AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

అవార్డులు గ్రహీతలు Awards Recepients నోబెల్ బహుమతులు - 2015

నోబెల్ బహుమతులు - 2015

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పరిశోధనలు/విశేష కృషి చేసిన వారికి అందజేసే ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులను 2015 సంవత్సరానికి ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్‌లోని నోబెల్ అకాడమీ విజేతల పేర్లను ప్రకటించింది.
వైద్యంలో ముగ్గురికి..
విలియం సి. క్యాంప్‌బెల్, సటోషీ ఒమురాలకు గుండ్రటి పురుగుల వల్ల కలిగే వ్యాధులకు చికిత్స కనుగొన్నందుకు, యుయుటుకు మలేరియా మందు కనుగొన్నందుకు వైద్యంలో నోబెల్ బహుమతులను ప్రకటించారు. విలియం సి.క్యాంప్‌బెల్(అమెరికా), సటోషీ ఓమురా(జపాన్) అవెర్‌మెక్టిన్ అనే మందును కనుగొన్నారు. ఇది రివర్ బ్లైండ్‌నెస్, శోషరసయుత బోధకాలు వ్యాధులకు చికిత్సతో పాటు ఇతర పరాన్నజీవుల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
సతోషి ఒమురా ఆవిష్కరణ
ఈయన జపాన్ సూక్ష్మజీవశాస్త్రవేత్త. సహజ ఉత్పత్తులను వేరిపరిచే నిపుణుడు. స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా సమూహంపై తన పరిశోధనలు నిర్వహించాడు. నేలలో నివసించే ఈ బ్యాక్టీరియా నుంచి అధిక మొత్తంలో వర్ధనం చేశాడు. వీటి నుంచి వేల సంఖ్యలో వర్ధనాలను పెంచి అందులో నుంచి యాభై స్ట్రెయిన్‌లను తీసుకున్నాడు. ఇవి ఇతర సూక్ష్మజీవులపై క్రియావంతంగా పనిచేశాయి. ఈ స్ట్రెయిన్‌ల నుంచి స్ట్రెప్టోమైసిస్ అవెర్‌మిటిలిస్ తయారైంది. దీని నుంచి ఐవెర్‌మెక్టిన్ తయారుచేశారు.
విలియం సి.క్యాంప్‌బెల్ ఆవిష్కరణ
అమెరికాకు చెందిన పరాన్నజీవ శాస్త్రవేత్త. ఓమురా యొక్క స్ట్రెప్టోమైసిస్ వర్ధనాలను తీసుకుని వాటి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేశాడు. ఒక స్ట్రెయిన్ మిగిలిన వాటికంటే పెంపుడు, ఫారం జంతువులలో ఉండే పరాన్నజీవులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించాడు. దానిని శుద్ధిచేసి అవెర్‌మెక్టిన్‌గా పేరుపెట్టాడు. దీనిని రసాయనికంగా కొన్ని మార్పులకు గురిచేసి ‘ఐవర్‌మెక్టిన్’గా మార్చాడు. దీనిని మానవులపై ప్రయోగించినపుడు విజయవంతంగా పనిచేసింది.
మలేరియాకు మందు కనుగొన్న యుయుటు
మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. ప్లాస్మోడియం జాతికి చెందిన పరాన్నజీవుల వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మలేరియాకు క్లోరోక్విన్‌తో వైద్యం చేస్తారు. కాని ఫలితం చాలా తక్కువ. 1960 సంవత్సరాలలో మలేరియా నియంత్రణ తగ్గిపోయి ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలింది.
అమెరికాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు చైనా, ఉత్తర వియత్నాం యుద్ధం చేసే సమయంలో తమ దేశ సైనికులు అడవుల్లో మలేరియా కారణంగా అధికంగా చనిపోతుండటంతో అప్పటి చైనా అధ్యక్షుడు మావో సూచనల మేరకు యుయుటు అనే చైనా వైద్యురాలు సాంప్రదాయ వైద్య విధానంలో మలేరియా నివారణకు పూనుకున్నారు. ఆర్టిమిసియా అన్యువా మొక్క నుంచి ‘ఆర్టిమిసినిన్’ అనే కొత్త మందును ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన పరిశోధనా శాస్త్రవేత్త లూయిస్ మిల్లర్ 2005లో యుయుటు పరిశోధనను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు.

రసాయనశాస్త్రంలో..
డీఎన్‌ఏ మరమ్మతు యొక్క యాంత్రికతను కనుగొన్నందుకు థామస్ లిండాల్(స్వీడన్),పాల్ మ్యాడ్రిక్(యూఎస్‌ఏ),అజీజ్ సంకార్(యూఎస్‌ఏ-టర్కిష్ పౌరుడు)లకు రాయల్ స్వీడిష్ అకాడెమీనోబెల్ బహుమతిని ప్రకటించింది. దెబ్బతిన్న డీఎన్‌ఏను మానవ శరీరం ఏవిధంగా మరమ్మతులు చేసుకుంటుందనే అంశంపై విలువైన పరిశోధనలు నిర్వహించినందుకు వీరికి ఈ ఏడాది నోబెల్ బహుమతులు ప్రకటించారు.
లిండాల్ పరిశోధన
కణ విభజన సమయంలో డీఎన్‌ఏ రెండు పోగులుగా విడిపోతుంది. సరైన జతతో కలిసిపోయి కొత్తకణంలో పూర్తిస్థాయి డీఎన్‌ఏ ఏర్పడుతుంది. ఈ క్రమంలో డీఎన్‌ఏలోని సైటోసిన్‌లో కొన్ని మార్పులు వచ్చి యురాసిల్ అనే కొత్త నత్రజని క్షారం ఏర్పడుతుంది. గ్లైకోసైలేస్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఈ మార్పును గమనించి యురాసిల్‌ను కత్తిరించి మరికొన్ని ఎంజైమ్ సహకారంతో కొత్త రసాయనాలు చేరతాయి.
పాల్ మ్యాడ్రిక్ నిరూపణ
కణం రెండుగా విభజితమైనప్పుడు కొన్ని సార్లు సహజసిద్ధంగానే వాటిలోని బేస్ పెయిర్లలో తేడాలు నమోదవుతాయి. అంటే అడినైన్, థయమిన్‌తో కాకుండా మరో రసాయనంతో జతకడుతుంది. ఈ సమయంలో మ్యూట్ ఎస్ మ్యూట్ ఎల్ అనే ఎంజైమ్ గుర్తిస్తుంది. ఇది తేడాగా ఉన్న బేస్ ఫెయిర్‌ను గుర్తించి కత్తిరిస్తుంది. డీఎన్‌ఏ పాలిమరేజ్, డీఎన్‌ఏ లైగేజ్ సాయంతో తేడాల్లేని డీఎన్‌ఏ పోగు వాటి మధ్య రసాయన బంధం ఏర్పడుతుంది.
అజీజ్ సంకార్ ఆవిష్కరణ
యూవీ కిరణాలు, సిగరెట్ పొగలోని నుసి, కేన్సర్ కారకాల వలన డీఎన్‌లో వచ్చే మార్పులు, ఆ మార్పులను మరమ్మతులు చేసుకోవడం సంకార్ గుర్తించాడు. అతినీలలోహిత కిరణాలు డీఎన్‌ఏ పోగులోని రెండు థయమీన్ అణువుల మధ్య రసాయన బంధం ఏర్పడేలా చేస్తాయి. ఎక్సిన్యూక్లియేస్ అనే ఎంజైమ్ ఈ మార్పు గుర్తించి వెంటనే డీఎన్‌ఏ పోగును కత్తిరించి 12 న్యూక్లియోటైడ్‌లను తొలగిస్తుంది. ఫలితంగా ఏర్పడ్డ ఖాళీని డీఎన్‌ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ పూరిస్తుంది. ఆ వెంటనే డీఎన్‌ఏ లైగేజ్, పాలిమరేజ్‌లోని థయమిన్ దిగువభాగంలోని అడినైన్‌లను కలుపుతుంది. దీంతో మరమ్మతు పూర్తవుతుంది.

భౌతికశాస్త్రంలో..
న్యూట్రినో డోలనాలు, న్యూట్రినోలకు కూడా ద్రవ్యరాశి ఉంటుందని ఆవిష్కరించడంతో తకాకి కజిత, (జపాన్), అర్థర్ బి.మెక్‌డొనాల్డ్, (కెనడా)లు భౌతిక శాస్త్రంలో నోబెల్ ను పొందారు.
ఆవిష్కరణ క్రమం: పరమాణు కేంద్రకంలోని ప్రొటాన్లు, న్యూట్రాన్లు కలిసి కొత్త కణాలను ఏర్పరుస్తాయి. న్యూట్రాన్ ప్రోటాన్‌తో కలిసినపుడు బీటాకణం ఏర్పడుతుంది. ఇది రుణావేశ పూరితం కాబట్టి దీనిని ఎలక్ట్రాన్ అంటారు. దీనితో పాటు ఏంటి న్యూట్రినో ఏర్పడుతుంది. అదే విధంగా ప్రొటాన్ న్యూట్రాన్‌తో కలిసినపుడు పాజిట్రాన్, న్యూట్రినోలు ఏర్పడతాయి. ఇవి మూడు రకాలు. అవి ఎలక్ట్రాన్ న్యూట్రినో, మ్యూన్ న్యూట్రినో, టాన్యూట్రినో. న్యూట్రినోలు చిన్నపాటి రేణువులు. వీటికి ద్రవ్యరాశి లేదన్న భావన తొలుత ఉండేది. అయితే ఈ రేణువులు గల్లంతు కాలేదని, తమ ప్రయాణక్రమంలో ఒకరూపంలో నుంచి మరో రూపంలోకి మారుతున్నాయని కజిత,మెక్ డొనాల్డ్‌లు రుజువు చేశారు. దీనినే న్యూట్రినో డోలనం అంటారు. కజిత జపాన్‌లోని సూపర్ కామియోకాండే డిటెక్టర్‌లోనూ, మెక్ డొనాల్డ్ కెనడాలోని సడ్‌బరీ న్యూట్రినో అబ్జర్వేటరీలల్లో పరిశోధనలు చేస్తూ ఈ ఆవిష్కకరణలు చేశారు.

స్వెత్లానాకు సాహిత్య నోబెల్
బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెగ్జివిచ్(67)కు ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. సామ్రాజ్యవాద యుద్ధాలు, సామ్యవాద పోరాటాల రూపంలో చరిత్రకు అంటిన నెత్తుటి మరకలను మానవీయ కోణంలో అక్షరబద్ధం చేశారని నోబెల్ ఎంపిక కమిటీ స్వీడిష్ అకాడెమీ శ్లాఘించింది. మహా యుద్ధాలను విజేతలు, పరాజితులు అనే కోణంలో కాకుండా స్త్రీలు, చిన్న పిల్లల దృక్కోణంలోంచి చూడండి అంటారామె. ‘వార్స్ ఆన్ విమెన్లీ ఫేస్’ అనేది ఆమె తొలి రచన. బెలారస్‌కు నోబెల్ రావడం ఇది తొలిసారి కాగా ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళల్లో స్వెత్లానా 14వవారు. ఈ అవార్డు కింద తొమ్మిది లక్షల యాభై వేల డాలర్లు ఆమెకు లభించనున్నాయి.
సమకాలీన యుద్ధ విషాదాలపై సాధికార ధిక్కారాన్ని ప్రదర్శించిన స్వెత్లానా పూర్వ సోవియట్ యూనియన్‌లో భాగమైన బెలారస్‌లో 1948 మే 31వ తేదీన జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చిన్న పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ ‘నేమ్యాన్’ అనే సాహిత్య పత్రికలో ఉద్యోగానికి కుదిరింది. అలా సాహిత్యంతో పరిచయం ఏర్పడి పదునైన రచనలు చేసే స్థాయికి ఎదిగింది. 1986లో రష్యాలో సంభవించిన చెర్నో బిల్ అణు ప్రమాదం ఆమె జీవిత దృక్పథాన్ని మార్చివేసింది. 2000 సంవత్సరంలో లుకషెంకో పాలనలో తొలుత ఆమె పుస్తకాలను, తర్వాత స్వెత్లానానే దేశం నుంచి బహిష్కరించారు. అలా 11 పదకొండేళ్ల పాటు యూరోపియన్ దేశాల్లో ప్రవాస జీవితం గడిపి తిరిగి 2011లో బెలారస్‌లో ప్రభుత్వం మారడంతో స్వదేశానికి చేరుకుంది.

‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు శాంతి నోబెల్
టునీసియాలో ప్రజాస్వామ్య స్థాపన, పరిరక్షణకు కృషి చేసిన నాలుగు పౌరసంస్థలు ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ సంస్థలు ఏవంటే టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్, టునీసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ,ట్రేడ్ అండ్ హాండీ క్రాఫ్ట్, టునీసియన్ హ్యూమన్ రైట్స్ లీగ్, టునీసియన్ ఆర్డర్ ఆఫ్ లాయర్స్. దేశంలో నెలకొన్న అరాచక పాలనను తరిమికొట్టడానికి మల్లెపూల విప్లవం(జాస్మిన్ రెవల్యూషన్) చరమగీతం పాడితే ఆ శిథిలాల మీదుగా నూతన ప్రజాస్వామ్యం ఆవిష్కరించడానికి నేషనల్ డైలాగ్ క్వార్టెట్ దోహదపడింది. ఈ నేపథ్యంలో నోబెల్ ఎంపిక కమిటీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ఈ పురస్కారం మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో కూడా శాంతిని, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకునేలా స్ఫూర్తిని రగిలిస్తుందని భావిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. 2010లో టునీసియాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా డిసెంబరు 17, 2010 నుంచి జనవరి14, 2011 వరకు ఈ విప్లవం నడిచింది. అప్పటి అధ్యక్షుడు జిన్‌ఎల్ అబిదిన్ బెన్ అలీ యొక్క నిరంకుశ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఒక్కసారిగా తిరుగుబాటుకు పూనుకున్నారు. ట్యునీషియా జాతీయపుష్పం జాస్మిన్ కనుక దీనిని జాస్మిన్ రివల్యూషన్ అంటారు. నేషనల్ డైలాగ్ క్వార్టెట్ ఇస్లామిక్‌వాదుల ఆధిపత్యంలోని ప్రభుత్వవర్గానికి, తిరుగుబాటుదారులకు మధ్యవర్తిత్వం వహించింది. విస్తృత చర్చల ద్వారా రాజీ కుదిర్చి ప్రజాస్వామ్యానికి బాటలు వేసింది. తద్వారా టునీసియా కొత్త రాజ్యాంగాన్ని రచించుకుంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ఏర్పడింది.

ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు..
పేదరికాన్ని ప్రపంచ సమాజం పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి విశేష కృషి చేసిన స్కాటిష్ శాస్త్రవేత్త ఆంగస్ డేటన్‌కు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతికి గాను 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఆయనకు లభిస్తాయి. డేటన్ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్‌లో పేదరికాన్ని ఎలా కొలవాలో పునర్నిర్వచించడానికి దోహదపడ్డాయి. డేటన్ రచించిన ‘ది గ్రేట్ ఎస్కేప్’ అనే గ్రంథం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది.
వినియోగదారులు ఏయే వస్తువులపై ఎంత ఖర్చు పెడతారు? సమాజ ఆదాయంలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పొదుపు చేస్తున్నారు? పేదరికాన్ని, సంక్షేమాన్ని ఎంత బాగా అంచనా వేయగలం, విశ్లేషించగలం? అనే మూడూ ప్రశ్నల చుట్టూ డేటన్ పరిశోధన కొనసాగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని, జీవన ప్రమాణాలను కుటుంబసర్వేల ఆధారంగా అంచనా వేసేందుకు ఆయన రూపొందించిన నమూనా ఎంతగానో ఉపకరించింది. డేటన్ రచించిన ‘ది గ్రేట్ ఎస్కేప్’ అనే గ్రంథం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది.

ఆల్‌ఫ్రెడ్ నోబెల్ విశేషాలు
నోబెల్ స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త. పేలుడు పదార్థాలపై పరిశోధనలు నిర్వహించాడు. స్టాక్‌హోం పట్టణంలో 1833వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జన్మించారు.
నోబెల్ ప్రధాన ఆవిష్కరణ డైనమైట్. దీనిని 1866లో కనుగొన్నాడు. దీని ద్వారా 16,87,337 బ్రిటీష్ పౌండ్ల (సుమారు 472 మిలియన్ అమెరికన్ డాలర్లు) ధనాన్ని ఆర్జించాడు.
డైనమైట్‌ను పరీక్షించేక్రమంలో భారీ విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో నోబెల్ సోదరుడు మరణించాడు. అయితే ఈ వార్తను ప్రచురించడంలో పొరపాటు జరిగింది. ‘మృత్యు వ్యాపారి, నరహంతకుడు నోబెల్ అస్తమయం’ అని వచ్చింది.
దీంతో నోబెల్ తీవ్రంగా బాధపడి 1896లో నోబెల్ ఫౌండేషన్‌ను స్థాపించి తాను సంపాదించిన ధనంలో 95 శాతం బ్యాంకుల్లో జమచేసి వాటి ద్వారా వచ్చే ధనంతో ఏటా బహుమతులు ఇవ్వాలని వీలునామా రాశాడు.
నోబెల్ 1896, డిసెంబర్ 10న సెరిబ్రల్ హెమరేజీతో మరణించాడు.
1901 నుంచి ఇప్పటివరకు 860 మంది స్వీకరించారు.
1895 నాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, శాంతి, సాహిత్యంలో మాత్రమే బహుమతులు ఇచ్చేవారు. 1968 నుంచి ఎకనమిక్స్‌ను చేర్చారు.


No comments:

Post a Comment