AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2017

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2017
ఇస్రో క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO క్రయోజనిక్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించింది. జనవరి 25న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 50 సెకండ్లపాటు జరిపిన పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఇంజన్‌ను త్వరలో ఇస్రో ప్రయోగాల్లో వినియోగించనున్నారు. 

ట్రోపెక్స్ పేరుతో త్రివిధ దళాల భారీ విన్యాసాలు
ట్రోపెక్స్ పేరుతో పశ్చిమ తీరంలో నెల రోజులపాటు సాగే భారీ యుద్ధ విన్యాసాలను భారత త్రివిధ దళాలు, తీర రక్షణ దళం జనవరి 27న ప్రారంభించాయి. ఈ విన్యాసాల్లో నౌకా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్ర, యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్‌లు, వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి.
భారత్‌లో క్షీణిస్తున్న పర్యావరణం: సీఎస్‌ఈ నివేదిక
భారత్‌లో పర్యావరణ పరిస్థితి క్షీణిస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) జనవరి 20న విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్‌ఈ.. తన వార్షిక నివేదిక స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌లో అటవీ విస్తీర్ణం తగ్గుతున్న, ఎడారి భూములు పెరుగుతున్న తీరును వివరించింది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కోసం నిర్దేశించిన 52 సూచీల్లో.. భారత్ కేవలం పదహారింటిలో మాత్రమేప్రపంచ సగటు స్థాయిని అందుకుంటోంది. విద్య, ఆరోగ్యం, పరిశోధన రంగాలకు సంబంధించి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 8.6 శాతాన్ని మాత్రమే భారత్ ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ దేశాల సగటు ఖర్చు కంటే తక్కువ. దీంతోపాటు దేశవ్యాప్తంగా సారవంతమైన భూమి విస్తీర్ణం ఏటా తగ్గుతోందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం 32.87 కోట్ల చదరపు హెక్టార్ల భూమి ఉండగా, ఇందులో దాదాపు 10.51 కోట్ల చదరపు హెక్టార్ల భూసారం క్షీణించింది. 2003-05, 2011-13 మధ్యకాలంలో 18 లక్షల చదరపు హెక్టార్ల భూమి ఎడారిగా మారినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయని నివేదిక వెల్లడించింది.
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ఏటీఎం
భారత్‌కు చెందిన అతి పెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో తొలిసారిగా జనవరి 21న ఏటీఎం సేవలను ప్రారంభించారు. ఎస్‌బీఐ నిర్వహించే ఈ ఏటీఎంను నౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 1500 మందికిపైగా సిబ్బంది, అధికారులు వినియోగించుకుంటారు. త్వరలో దీన్ని నగదు డిపాజిట్ మెషీన్‌గా కూడా తీర్చిదిద్దనున్నారు.
అబాబీల్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
అణ్వస్త్ర సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అబాబీల్‌ను పాకిస్తాన్ జనవరి 24న విజయవంతంగా పరీక్షించింది. 2,200 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి మల్టీపుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) సాంకేతికతతో ఉపరితలం నుంచి ఉపరితలంపై దాడి చేయగలదు. 
పినాక క్షిపణి ప్రయోగం సక్సెస్
 పినాక శ్రేణిలోని రెండో తరానికి చెందిన గెడైడ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. జనవరి 24న ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిపిన ప్రయోగం విజయవంతమైంది. ఇది 70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్‌డీవో గతంలో అభివృద్ధి చేసిన పినాక క్షిపణి పరిధి 40 కిలోమీటర్లు.

జలాంతర్గామి ఖందేరీ జలప్రవేశం
జలాంతర్గామి ఖందేరీ.. జనవరి 12న ముంబైలో జలప్రవేశం చేసింది. దీంతో సముద్ర జలాల్లో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. స్కార్పీన్ తరగతికి చెందిన ఈ జలాంతర్గామిని ఫ్రాన్స్ సహకారంతో దేశీయంగా రూపొందించారు. దీన్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. కాగా, ముంబై తీరంలోని ఒక దీవి పేరును దీనికి పెట్టారు. ఖందేరీ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తుంది. శత్రు రాడార్ల నుంచి తప్పించుకునే అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానం ఇందులో ఉంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ.. ఉపరితలంలోని లక్ష్యాలతోపాటు జలాంతర్గాములను కూడా నాశనం చేయగలదు. ఇది టార్పెడోలు, నౌకా విధ్వంసక క్షిపణులతో దాడి చేస్తుంది. 
విజయవంతమైన పినాకా-2 పరీక్ష
ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి జనవరి 12న చేపట్టిన పినాకా మార్క్-2 రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఈ రాకెట్‌ను మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ నుంచి పరీక్షించారు. ఈ లాంచర్ నుంచి 1.2 టన్నుల బరువు గల 12 రాకెట్లను 44 సెకన్ల వ్యవధిలో పేల్చవచ్చు. దీంతోపాటు నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించవచ్చు. నేవిగేషన్, మార్గనిర్దేశం, నియంత్రణ కిట్‌లను అమర్చి పినాకా-2ను గెడైడ్ రాకెట్‌గా తీర్చిదిద్దారు. దీన్ని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డీఆర్‌డీఎల్ అభివృద్ధి చేశాయి.
టిబెట్‌లో చైనా ఎత్తై టెలిస్కోప్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకునేందుకు సుమారు రూ.128 కోట్ల వ్యయంతో టిబెట్‌లోని ఎన్గారీ పట్టణంలో దీన్ని నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఏర్పాటవుతున్న ఈ టెలిస్కోప్ ఉత్తరార్ధగోళంలోని తొలి గురుత్వాకర్షణ తరంగాలను మరింత కచ్చితంగా గ్రహించి వివరాలందిస్తుంది. 2021 నుంచి ఇది వినియోగంలోకి రానున్నట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.
చంద్రునిపై చివరిగా నడిచిన వ్యోమగామి మృతి
చంద్రునిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి యుజీన్ సెర్నన్(82) జనవరి 16న కన్నుమూశారు. జీన్ 1972 డిసెంబర్‌లో అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్‌కు జీన్ కమాండర్‌గా పనిచేశారు. చంద్రమండలంపై ఇప్పటివరకు 12 మంది కాలుమోపారు.

బాబర్-3 క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్-3ని పాకిస్తాన్ జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. హిందూ మహా సముద్రంలో నీటి లోపల మొబైల్ లాంచర్ నుంచి దీనిని ప్రయోగించారు. 450 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేధించే బాబర్-3 క్షిపణి భూ ఉపరితలంపైనే కాకుండా సముద్రం లోపల కూడా దూసుకెళ్లగలదు. పాకిస్తాన్ ఇటీవల బాబర్-2 క్షిపణిని పరీక్షించిన సంగతి తెలిసిందే.

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వస్త్ర సామర్థ్యమున్న ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-4 క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) జనవరి 2న విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ఒడిశా సముద్రతీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం (వీలార్ ఐలాండ్) దీవి నుంచి పరీక్షించారు. రెండు దశల్లో పనిచేసే ఈ క్షిపణి 4,000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. దీని పొడవు 20 మీటర్లు, బరువు 17 టన్నులు. మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ నుంచి 4,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా అగ్ని-4 పనిచేయగలదు.

No comments:

Post a Comment