AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

సైన్స్ & టెక్నాలజీ Science & Technology నింగిలోకి మరో సమాచార ఉపగ్రహం ..

నింగిలోకి మరో సమాచార ఉపగ్రహం .. జీశాట్-16 ప్రయోగం విజయం

సూళ్లూరుపేట/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రాన్స్‌లోని ఫ్రెంచి గయానా, కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఏరియన్-5 వీఏ-221 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,181.6 కిలోలు బరువు కలిగిన జీశాట్-16 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
శనివారం తెల్లవారుజామున 2.09 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా వాతావరణంలో సహకరించకపోవడంతో రాకెట్‌ను మళ్లీ ప్రయోగవేదిక నుంచి వెనక్కి తీసుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రయోగించి విజయం సాధించారు. ప్రయోగం ప్రారంభమైన తరువాత 32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. దేశంలో ట్రాన్స్‌ఫాండర్లకు ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఉపగ్రహంలో 48 ట్రాన్స్‌పాండర్లు అమర్చి పంపారు. ఇందులో 12 కేయూ బాండ్ ట్రాన్స్‌పాండర్లు, 24 సీబాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీబాండ్ ట్రాన్స్‌పాండర్లను పంపారు. డీటీహెచ్ ప్రసారాల్లో నాణ్యతను పెంచేందుకు ట్రాన్స్‌పాండర్లను పంపామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగం అనంతరం 2.41 గంటలకు బెంగళూరు సమీపంలోని హసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు ఉపగ్రహాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దీని పనితీరు సంతృప్తికరంగానే ఉందని ప్రకటించారు. అయితే ఈ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు దూరంలో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహంలోని అపోజీ మోటార్లును మూడుసార్లుగా మండించి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మొదటి సారి కక్ష్యను పెంపుదల చేయడంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు అపోజీ మోటార్లను మండించి కక్ష్యదూరాన్ని పెంచుతారు. ఈ నెల 12 నాటికి ఉపగ్రహంలోని ట్రాన్స్‌పాండర్లను ఉపయోగంలోకి తెస్తామని ఇస్రో ప్రకటించింది.12 ఏళ్లపాటు కక్ష్యలో ఉండి సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ.865 కోట్లు వ్యయం చేసినట్టు తెలిపింది.

జీశాట్-16 విశేషాలు..
1. 48 ట్రాన్స్‌పాండర్లను ఒకేసారి నింగిలోకి పంపటం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారి.
2. 3,181.6 కిలోలతో ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
3. టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇస్రోకు లేకపోవడంతో ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందాల మేరకు ఈ ప్రయోగాన్ని అక్కడి నుంచి చేపడుతోంది.
4. అత్యంత బరువైన ఉపగ్రహాలను భారత్.. కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి, అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు.. శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు.
5. ఇదివరకే స్పాట్-6, స్పాట్-7 వంటి ఫ్రాన్స్ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
6. జీశాట్-16తోపాటు డెరైక్ట్-14 అనే మరో ఉపగ్రహాన్ని ఏరిఎన్-5 వాహన నౌకలోనే పంపనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ప్రత్యేకతలు..
7. కాలపరిమితి 12 ఏళ్లు. ప్రయోగానికి అవుతున్న ఖర్చు రూ.865.50 కోట్లు.
8. ఉపగ్రహ తయారీ ఖర్చు రూ.400 కోట్లు కాగా, నింగిలోకి పంపేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి 18 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.500 కోట్లు) ఇస్రో చెల్లిస్తోంది.
9. ఏరియన్-5 ఈసీఏ రాకెట్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.
10. ఇందులో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12కేయూ బ్రాండ్ ట్రాన్స్ పాండర్స్, 24 సీ బాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీబాండ్ ట్రాన్స్‌పాండర్స్ అమర్చారు.
11. 11వ భారత సమాచార ఉపగ్రహం కావడం దీని ప్రత్యేకత.
12. 6.8 కేవీ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జీఎస్‌ఏటీ-15 ఉపగ్రహాన్ని పోలి ఉంటుంది. లక్ష్యాలు..
13. భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత టెలీ కమ్యూనికేషన్స్, టెలివిజన్ వ్యవస్థను అభివృద్ధి పరచడం.
14. దేశంలో ట్రాన్స్‌పాండర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సేవలు విస్తరించడం.
15. ఇతర సమాచార ఉపగ్రహాలు అందించే సేవలకేగాక పౌర విమానయాన సేవలకు ఆసరాగా నిలవడం.
ముఖ్యాంశాలు.. 
మిషన్ రకం : కమ్యూనికేషన్ 
ఆపరేటర్ : ఇస్రో
కాలపరిమితి : 12 ఏళ్లు (అంచనా) 
తయారీదారు : ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్
బరువు : 3,181 కేజీలు 
ప్రయోగం : డిసెంబర్ 5, తెల్లవారుజామున 2.08 గంటలు 
రాకెట్ : ఏరియన్-5 ఈసీఏ 
బాండ్ : 12 కేయూ బాండ్, 24 సీ బాండ్,12 ఎక్స్‌టెండెడ్ సీ బాండ్ 
బాండ్ వెడల్పు : 36 మెగాహెడ్జ్‌లు


No comments:

Post a Comment