*స్వాగతిస్తున్నాయ్... ఉపాధ్యాయ ఉద్యోగాలు!*
*తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ప్రకటన విడుదలయింది!*
స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీ (వ్యాయామ విద్య ఉపాధ్యాయులు), భాషా పండితుల పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ లక్ష్యసాధనకు సమగ్ర ప్రణాళికతో ముందుకుసాగాల్సివుంది. అందుకు ఉపకరించే కథనం ఇదిగో..!
*తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. కొత్త జిల్లాల ప్రాతిపదికగా 31 జిల్లాల్లో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.*
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 30.10.2017
* దరఖాస్తు స్వీకరణ చివరి గడువు: 30.11.2017
* ఫిబ్రవరి-2018 రెండోవారంలో ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా/ ఆఫ్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.tspsc.gov.in
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ఆధార్ నంబరు, విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం మొదలైనవాటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ దరఖాస్తులో వెల్లడించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుదారుడు ఏ మాధ్యమంలో ఉద్యోగానికి అర్హత పొంది ఉంటే, దానిలోనే పరీక్ష రాయవలసి ఉంటుంది. ఉదా: ఉర్దూ మీడియం టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఆ భాషలోనే ప్రశ్నపత్రం అందుబాటులో ఉంటుంది.
వయసు: 01.07.2017 నాటికి కనిష్ఠ వయసు- 18 సంవత్సరాలు; గరిష్ఠ వయసు- 44 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్ వారికి గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200. దీనిలో ఎవరికీ మినహాయింపు లేదు. పరీక్ష ఫీజు ప్రతి ఉద్యోగానికీ రూ.80. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఇతర వర్గాలకు చెందిన నిరుద్యోగులకు మినహాయింపు ఉంది. ఫీజును ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ ఈ-పే ద్వారా చెల్లించవచ్చు.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
విద్యార్హతలు
1) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులతో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా అర్హత పొందాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్‌లకు కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత అవసరం. బీఈడీలో ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
2) సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 10+2 స్థాయిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత పొందివుండాలి (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్‌లకు కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత పొందివుండాలి). దాంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణతా ఉండాలి.
గమనిక: 2007కు పూర్వం అభ్యర్థులు 10+2 స్థాయిలో 45% మార్కులతో ఉత్తీర్ణత (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్‌లకు 40% మార్కుల ఉత్తీర్ణత) పొందివున్నా అర్హులే.
3) ఏపీ టెట్/ టీఎస్ టెట్/ సీ టెట్ ల్లో క్వాలిఫై అయ్యుండాలి. ఏపీ టెట్ స్కోరు 02.06.2014 నాటికి పొందినవారివి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌జీటీ అభ్యర్థులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పేపర్-2 స్కోరు పరిగణనలోకి తీసుకుంటారు.
గమనిక: పీఈటీ, పీడీ ఉద్యోగాలకు తప్ప మిగతా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్ష మార్కులకు 80%, టెట్ స్కోరుకు 20% వెయిటేజీల ఆధారంగా మెరిట్ జాబితాలో ర్యాంకును నిర్ణయిస్తారు.
పీఈటీ, పీడీ ఉద్యోగాలకు పూర్తిగా రాతపరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలో ర్యాంకు నిర్ణయిస్తారు. టెట్ స్కోరు 150 మార్కులకుగానూ ఓసీ వారు 90, బీసీ వారు 75, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీహెచ్ అభ్యర్థులు 60 మార్కులు పొందివుండాలి.
ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాల్లోని అభ్యర్థులు నాన్ లోకల్ కోటాలో 20 శాతం పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
సెకండరీ గ్రేడ్ టీచరు ఉద్యోగాలకు 80 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం- 2.30 గంటలు.
ఎస్‌జీటీ
1. జీకే, కరెంట్ అఫైర్స్- 10 మార్కులు
2. విద్యా దృక్పథాలు (పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్)- 10 మార్కులు
3. ప్రథమ భాష- 9 మార్కులు
4. ద్వితీయ భాష (ఆంగ్లం)- 9 మార్కులు
5. కంటెంట్ (మేథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్)- 09x3= 27 మార్కులు
6. టీచింగ్ మెథడాలజీ (డీఈడీ, తెలంగాణ రాష్ట్ర సిలబస్ ప్రకారం)- 15 మార్కులు
* సైన్స్ సిలబస్‌లో 1-5 తరగతుల పరిసరాల విజ్ఞానం, 6, 7 తరగతుల జనరల్ సైన్స్, 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ ఉంటాయి.
* సోషల్ స్టడీస్‌లో 1-5 తరగతుల పరిసరాల విజ్ఞానం, 6-8 తరగతుల సోషల్ స్టడీస్ సిలబస్ ఉంటుంది.
స్కూల్ అసిస్టెంట్లు
సమయం- 2.30 గంటలు; మార్కులు- 80; ప్రశ్నలు- 160.
1. జీకే, కరెంట్ అఫైర్స్- 10 మార్కులు
2. పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్- 10 మార్కులు
3. కంటెంట్ (గణితం/ ఫిజికల్ సైన్స్/
బయలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్)- 44మార్కులు
4. టీచింగ్ మెథడాలజీ (బీఈడీ కోర్సులో ఎంచుకున్న మెథడాలజీ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల్లోని సిలబస్ ఆధారంగా)- 16 మార్కులు
గమనిక: కంటెంట్ తెలంగాణ రాష్ట్ర సిలబస్ ప్రకారం 6-10 తరగతుల సన్నద్ధత అవసరం. అయితే ప్రశ్నల కఠినతాస్థాయి ఇంటర్మీడియట్/ 10+2 స్థాయి వరకు ఉంటుంది.
తాజా నియామకాలకు ఏ ప్రత్యేకతలు?
* మొదటిసారిగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించడం
* నూతన జిల్లాల ప్రాతిపదికన పోస్టుల్లో నియమించటం
* స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రూప్-2 స్థాయి జీతభత్యాలుండటం, ఆ తర్వాత పదోన్నతిపై గెజిటెడ్ హెడ్మాస్టర్, ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్ లాంటి గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ పోస్టులున్నా పోటీ ఎక్కువ ఉన్నా ఒక ఉద్యోగం నాదే అనే ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత ప్రారంభించండి.
* తెలుగుమీడియం టీచర్ ఉద్యోగాలతోపాటు ఉర్దూ, కన్నడ, తమిళం, హిందీ మీడియం పోస్టుల భర్తీ...ఆ మీడియంలో అర్హతున్నవారికి మంచి అవకాశమని చెప్పవచ్చు.
ఇలా సన్నద్ధం కావాలి
* తొలిసారిగా టీఎస్‌పీఎస్‌సీ నిర్వహిస్తున్నందున జీకే, కరంట్ అఫైర్స్‌లలో వివిధ రకాల పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. అనుగుణంగా సన్నద్ధత ఆరంభించాలి.
* పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ప్రామాణిక సిలబస్ అధ్యయనం అవసరం. తెలుగు అకాడమీ పుస్తకాలు, నాణ్యమైన మెటీరియల్‌ను ఎంచుకుని అభ్యసించాలి.
* కంటెంట్, భాషలు (తెలుగు, ఆంగ్లం)కు సంబంధించి గత డీఎస్‌సీ ఉపాధ్యాయ పరీక్షల, టెట్ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
* మెథడాలజీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణీత సిలబస్ మేరకు తెలుగు అకాడమీ పుస్తకాలను అనుసరించవచ్చు.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రాథమిక భావనలపై పూర్తిగా పట్టు పెంచుకోవాలి.
* ఫిబ్రవరిలో పరీక్ష ఉండవచ్చు కాబట్టి జనవరి చివరినాటికి సన్నద్ధత పూర్తిచేయాలి. ఆ తర్వాత నమూనా పరీక్షలు సాధన చేయడం, తప్పులను సవరించుకోవడం ముఖ్యం.
రిఫరెన్స్ పుస్తకాలు
1. టీఎస్ తెలుగు అకాడమీ పుస్తకాలు (కంటెంట్ కోసం)
2. ఆర్‌టీఈ-2009, ఎన్‌సీఎఫ్‌డబ్ల్యూ-2005 మాడ్యూళ్లు
3. డీఈడీ, బీఈడీ తెలుగు అకాడమీ బోధనాశాస్త్రాల పుస్తకాలు
ఈ రోజు నుంచే క్రమం తప్పకుండా సిలబస్ ఆధారంగా ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో అభ్యసనాన్ని విశ్లేషణాత్మకంగా కొనసాగించి, మాదిరి ప్రశ్నపత్రాల నిరంతర సాధన, సవరణాత్మక అభ్యసనం కొనసాగిస్తే.. అభ్యర్థులూ.. విజయం మీదే!
టీఆర్‌టీ సిలబస్, పూర్వ ప్రశ్నపత్రాలు, మెటీరియల్ కోసం www.eenadupratibha.net ను చూడండి.
No comments:
Post a Comment