జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 విజయం.. ఇస్రో ఏడేళ్ల కఠోర శ్రమ ఫలితం
శ్రీహరికోట( సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడేళ్ల కఠోరశ్రమ ఫలించింది. ఎస్-200, ఎల్-100 తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్ నుంచి గురువారం జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్-3 (జీఎస్‌ఎల్‌వీ మార్క్-3) ప్రయోగాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఇస్రో కొత్త చరిత్రను లిఖించింది. ఇది మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా మారనుంది.
కౌంట్ డౌన్ అనంతరం జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ 3,775 కిలోల కేర్ మాడ్యూల్‌ను మోసుకుని నింగికేగింది. కేర్ మాడ్యూల్‌ను 126 కిలోమీటర్లు ఎత్తులోకి పంపి దాన్ని మళ్లీ తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను కూడా విజయవంతంగా చేపట్టారు. ఇది స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం లాంటిదే కావడం విశేషం
రాకెట్ ద్వారా ఎస్-200, ఎల్-110 సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు శిఖర భాగంలో అమర్చిన కేర్ మాడ్యూల్ (వ్యోమగాముల గది) 126 కిలోమీటర్లు ఎత్తుకెళ్లి తిరిగి వచ్చేటపుడు దానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. కేర్ మాడ్యూల్ భూమిపై సముద్రంలోకి తిరిగి వస్తున్నపుడు అన్ని పరిస్థితులు సహకరించాయుని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ప్రయోగాత్మక పరిశీలన ద్వారా మూడు రకాల ఉపయోగాలను ఇస్రో పరిశీలించి విజయం సాధించింది. భవిష్యత్తులో 3 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాల (కమ్యూనికేషన్ శాటిలైట్స్)తో పాటు చంద్రయాన్-2 ప్రయోగంలో రోవర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ప్రయోగాత్మక పరిశీలన ఎంతో దోహదపడింది.
No comments:
Post a Comment