వరకు జీఐ ఉంటుంది. ఈ రకాల బియ్యం రక్తంలో చక్కెర నిల్వల పెంపుదలకు కారణమవుతున్నాయన్నారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడంలో ఇది 56 వరకు ఉందని జాతీయ పోషకాహార సంస్థలో జరిపిన పరీక్షల్లో తేలిందన్నారు. బీపీటీ బియ్యంలో 51 వరకు జీఐ ఉంటుందన్నారు.

No comments:

Post a Comment