AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

క్రీడలు Sports ఫిఫా ప్రపంచకప్ 2014 ప్రత్యేకం

ఫిఫా ప్రపంచకప్ 2014 ప్రత్యేకం

వర్తమాన వ్యవహారాలను చదివేటప్పుడు.. వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఆ సంఘటన పూర్వాపరాలను కూడా క్షుణ్నంగా గమనించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జరిగిన అతి పెద్ద క్రీడాసంరంభమైన ఫిఫా ప్రపంచకప్ సాకర్- 2014కు సంబంధించిన కీలక ఘట్టాలను పరిశీలిస్తే...

ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 1930లో ప్రారంభమైంది. ఉరుగ్వే తొలిసారి ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942,46లలో నిర్వహణ సాధ్యం కాలేదు. 
ఇప్పటి వరకు ఈ పోటీలు 20సార్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా బ్రెజిల్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. తర్వాత జర్మనీ, ఇటలీ చెరి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాయి. అర్జెంటీనా, ఉరుగ్వే రెండుసార్లు, ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.
2014 ప్రపంచకప్ బ్రెజిల్‌లో జరిగింది. జూన్ 12న ప్రారంభమై జూలై 13న ముగిసింది. మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. బ్రెజిల్‌లోని 12 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించారు. మొత్తం 64 మ్యాచ్‌లలో 171 గోల్స్ నమోదయ్యాయి. సావ్‌పోలోలో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ క్రొయేషియాను ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన స్పెయిన్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. కొలంబియా, కోస్టారికా దేశాలు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. జర్మనీ, నెదర్లాండ్స్, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. తద్వారా వరుసగా నాలుగు టోర్నమెంట్‌లలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి దేశంగా జర్మనీ ఘనత దక్కించుకుంది. రియోడిజెనీరోలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి జర్మనీ నాలుగోసారి విజేతగా నిలిచింది. గతంలో 1954, 1974, 1990లలో కూడా జర్మనీ ఈ ఘనతను సాధించింది. జర్మనీ జట్టుకు 35 మిలియన్ డాలర్లు, రన్నరప్ అర్జెంటీనాకు 25 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. బ్రెజిల్‌ను ఓడించి నెదర్లాండ్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ ఈ టోర్నమెంట్ ద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు (గత రికార్డు 15 గోల్స్‌తో బ్రెజిల్‌కు చెందిన రొనాల్డో పేరిట ఉంది). ఈ సందర్భంగా ప్రదానం చేసిన అవార్డుల వివరాలు..
గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారునికి ఇచ్చే అవార్డు): జేమ్స్ రోడ్రిగ్వెజ్ (కొలంబియా- 6 గోల్స్)
గోల్డెన్ బాల్ (అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుడు): లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
గోల్డెన్ గ్లోవ్: జర్మనీ గోల్ కీపర్ మాన్యుయెల్ న్యూర్
బెస్ట్ యంగ్ ప్లేయర్ (21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆటగాడికి ఇస్తారు): పాల్ పోగ్బా (ఫ్రాన్స్)
ఫెయిర్ ప్లే: కొలంబియా జట్టు
ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వడం బ్రెజిల్‌కు ఇది రెండోసారి. 1950లో బ్రెజిల్‌లో మొదటిసారి ఈ టోర్నీని నిర్వహించారు. తదుపరి ప్రపంచ కప్ పోటీలకు 2018లో రష్యా, 2022లో ఖతార్ ఆతిథ్యమివ్వనున్నాయి.


No comments:

Post a Comment