AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2017

సైన్స్ & టెక్నాలజీ జూన్ 2017
కార్టోశాట్ - 2ఈని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో  ఒకే ప్రయోగంలో బహుళ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రక్రియను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి విజయంవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 23న పీఎస్‌ఎల్‌వీ సీ38 ద్వారా మొత్తం 31 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో ఒకటి 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-2ఈ ఉపగ్రహం కాగా మరొకటి తమిళనాడు కన్యాకుమారిలోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ (ఎన్‌ఐయూఎస్‌ఏటీ)కి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహం.
మిగిలిన 29 ఉపగ్రహాలు 14 దేశాలకు చెందినవి.పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం. మొత్తంగా ఇస్రో ప్రయోగాల్లో ఇది రెండో అతిపెద్ద ప్రయోగం. 2017 ఫిబ్రవరి 15 పీఎస్‌ఎల్‌వీ సీ37 ద్వారా ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 
పీఎస్‌ఎల్‌వీ సీ38 పేలోడ్స్: వాహకనౌక పేలోడ్ - 955 కేజీలు.
మొత్తం ఉపగ్రహాలు:
 31
భారత ఉపగ్రహాలు 
  1. కార్టోశాట్ - 2ఈ. బరువు - 712 కేజీలు.
  2. ఎన్‌ఐయూఎస్‌ఏటీ తయారు చేసిన చిన్న ఉపగ్రహం. బరువు - 15 కేజీలు
విదేశీ ఉపగ్రహాలు - 29. ఇందులో 10 అమెరికావి. 3 చొప్పున ఉపగ్రహాలు బెల్జియం, ఇటలీ, యూకేకి చెందినవి. ఆస్ట్రియా, చిలీ, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, లాత్వియా, లుతియానియా, స్లోవెకియాకు చెందిన ఒక్కో ఉపగ్రహం. వీటన్నింటి బరువు - 228 కేజీలు. 
దేశీయ అవసరాల కోసం కార్టోశాట్-2దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన కార్టోశాట్ 2ఈ ఉపగ్రహం 6వది. 
కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థ సూర్యానువర్తన ధృవ కక్ష్యలో వివిధ దశల్లో పరిభ్రమిస్తూ భౌగోళికపరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియోగంపై మ్యాప్‌ల తయారీ, విపత్తులను విసృ్తతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది.
కార్టోశాట్ సిరీస్
  1. కార్టోశాట్-2, పీఎస్‌ఎల్‌వీ సీ7 - 2007 జనవరి 10
  2. కార్టోశాట్-2ఏ, పీఎస్‌ఎల్‌వీ సీ9 - 2008 ఏప్రిల్ 28
  3. కార్టోశాట్-2బీ, పీఎస్‌ఎల్‌వీ సీ15 - 2010 జూలై 12
  4. కార్టోశాట్-2సీ, పీఎస్‌ఎల్‌వీ సీ34 - 2016 జూన్ 22
  5. కార్టోశాట్-2డీ, పీఎస్‌ఎల్‌వీ సీ37 - 2017 ఫిబ్రవరి 15
  6. కార్టోశాట్-2ఈ, పీఎస్‌ఎల్‌వీ సీ38 - 2017 జూన్ 23
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగం
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: ఇస్రో
ఎక్కడ : శ్రీహరికోట, ఏపీ 
ఎందుకు : 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన వాహకనౌక 

విశ్వంలో భూమిని పోలిన మరో పది గ్రహాలు సౌర వ్యవస్థ వెలుపల రాతి ఉపరితలంతో భూమిని పోలిన పది చిన్న గ్రహాలను కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని టెలిస్కోప్ నుంచి అందుకున్న శాస్త్రవేత్తలు.. వీటిపై జీవానికి అనువైన పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
భూమిని పోలి ఉన్న గ్రహాలు విశ్వంలో ఎక్కువగానే ఉన్నాయా, లేదా అని తెలుసుకోవడానికి కెప్లర్ టెలిస్కోప్‌ను నాసా 2009లో ప్రయోగించింది. తొలి నాలుగేళ్ల కార్యక్రమంలో సౌర వ్యవస్థ వెలుపల గుర్తించిన గ్రహాలను పోలిన 219 ఖగోళ వస్తువులపై అధ్యయాన్ని ఇటీవల విడుదల చేసింది. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలే కావచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విశ్వంలో భూమిని పోలిన మరో 10 గ్రహాల గుర్తింపు 
ఎప్పుడు : జూన్ 20
ఎవరు: నాసా (కెప్లర్ టెలిస్కోప్)

రైలు గేట్ల ప్రమాదాల నివారణకు ఇస్రో చిప్కాపలా లేని రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంది. ఈ మేరకు ఇస్రో తయారు చేసిన ఉపగ్రహ సంబంధిత ఇంటిగ్రేటెడ్ చిప్‌లను రైలు ఇంజన్‌లలో అధికారులు అమర్చారు. వీటి ద్వారా గేటు సమీపంలోకి రైలు రాగానే ఒక సైరన్ మోగేలా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిని తొలుత ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. 
కాపలా లేని రైల్వే గేటుకు 500 మీటర్ల దూరంలోకి రైలు రాగానే ఈ చిప్ ద్వారా సిగ్నల్స్ యాక్టివేట్ అయి సైరన్ మోగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తమవుతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఇస్రో సహకారం 
ఎప్పుడు : జూన్ 25
ఎక్కడ : ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో
ఎందుకు : రైలు రాకపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు

చంద్రుడిపై సాగుకు చైనా తొలి ప్రయత్నం బంగాళాదుంప విత్తనాలు మొలకెత్తేలా, పట్టుపురుగు గుడ్లు లార్వాలుగా మారేలా ఓ ఎకోసిస్టమ్‌ను రూపొందించి, దానిని చంద్రుడిపైకి పంపేందుకు చైనా ఏర్పాట్లు చేస్తుంది. చందమామపై వాతావరణంలో ఇవి ఎలా మార్పు చెందుతాయో తెలుసుకునేందుకు ఓ ప్రయోగం చేపడుతోంది. మొత్తం మూడు కిలోల బరువున్న ఈ ఎకోసిస్టమ్‌ను చాంగ్‌క్వింగ్ యూనివర్సిటీ సిద్ధం చేయగా, చాంగ్ ఈ4 వాహకనౌక ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం ద్వారా జాబిల్లిపై మానవులు జీవించడం సాధ్యమేనా అనే విషయాన్ని పరిశీలించాలని చైనా భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : చంద్రుడిపై సాగుకు తొలి ప్రయత్నం
ఎవరు : చైనా
ఎందుకు : ఎకోసిస్టమ్ ద్వారా చంద్రుడిపై వాతావరణ మార్పులు తెలుసుకునేందుకు 

వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న మామ్ ఉపగ్రహం అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)అరుణగ్రహం కక్ష్యలో తిరుగుతూ విజయవంతంగా వెయి్య రోజులు పూర్తి చేసుకుంది. 6 నెలల వ్యవధి కోసం రూపొందించిన ఈ అంతరిక్ష నౌక లక్ష్యాన్ని అధిగమించి తన కక్ష్యలో 1000 రోజులు (భూమిపై 1000 రోజులు కాగా, అరుణ గ్రహంపై 973.24 రోజులు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. 388 సార్లు తన కక్ష్యలో తిరిగింది. 
2014 సెప్టెంబర్ 24న మామ్‌ను అరుణగ్రహం కక్ష్యలోకి ఇస్రో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన పీఎస్‌ఎల్వీ రాకెట్ సాయంతో శ్రీహరికోట నుంచి 2013 నవంబర్ 5న ఈ నౌకను ప్రయోగించారు. అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ వెతికేందుకు, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసి జీవం ఉందని సూచించే మీథేన్‌ను కనిపెట్టేందుకు రూ.450 కోట్లతో తయారుచేసిన ఈ మామ్‌ను అక్కడికి పంపించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న మామ్ ఉపగ్రహం 
ఎప్పుడు : జూన్ 19 నాటికి 
ఎవరు : ఇస్రో 
ఎందుకు : అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ, వాతావరణం అధ్యయనం కోసం 

యుగో ఇంపోర్ట్‌తో రిలయన్స్ డిఫెన్‌‌స ఒప్పందంసెర్బియాకు చెందిన యుగో ఇంపోర్ట్‌తో అనిల్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ డిఫెన్స్ అమ్యూనిషన్’ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మందుగుండు సామగ్రి సహా ఇతర అంశాల్లో రెండు కంపెనీలు కలసి పనిచేయడంతోపాటు వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ ఒప్పందంలో భాగమని రిలయన్స్ డిఫెన్స్ తెలిపింది. అనిల్ అంబానీ సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్‌తో భేటీ అయిన మరుసటి రోజే ఈ ఒప్పందం కుదిరింది. 
మందుగుండు తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న యుగోఇంపోర్ట్ సెర్బియా ప్రభుత్వ రంగ సంస్థ. ప్రస్తుతం మన దేశ మందుగుండు అవసరాల్లో రూ. 10,000 కోట్ల (50 శాతం) మేర దిగుమతి అవుతున్నదే. 
క్విక్ రివ్యూ: ఏమిటి : యుగో ఇంపోర్ట్‌తో రిలయన్‌‌స డిఫెన్‌‌స ఒప్పందం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : సెర్బియాకు చెందిన యుగోఇంపోర్ట్ మరియు రిలయన్స్ డిఫెన్స్ 
ఎందుకు : మందుగుండు సామగ్రి తయారీకి

గురు గ్రహం.. అతిపురాతనంసౌర వ్యవస్థలోని గ్రహాల్లోకెల్ల్లా గురు గ్రహం అత్యంత పురాతనమైందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల ఏళ్లకు గురు గ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీ జూన్ 12న తెలిపింది. గురు గ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్ సిగ్నేచర్ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు
ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ధిక్కరించి ఉత్తర కొరియా మరో సారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. గ్యాంగ్‌వాన్ ప్రావిన్స్లోని వాన్‌సాన్‌లో జూన్ 8న కొన్ని క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఇవి భూ ఉపరితలం నుంచి ఓడలపై దాడులు చేసే తరహా క్షిపణులు అయి్య ఉండవచ్చని తెలిపింది. గడిచిన ఐదు వారాల్లోనే ఉత్తర కొరియా నాలుగుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. 
ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రతిపాదించిన ముసాయిదాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జూన్ 2న ఏకగ్రీవంగా తీర్మానించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మరోసారి క్షిపణి పరీక్షలు 
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : ఉత్తర కొరియా 

జీశాట్-19 కక్ష్య దూరం పెంచిన ఇస్రోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ1 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్- 19 ఉపగ్రహం కక్ష్య దూరాన్ని జూన్ 8న రెండు సార్లు విజయవంతంగా పెంచింది. 170 కిలోమీటర్ల పెరిజీని (భూమికి దగ్గరగా) 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ, అపోజీని (భూమికి దూరంగా) 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీశాట్ - 19 కక్ష్య దూరం పెంపు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : ఇస్రో 

పాలపుంతలోని ఓ గ్రహానికి బెంగళూరు బాలిక పేరు బెంగళూరులో జరిగిన ఇన్‌టెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్(ఐఎస్‌ఈఎఫ్)లో అదే నగరానికి చెందిన సాహితి పింగళి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో మలినాలతో నిండిన సరస్సుల డేటాతో సాహితి రూపొందించిన యాప్‌కు గాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. దాంతో మాసాచూసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్‌ఐటీ) ఆమె పేరును పాలపుంతలో ఒక గ్రహానికి పెట్టాలని నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పాలపుంతలో ఓ గ్రహానికి సాహితి పింగళి పేరు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : మాసాచూసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3డీ1 ప్రయోగం విజయవంతం
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) నుంచి జూన్ 5 సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 
ప్రయోగం సాగిందిలా.. 
43.43 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1ను 16 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో మూడు దశ ప్రయాణంతో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మొదటిదశ: కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్-200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. 
రెండోదశ: 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్-110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్‌ను పెంచారు. 2.20 నిమిషాలకు ఎస్-200 రెండు బూస్టర్లు విడిపోయాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది.
మూడోదశ: 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు.
స్థిరకక్ష్యలోకి..: ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపర్చారు. 
జీశాట్-19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
- దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విసృ్తత సేవలు, ఇంటర్నెట్ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. 
- ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. - ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌‌స అమర్చి పంపారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్స్‌పాండర్లతో దేశవాళి డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 400 ట్రాన్స్‌పాండర్లు దాకా డిమాండ్ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 
- దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్స్‌పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. 
పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది
భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపాదన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో మార్క్-3 తరహా భారీ రాకెట్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.
అన్ని దశలూ భారీగానే 
పీఎస్‌ఎల్‌వీ, సాధారణ జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయితే భారీ రాకెట్ రూపకల్పనలో భాగంగా మార్క్3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్ (ఎస్-200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. 
రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్-110) ను వినియోగించారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ సెంటర్‌లో తయారు చేశారు. 
మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్‌ఎల్‌వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ-25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది.
ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా..
తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్-200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్-100 ద్రవ ఇంధన దశ, సీ-25 క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్-200, ఎల్-110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ-25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ-25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు.
59 ప్రయోగాలు.. విజయాలు 51 జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 ప్రయోగంతో ఇస్రో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్‌ఎల్‌వీ డీ5, డీ6, మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్-09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్-3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. 
అగ్రదేశాల సరసన
- జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ని ప్రయోగించడం ద్వారా భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు మాత్రమే ఉంది.
- 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు.
- పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్-19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం.
- ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
- సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి.
- 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్-9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది.
- భారత్ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్ వాటా 0.6 శాతం మాత్రమే.
- భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ- మార్క్3 రాకెట్ కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది. 

కూడంకుళం 5, 6 యూనిట్లకు రష్యా అంగీకారం
తమిళనాడు కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5, 6 యూనిట్ల నిర్మాణానికి (ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యి మెగావాట్లు) రష్యా అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా జూన్ 1న ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు జరిగాయి. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. 
ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారు. అనంతరం పలు అంశాలపై ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘21వ శతాబ్దపు దార్శనికత’ పేరుతో విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌జీ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. 
ఢిల్లీలో వీధికి రష్యా రాయబారి పేరు 
భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడికన్ పేరుని ఢిల్లీలోని ఓ వీధికి పెడుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇటీవల మరణించిన కడికన్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు విశేషంగా కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. 
భారత్ - రష్యా సంయుక్తంగా ఈ సంవత్సరం ఇంద్ర-2017 పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించనున్నాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్ - రష్యా మధ్య 5 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 1
ఎక్కడ : సెయింట్ పీటర్స్‌బర్గ్ 
ఎవరు : ప్రధాని మోదీ - రష్యా అధ్యక్షుడు పుతిన్ 


ఫృథ్వీ-2 పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వాయుధాలను ప్రయోగించగల పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. చాందీపూర్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 2న భారత సైన్యం దీన్ని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1,000 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
క్విక్ రివ్యూ:ఏమిటి : పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : భారత సైన్యం

కేరళ వాసికి రెండో గుండె అమర్చిన వైద్యులుకోయంబత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కేరళ వాసికి విజయవంతంగా రెండో గుండెను అమర్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌కు గురైన మహిళ గుండెను కుడివైపున అమర్చారు. ప్రస్తుతం అతని శరీరంలోని రెండు గుండెలు సహజరీతిలో పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : కేరళ వాసికి రెండో గుండె అమర్చిన వైద్యులు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు

No comments:

Post a Comment