AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

ఇతర వివరాలు Other details విద్యాహక్కు చట్టం.. పూర్వాపరాలు

విద్యాహక్కు చట్టం.. పూర్వాపరాలు

నిర్బంధ విద్య అమలు చేయాలని సంకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2010, ఏప్రిల్ 1న ‘విద్యాహక్కు చట్టం’ తీసుకొచ్చింది.
బడి బయట ఉన్న పిల్లలను తిరిగి చదువుల బాట పట్టించడం, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించడం, 6-14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశాలు.

ఈ చట్టం అమలుకు నోచుకోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయి. ‘సర్వశిక్షా అభియాన్’ పథకం కింద కేంద్రం మౌలిక సదుపాయాలు కల్పించినా గ్రామీణ పాఠశాలల్లో వసతుల అంశం అందని ద్రాక్షగానే మారింది. విద్యాహక్కు చట్టం ఏర్పడి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలు, ఇతర విశేషాలు తెలుసుకుందాం.

చట్టం ఎప్పుడొచ్చింది? 
విద్య ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్‌ఈఏ) తీసుకొచ్చింది. దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు 2009, జూలై 2న ఈ చట్టానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే ఏడాది జూలై 20న బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీని ద్వారా భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. ఇది 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయి.

ప్రాధాన్య అంశాలేంటి? 
1. 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ ఒకటో తరగతిలో చేర్పించడం
2. బడి బయట పిల్లలు, బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించడం
3. బాలికా విద్యను ప్రోత్సహించడం
4. 100 శాతం విద్యార్థులను, కింది తరగతుల నుంచి పైతరగతులకు పంపడం
5. ప్రత్యేక అవసరాల పిల్లలకు అందరితో సమానంగా విద్యనందించడం
6. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాల వారిపై ప్రత్యేక శ్రద్ధ
7. అందరికీ విద్యనందించే దిశగా అడుగులు వేయడం
8. నాణ్యమైన విద్యనందించడం.
ఏం చెబుతోంది? 
1. ఆరు నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు విద్య ప్రాథమిక హక్కుగా చేయడం.
2. ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించాలి. పాటించని స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తారు.
3. అన్ని ప్రైవేటు పాఠశాలలు పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు రిజర్వు చేయాలి.
4. పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం, పిల్లలు లేదా వారి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం నిబంధనలకు విరుద్ధం.
5. ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థినీ వెనక్కి పంపడం, తొలగించడం, బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలనడం కుదరదు.
6. డ్రాపౌట్లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
విశేషాలు..
1. పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.
2. పాఠశాలల ఏర్పాటు, భవనాలు, బోధన సిబ్బంది, బోధన పరికరాలతోపాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చాలి.
3. పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించి, బడి మానకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, తల్లిదండ్రులపై ఉంటుంది.
4. బడి బయట ఉన్న పిల్లలను వారి వయసుకు తగిన తరగతుల్లో చేర్చి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
5. బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం లేదా బడి నుంచి తీసివేయడం చేయకూడదు.
6. బాలలను శారీరకంగా, మానసికంగా, వేధించడం లాంటివి చేయకూడదు. ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
7. ప్రైవేటు పాఠశాలలు తప్ప.. అన్ని పాఠశాలల్లో బడి యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలి.
8. ఈ కమిటీలు పాఠశాలల పనితీరును సమీక్షించడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం లాంటి విధులు నిర్వహిస్తుంది.
9. కనీస విద్యార్హతలున్న వారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.
10. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, సకాలంలో పాఠ్యాంశాలు బోధించడం, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి.
11. చట్టంలో పేర్కొన్న విధంగా తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలి.
12. చట్టం అమలు తీరు పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలి.
13. సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే సర్వశిక్షా అభియాన్.
14. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2001-02 నుంచి రాజీవ్ విద్యామిషన్ ద్వారా అమలు చేస్తున్నారు.


No comments:

Post a Comment