AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు జూన్ 2016

అవార్డులు జూన్ 2016
దినేశ్ శర్మకు హిస్టరీ మ్యూజియం బుక్ ప్రైజ్
భారత రచయిత, ప్రముఖ కాలమిస్టు దినేశ్ శర్మ 2016 సంవత్సరానికి ‘కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం బుక్‌ప్రైజ్’ను అందుకున్నారు. ఆయన రాసిన ‘ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఐటీ రెవెల్యూషన్’కు ఈ అవార్డు దక్కింది. కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సొసైటీ టెక్నాలజీపై రాసే పుస్తకాలకు ఈ అవార్డును అందజేస్తున్నారు. కంప్యూటర్ చరిత్ర, విశేషాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై వివిధ పత్రికలు, జర్నల్స్‌లో ప్రచురితమైన వ్యాసాల ఆధారంగా ఈ అవార్డును అందజేస్తారు. 2015లో శర్మ రాసిన పుస్తకం ఎంఐటీ ప్రెస్‌లో ప్రచురితమైంది.
17వ ఐఫా అవార్డులు ప్రదానం
2015 సంవత్సరానికి గాను 17వ ఐఫా అవార్డుల ప్రదానోత్సవం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జూన్ 26న జరిగింది. ఉత్తమ చిత్రంగా భంజరంగీ భాయిజాన్‌కు, సంజయ్‌లీలా బన్సాలీకి ఉత్తమ దర్శకుడిగా ఐఫా పురస్కారాలు దక్కాయి.
అవార్డుల జాబితా:ఉత్తమ చిత్రం :బజరంగీ భాయ్‌జాన్
ఉత్తమ దర్శకుడు : సంజయ్‌లీలా బన్సాలీ
ఉత్తమ నటుడు : రణ్‌వీర్‌సింగ్ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమనటి : దీపికా పదుకొనే (పీకు)
ఉత్తమ కథ : జూహి చతుర్వేది (పీకు)
ఉత్తమ గాయకురాలు : మొనాలీ ఠాకూర్
ఉత్తమ గాయకుడు : పపాన్
ఉత్తమ సహాయనటుడు : అనిల్ కపూర్
ఉత్తమ సహాయనటి : ప్రియాంక చోప్రా
ఉత్తమ విలన్ : దర్శన్ కుమార్
ఉత్తమ హాస్యనటుడు : దీపక్ దొబ్రియాల్
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ (తల్వార్)
నలుగురు ఇండో అమెరికన్‌లకు గ్రేట్ ఇమ్మిగ్రాంట్స్ 
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు మరో ముగ్గురు భారతీయ అమెరికన్‌లకు ‘ది ప్రైడ్ ఆఫ్ అమెరికా’(గ్రేట్ ఇమ్మిగ్రాంట్స్) అవార్డులు దక్కాయి. పిచాయ్‌తోపాటు పీబీఎస్ న్యూస్ సీనియర్ కరెస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకిన్సీ అండ్ కంపెనీ చైర్మన్ విక్రమ్ మల్హోత్రా, ప్రముఖ రచయిత భారతి ముఖర్జీ ఈ గౌరవానికి ఎంపికయ్యారు. పాకిస్తానీ అమెరికన్ వ్యాపారవేత్త షైజా రిజ్వీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అమెరికాలో స్థిరపడి స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందికి ఈ ఏడాది అవార్డులు ప్రకటించారు.

పింగళి చైతన్యకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
రచయిత్రి పింగళి చైతన్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2016 (తెలుగు) లభించింది. ఆమె రాసిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ అనే సంక్షిప్త కథలకు ఈ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా 24 భాషల్లో 24 మంది యువ రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ జూన్ 16న అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.50,000 నగదు అందజేస్తారు.
బాల్ సాహిత్య పురస్కార్ 2016
కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా 21 మంది రచయితలకు ‘బాల్ సాహిత్య పురస్కార్-2016’ అవార్డులను ప్రకటించింది. తెలుగు భాషకు సంబంధించి ఆలపర్తి వెంకటసుబ్బారావు (బాలబంధు) రాసిన ‘స్వర్ణ పుష్పాలు’ (కవిత్వం) పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.50 వేల నగదు అందిస్తారు. నవంబరు 14న జరిగే బాలల దినోత్సవంలో అవార్డు అందజేస్తారు.
ఈసీఐఎల్‌కు బ్రహ్మోస్ ఏరో స్పేస్ అవార్డు
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ‘2016 బ్రహ్మోస్ ఏరో స్పేస్ అవార్డు’ను సొంతం చేసుకుంది. జూన్ 18న ఢిల్లీలోని బ్రహ్మోస్ ఏరో స్పేస్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎండీ పి.సుధాకర్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ క్రిస్టాఫర్ నుంచి అవార్డు అందుకున్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో సంస్థ పనితీరు, నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, నాయకత్వ లక్షణాలతో పాటు బ్రహ్మోస్ పరిశోధనల్లో భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించింది. బ్రహ్మోస్ పరిశోధనలకు ఎయిర్ బార్న్ రాడార్ సిస్టమ్‌ను ఈసీఐఎల్ అభివృద్ధి చేసింది.

అఖిల్ శర్మకు డబ్లిన్ సాహిత్య అవార్డు
భారత్-అమెరికన్ రచయిత అఖిల్ శర్మకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య అవార్డు లభించింది. ఆయన రాసిన రెండో నవల ‘ఫ్యామిలీ లైఫ్’కు ఈ పురస్కారం దక్కింది. నవలలకు సంబంధించి ప్రపంచంలో అత్యంత ఖరీదైన అవార్డు (సుమారు రూ.75.49 లక్షలు) ఇదే. అఖిల్ శర్మ ఢిల్లీలో జన్మించి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. తన కుటుంబం న్యూయార్క్‌కుతరలిన క్రమాన్ని ఆయన ఈ నవలలో వివరించారు. 
భారతీయ అమెరికన్‌కు ఐరిష్ పురస్కారం
భారతీయ అమెరికన్ రచయితకు ప్రఖ్యాత ఐరిష్ అవార్డు లభించింది. రూ. 75.5 లక్షల (లక్ష యూరోలు) విలువ చేసే అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య అవార్డును ఢిల్లీలో పుట్టి న్యూయార్క్‌లో పెరిగిన అఖిల్ శర్మ ‘ఫ్యామిలీ లైఫ్’ అనే నవలకు దక్కించుకున్నారు. ప్రపంచంలో ఒక ఇంగ్లిష్ నవలకు ఇచ్చిన అత్యంత ఎక్కువ ప్రైజ్‌మనీ ఇదే. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ కౌన్సిల్ ఈ అవార్డును అందజేస్తుంది. అఖిల్ శర్మ తన స్వీయ చరిత్రనే ‘ఫ్యామిలీ లైఫ్’ నవలగా రాశారు. ఇది ఆయన మొదటి నవల. 2015లో రూ.38 లక్షల (40,000 పౌండ్లు) ఫోలియో ప్రైజ్‌ను కూడా ఈ నవల గెలుచుకుంది.
ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు
పార్లమెంట్‌లో అత్యధిక ప్రశ్నలు లేవనెత్తిన ఐదుగురు ఎంపీలు జూన్ 11న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా ‘సంసద్ రత్న’ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, ఈ-మ్యాగజైన్ ప్రీసెన్స్ అందించాయి. అవార్డులు అందకున్నవారిలో రాజస్తాన్‌కు చెందిన పి.పి. చౌదరి (బీజేపీ), మహారాష్ట్రకు చెందిన హీనా విజయ్‌కుమార్ గావిట్ (బీజేపీ), శ్రీరంగ్‌అప్పా బర్నే (శివసేన), రాజీవ్ సతాల్ (కాంగ్రెస్), షిరూర్ (శివసేన) ఉన్నారు. మాజీ రాష్ట్రపతి కలాం పేరిట ఈ అవార్డులను 2010 నుంచి ఇస్తున్నారు. అవార్డు విజేతలు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరై 300-500 ప్రశ్నలను లేవనె త్తారు. 
భారతీయ వైద్యుడికి యూఎస్ అవార్డు
భారత్‌కు చెందిన మధుమేహ వైద్య నిపుణుడు శశాంక్ ఎస్.షాకు ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డు లభించింది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) ప్రతి ఏటా అందించే ‘వివియన్ ఫొన్సెకా స్కాలర్ అవార్డు 2016’ను షా జూన్ 13న అందుకున్నారు. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లో జరుగుతున్న ఏడీఏ 76వ సైంటిఫిక్ సెషన్స్‌లో ఈ అవార్డును అందజేశారు. దక్షిణాసియాలో మధుమేహ నియంత్రణలో షా జరిపిన పరిశోధనకు గాను ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జన్మించిన షా ప్రస్తుతం పుణెలోని లాప్రో-ఒబెసో సెంటర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పది గంటల్లో 45 హెర్నియా శస్త్రచికిత్సలు చేసిన ఘనత కూడా ఆయన సొంతం.
ప్రణబ్‌కు ఐవరీ కోస్ట్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐవరీ కోస్ట్ వెళ్లిన ప్రణబ్ ముఖర్జీ జూన్ 15న అబిడ్‌జాన్‌లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ నేషనల్ ఆర్డర్’ను అందుకున్నారు. అలాగే ఆ దేశాధ్యక్షుడు అలస్సానే ఒట్టారాతో చర్చలు జరిపారు. ఐవరీ కోస్ట్‌లో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతిగా ప్రణబ్ నిలిచారు.

భారత ప్రొఫెసర్‌కు ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ’ అవార్డు
‘కౌ అండ్ కంపెనీ’ రచనకుగాను భారత్‌కి చెందిన ప్రొఫెసర్ పరాశర్ కులకర్ణికి ప్రఖ్యాత ‘కామన్‌వెల్త్ షార్ట్ స్టోరీ’ అవార్డు దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు ఈయనే. కులకర్ణి రాసిన మొదట రచన ఇదే కావడం విశేషం. మొత్తం నాలుగువేల మంది పోటీలో పాల్గొనగా కులకర్ణి విజయం సాధించి, 5వేల పౌండ్లను బహుమతిగా గెలుచుకున్నారు. జూన్ 5న జమైకాలో జరిగిన ‘కాలాబాష్’ సాహిత్యోత్సవంలో ప్రముఖ రచయిత మార్లాన్ జేమ్స్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. చుయింగ్ గమ్ ప్రకటన కోసం 1990లో భారత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఆవులపై చేసిన పరిశోధన గురించి కులకర్ణి ‘ద కౌ అండ్ కంపెనీ’లో వివ రించారు. కులకర్ణి ప్రస్తుతం సింగపూర్‌లోని ‘యాలే ఎన్‌యూఎస్’ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
జెఫ్ బెజోస్, దిలీప్ సంఘ్వీలకు గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ యూఎస్-ఇండియా వ్యాపార మండలి(యూఎస్‌ఐబీసీ) గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడంలో నిబద్ధత, చేయూతలకుగాను దిలీప్ సంఘ్వీకి ఈ పురస్కారాన్ని ఇచ్చారు. అవార్డును ఆయన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. భారత ప్రభుత్వం సంఘ్వీని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

డా. జీవీ రావుకు బీసీ రాయ్ అవార్డు
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ శస్త్ర చికిత్సల నిపుణులు డా. జీవీ రావుకు ప్రతిష్టాత్మక డా. బీసీ రాయ్ అవార్డు దక్కింది. ఈయన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. డా. బీసీ రాయ్ పేరు మీద భారతీయ వైద్య మండలి ప్రతిఏటా ప్రతిష్టాత్మక అవార్డులు ఇస్తుంది. 2016 సంవత్సరానికి డా. జీవీ రావుకు ప్రకటించారు. ఈయన అతి తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్‌వాసివ్ సర్జరీ) శస్త్ర చికిత్సలు చేయడంలో నిపుణులుగా పేరుగాంచారు. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా జీవీ రావుకు ఈ అవార్డును అందజేస్తారు.

అదితి కృష్ణకుమార్‌కు ఆసియా బుక్ అవార్డుభారత రచయిత్రి అదితి కృష్ణకుమార్‌కు ప్రతిష్టాత్మక ఆసియా బుక్ అవార్డు లభించింది. సింధు నది చిట్టచివరి అమూల్య సంపద అనే లిఖిత ప్రతికి ఆమెకు ఈ అవార్డు దక్కింది.

గురురాజ్‌కు నాయుడమ్మ అవార్డుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ అందించే నాయుడమ్మ అవార్డుకు 2016 సంవత్సరానికి గాను అమెరికాలోని ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ గురురాజ్ దేశ్‌పాండే ఎంపికయ్యారు. కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన గురురాజ్.. మద్రాస్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ తర్వాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో డేటా కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం స్పార్టాగ్రాప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాస్కేడ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్, ఎంఐటీ కార్పొరేషన్లలో సభ్యుడిగా ఉన్నారు. 2002లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంఐటీలో దేశ్‌పాండే సెంటర్ ఫర్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్ స్థాపించి పరిశోధనల కోసం పెద్ద నిధి ఏర్పాటు చేశారు. ఆయన స్థాపించిన స్కై మోర్ నెట్‌వర్క్స్ ఈ విభాగంలో అతి పెద్ద పరిశ్రమ.

ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జపాన్ అందించే ‘గ్రాండ్ ఫ్యూకూవోకా ప్రైజ్-2016’కు ఎంపికయ్యారు. ఆసియా దేశాల సంస్కృతిని తన సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ను ఈ పురస్కారం వరించింది. ఆయనతో పాటు ఫిలిప్పీన్స్ చరిత్ర కారుడు అంబెత్ ఆర్ ఒకాంపో, పాకిస్తాన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ యస్మీన్ లారి ఈ అవార్డును అందుకోనున్నారు. జపాన్ ఈ అవార్డును 1990 నుంచి ప్రదానం చేస్తుంది. ఇప్పటివరకు ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రమణ్యం, చరిత్రకారులు రోమిలా థాపర్, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీ ఖాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

No comments:

Post a Comment