AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూలై 2017

సైన్స్ & టెక్నాలజీ జూలై 2017
తొలి రిమోట్ యుద్ధట్యాంక్ ‘మంత్ర’ స్వదేశీ పరిజ్ఞానంతో రిమోట్ సాయంతో నడిచే తొలి మానవరహిత ‘యుద్ధ’ ట్యాంకులను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. రిమోట్ ఆదేశాలతో పనిచేసే మూడు ‘మంత్ర’ సిరీస్ ట్యాంకులు.. నిఘా, మందుపాతరల గుర్తింపు, అణుధార్మికత, జీవ ఆయుధాల ప్రమాదమున్న ప్రాంతాల జాడ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. 
నిఘా కోసం మంత్ర-ఎస్, బాంబుల గుర్తింపు కోసం మంత్ర-ఎం అలాగే అణు ధార్మికత, జీవాయుధాల ప్రమాదమున్నప్రాంతాలను గుర్తించేందుకు మంత్ర- ఎన్ రకాన్ని అవడిలోని ఆర్మీకి చెందిన కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ)లో తయారు చేశారు. సీవీఆర్‌డీఈలో మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళిగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలో కొత్తగా తయారుచేసిన రెండు మంత్ర సిరీస్ ట్యాంకులను ప్రదర్శించారు. 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారి ప్రాంతమైన రాజస్తాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వీటిని పరీక్షించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో తొలి రిమోట్ యుద్ధ ట్యాంకులు మంత్ర
ఎప్పుడు : జూలై 30
ఎవరు : డీఆర్‌డీవో 
ఎక్కడ : భారత్‌లో 

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా అమెరికా సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా జూలై 29న మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించింది. జూలైలో ఐసీబీఎం ప్రయోగాన్ని రెండోమారు జరిపిన ఉత్తర కొరియా.. తాజా క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేయగలమని స్పష్టం చేసింది. అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపేందుకే ఈ పరీక్ష జరిపినట్లు దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. జూలై 4న ప్రయోగించిన క్షిపణి కంటే తాజా క్షిపణి అత్యంత శక్తిమంతమైనదని, దాని పరిధి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాలు ఆ క్షిపణి పరిధిలోకి వస్తాయని హెచ్చరిస్తున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖండాంతర క్షిపణి పరీక్ష
ఎప్పుడు : జూలై 29
ఎవరు : ఉత్తర కొరియా 

స్కాట్‌లాండ్‌లో నీటిపై పవన విద్యుదుత్పత్తి ప్రపంచంలోనే తొలిసారిగా పవన విద్యుత్ ఉత్పత్తి కోసం సముద్రంలో తేలియాడే గాలిమరలను స్కాట్‌లాండ్ జలభాగంలో లండన్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ గాలి మరలతో ఏకంగా 20,000 గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. నీళ్లపై ఈ భారీ స్తంభాలు నిలబడేందుకు స్టాటాయిల్ అనే సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి హైవిండ్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నీటిపై పవన విద్యుత్ ఉత్పత్తి 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : లండన్ శాస్త్రవేత్తలు
ఎక్కడ : స్కాట్లాండ్ సముద్ర జలాల్లో 

ఆగస్టు 12న భారీ ఉల్కాపాతంమానవ చరిత్రలోనే అత్యంత భారీ ఉల్కా పాతం ఆగస్టు 12 రాత్రి కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి కూడా పగలు వలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపుగా గంటకు 100 వరకు ఉల్కలు నేలరాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలను చూడగలమని అంటున్నారు. 109పీ / స్విఫ్ట్-టట్టెల్ అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతాయని చెప్పారు. ప్రతి ఏడాది జూలై మధ్య నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయనీ, ఆగస్టు మధ్యలో ఓ రెండ్రోజులు ఎక్కువ సంఖ్యలో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని వివరించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కల వేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. వెంటనే అవి వాతావరణంలోనే మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మానవ చరిత్రలోనే భారీ ఉల్కాపాతం 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎందుకు : 109పీ/స్విఫ్ట్-టట్టెల్ అనే తోకచుక్క నుంచి రాలనున్న ఉల్కలు

చంద్రుడి పై భారీ నీటి నిల్వలు భూగర్భంలో ఉన్నట్లుగానే చంద్రుడి లోపలి పొరల్లో కూడా పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉండే అవకాశముందని అమెరికాలోని బ్రౌన్ యూనివవర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఈ జలవనరులను ఉపయోగించుకోవచ్చని వివరించారు. శాటిలైట్ డాటాను సేకరించిన తర్వాత చంద్రుడి పైపొరల కింద నీటి జాడలున్నాయనే నిర్ధారణకు వచ్చారు. భూమిపై అగ్నిపర్వతాలు పేలి, వాటిలోని లావా ఏరులై పారినట్లుగానే చంద్రుడిపై కూడా అగ్నిపర్వాతాలు వెదజల్లిన లావా విస్తరించిన ఆనవాళ్లున్నాయని, దీనివల్ల చంద్రుడి ఉపరితలంపై ఉన్న నీరంతా కింది పొరల్లోకి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూకేంద్రంలో అత్యధిక వేడి ఉండడం కారణంగా అక్కడ నీటి జాడలేదనే విషయం మనకు తెలిసిందే. అయితే చంద్రుడిలో అలా కాకుండా చంద్ర కేంద్రకం వరకు కూడా వివిధ స్థాయిలో నీటి జాడలు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2008లోనే చంద్రుడి పొరల్లో దాగి ఉన్న నీటిని అపోలో 15, 17 వాహక నౌక భూమికి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెద్దమొత్తంలో నీటి నిల్వలున్నాయని చెప్పేందుకు ఇవే ఆధారమన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చంద్రుడి పై భారీ నీటి నిల్వలు 
ఎప్పుడు : జూలై 25
ఎవరు : బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అమెరికా

అంటార్కిటికా నుంచి విడివడిన భారీ మంచు ఫలకంఅంటార్కిటికా ఖండం నుంచి ట్రిలియన్ (లక్ష కోట్ల) టన్నుల బరువైన మంచు ఫలకం విడివడిందని శాస్త్రవేత్తలు జూలై 12న వెల్లడించారు. దీంతో దక్షిణ ధ్రువం, పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ఓడలు పెను ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. 5,800 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మంచుగడ్డ ఇప్పటి వరకు అంటార్కిటికా నుంచి వేరైన వాటిలో అతిపెద్దది. 
జూలై 10 తర్వాత ఏదో ఓ సమయంలో ఇది లార్సెన్-సీ హిమపర్వతం నుంచి వేరుపడిందనీ, తత్ఫలితంగా లార్సన్-సీ విస్తీర్ణం 12 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మంచుఫలకానికి ఏ68 అని పేరు పెట్టే అవకాశం ఉందనీ, అంటార్కిటికా ద్వీపకల్ప రూపురేఖలనే ఇది మార్చేసిందని వారు పేర్కొన్నారు. చిన్నచిన్న మంచుగడ్డలు అంటార్కిటికా నుంచి విడిపోవడం మామూలుగా జరిగేదే. అయితే ఇది భారీ మంచు ఫలకం కాబట్టి ఓడలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. 
నాసా పరికరాలతో గుర్తింపు
మంచుగడ్డ విడిపోవడాన్ని నాసాకు చెందిన ఆక్వా మోడిస్ ఉపగ్రహ పరికరం ద్వారా గుర్తించిన శాస్త్రజ్ఞులు, సువోమి వీఐఐఆర్‌ఎస్ పరికరంతో నిర్ధారించారు. గత ఏడాది కాలంగా లార్సెన్-సీపై వస్తున్న పగుళ్లను యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ఉపగ్రహాల ద్వారా పరిశీలించారు. ఈ మంచుగడ్డ హిమకొండ నుంచి విడిపోతుందని శాస్త్రవేత్తలు అప్పుడే గుర్తించారు.
లార్సెన్-బీ మంచుకొండలో కూడా 1995లో పగుళ్లు ఏర్పడి మంచుగడ్డలు విడివడి 2002 నాటికి చాలా చిన్నదైపోయిందనీ, ఇప్పుడు లార్సెన్-సీ కూడా అలాగే అవ్వొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 అంటార్కిటికా నుంచి విడివడిన భారీ మంచు ఫలకం
ఎప్పుడు : జూలై 10
ఎవరు : నాసా 
ఎక్కడ : అంటార్కిటికా

గెలాక్సీల మహా సమూహం గుర్తించిన శాస్త్రవేత్తలుభారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహా సమూహాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆో్టన్రమీ అండ్ ఆో్టఫ్రిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళంలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదీ ఒకటని, 10 బిలియన్ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4 వేల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది. గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని స్లోవాన్ డిజిటల్ స్కై సర్వే ద్వారా చూడొచ్చు. ఇదే సంస్థకు చెందిన పరిశోధకులు గతేడాది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఒక సమూహంలో 1000- 10 వేల దాకా గెలాక్సీలుంటాయి. మహా సమూహంలో అయితే అలాంటి సమూహాలు దాదాపు 43 ఉంటాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 మహా గెలాక్సీల సమూహం గుర్తింపు
ఎప్పుడు : జూలై 13
ఎవరు : ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆో్టన్రమీ అండ్ ఆో్టఫ్రిజిక్స్
ఎక్కడ : పూణె 

ఉలవ పంటలకు 4 వేల ఏళ్లుదక్షిణ భారతదేశంలో క్రీస్తుశకం రెండు వేల సంవత్సరాల నుంచి ఉలవ పంటల సాగు ఉండేదని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే కంప్యూటెడ్ టోమోగ్రఫీ పద్ధతి ద్వారా పురాతనమైన ఉలవ విత్తనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డోరియన్ ఫుల్లర్ తెలిపారు. పంటల సాగుకు ముందు విత్తనాల్లోని ఒక పొర చాలా మందంగా ఉంటే.. మానవులు సాగు మొదలు పెట్టిన తర్వాత అది పలచబడుతూ ఉంటుంది. నీళ్లు పోయగానే.. తొందరగా మొలకెత్తుతుంది కాబట్టి విత్తన పొర మందం తగ్గుతూ వస్తుంది. ఈ అంశం ఆధారంగా శాస్త్రవేత్తలు ఉలవ విత్తనాలపై పరిశోధనలు జరిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఉలవ పంటకు 4 వేల ఏళ్లు 
ఎప్పుడు : జూలై 14 
ఎవరు : యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్
ఎందుకు : 4వేల ఏళ్ల కిందటి నుంచి ఉలవ సాగు ఉందని గుర్తింపు 

సూర్యుడు ఉన్నంతకాలం జీవించే టార్డిగ్రేడ్ సూర్యుడు ఉన్నంతకాలం జీవించే ఎనిమిది కాళ్ల టార్డిగ్రేడ్ అనే సూక్ష్మ జంతువు ఒకటుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్ సంవత్సరాలు బతుకుతుందని అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్ మాత్రమేనని, మైక్రోస్కోప్‌లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : సూర్యుడు ఉన్నంత కాలం జీవించే జీవి - టార్డిగ్రేడ్ 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : బ్రిటన్ 

కజకిస్థాన్‌లో యురేనియం బ్యాంక్కజకిస్థాన్‌లోని ఒస్కెమెన్ నగరంలో యురేనియం బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) జూలై 10న నిర్ణయించింది. అణు రియాక్టర్లలో వాడే యురేనియంను సోవియట్ యూనియన్ కాలం నాటి కర్మాగారంలో భద్రపరచనున్నారు. ఈ బ్యాంకు నుంచి ఐఏఈఏ సభ్యదేశాలు మార్కెట్ ధరకు యురేనియంను పొందవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో తమ అణుకర్మాగారాలకు ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఆయా దేశాలకు ఇది ఉపయోగపడుతుందని ఐఏఈఏ పేర్కొంది.

అమెరికా-దక్షిణ కొరియా క్షిపణి ప్రదర్శన ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించడానికి ప్రతిగా దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా జూలై 4న క్షిపణి ప్రదర్శన నిర్వహించాయి. ధిక్కార ధోరణిని అవలంభిస్తున్న ఉత్తర కొరియాకు తమ బలమేంటో చూపడానికి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లోకి క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో ముఖ్య అధికార ప్రతినిధి డానా వైట్ చెప్పారు. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం(ఏటీఏసీఎంఎస్), దక్షిణ కొరియాకు చెందిన హ్యున్మూ మిసైల్ 2ను ఈ కసరత్తులో వినియోగించినట్లు దక్షిణ కొరియాలోని అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా నుంచి ముప్పు నేపథ్యంలో తమ మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌ల రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా తెలిపింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా - దక్షిణ కొరియా క్షిపణుల ప్రదర్శన 
ఎప్పుడు : జూలై 5
ఎక్కడ : దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లో 
ఎందుకు : ఉత్తర కొరియాకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు 

పీఏ సంస్థలో త్వరలో రోబో రిపోర్టర్లు యునెటైడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లలో ప్రఖ్యాతిగాంచిన ‘ప్రెస్ అసోసియేషన్ (పీఏ)’ వార్తాసంస్థ త్వరలో రోబో రిపోర్టర్లని ప్రవేశపెట్టనుంది. ఈ రోబో పాత్రికేయులు స్థానిక ప్రభుత్వ సంస్థల వద్ద ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమాచారాన్ని ప్రచురణకు అనుగుణంగా వార్తలుగా, గ్రాఫ్స్‌గా మారుస్తాయి. ‘రిపోర్టర్స్ అండ్ డాటా అండ్ రోబోట్స్(రాడార్)’గా పిలిచే ఈ ప్రాజెక్టు కోసం పీఏ సంస్థ ‘ఉర్బ్స్ మీడియా’తో చేతులు కలిపింది. డిజిటల్ పాత్రికేయరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అందిస్తున్న రూ.5.17కోట్ల గ్రాంటును సైతం ఈ ప్రాజెక్టు గెలుచుకుంది. 2018లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోబో రిపోర్టర్లు
ఎప్పుడు : 2018
ఎవరు : ప్రెస్ అసోసియేషన్ సంస్థ 
ఎక్కడ : యూకే, ఐర్లాండ్‌లో 

ఫీచర్ ఫోన్లలోనూ జీపీఎస్ తప్పనిసరి: డాట్ఫీచర్ ఫోన్లలో ఖరీదైన జీపీఎస్ టెక్నాలజీకి బదులుగా ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉపయోగిస్తామన్న మొబైల్స్ తయారీ సంస్థల ప్రతిపాదనను టెలికం విభాగం (డాట్) తోసిపుచ్చింది. వినియోగదారులు.. ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా జీపీఎస్ తప్పనిసరని స్పష్టం చేసింది. 
అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ యూజర్లున్న ప్రాంతాన్ని సత్వరం కనిపెట్టగలిగేలా.. 2018 జనవరి 1 నుంచి దేశీయంగా విక్రయించే ఫీచర్ ఫోన్లు సహా అన్ని మొబైల్స్‌లోను జీపీఎస్ ఫీచర్‌ను పొందుపర్చాలని కేంద్రం గతంలోనే ఆదేశించింది. అయితే ఈ ఖరీదైన టెక్నాలజీ వల్ల ఫీచర్ ఫోన్‌‌స ధర 50 శాతం పైగా పెరుగుతుందని, కాబట్టి ప్రత్యామ్నాయ టెక్నాలజీని వాడేందుకు అనుమతించాలంటూ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) చేసిన ప్రతిపాదనని డాట్ అనుమతించలేదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫీచర్ ఫోన్లలో జీపీఎస్ తప్పనిసరి 
ఎప్పుడు : 2018 జనవరి 1 నుంచి 
ఎవరు : డాట్ 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : భద్రతా ప్రమాణాల కోసం

మెక్సికోలో కొత్త జాతి చిలుకల గుర్తింపు  నీలిరంగులో ఉన్న అరుదైన చిలుక జాతిని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు మెక్సికోలోని అమెజాన్ ప్రాంతంలో గుర్తించారు. ఈ చిలుకలలో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయని వారు వెల్లడించారు. మనదగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయని.. అదికూడా ఒకే రకమైన శబ్దం చేస్తూ మళ్లీ మళ్లీ అరుస్తాయని తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించిందని గుర్తించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొత్త జాతి చిలుకల గుర్తింపు 
ఎప్పుడు : జూన్ 28 
ఎక్కడ : మెక్సికోలో
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు

ప్రపంచ తొలి Co2 గ్రాహక ప్లాంట్ ప్రారంభం వాహనాలు, పరిశ్రమల నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కార్బైన్ డయాక్సైడ్ ను గ్రహించేందుకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థల్లో ప్రపంచంలోనే మొదటిదిగా గుర్తింపు పొందిన ఈ ప్లాంట్‌ను క్లైమ్ వర్క్స్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఇది ఏడాదికి 900 టన్నుల కార్బైన్ డయాక్సైడ్ ను గ్రహించగలదు. ఇలా గ్రహించిన మొత్తాన్ని పంటల సాగుకోసం విక్రయిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో తొలి కార్బన్ డయాక్సైడ్ గ్రాహక ప్లాంట్ 
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : క్లైమ్ వర్క్స్ సంస్థ 
ఎక్కడ : జ్యూరిచ్, స్విట్జర్లాండ్ 
ఎందుకు : వాతావరణంలోని Co2 ను గ్రహించి సాగు అవసరాల కోసం వినియోగించేందుకు 

సమాచార ఉపగ్రహం జీశాట్ - 17 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీశాట్-17 సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. జూన్ 29న ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ-238 వాహన నౌక ద్వారా నిర్వహించిన ఈ ప్రయోగం 39 నిమిషాల్లో పూర్తయింది. జీశాట్-17ను అపోజి (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 175 నుంచి 181 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 30 నిమిషాలకు కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం.. జీశాట్-17ను స్వాధీనంలోకి తీసుకున్నామని ప్రకటించింది. 
సమాచార వ్యవస్థ బలోపేతం కోసం.. ఈ ఉపగ్రహంలో 42 ట్రాన్‌‌సఫాండర్లను అమర్చారు. ఇందులో 24 సీ-బాండ్ ట్రాన్‌‌సఫాండర్లు, 2 లోయర్ సీ-బాండ్లు, 12 అప్పర్ సీ-బాండ్లు, 2 సీఎక్స్, 2 ఎస్‌ఎక్స్ ట్రాన్‌‌సఫాండర్లు ఉన్నాయి. జీశాట్-17 ఉపగ్రహం 15 సంవత్సరాలపాటు సేవలందిస్తుంది. భారతదేశ అవసరాలకు సుమారు 550 ట్రాన్‌‌సపాండర్లు అవసరం కాగా.. ప్రస్తుతం 250 అందుబాటులో వున్నాయి. 
గయానా నుంచి 21 ఉపగ్రహాలుఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఇప్పటి వరకు 21 ఉపగ్రహాలను ప్రయోగించింది. 1981లో మొట్టమొదటగా ఆఫిల్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎక్కువ బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఇంకా భారత్‌కు లేనందున ఫ్రెంచి గయానా మీద ఆధారపడుతున్నారు. దీనికి పరిష్కారంగా భారత్ ఇటీవలే ‘బాహుబలి’ రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1ను అభివృద్ధి చేసి ప్రయోగించడం తెలిసిందే. అత్యంత బరువైన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేసి శ్రీహరికోట నుంచే బరువైన ఉపగ్రహాలను పంపేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
జీశాట్ - 17 వివరాలు 
బరువు:
 3,477 కేజీలు
రాకెట్: ఏరియన్-5 వీఏ-238 
లక్ష్యం: సమాచార సేవల మెరుగు
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీశాట్ - 17 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో
ఎక్కడ : కౌరు అంతరిక్షణ కేంద్రం, గయానా - ఫ్రాన్స్ 
ఎందుకు : సమాచార వ్యవస్థల బలోపేతం కోసం 

అంతరిక్షంలో చెత్త తొలగింపునకు కొత్త యంత్రం అంతరిక్షంలో చెత్తను తొలగించేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఉడుంపట్టు స్ఫూర్తిగా ఓ యంత్రాన్ని రూపొందించారు. ఇది ఓ రోబో. ఇందులో ఉడుము కాళ్లలో ఉండే పొలుసుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఉడుముల పాదాల్లోని పొలుసులు 200 నానోమీటర్ల పరిమాణంతో సూక్ష్మంగా ఉంటే.. ఈ రోబో గ్రిప్పర్ పొలుసుల సైజు 40 మైక్రోమీటర్ల వరకు ఉంటాయి.ఏదైనా వస్తువును తాకినప్పుడు ఈ పొలుసులకు, ఆ వస్తువుకు మధ్య ఏర్పడే వాండర్‌వాల్స్ బలాల కారణంగా రెండు గట్టిగా అతుక్కుపోతాయి. ఆ తర్వాత ఆ వస్తువును అతితక్కువ శక్తితో కావాల్సిన చోటికి తీసుకెళ్లొచ్చు. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ రోబోను నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు. 
అంతరిక్షంలో పాడైన ఉపగ్రహాలు మొదలుకొని.. ప్రయోగ సమయంలో విడిపోయిన నట్లు, బోల్ట్‌లు వంటి అనేక పరికరాలు చెత్తగా పేరుకుపోయాయి. ఈ చెత్త గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది. ఇందులో ఏ ఒక్కటైనా పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టినా.. తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతరిక్షంలో చెత్త తొలగింపునకు ఉడుంపట్టు యంత్రం 
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : అమెరికాలో 

పెట్యా వైరస్ దాడితో భారత్‌కు భారీ నష్టంయూరప్ సహా పలు దేశాలపై దాడి చేసిన పెట్యా ర్యాన్సమ్‌వేర్ కారణంగా భారత్‌కు కూడా తీవ్రనష్టం వాటిల్లిందని సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ సిమాంటెక్ వెల్లడించింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కంప్యూటర్లు కూడా పెట్యా బారినపడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విండోస్ సాఫ్ట్‌వేర్‌ను ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 
ఈ దాడిలో ఉక్రెయిన్, అమెరికా, రష్యాలు అత్యధికంగా నష్టపోయాయి. ఫ్రాన్‌‌స, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, జపాన్ దేశాల్లోనూ లక్షలాది కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. 
2017 మే నెలలో వనా క్రై ర్యాన్సమ్‌వేర్ దాడి వల్ల 100 దేశాల్లో కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించాయి. కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను తిరిగి పొందాలంటే 300 డాలర్లను బిట్‌కాయిన్ రూపంలో చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెట్యా దాడితో నష్టపోయిన దేశాల జాబితాలో 7వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : సిమాంటెక్

నూతన పంది రకాన్ని అభివృద్ధి చేసిన ఎస్‌వీవీయూతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) తిరుపతి వరాహ పేరుతో అభివృద్ధి చేసిన నూతన పంది రకానికి నేషనల్ బ్యూరో ఆఫ్ ఆనిమల్ జెనటిక్ రీసెర్చ్( ఎన్‌బీఏజీఆర్) గుర్తింపు లభించింది. ఈ మేరకు జూలై 1న తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఎన్‌బీఏజీఆర్ ప్రతినిధులు ఈ రకాన్ని రిజిస్టర్ చేశారు. 
తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్‌‌సలో 1971 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని.. 1971 నుంచి 80 వరకూ లార్జ్ యార్క్‌షైర్ పిగ్‌‌స (సీమ పందులు)పై, 1981 నుంచి 87 వరకూ దేశీయ పందుల (నాటు పందులు)పై పరిశోధనలు చేసినట్లు ఎస్‌వీవీయూ ప్రతినిధులు చెప్పారు. అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తిరుపతి వరాహం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
ఎక్కడ : తిరుపతి 

డీఆర్‌డీవో క్షిపణి ప్రయోగం విజయవంతంఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగల స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణిని భారత రక్షణ శాఖ జూలై 3న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డిఫెన్‌‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి 25 నుంచి 30 కి.మీ. దూరంలోని వివిధ లక్ష్యాలను ఒకే సమయంలో అత్యంత వేగంగా ఛేదించగలదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : జూలై 3
ఎవరు : భారత రక్షణ శాఖ 
ఎక్కడ : చాందీపూర్, ఒడిశా 
ఎందుకు : 25 నుంచి 30 కి.మీ. లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించేందుకు 

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని జూలై 4న విజయవంతంగా పరీక్షించింది. వాసోంగ్-14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉత్తర కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. కాగా.. ఉత్తర కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వాసోంగ్ - క్షిపణి పరీక్ష
ఎప్పుడు : జూలై 4
ఎవరు : ఉత్తర కొరియా

No comments:

Post a Comment