AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు సెప్టెంబరు 2014

క్రీడలు సెప్టెంబరు 2014
ప్రపంచ చెస్ టోర్నీలో కార్తీక్‌కు కాంస్యం
సెర్బియాలో జరిగిన వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్ (వికలాంగుల)లో విజయవాడకు చెందిన కేవీకే కార్తీక్ కాంస్యపతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు ఫిడే మాస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
కపిల్‌దేవ్‌కు లైఫ్‌టైం అచీవ్ మెంట్ అవార్డు
భారత మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్‌దేవ్ ఇండో -యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సెప్టెంబర్ 24న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. క్రికెట్‌తో పాటు నిరాశ్రయులకు చేయూతనివ్వడంలో కపిల్ చూపిన కృషికి ఈ అవార్డు లభించింది. 
సచిన్, స్టీవ్‌వాలకు బ్రాడ్‌మన్ పురస్కారం
2014 బ్రాడ్‌మన్ పురస్కారానికి క్రికెటర్లు సచిన్‌టెండూల్కర్, స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లను బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ఎంపికచేసింది. ఈ ఏడాది అక్టోబర్ 29న బ్రాడ్‌మన్ ఫౌండేషన్ అవార్డులను ప్రదానం చేయనుంది. 
పేస్ జోడీకి మలేసియా ఓపెన్ టైటిల్
లియాండర్ పేస్-మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) జోడీ మలేసియా ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. సెప్టెంబర్ 27న జరిగిన పోటీలో జేమీ ముర్రే, జాన్ పిర్స్ జంటపై పేస్ జోడీ విజయం సాధించింది.

సానియా జోడీకి పసిఫిక్ ఓపెన్ టైటిల్
సానియామీర్జా, కారాబ్లాక్ (జింబాబ్వే) జోడీ డబ్ల్యూటీఏ టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. టోక్యోలో సెప్టెంబర్ 20న జరిగిన ఫైనల్‌లో ఈ జంట గాబ్రిన్ మగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై విజయం సాధించారు. 
ఇంచియాన్‌లో ప్రారంభమైన 17వ ఆసియా క్రీడలు 
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో 17వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 17న ఆరంభమయ్యాయి. అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. ఒలింపిక్స్ తర్వాత రెండో అతిపెద్ద క్రీడలివే. 45 దేశాల నుంచి 13,000 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరిలో భారత్ నుంచి 516 మంది ఉన్నారు. 36 క్రీడాంశాల్లో 439 ఈవెంట్లు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బృందానికి హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ త్రివర్ణ పతాకంతో సారథ్యం వహించాడు.
జీతూరాయ్‌కి తొలిస్వర్ణం: 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ జీతూరాయ్ స్వర్ణం గెలిచాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణం కూడా ఇదే. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరగనున్నాయి. 
షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్‌కు కాంస్యం
స్పెయిన్‌లోని గ్రనడా వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో యువ షూటర్ ప్రదీప్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ పోటీ జూనియర్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో పతకం. ఇంతకు ముందు 50 మీటర్ల పిస్టల్ పోటీలో జీతూరాయ్ రజతం గెలిచాడు.

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత మారిన్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ నిలిచాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన తార కియ్ నిషికోరిపై విజయం సాధించాడు. 
పాక్ స్పిన్నర్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం
పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజ్మల్ బౌలింగ్ తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌క ఐసీసీకి నివేదించారు. దీంతో అజ్మల్‌కు పరీక్షలు నిర్వహించడంతో అతని బౌలింగ్ అక్రమమని తేలింది. 
నిషాకు జాతీయ మహిళల చెస్ చాంప్
జాతీయ మహిళల చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిషా మెహతా గెలుచుకుంది. పనాజీ(గోవా)లో సెప్టెంబర్ 15న ముగిసిన పోటీల్లో నిషా మెహతా స్వర్ణపతకం సాధించింది. విజయలక్ష్మికి రజతం, తెలంగాణకు చెందిన హిందూజ రెడ్డి కాంస్యం గెలుచుకున్నారు. 
ప్రణయ్‌కు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్
భారత షటిలర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్నాడు. పాలెమ్‌బాంగ్ (ఇండోనేషియా)లో సెప్టెంబర్ 14న జరిగిన ఫైనల్లో అబ్దుల్ కోలిక్ (ఇండోనేషియా)ను ఓడించాడు. అతనికిది తొలి గ్రాండ్ ప్రి గోల్డ్‌టైటిల్.

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. 
యూఎస్ ఓపెన్ టెన్నిస్
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా సానియా -బ్రునో సొరెస్ (బ్రెజిల్) జంట నిలిచింది. సెప్టెంబర్ 5న జరిగిన ఫైనల్లో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడిని ఓడించింది. సానియాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. 
మహిళల సింగిల్స్: ఈ విభాగంలో సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. ైఫైనల్లో కరోలైన్ వోజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. సెరెనాకు ఇది ఆరో యూఎస్ టైటిల్ కాగా తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 
మహిళల డబుల్స్: ఈ విభాగంలో ఎకటెరీనా మకరోనా-ఎలెనా వెస్నినా (రష్యా) విజేతలుగా నిలిచారు. 
పురుషుల డబుల్స్: ఈ విభాగం టైటిల్‌ను అమెరికాకు చెందిన మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ సోదరులు గెలుచుకున్నారు. వీరికిది వందో డబుల్స్ టైటిల్. యూఎస్ ఓపెన్‌లో ఐదో సారి విజేతలుగా నిలిచారు. మొత్తం మీద 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 
హామిల్టన్‌కు ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్
ఫార్ములా వన్ ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మోంజా (ఇటలీ)లో సెప్టెంబర్ 7న జరిగిన పోటీలో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను చైనాకు చెందిన చెన్‌లాంగ్ గెలుచుకున్నాడు. ఆగస్టు 31న కోపెన్‌హెగెన్‌లో జరిగిన ఫైనల్లో మలేషియాకు చెందిన లీచోంగ్‌వీ నిచెన్‌లాంగ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుచుకుంది. ఫైన ల్లో జురుయ్ లీ (చైనా)ను ఓడించింది. స్పెయిన్ క్రీడాకారిణి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన పి.వి. సింధు వరుసగా రెండో ఏడాదీ కాంస్యం నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 26న అతుల్‌వర్మ భారత్‌కు రెండో పతకం అందించాడు. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో అతుల్ కాంస్యం గెలుచుకున్నాడు. 

క్రీడా పురస్కారాల ప్రదానంజాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు.. 15 మందికి 2014 అర్జున అవార్డులను అందజేశారు. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ (క్రికెట్), పూజారి మమత (కబడ్డీ), సునీల్‌కుమార్ రాణా (రెజ్లింగ్) ఉన్నారు. ద్రోణాచార్యగ్రహీతలు: గురుచరణ్ సింగ్ గోగి (జూడో), మనోహరన్ (బాక్సింగ్), జోసె జాకబ్ (రోయింగ్), లింగప్ప (అథ్లెటిక్స్), మహావీర్ ప్రసాద్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: గుర్మిల్ సింగ్ (హాకీ), కేపీ ఠక్కర్ (స్విమ్మింగ్-డైవింగ్), జీషణ్ అలీ (టెన్నిస్). హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవాన్ని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు.

జైపూర్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ టైటిల్ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు గెలుచుకుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు చెందిన ఈ జట్టు ఆగస్టు 31న జరిగిన ఫైనల్లో యు ముంబై జట్టును ఓడించింది. పాట్నా పైరేట్స్ మూడో స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment