AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

పథకాలు Schemes ఏపీలో స్మార్ట్ విలేజ్, వార్డులకు శ్రీకారం

ఏపీలో స్మార్ట్ విలేజ్, వార్డులకు శ్రీకారం

హైదరాబాద్: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పల్లె సీమలకు కొత్త హంగులు చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆధునిక వసతులతోపాటు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనీస సదుపాయాలు, సామాజిక వసతులు కల్పించాలని నిర్ణయించింది.
ఈ మేరకు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్నులో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాదయాత్రలు చేశారు. జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీలను, వార్డులను మూడు రకాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. 5 వేల జనాభా ఉన్న గ్రామాలు, వార్డులను అధికారులు, దాతలు, వ్యక్తులు; 10 వేల జనాభా ఉన్న గ్రామాలు, వార్డులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు; అలాగే 10 వేల జనాభా ఉన్న గ్రామాలు, వార్డులను కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజులపాటు కొనసాగనుంది.

ఏం చేస్తారు? 
రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామాలు, 3,465 వార్డులను దత్తత ఇవ్వనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆయా గ్రామాలు, వార్డులను 20 అంశాల్లో రాజీపడకుండా తీర్చిదిద్దాలి. అప్పుడు ఆ గ్రామాలను, వార్డులను స్మార్ట్ గ్రామాలు, వార్డులుగా ప్రకటిస్తారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, దత్తత తీసుకునే ఇతర ప్రతినిధులతో వర్క్‌షాపు నిర్వహించి వారి నుంచి వచ్చిన సూచనలు, సలహాలను వెంటనే తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. గ్రామాలను దత్తత తీసుకోవడానికి అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్ సంస్థలు, సినీ రంగానికి చెందిన వారు, మీడియా, పేరు, ప్రతిష్ఠలు గల స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఏదైనా ఒక గ్రామం లేదా వాడను స్మార్ట్‌గా ప్రకటించేందుకు 20 సామాజిక, మానవాభివృద్ధి అంశాల్లో చూపిన సామర్థ్యం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం జిల్లాకు ఇద్దరు సమన్వయ అధికారులను ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 అధికారులను పంచాయతీకి ఒకరు చొప్పున నియమించారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం గమనార్హం.

20 లక్ష్యాలు ఇవే
1. ప్రతి కుటుంబానికీ జీవనోపాధి అవకాశాలు
2. అందరికీ గృహ, మరుగుదొడ్లు, రక్షిత నీరు, విద్యుత్తు
3. నూరు శాతం ఆసుపత్రి కాన్పులు
4. పోషకాహార లోపాన్ని నివారించడం.
5. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, స్కూల్ డ్రాపవుట్స్ నివారణ
6. నూరు శాతం అక్షరాస్యత
7. బాల్యవివాహాలు జరగకుండా చూడటం
8. అంగన్‌వాడీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం, పంచాయతీ కార్యాలయాల్లో మరుగుదొడ్లు నిర్మించడం
9. పైన పేర్కొన్న వాటిల్లో తాగునీరు, విద్యుత్తు అందుబాటులో ఉంచడం
10. స్వయం సహాయక సంఘాల సభ్యులకు, నిరుద్యోగులకు సాంకేతికాభివృద్ధి సామర్థ్యం పెంపొందించడం, జీవనోపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతుల కల్పన
11. సంవత్సరంలో 4 పర్యాయాలు 2/3 శాతం హాజరుతో గ్రామ సమావేశాల ఏర్పాటు
12. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా
13. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి భూసార పరీక్షకార్డు
14. నూతన సాంకేతిక పద్ధతులు, వినూత్న విధానాలు
15. రహదారికి ఇరువైపులా గట్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పెంపకం
16. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం (ఇంకుడు గుంతలు, పర్కులేషన్ ట్యాంకులు)
17. గ్రామ సమాచార కేంద్రం, మీ-సేవ కార్యక్రమం, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ప్రోత్సహించడం
18. గ్రామ సమాచార కేంద్రంలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం
19. సౌరశక్తి, ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం
20. ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం


No comments:

Post a Comment