AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2017

సైన్స్ & టెక్నాలజీ ఆగష్టు 2017
హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి 
సామాజిక మాధ్యమాల్లో కీలకంగా వాడే హ్యాష్‌ట్యాగ్ (#)కు ఆగస్టు 23తో పదేళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన క్రిస్ మెస్సినా అనే సామాజిక మాధ్యమ నిపుణుడు హ్యాష్‌ట్యాగ్ విధానాన్ని రూపొందించి, తొలిసారిగా 2007 ఆగస్టు 23న ఓ ట్వీట్‌లో ‘#barcamp’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు. అప్పటి నుంచి ఇది ప్రచారంలోకి వచ్చింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : క్రిస్ మెస్సినా 

ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని నేవీకి అప్పగించిన జైట్లీ హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్‌లో ఆగస్టు 28న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ.. సామ్ క్షిపణిని నావికాదళానికి అప్పగించారు. అలాగే.. బార్‌కోడ్‌తో రూపొందించిన బీఎంపీ-2 వాహనాలను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. అధునాతన ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని బీడీఎల్, మిథాని సంయుక్తంగా రూపొందించాయి. పటాన్‌చెరులోని బీడీఎల్ పరిశ్రమలో అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను జైట్లీ ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎల్‌ఆర్ సామ్ క్షిపణి నేవీకి అప్పగింత 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 
ఎక్కడ : హైదరాబాద్‌లో 

జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న ఉత్తర కొరియా ఆగస్టు 29న జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని సునన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడింది. 2,700 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై జపాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా క్షిపణి ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున.. ఉత్తర కొరియాపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అమెరికా, జపాన్‌లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐక్యరాజ్యసమితిని కోరాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఉత్తర కొరియా

సైన్యానికి బోయింగ్ అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం కోసం అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఆగస్టు 17న సమావేశమైన రక్షణ సామాగ్రి సేకరణ మండలి (డీఏసీ) రూ.4,168 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. మరో మూడేళ్లలో వీటిని భారత సైన్యానికి అప్పగించనున్నారు. 
ఒప్పందంలో భాగంగా బోయింగ్ సంస్థ దాడికి ఉపయోగించే ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు ఆయుధ వ్యవస్థ, మందుగుండు, విడిభాగాలు, శిక్షణ అందించనుంది. 2015, సెప్టెంబర్‌లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఆర్డర్ ఇచ్చిన 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లకు అదనంగా ఇవి భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : రక్షణ సామాగ్రి సేకరణ మండలి 
ఎక్కడ : అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి 

కేరళలో రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు రెండు కొత్తరకం వానపాము జాతులను గుర్తించారు. వీటికి ద్రవిడ డైవర్టిక్యులట, ద్రవిడ తోమసిగా నామకరణం చేశారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ రెండు జాతుల మధ్య కూడా చాలా తేడాలున్నాయని కేరళలలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్కూలిని యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ద్రవిడ డైవర్టిక్యులేట ఒంటిపై పదుల సంఖ్యలో ఖండికలుండగా కీలక అవయవాలన్నీ శరీరానికి ముందు భాగంలో ఉన్నాయి. మున్నార్ ప్రాంతంలోని షోలా గడ్డి భూములు, ఎరావికుళం నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇక ద్రవిడ తోమసిగా నామకరణం చేసిన మరో జాతిని కొజిప్పారా జలపాతం సమీపంలోని భూముల్లో గుర్తించారు. ఈ రెండు వానపాములు కూడా మోనిలిగాస్ట్రిడే జాతికి చెందిన జీవులు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు 
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : మహాత్మాగాంధీ యూనివర్సిటీ, స్కూలిని యూనివర్సిటీ పరిశోధకులు
ఎక్కడ : కేరళలో 

ఇస్రో, నాసా ఆధ్వర్యంలో నిసార్ ప్రాజెక్టు భూమిపై వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు, నేలల పరిశీలన కోసం ఇస్రో, నాసా సంస్థలు నిసార్ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో నిఘా సెన్సార్లను ఏర్పాటు చేయనున్నాయని.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్ తపన్ మిశ్రా ఆగస్టు 20న వెల్లడించారు. అత్యయిక పరిస్థితులలో వీలైనంత వేగంగా స్పందించి సహాయ సహకారాలు అందించేందుకు ఈ సెన్సార్లు ఉపయోగపడతాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భూమి పరిశీలన కోసం నిసార్ ప్రాజెక్టు 
ఎవరు : ఇస్రో, నాసా 
ఎందుకు : సెన్సార్ల ద్వారా వాతారవరణ మార్పులు, సముద్ర మట్టాలు, నేలల పరిశీలన కోసం 

అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. దాదాపు 99 ఏళ్ల తర్వాత అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సంపూర్ణ సూర్యగ్రహణం 
ఎప్పుడు : ఆగస్టు 21 
ఎక్కడ : అమెరికాలో 
ఎందుకు : 14 రాష్ట్రాల మీదుగా సాగిన సూర్యగ్రహం 

రోదసీలోకి చేరిన తొలి సూపర్ కంప్యూటర్మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ (స్పేస్ బర్నో కంప్యూటర్) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్‌కెనవారాల్‌లో నిర్వహించారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్ ఈ సూపర్ కంప్యూటర్‌ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్ కంప్యూటర్‌ను హ్యూలెట్ ఎయాకార్డ్ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్ ఎక్స్‌కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు.

నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్‌సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి.

తెలుగులోనూ గూగుల్ సెర్చ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా తన వాయిస్ సెర్చ్ ఫీచర్‌కు తెలుగు భాషను యాడ్ చేసింది. దీంతో ఇక తెలుగులో చెబుతూనే గూగుల్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. తెలుగుతోపాటు ఇకనుంచి తమిళ్, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ గూగుల్ సెర్చ్ చేయొచ్చు. ఇదివరకు కేవలం ఆంగ్లం, హిందీలో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ అందుబాటులో ఉండేది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుగులో చెబుతూ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్‌‌సలో ఉన్న ‘సెర్చ్ లాంగ్వేజ్’ ఆప్షన్‌లో ఆంగ్లం బదులుగా తెలుగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలుగులో గూగుల్ సెర్చ్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : గూగుల్ సంస్థ

తీర ప్రాంత అప్రమత్తతకు "సాగర్ వాణి" ప్రారంభం సముద్రంలోని వాతావరణ పరిస్థితులపై మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 29న సాగర్‌వాణి అనే వ్యవస్థను ప్రారంభించింది. The Integrated Information Dissemination System (IDS) వ్యవస్థతో దేశంలో తొలిసారి ప్రారంభించిన ఈ విధానం ద్వారా మత్య్స వృత్తిపై ఆధారపడిన 9.27 లక్షల మందికి సముద్ర రక్షణకు సంబంధించిన సమాచారం పంపుతారు. రేడియా, టీవీ, వాయిస్ కాలింగ్, సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఆప్స్ ద్వారా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని చేరవేస్తారు. Indian National Centre for Ocean Information Services (INCOIS) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : సాగర్‌వాణి ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : తీరప్రాంత ప్రజలకు సముద్ర రక్షణ సంబంధిత సమాచారం చేరవేసేందుకు

No comments:

Post a Comment